Harshaneeyam

రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ


Listen Later

ఆటా బహుమతి పొందిన 'యారాడకొండ' నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన 'తూరుపు గాలులు' కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ' చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం.

'చలిచీమల కవాతు' కొనడానికి - https://amzn.to/3kXhuhK

'చలిచీమల కవాతు' పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి - మీరు ఎంత కాలం నించీ కథలు రాస్తున్నారు? రచనకు మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏమిటి?

80లలో ఒకటి రెండు రాశాను. నాకవి అంతగా నచ్చలేదు. మళ్లీ అరవై ఏళ్ళ వయసులో మొదలు పెట్టాను. అంటే గత అయిదారేళ్లుగా రాస్తున్నాను. చిన్నప్పటినుండి సాహిత్యంలో ఆసక్తి ఉంది గానీ రాయాలనే ఆలోచన కొత్తగా వచ్చింది. కొన్ని కథలు ప్రచురింపబడ్డాక, పాఠకుల స్పందనలు తెలిశాక కొన్ని రకాల కథలు నేను రాయగలను అనే ధైర్యం, నమ్మకం కలిగాయి.

మీరు హిస్టరీమీద పట్టు ఎలా సాధించడానికి మీ చిన్నతనంలో దోహదం చేసిన కారణాలేవైనా ఉన్నాయా

పట్టు సాధించాను అని చెప్పుకోలేను గానీ, చిన్నతనం నుండీ చరిత్ర అంటే ఆసక్తి ఉండేది. అది కూడా ప్రధానంగా పుస్తక పఠనం ద్వారా ఏర్పడ్డదే. పుస్తకాలు కొత్త ప్రపంచాల్ని మన ముందుంచుతాయి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే చిన్న ఊళ్లోని ప్రభుత్వ లైబ్రెరీలో – ‘మొగలాయి దర్బారు కుట్రలు’, నార్వీజియన్ చరిత్రకారుడు రాసిన ‘కడలి మీద కోన్-టికి, రాహుల్ సాంకృతాయన్ రచనలు – ఇటువంటివన్నీ చదివాను. అవన్నీ అనువాదాలే. మా నాన్నగారు విల్ డ్యురాంట్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్’లాంటి ఇంగ్లీషు పుస్తకాలను చదువుతూ ఆ వివరాలు మాకు చెప్పేవారు. ఆవిధంగా సాహిత్యంతో బాటుగా చరిత్ర పట్లకూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది.

స్కూలు రోజుల తరువాత ఇంగ్లీషు పుస్తకాలు కూడా చదవడం మొదలుపెట్టాను. నెహ్రూ 'డిస్కవరీ ఆఫ్ ఇండియా, డీ డీ కోసంబి, ఈ. ఎచ్. కార్, రొమిల్లా థాపర్ ల ప్రభావం నాపైన పడింది. ‘చరిత్ర అంటే గతానికీ, వర్తమానానికి నిత్యం జరిగే సంభాషణ’ అంటాడు ఈ. ఎచ్. కార్. అందుకే చరిత్రని విడిగా కాకుండా, వర్తమానంతోనూ, తద్వారా భవిష్యత్తుతోనూ సంధించగలిగే సందర్భాలు నాకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి.

మీ రచనల్లో హిస్టారికల్ ఫిక్షన్ ముఖ్య ప్రక్రియగా ఎంచుకోడానికి కారణాలు ఏమిటి? మీరు మెరైన్ ఇంజనీర్ కావడం అందుకు తోడ్పడిందా?

ఒక సమాజంలో అంతవరకూ లేనటువంటి టెక్నాలజీని ప్రవేశపెట్టినపుడు ఏమవుతుంది? ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? ఒక ఇంజినీరుగా నాకు ఆసక్తి కలిగించే ప్రశ్నలు ఇవి. ‘వార్తాహరులు’, ‘మూడు కోణాలు’ కథల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. మెరైన్ ఇంజనీర్ ని కావడం మూలాన నాకు వాణిజ్య నౌకారంగ చరిత్ర, అంటే మేరిటైం హిస్టరీలో ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. ముఖ్యంగా యూరోపియన్ నావికులు, వ్యాపారులు మనదేశంలో అడుగుపెట్టిన తొలిదశలో వచ్చిన మార్పుల్ని శోధించడం నాకు ఇష్టమైన పని. ఒక స్తభ్దతకు లోనై, ఎన్నో శతాబ్దాలపాటు నిద్రాణంగా ఉన్న మన ఫ్యూడల్ వ్యవస్థలో యూరోపియన్ల రాకతో కదలికలు మొదలయ్యాయి. 'ఆసియా ఖండం తన చరిత్రలో తానే మునిగి, సుదీర్ఘమైన నిద్రావస్థలో ఉంది’ అన్నాడు మార్క్సు. ఆనాడు మొదలైన మార్పులు మన దేశపు ఆధునిక చరిత్రలో చాలా కీలకమైనవి.

