Harshaneeyam

నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!


Listen Later

ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్లు ఉండటంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసం తో మొదలుపెట్టాము, మాకేంటి అనే ధీమా తో. జె .ఎఫ్ .కే లో మార్చ్ 31 వ తేదీ సాయంత్రం ఐదున్నరకి దిగేసాము. డెన్వర్ కి మా కనెక్టింగ్ విమానం, తర్వాత రోజు ఉదయం ఏడు గంటలకు, పక్కనే ఉన్న లాగార్డియా విమానాశ్రయం నుండి. మా కంపెనీ వాళ్ళు 31వ తేదీ రాత్రికి, మాకు జె.ఎఫ్.కె కి దగ్గర వున్న రమడా ఇన్ లో బస ఇచ్చారు.

నా క్లోజ్ ఫ్రెండ్స్ ఐన శ్రీధర్, మరియు నాకు జూనియర్ ఐన కమల న్యూజెర్సీ లో చాల సంవత్సరాల క్రితమే స్థిరపడి యున్నారు. మా రాక తెలిసి, ఆ ఇద్దరూ విమానాశ్రయానికి   వచ్చారు, మమ్మల్ని చూడను. పిచ్చాపాటి అయ్యాక రాత్రికి ఇక్కడెందుకు,  మనం ఇంటి కెళదాం అన్నారు. మేము ఉత్సాహంగా ఇంకొంచెం కబుర్లు చెప్పుకోవచ్చు అనుకొని,  సరే అన్నాము. అలా కమల వాళ్ళింట్లో బస చేద్దామని, వాళ్ళింటికి వెళ్ళాము. శ్రీధర్ భార్య కవిత మరియు వాళ్ళ బాబు అనిరుధ్ అప్పటికే కమల వాళ్ళింటి కి చేరుకొని వున్నారు. ఆ రాత్రి, మా మూడు కుటుంబాలు కలిసి,  పిచ్చా పాటి మాటలాడుకొని, డిన్నర్ చేసి, మరల బాగా పొద్దు పోయిందాకా కబుర్లు చెప్పుకొని కొన్ని గంటలే నిద్ర పోయాము. తర్వాత రోజు ఆరుగంటలకు, అనగా ఒక గంట ముందు విమానాశ్రయానికి చేరుకున్నాం. అక్కడకి వెళ్ళాక ఎయిర్ లైన్స్ వాళ్ళు బాంబు పేల్చారు, విమాన తలుపులు అప్పటికే మూసివేయబడ్డాయని. ఏంటబ్బా! అని తలలు గోక్కున్నాక, శ్రీధర్ మరియు కమల చెప్పారు, క్షమించు అబ్బాయి! ఈ రోజు ఏప్రిల్ ఒకటి, మాకు అమెరికాలో ఒక గంట సమయం ముందుకు జరుపుతారు. ఇప్పుడు సమయం ఆరు పది కాదు, ఏడు పది, అందుకే మీ విమాన తలుపులు మూసివేయబడ్డాయి అని. ఇన్నేళ్లు మేము ఇక్కడున్నా, మేము కూడా మరిచితిమి, తాళం వేసితిమి గొళ్ళెం వేయుట మరచితి అన్నట్టు.

