ఒకే ఆత్మను రెండు ముక్కలుగా విడదీశాడు ఆ దేవుడు
ఆడ,మగ అనే పేర్లు పెట్టి తలో దిక్కున విసిరేశాడు
కలుసుకోవాలనే తపనను మనసులో రగిలించాడు
ఆ ఇరు హృదయాల ప్రయాణం
చూసే పై వాడికి కాలక్షేపం
మన మనిషి ఎదురవగానే
కలిగే ఆకర్షణ అసంకల్పితం
అది విధి లిఖితం, అలౌకికం, అద్భుతం
మన ప్రమేయం లేకుండా
మరొకరి మీద కలిగే భావం
మాటలకందని మధురానుభవం
మనసుని మనసుతో ముడివేసే దారం
మనిషి మనుగడకు ఆధారం
అందితే వరం అందకపోతే కలవరం
అనుభూతి చెందిన మదిలో అజరామరం
కళ్లు, కళ్లు కలవడం
మనసు, మనసు మాట్లాడుకోవడం
పదే పదే చూసుకోవడం
చూడకుండా ఉండలేకపోవడం
దూరంగా ఉంటే విరహం
దగ్గరవ్వగానే మదిలో ఓ మథనం
కోటి పువ్వుల తోటలో ప్రయాణం
మనసుని మైమరపించే పరిమళం
నచ్చిన మనిషితో గడిపే సమయం
కాలాన్ని ఆపే మాయాజాలం
చూపులతోనే చుట్టేయకు సమయం
చేజారక ముందే చెప్పు విషయం
కలిసి బ్రతుకుదాం అనుకున్నాక
విడిచి ఉండటం చాలా కష్టం
ఒక తోడు కోసం నువ్వు పడే ఆరాటం
అది అనివార్యం అదే ప్రకృతి ధర్మం
విడిపోయిన నీ ఆత్మను
తిరిగి నీలో కలుపుకోవడమే దాని ఉద్దేశం