
Sign up to save your podcasts
Or


ఈ కథ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘ రామేశ్వరం కాకులు’ పుస్తకం లోనిది.
పుస్తకం కొనాలంటే – https://amzn.to/3rDN1YM
రామేశ్వరం కాకులు :
వెనకవైపు రెండు వేపచెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ రెండు చెట్లనీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీసు స్టేషను. పెరటిగోడ పక్కభాగంలో లోపలికి రావడానికి చిన్న గేటుంది. సామాన్యంగా తెరవరు. వేపనీడలో ఒకవైపు రెండు స్నానాల గదులూ, ఒక పాయఖానా, వీటికి దూరంగా నాలుగు నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడుంటాయి. స్టేషనుకి వెనక వరండా ఉంది. వరండాలో అనేకమంది నేరస్థులు, అమాయకులు, అనుమానితులు కూర్చుని కూర్చుని నున్న బరిచిన రెండు పొడవాటి బెంచీలుంటాయి. రెండుకాళ్లూ ఎదుట కుర్చీలో పడేసి, టీ తాగిన కప్పు పక్కకుర్చీలో పెట్టి, తీరిగ్గా సిగరెట్టు వెలిగించి, పొగ వదులుతూ, కానిస్టేబులు వేపు చూశాడు రెడ్డి.
దరిదాపు ఒంటిగంటవుతోంది – వేప కింద మంచం వేసుకుని హాయిగా పడుకోవాలనుంది అతనికి.
“ఊ. ముండలకి అన్నం పెట్టారా?” కానిస్టేబులు నవ్వాడు.
“తిన్నారు సార్. బేబీ వచ్చి డబ్బులిచ్చింది.”
“ఎలాగైనా వాళ్లని బానే చూసుకుంటారా మీరు.”
ఎస్సైగారి మాటలకి మళ్లీ నవ్వాడు పీసీ.
“ఎంతమందీళ్లు.”
“నలుగురు సార్. ముగ్గురు పాతోళ్లే. నాలుగోది ఈడది కాదు సార్.”
“అవునే, ఈళ్లకి మన్లాగే ట్రాన్స్ ఫర్లుంటాయి గదా!”
మళ్లీ నవ్వేడు పీసీ.
“దాని గుంటూరు యాసండి. అదేదో పల్లెటూరు సార్. మాణ్నెల్లయిందంట దీనికాడికొచ్చి. ఇంటర్ చదివిందంట సార్.”
“ఆ. ఉష్ణోగాలు జేసే వోళ్లీ సెల్ ఫోన్లు అడ్డుపెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. నే వైజాగులో మెడిసిన్ చదివే అమ్మాయిల్ని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో. ఈ డ్రగ్స్ ఉంటయి గదా, వాటికి అలవాటుపడి.”
కాసేపాగి పీసీ వెళ్లిపోయాడు. రెడ్డి భోజనం చేసి వచ్చాడేమో చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. తల వెనక్కి వాల్చి కళ్లు మూసుకున్నాడుగానీ ఎందుకో నిద్ర రాలేదు. మరో పది నిమిషాల్లో పీసీ వచ్చి దగ్గ నుంచున్నాడు. కళ్లు తెరిచి చూశాడు రెడ్డి.
“తినేత్తందండి. కాళ్లట్టేసుకుంది. మీతో మాటాడాలట సార్. కాళ్లిదలట్లేదు సార్.”
ఒక క్షణంపాటు రెడ్డి కేవీ అర్థం కాలేదు.
“గుంటూరుదండి సార్. మీతో మాట్లాడాలంట సార్.”
ప్లాస్టిక కుర్చీ ఎత్తి విసిరేస్తాడనుకున్నాడు పీసీ.
“ఎవత్తిరా అది? రాజకీయాలుగానీ మాటాడుతుందా?”
“పద్మ సార్ దాని పేరు.”
“సరే, రమ్మను.” తల ఊపి వెళిపోయాడు పీసీ.
రెండు నిమిషాల్లో ఆమె వచ్చింది. వరండాలోంచి మెట్లుదిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని అక్కణ్ణించే చూస్తూ నడిచి వచ్చింది.
“నీ పేరేంటి?”
“పద్మ సార్.”
“అసలు పేరు.”
“పద్మావతి సార్.”
“ఏ ఊరు నీది?”
“సత్తెనపల్లి దగ్గర సార్.”
“ఇక్కడి కొచ్చి ఎన్నాళ్లయింది!”
“మూడు నెలలైంది సార్.”
“ఊం పర్సనల్ గా మాటాడాలన్నావంట?”
తల ఊపిందామె.
రెడ్డి సిగరెట్టు వెలిగించాడు. పద్మ అతనివైపే చూస్తోంది. జుట్టు బిగువుగా వెనక్కిలాగి జడ వేసుకుందామె. రెండు కనుబొమల మధ్య కొంచెం పైన దోసగింజ తిలకం. సన్నటి కాటుక గీత. నీలంరంగు చీర, అదే రంగు జాకెట్టు భుజాల మీంచి కొంగు కప్పుకుని చేతులు కట్టుకు నిల్చుంది.
“నన్ను చూడ్డానిగ్గాని వచ్చేవా, మాటాడతావా?”
ఆమెవేపుచూస్తూ అన్నాడు రెడ్డి. పద్మ పెదాలు ఒంపు తిరిగాయి. అంతవరకూ ఎస్సైని కన్నార్పకుండా చూస్తున్న ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
దణ్ణం పెడుతూ అందామె.“సార్. నన్ను కోర్టుకి తీసికెళ్లవాకండి సార్. ప్లీజ్.” ,
“కోర్టుకి రావా? బావుంది. ఏం కొత్తా? ఆళ్ల మొహాన ఫైను పారేస్తే మళ్లీ మామూలే. ఏం, కోర్టుకి పోలా ఎప్పుడూ?”
అడ్డంగా తల ఊపిందామె.
“కోర్టుకి పోలేదా, నిజవే?”
“నిజవే సార్,” ఆమె కళ్లు తుడుచుకుని చటుక్కున అతని కాళ్లు పట్టుకుంది.
“సార్. నాకు బయెం సార్. మీ ఇష్టం ఏదేనా చెయ్యండి. కోర్టుకి పంపమాకండి సార్,” కాళ్ల మీద పడ్డ నీలంకుప్పలా ఉందామె. ఏడుపుతో ఆమె భుజాలు ఎగిరిపడు తున్నాయి.
రెడ్డికి కాసేపు నోటమాట రాలేదు.
“హ్. లెగెహె. ముందు లెగు. లే!” ఓ చేత్తో బలంగా ఆమె భుజం పట్టుకుని లేపేడతను. “ముందు ఆ ఏడుపాపు.” మరో దమ్ములాగి అన్నాడు రెడ్డి.
“అంతేనా ఇంకా ఉందా?”
ఆమె కళ్లు తుడుచుకుని చేతులు జోడించి నుంచుంది. ఎస్సై రెడ్డి అనేకమంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్నీ చూసాడు. వాళ్ల ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు. రుమాలో ముఖం తుడుచుకుని పద్మవైపు నిశితంగా చూశాడతను.
తెల్లగానే ఉంది. సన్నగా, ఒత్తు జుట్టు, పొడుగూ పొట్టీ లేకుండా మరోసారి చూడాలనిపించే ఆకర్షణ ఉందామెలో. కనుబొమలు ముడిచి ఆమెవైపే చూస్తున్నాడతను. ఏడవడం వల్ల ఆమె కళ్లు శుభ్రం అయినాయి. మళ్లీ అతనివైపే చూస్తోందామె. రెడ్డి కళ్లు తిప్పుకోలేకపోయాడు. ఆమె కళ్లు అతన్ని ఆక్రమించాయి. అతని ఎస్సె జీవితం కరుకైనది. అతని ప్రపంచం నిండా సరిగా వెలుతురు పడని చీకటి. తన ఎదురుగా నుంచున్న పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి జీవితం అయిదో నంబరు జాతీయ రహదారిలాంటిదని అతనికి తెలుసు. అది కొత్తాకాదు, ఆశ్చర్యం, విషాదం అసలు లేవు అతనికి. కానీ చూస్తున్న కొద్దీ ఆమె కళ్లకీ ఆమె శరీరానికీ ఏవీ సంబంధం లేదనిపించిం దతనికి. ఒక రకమైన ఏకాంతంలో, నిశ్శబ్దంలో ఆమె కళ్లు చిత్రమైన నమ్మకంతో విషాదంతో నిశ్చలమై అతన్ని అశక్తుణ్ని చేశాయి. కాసేపాగి అసంకల్పితంగా అడిగాడతను.
“కోర్టుకి రాకుండా ఏం చేస్తావు?”
అతన్ని చూస్తూనే అన్నదామె, “నే కోర్టుకి బోను సార్. ఈణ్ణుంచి పోయి డబ్బు తీసుకుని వెంబడే వెళ్లిపోతాను. రెయిడ్ లేకుంటే ఈ పాటికి చానా దూరం పోయేదాన్ని సార్.”
ఒకసారి కళ్లు మూసుకుని ఆఖరి దమ్ములాగి సిగరెట్టు అవతల పారేసి రెడ్డి
ఆమెవైపు చూశాడు. ఆమె కళ్లు తిప్పుకోవడం లేదు. మనుషులు లేని చోట ఒంటరిగా చెరువులోకి దూకినట్టనిపించింది. బయటపడేసరికి సునాయాసంగా ఆమె చూపులు అతని ఖాకీ బట్టల్ని ఉల్లిపొరలా విడదీశాయి. ఆమె మాటల్ని ఎందుకు వింటున్నాడో అతనికి తెలియలేదు. అతని నోరు పెగిలేసరికి అతని కంఠంలోని తీవ్రత వేపగాలిలో కలిసిపోయింది.
“బేబీ కంపెనీ ఒదిలి పారిపోదావనుకున్నావా!”
“అవును సార్.”
“ఏం?”
“నే వెళ్లిపోవాల సార్… ఈ పని చెయ్యను.”
“సత్తెనపల్లి వెల్గావనా?”
“అవును సార్. అక్కడ నాలుగు దినాలుండి ఎళిపోతా.”
హైదరాబాదు వెళ్తావా?” తల అడ్డంగా ఊపిందామె. ..
“నీకు అమ్మా నాన్నా ఉన్నారా?”
“అమ్మ ఉంది సార్. నాన్న ఈ నడుంగల పోయాడు సార్.” అంది
“ఏం జేసేవోడు?”
“చిన్న స్కూల్లో టీచరు సార్.”
“టీచరా?” –
“పంచాయితీ స్కూలు. నేనంటే ప్రేణంగా ఉండేవాడు. బియిడి చేసి నేను టీచరవాలనేవాడు.”
“… అతనికి తెలవదా?” తెలవదని తల అడ్డంగా ఊపిందామె.
“అమ్మకి అనుమానం. వైజాగులో ఉజ్జోగం అని చెప్పేదాన్ని. డబ్బులు పంపిస్తానే ఉన్నా. ఇంటికి పోయేదాన్ని కాదు.”
“మరిప్పుడెందుకు?”
“అమ్మకి డబ్బులిచ్చిపోతా.”
“ఎక్కడికి?”
ఆమె మాట్లాడలేదు. మళ్లీ అడిగేడతను.
అతని కళ్లలోకి చూస్తూ మెల్లిగా స్పష్టం గా చెప్పిందామె. “రామేశ్వరం.”
*******************
ఇద్దరూ పొలంగట్టు మీద కూచున్నారు. వెచ్చగా ఉన్న పకోడీ పొట్లాలు రెండూ విప్పుకుని ఒక్కోటీ తింటూ కబుర్లు నంజుతున్నారు. అన్నివైపుల నుంచీ వాళ్లని పొలం పచ్చటి దుప్పటి కప్పింది. పొలం మీంచి చల్లటి గాలి ఇద్దరికీ స్నానం చేయిస్తోంది.
“పద్దూ ఈ డ్రెస్సులో బలేగున్నావే. సినిమాల్లో జేర్రాదూ ,” పెద్దగా నవ్వింది
పద్మ.
“అప్పుడుగాని నాన కాళ్లిరగనూకి ఇంట్లో కూచోపెట్టడూ,” ఇద్దరూ కలిసి నవ్వు కున్నారు.
“ఏమోగానీ నువ్వు హీరోయిన్లా ఉంటావంట గదా?”
“ఆ చెప్పినోడెవడో?”
“ఏం నీకు చెప్పాలేంది?”
“నన్ను హీరోయినన్న సుత్తి మొకమోడెవడా అని.”
“అట్టనబాక. ఆడిది సుత్తిమొకం కాదు.” పద్మ దుర్గవైపు అర్థమైందన్నట్టుగా చూసింది.
“రాంబాబు బస్సులో నీ యెనకనే నిలబడతాడా లేదా? కాలేజీ దగ్గిర దిగినాక నీ యెంబడే కుక్కమాదిరి లోపలికి రావట్లే? నిన్ను ప్రేమిస్తున్నాడంట.”
దుర్గ జాగ్రత్తగా రాంబాబు గురించి చెప్పింది. రోజూ సత్తెనపల్లి బస్సులో కనీసం పదిమంది కాలేజికి వెళ్లిస్తుంటారు. పద్మకి రాంబాబు తెలుసు. ఒక ఊరే. ఈ ప్రేమే ఆమెకు తెలీదు. మరో రెండు మూడు రోజుల తరువాత , నాలుగు పకోడీ పొట్లాల తరువాత పద్మ ఒప్పుకుంది. “నీకేం బయం లేదు. నేను ఆ యెనక గట్టుమీద దాక్కొనుంటా. రాంబాబు ఏదేనా జేస్తే నే ఒస్తా గదా. ఊరికే కోకాకోలా తాగి కాసేపు మాట్లాడుకోండి.”
మర్నాడు రాంబాబు ఏవీ చెయ్యలేదు. పద్మ కోకాకోలా తాగింది. అలా రెండు సార్లు అతను పొలం గట్టుమీద కబుర్లు చెప్పాడు. మూడోసారి కనుచీకటి పడుతుండగా పద్మ ఇంటికి పోవాలంది. “సర్లే. ఈ బాటిలు మిగిలిపోయింది. సగం నువ్వు తాగు. సగం నేను.” ఆమె సగం తాగింది ముందు. దుర్గ ఎప్పుడో వెళ్లిపోయింది. తరువాత ఎప్పుడో చిమ్మచీకట్లో మెలకువ వచ్చింది పద్మకి. పూర్తిగా స్పృహలోకి రాగానే ఏమైందో అర్థం అయిందామెకి. మర్నాడు కాలేజీకి వెళ్లిన పద్మ మళ్లీ రాలేదు.
చాలా కాలం తరువాత తల్లి పేరిట డబ్బు వచ్చేది. కూతురు చేసే ఉద్యోగం మీద ఆమెకి నమ్మకం లేదు. తండ్రికి నమ్మకం ఉందో లేదో తెలీదు. ఆయన అప్పట్నించీ క్లాసులో మాట్లాడ్డం మానేశాడు. ఊళ్లో వాళ్లు అడగడం మానేశారు. ఏవైందో మాత్రం ఎవరికీ తెలీదు, దుర్గకి తప్ప.
విశాఖపట్నం, కడప, గుంటూరు, శ్రీకాకుళం నగరాలు తిరుగుతూ అయిదేళ్లు గడిపింది పద్మ. తన వయసులో బాగున్న అమ్మాయిలకి మామూలు ఉద్యోగాలు రావని ఆమెకి రెండోరోజే అర్థమైంది. విశాఖపట్నం నుంచి వచ్చి మూడునెలలైంది. బేబీ జాగ్రత్తగానే చూసుకుంటుంది. ఎవరూ చూడకుండా సత్తెనపల్లి కాలేజికి వెళ్లి చూసి రావాలని అనిపిస్తూండేది అనేకసార్లు. దుర్గ ఎందుకు మోసం చేసిందో అడగాలని అనుకుంది. కానీ క్రమంగా తెలుసుకోవలసిన అవసరం కనిపించలేదు.
ఓరోజు రాత్రి ఏడు దాటిం తరువాత బేబీ పిలిచింది. ఆమె ఎదురుగా కుర్చీలో ఒక వ్యక్తి కూచుని ఉన్నాడు. పద్మని అందరి దగ్గరికి పంపించదామె. కాలుమీద కాలు వేసుకుని కూచున్న విరుగుడు చేవ బొమ్మలా ఉన్నాడతను. పద్మ మొగవాళ్ల ముఖాల్ని పరిశీలనగా చూడ్డం ఎప్పుడో మానేసింది. నలుపు తెలుపులు తప్ప పెద్ద తేడా కనిపిం చదు. అలవాటుగా అతనివైపు చూసి చిరునవ్వు నవ్విందామె. తల తిప్పి ఆమెవైపు నిశ్శబ్దంగా చూసాడతను. ఆ క్షణంలో అతను తనలోంచి బయటికి చూస్తున్నట్టనిపించింది. తిరిగి నవ్వలేదతను. అతనికేమీ సంబంధం లేదన్నట్టు కూచుని ఉన్నాడు.
మరో నిమిషం తరువాత అతన్ని గదిలోకి తీసికెళ్లింది పద్మ. మంచం మీద , కాకుండా మంచం పక్కన కుర్చీలో కూచున్నాడతను. అతనికి దగ్గిరగా మంచంమీద కూచుందామె.
“సిగరెట్టు కాల్చుకోవచ్చా?” వింతగా చూసిందామె. దిగి టీపాయి కింద నుంచి ఏష్ ట్రే అతని ముందు పెట్టింది. సిగరెట్టు వెలిగించాడతను. ఆమెవైపు చూడ్డం లేదతను.
మొదటిసారిగా అప్పుడతన్ని పరిశీలనగా చూసిందామె. సగందాకా నెరిసిన నొక్కుల జుట్టు, మంచి ముక్కు చక్కటి పెదాలు, మూసుకుపోయిన చెవిచిల్లు. ముఖ్యంగా అతని నల్లటి ముఖంలో తెల్లగా మెరుస్తున్న అతని కళ్లు ఆమె నాకర్షించాయి. సన్నగా పొడుగ్గా… ఆ పొడుగు పెరగడానికి కనీసం యాభై ఏళ్లు పట్టిందనుకున్నదామె. తెల్లటి పేంటు, లేత నీలం చొక్కా.
• “మీదీ ఊరేనా?” చటుక్కున ఆమె జ్ఞాపకం వచ్చినట్టు పక్కకి తిరిగి ఆమెను చూశాడతను. రెండు కనుబొమల మధ్య చిన్న గుండ్రటి తిలకం కనిపించిందామెకి. “కాదు.”
“పనిమీదొచ్చేరా?”
“నాకేం పనిలేదు. ఉత్తినే వచ్చేను.”
“మీ సొంతూరు?”
"రామేశ్వరం"
ఆమెకి వెంటనే నవ్వొచ్చింది. “సారీ సార్. రామేశరం పోయినా శనీసరం వదల్లేదంటారు. అదేనా?”
“అదే. నాదీ అదే పరిస్థితి.” ఆమె అతన్ని చూస్తూ కాసేపు మాట్లాడలేదు. “మీ మనసు బాలేదేం?”
తల ఊపేడతను. సిగరెట్టు ఏష్ ట్రేలో నలిపేశాడు. ఇష్టంగా కాల్చినట్టు అనిపించలేదామెకి.
“ఎన్ని సిగరెట్లు కాలుస్తారు?”
“నాకలవాటు లేదు.. ఈ మధ్యనే అలవాటైంది. ఇన్నని లేదు.” అతను కుర్చీలో వెనక్కివాలి కూచుని ఎదుట గోడవేపు చూస్తున్నాడు. మరో ప్రశ్న ఆమె ఆలోచించేలోగా అన్నాడతను. “నా పేరు వరహాలు. మా పెద్దలు ఎందుకో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి రామేశ్వరం వెళ్లిపోయారు. అక్కడ నాకు బట్టలకొట్టు ఉండేది. ఇప్పుడు లేదు. అమ్మేశాను.”
“ఏం? నష్టం వచ్చిందా ఏంది?”
“ఒక రకంగా. డబ్బు కాదు… ఏడాది క్రితం నా భార్య పోయింది. కడుపులో కేన్సరు.”
“అయ్యో.” కాసేపు మళ్లీ అతనేం మాట్లాడలేదు. ఆమెకేం చెయ్యాలో తోచలేదుగానీ అతనక్కడుండడం బాగుంది. మాట్లాడకపోయినా సరే. అతనామెతో మాట్లాడుతున్నాడు అనిపించడం లేదు.
“నీ పేరు?”
“పద్మ.”
“మంచి పేరు.”
“ఇట్టా రండి.” ఆమె చెయ్యి అందించి అతన్ని మంచంమీద కూచోబెట్టింది. ఆమె వేపు చూస్తూ రెండు దిళ్లు తలవేపు చెక్కమీద వేసి తల వాల్చుకున్నాడతను. ఒక చెయ్యి అతని నడుం మీంచి అవతలికి వేసి మరో చేత్తో అతని ఛాతీ మీద రాస్తూ అందామె. “ఇక్కడికెప్పుడొచ్చారు?”
“నాలుగు దినాలైంది. సాయంకాలం గోదావరి గట్టుమీద కూచున్నాను. తరవాత రోడ్డు మీద కొచ్చేను. అతనెవరో ఇక్కడికి తీసుకొచ్చేడు.”
“నాలాంటి అమ్మాయిలు తెలుసా?”
“తెలీదు. కానీ అతనెవరో అడిగితే రావాలనిపించింది. ”
“ఎంతమంది పిల్లకాయలు?”
“ఇద్దరమ్మాయిలు. పెళ్లి అయిపోయింది. వచ్చే ముందు షాపు అమ్మేసి ఇద్దరికీ డబ్బులిచ్చి వచ్చేశాను.”
“ఎక్కడికి?”
“తెలవదు. తిరుపతి పోయినా. కాళహస్తి, విజయవాడ తిరుగుతూంటి.”
“ఇక ఊరెళ్లరా?”
“ఊరు లేదు. అక్కడ నాదేమీ లేదు. నాకు ఏవీ అవసరం లేదు. నాతో నాకు పర్లేదు. ఎవరితో పర్లేదు. నా భార్యకోసం వ్యాపారం చేశా. ఇంక దేనికి? పిల్లకాయలకి వాళ్ల భర్తలు, సంసారాలున్నాయి. నా అవసరం లేదు. ఇప్పుడు తేలిగ్గా ఉంది. ఏ దినం అయినా, పగలూ రాత్రీ అన్నీ ఒకటే.” –
“ఏం చేసేరిక్కడ?”
“గోదావరి గట్టమ్మటే తిరిగినా. రోజూ పొద్దుపోయినాక పడవెక్కి నదిలో తిరిగా. ఒడ్డుకు రాబుద్ది పుట్టలా. నదిలో పడవలో ఒంటిగా. ఇంకా రాత్రి అయినాక రమ్మంటే పడవోడు రానన్నాడు. ఒక్కడే పడవేసుకుని సముద్రంలోకి పోవాలనుకున్నా.”
“మరి ఇక్కణ్ణించి ఎక్కడికి?”
“తెలీదు… నీకు భీమునిపట్నం తెలుసా?”
“తెలుసు సార్.”
“అక్కడికి వెడతాను. చిన్నప్పుడు వెళ్లేను. అక్కడ సముద్రం బావుంటుంది. ఆమెకీ సముద్రం అంటే ఇష్టముండేది.”
ఆమె అతని వైపు అలాగే చూసింది. తన నల్లటి జాకెట్టు పక్కన పడేసి అతని ఛాతీ మీద వాలి పడుకుంది. వరహాలు ఆమె వీపు మీద చెయ్యివేసి తన పొడవాటి వేళ్లతో నిమురుతూ ఉండిపోయాడు. మగవాళ్ల చేతులామెకు తెలుసు. అతని చెయ్యి మగాడి చెయ్యిలా అనిపించలేదు. ఆమె ప్రాణం కదలాడింది. అతని పొడవాటి వేళ్లు అలలు అలలుగా ఆమెకు గగుర్పాటు కలిగించాయి. ఆ స్పర్శలో ఆమె నది అయిపో యింది. అతని వేళ్లు మృదువుగా ఆమె వీపు మీద ప్రవహిస్తున్నాయి. తల మెల్లిగా ఎత్తి అతనివేపు చూసింది. అతను కళ్లు మూసుకుని ఉన్నాడు. ఆమెకు నిద్రలాంటి మత్తులాంటి హాయివంటిదేదో చర్మంలోంచి శరీరంలోకి ప్రవహిస్తున్నట్టనిపించింది. అతని చెయ్యి ఆమె వీపుని మంత్రిస్తూనే ఉంది. ఆమె చటుక్కున లేచింది. అతను చెయ్యి తీశాడు. పక్కన పడేసిన జాకెట్టు వేసుకుని అతని భుజం వంపులో తల పెట్టుకుంది. అతని చెయ్యి ఆమె వీపు మీద మృదువుగా సంచరిస్తుంటే అది అతని మాటల కొనసాగింపులా అనిపించిందామెకి. తల కొంచెం పైకి జరిపి మెల్లగా అడిగిందామె.
