Harshaneeyam

part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన


Listen Later

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.

పుస్తకం కొనడానికి కావాల్సిన web link

Palagummi Padmaraju Rachanalu -Vol1

కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.

ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

గాలివాన’

మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. 

ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దానిమీద ఒక మూలగా, ఒక ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ వుంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ.వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.

రైలు పెట్టెలో మూడుమెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో వున్న నలుగురు ప్రయాణికులు చిరాకు పడుతున్నట్లు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి వెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కాని కూలివాడు ఆయన బెడ్డింగూ, పెట్టె, గొడుగు పైబల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్దమనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు.

నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించారు. బూట్లు మేజోళ్లతో సహా బల్లల క్రిందకు తోసివేయబడి వున్నాయి. కోట్లు, పాంట్లు, చొక్కాలు పై కొంకెలకు తగిలించి వున్నాయి. వదులైన పైజామాలను ముగ్గురు మగప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ యిటూ అటూ తొందరలేనట్టు పరచి ఉన్నాయి. కిటికీల పక్కనివున్న రెండు మెత్తలమీద ఇద్దరు పెద్దవయసువాళ్ళు కూచున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆయనకు భార్య అయిఉంటుంది. సిగరెట్టు పొగ మెత్తనిఘాటు రావుగారి నాసికారంధ్రాలలోకి తెలియకుండా ప్రవేశించి ఒకక్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

రైలు పెట్టెలో సిగరెట్టు పొగను గురించి రావుగారికి తీవ్రమయిన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమయిన అభిప్రాయా లున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకొక అభిమాన సిద్ధాంతముంది – వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ, అనుబంధించి వుంటుందని ఆయన వాదము. ఆయన ప్రకారం, వేదాంతానికి, జీవితానికీ, నిశితమైన మానవానుభవాలకి కూడా అతీతమయిన విషయాలతో ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. అసంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమయిన ఉత్సాహంతోటీ పవిత్రమైన ఉద్రేకంతోటీ మాట్లాడగలరు.   

ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచివక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ వుంటారు. 

అసలు ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడంకోసం. ‘ఆస్తిక మహాసమాజము’ అని పేరు పెట్టుకున్న ఒక సంస్థ ఆహ్వానం మీద ఆయన వెడుతున్నారు. ఉపన్యాసం; సామ్యవాదమూ రమ్య రసామోదము అనే విషయాన్ని గురించి. ఆయన అభిప్రాయం సామ్యవాదంలో ఈ రమ్యరసాత్మ ఉందనో లేక ఆ రెండూ పరసర విరుద్దమయినవి కావడంచేత వాటికి ఒక సమన్వయం కల్పించాలనో అన్నది తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసం వినవలసిందే.

రావుగారు యువదంపతుల వేపు చూశారు. యువతి ముఖం చాలా బరువుగా మంది. ఆమెకు కాస్తవుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా అతను ఉద్యోగంలో వున్న ఏ దూర దేశానికో మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. 

రావుగారికి ఈ మధ్యనే తాను యిచ్చిన ఉపన్యాసం జాపకం వచ్చింది. ‘సత్వము తత్వము’. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయిగాని, అర్ధస్ఫురణను బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తుంటారు. అది నిజం కాదని ఆయననలేదు. కాని ధ్వనిని బట్టి అర్థం అనుసరిస్తోందని మాత్రం సమాధానం చెబుతుంటారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో చాలా అందమయినది “ప్రకృతి పరిష్కృతి.”

గాలి పెరిగింది. బలంగా కిటికీ తలుపుల మీద మొత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టెలో చీకటిగా అయిపోయింది; ఇంకా సాయంత్రం అయివుండదు. రావుగారికి ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి కనిపించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుతున్నాడు. చటుక్కున అతను ముఖం ఎత్తి ‘టైము ఎంత అయివుంటుంది’ అని రావుగారి నడిగాడు. రావుగారు ఒక క్షణం ఆలోచించారు, ఆయన చేతికి గడియారం ఉన్నా కూడా. “మూడు గంటలు అయివుండవచ్చు” అన్నారు. 

