Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • త్రిపుర గారి 'పాము'

    ‘త్రిపుర’ పేరు తో కథలు కవిత్వం రాసిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు గారు, తన విలక్షణమైన కథా శైలి తో ఎందరో అభిమానుల్ని సంపాదించుకోవటమే గాకుండా, అనేక మంది రచయితలకు ఆదర్శంగా నిలిచారు. 

    కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన త్రిపుర గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. 

    కథను అనల్ప పబ్లిషర్స్ ప్రచురించిన ‘త్రిపుర కథలు ‘ నించి తీసుకోవటం జరిగింది. 

    పుస్తకం కొనాలంటే – https://bit.ly/3mAwFhN

    శేషాచలపతిరావ్ అద్దంలో చూస్తూ దువ్వుకుంటూ “ఇవాళ నీ పేరు అలఖ్ నిరంజన్” అని చెప్పేడు అద్దంలోని శేషాచలపతిరావ్ తో. అద్దం లోని శేషా….నవ్వి “గొప్ప మజా, స్కౌండ్రల్ , నీసంగతేం చెప్పను. అవును కానీ, నీకు ఎడం పాపిడేమీ బాగులేదు ఇవాళ. కుడి పాపిడిలాగు. టై నాట్ కింద డింపుల్ బాగులేదు. షోల్డర్స్ ఇంకా స్క్వేర్ చెయ్యి” అన్నాడు.

    విండ్సర్ నాట్ కింద డింపుల్ దిద్ది, పాపిడి కుడిచేసి, మళ్ళీ బ్రష్ చేసి, బుగ్గల్లోని డింపుల్స్ ప్రాక్టీస్ చేసి, అద్దం పక్కని పిన్ చేసి ఉంచిన క్లాస్ రొటీన్ చూశాడు.

    “మొదటి రెండు పీరియడ్సూ ఉండాలి. మూడు, నాలుగూ స్కిప్ చెయ్యొచ్చు.”

    హాస్టల్ గేటు దాటుతూ “పవర్, ట్రెచరీ, ఎడ్వంచర్. నేను నేతాజీని, హిట్లర్ ని. వినండి, బుద్దిలేని, బలంలేని బాస్టర్డ్స్……… మిమ్మల్ని హత మార్చేస్తాను. పారా హుషార్…….. లక్షలు లక్షలుగా క్రిముల్లాగ బ్రతుకుతున్న మిమ్మల్ని రూపురేఖలు లేకుండా చేస్తాను……” పిడికిలి బిగపట్టి, హాస్టల్ వేపు కాలేజీవైపు చూపించి గట్టిగా చెయ్యి ఊపేడు.

    జోరుగా వచ్చే రిక్షాని తప్పించుకుని హిందీలో బూతులు తిట్టేడు.

    ‘మొదటి రెండు పీరియడ్స్ స్కిప్ చెయ్యొచ్చు. దశాశ్వమేథ్ ఘాట్ కి వెళ్తాను’ అని అనుకుంటూనే లైబ్రరీ వేపు తిరిగి, ‘అలఖ్ నిరంజన్! నిన్ను….నన్నే…..నేను డిసీవ్ చెయ్యగలను తెలుసా’ అని లైబ్రరీ వేపు నడవటం మొదలు పెట్టేడు.

    సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద గుట్టలు గుట్టలుగా రీబైండు చేసిన పుస్తకాల పేర్లు రెజిస్టెర్ లో రాసుకుంటున్నాడు. నేరుగా లోపలికి పోయి బీరువాల్లో పుస్తకాల టైటిల్స్ చూడటం మొదలు పెట్టేడు అలఖ్ నిరంజన్.

    చీర రెపరెపలు. సున్నితంగా మాటలు.

    కంటి చివరినుంచి చూస్తే, సెక్షన్ లైబ్రేరియన్ టేబుల్ మీద వేళ్ళు. లేడి…….. జింక…… డీర్.

    ముఖం తిప్పి చూసేడు. తనవేపే చూస్తూంది ఉమాడే.

    అప్రయత్నంగా కళ్ళతో నవ్వేడు అలఖ్, అప్రయత్నంగా కళ్ళతో నవ్వడం అలవాటు చేసుకున్న నిరంజన్.

    హిందీలో అంది : “నా కార్డ్ మర్చిపోయాను. శనివారం త్రివేదీ సెమినార్ లో ఎస్సే సబ్మిట్ చెయ్యాలి. మీకార్డ్ మీద ఛాసర్ మీద బుక్స్ ఏమేనా ఇప్పిస్తారా?”

    ఆ క్షణంలో చిరునవ్వు మాయమయి పోయింది నిరంజన్ కళ్ళల్లో, క్షణంలో కళ్ళల్లోని నవ్వుని మాయం చెయ్యడం అలవాటు చేసుకున్న అలఖ్ కళ్ళల్లో. ఇంగ్లీషులో అన్నాడు : “కారిడార్ లోకి రండి.”

    గాజు అద్దాల కిటికీ దగ్గరగా వెళ్ళి, వెనక్కి తిరిగి కోపంగా అన్నాడు, “నా కార్డ్ ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరగను, మీరెవరో నాకింకా బాగా తెలియదు. తెలియని ఆడవాళ్ళందరికీ సహాయం చేసే షివల్రస్ మనిషిని కాను.”

    ఉమా కళ్ళలో మెరుపులాగా కోపం………

    “ఇవ్వకపోతే యివ్వనని మృదువుగా చెప్పొచ్చు. గొంతుకలో అంత థండర్ అవసరం లేదు.”

    విసురుగా చీర మెరుపు మాయమయింది.

    మళ్ళీ తెర ఎత్తబడింది. తను అనుకోకుండానే అకస్మాత్తుగా. అయితే, తన భవిష్యత్తుకి ఆకారం తానే యిస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది తను ఎప్పుడో ఊహించి మనస్సు మారుమూలల్లో తొక్కి పడేసి ఉంచిన నాటకంలోని ఒక భాగం.

    తెర ఎత్తేసింది కాలం, కాస్త ముందుగానే. అయితే తను ఎప్పుడూ సిద్ధమే.

     “జగదేవ్…..జగదేవ్…..” “ఈ అల్మైరా తాళాలియ్యి.”

    తాళాలు తీసుకుని బీరువా తెరిచి రెండు పుస్తకాలు తిరగేశాడు. జగదేవ్ అక్కడే నిలబడ్డాడు.

    ఒక చివరన ఇషరవుడ్ నావల్ ఒకటి కనిపించింది.

    “ఇదిగో! నువ్వు అన్నిరకాల మనుషులకి తాళాలిచ్చేస్తావ్. ఎలా అడ్డదిడ్డంగా పెట్టేశారో చూడు. ఈ పుస్తకం యిక్కడేమిటి చేస్తూంది. తీసుకువెళ్ళి ఫిక్షన్లో పెట్టు. మీకు బుద్ధిరాదు. ఎన్నిసార్లు లైబ్రేరియన్ చేత తిట్లు తిన్నా.” జగదేవ్ గొణుక్కుంటూ పుస్తకం తీసుకుపోయేడు.

    అల్మైరాలోంచి ఛాసర్ మీద లెగూయీ రాసిన పుస్తకం పైకి తీసేడు. కోట్ ప్రక్కకిలాగి, షర్ట్ కి, బెల్ట్ కి మధ్య పుస్తకాన్ని తోసి, మళ్ళీ కోటు గుండీలు పెట్టాడు. ఎడం చెయ్యి అడ్డంగా పెట్టుకుని జగదేవ్ ని పిలిచి తాళాలు యిచ్చేశాడు.

    కౌంటర్ దగ్గర:

     “పండిట్జీ, ఇంకా కాస్త విజిలెంట్ గా ఉండాలి. పుస్తకాల దొంగలు ఎక్కువయి పోయారు. ఇవాళ నాకు కావలసినవి ఒకటి కనిపించలేదు. ఇష్యూకూడా అవలేదు. మీరింత ఇనెఫిషెన్ట్ గా ఉంటే మేము కంప్లెయిన్ చెయ్యవలసొస్తుంది.” కోపంగా వికెట్ తోసుకుని విసురుగా పైకి వచ్చేశాడు అలఖ్ నిరంజన్.

    లైబ్రరీ దగ్గర చెట్టుకింద కేంటీన్.

    చెట్టుకింద బల్లమీద కూర్చుని నాలుగు సమోసాలు తిని, టీ తాగుతూ చుట్టూ ముసిరే ఎర్ర కందిరీగల్ని ఛాసర్ తో అప్పటికే ఆరు చంపేడు.

    ‘ఇంకో అయిదు నిమిషాల్లోపల ఉమ పైకి రావాలి….వచ్చి తీరాలి’ అనుకున్నాడు. రిస్ట్ వాచ్ విప్పి చేత్తో పట్టుకున్నాడు. సాసర్ బల్లమీద ఉంచి, కప్ మాత్రం చేత్తో పట్టుకుని లైబ్రరీ వేపు తిరిగి నిలబడ్డాడు….. నాలుగు నిముషాల నలభయి సెకండ్లు…..నలభయిఐదు….ఏభయి…. ఏభయి ఎనిమిది….అయిదు నిముషాలు.

    ఉమ లైబ్రరీ మెట్లు దిగి వస్తుంది. దగ్గరగా వచ్చింది.

    “హలో! మీరు రెండు సెకండ్లు ఆలస్యం. చూశారా స్టాప్ వాచ్ లాగ పట్టుకుని ఎలా లెఖ్క పెడ్తున్నానో. ఈసారికి క్షమించేను….రండి, మేనర్సు గురించి బాధపడితే మీకు కావాల్సిన బుక్ దొరకదు. మీ హృదయంలోని మిక్సెడ్ ఫీలింగ్స్ నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా……”

    ముందుకు, దగ్గరగా అడుగు వేసింది ఉమ.

    “……. అయినా, మీరు వప్పుకుంటారు…..రండి.” 

    ఉమ నవ్వింది. బెంచ్ మీద కూర్చుంది.

    “గులాబ్ జామున్ కూడా చేశాడు శర్మాజీ. స్వీట్స్ అంటే అసహ్యం నాకు. స్వీట్స్ అంటే ఇష్టపడే వాళ్ళని మెషిన గాన్ తో షూట్ చేద్దామనిపిస్తుంది. కాబట్టి సమోసాలు. ఏమంటారు. అండ్ టీ…..ఇదిగో మీకు కావలసిన పుస్తకం. మన ఫ్యూచర్ అసోసియేషన్ కి చిహ్నంగా యీ ఆరు కందిరీగల కళేబరాల్ని ఛాసర్ తో చంపి సిద్ధంగా ఉంచేను…..వద్దు. మీరు మాట్లాడటానికి ప్రయత్నించకండి. నేనే అంతా మాట్లాడేసిన తరువాత మీకు అవకాశం యిస్తాను……మీరు నాకు జూనియర్. మీ పేరు ఉమాడే. గౌహతిలో బి.ఏ. చదివేరు. ఇక్కడ బెంగాలీ టోలాలో అంకుల్ దగ్గర ఉన్నారు….. 

    తరువాత, నా సంగతి. బెలూచిస్తాన్, జర్మనీ నా స్పిరిట్యుయల్ హోమ్స్. ఇంఫాల్లో ఫోర్టీన్త్ ఆర్మీలో పనిచేశాను. కెప్టెన్ గా, కోర్ట్ మార్షల్ చేసేరు కారణాంతరాలవల్ల. 

    ఇక్కడ ముప్పయి సంవత్సరాల వయస్సులో – యూనివర్సిటీలో చదవటానికి కారణాలు :

    ఒక్కొక్క వేలు ముడుస్తూ చెప్పేడు. “….ఒకటి : నాకు హోమ్ లేదు. బంధువులు లేరు. రెండు: ఉద్యోగాలు చెయ్యటానికి కావలసిన టెంపర్మెంట్ లేదు. మూడు : హోటల్స్ లో ఎప్పుడూ ఉండటానికి కావలసిన డబ్బు లేదు. నాలుగు : యూనివర్సిటీలో చదువు నా ఎస్టిమేట్ ప్రకారం చాలా చవక.”

    “చూశారా….నాలుగు నిముషాల్లో, నాలుగు నెలల పరిచయం అయితేగాని తెలియని విషయాలన్నీ చెప్పేశాను. కాలానికి ఏదీ వదిలెయ్యకూడదు……”

    సమోసాలు, టీ వచ్చాయి. ఉమ తినడం మొదలు పెట్టింది.

    “రిమార్కబుల్. మీరు రెండు వేళ్ళతో సమోసాలని చిన్న చిన్న ముక్కలుచేసి గ్రేస్ ఫుల్ గా నోట్లో పెట్టుకుని అవి బాధతో ఏడుస్తాయేమో అన్న భయంతో మెల్ల మెల్లగా తినడం అలవాటు చేసుకోలేదు. ఎడ్మిరబుల్.”

    సమోసాలు అయిపోయాయి. “ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు.”

    “మీరు విచిత్రమయిన వ్యక్తులు. అన్ని విషయాలు చెప్పేరుగాని మీ దగ్గర లైబ్రరీ కార్డ్ లేకుండానే యీ పుస్తకం ఎలా తెచ్చారో చెప్పలేదు.”

    కుడిచేతి వేళ్ళ గోళ్ళతో బెంచ్ మీద వరసగా చప్పుడు చెయ్యడం మొదలు పెట్టేడు. “హార్స్ రైడింగ్ యిన్ చండికా… చాలా కాలం క్రింద చండిక అనే ఫిల్మ్ చూశాను. అందులో గుర్రాలు పరుగెడుతూంటే యిదే చప్పుడు. చండికా ఆన్ హార్స్ బేక్…..ఐదడుగుల పదకొండున్నర అంగుళాల పొడవూ, నూట ఎనభయి పోన్ల బరువూ మనిషిని. ఈ పది ఔన్సుల బరువు పుస్తకాన్ని తేడానికి లైబ్రరీ కార్డ్ ఉండాలా?….. ఇష్యూ కౌంటర్ దగ్గర పండిట్జీ బాగా తెలుసులెండి. అడిగి తెచ్చాను. – మీరు నాలుగు రోజులుంచుకుని నాకు తిరిగి యిచ్చేయండి.”

    ఉమ తెలివైన పిల్ల.

    అంది : “నన్నొకమాట చెప్పనిస్తారా. మీరు చాలా నెర్వెస్ మనుష్యులనుకుంటాను. దాన్ని కప్పి పుచ్చడానికి ఈ విధంగా మాట్లాడతారు….. అంతేనా?” 

    ఉమ కళ్ళల్లోకి సూటిగా, తీవ్రంగా చూశాడు నిరంజన్.

    “మీరు సైకాలజీ పుస్తకాలు చదివినట్లున్నారు. లేకపోతే ఎవరో అంటే విన్నారు. అంత సులభంగా లేబుల్ అంటించీకండి. మీ మంచికి చెప్తున్నాను. నేను డేం.జ….ర…స్ మనిషిని.”

    “శర్మా జీ?” 

    రూపాయినోటు యిచ్చి చిల్లర తీసుకున్నాడు.

    “నన్ను మరచిపోండి. ఈ సెప్టెంబర్ వెదర్ నన్ను సరదాగా మాట్లాడటానికి ప్రోత్సహించింది. అంతే. మీకింకా చిన్న వయస్సు. గుడ్ బై!” లేచి గిరుక్కున తిరిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బిర్లా హాస్టల్ వేపు నడిచిపోయాడు. అలా పెద్ద పెద్ద – అడుగులు వేస్తూ నడవడం అలవాటయిపోయిన అలఖ్.

    బ్రోచా హాస్టల్ దగ్గర బస్ ఎక్కేడు. ఖాళీగా ఉంది. 

    గోడోలియాకి రెండు టిక్కట్లు అడిగేడు. “ఒక్కడికే రెండెందుకూ” అడిగేడు కండక్టర్. “అది నీకవసరం లేదు. ఒకటినాకూ, రెండోది నా స్పిరిట్ కి” అన్నాడు అలఖ్. 

    రూయా హాస్టల్ స్టాప్ దగ్గర అమెరికన్లా కనిపించే ఒక జంట ఎక్కేరు. అతను లావుగా, పొట్టిగా. ఆమె సన్నగా, పొడుగ్గా, అందంగా.

    “లైక్ ఏ క్వీన్’ అనుకున్నాడు. క్రిందటి సాయంత్రం సాన్ ఫ్రాన్సిస్కో నుంచి పెద్ద గ్రూప్ దిగిందట. ఆ గ్రూప్లోని వాళ్ళే గాబోలు అనుకున్నాడు.

    కండక్టర్ తో “గేంజిస్ కి టికెట్స్” అన్నారు వాళ్ళు. కండక్టర్ కి బోధపడలేదు.

    “గోడోలియాకి యియ్యి” అన్నాడు అలఖ్,

    వాళ్ళవేపు చూసి అన్నాడు. “మీకు యిష్టమయితే సహాయం చెయ్యగలను? నేను గూడా గేంజిస్ వేపే వెళుతున్నాను.”

    థాంక్స్ తో ఉక్కిరి బిక్కిరి చేసిన తరువాత అన్నారు. “గ్రూప్ తో తిరగడం థ్రిల్లింగ్ గా ఉండదు మాకు. అందుకే ముందుగా బయలు దేరేము. లక్కీగా నువ్వు కలిసేవు.”

    “నువ్వు హిందూవేనా? ఇజిప్షన్‌లాగో , స్పానియార్డ్ లాగో ఉన్నావు” అని అడిగేడు మగ అమెరికన్.

    పరిచయం చేసేడు : “నా పేరు జేమ్స్ ఎలియట్. ఈమె మిసెస్ ఎలియట్… క్వీనీ ఎలియట్.”

    ‘లైకే క్వీన్!’ నిజమే అనుకున్నాడు నిరంజన్,

    “నేను హిందూనికాను. ముస్లిమ్ ని. నా పేరు బైరాంఖాన్. మీరు గెంజిస్ చూడొచ్చు. కాని టెంపుల్స్ లోకి రానీయరు.”

    “ఇదిగో యిక్కడే దిగాలి.” క్వీనీ దిగడానికి తన చెయ్యి యిచ్చి సహాయం చేశాడు. 

    ముగ్గురూ దశాశ్వమేథ్ వేపు నడిచారు. జేమ్సు, క్వీనీ దృశ్యాల్ని తాగుతున్నారు! లస్సీ దుకాణంలో బెంచ్ మీద కూర్చున్నారు. 

    ఛోక్రాని పిలిచి “మూడు గ్లాస్లు తీసుకురా. బాగా భంగ్ కలుపు” అన్నాడు.

    అప్పుడే కలలోంచి లేచి ప్రపంచాన్ని కొత్తకళ్ళతో చూస్తున్నట్లు చూస్తున్నాడు, జేమ్సు గుంపులుగా రోడ్ మీద నడిచే ఇండియన్ ప్రజల్ని, టాంగాల్ని, ఎక్కాల్నీ.

    క్వీనీ మధురమైన స్వరంతో, “నువ్వు యూనివర్సిటీలో చదువుతున్నావా?” అని అడిగింది.

    “ఇక్కడ యూనివర్సిటీలో యిడియట్స్ తప్ప ఎవరూ చదవరు. నేను తోళ్ళ వర్తకం చేస్తాను. యూనివర్సిటీ డైరీలో ముసలి ఆవులు బేరానికొస్తే కొనడానికి వచ్చేను. నాది మీర్జాపూర్ హెడ్ క్వార్టర్స్.”

    ఛోక్రా లస్సీ తెచ్చి టేబుల్ మీద పెట్టేడు.

    ““ఇందులో భంగ్ వేయించేను. చాలా థ్రిల్లింగ్ డ్రింక్” అని జేమ్సు చెవిలో ఏదో అన్నాడు. జేమ్సు మొదట షాక్ అయి, తరువాత ఏమనాలో తెలియక నవ్వేడు.

    లస్సీ మెల్లగా తాగేరు ముగ్గురూ.

    జేమ్సు ఎంతయిందో అడిగి, జేబులోంచి వాలిట్ తీసి, మెల్లగా కూడబలుకుతూ లెక్క పెట్టి యిచ్చేడు. వాలిట్ లావుగా, నోట్లతో వానాకాలం కప్పలాగుంది.

    “పదండి గేంజిస్ దగ్గరకు పోదాం.” ఘాట్ వేపు నడిచేరు.

    వెల్లువతో గంగానది బురదనీరు ఉరకలేస్తూ ప్రవహిస్తూంది. విజృంభించి మెట్లమీద కెరటాలు పగిలి సుడిగా వెనక్కి తిరుగుతున్నాయి.

    “క్రాస్ చేద్దామా “

    “వయొలెంట్ గా ఉన్నట్లుంది. అవేనా బోట్స్? చాలా ఫ్లెమ్సీగా కనిపిస్తున్నాయి” . అన్నాడు జేమ్సు.

    “ఏం భయం లేదు. ఇంతకంటే వరద ఎక్కువ వున్నప్పుడు కూడా తీసుకుపోతారు యీ పడవ వాళ్ళు. పోనీ డౌన్ స్ట్రీమ్ పోదామా?”

    జేమ్సు ముఖంలో భయం. “వద్దు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు, క్వీనీ – కూడా ఉంది.”

    థ్రిల్స్ కావాలి నీకు. కవర్డ్. 

    “సరే, నీకేమేనా బనారస్ బ్రోకేడ్స్ కావాలా?” అడిగేడు క్వీనీని.

    క్వీనీ ముఖంలో సంతోషం. “చాలా కొందామని ఉంది. ఆ దుకాణాలకి తీసుకువెళ్ళు…….ప్లీజ్!”

    విశ్వనాథ్ గల్లీలోకి తీసుకువెళ్తూ ఆగేడు అలఖ్.

    జేమ్సుతో అన్నాడు: “ఇక్కడ జేబుదొంగలు ఎక్కువ. మీ దగ్గర వాలిట్ మ వుంచడం మంచిది కాదు. ఇక్కడ జేబుకొట్టే వాళ్ళందరూ నాకు తెలుసు. వాలిట్ నా దగ్గరుంచితే ఏ భయమూ లేదు.”

    జేమ్స్ తొందరగా కోట్ లోపలి జేబులోంచి వాలిట్ తీసి అలఖ్ కి యిస్తూ “ముందే చెప్పినందుకు చాలా థేంక్స్” అన్నాడు.

    గల్లీలోకి వెళ్ళారు.

    చాలా రద్దీగా ఉంది. క్వీనీ దుకాణాల్లో వేళ్లాడగట్టిన చీరెల్నీ, కంచు, యిత్తడి సామానుల్ని ఆశ్చర్యంగా చూస్తూంది.

    జేమ్సు పొట్టి కాళ్ళతో వెనుక నడుస్తున్నాడు. దుకాణాల పేర్లు కాకుల్లాగ పిలుస్తున్నారు. 

    బీహారీ పల్లెటూరు గుంపొకటి గొడవ చేస్తూ ముందు నడుస్తుంది.

     ఆబోతు ఎదురుగా రంకె వేస్తూ వేగంగా దూసుకుంటూ పరుగెత్తుతూ వచ్చింది….

    బీహారీ గుంపు అరుచుకుంటూ చెదిరిపోయి వెనక్కి ముందుకూ గోల పెడుతూ పరుగెడుతూంటే …….

    ‘రన్’ అని గట్టిగా అరిచి, ఇద్దరి చేతులూ పట్టుకుని పరుగెత్తేడు. “వాట్ ద హెల్ యీస్ ద మేటర్ నౌ” అంటూ పొట్టికాళ్ళ జేమ్స్ చెయ్యి విదిలించుకుంటూ అడిగేడు.

    “…… హిందూ ముస్లిమ్ రయట్” క్వీనీ చెయ్యి పట్టుకుని పరిగెత్తుతూనే అన్నాడు.

    బీహారీ మూక మధ్య జొరబడ్డారు.

    క్వీనీ చెయ్యి కూడా వదిలి అలఖ్ ఇంకా వేగంగా ముందుకు దూసుకుపోయి గల్లీలోంచి పైకి పోయాడు.

    చౌక్లోంచి కట్ చేసి యింకో చిన్న గల్లీలో జొరబడి ‘సంగమ్’ బార్ చేరుకున్నాడు.

    గట్టిగా వూపిరి బిగించి ఒక నిముషం నిలబడ్డాడు. పేంట్ జేబులో చెయ్యి పెట్టి బరువుగా, డబ్బుగా ఉన్న వాలిట్ ని సంతృప్తిగా తడిమేడు. వాలిట్ పైకి తీసి, నోట్లు పైకి లాగి, వాలిట్ని కాలవలో విసిరేశాడు. బార్ లోపల అడుగు పెట్టేడు. సగం బార్ నిశ్శబ్దంగా ఉంది. హాల్ అద్దంలో జుత్తు దువ్వుకుని, రుమాలుతో ముఖం తుడుచుకున్నాడు. జేబులో నోట్లు మళ్ళీ చూసుకున్నాడు. అరవయికి పైగా పది రూపాయల నోట్లు. అద్దంలో చూస్తూ, కుడికన్ను గట్టిగా మూసి నాలిక పైకి పెట్టి మళ్ళీ లోపలికి మడిచి, ఎడం చెయ్యి చూపుడువేలు పెదవులమీద నిలువుగా నిలిపి మెల్లగా అన్నాడు, “ఎవరికి చెప్పొద్దు…..సక్కర్స్.”

    బాలో నిశ్శబ్దం. బూత్ లో తొంగిచూస్తే ఎవరూ లేరు. పక్క గదిలో బెనర్జీ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు. కునుకు తీస్తున్నాడు బెనర్జీ, డెస్క్ మీద ముఖం పెట్టుకుని. చప్పుడు చెయ్యకుండా డెస్క్ మీద తాళాలు తీసి, వెనక గదిలోకి వెళ్ళి బీరువా తెరిచాడు. క్రింద అరలో కారూస్ జిన్ బాటిల్ తీశాడు. బెనర్జీ దగ్గరకు వచ్చాడు. డెస్క్ మీద వంగి బెనర్జీ వీపు మీద గట్టిగా చరిచాడు. ఉలిక్కిపడి కోపంగా, బాధగా, భయంగా, అర్థం లేని అరుపులు అరుస్తూ లేచాడు బెనర్జీ,

    కళ్ళు రెపరెపలాడించి శేషాచలపతిని చూసి బెంగాలీలో అన్నాడు:

    “అబ్బ ఎంత దెబ్బ కొట్టేవు రావు బాబూ. ఇంత మిట్ట మధ్యాహ్నం వచ్చేవేమిటి. ఎవరూ లేరు కుర్రాళ్ళు!”

    “నువ్వు యిలా తలుపులు తీసి పెట్టి కునుకు తీస్తుంటే లిక్కర్ స్టోర్ అంతా ఖాళీ అవుతుంది ఒక గంటలోనే. ఐస్ ఉందేమో చూడు.” 

    బెనర్జి లోపలికి వెళ్ళాడు ఐస్ కోసం.

    అలఖ్ అక్కడే సోఫాలో కూర్చుని బాటిల్ మూత తీసేడు.

    బెనరీ ట్రయిలో ఐస్, వైన్ గ్లాసులు, నిమ్మకాయలు పట్టుకొచ్చాడు. గ్లాసులు మూడు పెగ్లు జిన్ పోసి ఐస్ ముక్కలు వేసి బెనర్జి కొకటి యిచ్చి, తను చెయ్యడం మొదలు పెట్టేడు.

    బెనర్జీ గడగడ తాగేసి గ్లాస్ ఖాళీ చేసి మాట్లాడటానికి గొంతు సవరించు కుంటుంటే, “మాట్లాడొద్దు. నన్ను వదిలి నీ పని నువ్వు చూసుకో – అంటే, మళ్ళీ ముఖం డెస్క్ మీద పెట్టి పడుకో” అన్నాడు అలఖ్.

    బెనర్జీ కళ్ళు మూసుకునే చిరునవ్వు నవ్వి తిరిగి సమాధిలోకి వెళ్ళిపోయాడు…..

    కుడి జేబులో ఆరు వందల రూపాయలు, ఎడం జేబులో ఉమాడేకి జాగా. సెంటిమెంటల్ మూడ్ లోకి పోవచ్చు.

    …….బాల్యం…. …. బాల్యపు అనుభూతులు….బాల్యం నన్ను విరామం లేకుండా మెత్తగా వెంటాడుతూంది. ఏళ్ళు గడిచిన కొలదీ, ఎడారి లాంటి “యథార్థం’ గుండెల్లో బలమైన వ్రేళ్ళతో పాతుకుపోయి స్థిరపడ్డ కొలదీ, ….నా వెనుకనే నీడలా వచ్చి వీపు మీద పచ్చటి వేళ్ళతో తట్టి పిలుస్తున్నారెవరో….. జీవితానికి అర్థం లేదు,

    అంతా శూన్యం అని తెలుస్తున్న కొలదీ, నా పూర్ణ శక్తితో వెనక్కి….వెనక్కి పరుగెడుదామను కుంటాను…..తిరిగి, నా బాల్యంలోకి….. క్షణానికీ, క్షణానికీ, క్రియకీ, క్రియకీ సంబంధం లేకుండా బ్రతకడం…………”

    పవర్, ట్రెచరీ….

