Harshaneeyam

నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!


Listen Later

మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు !  నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో  వున్న నా కూతుర్లని పిలిచి, నా సహాధ్యాయిన్ని పరిచయం చేస్తూ, తాను నా చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పా. తాను వెంటనే, చిన్ననాటి కాదు, నేను మీ నాన్నకి పుట్టినప్పటి నుండి స్నేహితురాలిని అని నన్ను సరి చేసింది. ఆ మాటతో నాలో ఎన్నో చిన్న నాటి జ్ఞాపకాలు పొలమారాయి. నిజమే తాను నాకన్నా పదిహేనురోజుల తర్వాత ఈ లోకం లోకి వచ్చింది. మా అమ్మకి వాళ్ళ అమ్మ, సొంత మేనమామ కూతురు. ఒకే ఈడు వారు, పైపెచ్చు మంచి స్నేహితురాళ్ళు. వాళ్ళ అమ్మకి మా అమ్మ ఒక మార్గదర్శి, చదువూ సంధ్యలలో. వాళ్ళ స్నేహం లో చాలా సౌలభ్యం ఉండేది వాళ్ళకి. ఒకళ్ళు ఎర్ర రాళ్ళ నెక్లెస్ చేయించుంటే, ఇంకొకళ్ళు వాటికి మాచింగ్ గాజులు చేయించుకునే వాళ్ళు, ఎంచక్కా వాళ్లకి ఓ సెట్ దొరికినట్టే. వాళ్ళ మధ్య ఎన్నో ఇచ్చి పుచ్చుకోవటాలు.

మేమూ పెరిగాం అలాగే. ఒకే సారి పుట్టామన్న అఫినిటీ ఎక్కువే మా మధ్య. ఆటలన్నీ కలిసే, ఏదన్న జట్లు జట్లుగా ఆడల్సి వస్తే మేమిద్దరం ఒకే జట్టు. తనుంటే అమ్మాయిల ఆటల్లోకి నాకు ప్రవేశం, నేనుంటే అబ్బాయిల ఆటల్లోకి తన ప్రవేశం. చాలా కస్టపడి  చదివేది మొదటనుండి, నా మార్కులన్నీ తన తర్వాతే, ఎందుకంటే మనం మొదట నుండి ఆడుతూ పాడుతూ చదవాల్సొచ్చాయే. ఇద్దరం ఒకే సారి నాలుగు నుండి ఆరుకి ఎగిరేశాం, అప్పటికే చాలా ఎక్కువ చదివేశాం అనే ఉద్దేశ్యంతో.  అలా ఎగరడానికి మేము అప్పట్లో ప్రవేశ పరీక్ష రాయాల్సొచ్చింది. ఆ ప్రవేశ పరీక్షకి వాళ్ళ నాన్నగారు వెళ్లి తన ఫీజు కట్టేశారు. మా నాన్న ఊర్లో లేకపోవటం తో నాకు కట్టలేక పోయారు, ఆఖరు తేదీ తప్పిపోయా నేను. తాను ఎక్కడ నాకంటే ముందుకెళ్ళి పోతుందని నేను నిద్రాహారాలు మానేస్తే మా నాన్న ఆ ప్రవేశ పరీక్ష సంచాలకుని కాళ్ళవేళ్ళ పడటం నాకు ఇప్పటికీ గుర్తు. అలా నేను కూడా ప్రవేశ పరీక్ష అర్హత సంపాదించు కున్నా.

అలా మేమిద్దరం ఎగిరి వెళ్లి వాళ్ళ అన్న, మా అక్క, మా పెద్దమ్మ మనవడు, మా పెద్దమ్మ మనవరాలు చదివే ఆరవ తరగతిలో పడ్డాము. అలా నా చదువులు నా బంధువర్గం పిల్లకాయలు మధ్యలో జరగటం ఒక తీపి అనుభవం. అలా ఎంత మంది పిల్లకాయలున్న, స్కూల్ కి వెళ్ళటం రావటం లో మేము ఎవరికోసం ఎదురు చూసే వాళ్ళం కాదు, మా ఇద్దరి పాటికి మేమె, మాకెవరితో పనిలేదు. మా స్నేహం నేను ఎనిమదవ తరగతి చదువుల కోసం నెల్లూరు కి వచ్చేయటం తో విరామం లో పడింది. కానీ సెలవలు వస్తే మా ఉప్పలపాటిలో తేలాల్సిందే. మా నెల్లూరి విషయాలు చిలవలు పలవలు గా చెప్పాల్సిందే.