“ఎంత చీకటిగా అయిపోయింది!” అన్నాడు పెద్దమనిషి. రావుగారు సమాధానం చెప్పకుండా ఆ పెద్దమనిషివేపు చూచారు. ఆయనకు రావుగారి వయస్సు ఉంటుంది. ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూచున్న ముసలాయన గంభీరంగా చుట్టకాలుస్తూ దాని రుచి ఆస్వాదిస్తున్నాడు. కొందరు మనుష్యుల స్వభావాలే అంత – అనుకున్నారు రావుగారు. ఎదురుగా కూర్చున్న ముసలాయన రావుగారికంటె పెద్దవాడయి యుంటాడు. కాని ఆయన ముఖంలో కుర్రవాళ్ళకి సహజమైన చురుకుతనం ఉంది. అయినా ఆ ముఖం ఆయన వయసును మాటుపరచడంలేదు. వాలిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు, వయస్సును చాటుతూనే ఉన్నాయి. రావుగారికి ఉపన్యాసానికి ఇంకొక విషయం స్ఫురించింది. ‘వయోవిపాకము మనోవివేకము.”

తాను చాలా ఆరోగ్యవంతుడని రావుగారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయనకంటే పెద్దదిగా కన్పిస్తుంది. తెలియనివారు   ఆయన అప్పగారో, తల్లో అని భ్రమపడుతూ ఉంటారని ఆయన తరచుగా వేళాకోళం ఆడుతుంటారు.

ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే ఇద్దరు చక్కని పిల్లలున్నారనీ, అతను యీ మధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ తనే చూసుకోడం ప్రారంభించాడనీ, రావుగారిని చూసిన వాళ్లెవరూ అనుకోరు. ఆయనంత ఆర్జనవున్న వాళ్ళెవరూ వయస్సులో న్యాయవాదవృత్తినుండి విరమించలేదు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నారు. వాటిని అతిక్రమించి కుండా వుండగల సాహసం ఆయనకు వుంది. నీతి, నియమాలను గురించి ఆయనకు పిచ్చి పట్టుదల లేదు. కాని మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలి అని ఆయన అభిప్రాయం. ఆయన పిల్లలను నెలకొకసారి సినిమాలకు వెళ్లనిస్తారు. అంతకంటె తరచుగా మాత్రం ఎన్నడూ వెళ్లనివ్వలేదు. కుర్రవాళ్ల హృదయాల్లో వుండే కోరికల ఎడల ఆయనకు సానుభూతివుండి ఆ కోరికలు తీరడంకూడా, వాళ్ళ హృదయపరిపక్వానికి అవసరమని ఆయన నమ్మకం. అయినా కోరికలు వాళ్ళ ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన తన ఇంట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టారు. ఆ క్రమపద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికి కూడా ఎంతో శాంతి, సుఖం సమకూరుస్తోంది.

అన్ని కిటికీల తలుపులు మూసివున్నాయి. గాలి అవతల ఆరుస్తోంది. జల్లుకూడా ప్రారంభించింది. వానచినుకులు గాలిబలంవల్ల కిటికీ తలుపుల సందుల్లోనుంచి చొచ్చుకుని వస్తున్నాయి. స్పర్శకు అన్నీ చల్లగా వున్నాయి. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి ఇటూ అటూ చూచి దూరంగా జరిగింది.

దారుణంగా వుందే ఈ గాలివాన!” అన్నాడు యువకుడు. రావుగారి పక్కనున్న పెద్దమనిషి ముఖం పైకెత్తి, ఏదో చెప్పబోయి, మానివేసి మళ్లీ చదువు ప్రారంభించాడు. యువకుడు సిగరెట్టు ముట్టించాడు. యువతి ముఖం చిట్లించి దూరంగా జరిగింది. యువకుడు ఒక చిరునవ్వు నవ్వి సిగరెట్లు కాలుస్తూనే కూర్చున్నాడు. చక్కగా దువ్విన యువతి తలకట్టులో నించి ముంగురులు విడిపోయి ఆమె నుదుటిమీద, చెక్కులమీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తలదువ్వుకునే పద్ధతి రావుగారే నిర్ణయించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ కూడా అందాన్ని గురించి మర్యాదను గురించీ రావుగారి కున్న అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి…

