Vennela - వెన్నెల

చెట్టుకొమ్మనున్నకథ_అమరావతికథలు


Listen Later


సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "చెట్టుకొమ్మనున్న కథ."

ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదిహేడవ కథ.

చిన్నప్పటి ఆకతాయి ముక్కంటి పెద్దవాడై, ముక్కంటి పల్లవుడై ధరణికోట రాజధానిగా సామ్రాజ్యం స్థాపించాడు. ప్రజారంజకంగా రాజ్యమేలాడు. ఓక సిద్ధుడి కృపతో పాదలేపనం సంపాదించి రోజు కాశీ వెళ్ళి గంగానదిలో మునిగి, తెల్లవారకమునుపే తిరిగి రాజ్యం చేరుకునేవాడు. ఒకనాటికి భార్యకు ఈవిషయం తెలిసింది. తానుకూడా గంగాస్నానం చేయాలని కోరింది. భర్త అనుమతినివ్వలేదు. కోరిక బలీయమైతే, భర్త, అనుమతీ ఒక భారమా!? జైన సిద్ధులనుండి ఎలాగో పాదలేపనం సంపాదించి తాను భర్త వెనకే కాశీ పయనం, గంగా స్నానం పుర్తిచేసుకుని, ఆతడికంటే ఓ ఘడియ ముందే తిరిగి అంతఃపురం చేరసాగింది. ఒకనాడామె స్నానం ముగించుకునే సమయానికి వాకిట చేరింది. ఆ స్థితిలో పాదలేపనం పనిచేయదు! మరి రాజ్యం చేరడమెలా!? విధిలేక, భర్తని వెదకి కలిసి, ఉపాయం అలోచించమంది. ముక్కంటి పల్లవుడి కోరిక మేరకు కాశీలోని పండితులు వారిరువురనూ స్వదేశం పంపే మార్గం చూపారు కాని, అది ఒక షరతుపైని. రాబోయే గడ్డుకాలంలో, ఈ పండిత కుటుంబాలకు తన రాజ్యంలో, ముక్కంటి పల్లవుడు ఆశ్రయమివ్వాలని.

ఆవిధంగానే, ఒకానొకనాడు కాశీలో కఱవు సంభవించిననాడు, ఆరువేల పండిత కుటుంబాలు అమరావతి చేరాయి. రాజు మాటప్రకారం ఆదరించాడు. తనవారిగా ఉండిపొమ్మని వారిని ఆహ్వానించాడు. మాన్యాలిచ్చి ఆదుకున్నాడు.

ఇది నిజమా? చారిత్రకమేనా? ఆధారాలు, శాసనాలు ఉన్నాయా? ఉండేవుంటాయి, ఎక్కడో.... ఏదో ఒకనాటికి బయటపడవూ? అందాకా ఇది కథే అనుకుందాం. పాత కథే కూడా. అయితే?! 

ఎంత అందమైన కథ! ఎంత గొప్ప కథ!! ఆరువేల నియోగులకు గర్వ కారణం కాదూ? 

వాళ్ళూ వీళ్ళనేం? తెలుగువారందరము హాయిగా చదువుకునేందుకు సత్యంగారందించిన అజరామరమైన కథ కదూ ఇది!


రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.

దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.


ధన్యవాదాలు,

కొండుభొట్ల. చంద్రశేఖర్

Twitter ID: @Chandu1302

...more
View all episodesView all episodes
Download on the App Store

Vennela - వెన్నెలBy చంద్రశేఖర్ కొండుభొట్ల