    జిన్ కైపు ఎక్కిస్తూంటే వాచాలత్వం, దెబ్బలాడడం సోపానాలు స్కిప్ చేసి సెంటిమెంటల్ మూడ్లో ప్రవేశించి అందులోంచి మెల్లగా జరిగి, కళ్ళనీళ్ళ ప్రవాహంలో పడ్డాడు.

    సాయంకాలం ఏడు గంటలకు యింకా కొంచెం మత్తు ఉండగానే, మెల్లగా తూలుకుంటూ హాస్టల్ చేరుకున్నాడు శేషాచలపతి.

    బట్టలన్నీ విప్పేసి నగ్నంగా మంచం మీద పడుకొని, పది నిముషాల తరువాత చల్లటి నీరుతో ముఖం కడుక్కుని, అద్దంలో చూసుకుంటూ “ఎలా ఉంది. అలఖ్ నిరంజన్, యీ దినం?” అని అడిగేడు అద్దంలోని శేషాచలపతిని..

    “రేపు నీ పేరు సాల్వడార్ డాలీ. ఏం చేస్తావో” అని అద్దంలోని శేషాచలపతి విషపు నవ్వు ఒకటి మధురంగా నవ్వేడు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    23 min
  • 'సమాంతరాలు' - పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

    ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

    ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో .

    పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

    ఆడియో వినడానికి మై ఆడియో బైట్స్ ఆప్ ని ఉపయోగించండి. (https://web.myaudiobits.com/#/audio-bits)

    తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత. శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.

    ఇంటర్వ్యూ:

    సమాంతరాలు కథా సంకలనం వెలువడిన సందర్భంగా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారితో హర్షణీయం సంభాషణ

    హర్షణీయం : ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటంటే బహుశా మొట్ట మొదటి సారి తెలుగులో ఛాయా రిసోర్సెస్ సెంటర్ నుంచి ప్రింట్ వర్షన్, ఆడియో బైట్స్ నుంచి ఆడియో స్టోరీ వర్షన్ రెండూ ఒకే సారి రిలీజ్ అవుతున్నాయి. మోహన్ గారు, ఆడియో వర్షన్ పై మీ అంచనాలేంటి? ఎందుకంటే, ఇప్పుడిప్పుడే ఆడియో వర్షన్ పాపులర్ అవుతోంది కదా?

    ఛాయా మోహన్ : మనకు ఇప్పుడు వచ్చే తరాలు, ముప్పై ఏళ్లలోపు పిల్లలెవరికీ కూడా చదవడం రాదు. కనుక, ఖచ్చితంగా ఆడియో ఈజ్ గోయింగ్ టు ది ఫ్యూచర్. దాన్ని మొట్ట మొదట మనం మొదలుబెట్టడం అనేది ఆశ్చర్యం, బావుంది. ఆశ్చర్యం ఎందుకంటే, అది అనుకోకుండా జరిగింది. అది కూడా మా కండిషన్ ఏంటంటే ప్రింట్ వర్షన్ తో పాటు, ఆడియో కూడా రావాలని గట్టిగా చెప్పడంతోని వాళ్లు సరే అన్నారు. అది ఒక కండిషన్. చూద్దాం………, This is going to be a good beginning. It is going to be a Landmark Thing అని చెప్పగలను.

    హర్షణీయం : శాస్త్రిగారు, మీరు ఈ పుస్తకంలో ఐదు కథలు రాశారు. ఇంతకు ముందు కూడా రామేశ్వరం కాకులు, పతంజలి శాస్త్రి కథలు, నలుపు ఎరుపు అని మూడు సంపుటాలు వచ్చాయి. ఆ కథలకి, ఇప్పుడు ఈ పుస్తకంలో మీరు రాసిన కథలకీ స్వరూప స్వభావాల్లో ఏమైనా తేడాలున్నాయా?

    పతంజలి శాస్త్రి : There is a thematic undercurrent. ఒక రకమైన ఏక సూత్రత ఉంటుంది. అందువల్ల బహుశా మోహన్ గారు, మిగతా కథలు ఇందులోంచి తీసి వేరే సంకలనం వేద్దాం అన్నారు. ఇవి ఇట్లా ఉన్నాయి కనుక బావుంటుంది అని నిర్ణయించారు. మొదట్లో నేను ఒప్పుకోలేదు. తరువాత ఆయన చెప్పినదాంట్లో నిజం ఉందనిపించింది. ఇప్పుడు, గతంలో నేను రాసిన కథల్లో కూడా ఈ రకమైన ఆలోచన, దృక్పథం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనవాళ్లు ఫిలాసఫీ లేదా తాత్విక దృక్పథం అంటుంటారు. తెలుగుదేశంలో ఒక ప్రత్యేకమైన అవ్యవస్థ ఉంది. ఫిలాసఫీ అన్నా, లేదా ఈ రచనకి ఒక తాత్విక దృక్పథం ఉందని అన్నా వాళ్లు ఏమనుకుంటారంటే ఇదేదో నేల విడిచి సాము చేసే వ్యవహారం ఏదో చేస్తున్నాడని, నిజ జీవితంతో మనకి తెలిసినటువంటి వాస్తవమైన పరిస్థితులతో సంబంధంలేని ఒక మాయ ఏదో చేస్తున్నాడని అనుకుంటారు. మిగతా చోట్ల అట్లా అనుకోరనుకుంటా. ఈ జీవితాన్ని మనం ఎట్లా చూడాలి? ఏరకంగా చూడాలి? ఏ పరిస్థితిలో ఈ జీవితాన్ని మామూలుగా మనం చూసే పద్ధతిలో కాకుండా వేరే రకంగా చూడడం జరుగుతుంది? ఇట్లా అనేక ప్రశ్నలు మనకి అప్పుడప్పుడూ ఎదురవుతూ ఉంటాయి. అట్లా జరిగినటువంటి నాలుగో ఐదో భిన్నమైనటువంటి సందర్భాలు ఈ కథలు. 

    ఈ పుస్తకానికి ముందుమాట కాదు కానీ, కేవలం ఒక అరడజను వాక్యాలు రాశాను. ‘‘మీ కథలు అర్థం కావని ’’ బహుశా తరుచుగా వినడం వల్ల నేనలా రాశానేమో తెలీదు. అయితే, నిజం చెప్పాలంటే నేను తరువాత చదువుకున్నాను మోహన్ గారు ప్రింట్ పంపించిన తరువాత. 

    నా కథలెలా ఉన్నాయో ఈ ముందు మాట కూడా అలాగే ఉంది. you know what I mean (నవ్వుతూ)… అంటే, ఏమవుతుందో తెలీదు కానీ ఏదో చెప్పాలనుకుంటున్నాను. 

    ఈ కథల్లో నేనేమన్నానంటే ‘‘ఓర వాకిలిగా వేసిఉన్న గది లాంటివి నా కథలు చాలా భాగం. మనం తలుపు తోసి లోపలికి వెళ్తే, ముఖ్యంగా వాటి ఆంతరిక ప్రపంచం కనిపిస్తుంది’’ అని రాశాను. నా కథలు మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో ఉండే నిర్మాణ సంబంధమైన ప్రత్యేకతల కంటే కూడా ఇటువంటి ఒక చింతన, ఒక ఆలోచన, ఒక ప్రవాహశీలత, ఒక ప్రవాహ లక్షణం కనిపిస్తుంది. సాధారణ ప్లేన్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే ‘‘ఇట్స్ ఏ ఫ్లోయింగ్ మూడ్.’’ ఆ ఇతివృత్తానికి సంబంధించిన ఒక మూడ్ ఏదైతే ఉందో, మీరు అట్ల లోపలికి వెళ్లి వాళ్లతో రెండు మాటలు మాట్లాడగానే, మీరు అందులోకి ప్రవేశిస్తే మెల్లగా పడవలో ప్రవాహంతో పాటు వెళ్తున్నట్టుగా మీరు కూడా ప్రయాణం చేస్తారు.

    హర్షణీయం : ఈ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ మా మధ్య జరిగింది. మా గిరి బాగా కథలు చదువుతాడు. వాడు ‘‘రేమండ్ కార్వర్, టోబయాస్ ఉల్ఫ్ లాంటి మినిమలిస్టిక్ మూమెంట్ రైటర్స్ ఉన్నారు’’ అని చెబుతూ లిటరరీ మినిమలిజం అంటే ఏందనేది నాలుగైదు వాక్యాలు పంపించాడు. నేను ఇప్పుడు దాన్ని చదువుతాను. ‘‘Literary minimalism is often expressed through the use of short or short short stories, that are nearly plotless. They treat isolated moments, or seemingly random in significant events, where the reader is put to some thought in what really happened. The reader has to reflect about the issues presented that lie under need the story just unfolded.’’ 

    పతంజలి శాస్త్రి : నేనైతే ఆ మినిమలిస్ట్ ధోరణి అని ఏదైతే మీరంటున్నారో దాని గురించి నేనేమీ చదవలేదు. కానీ నాకు మొదటి నుంచి కూడా క్లుప్తత నాకు చాలా ఇష్టమైన విషయం. కథలకు సంబంధించినంతవరకు క్లుప్తంగా, గుప్తంగా చెప్పడం. ఊరికే అట్లాగ సజెస్టివ్ గా చెప్తూ, ధ్వని అంటే పాఠకుడికి ఇతనేం చెబుతున్నాడు, ఎలా అని ఆలోచించే అవకాశం కల్పించాలని నాకు మొదటి నుంచీ ఉండేది. దానికి గుప్తత అనేది నాకు సహజంగా అలవడ్డది. వాస్తవానికి అందులో ఇంకో భాగం ఏంటంటే understatement నాకు చాలా ఇష్టం. 

    నేను ఇంగ్లీష్ భాషను భాగా ఇష్టపడడానికి ఒక కారణం వాళ్ల understatement. చాలా నచ్చుతుంది నాకు. అదొకటి. రెండొవది ఏంటంటే నేను సినిమాలు బాగా చూస్తాను. అనేక ప్రపంచ భాషల్లో ఉండే గొప్ప సినిమాలు. ఈ కోవిడ్ లో నేను యాభై, అరవై సినిమాలు చూశాను. ఏంటంటే స్ర్కీన్ ప్లే కాదు, మంచి నటుల ఫిల్మ్ యాక్టింగ్ లో కనిపించే understatement ఉంటుంది చూశారా? అది నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. అందుచేత ఇవన్నీ నా మీద ప్రభావం చూపాయి. అందుచేత నేను రాసేటప్పుడు పాఠకుడి అంతా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు కాకుండా గుప్తంగా చెప్పింది కొంత, చెప్పంది ఎక్కువగా ఉండే ఏర్పాటు చేస్తుంటాను. నా ఉద్దేశ్యం ఏంటంటే అటువంటి పరిశ్రమ గనుక పాఠకుడు చేస్తే అతడికి కలిగే సాహిత్యానుభవం ఎక్కువ రుచికరంగా ఉంటుంది. ఒక సర్క్యూట్ ఉంటుంది, కరెంట్ సర్క్యూట్ రచయిత, విమర్శకుడు, పాఠకుడు. ఈ సర్క్యూట్ సక్రమంగా ఉంటే రచయిత సుఖంగా ఉంటాడు. భావ ప్రసారం పవర్ లా సరిగ్గా సాగుతుంది. 

    మనకి తెలుగులో ఒక ప్రత్యేకత ఏంటంటే విమర్శకులు లేకపోవడం. అందుచేత పాఠకుడికేంటంటే రచయిత బాగా దూరమైపోయాడు. చిన్న సవరణ, అందరు కాదు. కొందరు. నేను చెప్పిన పద్ధతుల్లో రాసే వాళ్లకి పాఠకుడికి దూరం పెరిగిపోయింది. ఎందుకంటే దీని గురించి వివరించి చెప్పే విమర్శకులు లేరు తెలుగులో. అటువంటి సమర్థులున్నారు కానీ, విమర్శ పనిగా పెట్టుకొనే వాళ్లు లేరు.

    హర్షణీయం : నీడవెంట, తుర్కపాలెం దేవకన్యలు ఈ రెండు కథలు… నీడవెంట కథలో అతడికి(Protagonist) నలభై ఐదు, యాభై ఏండ్లు ఉంటాయి. తుర్కపాలెం దేవ కన్యల్లో Protagonist కి పదేళ్ల పిల్లవాడు. మీరు వాళ్లు ఊహించే ఊహాలోకానికి, వాస్తవానికి సరిహద్దులేవైతే ఉన్నాయో వాటిని తీసేస్తారు.

    పతంజలి శాస్త్రి : నా ఉద్దేశ్యమే అది. అందుకే సమాంతర వాస్తవికత అంటుండేవాడిని. ఇంకా అంటున్నాను. ఈ రెండు నాణేనికి అటు వైపు, ఇటు వైపు అంటామే అలాంటివి. ఏ creative imagination అని అంటున్నానో, మీరంటున్నారో అది it has firmly rooted in reality. మనం అనుకునే వాస్తవానికి మరొక పార్శ్వం అది. 

    ఈ తుర్కపాలెం దేవకన్యలు అనేది మరొక ముఖ్యమైన షార్ట్ స్టోరీ. ఎందుకంటే మీరు ఇంతకు ముందు అన్నాడు చూశారా? వాస్తవం, creative imagination కి సంబంధించిన కథ అది. అందుకే ఒక కుర్రవాడిని పెట్టాను. 1952 లో నేను, ఒక ఆర్కియాలజిస్ట్ ఒకాయన కలిసి కోనసీమలో ఒక గ్రామం వెళ్లాం. వెళ్లి ఒకరి ఇంటి వెళ్లాం. అందులో ఒక పెద్దావిడ ఒకామె ఉంటుంది. ఆవిడ వాళ్ల ఊరు గురించి చెబుతోంది. పెద్దావిడ కదా, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతోంది. ‘‘మీరు వెళ్లి ఒకసారి అమ్మవారిని చూసి వెళ్లండి’’ అని, ‘‘ఏమనుకున్నారు మా ఊళ్లో అమ్మవారంటే, అప్పుడప్పుడూ దేవకన్యలు వచ్చి మా కాలువలో స్నానం చేసి వెళ్తుంటారండీ, ఎవ్వరికీ కనబడరు. కనపడ్డా కళ్లు పోతాయండి బాబు’’ అంది. సరే, పెద్దావిడ నవ్వుకున్నాం. 

    మామూలుగా చెబుతుంటారు కదా, ‘‘నువ్వు ఏదైనా చూడకు చూస్తే కళ్లు పోతాయి’’ అని మన కథల్లో. తరువాత మర్చిపోయాను నేను ఇన్ని సంవత్సరాలు. 1983 నుంచి 2021 ఈ తుర్కపాలెం దేవకన్యలు కథలో మళ్లీ వాళ్లు వచ్చారు. ఇది బాగా సరిపోతుంది కథలో. 

    ఇది అలా ఉంచితే, నేను చెప్పదల్చుకున్న రెండు విషయాలు… చాలా ముఖ్యమైన చాలా చిన్న వాక్యాలు రెండు ఉన్నాయి అందులో. ఆవిడేదో చెబుతూ ఉంటుంది వాళ్ల ఊరి గురించి, ఆలయం గురించి. ఈ కుర్రావాడు American Boy More Or Less. ‘‘పెద్దమ్మా ఇవన్నీ ఎక్కడైనా రాశారా’’ అని అడుగుతాడు. ఆవిడా… ‘‘అన్నీ రాయడమెందుకు రా?’’ అంటుంది. అంటే అన్నీ రాసి ఉండాల్సిన అవసరం లేదు. మౌఖిక సంప్రదాయం ఉంది. ఇలా లక్ష వాటికి సంకేతం అది. ఆ ఒక్క వాక్యం ఎన్నో ఆలోచనలు రావడానికి. అలాగే దేవతల గురించి చెబుతుంటే ‘‘ఎవరైనా చూశారా?’’ అంటాడు. ఆవిడ లేదని చెబుతూ ‘‘అరే, అయినా అన్నీ చూడడమెందుకు? అన్నీ చూడాలా?’’ అంటుంది. నేను చెప్పక్కర్లేదు ఊరికే ప్రస్తావిస్తున్న. seeing is noting. ఏదైతే మనం చూస్తామో, మనం చూసిందల్లా సత్యం కాదు. వాస్తవం సత్యం కాదు. ఇలా మనం ఎంత దూరం వెళ్తే అంత అంటుంది ఆవిడ. చివరగా గుళ్లోకి వెళ్లినప్పుడు ‘‘దీన్ని రాజు ఎవరో కట్టించారట కదా’’ అంటే వీడి స్నేహితుడు ఇంకో కథ చెబుతాడు. ఎందుకంటే వాళ్ల మామ్మ ఇంకో కథ చెప్పింది గుడి గురించి. వాడు ఏమనుకుంటాడు ఇదీ బానే ఉంది అనుకుంటాడు. అంటే ఏమిటీ multiple versions of for of thing. ఒక cultural geography, ఇన్ని విషయాలను అందులో అర్థం చేసుకోవచ్చు.

    హర్షణీయం : నీడ వెంట కథలో మీరు కాశీ గురించి చేసిన వర్ణన, గంగానదిని వర్ణించిన తీరు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. 

    పతంజలి : నేను ఎప్పుడూ కాశీ వెళ్లలేదు. అయితే, నేను కథకు కాశీని కేంద్రంగా చేసుకోవడానికి కారణం ఏంటంటే అందులోనే రాశాను ‘‘కాశీ ఒక ప్రాచీన విషాదం …’’ people go there to die. చాలా విచిత్రం అది. ఈనాడే కాదు, ఎప్పుడూ. నడిచి వెళ్లి పూర్వం అక్కడ ప్రాణాలు విడిచేవారు. మొత్తానికి మృత్యువు కాశీ అధిష్టాన దేవత. అక్కడ రాజుగారు అంటారు ఒక మాట ఎక్కడా ఆ సత్రంలో ‘‘ఇది శివుడి సొంతూరండి బాబు’’ అని. శివుడు లయకారుడు. ఇది వాడి destination. అయితే ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, వాడికి తెలియకుండా మృత్యువును వెతుక్కుంటూ వెళ్తాడు. వాడిని మృత్యువు ఆవహిస్తుంది. ఆ విషయం తెలియదు వాడికి. 

    అది right from the word go … ఆ కథలో కనిపిస్తుంది మీకు. అందులో రాత్రి చచ్చిపోయినట్లు వాడికి కల వస్తుంది. రెండోది వాడు గదిలో కూర్చుంటే నల్లటి ఆకారం లోపలికి వస్తుంది. అది మృత్యువు. అది గరుడ పురాణంలో వర్ణించినటువంటిది. ఒళ్లు జల్లుమంటుంది. గరుడ పురాణంలో దాని గురించి చెప్పారు. అంటే గరుడ పురాణం చదువలేదు. నాకు చాలా గొప్ప పండితుడొకరు దాని గురించి చెప్పాడు. చెబుతుంటేనే నాకు ఏదోలా అనిపించింది. నల్లటి మగ కాని, ఆడ కాని ఒక ఆకారం అంటే మృత్యువు. రాస్తూ చటుక్కున అది పెట్టాను. అది గరుడ పురాణం తెలియకపోయినా పర్వాలేదు. తెలిసిన వాళ్లకి బానే ఉంటుంది. 

    ఇంకోటి అది ఒక చావుతో మొదలవుతుంది. ఆ సాయంత్రం ఒక మృత్యువుతో మొదలవుతుంది. ఏం మృత్యువు? వీడికేం సంబంధ లేదు. ఎవరికీ సంబంధంలేదు. ఎవరో ఒక నాయకుడు చనిపోతే, ఆ నగరంలో రాజమండ్రిలో బంద్ నిర్వహిస్తుంటారు. దాని గురించి మొదలయ్యే చర్చతో మృత్యువుతో మొదలవుతుంది. చటుక్కున ఇంటికి వెళ్లే సరికి వాడికి మృత్యువు ఎదురవుతుంది. వాడి చుట్టూ ఉండే ఈ ప్రపంచం నుంచి వాడు జారి పోతున్నాడు నెమ్మదిగా. He was slipping from the world he knew…. 

    ఛాయా మోహన్: ‘మార్కండేయులు కాఫీ’ గురువు గారు . పోగొట్టుకోవడం , వెతకడం …?

    పతంజలి శాస్త్రి : మార్కండేయులు కాశీ అనే కథలో నిజానికి నేను చెప్పిందానికంటే చెప్పందే ఎక్కువ. అందులో టైం ని నేను అటూ ఇటూ, ఇటూ అటూ జరిపేశాను. వాళ్లు వెళ్లిపోయి మూడు సంవత్సరాలు అయ్యింది. తరువాత వీళ్లు అక్కడ హోటల్ లో కలుసుకోని అంతకుముందు ఏదో మూన్నెళ్లు అయ్యింది. ఆ తరువాత వీడొస్తాడు. వీడు మాట్లాడేది ఆ మూడు నెలల గురించి. మొదటి మూడు నెలలు. వీడు తరువాతేదో మాట్లాడితే రెండో మూడు నెలల దగ్గరినుంచి ఆగి, వెనక్కి మళ్లీ.. ఈ టైం ని వెనక్కి ముందుకు, అటూ ఇటూ జరుపుతుంది. కానీ మొత్తానికి ఈ ప్రవాహం ఒకటే లోపల. మూడ్ అదే కంటిన్యూ అవుతుంది. అందుకే చాలా చెప్పకుండా వదిలేసింది. మెమరీ అండి. పొందడం పోగొట్టుకోవడం. 

    నేనెప్పుడూ అంటుంటాగా man is nothing but a memory. మనిషొక జ్ఞాప‌కం అంతే. ఇతనికి ఇందులో మార్కండేయులు మెమరీస్ లో He knows only possesstion. Possession మాత్రమే తెలుసు అతనికి. అందులో ఆ కథలో చివరన రెండు వాక్యాలున్నాయి. మితృడు ఫస్ట్ పర్సన్ లో అతడంటాడు ‘‘నాకు రెండు చిన్న పెద్ద విషయాలు తెలిశాయి. ఏంటంటే? ఆ అమ్మాయి పూర్ణ, ఆవిడ ఎలా ఉండకూడదనుకుందో అలాగే ఉంది. మార్కండేయ ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉన్నాడు’’ అని ఎండ్ చేస్తాను. నిజానికి అది బిగ్ క్వశ్చన్ మార్క్. పెద్ద ప్రశ్నార్థకం అది. ఎందుకంటే, వాళ్లు నిజంగా అట్లా అనుకొని ఉన్నారా? ‘‘ఓహో నేను ఇలా ఉండాలి’’ అని వాళ్లు అనుకున్నారా? లేదు నిజానికి. ఆ అమ్మాయి అనుకోలేదు. కానీ వాళ్లు అట్లా ఉన్నారు. దీనికి ప్రేరణ ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే? అస్థిత్వ వాదులు ఏమంటారంటే? ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు అంటారు.

    హర్షణీయం : ‘ ఇదొక అరసున్నా’ చాలా ప్రత్యేకంగా అనిపించిందీ మీరు ఆ కథను ముగించిన పద్ధతి.

    పతంజలి శాస్త్రి : అదేంటంటే, నాకు చాలా ఏళ్ల నుంచి ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అనేక సందర్భాలు మీరు గమనించినట్లయితే, మనిషి మెదడులో ఒక వ్యవస్థ ఉంటుంది. హఠాత్తుగా మీకు ఏదో స్ఫురిస్తుంది. ఒక యాభై సంవత్సరాల అర్థ శతాబ్ది భాందవ్యంలో, స్నేహంలో, సంసారంలో లేదా జీవితానికి సంబంధించిన మరో దాంట్లో మరోదాంట్లో కలగనటువంటి ఓ మార్పు, రాని ఆలోచన క్షణకాలంలో వస్తుంది. అది ఒక Realization కూడా కావచ్చు. మీ జీవితాన్ని మొత్తం తలకిందులు చేసేటటువంటి ఒక మార్పు కావచ్చు. అదీ ఎలా వస్తుందో తెలీదు. ఒకరిని చూడడం వల్ల కావచ్చు, మాట్లాడడం వల్ల కావచ్చు. అలా మామూలుగా ఏకాంతంగా కూర్చున్నప్పుడు చటుక్కున రావచ్చు. 

    ఇందులో గురుమూర్తి అనేవాడు భార్య అన్న ఒక చిన్న మాటను పట్టుకొని జీవితాన్ని తవ్వుకుంటూ వెళ్తాడు. ఈ తవ్వకాల్లో ఏమవుతుందంటే, మన గురించి మనకు కూడా తెలియనటువంటి చిత్రమైన విషయాలు తెలుస్తాయి. కనుక వాడికి ఎప్పుడూ కూడా గదిలో పగుళ్లు అగుపిస్తాయి. 

    అటువంటి పరిస్థితుల్లో ఇదాంక నేను చెప్పినటువంటి… హఠాత్తుగా వాడికి ఆ అత్యంత ప్రకాశవంతమైన వలయాన్ని చూడగానే వాడి జీవితంలో ఎప్పుడూ చూడని, వాడి అనుభవంలోకి రానటువంటి తేజశ్వంతమైనటువంటి ఒక పరిపూర్ణత వాడికి కనిపిస్తుంది. A completness he never imagined existed. అది తెలియదు వాడికి. చూసేసరికి ఆ అనుభవం ఒక అద్భుతం వైపు తీసుకెళ్తుంది వాడిని. 

    కట్టుకున్న తువ్వాలు ఊడిపోతుంది. ఆ ఒక ‘ఏకాంత నగ్నత్వం’ ….in the figurative sense. అలా చూస్తూ ఉండిపోతాడు. అది ఏ రియలైజేషనో, తరువాత కంటిన్యూ అయ్యిందా లేదా అనేది పాఠకుడు ఊహించుకోవాలి.

    ఛాయా మోహన్ : సమాంతరాలు ముఖచిత్రం మీద అభిప్రాయం ఏంటి? మీ కిష్టమైన గోదావరి నది, నదిలో కొట్టుకొచ్చే దుంగలు కనిపిస్తాయి? 

    పతంజలి శాస్త్రి : గోదావరి అంటే నేను యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. గోదావరి నా జీవితంలో భాగం. పైగా అన్ని కథల్లో కూడా గోదావరి ఒక పాత్ర. కొన్నిట్లో అయితే మేజర్ పాత్ర గోదావరిదే. వాడు అందులో ప్రయాణిస్తూ, అంటే కాలప్రవాహం అనే దృష్టితో కొన్ని కథల్లో రాశాను. అందువల్ల గోదావరి. పైగా ఊళ్లో ఉన్నాను కనుక, మేమిక్కడ గోదావరి గట్టుకు వెళ్లకపోతే ఇక్కడ రాజమండ్రిలో మాకెవ్వరికీ తోచదు. గోదావరి గట్టుకెళ్లి ఓసారి గోదావరిని చూడకపోతే చాలా అసంతృప్తి. రెండోది ముఖచిత్రం ఏంటంటే చాలా ఆసక్తికరమైన కథ అది. వాళ్లు ఒకరికొకరు చాలా భిన్న ప్రపంచాల్లో ఉంటారు. కలిసున్నా కూడా ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉంటుంటారు. మళ్లీ ఒకరిపై ఒకరు డిపెండ్ అయి ఉంటారు. అందులో కూడా మినహయింపులుంటాయి. they are also on a shaky zone. ఎందుకంటే పెద్దాయన లైఫ్ అనిశ్చితం. ఆ కుర్రవాడిది ఇంకా ఘోరం. ఇలాగ ఆ ఒడిదుడుకుల్లో వాళ్లు అలా ప్రయాణిస్తుంటారు. 

    అందుచేత ఆ దుంగ, పడవ మీద కాదు, దుంగ మీద కూర్చోబెట్టాడు శివాజీ. ఇంకో కారణం నేననుకుంటుంది (శివాజీ చెప్పలేదు నాకు)… రామాయణంలో అనుకుంటా. ఒక శ్లోకం… అందరికీ తెలిసిందే,

    ‘ యధా కాష్టం ..కాష్ఠంచ ‘ 

    నదిలో రెండు వెదురు బొంగులు వెళ్తుంటాయి. ప్రవాహ వేగానికి విడి విడిగా వెళ్తూ మధ్యలో కలుస్తుంటాయి. అది మానవ బాంధవ్యాల గురించి చెబుతుంది. కలుస్తాం, విడిపోతాం. తాత్కాలికమైన బాంధవ్యం ఇది. అది బహుశా అతని మనసులో ఉండి ఉంటుంది. Probably it was on his mind when he was making it.

    హర్షణీయం : ధన్యవాదాలు శాస్త్రి గారు.

    పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) .

    పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) .

    తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’ సంపుటం ప్రత్యేకత.

    శాస్త్రి గారి రచనా శైలి, ఈ సంపుటంలో కథలు, ఆడియో బుక్స్ ప్రాచుర్యం,- వీటిపై ఈ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది.

    హర్షణీయం పాడ్కాస్ట్ –

    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa

    స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all

    హర్షణీయం ఫేస్ బుక్ లో – https://www.facebook.com/Harsha051271

    హర్షణీయం ట్విట్టర్ – @harshaneeyam

    హర్షణీయం యూట్యూబ్ లో – https://bit.ly/harshayoutube



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    27 min
  • 'షరా' - గోపీచంద్ గారి రచన

    ‘షరా’ గోపీచంద్ గారు రాసిన కథ . కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.

    గోపీచంద్ గారి కథలను మీకు అందించడానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.

