శీర్షిక: మ్యాజిక్ చేద్దామా
రచయిత్రి: శివరంజని, ఊరు : హైదరాబాద్
*************************************************************************
తనకెంతో ఇష్టమైన మామిడిపళ్లు తింటున్న చిన్నుని తల్లి పావని "చిన్నూ మామిడితొక్కలు చెత్తడబ్బాలో వేయకుండా, వీటితో మ్యాజిక్ చేద్దామా" అని అడిగింది.
చిన్నూ హుషారుగా తల ఊపాడు. పళ్లతొక్కలు తీసుకొని ఇద్దరు వాళ్ల మిద్దెతోటలోకి వెళ్లారు.
"చిన్నూ, ప్రతిరోజూ మనింట్లో చెత్త ఏమవుతుంది" అని పావని అడిగింది.
"చెత్తబండిలో తీసుకెళ్తారు అమ్మ" అన్నాడు చిన్నూ.
"గుడ్, ఇలా ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకెళ్లి అందరి చెత్తను ఒకచోట వేస్తారు. వీటిని ల్యాండ్ ఫిల్స్ అంటారు. ఒక్క హైదరాబాదులోని ఇళ్ల నుంచే ఒకరోజుకు అయిదువేల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. వీటిలో సగం వంటింటివ్యర్తాలు కాగా మిగతా సగం ప్లాస్టిక్, పేపర్ లాంటివి ఉంటాయి. ఇవి గాలిని, భూమిని కలుషితం చేసి, రోగాలు పెంచుతున్నాయి. మరి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం మ్యాజిక్ చేద్దామా" అడిగింది పావని.
"చేద్దామమ్మా" అన్నాడు చిన్నూ.
పావని మిద్దెతోటలోని కంపోస్టింగ్ తొట్టిలో మామిడితొక్కలు వేసి, మట్టితో కప్పేసి " కొన్నిరోజుల్లో మ్యాజిక్ జరిగి తొక్కలన్ని ఎరువు అవుతాయి" అని మరో కంపోస్ట్ తొట్టిలో తయారైన ఎరువును చూపింది. "ప్రతి కుటుంబం ఇలాగే వంటింటి వ్యర్తాలను ఇళ్లదగ్గరే కంపోస్ట్ చేస్తే, సగంచెత్త తగ్గుతుంది. మున్సిపల్ కార్మికులు, ప్లాస్టిక్, పేపర్ వంటివి వీలైనంతమటుకు రీసైక్లింగ్ కు పంపిస్తారు. అప్పుడు కాలుష్యం తగ్గుతుంది. బావుందా మ్యాజిక్" అన్నది పావని.
"వావ్ అమ్మా, ఈ మ్యాజిక్ మా స్నేహితులందరికీ నేర్పిస్తా" అన్నాడు చిన్నూ.
నీతి: మనం ఉత్పత్తి చేస్తున్న వ్యర్తాలకు మనమే బాధ్యత వహించి, కాలుష్య నివారణలో మన పాత్ర నిర్వర్తించాలి.
*************************************************