“రామేశ్వరం బావుంటుందా?”
కళ్లు మూసుకునే అన్నాడతను, “ఊఁ సముద్రం ఒడ్డున కూచోవాలి. అది చివరన్నమాట. అది నీ చివరి చిరునామా. చాలామంది ఒస్తారు. పెద్దలందరికీ అక్కడ పిండాలు పెడతారు. అందరి ఆత్మలూ అక్కడికి వచ్చి వెళతాయి.”
“మీరు చూసేరా?”
“అవి కనబడవు. ఉంటాయి. ఉన్నాయని అనుకుంటాం. అనిపిస్తుంది. అనిపించడమే ముఖ్యం.”
“నన్ను మీ ఊరు తీసుకెళ్తారా?”
“ఉహు. నేను వెళ్లను. నాకు ఊరు లేదు.”
కాసేపాగి అన్నాడు. “నువ్వు వెళ్లు.”
ఆమె అలాగే ఉండిపోయింది. సముద్రపు గాలి సోకిందామెకి, వీపు మీద పొడవాటి – వెచ్చటి అలలేవో కదులుతున్నాయి. చెవుల్లో దూరం నుంచి అలలు విరిగి పడ్డం వినిపించింది. కాసేపు అలాగే సముద్రపు గాలిలో ఉండి మళ్లీ అంది,
“భీమ్లీలో ఉండరా సార్?”
“ఉంటాను.”
“ఊం ఎన్నాళ్లు?”
“రెండు రోజుల కంటే ఉండను. చిన్నతనంలో వెళ్లా. ఒకసారి గుర్తు చేసుకుంటా. అక్కా నేను, తమ్ముడు, అమ్మ, నాన్న…”
ఆమె కాసేపు మాట్లాడలేదు.
“తరవాత?”
అతను సమాధానం చెప్పలేదు. తల ఎత్తి అతని వైపు చూసిందామె. అప్పుడే వరహాలు కళ్లు తెరిచాడు. తదేకంగా ఆమెవేపే చూస్తుండగా అతని పెదాల చివరనుంచి అతి చిన్న నవ్వు కదిలింది. ముడిపడ్డ ఆమె కనుబొమలు విడివడ్డాయి. ఫెళ్లున పెద్ద అల ఆమె చెవిలో విరిగిపడింది. ఆమె కళ్లు విప్పారాయి. అతని కళ్లలోకి మంత్రించినట్టు చూస్తుండిపోయింది. అతనామె కళ్లలోకి చూస్తున్నాడు. ఆ కళ్లేదో ఆమె కళ్లకి రహస్యం చెప్పినట్టనిపించింది. అతని కళ్లలోకి చూడలేక ఆమె అతని ఛాతీకి అతుక్కుపోయింది. అతని చేతివేళ్ల అలలు ఆమెని మృదువుగా చిక్కటి నీలిమలోకి తీసుకెళ్తున్నాయి.
అతను ఎప్పుడు లేచి వెళ్లిపోయాడో ఆమెకు తెలియలేదు. తలవాల్చిన దిండు తడిసిపోయింది. ఒక శూన్యంలో మేలుకుందామె. పెద్దచక్రం నుంచి విడిపడి శూన్యం లోకి జారిపడినట్టనిపించింది. బయటికి రాగానే బేబీ అంది.
“ఆయనగారు రేపిదే టయానికి ఒస్తానన్నాడు. నువ్వే కావాలంట.”
వరహాలు మర్నాడు రాలేదు. మర్నాడూ ఆ తరువాతా కూడా రాలేదు. పద్మకి తన ప్రపంచం, మనుషులు, తన శరీరం కొత్తగా కనిపిస్తున్నాయి. తన శరీరం ఎలాగూ తనది కాదు. ఇంక వరహాలు రాడని ఆమెకి అర్థం అయింది. ఆమె నిద్ర నిండా సముద్రం నిండిపోయింది. ఇంక తను వెళ్లిపోవాలి.
****************
మంత్రించినట్టు ఉండిపోయాడు రెడ్డి. ఆమె మళ్లీ ఒంగి అతని కాళ్లు పట్టు కుంది. ఆమెను లేపాలని కూడా తోచలేదతనికి. నీళ్లు నిండిన ఆమె కళ్లలోకి చూస్తుండి పోయాడతను.
“లే. లేచి కూచో.”
అతని కంఠంలో మార్పు ఆశ్చర్యం కలిగించిందామెకి. తటపటాయించి జాగ్రత్తగా కుర్చీ చివర కూచుంది.
“రామేశ్వరంలో ఎన్నాళ్లుంటావు?” అడిగాడని కూడా అతనికి తెలిసినట్టు లేదు.
ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. “రెండు రోజులు. సముద్రం దగ్గరే ఉంటాను.”
మెల్లిగా తల ఊపుతూ ఆమెనే చూస్తున్నాడు రెడ్డి.
కాసేపుండి అన్నాడు. “తరవాత?”
ఆమె చెంపలు కన్నీటితో తడిగానే ఉన్నాయి. కళ్లు విప్పి అతని వేపే నిశ్చలంగా చూస్తుండిపోయిందామె.
*******************
ఆమె అట్లా చూస్తున్నంత సేపూ పాత చీకట్లోంచి అతనికి మాటలు వినిపించేయి. తలకీ, చేతికి రక్తం మరకలు కనిపిస్తున్న కట్లతో అక్క మంచం మీంచి మెల్లిగా లేచి మంచం కింది నుంచి ఇత్తడి చెంబు తీసుకుంది.
“తమ్ముడూ, ఇక నావల్ల కాదు. చదువుకో. అమ్మనీ నాన్ననీ జాగర్తగా చూసుకో.”
“ఏంటక్కా అది?” ఆమె చెంబులోంచి పూర్తిగా గొంతులో పోసుకుని తమ్ముడ్ని చివరిసారిగా గట్టిగా హత్తుకుంది.
***************
ఆ జ్ఞాపకం నుంచి బయటపడి, “రామేశ్వరం ఎలా వెళ్లాలో తెలుసా?” అన్నాడు
“అడుగుతాను. తెలీదు.”
“విను.” అతను రామేశ్వరం, ధనుష్కోటిల గురించి చెప్పేడు.
“నువ్వు వెళ్లు. డబ్బు తీసుకుని ఇక్కడికి రా. వెళ్లు.”
ఆమె గాలిలా వెళ్లిపోయింది.
“సార్. అదెక్కడికో పోతోంది సార్.” “ రామేశ్వరం.”
“సార్?”
మరో సిగరెట్టు వెలిగించి కళ్లు మూసుకున్నాడు రెడ్డి. పద్మ వెనక్కి రావడానికి గంట పట్టింది.
“డబ్బులున్నాయా?”
“ఉన్నాయి సార్.”
“ఇది ఉంచు. నువ్వెళ్లు.”
ఆమె దణ్ణం పెట్టి నుంచుంది. వేపగాలి ఇద్దర్నీ ముంచెత్తుతోంది.
అతను ఆమె వైపు చూస్తూ అన్నాడు- “సెల్ ఇవ్వు. నా నంబరు ఇస్తాను. రామేశ్వరం నుంచి నాకు ఫోన్ చెయ్యి.”
సెల్ తిరిగి తీసుకుంటూ అడిగిందామె. “ఎప్పుడు చెయ్యమంటారు సార్?”
అతను మాట్లాడకుండా ఆమె కళ్లలోకి చూసాడు. క్షణం ఆగి తల ఊపి ఆమె వెళ్లిపోయింది. నీలంగా ఆమె వరండాలోంచి బయటకు వెళ్లిపోయింది. మళ్లీ కాళ్లు రెండూ ఎదుట కుర్చీలో పెట్టుకుని రెడ్డి కళ్లు మూసుకున్నాడు. ఈసారి వేపగాలి, సముద్రపు గాలి అతన్ని నిద్రపుచ్చేయి. తరువాత నాలుగైదు రోజులు అతను సెల్ ఫోన్లో జీవించాడు. ఆరో దినం సాయంకాలం ఆరుగంటలకి సెల్ మోగింది. నంబరు చూడగానే చల్లటి సముద్రపు గాలి అతన్ని కమ్ముకుంది. కళ్లు మూసుకుని అన్నాడు.
“హలో.”
“హలో సార్. నేను.”
“అవును. చెప్పు. ఎక్కడున్నావు?”
“సముద్రంలో ఉన్నాను సార్. మోకాలు లోతుకొచ్చాను సార్. ముందుకు పోతున్నా సార్. సముద్రం చాలా బావుంది సార్. కొంచెం భయంగా హాయిగా ఉంది సార్.”
“భయం లేదు. వెళ్ళు”
“సముద్రం నా మీదికే వస్తోంది సార్. పెద్ద అల వస్తోంది సార్….”
xxxxxxxxxxxx
రామేశ్వరం కాకులు – ప్రతిస్పందన:
ఎస్సై గా పని చేసే రెడ్డికి, ముందు రోజు రాత్రి రైడ్ లో పట్టుబడిన పాతికేళ్ళ పద్మావతికి మధ్యలో జరిగిన కథ ‘రామేశ్వరం కాకులు’
వేపచెట్టుకింద రిలాక్స్ అవుదామని కూర్చున్న రెడ్డిని కలిసి “నన్ను కోర్టుకి తీసుకెళ్ళొద్దు, నన్నొదిలేస్తే రామేశ్వరానికి వెళ్ళిపోతాను” అంటుంది పద్మావతి. ఆమె అక్కడికి ఎందుకు వెళ్లాలనుకుంటోందో తెల్సుకుని , ఎలా వెళ్ళాలో వివరం తెలీకపోతే చెప్పి, చేతిలో కొంత డబ్బులు పెట్టి, ఆమె అసాధారణమైన కోరిక తీరేటట్టుగా చూస్తాడు ఎస్సై రెడ్డి. కథ మొదట్లో వేపచెట్టు చల్లటి నీడలో నిద్ర పట్టని రెడ్డి, ఆమెకు సహాయం చేసి అదే వేపచెట్టుకింద హాయిగా పడుకుని నిద్రపోతాడు. కథలో ఇంకో ముఖ్య పాత్రధారి, ఒంటరిగా పడవేసుకుని గోదావరి దాటి సముద్రంలోకి వెళ్లిపోవాలనుకున్న వరహాలు. ఎక్కడో పక్క రాష్ట్రంలో చిన్న బట్టలకొట్టు నడిపి, దేశ దిమ్మరిలా తిరుగుతూ గోదారి పక్కనున్న రాజమండ్రికొస్తాడు. ఒక రాత్రి ఉబుసుపోక , కాకతాళీయంగా పద్మ దగ్గరికి వచ్చి, కొన్ని గంటలు గడుపుతాడు. తానున్న చట్రంలోనించి బయటపడడానికి రామేశ్వరపు సముద్రానికి వెళ్లిపోవాలనే తీవ్రమైన కోరిక, ఆమెలో కలిగిస్తాడు.
రెడ్డి గురించి చెప్తూ – “తన జీవితంలో ఎంతో...
‘తెరిచున్న కిటికీ’: మూలం - హెక్టర్ హ్యూగో మన్రో (Saki) రాసిన ‘The Open window’
(https://americanliterature.com/author/hh-munro-saki/short-story/the-open-window)
“అత్తయ్య ఇప్పుడే వచ్చేస్తుందండీ, ఈలోపల నా కంపనీ భరించాలి మీరు” అంది ఆ పదిహేనేళ్ల యువతి నవ్వుతూ, కొత్త మనిషిని కలుస్తున్నాను అన్న బెరుకేవీ లేకుండా.
వాళ్ళ అత్త రాక ప్రాముఖ్యతని తక్కువ చేయకుండా, ఈ అమ్మాయిని పొగుడుదామని కొంత ఉత్సాహపడ్డాడు, ఫ్రాంటన్ నట్టెల్.
నిజానికి, ఇలా ఒకరి తర్వాత ఒకర్ని, కొత్తవాళ్ళని కలవడం అతనికంత గొప్ప ఐడియాలా అనిపించడంలేదు. తన నరాల వ్యాధి తగ్గడానికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో అర్థం కావడం లేదు.
పల్లె ప్రాంతంనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని ఏర్పాట్లు చేసుకుంటూంటే, వాళ్ళ అక్కయ్య అంది, “నాకు బాగా తెల్సు. నువ్వు అక్కడికెళితే, ముసుగేసుకుని ఎవ్వరినీ కలవకుండా మూలుగుతూ కూర్చుంటావు. ఆ ఒంటరి బతుక్కి, నరాలు ఇంకా బలహీనపడతాయి. నాకు తెల్సిన వాళ్లందరికీ ఉత్తరాలు రాసిస్తాను. నా మాట విని, వాళ్ళని కలుస్తూ వుండు. నాకు తెల్సినంతమటుకు వాళ్ళందరూ మంచి మనుషులు. నిన్ను ఇబ్బంది పెట్టరు .”
ఫ్రాంటన్ కి అనుమానం వచ్చింది, ‘తను కలవబోయే మిసెస్ సాపిల్టన్, ఈ ‘మంచి’ అనబడే కాటగిరీలో ఉందా?’ అని.
అతను కొంత కుదురుకున్నాడు అని నిర్ధారించుకుని , “మీకీ చుట్టుపక్కల చాలా మంది తెల్సా?” అని అడిగింది ఆ అమ్మాయి.
“ఒక్కరు తెలిస్తే ఒట్టు. ఓ నాలుగేళ్ళ క్రితం అనుకుంటా, మా అక్కయ్య ఇదే ఊళ్ళో, పాస్టర్ గారింట్లో కొన్నాళ్ళుండింది. తనకు పరిచయం ఉన్నవాళ్ళని కలవమని కొన్ని ఉత్తరాలు రాసిచ్చింది.” అని బదులిచ్చాడు, చివరి వాక్యం మటుకు పట్టి పట్టి ఉచ్ఛరిస్తూ.
“అయితే మా అత్తయ్య గురించి కూడా మీకేవీ పెద్ద తెలిసుండదే?” నింపాదిగా అడిగింది ఆ అమ్మాయి.
“ఆమె పేరు, అడ్రస్ మాత్రం తెల్సు” అంటూ అనుకున్నాడు, ‘అసలు ఈ మిసెస్ సాపిల్టన్ గారికి పెళ్లయిందా? భర్త వున్నాడా? లేడా?, ఈ రూమ్ చూస్తూంటే మటుకు కొన్ని మగవాసనలు కనపడుతున్నాయి, అని.
“ఆమె జీవితంలో మూడేళ్ళ క్రితం ఒక పెను ప్రమాదం జరిగింది, మీ అక్కయ్య గారు అప్పుడు ఇక్కడుండరు.” అంది ఆ పిల్ల.
“ఏవిటీ” ఉలిక్కిపడి అడిగాడు ఫ్రాంటన్, ఇలాటి ప్రశాంతమైన పల్లెటూళ్లలో ప్రమాదాలా ? అని లోపల ఆశ్చర్యపోతూ .
“ మీకు విచిత్రంగా లేదూ! ఈ చలికాలంలో, అలా ఆ కిటికీ తెరిచిపెట్టటం” అందా అమ్మాయి, అక్కడ తెరిచున్న ఒక పెద్ద ఫ్రెంచి కిటికీ ని చూపిస్తూ. దాదాపు తలుపంత సైజులో ఉండే ఆ కిటికీలోంచి, ఇంటి ముందరున్న లాన్ కనపడుతోంది.
“గదిలో వెచ్చగానే వుంది. అది సరే! ఆ కిటికీకి, ప్రమాదానికీ సంబంధం ఏదన్నా ఉందా ఏవిటి కొంపదీసి?”
“మూడేళ్ళక్రితం ఇదే రోజు, ఆవిడ భర్త, ఇద్దరు తమ్ముళ్లూ, అదే కిటికీలోంచే బయటకు దిగి, ఉల్లంకి పిట్టని వేటాడ్డానికెళ్లారు. వెళ్ళినవాళ్ళు అంతే! ఇంక తిరిగిరాలేదు. ఓ చిత్తడి నేల దాటుతూ పొరపాట్న ఒక భయంకరమైన ఊబిలో కూరుకుపోయారు. ఆ వేసవంతా, ఆగకుండా వర్షాలు పడ్డం వల్ల మామూలుగా గట్టిగా వుండే నేల కూడా, ఒక్కోచోట మెత్తబడి పోయింది.
అన్నిటికంటే భయంకరవైన విషయం, పాపం! ఆఖరికి వాళ్ళ శవాలు కూడా దొరకలేదు” ఆ అమ్మాయి గొంతులో అప్పటిదాకా ధ్వనించిన స్థైర్యం బదులు తడబాటు తెలుస్తోంది. “పిచ్చి అత్తయ్య, ఇప్పటికీ అలవాటు ప్రకారం వాళ్ళు ఆ కిటికీలోంచే వెనక్కొస్తారనీ, వాళ్ళతో పాటూ కనిపించకుండా పోయిన బూడిద రంగు కుక్కపిల్ల కూడా తిరిగొస్తుందనీ, ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే ప్రతి రోజూ, రాత్రి బాగా చీకటి పడే దాక , ఆ కిటికీ అలానే తెరిచి ఉంచుతుంది. పాపం! నాకు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పింది, ఎలా వేటకి బయలుదేరారో? మావయ్య తెల్లటి వాటర్ ప్రూఫ్ కోటు వేసుకుని, వాళ్ళ తమ్ముడు రోనీ ఏమో , ఈమెని ఎపుడూ ఏడిపించడానికి పాడే పాట ఒకటి ‘బెర్టీ బెర్టీ’ అని పాడుకుంటూ. నిజం చెప్పొద్దూ! ఒక్కోసారి, ఇలాంటి సాయంకాలం పూట, వాళ్ళు ఆ కిటికీలోంచి ఇంటి లోపలికి వచ్చేసినట్టు అనిపించి, నాకు ముచ్చెమటలు పోస్తాయి.”
ఆ అమ్మాయి కంఠంలో చిన్న వణుకు కనిపిస్తోంది. మాట్లాడ్డం ఉన్నట్టుండి ఆపేసింది ఆ అమ్మాయి.
గబగబా రూంలోకి వచ్చిన వాళ్ళ అత్తయ్యని చూసి ఊపిరి పీల్చుకున్నాడు ఫ్రాంటన్. తను లేటుగా వచ్చినందుకు ఓ వందసార్లు క్షమాపణ కోరింది మిసెస్ సాపిల్టన్.
“మా వేరా కబుర్లు బానే చెప్పిందా? ” అడిగింది ఆవిడ.
“వూ. టైమే తెలియలేదు” అన్నాడు ఫ్రాంటన్.
“ ఆ తెరిచున్న కిటికీ వల్ల మీకేవీ ఇబ్బంది కలగలేదుగా? వేటకెళ్లిన ప్రతిసారీ, మా ఆయన, తమ్ముళ్లు, నేరుగా ఆ కిటికీలోంచే ఇంట్లోకి వస్తారు. చిత్తడి నేలల్లోకిఉల్లంకి పిట్టని వేటాడ్డానికి వెళ్లారు,. ఆ బురద కాళ్లతో లోపలికొచ్చి, నా కార్పెట్ అంతా పాడు చేస్తారు. మీ మగాళ్లంతా ఇంతే. అవునా?” అంటూ ఉత్సాహంగా, వేటాడ్డం గురించి, పక్షులు ఎక్కువ కనపడకపోవడం గురించి, చలికాలంలో బాతుల వేట గురించి చెబుతూ పోయింది.
ఫ్రాంటన్కు మటుకు ఇదంతా వింటూంటే వొంట్లో వణుకు మొదలైంది. ఇలాటి భయంకరమైన విషయాలు కాకుండా వేరే మామూలు విషయాలవైపు సంభాషణ మళ్లిద్దాం, అని కొంత ప్రయత్నం మొదలెట్టాడు. తనతో అన్యమనస్కంగా ఏదో మాట్లాడుతోంది కానీ, ఆవిడ ధ్యాసంతా ఆ కిటికీ మీద , కిటికీ అవతలున్న లాన్ మీదే ఉందని, అతనికి అర్థమౌతోంది.
“నిజంగా ఎంత దురదృష్టం కాకపోతే, సరిగ్గా వాళ్ళు పోయిన ఈ దౌర్భాగ్యపు రోజునే, ఈ ఇంటికి రావాల్సొచ్చింది” అనుకున్నాడు మనసులో .
“పూర్తిగా విశ్రాంతి తీసుకోమని, అలిసిపోయేట్టు శరీరాన్ని శ్రమ పెట్టొద్దనీ, ఉద్రేకానికి లోనయ్యే విషయాలకి దూరంగా ఉండమనీ డాక్టర్లు అందరూ ఒకే సలహా ఇచ్చారు. ఆహారం విషయంలో మటుకు ఒక్కో డాక్టరు ఒక్కో విధంగా చెప్తున్నారు” అన్నాడు అతను.
‘చాలామంది రోగుల్లా, ఎదురుపడ్డ ప్రతివాడూ తన రోగం గురించి అతి చిన్న వివరంతో సహా , తెలుసుకోడానికి ఆత్రుత పడుతూ ఉంటాడు’, అనే భ్రమలో, మునిగిపోయున్నాడు, ఫ్రాంటన్ .
“అవునా” అంది ఆవిడ తన వాక్యం పూర్తికాకుండానే, ఆవులింతలోకెళ్ళి. అకస్మాత్తుగా మిసెస్ సాపిల్టన్ మొహం విప్పారింది, a అటు ఏటో చూస్తూ.
“అమ్మయ్య! చివరికి టీ తాగే టైముకి వచ్చేసారు. బురదలో స్నానం చేసొచ్చినట్టు లేరూ వాళ్ళు “
ఆ మాటకి కొంచెం సన్నగా వణుకు పుట్టి , జాలి చూపుల్తో, తల పంకిస్తూ, వేరా వైపు చూసాడు ఫ్రాంటన్.
ఆ అమ్మాయి నిశ్చేష్టురాలై, ఏదో కనపడ కూడనిది కనపడినట్టుగా, కళ్లంతా భయం నింపుకొని, కిటికీలోంచి బయటికి చూస్తోంది. ఫ్రాంటన్ ఒళ్ళంతా ఏదో తెలీని భయం ఆవరించింది. రక్తమంతా గడ్డకట్టుకొనిపోయినట్టై, కూర్చున్న చోటునించీ, తలతిప్పి వేరా చూస్తున్న వైపే చూసాడు ఫ్రాంటన్.
మసకబారుతున్న ఆ సాయం వెలుగులో మూడు ఆకారాలు లాన్లో నించీ, కిటికీ వైపే నడిచొస్తున్నాయి. అందరూ చేతుల్లో తుపాకులు పట్టుకోనున్నారు. ఒకరి భుజాల మీంచి తెల్ల కోటు వేలాడుతోంది. అలిసిపోయిన బూడిద రంగు కుక్క పిల్ల ఒకటి వాళ్ళ వెంబడే నడిచొస్తోంది. ఏ మాత్రం శబ్దం చేయకుండా కిటికీ దగ్గరకొచ్చేస్తున్నారు.
కనుమరుగౌతున్న వెలుగులోంచి, కరుకైన గొంతుతో పాట వినపడ్డం మొదలైంది “ బెర్టీ ఓ బెర్టీ” అని .
వెంటనే ఫ్రాంటన్ ఒక్క ఉదుటున లేచి చేతి కర్ర, టోపీ తీసుకున్నాడు. ఆ తరువాత ముసురుకుంటున్న చీకట్లో, అతను డోర్ తీయడం, బయట వసారాలో అడుగు పెట్టడం, ఇంటి ముందరి గేటు తెరిచి రోడ్డుమీదకు దూకడం మటుకే మిగతా వాళ్లకి కనపడింది.
సైకిల్ తొక్కుతూ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి అతన్ని ఢీకొట్టబోయి, ఎలాగోలా పక్కనున్న పొదల్లోకి తన సైకిల్‌ను మళ్ళించి ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
వైటు కోటు తగిలించుకున్న మనిషి, కిటికీ లోంచి లోపలికొస్తూ “ వచ్చేసాం డియర్” అని ప్రకటించాడు. “ అంతా బురద బురద. కానీ ఎండిపోయిందిలే. అయినా ఎవడు వాడు? మేం వస్తూంటే, కట్లు తెంచుకుని పారిపోతున్నట్టు పరుగులు పెడుతున్నాడు?”