అలా వుండే స్నేహం మరియు మా అమ్మల స్నేహం, నా స్నేహితురాలి పెద్దమ్మ కొడుకు మరియు మా మేనమామ కొడుకు ఐన వాళ్ళ బాడుగ అన్న నిర్వాకంతో తలకిందలయ్యింది. మా మేనమామ మేము పుట్టక ముందే చనిపోయారు. వాళ్లకు రావాల్సిన ఆస్తులు, పొలాలు అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మా తాత మా అమ్మకి, పెద్దమ్మ లకి వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్లలో ఏవైతే వాగ్దానం చేశారో ఆ ప్రకారం పంచేసేరు చాల స్పష్టం గా. ఇది జరిగిన చాలా సంవత్సరాలకి అంటే నేను సీనియర్ ఇంటర్ లో ఉండగా మా మేనమామ కొడుకు తన మేనమామల సహాయంతో మాకూ మా పెద్దమ్మలకి ఇచ్చిన పొలాలని మళ్ల కొట్టి  మమ్మల్ని పొలాల్లోకి రాకుండా అడ్డు కున్నాడు అవన్నీ వాళ్ళ నాన్నవే అని. అవి పరిష్కరించుకోవడానికి మాకు చాలా సమయము, డబ్బులు, మనఃశాంతి ఖర్చు అయ్యాయి. అలా మా రెండు కుటుంబాలు వేరయ్యాయి.

మేము దాదాపు ఇరవై ఏళ్ల వరకూ ఒకరి ముఖాలు ఒకరం చూసుకోలేదు. ఈ మధ్య నాలుగైదు ఏళ్లలో కోపావేశాలు చల్లారి ఒకరినొకరం పలకరించుకుంటున్నాము. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ గారిని కలిసాను. ఆవిడ నన్ను దగ్గరకు తీసుకొని, "నీకు తెలీదురా! మీ అమ్మకి జ్వరం వచ్చినప్పుడో, లేక మీ అమ్మ ఎప్పుడన్నా నిన్ను నా దగ్గర వదిలి నెల్లూరు కి వెళ్ళినప్పుడో నా దగ్గరే పాలుతాగే వాడివి, దానికి ఒక్క చుక్క కూడా మిగిల్చేవాడివి కాదు. నువ్వు నా బిడ్డవురా"  అంటూ ఏడ్చేసిందావిడ. మాట్లాడుతూ ఆవిడ ఓ ఎర్ర రాళ్ళ గాజు తెచ్చి నా చేతిలో పెట్టి చెప్పింది, అచ్చు ఇలాటి గాజు మీ అమ్మ దగ్గరే ఒకటి వుండాలిరా, ఇది మీ అమ్మదో లేక నాడో ఇప్పటికీ తెలీదురా, ఎందుకంటే అవి ఎప్పుడో కలిసిపోయాయి. ఇప్పుడు చెప్పటం కష్టం అని నిట్టూర్చింది. ఆవిడకి నేను చెప్పలేదు, ఆ గాజు మా అమ్మ తన కోడలికి ఇచ్చిందని, ఆవిడ అది పాత మోడల్ గా ఉందని దాన్ని కరిగించేసి కొత్త గాజులు చేయించుకున్నదని



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
Kathavahini - Telugu Stories Podcast by TeluguOne

Kathavahini - Telugu Stories Podcast

12 Listeners

Beyond The Zero by Dick's Pizza Media

Beyond The Zero

35 Listeners