యారాడ కొండ నవల రాసినప్పుడు ఇంతకు మునుపు విశాఖ పట్టణం ఎలా ఉండేదో తెలుసుకోడానికి మీరు చేసిన పరిశ్రమ గురించి వివరాలు చెప్తారా?

ఇంట్లో వాళ్లు తాత ముత్తాతల కథలు చెప్తూనే ఉండేవారు. మిగతావి ఎక్కువగా నేను చూసినవి, నాకు తెలిసిన సంగతులే. కొన్ని వాస్తవాలను, వివరాలను, తేదీలను చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అవి ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి. కొంత మంది మిత్రులు, పెద్దలు సహకరించారు.

విశాఖ వాసుల నించీయారాడకొండపై వచ్చిన స్పందన ఏమిటి?

మా తరం వాళ్లు, ఇంకా ముందరి తరం వాళ్లు - తమ చిన్ననాటి రోజుల్ని గుర్తుచేసిందన్నారు. యువతరం, 'మాకు తెలియని వివరాలు చాలా ఉన్నాయీ నవలలో’ అన్నారు. మొత్తనికి అన్ని వయసుల వాళ్లూ కనెక్ట్ అయ్యారు.

త్రిపుర గారితో మీకున్న సాహితీ పరిచయాన్ని గురించి కొన్ని వివరాలు చెప్తారా? ఆయన సాన్నిహిత్యం మీకు రచనా పరంగా ఎంత మటుకు మేలు చేసింది?

ఆయన నా రచనలేవీ చదవలేదు. నేను రాయడం మొదలుపెట్టేనాటికే ఆయన వెళ్లిపోయారు. అయితే ఆయనతో సాగత్యం మూలాన నాకు తెలియని ఎంతోమంది అంతర్జాతీయ రచయితల రచనలు పరిచయం అయ్యాయి. ఒక్కోసారి ఏదో పుస్తకం నా చేతిలోపెట్టి, 'ఇది చదువు, నీకు నచ్చుతుంది’ అనేవారు. అది చదివాక నేనేదైనా చెబితే వినడమేగానీ మళ్లీ దాని గురించి అడిగేవారు కాదు. ఎప్పుడైనా కొందరి రచనల గురించి తన అభిప్రాయం చెప్పేవారుగానీ సుదీర్థమైన సాహితీ చర్చలు జరపడానికి ఇష్టపడేవారు కాదు.

కొన్ని కథలు మీరు మీ అబ్బాయితో కల్సి రాయడం జరిగింది? కొలాబరేషన్ గురించి వివరాలు చెప్తారా?

మా అబ్బాయి జైదీప్ ఉణుదుర్తి, నేనూ కలిసి ఇంతవరకూ ఒకే కథ రాశాం. 'రెక్కలు చాచిన రాత్రి’ అనే ఆ కథలో ప్రత్యామ్నాయ చరిత్ర అనే ప్రక్రియను తీసుకున్నాం. జైదీప్ బాగా చదువుతాడు; స్వయంగా రచయిత. సైన్స్-ఫిక్షన్ రచనలు చాలా చదివాడు, కొన్నిటిని నాకు పరిచయం చేశాడు. ప్రత్యామ్నాయ చరిత్ర అనేది సైన్స్-ఫిక్షన్ కోవకి చెందే ప్రక్రియ. అయితే ప్రత్యామ్నాయ చారిత్రక రచనలను ఆస్వాదించాలంటే చరిత్ర తెలిసి ఉండాలి.  ఇది రాయడానికి మాకు సుమారు ఆరునెలలు పట్టింది. మరే కథకీ అంత కాలం పట్టలేదు.

ఇప్పుడు ఎక్కువమంది ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి, అదే రంగాల్లో ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడ్తున్నారు. వీరికి తెలుగు సాహిత్యం చదవడం రకంగా ఉపయోగపడుతుంది?

ప్రొఫెషనల్ కోర్సులకీ, సాహిత్యానికీ మధ్య వైరుధ్యం ఏమీలేదు. సాహిత్యం, కళలూ మనుషుల్ని సాటి మనుషుల పట్ల, సమాజం పట్ల మనల్ని సెన్సిటైజ్ చేస్తాయి. మన మూలాల పట్ల ఎరుకను కలుగజేస్తాయి. వాటిని వొదులుకుంటే మర మనుషులంగా మిగిలిపోతాం. ప్రజలకీ, సమాజానికీ మనల్ని దూరం చేసే చదువు నా దృష్టిలో చదువే కాదు. పై దేశాలలో, పై రాష్ట్రాలలో ప్రొఫెషనల్ కోర్సులు చేసేవాళ్లంతా సాహిత్యానికి దూరం అయిపోతున్నారా? లోపం మన విద్యావిధానంలో, సిలబస్ లలో ఉంది. దాన్ని సవరించడం పెద్ద కష్టం కాదు. ఇంగ్లీషు అవసరమే. కానీ తెలుగుని దూరం చేసుకోరాదని నా అభిప్రాయం. మాతృభాషని ఎలా కాపాడుకోవాలనేది మిగతా దేశాలనుండి, రాష్ట్రాలనుండి మనం నేర్చుకోవచ్చు - తప్పులేదు.