“ఓహ్ అతనో వింత వ్యక్తి . పేరేదో నట్టెల్. ఎంతసేపు అతనికున్న రోగం గురించే వాగడం. చివరికి మిమ్మల్ని చూసినప్పుడు, హలో అనడం కానీ, వెళ్ళొస్తానని చెప్పడం కానీ ఏవీ లేదు. ఏదో వింతగా దయ్యాన్ని చూసినట్టు, ప్రవర్తించాడు” అంది మిసెస్ సాపిల్టన్.
“నాకైతే మన కుక్కని చూసి భయపడ్డాడనిపించింది. నాతో చెప్పాడు, కుక్కలంటే చచ్చే భయమని. ఒకసారి రాత్రి పూట, గంగా నది ఒడ్డున, ఊరకుక్కల గుంపు అతన్ని తరుముకుంటే, స్మశానంలోకి పరిగెత్తి, దాక్కోవలసి వచ్చిందట. తవ్విపెట్టున్న ఓ గోతిలో కూచుని, అక్కడే తిరిగే ప్రేతాత్మలన ఊళలు, నవ్వులు, చితిమంటల పటపటలూ వింటూ రాత్రంతా గడిపాట్ట. అలాంటి అనుభవాలు ఎదురైతే, ఎవరు మటుకు అలా అయిపోరు” అంది ప్రశాంతమైన కంఠస్వరంతో ఆ పిల్ల.
చిటికేస్తే మనల్ని, తన ఊహాలోకంలోకి తీసుకెళ్లగలగటం వేరాకు మాత్రమే వుండే ఓ ప్రత్యేకత.
రచయిత గురించి: 19 వ శతాబ్దం తొలిరోజుల్లో సాకి అనే కలం పేరుతో కథారచయితగా ప్రసిద్ధుడైన హెక్టర్ హ్యూగో మన్రో, బ్రిటన్ లోని డెవాన్‌షైర్ లో అతని బాల్యం గడిచింది. ఆయన పెరిగిన వాళ్ళ అత్తయ్య గారింట్లో ఒక పెద్ద ఫ్రెంచ్ కిటికీ ఉండేదట. చలిగాలి లోపలికొచ్చి ఆరోగ్యం పాడౌతుందని ఆవిడ ఆ కిటికీకి మేకులు కొట్టించి మూసివేయిందించిందట. కథలో మాదిరిగానే లాన్ లోకి తెరుచుకునే ఆ కిటికీని సైన్యంలో పని చేసే మావయ్య, రిటైర్ అయ్యి వెనక్కి వచ్చినప్పుడు మేకులు తీయించి ఆ కిటికీని తెరిపించాడట. మన్రో ఆ తరువాత అనేక ప్రసిద్ధమైన కథలు రాసి పేరు తెచ్చుకుని, సైన్యంలోనే పనిచేస్తూ చిన్న వయస్సులోనే మరణించాడు.
ae30HCvSxkXmzvGvXUuL
‘కూపే’ ( మూలం: రేమండ్ కార్వర్ కథ ‘కంపార్ట్మెంట్’)
అమెరికన్ రచయిత రేమండ్ కార్వర్ కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ‘Compartment’ ఒకటి. కథాంశం ఎనిమిదేళ్లుగా దూరమైన కొడుకుని కలవడం కోసం మేయర్స్ అనే వ్యక్తి చేసే ప్రయాణం.
సంభాషణల ద్వారా లేదా రచయిత జోక్యం ద్వారా కాకుండా, మేయర్స్ మనసులో ఆలోచనలూ, అతని చుట్టూ కనపడుతున్న వాతావరణం లో అతను గమనించే విషయాలూ వీటి గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తూ కథను ముందుకు తీసుకెళ్తారు రచయిత. మేయర్స్ వ్యక్తిత్వాన్ని తేటతెల్లంగా మన ముందుంచడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రతి వాక్యంలో కనపడుతుంది. కథలో అప్రస్తుతం అని మనకనిపించే రచయిత ఇచ్చిన కొన్ని వివరాలు , ప్రయాణంలో క్రమంగా అతని ఆలోచనలో వచ్చిన మార్పుని, ముగింపునీ మనం అర్థం చేసుకోడానికి వుపయోగపడతాయి. ఉదాహరణకి కథలో మేయర్స్ చూసిన కలిసిన ప్రతి వ్యక్తి మేయర్స్ కు తెలీని భాషలో మాట్లాడతారు. ఇది మేయర్స్ వ్యక్తిత్వంలో ఉన్న ఇబ్బందిని మనకు సూచిస్తుంది.
ముగింపు తెల్సుకుని మరిచిపోయే కథ కాదు ‘కంపార్ట్మెంట్’.
కథపై మీ ప్రతిస్పందన తెలియజేయడానికి [email protected] కి మెయిల్ చెయ్యండి.
‘కూపే’:
మేయర్స్ మొదటి తరగతి కూపేలో ప్రయాణిస్తున్నాడు. ఫ్రాన్సులోని స్ట్రాస్బెర్గ్ యూనివర్సిటీ లో చదువుతున్న కొడుకుని కలవడానికి ఈ ప్రయాణం. కొడుకుని చూసి ఎనిమిదేళ్లయింది. ఆ అబ్బాయి తల్లితో మేయర్స్ విడిపోయిన తర్వాత ఈ ఎనిమిదేళ్లలో ఫోన్లో వాళ్ళిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు. కనీసం ఓ ఉత్తరం ముక్క కూడా లేదు… . కొడుకు తల్లితోనే ఉంటున్నాడు. వాడి పాడు జోక్యం వల్లే, చివరన తామిద్దరం అంత తొందరగా విడిపోయావని మేయర్స్ గట్టి నమ్మకం. తమ పెనుగులాటలో వాడు తన మీదకి దూకినప్పుడే ఆఖరు సారి వాణ్ణి చూడ్డం. పక్కనే నించుని తన భార్య ఒక్కొక్కటిగా పింగాణీ గిన్నెలు ముందు గదిలోకి విసరడం మొదలెట్టి, కప్పుల మీదికొచ్చింది. తాను “ఇంక ఆపేయ్” అని గట్టిగా కేక పెట్టడంతో, వాడు ఒక్క ఉదుటున మీదికి వచ్చేసాడు. మేయర్స్ గబుక్కున పక్కకు జరిగి, వాడి తలను తన చంకకీ చేతులకీ మధ్య గట్టిగా ఒడిసిపట్టుకున్నాడు. వాడు ఏడుస్తూ, మేయర్స్ వీపు మీద, పొత్తికడుపు మీద ఆపకుండా గుద్దేసాడు. మేయర్స్ పట్టిన పట్టు విడవకుండా, అందిన కొద్దీ చితక బాదేశాడు. వాణ్ణి దడాల్న వెనక్కి తోసి, గోడకి అదిమిపెట్టి, చంపుతానని బెదిరించాడు. చంపేసేవాడేమో ఆ కోపంలో.. . తను అప్పుడు ఏవన్నాడో ఇంకా గుర్తుంది, “ నీకీ బతుకిచ్చిందే నేను, వెనక్కి తీసుకోగల్ను కూడా , జాగర్త”
ఆ భయానక దృశ్యం తల్చుకుని ఒక్కసారి మేయర్స్ గట్టిగా తల విదిలించాడు, అదేదో ఇంకెవరికో జరిగిన సంఘటనలా. అవును…. తాను కూడా ఇంతకు మునుపులా లేడు. ఒంటరిగా బతుకుతున్నాడు. తన పనేదో తను చూసుకుంటూ, వేరే ఎవ్వరితో సంబంధం లేకుండా. రాత్రి పూట శాస్త్రీయ సంగీతం వింటూ, ‘నీటి పక్షులకు ఉచ్చులు ఎలా తయారు చేయాలి’ అనే విషయం మీద పుస్తకాలు చదువుకుంటూ పొద్దు పుచ్చుతున్నాడు.
తలుపుకు అవతల సీట్లో కూర్చోనున్న వ్యక్తి తన టోపీని కళ్ళ మీదకు లాక్కుని నిద్ర పోతున్నాడు. మేయర్స్ అదేవీ పట్టించుకోకుండా, సిగరెట్ వెలిగించి, తదేక దృష్టితో కిటికీలోంచి బయటికి చూడ్డం మొదలుపెట్టాడు. అపుడపుడే తెల్లవారుతోంది. పక్కనించీ వెళ్లిపోతున్న పచ్చని పొలాల మీద పొగమంచు పల్చని తెర కప్పింది. అక్కడక్కడా పొలాల మధ్యలో కట్టుకున్న బంగళాలూ, వాటి చుట్టూ కట్టిన ప్రహరీ గోడలూ.
‘ఇలాంటి ఇళ్ళల్లో బావుంటుంది, పాత కాలం ఇల్లూ, చుట్టూ వుండే పెద్ద గోడ.’ అనుకున్నాడు మేయర్స్.
టైము ఆరుగంటలు దాటింది. ముందు రోజు రాత్రి పదకొండు గంటలకి మిలాన్ లో రైలు ఎక్కినప్పట్నించీ నిద్రే పోలేదు. రైలు మిలాన్ స్టేషన్ దాటిన తర్వాత అనుకున్నాడు ‘ అదృష్టం.. కూపే లో నేనొక్కణ్ణే!’. లైటుంచి, టూరిస్టు గైడు పుస్తకాలు తిరగేయడం మొదలెట్టాడు. ఇటలీలో ఏమేం చూసుండొచ్చో, చేసుండొచ్చో అర్థం అవుతోంది. ఇటలీకి రావడం ఇదే మొదటి, ఆఖరిసారి కచ్చితంగా. వదిలివెళ్లే సమయంలో ఆ దేశం గురించి తెలుసుకోడం .. కొంత బాధగానే వుంది.
పుస్తకాలు సూటుకేసులో ఉంచి, సూటుకేసు పై అరలో పెట్టాడు. కోటు బయటికి తీసి దుప్పటిలా కప్పుకున్నాడు. లైటు ఆర్పేసి, నిద్ర పడుతుందన్న ఆశతో, కూపే చీకట్లో అలా కళ్ళు మూసుకు కూర్చున్నాడు. చాలా సమయం గడిచిపోయింది అనిపించింది. సరిగ్గా నిద్ర పట్టే సమయంలో, రైలు నడక మందగించడం మొదలైంది. రైలు బాసెల్ అవతల వుండే ఒక చిన్న స్టేషన్లో ఆగింది. ఒక నడివయసు మనిషి , తల మీద టోపీ తో, ముదురు రంగు కోటు వేసుకుని, కూపేలోకి ప్రవేశించాడు. మేయర్స్ తో, తెలీని భాషలో ఏదో మాట్లాడి , తనతో పాటూ తీసుకొచ్చిన లెథర్ బాగ్ పక్కన పెట్టాడు. కూపేలో అవతలి వైపు కూర్చొని భుజాలు తిన్నగా చేసుకున్నాడు. టోపీ కళ్ళమీదకి లాక్కుని, రైలు కదిలే లోపలే, సన్నని గురకతో నిద్ర పోవడం మొదలుపెట్టాడు. మేయర్స్ కి అతన్ని చూస్తే అసూయ కలిగింది.
కొంతసేపటి తర్వాత ఒక స్విస్ ఆఫీసర్ కూపే తలుపు తెరిచి, లోపలికొచ్చి లైటు వేసి పాస్ పోర్టులు చూపించమని అడిగాడు,ఇంగ్లీషు తో పాటూ ఇంకేదో భాషలో కూడా (జర్మన్ అయుండొచ్చు). మేయర్స్ తో పాటూ కూపే లో కూర్చొని వున్న వ్యక్తి, టోపీ వెనక్కి తోసి,కళ్ళు చిట్లించి, కోటు జేబులో చేయ్యిపెట్టాడు. ఆఫీసర్ అతని పాస్ పోర్ట్ పరిశీలించి, అతడి వైపు నిశితంగా చూసి, వెనక్కి తిరిగి ఇచ్చేసాడు. మేయర్స్ తన పాస్‌పోర్ట్ ఇస్తే, అందులో వున్న సమాచారం చదివి, ఫోటోని పరికించి, మేయర్స్ వైపు చూసి, తల ఆడించి, వెనక్కి ఇచ్చేసాడు. వెళ్ళబోతూ లైట్ ఆపేసాడు. మేయర్స్ ఎదురుగా కూర్చుని వున్న వ్యక్తి టోపీ కళ్ళమీదకి లాక్కుని, కాళ్ళు జాపుకున్నాడు. ‘ఇతను వెంటనే నిద్ర పోతాడు’ అనుకున్నాడు మేయర్స్ తిరిగి అసూయతో.
అలానే మేలుకుని, కొడుకును కలవబోయే విషయం గురించి ఆలోచించడం మొదలెట్టాడు. ఇంకొన్ని గంటలే వుంది వాణ్ణి కలవడానికి. వాణ్ణి స్టేషన్లో చూడగానే నేను ఏం చేస్తాను? వాణ్ణి దగ్గరకు తీసుకోవాలా? ఆ ఊహే అతన్ని ఇబ్బంది పెట్టింది. లేదంటే, చెయ్యి కలిపి, ఈ ఎనిమిదేళ్ళూ ఏవీ జరగనట్టు ఓ నవ్వు నవ్వి, వాడి భుజం తట్టాలా? వాడు కూడా నాలుగు మాటలు మాట్లాడతాడేవో? ‘నిన్ను కలవడం బావుంది’, ‘నీ ప్రయాణం ఎలా జరిగింది…’ లాటివి. అపుడు తను ఏదో ఒక సమాధానం ఇస్తాడు. నిజంగా ఏవనాలో తెలీడం లేదు.
ఫ్రెంచ్ ఆఫీసర్ కూపేలోకి వచ్చాడు. మేయర్స్ వైపు, ఆ నిద్రపోతున్న వ్యక్తి వైపు చూసాడు. ఆఫీసరు ఇంతకు మునుపు టిక్కెట్లు పరిశీలించిన మనిషే . మేయర్స్ తల పక్కకు తిప్పి మళ్ళీ కిటికీలోంచి బయటకు చూసే పనిలో పడ్డాడు. ఇంకొన్ని ఇళ్ళు కనపడ్డం మొదలెట్టాయి. అయితే ఇప్పుడు వాటికి గోడలు లేవు. చిన్నవిగా ఉండి, పక్క పక్కనే వున్నాయి ఆ ఇళ్ళు .
‘ఇంకొంచెం సేపట్లో ఎదో ఫ్రెంచ్ గ్రామం కనపడుతుంది కచ్చితంగా’ అనుకున్నాడు మేయర్స్.
పొగమంచు తొలిగిపోతోంది. రైలు కూత పెట్టి, అడ్డుపెట్టున్న క్రాసింగ్ పక్కనించీ పరుగులు తీస్తోంది. వేగంగా పరిగెడుతున్న ఆ రైలు బోగీలను చూస్తూ ఒక యువతి జుట్టు పైముడితో, స్వెటర్ వేస్కుని, సైకిల్ పట్టుకుని నిలబడుంది.
‘మీ అమ్మెలావుంది?’ స్టేషన్ నించీ కొంచెం దూరం వచ్చినతర్వాత అడుగుతాడు తాను.
‘మీ అమ్మ ఏవంటోంది?’
‘ఆమె చనిపోయుండొచ్చు!’, అని అకస్మాత్తుగా మేయర్స్ కి అనిపించింది. మరుక్షణం అనుకున్నాడు, లేదు! అదే జరిగుంటే, తనకు తెలీకుండాపోయే అవకాశమే లేదు. ఏదో రకంగా తెలిసుండేది. ఏదో రకంగా… అతనికి తెలుసు ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తూ పోతే, తన గుండె పగలొచ్చు. మేయర్స్ చొక్కా పైగుండీ పెట్టుకుని, టై బిగించాడు. పక్కనున్న సీటుమీద కోటును పరిచి, షూ లేసులు కట్టుకున్నాడు. పైకి లేచి, నిద్ర పోతున్న వ్యక్తి కాళ్ళు దాటుకుని, కూపే నించి బయటపడ్డాడు. బోగీ చివర భాగానికి నడుస్తూంటే తాను పడిపోకుండా ఊతంగా బోగీ కిటికీలను చేత్తో పట్టుకోవలిసి వచ్చింది. టాయిలెట్ తలుపు వేసి గడియ పెట్టాడు. కొళాయి తిప్పి ఆ నీళ్లను మొహం మీద చల్లుకున్నాడు. రైలు విపరీతమైన వేగంతో మలుపు తిరుగుతోంది. పక్కకు పడిపోకుండా, సింకును పట్టుకున్నాడు.
రెండు నెలల కింద వచ్చింది వాడి వుత్తరం. క్లుప్తంగా వుంది, ఒక ఏడాది నించీ ఫ్రాన్సులో ఉంటున్నాననీ, స్ట్రాస్ బర్గ్ యూనివెర్సిటీ లో చదువుతున్నాననీ. అది కాక, అసలు ఫ్రాన్స్ ఎందుకు రావలసి వచ్చిందో, రాక ముందు ఏవి చేస్తున్నాడో, ఇలాటి వివరాలు ఏవీ లేవు. అలానే వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావన గానీ , ఆమె ఎక్కడ, ఎలాఉందని గానీ ఏ రకమైన సూచనలూ లేవు ఆ ఉత్తరంలో. కానీ వాడు ఉత్తరాన్ని ‘ప్రేమతో’ అని ఎందుకు ముగించాడో అర్థం కాలేదు. మేయర్స్ అదే విషయం గురించి చాలాసేపు లోతుగా ఆలోచించి చివరకు తిరుగు జవాబు రాసాడు. కొంతసేపు మనసులో చర్చించుకుని, తాను యూరప్ లో కొద్ది రోజులు గడపాలని అనుకుంటున్నట్టుగా, ఉత్తరంలో రాసాడు.
‘వాడు స్టేషన్ వచ్చి తనను కలవడానికి ఇష్టపడతాడా?’ మేయర్స్ ఉత్తరం చివరన ‘ప్రేమతో – నాన్న’ అని సంతకం చేసాడు.
ఆ ఉత్తరానికి వాడు సమాధానం ఇచ్చిన తర్వాత ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మేయర్స్ కు తన సెక్రెటరీ, కొంతమంది తోటి ఉద్యోగస్థులు, కాకుండా తన దూర ప్రయాణం గురించి తెలుసుకోవలసిన వాళ్ళు, ఇంకెవరూ లేరు అని హఠాత్తుగా స్ఫురించింది. పనిచేస్తున్న ఇంజనీరింగ్ కంపెనీలో ఆరువారాల సెలవు పోగు చేసున్నాడు తను. ఇప్పుడు ఆ సెలవంతా ఈ ప్రయాణం పేరుతో వినియోగించుకోబోతున్నాడు. మొత్తం సమయం యూరప్‌లోనే గడిపే ఉద్దేశం లేదు కానీ, సెలవు పెట్టినందుకు మటుకు సంతోషంగా వుంది.
మొదట రోమ్ కి వెళ్ళాడు. అక్కడ, ఒక్కడే రోడ్ల మీద కొన్ని గంటలు తిరిగిన తర్వాత, ఏదన్నా గ్రూపుతో కల్సి తిరిగే ఏర్పాటు చేసుకోనందుకు బాధ పడ్డాడు. తాను ఒక్కడే అయిపోయాడు. తను తన భార్య కలిసి వెళదాం అని ఎన్నోసార్లు అనుకున్న ‘వెనిస్’ కి వెళ్ళాడు. అయితే వెనిస్ అతన్ని నిరుత్సాహ పరిచింది. వెనిస్ లో ఒంటి చేతి మనిషి ఒకడు , పది కాళ్ళుండే స్క్విడ్ ను తినటాన్ని చూసాడు. నీటి మరకలతో, మట్టి కొట్టుకుని వున్న భవనాలను చూసాడు. అక్కణ్ణించీ మిలాన్ కు రైల్లో వచ్చి ఒక పెద్ద హోటల్ లో దిగి, రాత్రంతా కూర్చుని , ప్రసారం ఆగిపోయేదాకా సోనీ కలర్ టీవీలో ఫుట్ బాల్ మ్యాచ్ చూసాడు.పక్కరోజు పొద్దున లేచి మిలాన్ అంతా, అటూ ఇటూ తిరిగి, రైలు బయలుదేరే సమయానికి స్టేషన్ కి వచ్చాడు. స్ట్రాస్‌బర్గ్ లో ఆగి ఉండడానికి ఏర్పాట్లు చేసుకోనున్నాడు. ఒక రోజో, రెండు రోజులో , మూడు రోజులో … అక్కడ పరిస్థితిని బట్టి గడిపి, అక్కడనించి పారిస్ వెళ్లి, అమెరికాకి విమానంలో వెళ్ళిపోతాడు. తాను ఏవంటున్నాడో, ముక్కు మొహం తెలీని వాళ్ళతో చెప్పడానికి ప్రయత్నించి, ప్రయత్నించి, అలిసిపోయాడు. వెనక్కి వెళ్తూండడం ఆనందంగా వుంది.
ఎవరో టాయిలెట్ తలుపు తీడానికి ప్రయత్నించారు. మేయర్స్ టక్ చేసుకోటం పూర్తి చేసి బెల్టు పెట్టుకున్నాడు. తలుపు తీసి, రైలు కదలికకు అటూ ఇటూ ఊగుతూ, వెనక్కు తన కూపే వైపు నడిచాడు. తలుపు తీగానే, ఏ సీటు మీదయితే తాను కోటు వదిలేసాడో అక్కడ లేదు. వేరే సీట్లో కనపడింది. తానొక అర్థంలేని, ఆందోళనకరమైన పరిస్థితిలో అడుగుపెడ్తున్నట్టుగా అనిపించింది. కోటు చేతిలోకి తీసుకుంటూంటే గుండె వేగంగా కొట్టుకోడం మొదలైంది. చేతిని లోపలి జేబులోకి పోనిచ్చి పాస్‌పోర్ట్‌ని బయటకి తీసాడు. పర్సుని పాంటు వెనక జేబులో పెట్టుకుంటాడు తాను. పర్సు , పాస్‌పోర్ట్ రెండూ ఉన్నాయి. కోటు మిగతా జేబులన్నీ వెతికాడు.కనపడకుండా పోయింది, కొడుకు కోసం కొన్న ఆ బహుమతి. ఖరీదైన జపాను వాచీ, రోములో ఒక దుకాణంలో కొన్నాడు. జాగర్త కోసం కోటు లోపలి జేబులో పెట్టుంచాడు. ఇప్పుడు ఆ వాచీ పోయింది.
సీట్లో జారగిలిపోయి కాళ్ళు చాపుకుని, కళ్ళమీద టోపీ అడ్డుగా పెట్టుకునివున్న ఆ వ్యక్తితో “క్షమించాలి” అన్నాడు. “క్షమించాలి” మళ్ళీ రెట్టించాడు. టోపీ వెనక్కి తోసి అతడు కళ్ళు తెరిచాడు. కొంచెం సర్దుకుని కళ్ళు పెద్దవి చేసి మేయర్స్ వైపు చూసాడు.
‘కలలు కంటున్నాడేమో?….. కాదేమో’?.
“ఎవరన్నా ఇటు రావడం చూసారా?” అడిగాడు మేయర్స్.
మేయర్స్ ఏమంటున్నదీ అతనికి తెలీడం లేదని, అర్థం అవుతోంది. అతను అలానే మేయర్స్ వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. మేయర్స్ కి ఆ చూపులో అయోమయం తప్ప ఇంకేమీ కనపళ్ళేదు . ‘ఆ చూపు వెనకాల ఏవుంది’? ‘తన కుయుక్తికీ , మోసానికి ఆ చూపుతో ముసుగు వేస్తున్నాడా?’ .
మేయర్స్ తన కోటు దులిపి అతని దృష్టి అటువైపు మళ్లించేందుకు ప్రయత్నించాడు. చేతులు కోటు జేబుల్లో పెట్టి వాటిని అటూ ఇటూ తిరగేసాడు. చొక్కా చేతులు పైకి మడిచి అతడికి తన వాచీ చూపించాడు.అపుడతను మేయర్స్ వైపు, తర్వాత మేయర్స్ వాచీ వైపు చూసాడు. ఆ చూపుల్లో గందరగోళం కనపడుతోంది. మేయర్స్ తన వాచీ మీద వేళ్ళతో తట్టి చూపించాడు. ఇంకో చెయ్యి మళ్ళీ కోటు జేబులో పెట్టి దేని కోసమో వెతుకుతున్నట్టుగా తడిమి చూపించాడు. తన వాచీని ఇంకోసారి చూపించి, చేతి వేళ్ళతో వాచీని అటూ ఇటూ కదిపి వాచీ బయటికి ఎగురుకొనివెళ్లినట్టుగా సంజ్ఞ చేసాడు. ఆ వ్యక్తి భుజాలెగరేసి తల అటూ ఇటూ ఆడించాడు.