ఎదురుగా కూర్చున్న ముసలాయన తన పరుపుచుట్టలోనుంచి బూడిదరంగు ప్లానిలు చొక్కా తీసి తొడుక్కున్నాడు. ఆయన ఆ చొక్కాలోను ఆ చారల పైజామా లోనూ నిజంగా చిత్రంగా కనబడుతున్నాడు. ఆయన ఫ్లాస్క్ లొనించి వేడి కాఫీ ఒక కప్పు పోసుకుని తాగడం ప్రారంభించాడు. రావుగారికి తన పెట్టెలో ఒవల్టితో వున్న ఫ్లాస్క్.  అది తీసి ఒవల్టిన్ ఆయన ఆప్యాయంగా చప్పరించడం ప్రారంభించాడు. రావుగారికి ఒవల్టిన్అంటే చాల యిష్టం కాని ఆ యిష్టానికి హద్దుమించి ఆయన ఎన్నడూ వశుడై పోలేదు. ఆ మధురమైన పానీయాన్ని ఆయన రోజుకి రెండుసార్లు ఒక్కొక్క కప్పు చొప్పున తాగుతారు.

గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు రైలుపెట్టె మీద మొత్తుతున్నాయి. ఆ హోరులో రైలు నడిచే చప్పుడు కూడా మాటుపడిపోయింది.  

రైలు కదులుతున్నట్లు రావుగారికి ఒక్క కుదుపువల్ల తప్ప తెలియడంలేదు.

‘తుపానులా వుంది’ అన్నాడు యువకుడు భార్యతో. ఆమె సమాధానం చెప్పకుండా ఒక రగ్గు దగ్గరగా కప్పుకుంది. ఆమె ముఖంలో పెద్ద బెంగ ఏదో ప్రతిఫలిస్తోంది. గాలివాన గురించి రావుగారి మనసులో అదురు ప్రారంభమయింది.

పెట్టె తలుపు తెరచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీవానా పెట్టెలోకి చొచ్చుకువచ్చాయి. చినిగిపోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె పెట్టెలో ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపుమూసి ఒక మూల నీరు కారుతూ ఆమె నిలబడింది. ముసలాయన తగినంత కోపం తెప్పించుకుని ‘ఇది పరుపులపెట్టి అని తెలియదూ’ అన్నాడు

‘బాబ్బాబు! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాకి సోటివ్వరా బాబుగారూ, దయగల బాబులు! బిడ్డలుగన్నతండ్రులు, ముష్టిముండకి మీకానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతుంది బాబులు. గొప్పగొప్ప బాబులు, డబ్బున్నా బాబులు, గొప్ప పెభువులే అంతాను. పేదముండని ఇల్లా ఆకలితో సచ్చిపోనివ్వరు బాబులు…”

రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లలో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో విరోధభావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు సుమారు ముప్పయి ఏళ్లుంటాయి. అంత కడుపునిండా తిని ఉండి కొవ్వెక్కినట్టు లేకపోయినా, ఆకలితో చచ్చిపోతున్నట్టు మాత్రం ఆమె కన్పించడంలేదు. ఎంత అసహాయత ఆమె నటించినా, ఆమెలో స్థైర్యము ఉంది. 

బిచ్చమెత్తుకోడంమీద రావుగారికి అసలు సానుభూతి లేదు. పేదవాళ్ళన్నా, లేమివల్ల బాధపడుతున్న వాళ్ళన్నా, రావుగారికి జాలిలేకపోలేదు. కాని బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదోమోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్ళి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు వెకిలిగా నవ్వుతూ, ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు ముసలాయన.

‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింతమాత్రం జాలిలేదు. ఆకలితో సచ్చిపోతున్న ముండని ముష్టడిగితే ‘ఫో’ అంటాడు బాబు.

తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం, పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. కాని ఆయనకు ఏమనడానికి తోచలేదు. ఇష్టం లేకపోయినా ఆమెవేపు చూస్తూ ఆయన అల్లాగే కూర్చున్నాడు. ముసలాయన చిత్రమయిన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తూ పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆముష్టిది నోరు ఎలా జారవిడుస్తుందోనని భయం.