    ఈ కథ ‘గోపీచంద్ రచనా సర్వస్వం – కథలు – 2 ‘ లోనిది. పుస్తకం కొనాలంటే ఈ లింకుని ఉపయోగించండి. https://bit.ly/3jTBgsb

    ఆ మనిషిని ఎక్కడో చూశాననిపించింది. కాని ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. కృష్ణలంకలో నాకు ఎవ్వరితోనూ పరిచయం లేదు. నేను ఎన్నడూ ఆ లంకలో అడుగుపెట్టి కూడా ఎరగను.

    మా ఊరు బెజవాడ దగ్గరదే అయినా నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచీ మద్రాసులోనే వుంటున్నాను. ఈ ప్రాంతాలకు రాలేదు. ఇటీవల వొచ్చిన గాలివానకు పంటలన్నీ పాడైనయ్యని తెలుసుకొని పొలాలు చూచుకు వెళ్ళదామని వొచ్చాను. గాలివానవల్ల నిజంగా అపారమైన నష్టం కలిగింది. నేను ఎరిగినతర్వాత ఇంత నష్టం ఎప్పుడూ జరగలేదు. కవులు వాళ్ళు తమ గింజలుకూడా రావని గోలపెడుతున్నారు. నేను ఏమి చెయ్యగలను! మళ్ళీ మద్రాసు వెళ్తామని బయలుదేరి, ఎలాగూ వచ్చాంగదా అని బెజవాడలో వున్న నా మిత్రుణ్ణి వొకణ్ణి చూచిపోదామని బెజవాడలో దిగాను. అతను గాలివానకు నష్టపడిన వారికి సహాయంచేసే ప్రయత్నంలో వుండి “రేపు వెళ్ళొచ్చులే” అంటే-ఆనాటికి ఆగిపోయాను.

    ఆ సాయంత్రం బెజవాడ లంకలో నష్టపడ్డ బీద జనానికి వాసాలూ, తాటాకులూ పంచిపెడుతూ నన్ను కూడా రమ్మంటే నేనూ వెళ్ళాను. శరణార్థుల్లో కనుపించాడు ఆ మనిషి. ఆ మనిషి నన్ను చూచి కొంచెం బెరుకుపడ్డట్టు కూడా అనిపించింది నాకు. నిజంగా ఆ మనిషిని నేను ఎక్కడో చూశాను. అందులో సందేహం లేదు. కాని ఏ సందర్భంలో చూశానో ఎంత ఆలోచించినా నాకు జ్ఞాపకం రాలేదు.

    మేము పని పూర్తి చేసుకొని యింటికి వస్తుంటే ఒక రైతు మా వెంట వొచ్చాడు. అతనివల్ల ఆ మనిషి కోటిరెడ్డి మామ అని తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. కోటిరెడ్డిని నేను ఎరుగుదును. అతనూ మద్రాసులోనే ఉంటున్నాడు. అతని మామను కూడా నేను ఎరుగుదును. ఒకసారి అతని అత్తవారి ఇంటి దగ్గర ఉండగా అతన్ని చూద్దామని వెళ్ళాను. అప్పుడే ఈయన్ని చూశాను. కాని గుర్తుపట్టకపోవటం నాతప్పు కాదు. మనిషి చాలా మారిపోయాడు.

    నేను ఏట్లాగూ మద్రాసు వెళుతున్నాను గనక అల్లుడికేమైనా కబురు చెబు, మర్నాడు ప్రొద్దున్నే లేచి కోటిరెడ్డి మామను చూద్దామని లంకకి ప్రయాణ ఆ లంకలో వుంటున్నదంతా అలగా జనం. నాకు తెలిసినంతవరకు కోటిరెడ్డి వున్నవాడే. కాని ఈ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. స్వగ్రామంలో ను వాకిలి వొదులుకొని ఇక్కడ ఎందుకు కాపరం పెట్టాడో కూడా నాకు తెలియదు. కోటి కూడా ఈ విషయం నాతో ఎన్నడూ ప్రస్తావించలేదు. అక్కడ వున్నవన్నీ చిన్న చిన్న హరి గుడి సెలే. ఆ గుడిసెల్లో వొక గుడిసెలో కాపరం వుంటున్నాడు కోటిరెడ్డి మామ. నేను వెళ్ళేటప్పటికి ఆస్థలంలోనే వున్న మరికొన్ని గుడిసెల్ని బాగుచేయిస్తున్నాడు. నన్ను చూచి కొంచెం తబ్బిబ్బుపడ్డాడు. ఇంటిలోకి వెళ్ళి నేను కూర్చోగలందులకు ఒక కుక్కిమంచం తెచ్చాడు. అతన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత హీనస్థితికి ఎందుకు వొచ్చాడా అని ఆలోచించ బుద్ధి ఐంది. మాటల్లోకి దింపాను. అతను ఆకును అందకుండా పోకను పొందకుండా జవాబులు చెప్పాడు. తన అల్లుడి సంగతి అడిగాడు. బాగానే వున్నాడని చెప్పాను. నేను అదీ, ఇదీ అడిగాగాని సరైన జవాబులు చెప్పలేదు. చివరికి; “నేను మద్రాసు వెళ్తున్నాను మీ అల్లుడికి ఏమైనా కబుర్లు చెపుతారా?” అని అడిగాను.

    “ఇట్లా వుంటున్నామని చెప్పండి” అన్నాడు. నేను ఆయన దగ్గర సెలవు తీసుకొని మిత్రుని ఇంటికి బయలుదేరాను. దారిలో ముందురోజు కలిసిన రైతు కలిశాడు. అతన్ని అడిగాను. కోటిరెడ్డి మామనుగురించి.

    “ఆయన ఆస్తి ఎందుకు పోయింది?” అని అడిగాను. “ఆస్తి పోవటం ఏమిటండోయ్!” అన్నాడు ఆ రైతు. “ఆస్తిపోకపోతే ఈ గుడిసెలో వుండవలసిన అవుసరం ఏమొచ్చిందీ?” అన్నాను.

    “అదా అండి… అట్లా అడగండి” అన్నాడు రైతు. అని ఈ విధంగా చెప్పాడు; “ఏమండోయ్ నాదీ ఆయనది వొక ఊరే… తెలుసా అండి… నాకాయన సంగతి బాగా తెలుసు… ఆస్తిపోయి రాలేదు….”

    “మరెందు కొచ్చాడు?”

    “సంపాదించటానికి వొచ్చాడు. అక్కడ ఇల్లూ, పొలం అమ్ముకొని వడ్డీకిచ్చి ఈ లంకలో స్థలాలు చౌగ్గా వున్నాయనీ, తొందరలో ధరలు పెరుగుతాయని తెలుసుకొని, ఇక్కడ స్థలం కొన్నాడు… రేపీ స్థలం అమ్ముతాడు… ఇంకొకచోట కొంటాడు… ఆయన కేమండీ… చూశారూ… ఈ స్థలం కొన్నాడా… కొని ఊరికేవుంటి యేమొస్తుందని నాలుగు గుడిసెలు వేయించి అద్దెకిస్తున్నాడు… కాని గాలివాన వొచ్చింరోజే గమ్మత్తంటే గమ్మత్తు…” అని నవ్వటం మొదలు పెట్టాడు.

    కారణం తెలియకపోయినా, అతను నవ్వుతుంటే నాకూ నవ్వు వొచ్చింది. “ఏం జరిగిందేమిటి?” అని అడిగాను.

    “అంతకు ముందు మూడు రోజులనుంచీ గాలివాన కొడుతూ వుంది. ఆ రోజు ఎక్కువైంది. లంకలో వుంటానికి వీల్లేక అంతా ఊళ్ళోకి వెళ్ళారు తలదాచుకోటానికి. ఈయన్ని రమ్మంటే రాడే “ఈ ఇళ్ళు నన్ను కాపాడినై… కష్టకాలంలో వాటిని విడిచిపెట్టి రాను” అంటూ కూర్చున్నాడు… ఆయన భార్య కూడా ఆయనకు తగ్గదే దొరికింది. “వొచ్చిన గాలి వాన పోక వుంటుందా… వెళ్ళటం రావటం… ఇదంతా ఎందుకు?” అంటూ కూర్చుంది. …. వొచ్చిన గాలివాన ఎట్టాగూ పోతుందట!” మళ్ళీ నవ్వటం మొదలు పెట్టాడు.

    “చివరికి ఏమైంది?” అని అడిగాను.

    “ఏమవుతుంది? వాళ్ళు రానంటే మాత్రం మేము ఊరుకుంటామా? వాళ్ళ సంగతి దేవుడెరుగు వాళ్ళకొక చంటి బిడ్డ వుంది. ఆ చంటి బిడ్డ జోరున తడుస్తుంటే ఎట్లా చూస్తూ వూరుకోవటం… బలవంతంగా తీసుకువెళ్ళాం… అదుగో చూడండి ఆ కట్టెల అడితీ… అది దాటి రానంటాడే… తన ఇళ్ళకు వీలైనంత దగ్గర్లో వుండాలని ఆశ! ఆ రాత్రి ఆ కట్టెల అడితీలో పెట్టాం… మమ్మల్ని నానా మాటలూ అంటూ కూర్చున్నాడు… ఆయన అల్లుడి తరపు బంధువులు వూళ్లో వున్నారు. వాళ్ళు వొచ్చి తమ యింటికి రమ్మని పిలిచారు. ఉహు, ఎంత చెప్పినా వినడు… పైగా “మీరు ఆనాడు అట్లా చేశారు. ఈనాడు యిట్ల చేశారు. నా సంగతి మీకు పట్టిందా, ఈ కష్టంలో నన్ను చూసి నవ్వాలని వచ్చారు” అని మండిపడి పంపించాడు. ఎట్లాగో తెల్లవారేదాకా ప్రాణాలు బిగబట్టుకు కూర్చుని తెల్లవారి మళ్ళీ భార్యా సమేతంగా లంక ప్రవేశించాడు. అప్పటికి గాలివాన కొంచం తగ్గిందిగానీ యింకా యెవ్వరూ బయటకు రావటం లేదు. పాపం పడిపోయిన ఇళ్ళని చూడలేకపోయాడు. వాటిని మళ్ళీ మామూలు ఆకారంలో చూస్తేగాని వుండలేక పోయాడు. భార్యనీ, చంటి పిల్లనీ పడని మొండి గోడలకు నాలుగు ఆకులు కప్పి, దాని క్రింద పెట్టి ఇళ్ళు నిలబెట్టటానికి పూనుకున్నాడు…” ఈ విధంగా ఆ రైతు చెప్పి చెప్పి, “పాపం అతనికి ఇప్పుడు ఒక్కటే దిగులు” అని పెదవి విరిచాడు.

    “ఏమిటది?” అని అడిగాడు.

    “ఏముంది, పాపం! మొదట్లో తాను వుంటానికి వొక గుడిసె వేయించాడు. అద్దెలవాళ్ల పోరుపడలేక ఆ గుడిసెలో సగం అయిదు రూపాయలకు అద్దెకిచ్చి మిగిలిన సగంలో తాను వుండేవాడు. అప్పటికీ అద్దెలవాళ్ళ పోరు తగ్గలేదు. అందుకని ఆ సగంకూడా అద్దెకిచ్చి పంచలో వుండేవాడు. ఆ పంచకూడా అద్దెకివ్వాల్సి వొచ్చింది. అందుకని మరొక గుడిసె వేయాల్సి వొచ్చింది. కాని ఆ గుడిసె పనీ ఇంతే అయింది. ఎన్ని గుడిసెలు వేయించినా తాను కొంత స్థలం ఆక్రమించుకోవాల్సి రావటం, అంతమేరా అద్దె డబ్బులు దండగలు జరుగుతూ వుంది… ఈ సమస్య ఎట్లా తీరుతుందా అని అతను రాత్రింబగళ్ళూ దిగులు పడుతూ వుంటాడు” అని చెప్పి పెద్ద పెట్టున నవ్వాడు.

    నాకూ నవ్వు వొచ్చింది. ఆ రైతు చెపుతున్న పద్ధతి నాకు నవ్వు తెప్పించింది. కాని లోపల కోటిరెడ్డి మామ ఎందుకు మారాడా అని ఆందోళన కలగకపోలేదు. మొదట్లో నేను చూచినప్పుడు అతను చాలా మర్యాదస్తుడుగా కనిపించాడు. వూళ్ళో గౌరవంగా వుండేవాడు. తాను తినేవాడు, ఇతరులకు పెట్టేవాడు. మర్యాదకు ప్రాకులాడే మనిషనే అనుకున్నాను నేను. ఇంతగా ఎందుకు మారాడో!

    ఆ రాత్రి మెయిల్లోనే నేను మద్రాసు జేరుకున్నాను. నా సొంత పనులు చూచుకుంటూ నాలుగు రోజులు కోటిరెడ్డిని కలవలేకపోయాను. అయిదో రోజు సాయంకాలం అతని ఇంటికి వెళ్ళాను. అతను ఇంట్లోనే వున్నాడు. ఏదో రాసుకుంటూ వున్నాడు. కాసేపు అదీ ఇదీ మాట్లాడి అతని మామను చూశాననీ, గాలి వానకు చాలా నష్టపడ్డాడనీ, ప్రస్తుతం బాగానే వున్నాడనీ మాత్రం చెప్పాను. అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా డ్రాయరు తీసి చదవమని వొక కార్డు ఇచ్చాడు. అది అతని మామ కూతురికి వ్రాసిన ఉత్తరం. అందులో ఇల్లా వుంది.

    “బిడ్డా ! నీవు వ్రాసిన వుత్తరం అందినది. గాలివానవల్ల నష్టపడ్డా, భగవంతుని కృపవల్ల అట్టే నష్టం లేకుండానే తేరుకున్నాము. గాలివాన తగ్గిన మార్నాడే, ఎవ్వరూ ధైర్యం చెయ్యకపోయినా, మీ అమ్మా నేనూ లంక ప్రవేశించి ఇళ్ళు నిలబెట్టాము. మళ్ళీ వొక్కరొక్కరే అద్దెలవాళ్ళు ఇప్పుడిప్పుడే వొస్తున్నారు. ఇళ్ళు మళ్ళీ వేయించినందుకుగాను నెలకి యిది వరక్కంటే వొక రూపాయి ఎక్కువ ఇవ్వాలని మీ అమ్మ అడుగుతూ వుంది. నువ్వు మాత్రం డబ్బు దగ్గర జాగ్రత్తగా వుండు. మీ ఆయన పుస్తకాలకని, వాటికనీ అనవసరంగా డబ్బు తగలవేస్తూ వుంటాడు. నువ్వు గట్టి పట్టుపట్టి డబ్బు ఖర్చు కాకుండా చూడు. ఆయనకు లేకపోయినా, నువ్వయినా నీ పిల్లల సంగతి చూచుకోవాలిగదా?” ఈ విధంగా వ్రాసి షరాలో “చంటి బిడ్డ” జలుబు చేసి మరణించిందని తెలియజేశాడు. నేను ఉత్తరం చదివి కోటిరెడ్డి వంకకు చూశాను. “చూశావా, చంటిబిడ్డ మరణించటం ఆయన కంత స్వల్ప విషయంగా కనిపిస్తూ వుంది. ఆ గాలివానలో ఇటూ అటూ తిప్పి ఉంటారు, డాక్టరుకి కూడా చూపి ఉండరు. తమ ఇళ్ళేమో, వడ్డీ డబ్బులేమో, అద్దెలేమో తప్ప మరింకొకటి వాళ్ళకు పట్టదాయె. పైగా చెప్పినవాళ్ళు పిచ్చివాళ్ళకింద లెక్క. మొదటినుంచీ ఇలా ఉండేవాడు కాదు. కాని పొలం అమ్మి వడ్డీకిచ్చాడు. అప్పటినుంచీ ఇట్లా తయారయ్యాడు. క్రమ క్రమేణా మరీ అన్యాయం అయిపోతున్నాడు” అన్నాడు కోటిరెడ్డి.

    కథను –

    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    (Harshaneeyam on Gaana app)

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

    (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

    (Harshaneeyam on Apple. Podcast)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    12 min
  • అర్నాద్ గారి 'రిక్షా ప్రయాణం'

    ప్రముఖ రచయిత అర్నాద్ గారి రచన ‘రిక్షా ప్రయాణం’. 1981 వ సంవత్సరంలో ఆంద్రజ్యోతి సంక్రాంతి కథల పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం అందుకున్న కథ. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అర్నాద్ గారికి కృతజ్ఞతలు.

    “అమ్మా రిక్షా కావాలా” తైల సంస్కారం లేని ఉంగరాల జుట్టు, కోల ముఖంలో చురుకైన కళ్లు, సూది ముక్కు, బండ పెద వులు, మెడలో మురికి పట్టిన తాడు, దానికి వేళాడుతూ ఏడు కొండలవాడి ప్లాస్టిక్ బిళ్ళ, చిన్నచిన్న బొక్కల బనీను, రెండు పెద్ద పేలున్న బిగుతు ఆఫ్ ఫేంటు, బనీన్ని ఫేంటుని కలుపుతూ మురికి పట్టిన నల్లని తోలు బెల్టు, నల్లని ఒళ్ళు. చెప్పులు లేని కాళ్ళు. ముప్పయి మూడేళ్ళ వయసు. పేరు నర్శిమ్మ. నరిసిగాడంటారు అంతా.

    “రిక్షా తల్లీ రిక్షా”. గోదావరి ఎక్స్ ప్రెస్ చాలా ఆలస్యంగా వచ్చింది. అందులో ఆశ్చర్యం లేదు. అదేం అద్భుతం కాదు. ఎప్పుడూవున్న న్యూసెన్సే గాబట్టి పెద్ద బాధాకరమైన విషయం కూడా కాదు. ఆ మాటకొస్తే సీటూ బెర్తు రిజర్వేషనూ… వీటికన్నా ఇదిగో ఈ వూళ్ళో స్టేషన్నించి ఇంటికి వెళ్ళడమే అసలైన బాధ. సిసలైన గాథ! –

    “రిక్షా కావాలేటమ్మా”. 

    ఆ ప్లాటుఫారం అవతల వుండాల్సిన రిక్షావాడు ప్లాటుఫారం టికట్ లేనే లేకుండా ప్లాటుఫారం మీదికి ప్రవేశించి – బిలబిలమంటూ రైలు దిగిన జనాన్ని దేవే స్తున్నాడు. పట్టే యత్నంలో, పోటీలో రెండూ, మూడు చిక్కినట్టుచిక్కి చేజారి పోయేయి. నిరాశ ఆ క్షణం! ఆశ మరుక్షణం. మళ్ళీ ప్రయత్నం. పరుగు పట్టు.

    “అమ్మా రిక్షా”. అమ్మని వదిలేలాలేడు రిక్షా నరిసిగాడు.

    ఆయమ్మ ‘అమ్మ’ అంటే అమ్మకాదు. అమ్మమ్మ నరిసిగాడికి కాదు. ఆమె చెంగు పట్టుకొని నడుస్తున్న చిన్నారి చిట్టికి. ఏడేళ్ళ బూరిబుగ్గల పెద్దకళ్ళ చిట్టికి,

    చిట్టి అమ్మమ్మని పట్టుకు నడుస్తుంటే, అమ్మమ్మ ట్రంకు పెట్టిని పట్టుకు నడుస్తోంది.

    పెట్టిని మోస్తుంటే చేయిలాగేస్తోంది ఆమెకి. పదడుగులు నడిచింది. పెట్టె నేల దించింది. పెట్టిని కుడిచేతి నుంచి ఎడమచేతికీ, చిట్టిని ఎడమ చేతినుండి కుడిచేతికి మార్చుకు నడుస్తోంది. మనిషిని చూస్తే – అలాంటి బరువు పెట్టెలు పది ఒక్కసారే మోసేయగలదు అనిపిస్తుంది. కాని ఆమె తనవొళ్ళు తనే మోయలేక పోతోంది. ఆమె శరీరం యినపరాయిలా గట్టివొళ్ళు కాదు. గాలి నింపిన బెలూన్లో నీరుపట్టిన వొళ్ళు. నాలుగడుగులు నడిస్తే చాలు కాళ్ళు పొంగుతాయి. ఆమె వయసు యాభై అయిదేళ్ళు. పేరు సోములమ్మ. కాని అంతా దిబ్బమ్మ అంటారు.

    “ఎక్కడికమ్మా ఎల్లాల”.

    వెళ్ళాల్సిన చోటు ఇక్కడా, అక్కడాలేదు. చాలా దూరం. ఆటో అయితే పదో, పన్నెండో అడిగే దూరం. బస్సయితే రూపాయి తీసుకొని పదిపైసలు తిరిగిచ్చే దూరం. –

    తను వెళ్ళాల్సిన సిటీ బస్సు దొరికే బస్టాండు దిబ్బమ్మకి తెల్సు, ప్లాటుఫారం అంచునుంచి చూస్తే అదిగో, అల్లదిగో కనిపిస్తోంది… పెట్రోలు బంకు పక్కన నడిస్తే అయిదు నిమిషాలు.

    ఆమె నడిచేయగలదు – కాళ్లు పొంగినా ఖాతరు చేయకుండా. ఈ గుంట పాప, ఆ ట్రంకు పెట్టె లేకుంటే నడిచేసును.

    తను వెళ్లాల్సిన బస్టాండు చెప్పి, చూపించి ‘ఎంతిమ్మంటావు’ అనడిగింది. “రెండ్రూపాయిలిప్పించండి”.

    రిక్షావాళ్లు అడిగే రేట్లు చూస్తే సింహాచలం, పెందుర్తి అయినా నడిచి పోవాలనిపిస్తుంది. అది అనిపించడం వర్కే! నసిగో, గుణిసో, ముక్కో, మూలిగో వాహనం ఎక్కకుండా వెళ్ళలేం మనం చివరికి. ఈ నాగరికత ఎలాంటి దూరాన్నయినా నడిచిపోగలమనే సంగతి మనం మర్చిపోయేట్టు చేసింది. మన పూర్వీకులు కాశీకి నడిచి వెళ్లారంటే తెల్లమొగాలు వేయడం వేరే సంగతి. పెదవాల్తేరు నుంచి పూర్ణా మార్కెట్ కి ఏమీ కాకుండా నడిచేసిన వాళ్ళు – సిటీ బస్సుకోసం గంటల కొలదీ వెయిట్ చేసి, నలిగిపోతూ, వేలాడ్డానికే ఇష్టపడుతున్నారిపుడు. కాలం! –

    “ఏటీ రెండడుగుల దూరానికి రెండు రూపాయలా! అవ్వ! ఏం ఆశరా”! 

    “అదేటి తల్లీ అలాగంటారు. రెండు రూపాయల్కి శేరునూకలు రావడం లేదు.” 

    ఆమె అన్నది వేరు. వాడు చెప్పింది వేరు. కాని రెంటికీ లింకు వుందనేది వాస్తవం.

    అంచేత రిక్షావాడి రేటుబట్టి ఆ పట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్థాయిలో వుందో ఈజీగా చెప్పేయవచ్చంటారు. ఒకే దూరానికి రిక్షావాడు రాజమండ్రిలో అర్ధరూపాయికి కడ్డాడు. విజయవాడలో ముప్పావలాకి కడ్డాడు. వైజాగులో అర్థలూ, పావలాలు నైజానా! మూడు రూపాయలవుద్ది, యిష్టమైతేరా, కష్టమైతే పో అంటాడు.

    రెండు రూపాయలివ్వడం దిబ్బమ్మకి తన జరుగుబాటు బట్టి పెద్ద కష్టమేమీ కాదు. కాని కనిపించే ఆ మాత్రం దూరానికే రెండు రూపాయలు అర్పించాలంటే యెవరి మనసైనా ఎలా ఒప్పుతుంది?

    దిబ్బతనం “సుఖంగా, హాయిగా కష్టబడకుండా బతికేస్తున్నాడు” అనే దానికి సాక్ష్యం, సంకేతం. కాని దిబ్బమ్మ కష్టజీవి. ఆమె కష్టపడి సంపాదించడాన్నే నమ్ముకుంది. ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది. కోరుకుంటుంది. ఏడేళ్ళ కిందట జబ్బు పడి ఒళ్ళు వచ్చింది గాని అంతకుముందు రివటలా లేకపోయినా లావు మాత్రం కాదు.

    తను కష్టం చేసి తను బతగ్గలిగింది.

    పిల్లా, పాపని పెంచగల్గింది. కాని ఒక్క పైసా కూడా కూడబెట్టలేక పోయింది. తన శ్రమంతా ఏ గంగలో కలిసిపోయి ఎవరి పూలతోటలు పెంచిందో ఇంకెవరి పళ్ళ తోటలు పెద్దచేసిందో ఆమెకి తెలీదు. దగాలు, దోపిడీలు… వీటి అర్థాలు తనకి ఇప్పటికీ సరిగా తెలీవు. తను చేసే పని – కూలి పని. ఎంతో నిక్కచ్చిగా, నిజాయితీగా చేసేది. వూరికే గోడు గిల్లుకుంటూ వుండడం ఇష్టం వుండేది కాదు. రోడ్డుమీద పేడని కూడా వూరికే పోనిచ్చేది కాదు. పిడకలు పెట్టి అమ్మేది. బొరిగతో చకచకా గడ్డికోసి గంపలకి గంపలెత్తి అమ్మేది. కాని కూతురికి పావుతులం బంగారం కొనలేక పోయింది.

    అయితే ఇప్పుడు ఆ కూతురు మెడలోనే పది తులాల బంగారం పెట్ట గల్గింది. అది తన కష్టంతోకాదు – అదృష్టం వల్ల. తనకి అదృష్టం, రోగం ఒకేసారి వచ్చేయి. అదృష్టం ఆస్తి తెచ్చింది. రోగం వంటికి నీరు నెక్కించింది. సోములమ్మగా ఎవర్కీ తెలీనితను దిబ్బమ్మగా ఆ వూళ్ళో ప్రసిద్ధి కెక్కింది. తన పెనిమిటి పదిహేనేళ్ళు మిలటరీలో సేవచేసినందుకు ఐదెకరాల బంజరు పొలం బహూకరించింది….. ప్రభుత్వం. ఎందుకూ పనికిరాని ఆ భూమి పక్కనే ఐదు వేల మంది పనిచేసే ఫేక్టరీ లేచింది. దాంతో ఆ భూమికి ఎక్కడలేని గిరాకీ వచ్చింది. ఒక ఉద్యోగి వచ్చాడు. ఆ భూమిని ప్లాట్లు వేసి అధిక లాభానికి అమ్మి పెడతానన్నాడు. అందులో నూటికి 10 రూపాయల కమీషన్ ఇమ్మన్నాడు. ఆ వ్యవహారాలు తెలీక తన పెనిమిటి అందుకు ఒప్పుకున్నాడు. చివరికి ఆ ఉద్యోగి కమీ షన్ డబ్బుతోనే ఇల్లు కట్టేయగలేడు. వాడు ఏదో మాయ చేశాడని చాలామంది అంటారు గాని – తనకా లెక్కలు తెలీదు గనక “అవును. మాయ చేసే వుంటాడు దొంగ సచ్చినోడు’ అని అనుకోవడం ఆమె ఇష్టపడదు. డబ్బు తమకీ బాగానే వచ్చి పడింది. కమ్మలిల్లు పెంకుటిల్లుగా మారింది. కూతురికి 5 వేల కట్నంతో, 10 తులాల బంగారంతో పెళ్ళి చేసింది.

    దిబ్బమ్మకి ఒకతే కూతురు. నలుగురు పిల్లలు పుట్టిపోయారు. కూతురు పెళ్ళయి, అత్తవారింటికి పోయేక తనూ పెనిమిటీ ఇద్దరే వుంటున్నారు. ఇప్పటికీ కూర్చొని తినడం ఆమెకి ఇష్టముండదు. తనకిప్పుడు ఎనిమిది గేదెలున్నాయి. ఆ పాలు కంపెనీ క్వార్టర్సులో ఉన్న ఉద్యోగస్తులకి పోస్తుంది. పాలు పితకడం కాడనించి, గేదెల్ని, గేదెలుండే పాకని శుభ్రం చేయడం వర్కూ అంతా తనే చూస్తుంది. తనకి పెనిమిటి చేసేది సాయం మాత్రమే.

    తను కూలి కెళ్ళిన రోజుల్లో రోజంతా కష్టపడితే రెండు రూపాయలు సంపాదించడం బ్రహ్మాండమై పోయేది. అలాంటిది రిక్షావాడికి ఆ పాటి దూరానికే రెండు రూపాయలు కావాలట! అయినా రోజులు మారిపోయేయి. ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయన్న బాధతో బాటు అసలు బజార్లో పూర్తిగా దొరక్కుండా మాయమై పోతాయేమోనని భయం.

    రిక్షా నరిసిగాడు రెండడిగేడు. దిబ్బ సోములమ్మ రూపాయి ఇస్తానంది. సెటిలుమెంటు రూపాయిన్నరకయింది.