“ఛ” అనుకున్నాడు మేయర్స్ విసుగొచ్చి. కోటు వేసుకుని కూపే బయటికొచ్చాడు. ఆ కూపేలో ఇంకొక్క క్షణం ఉండలేకపోయాడు తను. ఇంకో క్షణం ఉంటే అతన్ని కొట్టేవాడేమో అని భయం వేసింది. దొంగ కనపడతాడేమో అన్న ఆశ వున్నట్టు బోగీ వసారాలో అటూ ఇటూ చూసాడు. కానీ అక్కడెవరూ లేరు. తనతో పాటూ బోగీలో వున్న వ్యక్తి ఆ వాచీ తీలేదేమో. ఇంకెవరైనా అయ్యుండొచ్చు. టాయిలెట్ తలుపు తీడానికి ప్రయత్నించి, కూపే పక్కగా నడుస్తూ వెళ్ళినప్పుడు, సీట్లో పడున్న కోటును, నిద్ర పోతున్న మనిషిని గమనించి వుండవచ్చు. తీరిగ్గా తలుపు తెరిచి, కోటు జేబులు వెతుక్కుని, మళ్ళీ తలుపేసి, వెళ్లిపోయి ఉండొచ్చు.మేయర్స్ నెమ్మదిగా బోగీలో వున్న మిగతా అన్ని కూపేలలోకి తొంగి చూస్తూ చివరి దాకా నడిచాడు. మొదటి తరగతి బోగీ … జనాలు అంతగా లేరు. ఒక్కో కూపేలో ఒకరో ఇద్దరో వున్నారు. చాలా మంది నిద్రపోతూనో ,నిద్ర పోతున్నట్టుగానో వున్నారు. కళ్ళు మూసుకొని, తలలు సీటు మీద వెనక్కి వాల్చుకుని వున్నారు. ఒక కూపేలో మేయర్స్ వయసున్న వ్యక్తి , కిటికీ పక్కనే కూర్చుని బయట కనపడే పల్లెలను, పొలాలను చూస్తున్నాడు మేయర్స్ ఆగి అద్దంలోంచి ఆ మనిషిని చూస్తూండగా ఒక్కసారి తిరిగి మేయర్స్ వైపు తీక్షణంగా చూసాడు. రెండో తరగతి బోగీలో ప్రవేశించాడు మేయర్స్. అక్కడ ఒక్కో కూపేలో ఐదారు ప్రయాణీకులతో జనం కిక్కిరిసి ఉన్నారు. వీళ్ళు ఇంకా నిరాశగా వున్నారు అనుకున్నాడు చూడగానే మేయర్స్. నిద్ర పోవడానికి అస్సలు సౌకర్యంగా లేక చాలామంది మేలుకొని వున్నారు,. మేయర్స్ వెడుతూ ఉంటే అతడి వైపే చూస్తున్నారు. “పరాయి దేశస్తులు ” అనుకున్నాడు మేయర్స్.
తన కూపేలో వున్న మనిషి వాచీ తీసుండకపోతే , కచ్చితంగా దొంగ ఇక్కణ్నుంచే వచ్చివుండాలి. కానీ తనేం చెయ్యగలడు? ఏవీ లాభం లేదు. వాచీ అయితే పొయినట్టే. ఇపుడు ఎవడి జేబులోకో వెళ్ళిపోయింది. ఏవి జరిగిందో తను టీసీకి అర్థం అయ్యేలా చెప్పలేడు. చెప్పినా కూడా ఏవిటి ? మళ్ళీ వెనక్కి తన కూపే వైపు నడిచాడు. కూపేలో వ్యక్తి మళ్ళీ కాళ్ళు చాపుకుని టోపీ కళ్ళ మీదుంచుకుని కనపడ్డాడు. అతడి కాళ్ళు దాటుకొని , కిటికీ పక్కన తన సీట్లో కూర్చున్నాడు మేయర్స్ . వొళ్ళు తెలీనంత కోపం. రైలు ఏదో నగరం పొలిమేరలను సమీపించింది. పొలాలు, తోటల స్థానంలో, ఉచ్ఛరించలేని పేర్లతో బోర్డులున్న ఫ్యాక్టరీలు కనపడ్తున్నాయి. రైలు వేగం తగ్గింది. మేయర్స్ కి నగర వీధుల్లో వాహనాలు, క్రాసింగుల దగ్గర రైలు వెళ్ళిపోతే , దాటడానికి వరసలో నిల్చున్న మనుషులు కనపడుతున్నారు. లేచి సూటుకేసు కిందికి దించాడు. దాన్ని ఒళ్ళో పెట్టుకొని, బయట కనపడుతున్న ఆ హేయమైన ప్రదేశాన్ని చూడ్డం మొదలెట్టాడు .
‘అసలు వాణ్ణి ఎప్పుడూ చూడాలనుకోలేదు’ అనుకున్న విషయం తలపులోకి వచ్చింది.
అతను దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఒక్క క్షణం ఆ ఆలోచనలో వున్న క్రూరత్వం అతణ్ణి చిన్నబోయేలా చేసింది. తల విదిలించాడు. తన జీవితంలో చేసినవన్నీ మూర్ఖపు పనులే. వాటన్నిటినీ మించింది… ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణం. తన ప్రవర్తనతో ఎప్పుడో తన ప్రేమకు దూరం అయ్యాడు వాడు. నిజం ఏవిటంటే, వాణ్ణి కలవాలనే కోరిక తనకు ఏనాడూ లేదు. అకస్మాత్తుగా, తనమీదకి దూకుతున్న వాడి మొహం పూర్తి స్పష్ఠతతో గుర్తుకొచ్చింది. పగతో రగిలిపోయాడు మేయర్స్. వీడు తన యవ్వనాన్ని అంతా మింగేశాడు. ఏ అమ్మాయినైతే తాను వలచి పెళ్లి చేసుకున్నాడో ఆమెను ఒక దౌర్బల్యమైన తాగుబోతుగా మార్చేశాడు. ఇంత దూరం వచ్చింది తాను ద్వేషించే ఒక వ్యక్తిని కలవడానికా ? అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు మేయర్స్.
వాడితో చెయ్యి కలపాలి అనుకోవడం లేదు. …తన శత్రువు చెయ్యి… అదేకాదు, వాడి భుజం తట్టడం, వాడితో అవీ ఇవీ మాటాడ్డం కూడా. వాడి తల్లి గురించి తెలుసుకోవాలని కూడా లేదు తనకు.
రైలు స్టేషన్లో ప్రవేశిస్తోంది. సీటులో ముందుకు జరిగి కూర్చున్నాడు. బోగీ లో వున్న మైకులో ఫ్రెంచ్ భాషలో ఏదో ప్రకటిస్తున్నారు. ఎదురుగా కూచున్న మనిషిలో కదలిక మొదలయ్యింది. తన టోపీ సవరించుకుని, అతడు సీట్లో సర్దుకుని కూచుంటూ ఉంటే, మళ్ళీ ఫ్రెంచ్ భాషలో ఇంకేదో ప్రకటన మొదలైంది. మేయర్స్ కి ఒక్క ముక్క అర్థం కాలేదు. మేయర్స్ రైలు నెమ్మదించి ఆగుతుంటే, ఇంకా ఇంకా ఇబ్బందికి గురౌతున్నాడు. కూపే వదిలి బయటకు వెళ్ళేది లేదు అని నిశ్చయించుకున్నాడు. ఎక్కడైతే కూచుని వున్నాడో రైలు కదిలేదాకా అక్కణ్ణుంచి కదలడు తను. అదే రైల్లో పారిస్ వెళ్ళిపోతాడు…. అంతే. అద్దం లోంచి వాడి మొహం కనపడుతుందేమోనని భయపడ్తూ, కిటికీలోంచి జాగర్తగా బయటికి చూసాడు. కనపడితే ఏవి చెయ్యాలో తెలీదు. వాడి మీదకి పిడికిలి విసురుతానేమోనని అతడికి భయం వేసింది.కొంతమంది కోట్లు వేసుకుని, స్కార్ఫ్ లు కట్టుకొని రైలు ఎక్కడానికి , ప్లాట్ఫారం మీద నిలబడున్నారు. కొంతమంది జేబులో చేతులుంచుకుని, సామాన్లు ఏవీ లేకుండా,ఎవరినో కలుద్దాం అని వచ్చి, వేచి చూస్తున్నారు. ఆ వేచి చూసే వాళ్లలో తన కొడుకు లేడు. కానీ దానర్థం వాడు అక్కడెక్కడా లేడని కాదు. మేయర్స్ సూటుకేసుని ఒళ్ళో నుంచి తీసి, కింద పెట్టి, సీట్లో కిందికి ఒదిగి కూచున్నాడు.
ఎదురుగా కూచుని వున్న మనిషి ఆవులించి, కిటికీ బయటకి చూసాడు. తర్వాత తన దృష్టి మేయర్స్ వైపు సారించాడు. తన టోపీ తీసి, జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి సవరించుకున్నాడు. మళ్ళీ టోపీ పెట్టుకుని నిలబడి, తన బాగ్ ని అరలోంచి కిందికి లాగాడు. కూపే తలుపు తీసాడు. వెళ్లబోయే ముందు, వెనక్కి తిరిగి , స్టేషన్ వైపు చెయ్యి చూపిస్తూ ‘స్ట్రాస్ బర్గ్’ అన్నాడు. ఇంకో వైపు తిరిగాడు మేయర్స్.
ఇంకో క్షణం చూసి కూపే బయటికి బాగ్ తో సహా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ‘కచ్చితంగా వాచీ తీస్కొని పోతున్నాడు వీడు’ అనుకున్నాడు మేయర్స్. కానీ మేయర్స్ కున్న సమస్యల్లో ‘వాచీని పోగొట్టుకోడం’ చాలా చిన్న సమస్య. మేయర్స్ బయట స్టేషన్ డోరు దగ్గర నించుని సిగరెట్ తాగుతూ వున్న ఒక మనిషిని చూసాడు. అతను, ఇద్దరు రైల్వే ఉద్యోగస్తులు ఒక ఆడ మనిషికి ఏదో వివరిస్తూ ఉంటే, వాళ్ళను చూస్తూ నిల్చొని వున్నాడు. ఆవిడ చేతిలో ఒక పసిబిడ్డ వుంది. ఆమె వాళ్ళు చెప్పేది విని తల ఆడించి మళ్ళీ వినడం చూస్తున్నాడు మేయర్స్. ఒక చేతి లోంచి ఇంకో చేతికి బిడ్డను మారుస్తూ వుంది. వాళ్లింకా ఏదో చెప్తూనే వున్నారు. ఆమె వింటోంది. వాళ్లలో ఒకడు ఆ పసిబిడ్డ గడ్డం ముద్దుగా తడిమాడు. ఆమె పాప వైపు చూస్తూ నవ్వింది. మళ్ళీ బిడ్డను కదిపి వినడం మొదలెట్టింది. ప్లాట్ఫారం మీద కొంత దూరంలో, ఒక జంట కౌగిలించుకుంటూ కనపడ్డారు. యువకుడు యువతిని తన కౌగిలి నించి వదిలిపెట్టాడు. ఏదో మాట్లాడి, సూటుకేస్ను చేతిలోకి తీస్కుని, రైలు వైపు కదిలాడు. ఆ అమ్మాయి అతణ్ణే చూస్తూ నిలుచుంది. చెయ్యి మొహానికి దగ్గరగా చేర్చి, చేతి కింది భాగంతో ఒక కంటి తర్వాత ఇంకో కంటిని అద్దుకుంది. మరు నిముషంలో ఆ అమ్మాయి మేయర్స్ ఉన్న బోగీనే చూస్తూ, ప్లాట్ఫారం మీదికి రావటం, మేయర్స్ కంటపడింది. ఎవరినో అనుసరిస్తున్నట్టుగా వస్తోందామె. మేయర్స్ ఆ అమ్మాయి వైపు నించి దృష్టి మరల్చి, స్టేషన్ లో, వెయిటింగ్ రూమ్ మీద వున్న పెద్ద గడియారం వైపు చూసాడు . అటునించి ఇటు ప్లాట్ఫారం అంతా పరికించాడు. కొడుకు ఎక్కడా కనపళ్ళేదు. నిద్ర నించి లేవకపోవడమో లేదా తను కూడా మనసు మార్చుకోవడమో, జరిగుండే అవకాశం వుంది. మేయర్స్ స్థిమితపడ్డాడు. గడియారం వైపు చూసి, పరిగెత్తుకుంటూ తన కిటికీ వైపే వస్తున్న యువతిని చూసాడు. ఆమె కిటికీ అద్దం మీదికి దూకుతూందేమో అనిపించి వెనక్కి జరిగాడు.
కూపే తలుపు తెరుచుకుంది. ఇందాక బయట కనిపించిన యువకుడు లోపలికొచ్చి, తలుపు మూసి , “బాంజోర్” అన్నాడు. సమాధానం కోసం వేచి చూడకుండా, అతడు తన సూటుకేసు ని పైనున్న అరలోకి విసిరి, కిటికీ వైపు కదిలాడు. “పార్డ్నెజ్మోయ్” అంటూ కిటికీ ని కిందికి దించాడు. బయటున్న ఆ యువతీ వైపు చూసి “మారీ” అని పీల్చాడు. ఆమె నవ్వుతూ, కన్నీళ్లు కూడా కారుస్తోంది . ఆమె చేతులు దగ్గరకు తీసుకుని వేళ్ళను ముద్దెట్టుకున్నాడు ఆ యువకుడు. పక్కకు ఎటో చూస్తూ పళ్ళు బిగించాడు మేయర్స్. కదిలి వెళ్ళమన్నట్టుగా రైలు ఉద్యోగుల అరుపులు వినపడుతున్నాయి. ఎవరో విజిల్ వేశారు. రైలు ప్లాటుఫారం నించి కదలడం మొదలెట్టింది. ఆ యువకుడు ఆమె చేతులు వదిలేసాడు. కానీ రైలు వెడుతుంటే తన చేతిని వూపుతూనే వున్నాడు.
కానీ రైలు స్టేషన్ బయటికొచ్చి, పక్కనే వున్న ఖాళీ ప్రదేశం దాకా ప్రయాణించి అకస్మాత్తుగా ఆగింది. యువకుడు కిటికీ మూసివేసి, తలుపు పక్కనున్న సీటు వైపుకు వెళ్ళాడు. తన కోటులోంచి దిన పత్రిక తీసి చదవడం మొదలెట్టాడు. మేయర్స్ లేచి తలుపు తీసి కూపే బయటికొచ్చాడు. తన బోగీకి పక్క బోగీ కలిసే ప్రదేశం దాకా నడిచాడు. రైలు ఎందుకు ఆగిందో అతనికి అర్థం కాలేదు. ఏదన్నా ఇబ్బందేమో? మేయర్స్ అక్కడున్న కిటికీలోంచి చూసాడు. బయట రైలు పట్టాలన్నీ ఒక దాంతో ఒకటి పెనవేసుకునున్నాయి. బోగీలు ఒక రైలు నించి విడిపోయి ఇంకో రైలుతో కలుస్తున్నాయి. అంతా గందరగోళంగా వుంది. పక్క బోగీ మీద ‘పౌస్సెజ్’ అని రాసి ఉండడం కనపడింది. ఆ రాసిన చోట పిడికిలితో నొక్కాడు. తలుపు తెర్చుకుంది. మళ్ళీ రెండో తరగతి బోగీలోకి ప్రవేశించాడు తాను. నడుస్తూంటే, అన్ని కూపేల్లో ప్రయాణీకులు నిండిపోయి, అపుడే సర్దుకుంటున్నారు, ఎక్కడికో దూర ప్రయాణానికి సిద్ధం అవుతున్నట్టు. ఈ రైలు ఎక్కడికి పోతోందో, వీళ్లల్లో ఎవరినో ఒకరిని అడిగి తెల్సుకోవాలి.
టికెట్ కొన్నప్పుడు స్ట్రాస్ బర్గ్ మీదుగా రైలు పారిస్ వెళ్తుందిఅన్నట్టుగా అర్థం అయింది. అయితే ఏదో ఓ కూపేలో తల దూర్చి ‘ పారీ’? (అదేదో అంటారు కదా పారిస్ ని ?) అని పారిస్ చేరిపోయినట్టుగా అడగాలంటే అవమానకరంగా అనిపించింది. ఏదో పెద్దగా ఒరుసుకున్నట్టుగా శబ్దం వినపడి రైలు కొంచెం వెనక్కెళ్లింది. స్టేషన్ మళ్ళీ కనపడింది....
‘ వర్షంలో పిల్లి’ , ఈ కథకు అనువాదకులు శ్రీ పతంజలి శాస్త్రి గారు. కథకు ఆంగ్ల మూలం ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘Cat in the Rain’. కథకు అనువాదంతో పాటూ , కథ గురించి వారు ఇచ్చిన వివరణ కూడా ఇదే పేజీలో చదవవొచ్చు.
‘వర్షంలో పిల్లి’: తెలుగు అనువాదం – పతంజలి శాస్త్రి
(‘Cat in the Rain’: ఆంగ్ల మూలం – ఎర్నెస్ట్ హెమింగ్వే)
ఆ హోటల్లో ఇద్దరే అమెరికన్లు దిగేరు. వాళ్ళ గదిలోకి వెళ్తూ, మెట్లెక్కి దిగుతున్నప్పుడు తారసపడే వాళ్ళెవ్వరూ తెలీదు వాళ్ళకి. ఎదురుగా సముద్రం కనిపించే రెండో అంతస్థులో గది వాళ్ళది. పార్కు, వార్ మెమోరియల్ కూడా కనిపిస్తుంది అక్కణ్ణించి. పార్కులో పెద్ద కొబ్బరిచెట్లు, ఆకుపచ్చని బెంచీలు.
వాతావరణం బాగున్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒక చిత్రకారుడు సరంజామాతో వుంటాడక్కడ. పెరిగిన కొబ్బరిచెట్లూ, పార్కులు, సముద్రం, ఎదురుగా మెరుస్తున్న హోటళ్ల రంగులూ, చిత్రకారులు ఇష్టపడతారు. వార్ మెమోరియల్ చూడ్డానికి దూరంనించి ఇటాలియన్లు వస్తారు. కంచు పోతపోసిన మెమోరియల్ వర్షంలో మెరుస్తోంది. వర్షం పడుతోంది. కొబ్బరి చెట్ల మీదనించి జారుతోంది. కంకరరోడ్ల మీద నీళ్లు మడుగులు కట్టేయి. పొడవుగా వర్షంలో విరిగిపడుతూ, తిరిగి వెనక్కి జారుతూ,మళ్ళీ తీరం మీదికి పొడుగు గీతలా విరిగి పడుతోంది సముద్రం. వార్ మెమోరియల్ చౌరస్తా దగ్గిర కార్లు వెళ్లిపోయాయి. అవతల హోటలు గుమ్మంలో ఖాళీ చౌరస్తా చూస్తూ నుంచున్నాడు హోటలు వెయిటరు. బయటకు చూస్తూ కిటికీ పక్కన నుంచుంది అమెరికన్ గృహిణి. బయట సరిగ్గా కిటికీ కింద ఒక పిల్లి. అది వర్షపు నీళ్లు కారుతున్న ఆకుపచ్చ టేబిలు ఒకదాని కింద నించుంది. వర్షం మీద పడకుండా, సాధ్యమైనంత ముడుచుకుపోవడానికి ప్రయత్నిస్తూ వుంది.
“కిందికి వెళ్లి ఆ పిల్లిని తెస్తున్నాను” అందామె.
మంచం మీంచి ఆమె భర్త “ ఒద్దు. నేను వెళ్లి తెస్తాలే” అన్నాడు.
“కాదు. నే తెస్తాను. ఆ టేబిలు కింద తడిసిపోకుండా కూచోడానికి ప్రయత్నిస్తోంది పాపం.”
మంచం కాళ్ళ వేపు రెండు దిండ్ల మీద ఆనుకుని, మళ్ళీ చదువులో పడ్డాడు భర్త.
“తడవకేం” అన్నాడతను.
ఆమె కిందికి వెళ్ళింది. ఆఫీసు గది దాటుతుండగా, హోటల్ మేనేజర్ లేచి ఆమెకి గౌరవంగా తల వంచాడు. అతని టేబిలు ఓ చివర వుంది. పొడవాటి వృద్ధుడతను. “వర్షం పడుతోంది” అందామె. యజమాని అంటే అభిమానం ఆమెకి.
“అవును మేడమ్. ఏమీ బాగా లేదు. పాడు వాతావరణం.”
గదిలో టేబిలు వెనక నుంచున్నాడతను. ఆమెకి నచ్చుతాడతను. ఫిర్యాదులు తీసుకునేటప్పుడు తీవ్రంగా పెట్టే అతని గంభీరమైన ముఖం ఆమె కిష్టం. అతని హుందాతనం ఆమెకిష్టం. ఆమెకి సేవలందించటానికి అతను చూపించే ఉత్సాహం ఆమెకిష్టం. అసలు అతను హోటలు మానేజర్ గా ఎట్లా వుండాలనుకుంటాడో అదామెకిష్టం. పెద్దతనంతో భారీగా వుండే ముఖం, అతని పెద్ద చేతులు, ఆమెకిష్టం. అతని గురించి ఆలోచిస్తూనే , తలుపు తీసి బయటికి చూసిందామె.
గట్టిగా పడుతోంది వాన. రబ్బరు కోటు వేసుకుని ఒక వ్యక్తి చౌరస్తా దాటుతూ హోటలు వేపు వస్తున్నాడు. కుడివైపు ఎక్కడో ఉంటుంది పిల్లి. సన్ షేడ్ల కిందినించి బహుశా తను వెళ్లగలదేమో. గుమ్మంలో నుంచుని ఉండగానే తన వెనక గొడుగు తెరుచుకుంది. వాళ్ళ గది శుభ్రం చేసే అమ్మాయి.
“మీరు తడవకూడదు” ఇటాలియన్ మాట్లాడుతూ చిరునవ్వింది. హోటలు మేనేజర్ పంపించాడన్నమాట. ఆ అమ్మాయి పట్టుకున్న గొడుగు కింద ఆమె కంకర బాట కింద నడుస్తూ వాళ్ళగది కిటికీ కిందికి వచ్చిందామె. వర్షంలో శుభ్రమై పచ్చగా మెరుస్తూ టేబిలు వుంది గానీ, పిల్లి వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆమెకి ఏదో నిరాశ కలిగింది. అమ్మాయి ఆమెని చూసి అంది, “ మీరేవన్నా పోగొట్టుకున్నారా?”
“ఒక పిల్లి వుంది”
“పిల్లి”
“అవును”
“పిల్లి? వర్షంలోనా” నవ్విందాఅమ్మాయి.
“ ఊ.టేబిలు కింద” అని మళ్ళీ అందామె, “దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఆ పిల్లి కావాలి నాకు.”
ఆమె ఇంగ్లీషులో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ముఖం బిగుసుకుంది.
“ రండి మేడమ్. లోపలికి వెళ్దాం. తడుస్తారు మీరు.” అంది.
“అవును గదా” అందామె.
మళ్ళీ కంకర కాలిబాటలో నడుచుకుంటూ లోపలి వచ్చేరు.
పనమ్మాయి గొడుగు ముడవడానికి గుమ్మం దగ్గర ఉండిపోయింది. అమెరికన్ అమ్మాయి ఆఫిసు దాటుతూండగా మేనేజర్ తలవంచాడు. ఆమెకు తనలో ఏదో కుచించుకుపోయినట్టై, కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తను ఒక అల్పప్రాణిలా, అదే సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిలా, అనిపించేలా చేస్తాడు అతను. ‘తాను చాలా ప్రాధాన్యత గల మనిషిని’ అనే ఒక క్షణికమైన భావన కల్గుతుంది. మెట్లెక్కి వెళ్లిపోయిందామె. గది తలుపు తీసుకుంది. మంచం మీద జార్జి పడుకుని చదువుకుంటున్నాడు. పుస్తకం కిందపెడుతూ అడిగేడతను.