హతవిధీ! ఏమి ఈ వైపరీత్యం అనుకుంటూ, ఆ విమానపోళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు దయదలచి డెట్రాయిట్ ద్వారా వెళ్లే విమానానికి సర్దుబాటు చేశారు, కాక పోతే ఒక షరతు తో. అదేమిటంటే, ఆ రోజు ఆదివారం కనుక, డెట్రాయిట్ నుండి డెన్వర్ కి ఏ విమానంలో ఖాళి ఉంటుందో, ఆ విమానం మాత్రమే ఎక్కాలని, బిచ్చగాడికి ఎంపిక చేసుకొనే అధికారం లేదు అని చెప్పకనే చెప్పారు. వాళ్ళిచ్చిన విమానం పట్టుకొని పదకొండుకి డెట్రాయిట్  లో దిగాము. డెట్రాయిట్ నుండి డెన్వర్ కి అన్నీ విమానాలు కిటకిటలాడిపోయాయి. మా ఇద్దరు పిల్లలు చిన్న వాళ్ళు. కాకపోతే మా కేబిన్ బాగ్స్ అన్నిట్లోనూ పిల్ల సామగ్రీయే పెట్టుకున్నాం, కాబట్టి ఇబ్బంది లేదు.  విమానాశ్రయం లోనే  మధ్యాహ్న భోజనంగా, సుప్రీ! పెప్పరోని అంటే ఎర్రని పచ్చి మిర్చి (బెల్ పెప్పెర్స్ ) అని చెప్పి, పిజ్జా ఆర్డర్ చేసి, యమ్మీ యమ్మీ! అంటూ ఒక్క మా చిన్నది తప్ప, అందరమూ తినేశాం.

అలా సాయంత్రం ఆరు దాకా విమానాశ్రయం లోనే ప్రతీ విమానంలో ఖాళీ ఉందా అని విమానపోళ్ళని అడుక్కుంటూ గడిపేసాము. ఏ విమానమూ దొరకలేదు మాకు ఆ రోజు. మరలా విమానపోళ్ళని బతిమాలుకుంటే, ఆ రోజు రాత్రికి బస మరియు డిన్నర్ కి కూపన్స్ ఇచ్చారు. హోటల్ కి వాళ్ళు ఏర్పాటు చేసిన షటిల్ లో ప్రయాణం. బయటకొద్దుము కదా చలి ఇరగ తీస్తుంది, వొళ్ళంతా గడ్డకట్టుకు పోయేలా. మా బట్టలన్నీ చెక్ ఇన్ బ్యాగేజీ లోనే వున్నాయి.  బతుకు జీవుడా అనుకుంటూ, హోటల్ కి వెళ్ళాం. పిల్లల వరకూ అన్నీ వున్నాయి మా దగ్గరే, పాలపొడులు పొడులు, బిస్కట్స్, డైపర్స్ వగైరా వగైరా. తెల్లవారి లేచి డెన్వర్ ఫ్లైట్ పట్టుకున్నాము.

కానీ డెన్వర్ లో ముందు రోజు రాత్రి పెద్ద మంచు తుఫాను. దాదాపు రెండు అడుగుల వరకూ మంచు, ఎక్కడ చూసినా కుప్పలుగా. మమ్మల్ని పిక్ అప్ చేసుకున్న అబ్బాయి దాదాపు మూడు గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చాడు విమానాశ్రయానికి , ఆ మంచులో పడి. ఇంటికి చేరే సరికి మాకు లోకల్ టైం ఏ మూడో నాలుగో అయ్యింది. ఆ అబ్బాయి వండిన అన్నం మరియు పప్పు,  అమృతం లా గా తిని పడి నిద్ర పోయాం. చాలా ఆలస్యంగా లేచి విక్రమ్ విక్రమ్ పెప్పరోని అంటే ఏమిటి అంటే,  అది బాగా గుండ్రంగా కోసిన పంది మాంసం ముక్కలు అని చెప్పాడు. అప్పుడు మొదలయ్యింది సుప్రియాకి, కడుపులో అసలు సిసలు యమ్మీ యాక్షన్ . కాబట్టి జనులారా అమెరికాలో, ఈ సమయ మార్పుతో జాగ్రత్తగా వుండండి. మొదటి సారి వెళ్లే టప్పుడు ప్రయోగాలు చేయకండి. బుద్దిగా ఇచ్చిన ముందస్తు సూచనలు  పాటించండి. ఆ కమలాని మరియు శ్రీధర్ గాడిని అసలు నమ్మకండి.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
Beyond The Zero by Dick's Pizza Media

Beyond The Zero

35 Listeners