    ఏం చేస్తుంది. అర్ధ రూపాయి తగ్గేడు అదే చాలనుకుంది. ఏమంటే ఈ రిక్షా వాళ్ళతో గొప్ప పేచీ ‘రిక్షా అబ్బాయ్, నీ వడిగిన బేరం నేనివ్వలేను, తప్పుకో’ అంటే తప్పుకోడు. మనకి తోవ ఇవ్వడు. మరో రిక్షా దగ్గరకి వెళ్ళనీయడు. మనల్ని వెంటాడుతాడు. వెంట వాడువుండగా మరో రిక్షావాడు ముందుకి రాడు. గొప్ప హింస పెట్టేస్తారు. ఎలాగోలా వాడితో దెబ్బలాడి దూరంగా వుంచి – మరో రిక్షావాడి దగ్గరకెళ్ళి బేరమాడితే… వాడు అంతే! అదే రేటు చెబుతాడు. అంతా ఒకే రేటు. ఒకే కట్టు.

    ఎవడైనా కట్టుతప్పి, రేటు తగ్గించడానికి కక్కుర్తి పడ్డాడో – ఇక వాళ్ళలో వాళ్ళు కొట్టేసుకుంటారు. ఇక ప్రయాణికుడి పని అంతే!

    ఈ గొడవలేం పడకుండా నరిసిగాడి రిక్షాయే బేరం సెటిల్ చేసుకుంది. రిక్షా వరకు పెట్టె పట్టుకోడానికి నర్సిగాడి కివ్వలేదు. ఫర్వాలేదు, తనే పట్టుకుంటానంది దిబ్బమ్మ. అతను పరుగెత్తలేదు. వాడు పెట్టె పట్టుకొని తుర్రున పారిపోతేనో! అమ్మో ఇంకేమయినా వుందా!

    ట్రంకు పెట్టె పైకలా కనిపిస్తోంది గాని… దాని ఖరీదు పదివేలు! –

    రిక్షా ఎక్కడమంటే చిట్టికి చెడ్డ సంతోషంగా వుంది. కాని సీటంతా మామ్మే ఆక్రమించేయడంతో ఏనుగు పక్కన ఎలకలా నక్కి, నలిగిపోవడంతో ముఖం చిన్నబోయింది.

    దిబ్బమ్మకి రైలుదిగిన కాణ్ణించి దాహంగా వుంది. రిక్షాను ఆపించి ఏకొట్టు దగ్గరైనా సోడా తాగుదామనుకుంది. కాని కొట్లు మూసేసి వున్నాయి. పోనీ స్టాండు దగ్గర తాగొచ్చు అనుకుంది.

    స్టాండుకొస్తే – తీరా అక్కడా లేవు కొట్లు! లేకపోతే లేక పోయాయి వెధవ కొట్లు, సోడా తాగడం మానేస్తాం.

    కాని బస్సులు కూడా వున్నట్టు లేవే!

    పిట్టమనిషి కూడా లేడు. రెండు కుక్కలు మాత్రం సరదాగా కరుచుకుంటూ, దొర్లుకుంటూ స్టాండును ఆక్రమించేశాయి. జంక్షనులో హార్బరు కెళ్ళే రోడ్డు కిరువైపులా, ఎల్లవేళలా పచ్చపచ్చగా మెరిసి పోతూ జీవనదులు; ఆ నదుల పై నుంచి వీస్తున్న గాలి మాత్రం ముక్కుల్ని మీరు మూసుకోపోతే మీ ఖర్మ అంటోంది. దిబ్బమ్మకి ఎందుకో గాభరా వేసింది. రిక్షా దిగలేదు. రిక్షావాడు దిగుదిగు అనలేదు. తెల్లబోతూ, బెదురు చూపులు చూస్తున్న ఆమె ముఖం చూస్తుంటే నరిసిగాడికి నవ్వొస్తుంది.

    వాడికి అంతా తెల్సు. కొట్లు లేక పోవడం ఏటో, బస్సులు రాక పోవడం ఏటో తెల్సు! తెల్సు అంతా తెల్సు వాడికి! ఇక్కణ్ణించి మళ్ళీ తనే కట్టక తప్పదనీ, దానికి మళ్ళీ వేరే బేరమనీ…. పెద్ద ఆశేవుంది వాడికి.

    నరిసిగాడు తనకేమీ తెలీనట్టు నడిచిపోతున్న ఒకతణ్ణి ఆపి అడిగేడు – ఏటి బాబు ఏటయింది? కొట్లూ, బస్సులు, ఆటోలూ… ఏటీ లేవేటి?…. ఏటయ్యిందో”.

    “ఈ రోజు బందయ్యా బంద్. ఇంకేం బస్సులు, ఇంకేం కొట్లు, ఇంకేం హోటల్లు! అధిక ధరలకి నిరసనగా బంద్ అని వారం రోజుల్నించి గోల పెడుతున్నారు గదయ్యా” – అంటూ వెళ్ళిపోయాడు అతడు.

    దిబ్బమ్మ గుండెల్లో రాయి పడింది. “ఇపుడేం దారి దేవుడోయ్” అనుకుంది.

    బందులనుంచి రిక్షావాళ్ళకి మినహాయింపు వుంది. ‘రెక్కాడితే గాని, డొక్క నిండని బతుకులు. తొక్కుకోనియ్ – వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం’ అని వదిలేస్తారు బంద్ నిర్వాహకులు.

    ఇప్పుడా అవకాశం తీసుకుని … బేరం మరో… అయిదో, ఆరో కొట్టేయాలని ఆశ పడుతున్నాడు నరిసిగాడు.

    అవకాశం వచ్చినప్పుడు ఎదుటివాణ్ణి అందినంత మేరకి బలిచేసుకోడమే (ప్రస్తుతం అమల్లో వున్న) లోక న్యాయం! అందులో లింగభేదం లేదు. వర్గభేదం లేదు. ‘తప్పు, దోచుకోవడం తప్పు, తప్పు’ అని వచ్చే ఛాన్సు నుంచి తప్పుకుంటే – భవంతులు కట్టడం సంగతికేం గాని, బతకం కష్టమై పోతున్న మాయదారి రోజులు!

    “ఎక్కడ కెళ్లాలమ్మా?”

     “నాతయ్యపాలెం బాబూ”.

    ఏటి! నాతయ్యపాలెవా…. అయ్యబాబోయ్ అంత దూరవే….. సరిపోయింది. తను ఏ పోర్టు క్వార్ట్రర్స్ ఏ షిప్ యార్డో అనుకున్నాడు గాని…. ఎక్కడో బి.హెచ్.పి.వి. దగ్గరున్న నాతయ్యపాలెవంటే ఎవడు వొస్తాడు … తగలగా, తగలగా ఎలాంటి బేరం తగిలిందిరా బాబూ – అనుకున్నాడు నరిసిగాడు చిరాగ్గా

    “బాబూ! ఎలాగోలా నీవే రిక్షా కట్టి పున్నెం కట్టుకో నాయనా” ప్రాధేయ పూర్వకంగా అడిగింది దిబ్బమ్మ. 

    “నాది పిట్రోలు కాత్తల్లీ, రక్తం… నానంత దూరం రాలేను తల్లోయ్” అని బుర్ర అడ్డంగా వూపే శాడు.

    చుట్టూ చూసింది. చుట్టుపక్కల మరేం రిక్షాలు లేవు! ఈ రోజు రిక్షాల డిమాండు అలా వుంది మరి.

    చావుల మదుం కిందనుంచి ఓ పోలీసు వ్యాను వెళ్ళిపోతోంది. నేవెల్ బేసుకి ఏదో జీపు పోతోంది. ఎదురుగా శ్మశానంలోంచి శవం కాలుస్తున్న పొగ వస్తోంది. కుష్టివాడిని ఒక చక్రాల తొట్టెలో లాక్కు పోతున్నాడు ఏ కుష్ఠ లేని పదేళ్ళబాలుడు.. కూలికి! –

    “అలాగ అనేయకు బాబు. ఎంతకైతే కడతావో అడుగు. అంతేగాని కట్టననేస్తే మేం చచ్చి పోవాఁ”అంది దిబ్బమ్మ.

    నరిసిగాడు తల గోక్కొని, ముఖం అదోలా పెట్టి అన్నాడు – “ఇరవై అవుద్దమ్మా… ఈ రూపాయి న్నర కాక”.

    కడ్తానన్నాడు అదే సంతోషం అనుకుని “మళ్ళి రూపాయిన్నర యెందుకు. మొత్తం ఇరవై చేసుకో బాబూ” అంది.

    “అదేం కుదర్దు” అన్నాడు నరిసిగాడు. “సరే, పోనియ్ బాబు” అంది దిబ్బమ్మ.

    స్టాండుకి రూపాయిన్నర పోయడానికి గిజగిజలాడిన దిబ్బమ్మ మరో ఇరవైకి వెంటనే ఒప్పేసు కుంది. ఒప్పుకోక చస్తుందా!

    దిబ్బమ్మ యెంతంటే అంతకి ఒప్పేసుకోడంతో – మరో అయిదు ఎక్కువ అడిగి వుండాల్సింది, అయ్యయ్యో! అని బాధ పడ్డాడు నరిసిగాడు.

    ఎండ తీక్షణంగా వుంది. ఇంటికెలా చేరాలనే భయం. కలవరపాటులో తన దాహం సంగతే మర్చిపోయింది.

    చావులమదుం కిందనుంచి చావుడప్పుల బాజాలతో ఊరేగి వసోంది ఒక శవం! పాడెవెనకాల పడుతున్న పైసలకోసం నలుగురు దిసమొల కుర్రాళ్ళు పడి కొట్టుకు చస్తున్నారు. స్టాండులో నున్న రెండు కుక్కలు ఆడుతున్న ఆటలు ఆపేసి దీనంగా, భయంకరంగా అరవడం మొదలు పెట్టాయి. దిబ్బమ్మ ఆ కుక్కల అరుపులు భరించలేక చీ ఛీ అని కేకలు వేసింది. ఆ కేకలకి కుక్కలు చలించలేదు. రిక్షా కదలడానికి గ్రీన్ సిగ్నల్ యిచ్చినట్టు మదుంమీద నుంచి రైలు కూత పెట్టింది.

    రిక్షాకి పాడె ఎదురురావడం యిష్టం లేదు దిబ్బమ్మకి. గబగబా దాటించేయమంది రిక్షాని.

    చిట్టి పెళ్ళి పల్లకీని చూసి ఆనందించినట్టే, ఆ పాడెను కూడా క్యూరియస్ గా, కళ్ళార్పకుండా చూస్తోంది. ఇంటికెలా చేరాలనే భయమే కాదు, ఏ బాధా, భయం లేని వరం లాంటి వయసు ఆ పాపది.

    రిక్షా కదులుతుండగా దిబ్బమ్మ మనసులో ఏడుకొండలవాణ్ణి తలచుకుంది. ఇంటికి క్షేమంగా చేర్చు తండ్రీ, ఈ పసిపిల్లతో, ఈ ట్రంకు పెట్టెతో నన్ను ఒడ్డుకి పడేయ్ తండ్రి’ అని ప్రార్థించింది.

    ధరల పెరుగుదలకి నిరసనగా బంద్ జరుపుతున్నందుకు దిబ్బమ్మ విసుక్కోవడం లేదు. దురదృ పవశాత్తు బంద్ కి దొరికిపోయినందుకు తనను తాను నిందించుకుంటోంది. తనలాంటి ఏ ఒక్క వ్యక్తో ఇబ్బందుల పాలవుతారని ప్రజల ఉద్యమాలనే తప్పు పట్టడం తప్పు కాదూ?

    జరుగుతున్న బంద్ ధరల పెరుగుదలకే కాదు, క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితికి కూడా నిరసన అని ఆమెకి తెలీదు.

    మనిషికి సెక్యూరిటీ అంటూ ఒకటి లేకుండా పోయింది. గుండెమీద చేతులేసుకుని ఎవరూ నిద్రపోలేక పోతున్నారు. నిర్భయంగా, నిశ్చింతగా వుండలేక పోతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అలజడులు, దుర్మార్గాలు, ఇంటినుంచి బయటికెళ్ళిన పెనిమిటి తిరిగి ఇంటికి చేరేవరకు ఇల్లాలికి పీచుపీచు భయం! ఇంట్లో వంటరిగా వున్న తన ఇల్లాలిపై ఏ అత్యాచారాలు సాగుతాయో, ఇంటిపై ఏ రాబందులు వాలేయో – అని అవతల భర్త భయం. బతికే బతుకంతా భయం, భయం అయిపోయింది.

    వంటరిగా ప్రయాణం చేస్తున్న ఆడమనిషిపై జరిగే అత్యాచారాలకి అంతే లేదు. ఆరేళ్ళ పసిపాపనే కాదు, ఎనభయ్యేళ్ళ ముసలమ్మనే మానభంగాలు చేసేస్తున్నారు. బంగారం కోసం చెవుల్నీ, ముక్కుల్నీ కూడా నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఏ మగతోడు లేకుండా ఒంటరిగా పదిమైళ్ళ దూరం ప్రయాణం చేస్తోంది దిబ్బమ్మ. ఎన్‌హెచ్ 5 రోడ్డుకి టర్నయి, కాకాని నగర్ దాటేక – నాతయ్యపాలెం చేరేదాకా ఒక్క యిల్లుగాని, పిట్టమనిషి గాని కనిపించరు! దిబ్బమ్మ చెవులకి పోవుఁలున్నాయి. ముక్కుకి నత్తువుంది. మెళ్ళో గొలుసు వుంది. చిట్టిచెవులకి రింగులున్నాయి. అంతేకాదు పెట్టెలో బంగారం ఎనిమిది తులాలు వుంది!

    అల్లుడు చేస్తున్న ఉద్యోగం మానేసి ఆ బంగారంతో ఏదో వ్యాపారం చేస్తానంటున్నాడు. కూతురుకది ఇష్టం లేక, మొగుడెక్కడ బంగారం లాగేసుకుంటాడోనని (అప్పటికే రెండు తులాలు ఆర్పేశాడు!) తల్లి చేతికిచ్చేసి నీ దగ్గరే వుంచమ్మా అంది. తీసుకు వెళ్ళిపో అమ్మా అంది. తీసుకు వస్తోంది తను. బంగారం మోసుకెళ్ళడం ఇంత ఇబ్బందని అనుకో లేదు. సిటీ బస్సే వుంటే ఇబ్బందే అన్పించక పోను!

    ఎండ నిప్పులు చెరుగుతోంది. రోడ్డుమీద తారు మెత్తగా కరుగుతోంది. ఎక్కడో ఇళ్ళంటుకున్నట్టు న్నాయి – ఫైర్ సర్వీస్ లారీలు గణగణ గంటల చప్పుడుతో తాపీగా పోతున్నాయి! రోడ్డు కిరువైపులనున్న దుకాణాలు మూసేసి వున్నాయి. మెడికల్ షాపువాడు నా దుకాణం కేం ఫర్వాలేదు అని ధైర్యంగా తెరిచే వుంచాడు. ఒకటి, రెండు చోట్ల కొద్దిగ తలుపులు తెరిచి తొందర, తొందరగా, భయం భయంగా

    అమ్మకాలు చేస్తున్నారు. 

    బంద్ తోపాటు భీకరమైన ఎండ కాస్తుండటం చేత రోడ్డు మీద జనం లేరు.

    అక్కడక్కడ పోలీసులు లాటీలు, తుపాకులతో వున్నారు. అయిదు నిమిషాల క్రితమే కర్వ్యూ సడలించి 144వ సెక్షను పెట్టినట్టు నిస్తేజంగా వుంది రోడ్డు.

    దిబ్బమ్మకి బెంగగా, గాబరాగా వుంది. రిక్షా వెళ్తూంటే తోవలో పైడితల్లమ్మ గుడి తగిలింది. నరసిగాడి చేతిలో పావలా పెట్టి ‘బాబూ ఆ యమ్మ హుండీలో వేసిరా బాబూ’ అంది. తర్వాత రామమందిరం తగిలింది. రిక్షాలోంచే దండం పెట్టుకుంది. రిక్షా అప్ ఎక్కేక ముత్యాలమ్మ గుడి… తను లెంపలు వాయించుకు దండం పెట్టింది. పక్కనే శివుడి కోవెల! తనే కాక చిట్టిచేత దండం పెట్టించింది. దండం పెడుతున్న చిట్టికి ఏం జ్ఞాపకం వచ్చిందో ఏమో ‘మామ్మా! ఆకలి’ అంది. ఇదిగో ఇంటికొచ్చే సేం అంటూ మరిపించడానికి మనవరాలిని మాటల్లోకి దించింది మామ్మ? ఆ చిట్టి ఆపకుండా ఏవేవో పిచ్చి, పిచ్చి ప్రశ్నలు వేసి వేధిస్తోంది.

    సాధ్యమైనంతవరకూ చిరాకు పడకుండా పిల్ల యక్ష ప్రశ్నలకి సమాధానం చెబుతోంది దిబ్బమ్మ.

    రిక్షా కీచుకీచుమని వెల్తోంది. స్పీడు లేదు. నరిసిగాడు హుషారుగా ఫెడలు వేసినప్పటికీ చక్రాలు సర్రున పరుగుదీయడం లేదు. డొక్కు రిక్షా! పోనీ డొక్కుకైనా ఏనాడైనా ఆయిలింగ్ చేసిన పాపానికి పోతేనా!

    గట్టిగా పెడలు వేస్తున్నప్పుడు చైను ఫట్ ఫట్ మంటోంది. వాడికి దిబ్బమ్మ నెక్కించుకొని రిక్షా తొక్కడం – నడుం మీద వంద కేజీల బియ్యం బస్తాని వేసుకు మోస్తున్నట్టే వుంది.

    రోడ్డంతా ఎగుబోటు!

    మరిక ఫెడలు వేయడం కష్టమయి ‘దీనమ్మ’ అని కిందకి దిగేడు. కాళ్ళు చుర్రు మంటున్నాయి. తారు చురకలు పెడుతోంది. ఎడమచేయి హాండిలు మీద వేసి, కుడి చేయి వెనుక ఐరస్టాండు మీద వేసి బలంగా లాగుతున్నాడు. తన శక్తినంతా కూడదీసి వంగోని లాగుతుంటే తనకి ముందు చక్రం మూడు చక్రాల్లా కన్పిస్తోంది. కళ్ళమీద చమటపడి మసక కమ్మేస్తోంది. మోచేతి బనీనుకి ముఖం తుడుచుకుంటూ రిక్షాని ముందుకి పోనిస్తున్నాడు. నుదుటిపై చెమటబొట్లు రోడ్డుపై పడి, అంతలో ఆవిరై పోతున్నాయి.

    రిక్షాకి అడ్డంగా గజ్జి కుక్క వచ్చింది. ‘ఛత్తల్లి… నీయమ్మ’ అని దాన్ని ఒక్క తావు తన్నేడు. అది కుయ్ కుయ్ మని పరిగెట్టింది. రిక్షాని అంత కష్టంగా లాగుతున్నప్పుడు నరిసిగాడి కెంతో కసిగా, కచ్చగా వుంటుంది. ఆ కసి, కచ్చ ఎవరి మీదో తెలీదు. ఆ సమయంలో కుక్కేకాదు లారీ. రిక్షా, మనిషి… ఏ అడొచ్చినా, ఎవరు అడొచ్చినా ఎగిరిపోయి బూతులు అందుకుంటాడు.

    గంటసేపు తొక్కితే – ఇంకా సగం దూరమైనా రాలేదు. ఛత్తిరి!… ఇరవై రూపాయలకి కక్కుర్తి పడిపోయి తొక్కలేని దూరానికి ఒప్పుకున్నాను. అంతా ఎగుబోటు. ఎదురు గాలి, మిట్ట మధ్యాహ్నం. కూర్చున్నది దిబ్బది! రిక్షా డొక్కుది…. ఏదైనా రిక్షాకి తన బేరం అప్పగించేసి తప్పుకుంటే బాగుణ్ణు అనిపిస్తోంది. అడివిలోంచి ఎడారిలో కెళ్ళడానికి తను కాబట్టి ఒప్పేసుకున్నాడు గాని బుద్ధి, బుర్రా వున్న ఏ రిక్షా నా కొడుకు కట్టడు, కట్టడు – అనుకున్నాడు నరిసిగాడు.

    తెల్లారి కొట్టిన గిన్నెడు చద్దన్నం ఏ మూల కెళ్ళిపోయిందో… లోన పేగుల్ని ఎలుకలు కొరికేస్తు న్నాయి.

    దిబ్బమ్మకి చెమటలో తడిసిన వాడి కండలు యినప దిమ్మలా కన్పిస్తున్నాయి. చేతులపై నరాలు ఎత్తుగా ఉబ్బేయి. పొట్టి నిక్కరులోంచి తొడలు, పిక్కలు రాళ్ళలా కన్పిస్తున్నాయి. గోడకి పోస్టరు అంటించినట్టు బనీను వీపుకి అతుక్కుపోయింది. బనీను మీద కన్నాలు అయిదు లెక్క పెట్టింది చిట్టి. 

    చిన్నకొండలా వున్న కొత్త రోడ్డు బ్రిడ్జి దాటేటప్పటికి పన్నెండు సైరను ఊదింది. రిక్షా సింహాచలం రోడ్డు దాటి ఎన్ హెచ్ 5 రోడ్డులో వుందిప్పుడు. బ్రిడ్జ్ కింద వంకర వంకరగా తిరిగివున్న పట్టాలు – పాదరసం పరుగుతీస్తున్న గొట్టాల్లా ఉన్నాయి. తాగేసో, లేక మూర్ఛపోయో ఒకడు పక్కన పడి వున్నాడు. ఆ బ్రిడ్జి దగ్గర అర్బన్ ఏరియా దాటి రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతున్న వారికి మున్సిపాలిటీ ‘థాంక్యూ’ అని బోర్డు కట్టి చెబుతోంది. 

    ఆ రిక్షా బ్రిడ్జి నెక్కడం ఎంత కష్టమయిందో, దిగడం అంత ఈజీగా వుంది, కాని ఎదురుగాలి అటకాయిస్తూనే వుంది.

    ఇక ఎదురుగా ఎడారి. రోడ్డు పక్కన ఒక ఇల్లు లేకపోతే పోనీ, నీడనిచ్చే ఒక చెట్టు కూడా లేదు. అంతా డ్రయ్ ఏరియా. ఈ ఎడారిలో గంట సేపు ఈదుకెళ్తే గాని నాతయ్యపాలెం అంచులు దొరకవు. – చిట్టి సీటులో ఒద్దికగా కూచోకుండా నించొని, పెట్టె తొక్కి, అటుకదిలి, ఇటు కదిలి, స్టాండు పట్టుకు వూగి ఎంత అల్లరి చేసినా భరించింది దిబ్బమ్మ. అడిగిన లక్షయక్ష ప్రశ్నలకీ జవాబులు ఇచ్చింది. చిట్టిది పట్టిందేపట్టు – దాహం. ఆకలి అనడం లేదు. అదే చాలు అనుకుంటోంది. నెమ్మదిగా ఇంటిదాకా ఓపిక పడితే ఏదైనా గబగబా వండి పడెయ్యొచ్చు.

    కాని అనుకున్నట్టు జరగలేదు. – అకస్మాత్తుగా ఆకలేస్తోందని రాగం తీయడం మొదలుబెట్టింది చిట్టి. ఎంత నచ్చ చెప్పినా, ఎన్ని మాయమాటలు ఆడినా వినిపించుకోలేదు. పోనీ ఏదైనా కొని పడేద్దామన్నా గడ్డితప్ప ఎక్కడా ఏమీలేదు.

    అయిదు నిమిషాలు నచ్చజెప్పచూసి, విసిగి వీపుమీద రెండు బాదులు బాదింది. నెత్తిమీద రెండు మొట్టికాయలు మొట్టింది. ఆ – చిట్టి గొప్ప మాటకారి. చిట్టిచేత ఏవేవో మాట్లాడించుకుని, వినడం, మురిసిపోవడం దిబ్బమ్మకి ఇష్టం. స్కూలు సెలవులివ్వడంతో చిట్టిని వెంటేసుకు వచ్చింది.

    ఎప్పుడూ కొట్టని మామ్మ కొట్టడంతో చిట్టికి కోపం, రోషం వచ్చింది. “నీ జుట్టు పీస్…. నీవు నా కొద్దు. మా అమ్మకాడికెళిపోతాను” అంది. 

    “ఎళ్లిపోయే సిగురుగుంట…. ఒవుల్నే బెదిరిస్తావు”.

     “అవుతే నన్ను దిగబెట్టేయి మా ఇంటికి”.

    “ఆఁ! నాకు పట్టింది బాధ” అంది ఒళ్ళు మండి. అంత మంటలోనూ మనవరాలితో వాదన సరదాగా వున్నట్టుంది దిబ్బమ్మకి.

    “నాకేం బయ్యివేఁటి? నేనెళ్ళి పోగల్ను”.

     “పో అయితే”. 

    “డబ్బులియ్యి”. 

    “తొంగుడున్నాయి”. 

    డబ్బులు తొంగుడోడవేవిఁటో చిట్టికి అర్థం కాలేదు. మొత్తానికి డబ్బులివ్వనంటుందని అర్థమయ్యింది.

    “అవుతే, మా నగలిచ్చే సేయ్”…

    “ఏం నగలు? మీ బాబూ సంపాయించేడా? మీ యమ్మ సంపాయించిందా”.. 

    “అదేం కాదు… మా అమ్మవి, ఇచ్చేయ్” – రోషంగా మామ్మగుండెల మీద రుద్దుతూ అంది. మనవరాలితో అలా గుండెల మీద గుద్దించుకోవడం సరదాగానే వున్నట్టుంది దిబ్బమ్మకి.

    “ఇస్తావా, లేదా?”

     “తచ్చాడుతున్నాయి లచ్చోరం సంతలో”.

    సంతలో తచ్చాడ్డం ఏమిటో అర్థంకాక – “అదేం కాదు, నాకు తెల్సు. ఇగో ఈ పెట్టెలో వున్నాయి మా అమ్మ నగలు” తెలియజేసింది గొప్పగా.

    ఆ దెబ్బతో దిబ్బమ్మకి మురిసిపోతున్న మనవరాలి ముచ్చటా, గిచ్చటా ఎగిరిపోయేయి. ఆమె గుండెలు ఒక నిమిషంపాటు కొట్టుకోవడం మర్చిపోయేయి. రిక్షావాడు వినేశాడు… వినేశాడు. అవునే వినేశాడు. అమ్మ నాయినో ఇంకేం వుంది. అదిగో రిక్షా ఆపేశాడు… ఎంత పని చేశావే గుంటా? ఇంకేం వుంది… అయిపోయింది, అంతా అయిపోయింది. దేవుడోయ్… అయిపోయింది… పెట్టెలంకించుకు పోతాడు. ఇక నేనేం చేతును దేవుడోయ్….

    చిట్టిని శుభ్రంగా రెండు చేతుల్తో దబదబా మొత్తేసింది. ‘చావే గుంటా, చావు’ అని జుత్తు పీకేసింది.

    నరిసిగాడు రిక్షాని ఆపేడు. 

    రోడ్డుకి ఎడమవైపున పచ్చపచ్చగా మెరిసిపోతూ పొలాలు. ఆ పచ్చని పొలం పక్కనే గాలివాన తుప్పలు, తుమ్మచెట్లతో నిండిపోయిన బీడు నేల. కాళ్ళూ, చేతులూ, ముక్కూ, ముఖం చెక్కేసినట్టున్న తవ్వినంత తవ్వి వదిలేసిన మొండి కొండ! విశాలంగా లేని చిన్ని ఏరోడ్రాంలో పెద్ద పక్షి ఏదో వాలినట్టు విశ్రాంతి తీసుకుంటున్న విమానం! రోడ్డు కిరువైపులా కాస్త దూరంలో దట్టంగా పెరిగిన సరివిడి తోట. ఆకాశం అంచుల్ని వంకరటింకరగా కత్తిరించినట్లు చుట్టూ కొండలు, కొండలు! సింహాచలం కొండ వెండి జరీ తలపాగ చుట్టుకున్నట్టు శిఖరాన్ని చుంబిస్తూ తెల్ల మబ్బులు! చెట్లు, తుప్పలు. రాళ్ళ గుట్టల మధ్య నుంచి కొండచిలువలా పాకుతూ రైలు…. చిట్టి అంత ఏడుపులోనూ రైలుని దీక్షగా కళ్ళార్పకుండా చూస్తోంది.

    “ఎందుకు తల్లీ పిల్లనలా బాదేస్తావు” అన్నాడు నరిసిగాడు. అంటూ దగ్గరకొచ్చేడు. ఒక చేయి పెట్టె మీద...

    46 min
  • 'పేపర్ టైగర్' - ఎన్ ఎస్ ప్రకాశరావు గారి రచన

    ఎన్ ఎస్ ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. ‘ఎన్నెస్ కథలు’ వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

    ముందుగా ఈ కథ గురించి ‘ కథా’ నవీన్ గారు మాట్లాడతారు. కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి, ముందు మాటనందించిన నవీన్ గారికి కృతజ్ఞతలు. 

    “ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహం గారు, కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా వుంది.

    ‘నువ్వు ఇప్పుడిప్పుడే నన్ను వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నట్టు విన్పించింది ‘అబ్బాయ్’కి. అబ్బాయ్ పేరు వరప్రసాదరావు, అతనా గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడనడం కంటే సోఫాని ఆనుకొని ‘గోడ కుర్చీ’ వేసేడనడం సబవు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహంగారు, ఏం చేసేస్తారో అని భయపడుతున్నవాడిలా వున్నాడతను. .