“పిల్లి దొరికిందా”?
“అది వెళ్ళిపోయింది”
“ఎక్కడికి వెళ్ళుంటుందబ్బా!” చదివిన అలిసిన కళ్ళకి విశ్రాంతినిస్తూ అన్నాడతను. ఆమె మంచం మీద కూచుంది.
“దాన్ని ఎంతో కావాలనుకున్నాను. ఎందుకంతకావాలనుకున్నానో తెలీదు. పాపం ఆ పిల్లి కావాలనిపించింది. వర్షంలో తడుస్తూండడం ఏం సరదా దానికి . ?”
జార్జి మళ్ళీ చదువుకుంటున్నాడు. ఆమె వెళ్లి డ్రెస్సింగ్ టేబిలు అద్దం ముందు కూచుని చేతి అద్దంలో ముఖం చూసుకుంటోంది. ముందు ఆ పక్కనించి తరువాత రెండో వేపు నించి, తల వెనక భాగం, కంఠభాగం పరిశీలించింది.
ఒక వేపు ముఖాన్ని చూసుకుంటూ అడిగిందామె. “జుట్టు బాగా పెరగనివ్వడం బాగానే ఉంటుందంటావా?”
కళ్ళెత్తి ఆమె మగవాళ్ళ లాగ దగ్గిరిగా కత్తిరించుకున్న జుట్టు చూసి అన్నాడు.
“అలా ఉంటేనే ఇష్టం నాకు.”
“విసుగెత్తి పోయింది నాకు. మగపిల్లాడిలా కనిపించడం విసుగ్గా వుంది.”
“చక్కగా ఉంటావు నువ్వు” అన్నాడతను.
డ్రెస్సింగ్ టేబిలు మీద అద్దం పెట్టి కిటికీ దగ్గరికి వెళ్లి బయటకి చూస్తూ నుంచుందామె. చీకటి పడుతోంది.
మంచం మీద జరిగి కూచున్నాడు జార్జి. ఆమె మాట్లాడ్డం మొదలుపెట్టినప్పట్నుంచి తదేకంగా ఆమెనే చూస్తున్నాడతను.
“జుట్టు వెనక్కి దువ్వుకుని, చిక్కగా మెత్తగా, పెద్ద కొప్పు నాకు తగులుతూ ఉండాలి. ఒళ్ళో ఓ పిల్లి ఉండాలి, తాకినప్పుడల్లా మ్యావు మంటూ.” అందామె.
“అలాగా?” అన్నాడు పక్క మీంచి జార్జి.
“డైనింగు టేబిలు మీద నా సొంత వెండి గిన్నెల్లో తినాలి. క్యాండిల్స్ కావాలి నాకు. అది వసంతకాలం అయివుండాలి. అద్దం ముందు నించుని జుట్టు దువ్వుకోవాలి. పిల్లి పిల్ల కావాలి. కొత్త బట్టలు కావాలి కాసిని.”
“ఇంకా చాలు. ఏదేనా తెచ్చుకుని చదువుకో” అని మళ్ళీ చదువుకోడం మొదలుపెట్టేడు జార్జి.
“ఏవయినా నాకో పిల్లి కావాలి. పిల్లిపిల్ల కావాలి. ఇప్పుడు పిల్లిపిల్ల కావాల్సింది. పొడుగాటి జుట్టూ, సరదాలూ లేకపోయినా పిల్లి పిల్ల కావాలి.”
ఆమె కిటికీలోంచి బయటికి చూస్తోంది. చీకటిగా వుంది. కొబ్బరి చెట్ల మీద వర్షం పడుతోంది. జార్జి వినడం లేదు. పుస్తకం చదువుకుంటున్నాడు. అప్పుడే చౌరస్తాలో వెలుతురు పడ్డ చోటు కిటికీలోంచి చూస్తోందామె.
ఎవరో తలుపు తడుతున్నారు.
“అవంతి” అన్నాడు జార్జి. పుస్తకంలోంచి తలెత్తి చూసాడు.
గుమ్మంలో పని అమ్మాయి నుంచుని వుంది.
తాబేలు రంగు పిల్లిని గట్టిగా ఆమె హత్తుకుని వుంది. ఆమె వొంటి మీద నించి పిల్లి కొంచెం జారి వుంది.
“మన్నించండి. మేనేజర్ గారు మేడమ్ గారికి పిల్లిని యిచ్చిరమ్మన్నారు.” అందామె.
‘తడుస్తూ ఆమె’ – పతంజలి శాస్త్రి గారి వివరణ
హెమింగ్వే రాసిన ఒక అతి చిన్న కథ ‘వర్షంలో పిల్లి’ 1924 లో భార్య Hadley తో ఇటలీలో Pablo అనే చోట Splendid అనే హోటల్లో దిగి ఈ కథ రాసాడాయన. కథావస్తువు ని బట్టి హోటల్ పేరు ‘Splendid’ అని ఉండడం యాధృచ్చికం అయినా స్పష్టమైన వ్యంగ్యం. అప్పటికే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు తీవ్రంగా ఉండేవి. కథ ఆమె గురించి రాసాడు. కానీ కథాబీజం ‘1923’ లో Hadley వేసింది అనుకోవచ్చు. ఆ ఏడాది ఇద్దరూ Ezrapound ఇంట్లో అతిధులు. ఆయనింట్లో చక్కని పిల్లి పిల్లను చూసి ముచ్చటపడి పిల్లి కావాలని అడిగిందామె. “ఖర్చు” మనం భరించలేం అన్నాడు హెమింగ్వే .
ఈ వివరాలన్నీ చదివి సేకరించాను. ఈ కథ మీద కనీసం రెండు వందలకి పైగా విమర్శనా వ్యాసాలు ఉంటాయి. ఇంకా వస్తున్నాయి. హెమింగ్వే రచనల్లో క్లుప్తత, స్పష్టత, తళుక్కుమనే వాడి కనిపిస్తాయి. ఆయన Theory of omission అనే కథన పద్ధతిలో రాసేడు. మామూలు మాటల్లో చెప్పాలంటే చెప్పవలసిన విషయం పాఠకుల ఆలోచనకు విడిచిపెట్టడం. అది ఈ రెండు పేజీల కథలో సాధించినంతగా మరే ఇతర కథల్లోనూ జరగలేదని అనుకోవాలి. ఒక కారణం కథ చిన్నది కావడం, రెండు ఇతివృత్తం అనేక జీవితాలకి చేరువైనది కావడం.
ఈ కథ హెమింగ్వేల కథ. ఇంకా స్పష్టంగా హెమింగ్వే భార్య వేదన. అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి అంత ఆరోగ్యంగా లేదు. భార్య సుఖంగా లేదు. ఆమె చిన్న చిన్న కోరికలు కూడా బరువు పెంచుకుని ఆమెని కుంగదీస్తున్నాయి. ఇంతవరకూ కథలో జార్జి భార్య Hadly. కథలో జార్జి ఆమెని పట్టించుకోడు. నిస్సహాయత కావచ్చు. ఆమెని ఓదార్చే ప్రయత్నం కూడా చెయ్యదు. పాఠకులు సులభంగా భార్య పక్షాన వుంటారు. ఆమె బాధ చూసి కాదు. భర్త పట్టించుకోడని. ఇది ఆసక్తికరమైన అంశం. ఏమంటే నిజ జీవితంలో హెమింగ్వే జార్జి కాదు. మరి జార్జిని ఎందుకలా చిత్రించాడు.? జార్జి భార్య పట్ల పాఠకులకి సానుభూతి కలగాలని. హెమింగ్వేల వ్యక్తిగత జీవితం, నిజానికి పాశ్చాత్య రచయితల వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం. ఆయన అందరికీ తెలిసినా జార్జిని మంచి భర్తని చెయ్యలేదు ఆయన.
కథలో ప్రతీక స్పష్టం. వర్షంలో తడవకుండా తలదాచుకున్న పిల్లి జార్జి భార్య. రెండు అది ఆమె కోల్పోయిన సుఖం సంతోషం. కళ్లెదుట కనిపిస్తూ తెలుస్తూ చేజారిపోయిన సంతోషం. అందుకే ఆమె వెనక్కి తిరిగి గదిలోకి వచ్చి రెండు మూడు సార్లు ‘నాకు ఆ పిల్లి పిల్ల ఇప్పుడే కావాలి’ అంటుంది. – ఆమెకి మన సానుభూతి సులభంగా ఎందుకు చేరుతుందంటే, ఆమె కోరికలు చిన్నవి. గొప్ప సౌఖ్యం, విలాసాలూ కోరుకోవడం లేదు ఆమె.
కథలో ఒక లైంగిక అంశాన్ని కూడా కొంతమంది చూసారు. నేను ఈ కథ చదివి నాలుగు దశాబ్దాలు అయింది. అప్పుడు చూసిన ఒక వివరణ అది. కానీ అది సమంజసం కాదనిపించింది. ఈ కథా నిర్మాణం నాకు నచ్చింది. ఇది ‘సరళ – క్లిష్టమైన’ కథనం. (ఈ మాట నా కథలకి R.S. వెంకటేశ్వర రావు గారు ఇచ్చిన కితాబు. )
కథ ఒక వర్షాసంధ్యలో జరుగుతుంది. సీతువులో వర్షంలో మనం శారీరకంగా మానసికంగా కుచించుకుపోతాం. మన సుఖసంతోషాలు, భయాలు, ఆశలు, బహిర్గతం అవుతాయి. వర్షం మన దుఃఖం. సీతువు వేదన. తరువాతి కాలంలో ప్రసిద్ధమైన ‘మినిమలిజం’ వంటిదే ఈ కథనం.
కథ మొత్తంలో చివరి వాక్యాలు నన్ను గాయపరిచినాయి.
ఆమె కోరుకున్నదేమిటి?
ఆమెకి దక్కినదేమిటి ?
అది ఒక జీవన సారాంశం.
చివరికి మిగిలేది ఏది?
నువ్వు కోరుకున్నది కాదు. ఆశించినదీ కాదు. అడిగినదీ కాదు…
‘What we get in life ofen is a small compensation like an unattractive tortoiseshell cat. That is life”
వర్షంలో తడిసింది జార్జి భార్య.
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.
ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.
తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya
‘
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.
ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.
తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya
‘
నల్లజర్ల రోడ్డు ‘తిలక్ కథలు’ అనే సంకలనం నుంచి. ఈ కథ మూడు భాగాలుగా ప్రసారం చెయ్యడం జరుగుతుంది.
ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.
తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
పుస్తకం నవోదయ బుక్ హౌస్ వారి లింక్ ద్వారా ఆన్లైన్ లో కొనొచ్చు. – http://bit.ly/tilaknavodaya
‘
“నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు”.
అవధానిగారు యిలాగ అనేటప్పటికి మేమందరం పక్కున నవ్వాం. .కొవ్వొత్తి దీపపు వెలుతురులో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండిదారాల్లా మెరిసాయి.
“చంద్రుడూ వెన్నెలా ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం. కాని ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయ పెడతాయో మీకు తెలియదు” అన్నారు మళ్ళీ.
“చెప్పండి. మీరేదో కథ చెబుతారని తెలుస్తూనే వుంది. వినటానికి సిద్ధంగా ఉన్నాం” అన్నాను నేను.
“ఈ రాత్రికింక లైట్లురావు. ఎక్కడో తీగ తెగిపోయి వుంటుంది.” అన్నాడు నారాయణ.. –
“తోట అంతా చీక టైపోయింది” అన్నాడు నెర్వస్ గా ఆచారి. అస్థిమితంగా చేతివేళ్లతో బల్లమీద ఆదితాళం వేస్తున్నాడు. “ఇంకా – కొవ్వొత్తులున్నాయాండీ!” అని అడిగాడు.
అవధానిగారు తల వూపారు – ఉన్నాయన్నట్టు
“ఈ తోటా, తోటలో మీ బంగళా, మీరు చేసిన విందూ – ఓహ్! మరిచిపోలేం” అన్నాడు నారాయణ.
“వూరికి యింతదూరంగా యీ తోట వుండడమే అంత ‘ బాగా లేదు” అన్నాడాచారి.
“చెప్పండి కథ” అన్నాను నేను. “కథా!” నిరసనగా చూశారు – అవధానిగారు.
“అదే! అదే! మీ చిన్నప్పుడు జరిగిన సంఘటన….” అని సర్దుకున్నాను.
అవధానిగారు కవీకాదు; కథకుడూ కాదు.. జీవితాన్ని నిండుగా సూటిగా జీవించిన మనిషి. హృదయమూ, చమత్కారమూ, ఆలోచనా ఉన్నవాడు. వీటికి తోడు విచిత్రంగా విరుద్దంగా బాగా డబ్బున్నవాడు. .
ఆయన చెప్పడం మొదలు పెట్టారు.
“ఏలూరులో చూసుకోవాల్సిన పని అంతా అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక, కారు స్టార్టు చేశాడు రామచంద్రం, పది గంటలు దాటింది రాత్రి. నాగ భూషణం మామయ్యా, నేనూ వెనకాల సీటులో కూర్చున్నాం.
ప్లీడరుగారు – కారు దగ్గరకి వచ్చి”నా మాట విన్నారు కాదు” అన్నారు.
“అబ్బే ఎంత సేపండీ, సరీగ్గా తొక్కితే ఒక్క గంటన్నరలో తణుకులో పడతాం. మీరేం యిదవకండి” అన్నాడు రామచంద్రం.
– “అమ్మమ్మ! ఎంత మాట! కలక్టరుగారింట్లో శుభ • కార్యమంటే వేరే చెప్పాలా! ” అన్నారు ప్లీడరుగారు … యావద్విషయాన్నీ గ్రహించిన వారై.
కారు సాగింది.
“అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. అప్పటికి – మీ రెవరూ పుట్టివుండరు” అన్నారు – అవధానిగారు మా అందరికేసి చూసి.
“అటువంటి ప్రమాదం సంభవించే సూచనలు కూడా వాతావరణంలో ఉండి ఉండవండి” అన్నాడు నారాయణ.
తోటలో గలగల చప్పుడయింది. ఆచారి ఉలిక్కిపడి “దొంగలేమో” అన్నాడు.
“పక్షులు చెట్లలో కదులుతున్నాయి. అంతే” అన్నారు అవధానిగారు.
కథలోకి రండి” అన్నాను నేను. .
“అంటే….. ” కోపంగా చూశారు అవధానిగారు.
“అదేనండీ, మీ చిన్నప్పటి….”
అవధానిగారు చిన్నగా నవ్వి గడ్డం చేత్తో ఒక్కసారి సవరించుకున్నారు. కొంచెం ముందుకు వంగి యిలా చెప్పసాగారు.
-ఆరుమైళ్ళు వచ్చేటప్పటికి కారు ఆగిపోయింది. రామ చంద్రం దిగి బానెట్ చూశాడు.
” ఇది వెధవ కారులా వుంది. నడచి వెనక్కి పోదాం పద. ఎందుకేనా మంచిది” అన్నాడు నాగభూషణం మామయ్య.
“అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగాని యీ కారుని తిడితే మాత్రం నే నూరుకోను. అసలీ యింజనులాంటిది ఇండియాలో వుండదు” అన్నాడు రామచంద్రం.
“అందుకే ఆరుమైళ్ళకే ఆగిపోయింది” మామయ్య విసుగ్గా అన్నాడు.
“డొక్కు కార్లు కొనకురా , అంటే విన్నావ్? సెకండ్ హాండ్ వి కొనవల్సిన ఖర్మ నీకే మొచ్చింది? మనమాట ఎలాగున్నా వీణ్నికూడా మనతో తీసుకువచ్చాం. కర్మ! వీడు ఎనిమిది గంటలకి పడుకోకపోతే మా అక్కయ్య ఎనిమిదిమంది డాక్టర్లని ఒకేసారి పిలిచి చూపెడుతుంది” అన్నాడు నన్ను ద్దేశించి.
“ఏం భయంలేదు మామయ్యా. రాత్రిళ్ళూ ,కార్లలో , ప్రయాణం చెయ్యడం నాకు సరదా” అన్నాను నేను.
రామచంద్రం మావూళ్ళో పెద్ద టెన్నీస్ ఛాంపియన్. – పొడుగ్గా, బలంగా, హుషారుగా వుంటాడు. మా, వూరి క్లబ్బుకి , సహాయ కార్యదర్శి, సేవాసదనానికి గౌరవాధ్యక్షుడు. ఆ సదనం ఏమిటో, యేం చేసేదో యిప్పటికీ నాకు తెలియదు. ఇటువంటి సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు.
రామచంద్రానికి కాలవ వొడ్డున పెద్ద మేడ వుంది. మేడలో అతనికొక భార్యా కుమారరత్నమూ , కూడా వున్నారు. అతను భార్య నెక్కువ ప్రేమిస్తాడో భార్య పేర ఆమె తండ్రి వ్రాసి యిచ్చిన ముప్పేనాలుగెకరాల్నీ ఎక్కువ ప్రేమిస్తాడో తెలియక, తేలక జిజ్ఞాసువులు చాలామంది బాధపడే వారు పాపం.
మా నాగభూషణం మామయ్యకి వరుసకి బావ అవుతాడో బావమరది అవుతాడో – యిటువంటి భోగట్టా నాకు సరీగా తెలియదు. మా ఆవిడకి తప్ప – అసలు నాగభూషణం నాకు వేలు విడిచిన మేనమామ; అందరమూ ఒకే ఊళ్ళో వుండ డమూ, రాకపోకలూ, శుభకార్యాలూ, మంచి చెడ్డల్లో ఒకరినొకరు ఆదుకోవడమూ – ఇలాంటి వాటివలన ఈ కుటుంబాలన్నింటికీ చనువూ, గాఢ స్నేహమూ ఏర్పడ్డాయి. నాగభూషణం కూడా ఉళ్ళో చెప్పుకోదగినవాడు. ఎం.ఏ చదివాడు. పెద్ద కలప వ్యాపారం నడుపుతున్నాడు. ప్రతీ ఏడాదీ భగవద్గీత మీదా, ఉపనిషత్తులమీదా పెద్ద వాళ్ళని పిలిపించి ఉపన్యాసాలు యిప్పిస్తుంటాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరేగాని జిల్లా బోర్డు ప్రెసిడెంటు ఏ పార్టీ అయితే ఆ పార్టీనే బలపరుస్తాడు. దివ్యజ్ఞాన సమాజానికి ఉపాధ్యక్షుడు. ఊళ్ళోకి కలక్టరు వచ్చినా, మంత్రి వచ్చినా ఇతని యింట్లోనే మకాం.
– కారు బాగుపడిందాండీ?” అన్నాడు నారాయణ మధ్యలో అడ్డువచ్చి.
ఆ రామచంద్రం కారు చుట్టూ రెండుసార్లు ప్రదక్షిణం చేశాడు. కొంత సేపు గొణుక్కున్నాడు. కారు కిందా మీద ఏవో పరీక్ష చేశాడు. చివరికి “ఆల్ రైట్” అంటూ కారులో కూర్చు న్నాడు. కారు సాగింది. ఎర్రని పొడుగాటి రోడ్డుమీద కారు వెళుతూంటే చల్లనిగాలి మొహానికి కొడుతోంది. ఇటూ అటూ’ పంటచేలు. కారు లైట్ల కాంతిలో నెంబర్లు వేసిన మైలురాళ్ళు ఒకటొక్కటే జరిగిపోతున్నాయి. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాలలాగ నక్షత్రాలు మెరుస్తున్నాయి. మండుతున్నాయి. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది. దేవుడులాంటి అనిర్వచ నీయమైన శక్తి సన్నిహితంగా వున్నట్టు వుంటుంది. మామయ్య నన్ను బి.ఏ. ఎక్కడ చదువుతావని అడుగుతున్నాడు.
మద్రాసులో అని చెప్పాము లజ్ కార్నర్ కి దగ్గర్లో అతనికో థియాసఫిస్టు మిత్రుడున్నాట్ట. అతని దగ్గరవుండి చదువుకోమనీ, హాస్టల్సులో వుంటే పాడై పోతావనీ చెపుతున్నాడు. రామచంద్రం మధ్య – మధ్య రాజమండ్రి శంకరం టెన్నీస్ ఆటలో. వుండే లోపాన్ని గురించి చెపుతున్నాడు.
“మిక్సెడ్ డబుల్స్ ఆడుతుందిట. ఆవిడెవరూ?” మామయ్య అడిగాడు.
“మిస్ శర్మిష్ట”
“బాగుంటుందా?”
“ఆవిడా, ఆవిడ ఆటా?”
“రెండూనూ” అంటూ మామయ్య నవ్వాడు.
“దోబిచెర్ల వస్తున్నాం” అన్నాడు రామచంద్రం.
అక్కడక్కడ రెండు మూడు పాకలూ, గుడి సెలూ, చీకట్లో ముడుచుకుపోయి పున్నాయి. ఒక బండి దగ్గర ఇద్దరు మనుష్యులు తలలకు పాగాలు చుట్టుకుని జమిలిదుప్పట్లు కప్పుకొని చుట్టలు కాల్చుకొంటూ కూర్చున్నారు. ఊరు ఎక్కడో లోపలకు వుంది. ఇప్పటిలాగా అప్పటికి పల్లెటూళ్ళలోకి నాగరికత ప్రవేశించలేదు. ఈ పాతికేళ్ళలో ఎంత అద్భుతమైన మార్పు వచ్చిందో మీకు ! తెలియదు. మీకు ఆ రోజులు తెలియవు. విద్యుచ్ఛక్తి అంటే గ్రామీణులకు ఏమిటో తెలియదు. ఏలూరు నుంచి తణుకు వెళ్ళే రోడ్డుని గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు. రాత్రి ఎనిమిది దాటాక యీ రోడ్డు సంరక్షితం కాదు. నిర్జనంగా, చీకట్లో నిశ్శబ్దంగా నిద్ర పోతూండేది.
ఇప్పుడు చూడండి నిముష నిముషానికి ఒక లారీ వస్తూ, వెళుతూ వుంటుంది. ప్రతీ గ్రామం నుండీ కూరలూ, – పసుపూ, మిర్చీ మొదలైనవి ఎగుమతి అవుతున్నాయి. ఈ దోబిచెర్లలో యిప్పుడొక డేరా సినిమా కూడా వుంది. గ్రామీణు లీనాడు చుట్టలకన్న సిగరెట్లు ఎక్కువకాలుస్తున్నారు.
మొన్న కార్లో వస్తూ చూశాను. వెంకట్రామన్న గూడెంలో బాడ్మింటన్ పోటీలు జరుగుతూన్నట్టు పెద్ద బోర్డు వ్రాసి ఉంది. దారి పొడుగునా కాగితపు జెండాలు కట్టివేశారు. అక్కడ రెండు న్యూ మోడల్ కార్లు కూడా వున్నాయి.
పాతికేళ్ళ క్రితం ఉన్న స్థితికీ యిప్పటికీ ఉన్న వ్యత్యాసం చాలా తీవ్రమైనది. సాధారణంగా రెండు దశాబ్దాలలో యింత మార్పు ఎక్కడా చరిత్రలో జరుగదు.
కాని ఒక్కుమ్మడిగా భూస్వామ్య వ్యవస్థ మీదకు పారిశ్రామిక విప్లవమూ, సైన్సు పరిణామ ప్రయోజనమూ దాడిచేసేటప్పటికి పాతవి విచ్చిన్నం చేస్తూ నవీన లోకం కఠినంగా స్థిరపడుతోంది. ఈ తీవ్రవేగానికి తట్టుకోలేక మనుష్యులూ, సమాజమూ తమ చుట్టూ గోడలని కట్టుకుని లోపల దాక్కుంటారు. దేశానికేదో కీడు మూడిందని గోల పెడతారు….
“మీరు కథని ఆపుచేశారు” అని జ్ఞాపకం చేశాడు నారాయణ అవధానిగారి ఉపన్యాస ధోరణికి కొంచెం భయపడి.
“అవును. కథ ఆగిపోయింది. ఎందుకంటే కారు కూడా సడెన్ గా అక్కడ ఆగిపోయింది” అన్నాడు అవధానిగారు చిన్నగా ‘ నవ్వుతూ.
– “కొవ్వొత్తి అయిపోతోందండోయ్” అన్నాడు. ఆచారి. వాడి చూపు దానిమీదే వుంది. మొదటినుంచీ.
అవధానిగారు సొరుగులోంచి ఒక కొవ్వొత్తి తీసి వెలిగిం చారు. “ఇంక ఒక్క కొవ్వొత్తి మాత్రం వుంది – యిది కాక” అన్నారు.
