Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • Part - ii : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.

    కొంచెం సేపయిన తర్వాత ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఇలా అంది. “మీ ఊరు చాలా వెనకబడి ఉందండీ!”

    నాకేమీ తోచక, “శాస్త్రి కూడా వస్తే బాగుండేది” అన్నాను. 

    ఆమె ఒక క్షణం ఆగి, “చాలా వెనకబడి ఉంది” అతని తనలో తాను అనుకుంటున్నట్లు అన్నది. 

    “లేకపోతే బొంబాయి ఉన్నట్లు ఉండమంటే ఎట్లా ఉంటుంది!” అన్నాను.

    “ఊరు సంగతి కాదు. మనుషుల సంగతి. నేను వచ్చినప్పటినుంచి చూస్తున్నాను. మీరు మాంధాత కాలంలో ఉన్నారు. అబ్బా, మీ ఊళ్ళో ఎలా బ్రతుకుతున్నారో. ఒకరితో మాట్లాడితే యింకొకరికి కోపం, అందరితో మాట్లాడితే అందరికీ కోపమే! దీన్నే ఈర్ష్య అంటారు కాబోలు. శాస్త్రి ఇంటో మీ అందరి సంగతి గమనించాను. కాఫీ హోటల్ కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళ సంగతి చూచాను. ఏం అన్యాయం? అన్నీ ప్రిమిటివ్ లక్షణాలే. ఆడవాళ్ళ పని మరీ అన్యాయంగా ఉంది. ప్రతి భార్యా తన భర్తని యితర స్త్రీలనుండి కాపాట్టమే తన ధర్మంగా నటిస్తుంది. తన భర్తతో మాట్లాడే ప్రతి స్త్రీ తన భర్తను కాజెయ్యటానికే ప్రయత్నిస్తూ ఉంది అనుకుంటుంది. ఎంత ప్రిమిటివ్! మీరంతా మాంధాత యుగంలో ఉన్నారు.”

    నేనేమీ మాట్లాడలేదు. ఆమె మాటలు యదార్థం అని నాకు తెలుసు. ఆమె వచ్చిందగ్గరనుంచి మా జీవితంలో అమానుషత్వం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

    “మీరు తెలివిగలవాళ్ళు. మీరు అనుకుంటున్న దానికంటే తెలివికలవాళ్ళు. అందుకని మిమ్మల్ని చూస్తూవుంటే నాకు ముచ్చటగా ఉంటుంది. కాని ఏం లాభం? మీ చుట్టూ వున్న సంఘంలో మీరు ఒకరు అవటంవల్ల మీలో కూడా ప్రిమిటివ్ ఇనిస్టింక్స్ చాలా ఉన్నయ్. మొదటినుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరిక్కడ ఉండి చెడిపోతున్నారు. మీ కొక్క సలహా చెపుతాను

    మీరిక్కడ స్త్రీల క్లబ్బు నొకదాన్ని ఆర్గనైజు చెయ్యండి. ఆడవాళ్ళని కొంచెం కలిసి మెలసి తిరిగేటట్టు చేస్తే తప్ప ఈ పశుత్వం పోదు. నామాట వినండి.”

    ఈ మాటలు మేం బ్రతుకున్న బ్రతుకునంతా ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చినయ్. భార్యల్ని ఇళ్ళల్లో పెట్టటం బజార్ల వెంట తుకిడీ లు తుకిడీలుగా తిరగడం ఏ స్త్రీ అయినా కనిపిస్తే కోతి చేష్టలు చెయ్యటం- ఆడవాళ్ళ సంగతే సదా మాట్లాడుకోవటం – అంతా అసహ్యంగా కనిపించింది. ఈ మధ్య మా ఊళ్ళో ఆడవాళ్ళకోసం జరిగిన హత్యలు జ్ఞాపకం వొచ్చినై. వీటన్నిటికీ కారణం ఆమె చెప్పిందేనా? ఆమె మాటలకు సమాధానం చెప్పకుండా ఆలోచనలో పడ్డాను. ఆమెకూడా గ్రహించినట్లు ఉంది. మళ్ళీ ఆ సంగతి ఎత్తలేదు..

    హాల్లో ప్రవేశించిం తర్వాత మొత్తం రెండు మూడుసార్లు మాట్లాడించింది. ఒకసారి “నాకు ఛార్లెస్ బోయర్ అంటే ఇష్టం. కామేశ్వరుడికి గ్రేటాగార్బో అంటే ఇష్టం” అంది.

    “ఛార్లెస్ బోయర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో నాకు తెలుసు. కానీ మీకు ఇష్టం అవటం చాలా ఆశ్చర్యంగా వుంది” అన్నాను.

    “ఎందుకని?”

    “అతడు చాలా మాస్కులైన్ గా ఉంటాడు. అతడు ముద్దు పెట్టుకుంటూ ఉంటే తెర చిరుగుతుందేమోనని భయం వేస్తుంది నాకు.”

    ఆమె చిరునవ్వు నవ్వుతూ, “చిరిగితే చిరిగిందిలే అని పిస్తుంది నాకు” అంది. కొంచెం సేపు వుండి, “విరుద్ధ స్వభావాలు ఆకర్షించుకుంటాయి అనుకోవటం పాత సిద్ధాంతం” అని నెమ్మదిగా చెప్పింది.

    ఇంకా కొంచెం సేపు ఉండి, “మీరన్న మాటకి నాకొక్క విషయం జ్ఞాపకం వస్తూవుంది. మీతో చెప్పక పోవటం ఎందుకు? మా ఊళ్ళో ఒక మహిళా సంఘంలో సభ్యురాలిగా జేర్చుకోమని అప్లికేషన్ పెట్టుకున్నాను. వాళ్ళు నా అప్లికేషన్ తిరగగొడుతూ ఈ సంఘం స్త్రీలకు మాత్రమే’ అని రాసి పంపారు” అని బిగ్గరగా నవ్వటం మొదలు పెట్టింది. నాకు మాత్రం ఆమెను చూస్తే జాలి వేసింది.

    మళ్ళీ సినిమా చూస్తూ కూర్చున్నాం

    మొదటిరాత్రి తెల్లవారగానే కథానాయకుడూ, కథానాయకి అత్యుత్సాహంగా చెట్టుకొమ్మ పట్టుకొని ఒకళ్ళు పువ్వు వాసన చూస్తూ, ఒకళ్ళు డూయట్ సాంగ్ పాడుతూ ఉంటే ” ఈ సీను ఎట్లాఉంది?” అని అడిగింది.

    “బాగోలేదు. ఆమె కాసేపు అభినయిస్తే బాగుండేది!” అన్నాను. “ఎందుకని”

    “గత రాత్రి అనుభవం ఆమెకు ప్రథమం చూడండి. అందుకని అతని మొహం చూసీ చూట్టంతోనే సిగ్గు జనించటం సహజం” అన్నాను.

    “ఆమెకు ఆ అనుభవం ప్రథమం అని మీకెట్లా తెలుసు?” అని నవ్వింది. నవ్వుతూ తన చేతుల్లో వున్న సంపెంగపువ్వు నా చేతిలో పెట్టింది. నాకు పువ్వులంటే ఇష్టం లేకపోయినా వాసన చూస్తూ కూచున్నాను.

    “గ్రేటాగార్బో “క్వీన్ క్రిస్టనా” చూశారా”

    “ఆ”

    “ఆ సీను ఎట్లావుంది”

    ఆమె ఏ సీనుకి రిఫర్ చేస్తూవుందో నాకు తెలిసింది. ఆ సీన్లో గ్రేటాగార్బో పక్కన పడుకునే వరకు ఆమెకుర్రవాడు అనుకుంటాడు హీరో. అకస్మాత్తుగా తెలుస్తుంది ఆమె కుర్రదని.. ఆ సీను ఎట్లా ఉందని ఆమె నన్ను అడుగుతూ ఉంది.

    “బాగుంది”

    “ఆ షాటు ఎట్లా వుంది”

    ఆమె ఏ షాట్ని గురించి అడుగుతూ ఉందో నాకు తెలిసింది. కాని ఆమె ఆ షాట్ అడగటం లేదు. ఆ షాట్లో ఉన్న గ్రేటా గార్బో సంగతి అడుగుతూ ఉంది. గార్బో వదులుగా ఉన్న చొక్కాతో నిలబడి వుంది. లోపల మరేమీ లేదు. అది ఎట్లా వుంది? అని అడుగుతూంది నన్ను. 

    “అసలు గార్బో చిత్రాలు చూస్తుంటే నాకు ఊపిరి సలపక ఒక రకంగా ఉంటుంది, అట్లా అవటం నాకు ఇష్టం ఉండదు.”

    ఆమె మాట్లాడలేదు.

    సినిమా హాల్లోనుంచి బయటికి రాగానే ఆమె ఇట్లా అన్నది: “ఇక ఈ వూళ్ళో నేను బతక లేను. మీరంతా ప్రిమిటివ్ పీపుల్స్. నాలుగు వందల సంవత్సరాల కిందటి జీవితాన్ని ప్రస్తుతం మీరు గడుపుతున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే బారువా చిత్రాలలోని కోయవాళ్ళు జ్ఞాపకం వస్తున్నారు. బారువా నవనాగరిక కుటుంబాలను చూపించి, చూపించి అకస్మాత్తుగా కోయగూడెంలో ప్రేక్షకుల్ని పడేస్తారు. ఇతర చోట్ల చూచి మీ ఊరు వచ్చిన నాపని ఇప్పుడల్లా ఉంది. ఇక ఇక్కడ నేను బతకలేను. రేపే వెళ్ళిపోతాను.”

    ఆమె ఇంకా కొన్నాళ్లు ఈ ఊళ్ళో వుండాలని నాకు ఉంది. ఆమె ఉంటే మా జీవితాలు కొద్దిగానైనా మారవొచ్చు అనే ఆశకూడా ఉంది.

    ఆమెతో చెప్పుకోలేక “రేపు ఒక్కరోజు ఉండమన్నాను.”

    “నేను నిజంగా చెబుతున్నాను. ఈ వాతావరణంలో ఒక్క క్షణం కూడా బతకలేను. టార్జాన్ చూశారుగా! ఆ మృగాల మధ్య, ఆ మహారణ్యంలో, ఆ టార్జాన్ పక్కన వున్న పిల్లలని చూస్తే నాకు అమిత భయం వేసేది. ఇప్పుడు మీ ఊళ్ళో మీ మధ్య నా పని ఆ పిల్ల పనిలాగే ఉంది. ఎలా ఉండగలను! ఉండను”

    మర్నాడు పొద్దున్న నేనూ లక్ష్మణశాస్త్రి మరి కొంతమంది స్నేహితులం కలసి ఆమెను బొంబాయి రైలు ఎక్కించి వొచ్చాం. ఎక్కించి వొచ్చాం అంటే ఆమె ఎక్కింది. మేం చూస్తూనుంచున్నాం.

    ఆమె నా జీవితాన్ని మార్చి వేసింది. నా దృష్టి పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు ఏపని చెయ్యబోయినా ఇన్ సెంటివ్ ఉండేది కాదు. ఇప్పుడా తత్వం పోయింది. హుషారు ఎక్కువైంది. ఇదివరకు ఎవ్వరయినా ఉపన్యాసానికి పిలిస్తే వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఇప్పుడలా కాదు కథలు రాయాలనీ, ఉపన్యాసాలివ్వాలనీ, పదిమందిచేత మెప్పులు పొందాలనీ ఆపేక్ష కలిగింది. 

    అన్నిటికంటే పెద్ద మార్పు చేతులు, కాళ్లూ, మొహం రోజూ వీలు చిక్కినప్పుడల్లా శుభ్రంగా తోముకోవటం, నాలో కలిగిన మార్పుకి ఇవి ఉదాహరణలు మాత్రమే! ఏ పని చెయ్యబోయినా ఎవరితో మాట్లాడబోయినా, ఏదో జీవిత రహస్యం తెలుసుకున్నట్టు, తారకమంత్రోపదేశం పొందినట్టు సంతోషంగా ఉండేది. ఆమె మాటలూ ఆ చనువూ ఉండీ ఉండకుండా ఉంటం… చనువుగా చనువుగా వుంటూనే లొల్లిగా ఉండకుండా ఉంటం… నిర్భయంగా అన్ని విషయాలు చర్చించటం ఆమెని తలుచుకొన్నప్పుడల్లా హృదయం ఉప్పొంగేది. స్త్రీ మొగవాడితో తిరిగితే పాడై పోతుంది అంటారే ఎంత పొరపాటు మాట!

    ఆనాటి సాయంకాలం లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెళ్లాను. అతనితో ఆమెను గురించి తలుచుకున్నా, ఆమెను గురించి మాట్లాడినా ఆమె పక్కన కూర్చొని నవ్వుతున్నటు ఉండేది నాకు. 

    నేను వెళ్ళేటప్పటికి , లక్ష్మణశాస్త్రి యింట్లో సుబ్బారావు, కృష్ణారావూ, వెంకటేశ్వర రావూ ఉన్నారు. లక్ష్మణ శాస్త్రి వాళ్ళకేదో చెపుతున్నాడు. వాళ్ళుగూడా ఆమెను గురించే మాట్లాడుతున్నారని నేను కనిపెట్టాను. పాపం వాళ్ళని చూస్తే నాకు జాలివేసింది. వాళ్ళు దిగులుగా కూర్చున్నారు. ఆమె వెళ్ళిపోగానే వాళ్ళ జీవితాలన్నీ ఒక్కసారి అయోమయం అయిపోయినై. చెట్టు ఆశ్రయం పోయిన పక్షుల్లా అయిపోయారు. తల్లి ప్రేమను పోగొట్టుకొన్న పిల్లల్లాగా కూర్చున్నారు.

     “నేను మీ తల్లిని” అని ఆమె చెప్పిన మాట నా చెవుల్లో గింగురుమంది.

    నేను వెళ్ళి కూర్చోగానే లక్ష్మణశాస్త్రి “ఏమోయ్ మన కృష్ణారావు ఏమంటున్నాడో విన్నావా? ఆమెను మళ్ళీ పిలిపించి మహిళా సంఘాలు ఆర్గనైజ్ చేయించాలంటున్నాడు”.

    “మంచిదేగా! తగిన సన్నాహాలు చేసి పిలిపించండి” అన్నాను. నాక్కూడా ఆ కోర్కె ఉందని చెప్పటం నాకు ఇష్టం లేక అలా అన్నాను.

    “పిలిపించండి అంటే కాదు. మేము రాస్తే వొస్తుందో లేదో నువ్వు రాయాలి” అన్నాడు కృష్ణారావు.

    “మన కోసం వస్తుందా? ఎవ్వరు రాసినా ఒకటే” అన్నాను.

    “అదేమిటి? స్నేహం, మంచీ చెడ్డా ఉండవ్! నువ్వంటే ఆవిడకు గురి…” అన్నాడు సుబ్బారావు, సుబ్బారావు చూపులూ, వైఖరీ నాకేమి నచ్చలేదు. అసలు మొత్తం అంతా విచిత్రంగా ఉంది. వాళ్ళ స్వభావమే విచిత్రంగా మారినట్లు ఉంది. వాళ్ళ ధోరణి చూస్తే నాకు కోపం వచ్చింది. – 

    “అందరం స్నేహితులమే! ఇందులో ?” అన్నాను.

    ” మా స్నేహాల దేముందిలే! మావన్నీ ఉత్తుత్తి స్నేహాలు. మాతో స్నేహం చెయ్యటానికి, మే మేమన్నా కథలు రాస్తామా? హ్యూమరస్ గా మాట్లాడి నవ్విస్తామా? సినిమాలకు వెంటబెట్టుకు పోతామా?” అన్నాడు సుబ్బారావు.

    ఆఖరి మాటకు అంతా విషపు నవ్వు నవ్వారు. కృష్ణారావుకి ఎన్నడూ ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం వల్ల ఏమొచ్చినా ఆపుకోలేడు. విరగబడి నవ్వటం మొదలు పెట్టారు. వాళ్ళ సంభాషణమాట అటుంచి, వాళ్ళ నవ్వుకూడా నాకు సహజంగా కనబడలేదు. క్షణక్షణానికి నాకు కోపం ఎక్కువ అవుతూ ఉంది.

    నేను సుబ్బారావు వంక తీక్షణంగా చూచి, “నీ తెలివికి సంతోషించాను. ఇకనైనా ఆపు?” అన్నాను.

    “మా అందర్లోకి ఆమెకు నువ్వంటే మనసన్నమాట అందరికీ తెలిసిన విషయమే! మొగ ఆడ అన్న తర్వాత, కలిసి తిరగటం మొదలు పెట్టింతర్వాత…..

    “శాస్త్రీ….!!” అని గద్దించాను.

    అతడు నామాట లెక్క చేయలేదు. వింత ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. “తప్పేముందోయ్? ఆమె నంగనాచా?”

    అంతా గొల్లున నవ్వారు. నాకు తపన పుట్టింది. “ఆమెను ఒక్క మాట అన్నావా నేను ఊరుకోను” అని గట్టిగా అరుస్తూ లేచి నుంచున్నా.  

    నాకు కోపం ఎక్కువ అవుతున్న కొద్దీ శాస్త్రికి చిలిపితనం ఎక్కువ అవుతుంది. కొంటెనవ్వుతో అతని మొహం నిండిపోయింది. – “చూశారా, ఆవిడమాటంటే అతనికి ఎంత కోపమో! మనం ఆమెని ఒక్కమాటకూడా అనకూడదట! మీరు శ్రద్ధగా వినండి. ఒక్కమాటకాదు వెయ్యిమాటలంటా, ఆమె మహాపతివ్రత. ఈ మధ్య సినిమాలో ఆమె పాతివ్రత్యం కాపాట్టానికి ఇతగాడు ప్రయత్నించాడు

    ఆమె…”

    ఇంతవరకే అన్నాడు. కాని ఆమెని అతడు అనబోయే మాటలన్నీ నాకు ముందే వినబడి.. మాటలు నా చెవినిపట్టం నాకు ఇష్టం లేదు. క్షణం క్షణం పెరుగుతూ వచ్చిన కోపాన్ని తట్టుకోలేకపోయాను ఇంతలో శాస్త్రి “పుష్పం మకరందం భ్రమరం” అంటున్నాడు.

    ఇంకేముందీ? అమాంతంగా శాస్త్రి మీదకు వెళ్ళాను. అతన్ని నేను ఎన్ని దెబ్బలు వేశానో, తర్వాత ఏమయిందో నాకు తెలియలేదు. కాసేపటికి నేను నుంచున్నాను. సుబ్బారావు, కృష్ణారావు, వెంకటేశ్వరరావూ కిందపడివున్న శాస్త్రిని నెమ్మదిగా లేపుతున్నారు. అతని చూపులు చూస్తే నాకు జాలివేసింది. నేను ఇటువంటి పనికి పూనుకుంటానని అతడు ఎప్పుడూ అనుకొని ఉండడు. నన్ను జాలిగా చూస్తు అతడు “నీకు పిచ్చెత్తింది” అన్నాడు.

    నేను చేసిన పనికి నాకు ఏమాత్రం పశ్చాత్తాపం కలుగలేదు. ఎందుక్కలుగుతుంది? మంచి చెడూ తెలియకుండా అనేమాటా, అననిమాటా తెలియకుండా నోరు పారేసుకుంటే ఏట్లా ఓర్చుకోవటం? వాళ్ళు నాకు స్నేహితులే కావొచ్చును అయితే మాత్రం? అందులో ఆమెను గురించా? |

    ఆమె అటువంటి మనిషేనా? ఆ మాత్రం వాళ్ళు తెలుసుకోవద్దూ! ఆమె పక్కన కూర్చున్నా, ఆమెతో కలిసి మాట్లాడినా, ఆమెతో కలిసి నవ్వినా, అటువంటి చెడు ఆలోచనే రాదే! ఏదో లోకంలో, మబ్బుల్లో, శరీరాలే జ్ఞాపకానికి రాని భావంలో సంచారం చేస్తున్నట్టు ఉంటుందే! అటువంటి ఆమెకా ఇటువంటి నీచ స్వభావం అంటగట్టటం? వీళ్ళు కూడా అందరికి మల్లే ‘స్త్రీ పురుషుడితో తిరగితే చాలు, చెడిపోయి తీరాలి’ అనే అభిప్రాయంలోనే ఉన్నారు. ఎంత స్నేహితులైతే మాత్రం వీళ్ళని నేను ఎందుకు సహించాలి. తీరాలి’ అనే అంటగట్టటం? 

    నిజంగా నేను చేసిన పనికి నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళకు తగినట్టు బుద్ధి చెప్పాననే తృప్తి కలిగింది.

    ఒక్కొక్కప్పుడు, జరిగింది. జరిగినట్టు ఆమెకు రాద్దామనిపించేది. మళ్ళీ ఆమె మనసుని కష్టపెట్టినవాళ్ళం అవుతామేమోనని పస్తాయించి ఊరుకునేవాణ్ని. అటువంటి ఆమె కొంతమంది తనని గురించి ఇట్లా అనుకుంటున్నారని తెలిసినా, కొంతమంది మనుషులు ఎంత నీచంగా ఆలోచిస్తారో తెలిసినా, ఎంత బాధపడుతుందో, ఆమె పవిత్ర హృదయం ఎంత కొట్టుకుంటుందో నాకు తెలుసు. అందుకని ఇక్కడ జరిగిన సంగతులు ఆమెకు ఏమీ రాయకుండా ఊరుకున్నాను. .

    కాని అయిదోరోజు ఆమె దగ్గరనుంచే నాకు ఉత్తరం వచ్చింది. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందని? ఇక నా ఆనందానికి అంతేలేదు. గబగబా ఉత్తరం చించి చదివాను. ఆ ఉత్తరం రావటం నాకు ఆశ్చర్యం కలిగిస్తే, ఇక ఆ ఉత్తరంలోని సంగతులు చదివేటప్పటికీ నా హృదయం ఆగిపోయినట్లయింది. ఆమె ఉత్తరం ఇది…..

    “నేను బాగానే ఉన్నాను. ఇంటికి నలగని పువ్వుల్లే జేరాను. వచ్చినప్పటినుంచి మీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను. కాని మీకు ఉత్తరం ఎలా రాయాలో బోధపట్టంలేదు. ఏం రాస్తే ఏమనుకుంటారో, నేను రాయదలచింది మీకు అర్ధం అయ్యేట్టు రాయగలనో లేనో భయం వేసి మెదలకుండా ఊరుకున్నాను. నేను నిజం చెబుతున్నాను. మీకు అర్థం అయ్యే భాష నాకు రాదు. ఒకవేళ వచ్చినా మరచిపోయి ఉంటాను.”

    “ఇవ్వాళ లక్ష్మణశాస్త్రి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. మీరేమీ ఆశ్చర్య పడవద్దు మేమిద్దరం స్నేహితులమనే విషయం మీకు తెలిసిందే గదా? ఆ ఉత్తరంలో అతడు సంగతులన్నీ వివరంగా రాశాడు. అతనికి మీకు జరిగిన పోట్లాట అంతా రాశాడు. అతడేమీ అబద్దాలు రాయలేదు. అక్షరాలా జరిగింది, జరిగినట్టుగానే రాశాడు. ఆ వుత్తరం చదువుతూవుంటే నాకు అపరాధ పరిశోధక నవల చదువుతూ వున్నట్లు ఉంది. స్టంటు పిక్చరు చూస్తూ ఉన్నట్లు ఉంది.”

    “ఏమండీ, మీరు నా అనర్ డిఫెండు చెయ్యటానికేనా శాస్త్రితో పోట్లాడింది! అతన్ని కొట్టటం కూడా నాకోసమేనా? నిజంగా ఆ దృశ్యం ఊహించుకుంటూ ఉంటే మీరేగిన ఉంగరాల జుట్టూ, ఎర్రబడ్డ కళ్లూ, ఆవేశంతో చేతులు కాళ్ళూ ఒణకటం, లక్ష్మణశాస్త్రి కిందపట్టం, మీరు మీదకు దూకటం, జుట్టు పీకటం, మొహం రక్కటం ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటే నాడియామీద నాకు అభిమానం హెచ్చుతూ ఉంది. మాటవరుసకు అనటంకాదు. నాడియా అంటే నాకు పూర్తి అభిమానం. జనాన్ని గుంపులు గుంపులుగా పడేసి హంటర్లో ఏం కొడుతుందండీ!

    “మీరు చూపిన షివల్రీ నన్ను ఆకర్షిస్తూ ఉంది. గాలిపటంమీద ప్రయాణం చేసి, మీ ముందు నా కృతజ్ఞతను చెప్పుకోవాలనిపిస్తూ ఉంది. మీ ముందుకూర్చొని మీకు నా కృతజ్ఞతను తెలుపుకుంటూ నమస్కరిస్తే మీరు నా చేతులు పట్టుకొని లేపి, “దీనికి మీరింత పొగడాలా? నా ధర్మం నేను నెరవేర్చాను

    అంటారు కదూ? ఇటువంటి సీను ఏదో సినిమాలో చూచినట్టు జ్ఞాపకం. ఇటువంటి సీన్లు నాకు బాగుంటాయి కూడాను. కాని ముందు మిమ్మల్ని ఒక్కమాట అడగాలని ఉంది. దానికి మీరు సవ్యంగా జవాబు చెబితే రెక్కలు కట్టుకొచ్చి మీ ముందు వాలి, ఆ సీను యాక్టుచేసి పోతాను. ఆ మాట ఏమిటంటే అసలు నేను, నంగనాచినని మీకెట్లా తెలిసింది? మీరు నన్ను గురించి అలా అనుకోటానికి ఆధారాలేమిటి? నామాటలుగానీ, నా చేష్టలుగాని అటువంటి అవకాశం కలిగించినయ్యా? అలా కలిగించి ఉండవు. ఎందుకంటే నేను నిజంగా నంగనాచిని కాదు. లక్ష్మణశాస్త్రి మీకు యదార్థమే చెప్పాడు. నాకు నంగనాచిని కావాలనే ఆ పేక్షకూడా లేదు.”

    “మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. ఉన్న సంగతి ఉన్నట్టుగా చెపుతూఉన్నాను. మీరు చూపిన షివల్రీ విషయం కూడా నాకు అనుమానం ఉంది. ‘ఆడవాళ్ళని రక్షించవలసిన బాధ్యత పురుషులమీద

    ఉంది’ అనే అభిప్రాయమే ఈ షివల్రీ కారణం అనిపిస్తూ ఉంది నాకు. ఈ అభిప్రాయానికి స్త్రీ పురుషుడి ఆస్తి అనే అభిప్రాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ ఆస్తి అనుకున్నప్పుడూ తన్ను తాను కాపాడుకోలేని స్థితిలో వుంది అనుకున్నప్పుడేగా రక్షించవలసిన అవసరం కలిగేది. నేను ఒక రోజు మీతో తిరిగి, ఒక రాత్రి కలిసి సినిమా చూచినంత మాత్రాన నన్ను గురించి మీరిట్లా అనుకోటం… నా ఆనర్ని కాపాడవలసిన బాధ్యత మీమీద ఉందనుకోటం చాలా అన్యాయం. లక్ష్మణశాస్త్రి మొదలయిన వాళ్ళకి

    మీకుభేదం ఏముంది? నేను ఇంకొకళ్ళ ఆస్తి నయ్యాననే అసూయతో వాళ్ళు మీదగ్గర నోటికి వచ్చినట్లు మాట్లాడారు. మీ ఆస్తిని హేళన చేస్తున్నారనే భావంతో బాధపడి అవమానపడి మీరు వాళ్ళతో దెబ్బలాడారు. ఇక భేదం ఎక్కడ? మీరు నాకోసం పోట్లాట్టం ఖాళీ కోటని రక్షించటానికి ప్రాణాలు ఒడ్డిన రసపుత్ర వీరుని శౌర్యం, ధైర్యం, సాహసం జ్ఞాపకానికి తెస్తున్నది.

    “మీకు, మీకథలకూ ఎంత భేదం ఉందండీ! మీ ప్రవర్తన వేరు, మీ రచనలు వేరు. ఒకటి వెనక్కు లాగుతూ ఉంటే ఒకటి ముందుకు లాగుతూ ఉంటుంది. ఆలోచించుకొన్న కొద్దీ ఆ కథలు రాసింది మీరేనా అనిపిస్తూ వుంది. నేను చాలామంది రచయితల్ని ఎరుగుదును. ఎక్కువ మంది ఇంతే! వాళ్ళు రచనల్లో వెలిబుచ్చే అభిప్రాయాలు ఎంత అభివృద్ధిదాయకంగా ఉంటై! ప్రవర్తన మామూలు మనిషి ప్రవర్తనకంటే అధ్వాన్నంగా ఉంటుంది. దీనికి భావాలను, ఆలోచనలను, ఆచరణలోకి, అనుభవంలోకి తీసుకురావాలనే ప్రయత్నం లేకపోవటమే కారణం అనుకుంటాను. మీ విషయంలో ఇటా ఉండదని కుతూహలం పడ్డాను. కాని మీరూ అంతే! సాధారణంగా రచయితల్లో ఉండే బలాలు బలహీనతలూ, ఉద్రేకాలూ, ఆవేశాలూ అన్నీ మీలోను ఉన్నాయ్.మీరు మారాలి దయచేసి మారాలి. ఈ మాట నేను మీకు మీ ఊళ్ళో ఉన్నప్పుడే చెప్పాను మళ్ళీ చెపుతున్నాను. నేను ఇంతగా ఎందుకు చెపుతున్నానంటే, మీలో ఇన్ని బలహీనతలు ఉన్నా మీరంటే నాకు ఇష్టం. అందుకని మిమ్మల్ని బాగు చెయ్యాలనే గాఢంగా ఉంది. దీనికి నాకు ఒకటే దారి కనిపిస్తూ ఉంది. లేడీస్ క్లబ్ ఒక్కటి ఆర్గనైజ్ చెయ్యండి. ఆ క్లబ్బుకి మీరే సెక్రటరీగా ఉంటే మరీ మంచిది. నేను చాలా సంతోషిస్తాను. ఆశ్రద్ధ వొద్దు. జాడ్యం ముదరనిస్తే తరువాత ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు.”

    “లేడీస్ క్లబ్బుకి సెక్రటరీగా ఉంటే నాకు ఊపిరి సలపదు. నాకు అట్లా అవటం ఇష్టం వుండదు” అని మహాపతివ్రత ఫోజు పెట్టకండి. ఊరికే, అట్లా అంటారుగాని ఊపిరి సలపక ఏమవుతుంది? ఎంతసేపూ నేను ‘అందంగా’ తెలివిగా మాట్లాడుతున్నానా లేదా? అనే గొడవేగాని సహజంగా మాట్లాడుదాం అనిగానీ, యదార్థం మాట్లాడుదాం అనిగానీ, మీకు ఎందుకు ఉండదు? సంఘానికి జడిసి బానిస అయి చిటచిట లాడుతూ రుసరుస మంటూ కాలం గడిపే పతివ్రతగా మీరు ఉంటం నాకు యిష్టం లేదు.”

    “ఇక సెలవు నేను మనసిచ్చి రాయదలచుకుందంతా రాశాను. మీరు కూడా అట్లాగే ప్రవర్తించాలని నా కోర్కె. తప్పకుండా జవాబు రాయండి.”

    “అయితే, ఏమండీ, అడగటం మరచిపోయానూ, సినిమాలో సంపెంగపువ్వు చేతికి ఇస్తే, సినిమా అయ్యేదాకా వాసన చూస్తూ కూర్చుంటారా? వాసన చూట్టానికేనా సంపెంగపువ్వు లిచ్చేది? పువ్వులు ఎందుకు పుట్టినయ్? వాసన చూట్టానికి, సెలయేరు ఎందుకు ప్రవహిస్తూ ఉంది? గానం చెయ్యటానికి. మంచిగంధం చెట్టు ఎందుకు పుట్టింది? పాములకు ఆశ్రయం ఇవ్వటానికి. ఇంతేగాని వీటన్నిటికీ మానవుడు పరిస్థితుల్ని బట్టి కొత్త కొత్త అర్థాలు సృష్టించుకుంటాడనిగాని మాటలతో చెప్పుకోటానికి వీల్లేని భావాలను వీటి ద్వారా చెప్పుకుంటాడనిగాని మీకు తెలియదు. మీరంతా ఎంత ప్రిమిటివ్ గా వున్నారండీ! పైగా నేను నంగనాచినని ప్రచారం! నేనుకూడా ప్రిమిటివ్ గా ఉన్నాననేగా మీ ఉద్దేశం! ఉండాలని ఆపేక్ష కామాలు”.

    ఇట్లు

    మీ

    ……….