    ఆ సాయంకాలం అతను నరసింహం గారింటికి వస్తూ వుంటే, అల్లంత దూరంలో వుండగానే టపటపా చినుకులు పడ్డం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా వొంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జాత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్ళతో కలిపి, నూనె తలమీంచి కారి మొహమంతా జిడ్డులా తయారయింది. నరసింహంగారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి, వరండాలో నుంచుని రుమాలుతో – తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కేడతను.

    ఆ సమయంలో నరసింహం గారొక్కరే ఇంట్లో వున్నాడు. ఆయన కొడుకూ, కోడలూ, మనవలూ అంతా ఏదో పార్టీకి వెళ్ళేరు. –

    కాలింగ్ బెల్ విని ఆయనే తలుపు తీసేడు. తలుపు తియ్యగానే – చామనచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్క పలుచనివాడు – వర ప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూసేక, లోపలకు రమ్మనాలో, బైటవుంచి ‘ఏవరికోసవని’ అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకొని ఒక్క క్షణం ఆలా నిల్చుండిపోయేడాయన..

    నరసింహంగారిని చూడగానే వరప్రసాదరావు నోరు పెగల్లేదు. పెద్దపులిని చూచినట్టు ఒక్కసారి జడుసుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చెయ్యమని మరీ మరి చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయేడు. నరసింహంగారి మొహం చూసూనే ఎందుకోగాని గాభరాపడిపోయేడా కుర్రవాడు.

    నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో ఒక ప్రాక్టీసు వుంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసి నవ్వులు చిందిస్తాడో, అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవలసొస్తే అంత కటువుగానూ వుండగలడు. పూర్వంకూడా తన క్లయింట్లతోనూ, జడీలతోనూ ఎంత మృదు మధురంగా మాట్లాడేవాడో తమ వూళ్ళో రైతులతోటి, కూలీలతోటీ అంత కర్కశంగా మాట్లాడేవాడాయన. ఎవరెనా కొత్తవాళ్ళను చూసీ చూడ్డంతోపే, విధిగా ఆయన ముఖంలో రంగులు మారతాయి. అవతలవాణ్ణి చూస్తూనే ఒక అంచనా వేసుకొంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడం ‘గంభీరంగా పెట్టడవా’ ‘ప్రసన్న గంభీరంగా పెట్టడవాఁ’ అన్నది తేల్చుకొంటాడు.

    కాని వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు.

    ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ వుత్తరం తీసి ఇచ్చేడు. అది చూస్తూనే, అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకొన్నాడు నరసింహంగారు.

    “రా లోపలికి” అన్నాడాయన.

    తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి, చిన్న పొంగు పొంగిపోయేడు. వరప్రసాదరావు,

    కాని,

    వెంటనే నరసింహంగారు జోళ్ళు ………. అంటూ అర్థాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడా అబ్బాయి.

    ఆ కుర్రవాడి జోళ్ళు చిరు బురదతో వున్నాయి. “ఆయన చెప్పబట్టి సరిపోయింది కాని, అమ్మబాబోయ్! ఆ జోళ్ళతో లోపలికి వచ్చేస్తే ఇంకేదన్నా వుందా?” అనుకొని మనసులోనే ఫెడీ ఫెడీమని లెంపలు వాయించేసుకొన్నాడు వరప్రసాద రావు.

    జోళ్ళు బైటే వదిలి, లోపలికి వచ్చి సోఫాముందు ‘గోడ కుర్చీ’ వేసేడా కుర్రవాడు. “సరిగా కూర్చో పరవాలేదు’ అందామని నోటిదాకా వచ్చింది కాని మరెంచేతో నరసింహం గారు అనలేదు.

    ఆ కుర్రవాడి తాతగారూ, నరసింహం గారూ, చిన్నప్పుడు క్లాసుమేట్సు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ – ‘చదువు లేకపోతే మన బతుక్కి మరో దారీ తెన్నూ లేదు. చదువుకోకపోతే మట్టి కొట్టుకు పోతాం సుమా – అనుకొని కష్టపడి చదువుకొన్న వాళ్లే కానీ , పెద్దలు చెప్పినట్టు రోజులు అందరికీ ఒక్కేలా వుండవు కదా!

    నరసింహంగారికి రోజులు మారేయి. దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి – తన బాగుకోసం, అవసరం వస్తే – ‘అమ్మ లేదు, నాన్న లేడు, అన్న, చెలి ఎవరూ లేరు లేరంటే లేరు’ అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో గాని, పసిగట్టేరొక పెద్ద ప్లీడరుగారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి ‘జ్ఞానోదయం’ కలిగినందుకు తెగ మురిసి పోయేడాయన.

    ఆ తరువాత నరసింహంగారు – ఆ ప్లీడరు గారింటికి ఇల్లరికపుటల్లుడుగా వెళ్ళేడు; మద్రాసుకీ ‘లా’ స్టూడెంటుగా వెళ్ళేడు. కోర్టుకి మావగారి జూనియర్ గా వెళ్ళేడు. ఆ తరువాత ఎన్నెన్నో చోట్లకి ఎంతో గొప్పగా, గర్వంగా వెళ్ళేడు.

    నరసింహంగారికి భగవంతుడంటే, చెప్పలేనంత భక్తి. కాని ఆయనకి మావగారంటే అంతకన్న ఒక్క పిసరు ఎక్కువ భక్తి. ఆయన పావుగంట సేపు మాట్లాడేడంటే అందులో అరగంట సేపు మావగారిని గురించి రిఫరెన్సే వుంటుంది.

    నరసింహంగారికిప్పుడు ముగ్గురంటే ముగ్గురే మగపిల్లలు. ఆయన పెద్ద కొడుకు బొంబాయి దగ్గిర ఏదో ఆయిల్ రిఫెనరీలో జనరల్ మేనేజర్ హోదాకి ఒకే ఒక మెట్టు కింద వున్నాడు. అందుగురించి నరసింహంగారెప్పుడూ చిరాకు పడుతూనే వుంటారు. రెండో కొడుకు ఈ వూళ్ళోనే యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా వున్నాడు. అతను ఇప్పట్లో ప్రొఫెసరవాలంటే, ఇప్పుడు ప్రొఫెసరుగా వున్నాయన హఠాత్తుగా హారీమవడం ఒక్కటే మార్గం.

    అది తల్చుకున్నప్పుడల్లా నరసింహంగారికి ఆ ప్రొఫెసర్ పీక పిసికేద్దాం అన్నంత కోపం వస్తూంటుంది. మరి మూడోవాడు అమెరికాలో రిసెర్చి చేస్తున్నాడు. అమెరికాలో ‘స్టూడెంట్ రివోల్ట్’ గురించి ఎప్పుడయినా పేపర్లో చూసినప్పుడు కించిత్తు గాభరా పడినా, మొత్తంమీద నరసింహంగారికి ఆ చిన్నవాణ్ణి గురించిన చింతేమీ లేదు.

    ఇక ఆ సమయంలో నరసింహంగారి పుట్టింటివాళ్ళ దశకూడా మారింది. చదువు చదివి నాలుగు రాళ్ళు సంపాదించి, కుటుంబాన్ని లేవనెత్తుతాడనుకున్న నరసింహం, నడి సముద్రంలో సంసారాన్ని వదిలి పూలపడవలో తన మానాన్న తను పారిపోతే –

    ఆయన పెద్ద చెల్లెలు చాలాకాలం పెళ్ళి కాక అలా వుండి వుండి ఆఖరికి వురి పోసుకు చచ్చిపోయింది. రెండో చెల్లి ఎవరో ముసిలి ప్లీడరుగారికి మూడో భార్యగా వెళ్ళిపోయింది.

    ఆయన అన్నయ్య టీ.బీ.తో ఆమధ్యనే పోయేడు. అన్నగారి భార్యా, పిల్లలు అంతా ఎక్కడుంటున్నారో, ఏవయిపోయారో ఎవరికీ తెలీదు. తండ్రి చిన్నప్పుడే పోయినా నరసింహంగారి తల్లి మటుకు చాలాకాలం పీనుగు బతుకు బతికింది. ముసిలిముద్ద అయిపోయి, పక్క మీద బట్ట మార్చిన వాళ్ళు లేక, ఆఖరవస్థలో మరీ ఘోరంగా రోజుకి నలభైసార్లు మంచం దింపేస్తూ వుంటే; వీధరుగుమీద పారేస్తే బతికుండగానే చీమలు పట్టిపోయి, ఈగలు ముసిరిపోయి, దెయ్యపు చూపు వచ్చేసి; మందుమాకుల్లేక, చల్లనిమాట మాటాడే మనిషి లేక, నానాయాతనాపడి ఆవిడ ఆఖరికి ఆ దీనబాంధవుడి సన్నిధి చేరుకుంది.

    మరి అదే సమయంలో వరప్రసాదరావు తాతగారి ‘దశ’ కూడా మళ్ళింది. హఠాత్తుగా తండ్రి చచ్చిపోవడంతో, ఇంటరుతోనే చదువాపేసాడాయన. ఆ తరువాత చిన్న చిన్న వుద్యోగాలు చాలా చేసేడు. “పిల్లకింత తిండి పెట్టగలిగినవాడు చాలు” ననుకొంటున్న మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకూ.

    కొడుకు ఏదో ఫేక్టరీలో పని చేస్తూ నిచ్చెన జారి, నీళ్ళ టాంకులో పడి చచ్చిపోయేడు. ఫేక్టరీ యజమానులు మురిపించి మురిపించి యిచ్చిన కాంపెన్సేషన్ చేజిక్కించుకొని అతని భార్య పుట్టింటికి చేరింది. రెండో కూతురు కాపరం పరవాలేదు కాని, పెద్ద దాని మొగుడికి స్థిరం లేదు. అతను నెల్లాళ్ళు వుద్యోగం చేస్తే, రెండు నెలలు ఇంట్లో కూర్చుంటాడు. రెండునెల్లు ఇంట్లో కూర్చుంటే నాలుగు నెలలపాటు ఎక్కడిపోతాడో ఏవిటో పత్తా లేకుండా పోతాడు. వాళ్ళకి అయిదుగురు పిల్లలు. పెద్దవాడు వరప్రసాదరావు,

    వరప్రసాదుణ్ణి వాళ్ళ తాతగారే బియస్సీదాకా చదివించేరు. ఆకాడికే బ్రహ్మాండవై పోయింది. అంతకి మించి ఆయనకీ శక్తి లేదు. అందుకే – వరప్రసాదరావు వుద్యోగం ప్రయత్నం మొదలు పెట్టాడు. ఏడెనిమిది నెల్లపాటు, అతను వుద్యోగం కోసం చెడ తిరిగేడు. ఇతను వుద్యోగం అడిగిన చోటల్లా, వాళ్ళు ఇతన్ని లంచం అడిగేరు: రికమండేషన్ లెటరడిగేరు. రెండూ అక్కర్లేనివాళ్ళు కులం అడిగారు. కులం సరిపోయిన చోట శాఖ అడిగేరు. అన్నీ అడిగేరు కాని ఇతనడిగింది మట్టుకు ఇవ్వలేదు.

    అలాంటప్పుడు – గోదావరి వరదలో కొట్టుకుపోతున్న వాడికి, గడ్డి కుప్ప దొరికినట్లు నరసింహంగారు గుర్తుకొచ్చేడు. ఆయన్ని గురించి తాతగారు చెప్పింది వింటూ వుంటే, కల్పవృక్షమో కామధేనువో మన తాతగారి బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు ఫీలయేడు వరప్రసాదరావు, మనవడి చేతికి వుత్తరం ఇచ్చి పంపించారు తాతగారు.

    “ఈ బాలకుడు నా మనవడనీ; వీడి తండ్రికి స్థిరం లేదనీ, అందువల్ల తల్లీ నల్గురుపిల్లలూ మలమల మాడిపోతున్నారనీ, మీ పిల్లల ద్వారా కాని, మీకు తెలిసిన పెద్దవాళ్ళ ద్వారా కాని చిన్నదైనా సరే, ఏదో వుద్యోగం ఒకటి ఇప్పిస్తే, చచ్చి మీ కడుపున పుడతాసనీ; ఈ వుపకారం చేసి పెట్టినందుకు ఆ అనాధరక్షకుడు మీకు ఇందుకు వెయ్యి రెట్లు మంచి చెయ్యకపోడనీ; స్వయంగా వచ్చి కష్టసుఖాలు చెప్పుకొందికి తన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదనీ”- ఆ వుత్తరంలో వుంది.

    వరప్రసాదరావు, సోఫాలో సరిగా కూర్చుందామని రెండు మూడు సార్లు అనుకొన్నాడు కాని ఎందుకో భయపడిపోయాడు. తలెత్తి చూశాడు. నరసింహంగారు ఉత్తరం చదువుతున్నాడు. ఆయన వెనకాల గోడమీద ఫొటో చూసి గతుక్కుమన్నాడా కుర్రవాడు.

    ఆ ఫొటో అందమైన ప్రేములో బిగించి వుంది. అది ఎవరో పెద్దమనిషి ఫొటో, ఆ పెద్దమనిషి ముఖం – గంభీరంగా పెట్టబోయి, భయంకరంగా పెట్టినట్టు వుంది. పెద్ద తలపాగాతో ఆయన తల రెండింతలు పెరిగినట్టు కనిపిస్తోంది. దోసగింజంత బొట్టు, ఆయన కనుబొమల మధ్య మెరుస్తోంది. ఎక్కుపెట్టిన ఆయన మీసాలు, ఎవరివో తెచ్చి అతికించుకున్నట్లు వికృతంగా వున్నాయి. నల్లటి చీకటి కోటులోంచి బయటకు వచ్చిన ఆయన కంఠం, తెల్లగా సున్నం వేసుకొన్నట్లు వుంది.

    మొత్తంమీద ఆ ఫొటోలో వున్న విశేషం ఏమిటోగాని దానివేపు మరొక్కమారు చూడ్డానికి భయపడ్డాడు వరప్రసాదరావు.

    నరసింహంగారు పుత్తరం చదివి, ముడిచి టీపాయ్ మీద పెడుతూ ఒక నిట్టూర్పు, విడిచాడు. పరధ్యానంగా వున్న వర ప్రసాదరావు ఫొటోలో వున్నాయనే నిట్టూర్చేడనుకొనివులిక్కిపడ్డాడు. అయితే, యిప్పుడు మీ తాతకి వొంట్లో కులాసాగానే వుందా?……. అఫ్కోర్స్ ఓల్డ్ ఏజ్. నాయీడు వాడు. నాకూ యీమధ్య వొంట్లో బావుండటం లేదబ్బాయ్ ! మా పిల్లలు ‘ఇంకా మీరు కోర్టుకి వెళ్ళడం ఏవిటి నాన్నారూ!’ అంటే ఏణ్నర్థం నుంచి ప్రాక్టీసు వదిలేసేను……. మీ తాత ఇంకా ఏదైనా పని చేస్తున్నాడా?….. అని ఏదో ఆలోచిస్తున్న వాడిలా ఆగిపోయేడు నరసింహంగారు.

    వరప్రసాదరావు ఏం మాట్లాడలేదు. అతనికిందాకట్నించి చేతులు ఎక్కడ పెట్టుకోవడమన్నది పెద్ద సమస్య అయిపోయింది. సోఫా మీద చేతులు పెట్టడానికి అతనికి భయంగా వుంది. ముణుకులమీద పెట్టుకుంటే కూర్చోడం కష్టంగా వుంది.

    దానికి తోడు రాగానే నమస్కారం చేయ్యలేదన్న విషయం, అతనికి హఠాత్తుగా గుర్తుకి వచ్చింది. మహా పాపకార్యం ఏదో చేసినట్టు భయపడిపోయాడు. “ఇప్పుడు మధ్యలో నమస్కారం చేస్తే ఏం బావుంటుంది? మరింక వుండబటలేక పైకే “ప్చ్” అనేసాడు.

    “నేను ఎవరితో చెప్పాలంటే వాళ్లతో చెప్తానబ్బాయ్! కాని చూడూ, వెధవ రోజులెలా వున్నాయంటే, మనెదురుగుండా, “అలాగే సార్ ! తప్పకుండా” అన్న వెధవలే వెనకాతలకెళ్ళి మన మాటే మర్చిపోతారు. పూర్వపు రోజులు కావు గదా. ఓ మాట అన్నారూ అంటే, దానిమీద నిలబడతారు – అని నమ్మడానికి! నాకేవిటంటే ఓసారి చెప్పింతరవాత అది జరక్కపోతే నన్నే ఇన్సల్ట్ చేసినట్టు ఫీలవుతాను. అడిగి లేదనిపించుకోడంకంటె, వూరుకోవడం వుత్తమం అనిపిస్తోంది. నాకు వీళ్ళని చూస్తుంటే…… పోనీ మావాడితో చెప్దాం అంటే, అవడానికి మా వాడు అసిస్టెంటు ప్రొఫెసరే అనుకో కాని, వాడి నెత్తిమీద మరో వెధవ వున్నాడుకదా! నా అనుమానం మావాడి చేతిలో ఏమన్నా వుందా అని! వాడిప్పుడు ఇంట్లో లేడు. అంతా ఆ ప్రొఫెసరింటికే, వాడి కొడుకూ, కోడలు వెస్ట్ జర్మనీ నించి తిరిగొస్తే చూడ్డానికి వెళ్ళేరు. తప్పదు కదా మరి! మనవాడు చెయ్యగలిగిన పనైతే నిముషాలమీద చేయిస్తాను. ఈ కాలపు కుర్రవాళ్ళలా కాదు. ఇప్పటిక్కూడా, వాళ్ళంతటి వాళ్ళయిపోయాకకూడా, నన్ను కన్సల్ట్ చెయ్యందే ఒక్క పనీ చెయ్యరు…….” అని మళ్ళీ ఆగిపోయాడాయన.

    తనేం మాట్లాడాలో తెలియక వూరుకున్నాడు వరప్రసాద్ ….. “ఇంతకీ యీ ముసలాయన ఎవరితోనైనా చెప్తాడా, చెప్పడా? కర్ర విరుగుతుందా? పాము చస్తుందా? ఈ గోడ మీద పిల్లి ఎటు దూకుతుంది? అటా, ఇటా?……. మొహమంతా జిడ్డు కారుతూ చిటపటలాడుతోంది వరప్రసాదరావుకి. కాని తుడుచుకొంటే “స్టయిలు గాడనుకుంటారో, ఏమిటో “అనుకొన్నాడతను. 

    “ఈ రోజుల్లో వెధవ కరువు! అన్నిటికీ కరువే! తిండికి కరువే, వుద్యోగాలకి కరువే! ఐటెల్ యూ వన్ తింగ్. నేనింత చదువుకొన్నాను; అంత చదువుకొన్నాను, నాకీ వుద్యోగం సరిపోదు, అనుకొంటే మరి లాభం లేదబ్బాయ్! ఏదో ఒకటి పని. పని చెయ్యడానికి సిద్ధంగా వుండాలి. టు టెల్ యూ ఫ్రాంక్లీ – నా పిల్లలెవరికీ కూడా నేను జాబ్స్ కోసం ట్రై చెయ్యలేదు. కావాలన్నంతవరకు చదువులు చెప్పించేను. ఆ తరవాత వాళ్ళ అదృష్టం బావుంది. భగవన్తుడి దయవల్ల వాళ్ళే, ఏవో మంచి ఉద్యోగాలే సంపాదించుకొన్నారు……. ఎవ్వళ్ళూ నాకేవీ పంపిచ్చక్కర్లేదు. 

    మొన్న మొన్నటిదాకా, నేనూ, మా ఫాదర్ ఇన్ లా ఇక్కడే ప్రాక్టీసు చెయ్యడంచేత, ఈ వూరొదిలి వుండటం నాకిష్టం వుండదు. కాని నా పెద్దకొడుకూ, పిల్లలూ ‘గ్రేండ్ పాప! మా ఇంటికి రండి రండి’ అని పిలుస్తారు. కొన్నాళ్ళు బాంబే వెళ్ళి, వాళ్ళతో వుంటాను. మరింక మూడోవాడు, “ఎప్పుడూ ఆ ఇద్దరన్నయ్యల దగ్గిరేనా వుంటారు? నాతోపాటు అమెరికా వచ్చెయ్యండని” ఒకటే వుత్తరాల మీద వుత్తరాలు దంచేస్తున్నాడు……. నువ్వు నా యంగెస్ట్ సన్ ని ఎరుగుదువా……?” అని ఆగాడు నరసింహంగారు.

    తమ చిన్న కుమారుని తల్చుకోవడం వల్ల కాబోలు, ఆయన ముఖంలో చిన్న దరహాస రేఖ మెరిసింది.

    వున్నట్లుండి గదంతా చీకటయిపోయింది. బైట వాన కురుస్తూనే వుంది. వరప్రసాద రావు కూర్చున్న సోఫామీద, వెనకాతల కిటికీలోంచి, చిన్న తుంపర పడుతోంది.

    “గొప్ప స్మార్ట్ ఫెలోలే! చిన్నప్పుడు వాళ్ళ తాతగారు – పెద్దయాక నువ్వేం చేస్తావురా తాతా?” అని అడిగితే “నేను అమెరికా పోతాను తాతగారూ” అనేవాడు. సిల్లీ ఫెలో!. చిన్నప్పణ్నుంచీ వాడు అదేమిటో ‘అమెరికా పోతాన్, అమెరికా పోతాన్’ అంటూ వుండేవాడు. అఫ్ కోర్స్ హి ఈజ్ లక్కీ! భగవంతుడి దయవల్ల వాడికి స్టేట్స్లో సీటొచ్చింది. స్కాలర్ షిప్ ఇవ్వనన్నారు. “పొండి వెధవల్లారా! దరిద్రులకీ ముష్టివాళ్ళకీ మీ స్కాలర్ షిప్లు కానీ, నా కొడుక్కేం ఖర్మ కాలింది? అని నేను పంపించేశాను……… గొప్ప తమాషా ఏంటంటే, అసలు వాడు వెళ్ళేవరకు నాకు తెలీదు. నేను కోప్పడతానని నాతో చెప్పకుండానే వాడు అప్లై చేశాడు, సీటొచ్చిన తరువాత – “నాన్నారూ వెళ్తాను”, అని నాదగ్గర గునిసేడు. వైషుడై కమిన్ హిజ్ వే? బావుపడతాన్నాన్నా అంటే వద్దనే ఫాదరెవడైనా వుంటాడా? వెంటనే పంపించేశాను. ఆ తరవాత, నాకిక్కడే అన్ని ఫెసిలిటీస్ వున్నాయి; ఇక్కడే సెటిలయిపోతాను నాన్నారూ! అన్నాడు. సరేనయ్యా అన్నాను……. ఇదిగో చెప్తున్నా నబ్బాయ్! ఇది మన ఊరా , అది కాకపోయిందా? ఎక్కడో వోచోట హాయిగా, సుఖంగా బతికితే అంతే చాలు. ఇక్కడకన్నా సుఖంగా వుంటుందంటే, చంద్రమండలానికి పోతానన్నా నేను వద్దన్ను, మూడే ఏళ్ళకోసారి మనవేపు వస్తూనే వుంటాడు. ఎందుకు; ఏం బావుకోవాలని రావడం చెప్పు? వేలకి వేలు ఎయిర్ సర్వీసెస్ కి పొయ్యడం తప్పిస్తే! అయినా, ఏవిటో, ఎక్కడికిపోయినా, ‘మనవాళ్ళూ’. అంటే అభిమానం పోకపోవడవే పిటీ!” అని గుక్క తిప్పుకున్నాడు నరసింహంగారు.

    అమెరికాలో వున్న ఆ తృతీయ పుత్రరత్నాన్ని కళ్ళారా చూడలేకపోయినందుకు నొచ్చుకున్నాడు వరప్రసాదరావు. ఒక్క ఘడియ అతను, తన ఇంటినీ, ఇంటికి రాని తండ్రినీ, మంచం వదలని తాతగారినీ; ఏడుపు ఆపని అమ్మనీ – మర్చిపోయి, నరసింహంగారే తన తాతగారైతే ఎంత బావుండునోకదా! అనుకున్నాడు. అందులోకి నరసింహంగారు తన కుటుంబ వ్యవహారాలన్నీ తనతో అంత ఇంటిమేట్ గా ‘చర్చించడం’, అతన్ని ముగ్ధుడ్ని చేసింది. అంత పెద్దాయన తనొచ్చినందుకు విసుక్కోడంలేదు – అదే చాలు అనిపించిందతనికి,

    వరప్రసాదరావు వీపుమీద వాన జల్లు వుండుండి పడుతోంది. అంతకంతకీ వాన ఎక్కువయి పోతోంది. చిన్న మెరుపు మెరిసింది.

    “జల్లు కొట్టేస్తోందబ్బాయ్!” అన్నాడు నరసింహంగారు. అవి, ఒక్క క్షణం వరప్రసాదుడి వైపు చూసేడు.

    “అవున్నిజవే! జల్లు కొట్టేస్తోంది” – అన్నట్లు బుర్ర వూపేడు ప్రసాదరావు. చిన్న విసుగులాంటి మూలుగుతో, సోఫాలోంచి లేచాడు నరసింహంగారు.

    చుట్టూ తిరిగి వెళ్ళి, ప్రసాదరావు వెనకాతలవున్న కిటికీ అద్దాల తలుపులు మూసేసాడు.

    పూని పుచ్చుకొని ఒక్క లెంపకాయ కొట్టినట్టనిపించింది. ప్రసాదరావుకి. అతని గుండెలు అతివేగంగా కొట్టుకొన్నాయి. తలతీసి ఎక్కడయినా పెట్టేదామనిపించిందతనికి.

    అద్దాల తలుపుల్లోంచి బయటకు చూస్తూ “ఈ వర్షం ఇప్పుడప్పుడే వదిలేలాగ లేదబ్బాయ్!” అన్నారు నరసింహంగారు.

    ఎక్కడో దూరంగా పిడుగు పడింది.

    “నువ్విప్పుడప్పుడే నన్ను వదిలేలాగ లేవబ్బాయ్!” అన్నట్టే వినిపించింది వరప్రసాదరావుకి, వున్నట్లుండి అతనికి వెన్నుపూసలోంచి వణుకు ఆరంభమైంది. బయట -హోరున వాన కురుస్తోంది. ఉండుండి ఆకాశం పెద్ద వెలుగుతో చీల్చుకొంటోంది. దూరంగా గేటవతల వీధిలో దీప స్తంభానికి కట్టిన గేదె ఒకటి తడిసిపోతోంది. దానిముందు వేసిన గడ్డి పరకలు నీళ్ళలో కొట్టుకుపోతూ వుంటే, వెర్రి ముండలా చూస్తూ వుండిపోయిందా గేదె. ఎక్కణ్నించో కుక్కపిల్ల ఒకటి తడిసిపోయి, చలికి కాబోలు, “కుయ్యి, కుయ్యి”, మని అరుస్తోంది.

    గదిలో ట్యూబ్ లైట్ వేసి, మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు నరసింహంగారు.

    “టింగ్ టింగ్” మని చప్పుడు చేస్తూ, గుప్పున వెలిగింది, ట్యూబులైటు. మూలని నక్కి వున్న ఎలకని టార్చిలైటు వేసి మరీ, పిల్లి పట్టుకొన్నట్టనిపించింది వరప్రసాదరావుకి.

    చిరుచలితో వున్న ఆ కుర్రవాణ్ణి చూస్తే తువ్వాలిచ్చి, తల తుడుచుకోమని చెప్తామన్న ఆలోచన నరసింహంగారికి మెరుపులా మెరిసింది కాని, అంతలోనే ఆ ఆలోచన చప్పగా చల్లారిపోయి, అంతరాంతరాల్లో ఎక్కడో ఇరుక్కుపోయింది.

    “మా ఫాదరిన్లాని నువ్వెరుగుదువా?”

    నరసింహంగారి వేపు చూసాడు ప్రసాదరావు. బితుకు బితుకుమంటూ, ఆయన ఒక్క పిసరు వెనక్కి తిరిగి తన వెకాతలవున్న ఫొటోని చూసేడు. ఆ ఫొటోని చూస్తూనే నరసింహంగారి ముఖం ఒక విధమైన తేజస్సుతో వెలిగిపోయింది.

    వరప్రసాదరావు మళ్ళీ ఆ ఫొటో చూసేడు. అతనింతకుముందు గమనించలేదు గాని, ఆ బొమ్మలోని పెద్దమనిషి చిన్న నవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నవ్వు,శవం నవ్వినట్టుండి, పరమ భయంకరంగా వుంది. కళ్ళు దించేసుకొన్నాడు ప్రసాదరావు,

    నరసింహంగారు గొంతు సవరించుకొన్నారు.

    “నువ్వెరుగవులే! మీ తాతగారికి బాగా తెలుసును. కాని, అబ్బాయ్! చెపున్నాను. అలాంటి మనిషి నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆయన ఎన్ని పుస్తకాలు చదివేరు? | ఎంత జ్ఞానం సంపాదించేరు? ఆయన్ని చూస్తూ వుంటే – మనం ఎప్పటికైనా ఈయన సంపాదించిన జ్ఞానంలో నూరోవంతు సంపాదించగలవా? – అని నాకనిపించేది. కాని, చెప్తున్నాను విను, నెవర్, నెవరిన్ మై లైఫ్ . నేను మాత్రం ఇప్పటిదాకా సాధించలేక పోయాను…. అంత పండితుడాయన. అలాంటి దైవభక్తుణ్ణి మళ్ళీ మరోణ్ని చూళ్ళేదు నేను. ఆ రోజుల్లో చదువుకొన్న ప్రతి గాడిదా”దేవుడు లేడు, దెయ్యం లేదు” అంటూ బయల్దేరుతున్నారు గాని, వీళ్ళందరూ లేడనేస్తే లేకుండా పోతాడా ఏవిటి? వాడూయూ సే? నువ్వు నమ్ముతావా, నమ్మవా?”……. అని ఆగేడు నరసింహం గారు.