“చచ్చాం !’ అన్నాడాచారి. ,
“ఎందుకురా అంత భయం”- ప్రశ్నించాడు నారాయణ
“నాకు చీకటంటే పడదు” అన్నాడాచారి దిగులుగా తోటలో పేరుకుని ముద్దకట్టిన చీకటిని చూచి.
ఇంతలో ఏదో వికృతంగా సన్నగా కూత వినపడింది. ఆచారి భయంతో చటుక్కున లేచి “ఏమిటది అవధానులుగారు?” అని అడిగాడు.
“నక్కలు”
“మీ తోటలో నక్కలు కూడా ఉన్నాయాండీ?”
“తోటలో కాదు. శ్మశానంలో వుంటాయి”
“శ్మశానమా?” ఆచారి గొంతు తడబడింది. వణికింది.
“అవును. తోటకి అవతల కాస్త దూరంలో వుంది” – అవధానిగారు తాపీగా, జాగ్రఫీ, మేష్టారు తూర్పున బంగాళా ఖాతమూ దక్షిణమున హిందూ మహాసముద్రము ఉన్నవి అని చెపుతూన్నంత నిర్లిప్తతతో అన్నారు.
– “నోర్ముయ్యి ఆచారీ. ఇంత వయసొచ్చి కూడా, యింత మంది ఉండగా ఈ భయం ఏవిటీ? నవ్వుతారెవరైనా వింటే……” అన్నాడు నారాయణ కోపంగా.
“నాకు దెయ్యాలంటే తెగ భయం…. అయితే…. హిహి హిహి” నెర్వెగా నవ్వాడు ఆచారి. ఈసారి బల్లమీద ఆదితాళం తొందరగా వేస్తున్నాడు. నక్కల కూతలు అప్పుడప్పుడు ఘోరంగా వినపడుతూనే వున్నాయి.
“చెప్పండి” అన్నాను నేను అవధానిగారితో.. ,
రామచంద్రం విసుగ్గా కార్లోంచి దిగాడు. “మొదటినుండీ నువ్వు అపశకునం మాటలే మాట్లాడుతున్నావు. అందుకే అభిమానవతి అయిన వా .ఫోర్డు మారాం చేస్తోంది” అన్నాడు నాగభూషణంతో.
బానెట్ తీసి పరీక్షించాడు. “సరిగ్గా కనపడ డంలేదు యీ గుడ్డి వెన్నెలలో” అన్నాడు.
అంతవరకూ వెన్నెల ఉన్నట్టు మాకు అనిపించలేదు. ఆకాశం మీదికి చూశాను. జేగురురంగుగా ఉన్న చంద్రుడుమీద పల్చని’ మబ్బులు తారాడు తున్నాయి.
రామచంద్రం’ చుట్టలు కాల్చుకుంటూ కూర్చున్న ఆసామీలను పిలిచాడు. “కొంచెం అగ్గిపుల్ల గీస్తారా! కారు ఆగి పోయింది” అని అడిగాడు.
వాళ్ళు కుతూహలంగా ఒక్కొక్కటే. అగ్గిపుల్ల. గీస్తోంటే ఆ వెలుగులో ఏదో మరమ్మతు చేశాడు రామచంద్ర.
“థాంక్స్” అంటూ కారు ఎక్కి కూర్చున్నాడు స్టీరింగ్ దగ్గర.
“ఏ వూరెడుతున్నారు బాబూ” అన్నాడొక ఆసామీ. “తణుకు” అన్నాడు నాగభూషణం.
“శానాదూరం. జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి కనపడిందని చెప్పుకుంటున్నారు.”
“అలాగే, అలాగే” అని కారు స్టార్టు చేశాడు. రామచంద్రం. కారు సాగింది. నాకు ఏదో భయంగా వుంది.
“అదేరా నల్లజర్ల అడవి ఉదయం వస్తూంటే నీకు చూపిం చలేదూ!” అన్నాడు మామయ్య.
అవును, గూడెం దాటాక మైళ్ళ కొద్దీ రోడ్డుకి .. రెండువై పులా అడవి పరచుకుని వుంది. వందల కొలదీ కొండ ముచ్చులు రోడ్డుకడ్డంగా సభలు తీర్చి మా కారు సమీపించగానే కిచకిచలు చేస్తూ పరుగెత్తేవి. పగటి వేళ సూర్యరశ్మిలో ఆ ఆకుపచ్చని అరణ్యం ఎంతో మనోహరంగా వుంది. నోరులేని, తెలివిలేని వృక్షకోట మౌన సౌహారంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టున్నది.
“అయితే చిరుతపులి ఉందంటావా మావయ్యా” అన్నాను నేను.
“ఆ! చిరుతపులీలేదు గిలీలేదు. ‘ఈ పల్లెటూరి వాళ్లు వూరికే ఇలాగ పుకార్లు వేస్తుంటారు. అబ్బాయ్! ఇది ఇంగ్లీషు వాడి రాజ్యం రా. వాడి తుపాకిముందు సింహాలూ, పులులూ నిలుస్తాయట్రా…” అంటూ రామచంద్రం ఏదో చెపుతున్నాడు. కాని కారు యింజనులోంచి ఏదో పెద్ద స్వరం బయలుదేరి గొంతును వినపడకుండా చేసింది.
“ఇదేం జబ్బురా వెధవ కారుకి. మళ్ళీ ఆగిపోతుందేమో!” అన్నాడు నాగభూషణం భయంగా.
“ఇది మీ కాలంలోలాగే రెండెడ్ల బండికాదురా భూషణం. ఫోర్డు యింజను ఇలాగ చప్పుడైతే ఇంజన్ మాంచి బలంతో వుందన్నమాట” అంటూ రామచంద్రం ఏక్సిలరేటర్ మీద కాలు నొక్కాడు.
కారు రయ్యిమని చీకట్లో దూసుకుపోతోంది. నాకు ఏదో సరదాగా థ్రిల్లింగ్ గా వుంది; ఆ చిరుతపులి గొడవ మాత్రం మధ్యమధ్య భయ పెడుతోంది తప్ప…
“చూశావా ఒక్క పిట్టకూడా మైళ్ళకొద్దీ వెళ్ళినా కనపడదు. ఈ చెట్ల చాటున దొంగలు గుంపులుగా దాకుని పల్లెటూరి ప్రయాణీకుల్ని దోచుకునే వారు యిదివరలో….” అన్నాడు మావయ్య.
గత చరిత్ర నా కళ్ళముందు లీలగా ఆడింది. ఇలాగ రోడ్లూ అవీ ఉండేవి కావు. అక్కడక్కడా ఓ పల్లెటూరు వుండేది. ఏ కాకతీయులో, చాళుక్యలో పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దేశంలో వీరులూ, వీర వనితలూ, బందిపోటు దొంగలు, మట్టి రోడ్లూ, పులులూ ఎలుగుబంట్లూ, స్థిరమైన నమ్మకాలూ, సంప్రదాయాలూ అన్నీ ఉండేవి. ఇప్పుడు రోడ్లూ, టెలిగ్రాఫ్ తీగలూ, పోలీసులూ అన్నీ వచ్చి దొంగల్ని, క్రూరమృగాల్నీ నాశనం చేశాయి. వాటితోపాటు వీరవరులూ, స్వధర్మ నిరతులూ కూడా మాయమైపోయారు.
“అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పది హేను మైళ్ళ తణుకు” అన్నాడు రామచంద్రం.
నాగభూషణం జవాబివ్వలేదు. వెనక్కి జేర్లబడి నిద్దరోతు “నువ్వూ నిద్రపోతున్నావా ఏవిటిరా?” అన్నాడు రామ చంద్రం నన్ను ఉద్దేశించి.
– “లేదు” అన్నాను నేను దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తూ. అడవి మధ్యనుండి రోడ్డు ఒక రాక్షస సీమంతంలాగా వుంది. అడవిలో అంతా కటిక చీకటిగా ఉన్నట్టుంది.
ఇంజన్ లో ఏదో రమని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు.
కారు. ఒక గంతువేసి ఆగిపోయింది. …
“ఏమయింది!” అన్నాడు నాగభూషణం. శ్రీ రామచంద్రం మాట్లాడకుండా దిగి యింజన్ ని పరీక్ష చేశాడు.
“సరీగా కనపడటం లేదు” అంటూనే పరీక్ష చేస్త న్నాడు. కీచురాళ్ళ కూతలు ఉచ్చస్వరంతో వినపడుతున్నాయి.
నాగభూషణం కూడా దిగాడు. కంగారుగా అన్నాడు. “ఏం బాగుపడుతుందా?” అని అడిగాడు.
రామచంద్రం • మాట్లాడ కుండా వెనక సీటు కిందనుంచి కొంత సామాగ్రి తీసుకుని పనిలో పడ్డాడు .
“చిరుతపులి యీ అడవిలోనేనా వుందీ?” అన్నాను నేను.
మామయ్య ఉలిక్కిపడి “ఎక్కడ?” అని ఒక గంతు వేశాడు.
“వెధవాయ్ సడెన్ గా అలా అన్నా వేమిటిరా? అన్నాడు కోపంగా.
రామచంద్రం పనిముట్లు టిటిక్ మని చప్పుడు చేస్తున్నాడు. శ్రమవలన అతని బరువైన వూపిరి చప్పుడు కూడా వినపడుతోంది.
మధ్య మధ్య – ఎండుటాకులలో ‘ గలగలమని చప్పడు. పక్షి కూతలు…. కిచకిచలు… ఇన్నిటినీ మించిన భయంకరమైన నిశ్శబ్దం. –
“తెల్లవారితే కలక్టరు గారింట్లో పెళ్ళి …..” స్వగతం చెప్పుకున్నాడు మామయ్య. – “నువ్వేం చదివిస్తున్నావ్ ” అన్నాడు రామచంద్రం.
“మనం వెళ్ళలేకపోతే ఎంత అభాసు అవుతుంది!”అన్నాడు భూషణం.
. “చిరుతపులి మనుషుల్ని’ తింటుందా మామయ్యా” చిన్నవా డినైన నాకు ఒక పక్క భయం, మరోపక్క కుతూహలం.
“ప్లీడరుగారు పక్కలు వేయిస్తానన్నారు. వినలేదు ఖర్మం” మళ్ళీ భూషణం మామయ్య స్వగతం.
ఏదో చెప్పలేని భయం అందరిలో. వెన్నెల మరి కాస్త వచ్చింది. ఆకాశంమీద చంద్రుడు ఎర్రగా వున్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు, నోరు, చెక్కిళ్ళు పెరికి వేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం పూడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుణ్ణి చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీర సంగా, నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనలాగా దుశ్శకునంలాగా అనిపించాడు. వెలవెలబోతూన్న వెన్నెల కూడా కాష భస్మంలాగా భయ పెడుతోంది.
అరగంట జరిగింది. రామచంద్రం పట్టుదలగా, యింజ న్ తో తిప్పలు పడుతున్నాడు, “కారు బాగుపడదు, ఈ రాత్రి అంతా యిక్కడ బిక్కు బిక్కుమంటూ ఉండాల్సిందే” అన్నాడు నాగభూషణం.
కాస్సేపాగి మళ్ళీ అన్నాడు. “వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు. మా ప్రాణాలు తియ్యడానికి వచ్చింది. ఖర్మం ”
రామచంద్రం సహనం కోల్పోయి “అబ్బ చంపకు. వెధవ గోలా నువ్వూ, బాగుపడకపోతే నువ్వు కార్లో ఎక్కి స్టీరింగ్ దగ్గర కూర్చో. నేను తాడేపల్లిగూడెం వచ్చేవరకూ తోస్తాను. నీ ప్రాణానికి నా హామీ, సరేనా …” అని అరిచాడు.
మనుష్యుల గొంతులకి రోడ్డు వారనున్న చెట్లలో కలకలం రేగింది. ఒక్క క్షణం సద్దు అణగింది. రామచంద్రం లేచి రేగిన జుట్టుని, వెనక్కి తోసుకుని “ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్ర ఉంటే చూడాలి కారుని పైకి ఎత్తి పట్టుకోవాలి”. అంటూ రోడ్డు వారకుపోయి కర్రలకోసం వెదుకుతున్నాడు.
నేను భయంతో ఆకాశం కేసి చూశాను. తెలుపూ నలుపూ కలిపిన చిరుమబ్బుlu చంద్రుణ్ణి కప్పి వేస్తున్నాయి. చలిగాలి వీస్తోంది. నాగభూషణం దిగులుగా కారు పక్కనే నుంచున్నాడు. రామచంద్రం కర్రకోసం వెదుకుతూ పదిగజాల దూరం ముందుకు నడిచాడు. రోడ్డువారనే చింతచెట్లూ, రావిచెట్లూ ఉన్నాయి. ఎప్పటివో ముసలి చెట్లు శాఖోపశాఖలుగా అంతటా ఆక్రమించి వేశాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో చీకట్లో అసహ్యంగా, భయంక రంగా , ఉంది. ఊడలు చీకటి పేగులలాగ వేలాడుతున్నాయి. చెట్టు చెట్టుకీ మధ్య యీతపొదలు, బ్రహ్మ చెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. ఒక గుడ్లగూబ అరుస్తూ, ఒక చెట్టుమీద నుండి యింకో చెట్టుమీదికి యెగిరింది. ఆ చప్పుడికి ఉడతలు కాబోలు కిచకిచమంటూ పరుగులెత్తాయి . మనుష్యులకి నివాసంకాని యీ కీకారణ్యం జంతువులకి సహజమైన ఆవాసంగా ఉంది. ప్రకృతి శాసనం తప్ప వాటికి వేరే జీవన విధానమూ, నియమమూ, నీతిలేవు. ప్రతీ ప్రాణి యిక్కడ తనని తాను రక్షించుకుంటూ తనకన్న అల్పమైనదానిని భక్షిస్తూ బతుకుతూంటుంది. ఈ అడవి యిలాగ యెన్ని మైళ్ళు లోపలికి చొచ్చుకుపోయిందో! లోపల చిరుత పులులేకాదు, మనిషి మీదపడి నోట కరుచుకుపోయి ఏ పొదలోనోదాగి ఒక్కొక్క అవయవాన్నే సావకాశంగా చీల్చి రుచిగా భక్షిస్తాయి కాబోలు. ఈ అడవి మీద వెన్నెల అనవసరంగా, అసందర్భంగా ఉంది. అందుకే అడవి కాచిన వెన్నెల అంటారు. అదేకాదు, వెన్నెల సహజమైన సౌకుమార్యాన్నీ ఆహ్లాదత్వాన్ని కోల్పోయి దుర్మార్గంగా, దుస్సహంగా కూడా ఉంది. గుబురుగా ఉన్న ఆకుల మధ్యనుండి, కొంచెం కొంచెం వెన్నెల నేలమీదకు జారి వందల కొలదీ కట్లపాములూ, కొండ పాములూ పాకుతున్నట్టుగా ఉంది.
“మరీ లోపలకు వెళ్ళకు, జాగర్త రోయ్.” అంటూ భూషణం కేక వేశాడు .
“కారు బాగుపడకపోతే, రాత్రి అంతా ఇక్కడ ఉండిపోవడమే!” అన్నాను నేను. నాకు భయంగా ఉంది. గొంతుక యెండిపోతూన్నట్టు ఉంది.
“మంచినీళ్ళు కావాలి” అన్నాను.
“మంచినీళ్ళు! ఎక్కడ దొరుకుతాయి. ఇదేం మీ యిల్లనుకున్నావా” విసుక్కున్నాడు, నాగభూషణం.
“నిస్సహాయతవలన నాగభూషణానికి అసహనం ఎక్కువైపోతోంది. నాకు ఎందుకో అమ్మా, మా ఇల్లూ అన్నీ జాపకం వచ్చాయి. లోపల్లోపల చిరుతపులి వచ్చి కరుచుకుపోతుందన్న భయం అవ్యక్తంగా పెరుగుతోంది కాబోలు. నాకు ఏడుపు రాబోయింది.
నాగభూషణం నా వళ్ళు నిమురుతూ అన్నాడు. “భయపడకురా అబ్బాయి. ధైర్యం తెచ్చుకోవాలి. పన్నెండు గంటలయింది. ఇంకో నాలుగైదు గంటలు వోపిక పట్టితే తెల్లవారిపోతుంది. కారు బాగుపడిందా సమస్యే లేదు.”
నేను మౌనంగా తలూపాను. –
హఠాత్తుగా “భూషణం! పాము! పాము!” అన్న భయ విహ్వలమైన కేక నిశ్శబ్దాన్ని కత్తిలా చీలుస్తూ వినపడింది.
నాగ భూషణం రామచంద్రం వెళ్ళిన వైపు నాలుగడుగులు ముందుకు వేశాడు. దూరంగా రోడ్డుమీద ఒక వైపు నుండి మరోవైపుకి పెద్దపాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్ళిపోయింది.
“రామచంద్రం! రామచంద్రం!” అంటూ కేకలు వేస్తూ పరుగెత్తాడు. నాగభూషణం. రామచంద్రం అక్కడ పొదల దగ్గరే కూలబడ్డాడు. నా ప్రాణాలు బిగుసుకుపోయాయి. నెత్తురు జిలజిలమంది.
రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని తనమీద ఆనుకున్న రామచంద్రాన్ని తీసుకువస్తున్నాడు భూషణం.
రామచంద్రం వణకిపోతున్నాడు. “తలుపు తియ్యి” అన్నాడు భూషణం.
కారు తలుపు తీశాను.
“పడుకో రామచంద్రం, ఇలాగ పడుకో” అంటూ మెల్లగా రామచంద్రాన్ని వెనుక సీటులో పడుకోబెట్టాడు. పై మీద కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టాడు.
“భయపడకు, భయ పడకు” అని హెచ్చరిస్తున్నాడు భూషణం. గొంతులో ప్రాణం లేదు, ఎండిపోయి చచ్చిపోయి ఉంది.
రామచంద్రం కళ్ళలో విపరీతమైన భయం సుళ్ళుతిరిగింది. వెర్రిగా పరవళ్ళు తొక్కింది. చావుకన్నా, దాన్ని గురించిన భయం భరింపలేనిది. మనిషి యొక్క ప్రాణం స్వరక్షణార్థం వెర్రిగా అరుస్తూ నరాలలో కళ్ళల్లో గుండెలలో పరుగులెత్తుతుంది. ఆ ప్రాణం యొక్క ప్రథమ వివేకం “నేను” అన్న అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది. మొర పెట్టుకుంటుంది. మోదుకుంటుంది, గిజగిజలాడుతుంది. రామచంద్రం వణికిపోతున్నాడు. రామచంద్రంలోని “నేను” లుప్త మైపోతున్నాడు. కరిగిపోతున్నాడు. కోట్ల కొలదీ రక్త కణాల సైన్యాన్ని తన్ని తాను రక్షించుకుంటా నికి యుద్ధానికి పంపిస్తున్నాడు. కాని పాము విషం ముందు యింత సైన్యమూ ఓడిపోతోంది. కాలకూట జ్వాల రక్తాన్నీ, మాంసాన్నీ, ధాతువునీ అంతటా రూప హీనంగా పరచుకున్న ప్రాణాన్ని కాల్చి వేస్తోంది.
“భూషణం నేను చచ్చిపోతాను, చచ్చిపోతున్నాను” అంటూ అరిచాడు రామచంద్రం, బొంగురుగా, గాద్గదికంగా.
భూషణం యిటూ, అటూ చూశాడు. ఎవరూ లేరు. చుట్టూ భయంకరమైన అడవి. ప్రతీ నిముషమూ అమూల్యమైనది. ఒక నిముషం గడచిందీ అంటే రామచంద్రం నివారింపలేని విపత్తులోకిజారిపోతున్నాడు. భూషణం కర్తవ్యతా విమూఢుడై పోయాడు ఏమీ చెయ్యలేని, ఏమి చెయ్యాలో తెలియని తన అవివేకం, తన అశక్తతలో తనే బంధింపడి కొట్టుకుంటూ నీరసంగా “ఏం ‘భయం లేదు భయంలేదు” అంటూ గుండెలు రాస్తున్నాడు.
“నా భార్యా – నా పిల్లలు… రక్షించు భూషణం రక్షించు-” రామచంద్రం దీనంగా ఏడుస్తున్నాడు.
నాకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. ఇంత భయంకరమైన అనుభవం నన్ను సంధులలో కూడా సళ్ళించివేసింది. బావురుమని ఏడవాలనీ, అక్కడనుంచి పారిపోవాలనీ ఉంది. కాని ఎక్కడికి పోను, ఎలా పోను ఆ అడవిలో!
“గుండె బరువెక్కిపోతోంది. భూషణం” రామచంద్రం గొంతు క్షీణిస్తోంది. అతని నుదుటిమీద చెమట బిందువులుఅంత చలి గాలిలో కూడా..
“ఆపద్బాంధవా! జగద్రక్షకా! నా రామచంద్రాన్ని రక్షించు” తడబడుతూ భూషణం రెండు చేతులూ పైకెత్తి జోడించాడు.
రామచంద్రం వగరుస్తున్నాడు. అతని కళ్ళు పిచ్చిగా ఉన్నాయి. పెదవుల చివరినుండి నురగ కక్కుతున్నాడు. అది చూసిన నాగభూషణం “బాబోయ్” అని వెర్రికేక పెట్టాడు. నిలువునా వణకిపోతున్నాడు.
“వీడి శవాన్ని యింటికి తీసుకు వెళ్ళి చెల్లెలికి ఎలా చూపించనురా” అంటున్నాడు. రామచంద్రం కళ్ళు తెరచి “నా పెళ్ళాం…” అని అస్పష్టంగా అని నిస్పృహలోకి జారిపోయాడు.
అవధానిగారు ఆగారు. గత స్మృతుల పునశ్చరణవలన ఆయన గొంతు ఉద్రేకంతో బాధతో నిండింది. మేమందరం వూపిరాపి వింటున్నాం. ఆచారి బల్లని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని పళ్ళు బిగించి వింటున్నాడు. కొవ్వొత్తి జాలిగా రామచంద్రం ప్రాణంలాగా వెలుగుతోంది.
తోటలో ఏమీ ఎరగనట్టు, ఈ మాటలేవీ విననట్టు చెట్లు చీకటిలో నిశ్శబ్దంగా నుంచున్నాయి ఒక – నిముషం ఆగి అవధానిగారు చెప్పడం సాగించారు.
భయంకరమైన మృత్యువు ఎదురుగా రామచంద్రం గుండెలమీద కూర్చుంది. ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరు, అడవిలో మృత్యువులాంటి చీకటి. మృత్యుదేవత నవ్వులాంటి బూడిదరంగు వెన్నెల, నాగభూషణం రెండు చేతులతోనూ నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాడు. నేను కొయ్యబారిపోతున్నాను. కాలం కదలడం లేదు, తన యినుప పిడికిలితో మా తలలమీద నొక్కు తోంది. కారులో మూడు ప్రాణాలు. ఒక ప్రాణం కథావశిష్టంగా అయిపోతోంది. తక్కిన రెండు ప్రాణాలూ నీరసించి అచేతన స్థితిలోకి...
“అరే అబయా హర్షయ్య నువ్వెక్కడుండావో అని ఎతకతానే వుండా పొద్దుకాడినుండి, ఇక్కడుండావా” అంటూ వచ్చాడు నాకు చిన్నాయన వరుస అయిన శేఖరయ్య
“ఏంది చిన్నాయన మందల” అంటూ పలకరించా.
“నీ దశ తిరిగిందబ్బయ్యా! నీకు పిల్లనిచ్చిన మావ వుళ్లా! సుబ్బ మావ! ఆయనకి ఇరవై లక్షల ఆస్తి కలిసొచ్చిందంట. ఊరంతా ఒకటే ఆగమయిపోతావుంటే, ఆ ముక్క నీ చెవిన బడ్డదో లేదో అని నాకు విన్నకాడినుండి ఒకటే కడుపుబ్బరం గా వుండిందనుకో. ఆ సంగతేందో తేల్చుకోపో మీ అత్తగారింటి కెళ్ళి” అని చెప్పి సక్కా పోయాడు.
“వార్నీ మా మావ పాసుగాల! బీడీలకి, సిగరెట్లు తెచ్చిపెట్టడానికి నేను, ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో ఏమేమి చేసాడో చెప్పే సోది కబుర్లు వినటానికి నేను, ఇటుమంటి సంగతులు పంచుకోడానికేమో మా షడ్డకుడా మా మావకి, ఇంతకీ మా ఇంటిదానికన్నా తెలుసా! లేదా!నాలుగు రోజుల నుండి అక్కడే పడి వుందిగా, చెప్పనే లేదు, లేక తెలిసి నేను చేయబోయే రచ్చకు భయపడి రహస్యం దాచేసిందా! డబ్బుల సంగతేందో ఈ రోజు తేల్చి పారెయ్యాలి” అని సక్కా మా అత్తారింటికి బయల్దేరా!