ఇందులో ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరకి లేని తీవ్రత తెచ్చిపెట్టుకుని – ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ,

‘ఇందులో డబ్బున్నా దొరలున్నారని, నాబోటి ముష్టి ముండని సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేవుడా! ఈ రోజు తిండికి సరిపడా అడుక్కుందామనుకున్నాను. ఎంత మోసమయిపోయిందిరా దేవుడా! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్ళుంటారు. ఆళ్ళకే ఎక్కువజాలి ఈ బాబులకంటె. నా కట్టమంతా ఆళ్ళకి అర్థమవుద్ది. డబ్బున్నా బాబులంతా రాతి గుండెలని తెలుసుకోలేక పోయాన్రా దేవుడా! అవతల గాలివాన. రైలు నడుత్తావుంది. ఇక్కణ్ణించీ ఎల్లా పోను – ఆ దయగల బాబులున్నా సోటికి. ఇక్కణ్ణించి ఎల్లాపోను…”

ముష్టిమనిషి అందరి దృష్టినీ ఆకర్షించింది. రావుగారిపక్కనున్న పెద్దమనికి అపరాధపరిశోధకనవల చదవడం ఆపేశాడు. విచిత్రంగా ఆమెవేపు చూశాడు.

‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు. ‘ఓ వూరేటి. ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్ళకి. తమబోటి పెభువులకి సెప్పుకోనాకి వూళ్ళుంటాయి. పెద్ద పెద్ద లోగిల్లుంటాయి మీకు. గేటుముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్ళని రానీకుండా తరిమేయిత్తారు బాబులు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ 

‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని వుద్దేశించి ఇంగ్లీషులో. –

‘ఇంగిలీసులో ఎందుకు బాబు తిడతావు. నాకా బాసొచ్చునా, ఏమన్నానా? ఏమీ తెలియనిముండని, పేదముండని.”

బయట చీకటిగా అయిపోయింది. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానబాములా పాకుతోంది. రావుగారు దిగవలసిన స్టేషన్ దగ్గర పడుతోంది. ఆస్తిక సమాజం సభ్యులు ఎవరన్నా స్టేషన్కి రాకపోతారా అని రావుగారు ఆశగా అనుకున్నారు. ఆయన మనస్సు తికమకపడుతోంది. తనూ తన సామానులు రైలులోంచి దిగాలి. అదీ ప్రకృత సమస్య. సహ ప్రయాణీకులు సహాయం చేయకపోరు. 

గాలి అవతల కోపంగావున్న మహాసముద్రంలాగ హోరుమంటోంది. చెట్లు పడిపోతున్న చప్పుడు లాంటివి ఎన్నో గోలగా కలిసిపోయి అవతల వినబడుతున్నాయి. కదులుతున్న రైలు, గాలికి కారణభూతమయిన మానవ మేధ ఆ గాలివానలో నిరుపయోగంగానూ అత్యల్పంగానూ అని అనిపించాయి. పెట్టెలో కొంత సుఖంగానే వుంది. కాని అందులో నించి దిగిపోవాలి.

ముష్టిది పెట్టెలో యువదంపతులకు ఎదురుగా మధ్యగా కూర్చుంది. కొంచెం సేపు ఆగి, మళ్ళీ ప్రారంభించింది.

“అమ్మో నాసిట్టితల్లిగారున్నరిక్కడ, సిట్టిబాబుగారు కూడా ఉన్నారిక్కడ. ఇంకేం! సూడేలేదు ఎర్రిముండని. సిట్టితల్లిగారు! సిట్టిబాబుగారితో సొప్పి ఒక్క డబ్బు ఇప్పించు తల్లి ! ఎందుకుతల్లి అల్లా మొగం తిప్పుకుంటావు. ఏం? సిట్టితల్లికి సిట్టిబాబుకి తగాదా వచ్చిందా? 

సిట్టి బాబుగారు అత్తమానూ చిగరట్లు తాగుతారు. సిట్టితల్లి తాగనీకూడదు. 

అబ్బో! సిట్టితల్లికి నవ్వొత్తావుంది. “

యువతి చిరునవ్వు ఆపుకోలేకపోయింది. యువకుడు కడుపునిండా నవ్వాడు.

అన్నాడు. 

“మాతో కూడా వచ్చేయకూడదూ నువ్వు? పనీపాటా చేస్తూవుందుగాని తిండి గుడ్డా యిస్తామ్”

“ఏదో యిచ్చి దాన్ని పంపెయ్యకూడదూ?” అంది యువతి భర్తని ఉద్దేశించి. 