    వరప్రసాదరావు ఏదో చెబ్దామని నోరు విప్పేడుకాని, అతను చెబ్దామనుకొన్న ముక్కలు గొంతుకడ్డం వచ్చి గుటకతో మింగుడు పడిపోయేయి.

    నరసింహంగారు ఏవనుకొన్నారో, ఏమో మళ్ళీ మొదలెట్టాడు.

    “మాటవరసకి నా ఎల్డర్ సన్, నా డాటర్ ఇన్ లా , వాళ్ళ పిల్లలూ అంత చదువుకొన్న వాళ్ళే! బట్ దే ఆర్ ఆల్ గాడ్ ఫియరింగ్ పీపుల్, ప్రతి ఏడూ పిల్లలకి పరీక్షలయిపోగానే మనవేపు వస్తారు. మా పెద్దవాడూ, మగ పిల్లలూ అంతా తిరపతిలో తలనీలాలు సమర్పించుకు మరీ వెళ్తారు. అందులోనూ, నా ఎల్దెస్త్ గ్రాండ్సన్ – అచ్చు మా ఫాదర్ ఇన్ లా పోలికే వాడిది – వాడు బాంబే ఐ.ఐ.టి. లో కెమికల్ టెక్నాలజీ చదువుతున్నాడు. వాడు మరి ఏ పని చేసినా ఆ ఏడుకొండలవాణ్ణి తల్చుకోందే చెయ్యడు….. చెప్పొచ్చేదేమిటంటే, మా మావ గారికి అంత దైవభక్తి……”

    వరప్రసాదరావు నోరు కొంచెం వేళ్ళాడేసుకొని వింటున్నాడు. వింటున్న కొద్దీ అతనికి వెన్నుపూసలో వణుకు ఎక్కువవుతోంది.

    “ఆయన కోర్టుకెళ్తే అర్ధణా కేసులూ, అణా కేసులూ ఎప్పుడూ చూసేవారు కాదు. నేను కొత్తగా ప్రాక్టీసు పెట్టిన రోజుల్లోనే నాతో చెప్పేరు, – ‘నాయనా, నరసింహం! మనకున్న ఆస్తి ఇప్పటికైనా, ఎప్పటికైనా చదువు ఒక్కటే కదా! అంచేత మనం మన చదువు సంధ్యల్ని అలగా వెధవలకి, అడుక్కుతినే వెధవలకి దానం చేస్తే, ఆఖరికది మనకే బెడిసికొట్టి మనల్నికూడా వాళ్ళతో తత్తుల్యుల్ని చేసేస్తుంది. అందుకే ఆపాత్ర దానం కూడదన్నారు. మరింక బతకలేం – అంటావూ. ఈ వెధవ మురికి కేసులు, ముస్లి కేసులు చూసుకుంటూ బతకడంకన్న ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యానికి పోవడం నయం కాదూ!’ అన్నారు. అంతే! అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆవేళే నేనూ వెంకటేశ్వరుడి సాక్షిగా ఒట్టు వేసుకొన్నాను….. అది ఖూనీ కేసు కానీ, ప్రోనోటు కేసు కానీ, పార్టీ వచ్చి – బాబూ! రక్షించు అని అడిగితే, ‘అబ్బే! ఇంతవుతుంది’ అని చెప్పి డబ్బుకి డబ్బూ కరాఖండిగా పుచ్చుకునేవారు; పనికి పనీ కరాఖండిగా చేసేవారు”.

    ఎక్కువగా మాట్లాడుతున్నావేమోనని సందేహం వచ్చి ఒక క్షణం ఆగేరు వరసింహం

    కాని చెప్తున్నది – హైక్లాస్ డిగ్నిఫైడ్ లైఫ్ గురించే కాని లోక్లాస్ రెచడ్ లెఫ్గురించి కాదు కదా!

    చిన్ననవ్వు నవ్వి “ఇప్పుడు తల్చుకుంటే నాకే నవ్వొస్తోంది. ఓసారి నా చిన్నతనంలో అమాయకంగా నేనాయన్ని అడిగేను. ‘ అయితే, మావగారూ! ఖూనీ చేసిన వాణ్ణి రక్షిస్తే, అది దుష్ట రక్షణ అవుతుంది కదా! అది పాపం కాదా?’ – అని, ఆ ప్రశ్నకి మరెవరైనా అయితే వూరంత కోపం తెచ్చేసుకొనేవారు. కాని 

    ఆయన మాత్రం అంతా విని చిన్న నవ్వు నవ్వి, – “అది కానేకాదోయ్! మనం చేస్తున్నదేవీ లేదు. ఆ చచ్చిపోయినవాడు వీడి చేతులో చావ్వలిసుండి, వీడికి వాణ్ణి చంపాలిసుండి; వీడు బతకవలసుండి మన దగ్గరకు రావలిసున్నపుడు – మధ్యలో మనవెవరమోయ్ , దుష్ట రక్షణ అవునా కాదా?’ అని ఆలోచించడానికి ఆ జగత్పాలకుడి చర్యల్ని ప్రశ్నించడానికి నువ్వు గాని, నేను గాని ఎవళ్ళమైనా ఎవళ్ళమోయ్? ఎవడి కర్మ పరిపాకం ఎలా వుంటే అలా జరుగుతుంది” అని ఆయన సుళువుగా చెప్పేరు” అన్నారు, నరసింహం గారు.

    అలా ‘గోడ కుర్చీ’ వెయ్యడం వల్ల, వరప్రసాదరావు కాళ్ళు తిమ్మిరెక్కి వణుకుతున్నాయి. మెడ నొప్పెడుతోంది. తలెత్తి చూసేడు, ఎదురుగా ఫొటోలో వున్నాయన – “బతుకులో ఇంకా అంతుచూడాలిసినవి ఎన్నో వుండగా, అప్పుడే ఇలాగ చచ్చి శవాన్నయిపోయానే” అన్న అసూయతో బతికున్న వాళ్ళని శపిస్తున్నట్టు చూస్తున్నాడు. వెంటనే కళ్ళు తిప్పేసుకున్నాడు వరప్రసాదరావు.

    “ఇంతకీ నేను చెప్పిందేవిటంటే, ఆయన ‘లా పుస్తకాలు ఎంత క్షుణ్ణంగా చదివేరో, ధర్మ శాస్త్రాలూ, శ్రుతులూ, స్మృతులు అంత క్షుణ్ణంగానూ చదివేరు. ఎప్పుడూ చదువు, చదువు, చదువు. చేస్తే కోర్టుపని చేయ్యడం, లేకపోతే ఒక పుస్తకం చదువుతూ వుండటం. ఆఖరి రోజుదాకా ఆయన కోర్టుకి వెళ్తూనే వున్నారు. ఆ ఫొటో పోయిన వెంటనే తీసింది…. ఓసారిలాగే…..” నరసింహంగారు టక్కుమని ఆగిపోయేడు.

    బైట వరండాలో ఏవో మాటలు వినిపించేయి. అంతలోనే ఎవరో తలుపు దబదబ కొట్టేరు.

    నరసింహంగారికి చాలా చిరాకేసింది. “కాల్ బెల్ వుంటే, తలుపు బాదుతారు…….” అంటూ లేచి వెళ్ళాడాయన.

    సోఫాలో సరిగా కూర్చుందామనుకొన్నాడు వరప్రసాదరావు. కాని, వెంటనే – “ఇంత సేపూ ఒకలా కూర్చుని, ఇప్పుడొకసారి దర్జాగా కూర్చుంటే బావుంటుందా?” అని ధర్మ సందేహంలో పడ్డాడు.

    వరండాలో లైటు వేసి, తలుపు తీసాడు నరసింహంగారు. –

    తలుపు తీసిన నరసింహంగారికి, అవతల వరండాలో – వానలో తప్పతడిసిపోయిన ఒక ముసలివాడు, ఒక...

    44 min
  • ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన

    ది ఫ్రెండ్స్ - ఎన్.ఎస్.ప్రకాశరావు గారి రచన 

    ఎన్ ఎస్  ప్రకాశరావు గారు కథకులు, వ్యాసరచయిత. కెమికల్ ఇంజనీరింగులో పిహెచ్.డి చేశారు. 'ఎన్నెస్ కథలు' వీరి కథాసంపుటి. ఈ కథల సంపుటి చాలా ఆదరణకు నోచుకుంది. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీల సభ్యులుగా సేవలందించారు. వీరు అతి చిన్న వయసులో  అకాల మరణం చెందడం తెలుగు సాహిత్యానికి లోటు అని చెప్పవచ్చు.

    కథను మీకందించడానికి అనుమతినిచ్చిన శ్రీమతి నళిని గారికి  కృతజ్ఞతలు. 

    పుస్తకం కొనడానికి - 

    *************

    ఇంకా తెల్లవారలేదు.

    శీతాకాలం మంచు బాగా కురుస్తోంది. సముద్రపొడ్డునే వున్న ఆ పొడుగురోడ్డు నిర్మానుష్యంగా వుందనే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా వున్నారేమో? ఆ మంచుతెరల్లోంచి మాత్రం ఎవరూ కనబడడంలేదు. చలికి జడిసే కాబోలు పక్షులు కూడా ఇంకా గూళ్ళు వదిలి రావడంలేదు. సముద్రపు హోరునికూడా ఆ మంచు మింగేసినట్టుంది; ఆ పక్కని సముద్రమే లేనట్టుంది. స్టీమర్లలో దీపాలు కాబోలు ఏవో ఆకాశదీపాల్లాగా మసక మసకగా కనబడుతున్నాయి. రోడ్డుకి రెండోవైపు ఇళ్లున్నాయి. గాని పొగమంచుతో కప్పడిపోయేయి. తెల్లారగట్ట లేచి చదువుకొనే కుర్రాళ్ళ గదుల్లో దీపాలు కాబోలు అక్కడక్కడా కనబడీ కనబడనట్టు కనబడుతున్నాయి.

    మంచుని చీల్చుకొంటూ ఎవరో ఇద్దరు మనుషులు వస్తున్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనబడకపోయినా - వాళ్ళలో ఒకరు లావుగాను, మరొకరు అంతలావుగా లేనట్టూ కనబడుతున్నారు. అంత లావుకాని ఆయనచేతిలో వాకింగ్ స్టిక్ వుంది. దాన్ని మహా జోరుగా ఊపుతూ నడుస్తున్నాడతను. లావుగా వున్నాయన నోట్లో పైపొకటి వుంది. నోట్లో వుంచుకొనే ఏదో  మాట్లాడుతున్నాడతను. ఇద్దరూ నెమ్మదిగానే నడుస్తున్నా లావుపాటాయన కొంచెం ఈడుస్తూ నడుస్తున్నట్టూ, రెండో ఆయన ట్రిమ్ గా నడవడానికి ప్రయత్నిస్తున్నట్టూ ఉంది. వాళ్ళిద్దరూ తలలకి మఫ్లర్లు చుట్టుకొన్నారు చలికోట్లు వేసుకున్నారు. కాళ్ళకి బూట్లు తొడుక్కున్నారు.

    వారిద్దరిలోనూ పైపు పట్టుకొన్నాయన యూనివర్సిటీలో అదేదో శాస్త్రంలో అసిస్టెంటు ప్రొఫెసరు. వాకింగ్ స్టిక్ పట్టుకొన్నాయన అదే యూనివర్శిటీలో మరేదో శాస్త్రంలో ప్రొఫెసరు.

    “మేష్టారూ!" అన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు “రష్యాలో కూడా చలి విపరీతంగా ఉంటుంది, గానండి, అదంతా అదోరకం బ్యూటీసార్, నేను అక్కడ కూడా అప్పుడప్పుడు మార్నింగ్ వాక్ కి వెళ్ళేవాణ్ణిలెండి... కోటుజేబులో చిన్న వోడ్కా బాటిల్ పడేసుకొని" అంటూ పైపు  చేత్తో పట్టుకొని, బడబడ నవ్వేడతను.

    ప్రొఫెసరు ఏం మాట్లాడలేదు. ఆయన రష్యా వెళ్ళలేదు గాని, అమెరికా వెళ్ళేడు. అతను చిన్నప్పట్నించీ జబ్బు మనిషి. అమెరికాలో వున్నన్నాళ్ళూ హాస్పిటల్లోనే వున్నాడు. మంచుతెరలూ, మోణింగ్ వాకులూ అతనెరుగడు. తన అనారోగ్యం గురించి అతనెప్పుడూ చికాకుపడుతూనే వుంటాడు. అందుకే ఏం మాటాడలేదు.

    ఆయన మౌనాన్ని అర్థం చేసుకొన్నట్టున్నాడు, టాపిక్ మార్చేడు అసిస్టెంటు ప్రొఫెసరు. అసిస్టెంటు ప్రొఫెసరు పేరు ఎమ్.మారుతీరావు ఎమ్మెమ్ రావంటారు. స్టూడెంట్ సర్కిల్సులో మొద్దు మాస్టారనీ, ఏమేమీ రావనీ' ముద్దు పేర్లున్నాయతనికి.

    హెల్తుకి యోగాసనాలు మంచివి మేష్టారూ!... ఈ వయసులో యోగాసనాలేం చేస్తాంలెండి కాని, మోడింగ్ వాక్ ఫఱవాలేదు. మీకెందుకు, ఇలాగ నాలుగు రోజులు మీరు నాతో రండి. అయిదోరోజు మీరే వచ్చి నన్ను పిలుస్తారు” అన్నాడు మళ్ళీ దడదడ నవ్వుతూ,

    ప్రొఫెసరు క్లుప్తంగా “వూc" అని వూరుకొన్నాడు.

    ఆయన పేరు ప్రొఫెసర్ జె.గోవర్ధన గిరిధారి. ప్రొఫెసర్ జె.జీ.ధార్ అంటారు. జబ్బు గురుడు".  ఆయన రహస్య నామం.

    కొంతసేపు ఏమీ మాట్లాడకుండానే నడవసాగేరు వాళ్ళిద్దరూ. ఈ ఇద్దరి మధ్యా చాలాకాలం నించి మంచి స్నేహం వుంది. వాళ్ళ స్నేహానికి ఒక కారణం - ఇదే ముఖ్యమైన కారణమని కొందరు అంటారనుకోండి - వాళ్ళిద్దరిదీ ఒకటే కులం అవడం - అదీ కాకుండా 'మరో విషయంలో కూడా ఇద్దరిదీ ఒకే "కులం". ఉన్నత విద్యకోసం యూనివర్సిటీ ఖర్చుమీద ' విదేశాలకి వెళ్ళి, ఉన్న విద్యతోనే తిరిగొచ్చేరు. ఇద్దరూ.. |

    చదువుకొనే రోజుల్లో (అంటే విద్యార్థి దశలో) తనశాస్త్రాన్ని మారుతీరావు ఎన్నడూ  (సరిగా) చదువుకోలేదు. ట్యూటరయేకా చదవలేదు. లెక్చరయేక అంతకన్నా లేదు.  ప్రొఫెసరయేక అసలులేదు. అతను కొద్దిరోజుల్లోనే ప్రొఫెసరయే అవకాశం వుంది.  అవగలనన్న నమ్మకం కూడా అతనికి వుండేది నిన్నమొన్నటి దాకా. కులం  ఎంచేతంటే,  అతని కులం వాడొకాయన రాష్ట్ర మంత్రివర్గంలో స్టేట్ మంత్రిగా వుంటున్నాడు. అతను కనీసం క్యాబినెట్  మంత్రయినా (కా(లే) నంద్కు అతను (అంటే అసిస్టెంటు ప్రొఫెసరు) మహాచిందులు తొక్కేవాడు. అయితే, ఈ మధ్య అతనికి కొత్త సమస్య ఒకటి తగులుకొంది. ఆ సమస్య - కంటిలోనలుసు కన్నా, కాలిలో ముల్లుకన్నా ఎక్కువగా అతన్ని బాధిస్తోంది. “ఈ అసిస్టెంట్ ప్రొఫెసరుకి ఏమీరాదనీ, ఇంగ్లీషు(లో) కూడా సరిగా మాట్లాడలేడనీ” - ఇతన్ని గురించి ఆకాశరామన్న ఉత్తరాలు పై అధికార్లకి అందేయి. (మారుతీరావు ఇంగ్లీషు గురించి విద్యార్థిలోకంలో బోలెడు జోక్సు ప్రచారంలో వున్నాయి)

    దానికి తోడు ఆ స్టేట్ మంత్రి ఏవో పంతాలకిపోయి, ఉన్న పదవికి కాస్తా రాజీనామా ఇచ్చేస్తానంటున్నాడని వార్త వచ్చింది. వీటన్నింటినీ మించి మరో పెద్ద డేంజరస్ విషయంలో ఇరక్కున్నాడతను. రష్యానించి తిరిగివచ్చిన కొత్తలో,  అడగనివాడిదే పాపమన్నట్టు అందరికీ రష్యా గురించి గొప్పగా చెప్పేవాడు. అక్కడ పరిశ్రమల గురించీ, పాడిపంటల గురించి,

    పాఠశాలల గురించీ, పసిపాల గురించీ, పంతుళ్ళ గురించీ తెగ పొగుడుతూ చెప్పేవాడు. దాంతో అతనికి "కమ్యూనిస్టు” అన్న పేరు వచ్చింది. ఇంత ఆస్తివున్నా, తను "కమ్యూనిస్టు" అని పిలవబడు తున్నందుకు అతను చాలా గర్వించేడు. అయితే, కొన్నాళ్ళకే అతనికి ఒక నగ్న సత్యం తెలిసొచ్చింది. 'సభ్యసమాజంలో కమ్యూనిస్టనిపించుకోవడం ఇంటికి వంటికి మంచిది కాదని అర్థమయింది. అర్థమయిన తరువాత ప్లేటు మార్చి, నుదుట తిలకం దిద్ది ఇంట్లో గోడల్నున్న రష్యాదేశపు ప్రకృతి దృశ్యాల చిత్రపటాలుకూడా తీసిపారేసి - ఎంతగా “మంచిబాలుడు” గా చలామణి అవుదామని ప్రయత్నం చేసినా, చేసిన పాపం ఏడేడు జన్మలదాకా వెంటాడినట్టు అతనికి కమ్యూనిస్టన్న పేరు మాత్రం పోలేదు. రాబోయే ప్రొఫెసరు పదవికి ఇది కూడా అడ్డు తగుల్తుందేమోనని భయంగా వుందతనికి.

    ప్రొఫెసర్ జెజిధార్ సబ్జక్టులో దిట్ట అనిచెప్పలేంగాని, పాపం ఎప్పటికప్పుడు చదువుదామనే అతను అనుకొనేవాడు. కాని అతని ఆరోగ్యం అలాంటిది పుస్తకం పట్టుకొంటే చాలు పక్కలో నొప్పి వచ్చేది. (సబ్జక్టు గురించి) ఆలోచిస్తే చాలు ఆయాసం వచ్చేది. తనకన్నా ఆలస్యంగా జాయినయినవాళ్ళు, ఆ మాటకొస్తే తన స్టూడెంట్సు - యిక్కడ చదువులు పూర్తిచేసుకొని, విదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద డిగ్రీలు మోసుకొచ్చి డిపార్టుమెంటులో తిష్ట వేసుక్కూర్చున్నారు. కొంచెం సెన్సిటివ్ ("ఫెలో” అనొచ్చా ప్రొఫెసర్లని?) కాబట్టి అతనికి ఆ అవమానకరంగా వుంది . నిన్నగాక మొన్నచేరిన కుర్ర సరుకంతా మంచి పావులారిటీ కొట్టేస్తున్నారు. మీటింగ్సు, సెమినార్సు, పేపర్సు ఓ ఎక్కడ చూసినా వాళ్ళే! తనా అవన్నీ చూడలేడు. చూస్తూ వూరుకోలేడు. వీటన్నిటికి తోడు ఆరోగ్య కారణాలవల్ల (అనారోగ్య కారణాల వల్ల కాదా?) అతన్ని వేగంగా రిటైర్ చేసేస్తారని అధికార వర్గాలలో పుకారొకటి బయల్దేరింది. ఎలాగో ఒకలాగ హెల్తు ఇంప్రూవ్ చేసుకోవాలనుందతనికి. లేహ్యాలు తిన్నాడు. టానిక్సు తాగేడు, నవజీవన గుళికలు మింగేడు.వేళకి బోర్న్ విటా తీసుకొంటాడు. గుడ్లు, పాలు పుచ్చుకొంటాడు. పళ్ళూ, ఫలాలూ తింటాడు. - ఏం తిన్నా, ఆరోగ్యం మాత్రం అలాగేవుంది. -

    కష్టాలలో ఉన్నవాళ్ళు స్నేహితులవుతారు. ఆ కష్టాలు ఒకే రకం కష్టాలయితే ఆ స్నేహితులు ప్రాణ స్నేహితులుగా మారొచ్చు . ప్రొఫెసర్ గోవర్ధనగిరిధారి గారికీ, అసిస్టెంట్ ప్రొఫెసరు మారుతీ రావు గారికి ఇప్పుడున్నది ప్రాణ స్నేహం.

    తనతోపాటు మోణింగ్ వాక్కి వస్తే, ఆరోగ్యం బాగుచేసుకోవచ్చునని ఎప్పట్నించో చెప్తున్నాడు. మారుతీరావు. చాలా రోజులు అంత వుదయాన్నే లేవలేక రాలేకపోయేడు ప్రొఫెసరు. కాని ఉద్యోగం వూడిపోతుందేమోనన్న భయం అతన్ని ఆఖరికి లేపి కూచోబెట్టింది. ఇక  మారుతీరావు మోణింగ్ వాక్ లో ఓ రహస్యం వుంది. తను లావుగా వుండడంవల్లే "మొద్దు మాస్టారన్న” పేరు వచ్చిందని అతనికో అనుమానం వుంది. తనూ స్లిమ్ గా తయారయితే ఆ చెడ్డపేరు పోవచ్చునని అతనికి అనిపించింది. ఆరునెల్లనించీ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఒక మైలు దూరం నడిచివస్తున్నాడతను.

    ప్రొఫెసరూ, అసిస్టెంట్ ప్రొఫెసరూ మాట్లాడకుండా నడుస్తున్నారు. అనుకోకుండానే చాలాదూరం నడిచేరు ఇద్దరూ. మారుతికి కొంచెం ఆయాసంగా వుంది. గోవర్ధనుడికి కొంచెం నీరసంగా  వుంది. పరగడుపుని ఇలా పరుగులు తీయడం అలవాటు లేదేమో, అతనికి కొంచెం ఆకలికూడా వేస్తోంది.

    "మేష్టారూ? ఇవాల్టికి చాలు. ఇకవెనక్కి తిరుగుదాం ఏం వంటారు?” అన్నాడు మారుతీరావు వగరుస్తూ.

    ఇంటిముఖం పట్టేరు ఇద్దరూ.

    అప్పుడే తెలతెలవారుతోంది. ఉదయించడానికి కావలసిన సరుకూ సరంజామా అంతా సిద్ధం చేసుకొంటున్నాడు. సూర్యుడు. మంచు తెరలు ఒకటొకటే విడిపోతున్నాయి -  చలి కూడా చాలా మటుకు తగ్గింది. రోడ్డంతా, వానపడినట్టు తడితడిగా వుంది.

    అలా నెమ్మదిగా నడిచివస్తూ వస్తూ, పాముని చూసినట్లు టక్కున ఆగిపోయేరు ప్రొఫెసరూ, అ. ప్రొఫెసరూ. 

    ఆ. ప్రొఫెసరు నోట్లో పైపు జారిపడిపోయింది. ప్రొఫెసరు చేతిలో కర్ర నిలిచిపోయింది. 

    పైపు చేత్తో పట్టుకుని, తెరిచిన నోటిని అలాగే వుంచి చూసేడు మారుతీరావు. వాకింగ్ స్టిక్ కి ఆనుకొని చూస్తూ అలాగే నిల్చుండి పోయేడు గిరిధారి.

    అ మసక వెలుతురులో ఎర్రగా, అందంగా, గంభీరంగా, పెద్ద విమానంలాగ కనబడింది - ఒకకారు. రోడ్డుకి కొంచెం పక్కగా నిలిపివుంది. లోపల ఎవరూలేరు. అద్దాలు  మీదికి ఎత్తేసివున్నాయి. చుట్టుపక్కల ఎక్కడా అలికిడిలేదు; సముద్రపు హోరుతప్ప...

    కారుకి రెండు గజాల దూరంలో బొమ్మల్లా నిల్చుండిపోయేరు ప్రొఫెసరూ, అసిస్టెంటు ప్రొఫెసరూ.

    “మేష్టారూ!” అన్నాడు మారుతీరావు కొంచెం తేరుకొని. “అదేనంటారా?” అన్నాడు గిరిధారి నిటారుగా నిల్చోడానికి ప్రయత్నిస్తూ,

    అంత చలీ పారిపోయి, ఒక్కసారిగా వుక్కపొయ్యడం మొదలెట్టింది ఇద్దరికీ. మఫ్లరు  విప్పి భుజంమీద పడేసుకున్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు. మఫ్లరే కాకుండా కోటు బొత్తాలుకూడా రెండుమూడు విప్పుకొన్నాడు ప్రొఫెసరు. -

    చెదిరిపోయిన తల వెంట్రుకల్ని సర్దుకొన్నాడు గిరిధారి. అది చూసి తనూ, సర్దుకోబోయి, మళ్ళీ వూరుకొన్నాడు మారుతీరావు. సర్దుకోడానికి మారుతికి అక్కడ ఏవీలేదు. అసలే బట్టతల, దానికి తోడు ఆ మధ్యే తిరుపతి వెళ్ళివచ్చేడు.

    “ఆయన బీచికి వెళ్ళుంటారు” అన్నాడు మారుతీరావు ఇసక దిబ్బలవైపు చూస్తూ,

    ఇసక దిబ్బలు బాగా ఎత్తుగా వున్నాయి. సముద్రపు ఒడ్డు కనిపించడఁవేలేదు. దూరంగా అలలులేని సముద్రం మాత్రం నీలంగా, పెద్ద చెరువులాగ కనిపిస్తోంది. ఇసక దిబ్బలమీద అక్కడక్కడా “రావణాసురుడి మీసాల” మొక్కలు తడితడిగా కనబడుతున్నాయి. 'ఆయన' మాత్రం ఎక్కడా కనబడలేదు.

    ఆ “ఆయన” యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్‌ గారు.  ఆ కారు ఆయనది.

    ఆయన ఆ యూనివర్శిటీకి కొత్తగా వచ్చేడు. వచ్చి ఇంకా వారం రోజులైనా కాలేదు. అంతకు ముందున్న వైస్ ఛాన్సలర్ (వీ.సీ. అంటారు క్లుప్తంగా) గారి హయాంలో యూనివర్శిటీ అంతా అల్లకల్లోలంగా తయారయింది. ఆ వీసీని పదవినించి దింపడానికి విద్యార్థులు సమ్మె చేసేరు. అందుకు కొందరు అధ్యాపకులుకూడా వెనక వుండి నాటకం ఆడించేరు. ఆయన పరిపాలనలో కొన్ని కులాల ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, ఇంజినీర్లూ, డాక్టర్లూ కొందరు, కొందరు కంట్రాక్టర్లూ బాగుపడ్డారు. బాగా డబ్బు చేసుకొన్నారు. (కొందరు ప్రమోషన్లు సంపాదిస్తే,  కొందరు పరీక్షలు పాసయేరు, కొందరు ఉద్యోగాలు సంపాదిస్తే, ఇంకొందరు విదేశాలకు అవకాశాలు సంపాదించుకున్నారు) కొన్నికులాల వాళ్ళు మాత్రం తినడం గట్టిదెబ్బే తిన్నారు.  అసమ్మతి వర్గం బయల్దేరింది. అలజడి చెలరేగింది. వెంటనే ప్రభుత్వం వారు  ఆయన్ని మరో పెద్ద పదవికి పంపించేశారు.

    కొత్త  వీసీగారిని గోవర్ధనుడూ, మారుతీ ఇంకా చూడలేదు. చూడ్డానికి వెళదామని అనుకున్నారు కానీ . ఇంతవరకు చూడ్డం జరగలేదు. -

    వీసీ గారిని చూడకపోయినా, ఆయన  గురించి కొన్ని భోగట్టాలు మాత్రం చాలా రోజుల్నించీ తెలుస్తూనే ఉన్నాయి. 