మా పెళ్లి అయ్యి నాలుగేళ్లు అయ్యింది. నాకేమో హైదరాబాద్ లో ఉద్యోగం. వారం రోజులయ్యింది సెలవుల మీద వూరుకొచ్చి.
నేను వెళ్లే సరికి, మా వాళ్ళ మావా, మా మావకి పిల్లనిచ్చిన ఆయన మావా, చాలా కుశాలగా కబుర్లు చెప్పుకుంటుండారు వరండాలో కూర్చొని. “ఇదేదో ఎనిమిదో వింతలాగా వుందే, ఎప్పుడూ పిల్లీ ఎలుకల్లాగా పోట్లాడుకునే మావా అల్లుళ్ళు ఇంత ఒద్దిగ్గా వుండటమేంది. అయితే మా శేఖర చిన్నాయన చెప్పింది నిజమేనేమో. అందుకే మా మావ మీద వాళ్ళ మావ కి ఇంత ప్రేమ కలిగింది” అనిపించింది నాకు.
మా మావ చాలా కళ మీద వుండాడు. “మే ఇందిరా! హర్షయ్యొచ్చాడు వచ్చాడు, రెండు టీ లు పట్టుకురా అని కేకేశాడు”. ఆ కేక లో నాకు అంతక మునుపు లేని ధీమా కనపడింది. అంతకు ముందు ఒక టీ కోసం పది సార్లు మా అత్తని బతిమాలుకొనే ఆయన, యీ సారి ఇలా కేకెయ్యటం తొమ్మిదో వింతే.
“రోజుకి వంద బీడీలు తాగటం, అస్తమానం టీ కావాలని మమ్మల్ని సంపక తినటం” అని విసుక్కునే మా అత్త, వెంటనే జీ హుజూర్ అన్నట్టు రెండు టీలు, ప్లేట్ నిండా బిస్కట్ లతో రావటం, అది చూసి నా తల తిరగటం వెంట వెంటనే జరిగిపోయాయి.
నాకై నేను యీ కొత్త ఆస్తి వచ్చి పడటం గురుంచి ఎవర్నీ అడగలేడు. అందుకే నా భార్య కోసం చూపుల్తోనే ఎతకటం మొదలు పెట్టా! అది గమనించి “అమ్మి, దొడ్లో పూలు కట్టుకుంటుంది పో” అని వాళ్ళ మావతో కబుర్లలో పడ్డాడు మా మావ, నా పేరు జెప్పి తెప్పించుకున్న టీ జుర్రుకుంటూ
“ఏందిమే, సంగతి, వూరు వూరంతా గుప్పు మంటూండాదే, మీ నాయనకేదో లిబ్బి దొరికిందని, నిజమేనా” అని అడిగా గుప్పెడు మల్లె పూలు దొరగ్గానే పండగ జేసుకొనే నా పెళ్ళాం దొడ్లో కనపడగానే
“అబ్బో! దిగబడింది, ఇందుకా! నేనింకా ఎదో నా మీద ప్రేమ కారిపోయోచ్చాడు అనుకున్నాలే” అని ఎత్తి ఒక్క పొడుపు పొడిచింది నా పెళ్ళాం.
అట్టా, యిట్టా చూసి, “వాటాలేమన్నా! తేల్చేరా, యింతకీ” అని మన్సులోది కక్కేశా ఆత్రం గా. “మనం దేన్నీ ఎక్కువ సేపు నాన్చము కదా” అని అనుకుంటూ.
“ఏందీ! వాటా కావాలా నీకు. పెళ్లప్పుడు డబ్బు అంతా వసూలు చేసుకొని, ఇచ్చిన పొలాలు అయినకాడికి అమ్ముకొని పోతిరి, మీ అబ్బా కొడుకులు. ఇప్పుడేమి వాటా కావాలి నీకు” అని దండయాత్ర చేసింది.
“ఏంది మే! నీకు ఇచ్చింది? రెండెకరాలు నీకు, మీ అక్కకి ఎనిమిది. కునిష్ఠ వని రెండుతో సరిపెట్టారు నీకు, నీకేమో ఏమీ పట్టదు, చేతిలో కుడుము పెట్టగానే పండగనుకుంటావు”
“సడే! మా అక్కోళ్ళ కి పొలాల విలువ తెలుసు కాబట్టి, డబ్బులు వద్దు అని పొలాలు తీసుకున్నారు. మీ నాయనా కొడుకులు డబ్బో డబ్బో అని, డబ్బులెక్కువ, పొలాలు తక్కువ తీసుకొని, ఇప్పుడీ ఏడుపులేడుస్తున్నారు, ఇక్కడెవరో మీకు అన్యాయం చేసినట్టు. ఇదిగో విను, మా వాళ్ళు పెళ్లప్పుడు పెట్టాల్సిన పెట్టు పోతలన్నీ పెట్టేసారు. ఇప్పుడు గాని వాటా గీటా అన్నావంటే మర్యాద దక్కదు, రేపే మన ప్రయాణం మనూరికి” అని డిసైడ్ చేసేసింది.
“ఇంత తెలివి లేని దాన్ని కట్టబెట్టావేందిరా దేవుడా” అనుకుంటూ స్నానానికి బయల్దేరా!
స్నానం చేసేటప్పుడంతా ఒకటే ఆలోచన, ఈ విషయం ఎలా కదపాలి, ఎవర్ని కదపాలి అని. ఉడుకుడుగ్గా నాలుగు చెంబులు పోసుకొనే సరికి మనస్సు, శరీరం కాస్త స్వాధీనం లోకి వచ్చాయి.
ఆపాటికే అందరు వరండాలోకి చేరారు. బహుశా, నా కెలా చెప్పాలో అని తర్జన భర్జన ముందే పడ్డట్టు వున్నారేమో, మా అత్తగారు, సూటిగా సుత్తి లేకుండా అసలు విషయం లోకి వచ్చేసారు.
“మీ మావకి ఇరవై లక్షలు వస్తాయి. మీ మావ గారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఆయన లోకంలో ఆయన బతుకుతూ, ఇంటిని గురించి పట్టించుకోకుండా, వుంటే, మా పెద్ద అల్లుడు అంటే మీ షడ్డకుడు ఒక బిడ్డలా, ఈ ఇంటిని ఆదుకున్నాడు. కాబట్టి మీ మావకొచ్చే ఆస్తిలో ఎక్కువ భాగం ఆయనకి చెందాలి. యీ విధం గా అయినా ఆయన అప్పు తీర్చినట్టు” అని.
నాకు తెలుసు, తాను ఆమె కంటి లో నలుసు అని. కానీ పెద్దల్లుడు ముందర తన విలువ యింత తక్కువ అని నా భార్య వైపు చూశా. వాళ్ళమ్మ చెప్పింది నూరు పాళ్ళు నిజం అనే తన్మయత్వం కనిపించింది తనలో
ఈ లోపల మా అత్త గారి నాయన మొదలుపెట్టాడు, “అబ్బ! సుబ్బయ్య, చాలా తెలివికల్లోడు. నాకు తెలుసు ఎప్పటికైనా, పైకొస్తాడు” అని. “ఈ మావ అల్లుళ్ళ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనేది. కానీ ఈ ఆస్తి కలిసి వస్తుందని తెలిసినప్పటి నుండి ఆయనకీ అల్లుడు మరీ ముద్దు అయిపోయాడు. అరవై ఏళ్ల అల్లుడు ఇంకా పైకొస్తాడట, ఏమి మిగిలుందో రావడానికి” అని కసిగా అనుకున్నా!
ఇంకమావ ఏమంటాడో అని ఆయన వయిపు చూశా! ఆయన దొరక్క దొరక్క దొరికిన సెలబ్రిటీ స్టేటస్ ని ఇంకా ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదిస్తూనే ఉండిపోవాలనే కోరిక ఆయన మోహంలో చాలా బాగా కనపడుతుంది. పాపం ఆయన అప్పట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెనారస్ యూనివర్సిటీ చదివాడు. మంచి కుటుంబంలో పుట్టాడు. మంచి ఉద్యోగం చేస్తూ, వాళ్ళ బాస్ తో పడక, ఆవేశంతో రాజీనామా లెటర్ మొహం మీద కొట్టి, గత ఇరవై ఏళ్ళు ఆ పని ఎందుకు చేసానా అని రిగ్రెట్ అవుతూ బతికేస్తున్నాడు.
ఇప్పుడాయన వంతు వచ్చింది. ఆయన వంతు వచ్చినప్పుడు, యూనివర్సిటీ లో నేర్చిన క్లాసికల్ ఇంగ్లీష్ బయటకి వస్తుంది. అవతలోడికి అర్థమవుంతుందా లేదా అని ఆయనకి పట్టదు. గొంతు సవరించుకొని, “సీ మై డియర్ మెంబెర్స్! ఐ హావ్ డన్ మై పీజీ ఇన్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్. ఐ వర్కడ్ అండర్ గ్రేట్ స్కాలర్స్. ఐ హావ్ బీన్ ఇన్ ది బెస్ట్ ప్లేసెస్. ఐ హావ్ డైన్డ్ ఇన్ ది బెస్ట్ రెస్టారెంట్స్. ఐ హావ్ మారీడ్ ది బెస్ట్ వుమన్ అండ్ హావ్ బెస్ట్ చిల్డ్రన్స్. ఐ సీమ్ టు హావ్ వరస్ట్ సన్-ఇన్-లా. మై ప్రాపర్టీస్ విల్ గో టు వన్ అమోంగ్స్ట్ యు హూ విల్ గివ్ మీ ది బెస్ట్ పాసిబుల్ కేర్. గెట్ మీ వన్ కోక్ ప్లీజ్” అని ఒక ఆర్డర్ పారేసి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
నాకు చాలా సమయం పట్టింది మావ ఏమి చెప్పాడో అర్థం చేసుకోవడానికి. ఆ రోజు నుండి మొదలయ్యాయి నా తిప్పలు, మా మావకి గాడిద చాకిరీ.
హైదరాబాద్ వచ్చేశాక, ఒక రోజు ఆఫీస్ కి వెళ్లే హడావుడిలో వుండగా మావ గారినుండి ఫోన్, “హైదరాబాద్ వస్తున్నా, సెకండ్ ఏ/సీ లో టికెట్ రిజర్వు చెయ్. పికప్ చేసుకో” అనే హుకుం. చచ్చామురా దేవుడా ఈయన ఎన్నిరోజులుంటాడో అనుకోని, “రిటర్న్ ఎప్పుడు చేయించమంటారు అదే అడిగితే, లెట్ మీ డిసైడ్ వెన్ ఐ అరైవ్” అని సమాధానం.
ఆయనహైదరాబాద్ వచ్చాక, నా పడక హాల్లో కి షిఫ్ట్, ఎందుకంటే మావ గారికి కొత్తగా హైదరాబాద్ లో ఏ/సీ లేనిదే నిద్ర పట్టని అలవాటు పట్టుకుంది. నేను ఎక్కడున్నా ఆయన ఫోన్ చేయగానే ఆయన కోరికలు తీర్చాలి. ఫోన్ లో సంభాషణ చాలా క్లుప్తంగా ఉంటుంది. “ఐ వుడ్ లైక్ టు హావ్ ఫిష్ ఇన్ ది డిన్నర్”, మళ్ళీ ఈ ఫిష్ కొర్రమీను అయ్యుండాలి. ప్రాన్ అయితే టైగర్ ప్రాన్.
ఇవి కాక మావగారి కోరికలు చాంతాడంత, తాజ్ బంజారాలో ఒక రాతిరి డైన్-ఇన్ చేయాలి, నెల్లూరు జై హింద్ నుండి గులాబీ జామూన్, మురళి కృష్ణ నుండి మలయ కాజా తెప్పించాలి ఎక్కడో మలక్ పేటలో ఎవడో రాజస్థానీ రోటీవాలా అట వాడు చేసే పుల్కాలు. ఊర్లో బీడీలు మాత్రమే తాగే మా మామ నా చేత నా ప్రాజెక్ట్ మేట్ అమెరికా నుండి వస్తుంటే తెప్పించుకున్న పనామా సిగార్ లు మాత్రమే కాలుస్తున్నాడు, అవి అయిపోతే నన్ను కాలుస్తున్నాడు. నేను ఇంకా కాలకుండా మిగిలి ఉంటే మామ్ అండ్ డాడ్ స్టోర్ నుండి లోకల్ మేడ్ స్ట్రా బెర్రీ ఫ్లేవర్ సిగార్లు కొనుక్కొచ్చి మావని తృప్తి పరుస్తున్నా.
మావ నెలకోసారి హైదరాబాద్ ప్రయాణం పెట్టుకోవడం, పైన కోరికలన్నీ ఒక సారి రివైజ్ చేసుకొని మార్పులు చేర్పులు ఎమన్నా ఉంటే చేసుకోవటం, వాటిల్ని తీర్చుకొని ఊరెళ్ళటం ఒక ఏడాది పాటు జరిగింది.
“ఎప్పుడు మావ నీ ఆస్తి వచ్చేది, అది నాకు ఇచ్చేది, నువ్వన్నట్టుగానే నేను నీకు బెస్ట్ కేర్ ఇస్తున్నాను కదా” అని ఎన్నో మార్లు మొరపెట్టుకుంటుంటే, అన్నిటికీ ఒకటే సమాధానం, “ఇవాళ, లేక రేపు అంతే” అని. మావ రేపు ఎంత ఇస్తాడో కానీ, మావ బెస్ట్ కేర్ కి నా క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకున్న అప్పు పెరిగి పోయి, దాన్ని కట్టడానికి ఇంకో కార్డు, ఆ కార్డు కి కట్టడానికి ఇంకో కార్డు, నేను రాసిన ప్రోగ్రాం లాగ, లూప్ లోంచి బయటకి రావటం లేదు.
క్రెడిట్ కార్డు రికవరీ వాళ్లంతా ఇంటి మీద పడటం తో, ఇంటికి తాళం వేసుకొని, ఓ రెండు వారాలు సెలవు పెట్టి, అత్తగారి ఇంట్లో దిగిపోయా. వెళ్లే సరికి ఇంట్లో వాళ్ళ మొఖాల్లో కళా కాంతి లేదు. ఏమయ్యింది అంటే ఎవరూ ఏమీ చెప్పరు. అంతా నిశ్శబ్దం. మావగారు నన్ను చూడగానే, “ఇందిరా! రెండు కప్పుల టీ” అని కాన్ఫిడెంట్ గా అరవటం లేదు. నేను పంపిన సిగార్లు పక్కన పడేసి, బీడీల్లోకి దిగిపోయుండాడు. మావ వాళ్ళ మావగారు, “మా సుబ్బయ్య! చాలా తెలివి గల్లోడు! ఎప్పటికైనా పైకొస్తాడు అనటం లేదు పొరపాటున కూడా”.
నాకు తిక్క పుట్టి పోతుంది. “మావా! ఏమయ్యిందో చెప్పు” అని గట్టి గా చేయి పట్టుకున్నా మూడో రోజు.
మావ నిశ్శబ్దంగ గదిలోకి వెళ్లి, “ఓ మూడు పోస్టల్ కవర్లు తెచ్చి నా చేతిలో పెట్టాడు”. వాటిల్ని డేట్ వారీగా పెట్టి, మొదటి దాన్ని ఓపెన్ చేశా! దాని తెలుగు సారాంశం ఏమనగా!
11/6/2010,
“డియర్ సుబ్బయ్య!
మీరు ఎక్స్ అను మా మ్యాగజైన్ కి గత పదేళ్లుగా సభ్యత్వం కలిగి వున్నారు.
“…”
“…”
కావున మీరు ఈ కింది పజిల్ ని పూరించి పంపిన ఎడల, మీరు మేము ఎంపిక చేసిన సభ్యులలో రూ|| ఇరవై లక్షలు లాటరి ద్వారా గెలుచుకొనే అవకాశం కలిగి వున్నారు.
ఇట్లు మీ భవదీయులు,రెండో లెటర్ ఓపెన్ చేయగా, దాని సారాంశం, ఏమనగా!!
1/1/2011,
“డియర్ సుబ్బయ్య!
“…”
“..”
మీరు పంపిన పజిల్ అందినది. మరియు అది సరియైనది. కావున లాటరి ద్వారా ఎంచుకొని బహుమతి పంపగలము.
ఇట్లు మీ భవదీయులు,ఇంకా ఆశ చావక మూడో దాన్ని కూడా ఓపెన్ చేశా. దాని సారాంశం ఏమనగా!!
6/1/2011
“డియర్ సుబ్బయ్య!
“…”
“..”
మీరు మా లాటరి లో విజేతలు గా ఎంపిక అవటం తృటిలో చేజారినదని తెలియ పరచుటకు మిక్కిలి విచారిస్తున్నాము.
ఇట్లు మీ భవదీయులు,నా ముఖం లో మామ పెట్టిన కత్తి గాటుకి ఒక్క నెత్తురు చుక్క కూడా రాల లేదు. ఎక్కడో దూరం గా పాట వినిపిస్తుంది మైకు , “అనుకున్నదొక్కటి, అయినదొక్కటి, బోల్తాకొట్టావులే బుల్బుల్ పిట్టా!” అని.
‘గేట్’ ఖదీర్ బాబు గారి రచన. ‘ గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా కావలి లో జన్మించారు. బి.ఎస్. సీ కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రులు. పత్రికా రంగంలో, సినీ రంగంలో తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. . వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘ దర్గామిట్ట కథలు ‘ , ‘ న్యూ బాంబే టైలర్స్ ‘ , ‘ పోలేరమ్మ బండ కథలు’ , ‘ కథలు ఇలా కూడా రాస్తారు’.
వీరు రాసిన ‘ న్యూ బాంబే టైలర్స్’ ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు ను గెలుచుకోవడమే కాక, నాటకంగా రూపాంతరం చెంది అనేక ప్రశంసలందుకుంది.కృతజ్ఞతలు ఖదీర్ గారూ హర్షణీయం ద్వారా ఈ కథను పరిచయం చెయ్యడానికి అనుమతినిచ్చినందుకు.
గేట్ :
గొణుక్కుంటున్నారు ఇద్దరూ.‘లాగండి’ అంటోంది.లాగితే రావడం లేదు. మూడు మెట్లు ఎక్కితే ఉంది గేటు. పైన చిలుకు తీసి ముందుకు లాగుతుంటే కదలడం లేదు. ఇద్దరు పిల్లలూ ఊరికే చూస్తున్నారు. టక్ చేసి ఉన్న అతడు బెల్ట్ సర్దుకుంటూ మళ్లీ లాగాడు
.‘రావడం లేదు’ అన్నాడు.
అలికిడి లోపలి వరకూ వినిపించినట్టుంది…
‘ఎవరూ’ అంటూ వచ్చి అవతలి నుంచే మునిగాళ్ళు ఎత్తి గేటు బయటకు చూస్తూ ‘ఏంటి.. ఏంటి… నిజమే.. సుదా.. నువ్వేనా’ అందామె అతణ్ణి చూస్తూ.
‘గేటు ఇంటి వైపుకు నెట్టాలి. వీధి వైపుకు కాదు. ఏం మారలేదు నువ్వు’ అంటూ ఇంటి వైపుకు లాగింది.
గేటు తెరుచుకుంది. కిరకిరమని కఠినమైన శబ్దం చేసింది.
‘గ్రీజు పూయాలి దీనికి. ఎప్పట్నించో. అలాగే పోతా ఉంది. ఓహో… అమ్మాయి వచ్చిందా… అరెరె… ఈ చిన్న మినిస్టర్లు ఎవరమ్మా’ అంటూ పిల్లల్ని జవురుకుంది. మొదటిసారి చూస్తున్న పిల్లలు. బెదరలేదు. అలాగని సంబర పడలేదు. కొత్త చేసి చూస్తున్నారు.‘ఇదిగో.. ఎవరొచ్చారో చూశారా’ పెద్దగానే అరిచింది.
‘అచ్చు సినిమాల్లోలాగే చేస్తున్నావు అమ్మీ’ అన్నాడు నవ్వుతూ.
‘ఓహో.. అమ్మీ అనే అన్నావు. టీచార్ అంటావేమో అనుకున్నా చాకు దీర్ఘం పెట్టి’ అని పిల్లల వీపు మీద ఇంకా గట్టిగా చేతులు అదిమింది.
గేటు నుంచి ఇంటి వరకూ నాప పలకలు పరిచి ఉన్నాయి. ఎండ వాటి మీద పడి మెరుస్తూ ఉంది. నీడల్ని బట్టి పన్నెండు లోపే అయి ఉండవచ్చు టైము. పదిహేను ఇరవై నాప పలకలు పరిచేంత ముంగిలి ఉంది. తర్వాత గడప.
హాలులోనే ఉన్నాడు సారు. వైరు మంచం మీద కూచుని. ఒక కాలు కిందకు జార్చి. ఒడి మొత్తం కప్పేలా టర్కీ టవల్ పరుచుకుని. ‘ఏమిటీ పిడుగు… సుదా’ అన్నాడు. తెల్లటి గడ్డంలోని లేత బూడిదరంగు పెదాలు విడివడి ఎప్పటిలాగే తెల్లటి పలువరుస మెరిసింది. చుబుకం నుంచి కంఠానికి రెండు తాళ్లు కట్టినట్టు ఉంటుంది చర్మం. ఆ తాళ్లు ఊగాయి నవ్వుకు.
అతడు వొంగి ఆయన కాలుకు నమస్కారం పెట్టాడు. కళ్లు ఉబికాయి. ఆమె కూడా ఒంగి నమస్కారం పెట్టింది.
‘ఏమిట్రా సుదా.. ఊ’ అన్నాడు సారు.‘పిల్లలు… మినీ.. బూ… ఇట్రండి. తాతకు నమస్కారం పెట్టండి’పెద్దది– తొమ్మిదేళ్లు ఉంటాయి… దళసరి కళ్లద్దాలు… రెండు చేతులు జోడించి పెట్టింది. చిన్నాడు– ఆరుంటాయి– వంకర్లు తిరిగాడు. సారు టవల్ అంచు తీసుకుని కళ్లు వొత్తుకుని, ఏమి ఇద్దునా అని చొక్కా జేబు తడుముకున్నాడు. ఇంకు పెన్ను ఉంది. దానిని తీసి, ఆగి, భార్య వైపు చూస్తూ ‘ఇంకో పెన్ను ఏదైనా ఉంటే చూడు. చెరొకటి ఇవ్వకపోతే అదొక గలభా’ అన్నాడు.
‘ఇప్పుడు మీ పాతకాలపు పెన్నులే వీళ్లక్కావాల్సింది. రూములో టీవీ ముందు కూచోబెట్టి బూస్టేదైనా ఇస్తాగాని… మీరు మాట్లాడుకోండి’ అందామె నవ్వుతూ.
‘అహ్మద్‌కు ఫోన్ చేసి నాటు తెమ్మను. ఫారమ్ తెస్తే పడతాయ్ అని చెప్పు. కుర్మా చేసి వేపుడు కూడా చెయ్. గుడ్లు ఉడకెయ్’… పిల్లల్ని వెంటబెట్టుకు వెళుతుంటే గట్టిగా చెప్పాడు.
‘ఇప్పుడవన్నీ ఎందుకు మావయ్యా’ అందామె.
‘నువ్వూర్కోమ్మా. ఇప్పటికి తీరి వచ్చారు. ఏరా… తినే దాకా ఉండవా? పరిగెత్తి పోతావా? ఇన్నాళ్లూ పరిగెత్తి పోయావుగా’ అన్నాడు సారు.అతడు మాట్లాడలేదు. గతంలో మల్లే స్టూడెంట్ మొహం పెట్టాడు.
‘కూచో’ అన్నాడు సారు. ఆమె కూడా ప్లాస్టిక్ కుర్చీలో కూచుని హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి మడిచి ఉన్న పాలిథిన్ కవర్ తీసింది. అందులో సాధారణంగా అమెరికా నుంచి వచ్చేవాళ్లు తెచ్చే చాక్లెట్లు, ఏవో చిన్న చిన్న కానుకలు ఉన్నట్టున్నాయి. ఇద్దునా అన్నట్టు భర్త వైపు చూసింది. ఇప్పుడు కాదు అన్నట్టు వారించాడు.