    పి.యస్ : లక్ష్మణశాస్త్రి రాసిన ఉత్తరం కాదు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    23 min
  • Part - I : సంపెంగ పువ్వు - గోపీచంద్ గారు.

    ‘సంపెంగ పువ్వు’ గోపీచంద్ గారు రాసిన కథ . 1971 వ సంవత్సరం, జనవరి నెల యువ మాస పత్రిక లో ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోపీచంద్ గారు ప్రసిద్ధ రచయిత, సినిమా రంగంలో ప్రవేశించి దర్శక నిర్మాత గా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశారు.

    ఈ కథను మీకు అందించదానికి, అనుమతినిచ్చిన శ్రీమతి రజని గారికి కృతజ్ఞతలు.

    ముందుగా, రజని గారు గోపీచంద్ గారి గురించి , ఈ కథ గురించీ మాట్లాడతారు.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    సంపెంగపువ్వు:

    సంపెంగ పువ్వు

    “ఆమె ఈ బండికి వస్తోందని నీకెట్లా తెలిసింది?” అని శాస్త్రిని అడిగాను. అప్పుడు ఆరుగంటలవుతుంది. బొంబాయినుంచి రైలువొచ్చే టైం. నేనూ, శాస్త్రి ప్లాటుఫారం మీద నుంచొని మాట్లాడుకుంటున్నాం.

    “ఇవ్వాళే వైరిచ్చింది” అన్నాడు శాస్త్రి. ఆమె శాస్త్రి స్నేహితురాలట ఆమె బండికి వస్తోందని చెప్పి నన్ను వెంట పెట్టుకొచ్చాడు శాస్త్రి.

    శాస్త్రి ఆమెని గురించి చెప్పిన మాటల్ని బట్టి ఆమె విచిత్ర వ్యక్తి అనిపించింది నాకు

     “బలే మనిషి, బలే మనిషి” అంటాడు శాస్త్రి. ఏమడిగినా “నువ్వే చూస్తావుగా” అంటాడు. “ఏమోనబ్బా, నాకు చెప్పటం చాతగాకుండా ఉంది మన సంఘంలో ఇటువంటి మనిషి ఉండదు. వచ్చే సంఘంలో ఆడవాళ్ళు ఇట్లా వుంటారేమో! ఇప్పుడు రష్యాలో ఏమన్నా ఉన్నారేమో!” అంటాడు.

    “అయితే ఆమె భర్త ఏం చేస్తుంటాడు?” అని అడిగాను. ఆమె గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తూ ఉంది నాకు.

    “ఏదో చేస్తూనే ఉంటాడు లాగుంది. ఆమె మాట్లాడితే ‘కామేశ్వరుడు అటువంటివాడు, ఇటువంటివాడు, ఎంత చలాకీగా వుంటాడనుకున్నావ్” అని చెపుతూ ఉంటుంది.

    “భర్త అంటే చాలా ప్రేమ కాబోలు.”

    “ఆమెకు మొత్తం నలుగురు పిల్లలు. ఒక మొగపిల్లవాడూ ముగ్గురు ఆడ పిల్లలూ” అన్నాడు శాస్త్రి కొంటెగా.

    నిజంగా ఆమెకు పిల్లలనేటప్పటికి నా మనస్సు కలుక్కుమంది. మిగిలిన ఆడవాళ్ళకు మల్లే ఈ బలే మనిషిక్కూడా పిల్లలా? ఎందుకనోగాని ఈ భావాన్నే నేను భరించలేక పోయాను.

    ఇంతలో “అదిగో రైలు వస్తూ ఉంది” అన్నాడు శాస్త్రి. ఆమాటకి నా హృదయం దడదడ కొట్టుకుంది.

    అకస్మాత్తుగా ప్లాట్ ఫారానికి చలనం కలిగింది. ఇద్దరు ప్రయాణీకులు ప్లాట్ఫారం అంచునుంచి సామాను సర్దుకొని దూరంగా నుంచున్నారు. ఒక ముసలమ్మ మూటనొక చేత్తో, మనవణి పట్టుకొని నిలబడింది. ఒక రైతు నుంచున్నవాడు నుంచున్నట్టుగానే హడావిడి పడుతున్న కర్ర చుట్టా, చుట్టని కర్రా అనుకున్నాడు.

    రైలు ఆగీ ఆగడంతోనే ‘మూడో తరగతి’ అని జ్ఞాపకం చేశాడు లక్ష్మణ శాస్త్రి. ఆమె ఎప్పుడూ మూడో తరగతిలోనే ప్రయాణం చేస్తుందట. అమెకు ఒంటరితనం గిట్టదు. అందుకని జనసమ్మర్థంగా మూడో తరగతి చూచి అందులో ప్రయాణం చేస్తుంది. ఆమెకు ఎంత ఇరుగ్గా ఉంటే అంత సరదాగా ఉంటుందట! నాకు ఆమెను వెతకాలని వుంది కాని కాళ్లాడక అక్కడే దిక్కులు చూస్తూ నుంచున్నాను.

    అది చిన్న స్టేషను. ఎక్కువ మంది దిగరు. “అదుగో దిగుతూ ఉంది” అని గార్డు పెట్టె వైపుకి చూపిస్తే చూశాను. కనబడలేదు.

    “హలో” ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తితో కరస్పర్శ చేస్తూ అన్నాడు లక్ష్మణశాస్త్రి, ఆ వ్యక్తి ఓవర్ కోటులో ఉంది. చేతిలో తోలుసంచి ఉంది.

    “మీరు రారనుకున్నాను” అన్నాడు. “అదేమిటి? ఎందుకు అలా అనుకోవటం?” అంటున్నది.

    ఆ ఓవర్ కోటులో ఉన్న వ్యక్తి ఆమె అని అప్పుడు నాకు తెలిసింది. మామూలు స్త్రీ ఆకారం కోసం వెతుకుతున్న నా చూపులు ఓవర్ కోటులో ఉన్న ఆమెను పట్టుకోలేక పోయినయ్. నేను మళయాళంలో ఉన్నప్పుడు ఇటువంటి అవస్థలోనే ఉండేవాణ్ని. గూడకట్టు కట్టుకొని తుండుగుడ్డ భుజాన వేసుకునే ఆ స్త్రీలు నా కంటికి ఎప్పుడూ పొరపాట్నయినా స్త్రీలుగా కనిపించేవాళ్ళు కాదు. ఇప్పుడూ ఆ దుర్గతే పట్టింది.

    లక్ష్మణ శాస్త్రి “ఆపేక్ష వున్నచోటే భయంకూడా ఉంటుంది. మీరు రావాలనే ఆ పేక్షతో పాటు, మీరు రారనే భయంకూడా ఎక్కువైంది”.

    ఆమె నవ్వి “కామేశ్వరుడు కూడా ఇట్లాగే మాట్లాడుతాడు” అంది.

    ఆమె భర్త పేరు ఎత్తేటప్పటికి లక్ష్మణశాస్త్రి కించపడి టాపిక్ మార్చటానికి ప్రయత్నించాడు. నన్ను పరిచయం చేస్తూ, ఇతడు శరచ్చంద్రబాబు. నాకు పరమ స్నేహితుడు. రాస్తూ ఉంటాడు. సినిమాలతో సంబంధం ఉంది.. మంచి….”

    ఆమె లక్షణశాస్త్రి చేతిని వదలకుండానే నన్ను ఎగాదిగా చూచి, “మీ కథలు కొన్ని చదివాను. మీ కథలు బాగుంటై” అంది. 

    శాస్త్రి యింట్లో దిగింది!

    ఆ రాత్రి నిద్రపట్టకపోవటం వల్ల తెల్లవారి కొంచెం ఆలస్యంగా లేచాను. త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆమెను చూట్టానికి లక్ష్మణ శాస్త్రి ఇంటికి వెల్దామా వద్దా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలోకి లక్ష్మణశాస్త్రే వొచ్చాడు. “ఒకసారి మా ఇంటికి రావోయ్. ఆమె పిలుచుకురమ్మన్నది” అన్నాడు.

    “ఎందుకు?” అని అడిగాను. లోపల వెళదామని ఉంది. ఆమె ఊరికేనే పిలుస్తూ ఉందని తెలుసు. అయినప్పటికీ అప్రయత్నంగా అలా అడిగేశాను.

    లక్ష్మణశాస్త్రి నన్ను విచిత్రంగా చూచి, కాసేపు ఆగి, “సరేలే, రా” అన్నాడు. నేను బయల్దేరాను.

    మేము వెళ్లేటప్పటికీ లక్ష్మణశాస్త్రి స్నేహితులూ, ఊళ్ళో కుర్రవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ మధ్య కూర్చొని కబుర్లు చెబుతూ ఉంది. నన్ను చూచి, “ఏమండీ, పిలిస్తేగాని రావొద్దను కున్నారా?” అని నవ్వుతూ అడిగింది.

    “మా వాడికి ఆడవాళ్లని చూస్తే సిగ్గు” అన్నాడు శాస్త్రి,

    అంతా నవ్వారు. ఆమె మాత్రం చిన్నపుచ్చుకుంది. కారణం నాకు బోధపడలేదు గాని, ఎందుకో బాధపడుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపించింది. అదైనా కాసేపే! మళ్ళీ యథాప్రకారం అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పటం మొదలు పెట్టింది. తన అనుభవాలు, కథలు కథలుగా వర్ణించి చెప్పింది. చివరికి “మీకు నాకున్న అనుభవంలో పదోవంతు కూడా లేదు” అంది.

    నిజమే, అందరూ అంగీకరించారు. “కాబట్టి వయస్సు మాట ఎట్లా వున్నా మీ అందరికీ నేను తల్లిని” అంది.

    ఈ మాట మామధ్య పిడుగుపడినట్లు పడింది. కొందరు సిగ్గుపడి తలవొంచుకున్నారు, కొందరు వెకిలినవ్వు నవ్వారు, కొందరు తెల్లబోయారు.

    నాకు ఇంకొక లోకంలో ఉన్నట్లు ఉంది. ఆమె మాత్రం వీటిని గమనించనట్లు యథాప్రకారం మాట్లాడుతూనే ఉంది, అందరితో ఒకే మోస్తరుగా. కుర్రవాళ్ళంతా కిక్కురుమనకుండా విన్నారు. అవునూ, కాదూ అంటాన్నిక్కూడా వాళ్ళకు ధైర్యం లేకపోయింది. ఊకొట్టటానికే వాళ్లకు సిగ్గు వేసింది. “నేను స్త్రీని’ అనే భావం ఆమెకు చచ్చినా గుర్తుకు రాలేదు. 

    నాకు చాలా సంతోషం వేసింది. కాని “పూర్వం సంతానానికి స్త్రీ పురుష సంపర్కం అవసరం లేనట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అవసరం. కొన్ని సంవత్సరాలకు మళ్లీ అవసరం లేకుండా పోవొచ్చు” అని చెపుతూ ఉంటే నా మనస్సుకూడా చివుక్కు మంది.

    కొంచెం సేపు అయింతర్వాత మేము కాఫీ హోటలుకి బయల్దేరాం. ఆమె కూడా కంగారుగా వుంది. కాని ఆమెకు ఏమని చెప్పటం?

    మేము దారిన వెళ్తుంటే జనం గుంపులు గుంపులుపడి విచిత్రంగా చూస్తూ హేళన చెయ్యటం నేను గమనించాను. ఆమెను గురించి ఒకటి రెండు మాటలు నా చెవిని పడినై. హోటలనుంచి బయటపడి కొంపకి జేరదామని అంతా త్వరగా కాఫీ ముగించారు. ఆమె మాత్రం తొందరపడనేలేదు.

    “ఏదీ ఆ హల్వా ఇట్లా ఉంచండి” అని సుబ్బారావు పేట్లో హల్వాలో సగం తీసుకుంది. “ఈ బూంది కొంచెం తీసుకోండి” అని శాస్త్రి ప్లేటులోకి తన బూందిని చెంచాలో సగం పెట్టింది.

    ఇక మిగతా టేబిల్సు చుట్టూ ఉన్న జనం రుసరుసలు చెప్పాలి!

    సాయంకాలం పార్కుకి వెళ్ళాం. అక్కడా ఇంతే. అక్కడి వాళ్లంతా మమ్మల్ని మ్యూజియంలో జంతువుల్ని చూచినట్టు చూట్టం మొదలు పెట్టారు. ఏం జరుగుతున్నా ఆమెలో మాత్రం ఏమీ మార్పు కనపట్టంలేదు. కాని నేను కని పెట్టిన వాటిల్లో మరీ విచిత్రం అయిన విషయం ఏమిటంటే ఆడవాళ్ళతో మాట్లాడటానికినికి ఆమె నాకంటే సిగ్గుపడేది. లక్ష్మణశాస్త్రి భార్యతో తలవంచుకొని మాట్లాడేది. ఆమె వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి అమిత సిగ్గుపడేది.

    “మీకు పిల్లలు ఎంతమందండీ?”

    “మీరిట్లా తిరుగుతూ ఉంటే మీపిల్లలకు ఆలనా పాలనా ఎట్లా జరుగుతుంది!”

    “ఈ చీరె ఎక్కడ కొన్నారు? దీని రంగు నిలవదండి”

    “ఈ జాకెట్టుకి కుట్టుకూలి ఏం ఇచ్చారు?”

    ఇటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పలేక ఆమె తబ్బిబ్బు పడేది. మర్యాదగా జవాబులు చెప్పాలని ప్రయత్నించేదిగాని జవాబులు దొరక్కో అలవాటు లేకో ఉక్కిరి బిక్కిరి అయ్యేది.

    ఇంతేకాదు, పసిపిల్లల్ని చూసినా, అంతే! మేం అంతా మాట్లాడుకునే సమయంలో శాస్త్రి పిల్లవాడు “అమ్మా” అంటూ అమె ఒళ్ళో దూరితే అమె పడిన భయం నేనెప్పుడూ మరిచి పోలేను. 

    ఒళ్ళో తేలుపడ్డట్టు ఉలిక్కి పడ్డది. శాస్త్రీభార్య, “తిరగమోత మాడుతూ ఉంది. కొంచెం పిల్లవాడ్ని చంకవేసుకోండి, చూసి వస్తాను” అని చెప్పి ఆమెకు పిల్లవాణ్ణి అందించినప్పుడు ఆమె పడ్డ యాతన ఆ పరమాత్ముడికే తెలియాలి.

    పిల్లవాణ్ని చంకన వేసుకోవటం చాతకాక శాస్త్రి భార్య పొయ్యిమీద చట్టిని పట్టుకున్నట్లు పట్టుకుంది. కాని ఎంత బాధ అయినా ఆమె మరుక్షణమే మర్చిపోయేది. ఇవతలికి వచ్చి ఏమీ జరగనట్టుగానే యథాప్రకారం ఆమె అందరితోనూ కులాసాగా కబుర్లు చెప్పేది, ఆ సంగతే ఎత్తేదికాదు.

    భోజనం చేసి ఆమెను గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలో ఆమె కూడా శాస్త్రి ఇంట్లో భోజనం పూర్తిచేసుకుని వచ్చి “సినిమాకి వెళ్లాం రండి” అని అడిగింది.

    నేను కొంచెం తటపటాయించి “శాస్త్రి ఏడి?” అన్నాను. 

    “శాస్త్రి లేకపోతే మీరు రారా?” 

    “ఎందుకు రాను?” 

    “ఇంకేం? రండి.” 

    “బండి పిలిపిస్తాను.” 

    “నడిచిపోదాం .”

    ఇద్దరం బయల్దేరాం. రోడ్డు మీద ఎవ్వరూ నడవటం లేదు. మునిపల్ లాంతరు స్థంభాలు మిణుకు మిణుకు మంటూ కాపలా కాస్తున్నై. దూరంగా అప్పుడప్పుడూ గుర్రపు బళ్ళ వోటిమోత వినిపిస్తోంది. మేమిద్దరం పక్క పక్కనే నడుస్తున్నాం. చలికి ఆమె శాలువా కప్పుకుంది. అందుకని నాకు ఆమె స్త్రీగా కనపట్టం మానేసింది.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    16 min
  • part ii - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన


    ఆగదిలో యింకోవస్తువేదో ఉన్నట్టు రావుగారికి కనిపించింది. తెరచిన తలుపులోనుంచి లోపలికేదో ప్రవేశించినట్లుగా, చేతిలో దీపం వెలిగించి ఆయన ఆవేపు చూశారు. ముష్టి ఆమె గజగజ వణకుతూ నీరు కారుతూ వొకమూల నిలబడివుంది. ఆమె తడివెంట్రుకలు ముఖాన్నీ చెక్కులనీ అంటుకున్నాయి. వాటివెంట నీరు కారుతోంది.

    ‘బాబుగారు! తలుపు ముయ్యలేదే! కొంచెం వెచ్చగా వుంటుంది’ అంది ఆమె గొంతుక బాగా పెద్దది చేసి. ఆయన ఒక యంత్రంలాగా లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. ఆమె సహాయం చేసింది. ఎలాగో తలుపు మూసి లోపల గడియవేశారు. కాని గాలి ఒక్కసారి వూపింది. గడియ వూడిపోయింది. ఇద్దరూ మళ్ళీ తలుపులు మూసి గదిలో వున్న కర్రసామాను అంతా కొన్ని కుర్చీలూ, ఒక బీరువ, బరువైన డ్రాయరూ తలుపుకి అడ్డంగా చేర్చారు. తలుపులు ముయ్యాలని తనకు తోచకపోవడం రావుగారికి వింతగా తోచింది. 

    ఇపుడు కొంత వెచ్చగా వుంది. భయం తగ్గింది. ఎక్కడో పెద్ద చప్పుడైంది. ఏదో పడిపోయింది. స్టేషన్ లోపలే పడిపోయిందేమో? “ఏం గాలి వానండి బాబుగారు నేను పుట్టిన్నాటి నుండి యింత గాలివాన నేను సూడలేదు.” అంది ముష్టి ఆమె గొంతులో ఏమీ బెదురులేకుండా. 

    అంత ప్రశాంతంగా ఆమె ఎట్లా మాట్లాడకలుతుందో ఆయనకు అర్థం కాలేదు. ఆమెవేపు దీపం వేసి చూశారు. మూలగా చలిచేత ముడిచి పెట్టుకుని వొణుకుతూ ఆమె కూచుంది. రావుగారు పెట్టి తీసి తనపంచ ఒకటి తీసి ఆమెవేపు విసిరి ‘తడిబట్ట విడిచి యిది కట్టుకో’ అన్నారు. ఆయనన్న దేమీ ఆమెకు వినిపించలేదు. కానీ పొడిబట్ట యిచ్చినందుకు కృతజ్ఞత చూపిస్తూ బట్టమార్చుకుంది. ఆ మూలే పొడిగా వున్నచోట కూర్చుంది. రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది

    తన పెట్టె తీసి అందులో వున్న బిస్కట్ల పొట్లం తీశారు. ఒకటొకటి చొప్పునా నమలడం మొదలు పెట్టారు. |

    అక్కడే కూర్చున్న ఆమె ముఖం వేపు చూసారు. ఆమెకు కూడా ఆకలి వేస్తున్నదేమోనని ఆయనకు స్ఫురించింది.

    “బిస్కట్లు తింటావా?” అని అడిగారు. 

    “ఏంటన్నారు?” అన్నదామె గట్టిగా, ఆ గాలి హోరులో ఒకరు మాట్లాడితే ఒకరికి వినిపించలేదు. ఆయన దగ్గరగా వచ్చి కొన్ని బిస్కట్లిచ్చారు. 

    . “ఇవ్వేవున్నాయి, తినడానికి” అన్నారు రావుగారు ఏదో పొరబాటు చేసినట్లుగా. 

    కాని అసలు లేనిదానికంటె నయం కాదూ? 

    తన చోటికి తిరిగి వెళ్ళి పెట్టిమీద కూచున్నారు. కుర్చీలు తలుపులకి అడ్డం పెట్టివున్నాయి. ఆమె గదిలో వుండడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరూ లేకపోవడం కంటె ఆమె వుండడం కొంత నయం. – దేని గురించీ బాధ పడదు. గాలివానను గురించి కూడా. జీవితంలో కష్టనిష్ఠురాలు ఆమెకు అనుభవమై వుంటాయి. అంచేత ఆమె ఏ పరిస్థితినైనా కంగారు పడకుండా ఎదుర్కోగలదు. . 

    రావుగారు గడియారం వంక చూచారు. తొమ్మిది గంటలయింది. అయినా రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్లు ఆయన కనిపించింది. ఆయన వచ్చే స్టేషను వరకు మిగతా వారితో కూడా ప్రయాణం సాగించివుంటే బాగుండును. పెద్ద గాలివాన చెలరేగుతుందనీ, తను దిగేది ఒక చిన్న స్టేషను అని ఆ కంగారులో ఆయనకు స్పురించలేదు. స్టేషన్ నుంచి వూరు సుమారు రెండుమైళ్ళు ఉంటుంది. వూరికి తర్వాత స్టేషన్ నుంచైనా చేరుకుని వుండవచ్చు. 

    అన్ని విషయాలను కొన్ని సూత్రాలతో బంధించడం అలవాటయిన ఆయన మనస్సు గాలి యొక్క వేగాన్ని గురించి యోచించింది. బహుశా గంటకు 80 లేక 100 మైళ్లు వుండవచ్చు గాలివేగం. పెద్ద భయం ఆయన మనస్సును ఆవరించింది. ఈ గది కూలిపోవచ్చు. బయటికి పోయే ఒక్కదారీ కుర్చీలతోటి, బల్లలతోటి మూసివుంది. ముష్టిమనిషి కూచున్న చోటికి ఆయన కంగారుగా పరిగెత్తారు. 

    “ఈ యిల్లు కూలిపోదుగదా?”అని ఆయన అడిగారు.

    “ఎవరు చెప్పగలరు? యిల్లు గట్టిగానే వున్నట్టుంది. గాలిబలం ఎక్కువయితే ఏది ఆగుద్ది?”

    ఆమె మాటల్లో ధైర్యాన్ని కలిగించేది ఏదీ లేకపోయినా, ఆమె గొంతులో ఏదో ఒక చనువూ స్థైర్యం ధ్వనించింది. ఆయన పెట్టి దగ్గరకు పోయి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకు నెమ్మదిగా ఆమెకూడా చేరింది. “అక్కడ కూర్చుంటే ఒకరి మాట ఒకరికి వినబడదు” అంది. 

    “గాలివాన యింత ముదిరిపోతుందని నే ననుకోలేదు.”

    “బాబుగారు ఎందుకలా భయపడతా” రందామె. “ఒక్కరుండే కంటె ఇద్దరమున్నాంగదా! టికెట్టు కలెక్టరు దొంగముండావాడు. రైలు కదులుతూంటే నన్ను దింపేశాడు, ఏం చెయను! యిక్కడుండి పోయాను. అయినా నాకేటి విసారం? బాబుగారు చుట్టమెట్టుకోనాకి ఓ పొడిగుడ్డిచ్చారు. ఏదో కాంత అకలికి మేత పడేశారు. వచ్చే టేసనులో ఈ మాత్రం సుకమయినా వుంటాదని ఎలా అనుకోగలను? వున్నంతలో సుకంగా వుండాలి బాబుగారు! అదిలేదని, యిదిలేదని సీకాకుపడితే ఏం లాబం?”

    ఆమె గొంతు అలా మోగుతుంటే ఆయన మనస్సు కాస్త స్థిమిత పడింది. ఆమె భౌతిక దేహాన్ని చూస్తే ఆయన కసహ్యం. ఆయన మనస్సుకీ ఆమె మనస్సుకి ఎంతో అంతరం వుంది.

    అయినా ఆ భయంకరమయిన రాత్రి తనకు తోడుగా ఆమె వున్నందుకు ఆ కృతజ్ఞత ఆయన మనసులో నిండింది.

    “నీ కెవరూ చుట్టాలు లేరా?” అన్నారాయన, వెంటనే యింత చనువుగా ప్రశ్న వేసినందుకు నొచ్చుకున్నారు. తను రైలులో ఆమెకు ఒక కానీ కూడా యివ్వనందుకు ఆమెకు తనమీద ఏమన్నా కోపముందేమోనని ఆయన అనుమానం. మాటల్లోగానీ చేతల్లోగానీ కోపం కనబడలేదు. గట్టిగా గొంతు ఎత్తి మాట్లాడవలసిన అవసరం లేకుండా ఆమె కొంచెం ఆయన దగ్గరగా జరిగింది.

    సుట్టాలందరికీ వుంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగుతాడు. ఆడే మా అమ్మని సంపేశాడంటారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు ఓ దొంగముండావాడితో సేవితం కలిసింది. నాకు ఇద్దరు పిల్లలండి బాబుగారు. ఆడికి జూదం, తాగుడు అలవాటయిపోయాయండి. రోజూ ఏలకి ఏలు నెగ్గుతుంటాడు పోతుంటాయి. ఏం జెయ్యను బాబుగారు? ఇంట్లో తిండికి తిప్పలకీ నా సంపాదనే. పిల్లలింకా చిన్నోళ్లు బిచ్చమెత్తుకోనాకి. మావోడికి రోజుకో పావలా ఇత్తానండి తాగుడికి. 

    అడికి నన్ను సూత్తే అడలు బాబుగారు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేడండి. అందుకే తాగుతాడు బాబుగారు! అసలు అందరికీ తాగుడు అలాగే అలవాటవుద్దండి.”

    ‘నువ్వు ఏమాత్రం సంపాదిస్తావు.”

    ‘ఒక్కోరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒకోరోజు కానీ కూడా వుండదు. అయినా బాబుగారు! నేనడిగితే ఎవరూ లేదనరండీ మీరు తప్పితే. కొంతసేపు ఆరితో సరదాగా మాట్లాడితే యిచ్చేత్తారండి.”

    రావుగారు అనుకోకుండానే ఆమె ముఖం మీదికి దీపం వేశారు. ఆమె కొంచెంగా నవ్వింది. ఎవరినైనాసరే ఆమె కిందా మీదా పెట్టేయగలదు. అయినా ఆమెకు మనస్సులో అంత లోతుగా యిష్టాలు అయిష్టాలు లేనట్టు ఆయనకు అనిపించింది. జరుగుతున్న ఆ క్షణంతోనే ఆమెకు సజీవమైన అనుబంధం. గడచినకాలపు స్మృతుల బరువుగానీ, రాబోయే రోజుల గూర్చిన ఆశలుగానీ ఆమెకు లేవు. ఆమె నడవడిని నిర్ణయించే సూత్రాలు లేవు. ఆ సూత్రాలలో నిషేధాలసలే లేవు. నిత్యమూ ధర్మాధర్మచింతతో బాధపడే అంతరాత్మగానీ, నాగరికులకు సహజమయిన సంకీర్ణ మనస్తత్వంగానీ ఆమెకు లేవు. తను ఎన్నడూ ఎరగని మగవాడి కూడా ఆమె శరీరాన్ని అర్పించి తేలికైన మనస్సుతో ఆమె సుఖించగలదు.

    ఆయన ఆమె కొంటె చిరునవ్వుని యింకా అలానే చూస్తూ కూచున్నారు. ‘ఏటండి బాబుగారు! నాకే సలా చూస్తారు?” అంది ఆమె. 

    “మునుపున్నంత రంగుగా యిపుడు లేనండి.”

    వెంటనే ఆయన తనలోకి ముడుచుకుపోయారు. తనమనస్సులో అశ్లీలమయిన భావాలు వుంటాయన్నట్లు ఆమె సూచించినందుకు ఆమెమీద అసహ్యం కలిగింది…

    “నీవేపు చూడ్డంలేదు నేను’ అన్నారాయన, గట్టిగా.

    దీపం అర్పడం మరిచిపోయాను

    అకస్మాత్తుగా పెద్ద చప్పుడైంది. గది తలుపులు ఒక్క వూపులో తెరుచుకున్నాయి.

    సామాను చెల్లా చెదరై పోయింది. ఒక తలుపు పూర్తిగా ఊడిపోయి ఒక కుర్చీ మీద నుంచి పల్టీకొట్టింది. రావుగారి గుండె గొంతుకలో అడ్డింది. శక్తి కొద్దీ ఒక మూలకి గెంతి, పిచ్చిగా ఆయన ముష్టి ఆమెని కౌగలించుకున్నారు. 

    వెంటనే తెలివి తెచ్చుకుని చాలా సిగ్గుపడ్డారు. కాని ఆమె ఆయన చెయ్యిపట్టుకు నడిపించుకుని వెడితే మాట్లాడకుండా వెళ్లారు, గుమ్మం పక్కనున్న మూలకి. కఆమె ఆయనను తీసుకువెళ్లి ఆ మూలలో కూచోబెట్టింది. తనుకూడా దగ్గరగా కూర్చుని చేతులాయన చుట్టూ చుట్టింది. ఆ కౌగిలింతలో సంకోచాలేమీ లేవు. ఆయన మనస్సులో ప్రళయమంతటి మథన గుతోంది. కాని ఆ వెచ్చదనం ఆయనకు ప్రాణావసరం. అంచేత ఆయన కాదనలేదు.

    “సరిగా కూకొని నా సుట్టూ సేతు లేసుకోండి. కాంత ఎచ్చగుంటది పాపం! బాబుగారు ఒణికిపోతున్నారు”.

    ఆ మాటలు చాలా వెగటుగా ధ్వనించాయి రావుగారికి.. ఆమె మరీ దగ్గరగా జరిగి ఆయన వొళ్లోకి వాలింది. ఆమె రొమ్ముల బరువు ఆయన మోకాళ్ళమీద అన్చింది.

    మోకాళ్లు మరి కాస్త దగ్గరగా ఆయన ముడుచుకొని దీర్ఘంగా అవమానకర మయిన ఆలోచనాపరంపరలో మునిగిపోయారు. ఆమె అలా మాట్టాడుతూనే వుంది.

    “ఈ మూల బయం లేదండి. బాబుగారికి సక్కని కూతుళ్లుంటారు యింటికాడ. బాబుగారు ఆరిని తలుసుకుంటున్నారు. మా గుడిసె ఎగిరిపోయుంటది. మా పిల్లలేమైయారో! ఇరుగు పొరుగోళ్లు సూతుంటార్లెండి. మావొడొట్టి ఎదవ. ఎందుకూ పనికిరాడు. చిత్తుగా తాగిపడుంటే గుడిసి ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలెట్టా వున్నారో యేమో?”

    ఒక మానవ హృదయంలోనించి వెలువడిన యీ వేదన విటుంటే ఆయన హృదయం చుట్టూ పెట్టుకున్న గోడలన్ని మాయమైపోయాయి. పెద్ద ఆవేదనతో ఆ ముష్టి ఆమెను గట్టిగా దగ్గరగా అదుముకున్నారు. ఆయన ఆవేదన తనకు అర్థమైనట్టు ఆయన మోకాళ్లమీద మెల్లగా తట్టింది. క్రమంగా ఆయన మనస్సు ఆలోచించడం మానేసింది. గాలిచేసే అంతులేని గోల మనస్సు పొలిమేరల్లోకి పోయింది. ఆయన కాళ్లమీద గుండెలమీద ఆనుకున్న మానవ శరీరపు వెచ్చదనం వొక్కటే ఆయనకు గుర్తుంది.

    కాలం అతిమెల్లగా జరుగుతోంది, కాని ఆ సంగతి ఆయనకు తెలియదు. గాలివాన బలం హెచ్చింది. అన్ని పక్కలనించీ పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నై. తెల్లవారేసరికి ఒక చెట్టయినా నిలబడివుంటుందా అనిపిస్తోంది. కొంచెం యించుమించుగా పైకప్పు పెంకులన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాని గాలి వల్ల వాన వారిద్దరి నుంచి దూరంగా రెండో పక్కకి పడుతోంది.

    కొంతసేపటికి రావుగారి కాళ్లు తిమ్మిరెక్కాయి. పడుకునివున్న ఆ మూర్తి కదలకుండా మెల్లగా ఆయన కాళ్లు కదుపుకున్నారు. మెల్లగా మనస్సు మేలుకుంది. లైటు వెలిగించి ఆమె ముఖం వంక చూశారు. నిద్రలో ఆ ముఖం అమాయకంగా, నిశ్చింతగావుంది. స్వచ్ఛమైన, నిసర్గమయిన ఒక శోభ – ఆ ముఖంలోదివ్యత్వం స్ఫురింప జేసింది.

    ఆయనకు మళ్ళీ మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. గాలి మాత్రం బలంగా వీస్తోంది. ముష్టిఆమె లేచి వెళ్లిపోయింది. గడియారం వేపు చూచుకున్నారు. ఐదుగంటలయింది. లేచి నిలబడ్డారు. మోకాళ్లు పట్టివేశాయి. అనుకోకుండానే జేబులు తడుముకున్నారు.

     ఆయనకు స్ఫురించిన మొదటిమాట, ‘దొంగముండ!! కాని ఆమె అల్లా దొంగతనం చేసి ఉంటుందనుకోడం ఆయనకు యిష్టం లేదు. గదిలో నాల్గుమూలలా వెతికారు.గడిచిన రాత్రి కంగారులో ఎక్కడన్నా పడిపోయిందనుకున్నారు. గదిలోనుంచి బయటికి వచ్చారు. బయట దృశ్యం బీభత్సంగా వుంది. ప్లాట్ ఫారం తప్ప చుట్టుపక్కలంతా నీటిమయం. కొందరు దూరంగా రైలుగట్టు వెంబడి నడిచివస్తున్నారు. బహుశా వూళ్ళోనుంచి అయివుంటుంది. కొందరు దెబ్బలు తిన్న వాళ్లు స్టేషను రెండో పక్కన కింద పడుకుని వున్నారు. దూరాన్నుంచి చూసి ఆయన మొగం తిప్పుకున్నారు. ఏదో హాస్పిటల్ లో తెల్లగా శుభ్రంగా వరసల్లో పడుకోబెట్టినప్పుడు తప్ప, అంత నగ్నంగా మనిషి బాధపడడం ఆయనపుడూ చూడలేదు. ఆయనకు వికారం వచ్చింది, వెనక్కు తిరిగారు.

    టిక్కెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. గదితలుపులు ఎక్కడా కనబడ్డంలేదు. లోపల ఏవొ కుర్చీలూ, బల్లలూ, చిందర వందరగా పడిపోయి వున్నాయి. వెయిటింగు రూము కూలిపోతే ఏమైయుండునని ఆయన అనుకున్నారు. ఆ కల్లోలాన్ని శూన్యంగా చూస్తూ ఆయన నిలబడిపోయారు.

    లోపలి చీకటికి కళ్ళు కాస్త అలవాటు పడ్డాక ఆ సామానుకింద ఏదో శరీరం అస్పష్టంగా ఆనింది. దీపంవేసి చూశారు. ముష్టియామె. –

    ఆయన తట్టుకోలేక పోయారు. వంగి నుదురు తాకి చూచారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ యివతలకు వున్నాయి. క్రింది భాగం పూర్తిగా నలిగిపోయినట్టుంది. ఒకచేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు, కొంత చిల్లరావుంది. బహుశా టిక్కట్లు అమ్మిన డబ్బై వుంటుంది. గుమస్తా ఆ డబ్బు డ్రాయర్లో పెట్టి రాత్రి తొందరగా యింటికి పోయుంటాడు.

    రావుగారు ఆకస్మాతుగా చిన్నపిల్లవాడివలె ఏడుపు ప్రారంభించారు. చల్లని ఆ నుదురు ముద్దుపెట్టుకున్నారు. గడచిన రాత్రి ప్రతి చిన్న విషయం ఆయనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. తనకు ఆత్మ స్థైర్యాన్ని, శాంతిని, గాలివానకు తట్టుకోగల శక్తినీ చేకూర్చిన ఆ మూర్తి అక్కడ పడిపోయివుంది. ఆ గాలివానకు ఆమె బలి అయిపోయింది..! ఆయన హృదయం తుపానులో సముద్రంలాగా ఆవేదనతో పొంగిపొరలింది. తనకు జీవితంలో మిగిలిన ఒక్క ఆనందమూ శాశ్వతంగా పోయినట్టు ఆయనకు అనిపించింది. తన పర్సు దొంగిలించినందుకు గాని, అంత గాలివానలో డబ్బేమన్నా దొరికితే తీసుకోవచ్చునని టిక్కెట్ల గదిలోకి వెళ్లినందుకు గాని ఆయన ఆమెను మనస్సులో కూడా దూషించలేదు. 

    ఆమె ఆఖరుతత్వం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆమె చిలిపి కొంటెతనాలు ఆయనకు ప్రేమ పాత్రాలయాయి. ఆయనలో ఆయనలో లోతుగా మాటుపడియున్న మానవతత్వాన్ని ఈ జీవి వికసింపజేసింది. ఆయన భార్యగాని ఆయన పిల్లలలో ఎవరుగానీ ! ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు. 

    ఆయన విలువలు, నియమాలూ, ధర్మచింతా, వేదాంతం అన్నీ త్యజిస్తా డాయన, ఈ వ్యక్తికి ప్రాణం పొయ్యగలిగితే.

    అవతల మనుష్యులు వస్తున్న సవ్వడి వినిపించింది. రావుగారు కళ్లు తుడుచుకొని ఒక క్షణం ఆలోచిస్తూ నిలబడ్డారు. తర్వాత ఒక నిశ్చయంతో ఆమె వేళ్ళ సందులోంచి డబ్బుతీసి తెరచివున్న డ్రాయరులోవేసి డ్రాయరు మూశారు. కాని తన పర్సు ఆమె చేతిలోంచి విడదీయడానికి ఆయనకు మనస్సు వొప్పలేదు. తనకు సంబంధించినదేదో ఒక చిహ్నంగా ఆమె శరీరంతో ఉండిపోవాలని ఆయనకు అనిపించింది. కాని యితరులు ఆమె దొంగతనం చేసిందని అనుకుంటే ఆయన భరించలేరు. అంచేత జాగ్రత్తగా ఆ పర్సులో నుంచి తన పేరుగల కార్డు తీసివేసి బరువైన హృదయంతో అక్కణ్ణించి వెళ్లిపోయారు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    18 min
  • part I - ‘గాలివాన’ – పాలగుమ్మి పద్మరాజు గారి రచన

    కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘గాలివాన ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన కథల పోటీలో రెండవ బహుమతి పొందింది.

    పుస్తకం కొనడానికి కావాల్సిన web link

    Palagummi Padmaraju Rachanalu -Vol1

    కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.

    ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    గాలివాన’

    మబ్బు మసగ్గా అలుముకుపోయింది. రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండో తరగతి పెట్టె ఎక్కుతుంటే, ఆయనకు తన యిల్లు, ఆ యింట్లో అలవాటుపడ్డ సుఖాలు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. 

    ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా తుడిచివుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతిబల్ల, దానిమీద ఒక మూలగా, ఒక ఆకుపచ్చ గొట్టంలో దీపం వెలుగుతూ వుంటుంది. ఆయన కుర్చీ మెత్తలో కూర్చునే చోట అనుకూలమయిన పల్లాలు ఏర్పడ్డాయి. సోఫాలో వున్నట్టు కూడా తెలియకుండా ఆయన భార్య కూర్చుని ఉంటుంది. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడ, యిద్దరు మగ.వాళ్ళని చూస్తే ఆయనకు ఎంతో గర్వం.

    రైలు పెట్టెలో మూడుమెత్తలూ ఎవరో ఆక్రమించుకుని పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో వున్న నలుగురు ప్రయాణికులు చిరాకు పడుతున్నట్లు, రావుగారు వాళ్ల ముఖాలు చూడకుండానే గ్రహించారు. ఇంకో పెట్టెలోకి వెడితే బాగుంటుందని ఆయనకు అనిపించింది. కాని కూలివాడు ఆయన బెడ్డింగూ, పెట్టె, గొడుగు పైబల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది. ఒక పెద్దమనిషి పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటు చేశాడు. రావుగారు కూర్చుని పరిసరాలు వీక్షించడం ప్రారంభించారు.

    నలుగురూ దూర ప్రయాణీకులని ఆయన గ్రహించారు. బూట్లు మేజోళ్లతో సహా బల్లల క్రిందకు తోసివేయబడి వున్నాయి. కోట్లు, పాంట్లు, చొక్కాలు పై కొంకెలకు తగిలించి వున్నాయి. వదులైన పైజామాలను ముగ్గురు మగప్రయాణికులు తొడుక్కున్నారు. వస్తువులన్నీ యిటూ అటూ తొందరలేనట్టు పరచి ఉన్నాయి. కిటికీల పక్కనివున్న రెండు మెత్తలమీద ఇద్దరు పెద్దవయసువాళ్ళు కూచున్నారు. లోపలగా వుండే నిడుపైన బల్లమీద ఒక యువకుడు, ఒక యువతీ కూర్చుని ఉన్నారు. యువతి ఆయనకు భార్య అయిఉంటుంది. సిగరెట్టు పొగ మెత్తనిఘాటు రావుగారి నాసికారంధ్రాలలోకి తెలియకుండా ప్రవేశించి ఒకక్షణంపాటు ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.

    రైలు పెట్టెలో సిగరెట్టు పొగను గురించి రావుగారికి తీవ్రమయిన అభిప్రాయాలున్నాయి. అనేక విషయాలను గురించి ఆయనకు తీవ్రమయిన అభిప్రాయా లున్నాయి. అసలు ఆయన వేదాంతి. ఆయనకొక అభిమాన సిద్ధాంతముంది – వేదాంతం జీవితంతోటి, జీవన విధానంతోటీ, వ్యక్తికీ సంఘానికీ మధ్య ఏర్పడే రకరకాల సమస్యల తోటీ, అనుబంధించి వుంటుందని ఆయన వాదము. ఆయన ప్రకారం, వేదాంతానికి, జీవితానికీ, నిశితమైన మానవానుభవాలకి కూడా అతీతమయిన విషయాలతో ఏమీ సంబంధం లేదు. ఆయన జీవితం సుఖంగా మిట్టపల్లాలు లేకుండా గడిచిపోయింది. అసంతృప్తి వల్ల ఆయన జీవితాన్ని గురించి అమితమయిన ఉత్సాహంతోటీ పవిత్రమైన ఉద్రేకంతోటీ మాట్లాడగలరు.   

    ఒక్క వేదాంతిగానే గాకుండా, మంచివక్తగా కూడా ఆయన ప్రఖ్యాతి పొందారు. ఆయన తన వేదాంతాన్ని అనుపమానంగా ఉద్విగ్నుడై వివరిస్తూ వుంటారు. 

    అసలు ఈ ప్రయాణం చేస్తున్నది ఒక ఉపన్యాసం యివ్వడంకోసం. ‘ఆస్తిక మహాసమాజము’ అని పేరు పెట్టుకున్న ఒక సంస్థ ఆహ్వానం మీద ఆయన వెడుతున్నారు. ఉపన్యాసం; సామ్యవాదమూ రమ్య రసామోదము అనే విషయాన్ని గురించి. ఆయన అభిప్రాయం సామ్యవాదంలో ఈ రమ్యరసాత్మ ఉందనో లేక ఆ రెండూ పరసర విరుద్దమయినవి కావడంచేత వాటికి ఒక సమన్వయం కల్పించాలనో అన్నది తెలుసుకోవాలంటే ఆయన ఉపన్యాసం వినవలసిందే.

    రావుగారు యువదంపతుల వేపు చూశారు. యువతి ముఖం చాలా బరువుగా మంది. ఆమెకు కాస్తవుత్సాహం కలగడానికి కాబోలు యువకుడు నవ్వుతూ ఆమె చెవిలో ఏదో అన్నాడు. బహుశా తన భర్తతో కూడా అతను ఉద్యోగంలో వున్న ఏ దూర దేశానికో మొదటిసారి ఆమె వెడుతున్నట్లుంది. 

    రావుగారికి ఈ మధ్యనే తాను యిచ్చిన ఉపన్యాసం జాపకం వచ్చింది. ‘సత్వము తత్వము’. ఆయన ఉపన్యాసాల శీర్షికలు శబ్దాలంకారాలను బట్టి నిర్ణయమవుతాయిగాని, అర్ధస్ఫురణను బట్టి కాదని ఆయన స్నేహితులు కొందరు ఆయన్ని వేళాకోళం చేస్తుంటారు. అది నిజం కాదని ఆయననలేదు. కాని ధ్వనిని బట్టి అర్థం అనుసరిస్తోందని మాత్రం సమాధానం చెబుతుంటారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో చాలా అందమయినది “ప్రకృతి పరిష్కృతి.”

    గాలి పెరిగింది. బలంగా కిటికీ తలుపుల మీద మొత్తుతోంది. ఉన్నట్టుండి పెట్టెలో చీకటిగా అయిపోయింది; ఇంకా సాయంత్రం అయివుండదు. రావుగారికి ప్రక్కన కూర్చున్న పెద్దమనిషి కనిపించీ కనిపించని దీపపు వెలుగులో ఒక అపరాధ పరిశోధక నవలను తదైక్యంతో చదువుతున్నాడు. చటుక్కున అతను ముఖం ఎత్తి ‘టైము ఎంత అయివుంటుంది’ అని రావుగారి నడిగాడు. రావుగారు ఒక క్షణం ఆలోచించారు, ఆయన చేతికి గడియారం ఉన్నా కూడా. “మూడు గంటలు అయివుండవచ్చు” అన్నారు. 

    “ఎంత చీకటిగా అయిపోయింది!” అన్నాడు పెద్దమనిషి. రావుగారు సమాధానం చెప్పకుండా ఆ పెద్దమనిషివేపు చూచారు. ఆయనకు రావుగారి వయస్సు ఉంటుంది. ఏభై ఏళ్ల మనిషి. ఒక అపరాధ పరిశోధక నవల చదువుతూ ఆనందించటం రావుగారికి వింతగా కన్పించింది. ఎదురుగా కూచున్న ముసలాయన గంభీరంగా చుట్టకాలుస్తూ దాని రుచి ఆస్వాదిస్తున్నాడు. కొందరు మనుష్యుల స్వభావాలే అంత – అనుకున్నారు రావుగారు. ఎదురుగా కూర్చున్న ముసలాయన రావుగారికంటె పెద్దవాడయి యుంటాడు. కాని ఆయన ముఖంలో కుర్రవాళ్ళకి సహజమైన చురుకుతనం ఉంది. అయినా ఆ ముఖం ఆయన వయసును మాటుపరచడంలేదు. వాలిపోయిన దవడలు, ముడతలు పడ్డ నుదురు, వయస్సును చాటుతూనే ఉన్నాయి. రావుగారికి ఉపన్యాసానికి ఇంకొక విషయం స్ఫురించింది. ‘వయోవిపాకము మనోవివేకము.”

    తాను చాలా ఆరోగ్యవంతుడని రావుగారికి గర్వం. ఆయన జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుంది. ఆయన భార్య ఆయనకంటే పెద్దదిగా కన్పిస్తుంది. తెలియనివారు   ఆయన అప్పగారో, తల్లో అని భ్రమపడుతూ ఉంటారని ఆయన తరచుగా వేళాకోళం ఆడుతుంటారు.

    ఆయనకొక ఇరవయ్యయిదేళ్ల కొడుకున్నాడనీ, ఆ కొడుక్కి అప్పుడే ఇద్దరు చక్కని పిల్లలున్నారనీ, అతను యీ మధ్యనే తండ్రిగారి న్యాయవాద వృత్తినంతనీ తనే చూసుకోడం ప్రారంభించాడనీ, రావుగారిని చూసిన వాళ్లెవరూ అనుకోరు. ఆయనంత ఆర్జనవున్న వాళ్ళెవరూ వయస్సులో న్యాయవాదవృత్తినుండి విరమించలేదు. ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నారు. వాటిని అతిక్రమించి కుండా వుండగల సాహసం ఆయనకు వుంది. నీతి, నియమాలను గురించి ఆయనకు పిచ్చి పట్టుదల లేదు. కాని మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండి తీరాలి అని ఆయన అభిప్రాయం. ఆయన పిల్లలను నెలకొకసారి సినిమాలకు వెళ్లనిస్తారు. అంతకంటె తరచుగా మాత్రం ఎన్నడూ వెళ్లనివ్వలేదు. కుర్రవాళ్ల హృదయాల్లో వుండే కోరికల ఎడల ఆయనకు సానుభూతివుండి ఆ కోరికలు తీరడంకూడా, వాళ్ళ హృదయపరిపక్వానికి అవసరమని ఆయన నమ్మకం. అయినా కోరికలు వాళ్ళ ఆత్మను బంధించేటంత బలంగా వుండకూడదని ఆయన అభిప్రాయం. ఆయన తన ఇంట్లో తుచ తప్పని క్రమపద్ధతి చాలా శ్రమపడి అమలులో పెట్టారు. ఆ క్రమపద్ధతి ఆయన మనస్సుకీ శరీరానికి కూడా ఎంతో శాంతి, సుఖం సమకూరుస్తోంది.

    అన్ని కిటికీల తలుపులు మూసివున్నాయి. గాలి అవతల ఆరుస్తోంది. జల్లుకూడా ప్రారంభించింది. వానచినుకులు గాలిబలంవల్ల కిటికీ తలుపుల సందుల్లోనుంచి చొచ్చుకుని వస్తున్నాయి. స్పర్శకు అన్నీ చల్లగా వున్నాయి. యువకుడు యువతికి కొంచెం దగ్గరగా జరగబోయాడు. యువతి ఇటూ అటూ చూచి దూరంగా జరిగింది.

    దారుణంగా వుందే ఈ గాలివాన!” అన్నాడు యువకుడు. రావుగారి పక్కనున్న పెద్దమనిషి ముఖం పైకెత్తి, ఏదో చెప్పబోయి, మానివేసి మళ్లీ చదువు ప్రారంభించాడు. యువకుడు సిగరెట్టు ముట్టించాడు. యువతి ముఖం చిట్లించి దూరంగా జరిగింది. యువకుడు ఒక చిరునవ్వు నవ్వి సిగరెట్లు కాలుస్తూనే కూర్చున్నాడు. చక్కగా దువ్విన యువతి తలకట్టులో నించి ముంగురులు విడిపోయి ఆమె నుదుటిమీద, చెక్కులమీద కదులుతున్నాయి. తన కుమార్తెలు తలదువ్వుకునే పద్ధతి రావుగారే నిర్ణయించారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ల అలవాట్లు, నోములు, వ్రతాలు, స్నేహాలు, దుస్తులు వేసుకునే పద్ధతి అన్నీ కూడా అందాన్ని గురించి మర్యాదను గురించీ రావుగారి కున్న అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయమైపోయాయి…

    ఎదురుగా కూర్చున్న ముసలాయన తన పరుపుచుట్టలోనుంచి బూడిదరంగు ప్లానిలు చొక్కా తీసి తొడుక్కున్నాడు. ఆయన ఆ చొక్కాలోను ఆ చారల పైజామా లోనూ నిజంగా చిత్రంగా కనబడుతున్నాడు. ఆయన ఫ్లాస్క్ లొనించి వేడి కాఫీ ఒక కప్పు పోసుకుని తాగడం ప్రారంభించాడు. రావుగారికి తన పెట్టెలో ఒవల్టితో వున్న ఫ్లాస్క్.  అది తీసి ఒవల్టిన్ ఆయన ఆప్యాయంగా చప్పరించడం ప్రారంభించాడు. రావుగారికి ఒవల్టిన్అంటే చాల యిష్టం కాని ఆ యిష్టానికి హద్దుమించి ఆయన ఎన్నడూ వశుడై పోలేదు. ఆ మధురమైన పానీయాన్ని ఆయన రోజుకి రెండుసార్లు ఒక్కొక్క కప్పు చొప్పున తాగుతారు.

    గాలి అంతకంతకు భయంకరంగా వీస్తోంది. పెద్ద చినుకులు రైలుపెట్టె మీద మొత్తుతున్నాయి. ఆ హోరులో రైలు నడిచే చప్పుడు కూడా మాటుపడిపోయింది.  

    రైలు కదులుతున్నట్లు రావుగారికి ఒక్క కుదుపువల్ల తప్ప తెలియడంలేదు.

    ‘తుపానులా వుంది’ అన్నాడు యువకుడు భార్యతో. ఆమె సమాధానం చెప్పకుండా ఒక రగ్గు దగ్గరగా కప్పుకుంది. ఆమె ముఖంలో పెద్ద బెంగ ఏదో ప్రతిఫలిస్తోంది. గాలివాన గురించి రావుగారి మనసులో అదురు ప్రారంభమయింది.

    పెట్టె తలుపు తెరచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీవానా పెట్టెలోకి చొచ్చుకువచ్చాయి. చినిగిపోయి తడిసిపోయిన గుడ్డలతో ఒక ఆమె పెట్టెలో ప్రవేశించింది. లోపల వున్నవారు చెప్పే అభ్యంతరాలు లక్ష్యపెట్టకుండా తలుపుమూసి ఒక మూల నీరు కారుతూ ఆమె నిలబడింది. ముసలాయన తగినంత కోపం తెప్పించుకుని ‘ఇది పరుపులపెట్టి అని తెలియదూ’ అన్నాడు

    ‘బాబ్బాబు! తాతగారు! ముష్టిముండకి కొంత నిలబట్టాకి సోటివ్వరా బాబుగారూ, దయగల బాబులు! బిడ్డలుగన్నతండ్రులు, ముష్టిముండకి మీకానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడుతుంది బాబులు. గొప్పగొప్ప బాబులు, డబ్బున్నా బాబులు, గొప్ప పెభువులే అంతాను. పేదముండని ఇల్లా ఆకలితో సచ్చిపోనివ్వరు బాబులు…”

    రావుగారు ఆమెవేపు చూశారు. ఆమె కళ్లలో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆ తళుకు రావుగారి హృదయంలో విరోధభావాన్ని రేకెత్తించింది. ఆమె వయస్సు సుమారు ముప్పయి ఏళ్లుంటాయి. అంత కడుపునిండా తిని ఉండి కొవ్వెక్కినట్టు లేకపోయినా, ఆకలితో చచ్చిపోతున్నట్టు మాత్రం ఆమె కన్పించడంలేదు. ఎంత అసహాయత ఆమె నటించినా, ఆమెలో స్థైర్యము ఉంది. 

    బిచ్చమెత్తుకోడంమీద రావుగారికి అసలు సానుభూతి లేదు. పేదవాళ్ళన్నా, లేమివల్ల బాధపడుతున్న వాళ్ళన్నా, రావుగారికి జాలిలేకపోలేదు. కాని బిచ్చమెత్తడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి బిచ్చం అడిగితే ఆయన ఇంక అనుమానం లేనంత గట్టిగా ‘ఫో’ అన్నారు. ఆమె ముఖం అదోమోస్తరుగా పెట్టి రెండో పక్కకు తిరిగింది. ఎదురుగా కూర్చున్న ముసలాయన దగ్గరకు వెళ్ళి వంగి పాదాలు ముట్టుకుంది. ముసలాయన కాళ్లు వెనక్కి లాక్కున్నాడు వెకిలిగా నవ్వుతూ, ‘వెళ్లు, వెళ్లు’ అన్నాడు ముసలాయన.

    ‘అల్లా అనకండి తాతగారు. ఆ బాబంత రాతిగుండె కాదు బాబు నీది. ఆ బాబుగారికి యింతమాత్రం జాలిలేదు. ఆకలితో సచ్చిపోతున్న ముండని ముష్టడిగితే ‘ఫో’ అంటాడు బాబు.

    తను అన్న ‘ఫో’ ఆమె అనుకరించడం, పెద్ద పొగరుబోతుతనమని రావుగారికి అనిపించింది. కాని ఆయనకు ఏమనడానికి తోచలేదు. ఇష్టం లేకపోయినా ఆమెవేపు చూస్తూ ఆయన అల్లాగే కూర్చున్నాడు. ముసలాయన చిత్రమయిన అవస్థలో పడ్డాడు. దానికి ఓ డబ్బు యిచ్చి పంపేస్తూ పెట్టిలో నలుగురూ పైకేమీ అనకపోయినా హర్షించరని ఆయన అనుమానం. ఇవ్వకపోతే ఆముష్టిది నోరు ఎలా జారవిడుస్తుందోనని భయం.

    ఇందులో ఏది ఉత్తమమో ఆయనకు తేలలేదు. చివరకి లేని తీవ్రత తెచ్చిపెట్టుకుని – ఆమెను పొమ్మన్నాడు. ముష్టిది గోల ప్రారంభించింది. ,

    ‘ఇందులో డబ్బున్నా దొరలున్నారని, నాబోటి ముష్టి ముండని సచ్చిపోనివ్వరని ఎంతో ఆశగా ఈ పెట్టిలో కొచ్చాన్రా దేవుడా! ఈ రోజు తిండికి సరిపడా అడుక్కుందామనుకున్నాను. ఎంత మోసమయిపోయిందిరా దేవుడా! మూడోకలాసు పెట్టెల్లో పేదోళ్ళుంటారు. ఆళ్ళకే ఎక్కువజాలి ఈ బాబులకంటె. నా కట్టమంతా ఆళ్ళకి అర్థమవుద్ది. డబ్బున్నా బాబులంతా రాతి గుండెలని తెలుసుకోలేక పోయాన్రా దేవుడా! అవతల గాలివాన. రైలు నడుత్తావుంది. ఇక్కణ్ణించీ ఎల్లా పోను – ఆ దయగల బాబులున్నా సోటికి. ఇక్కణ్ణించి ఎల్లాపోను…”

    ముష్టిమనిషి అందరి దృష్టినీ ఆకర్షించింది. రావుగారిపక్కనున్న పెద్దమనికి అపరాధపరిశోధకనవల చదవడం ఆపేశాడు. విచిత్రంగా ఆమెవేపు చూశాడు.

    ‘ఉనది ఏమి ఊరు’ అని తమిళుల తెలుగులో అడిగాడు. ‘ఓ వూరేటి. ఓ పల్లేటి బాబు మాబోటి పేదోళ్ళకి. తమబోటి పెభువులకి సెప్పుకోనాకి వూళ్ళుంటాయి. పెద్ద పెద్ద లోగిల్లుంటాయి మీకు. గేటుముందు బంట్రోతులు కూచోని ముష్టోళ్ళని రానీకుండా తరిమేయిత్తారు బాబులు. నాబోటి పేదముండకో వూరేటి? ఓ పల్లేటి?’ 

    ‘నాలుక చాలావాడి’ అన్నాడాయన రావుగారిని వుద్దేశించి ఇంగ్లీషులో. –

    ‘ఇంగిలీసులో ఎందుకు బాబు తిడతావు. నాకా బాసొచ్చునా, ఏమన్నానా? ఏమీ తెలియనిముండని, పేదముండని.”

    బయట చీకటిగా అయిపోయింది. చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రైలు వానబాములా పాకుతోంది. రావుగారు దిగవలసిన స్టేషన్ దగ్గర పడుతోంది. ఆస్తిక సమాజం సభ్యులు ఎవరన్నా స్టేషన్కి రాకపోతారా అని రావుగారు ఆశగా అనుకున్నారు. ఆయన మనస్సు తికమకపడుతోంది. తనూ తన సామానులు రైలులోంచి దిగాలి. అదీ ప్రకృత సమస్య. సహ ప్రయాణీకులు సహాయం చేయకపోరు. 

    గాలి అవతల కోపంగావున్న మహాసముద్రంలాగ హోరుమంటోంది. చెట్లు పడిపోతున్న చప్పుడు లాంటివి ఎన్నో గోలగా కలిసిపోయి అవతల వినబడుతున్నాయి. కదులుతున్న రైలు, గాలికి కారణభూతమయిన మానవ మేధ ఆ గాలివానలో నిరుపయోగంగానూ అత్యల్పంగానూ అని అనిపించాయి. పెట్టెలో కొంత సుఖంగానే వుంది. కాని అందులో నించి దిగిపోవాలి.

    ముష్టిది పెట్టెలో యువదంపతులకు ఎదురుగా మధ్యగా కూర్చుంది. కొంచెం సేపు ఆగి, మళ్ళీ ప్రారంభించింది.

    “అమ్మో నాసిట్టితల్లిగారున్నరిక్కడ, సిట్టిబాబుగారు కూడా ఉన్నారిక్కడ. ఇంకేం! సూడేలేదు ఎర్రిముండని. సిట్టితల్లిగారు! సిట్టిబాబుగారితో సొప్పి ఒక్క డబ్బు ఇప్పించు తల్లి ! ఎందుకుతల్లి అల్లా మొగం తిప్పుకుంటావు. ఏం? సిట్టితల్లికి సిట్టిబాబుకి తగాదా వచ్చిందా? 

    సిట్టి బాబుగారు అత్తమానూ చిగరట్లు తాగుతారు. సిట్టితల్లి తాగనీకూడదు. 

    అబ్బో! సిట్టితల్లికి నవ్వొత్తావుంది. “

    యువతి చిరునవ్వు ఆపుకోలేకపోయింది. యువకుడు కడుపునిండా నవ్వాడు.

    అన్నాడు. 

    “మాతో కూడా వచ్చేయకూడదూ నువ్వు? పనీపాటా చేస్తూవుందుగాని తిండి గుడ్డా యిస్తామ్”

    “ఏదో యిచ్చి దాన్ని పంపెయ్యకూడదూ?” అంది యువతి భర్తని ఉద్దేశించి. 

    “నాకు తెలుసు. సిట్టితల్లి గుండి జాలి గుండి. తాతగారు ఇప్పుడు నాకో అణాకి తక్కువివ్వరు.. ఎర్రిముండని ఆ బాబు కంత చిరాకు వచ్చీలాగ చెయ్యకూడదు. అంత మంచిబాబు ఎక్కడా వుండరు. తాతగారు జాలిగల ప్రెభువు…. – 

    రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో యిచ్చారు. ఆమె మాటలు వింటూంటే అందరికీ సరదాగా వుంది. కాని రావుగారు మనస్సు ఇతర విషయాలతో పోయింది. ఆయన గాలివానను గురించి, తను రైలులోంచి దిగడాన్ని గురించి ఆలోచిస్తున్నారు.

    రైలు ఆగినట్టు రావుగారికి ఒక ముహూర్తంపాటు తెలియలేదు. సరిగ్గా అపుడే వాన మరీ తీవ్రమయింది. ఆయన గొడుగు ఒక చేత్తోబట్టుకు లేచారు. తలుపు తెరవడంతోటే గాలి ఆయన్ను తీవ్రంగా వెనక్కు నెట్టివేసింది. ఆయన తూలిపోయారు. ముష్టి మనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావుగారికి ఆ సందర్భంలో మంచి చెడ్డలు ఆలోచించడానికి సావకాశం లేదు. ఆమె సహాయాన్ని అంగీకరించక తప్పలేదు. కాని ఏదో అస్పష్టమయిన నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆయన మనస్సులో కొంచెం బాధ కలిగింది. కాని రైలు దిగి ఆయన స్టేషనులోకి పరుగెత్తి వెళ్ళిపోయారు. ముష్టి ఆమె ఆయన సామానులు వెయిటింగు రూములో పెట్టింది. స్టేషనులో ఎక్కడా ఒక్క దీపంలేదు. రావుగారు కొంత డబ్బు తీసి ఆమెకు యివ్వబోయారు. ఆమె వద్దనలేదు గాని, ఏదో వినబడకుండా అని చటుక్కుని మాయమయిపోయింది. –

    స్థబ్దుడై రావుగారు మళ్ళీ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. గింగురుమనే ఆ గాలిలో కాళ్లు పట్టు తప్పిపోతున్నాయి. గుడ్డలన్నీ తడిసిపోయాయి.. పెట్టి తీసి చేత్తో యిటూ అటూ తడిమారు. బాటరీలైటు చేతికి తగిలింది. పట్టరాని సంతోషం వచ్చింది. రావుగారికి తన పెట్టెలో ఒక లైటున్నదన్న సంగతి గుర్తులేదు. తడి బట్టలు విప్పి పొడిబట్టలు కట్టుకున్నారు. ఊలు స్వెట్టర్సు తొడుక్కున్నారు. మప్లరు చెవులకు, తలకు చుట్టుకున్నారు. పెట్టెతాళం వెయ్యడం కూడా మరిచిపోయి కుర్చీలో కూర్చున్నారు. తన స్థితిని గురించి ఆలోచించడం కూడా ఆయనకు యిష్టం లేదు. ఇంతలో రైలు దీపాలు కదిలాయి. స్టేషనులో ఎవరో ఒకరు వుండి తీరాలని నిశ్చయించుకుని బయటికి వచ్చారు. ఇద్దరు ఎవరో ప్లాట్ ఫారం దాటి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. రావుగారు గొంతెత్తి పిలిచారు. ఇద్దరు ఆగారు. ఒకరు స్టేషను మాష్టరు గారనీ ఇంకొకరు బంట్రోతనీ రావుగారు గుర్తించారు

    “నేను వూర్లోకి వెళ్ళాలి” అన్నారు రావుగారు ఆదుర్దాగా. 

    “చాలా కష్టం. రోడ్డు మీద అంగుళం అంగుళానికి చెట్లు పడివున్నాయి. టెలిఫోను తీగలు తెగిపోయాయి. ఒకచోటికి ఇంకోచోటికి కబురు తెలియడం కూడా అసంభవం. వచ్చే స్టేషనులో రాత్రికి రైలు ఆగిపోతుంది. గాలివాన చాలా తీవ్రంగా వుంటుందనీ, 36 గంటల వరకూ తగ్గదనీ మాకు వార్త వచ్చింది.”

    “కాని స్టేషన్లో యింకెవ్వరూ లేరే.”

    “నేనేం చేస్తాను? ఎల్లాగో స్టేషనులోనే మీరు గడపాలి.”

    స్టేషను మాష్టరు వెళ్ళిపోయారు. రావుగారు వెయిటింగు రూంలోకి వెళ్లిపోయారు. పడకకుర్చీలో కూలబడి పోయారు. గది తలుపులు మూసేస్తే గాలివాన లోపలికి రాకుండా వుంటుందని ఆయనకు తోచలేదు. రెండు కిటికీ తలుపులు ముక్కలైపోయాయి. పెంకు లెగిరిపోయాయి. ఏవో క్రూర శక్తులు విజృంభించి మానవుడు సృష్టించినవీ దేవుడు సృష్టించినవీ కూడా భూమిమీద లేకుండా రూపుమాపడానికి పూనుకున్నట్లు అనిపిస్తోంది.

    ఈ గందరగోళంలో మనస్థైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ రావుగారికి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీకూడా మానవాతీతమయిన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితం అయిపోతాయని ఆయనకు జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి సర్వనాశనానికొడిగట్టినట్టయితే మానవుడు తన్ను తానెలా రక్షించుకోగల్గుతాడు? ఎన్నడూ ఎరుగని భీతి రావుగారి మనస్సును ఆవరించింది. ఆ బాధ దుర్భరంగా వుంది. చుట్టు పక్కల ఎక్కడా మానవహృదయమన్నది లేదు. స్టేషన్ భీతావహంగా వుండి గాలివాన ఉగ్రరూపం దాల్చింది. ఆయన మనస్సు ఒక పీడకలలో చిక్కుకున్నట్టు ఉక్కిరి బిక్కిరైపోయింది.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    27 min
  • 'మంత్రపుష్పం' - మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ

    హర్షణీయంలో ఇప్పుడు వినబోయే కథ - మంత్రపుష్పం, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి రచన.

    తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన డుమువులు కథ 14 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. మచిలీపట్నంలో బి.ఎ. వరకు చదివారు. తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రాలలో ఎం.ఎ.పట్టా పుచ్చుకున్నారు. నాట్యకళలో, చిత్రలేఖనంలో, సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది.

    కృష్ణాతీరం అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి గడించింది.

    ఈ కథను మీకందించడానికి అనుమతినిచ్చిన క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ సూరిబాబు గారికి కృతజ్ఞతలు.


    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1


    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)


    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    మంత్రపుష్పం :


    పాపం! - చిట్టి రాలిపోయిందిరా!" అన్నాడు, మొనమొన్ననే జిల్లా కాంగ్రెసు సంఘంలో కృత్యాద్యవస్థమీద సభ్యుడుగా జొరబడ్డ మా పంతులు.

    "ఎప్పుడు?" అని మేం నలుగురం అడిగాము, గొంతులు బిగిసి.

     “వారం రోజులయింది!" అని జవాబు ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు!

    "బ్రతికి ఎందర్నో సుఖ పెట్టింది! పోయి తాను సుఖపడుతుంది" అంటూ మాలో ఒకడి నిట్టూర్పు!

    "ఆ బ్రతుక్కి చచ్చిపోవడంకన్న సుఖమేముంది? తెరిపి ఏముంది?- అదృష్టవంతురాలు!" అని మరొకడి సాకారం.

    “అవును, దాని బ్రతుకంతా చచ్చినచావే! అది కాగా నెట్టుకొచ్చింది కాని, మరో ఆడదైతే-"

    “మరో ఆడదానికి అంత దమ్ముంటుందా?- గట్టిగా చెడిపోయేందుకన్నా నిష్ఠంటూ ఒకటి ఉండాలి!"

    చిట్టి బ్రతికి ఉన్నప్పుడు, ఎవరన్నా ఇలా నోరెత్తగలిగారా? - ఎవడికి గుండెలున్నాయ్

    -ఎవరెల్లా మాట్లాడినా, మొత్తానికి అందరమూ చిట్టి స్వర్గానికి చేరుకున్నందుకు - సాదా స్వర్గం కాదు, పచ్చి వీరస్వర్గం - ఎంతో వాపోయినాము. మా విచారం చిట్టి పోయిందని కాదు. సరిగ్గా ఆ వేళకే - ఎప్పుడూ ఊళ్ళోనే ఉట్టి కట్టుకుని ఊరేగే బడుద్దాయిలం యావన్మందీ - ఏదో మునిగిపోయినట్లు - ఎవరమూ ఊళ్ళో లేకుండా పోయినందుకు, ఆ వైభవం కళ్ళారా చూసే భాగ్యం లేకపోయినందుకు..

    చిట్టి భౌతిక శరీర లేశానికి వీరాధి వీరోచిత మర్యాదలు జరిగినవి. త్రివర్ణ పతాకాన్ని కప్పి, కాంగ్రెసు వాలంటీర్లు, రెండోరకం నాయకులూ జయజయ నినాదాలతో బారులు తీరి ముందు నడవగా, చిట్టి పితృవనానికి పయనించింది. మంచిగంధపు ధూళిలో మలిగిపోయింది.

    ఈ మర్యాదలో మర్మం - మా ఊరి వారికి - అందులోనూ ఇంగితమున్న కొందరికి - కాని అర్థంకాదు. విన్నవాళ్ళూ - పత్రికలో చదివిన వాళ్ళూ - "ఇదేం విడ్డూరం? ఈ ఊళో కాంగ్రెసువారు కేమన్నా పిచ్చి ఎక్కిందా? లేకపోతే, పెద్దలను వెక్కిరించడానికా, ఈ తతంగమంతా. 

    లేకపోతే.. సామాన్యపు బజారీ పడుపుగత్తె కనుమూస్తే బ్రహ్మరథం పడతారా? " అనుకుంటూ విసుపోవచును అందులో అబ్బురం ఏమీలేదు. చిట్టి బ్రతుకు మా సీమదాటి ఎందరికి తెలుసు? - ఆ మనిషి మనసు ఎవరికి తెలుసును .

    పోనీ - ఇప్పుడన్నా, లోకం కనువిప్పడం మేలు.

    చిట్టి - ఏ తల్లి కడుపునో పుట్టింది. ఏ చెట్టునీడనో తినో మానో ఎలాగో పెరిగింది. పదేళ్లు వయసులో బొద్దుగా గున్నలాగా ఉండేది. సినీమాకు, ఆడవాళ్ళ గేటు దగ్గిర సమ్మరం చూచుకుని దూసుకుపోయేది. సినీమాలో విన్న పాటలూ - చూసిన ఆటలూ - కునికిపాట్లు పడుతూండే జట్కాబండి వాళ్ళ దగ్గిరపాడేది - ఆడేది. వాళ్ళు విసిరేసిన కానీ డబ్బులు పరికిణీ రొండిన దోపుకునేది. ఎవడి చెవిసందునుంచో ఓ బీడీ ఎగేసుకుపోయి, కమ్మగా దమ్ముకొట్టి ఎక్కడ నిద్రవస్తే అక్కడే పడుకునేది. చెట్టుమీద వాలే గువ్వపిల్లంత గోముగా, ఈ చెట్టుకింద పక్షి పెరిగింది.

    చిట్టికి ఎవరా పేరు ఎప్పుడు పెట్టారో, ఎవరా పేరుతో మునుముందుగా పిలిచారో తెలిసే దాఖలా ఏమీలేదు. కాని, ఓ రకంగా ఊహించడానికి కొంతవరకు వీలున్నది. అసహాయోద్యమ యోధులలో కొన్ని వర్గాలు కేవలం శాంతి సమరంమీద విసుగుపుట్టి - రైలు పట్టాలు లేవనెత్తడం, తంతితీగెలు తెంచడం ఇత్యాది సర్కస్ ప్రదర్శనానికి నడుంకట్టి దుమికిన రోజుల్లో - మా వూళ్ళో, ఉత్తరాదినుంచి వచ్చిన గారడివాడి ఆటలో, తొలుదొల్తగా  చిట్టి సాక్షాత్కరించింది. 

    వాడు, ఏదో లాగవం చేయడానికి - ఎవరన్నా ఓ కూన అవసరమై,  చుట్టూ మూగిన మూకలో ఏ పోరగాణ్ణి రమ్మన్నా రాకపోవడంతో - "పోనీ నీవు రా చిట్టి, నిన్నేం కొరుక్కు తిననులే!" అని, జనం మధ్య కుమ్మిసలాడుకుంటూ ఆట చూడటానికి ముందుకు నెట్టుకువస్తున్న ఈ ఏబ్రాసిని, వాడు వెక్కిరింతగా పిలవడంతో, చిట్టి ఆ సుముహూర్తాన రంగంలోకి నిర్భయంగా దూకి - వాడితోబాటు ఆడి, వాడిని ఆడించి ఆ పూటనుంచీ - చిట్టి మాదైపోయింది. అదే పేరైపోయింది.

    చిట్టి ఎవరు పిలిచినా పలికేది. అందరినీ కవ్వించి మాట్లాడేది. దాని మాటలో అదో పొంకం ఉంది. మాటకు మాటకూ మధ్య మౌనంగా పెదవి విరుపులో - ఆ కంటి చూపులో - ఏదో చెప్పరానంత నిండు ఉంది. చిట్టి అలవోకగా బూతులు మాట్లాడేస్తున్నా, ఎంత శోత్రియుడికైనా వినడానికి ఏమీ ఎబ్బెట్టు ఉండేది కాదు.

    చిట్టి అధిక చక్కంది. అదంతా అర్థంకాని అందం. ఎండా వానా అనకుండా, అహర్నిశలూ ఆగమ్మ కాకిలాగా తిరుగుతూ, అందిందల్లా తింటూ, ఏ జన్మానా, జుట్టుకు చమురూ, ఒంటికి నలుగూ లేని ఏబ్రాసి - లక్సు పరిమళ సబ్బుతో చర్మ సౌందర్యాన్ని రక్షించుకునే తారల గ్లేజు  బొమ్మలకన్న పోణెం  గా ఉండేది. పిల్లదాని పోషణ యావత్తు పంచప్రాణభూతాలు చేసేవి,  అని మా కందరికీ గట్టి నమ్మకం! వచ్చిన ఏడాది లోపలే చిట్టికి నిండుగా వయసు వచ్చేసింది. 


    వచ్చిన మరుక్షణంలోనే - ఎవరో , పొరుగూరు నుంచి బడి చదువుకోసం వచ్చిన ఓ కుర్రవాడి చెంప - నడి బజారులో నాలుగు రోడ్లు కలిపే రద్దీలో మెరుపు దీపం క్రింద చెళ్ళుమంది. అది ఎలా జరిగిందంటే -

    చిట్టి అప్పటి నుంచి, కొన్ని రోజులుగా, సంజపడిన తరువాత సరిగా అదే వేళకు, ఆ దీపం దగ్గరకు వచ్చి, ప్రొద్దుపోయేదాకా ఉండి కడుపు పట్టినంత, ముంత క్రింద పప్పు కొనుక్కు తినేది. అంటే, తిన్నదంతా కొనుక్కునేది అనకూడదు. కొన్నప్పుడల్లా కొన్నంత కొసరేయించుకునేది. చనువైనవాడు కొంటూంటే కలియబడి ఓ పట్టెడు కముచుకునేది - బేరం సాగినంత సేపూ ఇలాగే బొక్కుతూ, చివరకు

    వాడు జంగిడి ఎత్తేవేళకు - మిగిలిన అడుగూ బొడుగూ దులిపించుకుని - కారం చేయి, పక్కనున్న స్తంభానికి వేసి పామి - ఓ గుక్కెడు నీళ్ళు తాగి, చక్కా బోయేది.

    అవాళా అలాగే పోతూంటే - అందుకోసమే కాపేసుకుని ఉన్న కుర్రవాడు చాలా దూరం వెన్నంటి వెళ్ళి - అడుగు కలిపి అడుగువేసి - పలుకరించబోయినట్లు గొంతు తడబడి అందుబాటులో ఉన్న చెయ్యి పుచ్చుకున్నాడు. చిట్టి నదురూ బెదురూ లేకుండా - తెరిపిగా ఉన్న చేత్తో, వాడి చెంప మోగించింది. దెబ్బతో, వాడు పాపం గింగిరాలెత్తిపోయి - ఓ పొల్లుకేక పెట్టి, రోడ్డు పుచ్చుకున్నాడు.

    రాత్రి ఇలా జరిగిందని చిట్టి, తెల్లవారగానే ఎవరితోనో చెప్పింది. నిమిషంలో ఆ కథ ఊరు మొత్తంమీద గుప్ మన్నది. చిట్టికి వయసు వచ్చిందని అందరికీ అర్ధం అయింది.

    ఊరు యావత్తూ విస్తుపోయిందంటే అబ్బురం ఏమీలేదు. అన్నాళ్ళనుంచీ చిట్టి, అలా వాళ్ళ నడుమను పెరుగుతున్నా. అంత ఏపుగా కనబడుతూన్నా - చిట్టి వయసు వచ్చిన పిల్లది అనే భావనగాని - దాన్ని చూసి మరులెత్తించుకోవాలనిగాని - ఎందుచేతనో జనాభాలో ఏ ఒక్కడికీ తోచినట్టులేదు.

    ఆ క్షణాన్నుంచి ఎవడికివాడే చిట్టిని చూస్తే బెదిరిపోవడం మొదలు పెట్టాడు. చిట్టి మాత్రం ఏమీ మారిపోలేదు. చుట్టూ మెలిగే లోకం మాత్రం విచ్చిపోయింది.

    బెదురు ఎందుకంటే ఆ చిన్నది చేయి చేసుకుంటుందని కాదు. అది భయం కూడా కాదేమో - ఎవరి మానాన వాడు తానంత యంబ్రహ్మ నేమో అని కించపడి ఉంటాడు. ఇంకోఫికరు కూడా ప్రతివాడికి ఉండి ఉంటుంది. చిట్టి ఎంతమాత్రమూ చాటూ మాటూ లేనిపిల్ల. ఇదివరకైతే ఆ చొరవ అందరికీ సరదా. ఇప్పుడు, మునుపటి ధోరణిలోనే పలుకరిస్తే - చిట్టి ఏమనుకున్నా అనుకోకపోయినా, చూసే మరో మగరాయడు అసూయతో అయినా, అపార్థం చేసుకుంటాడు.

    చిట్టి కనబడ్డ ప్రతి మనిషితోనూ, రాత్రి జరిగిన ముచ్చట చిలవలు పలవలు లేకుండా చెప్పింది. ఎంత పనిమీద పోయే పెద్దమనిషినైనా, నిలవేసి చెప్పింది. కోర్టుకు వేళ మించిందని ఉరుకులు పరుగులుగా జట్కా ఉరికించే లాయర్లను నిలవేసి చెప్పింది. తప్పించుకుపోయేవాళ్ళని తరుముకు వెళ్ళి, చేయి పట్టుకుని జబర్దస్తీగా ఆపి చెప్పింది. ఓపికున్నంతవరకూ, ఒక్కొక్కడికే చెప్పి... ఎంతసేపటికీ తెమలక పోతే చిరాకుపడి పీచుమిఠాయి అమ్మే సాయెబ్ చేతిలో బాకా లాక్కుని, నాలుగు దిక్కులూ దద్దరిల్లేట్లు చెప్పింది.

    జరిగిందేదో చెప్పిందే కాని, అవతల కుర్రవాణ్ణి తుట్టలేదు - తిమ్మలేదు. జాలిగా, విసుగ్గా, కసురుకుంటూన్నట్టు తనలో తాను గొంతెత్తి అనుకుంది. “వాడేం మొగాడు!- చెయ్యట్టుకున్నాడు!"

    ఆ కథ అంతటితో పోలేదు. ఆ కుర్రవాడెవరో మాకెవరికీ ఈనాటికీ తెలియదు. చిట్టికీ తెలియదు. కాని అహోరాత్రాలు అదే చూపుగా తిరిగి, ఎక్కడో మొత్తానికి పట్టుకుంది. పట్టుకుని, వాడు కోరుకున్న సుఖం బలవంతం చేసి దక్కించింది.

    ఈ చోద్యం తనంత తాను చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది. దోవ వెంబడి, పురివిప్పిన బుక్కా పావురం మల్లే చిట్టి ఏదో బరువెత్తి దించిన తేలికతో, నడిచిపోతూ - చంకనున్న పాపణ్ణి  ఆడించుకుంటూ గుమ్మంలో నిలుచున్న ఏ ఇల్లాలితోనో, ముచ్చటంతా చెప్పేసిందట!

    _ “మగవాడంటే ఎలాటి గండో అనుకున్నానమ్మా, ఆస్తమానం పసిపాపే!- కడు పెరిగి ఉంగపట్టాలి. లేకపోతే జాతి జాతి ఆకలితో అటమటించి పోతుంది!" ఇంత నీతి చెప్పిందట!

    చిట్టి ఈ మాటమీదే బ్రతికింది ఇన్నాళ్ళూ!

    లోకం చిట్టిని ఏనాడూ వెర్రిదానికింద జమకట్టలేదు. వ్యభిచార నిర్మూలన చట్టం అమలుపరచే శాఖలో జమాశెట్టి లెవరూ, చిట్టి విషయంలో అలాటి పాపం ఎన్నడూ తలచలేదు. చిట్టి ఏం చేసినా, ఏమన్నా మాకెన్నడూ ఓగు అనిపించలేదు. అలా బ్రతికింది.

    తాను బ్రతకడం కాదు, లోకాన్ని బ్రతికించింది.

    ఊరేగే దేముడికన్నా ఊరి రోడ్లవెంట విచ్చలవిడిగా తిరిగే చిట్టికి బుద్ధి ఉన్న ప్రతివాడూ మనసులో ఎందుకు మ్రొక్కుతాడో మేం చెపితేకాని లోకానికి తెలియదు.

    యుద్ధం ముమ్మరంగా ఉన్నరోజుల్లో కదలే పటాలం విడిసే పటాలంగా మా ఊరు, పవలూ రాత్రీ మేలుకునే ఉండేది. దండు స్టేషనులో దిగగానే - అందుకైనా అధికారులు వాళ్ళకి లెక్క ప్రకారం అన్నపానీయాలకు మటుకు ఏర్పాటుచేసి, తరువాత వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేవాళ్ళు. మా ఊళ్ళో.... మహానగరానికి అనువైన కశ్మలం తొక్కిడీ మటుకే కాని, సదుపాయాలు మాత్రం సున్న. కొమ్ములు తిరిగిన కొన్ని నగరాల్లో... ప్రపంచ సంగ్రామంలో ప్రాణాలు అర్పించటానికి... పొట్ట చేత్తో పుచ్చుకుని సన్నద్ధులైన  వీరులకోసం, ఎడనెడ చీకటి విడుదులు అధికారులు ఏర్పాటు చేసిన వైనం గ్రంథస్థం కాకపోయినా... అభిజ్ఞవర్గానికి  ఆ విషయం కరతలా మలకమే.

    మా ఊళ్ళోమటుకు, దిగిన ఆసాములు ఆదమరవడానికి అలాటి సదుపాయం లేకపోవడంతో... సంజె పడగానే పారువేటకు తండాలు తండాలుగా బయలుదేరిన యోధులు. చీకటిలోనో గుయ్యారంలోనో ఆబకు అడుగువేసి... అడుగులోనే పడకవేసి... తరువాత ఏమైపోయేవాళ్ళో దైవానికి ఎరుక! ఒళ్ళు విరుచుకు వచ్చిన పటాలం మళ్ళీ తరలే వేళకు చచ్చి సగమైనంత హీనంగా, ముప్పాతిక మువ్వీసం జబ్బు పెట్టెలో పడిసాగిపోయేది. 

    ఇది, అందరికీ తెలుసు! కాని ఎవరేం చేస్తారు? అధికారులు మట్టుకు ఎన్నింటికని దేవుల్లాడుతారు?

    ఎవరికీ తరంకాని ఘనకార్యం చిట్టి సాధించింది. క్రొత్తలో, పటాలాలు దిగుమతి అవుతున్న రోజుల్లో, ఆ ఊరా నీలివార్తలు కోటాను కోట్లు పుట్టుకు వచ్చినవి. ఆ రవ్వంత సుకానికి, ఆడమొగాలకూ మొగం వాచిపోయిన మూక... ఏమరుపాటున ఆడదంటూ కంటబడితే ఊరికే పోనివ్వడం లేదనీ, అక్కడా అక్కడా వాళ్ళ అఘాయిత్యం మూలంగా ఎన్నో ప్రాణాలు కడకట్టిపోయినాయనీ... మొరాయించిన కొన్ని జీవాలు రూపులేకుండా పోయినాయనీ...... ఇంత గగ్గోలుగా ఉంది. 

    ప్రతి ఆడగుండె పీచు పీచుమనే రోజులవి.

    సరిగ్గా ఆ తరుణంలోనే - చిట్టి మాయమైంది. ఇకనేముంది. వాళ్ళెవళ్ళో ఎగరేసుకు పోయినారనుకున్నాం. నేడో రేపో, ఆ కళేబరం ఏకంచెలోనో ఏ కాలువగట్టు నో దొరుకుతుందనుకున్నాం. చిట్టి అంత దారుణంగా అవతారం చాలించిందనుకున్నాం.

    కాని, అలా జరగలేదు. చిట్టి మల్లెపూవల్లే మళ్ళీ వాళ్ళ నడుమకు వచ్చింది. “ఇన్నాళ్ళూ ఏమైపోయినావ్ చిట్టి!"అని ఊరు ఊరూ ఏక గొంతున ఆడిగింది. తాను ఏమైపోయిందో ఏం చేసిందో అరమరిక లేకుండా చెప్పింది చిట్టి.

    ఏనుగులల్లే బండి దిగిన ఎందరో పడుచువాళ్ళు... తెలతెలవారేసరికి, ఎవళ్ళో మోసుకెళ్లి బండిలో పడవేయవలసిన స్థితికి రావడం.......... చిట్టి చూసింది. దీనికి మందేమిటా అని ఆలోచించింది. అడుగు ముందుకు వేసింది.

    అటూ ఇటూ మళ్ళీ మనుష్యులని అటకాయించింది. బ్రతిమాలింది. దేశం కోసం బ్రతకమంది. యుద్ధంలో నెగ్గి సీమ చల్లబడితే....... ఏ చిన్నదాన్నో ఏలుకుని పిల్లా పాప ఎత్తవలసిన మనిషివి... నీకు ఇంతలో ఈ బుద్ది ఏమిటంది. నీవు బొమికల బొమ్మవైపోతే, కన్నతల్లి కడుపు చేటుకదా అంది. నా మాట విను అన్నా అంది. వినని మొండి ఎవరన్నా ఉంటే....... నాకు రూకలొద్దు  కోకలొద్దు  నన్నేలుకో... నీ మనసంతా తీర్చుకో అంది.........

    నదరుగానో, బెదరుగానో.......... ఎవడినీ త్రోవ తొక్కనీయకుండా అడ్డు పడింది.

    "అందరూ నీ మాటలు విని నీతిమంతులైనా రంటావా?" అని ఎవడో అక్కసుగా అడిగాడు.

     మా అందరి మనసుల్లోనూ కొరకొరలాడుతూంది ఆ ప్రశ్నే. 

    మాతో కలసిమెలసి-మా కోసం పెరిగిన చిట్టి ఎవళ్ళ ఊరూ పేరూ లేని వాళ్ళ ముందు, తన వయసంతా వలకబోస్తుందా? బావురుమంటూ వచ్చినవాడు - ఇది బ్రతిమాలితే - అన్నా అంటే అట్టె మారిపోయి, మడిగట్టుకుంటాడా? ఎదుటున్న సిద్ధాన్నం చెడగొట్టుకుంటాడా?

    “నీతిమంతులంటే ఏమిటం” ది చిట్టి! 

    “నీతి ఉన్నవాళ్ళు!" 

    “నీతి అంటే?"

    ఏం చెప్పాలో ఎవరికీ చేతకాలేదు. కాని, చిట్టిని అదుపులో పెట్టడం ఎలా? - నీవు చేసింది అంత మంచిపనికాదని నచ్చచెప్పడం ఎలా?

    "నీ ఒక్కదానివల్లా ఏమౌతుంది?" అని అడిగామనుకో - అది అంతకన్నా మరో పెద్దతంటా అవుతుంది. “నా ఒక్కతెవల్లా కాకపోతే - నలుగురు మంచి ఏపైన వాళ్ళను సాయం రమ్మంటాలే! - 

    అంటే? - ఇంటింటికి పోయి, కంటికి ఆనిన పడుచునల్లా నిలవేసి, "నీవిలా గోళ్ళు గిల్లుకుంటూ కూచోకపోతే, నాతోబాటు బయలుదేరరాదూ?- ఆ ఒళ్ళంతా ఏం చేసుకుంటావ్?- కదులు!" ఇలా పచ్చి పచ్చిగా రెచ్చగొడితే - ఆపడానికి బ్రహ్మతరమా?. అందుకని - డూడూ బసవన్నలమై చెప్పిందంతా విని గ్రుడ్లనీళ్ళు కక్కుకుని ఊరుకున్నాం..

    చిట్టికి ఎక్కడెక్కడనుంచో ఉత్తరాలు వచ్చేవి - ఎన్నెన్నో బంగీలు వచ్చేవి - నగదు వచ్చేది - కాని, ఏం వచ్చినా చిట్టి ఏం చేసుకుంటుంది? ఏది వచ్చినా, వచ్చింది వచ్చినట్టుగానే కంటబడ్డవాళ్లకల్లా పంచిపెట్టేది. ఎవరన్నా తీయించుకున్న బొమ్మలు పంపితే - అవి అందరికీ చూపిస్తూ ఆ పడుచువాడికీ తనకూ ములాఖత్ - ఏం మాట్లాడుకున్నారో - ఎలా నవ్వుకున్నారో వాడెందుకు సిగ్గుపడ్డాడో - ఏం ఒట్టేసుకున్నాడో అన్నీ పూసగుచ్చినట్టు చెప్పేది.

    యుద్ధం  ఉన్నన్నాళ్ళూ చిట్టికి తపాలు బట్వాడా చేయడం పోస్టువాళ్ళకు నిత్యమూ గండకత్తెరే - చిట్టికి ఫలానా చిరునామా అంటూ ఎక్కడుందీ? వచ్చిన సరంజామా అంతా - అందరు పోస్టు జవాన్లూ పంచుకుని - ఏ మూల ఎదురుపడితే అక్కడ అందిచ్చేవాళ్ళు. 

    వ్రాత ఏమన్నా ఉంటే, ఎవడిచేతన్నాచదివిస్తుంది. 

    చదివి నందుకు వాడికి, చేతనున్న వాటిలో దండిగా ఇస్తుంది. పగలల్లా పేట పేటకూ ఏదో సంబరం కాసేపు!

    చిట్టి, అటు యుద్ధానికి - ఇటు ఈ ఊరికీ పుష్కలంగా సాయంచేసింది.

    ఇంత చేసినందుకు - ప్రభుత్వం చిట్టి చేసిన మేలు మరచిపోలేదు. చిట్టితో మంతనాలాడిన పడుచువాళ్ళు అధికార్లతో ఏమేం చెప్పారో, చిట్టి చేసిన మేలు ఎలా వివరించారో, ఏమోగాని మొత్తానికి, మిలిటరీ అధికారులు గూడుపుఠానీ చేసి ప్రభుత్వానికి కనుసన్న చేశారు.

    ప్రభుత్వం - చిట్టి అఖండ సేవకు సన్మానంగా, సేవాపతకాన్ని బహూకరించింది.

    ప్రభుత్వం తలపెట్టిన తతంగం అంటే - ఎన్ని యోజనాల ఎర్రటేపుతోనో కూడిన పని. దానికి బ్రహ్మాండమైన ఈషత్- బహిరంగసభ - జిల్లా అధికారి రావడం, లెక్చర్ చదవడం - ఇత్యాది కామాటం లక్షంత.

    ఆనాడు చిట్టిని సభకు బ్రతిమాలి తీసుకురావడం - వచ్చిందాన్ని ఒకచోట కూర్చోపెట్టడం బ్రహ్మప్రళయం అయింది. పతకం ఇచ్చారు - పుచ్చుకుంది -సభ యావత్తూ  అమ్మయ్య! అనుకుంది.

    కాని, అంతలోనే చిట్టి అందుకున్న పతకాన్ని అగ్రాసనం పక్క ఆసనంలో కూర్చున్న అధికారి పెళ్ళాం ఒళ్ళోకి విసిరేసి- "పిల్లది అల్లా బోసిగా ఉందేం? చెరిపి చేయించి పెట్టండి!." అని ఒడిలో ఉన్న పాప బుగ్గలు పుణికి, మళ్ళీ రోడ్డు పుచ్చుకుంది.

    చిట్టిని అదమాయించడానికి ఎవరి తరం? ఇలాటి రవంత అభాసు జరగడం మూలాన్నే పతక బహూకరణ విషయం ఏ పత్రికలోనూ పడలేదు.

    ఇలా బ్రతికింది చిట్టి. ఇంత ఘనంగానూ వెళ్లిపోయింది.

    -చిట్టికి ఏం జబ్బో ఎవరికీ తెలియదు. ఎవరూ మందివ్వలేదు. పోయినదన్నారు. 

    బొమ్మనెవరూ చూడకూడదు. అది... చిట్టి ఆఖరి కోరిక అన్నారు.

    అన్నారంటే... మరెవరో కాదు, సినోరా సీతాయ్. 

    సీతాయ్ భవనం నుంచే ఉత్సవంగా ఊరేగించారు. నాయకులు ముందు నడిచారు. 

    ఇల్లాటి విషయాల్లో సీతాయ్ మాట, మా కాంగ్రెస్ సంస్థ ఔదల ధరిస్తుంది.

    ఎవరి మొగానా కత్తివేటుకైనా నెత్తురు లేదట ఆనాడు.

    "జర్మనీవారు వచ్చి దేశం ఆక్రమించుకుని ఏదన్నా భీభత్సం చేసే అవకాశం ఉంది గనుక.... ప్రజలుయావన్మందీ, మాన ధన ప్రాణ రక్షణకు ఏ మారుమూలకేనా పోవలసిందోహా!" అని ప్రభుత్వం ఘార్ణిల్లినప్పుడైనా.... విశాఖపట్టణం, కాకినాడ గ్రామాలమీద జపానులో తయారైన బాంబులు రాలినప్పుడైనా.... బ్లిట్జ్ అవిచ్చిన్నంగా సాగితే..... ఇంగ్లాండు ద్వీపం ఇరవై నాలుగు గంటల్లో ఆనవాలు

    లేకుండాపోయే అవకాశం ఉందని తోచినప్పుడన్నా.... ఎవరికీ; అంటే మాలో యెవరికీ ఇంత దుఃఖం రాలేదు.

     ఆకాశంక్రింద బ్రతికిన చిట్టి......చివరకు ఇలా ఎందుకు అయిపోయింది? ఏనుగులు, చివరి ఘడియలు వచ్చినాయని పసిగట్టినప్పుడు....... ఒంటరిగా..... ఎక్కడికోపోయి; కూలిపోతాయంటారు కాదూ?........ ఈ దిగ్గజమూ అంతే చేసిందా?..... చిట్టి రాలిపోయిందా.........

    అన్ని గుండెలూ తరుక్కుపోయినాయ్...... కాని, ఎందుకో సీతాయ్ ఒక్కతె మాత్రం చెక్కుచెదరకుండా చిరునవ్వుతోనే ఉందట - అందరికీ ముందు నడిచిందట. 

    ఏమిటా నవ్వు? - అని ఎవరడుగుతారు - సీతాయ్ని?

    సీతాయ్ అంటే - మీకు అసలు తెలియదు. అదో పెద్దబాలశిక్ష.

    (1953).


    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    21 min
  • వాకాటి పాండురంగరావు గారి 'మందీ - మరొక్కడు'

    హర్షణీయంలో వినబోయే కథ పేరు 'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి రచన. ఈ కథను అందించడానికి అనుమతినిచ్చిన అపరాజిత గారికి కృతజ్ఞతలు.

    సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో  జన్మించారు. ఆయన  ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు.  విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.

    పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.

    "కథ చెయ్యాల్సిన పని వర్తమానం నించి భవిష్యత్తు గా మారే, పరిణామ క్షణాన్ని (that fleeting moment) , పట్టుకునేందుకు ప్రయత్నించడం. దానికుండే పరికరాలు , similes, metaphors, images, magic realism మొదలైనవి.. అనుకూలమయిన వాటిని ఎన్నుకుని వాడడం లో రచయిత ప్రత్యేకత ప్రతిభ వెల్లడవుతుంది" - శ్రీ. మధురాంతకం నరేంద్ర



    'మందీ - మరొక్కడు' వాకాటి పాండురంగరావు గారి 'అపరాజిత' అనే కథాసంపుటిలోనిది.

    ఈ కథ రాసింది, 1964-65 మధ్య కాలంలో. అవి, మధ్యతరగతి కుటుంబాలు , వ్యవసాయాధారిత జీవనాన్ని వదిలేసి, ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలి వెళ్లడం అనే మార్పు మొదలైన రోజులు.

    కథలో ముఖ్య పాత్రధారి వేణుగోపాల్. అతని 'ఐడెంటిటీ క్రైసిస్' ఈ కథలో ముఖ్యాంశం.

    అతను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగి. వేణుగోపాల్ ఇబ్బందులు , ఆఫీస్ కు వెళ్ళడానికి బస్సు కోసం క్యూ లో నిలబడ్డప్పుడు మొదలౌతాయి. బస్సుల నిండా జనాలే. రెండు బస్సులు అసలు స్టాప్ లో ఆగకుండా వెళ్లిపోతాయి. మూడో బస్సు ఆగినా అతను ఎక్కేలోపల, బస్సు నిండిపోయి వెళ్ళిపోతుంది.

    ఈ గోలలో సగం చచ్చి ఆఫీసు కు వెడితే, అక్కడ ఆఫీసులో తోటి ఉద్యోగుల ప్రవర్తన విసుగు పుట్టిస్తుంది. బాస్ రూంలోకి వెళ్తే , ఆయన మాటల్తో తను ఒక మనిషిని కాదేమో అన్న అనుమానం కలగచేస్తాడు వేణుగోపాల్ కి.

    సాయంత్రం ఇంటికి వెళ్లబోయే ముందర అవసరార్థం ఏదో ఒక షాపు లో అడుగుపెడితే, అక్కడి అనుభవం అతని ఇబ్బందిని తీవ్ర తరం చేస్తుంది.

    అక్కడ్నించీ ఇంటికి వెళ్లే లోపల , అతనికి సాంత్వన ఎలా లభిస్తుంది అని వివరిస్తూ కథను చక్కగా ముగిస్తారు రచయిత.

    ఒక సాధారణమైన జీవితం గడిపే మనిషి రోజూ వారీ అనుభవం నించి కథను సృష్టించారు రచయిత. ఈ క్రమంలో తను చెప్పదలుచుకున్న విషయాన్ని మనకు స్పష్టంగా అవగతం అయ్యేలా చేస్తారు.

    కథలో ముఖ్య పాత్రధారి మానసిక స్థితిని క్రమంగా గట్టిపడే బంకమన్ను తో పోలుస్తారు రచయిత.

    పాండురంగరావు గారు ఈ కథగురించి మాట్లాడుతూ -

    "మన నాగరికత విస్తరించిన కొద్దీ వ్య క్తిగా మానవుడు సంకుచించుకు పోతున్నాడు. ఇంకా మన దేశంలో ఈ “మంది” తనం అన్న భూతం నూటికి నూరుపాళ్ళూ విస్తరించలేదు గాని, దాని లక్షణాలు మాత్రం స్పష్టంగా అగుపడుతూనే ఉన్నాయి." అన్నారు.

    అరవై ఐదు ఏళ్ల క్రితం ఈ కథ రాస్తూ , రాబోయే కాలంలో సమాజంలో వచ్చే మార్పు ను గురించి ముందుగానే సూచించారు పాండురంగరావు గారు.


    కథ:

    “తీరప్ప రం రం , తీరప్ప రం రం “


    అన్న స్వీయ కృతిలోని ఒక్కొక్క చరణాన్నీ ఒక్కో స్థాయిలో పాడుతూ తలదువ్వుకుంటున్నాడు వేణుగోపాలం.


    హఠాత్తుగా పాట ఆపి వంటింట్లోకి పరుగెత్తాడు. “లలితా !" 


    పూజ చేసుకుంటున్న లలిత ఇటు తిరిగింది. 


    “ఇటురా : ఒక నిమిషం.... అర్జెంటు...."'అయిదు నిముషాలయింది. ఆమె వచ్చింది.


    అతడి కళ్ళల్లోని వెలుగు చూచింది. ఇందాకటి సంగీతం కూడా విన్నది మరి. 


    “ఏవిఁటి” అని అడిగింది నోరు తెరవక నే.


    “సువార్త. సుందరీ | సువార్త! ఇవాళ నీ నాధుడి చేతికి రెండు వందలా నలభై రూపాయ లొస్తాయి."


    “ఎక్కడి నుండి !"


    “మహా ఘనత వహించిన సర్కారు వారినుండి ! వారు మన ఇంక్రిమెంటు ఇవ్వకుండా రెండేళ్ళు నిద్దరోయి, ఈ మధ్య మేలు కున్నారు."


    "ఓహో!"


    “అంచేత ఈ సుమూహూర్తాన నేను నీకు ఏదయినా కొని పెట్టదలచుకున్నాను. ఏం కావాలి కోరుకో !" అని గర్వంగా, భక్తుడి ఎదుట ప్రత్యక్షమయిన మహావిష్ణువులా అడిగాడు వేణు.


     ఆవిధంగా అతడు అడగగలిగిన అవకాశాలు వాళ్ళ జీవితాలలో ఎన్నో రాలేదు.


    తన భర్తమీద జీవితం చల్లని చూపు చూడలేదని - ఎందరో భార్యల్లాగే లలిత కూడా నమ్మేది.


    ఇప్పు డతడి చూపులో, మాటలో చిందుతున్న సంతోషం ఆమె గమనించింది. నచ్చిన బొమ్మతో ఆడుకుంటున్న బిడ్డను చూచిన తల్లిలా నిండిపోయింది ఆమె మనసు.


    ““ఊ • కోరుకో ! ఒక జత బంగారు గాజులు • ధర్మవరం పట్టుచీర • మహాబలిపురం యాత్ర - ఏది కావాలో కోరుకో."


    “నా కేమీ వద్దండీ • చింతా చికాకూ లేకుండా, హాయిగా నవ్వుతున్న మీరే నాకు అన్ని 


    బహుమతులూను."


    "వ్రత రత్నాకరం చదవడం మానేయి." 


    “నిజంగానే నాకేమీ వద్దు “


    “అట్లా కాదు.. నేను ఏదో ఒకటి కొన దలచుకున్నాను నీకు."


     “అయితే మీ ఇష్టం - మీకేది నచ్చితే అది తీసుకురండి."


    “అదుగో ఆ మాటంటేనే నాకు మండుకొస్తుంది. నిన్నొక మనిషిగా పిలిచి ఏమికావాలని అడుగుతున్నానా ! నీ ఇష్టానిష్టాలు తెలుపకుండా నా ఇష్ట ప్రకారం కొనమంటా వేం ? నీకు మనసు లేదూ!


    నీ కొక అభిప్రాయం ఉండదూ ? నువ్వొక వ్యక్తివి కావూ ! అన్నీ నాకు వదిలేస్తే ఏమిటని నీ అర్ధం ..... నువ్వు ఒక మనిషివి. నా నీడవు కావు. అది తెలుసుకో." అని గబ గబా బట్టలు మార్చుకో సాగాడు వేణుగోపాలం.


    “ఏమిటో బాబూ . నాకేమీ తెలియదు." అంటూ వడ్డనకుపక్రమించింది లలిత.


    భోజనం ముగించి బయటపడి  తొమ్మిదిన్నరకు బస్టాండ్ లో విల్చుని ఉన్నాడు. వేణుగోపాలం,  డెబ్బై తొమ్మిదిమంది గల 'క్యూ'లో డెబ్బయిఆరవ వాడుగా.


    పది అయింది. మూడు బస్సులు రావడం, వాటిలో రెండు ఆగక పోవడం, ఆగిన ఒకదానికోసం 'క్యూ' చచ్చి బ్రతకడం - అన్నీ జరిగాయి.


    నాలుగవ బస్సు వచ్చి సగం జనం తగ్గేసరికి పదీ పది అయింది. వేణు ఆఫీసు పదింబావుకు మొదలవుతుంది.


    ఆఫీసుకు వెళ్ళి చెక్కు అందుకుని బ్యాంకికి పంపాలి. ఆ వేళ శనివారం. పన్నెండు దాటితే బ్యాంకు వాళ్ళు డబ్బులివ్వరు. ఇవాళ ఆ డబ్బు లందకపోతే చాలా ఘోరంగా ఉంటుంది. నిప్పులమీద నిల్చున్న వాడిలా చిందులు తొక్కాడు వేణుగోపాలం. 


    తన ప్రక్క నున్న, సూటు వేసుకున్న బట్టతలాయనతో అంతవరకూ సైప్రసు వ్యవహారమూ అదీ మాట్లాడిన వాడల్లా ఢామ్మని విషయం మార్చేసి “చీ ! వెధవ దిస్సులూ, వెధవ జనమూ.... కారు గనుక ఉంటే ఈ చండాలమంతా లేదు. అనుకున్న చోటికి, అనుకున్న వేళకు వెళ్ళి పోవచ్చు." అన్నాడు వేణు.


    సూ. వే. దిట్టతలాయన ఒకసారి తలమీది చర్మాన్ని రుమా లుతో తుడుచుకుని “ప్చ్ ” అన్నారు. 


    “అంటే ఏవిఁటని మీ ఉద్దేశం" అని కళ్ళతో అన్నాడు-ఖాళీగా వెళ్ళిపోతున్న టాక్సీని పిలవడానికి డబ్బుల్లేని వేణుగోపాలం.


    ఆ టాక్సీని గమనించని సూ. వే. బ . త. చెప్పసాగారు - “అబ్బే, కారులున్నా లాభం లేదండీ ! నాకు చూడండి. ఒకటికి రెండు కార్లున్నాయి. కాని ఏం లాభం..... ఒకటేమో  మాఆవిడ తీసుకువెళ్తుంది. ఇహ రెండోది నాది. దానిని మా అబ్బాయి తీసుకు వెళ్ళి లారీకి గుద్దించాడు. అంచేత ఇదిగో ఇక్కడ 'క్యూ'లో ఏడుస్తున్నాను .... గనుక కారుల విషయంలో మీ నమ్మకం ఉత్త భ్రమ మాత్రమే అని చెప్పగలను .... కారు ఉంటే హాయిగా, జోరుగా, ఉషారుగా వెళ్లి పోవచ్చనికదూ అన్నారు... అది చాలా పెద్ద అచ్చు పొరబాటు. కారు అంటూ ఉంటే మీ ఒక్కరికే ఉండదుగా అడ్డమైన వాళ్ళందరికీ ఉంటాయి కార్లు. ఆ తర్వాత మరి కార్లు నడవ డానికి రోడ్లు. కావాలి--- రోడ్లు ఆ రోడ్లమీద అడ్డదిడ్డంగా సవాలక్ష కార్లు. ట్రక్కలు, దిస్సులు, సైకిళ్ళు, మనుష్యులు వీటన్నిటిని మించి ఎర్ర దీపాలు ఉంటాయి. చూశారు. అందుకని కారున్నాసరే ఈ తొక్కిడి, ఈ జనమూ ఇంకో విధంగా అనుభవించక తప్పదు." అని చాలా వివరంగానే చెప్పారాయన.


    అవును. ఇది నిజంలాగే ఉంది అనుకుని తల వూచాడు వేణు. 


    కాని లోలోపల ఎక్కడో ఏదో బంకమట్టి ముద్దలా ఉన్న ట్లనిపించింది.


    ఇంతలో ఒక వింత విషయం జరిగింది. ఒక ఖాళీ బస్సు వచ్చింది. ఆ 'క్యూ' ని మింగసాగింది. 


    హాల్లో పంకా తిరుగుతూంది. కిటికీ ప్రక్కగా కూర్చున్న వేణుగోపాలానికి పంకాతో అవ సరం లేదు. కాని దాని గాలి అతడి టేబిలు మీదికి రాక మానదు ! ఆ  కాగితాలని రెచ్చగొట్టక మానదు. ఇంచక్కా కిటికీ లోంచి గాలి వస్తూంటే పంకా ఎందుకు వేసుకోవాలో తెలీదు  వేణుగోపా లానికి. 


    ఆ మాటే మునుపోసారి  చెబితే ఆ గుర్నాధమూ, వేలుమణీ పోట్లాట కొచ్చారు.


     “చెమటతో తడిసి చస్తున్నాం మేము. ఇది ఆఫీసు పంకా. దీన్ని ఆపమనడానికి నువ్వెవరు - పంకా అక్కర్లేక పోతే వెళ్ళి వరండాలో కూచో." అన్నారు. 


    ఏమిటో అవతలి వారు ఒక మనిషని గమనించరు కదా !


    గడియారం టంగుమని పలికింది. పదకొండున్నరయింది. ప్యూన్ రజాక్ ని బ్యాంకికి పంపి అరగంటయింది. వాడింకో గంటలో వస్తాడేమో తన డబ్బుతో


    “వేణుగోపాల్ గారూ !”


    స్టెనో  గొంతు విని అదిరి పడి లేచాడు ఆ పేరు గలవాడు. స్టెనో పిలవడమంటే పెద్ద దొర గారు పిలుస్తున్నారన్నమాట.


    వెళ్ళి పెద్ద దొర గదిలో నిల్చున్నాడు వేణుగోపాలం. విశాలమైన మంచంలాంటి టేబిల్ కొకమూలగా, గోడనంటి పెట్టుకుని, భయ భక్తులతో నిల్చుని ఉన్నాడు. దంతం రంగు టెలిఫోను, గాజుపలక మీద పార్కర్  పెన్నులు రెండు, రంగు పెన్సిలు, చిన్న తెల్లకాగితాల పుస్తకం, ముచ్చటయిన పేపర్ వెయిట్ లు నాలుగు, రెండు ట్రేలు, ఆష్ ట్రే - గల ఆ టేబిలు ఉపరితలం ఇంకేదో లోకానికి అద్దం పట్టినట్లుంది .. తాను లోపలికి రావడం గమనించకుండానే గ్రహించిన దొరగారు తన వైపు చూడకుండా, ఎదుట ఉన్న ఫైలుని, చూస్తూ పైపు  పీలుస్తూ మధ్యమధ్య కళ్ళు మూస్తూ, మళ్ళీ తెరుస్తూ. పొగ విడుస్తూ ఉంటే - వారి దృష్టిలో తనొక మనిషా. లేక ఆ గదిలో ఉన్న వస్తువులలో ఒకటా అన్న సంశయం వచ్చింది వేణు గోపాలానికి.


    ఆ సంశయం ఆట్టేకాలం బతక లేదు. “ఇదిగో చూడూ ! నువ్వు ఏమిటి ?."


    లేచినించోలేక మట్టి లో పడి పొర్లాడుతున్న వాడిని ఇనుప బూట్లతో రాచడం  మొదలయింది.


    ఆ గొంతే మళ్ళీ పలికింది. “నువ్వు గుమాస్తావి....." నువ్వు పెద్ద యంత్రంలో ఎక్కడో చాలా చిన్న మరవి. మహారణ్యంలో లేత ఆకువి. సాహిత్యంలో 'కామా' గుర్తువి. మహా సముద్రంలో ‘నీటి బొట్టువి'. పది వేల లక్షల కోట్లలో ఒక అంకెవి.


     “నువ్వు గుమాస్తావి. అంతే కాని డైరెక్టరువి కావు .... బహుశా అయ్యే ప్రమాదం కూడా లేదు ...."


    నవ్వు .


    రాక్షసుడి కోరల్లాటి, గుండెల్లోని విషపు ముల్లులాటి, బట్టల్లేని వాడి మీద జీరోడిగ్రీ చలిగాలి లాటి నవ్వు.


    "అందుచేత ఆ 'రూల్'ని 'ఫ్లాగ్' చేసి కాగితం అక్కడపెడితే నిర్ణ యం ఏదో నేను తీసుకోగలను."


    అసలు విషయపు తల, తోక ఇపుడే గ్రహించిన వేణు గోపాలం పలికాడు . “ఈ వెవింగ్ కాలేజీలలో చదువుతామనేవారికి సాధారణంగా పర్మిషన్  ఇవ్వమనే 'రూల్' ఉంటుందండి.... అలాగే ఇస్తున్నామండి .... ఫైలు రెండుసార్లు తిరగడం ఎందుకని ఒక్క సారే 'డ్రాఫ్ట్'. కూడా పెట్టేశానండి" అని వివరించాడు.


    “అదే చేయవద్దన్నది. నేను వీడికి 'పర్మిషన్' ఇవ్వదలచుకో లేదనుకో , అపుడు? " అని, బ్రహ్మాండమైన సమస్యని సృష్టించి పారేసిన పోజులో వెనక్కు వాల్చి , తన ఆఫీసులో కలాలు నడిపే వారిలో ఒకడయిన ఈ కుర్రవాడివైపు ఒక్కక్షణం చూచి, ఆ ఫైలు మీద ఏదో గీకి, దానిని నేలమీదకు విసిరి పారేసి, పైప్ ని గట్టిగా పీల్చి పై కిచూశారు డైరెక్టరుగారు. ఇంక వారి దృష్టిలో తను లేనని తెలిసి బయటపడ్డాడు. వేణుగోపాలం.


    అతని మనసు ఏమిటో గోలగోలగా ఉంది. ఎవరో లోపల్నించి ఏదేదో అడుగుతున్నారు. ఏం చెప్పాలో తెలియలేదు. కుర్చీలో కూలబడి ఎక్కడో చూస్తున్నాడు వేణు. 


    బంకమట్టి ముద్ద.... బరువుగా కదిలినట్లయింది.


    సరిగా ఆ సమయంలో రజాక్ రూపంలో అగుపించింది ధ్రువతార. 


    వేణుగోపాలం అంతరంగంలోని గొంతుకలు చచ్చినట్లు పూరుకున్నాయి.


    “ఇదిగోనండిసార్...... అన్నీ కొత్తనోట్లే!" అని రెండు వందలా నలభై రూపాయ లిచ్చాడు రజాక్ .


    “ఇంద, నువ్వుంచుకో.” రెండువందలా ముప్పయి తొమ్మిది రూపాయలు తీసుకున్నాడు వేణుగోపాలం.


    అతడి జేబులోకి వెళ్ళాయి ఆ నోట్లు.


    అతడి లోలోపల క్రొత్త బలం  • కాల్షియం గ్లుకొనేట్ ఇంజ క్షన్ లా - పాకింది. అతడి మనసు డైరెక్టర్ జనరల్ అమ్మ మొగుడిలా వుంది.


    అరఘంట తర్వాత ఒంటిగంటయింది. కాని వెంటనే ఆఫీసు విడవలేక పోయాడు. వేణుగోపాలం పనినంతా ఒక పద్ధతిలో తెముల్చుకుని బయట పడేసరికి రెండయింది. తనకు డబ్బు వచ్చిన విషయం ఆఘ్రాణించి, సినిమా, టీ పార్టీ  అంటూ స్లోగన్లు మొద లెట్టారు గురునాధమూ, ఇంకో ఇద్దరు మిత్రులూ. .


    సరే, మ్యాటినీ చూశారు. ఆరయింది. హోటలు కెళ్ళితే ఇంకో మూడు రూపాయిలు వదిలాయి. అక్కడితో తమతమ జీవి తాశయాలు నెరవేరినట్లుగా సెలవు తీసుకున్నారు మిత్రులు ముగ్గురూ.


    వేణుగోపాలం ఒక్కడే మిగిలాడు.


    ఇటూ అటూ తోసుకుపోతున్న మూకనిచూస్తే జాలి వేసింది అతడికి. ఉత్తకాళ్లేగాని మొహాలున్నట్లు అనిపించలేదు, ఆ గుంపుకి. 


    ఏవిటో ఈ గుంపు, ఎక్కడికో ఈ తొందర - పాపం. వీళ్ళందరికీ కాసేపు ఆగి, నిలబడి ఆలోచించి, ఏ సినిమాయో చూసి, వాళ్ళ వాళ్ళకి ఏదయినా కొనుక్కు వెళదామని వుండదు కాబోలు - ప్చ్. పాపం!


    నెమ్మదిగా నడుస్తున్న వేణుకు, ఉన్నట్లుండి, తన చెప్పులలో ఒకటి తత్సంబంధమైన పాదంతో సహకరించడం లేదని తెలియ వచ్చింది. చూడగా కుడి పాదపు చెప్పు చాలా కీలకమయిన చోట వీడి పోయినట్లు కనబడింది. 


    ఇంకొకప్పుడయితే చెప్పు మీద  చాలా కోపం, మధ్యాహ్నం డైరెక్టరుమీద వచ్చినంత కోపం  వచ్చి ఉండేది. కాని, ఇప్పుడతడు - చాలా అసాధారణమయిన దశలో, ఆ పాత చెప్పుల్ని అలా గిరవాటేసి, క్రొత్తవి కొనగలిగినదశలో ఉన్నాడాయె ! అందుకని ఆ చెప్పులమీద జాలి వేసింది వేణుగోపాలావికి -


    'మై డియర్ చెప్పుల్లారా ! పాపం  మీరు నాకు రెండున్నర సంవత్స రాలు అమోఘమైన సేవ చేశారు. నేను తొక్కినట్లెల్లా నలిగారు. ఒకటి రెండుసార్లు కాబోలు అతుకుల కోసం అడిగారు. ' ఆవి ఇచ్చేసిం తర్వాత మంచి అబ్బాయిల్లా మెలిగారు. కాని, - ఇప్పుడు నన్ను క్షమించాలి - మనం విడిపోక తప్పదు.' అనుకుంటూ. "


    విశాలమైన హాల్లో, చెప్పుల గోడల మధ్య, నీలపు దీపాల క్రింద, మంచి కుర్చీలలో చేరగిలబడి కూర్చుని, పాదాలకు క్రొత్త రక్షలు తగిలిస్తున్న వారిని క్రీగంటితో చూస్తున్న అదృష్టవంతుల లోకంలోకి అడుగు పెట్టాడు వేణుగోపాలం.


    పది నిముషాలకు ఆతడి దగ్గర కొచ్చాడు షాపు కుర్రవాడు. “బూట్లా. శాండల్పా?" అని అడిగాడు.


    “చెప్పులు." అన్నాడు వేణుగోపాలం తనొకమనిషి. తన కొక ఇష్టంఉంది అన్న విషయం స్పష్టం చేస్తూ.


    షాప్ కుర్రవాడు ఒక జత నల్ల చెప్పులు తెచ్చాడు. అవి గోపాలం పాదాలకు సరిపోయాయి. కాని


    "ఇట్లాంటివే నాకు 'బ్రౌన్' రంగులో కావాలి" - 


    కుర్రవాడు చెప్పుల గోడలోంచి ఇటుకరాయిలాంటి ఆట్టపెట్టెను పెకలించి తీసు కొచ్చాడు. ఆ చెప్పుల్ని వేణుగోపాలం పాదాలకి తొడిగాడు.


    వేణు లేచాడు. క్రొత్త చెప్పులతో ఇటూ అటూ ఏడడుగులు వేశాడు. కాని స్నేహం కుదర లేదు.


    కొద్దిగా పాదం నేలకి తగులుతున్నట్లనిపించి, వంగిచూశాడు. నిజమే! చెప్పులపొడవు ఓ అంగుళం తక్కువ.


    "అబ్బే, సరిపోలేదు "


     “ఇది ఆరోనెంబరు, మీ సైజే సార్" 


    “దీని తర్వాతి సైజు చూద్దాం తీసుకురా!"


     “అది పెద్దదవుతుంది  సార్ !"


     “ఏమిటయ్యా నీగోల. నా పాదం సైజు నా పాదందే గాని మీ అట్ట పెట్టిమీది అంకెకాదుగా !"


    కుర్రవాడు మళ్ళీ వెళ్ళి వచ్చాడు.


    ఆ తర్వాతి సైజు వేణుకి పెద్దదయింది. కాస్త చిరాకనిపిం చింది, వేణుకు.


    “మొదట చూసిన ఆ నల్లవే బాగున్నాయి సార్ " అవి సూచించాడు. షాపు కుర్రవాడు.


    “నలుపు రంగు నాకు నచ్చదు."


    “అయితే ఉండండి.." అని బ్రౌన్ రంగులో ఇంకో జత చెప్పులు తెచ్చాడు కుర్రవాడు.


    అవి వేణుకు సరిపోయాయి. 


    “అమ్మయ్య” ఆనుకున్నాడు కుర్రవాడు.


    అని వేణు.. “అబ్బే, ఈ బకిల్సూ, లేసు అల్లికలూ చూస్తే  నాకు రోత .... అసలు ఈ డిజైను బాగులేదు." అన్నాడు. " 


     కుర్రవాడి ఓపిక కొంత కర్పూర మయింది. - "మరేం చెయ్యమంటారు సార్.  దేశంనిండా మా షాపు బ్రాంచీలు రెండు వందలున్నాయి. మా కంపెనీ పాదరక్షలు ఏటా అయిదు కోట్ల జతలు అమ్ముడు పోతాయి. అల్లాంటప్పుడు అయిదుకోట్ల డిజైన్లు రమ్మంటే ఎలా వస్తాయి. ఏవో కొన్ని డిజైన్లు, కొన్ని రంగులు వస్తాయి. వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాలి గాని, మీ ప్రత్యేక అభీష్ట ప్రకారం కావాలి అంటే కష్టమే సార్ --." అన్నాడు.ఇదేదో పాత పాటే , పదేపదే పాడుతున్నారు. 


    లోలోపల, బాబోయ్, ఆ బంకమట్టి ముద్దకు ఏదో ఆకారం వస్తున్నట్లుంది...... 


    పాత చెప్పులనే లాక్కుంటూ రోడ్డుమీద కొచ్చాడు వేణు. సందు లోకి తిరిగాడు.


    'లక్షలాది జనులు వాడే హేరాయిల్' పోస్టరొకటి గోడమీద నవ్వింది అతడినిచూసి.


    ఎవరో తరుముతున్నట్లుగా నడవసాగాడు వేణుగోపాలం.


    అల్లా తాను నడుస్తున్నట్లు తెలిసినక్షణం ఠక్కున ఆగి పోయాడు. నవ్వొచ్చింది. నెమ్మదిగా నడుద్దామని నాలుగడుగులు వేశాడు.


    "అయ్యా! మీ చెప్పునిట్లా ఇవ్వండి-బాగు చేస్తా. "


    ఎవరు వారు--తన్నే గాక, నడకలో ఉన్న తన చెప్పు స్థితిని పైతం గమనించి, తన అవసరాన్ని గుర్తిస్తున్నారు- అనుకున్న మరుక్షణం ఒక ప్రక్కగా కూర్చుని ఉన్న చెప్పులు కుట్టే మనిషి కనుపించాడు.


    వేణు ఆగి, వాడిని సమీపించి, తన కుడిచెప్పుని వదిలాడు. వాడు దానిని పరిశీలించి, కుట్టసాగాడు. కుడుతూ అన్నాడు --- "అయ్యా.-ఇది బాగా అరిగిపోయిందండీ, క్రొత్తవి కుట్టించుకోండి. దొరా.."


     "కొత్తవి ఎంతవుతాయి?" 


    చెప్పుల వాడిలో ఆశ మొదలయింది.


    “మంచి తోలు వేసి, గట్టిగా కుడతానండి, ఎంత తిరిగినా రెండేళ్లు నడవ్వాలి: ఆ....! మరి...ఆర్రూపాయలుఅవుతుందండీ."


    “నాకు బ్రౌన్ రంగులోనే కావాలి చెప్పులు"


     “అట్లాగేనండి..."


    “ఇది విను. కాలి వేళ్ళ దగ్గరొకపట్టి.. దానికి కొంచెం వెనక ఇంకో వెడల్పు పట్టి ఉండాలి. "


    “ఓ.--అట్లానే.."


    ““బొటన వేలికి 'రింగ్' ఉండాలి. ఏం? ఇంక దానికి బకిల్సూ డిజైన్లు ఉండకూడదు. చాలా సింపుల్ గా ఉండాలి..."


    "ఓ - మీ రెట్లా చెబుతే అట్లా కుట్టి పెడతాను దొరా! పని చూశాక చెప్పండి....కుట్టినాక చూడండి. అవసరం ఉంటే మార్పులు చేపిస్తాను. తమరికి పూర్తిగా తృప్తి అనిపించినాకనే డబ్బులివ్వండి." అన్నాడు ఆ వేళ పొద్దుటినుండి రూపాయి బేడ మాత్రమే సంపాదించిన చెప్పులవాడు.


    వేణుగోపాలానికి తానొక క్రొత్త ప్రపంచంలోకి వచ్చినట్లనిపించింది.


    ““మీ రెట్లా చెబుతే అట్లా."


     “తమరికి పూర్తిగా తృప్తి.” 


    ఆహా 11 ఆహాహా ! !!! 


    అంతేగాని.  -  “అయిదు కోట్ల జతలు."


    - ''ఏదో ఒకటి తీసుకోవాలి గాని." కాదు  మరి. ... ఆ.... అదీ.... బంకమట్టికి ప్రాణమే కాదు రాక్షసుడి రూపమూ వచ్చింది నేను నాగరికతను అని నవ్వుతున్నాడు |


    విశాలమైన - గంభీరమైన - నిండైన మనిషిని కొరుక్కు తింటున్నాడు. బాబోయ్ 


    "అయ్యా. ఇదిగో పాత చెప్పు ! ఏదీ ఆ పాదం ఈ అట్టమీద ఉంచండి, కొలత తీసుకుంటా."


    బాలి శిరస్సు మీద వామనుడిలా అట్టమీద కుడిపాదం ఉంచిన వేణుగోపాలుడిలో ఎక్కడో చిన్న దీపం వెలిగినట్లయింది. 


    “త్వరగా ఇంటికెళ్ళి లలితను లాక్కురావాలి - ఆమెకు నచ్చిందేదయినా కొని తీరాలి..”


    దీపం పెద్దదయి. ఇంకా పెద్దదయి చీకటినీ చంపింది. 


    పళ్ళులేని రాక్షసుడు. పాపం, తలవంచుకు నిల్చున్నాడు.


    “రేపీపాటికి క్రొత్త జోళ్ళు తయారవుతాయండి." అన్నాడు చెప్పులవాడు.


    పాత చెప్పులలో పాదాలుంచి చకచక నడిచాడు వేణు. సందు విడిచి పెద్దరోడ్డు మీదికి నడిచాడు.


    నడుస్తూ నడుస్తూ “అరె! ఈ పాత జోళ్ళు బాగానే ఉన్నాయే• రేపు క్రొత్తవి వచ్చినా వీటిని పారెయ్యక్కర్లేదు.” అనుకున్నాడు !


    ********************************************


    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on...

    24 min
  • 'హెడ్ మాస్టారు ' పాలగుమ్మి పద్మరాజు గారి రచన!

    న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘హెడ్ మాస్టారు ’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . 

    పుస్తకం కొనడానికి కావాల్సిన web link

    Palagummi Padmaraju Rachanalu -Vol1

    కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు.

    ఎపిసోడ్లో ముందుగా కథ గురించి పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    హెడ్ మాస్టారు

    “హెడ్ మాస్టారు పోయారు -”

    తంతి చదువుకున్నాడు. కెప్టెన్ రావు. క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు, పరధ్యానంగా. 

    జేబురుమాలు, పర్సు అందించడానికి వచ్చిన భార్య, బొమలు ముడివేసి అతని వంక చూసింది. వంగి తంతి చదివింది.

    “ఎవరీ హెడ్ మాస్టరు?”

     “మా హెడ్ మాస్టారు.”

    ఆమె భుజాలు అక్కళించి జేబు రుమాలు, పర్సు బల్లమీద పెట్టి లోపలికి వెళ్ళడానికి తిరిగింది. రావు పరధ్యానంగా అలాగే నిలబడ్డాడు. అతని కళ్లలో వెనకటి స్మృతులు తడిగా మెరిశాయి.

    ఇసుకతిన్నెలు గోదావరిని దూరంగా జరిపేశాయి. గట్టుమీదినించి చూస్తే గోదావరి కొనఊపిరితో మెల్లగా అంతిమయాత్ర చేస్తున్నట్టు, నీరసంగా ఏదో గమ్యం చేరుకోడానికి పాకలేక పాకలేక పాకుతున్నట్టు అనిపించేది. కానీ ఇసుక తిన్నెలు దాటి నీటి అంచుకి చేరుకునేసరికి గోదావరి నిండు ప్రాణంతో ఉత్సాహంగా సాగుతున్నట్టు అనిపించేది. హెడ్ మాస్తారు. అదే రేవులో మొలలోతు నీళ్ళలో నిలబడి ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు.

     రావు – అప్పుడతని పేరు సుబ్బారావు –

     కృష్ణయ్య, రామనాధం, సాంబు, రవి ఫర్లాంగు వెడల్పు నదిని ఈది, అవతలి తిప్పమీదికి పోయేవారు. అక్కడ దోసపాదుల మధ్య వాళ్లు దాచుకున్న ఉప్పూకారం పొట్లాలుండేవి. దోసకాయలు చేతులతోటే చిదిపి, ఉప్పుకారం అద్దుకు తినేవారు. వాళ్ళు పారేసిన దోసగింజల్లోంచి ఎన్నో కొత్త పాదులు మొలిచేవి. నీటి అంచుదాకా అల్లుకుపోయేవి దోసపాదులు. తిరిగి ఈదుకు వచ్చేసరికి హెడ్ మాస్టారి సంధ్యావందనం పూర్తయేది.

    “ఏరా? కిష్కింధాపురి అగ్రహారికులు ఏ తోటలు తగలబెట్టొచ్చారు? దోసకాయలా? పుచ్చకాయలా?” అని అడిగారొకనాడు. కుర్రాళ్లంతా బిత్తరపోయారు. తమ దొంగతనం ఆయన కనిపెట్టారని వాళ్లనుకోలేదు.

    “లేదండి – ఈత ప్రాక్టీసు…” అంటూ నసిగాడు రామనాథం.

    “ఒరే సత్యహరిశ్చంద్రా! ఈత ప్రాక్టీసు మంచిదేగాని, ఆ తోటగలాయన వెంటబడ్డాడంటే కాళ్లు విరగొడతాడు. అప్పుడు ఈత దెబ్బతింటుంది.”

    మెతని హాస్యం మాస్టారిది. పొడిచి బాధ పెట్టడు. అతి తాపీగా ప్రతి అక్షరం మెత్తగా ఉచ్చరిస్తూ మాట్టాడేవారాయన.

    “ఏవిటోయ్? కెప్టెన్ రావేనా? అంతమెత్తగా ప్రతి అక్షరం ఉచ్చరిస్తున్నావేమిటి?” అని అడిగాడు ఫోన్ లో కెప్టెన్ రెడ్డి. రావు తనలో తను నవ్వుకున్నాడు, హెడ్ మాస్టారి లాగ అనుకోకుండా మాట్లాడినందుకు. 

    హెడ్ మాస్టారిని అనుకరించాడు. నాటకంలో ఒకసారి రావు ధర్మరాజు పాత్ర ధరించి అచ్చంగా

    అనుకరించాడు. నాటకమయాక టీచర్లూ, స్నేహితులు అంతా ఎంతో. 

    కాని హెడ్ మాస్టారు మాత్రం కళ్లతోటే నవ్వుతూ, “ఒరే సుబ్బులూ! (ఆయనొక్కడే సుబ్బులూ అనేవారు అతన్ని) నన్ను ధర్మరాజుని చేసేశావేవిఁట్రా? అతను వారి దొంగముండాకొడుకు” అన్నారు.

    “రెడ్డీ ! ఏర్ పోర్ట్ కి వెళ్ళేప్పుడు ఇలారా. నేనూ వొస్తా.”

     “ఏవిటి విశేషం?” 

    “చెప్తా” ఫోన్ పెట్టేసి లేచాడు రావు. డైనింగ్ రూంలోకి వెళ్ళేసరికి అతని భార్య కమల అన్నీ సిద్ధంగా పెట్టింది. కూర్చున్నాడు. బత్తాయిరసం మెల్లగా చప్పరించడం మొదలెట్టాడు, పరధ్యానంగా. కమల అతని వంక అనుమానంగా చూసింది. ఇద్దరి మధ్యా నెల్లాళ్ళుగా మాటామంతీ లేదు. స్పష్టంగా నేరారోపణలు కూడా జరగలేదు. కాని కమలకు ఎందుకు కోపం వచ్చిందో, ఆమె ఎందుకు ఆనాడు పడకగది తలుపు మూసేసిందో, అతనికి తెలుసు. ఆ రోజుని కమల ఏర్పోర్ట్ కి వచ్చింది, అతన్ని ఇంటికి తీసుకుపోడానికి. 

    అంతవరకు, ప్రతిసారీ అతను డ్యూటీ ముగించి ప్లేన్ దిగే సమయానికి నిచ్చెనకింద చిరునవ్వు నవ్వుతూ నిలబడి ఉండేది. ఆ రోజు తరవాత ఆమె ఏర్పోర్ట్ కి రాలేదు. రాదని అతనికి తెలుసు.

    ఆరోజు, సన్నజల్లు, ఈదరగాలి. కమల ఆ పెనుచీకట్లో అతనికి కనబడలేదు. ఆమె వస్తుందని అతను అనుకోలేదు. అసలు ఆమె సంగతి మరిచిపోయాడు. మిస్ ఉషా వణికిపోతూ అతని భుజం పట్టుకు వేళ్లాడుతోంది. సన్నని మెట్ల మీద ఆమె, అతను సుఖంగా దిగడానికి చోటులేదు. అంచేత ఆమెను ముందు ఒక మెట్టు దింపి, వెనకనుంచి పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమె అతని మెడచుట్టూ చెయ్యివేసి, గట్టిగా పట్టుకుంది. ఎక్కడ పడిపోతాడో అన్నభయం, ఎక్కడ జారిపోతదో అన్న ఆత్రం. 

    కింద-సమతలం మీద అడుగు పెట్టగానే ఉషకు మైకం కమ్మేసింది (నిజం మైకమే). అతను పడిపోకుండా పట్టుకున్నాడు. ఆమెను వాన్లోకి ఎక్కించి తను ఎక్కాడు. తన రొమ్ముమీద, వదులుగా నరాలు పట్టులేనట్టు వాలింది ఉష. అప్పుడు చూశాడు కమలని. చూడకుండా చూశాడు. విమానం రెక్కపక్కకి, గొడుగుకింద, సన్నని జల్లుతెరలోంచి, ఉషని ఆస్పత్రిలో చేర్చి ఇంటికి చేరేసరికి ఒంటిగంట దాటింది.

    పడకగది తలుపులు తియ్యలేదు కమల.

    పెద్ద ప్రమాదం తప్పి ఇంచుమించు మృత్యుముఖంలోంచి బయటపడి, శరీరం, మనస్సు అలిసిపోయి, ఇంటికి తిరిగివస్తే తన శ్రీమతి ఇచ్చిన స్వాగతం అది. అదే ఆమె శ్రీముఖం. కింద హాల్లో సోఫాలో నిద్రపట్టలేదు. దొర్లాడు. తన ఆత్మ ఎంత పవిత్రమైనదో, మనస్సులో విమానం అంత ఎత్తులేచి, తలచుకుని బాధపడ్డాడు. కేవలం సోదరీభావంతో, ఆనాడు ఉషని – పెనుతుఫానులో చిగురాకులా అల్లల్లాడిపోతూ స్పృహ తప్పి పడివున్న ఉషని – తను పట్టుకున్నంత మాత్రాన తన భార్య ఎందుకు తప్పు తలవాలి? (హ.హ.తప్పు. నువ్వు ఆమె సన్నని నడుంచుట్టు చెయ్యి వేసి పట్టుకున్నావు. అవసరమైనదానికన్న కాస్త ఎక్కువ బలంతో దగ్గరగా ఒత్తిపట్టుకున్నావు. ఆమె నీ మెడచుట్టూ చెయ్యి వెయ్యడానికి సగం నీవంక తిరిగినప్పుడు ఆమె ఎడం రొమ్ము మెత్తగా నీ గుండెకు తగిలి పిట్టలా కొట్టుకుంటున్నప్పుడు, నీ కుడిచేతికి ఆమె వెన్నెముక సన్నని కాలవలా జిల్లుమంటూ తగిలినప్పుడు, ఆమె జుట్టు నీ మెడ కింద కితకితలు పెట్టినప్పుడు, నీలో ప్రవహించిన విద్యుత్తు సోదరీభావం!!)

    ఆమ్లెట్ తింటూ, వెన్నరాసిన రొట్టి చీలిక కొరుకుతూ కమల వంక చూశాడు రావు. ఆమె అతని పరధ్యానాన్ని అతి తీక్షణంగా చూస్తూ కూర్చుంది, మోచేయి బల్లమీద ఆన్చి, చిరుగడ్డానికి చెయ్యి బోటు పెట్టి. అతని కళ్లలో అనంతమైన ఆప్యాయత మెరిసింది. అది భరించలేక ఆమె చూపులు పక్కకి చెదిరిపోయాయి.

    “నేను ఏలూరు వెళ్లాలి, విజయవాడలో దిగి.” ఆమె అతని వంక చూసింది..

    “మా హెడ్ మాస్టారు పోయారు. ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉన్నాడు… నాకు తండ్రిలాంటివాడు. నేను వెడితే పాపం ఆవిడ ఎంతో సంతోషిస్తుంది ” . 

    అతనికే నవ్వొచ్చింది. అలాంటి భర్త పోయిన తరవాత ఆ ఇల్లాలు సంతోషిస్తుందా? ఇంకోమాట అతనికి తోచలేదు. కమల నవ్వలేదు. ఆమెకు అర్థమైంది.

    రావు కాస్త సందేహించాడు. కాఫీ చప్పరించాడు. “ఆవిడికి నా అన్నవాళ్ళెవరూ లేరు…నువ్వూ వొస్తావా!”. 

    కెప్టెన్ రెడ్డి వాన్ హారన్ మోగించాడు. సోఫాలోంచి లేచాడు. కమల గదిలోంచి తయారై వచ్చింది. తను అడిగినప్పుడు సమాధానం ఏమీ చెప్పకపోతే రాదనుకున్నాడు. తన వెనక ఇల్లు తాళం వేసి వచ్చి వాన్లో ఎక్కింది. రెడ్డి ప్రశ్నార్థకంగా చూశాడు.

    “మా హెడ్ మాస్టారు పోయారు. చూడ్డానికి వెడుతున్నాం ఏలూరు.”

     విమానంలో చోటులేదు. ఎలాగో సంపాదించాడు కమలకి ఒక సీటు, ఏర్హోస్టెస్ పక్కని.

    రెడ్డి చాలా నిదానమైనవాడు. ఏవ్రో ని అతి తాజుగా లేపాడు. గాలిలోని తెల్లని దూదిపరుపుల పైకి. 

    అతని వెనక నిలబడ్డాడు రావు.

    – అంత ఆకాశానికి విమానం కేంద్రం లాగ అనిపిస్తుంది రావుకి ఎగురుతున్నప్పుడు. పలచని మబ్బుపొరలలోంచి దూసుకుపోతున్నప్పుడు కాస్త జలదరించింది. విమానం. ఆ తాకిడికి టీ తీసుకొచ్చిన ఎయిర్ హోస్టస్ – నాయకి ఆమె పేరు – తూలినట్టు అతనిమీద పడి, “ఓ” అంది నొచ్చుకుంటున్నట్టు, నవ్వుతూ.

    “కాస్త ఉంటే టీ మీ మీద పడేది.” 

    “టీకన్నా నువ్వు పడ్డమే మేలు” రెడ్డి వ్యాఖ్యానం.

    కమలవంక చూశాడు రావు. కేవలం సోదరీభావం అని కళ్ళతో చెప్పబోయాడు. అతనికే నవ్వు వచ్చింది. 

    కమల పక్కకి ఇరుక్కుని కూచున్నాడు. 

    ఎక్కడికో చూస్తూ చెప్పడం మొదలు పెట్టాడు. 

    “మేస్టారు ఒకనాడు ఇంగ్లీషు పాఠం చెపుతున్నారు. ‘మానవులంతా సోదరులు’ అన్న గాంధీజీ వ్యాసం. – ఆయన అన్నాడు, ‘చూశారర్రా! గాంధీజీ చాలా కొంటెవాడురా.

    మానవులంతా సోదరులు  అని ఒక్క మగవాళ్ళని గురించే చెప్పాడు. పుంలింగం ఉపయోగించాడు. ఆడాళ్ళూ మొగాళ్ళూ అందరూ సోదరీసోదరులు కారని ఆయన కనిపెట్టేశాడు – మన సుబ్బులుగాడిలాంటి వాళ్ళని ఆయన ఎందర్ని చూశాడో’ – ఎందుకంటే నేను, హైస్కూలు రోజుల్లో నేను చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాణ్ణి.”

    కమల కళ్ళల్లో ఎక్కడో లోతుగా చిరునవ్వు తళుక్కుమని మెరిసి మాయమైపోయింది. ఎయిర్ హోస్టెస్ మీద అసూయపడకుండా చెయ్యడానికి రావు ఈ కథ చెప్పాడని ఆమెకు కచ్చితమైన అనుమానం. 

    అసలు కారణం ఏదయినా , మొదలు పెట్టిన తరవాత రావుకి, అసలు ఎయిర్ హోస్టెస్ గాని, టీ ఘట్టంగాని మనసులో లేదు. హెడ్ మాస్టారు గారు మనసులోనిండి, ఆయన ముఖంమీద ఎప్పుడూ మెదిలే కొంటె చిరునవ్వు అతని పెదవులమీద కొచ్చింది. తియ్యని చిరునవ్వు. కమల మౌనంగా చూసింది, క్రీగంట అతనివంక.

    రెండో ఏర్ హోస్టెస్ కొంచెం వాళ్ళవంక తూలి అసందర్భంగా నవ్వింది. కమలకి ఆ నవ్వులో, కాలికింద ఆధారం చటుక్కున జారి పోతున్నప్పుడు కలిగే కడుపులో కాళీలాంటి ఆందోళన, కొంత జులాయితనం ధ్వనించాయి. రావు ఆ నవ్వు విన్నాడో లేదో అతని ముఖం చూస్తే ఆమెకు అర్థం కాలేదు.

    చటుక్కుని రావు చెప్పడం మొదలుపెట్టాడు:

    నేలలాంటిది కాదు గాలి. నేలమీద నడవటం అలవాటు పడ్డ వాళ్లకి గాలిలో ప్రయాణం చెయ్యడం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది, ఎంత తరిఫీదు పొందినా సరే గాలి విమానాన్ని మోస్తుంది. కాని చటుక్కుని అప్పుడప్పుడు వొదిలేస్తుంటుంది – చంటి పిల్లాణ్ణి ఎగరేసి వొదిలేసినట్టు. అప్పడు గాలిమీద నమ్మకం ఉన్న వాళ్లకి భయం వెయ్యదు.

    కొందరికి పాతికేళ్ళు విమానం నడిపినా ఆ నమ్మకం కుదరదు. ఎప్పటికప్పుడు గాలి, వాళ్లకి కొత్త శత్రువులా అగుపిస్తుంటుంది. కెప్టెన్ రూంగ్తా చాలా అనుభవంగలవాడు. మంచి సాహసి కూడా. కాని ఆ రోజున అతనికి మతి పోయింది. 

    గుర్తుందా? ఆ రోజుని వానాగాలీలో…తనూ వచ్చింది ఏర్పోర్టుకి… ఇంచుమించు అందరూ చచ్చిపోవలసింది. రూన్గ్తా చీఫ్ పైలట్. తను కో పైలట్. ఎడమపక్క ఇంజిన్ చెడిపోయింది. గాలి విమానాన్ని ఊపేస్తోంది. ఏది చెయ్యకూడదో అది చేశాడు రూంగా, గాలితో యుద్ధానికి దిగాడు. గాలి ప్రాకృతిక శక్తి ముందు మనిషి చేసిన యంత్రం ఏపాటిది? 

    కాగితం పడవలా లుంగలు చుట్టుకు పోతోంది విమానం. 

    రావు హెచ్చరించాడు. 

    రూన్గ్తా ‘షటప్’ అన్నాడు. రావుకు చిరాకు హెచ్చింది. అన్యాయంగా 80 మంది ప్రాణాలు పోతాయి. ఏర్పోర్టు ఇంకో అరమైలుంది. విమానం పడిపోతోంది. ఏర్పోర్ట్ కి ఇవతల చిన్న గుట్ట – దానిమీద ఎర్రదీపం అతివేగంగా మీదికొచ్చి పడిపోతోంది. “ఎత్తు, పైకెత్తు” అని అరిచాడు రావు. ఉష అరుస్తోంది. ఆమెకు పిచ్చెక్కిపోతోంది. ఇంకొక్క రెండు నిమిషాల్లో గుట్టకి ఢీకొంటుంది విమానం. చటుక్కుని చెయ్యెత్తి రూన్గ్తాని గవదల మీద కొట్టాడు శక్తికొద్ది – రూన్గ్తా పక్కకి పడిపోయాడు దెబ్బకి – అతన్ని సీట్లోంచి తోసేసి రావు స్టీరింగ్ పట్టుకొన్నాడు. పూర్తిగా త్రాటిల్ ఇచ్చి విమానాన్ని పైకి లేపాడు. 

     గుట్లమీది ఎర్ర దీపానికి అయిదారు గజాల ఎత్తుని విమానం జుంయని దూసుకుంటూ లేచింది. తరవాత విమానాన్ని తాజు చేశాడు, ఇప్పుడింక దిగడానికి వీల్లేదు. రన్‌వే సగం దాటిపోయింది.

     రావు విమానాన్ని ఆకాశంలో ఒక చుట్టు తిప్పి- అతి ఒడుపుగా కిందికి దించాడు. రెండు చక్రాలే నేలకి తగిలి తూలింది విమానం. తరవాత రెండోపక్క చక్రాలు ఆనాలు తగ్గించి అదుపులోకి తెచ్చాడు రావు. 

    ఆఖర్ని బ్రేకులు వేసి ఆపేసరికి, అంత చలిలోనూ అతనికి ముచ్చెమటలు పోశాయి. ఉష పిచ్చిదానిలా మీదపడి గట్టిగా పట్టుకుంది. ఆమె ఒదలలేదు. హాస్పిటల్ కి చేర్చి మత్తుమందిచ్చే దాకా వొదలలేదు. నిట్టూర్చాడు రావు…

    “నేలమీది నీతినియమాలు, మంచి మర్యాదలు గాలిలో పని చెయ్యవు. రూలు ప్రకారం రూన్గ్తా ని ధిక్కరించడం నేరం. అతడు ప్రయాణికులందరినీ తన కంగారు వల్ల చంపేసినాసరే, నేను అడ్డుపడకూడదు. రూలు అతిక్రమించి ఆ రోజుని అందరీ కాపాడాను… రూల్సు ధిక్కరించడం, ఆ సమయానికి నా మనసు చెప్పినట్టు చెసెయ్యడం నా స్వభావం, చిన్నప్పటినించీ. 

    అంచేతే నిత్యజీవితంలో నేను అందరికీ పెద్ద సమస్యనైపోతూ వచ్చాను. 

    విమానం ఎగురుతున్నప్పుడు, అది ప్రత్యేకలోకం. నేలకు దానికి సంబంధం లేదు. అప్పుడు నేను రాజుని. నేనక్కడ ఎప్పుడూ తప్పు చెయ్యను…. నేలమీద దిగిన తరువాత చేసేవన్నీ తప్పులే.”

    తన్ను చూసికూడా ఉషని వాన్లో ఎక్కించుకుని వెళ్ళిపోయాడా రోజు రావు. ఆ విషయమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని కమలకు తెలుసు. కాని రావు స్పష్టంగా క్షమార్పణలాగ చెప్పలేదు. తను అంతమంది ప్రాణాలు ఆ రాత్రి కాపాడాడు గనుక, సొంత భార్యని అలక్ష్యం చేసి, ఉషని వాటేసుకోవడానికి తనకి అధికారం ఉన్నట్టు తన చేతలు సమర్థించుకుంటున్నాడని కమల తిక్కగా అనుకుంది. కనీసం ఆమె అలా అనుకుంటున్నట్టు రావుకి అనిపించింది. ఒక జాలినవ్వు ఆమె వైపు ప్రసరించాడు. అందులోని ఆప్యాయతకి ఆమె చెక్కులు ఎర్రబడ్డాయి.

     హెడ్ మాస్టారు అన్న మాటలు గుర్తు కొచ్చాయి.

    “ఆడది సాటి ఆడవాళ్ళని నమ్మదు. తన మొగుడితో చనువుగా ఉండే ఆడవాళ్ళని అసలే నమ్మదు. మొగుణ్ణి ఎప్పుడూ నమ్మదనుకో.”

    రావు కథ పూర్తిచేశాడు.

    ఉష నిద్రపోయింది. తను హోటల్ కొచ్చాడు. గదిలో కూర్చుని రాశాడు. జరిగిందంతా రాయలేదు. తను క్రమశిక్షణ తప్పాననీ, కెప్టెన్ రూన్గ్తాని అవమానించి, అతన్ని కొట్టి, కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకున్నాననీ, ఆ నేరానికి ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని, అతిక్లుప్తంగా రాశాడు. తను చేసిన పనికి, కెప్టెన్ రూన్గ్తా ను హృదయపూర్వకంగా క్షమార్పణ కోరుతున్నాననీ కూడా, రాశాడు. 

    నాలుగు గదులు అవతలున్నాడు రూన్గ్తా . 

    రావు వెళ్ళాడు. తలుపు మూసివుంది. మెల్లగా తట్టాడు. సమాధానం రాలేదు. గడియారం వంక చూసుకున్నాడు. రాత్రి రెండయింది. 

    ఇప్పుడెందుకు లేపడం అనుకున్నాడు. 

    వెనక్కి తిరుగుతుంటే, “కమిన్” అని గొంతు వినిపించింది. 

    మధువుతో బరువెక్కిన గొంతు. తలుపు తెరిచి లోపలికెళ్లాడు రావు. రూంగా కళ్లు ఎర్రగా మధువుతో బరువెక్కిన గొంతు. తలుపు తెరిచి లోపలికెళ్లాడు రావు, ఉన్నాయి.

    “ఏమయ్యా! హీరో?”

    గొంతులో ఎత్తిపొడుపు లేదు.రూన్గ్తా అతనివంక ఎంతో సేపు చూశాడు. అతని మనస్థితి అర్థం కాలేదు. బాగా తాగినా శ్రుతిమించలేదు రూన్గ్త. 

     మెత్తగా చిరు నవ్వు నవ్వుతూ రావు తను రాసిన క్షమాపత్రం అతని చేతిలో పెట్టాడు. 

    రూన్గ్తా అతనివంక చూశాడు. మెల్లగా చదివాడు. మాట్టాడ కుండా దీపంవంక చూస్తూ ఒక క్షణం కూర్చున్నాడు. చటుక్కుని ఆ కాగితం చింపి బుట్టలో పారేశాడు. రావు వంక తిరిగి శూన్యంగా చూశాడు. 

    మెల్లగా అతని పెదవులమీద ఎంతో బరువైన చిరునవ్వు .. అంతులేని విషాదంతో మొలిచింది. 

    “రావ్! నాతో ఒక్క పెగ్గు వేస్తావా? లేక అలిసిపోయావా?” 

    రావు కూర్చున్నాడు. 

    తనే సీసా తియ్యబోతుంటే – రూన్గ్తా ఆపాడు. “నో నో నువ్వు నా అతిథివి.” – రూన్గ్తా విస్కీ గ్లాసులో పోశాడు. 

    రావు తీసుకున్నాడు “చీర్స్” అన్నాడు.

    మౌనంగా తన గ్లాసు ఎత్తి ఒక్కగుక్కలో తాగేశాడు రూన్గ్తా. 

    రావుకి ఇబ్బందిగా ఉంది. గ్లాసు కింద పెట్టి రూన్గ్తా మెరుస్తున్న కళ్ళతో అన్నాడు రావు వంక చూస్తూ.

    “రావ్! నీకింత ఔదార్యం ఎలా వచ్చింది?…ఎనభై లక్షలు విలువచేసే విమానం కాపాడావు. విలువ కట్టడానికి వీల్లేని 80 ప్రాణాలు కాపాడావు. పైగా నాదగ్గరకొచ్చి క్రమశిక్షణ తప్పినందుకు ఏ శిక్షయినా అనుభవిస్తానని కాగితం రాసిచ్చావు….నన్ను గట్టిదెబ్బే కొట్టావు. నాలుగు రోజులదాకా వాపు తగ్గదు. రేపు మెడ బిగిసిపోతుంది. మరింత బాధ పెడుతుంది. కాని నాకు తగలవలసిందే. ఆ సమయంలో నాకు నిజంగా మతిపోయింది. కంగారు పడి పోయాను. ఆ ఎర్రదీపం అసలు నాకు కనబడలేదు. అదీగాక, ప్రయాణికులు, నేను, నువ్వు అందరు చచ్చిపోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేశాను. అయినా అహం. అందరితో చచ్చిపోవడానికి నాకు హక్కుందనుకున్నాను. ఊహలు, అహం కలగాపులగం అయిపోయాయి. నువ్వు కలగజేసుకున్నావు. కంట్రోల్స్ తీసుకున్నావు. కిందపడి లేచాను. నిన్ను తోసేద్దామని కోపంగా లేచాను. కొండవాలు జర్రున కిందికిపోతోంది. విమానం పైకి లేచింది. ఎర్రదీపాన్ని దాటేసింది. ఒక ఇంజన్ పనిచెయ్యని విమానాన్ని ఎంత ఒడుపుగా, ఎంత ఆత్మస్టెర్యంతో నువ్వు అదుపులో పెట్టావో చూశాను. పిట్టలా ఎంత చల్లగా తిప్పావు విమానాన్ని! తిప్పుతూనే దింపావు. ఒక పక్క చక్రాలమీద దిగిన విమానాన్ని ఎంత సున్నితంగా సరిజేశావు! నీ వంకే చూస్తున్నాను. నీకళ్ళలో తీక్ష్ణత తప్ప మరొకటి లేదు. అప్పుడర్థమైంది నాకు – నువ్వు కొట్టిన దెబ్బలో పొగరు లేదు, అహంకారం లేదు. నామీద కక్షగాని ఈసుగాని లేదు. గత్యంతరంలేక కొట్టావు. ఇంత నిబ్బరం నీకుందని నేననుకోలేదు. నువ్వు అందరితోటీ ఛలోక్తులు చెపుతూ, జులాయిగా బాధ్యత తెలియకుండా తిరిగే మనిషివని అంతవరకు నా నమ్మకం. ఆ కులాసా వెనక, ఆ తేలికతనం వెనక, ఎంత లోతుందో ఆ అయిదారు నిమిషాల్లో నా కర్ధమైంది.”

    రావు ఈ పొగడ్తకి చాలా ఇబ్బంది పడిపోయాడు. రూన్గ్తా వంక చూడలేకపోయాడు. డ్రెసింగ్ టేబిల్ మీద పెద్ద అద్దంలో తన ప్రతిబింబం అతనికి కొత్తగా కనబడింది. చటుక్కుని అది హెడ్ మాస్టరుగారి ముఖంగా మారిపోయింది. 

     చల్లని చూపులు – లోకమంతా తెలిసి, అమాయకంగా కనబడే చూపులు – ఆచిన ఆయనదే. కాని హెడ్ మాస్టారు ఎంతగా తనలో భాగమైపోయాడో అతనికి అప్పుడరమే కాని తను హెడ్ మాస్టారు ఎన్నటికీ కాలేడు. ఆయన తనలాగ ఎన్నడూ ఇరుకులో ప పడ్డవాళ్ళని అతి తాపీగా ఇరుకులోంచి బయట పడేస్తారు. తనలో ప్రవేశించి, ఆయన తను ఇరుకుల్లో పడ్డప్పుడు ఎన్నోసార్లు కాపాడారు. ఆ రాత్రికూడా ఆయనే తను ఆవేశించాడు.

    “రావ్? నేనింక పైలట్ గా పనికి రాను. రిజైన్ చేసేస్తున్నాను.” 

    “నాన్ సెన్స్!” అన్నాడు రావు. రూన్గ్తా మెత్తగా నవ్వాడు.

    “రావ్! యుద్ధంలో పైలట్ గా పనిచేసినవాణ్ణి. ఎన్నో అపాయాలు దాటి బతికినవాణ్ణి. పైలట్ గుండె ఎలా ఉండాలో, నరాలు ఎలా పనిచెయ్యాలో, అపాయం ఎదురైనప్పుడు ఎంత తాపీగా బుర్ర పనిచెయ్యాలో నాకు అనుభవమే. ఆ లక్షణాలు నాలో లోపించాయి. విమానం అల్లల్లాడినప్పుడు కాళ్లకి చెమటపట్టి చల్లబడిపోతే ఇంక విమానం నడపడానికి ఆ వ్యక్తి పనికిరాడు. రేపు చేర్మన్ ని కలుసుకొని, ఎగ్జిక్యూటివ్ శాఖలోకి మార్చమని అడుగుతాను. మార్చకపోతే రాజీనామా ఇచ్చేస్తాను.”

    రూన్గ్తా చెప్పింది నిజమని రావుకి తెలుసు. అతడు నిట్టూర్చాడు. రూన్గ్తా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. .

    ‘క్షమించు. ఇంక నిద్ర ముంచుకొస్తోంది. కావాలంటే నువ్వు కూర్చో. ఇంకో సీసా ఉంది. నువ్వు నా వద్దకు వస్తావనుకోలేదు. వచ్చావు, అదే సంతోషం.”

    రావు “గుడ్ నైట్” చెపుతుంటేనే రూన్గ్తా నిద్రపోయాడు…

    కమల అతని వంకే చూస్తూంది. అతని చెయ్యి ఆమెనడుం చుట్టింది. ఆమె బెదురుతూ ఇటూ అటూ చూసింది. ఏర్ హోస్టెస్లు ఇద్దరూ ఎక్కడో అవతలున్నారు.

    ప్లేన్ దిగుతోంది. “బెల్ట్ లేదుగా ఇక్కడ.” అని రావు ఆమె నడుం గట్టిగా పట్టుకున్నాడు.

    పాపం ఆ ఎయిర్ హోస్టస్లకి ఈ అదృష్టంపోయింది ఈ రోజున నామూలంగా,” అంది కమల. 

    కాని ఆ మాటల్లో ఎత్తి పొడుపు ధ్వనించలేదు. చక్రాలు రన్‌వేకి తగిలి విమానం ఒక్కసారి ఎగిరినప్పుడు ఆమె ఊపిరి గొంతులో అడ్డుపడింది. భర్త చెయ్యి తన నడుంచుట్టూ ఉన్నందుకు మనసులో ఎంతో కృతజ్ఞత, సంతృప్తి నిండిపోయాయి. మెల్లగా విమానం ఆప్రన్వెపు సాగుతుంటే రావుచెయ్యి తీసేశాడు.

    ఏలూరుకి టాక్సీలో పోతున్నప్పుడు, రావు జేబులోంచి తన చిన్న డైరీ తీసి మొదటి పేజీ తిప్పి, కమలకి చూపించాడు. ఆ డైరీ ఆమె ఎప్పుడూ తెరిచి చూడలేదు. ప్లాస్టిక్ పొరకింద ఒక పాత ఫోటో వుంది.

    “ఎవరు?”

    “హెడ్ మాస్టారు.”

    ఏలూరు వెళ్ళేదాకా ఆ ఫోటోవంక చూస్తూ కూర్చుంది కమల. 

    మాస్టారి శవం హాల్లో ఉంది. కాళ్ళవద్ద భార్య కూర్చుని వుంది. కాస్త దూరంలో జనార్దనరావుగారు, ఆయన కుమార్తె నాగుమణి ఉన్నారు. రావుని శూన్య దృక్కులతో చూసింది మాస్టారి భార్య . ఏడుపుకి కూడా అతీతమైన దిగులు ఆ చూపులలో ఉంది.

    “సుబ్బారావ్ కదూ,” అన్నారు జనార్ధనరావుగారు, అతన్ని ఆనవాలు పడుతూ. నాగుమణి అతని వంక చిత్రంగా చూసింది. అందులో ఆప్యాయత మెదిలింది.

    “సుబ్బారావ్! సూర్యారావు (మాస్టారి కొడుకు) ఇంకా మూడు రోజులదాకా రాడు. రేపు దహనం చెయ్యకపోతే – పాడయి పోతుందన్నాడు డాక్టరు. ఏం చెయ్యడానికి పాలుపోవడం లేదు.” అన్నారు జనార్ధనరావుగారు.

    రావు మేస్టారి భార్యవద్దకు వెళ్ళాడు. కమల ఆమె పక్కకు వెళ్ళి కూర్చుంది.

    “అమ్మగారూ!… కొరివి నేను పెడతాను…. మీకేమన్నా అభ్యంతరమా?…మీ బిడ్డలాంటి వాణ్ణి,” అన్నాడు పూడిపోతున్న గొంతుతో.

    ఎంత సేపో అర్థం కానట్టు అతనివంక చూసింది ఆ ఇల్లాలు – ఆఖరికి. “నీ ఇష్టం బాబూ” అంది.

    జనార్దనరావుగారు అన్ని ఏర్పాట్లు చేశారు. శవాన్ని తీసుకుపోతుంటే మాస్టారి భార్యకి దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించింది –

    రావు చనిపోయిన మాస్టారి ముఖం వంక ఒక్కసారికూడా చూడలేదు. చూడ్డానికి మనసు రాలేదు. మాస్టారి సజీవమూర్తే అతని మనసులో మిగలాలి. ప్రాణంలేని, తళుకులేని మృతముఖాన్ని అతడు చూడలేడు. 

    నిప్పుకుండ పట్టుకుని ముందు నడుస్తుంటే, పరిచితమైన వీధి మలుపులు అతన్ని మూగగా పలకరించాయి. కాలవ, పడవలరేవు, చీకటితోటే స్నానానికొచ్చి వెనకపక్కనించి పడవల్లోకి ఎక్కి అరిటిపళ్లు, బెల్లపు అచ్చులు దొంగిలించిన రోజులు – మరీ చిన్నతనపు రోజులు. 

    ఆ తరవాత కొవ్వూరు పంపింది అమ్మ, హైస్కూల్ చదువుకి, హెడ్ మాస్టరి దగ్గరికి. అతను నాన్నగారికి మంచి స్నేహితులట. విపరీతమైన తన అల్లరి చూసి అమ్మ ఎంతో దిగులుపడేది. తను ఎన్నటికైనా బాగుపడతాడా అని. హెడ్ మాస్టారింట్లోనే పక్కగదిలో తనమకాం – ముగ్గురు సహాధ్యాయులతో. ఎవరన్నా అధికారం ప్రదర్శిస్తే తిరగబడే స్వభావం. 

    మొదట్లో మాస్టారు అంతుపట్టలేదు అతనికి! సగం నెరిసిన తల, పలచగా కత్తిరించిన బూడిదరంగు మీసం, బంగారు కళ్లజోడు! రాత్రి పదైనా పదకొండయినా, అరుగుమీద కూర్చుని ఏదో చదువుతుండేవారు. ఓరోజున సర్కసు రెండో...

    56 min
  • వాకాటి పాండురంగరావు గారి పై శ్రీరమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు!

    సుప్రసిద్ధ కథా రచయిత , పాత్రికేయులు వాకాటి పాండురంగ రావు గారు 1934 లో జన్మించారు. ఆయన ఆనందవాణి, ఆంధ్ర జ్యోతి, న్యూస్ టైం, ఏ.పి.టైమ్స్, ఆంధ్రప్రభ వారపత్రికలలో వివిధ పాత్రికేయ సేవలనందించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం అధ్యాపకునిగా పనిచేసారు. విశాఖపట్నం పోర్టుకు డిప్యూటీ దైరక్టరుగా కూడా పనిచేసారు.

    పాండురంగారావుకథలు , మిత్రవాక్యం , చేత వెన్నముద్ద ,సృష్టిలో తీయనిది, దిక్చూచి లు ఆయన ప్రసిద్ధ రచనలు.

    ఈ ఎపిసోడ్ లో పాండురంగరావు గారి గురించి ప్రముఖ కథా రచయితలు శ్రీ రమణ గారు , మధురాంతకం నరేంద్ర గారు మాట్లాడతారు.

    వారివురికీ హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

    హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    29 min
  • పార్ట్ 2 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన

    అతనికి మెలకువ వచ్చేసరికి పెట్టి తలుపు తెరిచుంది. అవతల పొద్దుటి కనుచీకటిలో కంటి కలవాటుపడ్డ పట్నం దృశ్యాలు మసగ్గా కనబడ్డాయి. గుమ్మంలో సందేహిస్తూ నిలబడ్డాడు ఇంటి నౌకరు, దొర. ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు దక్షిణామూర్తి. దొర పక్క చుట్టేస్తూ అన్నాడు. 

    “చిన్న శెట్టియా రొచ్చారు సార్.”

     “ఎక్కడికీ?” 

    “ప్లాట్ఫారం మీదున్నారు సార్.”

    ఒకసారి బాత్ రూములోకి వెళ్ళి ముఖం చన్నీళ్ళతో కడిగి తుడుచుకున్నాడు. తల దువ్వుకున్నాడు. దొర తెచ్చిన కాఫీ తాగాడు. 

    ఈలోగా దొర, సామానంతా కూలీచేత మోయించుకుపోయాడు. 

    ఆ తరువాత అతను పెట్టెలోంచి దిగాడు. దిగగానే చిన్న శెట్టి కాళ్ళమీద పడ్డాడు. ఇంత జన సమూహంలో ఈ దృశ్యం జరిగినందుకు దక్షిణామూర్తికి కోపం చిరాకు పుట్టుకొచ్చాయి.

    చెట్టియార్, పదిమందిలో ఈ పని చేశావంటే నిన్ను దుంపనాశనం చేస్తాను. లే ముందు.” 

    చెట్టియార్ లేచాడు. దక్షిణామూర్తి అతి తొందరగా బయటికి నడుస్తుంటే చెట్టియార్ కూడా పడ్డాడు.

    “పొరబాటయింది సామీ! మీ సొమ్ము నయా పైసాతో ఇస్తును. ఏదో మా తమ్ముడుండాడే, వాడి బుద్ధి మంచిది కాదు. నాక్కూడా తెలియదు, సిమెంటని సెప్పి వట్టి బూడిద బస్తాల్లో నింపి మీకిచ్చినాడని. మీ తోడు. మీరు ఊరిలో లేరు. మీ వకీల్ నా మీద అరస్టు వారంటు తీసినాడు. పదిమంది బిడ్డలవాండ్లము. ఈ తూరి దయ చూపించారంటే…”

    “పదకొండు గంటలకు పోయి మా వకీలును చూడండి.” 

    “నిన్నసూస్తిని. అతను నిండా కోపంగా…” 

    “ఈవేళ పదకొండు గంటలకు వెళ్లి చూడండి.”

     “తమరుదా దయ తలిస్తే….”

    “చెపుతుంటే మీక్కాదూ, పదకొండు గంటలకి వెళ్ళి చూడమని. ఇంకొక్కడుగు నా వెనకాల వేశారంటే, ఈ రైల్వే పోలీసులచేతే మిమ్మల్ని అరస్టు చేయిస్తాను…. ఇక వెళ్ళండి.”

    తన్నులు తిన్న కుక్కలాగా వెళ్ళిపోయాడు చెట్టియార్. తన్ను మోసగించిన వాళ్ళమీద తన కెల్లాంటి అధికార మొస్తుందో దక్షిణామూర్తికి బాగా తెలుసు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నాశనం చెయ్యగలడతను. వాళ్లు తన చేతి కీలుబొమ్మలు. వాళ్లని శిక్షించడంలో అతని కేమి పెద్ద సంతృప్తి ఉండి కాదు. వాళ్ళు సంపూర్ణంగా తన దయమీద ఆధారపడి ఉండేటంతవరకూ తీసుకొస్తే, అతని కొక సంతృప్తి. దానివల్ల అతని సమర్థత అతనికే రుజువవుతుంది. వాళ్ళు వచ్చి తన కాళ్ళు పట్టుకోవడం అతనికి చాలా ఇష్టం. అయితే పదిమందిలో కాదు.

    చెట్టియార్ ఆడిన నాటకం, అతని తమ్ముణ్ణి విడదీసి, లంచం ఇచ్చి, అతనిచేత కోర్టులో అన్నగారికి వ్యతిరేకంగా సాక్ష్యమిప్పించడం, చెట్టియార్ దగాకోరని కోర్టువారికి రుజువు కావడం, అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ అతను కారుదగ్గరకు వచ్చాడు. వెనక తలుపు డ్రైవరు తెరిచాడు. అతను ఎక్కి కూచున్నాడు. డ్రైవరు తలుపు ముయ్యబోతుంటే అడ్డొచ్చింది చిట్టితల్లి . 

    నిద్రలేవగానే ఏదో మరిచిపోయినట్టనిపించిందతనికి. ఇంతలో చెట్టియార్ సంఘటనవల్ల అది పూర్తిగా మరిచిపోయాడు. కాని చిట్టితల్లి కనబడగానే తను మరిచిపోయింది ఆమేనని గుర్తుకొచ్చింది…

    అయితే, రాత్రి రైలు పెట్టిలో ఏకాంతంగా ఆమెతో ఎంత ఆంతర్యం ఏర్పడ్డా, తన పగటి జీవితంలో ఆమె ప్రవేశించడం మాత్రం అతని కిష్టం లేదు. కొంచెం చిరాగ్గానే అడిగాడు.

    “ఏం చిట్టీ?”

    “మా అమ్మ దగ్గరకి తీసుకెళ్లవా!” అంది దీనంగా చిట్టితల్లి. 

    “ఫో,ఫో” అంటూ లాగెయ్యబోయాడు దొర.. 

    “ఉండు దొరా!” అన్నాడు దక్షిణామూర్తి. “మీ అమ్మెక్కడుంది?”

     “ఏమో!”

     “ఎప్పుడొచ్చింది పట్నానికి?”

     “నిన్న పొద్దున్న.”

    “ఏ రైలుమీద?”

     “రైలుమీద కాదు. రెండు గడలు పోడుగ్గా ఏసి, మద్దినేమో సిన్న సిన్న ముక్కలేసి, ఓ మంచం కింద కట్టి దానిమీద మోసుకొచ్చారు. మా నాన్నని పోలీసులు పట్టుకుపోయారుగా! అందుకని సీతయ్యబాబు ముంతలో నిప్పు పట్టుకుని ముందెళ్ళాడు.” 

    దక్షిణామూర్తి గుండె గతుక్కుమంది..

     “పట్నం వొచ్చిందని ఎందు కనుకున్నావు.”

    “రంగత్త సెప్పిందిగా. నేను మా యమ్మతో కూడా పోతానని ఏడితే సెప్పింది. పట్నం ఆస్పత్రికి తీసుకుపోతున్నారు. బాగవగానే తిరిగొత్తాదిలే అంది. తనింటికి తీసుకుపోయి కూడెట్టింది. తినేసి నేను జారుకున్నాను. పట్టం పోడ మెట్టా గంటే సోడా సాయిబ్బన్నాడు – ఆ రైలెక్కితే సీదా పట్టం పోతాదని. ఎక్కేశా.”

    ఒక క్షణంపాటు దక్షిణామూర్తికి నోటమాట రాలేదు. కళ్ళలో చెమ్మ కనబడకుండా తుడుచుకుని అన్నాడు.

    “ఎక్కు కారెక్కు” ఆమె కారెక్కింది. కారు కదిలింది.

    షినాయి నగర్‌లో పెద్ద బంగళా అతనిది. దారిపొడుగునా చిట్టితల్లి ఏదో అడుగుతూనే ఉంది. దక్షిణామూర్తి పరధ్యానంగా సమాధానాలు చెపుతున్నాడు. ఆఖరుకి కారు పెద్ద ఇనుప తలుపులను దాటి గుండ్రటి రోడ్డు వెంట తన ఇంటి ముందు పోర్టికోలో అగేవరకూ అతనొక నిశ్చయానికి రాలేకపోయాడు.

    చిట్టితల్లి నేం చేయాలి?

    ఆమె కెలాగో సహాయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తెరచిన కారు తలుపు పక్క నిలబడి, అమాయకంగా ఆమె చెప్పిన కథ విన్నప్పుడు అతని వ్యక్తిత్వం ఆపాద మస్తకమూ నీరయిపోయింది. ఆ ముహూర్తంలో ఆమెను కారెక్కమనడం తప్ప మరో ఆలోచన అతని మనస్సులోకి రాలేదు. కాని జరిగినకథ వింటే అనసూయ అతడు చేసినపని హర్షించదు. అనసూయే కాదు, అతని స్నేహితులూ, ఆప్తులూ ఎవరూ హర్షించరు. ఆమెను చూసి జాలిపడ్డం, పదో పదిహేనో చేతిలో పెట్టడం – అంతవరకూ మాత్రం అతని కర్తవ్యమూ, విధీ అని అంతా ఒప్పుకుంటారు. కాని ముక్కూ మెగం ఎరగని ఒక అనాధ బాలికను కార్లో ఎక్కించి ఇంటికి తీసుకురావడం – అదిమట్టుకు అందరికీ వింతగా తోస్తుంది. అందులో తనలాంటి ఆరితేరిన వ్యాపారస్తుడు చెయ్యవలసిన పనికాదు. ఇది వింటే సాటివాళ్ళు అతని అతని మతి భ్రమించిదనుకుంటారు. అతని వ్యాపారానికే కాదు, అతని పేరు ప్రతిష్ఠలకే దెబ్బ. అయితే ఆ పసిపాపను వీధిపాలు చెయ్యడానికి అతనికి మనసొప్పలేదు. పోర్టికోలో ఆగిన కారులోంచి అతను దిగకుండానే తోటమాలి గుడిసె దగ్గరకు నడపమన్నాడు డ్రైవరుని. తీరా తను దిగాక తనకోసం ఎవరన్నా డ్రాయింగు రూములో వేచి ఉంటే వాళ్ళకీ పిల్లను గురించిన సముజాయిసీ అంతా చెప్పుకోవాలి.

    తన ఇంట్లో తనే ఏదో దొంగతనం చేస్తున్నట్టనిపించిం దతనికి. ఒక వంక అనసూయనీ, మరోవంక చిట్టితల్లినీ కూడా ఏదో మోసగిస్తున్నట్టు అతని మనస్సు పీకింది. కాని గుండె నిబ్బర పరుచుకుని, తోటమాలిని పిలిచాడు.

    “ఆర్ముగం! ఈ పిల్లని నీ ఇంట్లో పెట్టుకుని, పెట్టూ పోతా చూస్తుండు.” 

    “ఎత్తనినాళ్ళు సార్” అని అడిగాడు ఆర్ముగం.

    “నేను చెప్పేదాకా, తెలిసిందా. దొరగారికి అన్ని వివరాలతో చెప్పాలగావునేం? నీ పిల్లలతో సమంగా చూస్తుండు.. ఆమెకేమన్నా లోటొచ్చిందా! జాగ్రత్త.” 

    తోటమాలిమీద కోప్పడి, ఆమె విషయం అంత కచ్చితంగా అతనితో ఏర్పాటు చేశాక, అతని మనసులో ఇంతవరకూ అలజడి పెడుతున్న ఆందోళన కొంత తగ్గింది. ఆమె ఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చానని సంతృప్తిపడ్డాడు.

    “ఆఫీసులో అడిగి డబ్బు తీసుకుని ఆ పిల్లకి గుడ్డలు కుట్టించు” అని చెప్పి డ్రైవరుని కారు షెడ్డులో పెట్టమని, ఇంటివేపు నడిచి వెళ్ళాడు. సావకాశంగా ఆ పిల్లని ఒక అనాధ శరణాలయంలో జేర్పించేస్తే, సమస్య అన్నివిధాలా పరిష్కారమై పోతుందని నిర్ణయించుకున్నాడు.

    ఆ తరువాత పని తొందరలో ఆ పిల్ల విషయం పూర్తిగా మరిచిపోయాడు. అన్నిటికన్నా ముఖ్యమయిన పని అతని పెళ్ళి..

    అతను సరదాగా గడిపొద్దామని విశాఖపట్టణానికి బయలుదేరిన రోజునే, అనసూయ తండ్రికి గుండె జబ్బు సూచనలు కనిపించాయట. అనసూయ పట్టుబట్టి ఆ వార్త అతని కందకుండా ఆపించింది. 

    ఒకటి – ఏదో విశ్రాంతికోసం వెళ్ళినతన్ని వెంటనే తగినంత కారణం లేనిదే రప్పించడం న్యాయం కాదనీ; రెండు – తన తండ్రి గుండెజబ్బు అంత ప్రమాదమైనది కాదనీ. 

    అయితే అనసూయ తండ్రి మాత్రం ఒక వాగ్దానం పుచ్చుకున్నాడు. దక్షిణామూర్తి తిరిగొచ్చిన వెంటనే అతనికీ అనసూయకీ పెళ్లి జరిగిపోవాలని. నర్సింగ్ హోమ్ లో తమ ఆస్థాన జ్యోతిష్యుల్ని రప్పించడం, ఇద్దరి జాతకాలూ చూసి, ముహూర్తం నిర్ణయించడం. అన్నీ దక్షిణామూర్తి ఊరికి చేరుకోకుండానే జరిగిపోయాయి. మొదట అతనికి కొంత చిరాకు కలిగింది. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగినందుకు.

    “సరే, నీ కిష్టం లేకపోతే వొద్దని నాన్నతో చెప్పేస్తానులే, ఇందులో బలవంత మేముంది?” అంది అనసూయ.

    “ఆ! అదేమన్నమాట, ఇప్పుడు. పెళ్ళి వాయిదా వేస్తానంటే మాత్రం నే నొప్పుకుంటానా?” అన్నాడు ఛలోక్తిగా దక్షిణామూర్తి – 

    తను చిరాకు పడ్డందుకు అనసూయకి కోపం వచ్చిందని గ్రహించి, ఆమెను దగ్గరగా తీసుకుని పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు కూడా. అంత చనువు ఆమె ఇవ్వడం – తను తీసుకోవడం అదే

    మొదటిసారి. ఆమె ఎంత నవయువతి అయినా కొన్నింటి విషయంలో మాత్రం మహాపాతకాలపు మనిషి.

    ముహూర్తం సరిగ్గా వారం రోజులైనా లేకపోవడం మూలాన అతనికీ ఆమెకూ కూడా నిద్రా విశ్రాంతి లేదు. వ్యాపార విషయాలన్నీ వాయిదావేసి రోజుకి ఇరవై నాలుగు గంటలూ పనిచేసినా పెళ్ళి ఏర్పాట్లు పూర్తయ్యేట్లు కనబడలేదు. బంగారు నగలు బహిరంగంగా చేయించడానికి వీల్లేదు గనుక, అతని ఇంట్లో సరుకు గదిలో ఆ కార్ఖానా ఏర్పాటు చెయ్యాల్సి వచ్చింది. రెండువేపులా పిలుపులు, ఆహ్వాన పత్రాలు వగైరా 

    మామగారు నర్సింగ్ హోమ్ లో ఉన్నారు; ఆయన వంక మగదక్షత లేదుఒక్కగా నొక్క కూతురు. తమ్ముళ్ళన్నీ , వాళ్ళ పిల్లల్ని ఆయన నమ్మలేదు – ముఖ్యంగా డబ్బు విషయంలో..

    అన్నిటికన్నా ఎక్కువకాలం తినేసింది – పెళ్ళిబట్టల ఎన్నిక. 

    ఆమెకు కొనవలసిన చీరలు ఆమెనే ఎంచుకోమన్నాడు దక్షిణామూర్తి,

    “బాగుంది. కట్టుకునేదాన్ని నే నయినా, అనుక్షణం చూసేవాడివి నువ్వు, నీకు నచ్చి తీరాలి.”

    బట్టల దుకాణంలో అడుగు పెడితే, ఒకపూట గడిచిపోయింది, ఒక్క చీరయినా ఎంచకుండానే. పెళ్ళిలోగా ఈ చీరలు కొనడం ఎల్లాగా పూర్తికాదని నిరాశ చేసుకున్నాడు దక్షిణామూర్తి. 

    కాని రేపు పెళ్ళనగా సేలం వెళ్ళి ఆఖరి చీరలు కొనేసి, రాత్రి పదిన్నరకి ఇంటికి తిరిగొచ్చేసరికి, ఫరవాలేదు రేపు పెళ్ళి జరుగుతుందన్న నమ్మకం కలిగిందతనికి. 

    వచ్చిరావడంతోటే సోఫాలో కూలబడి కన్ను మూశాడు. పెద్దగాలివానకి అలసి విశ్రమిస్తున్న ప్రకృతిలాగుంది అతని స్థితి. అప్పుడొచ్చి చెప్పాడు దొర.

    “ఆ పొన్ను కనబడలేదు సార్.” – 

    “ఏ పొన్ను”

    “తోటకారన్ కి మీరిచ్చిన పొన్ను సార్. ఆ దినం మీతో కార్లో ….” 

    “ఏమయింది?” “పొద్దున్న తొమ్మిది గంటలకి చూసినాడంట, ఆ తరువాత చూణ్ణే లేదంట.” 

    దక్షిణామూర్తికి తనేదో తప్పు చేసినట్టనిపించింది. “ఆర్ముగాన్నిలా పిలు.”

    ఆర్ముగం వచ్చాడు. అతన పెళ్ళాం వొచ్చింది. ఇంటిముందు పందిరి వెయ్యడానికి కుదిర్చిన కూలీలందరూ వచ్చారు. అన్ని పోలీస్ స్టేషన్లకీ ఫోన్ మోగింది. ప్రతి అయిదు నిమిషాలకీ వాకబులు. ఎదురుగా కనిపించిన వాణ్ణి తిరిగి తిరిగి అదే ప్రశ్న అడగడం. దక్షిణామూర్తి అందర్నీ తిట్టాడు – తన కప్పగించిన పిల్ల మాయమైనందుకు ఆర్ముగాన్నీ, ఆమె ఎక్కడికి పోయిందో జాగ్రత్తగా చూడనందుకు దొరనీ, ఆమెను పట్టుకోలేకపోయినందుకు పోలీసుల్నీ. పై అధికారులందరూ నిద్ర మేలుకున్నారు – హోమ్ శాఖ మంత్రిగారిద్వారా. అందరూ టెలిఫోన్ల వద్ద కూచున్నారు, చిట్టితల్లి కబురుకోసం. 

    ఒక్క అనసూయకి మాత్రం అతడు ఫోన్ చెయ్యలేదు. ఆ క్షణంలో అతడు అనసూయ సంగతే మరిచిపోయాడు.

    రాత్రి పన్నెండు దాటినా చిట్టితల్లి కబురు తెలియలేదు. దక్షిణామూర్తికి ఆందోళన ఎక్కువైంది. ఈ మహాపట్నం ఆ పసిపాపను మింగేసిందా?

    ఆర్ముగం తన పిల్లలు ఆరుగుర్నీ నిద్రలేపి తీసుకొచ్చాడు. అందర్నీ తిరిగి తిరిగి విచారించాడు దక్షిణామూర్తి. కొన్ని అతనికి మరీ బాధ కలిగించిన వివరాలు దాటేశేవాడు.

     ఉదాహరణకి: మూడు రోజుల క్రితం అతడూ అనసూయా బయటికి పోడానికి కార్లో బయలుదేరినప్పుడు దారి కడ్డంగా నిలబడిందట చిట్టితల్లి, ఆర్ముగం ఆమె నోరుమూసి ఒక గుబురు పక్కకి లాగేశాట్ట – అయ్యగారికి ఆమె ఏడుపు వింటే కోపమొస్తుందని.

    అతన్ని చూడ్డానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిందట. గుమ్మం లోపల అడుగు పెట్టకుండానే అవతలికి ఈడ్చి పారేశాడట దొర. 

    “మా అమ్మ దగ్గరికి తీసికెల్తానన్నాడు. నన్నొదులు.” అని గింజుకునేదట వీళ్ళు పట్టుకుంటే.

    వాళ్ళతో ఎంత గట్టిగా మాట్లాడినా, ఎవర్నీ నిజంగా తిట్టలేకపోయాడు దక్షిణామూర్తి. ఎందుకో వాళ్ళలా చేసినందుకు నిజంగా బాధ్యత తనదే ననిపించి దతనికి.

    మరో రోజున ఆర్ముగం చేతిలోంచి విడిపించుకుని అరుస్తూ తన కారు వెనకాలు పరిగెత్తుకుంటూ వచ్చిందట. పందిరేస్తున్న ఆసామీ ఒకడు వెనకాల వెళ్లి ఆమెను పట్టుకుని తీసుకొచ్చి తిరిగి ఆర్ముగానికి అప్పగించాడట.

    ఇంక చిట్టితల్లి దొరకదన్న నిస్పృహ అతని మనస్సులో ఆవరిస్తున్న సమయంలో ఆర్ముగం మూడో కొడుకు చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది.

    అక్కడే పడుకుని నిద్రపోతున్న బాబుని బలవంతంగా ఊపి లేపాడు దక్షిణామూర్తి, ఈ దిక్కులేని పిల్లకోసం తన యజమాని పడుతున్న ఆందోళన నౌకర్ల కెవరికీ అర్థం కాలేదు.

    “ఏంరా బాలూ! పొద్దున్న ఏమిటి చూశానన్నావు? నువ్వూ చిట్టీ కలసి ఎక్కడికి పోయారు? ఇందాక ఏమిటన్నావు? చెప్పు.” అని ఆత్రంగా అడిగాడు.

    “పాడకట్టసార్. పొణం సార్ పొణం” అన్నాడు బాలు సగం మగతలో. 

    “ఎక్కడ? శవాన్ని ఎటు తీసుకుపోయారు?” “అమింజికలై పక్కమా సార్.”

     “డ్రైవర్! కారు తియ్యి – తొందరగా….”

    డ్రైవర్ షెడ్ తలుపు తెరిచి కారు ఇవతలికి తీసేదాకా అతనికి తొందర ఆగలేదు. తనే షెడ్ దగ్గరకు పరుగెత్తాడు. తనే కారు స్టార్టు చేసి బుర్రుమని శరవేగంతో వీధిలోకి తిప్పాడు. 

    ఎవరో మోసుకుపోతున్న శవం చూసింది. తన తల్లి నలాగే తీసుకుపోయారు. ఆ శవంతో పోతే తన తల్లి తప్పకుండా కనబడుతుందని గంపెడాశతో బయలుదేరింది. చిట్టిపాప. పూనమల్లి హైరోడ్డులోకి కారు తిప్పుతుంటే టైర్లు కిర్రుమన్నాయి. ఒక లారీనీ, ఒక రిక్షానీ భయపెట్టి కారు పూనమల్లి వేపు స్థిరపడింది. వంతెన దాటిం తరవాత వేగం తగ్గించాడు. కుడిచేతి పక్కనున్న సర్చిలైటు వెలిగించి ఆ స్మశానం అంతా వెతుకుతూ మెల్లగా కారు నడుపుతున్నాడు. 

    నిర్మానుష్కమైన ఆ స్మశానంలో, ఆ కటికి చీకట్లో – ఏకాకిగా నిస్సహాయంగా దూరంగా కూర్చుని వుంది – ఒక చిన్న ప్రాణి. ఆమె చిట్టితల్లి అని గుర్తు పట్టాడు దక్షిణామూర్తి. 

    తన తల్లిని వెతుక్కుంటూ మద్రాసు వచ్చింది. తన తల్లిని వెతుక్కుంటూ స్మశానంలోకి వచ్చింది. తల్లి లేదనీ, ఎక్కడా లేదనీ, తనకింక కనబడదనీ తెలుసుకుంది. తల్లి లేని లోకం స్మశానం. ఆ స్మశానంలో ఒంటరిగా కూర్చుంది. ఆ దృశ్యం కనబడగానే దక్షిణామూర్తికి లోపల ఎక్కడో విపరీతమైన బాధ పుట్టింది. అల్లాగే స్టీరింగు చక్రంమీద కళ్ళు మూసి వాలాడు. మెల్లగా కారు తలుపు తెరిచాడు. స్మశాన నిశ్శబ్దాన్ని భంగపరచకుండా జోళ్ళు విదిలించి పారేసి వట్టి పాదాలతో నడిచాడు – కారు దీపాలయినా ఆర్పకుండా. 

    వీటి వెనక ఒక క్షణం నిలబడ్డాడు; మెల్లగా వంగాడు. కూర్చున్నాడు. చేతులు చుటూ వేశాడు. 

    ఆమె ఒక్కసారి ఉవ్వెత్తుగా లేచింది. “నన్నొదిలేసెయ్. మీరంతా దొంగలు. నన్ను ముట్టుకోకు – నన్నొదిలేసెయ్.”

     “చిట్టీ” అన్నాడు! మెల్లగా, మృదువుగా… 

    అబద్దాలాడారు నాతో – రంగత్తా, నువ్వూ అంతా. మా అమ్మని అల్లాగే కాల్చేత్తే – ఆస్పత్రిలో ఉందన్నారు, పట్నంలో ఉందన్నారు. ఎందుకన్నారు? మా అమ్మ ఇంకా లేదంటగా. ఇంకసలు రాదంటగా. ఉందని ఎందుకన్నారు నాతో – నాతో అబద్దాలేదుకాడారు మీ రంతా? రంగత్తా, నువ్వూ – అంతా?” 

    మాటమాటకీ మధ్య ఎగుపుల్లో, ఆకస్మికంగా తగిలిన గాయం రక్తం చిందుతోంది. ఆమెలో, ఆకస్మికంగా కలిగిన జ్ఞానం కత్తిలా ఇంకా కోస్తోంది. దక్షిణామూర్తికి తెలుసు, ఆ గాయాన్ని ఓదార్పులు మాన్పలేవని.

    చిట్టి తల్లిని భుజంమీద వేసుకున్నాడు. కాలుతున్న చితుల మధ్య కాలిబాటవెంట రోడ్డు వేపు నడిచాడు. చిట్టితల్లి ఎగుపులు క్రమంగా సన్నగిల్లాయి. ఆమె ఎడంచెయ్యి అతని కంఠాన్ని చుట్టుకుంది – ఇంక జీవితాంతం వదలని బంధంలాగా..

    కారు తలుపు తెరిచి చిట్టిని లోపల సీటు మీదికి దింపాడు. అప్పుడు చూశాడు చిట్టి తల్లి నిద్ర పోయిందని. ఆమె శరీరం వశం తప్పి సీటు మీద పడిపోయింది. ఉదయం తొమ్మిది గంటల నించి ఈ నాలుగోఝూము రాత్రి వరకు ఆ లేత మనస్సులో ఎన్ని ఉప్పెనలు చెలరేగాయో ఊహించుకోగానే అతని ఒళ్ళు జలదరించింది. తలుపు మెల్లగా మూసి, డ్రైవరు సీటు వేపు కొచ్చాడు. ఒక్కసారి దిగంతం వరకూ పరుచుకున్న స్మశానం వేపు చూశాడు. మెల్లగా కారులో ఎక్కి తలుపు మూశాడు. పరధ్యానంగా ఇంటికి నడిపించాడు కారు.

    మిగతావాళ్ళు చిట్టి తల్లిని తియ్యబోతోంటే వారించాడు. తనే ఎత్తుకుని వెళ్ళి లోపల సోఫాలో పడుకోబెట్టాడు.

    పక్కనున్న ఫోను తీసి అలవాటైన నంబరొకటి డయల్ చేశాడు. కొంత సేపటికి – ఎంతో సేపటికి పరిచయమయిన కంఠం నిద్రమత్తులో బరువుగా పలికింది.

    “డార్లింగ్! ఏమి టింత రాత్రివేళ?” అంత రాత్రివేళ అతడు తప్ప మరెవ్వరూ ఫోన్ చెయ్యరని ఆమెకు తెలుసు. –

    “నువ్వు తక్షణం ఇక్కడికి రావాలి.”

     “రేపు పెళ్ళన్న సంగతి మరిచిపోయావా?”

    “లేదుగనకే రమ్మంటున్నాను. నువ్వు వచ్చి తీరాలి. నీకో ముఖ్యమైన బహుమానం ఇవ్వదలిచాను…. అది నువ్వు అంగీకరించాలి.”

    “ఏమిటది?”

    “నువ్వు రాగానే చూపిస్తాను” అతడు ఫోన్ పెట్టేశాడు. ఆమె వస్తుందని తెలుసు. అతని చెయ్యి అప్రయత్నంగా చిట్టితల్లి తల నిమురింది, అనసూయతో మాట్టాడినంతసేపూ. ఫోన్ పెట్టేసాడు. అనసూయతో చెప్పదలుచుకున్న మాటలు మననం చేసుకున్నాడు.

    “అనసూయ! ముందీ చిట్టితల్లికి నువ్వు తల్లివి కావాలి. అయితేనే నాకు భార్యవు కాగలవు.” 

    అతని హృదయంలో అమితమైన ప్రశాంతి నిండింది.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    20 min
  • పార్ట్ 1 - 'చిట్టి తల్లి' - పాలగుమ్మి పద్మరాజు గారి రచన

    న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ అంతర్జాతీయ కథా అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన ‘చిట్టి తల్లి’ కథ , పాలగుమ్మి పద్మరాజు రచనలు – మొదటి వాల్యూమ్ లోనిది . 

    పుస్తకం కొనడానికి కావాల్సిన web link

    Palagummi Padmaraju Rachanalu -Vol1

    కథను మీకందించడానికి అనుమతినిచ్చిన పాలగుమ్మి సీత గారికి కృతజ్ఞతలు. కథను రెండు భాగాలుగా ఆడియో చెయ్యడం జరిగింది, నిడివి ఎక్కువ కావడం వల్ల .

    ఎపిసోడ్లో ముందుగా వారి తండ్రి గారి గురించీ , కథ గురించీ పాలగుమ్మి సీత గారు మాట్లాడతారు.

    చిట్టి తల్లి:

    దక్షిణామూర్తి గాలి పీల్చుకోడానికి నిడదవోలు ప్లాట్ఫారం మీదికి దిగాడు. కుపే ఒక రకంగా సుఖంగానే ఉంటుందిగాని, మిగతా పెట్టెలాగ రైలు కదులుతున్నా గాలి రాదు. అయితే – కుపేలోకి బొగ్గు నెరుసులు, అనవసరమైన ప్రయాణీకులు అట్టే రారు. లాభనష్టాలు ప్రతిదానికీ ఉంటాయనుకుని తృప్తి పడ్డాడు దక్షిణామూర్తి…

    ప్లాట్ఫారం మహా రద్దీగా ఉంది. ఈ పెట్టెలో కాళీ లేదంటే, ప్రయాణీకులు మరో పెట్టి దగ్గరకు పరుగెత్తుతున్నారు. వాళ్ళ ఆత్రంలో జంతు సహజమైనదేదో ఉంది. అసలు దక్షిణామూర్తి ఎన్నికలో సామాన్య ప్రజలు జంతువులే, అయితే అప్పడప్పుడు ఆ జంతువులతో రాసుకు తిరగడం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటప్పుడు, బొత్తిగా ఒంటరిగా కొన్ని గంటల సేపు కుపేలో ప్రయాణం చేశాక, జీవ చైతన్యం ఉన్న వస్తువులతో తాత్కాలిక సంపర్కం కాస్త అవసరం. అయితే ఆ సంపర్కం అతనికి విసుగు పుట్టిస్తే, మళ్ళీ తన ఏకాంతంలోకి తను పోవడానికి అవకాశముండాలి. ఆ కుపేలోకి పోతే, ఈ జనం తన్ను తాకలేదన్న ధీమాతోనే, దక్షిణామూర్తి జనసముద్రంలోకి అడుగుపెట్టాడు. సోడాలూ, తినుబండారాలూ, పుస్తకాలూ అమ్మేవాళ్ళు పెట్టెలను తోసుకుంటూ, అతన్ని రాసుకుంటూ పోతున్నారు. పక్కపెట్టెలో మనిషి అరిటిపండు తినేసి విసిరిన తొక్క అతన్ని తలవెంట్రుక వాసిలో దూసుకుపోయింది. జనప్రవాహాన్నించి కొంచెం దూరం తొలిగి నిలబడ్డాడు దక్షిణామూర్తి. ప్లాట్ ఫారం మీదికి దిగడంలోనూ లాభనష్టాలున్నాయి.

    “ఏండోయి దక్షిణామూర్తిగారూ? హ! హ!హ!” అంటూ ఒక విగ్రహం అతని రెండుచేతులూ పట్టుకుని ఊపింది.

    “ఏమిటి విశేషాలు? పట్నమేనా? ఏవండీ! అక్కడెక్కడో అచ్చు ఇటికల ఫాక్టరీ పెడుతున్నారంట, కాస్త వివరాలు మాక్కూడా ఇవ్వండి.

    దానమ్మా మోసిరి ఉన్న లాభాలన్నీ మీరే ఏసుకోవాలేంటండీ? అవునుగాని, కలప మా దగ్గిర కొనడం బొత్తిగా మానేశారేంటి?”

    దక్షిణామూర్తికి వ్యాపారమంటే పిచ్చి మోజు. లాభ నష్టాల మాట అటుంచి, అసలు వ్యాపారంలో ఏదో ఒక విధంగా తనది పైచెయ్యి అనిపించుకోవాలి. అయితే ఒక్కొక్కప్పుడు – ముఖ్యంగా ఇలాగ విశ్రాంతి కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు – వ్యాపార వాతావరణం నించి దూరంగా ఉండాలనిపిస్తుంది. కాని పెద్ద వ్యాపారస్థుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాక, ప్రతి ఊళ్ళోనూ పదిమందితో వ్యాపార రీత్యా పరిచయం ఏర్పడ్డాక, అలా దూరంగా తొలిగిపోయి ఉండడం అసాధ్యమని అతనికి అనుభవంవల్ల తెలుసు. అదీగాక తనకు లోపల ఎంత చిరాకుగా ఉన్నా వాళ్ళతో ఆప్యాయంగా, చిరునవ్వు చెదరకుండా మాట్టాడ్డం వ్యాపారానికి ముఖ్యావసరం – 

    ఒక్కరికి మనస్సు నొచ్చుకునీ మాట అతడు మాట్లాడాడా, అతను ఇన్నాళ్ళూ నిర్మించుకుంటూ వచ్చిన పలుకుబడి, ఔన్నత్యం పేకమేడలాగ కూలిపోతుందని అతనికి తెలుసు. 

    పలకరించడం కోసమే దగ్గరగా వచ్చారు. మరికొందరు అతని సహాయం అర్థించడానికొచ్చారు. 

    . అతడు అందరిని సమంగా మాటలతో గౌరవించి, రైలు కదలబోతుండగా తన కుపే ఎక్కేశాడు. ఎక్కుతూ రైలులో ప్రయాణం చేస్తున్న ఉద్యోగిని సంజ్ఞచేశాడు

    “చూడప్పలసామీ, ఆ పెద్దమనుషులంతా ఈ కుపేలో పై బర్తుకోసం నిన్ను వేధించుకు కతింటారు. నా స్నేహితులెవరో బెజవాడలో ఎక్కుతారు, అంచేత రెండూ నేనే రిజర్వు చేయించానని చెప్పు.”

    “నాకు మీరు చెప్పక్కర్లేదు సార్. అప్పుడే కొందరు నన్నడగడం, నేను కాళీ లేదని చెప్పడం అయింది.”

    ఉద్యోగి కదులుతున్న రైలు కమ్మీ పట్టుకుని పక్క కంపార్టుమెంటులోకి వెళ్ళిపోయాడు. దక్షిణామూర్తి తన కుపే తలుపులు గట్టిగా మూసుకున్నాడు. ఇంక పట్నం వెళ్ళేవరకూ వాటిని తెరవకూడదనుకున్నాడు. పాపం రైల్వే ఉద్యోగులు అతనెంత చెపితే అంత. అతను కావాలంటే రైలంతా కాళీ చేయించి అతనికిస్తారు.

    కొంచెం బొగ్గురజను పడిందేమోనన్న అనుమానం కొద్దీ పక్క బాగా దులిపి మళ్లీ వేశాడు. దక్షిణామూర్తి. తలగడకింద లోపలికున్న పిస్తోలు తీసి చేతితో ఒక్కసారి దాని బరువు చూసి, పక్కని పెట్టుకున్నాడు. ఆ పిస్తోలు దగ్గరుంటే తనకింక ఏ అపాయం రాదని అతని నమ్మకం. 

    అప్పుడే కనుచీకటి పడుతోంది. బర్తుమీద మూలగా ఉన్న దీపం వెలిగించాడు. పైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ విప్పి చదవడం మొదలు పెట్టాడు.

    బ్రతుకొక బజారు. అందులో ప్రతివ్యక్తి విలువను పెంచుకోడానికి ప్రయత్నిస్తాడు. నిత్యం పైకో కిందకో పోతుంటాడు. ధర పెరిగినప్పుడు ధనంగా మార్చుకో గలవాడు సమర్థుడు. ఇంకా పెరుగుతుందన్న ఆశకొద్దీ బిగుసుక్కూచున్నవాడు ఆఖరికి పడిపోక తప్పదు. ధర తగ్గుతున్నప్పుడు ఆదుర్దాగా అమ్మడానికి ప్రయత్నిస్తే, ధర మరీ పడిపోతుంది. ప్రతిదినం ఈ పత్రికలో ఇదే కథ తను చదువుతున్నాడు. ఈవేళ కూడా ఎందుకీ తాపత్రయం ! ఈవేళ హాయిగా అన్నీ మరిచిపోవాలి! రేపెలాగా తప్పదు.

    మూసిన గాజు కిటికీ అవతల అస్పష్టంగా కదిలిపోతోంది. ప్రకృతి – చెట్లు, చేమలు, ఇల్లు, దీపాలు, దగ్గర స్తంభాలు, దూరపు కొండలు. కాని ద్విజ మండల రేఖ మాత్రం అతనితో సాగుతూ వస్తుంది. మధ్య మాయమైనా, మళ్ళీ వస్తోంది. పరధ్యానంగా చూస్తున్నాడు దాని వేపే. ఆ రేఖమీద – అవతరించింది అనసూయ ముఖం. అందంగా, తీక్షణంగా, ఆడతనం, అహంకారం అన్నీ కలుసుకున్నాయి ఆ ముఖంలో. అనసూయా షుగర్ మిల్స్ తనతో అరణంగా తెస్తుంది. ముప్పయి లక్షలు విలువగల ఫ్యాక్టరీకి ఆమె ఏకైక వారసురాలు. ఇంకా పెళ్ళికాకముందే అతని ఇంటికి యజమానురాలులా ప్రవర్తిస్తోంది. ఇంటికే కాదు అతనికిన్ని – తాంబూలాలు పుచ్చుకుని రెండేళ్ళయింది. ఎప్పటికైనా పెళ్ళిచేసుకోక తప్పదు. అయితే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న స్వేచ్చను వీలయినంతకాలం పొడిగిస్తున్నాడు దక్షిణామూర్తి.

    అనసూయ అందమైనదీ, హోదాగలదీ. అతనికి చాలా ఇష్టం. పక్కని కూచుంది ఆమె చెయ్యి పట్టుకుని నలపకండా ఉండలేడు. పళ్లుబిగించి, తీవ్రంగా, ఏకాంతంగా, ఆమెతో ఏకమైపోతున్న దృశ్యాలు ఊహించుకోకుండా ఉండలేడు. ఆమె విలువ ముప్ఫయి లక్షలు – ఈ రోజుని. అయినా అతను పెళ్ళి వాయిదా వేస్తున్నాడు.

    అప్పుడప్పుడు తన బ్రహ్మచారి స్నేహితులు అతన్ని పార్టీలకి పిలుస్తుంటారు. అప్పుడప్పుడు పార్టీలు అతని ఇంట్లోనే జరుగుతుంటాయి. ఎప్పుడో రాత్రి తొమ్మిది గంటలకి ప్రారంభమౌతాయి. అప్పుడప్పుడు తెల్లవారిపోయేదాకా సాగుతుంటాయి. మర్నాడెంత నీరసపెట్టినా, వాటి సరదా వాటిదే. 

    తన టైపిస్టు సులోచన – ఎప్పుడన్నా – ఇంకెవరూ దొరక్కపోతే వస్తుంటుంది. అనసూయకన్నా సులోచన ఎక్కువని కాదు. సులోచనలు వందలకొద్దీ ఉన్నారు. అనసూయ ఒక్కత్తే ఉంది. అయితే అప్పుడప్పుడు ఏ సులోచనతోనన్నా ఒక్క రాత్రి సరదాగా గడపడానికీ, అన్నీ మరిచిపోడానికి అవకాశం ఇస్తుంది బ్రహ్మచర్యం. గృహస్థు అయిన మరుక్షణంనించీ ఈ అవకాశం పోతుంది. 

    ఈ రెండు ఆశ్రమాలకీ, వాటికి తగిన విలువలు నిర్ణయించి, తన వయస్సుకి ఒక ధర ఇచ్చుకుని, పెళ్ళయ్యాక వచ్చీ లాభాలు బేరీజు వేసుకుని, పోయే స్వాతంత్ర్యానికి నష్టపరిహారం కట్టుకుని, లాభనష్టాల పట్టీ ఒకటి మనస్సులో తయారు చేసుకుంటున్నాడు దక్షిణామూర్తి.

    అప్పుడతని కంటబడింది – కదులుతున్న చిడత. ఆ చిడత పాకీ దొడ్డి తలుపుది. ఒక్కసారి పైకి లేచి మళ్లీ కిందపడిపోయింది, చిరు చప్పుడు చేస్తూ..

    దక్షిణామూర్తికి ముచ్చెమటలు పోశాయి. పాకీదొడ్డిలో ఎవడో దొంగ ఉన్నాడు. ఈ కుపేల్లో రెండూ మూడూ కూనీలూ, దొంగతనాలూ జరిగినట్టు పత్రికల్లో చదివాడు. 

    ఈ దొంగలకి దయాదాక్షిణ్యాలుండవు. లేవబోయాడు. లేచి గొలుసు లాగాలని అతని అభిప్రాయం. కూర్చుని కాళ్లు క్రింద పెట్టాడు. టప్పుని చిడత చప్పుడు చేస్తూ రెండో పక్కకి తిరిగి పోయింది. తను లేచి గొలుసు లాగే లోగా దొంగ తనమీదపడి ఏమన్నా చెయ్యగలడు.

     అతని కాళ్ళు జావలా మెత్తబడిపోయాయి. తన దగ్గర దొంగతనంగాని, కూనీగాని చెయ్యవలసినంత డబ్బులేదని చెపితే ఆ దొంగ నమ్ముతాడా? చటుక్కుని పిస్టలు గుర్తుకొచ్చింది. గభాల్న దాన్ని తీసి పాకి దొడ్డి తలుపువేపు గురిపెట్టి అరిచాడు.

    “రా! ఇవతలికి రా?”

    తనగొంతు ఎవరి గొంతులాగో ధ్వనించింది, అవసరమైనంత గట్టిగా, తలుపు మెల్లగా తెరచుకుంటోంది. ఆ చిడతకి ఒక అడుగు పై దృష్టికి కేంద్రీకరించి పిస్టలు గురిపెటాడు. దొంగ గుండెకాయ ఆ ప్రాంతంలో ఉంటుందని అతని అంచనా. తలుపుకీ, గుమ్మానికీ మధ్య చీలిక పెద్దదయింది. తలుపు వెనకాల, అతను చూస్తున్న చోట అంతా కాళీ. దొంగ తలుపు చాటుని దాక్కుని తీస్తున్నట్టున్నాడు.

     “దాక్కుని లాభంలేదు. నా చేతిలో పిస్టలుంది” అని ధీమాగా అన్నా డీసారి

    ఎందుకో ఇంక దొంగ తనకి లొంగిపోయినట్టనిపించింది.

    తలుపు తెరుచుకుంది. అతని చూపులు కేంద్రీకరించని క్రిందభాగంలో ఏదో కదిలింది. 

    కిందికి చూశాడు. చేతులో పిస్టలు అనుకోకుండా జారిపోయింది. నరాలన్నీ సర్దుకుని పట్టు వదిలేశాయి. అతనికి చటుక్కున పక్కలు పగిలేటంత నవొచ్చింది. 

    ఏనుగంత దొంగ ఇవతలి కొస్తాడని అతను అన్నిటికీ సిద్ధపడి ఎదురు చూస్తుంటే అందులోంచి ఇవతలి కొచ్చింది – ఒక ఎలక పిల్లలాంటి చిన్న ఆడపిల్ల.

    నాలుగైదేళ్ళుంటాయి. చింకి పరికిణీ, చింపిరి జుట్టూ, కళ్లు అమాయకంగా చురుగ్గా మెరుస్తున్నాయి. దక్షిణామూర్తికి ఆ పిల్లమీద కోపం మట్టుకు రాలేదు. తన ఆందోళననీ, దయాన్నీ పోగొట్టినందుకు, నిజంగా దొంగ కాకుండా నిరపాయకరమైన చిన్నపిల్లగా మారిపోయినందుకు ఒక రకమైన కృతజ్ఞత కూడా అతనికి కలగక పోలేదు. అందుచేత సౌమ్యంగా అడిగాడు.

    “పాకీ దొడ్లో ఎందుకు దూరావు?”:

     “నువ్వు పెట్లో కెక్కుతుంటే, నేను దొడ్లోకెల్లా” అంది పిల్ల, 

    “అసలీ పెట్లో కెందు కెక్కావు? ”

     “ఈ రైలు పట్నం పోద్దంటగా.”

     “చూడు పిల్లా. ఇది పరుపుల పెట్టి. వొచ్చి స్టేషనులో దిగిపోయి మరో పెట్లో ఎక్కు”

    “ఏం?”

     “ఇది పరుపుల పెట్టెని చెప్పడంలా? మూడో క్లాసు పెట్లో ఎక్కాలి. నీ టిక్కట్టేది?”

     “అదేంటది?” 

    “టిక్కట్టు కొనలేదా?”

    ఆమె లేదన్నట్టు తలూపింది. 

    ఇంకామెను ఏ ప్రశ్న లడిగినా ఏం లాభం లేదనుకున్నాడు. బెజవాడలో రైలాగ్గానే రైల్వే ఉద్యోగికి అప్పగించెయ్యొచ్చు ననుకున్నాడు.

    “ఆ మూల కూర్చో.” 

    ఆ పిల్ల కూర్చుంది. 

    దక్షిణామూర్తి వెల్లగిల పడుకుని పత్రిక తిరగవెయ్యడం ఆరంభించాడు. అది మూసేసి మరో పత్రిక తెరిచాడు. కళ్ళు అక్షరాలని గుర్తు పట్టినా, అవి మనస్సుకి ఎక్కడం లేదు. ఏం చెయ్యడానికి తోచక ఆఖరుకి భోజనం చేసేద్దామని నిర్ణయించుకున్నాడు. బెర్తుమీద పత్రిక పరచి, సీటుమీద నున్న కారియర్ తీసాడు. గిన్నెలన్నీ విడదీశాడు. అబ్బో! పదిమందికి సరిపడా పెడుతుంది వెంకాయమ్మెప్పుడూ.

    వెంకాయమ్మ క్షత్రియ వితంతువు. నిడదవోలు స్టేషన్ కి దగ్గరగా దక్షిణామూర్తికి పిత్రార్జితం ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో పూటకూటిల్లు నడుపుతోంది వెంకాయమ్మ. అతనెప్పుడు నిడదవోలు మీదుగా ప్రయాణం చేసినా, వెంకాయమ్మ కారియర్ లో భోజనం పంపుతుంటుంది. వంట మహా పసందుగా చేస్తుంది. అందులో ఈ వేళ కోడిపలావ్ కూడాను. బాగా ఉడికిన కోడి కండలు చూస్తూంటే నిగనిగ పొటమరించిన వెంకాయమ్మ వీపు మీది కండలు గుర్తుకొచ్చాయి అతనికి. వెంకాయమ్మ రవిక తొడుక్కోదు. వితంతువు. 

    ఆ వీపు, పక్కలూ ఎంత నున్నగా ఉంటాయో అతని వేళ్ళకి తెలుసు. 

    ఆ స్థలం తాలూకు అద్దె మరోరకంగా వసూలు చేసిన ఘట్టాలు అతనికి గుర్తు కొచ్చాయి. అతనికి నవ్వొచ్చింది. తింటూ తింటూ నవ్విన మూలంగా అతను ముఖం పైకెత్తవలిసొచ్చింది – నోట్లో ముద్ద జారిపోకండా. మూల నున్న అమాయకపుకళ్ళకు అపచారం చేసి నట్టనిపించింది.

    “ఆక లేస్తోందా.”

    ఔనన్నట్టు ఆమె తలూపింది. ఒక గిన్నెలో కొంత పలావూ కూరా పెట్టి ఇచ్చాడు.. ఆమె ఆకలిగా తింది. ఆ దృశ్యం చూస్తూంటే దక్షిణామూర్తి మనసు ఎందుకో చివుక్కుమంది. మామూలుగా రైళ్ళలో ముషెత్తుకోడానికి అలవాటు పడ్డ రకం కాదని అతనికి అర్థమైంది. అన్నం తినేసి ఆమె అసహాయంగా నిలబడి ఉంటే, అతనన్నాడు.

    “ఆ గదిలో కుళాయుంది. చెయ్యి కడుక్కురా.”

    ఆమె తన చెయ్యి, తిన్న గిన్నే కడుక్కొచ్చింది. అతడు కూడా భోజనం పూరి చేశాక కారియరు సర్ది చెయ్యి కడుక్కొచ్చాడు. సిగరెట్టు ముట్టించాడు. చేతి సంచీ లోంచి పేక తీసి ఒక్కడూ ఆడుకోడం మొదలు పెట్టాడు. పేకాటలో మునిగిపోయాడు.

    “అది ఇస్పేటు రాణీకదూ?” అంది ఆమె.

     “నీకు పేకముక్కలు తెలుసా?”

    “ఓ. మా నాన్న రోజూ ఆడతాడు. సత్తెన్న మామ, పెద్దగాడు, రత్తయ్య అంతా వొచ్చి కూర్చుని ఆడతారు.”

    “నాతో ఆడతావా?”

     “ఛా! పేక తాకితే పాపం.” 

    దక్షిణామూర్తి తలెత్తి ఆ పిల్లవంక చూశాడు. ఎదురుగా ఉన్న బల్ల చెక్కని ఆనుకుని నిలబడి రైలు ఊపుకి అసహాయంగా ఊగుతోంది ఆ అమ్మాయి.

    “ఎవరు చెప్పారు?” 

    “మా యమ్మ.” 

    “మరి మీ నాన్న ఆడతాడుగా?”

     “అందుకే మా అమ్మని కొడతాడు. ఓతూరి కాలిరిగిపోయింది మా యమ్మకి.”

    దక్షిణామూర్తికి తనెన్నడూ చూడదలుచుకోని ఒకానొక దృశ్యం ముందు తొలిగిపోయింది. పేకాట ఆపి ఒక క్షణం ఆలోచించాడు.

    “మీ నాన్న కేం పని?”

    “తాగుడు, పేకాట. అందుకే అతన్నెవరూ పనికి పిలవరంట – మాయమ్మంది. ఓతూరేమో పెద కామందింట్లో బియ్యం దంపి మాయమ్మ నాలుగు రూపాయలు తెచ్చింది. అదేమో తనకిమ్మని తన్నాడు. అమ్మేమో నామీదికి గిరాటేత్తే, ఆ డబ్బుచ్చుకొని నేను లగెత్తా. నా ఎంట బడ్డాడు. పేటంతా తిప్పినా. రంగడడ్డాచ్చాడు గాని, లేకపోతే దొరకను. నా తల సెట్టునేసి కొట్టాడు. ఇందుగో దెబ్బ.”

    ఎడం చెవి మీది జుట్టు తొలగించి చూపిందా పిల్ల. రెండంగుళాల మేర మానిన గాయం చూశాడు దక్షిణామూర్తి.

    “నువ్వీ రైలెందు కెక్కావు?” 

    “మా యమ్మ పట్టంలో వుందిగా మరి.” 

    “పట్నం ఎందుకు వెళ్ళింది?”

    “మాయయ్య మోటకత్తుచ్చుకొని తెగేశాడుగా మా యమ్మని. పట్టంలో ఆసుపత్రికి తీసుకుపోయారు.”

    “మీ అయ్య?”

     “పోలీసోళ్ళు తీసుకుపోయారు బేడీలేసి. “

    ఆ పిల్ల చెప్పిన కథ కాదు – దక్షిణామూర్తికి వింతగా తోస్తా – ఆమె ధోరణి. – కళ్ళయినా చెమ్మగిల్లలేదు. ఇంత దారుణం జరిగినా, దాని ఘాతుకత్వం ఆమె గహించినట్టు లేదు. దక్షిణామూర్తి పేక తీసేశాడు. పెట్టెలో పెట్టేశాడు. విజయవాడ వచ్చింది. 

    కాని ఆ పిల్లని దిగిపొమ్మని అనలేదు. రైలు మళ్లీ కదిలాక బొమ్మల పత్రిక తీసి నడుం వాల్చాడు. ఆ పిల్ల అలాగే నిలబడి వుంది. .

    “ఆ మూల పడుకో.” 

    “నిద్దర్రాదు.” 

    “ఏం?” 

    “మా యమ్మ పాట పాడాలి.” 

    “ఏం పాట?”

    “వా సిట్టి తల్లీ, నిదరపోవమ్మా, 

    రాసోరి పాపాయి రంగైనవోడు

    సింతల్లో సెంద్రుడూ తొంగిసూసేడు

    పుంతల్లో ఎలుతురూ పిండారబోసె 

    పాకలో పాడావు పాలు సేపింది –

    పండుకో నా చిట్టి పండుకోవమ్మా…… నాకంతే వచ్చు.”

     “పా టింకా ఉందా?”

    “నాకు నిద్దరొచ్చినా మా యమ్మ పాడతానే ఉంటదిగా, అదేంటది? బొమ్మల పుత్తకమా?”

    “ఇలా కూచుని చూడు.”

    అతడు కొంచెం జరిగాడు. అయితే ఆ పిల్ల కిందే కూచుని పత్రికలో బొమ్మలు చూసింది.

    “నీ పేరేమిటి?” అన్నాడు పేజీలు తిరగవేస్తూ,

     “సిట్టితల్లి!” 

    “మంచిపేరు.”

    “ఈ బొమ్మేంటి?” అని అడిగింది. చిత్రంగా ముఖం పెట్టి.

     ఆ ముహూర్తంలో దక్షిణామూర్తికి ఆ పిల్లంత అందమైనది సృష్టిలో మరొకటి లేదనిపించింది. ఒక్కసారి ఆ పిల్ల తలమీద చెయ్యేసి నిమరాలనిపించింది. కాని అంత సబబు కాదని తోచింది. మర్నాడు ఉదయం ఆ పిల్ల దారి ఆ పిల్లది, తన దారి తనది. ఆ రాత్రికి మట్టుకు తను ఆ పిల్లను ఆదుకున్నాడు, ఆకలి తీర్చాడు. టిక్కట్టు లేకండా పట్నం చేరుకోటానికి సహాయపడుతున్నాడు. ఆ అనుబంధం అంతవరకే పెట్టుకోవాలి. 

    ఈ సంగతి అనసూయకి చెపితే ఏమంటుంది? అనసూయ కిది అర్ధంకాదు. చెయ్యకూడని పని చేశాననుకుంటుంది. పోనీ పదిమంది చూస్తుండగా పేదలకు సహాయం చెయ్యడమా కాదిది. అల్లాంటి సేవ ఉబుసుపోకకి అనసూయ చేస్తుంటుంది. కూలిపేటల్లోకి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు నేర్పుతుంది. వాళ్ళ చంటిపాపలికి నీళ్ళుపోసి పాలు పట్టిస్తుంది. అయితే, కూడా పత్రికలు తాలూకు ఫోటోగ్రాఫరుంటాడు. ఆమె ఆ పనులు చేస్తుండగా రకరకాల కోణాలు ఛాయాచిత్రాలు తీసి పత్రికల్లో వేయిస్తాడు. ఆ మురికి కంపు భరించినందుకు ప్రతిఫలంగా ఆమె కీర్తి ప్రచారమౌతుంది. 

    ఏకాంతంగా ఒక రైలు పెట్టెలో ఒక అనాధకి చేసిన మేలు ఎందుకూ పనికి రానిది. బూడిదలో పోసిన పన్నీరు. 

    ఈ చిట్టితల్లి వల్ల తను పొందిన సంతృప్తి కూడా ఒకటుంది. ఈ ఒంటరి ప్రయాణంలో తోడు కావడం ఒకటే కాదు; చిన్న అమాయక ప్రశ్నలద్వార నవ్వొచ్చే కొన్ని నిర్వచనాల ద్వారా, కటిక వ్యాపారస్తుడైన తనవంటి వాడికి ఓ కొత్త అనుభవం కలిగించింది. లాభనష్టాలతో నిమిత్తంలేని అనుభవం అది. దానికి విలువ లేదని దక్షిణామూర్తికి తెలుసు. 

    అతని మనస్సు వర్తక వాణిజ్యాలకు బందీకాదు, వాటికి యజమాని. నయాపైసలూ, రూపాయిల ప్రపంచానికీ బయటుండే విలువలు అతనికి తెలుసు. అంచేతే అతను వ్యాపారస్థులలో అగ్రగణ్యుడు. అంచేతే ఆ విలువలకు రూపాయలు, నయా పైసలలో వెలకట్టగలడు. అనసూయను కూడా అతను వెల కట్టేశాడు.

    “ఏమిటి చూస్తున్నావు చిట్టీ.” అన్నాడు దక్షిణామూర్తి. అతను పరధ్యానంగా ఆలోచిస్తున్నప్పుడు చిట్టితల్లి అతని చేతిలో బొమ్మల పత్రిక తీసుకుని కాళ్ళమీద పరుచుకుని చూస్తోంది.

    “ఈ కుక్క మాటాడగలదా?”

     “ఏం?”

     “దాని నోట్లోంచి ఎవ్వో మాట లొత్తన్నాయిగా?” 

    “నిజమే, మాట్టాడుతోంది?

    ” ఏటంటాది?”

     “ఆ గోడనున్నది తినేదేనా అనుకుంటోంది.” 

    “పిచ్చి కుక్క” 

    “ఏం?”

     “అది టోపీగా, ఎట్టా తింటాది?” 

    “కుక్కగదా, దానికేం తెలుసు?”

     “మరి మా కావేరి కెన్ని తెలుసో తెలుసా?”

     “కావేరెవరు?”

    “మా కుక్క మా అయ్య కల్లుముంత దరికేనా పోదు; పక్కింటి పోతురాజు కల్లు మట్టుకు నాకేత్తాది. మా ఎదురింటి ఆడపిల్లని పట్టుకుని ఏడిపిత్తాది. నే నెక్కడి కెల్లినా కూడా వొత్తాది, టేసనుకి కూడా వొచ్చింది. పెట్టిలో కెక్కకుండా తలుపు మూసేశా.” |

    మా ఇంటి పక్క నుంటాడు. మిల్లు కామందుగారి డైవరు. ఆడికి కారుంది. తాగేసినప్పుడూరికే కామందుగారి పెళ్ళాం ఊసే. పోతుమామకి డబ్బిత్తాదంట. నామీద పడతాది. దూది బత్తా లాగ – డోకంటాడు పోతుమామ. మిల్లు కామందు మడుగులో పడి సచ్చిపోతే పోతుమామని పోలీసోళ్ళట్టుకుపోయారు. పోతుమామ మంచోడు. మాయమ్మని కొడతావుంటే మా అయ్యని సందేటేసి పట్టుకుని వాడు, కదలకుండా.

    పెదమణిసి. రంగత్త దూళ్ళసాల కూలిపోయింది గాలోనకి. లేగదూడుంది పాపం. పోతుమామ ఒంటి సేత్తో కూలిపోయిన పాక నెత్తిపట్టుకున్నాడు. ఆవునీ దూడనీ ఇంట్లో కటేసిందా రేత్రి. పోతుమామ శానా మంచోడు. వొద్దన్నా సరే మా యమకి పావలా అర్థా ఇచ్చి వోడు. ఒకో రోజు బియ్యానికి లేకపోతే..” –

    దక్షిణామూర్తి రెండు చేతులూ తలకింద పెట్టుకుని చిట్టితల్లి ఇల్లూ పరిసరాలూ ఊహించుకోవడం మొదలు పెట్టాడు.

    ఆ పిల్ల చెప్పుకుంటూ పోతోంది. చటుక్కున ఆమెకేసంగతి జ్ఞాపకం వొస్తే అందులోకి దాటేస్తుంది. మొదలు పెట్టిన ఘట్టం పూర్తి చెయ్యకుండానే మరో ఘట్టంలోకి పోతుంది. రకరకాల పేర్లు. ఆడ, మగ వచ్చిపోతున్నాయి. వాళ్లెవరో ఆమె వివరించి చెప్పదు. అయినా ఆమె వివరిస్తున్న కథలో ఒక పరిపూర్ణతుంది. 

    అతని మనస్సులో అతిస్పష్టమైన చిత్రంగా అది క్రమంగా రూపుదాల్చింది. అటువంటి గుడిసెలు, అటువంటి వ్యక్తులు, తనబోటి వాళ్లు ఎన్నోసార్లు చూసి ఉండవచ్చు. వాళ్ల కథలు రకరకాలుగా విని ఉండవచ్చు. కాని నాలుగయిదేళ్ల ఆ పసిపాప వివరించినంత స్పష్టంగా ఆ కథను ఎన్నడూ వినలేదు, ఇక ముందు వినబోడు. ఆమె చిన్ని మాటలలో తను ఎరగని వింత ప్రపంచకం పరుచుకుంది. ఆ వ్యక్తుల్ని ఆ వాతావరణాన్ని మననం చేసుకుంటుండగా అతనికి నిద్రపట్టింది. అతి ప్రశాంతమైన నిద్ర; ప్రగాఢమైన నిద్ర.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    38 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners