జోగిని - Skitఉపోద్ఘాతం - క్రీ.శ. 10వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో దేవాలయాల్లో, దైవ సన్నిధిలో నాట్యనివేదనకై నియమింపబడిన దేవుని దాసులే దక్షిణ భారత దేశంలో దేవదాసిలై, తెలుగు రాష్ర్టాలలో జోగినిలై, కేరళలో మాతంగిలై, అభం శుభం ఎరుగని అయిదేళ్ల వయసులో జీవితాన్ని దైవసన్నిధిలో, దైవం ముసుగులో ఎన్నో అరాచకాలకు బలైపోయాయి పసిప్రాయాలు. ఇది కేవలం భారత దేశంలోనే కాదు మన పొరుగు దేశాలైన శ్రీలంక, బాంగ్లాదేశ్, పాకిస్థాన్ లోనూ, మలేషియా, థాయిలాండ్ లోనూ, ఇండోనేషియా లో దేవీ-దేవీ అని, కాంబోడియా లో అప్సరసలని, నేపాల్ లో దేవికి లేని, చైనా మరియు రోమ్ లో ఆలయ వేశ్యలని, ఆఫ్రికా లో ట్రొపీజెన్నాస్ అని, జపాన్ లో గెయిషా లని, కొరియా లొ కిసాంగ్ అని, గ్రీస్ లో హిరోడల్సని పిలువబడే ఈ దురాచారాలు ఎన్నో ఏళ్లుగా ఎందరో పసిపాపలు, మరెందరో యువతులు, ఇంకెందరో మహిళలు తరతరాలుగా తమ మానప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతున్నారు. అటువంటి ఓ చిన్నారి చిన్ని కథే మా యీ జోగిని. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు. చరిత్ర పుటల్లో నుంచి పుట్టుకొచ్చిన బాధల వ్యధలే మా యీ గాథ. ఇది ఎవరి మనస్సునైనా నొప్పించినట్లున్ననూ, ఎవరి జీవితానికైనా దగ్గరగా ఉన్నట్లున్ననూ సాదరాభిమానంతో మన్నించి మా యీ చిన్న ప్రయత్నానికి ప్రోత్సాహాన్నిస్తారని ఆశిస్తూ......
నాటక సమయం - అయిదు నిమిషాలు
పాత్రలు - అమ్మ, అయ్య, చిన్ని, మల్లి, విజయ్, స్వామి
స్టేజి - ఎడమ వైపు చిన్ని ఇల్లు, అయ్య బుట్టలు అల్లడం, అమ్మ ఇంటి పని చేయడం, చిన్ని జామకాయలు కోయడం. మధ్యలో గుడి, గుడి లో సామి పూజలు చేయడం, బయట కాళ్లు లేని మల్లిగాడు డోలు వాయించడం. కుడివైపు గ్రామం పొలిమేరల్లో డాక్టర్ విజయ్ రావడం
డాక్టర్ విజయ్ - నేనిప్పుడే ఊర్లోకొస్తున్నానమ్మా. దారి తెలియట్లేదు. ఎవరయ్యా నువ్వు? కళ్లు కనిపించట్లేదా? ఇలా మీద పడుతున్నావు?
మల్లి - మన్నించండి సారు, నాకు నిజంగానే కళ్లు కనిపించట్లేదు.
డాక్టర్ విజయ్ - అరేయ్ మల్లి, ఏమైందిరా? నేను నీ చిన్ననాటి స్నేహితుడు విజయ్ ని. పట్నం లో బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యాను. ఇదో మన ఊరికే వచ్చాను. అసలు నీకళ్లకేమైంది రా?
మల్లి - ఏం సెప్పమంటావు, యిజయా. ఒక్కసారి నువ్వే చూడు.
సామి - ఓం భీం బుష్ “3”
అమ్మ - సిన్నీ......ఓ.....సిన్నీ.......యాడబోయి సచ్చినావే ? కూడు తిందువురా?
అయ్య - ఎందుకే దాన్నెలా తిడతావు? యాడో ఆడుకుంటాంటదిలే. ఆకలైతే అదే వస్తది.
చిన్ని - పో అమ్మా. నేను జాంకాయలు కోసుకుంటాండా.
అమ్మ - జాంకాయలా? పాడా? వచ్చానంటే యీపు యిమానమైపోతుంది. (అని కర్ర తీసుకుంటుంది)
అయ్య - ఎందుకే దాన్ని గదురుకుంటావు. పోనీయే!