సారు అదంతా పట్టక శిష్యుణ్ణే చూస్తున్నాడు.‘ఏమ్మా… వీడు బాగానే ఉంటున్నాడా నీతో. చెప్పు. గల్తీ గిల్తీ ఉంటే బయట ఎండలో రెండు రౌండ్లు ఫ్రంట్ రోల్ చేయిస్తా’ అన్నాడు.
భర్త వైపు చూసి సారు వైపు చూస్తూ ‘మీ స్టూడెంట్ కదా మావయ్య’ అంది.
‘ఏరా… డేగిశా సుమారుగా పెంచావు. అమ్మాయి చేత రోజూ రెండేసి ప్లేట్ల టిఫిన్ పెట్టించుకుని తింటున్నావా’… నవ్వాడు.ఆ మాటకు అతడు నవ్వాడు. దాని అర్థం ఆమెకు తెలుసులా ఉంది… ఆమె కూడా నవ్వింది.
హైస్కూల్లో చేరినప్పుడు తల్లి సద్దన్నం కట్టి, ఎరగడ్డను ఒలవడానికి కూడా టైము లేక సంచిలో పడేసేది. రెండు మైళ్లు నడుచుకుంటూ వచ్చి పొద్దునంతా పాఠాలు వింటే మధ్యాహ్నానికి అదే. మూడు ముద్దల్లో అంత సద్దెన్నమూ మింగేసి తింటున్న మిగతా పిల్లలవైపు కళ్లు పెట్టుకుని చూసేవాడు. సాయంత్రం ఇంటికెళితే పరమాణ్ణం ఉంటుందనా. కలో గంజో. ఉన్న బరెగొడ్డు మీద కూతుర్నీ కొడుకునూ సాకాలి తల్లి. తండ్రి ఏనాడో పొలంలోనే పాము కరిచి పోయాడు. ఎదిగే వయసు. ఎప్పుడూ ఏదో ఒకటి బుక్కమనే ఆకలి. ఒరే అర కడుపోడా… పోయి అమీర్ అలీ సార్‌ని కలువు… ఎన్.సి.సిలో చేర్చుకుంటాడు… తినొచ్చు అని సలహా ఇచ్చారెవరో. ఏం తినొచ్చు అనడిగాడు. వారంలో రెండుమాట్లు డ్రిల్లుంటుంది… అయ్యాక చెంగయ్య హోటలు ఇడ్లీ, వడ ఇస్తారు అని చెప్పారు. యూనిఫామ్ ఇస్తారని కూడా చెప్పారు.
అప్పుడు కలిశాడు అమీర్ అలీ సార్‌ను. పూర్తిగా ట్రిమ్ చేసిన నల్లగడ్డం. లేత బూడిద రంగు పెదాలు. తెల్లని పలువరుస. పెద్ద కాలరు… బ్రౌన్ కలర్ ఉంగటం చెప్పులు… ఆరు, ఏడు తరగతులకు ఇంగ్లిష్ చెప్పేవాడు. కాని ఎన్.సి.సి వరకు ఆయనది భుజాన రెండు స్టార్లు పెట్టుకునే ట్రూప్ కమాండర్ హోదా.‘ఎందుకు చేరతానంటున్నావ్ ఎన్.సి.సిలో’ అన్నాడు సారు.‘క్రమశిక్షణ కొరకు’ బట్టీ వేసింది చెప్పాడు.
‘అంటే?’‘యూనిఫారమ్ కొరకు’
‘సరిగా చెప్పు’
‘చెంగయ్య హోటలు టిపిను కొరకు సార్’పై నుంచి కింద దాకా చూశాడు.
‘తెల్లారే టైములో ఉంటుంది పరేడ్. మీ ఊర్నుంచి నువు రాలేవు’
‘ముందు రోజు రాత్రే ఇంట్లో అన్నం తినేసి స్కూల్‌కొచ్చి పడుకుంటా సార్’
‘దెయ్యాలుంటాయ్రా’
‘ఆకలి మీదుంటే నా అంత అలివి మాలిన దెయ్యం లేదు సార్’పరికించి చూశాడు.‘ఏం పేరు నీది?‘సుధాకర్. ఎయిత్ సి.
’అమీర్ అలీ సార్ ఒక పెంకుటింట్లో అద్దెకుండేవాడు. దాని వరండాలో ఎప్పుడూ ఇంటి ఓనరు రెడ్డాయన వడ్ల బస్తాలు పెట్టుండేవాడు. వాటి పక్క స్థలం అతనికి ఇవ్వబడింది. వారంలో రెండు రోజులు రాత్రి బస సారు ఇంట్లోనే. తెల్లారి లేచి సార్‌తో కలిసి యూనిఫామ్ వేసుకుని పరేడ్.
మొదటి రోజు పరేడ్‌కు తీసుకెళుతూ ‘సుదా… చూడాలిరా నీ అదృష్టం’ అన్నాడు సారు.‘ఏం సార్’ అన్నాడు అతడు.‘చెప్తా’ అన్నాడు సారు.పరేడ్ ముగిసింది. నలబై మంది స్క్వాడ్‌కి ఒక్కొక్కటి లెక్కన, అమీర్ అలీ సార్‌కి రెండు, హెడ్మాస్టర్ ఇంట్లో ఇచ్చేందుకు నాలుగు మొత్తం నలబై ఆరు ప్లేట్ల టిఫిను విస్తరాకు, పైన న్యూస్పేపరేసి కట్టి ఒక వెదురుబుట్టలో తెచ్చి పెట్టి వెళ్లడం చెంగయ్య పని. చేరేదే ఆ టిఫిను కొరకైనప్పుడు ఆబ్సెంట్ అయ్యే కేడెట్లు ఎవరుంటారు? సారు అదృష్టం అనింది అందుకే. ఆ రోజు ఒకడు డుమ్మా కొట్టాడు. ‘బోణి… రెండు ప్యాకెట్లురా’ అని ఆ డుమ్మావాడిది అతడికి ఇచ్చాడు సారు. ఆ ముహూర్తం బలమైనది. అతడు ఎన్.సి.సిలో ఉన్నన్నాళ్లు, పరేడ్‌కు హాజరైనన్నాళ్లు ఏ రోజూ రెండు ప్యాకెట్లు నాగా కాలేదు.
పేరు కూడా ‘రెండు ప్లేట్ల సుదా’ అయ్యింది సారు పుణ్యాన. ఆదివారం ఊళ్లో వేటను కోసి పోగులేసి అమ్మితే సారు భార్య కూర తెప్పించి టమేటాలు ఎక్కువేసి పలావు వండేది. అతడికి ముందు రోజు రాత్రి నుంచే ఆహ్వానం ఉండేది. స్కూల్ అవుతూనే సారు పిలిచి ‘రాత్రి ఇంటికొచ్చి పడుకోరా. రేపు పలావు. డేగిశా పగిలిపోవాలి’ అనేవాడు. అదృష్టం ఉంటే అన్నీ కలిసొస్తాయి. సారు కూతురు షమీమ్ గర్ల్స్ హైస్కూలులో ఆరు చదివేది. ‘సుదా భయ్యా’ అని అతణ్ణి అతుక్కుపోయేది. ఒక్కగానొక్క కూతురనీ సారు ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములుంటే ఈయనకు మాత్రమే ఆడపిల్ల పుట్టిందని అందరూ తెగ ముద్దు చేసి చిల్లరిచ్చి పోతుండేవాళ్లు. జామెట్రీ బాక్సులోని ఆ చిల్లరకు సుదా భయ్యాను కూడా హక్కుదారును చేసింది. జామకాయలు ఆధా ఆధా. రేగుపళ్లు ఆధా ఆధా. లెక్కలు బాగా వచ్చినందుకు ఆ పిల్లకు వాటిని నేర్పించి ఆ రుణం తీర్చుకున్నానని అనుకునేవాడు అతడు. ఏకు సుదా మేకు సుదా అయ్యి సారు భార్యను ‘టీచార్ ఉప్మా చేసి పెట్టు’ అనే దాకా వెళ్లాడు.
‘ఒరే నువ్వు దీర్ఘం తీసి నన్ను చారు పెట్టకు. అమ్మీ అని పిలు’ అంది ఆ మహాతల్లి.ఆమె ఆ మాట అన్నాక సారు ఇల్లే అతడి ఇల్లు అయ్యింది. ఎండలొస్తే ఆరుబయట పడుకునేందుకు నులక మంచం వచ్చింది. చలికాలం కోసం ఒక దుప్పటి వచ్చింది. ఎప్పుడు అడుగుతాడోనని సారు భార్య ఒక గుప్పెడు బియ్యం ప్రతిపూటా ఎక్కువేసి వండటం అలవాటు చేసుకుంది. కొడుకు దొరికాడు అని సారు, సారు భార్య అనుకున్నారో ఏమో. కొడుకును దొరికినట్టే అని అతడు అనిపించేలా చేశాడో ఏమో. ఎంతలా అనిపించకపోతే ఏనాడూ సినిమాలు చూడని సారు అతడు అడిగాడని తుపానప్పుడు రిలీజైన చిరంజీవి, శ్రీదేవి సినిమాకు గొడుగు పట్టుకుని సెకండ్ షో వెళ్లి అతణ్ణి సినిమాకు వదిలి ఆయన మాత్రం హాయిగా పక్కసీట్లో నిద్ర పోతాడు? ఇవన్నీ అప్పుడప్పుడు ఆమె అడిగితే అతడు చెప్పేవాడు. ఎప్పుడైనా అడక్కపోయినా.
‘షమీమ్ ఎలా ఉంది సార్’ భార్య చివుక్కున చూసి ‘చూడండి మావయ్యా ఎలా అడుగుతున్నాడో. షమీమ్ ఎలా ఉందో ఈయన కదా మీకు చెప్పాలి. ఈయన కదా తెలుసుకుని ఉండాలి’ అంది.
‘పోనీలేమ్మా. వాడి గోలలో వాడు పడ్డాడు’ అన్నాడు సారు.సారు భార్య టీ తీసుకు వచ్చి చక్కర లేని కప్పు మొదట సార్‌కి ఇచ్చి తక్కినవి వాళ్లిద్దరికీ ఇచ్చింది.‘సుదాది ఏముంది తప్పు. బి.టెక్ అయ్యేదాకా వచ్చి పోతానే ఉండేవాడు. ఉద్యోగం రావడంతోటే కంపెనీ చెన్నై పిలిచింది. ఆ తర్వాత జపాన్ పంపింది. అట్నించటే అమెరికా పంపింది. సెలవు నాలుగురోజులు కూడా లేదని విమానం సీట్లో కూచున్నట్టుగా పెళ్లి చేసుకున్నాడు. ఆ పూటే కదా మేం మిమ్మల్ని ఆకరుసారి చూసింది. ఏమున్నావులే నువ్వు పెళ్లికూతురిగా. వీడే… బోజనాలెప్పుడు పెడతారా అన్నట్టు కూచోనున్నాడు పక్కన లడ్డుముక్కలాంటి నిన్ను పెట్టుకుని’… తల మీద మొడుతున్నట్టుగా అభినయించింది.‘బిటెక్ చదివేప్పుడే అనేవాడులే అమెరికా వెళతానని’ అన్నాడు సారు.‘వెళ్తే ఫస్టు ట్రిప్పులో మమ్మల్నే తీసుకెళతానని ఒట్లు’ సారు భార్య నవ్వుతూ. తాగేసి కప్పులిస్తే వెళతాను అన్నట్టుగా నిలబడి ఉందామె.
‘మీ చెల్లెలు ఎలా ఉంది సుదా’
‘పెళ్లి చేశాను సార్. నేను అమెరికాలో ఉంటే ఆమె ఇక్కడెందుకని అమెరికా సంబంధమే చూసి చేశాను. కాకపోతే వాళ్లో మూలా నేనో మూలా ఉంటున్నాం. అమ్మను చెల్లెలి దగ్గరే పెట్టాను’
‘షమీమ్‌ను బుచ్చిరెడ్డిపాలెంలో ఇచ్చాంలే. అతనూ టీచరే. ఇద్దరు పిల్లలు. బాగనే ఉందిలే’ అందుకున్నట్టుగా అంది సారు భార్య. కప్పులు తీసుకున్నా కదలకుండా ‘నిన్ను గుర్తు చేసుకోవడం మాత్రం మానలేదు’ అంది.సారు ఒడి మీదున్న టవల్‌ను అవసరం లేకపోయినా సర్దుకున్నాడు.
‘సొంత ఇల్లు కొనుక్కున్నాం మావయ్యా అక్కడ. అప్పుడు ఫోన్ చేసి చెప్పమన్నాను మీకు’ అంది అతడి భార్య ఏదో ప్రయత్నంగా.
‘ఏమ్మా.. అమెరికాలో పది పన్నెండేళ్లు ఉన్నాక ఆస్తులు పాస్తులు కార్లు విశేషమా. ఏరా.. ఇది కాదు… అక్కడ నలుగురు మనుషుల్ని కూడేసుకున్నావా లేదా అది చెప్పు’గేటు కిరకిరమని తెరుచుకుంది.
‘అదిగో.. అహ్మద్ వచ్చినట్టున్నాడు చూడు’ అన్నాడు సారు.క్రీమ్ కలర్ ప్యాంట్, మోచేతుల వరకూ మడిచిన పూల చొక్కా, తలకు టోపీ పెట్టుకున్న కుర్రాడు రెండు మూడు పాలిథిన్ కవర్లతో వచ్చాడు. చొరవగా వంటగదిలోకి వెళ్లి వాటిని ఉంచి హాల్లోకి వచ్చాడు. ‘చెప్పినవన్నీ తెచ్చా’ అన్నాడు సారు భార్యతో.
‘వీడే అహ్మద్. డిగ్రీ ఫైనల్ ఇయర్. స్కూల్లో నా రిటైర్మెంట్ బ్యాచ్ స్టూడెంట్. నీలాగే ఇప్పుడు’ అన్నాడు సారు.‘సరే. మనుషులొచ్చారు. మళ్లి రాపో’ అన్నాడు అహ్మద్‌తో.
‘డ్రస్సింగ్ ఉందిగా. చేసి పోతా’ అన్నాడు వాడు.
‘వద్దులే. సాయంత్రం చేద్దువు. రెండు సిగరెట్లు తెచ్చిచ్చిపో’
‘మేం తెచ్చాం మావయ్యా’ అంది అతడి భార్య టక్కున పాలిథిన్ కవర్ మీద చేయి వేస్తూ.‘ఉంచమ్మా. అవి పనికొస్తాయా నాకూ? నోటికే తప్ప గుండెకు చాలవు అవి. నువ్వు తేపోరా’ అన్నాడు.
అహ్మద్ పోబోతుంటే అతడు లేచాడు.‘నేను తెస్తాను సార్. స్కూల్లో ఉన్నప్పుడు నాకే కదా చెప్పేవారు. నన్ను తేనీయండి’ గుంజాటనగా నిలబడ్డాడు.
‘వద్దు కూచో. నువ్వు పోరా’ అన్నాడు అహ్మద్‌తో. అహ్మద్ కదిలాడు. సారు తన ఒడి మీదున్న టర్కీ టవల్‌ను ఇరు చేతుల మునివేళ్లతో పట్టుకుని సర్దుకున్నాడు.
సారు భార్య వంట చేయడానికి వెళ్లింది. అతడు, ఆమె అలాగే కూచుని ఉన్నారు. ఆమె సారు వైపు కంటే భర్త వైపే ఎక్కువగా చూస్తూ ఉంది ఎందుకో.
సారు చేతులు రుద్దుకుంటూ శిష్యుడితో మాటవరసకన్నట్టు చెప్పుకున్నాడు–‘రిటైర్ అయ్యాక ఇదిగో ఈ ఇల్లు కట్టుకున్నాం. దీనికి కూడా బయట ప్లాస్టరింగు ఈ మధ్యే చేయించాను. అమ్మాయి పెళ్లికి, ఇంటికి ఉన్నది మొత్తం అయ్యాక పెన్షన్‌తో బాగానే ఉండేదిలే. కాని షుగర్ దెబ్బ కొట్టింది. షుగర్ వచ్చినట్టే నాకు తెలియలేదు. తెలిశాక నేరుగా ఇన్సులిన్కే వెళ్లాల్సి వచ్చింది. డ్రిల్లు చేసిన శరీరం కదా ఏం కాదనుకున్నాను. ఇదిగో… ఈ కాలు బొటనవేలికి గాంగ్రెయిన్ మొదలయ్యింది. ఖర్చు. భయం. హైదరాబాద్‌లో మావాళ్ల చారిటీ హాస్పిటల్ ఉంది… చీప్ అనుకుని వెళ్లాను. మెడికల్ కాలేజీకి అటాచ్డ్ ఆస్పత్రి అది. జూనియర్ డాక్టర్లు పని గట్టుకుని అక్కడ ఉద్యోగాల్లో చేరతారు. ఎందుకంటే బీదా బిక్కి నాబోటి మిడిల్‌క్లాస్ వాళ్లు గుంపులు గుంపులు వైద్యానికి వస్తారు. వాళ్ల మీద చేయి సాపు అవుతుందట. తర్వాత తెలిసింది. ఇక్కడ పని చేసిన జూనియర్ డాక్టర్లని పెద్ద ఆస్పత్రులు అందుకే టక్కున తీసుకుంటాయి. వాళ్లు మొదట బొటనేలు తీసేస్తే ఇన్ఫెక్షన్ పాదానికి వచ్చింది. పాదం తీసేస్తే మోకాలి దాకా వచ్చింది. ప్రస్తుతం మోకాలు కిందకు తీసేశారు. ఇన్ఫెక్షన్ ఆగిపోయి ఉంటుందని ఆశ’… అన్నాడు.
మంచానికి రెండు చేతులూ బలంగా ఆన్చి నేలకు తాకించి ఉన్న కాలును ముందుకూ వెనక్కూ ఊపాడు.‘ఈ కాలు బలం పోలేదులే. కర్ర మీద నా పనులు నేను చేసుకుంటున్నా. కాకపోతే… ఇన్ని వందల మంది కేడెట్లకు సావధాన్ చెప్పి సరిగా నిలబడేట్టు చేశాను కదా నేను నిలబడలేనే అని ఇది. ఎవరైనా ఒక కొడుకు మాదిరి ఉంటే ఆ తీరు వేరు. ఈ అహ్మద్ రేపు వెళ్లిపోతే నాకు కొత్తగా శిష్యులు కూడా రారు’…ఆమె వైపు చూసి ‘అరెరె… ఎందుకు ఏడుస్తున్నావు తల్లి’ అన్నాడు.
ఆమె ఏం లేదు అన్నట్టుగా తల ఊపుతూ ‘వినే వచ్చాం మావయ్యా’ అంది.అతడు తల దించుకున్నవాడు ఎత్తి, భంగ పడుతున్నట్టుగా ‘పాస్‌పోర్టులు, వీసాలు చేయిస్తాను సార్’ అన్నాడు.
‘పాస్‌పోర్ట్‌లు, వీసాలు చేయిస్తావా?’ అన్నాడు సారు శిష్యుణ్ణే చూస్తూ.
ఆ చూపుకు అర్థమేమిటో వాళ్లు తెలుసుకునేలోపు సారు భార్య వచ్చింది.‘ఏమిటి.. నా కొడుకును అలా చూస్తున్నారు. సుదా… నువు రా… మసాలా లెక్క నీకు తెలుసు కదా’ అని వంట గదిలోకి పిలుచుకుని వెళ్లింది.
ఆ తర్వాత మాటలన్నీ అతని ఇద్దరు పిల్లల గురించే నడిచాయి. పెద్దది ఫోన్ తీసి అమెరికాలో తన హార్స్ రైడింగ్ వీడియోలు సారుకు చూపించింది. తాము పెంచుతున్న రిట్రీవర్‌ను చూపించింది. సారు భార్య ఆ పిల్లల కోసమని ఉప్పు కారం లేని పప్పు విడిగా చేసి చిన్నాణ్ణి చంకనేసుకొని దొడ్లో తిప్పుతూ, మధ్య మధ్య కుళాయి నీళ్లలో కడిగి కూర ముక్కలు తినిపించింది. గురుశిష్యులు ఎన్.సి.సిలో సాగిన పనిష్మెంట్లేవో గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.
భోజనం అయ్యాక అహ్మద్ తెచ్చి పెట్టి వెళ్లిన సిగరెట్లలో ఒకటి తృప్తిగా కాల్చాడు సారు.ఎండ వాలుతోంది.‘గూడూరంటే రెండు గంటలన్నా పడుతుంది. చీకటి పడ్డాక ఎందుకు. పిల్లలున్నారు. బయలుదేరండి. సుదా… మీ అత్తగార్ని మామగార్ని అడిగినట్టు చెప్పు. అమ్మాయ్… అంతా సడన్ సడన్‌గా ఉంది మీరు రావడం. నీకు ఏమీ పెట్టలేకపోతున్నా’ అంది సారు భార్య.
అతడు, ఆమె ఒకరినొకరు చూసుకున్నారు. పాలిథిన్ కవర్ అలాగే ఉంది. ఇవ్వు అన్నట్టు చూశాడు. ఆమె తటపటాయిస్తోంది.
సారు భార్య గమనించింది.‘ఈ చాక్లెట్ల వయసు కాదు మాది. ఈయనకు అవి విషం. మీరు తెచ్చినవి మాకేం ఉపయోగపడవు. ఇంకా బంధువులను కలుస్తారుగా వాళ్లకు ఇవ్వండి. చిన్న మినిస్టర్లూ… ఈ నానమ్మను గుర్తు పెట్టుకోండ్రోయ్’ అందామె.
బయలుదేరడమే మంచిదన్నట్టు చూస్తున్నాడు సారు.అతడు, ఆమె సారుకు మరోసారి మొక్కారు. సారు తన చేతిని అతడి తలకు తాకించాడు. సారు భార్య పిల్లల్ని చెరో చేత్తో పట్టుకొని నాప పలకల ముంగిలిలోకి వచ్చింది.
అతడు భార్యవైపే చూస్తున్నాడు.‘ఏంటి?’ అంది భార్య.‘ఏమైనా రహాస్యం చెబుతాడేమో వెళ్లు’ అంది సారు భార్య నవ్వుతూ.ఇద్దరూ ముంగిలిలోనే ఒక మూలకు వెళ్లారు.‘
ఏం చేయమంటావు?’ అన్నాడు పెదవులను అదిమి పెడుతూ.
‘మీకు దండం పెడతాను. గమ్మున రండి. చెక్ బయటకు తీయొద్దు. వాళ్ళు తీసుకోరు.
’‘ఎలా వదిలేస్తాను చెప్పు’‘ఇన్నాళ్లు వదిలేసినట్టుగానే. మనం ఎంత పెద్ద సాయం చేయాలన్నా అంత కంటే పెద్దగా బంధం ఉండాలండీ. గొలుసు తెగకుండా కాపాడుకోవాలి. హైరానా పడి వెంట్రుకను కూడా తాడుగా పేనుకోవాలి. ఐదేళ్లకో పదేళ్లకో మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్టుగా వస్తే దేవుళ్లు ఊరుకుంటారేమో మనుషులు ఊరుకోరండి. అనుభవించండి’ అంది
.‘అయ్యాయా.. రహస్యాలు’ సారు భార్య పెద్ద గొంతుతో అడిగింది.‘ఏం లేదులే అత్తయ్యా. ఈయనదేదో చాదస్తం’ అందామె.
‘నాకు తెలియదా’ అంది సారు భార్య.
‘కారు ఎక్కడ పెట్టారు’ అడిగింది.
‘ఈ సందులో పట్టదని రోడ్డు మీద పెట్టాం’ అతడి భార్య అంది.
అతడు ఇద్దరు పిల్లల్ని చేత బట్టుకుని, భార్యను పక్కన జేసుకొని మూడు మెట్లు దిగి ‘వెళ్లొస్తానన్నట్టు’ సారు భార్య వైపు చూశాడు
. ఆమె గేటు దాటి బయటికొచ్చి రోడ్డు వరకూ వస్తుందేమోనని ఒక్క క్షణం ఆగాడు.
ఆమె చేయి ఊపి గేటును వీధి వైపు నెట్టింది.
కిరకిరమని కఠోరమైన చప్పుడు చేస్తూ గేటు మూసుకుంది.
నవంబర్ 5, 2021
కథను –‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)
ఇది వనవాసి శబ్ద రూపకంలో చివరి యాభైవ భాగం. ఈ ఎపిసోడ్ లో చివరిగా రచయిత సొలొమోన్ విజయకుమార్ గారు ఈ ప్రయత్నంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు.
1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ' అరణ్యక్' పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి 'వనవాసి' అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.
From the publisher's feed

52 Listeners