మిగతా భాషలతో పోలిస్తే ఎక్కువమంది తెలుగు పుస్తకాలు కొనడం లేదు, చదవడం లేదు అనేది ఒక అబ్సర్వేషన్. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? తెలుగు పుస్తకాలకు ఎక్కువ ప్రాచుర్యం రావాలంటే ఏమి చెయ్యాలి?

తెలుగంటే ఏర్పడ్డ చిన్నచూపుని మొదట వదులుకోవాలి. ఇంగ్లీషులో స్పెల్లింగు తప్పులు రాకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. అలాగే ఉచ్చారణ విషయంలో కూడా. తెలుగు దగ్గరకు వచ్చేసరికి అందులో పదోవంతు శ్రద్ధ కనిపించదు. తల్లిదండ్రులు పిల్లలు తెలుగు మాట్లాడేలా ప్రోత్సహించడం లేదు. స్వానుభవం ఆధారంగా మూడు చర్యలు అవసరం. బోధనాభాషగా తెలుగు - కనీసం పదో తరగతి దాకా. రెండోది మన గ్రామీణ లైబ్రెరీలనీ, స్కూలు లైబ్రెరీలనీ పునరుద్ధరించడం. మూడవది - బాల సాహిత్యాన్ని ఆకర్షణీయమైన బొమ్మలతో రూపొందించి తక్కువ ధరకు అందజేయడం. 'చందమామ’, ‘బాలమిత్ర’, అమర్ చిత్ర కథ అలాగే బొమ్మల భారతం, బొమ్మల రామాయణం, శతకాలు, పద్యాలు, పాటలు, జానపద గీతాలు, హరికథ, బుర్రకథలు - ఇవన్నీ మా తరం వరకూ గట్టి పునాదిని ఏర్పరచాయి. ఒకప్పుడు సోవియట్ యూనియన్ పిల్లలకోసం ఎన్నో పుస్తకాలను ప్రచురించేది, అతి తక్కువధరకు దొరికేవి. ఇవాళ్టి డిజిటల్ ప్రపంచంలో ఇవేవీ సాధ్యపడవు. కొత్త మాధ్యమాల ద్వారా పిల్లల్ని, యువతరాన్ని చేరుకోవాలి. ఉదాహరణకి ఆడియో బుక్స్ అనేది అటువంటి ఒక సాధనం. అలాగే యానిమేషన్ చిత్రాలు కూడా. తెలుగుని కాపాడుకోవడానికి ఇది మనకున్న ఆఖరి అవకాశం అని మనమంతా గుర్తించాలి. రాబోయే తరాలకు నేర్పేవాళ్లు కూడా మిగలరు.

రాబోయే పుస్తకం ‘చలిచీమల కవాతుగురించి వివరాలు చెప్తారా?

2018లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ వారు 'తూరుపు గాలులు’ సంకలనాన్ని ప్రచురించారు. దానికి పాఠకులనుండి, విమర్శకులనుండి మంచి స్పందన లభించింది. ఆ తరువాత రాసిన ఐదు కథల్ని ఇప్పుడు 'చలిచీమల కవాతు’గా అదే ప్రచురణకర్తలు తీసుకొస్తున్నారు. మరో వారం రోజుల్లో ఇది మార్కెట్లోకి వస్తుంది. అమెజాన్ లో దొరుకుతుంది. నేను చారిత్రక కథలే రాస్తాను అనే ముద్ర పడినట్లు తోస్తున్నది. 'చలిచీమల కవాతు కథలు’ ఆధునిక సమాజం గురించి రాసినవి. ఇందులోని 'గిట్టలు, గోళ్లు’ అనే కథ అలేగోరీ అంటే ఉపమాన రూపంలో అన్యాపదేశంగా చెప్పిన కథ. ఈ సంకలనంలోనే జైదీప్ తో బాటు రాసిన ప్రత్యామ్నాయ చారిత్రక కథ 'రెక్కలు చాచిన రాత్రి’ కూడా ఉంది. నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉండాలి అని నేను నమ్ముతాను. ఆ దిశగా చేసిన ఒక ప్రయత్నం – ‘చలిచీమల కవాతు’.  




This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
NPR's Book of the Day by NPR

NPR's Book of the Day

616 Listeners