అమ్మ - నువ్వూరుకోవయ్యా. నీకేం తెల్వదు. ఒసేయ్ ! యాడ బడి సచ్చినావే? వస్తాండా ఉండు.
చిన్ని - ఈ జాంకాయలు మల్లి మామకిద్దాం. పాపం, ఏమన్నా తిన్నాడో లేదో. మల్లి మామా? మల్లి మామా?
మల్లి - సిన్నీ. నా బంగారు తల్లీ. ఏమైందమ్మా. పొద్దుగూకాక, ఇప్పుడొచ్చావేంది. అమ్మ అయ్య బెంగ పెట్టుకుంటారు కదే, ఇంటికెళ్లమ్మా.
చిన్ని - నేనెళ్తాలే మామా! ఇగో ఈ జాంకాయలు తిను. ఏమన్నా తిన్నావో లేదో. ఇందా తిను.
మల్లి - యాడ పుట్టానో తెలీదు. యెవరికి పుట్టానో కూడా తెలీదు. ఈ అనాథను , అవిటోడ్ని, రోజూ తిన్నానా లేదా అసలున్నానా లేదా అని ఆలోచించే మాయమ్మవి నువ్వే సిన్నీ.
చిన్ని - నేనున్నంతవరకు నువ్వు అనాథవేంది మామా? నేను నిన్ను సూసుకుంటా. అదో అమ్మ అరుస్తోంది. ఇంటికేళ్తామరి. (దార్లో సామి దొంగతనం చూసి భయపడి ఇంటికెళ్ళి పడిపోతుంది)
అయ్య - సిన్నీ....సిన్నీ...... ఏమైందమ్మా? ఏం జరిగిందే?
చిన్ని - అమ్మ....అయ్య.....అమ్మ......అయ్య.......
అమ్మ - అయ్యయ్యో నా బిడ్డకి ఏమో అయిందే. అయ్యో. నీకెన్నిసార్లు సెప్తినే బయట తిరుగద్దని. యిని సస్తివా? యిప్పుడు నేనేం సేసేదిరా దేవుడా దేవుడా?
అయ్య - అసలే బిడ్డ ఏందో సూసి బయపడతాంటే, యింకా బయపెడతావేందే?
అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. ఆ సాములోరే ఏదో ఒకటి సేస్తారు. పదా గుడికి పోదాం.
అయ్య - సామి! సామి! నా బిడ్డ చీకట్లో ఏందో సూసి భయపడినాది. మాట రావట్లేదు సామి.
సామి - ఓం భీం బుష్. నీ బిడ్డకి దెయ్యం పట్టిందిరా! దీనికి ఒక్కటే విరుగుడు.
అయ్య - దెయ్యమేంది సామి!
అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. మీరు సెప్పండి సామి. మేమేం సెయ్యాలి.
సామి - నీ బిడ్డని బాగు సేస్తాను. కానీ.......
అయ్య - కానీ ఏంది సామి?
అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. మీరు సెప్పండి సామి. మేమేం సెయ్యాలి.
సామి - ఓం భీం బుష్. నీ బిడ్డని బాగు సేశాక, నీ బిడ్డని జోగిని సెయ్యాల.
అయ్య - జోగిని అంటే ఏంది సామి?
అమ్మ - నువ్వూరుకోవయ్యా, నీకేం తెల్వదు. మీరు సెప్పండి సామి. మేమేం సెయ్యాలి.
సామి - జోగిని అంటే దేవదాసి రా. దేవుని భార్య. ఇక్కడే ఉండాల. దొరికింది తినాల. యీడే పడుకోవాల. దేవుడి కోసం ఏమైనా సేయాల.
మల్లి - సామి, సిన్ని సిన్న పిల్ల సామి. వొగ్గెయ్యండి సామి. ఆ పనులు నేను సేసి పెడతాను. మీ కాళ్లొగ్గుతా సామి వొగ్గెయ్యండి.
సామి - (కాళ్లతొ దూరంగా తన్ని) నువ్వేందిరా సెప్పేది నాకి. తప్పు సేసింది అది, అనుభవించాల్సిందీ అదే. (జాంకాయలు కింద పడగా) ఈ జాంకాయలు ఎక్కడివి రా? దొంగిలించావా? అసలు దేవుడి నగలు కనిపించడం లేదు. నువ్వే దొంగిలించారు కాదా ? నిజం చెప్పు?