    వీసీగారిది ఏకులం? - అదికచ్చితంగా తెలుసు. ఆయనకి (స్వ) కులాభిమానం ఉందా - వుండే వుంటుంది. (పర) కులద్వేషం వుందా? - సరిగా తెలియదు - పోనీ ఏదైనా ప్రత్యేక కులంపట్ల ప్రత్యేక ద్వేషం వుందా? - అది సరిగా తెలియదు. ఇవి అతి ముఖ్యమైన వివరాలు.  ఇవిగాక, కొన్ని చిన్న వివరాలు : అంటే - ఆయన ఒక రిటైర్డ్ ఐపీయస్ ఆఫీసరనీ, అమెరికా, రష్యా, పశ్చిమ జర్మనీలాంటి దేశాలు తిరిగి అక్కడి విద్యా విధానాన్ని గురించి స్టడీ చేసేడనీ, ఆయనకి విమానంలాంటి ఎర్రటి అమెరికన్ కారు వుందనీ - ఇవి అందరికీ తెలుసు.

    ఇసక దిబ్బలవైపు చూస్తున్న ప్రొఫెసరూ, అసిస్టెంటు ప్రొఫెసరూ ఒక్కసారి తలలు తిప్పేరు. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొన్నారు.

    ప్రొఫెసరు తెల్లటి ముఖం ఇంకా తెల్లగా పాలిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసరు - నల్లటి ముఖం అటు ఎర్రగా కాలేక ఇటు నల్లగా వుండలేక మధ్యరకంగా వుండిపోయి కొంచెం అసహ్యంగా తయారయింది. మారుతీరావు వెంటనే ముఖం తిప్పేసుకొన్నాడు. ఇంకా వుక్క పోస్తున్నట్టే కోటు బొత్తాలు మళ్ళీ పెట్టుకొన్నాడు గిరిధారి.

    వాచీ చూసుకొంటూ “మేష్టారూ! మీకు ఆలస్యం అవుతున్నట్టుంది! వెళ్ళిపోతారా?” అన్నాడు మారుతీరావు.

    ప్రొఫెసరు కూడా వాచీ చూసుకొన్నాడు. “మీకు ఇదంతా కొత్త కదా ఆకలి వెయ్యడం లేదూ?"

    గిరిధారికి ఆకలి వేస్తున్నమాట నిజమే కాని, మారుతీరావు ఎందుకు అంత ఆప్యాయంగా అడుగుతున్నాడో తెలుసుకొనే సరికి అతనికి చిన్న కోపంతోపాటు, కొంచెం ఉడుకు మోత్తనం కూడా వచ్చింది, ఒక్కసారి ఎలర్ట్ అయిపోయి.

    “అబ్బెబ్బే! ఫరవాలేదు” అన్నాడు పొడిగా.. --

    అని, ఒక్కక్షణం ఆగి, ఉన్నట్టుండి “వీసీగారుకూడా రోజూ ఇటే వస్తున్నారా” అన్నాడు  ప్రొఫెసరు.

    అన్నాడు కాని, వెంటనే నాలిక కరుచుకొన్నాడు. మారుతిలో తను ఇదివరకు ఎన్నడూ  చూడని కొత్త మారుతి ఇప్పుడు కనబడుతున్నాడతనికి. (కొత్త) వీసీగారు ఇటు వస్తున్నారని   ముందే తెలిసి వుంటే, నన్నీదారంట ఎందుకు తీసుకొస్తాడు 'వీడు' - అనుకున్నాడు.

    ప్రొఫెసరు ఆ ప్రశ్న వేసిన సమయానికి అసిస్టెంటు ప్రొఫెసరుకూడా సరిగ్గా అదే ఆలోచిస్తున్నాడు... వీసీగారు రోజూ ఈ దారంటే వస్తున్నారా?

    అలా అనుకోగానే అతనికి చాలా చిరాకు కలిగింది. మారుతిరావు కొన్నాళ్ళపాటు ఈ రోడ్డంట వచ్చేవాడు. కొన్ని రోజుల్నుంచీ ఫరెఛేంజ్ మరోదారంట నడవసాగేడు. ఇవాళ ప్రొఫెసరుగారిని తీసుకొస్తున్నందుకు మళ్ళీ తన ఈ పాతదారికి వచ్చేడు.

    కలిగిన చిరాకుని కనబడనివ్వకుండా ముఖం తిప్పేసుకున్నాడు మారుతీరావు,

    “నేరకపోయి తీసుకొచ్చేనే ఈ జబ్బు వెధవని. ఇప్పుడెలా వదిలించుకోడం?” అనుకొన్నాడతను.

    “దిబ్బ మారుతి” కన్న తను సన్నగా వున్నాడు గనక, పరిగెత్తికెళ్ళి వీసీగారిని కలిస్తే? - అనిపించింది ప్రొఫెసరుకి... కాని ఆయన స్నానంచేస్తూవుంటే?... చూడ్డం బావుంటుందా?... ఒక వేళ భార్యా సమేతంగా వచ్చేడేమో? కాదు కాదు వచ్చేరేమో?

    ఆ ఇసక దిబ్బలమీద తను పరిగెత్తడం వూహించుకోగానే, కాళ్ళలో సత్తువంతా పోయినట్టయి నీరసంగా ఫీలయేడతను.

    వీసీగారు వచ్చేసరికి కారుదగ్గిర నించుని వుంటే?... ఆయనేమనుకొంటాడు? కాదుకాదు ఏమనుకొంటారు?... ఆయన ఫేవర్ కోసం దేవిరించినట్టుండదా?.. ఐతే ఏం చెయ్యాలి? కాజువల్ గా వస్తూవుంటే, ఆయనకి కనబడినట్టుండాలి... కొంత దూరం మళ్ళీ వెనక్కి నడిచి నెమ్మదిగా ఇటువస్తే... ఈలోపున ఆయన వచ్చి,  కారులో తుర్రుమంటే.... ఇంతకీ, తనని చూడగానే తనముఖం మీద ఫలానా అసిస్టెంటు ప్రొఫెసరు అనేం లేదు కద?.... తనే పరిచయం చేసుకోవాలి. ఈ ప్రొఫెసరుగాడు ఎక్కువ అటెన్షన్ కొట్టేస్తాడు. తప్పదు. ఎంతైనా ప్రొఫెసరు ప్రొఫెసరే, అసిస్టెంటు అసిస్టెంటే... ఇక ఛస్తే వీణ్ణి నాతో తీసుకురాకూడదు... ఇక ముందు సంగతిసరే, ఇప్పుడెలాగ?....

    తన సబ్జక్టు గురించి ఆలోచించి ఎన్నడూ బుర్ర పాడుచేసుకోలేదు మారుతీరావు, (నిజంగా ఆలోచించేవుంటే ఈ పాటికి యే నోబుల్ ప్రైజో కొట్టేవాడేమో- ఎవరు చెప్పగలరు?)

    కాని ఇలాంటి విషయాల్లో అతని బుద్ధి అమోఘం. సీమ్మిరపకాయలా చురుగ్గా పనిచేస్తుంది.

    వీసీ గారు రాగానే ఏం మాటాడాలో ఆలోచిస్తున్నాడు ప్రొఫెసరు... అన్నిటికన్నా ముందు తను చాలా రోజుల్నించీ మోణింగ్ వాక్ కి వస్తున్నట్టు చెప్పేయ్యాలి ఆ వెధవ చెప్పీలోపున.

    ఉదయాన్నే  ఇంత హుషారుగా తిరుగుతున్నాడంటే, తన ఆరోగ్యానికేం లోపం లేదనే - అర్థం. ఇంకా కావాలంటే చిన్న చిన్న ఆటలు కూడా ఆడతానని చెప్పొచ్చు. ఎవడు చూడొచ్చేడు? నిటారుగా నిలబడి మంచి కండిషన్లో వున్నవాడిలా కనబడాలి. ఇంగ్లీషులో టపటపా  మాట్లాడితే సరి. దెబ్బతో “వీడి" నోరు కట్టడిపోతుంది. ఆయన చేతిలో వాకింగ్ స్టిక్ ఉంటె  సరేసరి. లేకపోతే ఇది హంబుల్ గా ప్రెజెంట్ చెయ్యొచ్చు. ఫేషన్ కోసం తనీ స్టిక్  పట్టుకున్నాడు కానీ, అవసరంవల్ల కాదని ఆయనకి తెలిసేలా చెప్పాలి. ఒకవేళ ఆయన అమెరికా గురించి మాట్లాడితే? తనకి అమెరికాలో ఆస్పత్రి జీవితం తప్ప మరోటి తెలియదే? అయితే మాత్రం పుస్తకాల్లో చదివిన సంగతులు లేవా? అవే చూసినట్టు చెప్పెయ్యొచ్చు. ఫరవాలేదు. ఆ మాత్రం చెప్పగలడు తను. తను మంచి హెల్త్ తో  వున్నాడన్న ఇంప్రెషను ఆయనకిస్తే ఈ మూడేళ్ళ సర్వీసూ అయిపోగానే తనని ఎమెరిటస్ ప్రొఫెసరుగా వెయ్యొచ్చు...

    పదినిమిషాలు పాఠం చెప్తే సాధారణంగా పావుగంట రెస్టు తీసుకొంటారు ప్రొఫెసరుగారు. కాని యివాళ రెండు గంటలు (వీసీతో) మాట్లాడడానికి సిద్ధంగా వున్నారాయన.

    అసిస్టెంటు ప్రొఫెసర్ మారుతీరావు గారు జనరల్ గా క్లాసులకి వెళ్ళరు. వెళ్ళినా పాఠం మాత్రం చెప్పరు. చెప్పినా ఏదో గొణుక్కుంటూ ఉంటారు. క్లాసు ప్రిపరేషనుకోసం ఆయన టైము వేస్టు చెయ్యడం ఎవ్వరూ చూడలేదింతవరకూ.

    ఆయన ఇంగ్లీషులో మాట్లాడతారా? తెలుగులోనా? చిన్న చిన్న మాటలైతే ఫరవాలేదు. తను తెలుగు ఇంగ్లీషూ కలిసిన భాషలో దడదడ లాడించగలడు. కొంత సేపు చూసి, తెలుగులోకి దించితేసరి అది పెద్ద ఫరవాలేదు. కాని రష్యా వెళ్ళి వచ్చేడు కదా. ఆ దేశం గురించి ఆయన అభిప్రాయాలేమిటో? ముందే తెలిస్తే బావుణ్ణు. ఐ.సీ.యస్. ఆఫీసరుకదా, ప్రభుత్వానికున్న అభిప్రాయాలే ఆయనవీ అయితే అసలింక బెంగేలేదు. ఏవయినా జాగ్రత్త మీద వుండాలి. ఆయన ప్రైవేటు భావాలు తెలియందే నోరు జారకూడదు. ఆయనకూడా నాలాంటి కమ్యూనిస్టు అభిమానైతే, ఛాన్సు కొట్టేడన్నమాటే! ఆయనా నేనూ రష్యా గురించి చెప్పుకొంటూ ఉంటే! ఈ “జబ్బుగాడు” నోరు వెళ్ళబెట్టుకొని వినవలసిందే! మోణింగ్ వాక్ మంచితనం గురించి ఆయనకి చెప్పాలి. వీడు జబ్బు మనిషని తెలిసేలా చేస్తేసరి, రోగం కుదురుతుంది.

    "కంయ్ "మని వినిపించింది. హారన్. ఉలిక్కిపడ్డారిద్దరూ.  

    వేగంగా దూసుకుపోయింది ఒక కారు





    గుండె ఆగిపోతుందేమోనని భయం వేసింది గిరిధారికి.  మారుతీరావుకూడాబాగా జడుసుకొన్నాడేమో, గుండెలు దడదడ లాడసాగేయి..

    ఇద్దరూ ఒక్కసారే ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. “వీడిక్కణ్ణించి కదలడు” అన్న సంగతి ఇద్దరికీ స్పష్టంగా అర్థమయింది.

    ఎండ కొద్ది కొద్దిగా ఎక్కుతోంది. ఇసక దిబ్బలు నిశ్చలంగా కూర్చొని వున్నాయి. - దూరంగా సముద్రంలో - ఎక్కణ్ణించి వచ్చేయో, ఒక్కసారి కనిపించేయి వందలాది పడవలు.  మబ్బులులేని నీలాకాశం, అలలులేని నీలిసముద్రం - రెండూ కలిసిపోయి, దిక్చక్రం స్పష్టంగా కనబడడం లేదు. తెల్లటి నీటి కొంగలు బారులుతీరి ఎగురుతూ పోతున్నాయి,సూర్యుడి ఎరుపు కొంచెంకొంచెం తగ్గుతోంది. రోడ్డుకి రెండోవైపున ఇళ్ళు తడితడిగా కనబడుతున్నాయి. పాలవాళ్ళు ఇళ్ళకి గేదెల్ని తోలుకు వెళ్తున్నారు.

    ప్రకృతి అంతా మనోహరంగా వుంది.

    ప్రొఫెసరూ, అసిస్టెంటు ప్రొఫెసరూ ఒక్కమాట కూడా ఆడుకోకుండా కొయ్య బొమ్మల్లా నిల్చున్నారు.

    ప్రొఫెసరుకి బోర్నవిటా టైమయి చాలా సేపయింది. ఆకలీ నీరసం, టైముతోపాటు ఎక్కవవుతున్నాయి. కోటు చిరాకు కలిగిస్తోంది. బూట్లలో కాళ్ళు మంట పెడుతున్నాయి.

    అసిస్టెంటు ప్రొఫెసరుకి నెత్తి కొంచెం చుర్రుమంటోంది. అతని ముఖమంతా చెమటతో జిడ్డుగా తయారయింది. అతనికి వుక్కపోస్తోంది కాని, కోటు విప్పడానికి సందేహిస్తున్నాడు.

    పది నిమిషాలయంది. వీసీగారు రాలేదు. పావుగంటయింది. రాలేదు. ఏ క్షణాన వస్తారా, ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నారిద్దరూ ఎండ ఇద్దర్నీ చిరచిరలాడిస్తోంది. ఇంతలో మారుతీరావుకి ఒక ఐడియా వచ్చింది. -

    నేనూ, జబ్బుగురుడూ ఒకేకులం వాళ్ళంకద! ఇంతకుముందున్న వీసీ వెళ్ళిపోవడానికి కారణం కులాల కల్లోలఁవేకద! ఈ కొత్త వీసీకి ఆ సంగతి తెలిసే వుంటుంది కద! ఇప్పుడు ఇద్దరం ఒకేసారి కనబడితే, ఇవాళ కాకపోతే రేపైనా, ఒకకులం వాళ్ళ:తా ఒక జట్టుగా వుంటున్నామనుకొంటాడు కద! అది “మనకీ" మంచిది కాదు కద!... అందుచేత?

    అందుచేత, ఈ ఐడియాని చేతనైనంత సౌమ్యంగా ప్రొఫెసరుకి చెప్పేడు మారుతీ రావు. 

    ప్రొఫెసరు అంతా విన్నాడు. మారుతి ఎంత సౌమ్యం నటిస్తున్నాడో అతని మీద  అంత అనుమానం ఎక్కువ అవుతోంది. ప్రొఫెసరుకి.

    “సరేననుకోండి. ఇంతకీ ఏంచేద్దామంటారు?” అన్నాడు అంతా విని.

    ఇద్దరం  కలిసేవచ్చినట్టు తెలియకుండా మీరు కారుకి అటువైపు కొంతదూరం వెళ్ళి  , అట్నించి ఇటురండి. నేను కారుకి ఇటు వైపు కొంతదూరం వెళ్ళి,  మళ్ళీ ఇటువస్తాను" అన్నాడు అసిస్టెంటు ప్రొఫెసరు.

    "నేను వచ్చేలోపునే ఆయన వచ్చేస్తే?” 

    “మీకెందుకు నేనున్నానుగా, మిమ్మల్ని అప్పుడే చూసినట్టు 'గుడ్మానింగ్ , రండిసార్, మార్నింగ్  వాక్ కి వచ్చేరా?' అని అడుగుతాను” అన్నాడు మారుతీరావు అభినయిస్తూ,

    ప్రొఫెసరుకి 'ప్లాన్' అర్థమయింది. కాని ఆ ఎడ్వాంటేజ్ తనే కొట్టాలనుకొన్నాడు. మీరే  కారు వెనకవైపు వెళ్ళండి. నేను ఇటువెళ్తాను” అన్నాడు. 

    “ కాదు మీకు తెలీదు. మీరు అటువైపు వెళ్ళండి. నేనే ఇటు వెళ్తాను" అంటూ వెళ్ళిపోబోయాడు, అసిస్టెంట్...

    30 min
  • హర్షణీయంలో స వెం రమేష్ గారి ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలు

    స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు. ఈ వారాంతం హర్షణీయం ద్వారా ప్రసారం అవబోయే ఆయన ఇంటర్వ్యూ నించి కొన్ని భాగాలను ఇప్పుడు మనం వినొచ్చు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    6 min
  • స వెం రమేష్ గారి 'ప్రళయకావేరి కథలు' ఒక పరిచయం

    'ప్రళయకావేరి కథలు'రచయిత స.వెం.రమేశ్  ఎం.ఎ. (ఆంత్రొపాలజీ,)ఎం.ఎ. (తెలుగు) చదివారు. తెలుగు భాషకోసం అంకితమై పనిచేస్తున్న కార్యకర్త స.వెం.రమేశ్. తమిళనాడులోని తెలుగుభాషా సంస్కృతుల పరిరక్ష, ణ, అభివృద్ధి ఆయన  కార్యక్రమం.  తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో చెన్నై కేంద్రంగా తమిళనాడులో తెలుగు భాషాపరిశోధన, బోధన, ప్రచారాల కోసం ప్రారంభమైన 'తెలుగువాణి' (ట్రస్టు) సభ్యుడుగా, పూర్తి సమయ కార్యకర్తగా వున్నారు.

    'ప్రళయకావేరి' అందమైన పేరుగల అందమైన సరస్సు, ఆంధ్రప్రదేశ్‍లోని నెల్లూరు జిల్లాలో ఎక్కువగా, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లాలో కొద్దిగా పరుచుకున్న ఉప్పునీటి సరస్సు. ప్రళయకావేరి తల తమిళనాడులో, మొండెం ఆంధ్రలో. సరస్సులో నలభై వరకూ దీవులు. మనిషికీ మనిషీకి, దీవికి దీవికి నడుమ కంటికి కనిపించని అనురాగ సేతువులు. ప్రళయకావేటి పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఆ పల్లీయులనోట ఎన్నెన్ని కథలో, ఎన్నెన్ని పాటలో...ప్రళయకావేటి పుట్టుక గురించి, ప్రళయకావేటి లోని పెద్దపుణ్యక్షేత్రం 'పంటరంగం' గురించి పల్లె పల్లెలోనూ రకరకాల కథనాలు.

    ప్రళయకావేరి గుండెకాయ అయిన శ్రీహరికోటలో 1969 లో   రాకెట్ కేంద్రం నిర్మాణం కారణంగా దీవిలోని ప్రజలు నిరాశ్రయులైనారు. చంగలపాలెం,  కాకరమూల, కిళివేడు, రవణప్ప సత్రం, వంటోరిపాళం, సూళ్లదొరువు వంటి పలుగ్రామాల ప్రజలను,  నూరుమైళ్ల దూరంలోని మెట్టపొలాలకు తరిమింది కేంద్రప్రభుత్వం.

    పల్లెబతుకులతోపాటు అక్కడి ప్రాచీనదేవాలయాలు కూడా శిథిలమై రాకెట్ కేంద్రం స్థాపన మూలంగా నాశనమై పోయాయి. ఆ తరువాత పదేళ్లకు అభివృద్ధి పేరుతో ప్రళయకావేరి దీవుల్లో వేసిన గులకబాటలు, కరెంటుతీగెలు పట్టణనాగరికతను పల్లెలోకి తెచ్చింది. ప్రభుత్వంవేసిన గులకబాటలు, వర్షాధారమైన తమిదల్ని పండించడం మానివేసి, వరి పండించుటకై ప్రజలు వేసుకున్న చెరువుకట్టలు కలిసి, ప్రళయకావేట్లోని సహజమైన ఉప్పునీటిని కదలకుండచేశాయి. ప్రళయకావేట్లో కలిసే ప్రవాళం, కాళంగి, స్వర్ణముఖి, అరుణ కరిపేరు, చిలికేరుల్లో వానలేకా, ఎగువ ఆనకట్టలు కట్టెయడం వలన నీరు పారడం అగిపోయింది. ముఖద్వారాలలో ఇసుకమేటవేసి ఆటుపోట్లద్వారా వచ్చే సముద్రపు నీరు తగ్గిపోయింది. పేటలోని సినిమాలు మరిగి, ప్రళయకావేటి వారు జానపదాలను మరచిపోయినారు. ఇందతా, కళ్లముందే ఒక్క బతుకులోనే, తటాలున, చటుక్కున మాయమైపోవడం, అంతరించిపోతున్న ఆ సరస్సు జీవనాన్ని చూస్తూ తపించిపోయిన రచయిత నాటి వైభవాన్ని సజీవంచేసి, పాఠకులముందుంచిన ప్రయత్నమే ఈ 'ప్రళయకావేరి కథలు'.


    ఆనాటి ప్రళయ కావేరి సరస్సు   ఈనాటి  'పులికాట్'  లేక్. 


    ‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub


    హర్షణీయం పాడ్కాస్ట్ ని   –


    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa


    స్పాటిఫై  (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam


    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5


    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all


    హర్షణీయం ఫేస్ బుక్ లో  -  https://www.facebook.com/Harsha051271


    హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyam


    హర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutube



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    4 min
  • మా ఊరి నీళ్ల పురాణం:

    పైన చెరువు, మధ్యలో వూరు, వూరికింద పొలాలు, పొలాల క్రింద,  ఎంత ఎండాకాలం లో అయినా ఒక్క పాయన్నా పారే వాగులతో,  అద్భుతమైన గ్రావిటీ నీటి పారుదల వ్యవస్థ వున్న మా వూళ్ళో,   తవ్వితే పడేది మాత్రం  ఉప్పునీళ్ళే. 

    నీళ్లు పడ్డం అయితే ఇరవై ముప్పై అడుగుల్లోపలే పడతాయి, నోట్లో పోసుకుంటే కానీ తెలీదు ఎంత ఉప్పగా వుంటాయో. రాక రాక వచ్చిన జామ చెట్టు కాయలు, బాదం కాయలు, సపోటా కాయలు కూడా జవ్వ  బారిపోయుంటాయి. 

    అందుకు వచ్చిందేమో ‘ఉప్పలపాడు’ అని మా వూరికి  పేరు. 

    మా వూళ్ళో మూడు రకాల బావులు. ఊరికి దూరంగా  ఉండేది చెరువు అవతల వైపు ఒక మంచెళ్ల బావి. ఆ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే. ఊరి పైభాగాన, చెరువు కింద ఉండేది నడీది బావి.

     ఆ నీళ్లు అన్నం ఎసుటి మాత్రం వాడే వాళ్ళం.   ఇక వుప్పు నీళ్లు స్నానాలకు కాల కృత్యాలకి. 

    ఆబ్బో! ఆ వుప్పు నీళ్లకే పెద్ద డిమాండ్ మా వూర్లో ఎందుకంటే అందరం బావులు తొవ్వించుకోలేము కదా.  అలా ఇంట్లోనే బావుండే మా  శంకరవ్వ లాటి వాళ్ళ ప్రాపకం కోసం మాలాంటోళ్లం, పడరాని పాట్లు పడేటోళ్ళం. 

    శంకరవ్వ,  వాళ్ళ కోడి పక్కింట్లో గుడ్డు పెట్టేసిన రోజో,  లేదా  శంకరవ్వ దగ్గర పాలుపోయించుకొనే వాళ్ళు,  “కలిపితే కలిపావమ్మా కాస్త  మంచెళ్ళు అన్నా కలపకూడదా అన్న రోజునో” మనసు పాడుచేసుకునేది.

    అలా పాడైన  రోజున మా నీళ్ల ఆశ మీద నీళ్లు  చల్లి,  మనసు ఉల్లాస పరుచుకోవటం ఆవిడ సరదా. 

    అలాంటి శుభదినాల్లో , మా అమ్మ పిల్లకాయల్ని అందరినీ తీసుకొని ‘చలో పంటకాల్వ’  అని పొలాల్లో కి పట్టకెళ్లి మా వొళ్ళు  తోమేసేది. పంటకాల్వ దగ్గరికి పోవడం ఒక పిక్నిక్ లాంటిది మా పిలకాయలందరికీ,

    పాపం మా ఊరి ఆడపిల్లకాయలు, ఎప్పుడన్నా నెల్లూరు కో , బుచ్చిరెడ్డి పాలెం కో సినిమాకెళ్లి  , అక్కడ ప్రకటనల్లో కన్పడే  సినీ తారల సౌందర్య రహస్యాన్ని వాళ్ళ నోళ్ళ ద్వారానే వినేసి,  మూకుమ్మడిగా ముచ్చట పడి,  కొనుక్కొచ్చుకున్న లక్స్ సబ్బులు,   మా ఊరి నీళ్ళకి నురుగు బదులు  ఒంటిమీద విరిగిపోయిన పెరుగులయిపోయేవి. 

    ఈ కారణం చేత అందందేముందబ్బా, ఆరోగ్యం ముఖ్యం, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందొ ఆరోగ్యం అక్కడ వుంది అన్చెప్పి,  మా వూళ్ళో ఆడపిల్లంతా,  లైఫ్ బాయ్ కి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోయారు. 

    నిత్యం ఉప్పునీళ్లతో  ఒళ్ళు ఉతుక్కున్నా,  మా ఊరి ఆడపిల్లకాయల కళే వేరబ్బా. 

    ఇగన,  ఊరికి అవతలెక్కడో వున్నా మంచెళ్ల బాయి నుండి నీళ్లు తెచ్చుకోవటం పెద్ద ప్రహసనం. మా ఊరి అబ్బాయిలు బాధ్యత కల వాళ్ళో లేదో అనే విషయం,  యీ బాయి నుండి నీళ్లు తేవటం లో తెలిసిపోయేది. పెద్దోళ్ల మాటల్లో తరచూ వినపడేవి, "ఆ శేష మావ కొడుకు వయినమైనోడమ్మా! ఇంటికి సరిపడా నీళ్లు ప్రతీ దినం మోసుకొస్తాడమ్మా అనో లేక ఆ సుందరయ్య కొడుకు చాలా పెడద్రపోడమ్మా, ఏనాడన్న గుక్కెడు నీళ్లు తెచ్చి ఉండడు అనో". 

    నీళ్లు తెచ్చే వాడికే పిల్ల నిచ్చే వాళ్ళు  ఆ రోజుల్లో. 

    ఇట్టానే నీళ్ల వాడకం బట్టి,  మా ఊరి ఆడోళ్లు కుటుంబాన్ని నడిపే పద్దతిని చెప్పేసే వాళ్ళు, " ఆ ప్రమీలమ్మ కోడలిగా వచ్చిందమ్మా! ఆ ఈదలోళ్లు యీదిన పడ్డారమ్మా!  ఆ మహాతల్లి కడవల కడవల నీళ్లు పుసుక్కున పారబోసేదమ్మా అని. నీళ్ళేమన్నా వంటిమీద నిలుస్తాయమ్మా" అంటూ. 

    ఎవరన్నా పిల్లలు తలి తండ్రులని సరిగ్గా చూసుకోకపోతే, “అంతేనయ్యా, నీరు పల్లమెరుగు అనో మానూరి నీళ్ళలో ఉప్పు పోదు మీ పిల్లకాయల్లో వుండే చెడు పోదు” అంటూ  ముసలి వాళ్ళ నిర్వేదం లో కూడా నీళ్ల ప్రసక్తే. 

    మావూరి చెరువులోకి నీళ్లొచ్చే రోజుల్లో మటుకు  మా పిల్లకాయలకి పండగే పండగ. ఎప్పుడెప్పుడు చెరువు నిండుద్దా అని ఆత్రం గా చూసే వాళ్ళం. మా పెద్దకాయలేమో, ముందు తూములు ఎత్తేసి పొలాలకు పారిచ్చుకునే వాళ్ళు. అలా పొలాలన్నీ ఒక వారం ఒక తడవ తడిశాక,  తూములు బిగిచ్చి చెరువు నిండనిచ్చే వాళ్ళు. మాకైతే పెద్ద వాళ్ళు  ఈ పని చేయటం నచ్చేది కాదు. ఎప్పుడు చెరువు నిండుతుందా అని రోజూ చెరువు దాకా  పరిగెత్తి చూసే వాళ్ళం. అలా నిండిన చెరువు ఎండటం,  మళ్ళీ  నిండటం మళ్ళీ  ఎండటం,  అనేది నీళ్లు నేర్పిన పాఠం నాలాంటోడికి. 

    నేనెప్పుడైనా మంచెళ్ల బాయి దగ్గరకు వెళ్ళినప్పుడు, మాఊరోళ్ళే  కొంతమంది  వచ్చి, ఎవరన్నా జాలి తల్చి,  వాళ్ళ బిందెల్లో కొన్ని నీళ్లు  పోస్తారా,  అని ఎదురుచూస్తూ  , ఓ  పక్కన నిలబడ్డం,  చూసేవాణ్ణి.  

    వాళ్ళను  మటుకు నీళ్లు తోడుకొనిచ్చే వాళ్ళు కాదు ఈ బావిలోంచి.  “ఇదేంది మందలా” అని మా వాళ్ళని అడిగితే “అదంతే!  నీకు తెల్దులే అబ్బయ్యా” అనే వాళ్ళు మా ఇంట్లో పెద్దోళ్ళు. 