“నాకు తెలుసు. సిట్టితల్లి గుండి జాలి గుండి. తాతగారు ఇప్పుడు నాకో అణాకి తక్కువివ్వరు.. ఎర్రిముండని ఆ బాబు కంత చిరాకు వచ్చీలాగ చెయ్యకూడదు. అంత మంచిబాబు ఎక్కడా వుండరు. తాతగారు జాలిగల ప్రెభువు…. – 

రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటూంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారు మనస్సు ఇతర విషయాలతో పోయింది. ఆయన గాలివానను గురించి, తను రైలులోంచి దిగడాన్ని గురించి ఆలోచిస్తున్నారు.

రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తంపాటు తెలియలేదు. సరిగ్గా అపుడే వాన మరీ తీవ్రమయింది. ఆయన గొడుగు ఒక చేత్తోబట్టుకు లేచారు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. ఆయన తూలిపోయారు. ముష్టి మనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావుగారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలోచించడానికి సావకాశం లేదు. ఆమె సహాయాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమయిన నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ కలిగింది. కాని రైలు దిగి ఆయన స్టేషనులోకి పరుగెత్తి వెళ్ళిపోయారు. ముష్టి ఆమె ఆయన సామానులు వెయిటింగు రూములో పెట్టింది. స్టేషనులో ఎక్కడా ఒక్క దీపంలేదు. రావుగారు కొంత డబ్బు తీసి ఆమెకు యివ్వబోయారు. ఆమె వద్దనలేదు గాని, ఏదో వినబడకుండా అని చటుక్కుని మాయమయిపోయింది. –

స్థబ్దుడై రావుగారు మళ్ళీ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. గింగురుమనే ఆ గాలిలో కాళ్లు పట్టు తప్పిపోతున్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి.. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమారు. బాటరీలైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. రావుగారికి తన పెట్టెలో ఒక లైటున్నదన్న సంగతి గుర్తులేదు. తడి బట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నారు. ఊలు స్వెట్టర్సు తొడుక్కున్నారు. మప్లరు చెవులకు, తలకు చుట్టుకున్నారు. పెట్టెతాళం వెయ్యడం కూడా మరిచిపోయి కుర్చీలో కూర్చున్నారు. తన స్థితిని గురించి ఆలోచించడం కూడా ఆయనకు యిష్టం లేదు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు వుండి తీరాలని నిశ్చయించుకుని బయటికి వచ్చారు. ఇద్దరు ఎవరో ప్లాట్ ఫారం దాటి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు గొంతెత్తి పిలిచారు. ఇద్దరు ఆగారు. ఒకరు స్టేషను మాష్టరు గారనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు

“నేను వూర్లోకి వెళ్ళాలి” అన్నారు రావుగారు ఆదుర్దాగా. 

“చాలా కష్టం. రోడ్డు మీద అంగుళం అంగుళానికి చెట్లు పడివున్నాయి. టెలిఫోను తీగలు తెగిపోయాయి. ఒకచోటికి ఇంకోచోటికి కబురు తెలియడం కూడా అసంభవం. వచ్చే స్టేషనులో రాత్రికి రైలు ఆగిపోతుంది. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.”

“కాని స్టేషన్లో యింకెవ్వరూ లేరే.”

“నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.”

స్టేషను మాష్టరు వెళ్ళిపోయారు. రావుగారు వెయిటింగు రూంలోకి వెళ్లిపోయారు. పడకకుర్చీలో కూలబడి పోయారు. గది తలుపులు మూసేస్తే గాలివాన లోపలికి రాకుండా వుంటుందని ఆయనకు తోచలేదు. రెండు కిటికీ తలుపులు ముక్కలైపోయాయి. పెంకు లెగిరిపోయాయి. ఏవో క్రూర శక్తులు విజృంభించి మానవుడు సృష్టించినవీ దేవుడు సృష్టించినవీ కూడా భూమిమీద లేకుండా రూపుమాపడానికి పూనుకున్నట్లు అనిపిస్తోంది.

ఈ గందరగోళంలో మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావుగారికి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీకూడా మానవాతీతమయిన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితం అయిపోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి సర్వనాశనానికొడిగట్టినట్టయితే మానవుడు తన్ను తానెలా రక్షించుకోగల్గుతాడు? ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టు పక్కల ఎక్కడా మానవహృదయమన్నది లేదు. స్టేషన్ భీతావహంగా వుండి గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
Kathavahini - Telugu Stories Podcast by TeluguOne

Kathavahini - Telugu Stories Podcast

12 Listeners

Beyond The Zero by Dick's Pizza Media

Beyond The Zero

35 Listeners