మల్లి - అమ్మ మీద ఒట్టేసి సెప్తాండ సామి. నేనే దొంగతనం చెయ్యలేదు
సామి - అమ్మ అయ్య లేనోడివి. నువ్వేందిరా ప్రమాణం సేసేది. నువ్వు దొంగతనం సేశావో లేదో నేనే నిరూపిస్తా. ఇగో ఇదే కాలకూట విషం. దీన్ని నీ కంట్లో వేసినప్పుడు నీ కళ్లు పోకపోతే నువ్వు దొంగతనం చేసినట్టు. లేదంటే ఆ దొంగతనం చేసింది నువ్వే. (అని బలవంతంగా వాడి కళ్లలో విషం పోసి కళ్లు పోగొడుతాడు) సూశారా, వీడే దొంగతనం సేశాడు. అందుకే యీడి కళ్లు పోయాయి. యీడ్నిప్పుడే ఊరి నుంచి ఎలేయండి. (అని వాడ్ని దూరంగా తంతాడు. అప్పుడు విజయ్ మీద పడి, ఇది జరిగిందంటాడు)
డాక్టర్ విజయ్ - ఎంతటి ఘోరం. ఇదెంతటి అవివేకం. మనం ఆధునిక యుగంలో ఉన్నామా లేక ఆదిమ యుగంలో ఉన్నామా? పదా, ఆ దొంగ సామి భారతం పడదాం.
సామి - ఎవడికి రా నువ్వు? నా అనుమతి లేకుండా నా ఊర్లోకే వచ్చావు?
డాక్టర్ విజయ్ - నీ ఊరా? ఎవడు రాసిచ్చాడు? ఎంతకి కొన్నావేంటి? వదిలితే ఈ దేశం కూడా నాదే అంటావేమో. అసలు నిన్నెవరు సామి అన్నది. మూడు నామాలు పెట్టి, నాలుగు దండలేసుకొని, అడ్డంగా గడ్డం పెంచేసి కాషాయం ధరించినంతమాత్రాన నువ్వేం చెబితే అది నిజమైపోతుందా? అదెలాగ? విషం కళ్లలో కేసి కళ్లు పోతే దొంగతనం చేసినట్లా? పోక పోతే చేసినట్లా? ఇప్పుడు నేను చెబుతున్నా. ఆ దొంగతనం చేసింది నువ్వే. కాదంటే చెప్పు. ఈ విషం నీ కళ్లలోకి పోస్తా. నువ్వు దొంగతనం చేయకపోతే నీ కళ్లు పోవు. చూద్దామా?
సామి - అయ్యో సామి! నన్ను క్షమించండి. ఇదిగో మీ గుడి నగలు. నన్నొదిలిెయ్యండి సామి (అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అందరూ వాడి వెంట పాడుతారు)
డాక్టర్ విజయ్ - ఆగండి. మోసం చేసే వాళ్లుకన్నా మోసపోయేవాళ్లదే పెద్ద తప్పు. మీరిలా మోసపోతున్నంతకాలం వీదికొక దొంగ బాబా పుట్టుకొస్తాడు. అయినా తప్పు వాళ్లది కాదు. రాకెట్ ని సైతం చంద్రునిపై, అంగారకుడిపై పంపి, విశ్వాన్ని సైతం విశదీకరిస్తున్న ఈ నవయుగ భారతంలో, నోట్లో లింగాలు తీస్తాం, నీ జాతకాలు మారుస్తాం అంటూ పేర్లను, మొబైల్ నెంబర్లను మారుస్తూ ఏమార్చే వాళ్లకి పెట్టే డబ్బుల్లో కనీసం పదోవంతు పేదలకు పెడితే ఈ దేశం ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటుంది.ఎముకలు వంగిన ముతకల్లారా చావండి
రక్తం మరిగే యువకుల్లారా లేవండి
పదండి ముందుకు పదండి దూసుకు పదండి పోదాం పైపైకి
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
ఈ పాపకి ఏం కాలేదు. భయంతో జ్వరం వచ్చింది. ఈ మందులేస్తే సరిపోతుంది. ఇప్పటికైనా మీ మూఢనమ్మకాలు వదిలి మనిషిని మనిషిలా ప్రేమించడం. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం నేర్చుకోండి.