నాగరికత అని చెప్పుకునే ఒక విధమైన సమాజ నిర్మాణానికి బీజం వేసినప్పటి నుంచి స్త్రీకి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టి, పనికి దూరం పెట్టారు. పని చేయడం పురుష లక్షణమనీ, స్త్రీ సౌకుమార్యానికి, సౌందర్యానికీ ప్రతీక అని కవిత్వాలు అల్లారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి మనిషిగా ఉన్న స్త్రీని దేవతామూర్తిగా మార్చారు. అంతటితో ఆగకుండా ప్రబంధాలు రాశారు, స్త్రీ సౌందర్యోపాసనను రసాస్వాదనగా మార్చారు. స్త్రీల కోసం యుద్ధాలు చేశారు, కావ్యాలు రాశారు. నాగరికత కొత్తపుంతలు తొక్కేటట్టు చేశారు. అంతఃపురానికి అన్ని సౌకర్యాలూ కల్పించారు, బయటకు అడుగుపెట్టనీయకుండా, ఎండపొడ పడనీయకుండా పరదా కూడా వేశారు. మాతృమూర్తిని చేశారు, వీరవనితలుగా మార్చారు. విజయ ఫలాలుగా మారారు.