    నేనే ఇంకొంచెం  పెద్దయ్యాక, నాకు అర్థమైంది, దేవుడు పోసిన నీళ్లు తాగాలన్నా, మనుషుల్లో వుండే  ముందూ వెనకల్ని బట్టేనని చెప్పి. 

    ఒక పదేళ్ల క్రితం అనుకుంటా  మా వూరికి కుళాయిలొచ్చాయి. అంటే ఇప్పుడూ ముందూ వెనకాల ఏవీ లేవు. ఊరి  జామ చెట్టు కాయలు కూడా తియ్యబడ్డాయ్. వూరంతా తాగేది ఒకే నీళ్లు , మంచి నీళ్లు. 

    పేరు మటుకు ఉప్పలపాడే. 

    నేనే ఇంకొంచెం  పెద్దయ్యాక, నాకు అర్థమైంది, దేవుడు పోసిన నీళ్లు తాగాలన్నా, మనుషుల్లో వుండే  ముందూ వెనకల్ని బట్టేనని చెప్పి. 

    ఒక పదేళ్ల క్రితం అనుకుంటా  మా వూరికి కుళాయిలొచ్చాయి. అంటే ఇప్పుడూ ముందూ వెనకాల ఏవీ లేవు. ఊరి  జామ చెట్టు కాయలు కూడా తియ్యబడ్డాయ్. వూరంతా తాగేది ఒకే నీళ్లు , మంచి నీళ్లు. 

    పేరు మటుకు ఉప్పలపాడే. కొన్ని కొన్ని మారవు. మారడానికి టైము పడుతుందేమో.

    కథను –

    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa

    స్పాటిఫై (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam

    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5

    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all

    హర్షణీయం ఫేస్ బుక్ లో - https://www.facebook.com/Harsha051271

    హర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutube



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    6 min
  • తడిసిన నేల - అనిల్

    తడిసిన నేల:

    ముందు ఉన్న  సీట్లు ,   ఊతంగా పట్టుకు నడుస్తూ, బస్సులో  వెనకనించీ  ముందుకెళ్తున్నాడు రెడ్డి.

    లైట్లన్నీ ఆర్పేసున్నాయి బస్సులో. బస్సులో కూర్చున్న పది పన్నెండు మందీ, రక రకాల భంగిమల్లో,  నిద్రలో మునిగున్నారు. రోడ్డు మీద చిందుతున్న  వాన చినుకులు  హెడ్ లైట్ వెలుగు లో మెరుస్తున్నాయి. గతుకుల్లోంచీ బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది. 


    డ్రైవర్ సీట్ దాకా వచ్చి అడిగాడు, “కందుకూరు ఇంకా ఎంతసేపు ”?


    “ వానలు గదా …. రోడ్డుగూడా, బాగా దెబ్బతినుంది. ఓ మూడుగంటలు వేస్కో.“ అన్నాడు డ్రైవర్ , తల తిప్పకుండా.  


    వెనక్కి సీటు దగ్గరకొచ్చి  చూస్తే,  చిరంజీవి గాడు అంగుళం స్థలం కూడా మిగల్చకుండా  సీట్  అంతా ఆక్రమించి జోగుతున్నాడు.  


    మెల్లగా భుజం మీద తట్టాడు.  


    సగం కళ్ళు తెరిచి పక్కకు జరుగుతూ  అడిగాడు చిరంజీవి   -  “దగ్గరికొచ్చామా ’’ ?


    “ఇంకా మూడుగంటలంటున్నాడు  డ్రైవరు”


    “ బాగా లేటు అయ్యేట్టుంది.”  


    “చూద్దాం“ 


    “మరీ లేటయితే, రిక్షాలూ అవీ వుంటాయంటావా” 


    “ అదే ఆలోచిస్తున్నాను. ఈ టైములో ఇల్లు వెతకడం కూడా కొంచెం కష్టమే ”


    “వెతకడమేంది ,అడ్రస్ మన దగ్గర  లేదా “ అన్నాడు కళ్ళు  తెరిచి, పెద్దవిచేస్తూ  చిరంజీవి. 


    “అంటే ,  ఏదో సాయినగర్ అని చెప్పినట్టు గుర్తు   “


    “ ఇప్పుడెలా?  ఇరుక్కుపోతామేమో ?”


    “ కందుకూరు మరీ పెద్ద వూరేమీ కాదు . చూద్దాం.  ” 


    “వానేమో ఆగట్లేదు.  తుఫానో ఏందో ,  అన్నీ  చూసుకుని బయల్దేరాల్సింది. “ అటూ ఇటూ ఇబ్బందిగా కదుల్తూ అన్నాడు చిరంజీవి. 


    “ ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా ?” 


    “అవును “


    “ ఈ టైములో  వెనక్కెళ్ళడం తేలికా   , ముందుకెళ్ళడమా “


    ఏవీ మాట్లాడలేదు  చిరంజీవి. 


    రెడ్డి  కిటికీలోంచి బయటికి  చూస్తూ అనుకున్నాడు. “ వీడెప్పుడూ ఇంతే. టెన్షన్తో పక్కవాణ్ణి చంపేస్తాడు.  అసలక్కడ మూర్తి  ఎలా వున్నాడో  ఏందో ”


    రామిరెడ్డి , చిరంజీవి , ఇద్దరూ చిన్నపట్నించీ ఒంగోల్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు. రామిరెడ్డి వాళ్ళది పెద్ద వ్యవసాయ కుటుంబం. ఉలవపాడు ఆ చుట్టుపక్కల  మావిడి తోటలున్నాయి   వాళ్ళకి . చిరంజీవి నాన్నగారు  ఎల్ ఐ సీ  లో సీనియర్ పొసిషన్ లో  పనిచేస్తారు. ఒకడే సంతానం. చిరంజీవి, రెడ్డి , మూర్తితో పాటూ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో వున్నారు.  కంబైన్డ్ స్టడీలూ, కాలేజీ ఎగ్గొట్టడాలూ ముగ్గురూ కలిసే చేస్తారు.  అదే కాలేజీలో చదువుతున్న, వాళ్ళ పెద్దమ్మ కొడుకుతో కల్సి చిరంజీవి ఒక రూంలో ఉంటే, వెనక పోర్షన్లో వుండే ఇంకో రూంలో రెడ్డి , మూర్తి వుంటారు.  


    పొద్దున్న  బాగా వొళ్ళు నెప్పులని  చెప్పి,   కాలేజీ కి  రాలేదు  మూర్తి . సాయంత్రం వచ్చేటప్పటికి  రూము తాళం వేసుంది.  ఇంటిగలాయనకి కీ ఇచ్చి వెళ్ళాడు, ఊరెళ్తున్నా అని చెప్పి.   రూమ్ లోకొచ్చి  మెళ్ళో వేసుకున్న ఐ డీ కార్డు టేబుల్ మీద పడేస్తూంటే, ఒక చిన్న  కాయితం ముక్క  పెట్టుంది .


     “నాన్న పోయారు. టెలిగ్రామ్ వొచ్చింది. బయల్దేరుతున్నా, ఉన్న డబ్బులు ఛార్జీలకు మాత్రం సరిపోతాయి.”


    మూర్తికి, రామిరెడ్డి చిరంజీవిలతో తప్ప  వేరే  ఎవరితో పెద్ద పరిచయాల్లేవు.  చదువు తప్ప ఏదీ పట్టదు అతనికి.  చిన్నప్పుడే వాళ్ళమ్మ పోయారు . ఇంట్లో డబ్బుల ఇబ్బంది ఉన్నట్టుంది. ఏ నెలా టైం కి అందవు, వచ్చే మనీఆర్డర్లు.  


    పర్సులో వున్న మూడు, వంద నోట్లు చూసుకుంటూ  అనుకున్నాడు,  కొంచెం తొందరగా  బయదేరితే, రాత్రి పది కల్లా కందుకూరు  చేరొచ్చు. 


    తలుపు తోసుకుంటూ  ‘టీకి పోదాం’ అంటూ చిరంజీవి వొచ్చి   “మూర్తి గాడేడీ?  క్లాసుక్కూడా రాలేదు” అనడిగాడు. 


    విషయం చెప్తే , “ అయ్యో, నేనూ వచ్చేవాణ్ణి గానీ,  రేపు ఏటీడీ లాబులో రికార్డు సబ్మిట్ చెయ్యాలి. ” అన్నాడు 


    “ అదంత కొంపలు మునిగే విషయం కాదు గానీ, అసలు విషయం చెప్పు” అని చిరంజీవి మొహంలోకి చూస్తూ అడిగాడు రెడ్డి . 


    “అంటే…  నాకు అలాటి చొట్లకెళ్ళడం కంఫర్టబుల్ గా ఉండదు. మా తాతయ్య పొయ్యినప్పుడుకూడా ఎక్కువ సేపు అక్కడ ఉండలేక పోయాను. ” ఎటో చూస్తూ చెప్పాడు చిరంజీవి. 


    “అది సరే. డబ్బులేవన్నా ఉన్నాయా, మూర్తి గాడికి  అవసరం పడొచ్చు.”

     

    “ ఒక రెండు వందలు వున్నాయి. అన్న నడిగితే, ఇంకో మూడు నాలుగొందల దొరకొచ్చు. ” అని చెప్పి వెళ్లిన  చిరంజీవి,  ఓ పదిహేను నిమిషాలలో , ఓ చిన్న బాగు భుజానేస్కుని వచ్చాడు. 


    “బ్యాగ్  ఎందుకేసుకొచ్చావు” 


    “అన్నకు విషయం చెప్తే  “ఇట్లాంటప్పుడే, మనుషుల అవసరం, బయల్దేరి వెళ్ళు ” అన్నాడు.” 


    భోజనం అయ్యిందనిపించి,  ఆదరా బాదరాగా బయల్దేరారిద్దరూ. కుండపోత వర్షం. గూడూరు లో బస్సు ఎక్కేటప్పటికి   బాగా లేట్ అయిపొయింది. 


                                                                        *****


     పైనుంచి  పరుచుకున్న   వాన తెర  లోంచి బస్సు తీరిగ్గా ముందుకు వెళ్తోంది. 

     

    రెడ్డి అన్నాడు - “వీడెప్పుడూ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాట్టం గానీ , వాళ్ళనించీ లెటర్లు రావడం గానీ చూడలేదు. ఏదన్నా అలాంటి విషయం వొచ్చినా పొడి పొడి మాటలే . వాళ్ళ  అక్క కూడా కందుకూర్లో లేదనుకుంటా. “  అన్నాడు   ….  “ 


    “ ఎవరో  ఒకరు వచ్చి వుండరంటావా ఈపాటికి ”


    “నాకు అయితే డౌటే. అసలు ఈ వర్షం చూస్తూంటే, చాలా టైం పట్టేటట్లుంది.”


    “ఏదో ఒక టైం కి చేరుకుంటే ఓకే. మధ్యలో వాగులూ అవీ …. “ అంటూ మధ్యలో ఆపేసాడు, రెడ్డి మొహం చూసి చిరంజీవి. 


    బస్సు చిన్నగా , ఇంకో మూడు గంటల తర్వాత కందుకూరు చేరింది. అప్పటికి సెకండ్ షో కూడా అయిపోయిందేమో ,  ఊరి మొదట్లో  వుండే సినిమాహాల్లో కూడా, లైట్లు ఆర్పేసి వున్నాయి.  అక్కడక్కడా  ఆరుతూ వెలిగే, స్ట్రీట్ లైట్ల స్తంభాలు తప్ప రోడ్డంతా  ఖాళీ. బస్సు స్టాండ్ లోకి ఎంటర్ అవుతుంటే, ఎంట్రన్స్ లో పోలీస్ జీపు ఒకటి ఆగుంది. దాని పక్కన ఇద్దరు కానిస్టేబుళ్లు నిలబడి,  జీపులో వున్న మనిషితో ఏదో మాట్లాడుతున్నారు. వర్షం మటుకు సన్నగా పడ్తూనే వుంది.  


    బస్సు దిగి, కింద కాలు పెట్టంగానే, చిరంజీవి అన్నాడు, “ఆకలేస్తోంది. తినడానికి ఏమన్నా దొరుకుతుందంటావా ఈ టైములో … ?”


    బస్సు స్టాండ్లో  షాపులన్నీ  మూసున్నాయి, ఒక బంకు తప్ప . 


    “నువ్వేమన్నా తింటావా ? “అడిగాడు చిరంజీవి.


     “నాకు ఆకలిగా లేదు, నీకేం కావాలో తీస్కో “అన్నాడు రెడ్డి, భుజాన వుండే బ్యాగ్ ని కిందపెట్టి, చుట్టూ చూస్తూ. 


    చిరంజీవి  అరటి పళ్ళు బేరం చేసింతర్వాత, బంక్ అతన్ని , రెడ్డి  అడిగాడు.  “సాయినగర్ కి రిక్షా మీద  ఎంత అవుతుంది.”?


    చాకుతో పళ్ళు కోసిస్తున్న మనిషి ఆగిపోయి “వూరికి కొత్తా” అని అడిగాడు.  సమాధానం చెప్పబోయే లోపల, అన్నాడు  “ ఈ రోజు రాత్రి ఎమ్మెల్యే మనిషిని ఒకాయన్ని, ఎక్స్ పార్టీ వాళ్ళు చంపేశారు. 144 సెక్షన్ పెట్టారు. రిక్షాలు దొరకడం కష్టం ” 


    చిరంజీవి  పర్సులోంచి డబ్బులు తీస్తున్నవాడల్లా ఒక్క సారి ఆగి, రెడ్డి  వైపు చూసి అన్నాడు,  “ బయటికెళ్లి రిస్కు చెయ్యడం ఎందుకు . పొద్దుటిదాకా బస్టాండ్లో ఉందాం. “


    పట్టించుకోకుండా  రెడ్డి  అడిగాడు  బంక్  అతన్ని  “ఇక్కణ్ణుంచి నడిస్తే ఎంతసేపు  సాయి నగర్  “?


    “నడుచుకోని వెళ్లాలంటే, పదిహేను నిమిషాలు ,  సాయి నగర్లో ఎక్కడికి? “


    “ఈ టైంలో  వర్షంలో నడుచుకుంటూనా, అదిగూడా ఇల్లెక్కడో తెలీకుండా.” అని సణిగాడు చిరంజీవి. 


    సమాధానం చెప్పేలోపలే, రెడ్డి భుజం ఎవరో తట్టారు . వెనక్కి తిరిగి చూస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడున్నాడు. 


    “ఎక్కణ్ణించి వొస్తున్నారు”


    వూరు, కాలేజీ పేరు చెప్పాడు రెడ్డి  . 


    “ ఐడీ చూపించు  “


    బ్యాగులో చేయ్యిపెట్టబోతూ ఆగి చిరంజీవిని  అడిగాడు రెడ్డి,  “నీది ఉందా, నేను పెట్టుకోలేదు”


    అడ్డంగా తలూపాడు చిరంజీవి . 


    “పదండి, బయట గేట్ దగ్గర సి ఐ గారున్నారు.”


    “లేదు సర్, మా ఫ్రెండు వాళ్ళ ఫాదర్ పోతే, తొందర్లో …” 


    స్వరం హెచ్చించి అన్నాడు కానిస్టేబుల్, “సీ ఐ గారి దగ్గరి కన్నానా”


    ఒకరి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నడవడం మొదలు పెట్టారు , తల మీద కర్చీఫులు వేసి . చిరంజీవి మొహం ఎర్రబడి పొయ్యింది. నడవలేక నడుస్తున్నాడు. బస్స్టాండ్ గేట్ బయట దాకా తీసుకెళ్లి ఆగమన్నట్టు సైగ చేసాడు కానిస్టేబుల్.  తానొక్కడే నడుచుకుంటూ రోడ్డుకు అవతలి వైపున్న  జీపు దాకా వెళ్ళాడు. ఒకనిమిషం జీపులో ఉండే, సి.ఐ తో మాట్లాడి రమ్మన్నట్టు సైగ చేసాడు. 


    చిరంజీవి కి అడుగు ముందర  పడట్లేదు. “నువ్వెళ్ళి మాట్లాడు .. ప్లీజ్ “అన్నాడు =  


    రెడ్డి జీప్ దగ్గరికి వచ్చాడు. జీప్ స్టార్ట్ చేసి వుంది. 


     ముందు సీట్లో కూర్చొని వున్న సీ ఐ   అడిగాడు “ ఈ టైములో బస్సు స్టాండ్ లో ఏంచేస్తున్నారు”


    “ఇప్పుడే గూడూరు నించీ బస్సు దిగాం సర్ “


    “పనేంది?  “


    “మా రూమ్ మేట్ మూర్తిది ఈ వూరే సర్. వాళ్ళ ఫాదర్ చనిపోతే, వాణ్ని కలవడానికి వొచ్చాము.”


    “ఇంజనీరింగ్ స్టూడెంట్లవని చెప్పారట మా వాడికి, ఐ డీ కార్డులు పెట్టుకొని తిరగరా మీరు, రాత్రి ప్రయాణాలు చేస్తూ “


    “ఆ తొందర్లో మర్చిపొయ్యాం సర్. “


    “  మీ ఫ్రెండ్ ఇల్లెక్కడ వూళ్ళో . “


    చెప్పాడు రెడ్డి. 


    “సాయి నగర్లో ఎక్కడ.” 


    “అదీ  ...... “


    “ఇంటి అడ్రస్ , అడ్రస్ ఎక్కడ  “


    సమాధానం రాకపోవడం చూసి మళ్ళీ   రెట్టించాడు సీఐ . 


    “కరెక్టుగా తెలీదు సర్’


    “రమణరావు ఇద్దర్నీ, స్టేషన్ కి తీసుకెళ్ళు, నేను రౌండ్స్ మీద పోతున్నా,” అని కానిస్టేబుల్ కి చెప్పి  వెళ్ళిపోయాడు జీపులో సీ ఐ . 


    ఏదో చెప్పబోతున్న రెడ్డి తన పక్కనున్న ఆ కానిస్టేబుల్ రమణారావు వైపు చూసాడు. చెప్పాడు “ సర్, నిజంగానే, ఈ వూరు మా వాణ్ణి కలవడానికి వచ్చామండీ. తొందర్లో వచ్చేసాం. మా మూర్తిని చేరుకోటం ఇప్పుడు చాలా అవసరం. ఏదో ఒకటి చెయ్యండి.”


    “ఒకసారి సీ ఐ గారు ఏదన్నా చెప్పింతర్వాత, మా చేతుల్లో ఏం ఉండదు. మీ మొహాలు చూస్తే, చెప్పేది  నమ్మాలనే  వుంది. సీ ఐ గారు ఎటూ ఒక గంటలో స్టేషన్ కొస్తారు . అప్పుడు ఏదైనా మాట్లాడి చూడొచ్చు.”


    అలానే కాళ్ళీడ్చుకుంటూ, అతనితో ఓ రెండు ఫర్లాంగుల దూరంలో వున్న స్టేషన్లోకి అడుగుపెట్టారు, ఇద్దరూ. ఒక వరండా, వరండాలోంచి లోపలికెళ్తే హాలు. అక్కడ ఇద్దరు పోలీసులు ఛైర్లు టేబుళ్లు వేసుకుని కూర్చోనున్నారు. తన కుర్చీలో కూర్చుంటూ, మూలగా వుండే బల్ల చూపిస్తూ “అక్కడ కూర్చోండి” అన్నాడు రమణారావు. 



    హాల్లో ఒక మూల  కకటకటాల గది ఒకటుంది.  దాంట్లో నేల  మీద కూర్చొని వున్న, ఇద్దరి  ఆకారాలు కన్పడుతున్నాయి. అటు పక్కా, ఇటు పక్క ఇంకో రెండు రూములు . ఒక రూము తలుపు దగ్గరగా వేసుంది, రూమ్ లోపల్నించీ గట్టి గట్టిగా  అరుపులు    వినపడుతున్నాయి. నేలంతా అక్కడక్కడా  రెక్క పురుగులు కుప్పలు, కుప్పలుగా చచ్చి పడున్నాయి. ఎదురుగా కూర్చొన్న రమణారావు ఈనాడు పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. వెనకాల పేజీలో చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్, సినిమా యాభై రోజులని రాసుంది. సినిమాల్లో తప్ప పోలీస్ స్టేషన్ని చూడని , చిరంజీవి రుమాల్తో మాటి మాటికీ మొహం తుడ్చుకుంటున్నాడు. 


    “ఏదో ఒకటి ఆలోచించరా పుణ్యం ఉంటుంది.” చిరంజీవి మాటలు తడబడుతున్నాయి.  


    ” ఇంకెవరన్నా వచ్చి మనల్ని  బయటపడేసి , మూర్తి దగ్గరికి తీస్కెళ్ళే  అవకాశం ఉందా  ”


    “ లేదు”


    “ ఏం చెయ్యాలి ?  ” అన్నాడు రెడ్డి. 


    “మనమే ఏదో చెయ్యాలి”


    “అదీ ఆ విషయం ఆలోచించు. నేను కూడా అదే పని మీద వున్నా. అయినా మన సంగతి సరే. మూర్తి ఎట్టున్నాడో . వాడికి తోడెవరన్నా వున్నారో లేరో.  ”


    ఓ రెండు నిమిషాలాగి చిరంజీవి అన్నాడు “ మూర్తి అపుడపుడూ వాళ్ళ టీచర్ ఒకరి గురించి చెపుతూంటాడు “


    “నాదగ్గర కూడా అన్నాడు. లెక్కల మేష్టరు  అనుకుంటా. పేరేవన్నా గుర్తుందా”


    ఈలోగా, సి ఐ జీపు స్టేషన్ లోకి ఎంటర్ అయ్యింది. గబగబా స్టేషన్ లోకి వొచ్చి, వీళ్ళ మొహాల్లోకి చూసి, రూమ్ లోకి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. రమణరావు  అతని పక్క కుర్చీలో  కూర్చోనున్న   కానిస్టేబుల్,  ఇద్దరూ సి ఐ రూమ్ లోపలికి వెళ్లారు  బెల్ శబ్దం విని.ఇటు పక్క  రూమ్ నించి  అరుపులు ఎక్కువౌతున్నాయి.  


    సిఐ అడిగాడు  “ఏమంటున్నాడు ఆ రాజా   గాడు,  ఏడుపులు పెడబొబ్బలు  కాకుండా చెప్పాడా ఏవన్నా”


    “లేదు సార్,   రాత్రంతా తాగి ఇంట్లో  పడున్నాట్ట.  అసలా  హత్య విషయమే తెలీదంటున్నాడు.”


    సీ ఐ అంటున్నాడు “ఆ రాజా గాడి ఒంటికి  మీ చేతులు  సరిపొయ్యినట్టు లేదు.” 


     ఆ మాటలు చెవిలో పడ్డ  చిరంజీవి మొహం చేటంత అయ్యింది. . “మూర్తి చెప్పాడన్నానే  ,వాళ్ళ స్కూలు టీచర్,....   గుర్తొచ్చింది ఆయన పేరు  రాజారామ్ గారు .”


    “కరెక్ట్ . అదే ”అన్నాడు రెడ్డి. 


    ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ, సి ఐ రూమ్ ముందరకొచ్చి  నిలబడ్డారు . 


    “ఎక్స్ క్యూజ్ మీ సర్ “


    “ఏందీ” విసుగ్గా, తల తిప్పి చూసాడు సీ ఐ. 


    “ఇక్కడ స్కూలు టీచరు ఒకాయన తెలుసండీ, రాజారామ్  గారనీ” అన్నాడు రెడ్డి . 


    రమణారావు వైపు చూసాడు సీ ఐ . “అవును సర్, మున్సిపల్ హైస్కూల్ టీచర్ ఒకాయన వున్నాడు . పక్క వీధిలోనే ఆయన ఇల్లు “


    అన్నాడు  రెడ్డి, “సర్, ప్లీజ్ సర్. మా కాలేజీ కి రేప్పొద్దున మీరు ఫోన్ చేస్తే, వివరాలన్నీ, తెలుస్తాయి. ఇప్పుడు వెళ్లనివ్వండి. మళ్ళీ రేపు కనపడమంటే, వచ్చి కనపడతాం. . ఈ టైములో మా వాడి  దగ్గర ఉండటం   చాలా అవసరం అండీ”


    తాగుతున్న సిగరెట్ ఆష్ ట్రే లో పడేసి, లేచి బెల్టు సరిచేసుకుంటూ అన్నాడు , “ రమణరావు  వీళ్ళని ఆయన దగ్గరకి తీసుకెళ్లి విషయం కనుక్కో . నేను రాజా గాడి  సంగతి చూడాలి “  


    స్టేషన్ బయటికి రాంగానే అన్నాడు , చిరంజీవి “ నీకు భలే ధైర్యం రా. తొణకవూ, బెణకవూ “


    “స్కూల్ టీచర్ విషయం  మొదట ఎవరికి గుర్తు కొచ్చింది? “


    “నాకే”


    “టీచర్ పేరు ఎవరు చెప్పారు”


    “నేనే”


    “ అదీ విషయం” అన్నాడు రెడ్డి. 


    మబ్బులు ముసురేసుకుని వున్నా, ఆకాశంలో నెమ్మదిగా వెలుగు పర్చుకుంటోంది.  న్యూస్ పేపర్లూ, పాల కేన్లూ తగిలించుకున్న ,సైకిళ్ళు ఎదురొస్తున్నాయి. రాజారామ్ గారు కళ్ళు మూసుకుని వసారాలో బావి పక్కన కుర్చీ వేస్కుని కూర్చోనున్నారు.  ఓ డెబ్బై ఏళ్ళుంటాయి ఆయనకి. 


    “విషయమంతా విని రమణరావుకి చెప్పాడాయన, వీళ్ళ చెప్పే మూర్తి నాకు బాగా తెల్సు. ఊరికొచ్చిన ప్రతీ సారీ వచ్చి కలుస్తాడు కూడా. సాయి నగర్లో ఇల్లు. “


    రమణమూర్తి అక్కడ ఇద్దర్నీ వదిలేసి వెళ్ళిపోయాడు స్టేషన్కి. 


    రెడ్డి  ఏదో మాట్లాడపోయే లోపల  రాజారామ్ గారు అన్నారు  “ఆ బావి దగ్గర మొహాలు  కడుక్కొని, కాఫీలు తాగండి. వెళుదురు గాని ”


    పరిచయాలయ్యాక , కాఫీ తాగుతూ  చెప్పాడాయన   “అవధాని అంటే మూర్తి  వాళ్ళ నాన్న , చిన్న చిన్న పౌరోహిత్యాలు చేస్కుని బతికేవాడు. మూర్తి వాళ్ళ అమ్మ టైం కి వైద్యం అందక పోయిందని, బంధువుల అందరినీ దూరం చేసుకున్నాడు అవధాని. ఇది గాక కూతుర్ని కూడా  ఎవరో తురకబ్బాయిని చేసుకుందని దగ్గరకి రానివ్వలేదు. ఈయన పోవడం మూర్తికి పెద్ద దెబ్బే . వెంటనే వచ్చి మీరు మంచి పని చేశారు. మూర్తి కి ఈ టైములో కావాల్సింది మనుషులే.  ” అంటూ ఏదో  చెప్పబోతూంటే, ఎవరో ఇక మనిషి ఒక చిన్న చెక్క పెట్టె పట్టుకుని  వాకిట్లోకి వచ్చాడు. . 


    అతన్ని  చూసి రాజారామ్  గారు “నాకు ఈ కుడికాలు రెండు రోజుల్నించీ ఇబ్బంది పెడ్తోంది. ఇంట్లోనే ఏదో నాటు వైద్యం చేయించుకుంటున్నా. లేకపోతే నేను గూడా అక్కడికి వచ్చేవాణ్ణి . వాళ్ళిల్లు ఇక్కడ్నించీ ఓ పది నిముషాలు నడక, సాయి నగర్లో ఆంజనేయ స్వామి గుడిని ఆనుకొని వున్న పెంకుటిల్లు.” అన్నారు. 


    మూర్తి ఇంటి వైపు వెళ్తూంటే, చిరంజీవి అన్నాడు, “వాణ్ణి తల్చుకుంటూంటే జాలేస్తోంది. ఏవి ఇబ్బందులు పడ్తున్నాడో ఏందో .”




                                                        ************


    ఆ వీధిమొదట్లో వుంది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడికి ఆనుకొని వున్న ఇల్లు గేట్ తీస్కొని లోపలోకి అడుగుపెట్టారు ఇద్దరూ.  ఇంటి పైన పెంకులన్నీ నల్లబడి అక్కడక్కడా విరిగి ఖాళీల్లోంచి దూలాలు కన్పడుతున్నాయి. . గోడలన్నీ చెమ్మ పట్టున్నాయి. వసారాలో, అక్కడక్కడా  పోగుల్లేచిపొయ్యిన నవారు  మంచం ఒకటి వేసుంది.  


    గేటు శబ్దం వినంగానే  వసారాలో కొచ్చాడు మూర్తి.


    ఇద్దరి చేతులూ పట్టుకొని అన్నాడు , “రాత్రికే వచ్చేస్తారు అనుకున్నా ”. 


    ఒంట్లోంచి శక్తినంతా ఎవరో లాగేసుకునట్టు కన్పడుతున్నాడు మూర్తి. 


    ఇంట్లో ముందు గదిలో పడుకోబెట్టి వున్నారు, మూర్తి వాళ్ళ ఫాదర్ ని. ఇంట్లో వేరే మనిషి జాడ గూడా లేదు. 


    భుజం మీద...

    26 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners