தெலுங்கு லங்குஅகே - "பரிசுத்த ஆவியின் செயல்கள்".mp3 / Telugu Language - "Acts of the Holy Spirit" .mp3 //.
1 కొరింతీ పత్రిక 15 - ప్రభువు రాకడ, మొదటి పునరుత్థానం1సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు.
2మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.3దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు,
4లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా. 5ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు.
6ఆ తరువాత ఐదు వందలకంటే ఎక్కువైన సోదర సోదరీలకు ఒక్క సమయంలోనే కనిపించాడు. వారిలో చాలామంది ఇంకా జీవించే ఉన్నారు. కొందరు కన్ను మూశారు.
7తరువాత ఆయన యాకోబుకు, అటు తరువాత అపొస్తలులకందరికీ కనిపించాడు.8చివరిగా అకాలంలో పుట్టినట్టున్న నాకు కూడా కనిపించాడు.
9ఎందుకంటే నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి కాబట్టి నాకు అపొస్తలుడు అన్న పిలుపుకు అర్హత లేదు.
10అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.
11నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే.