Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • హర్ష రాసిన ‘ఎండమావి’ – 'సారంగ' పత్రిక నుంచి!

    ఈ కథ ‘ ఎండమావి’ హర్ష రాసింది , సారంగ’ వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది.

    కథ చదవడానికి – https://magazine.saarangabooks.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%a1%e0%b0%ae%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/

    ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)

    హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి [email protected] కు మెయిల్ లేదా ‘77807 43545 ‘ అనే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి




    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    11 min
  • ఎండపల్లి భారతి గారి 'ఎదారి బతుకులు' పై ప్రముఖ రచయిత ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష!

    ఎండపల్లి భారతి గారి 'ఏదారి బతుకులు' పై ఆర్ ఎం ఉమామహేశ్వర రావు గారి సమీక్ష ను ఈ ఎపిసోడ్ లో వినవచ్చు.

    ఉమామహేశ్వర రావు గారికి హర్షణీయం కృతజ్ఞతలు.

    'ఎదారి బతుకులు పుస్తకం కొనడానికి ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. http://bit.ly/3elxpDj



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    10 min
  • 'నారింజ రంగు సిరా మరకలు' పార్ట్ II -కథా -సమీక్ష

    ఈ ఎపిసోడ్లో , 'నారింజ రంగు సిరా మరకలు ' కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    24 min
  • 'నారింజ రంగు సిరా మరకలు' - మహి బెజవాడ ! పార్ట్ - I

    రచయిత పరిచయం:

    వాక్యాలనూ రంగులనూ జమిలీగా సాధన చేస్తున్న రచయిత. స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. పుట్టింది 1981లో. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసి మెడికల్ ఫార్మసీ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్షియో క్రియేటివ్ ఏజెన్సీ ద్వారా పబ్లిసిటీ వర్క్ చేస్తున్నారు. డాక్యుమెంటరీలు తీస్తుంటారు. ఇప్పటికి ఏడెనిమిది కథలు రాశారు. 'డెడ్ మాన్ గోయింగ్ టు సింగ్' కథలో భిన్నమైన శిల్పంతో ఆకట్టుకున్నారు. 'ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్నర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దానిని విజువలైజ్ చేయడానికి రాస్తే బాగుంటుందని రాస్తున్నాను' అంటారు.

    'నారింజ రంగు సిరా మరకలు', ఒక విలక్షణమైన కథ. 'అస్తిత్వ వేదన' ముఖ్యాంశం గా వచ్చిన కథలు వున్నప్పటికీ, రాసిన పద్థతి వల్ల ఈ కథ ప్రత్యేకతను సంతరించుకుంది. కథ చాలా మటుకు విజువల్స్ ప్రెజెంట్ చేస్తూ, సింబాలిక్ గా రాస్తూ వస్తారు రచయిత. కథంతా భావగర్భితంగానే ఉంటుంది.

    కొన్ని కథలు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిలిస్తే, కొన్ని కథలు ఆలోచింప జేస్తాయి. ఈ రెంటిని సాధించగలిగారు మహి ఒకే కథలో.

    ఆడియో పార్ట్ 1 లో , కథను మీరు వినవచ్చు.

    ఆడియో పార్ట్ 2 లో , కథ గురించి , లాయర్, సామాజిక కార్యకర్త అరుణాంక్ లత గారు, రచయిత్రి, మానస ఎండ్లూరి గారు, రచయితలు అరిపిరాల సత్యప్రసాద్ గారు, వెంకట్ శిద్ధా రెడ్డి గారు మాట్లాడతారు.

    ‘నారింజ రంగు సిరా మరకలు’

    in a highly disturbed state of mind. అతను మానసికంగా చాలా అలజడికి గురవుతున్నాడు. అసలేం జరిగింది ఇతనికి?

    తెల్లని గోడల మధ్య పుస్తకాల గుట్టలు. రాత్రంతా నిద్దురపోడు. అతను దేనికోసమో తపిస్తాడు. ఏదో దొరకని దానికోసం వెతుకుతుంటాడు. ఆ వెతుకు లాటలో భాగంగా చదువుతుంటాడు. చాలా దూరం చదువుతుంటాడు. పగలూ రాత్రి కనబడని దూరం చదువుతుంటాడు. అంత దూరం చదివి, రాయడమే

    మజిలీగా పెట్టుకుంటాడు. మళ్లీ పగలూ రాత్రి కనబడనంత దూరం రాస్తాడు. మళ్లా వెతకడం మొదలుపెడతాడు. చరిత్ర, పాలిటిక్స్, ఫిక్షన్- ఒకటని కాదు. రోజూ ఇదే పనిగా పెట్టుకుంటాడు. ఇవన్నీ చూస్తూ ఒక మూలగా ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పై గుబురు గడ్డం ముసలివాడు సాక్షిగా వుంటాడు. ఈ రాసిన కాగితాలన్నీ అచ్చుకు పోతాయి. పత్రికలవుతాయి, కరపత్రాలవుతాయి. కానీ చదివిన పుస్తకాలన్నీ తన బుర్రలో శిథిలమవుతాయి. చరిత్ర చదివి బాధపడతాడు. కోపం తెచ్చుకుంటాడు. తనలో తాను మథనపడతాడు. చివరికి కథ చెప్పాలంటాడు. అతడు కథ భలే చందంగా చెబుతాడు. తనకిష్టమైన వెన్నెల రాత్రులలో దగా చేసి రాయబడ్డ మన గతాలను ఆ నక్షత్రాల సాక్షిగా చెబుతాడు. మనం మనం కాదు. ఎవరి కోసమో రాయబడ్డ చరిత్ర. చరిత్రను తిరగరాయాలి. మన గురించి మనమే రాసుకోవాలి అంటాడు.

    Not a rare case. But sounds strange.

    మొదట్లో నాకూ వింతగా అనిపించింది. డిప్రెషన్ అనుకున్నాను. కానీ అనుకోకుండా మారిపోయాడు. ఇప్పుడు అన్నింటికీ భయం భయంగా వున్నాడు.

    తనలో తనే వున్నాడు. ఈ లోకంతో పని లేనట్టు తన రూమ్ నుండి బయటకు రావట్లేదు. తన బులుగు రంగు జేబురుమాలును చేతిలోనే వుంచుకుంటున్నాడు. రాత్రుళ్లు గట్టిగా అరుస్తున్నాడు. ఎవరో తన మీద నిఘా పెట్టారంటూ మంచం కింద దాక్కుంటున్నాడు. కానీ చదవడం ఆపలేదు. రోజూ పేపర్ చదువుతున్నాడు. తన పుస్తకాలు చదువుతాడు.

    కానీ రాయట్లేదు.

    రాయడానికి భయం అడ్డుపడుతుంది. కానీ రాస్తున్నాడు. ఎవరికీ కనబడకూడదని రాసిన కాయితాలన్నీ అటక పైన వున్న పాత ట్రంకె పెట్టెలో పెట్టి తాళం వేస్తున్నాడు. అప్పుడప్పుడు తన బులుగు రంగు చేతిగుడ్డను ముఖంపై కప్పుకుంటాడు. ఏడుస్తాడు. ఇదంతా ఆ గుబురు గడ్డం ముసలి మనిషి చుస్తూవుంటాడు.

    ఇలాగే వుంటే అతని పరిస్థితి ఏంటి డాక్టర్?

    It all depends. ఈ అలజడి ఎక్కువైపోయి ఆవేశాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఆత్మహత్యకి దారి తీయడానికి అవకాశం వుంది. ఏమీ జరగకుండానే ఇలానే పిచ్చిలోకి జారిపోయే ప్రమాదమూ వుంది.

    అతను తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం లేదా? దీనికి ఏ రకమైన ట్రీట్ మెంట్ లేదా డాక్టర్?

    ట్రీట్ మెంట్ అంటే, ఇది మందులతో మాత్రమే నయం కాని స్థితి. ఇది మనసుతో చెయ్యా ల్సిన వైద్యం . But it's not a hopeless condition. అయితే అతన్ని మాములు మనిషిని చేసే ప్రయత్నం కేవలం ఒక్కరికే సాధ్యం.

    ఎవరు డాక్టర్?

    తనే! Yes he only can cure himself. ఈ పరిసరాలు ఇవీ మారి తన కిష్టమైన చోటుకు తీసుకెళ్లి తనకు అడ్డు చెప్పకుండా తను ఇష్టపడే పనులు తనను చెయ్యనివ్వండి. తను ఏం మాట్లాడతాడో మాట్లాడనివ్వండి. తనలో వుండే ఇమేజెస్ ని మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తన మాట మీరు వింటున్నారు అంటే తనలో కూడా ఏదైనా మార్పు రావొచ్చు. But it's a long shot!

    Ok, Thank You, Doctor!

    గ్త్ ఎఫెకు పెట్టాను.

    మనం నీకిష్టమైన కన్యాకుమారి వెళ్తున్నాం. ఢిల్లీ టూ ఆగ్రా, ఆగ్రా టూ నాగపూర్, నాగ్ పూర్ టూ హైదరాబాద్, హైదరాబాద్ టూ బెంగుళూర్, బెంగుళూర్ టూ కన్యాకుమారి. On the road! అదీ ప్లాన్. వింటున్నావా?

    ఇప్పుడెందుకు ఇదంతా? నేను బాగానే వున్నా కదా?

    Yes! You are absolutely fine. జస్ట్ నాకు నీతో కన్యాకుమారి చూడా లని వుంది. వెళదాం. నీకు కాస్త ఛేంజ్ గా వుంటుంది కదా. ఎప్పుడూ ఆ నాలుగు గోడల మధ్య ఫ్లాట్ లో లోన్లీగా....

    లోన్లీగానా? Never! I like to be alone. అంతే!

    సరే. సరే. నువ్వు నాతోపాటు కన్యాకుమారి వస్తున్నావ్ అంతే. ఇది ఫిక్స్. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం. ఎక్కువ ఆలోచించకుండా త్వరగా పడుకో. Bye.

    ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు అతనికి. ఏదో వెతికాడు. పుస్తకాల షెల్ఫ్ నుండి Hard Bound పుస్తకం ఒకటి తీశాడు. అందులో కొన్ని పేజీలు వెతికి చదివాడు. ఆ పేజీలను చించి బులుగు రంగు రుమాలులో పెట్టి ముడి కట్టాడు. ఇంకా ఏదో పుస్తకం కోసం వెతికాడు. దొరికింది. ఆ అట్టపై ముక్కు విరిగిన శిల్పం

    బొమ్మ వెక్కిరిస్తునట్టుగా వుంది. దాన్ని చించి ఆ రుమాలులో మూటకట్టాడు. భయంగా ఒక కాగితంపై రాస్తున్నాడు.

    మనుషులు: రంగు-నలుపు-తెలుపు

    చరిత్ర: వక్రీకరణ-రాసినవాడు ముక్కు కొట్టేసిన శిల్పం: ఎద్దు-గిట్టలు-నురగ

    ప్రాంతం: ఉత్తరం దక్షిణం రాజ్యం: హత్య-ఆత్మహత్య-దాడి-నిఘా థి తాన్ని కూడా తన wు జురుమలులో మూటకట్టాడు. ఆ రాత్రి నిద్రపోలేదు. అలాగే కూర్చొని వున్నాడు. ఎదురుగా గుబురు గడ్డం ముసలి వాడు సాక్షిగా.

    ఏరా? ఇంకా రెడీ కాలేదా? వెళ్లాలా? తప్పదా?

    అదేంటి అంతా ఫిక్స్ చేశాను కదా! ఇప్పుడేంటి ఇదంతా? కళ్లేంటి ఎర్రగా వున్నాయి?

    రాత్రి నిద్రపోలేదా?

    లేదు.

    సరే get ready. కార్లో రెస్ట్ తీసుకుందువులే!

    Zolpidem 10mg ఇది వేసుకో నిద్రకి. మన నెక్స్ట్ స్టాప్ ఆగ్రా. ఇప్పుడు పదయ్యింది. ఇంకో నాలుగు గంటల్లో రీచ్ అయిపొతాం. ఏంటి వింటున్నావా?

    ఆ..

    లంచ్ కి ఆపుతా. అప్పుడు లేద్దువులే పడుకో. వొద్దు. ఏమీ తినాలని లేదు. నేరుగా ఆగ్రాకి వెళ్లిపోదాం. ఓకే. యువర్ విష్!

    షాజహాన్ నిర్మించిన తన ప్రేమ సౌదం తాజ్ మహల్. దాదాపు ఇరవై రెండు వేల మంది శ్రమ, సృజన కేవలం ఒక రాజు ప్రేమకి చిహ్నంగా మిగిలింది. మరి ఇంతమంది సృజనకారుల ప్రేమకథలు ఎంత గొప్పవి. ఈ ఇరవై రెండు వేల

    ప్రేమకథలు ఎక్కడా చరిత్రలో లిఖించబడలేదు. 22 ఏళ్ల వ్యవధిలో మనసు మనసుకొక, మనిషి మనిషికొక ప్రేమకథ వుంటుంది అంటాడు. షాజహాన్ తన

    ప్రేమకు చిహ్నంగా నిర్మించిన సమాధిలో ఎన్ని ప్రేమకథలు భూస్థాపితం చేసారో. తాజ్ మహల్ చుట్టూ వున్న గాలి అంతరాలలో ప్రతి అణువునా, ప్రతి చలువరాతి స్పర్శలోను, ప్రతి నగిషీ ఒంపులోను ఈ ఇరవై రెండు వేల మంది ప్రేమకథలు నిక్షిప్తమై వున్నాయి అని అంటాడు.

    Reaching agra రా. almost 10 Km. Time ఎంత ?

    5.15 కావొస్తోంది, sunset ki reach అయిపోతాం . నీకోసమే ఇదంతా. నువ్వేమయినా పోయెట్రీ చదువుతావేమోనని ఆశ! అందుకే చేసా.

    వొద్దు. డైరెక్ట్ గా రూమ్ కి వెళదాం . అదేంటి నేనేమో ఇంత ఆశగా వుంటే. వొద్దు. ఎందుకు వొద్దు...? నాకు ఇష్టం లేదు.

    అరే ఎప్పుడూ చెప్పేవాడివి కదా! సన్సెట్లో తాజ్ మహల్ ని చూస్తూ యమునానది ఒడ్డున కూర్చొని ప్రేమకథలు చెబుతాను అని ఊరించేవాడివి, ఇప్పుడే మయ్యిందిరా?

    ఇప్పుడు ఉదయాలను, అస్తమయాలను కొన్ని అందాలతో కలిపి చూడ

    లేకున్నా!

    అదే ఎందుకు?

    ఆ రంగే అత్యంత కిరాతకంగా సహజమైన చరిత్రను కప్పేస్తుంది.

    What the fuck man!!! You are becoming cynical, self destruction ఇదంతా! ఎందుకిలా?

    Yes destruction, but not self.

    ఏమోరా! ఈ ట్రిప్ నీకోసమే. కాస్త మామూలు అవుతావనే. నీ మాటలు వినాలని, నీ రాతలు మళ్లీ చూడాలని, నీ బ్లాక్ ని క్లియర్ చెయ్యాలని, నేను బిజీ షెడ్యూల్స్ లో వుండి కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేసా, only because of you. బీ నార్మల్.

    రూమ్ కెళదాం. మరి ఆగ్రా వచ్చి తాజ్ మహల్ చూడకుండా ఎలారా? వెళ్లడం. నాకు చూడాలని లేదు, Don't force me. Okay. But one condition. నాకు రూమ్ కెళ్లాక కథ చెబుతానంటేనే.

    హ్మ.

    కాలం చెప్పిన కథలు కాలం చెల్లినట్టుగా, ఇది కానరాని కథ. మనం తెలుసు కోవాల్సిన కథ. చరిత్ర మట్టిపొరల్లో దాగిన కథ. మనల్ని మనమే తవ్వుకోవాలి అంటాడు. తను ప్రయాణం చెయ్యాలి అంటాడు. తనకి తన వేర్లు ఎక్కడ మొదల య్యాయో తెలుసుకోవాలని తపన పడతాడు. అందుకు అక్షరాలను సాయం అడుగు తాడు. ఆ అక్షరాలు తన గమ్యాన్ని పక్కత్రోవ పట్టిస్తాయి. అందుకే వెతకడం ప్రారం

    భిస్తాడు. ఒక పురాతన మనిషి కోసం తన ప్రయత్నం మొదలుపెడుతాడు. అక్షరాలు తనని మోసం చేసినా, తన వెతుకులాటలో ఆ పురాతన మనిషి దొరుకుతాడు.

    పొడవాటి జుట్టుతో గడ్డం మనిషి పూల పూల కంబలి సగం మడిచి భుజం మీదగా ఛాతికి అడ్డంగా కప్పుకొని వుంటాడు. కానీ ముక్కు చెదిరి వికృతంగా నవ్వుతుంటాడు. ఆ మనిషి తన చెయ్యి పట్టుకొని ఒక్క ఉదూటున లాకెళ్లిపోతాడు. ఎంతదూరం అంటే కొన్ని శతాబ్దాల కాలం అంత దూరం. సువిశాల మైదానం చక్కగా అమర్చినట్టు అగ్గిపెట్టెలాంటి రాతి ఇళ్లు. మనుషులంతా అందరు ఒకటే రంగు నలుపు. చూడటానికి రెండు కళ్లు చాలవన్నట్టు చూస్తుంటాడు. అద్భుతమైన కట్టడాలు. మనుషులు ఇంత సృజనకారులా? అని ఆశ్చర్యపోతాడు.

    ఇంతలో తెల్లరంగు మనుషులు వలస వస్తారు. నెమ్మదిగా ఉత్తరం, దక్షిణం అంటూ విభజిస్తారు. వాళ్లు గొప్ప... వీళ్లు గొప్ప అని చర్చ లేవనెత్తుతారు. 

    తెలుపు రంగు వుత్తమమైనదిగా తేలుస్తారు. దీని పైన సృజనకారులు తమదైన పద్దతిలో నిరసన మొదలుపెడుతారు. కథలు రాస్తారు. పాటలు పాడుతారు. బొమ్మలు వేస్తారు. కరపత్రాలు పంచుతారు. అప్పుడు గొప్పవాళ్లుగా నిర్ధారించుకున్నవాళ్లూ తమ ఆధిపత్యం కోసం వేట మొదలెడతారు, మనుషులు దిక్కులు చూసుకొని చెల్లాచెదురవు తారు. ఇక కొంతమంది సృజనకారులు బట్రాజుల అవతారం ఎత్తుతారు. వారిచే చరిత్రను తిరగరాస్తారు. నిరసన తెలియజేస్తున్న సృజనకారులను వేటాడుతారు. ఎదురుగా సింహాసనంపై ధర్మశాస్త్రన్ని ప్రతిష్టింపజేస్తారు. దానినే అనుసరించాలంటూ బట్రాజులు ప్రచారం మొదలెడతారు. అందుకు బహుమతిగా కొత్త జోళ్లను బహుమతిగా ఇస్తారు. ఇక బట్రాజులందరూ వారికి గుర్తింపుగా ఆ జోళ్లను తొడుక్కుంటారు. ఇదంతా కళ్లకు కట్టినట్టు ఆ పురాతన మనిషి తన చెయ్యి పట్టుకొని చూపిస్తాడు. వెంటనే ప్రయాణం మొదలెట్టి ఎక్కడ కలిశారో అక్కడ ఆగుతారు. ఆ పురాతన మనిషి శిలలా మారిపోతాడు. ముక్కు కొట్టేసిన శిల్పం వెక్కిరింతగా చూస్తుంటుంది. ఇది చరిత్ర అన్నట్టుగా.

    ఏమైంది రా what the hell are you doing???

    ఫీలింగ్ ద పెయిన్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా?

    యెస్. యు ఆర్ ఇన్ బ్లడ్ పూల్! యెస్ ఐ నో! పద ముందు హాస్పిటల్ కి వెళదాం.

    నో!

    రా. నువ్వు ఆ చెయ్యి ఇలా ఇవ్వు ముందు. కర్చీఫ్ వుందా?

    యెస్ ఏంటి ఏవో మూట కట్టావ్? కాగితాలు. చిత్తు కాగితాలు. ఆ నెమ్మదిగా కట్టు. పద ముందు.

    డీప్ గానే కట్ అయ్యింది. త్రీ స్టిచెస్ వేశాను. తను చాలా డిప్రెస్సెడ్ గా వున్నారు. It's better to go back to your doctor. తన కండిషన్ క్రిటికల్ గా నే వుంది. మెడికేషన్లో వున్నట్టున్నాడు.

    యెస్ డాక్టర్.

    అంబులెన్స్ లో షిఫ్ట్ చెయ్యండి. కొద్దిగా డ్రోసీగా వుంటారు. కాస్త మాట్లాడుతూ తీసుకెళ్లండి.

    ఓకే! థ్యాంక్యూ.

    వేట ప్రారంభమైంది. నలుగురు మనుషులు పెద్ద మోకును పట్టుకుని పరిగెడుతున్నారు. ఎద్దు గాబరాగా పరిగెడుతోంది. ఒక గుండె ప్రాణం కోసం రొప్పు తోంది. నాలుగు గుండెలు దాని ప్రాణం కోసం అన్నట్టు రొప్పుతున్నారు. ఒకడు పక్కగా వచ్చి రెండు కొమ్ములకి గురి చూసి ఉచ్చులా చేసిన మోకును గురి చూసి విసిరాడు. అంతే ఒక్కసారిగా అది పరిగెత్తడం మాని కొమ్ములకి వేసిన ఉచ్చును తీసుకోవాలని చూస్తోంది. పక్కగా ఎద్దు కుడి కాలి గిట్టలకు మోకు వుచ్చును బిగించి వేసాడు. ఇంకొకడు మోకును దాని నడుము చుట్టూ రెండు మెలికలుగా వేసి ఒడుపుగా దాన్ని కింద పడేస్తారు. అది బెదురుగా నేల కూలుతుంది. ఈ తంతు ఊరి చివర అమ్మోరు గుడి ముందు జరుగుతుంది. అది రంకెలు వేస్తుంది. అత్యంత కిరాతకంగా దాని నాలుగు కాళ్లూ కట్టివేస్తారు. అప్పుడు లాల్చి వేసుకుని గళ్ల లుంగీ కట్టుకుని, నుదిటిన మచ్చతో, పొడవాటి గడ్డంతో, ప్రాణంతో మాత్రమే వున్న బక్క పలచని మనిషి తన పెట్టె తీసుకొని వస్తాడు. ఆ పెట్టె నుండి తీసిన ఇనుప నాడాలను ఎద్దు గిట్టలకు కొట్టే ప్రయత్నం మొదలుపెడుతాడు. అది కన్నీరు పెడుతుంది. కంట నీరు దారలుగా నేల కారుతుంది. తనది కానిదేదో తాను తొడుక్కోలేను అని మూగగా గింజుకుంటుంది. అది గింజుకున్న ప్రతిసారీ ఆ నలుగురు మనుషులు గట్టిగా పట్టు కుంటారు. ఒప్పుకోదు కానీ వీళ్లూ ఒప్పుకోరు. తన సహజమైన పాదాలకు ఇవి ధరించడం ఇష్టంలేదు. కనుకనే పోరాటం. ఇవి తొడిగి తమకు నచ్చినట్టుగా నడిపించుకోవటం కోసం ఆ నలుగురి పోరాటం. ఈ పనే నువ్వు చెయ్యాలి. ఇదే నీ వృత్తి అన్నారు కాబట్టి ఆ బక్క పలచని మనిషి పోరాటం. కాని ప్రకృతి ఒకటి వుంది కదా అది ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవడానికి సహజసిద్ధంగా కొన్ని పోరాట లక్షణాలను స్వభావాలుగా పొందుపరుస్తుంది. అందుకే ఇక ఎద్దు పోరా టానికి సిద్ధమైంది. పెద్దగా రంకెలు వేస్తూ నోటి నుండి నురగలు కక్కుతూ, మోకుల్ని తెంపుకొని ఒక్కసారిగా అస్తమిస్తున్న ఆ సూర్యుడి ఎదురుగా రెండు కాళ్లు పైకెత్తి ధిక్కరింపుగా చూస్తోంది.

    10

    3

    Electro Compulsive Therapy-ECT. దీన్నే షాక్ ట్రీట్ మెంట్ అని అంటుంటారు. మెడికేషన్ కి ఏమీ రెస్పాండ్ కావట్లేదు. పైగా సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. ఇక మీరు డిసైడ్ చేసుకోండి తన ఫ్యామిలీ ఎవరైనా వుంటే ఇన్ఫార్మ్ చెయ్యండి. కన్సెంట్ ఇవ్వాల్సి వుంటుంది. మేక్ ఏ క్విక్ డెసిషన్ ప్లీజ్.

    ఫ్యామిలీ ఎవరూ లేరు డాక్టర్! ఎవరన్నా వున్నారు అంటే మేమే. ఫ్రెండ్స్ మాత్రమే. షాక్ ట్రీట్ మెంట్ అంటున్నారు.

    దానివల్ల ప్రాబ్లమ్ ఏం వుండవు కదా డాక్టర్?

    హుమ్ వుంటాయి. కన్ఫ్యుషన్, మెమొరీ లాస్, హెడేక్, ఇలాంటివి వుంటాయి. ఇది కాకుండా మేజర్ రిస్క్ అంటే ట్రీట్మెంట్ సమయంలో బ్లడ్ ప్రెషర్ పెరిగి కార్డియాక్ అరెస్ట్ కావొచ్చు. It's a chance.

    Okay Doctor, How best we can treat అనేది మీ డెసిషన్.

    ఓకే. ఒకసారి అనెస్టిటిస్ట్ ఒపినియన్ తీసుకుందాం. ముందు అడ్మిట్ అవ్వండి. రిపోర్ట్స్ అన్నీ క్లియర్ గా వుంటే రేపు ఎర్లీ మార్నింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం.

    ఆ ఉదయం ఇలా వుంటుంది అని ఊహించలేదు. తనని రూమ్ లోకి తీసుకొని వెళ్తారు. వెళ్తూ తను పట్టుకున్న బులుగు రంగు జేబురుమాలు ఎదురుగా వున్న స్నేహితుడికి ఇచ్చి వెళ్తాడు. ఆశగా చూస్తూ వెళ్తాడు. రక్తపు మరకలతో తడిసిన ఆ రుమాలుకున్న ముడి విప్పుతాడు. అందులో వున్న కాగితాలను చదువుతాడు. ఒకటి తను చేతివ్రాతతో రాసుకున్న కాగితం.

    మనుషులు: రంగు నలుపు-తెలుపు

    చరిత్ర: వక్రీకరణ-రాసినవాడు 

    ముక్కు కొట్టేసిన శిల్పం: ఎద్దు-గిట్టలు-నురగ

    ప్రాంతం: ఉత్తరం దక్షిణం 

    రాజ్యం : హత్య-ఆత్మహత్య-దాడి-నిఘా 

    రెండోది ఆర్టికల్ నెం: 19, 20, 21, 22 కాగితాలు. 

    మూడోది: ది ఇండస్ సివిలైజేషన్ పుస్తకం కవర్ పేజీ.

    ఆ కాగితాలన్నిటికీ తన రక్తపు మరకలు అంటాయి. తను ఆత్రుతగా గ్లాస్ డోర్ నుండి వాడిని చూస్తుంటాడు. లోపల డాక్టర్లు ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. తను వాడినే చూస్తూంటాడు. వాడి కాళ్లకు ఉచ్చులాంటి క్లిప్స్ ఏవో పెడతారు. కదలకుండా నవా లాంటి దానితో అడ్డంగా కడతారు. వీడు చలనం లేనట్టు పైకి చూస్తుంటాడు. వాడి కణతలకి హెడ్ ఫోన్స్ లాంటివి పెడతారు. అందరూ వాడిని గట్టిగా పట్టుకుంటారు. డాక్టర్ మీటర్ చూసుకొని బటన్ నొక్కుతాడు.

    చీకటి గుహలో, గజిబిజి దారుల వెంట ఇరుక్కుని వున్న అక్షరాలు. వరదలా వస్తున్న రక్త ప్రవాహంతో ఎటు కొట్టుకుపోవాలో అర్థం కాకుండా తేలుతూ వుంటాయి.

    తన కంటనీరు దారలుగా కారుతుంది.

    సూర్యోదయానికి సాక్షిగా నురగులు కక్కుతూ విగతజీవిలా తననే చూస్తూ వాడు.

    ఆకాశానికి రంగులు అద్దేవాడు. నక్షత్రాలను లోకానికి తెచ్చేవాడు. చీకటిని ప్రశ్నించేవాడు. సహజసిద్ధంగా స్పందించేవాడు. పిడుగులు పడినా వెరవనివాడు. ఎవరు వాడు? ఇక వాడు వాడిలాగే స్పందించగలడా?

    వాడు మళ్లీ మామూలు మనిషై తనకు కథలు చెబుతాడని తను ఎదురు చూస్తుంటాడు.

    ఇవన్నీ తెలియని ఓల్డ్ స్మగ్లర్ బాటిల్ పై వున్న గుబురు గడ్డం మనిషి వాడి కోసం ఎదురుచూస్తూ వుంటాడు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    21 min
  • వేలు పిళ్లై రామచంద్ర రావు గారి గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు !

    ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి - (వేలుపిళ్లై కథలకు ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ముందు మాట)

    'పొగడ పూలు':

    గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

    రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

    యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

    నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్... మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.

    ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.

    రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.

    ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం...

    కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.

    అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.

    ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ - టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొకొడుకు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.

    రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.

    ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!

    ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు.... మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాట చాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.

    గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.

    అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం...

    -ముళ్ళపూడి వెంకటరమణ.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    4 min
  • 'నల్లగొండ కథలు' కథాసంకలనం పై కొన్ని అభిప్రాయాలు

    'నల్లగొండ కథలు' కథాసంకలనం పై ఛాయా పబ్లికేషన్స్ మోహన్ గారు, రచయిత 'మునికాంతపల్లి' విజయ్ గారు, రచయిత, విమర్శకులు వెల్దండి శ్రీధర్ గారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు.

    వారికి హర్షణీయం కృతజ్ఞతలు.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    11 min
  • 'కొత్త షూసు' - వీ మల్లికార్జున్ గారి 'నల్లగొండ కథలు' నుంచి.

    ఇప్పుడు మీరు వినబోయ్యే ' కొత్త షూసు' కథ , వీ మల్లికార్జున్ గారు రాసిన 'నల్లగొండ కథలు' పుస్తకం లోనిది. ఇది ఆయన మూడవ కథాసంకలనం.

    2020 సంవత్సరంలో రిలీస్ అయిన పుస్తకాల్లో, ఇది ఒక ఆణిముత్యం లాంటి పుస్తకం అని మనం చెప్పుకోవచ్చు. ఇరవై ఎనిమిది ఏళ్ల యువ రచయిత మల్లికార్జున్ గారు రాసిన ఈ పుస్తకంలో, 21 కథలున్నాయి. అన్నీ కథలు , నల్లగొండలో గడిపిన తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ , అతి హృద్యంగా మనకందించినవి.

    ఈ పుస్తకాన్ని కొనడానికి కావలసిన వివరాలు ఈ లింకులో మీరు చూడొచ్చు. (http://bit.ly/nallagonda-kathalu)

    కథను మీకందించడానికి అనుమతినిచ్చిన మల్లికార్జున్ గారికి కృతజ్ఞతలు.

    చిన్నప్పుడు - అంటే చానా చిన్నప్పుడు నాకు రింగుల జుట్టు ఉండేటిదని మా అమ్మ చెప్తది. రింగుల జుట్టంటే అట్లాంటి ఇట్లాంటిది కాదు. పల్లగ ఇంతింత కుచ్చు లెక్క ముఖం నిండ ఉండేటిదంట. 

    ఆబ్కారాయన ఇంటి ముందల ఒరండాల కూసొని ఎర్రటి అంగి మీద, ఇంతింత రింగుల జుట్టేసుకొని దిగిన ఫొటోల మటుకే నేను ఆ రింగుల జుట్టు చూసుకున్న గుర్తు. ఆ ఫొటో జూసి మురుస్తుంటి. చిన్నప్పుడు నాకు మా అమ్మోళ్లు తీశిన ఫొటోలు మూడుంటే అందుల ఇదొకటి. ఈ ఫొటో అటెన్క ఏడ్నో పోయింది. సూసుకుందామన్నా ఆ రింగుల జుట్టు సూస్కుంటానికి లేదిప్పుడు.

    అయితే ఆ ఫొటోల నాకు నా రింగుల జుట్టుకంటేగూడ, నేను తొడుక్కున్న ఎర్రటి బూట్లు ఎక్కువిష్టం.

    అవి ఎట్లాంటి షూసంటే కింద పీక ఒకటి ఉంటది. నడుస్తుంటే సౌండ్ చేస్తది. ఉరికినమంటే ఇంగంతే. నేనేసుకున్న ఫస్టు షూసు అదేనని నాకు గుర్తు. దాని తర్వాత స్కూల్లగూడ యూనిఫామ్ ఉండేటిదిగానీ, షూసు ఏస్కోవాలని ఏం లేదు. రబ్బరు చెప్పులే ఏస్కునేది.

    స్కూల్ కి అట్ల పోతుంటమా, వేరే స్కూలోళ్లని చూశి, ఆళ్లకు షూసుంటే మనగూడ ఉంటే బాగుండె కదా అనుకునేటోడి. ఎందుకో షూసంటే అంత పిచ్చి. . ఇంటికెవలన్న షూసేస్కొని వస్తే అటు దిక్కే చూస్తుండె. షూసేస్కొని ఫొటో దిగినట్లు, స్టయిలు పడ్డట్టు, ఎన్నో కలలు కంటుండేటోడ్ని.

    నేను పెద్దగయితున్న కొద్దీ కొద్దీ షూస్ పిచ్చి అట్ల పెరుగుతనే వచ్చింది. కొనియ్యమని అడుగుదామంటే భయం. మా సదువులు, తిండికే అప్పులు చేసేటంత పేదరికమాయె. ఏమని అడుగుతం?

    సినిమాలల్ల హీరోలను చూశి, “ఈళ్లు ఎన్నెన్ని షూసు మారుస్తున్నరో గదా!” అనుకునేటోడ్ని. 

    ఒక్కో సినిమాల హీరో ఎన్ని షూసు ఏసుకున్నడో కూడా లెక్కబెట్టేది.

    "అరెయ్, ఇన్ని షూస్ ఎట్ల కొంటున్నరో” అనుకునేది.

    అట్ల విచిత్రంగ నా షూసు పిచ్చి పెరుగుతనే ఉన్నదా, ఒకరోజు నేను స్కూల్ నించి ఇంటికొచ్చేసరికి మా నాన్న నాకోసం కొత్త షూసు తెచ్చిచ్చిండు. 

    అయి మల్ల మామూలు షూసా? రన్నింగ్ షూసు.

    “ఎక్కడియే !” అనడిగిన. 

    “ఎక్కడియయితేందిరా!” అన్నడు. ఏస్కొని చూసిన.

     కరెక్టుగ సరిపోయినయి. ఆహా! 

    ఆ షూసు నేను ఎన్ని తీర్ల, ఎన్ని పండుగలకి ఏసుకున్ననో చెప్తే గూడ ఒక

    కథ అయితది. కానీ నేను ఆ షూసు మా నాన్నకి, మా నాన్ననించి నాకు ఎట్ల వచ్చినయో చెప్పాలి. దానికి మళ్లా మా నాన్న కథకాడికే పోవాలి.

    మా నాన్న ఊర్నించి పారిపోయొచ్చి నల్లగొండల ఆబ్కారాయన దగ్గర చేరిండుగదా! అటెన్క పెండ్లయింది. అమ్మ అదే ఇంట్ల ఆ పని ఈ పని సూస్కుంటుంటే, నాన్న కొండచెల్మ బాయిల నీళ్లు తోడే ఇంకో పని పెట్టుకున్నడు.

    కొండచెల్మ బాయంటే నల్లగొండల ఎవ్వల్ని అడిగినా చెప్తరు. తేటగ తియ్యగ ఉంటయి నీళ్లు. ఎక్కడెక్కడ్నించో జీపుల క్యాన్లు తెచ్చుకొని తీస్కపోయేటిది.

    ఆ బాయి నించి నీళ్లు తోడి క్యాన్లల్ల నింపి ఇండ్లల్ల పోసుడు మా నాన్న పని. 

    పెద్ద క్యూ ఉండేటిదంట ఆ నీళ్లకోసం. తెల్లారుజామునే లేశిపోయి బాయికాడ నీళ్లు నింపుకొని సైకిల్ కి కట్టుకొని ఇంటింటికి తిరిగి పోసేటోడు మా నాన్న. అట్లజేస్తే నెలకు ఇంటికి ఇరవై రూపాయలు. రోజుకి రెండు క్యాన్ల నీళ్లు పొయ్యాలి. 

    నల్లగొండల పెద్దపెద్దాళ్ల ఇండ్లల్ల మా నాన్నదే నీళ్లు పోసే పని.

    ఒకసారి ఎర్రటి ఎండాకాలంల బాయిల నీళ్లు ఎండుకపోయినయి. అడుగు మడుగున ఏవో ఉన్నయంట. లోపలికి దిగితేగానీ నీళ్లు అందవు. కొండచెల్మ బాయికి కొన్ని మెట్లుంటయి. మా నాన్న చిన్నగ ఆ మెట్లమీంచి లోపలికి దిగి నీళ్లు తోడుతున్నడంట. 

    పాకురుబట్టిన మెట్లాయె. దమ్మనిజారి అందుల పడ్డడంట. ఏముంది? తుంటి బొక్క ఇరిగిందన్నరంట.

    అప్పటికి పెద్దక్క చిన్నది. పెద్దక్కని ఎవలో పాలోలింట్ల ఇడ్నిపెట్టి అమ్మ, నాన్న కల్ని ఓ ముప్పై కిలోమీటర్ల అవతల ఒక కాడ పసరు కట్టు కడ్తరంటే ఆడికి పోయిన్రంట. ఆ ఊరు కనుక్కొని, ఆడ ఉండి కట్టు కట్టిచ్చుకొని మళ్లా నల్లగొండల పడ్తానికి ముప్పు తిప్పలు పడ్డరంట.

    పసరు కట్టుతోటి ఊళ్ల దిగిండు. కొన్నిరోజులు ఇంట్లనే ఉన్నడుగానీ, పనిజెయ్యకుంట ఉండలేని మనిషాయె, ఇట్లనే నీళ్లు పోస్తప్పుడు పరిచయమైన ఒకాయనకాడికి పోయిండంట. ఆయనకి ఒక సినిమా టాకీస్ ఉంది. అందులనే అనౌన్సుమెంట్ ఇచ్చే రిక్షా తొక్కే పనిల పడ్డడు.

    పసరుకట్టు కట్టినంక కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఈయన అదేం పట్టించుకోకపోయేసరికి కాళ్ళు కొంచెం వంకర పోయినయ్. 

    ఒకసారి ఇట్లనే , ఒక పెద్దాయన , “ మారయ్యా, నీకు హ్యాండీక్యాప్డ్ పాసిస్తారు తీస్కో” అంటే డాక్టర్ సర్టిఫికెట్ దగ్గర ఒక రిపోర్ట్ వచ్చిందంట.

    “ఓ మారయ్యా! నువ్వు బతుకుడు కష్టమే” అని ఆడుకున్నడంట ఆ టాకీస్ ఓనరాయన.

     “ఏది, నీకు కాళ్లు ఎట్ల ఇరిగినయో చూపియ్యరా.”

    “కుంటోనివి ఎట్లయినవో చెప్పురా” అని ఆటపట్టించేటిదంట...

    అప్పుడే ఎవలో తెలిసినాయన ఒకాయన హైదరాబాద్ ఉస్మానియా ల పనిచేస్తడంట .

     “మారయ్యా, నువ్వేం ఫికరు చెయ్యకు. నేను దీస్కపోత” అని అన్ని ఆయననే చూసుకున్నడంట. 

    ఆపరేషన్ అయ్యింది. కాళ్లకు ఇనుప పట్టీలు కట్టిన్రంట . నల్లగొండకి తిరిగొచ్చి కొన్ని నెలలు ఇంట్లోనే ఉన్నడు. 

    మా నాన్న సంగతి తెల్సిందే గదా, ఒక్కకాడ ఉంటడా?

    “అయ్యో, ఏం చెయ్యకుంటే ఎట్ల ఎత్తది?” అని అందరినీ కాదని మళ్ళా పనిలవడ్డడు. 

    అక్కడ, ఇక్కడ పనిచేసి మళ్లా ఆ సినిమా టాకీస్ట్ గేట్ కీపర్లో, స్వీపర్ గ పనికి కుదిరిండు.

    ఆ కాలుని పట్టిచ్చుకోలేదుగా, అది అట్లనే ఉంది. ఒక కాలు కొంచెం ఒంకరుంటది. పాదం నేల మీద ఆనది. సగం పాదం మీదనే నడ్వాలి.

    హ్యాండీ కేఫ్ట్ సర్టిఫికెట్ తెప్పిచ్చుకున్నడు. బస్ పాసు , రైలు పాసు వచ్చినయి. 

    రైల్ల తిరుపతికి తప్ప ఇంకేడికీ పోలేదుగానీ, బస్సు పాసుని మాత్రం మంచిగ వాడిండు మా నాన్న.

    వికలాంగుల దినోత్సవం మీటింగులు అయితే పోతుంటడు. ఒకసారి అట్లాంటిదే ఒక రోజేదో, మా నాన్న అసోంటోళ్లకు షూసు, మొత్తం కాళ్లు నడ్వనోళ్లకు బండ్లు ఇచ్చిన్రు.

    మా నాన్నకి ఇచ్చిన షూసు పాదం మొత్తం నేల మీద పెట్టలేడుజేబట్టి షూసు లోపటనే ఒక ఎత్తు ఉంటది. అది బ్యాలెన్స్ చేస్తదన్నట్టు. 

    “నీకే ఇచ్చిన్రు కదనే! ఏస్కో ఏమైతది” అని నేనన్న. 

    “హేయ్, గమ్మత్తు మాట్లాడుతవేం రా. గివి నేనేడ తొడుగుత” అన్నడు.

    “నీకే ఇచ్చిన్రు కదనే..”

    “నాకే ఇచ్చిన్రులేరా. గీ బూట్లు నేనేడ తొడుగుత? నవ్వుతరు ఎవలన్న చూస్తే!” అని నవ్వి నా చేతుల పెట్టిండు.

    నేను ఆ షూసు తీసుకొని లోపట ఎత్తులు తీశి చూసిన్నా, నాయే అయిపోయినయి ఆ షూసు.

    అయి ఏస్కొనే నా పుట్టినరోజు చేస్కున్న. స్కూల్ల పిల్లలు టీచర్లయ్యే రోజు నేను హెడ్మాస్టరయి గూడ అదే షూసు ఏస్కున్న. ఏదో ఫేర్వెల్ పార్టీకి ఏసుకున్న. ఇంకేదో పెండ్లికి ఏసుకున్న. ఇంకెయ్యొ పండగలప్పుడు ఏసుకున్న. అట్ల ఆ రన్నింగ్ షూసు నేను ఇష్టంగా తొడుక్కున్న ఫస్టు షూసు అసొంటివే.

    ఇయ్యాల్టికీ ఎప్పుడు కొత్త షూసు కొన్నా, అయ్యాల మా నాన్న ఆయన కాళ్లకు ఎన్నటికీ తొడగని ఆ రన్నింగ్ షూసే గుర్తొస్తయి. అటెమ్మటే ఎర్ర రంగున్న కీచుమని సౌండుజేశే నా ఫస్టు షూసు గుర్తుకొస్తయి. ఆ రింగుల జుట్టున్న ఫొటో ఎప్పటికన్న దొరికితే బాగుండనిపిస్తది.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    8 min
  • 'మునికాంత పల్లి కథలు' - ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గార్ల అభిప్రాయం

    సొలోమోన్ విజయ కుమార్ గారి 'ముని కాంత పల్లి కథలు' వీటిపై , ఆచార్య ఇనాక్ , డాక్టర్ పతంజలి శాస్త్రి గారి అభిప్రాయాన్ని , హర్షణీయం అభ్యర్థించడం జరిగింది. తమ అభిప్రాయాన్ని అందజేసినందుకు , వారికి కృతజ్ఞతలు.

    ఇజియా గారూ ..Hearty Congrats...



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    9 min
  • అల్లం శేషగిరి రావు గారి 'మృగతృష్ణ'

    *** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.

    'మృగ తృష్ణ ' - అల్లం శేషగిరిరావు గారి 'అరణ్య ఘోష' కథాసంకలనం లోనిది.

    ఈ కథ ఆంధ్రజ్యోతి పత్రిక లో 1975 లో ప్రచురింపబడింది.

    పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

    బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

    ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

    అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.

    కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.

    1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.

    పల్లవి పబ్లికేషన్స్ వెంకట నారాయణ గారు , ఫిబ్రవరి మొదటి వారంలో 'అల్లం శేషగిరిరావు సమగ్ర కథా సంకలనం' తీసుకవస్తున్నారు.

    మొబైల్ : '98661 15655' ద్వారా ఆయన్ను సంప్రదించి , మీ కాపీ రిజర్వు చేసుకోవచ్చు.

    కథ:

    ఎండలు | నిప్పులు చెరిగే ఎండలు!!

    అడవిలోని నీటిమాటులు, కొండ వాగులు, సెలలు ఎండిపోయాయి. కొండల్లో అగ్గి జంజలు. వడదెబ్బకి పిట్టలు సొమ్మసిల్లి నేలకు రాలిపోతున్నాయి. దాహం !

    వులులు, తోడేళ్ళు, జింకలు, దుప్పులు, పిట్టలు, పురుగులు- నీటి కోసం ఆర్చుకుపోతూ మందలు మందలుగా వలసపోతున్నాయి. పరుగులు, ఉరకలు- దాహం. రాత్రింబవళ్ళు ఒకటే పరుగులు, దాహం. అడవి పంది పడితే రెండు మూడు వందలు దాకా చెయ్యొచ్చు. అదృష్టం పండి కణుసుపడిందా, నాలుగువందలదాకా చెయ్యొచ్చు. దుప్పి పడినా కనీసం నూటఏభైకి తక్కువరాదు,

    సూరయ్య బాకీ తీరిపోతుంది. మూడు సంవత్సరాల నుంచి వర్షాలు లేక బీడు పడిన తన మెరక చెక్క మీద చేసిన అప్పు! అసలు, వడ్డీతో కలిసి మూడు వందలు దాటింది. ఈ సంవత్సరమైనా తీర్చకపోతే సూరయ్య, బాకీ క్రింద భూమి జమకట్టేసుకుంటాడు. అలా చాలామంది భూముల్ని పడేసుకుని పల్లం ప్రాంతంనుంచి వచ్చిన షావుకారు సూరయ్య లక్షాధికారయిపోయాడు. ఆ సంగతి బాగా తెలిసిన బైరిగాడు తన భూమిని ఎలాగైనా దక్కించు కోవాలనుకున్నాడు.

    బైరిగాడు నాటు తుపాకీని బైటికి తీసి బూజు దులిపాడు. చూరులో దాచిన పాత మందుగుండు సంచి తీసి అందులోని మందుగుండు కొంచెం నేలమీద పోసి అగ్గిపుల్ల గీశాడు. పేదవాడి ఆశలా భగ్గున మండింది. పాతదైనా మందు ఇంకా పవరు పోలేదనుకున్నాడు. తుపాకీ నల్లీలో మందు ఎక్కువ పోసి దట్టించాడు. సంచీలో పాతబడిన మేకుల్నీ, ఇనుప ముక్కల్ని ఏరి గుళ్ళకు బదులుగా తుపాకీలో నింపి వాటి మీద కాగితపు ముక్కల్ని, గుడ్డ పీలికల్ని దట్టించాడు.

    గోచి గట్టిగా బిగించి, గుడిసె తడక దగ్గరగా లాగి, తుపాకీని పట్టుకుని సంచి భుజానికి తగిలించి అడవి లోకి బయలు దేరాడు వేటకి.

    అరవై సంవత్సరాలు నిండిన బైరిగాడి ముడతలు దేరిన ముఖం బీటలు పడ్డ నేలలా వుంది. వయస్సుతోనూ, కష్టాలతోనూ జీర్ణించుకుపోయిన శరీరం తోలుతో కప్పిన బొమికల గూడులా వుంది. జీరలు దేరిన కళ్ళు మాత్రం నిప్పు కణికల్లా తీక్షణంగా ఉన్నాయి. ఆ చూపుల్లో పట్టుదల, ఓపిక ఇంకా చప్పబడిపోలేదు. మధ్యాహ్నం దాటిపోయినా ఎండ ఇంకా తీక్షణంగా వుంది.

    దూరాన గూడెంలో వర్షాల కోసం వన దేవతలను కొలుస్తూ డప్పులు వాయిస్తూ జాతర చేస్తున్నారు.

    చెట్లన్నీ ఆకులు రాల్చేసి మోడువా రిపోయాయి. అడవంతా ఎండుటాకులు పరుచు కొనున్నాయి.

    బైరిగాడు నడుస్తుంటే దిష్టిబొమ్మ తుపాకి పట్టుకొని అడవిలో నడుస్తున్నట్టుంది. బైరిగాడి కాళ్ళ క్రింద ఎండుటాకులు చిట్లుతూంటే ఆ సడికి వెదురు డొంకల్లో చిలకలు గోలచేస్తూ ఎగిరిపోతున్నాయి. కాకుల గుంపు బైరిగాడి వింత ఆకారానికి చెట్ల మీద నుంచి గోలచేస్తూ బైరి నెత్తిమీద వలయాకారంగా తిరుగుతూ మెడలు నిక్కించి చాలా దూరం వరకు వెంబడించాయి.

    బైరిగాడు పొద్దుగూకక ముందే నీటిమాటు దగ్గరకు చేరాలని వడివడిగా అంగలేసుకుంటూ నడుస్తున్నాడు. అడ్డతోవల మీదగా నడుస్తూ తుప్పల్ని, డొంకల్ని, రాళ్ళని దాటుకుంటూ, రొప్పుకుంటూ, రోజాకుంటూ రెండు కొండలు ఎక్కి దిగి సాయంకాలానికల్లా నీటి మాటు దగ్గరకు వచ్చాడు.

    ఆ కీకారణ్యం మద్య ఎండిపోయిన సెలయేటికి పక్కగా గుబురుగా బలిసిన తుప్పల నీడలో నేల చెమ్మగా వుంది. దాని మధ్యలో చిన్న నీటి గుంట. సన్నగా నీరు ఊరుతూ గుంటగా ఏర్పడింది. బైరిగాడు దగ్గరకు రాగానే నీటిమీద ముసిరిన దోమలు జామ్మున లేచాయి. అంత అడవిలోనూ మరెక్కడా నీటి చుక్క లేదు. చుట్టుపట్ల జంతువులు దాహం తీర్చుకోవడానికి అక్కడికే వచ్చి తీరాలి. గుంట చుట్టూ బైరిగాడు పరిశీలనగా చూశాడు.

    జంతువుల అడుగులు చెమ్మ నేలమీద, సెలయేటి ఇసుక లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి, అడవి పందులు తేమనేలని నీటికోసం త్రవ్వేసి గొప్పులు పెట్టేసున్నాయి.

    కొండల వెనుక అస్తమిస్తున్న సూర్యుడు చెట్ల సందుల్లోంచి అందంగా కనిపిస్తున్నాడు. వడగాలి చల్లబడుతున్నా పగలంతా ఎండకి సలసల కాగిపోయిన కొండ రాళ్ళలో నుంచి వేడి చిమ్ముకొస్తోంది.

    నీటి గుంటకి ఇరవై గజాల దూరంలో వెదురు పొద మధ్యన కూర్చొనడానికి వీలుగా సంచీలో నుంచి కత్తి తీసి చదును చేశాడు. తను బయటికి ఏ మాత్రం కన్పించకుండా చుట్టుపక్కల కొమ్మల్ని, తుప్పల్ని నరికి తెచ్చి చుట్టూ పేర్చుకున్నాడు. తుపాకీతో కాల్చడానికి వీలుగా వాటి మధ్య చిన్న సందులు చేశాడు. దూరానికి చూడ్డానికి మాటు తుప్పల మధ్యలో తుప్పలాగా కనిపిస్తోంది. అంత గొప్ప నైపుణ్యంగా పేర్చినందుకు తననుతానే అభినందించుకొని మెల్లగా మాటులోకి దూరి కూర్చున్నాడు. తుపాకీ గుర్రం ఎక్కు పెట్టి సిద్ధంగా పక్కనుంచాడు. మాటు సందుల్లోంచి నీటి గుంటకి దాహం తీర్చుకోడానికి రాబోయే జంతువులకోసం నలువైపులా చూస్తున్నాడు. ప్రతి చప్పుడునీ చెవులు నిక్కించి సూక్ష్మంగా ఆలకిస్తున్నాడు- వేటలో రాటు దేరిన బైరిగాడు. • క్యాంప్, క్యాంప్ అడవిలో నెమళ్ళు అరుస్తున్నాయి.

    కత్తిరి పిట్టలు ఒక్కొక్కటిగా చెట్ల మీది నుంచి దిగుతూ నీళ్ళు తాగి ఎగిరిపోతున్నాయి. నెమళ్ళు జంట ఎండుటాకుల మీద జరజరమని పరుగెత్తుకుంటూ వచ్చి నీటి గుంట దగ్గర ఆగి బెదురుగా అటూ ఇటూ చూశాయి. గబగబా నీటిని పీలుస్తూ మెడల్ని పైకెత్తి కతకతమని మింగుతూ దాహం తీర్చుకున్నాయి. దాహం తీరిన మగ నెమలి ఉల్లాసంగా పురివిప్పి ఆడ నెమలిని క్రీగంట చూస్తూ కెక్ కెక్ మని కేరుతూ అడుగులు వేస్తోంది. దాని పింఛం నీరెండలో రంగు రంగులుగా మెరుస్తోంది. అలా కాస్సేపు ఆడి నెమళ్ళ జంట అరుచుకుంటూ, తేలిపోతున్నట్టు ఎగురుకుంటూ అడవిలోకి పోయాయి. సాయంకాలం అవుతున్న కొద్ది అడవి కోళ్ళు, రకరకాల పిట్ట జాతులు నీటి మాటు దగ్గరికి వచ్చి నీరు తాగి వెళ్ళిపోతున్నాయి.

    రాను రాను సందె చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షుల అరుపులు తగ్గిపోతున్నాయి. అవి గూళ్ళకు చేరుకుంటున్నాయి.

    ఇహ, జంతువులు నీటికి దిగేవేళ. గంటల తరబడి మాటులో కూర్చున్న బైరిగాడికి నడుం పీకేస్తోంది. క్రమేణా అడవంతా చీకట్లు ముసురుకున్నాయి. చీకటి దట్టమవుతున్న కొద్ది కీచురాళ్ళు ధ్వని ఎక్కువౌతోంది. దూరంగా కొండ లోయల్లో కొండ గొర్రె అరుపు మొదలు పెట్టింది. చుక్క వెలుగు గుంటలోని నీట్లో ప్రతిఫలిస్తూ

    బైరిగాడి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎండిపోయిన సెలయేటి ఇసక అంత చీకట్లోనూ తీర్చి దిద్ది నట్లు కనిపిస్తోంది.

    గంటలు దొర్లుతున్నాయి. బాగా చల్లగాలి తెరలు తెరలుగా ఎండుటాకుల మీద నుంచి గల గల వీస్తోంది. బైరిగాడి చెమట ఇగిరిన ఒంటిమీద చల్లగాలి తాకినప్పుడల్లా హాయిగా ప్రాణం లేచివచ్చినట్లుంది.

    ఉన్నట్టుండి అడవి అదిరిపోయేటట్టుగా కణుసు “ఫోంక్, ఫోంక్” మని బెదురుగా దగ్గర్లో అరుచుకుంటూ పారిపోయింది. దూరమౌతున్న దాని డెక్కల చప్పుడు బైరిగాడికి స్పష్టా స్పష్టంగా వినిపిస్తోంది. కీచురాళ్ళ అరుపులు ఒక్కసారి ఆగిపోయాయి. అంతా నిశ్శబ్దం.... భరించలేని నిశ్శబ్దం అడివిని ఆవరించుకుంది. బైరిగాడు మాటులో ఉలిక్కి పడ్డాడు. ఒళ్ళంతా గగుర్పొడిచింది. అప్రయత్నంగా తుపాకీ మీదకి చెయ్యి పోయింది. ఈ అవ్యక్తమయిన గగుర్పాటుకి కారణం అర్ధమవక తికమక పడిపోతున్నాడు. • వాగు ప్రక్క తుప్పల్లో నల్లటి ఆకారం ఏదో కదుల్తున్నట్టు అనిపించిది. బైరిగాడి కళ్ళు చీకట్లను చీల్చుకుంటూ చూస్తున్నాయి. బైరిగాడు నెమ్మదిగా తుపాకీని భుజానికి ఎత్తి ఆ ఆకారం వైపు గురి పెడుతున్నాడు. ఆ ఆకారం బరువుగా నడుస్తూ నీటి గుంట దగ్గరకు వెళ్ళింది. నాలుగు కాళ్ళ మీద పడుకుని నీటి గుంటలో మూతి పెట్టి నీటిని కతుకుతోంది. గాలి విసురుకి గుఫ్ మని గబ్బు కంపు కొట్టింది.

    బైరిగాడి గుండె ఝల్లు మంది. పెద్దపులి నీరు తాగుతోంది. నాటు తుపాకీ, అందులోనూ ఒకే ఒక్క బారు. గురి తప్పితేనో? అధవా, దెబ్బకి పడిపోయినా; అంత తేలిగ్గా ఫారెస్టు వాళ్ళ కన్ను గప్పి అమ్ముడుపోదు. సూరయ్య బాకీ తీరడం అటుంచి కనీసం ఆర్నెల్లు జైలు శిక్ష తప్పదు. నెమ్మదిగా తుపాకీ దింపేసి అలా పులిని చూస్తూ తుప్పల్లో తుప్పలాగా కదలకుండా కూర్చున్నాడు.

    పెద్దపులి నీరు త్రాగి తీరిగ్గా నిల్చుని, తృప్తిగా తోకతో నేలమీద రెండు మూడుసార్లు బాది నిర్భయంగా చీకట్లో నడుచుకుంటూ అడవిలోకి పోయింది. ఎక్కడో చిటారుకొమ్మన కూర్చున్న కొండ ముచ్చు పులిని చూసి కాబోలు “హూప్ హూప్ ” మని అరుస్తూ తన మందని హెచ్చరిం చింది. దాంతో అడవిలో వున్న కోతుల మందలు కిచకిచ మని అరుచుకుంటూ అడవంతా ఒకటే గోల పెట్టేస్తున్నాయి.

    రాను రాను పులి దూరమౌతున్న కొద్ది ఆ అరుపులు తగ్గిపోయాయి. తిరిగి అడవంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.

    "పులివాసన తగిలింది. మరే జంతువూ నీటికి రాదు” అని అనుకుంటూ నిరాశతో బైరిగాడు మాటులో చతికిలపడిపోయాడు. ఇంత ప్రయత్నం వృధా అయిపోతోందని ఉస్సురుమన్నాడు.

    షావుకారు సూరయ్య మనస్సులో మెదిలినప్పుడల్లా పులికంటే ఎన్నోరెట్లు భయంగాను, క్రూరం గాను కనిపిస్తున్నాడు. తనకు మిగిలిన ఒకే ఒక్క జీవనాధారం- మెరక చెక్కని- నంజేసు కుంటాడు.

    అర్ధరాత్రి దాటిన తరువాత అడవిలో గాలి ఎక్కువయింది. దూరంగా కొండల్లో ఉండుండి మెరుస్తోంది. గుడగుడ మంటోంది. బైరిగాడు తలెత్తి ఆకాశం వైపు చూశాడు. నలువైపుల నుంచి నల్లటి మేఘాలు కమ్ముకొస్తున్నాయి.

    “వర్షం కూడా వస్తాది కాబోలు” అనుకుంటూ తన దురదృష్టానికి నిందించుకొని తలపట్టుకు కూర్చున్నాడు.

    రాను రాను ఆకాశం మేఘావృతమై ఉరుముతోంది. తేమగాలి మరింత జోరుగా వీస్తోంది. వెదురు పొదలు కట కటమని శబ్దం చేస్తూ పిచ్చిగా ఊగుతున్నాయి. ఎండుటాకులు అడివంతా చెల్లాచెదురుగా సుడులు తిరుగుతూ ఎగురుతున్నాయి. గాలికి రేగిన దూళి నల్లటి చీకట్లో మంచు తెరలా కనిపిస్తోంది.

    “ఇంత సడయితే ఇంకే జంతువు దిగుతా ది; నా కరమ కాలిపోతుంటేను!” అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఈ నిరాశకి తోడుగా దూరాన అడవిలో వర్షం పడుతున్న చప్పుడు స్పష్టాస్పష్టంగా వినిపిస్తోంది బైరిగాడికి.

    రాను రాను వానజల్లు జలజలమని దగ్గరౌతోంది. రెండు మూడు చినుకులు బైరిగాడి వంటిమీద కూడా పడ్డాయి.

    తనకి ఎదురుగా అడవిలో ఎండుటాకుల మీద జరజరమని చప్పుడైంది. ఈదురుగాలుల నుకున్నాడు. ఆ చప్పుడు ఎక్కువౌతూ దగ్గరవుతోంది. బైరిగాడు అనుమానంగా చెవులు నిక్కించి ఆలకించాడు. ఎండుటాకుల మీద అడుగుల చప్పుడు.. డెక్కల చప్పుడు... మంద పరుగుల చప్పుడు. మందలు పరుగెత్తుకొస్తున్నాయి పరుగులు.. ఉరకలు... దాహం

    పెద్ద మెరుపు మెరిసింది.

    ఆ మెరుపు కాంతిలో దుప్పుల మంద ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వస్తోంది నీటి మాటుకి. తిరిగి చీకటి.

    చీకట్లో నీటి గుంట దగ్గర చిందర వందరగా దుప్పులు పరుగెత్తుతున్నాయి. ఒకదాన్నొకటి త్రోసుకుంటూ నీళ్ళు జుర్రుతున్నాయి. టకటకమని కొమ్ములు రాసుకుంటున్న చప్పుడు.

    బైరిగాడు మెరుపులా తుపాకీ తీసి గురి పెట్టాడు. చీకట్లో కదులుతున్న మంద తప్పించి సరిగ్గా గురి చూడడానికి స్పష్టంగా జంతువులు ఆనటం లేదు. ఆలస్యం చేస్తే మంద పారిపోతుంది. దుప్పుల మంద మధ్యలో గురి పెట్టి ట్రిగర్ నొక్కాడు.

    “ ధూమ్!" నాటు తుపాకీ మోత చుట్టు ప్రక్కల కొండల్లో ప్రతిధ్వనించింది. దుప్పులు చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. తుపాకీ పొగ..... మందుగుండు క్రూర వాసన.

    బైరిగాడు గబ గబా మాటులోంచి బైటికి వచ్చి పొగకి చేతులు అడ్డు పెట్టుకుంటూ పిచ్చిగా నలు వైపులా వెతికేస్తున్నాడు. నీటి గుంటకి రెండు గజాల దూరంలో పొదల్లో సడసడమని చప్పు డౌతోంది. బైరిగాడు దానివైపు పరిగెత్తాడు. దుప్పి పొదల్లో మరణాయాసంతో గిలగిల తన్ను కుంటోంది. పొట్టలోకి గుళ్ళు దూసుకు పోయి పేగులు బైటకు వచ్చేశాయి. దాన్ని చూసీ చూడగానే పారిపోతుందేమోనన్న అనుమానంతోఅమాంతంగా దానిమీద వడి దానికాళ్ళు పట్టుకో బోయాడు. బాధతో గింజుకుంటున్న దుప్పి ఒక్క తన్ను తన్నింది. ““అమ్మ దీనియమ్మ! " అంటూ వెల్లకితలా వడ్డాడు. బైరిగాడి జబ్బ గీరుకు పోయింది. క్షణం సేపులో తేరుకుని, తిరిగి దాని పీక మీదికి లంఘించి; మిగిలి వున్న కొనూపిరి పోయేదాకా కాళ్లతో కసాపిసా తొక్కి తొక్కి చంపేశాడు. పలవలకొమ్ములపోతు దుప్పి..... గీరుకు పోయి రక్తం కారుతున్న జబ్బని చేత్తో పట్టుకుని ఆశగా దుప్పివైపు చూస్తూ గుటకలు మింగేడు. కనీసం రెండు వందలు చేస్తుంది. సూరయ్య సగం బాకీ అయినా తీరిపోతుంది. ఏవో నాలుగాకులు తుంపి కస కస నమిలి వసరుతో నిండిని ఉమ్మిని జబ్బమీద గాయానికి రాసు కున్నాడు. భగ్గున మండుతూంటే ఉశ్ ఉశ్ అని కాసేపు మెలికలు తిరిగి చల్లపడే దాకా కూర్చున్నాడు.

    పోతుదుప్పి. ఊరంత బరువు. దాన్ని ఇంటికి ఎలా చేరెయ్యాలా అనే ఆలోచనలో పడ్డాడు. అంత బరువు మోసుకుంటూ రెండు కొండలు ఎక్కి దిగాలంటే వీలవదు. దగ్గిర తోనొకటుంది గాని అది తుప్పలతోనూ, డొంకలతోనూ, ఎండిపోయిన గెడ్డలతోనూ నిండి దారి సరిగ్గా లేదు. ఒక్కొక్క దగ్గర పొదల మధ్య నుంచీ, ఇరుకు సందుల్లోంచీ, దూరవలసి ఉంటుంది. ఇలా కష్ట మయినా సరే, దూరం దారి కంటే ఇదే మేలనిపించింది.

    చచ్చిపోయిన దుప్పిని ఎత్తలేక ఎత్తలేక దాని నాలుగు కాళ్ళూ పట్టుకుని ఊపిరి బిగబట్టి బలా న్నంతా కూడతీసుకుని ఎగరేసి ఎత్తి మెడమీద వేసుకున్నాడు. బరువుతో తూలిపోతున్నాడు. మాటు దగ్గర వదిలేసిన తుపాకీని చేత్తో పట్టుకుని దాన్ని నేలకి ఊత పెట్టుకుంటూ నడక ప్రారంభించాడు. అడ్డు తోవన పడి నడుస్తున్నాడు. ఎదురుగాలి, చినుకులు కూడా పడుతున్నాయి. సూరయ్య బాకీ తీరిపోతోందనే ఆనందంతో అంత కష్టాన్ని కూడా మరిచిపోయి తుప్పల్నీ, రాళ్ళల్నీ దాటుకుంటూ చీకట్లో, ఆ కీకారణ్యంలో నడుస్తున్నాడు. చచ్చిన దుప్పి నోట్లో నుంచి కారుతున్న చొంగలూ.. నెత్తురూ కలసి బంకబంకగా బైరిగాడి శరీరం మీద జారుతోంది. వెదురు కంపలూ, ముళ్ళ డొంకలూ బైరిగాడి వంటిని చేరుకుంటున్నాయి. ఇరుకు సందుల్లోంచి వంగి దూరుతున్నప్పుడు బరువుకి నడుం విరిగిపోతుందా అనిపించేది. కిరకిరలాడిపోతూ మూలిగేవాడు. కాస్సేపు జంతువు ని దించి అలసట తీర్చుకుందామా అనుకునేవాడు. దించితే తిరిగి ఎత్తుకోలేడేమో అనిపించేది. అలాగే కష్టపడుతూ నడక సాగిస్తున్నాడు.

    దూరంలో ఈలలు వేస్తున్నట్లు సన్నని అరుపులు, రాను రాను నలువైపుల నుంచి ఈలలు దగ్గరౌతున్నాయి. కూడబలుక్కుని ఈలలు వేస్తున్నట్లు ఒకదాని వెంట మరొకటి అరుస్తున్నాయి.

    మొదట్లో పిట్ట అరుపుల్లా వినిపించినా అడవిలో పుట్టి పెరిగి వేటలో మేటి అనిపించుకున్న బైరిగాడికి అవి రేచుకుక్కల అరువులని తెలుసుకోవడానికి అట్టే సేపు పట్టలేదు. జంతువును పసిగట్టిన రేచులు క్రమపద్ధతిలో నలువైపుల్నించీ ఈలలు వేస్తున్నట్టు అరుచుకుంటూ జంతువుపై దాడిచేస్తాయి. జంతువు బ్రతికుండగానే కండలు కండలుగా చీల్చుకుని తినేస్తాయి. .

    బైరిగా డిగుండె దడ దడ కొట్టుకుంది. రాను రాను రేచు కుక్కల అరుపులు, అడుగుల చప్పుడు దగ్గరౌతోంది. వచ్చిన దుప్పి గాయంలోంచి కారుతున్న నెత్తురు వాసన్ని గాలిలో వసిగట్టిన రేచులుపరుగెత్తుకుంటూ వస్తున్నాయి. రేచులు మనుష్యుల్ని ఏమీ చెయ్యవని తెలుసు. కాని తను మోసు కొస్తున్న దుప్పి కోసం చీకట్లో అటకాయిస్తే? ఒంటరిగాడినని మీద పడినా పడొచ్చు! చుట్టూ బలిసిన అడవినీ, కటిక చీకటినీ తన ఒంటరితనాన్ని తలుచుకుంటూంటే గుండె మరింత వేగంగాకొట్టుకొంటోంది. ధైర్యం చిక్కబట్టుకుని దుప్పిని, ఏ పొదల్లోనో దాచ్చేద్దామనుకున్నాడు. ఎక్కడ దాచినా నెత్తురు వాసన పసికట్టి బైటకు లాగి పీక్కుతింటాయి. నలువైపుల చూశాడు. దగ్గర్లోనే ఒక పెద్ద మర్రిచెట్టుంది. గాబరా గాబరాగా అడుగులు వేసుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చాడు. దానికొమ్మ అందుబాటులో వుంది.

    జాగ్రత్తగా భుజం మీది దుప్పిని దింపకుండా అలా భుజం మీద నుంచే కొమ్మమీదికి జారిపోకుండా నెట్టాడు. వదులైపోతున్న గోచీని తొందర తొందరగా బిగించి తనుకూడా చెట్టెక్కిపోయాడు. ఇలా బైరిగాడు చెట్టేక్కేడో లేదో - రేచులు నలువైవుల నుంచి చెట్టుని గిరేశాయి. కొమ్మ మీద దుప్పిని చూసేయి. చెట్టు మొదలు చుట్టూ చిందులేస్తున్నట్లు తిరుగుతున్నాయి. ఒగుర్చుకుంటూ దుప్పి తమ అందుబాటులో లేనందుకు కసిగి మెరుగుతూ నాలికలు చాచుకొని మీదికి చూస్తున్నాయి. కొన్ని కుక్కలు చెట్టు బోదెను బర బర బకిరేస్తున్నాయి చెట్టేక్కే ప్రయత్నంలో.

    బైరిగాడు చెట్టుమీది నుంచి “హాత్, హూత్! " అని కేకలేస్తున్నాడు వాటిని బెదిరిస్తూ. ఆ అదిలింవులకి రేచులు బెధిరిపోలేదు సరికదా " ఎప్పటికైనా ఆ దుప్పి కింద పడబోదా?” అన్నట్లు తిష్టవేసి చెట్టు చుట్టూ కూర్చున్నాయి. దుప్పి గాయంలోంచి కొమ్మమీద నుంచి బొట్లు బొట్లుగా ఉండుండి కారుతున్న నెత్తుర్ని రేచులు ఒక దానితో ఒకటి పోటీ పడి నాకుతున్నాయి.

    బైరిగాడు చెట్టు మీద నుంచి కేకలేసి కేకలేసి విసుగెత్తిపోతున్నాడు. ఇవి వదిలేటట్టు లేవు అని అనుకున్నాడు. తుపాకి తీసి దట్టించి వాటిని కాల్చెద్దామా అనుకున్నాడు. కాని తొందరలో మంద గుండు సంచీ వదిలేసినందుకు తనని తాను చెడా మడా తిట్టుకుంటున్నాడు. అదే సమయంలో ““ బేర్, బేర్ " మని కంచు గొట్టంలో అరచినట్లు ఓండ్రపోతు దుప్పి అరిచింది. ఆ అరుపుకి రేచుకుక్కల మంద; కుదిపివేసినట్లు లేచింది. చెవులు నిక్క బొడుచుకున్నాయి. వాటి వీపుల మీద రోమాలు గగుర్పాటుకి లేచి నిలుచున్నాయి. తోకల్ని సాలోచనగా అటు ఇటూ తిప్పు కుంటూ నిశ్శబ్దంగా గుమిగూడాయి. అరుపు వినపడిన వైపు చూస్తూ ఉద్రేకంతో సన్నగా మూల్గుతూ ఓక్కసారి గొలుసులు తెంచుకున్న కుక్కల్లా పరుగెత్తాయి కొత్త ఎరకోసం.

    “ బతుకు జీవుడా" అనుకుంటూ హాయిగా నిట్టూర్చాడు చెట్టుమీది బైరిగాడు. బైరిగాడు సర్దుకుని చెట్టు దిగేలోగా అంతవరకు పడుతున్న చినుకులు ఒక్కసారి ఎక్కువై రాళ్ళు వాన కురిసినట్టు పెద్ద పెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది. తేమగాలి ఝంఝామారుతంలా వీస్తోంది. రానురాను కుంభవృష్టి ఆకాశం చీలిపోతున్నట్టు మెరుపులు, పిడుగులు! గాలికి చెట్ల కొమ్మలు ఫెళ ఫెళ విరిగిపోతున్నాయి. మహా ప్రళయం సంభవిస్తున్నట్లు నింగీ నేలా ఏకమై పోతున్నట్టు ధారాపాతంగా వర్షం. బైరిగాడు తడిసి ముద్దయిపోయాడు. వర్షానికి కొమ్మ మీద దుప్పి ధ భీమని నేల మీద పడింది. అలా సుమారు రెండు గంటలు ఏకధాటిని కురిసి వర్షం ఆగి పోయింది.

    వర్షం ఆగిపోగానే బైరిగాడు చెట్టు దిగేడు. కష్టపడి దుప్పిని ఎత్తి భుజాన వేసుకున్నాడు. తుపాకీమడమ బురద నేల మీద కూరుకుపోతూ సరిగ్గా ఊతనివ్వటం లేదు. తడిసిపోయిన దుప్పి ఒంటి మీద జారిపోతోంది. నడుస్తున్నాడు. పట్టుదలతో లేని ఓపిక కూడ గట్టుకుంటూ సూరయ్య బాకీ తీర్చేదామనే దీక్షతో బురదలో, ముళ్ళలో, గతకల్లో నడుస్తున్నాడు.

    రాత్రి రెండు గంటలు దాటిపోయుంటుంది. వాన వెలిసిన ఆకాశం నిర్మలంగా కడిగినట్టుంది. సన్నని వెన్నెల పొడకూడా వచ్చింది. ఆకుల మీద నీటి బొట్లు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కప్పల, కీచురాళ్ళ, చిమ్మెట్ల అరుపులతో అడివంతా నిండిపోయింది. బైరిగాడు చాలా దూరం వచ్చేశాడు. ఒక గెడ్డ దాటి, మరోమైలు నడిస్తే తన గుడిసె చేరుకుంటాడు. .

    గెడ్డ దగ్గరౌతున్న కొద్పీ కప్పల బెకబెకలు ఎక్కువవుతున్నాయి. గెడ్డ దగ్గరకు రాగానే బైరిగాడికి కళ్లు తిరిగినంత పనయింది. కొన్ని గంటల క్రితం వరకూ ఎండిపోయి దిబ్బలు వేసిన గెడ్డ వర్షం పడడంతో కొండల్లో నుంచి నీరు దిగి నిండుగా ప్రవహిస్తోంది. నీరు సుడులు తిరుగుతూ పారుతోంది.

    అప్పుడు బైరిగాడికి గెడ్డ దాటడం తప్ప మరో మార్గం తోచలేదు. చుట్టు తిరిగి గెడ్డను తప్పించు కుని వెళ్ళాలంటే ఇప్పుడు నడచిన తోవకు మరో నాల్గు రెట్లు నడవాలి. నడవటమే కాక కొండలు ఎక్కి దిగాలి. గెడ్డలో నీరు నిండినా అది అంత లోతైన గడ్డ కాదని బైరిగాడికి తెలుసు. నీరు గుండెల్ని దాటదు. వెడల్పు పది గజాలలోపే గాని ఎక్కువ ఉండదు. అందులోనూ గజ ఈతగాడు బైరిగాడికి ఆ గెడ్డ ఒక లెక్కలో ది కాదు. ఆ ధైర్యంతోనే బైరిగాడు గెడ్డ దాటడానికి సిద్ధపడ్డాడు. దుప్పిని గెడ్డ ఒడ్డున దించాడు. పీక్కుపోతున్న కాళ్ళని, మెడని చేత్తో రుద్దుకున్నాడు. ఒక చేత్తో తుపాకీ పట్టుకుని భుజాన్న దుప్పిని మోసుకుంటూ, ఊపు కాసుకుంటూ,

    జోరుగా పారుతున్న నీటిలోంచి నడవటం అంత సులభం కాదు. అందువల్ల తుపాకీని రెండు చేతుల్తో పట్టుకుని గిర గిర తిప్పి అవతల ఒడ్డుకి విసిరాడు. అది అవతల ఒడ్డున బురదలో పడింది. ముసిలాడయిపోయినా తన జబ్బ సత్తువకి, గురికి మనస్సులోనే మెచ్చుకున్నాడు.

    గట్టు దిగి మెల్లిగా నీట్లో కాలు మోపాడు. కప్పలు ఒడ్డుమీద నుంచి జల్లున నీటిలోకి దూకు తున్నాయి. బురద జారు జారుగా ఉంది. మెల్లగా పాదాల్ని నిలదొక్కుకుని గట్టుమీది దుప్పిని భుజం మీదికి లాక్కున్నాడు. మెడ మీద బరువు ఆనించి వేలాడుతున్న నాలుగు కాళ్ళనీ రెండు చేతుల్తో పట్టుకున్నాడు. బరువుకి బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. అడుగు తీసి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ నీళ్ళలో నడుస్తున్నాడు. నురుగులు కక్కుతున్న నీటి ప్రవాహం వెన్నెట్లోమెలికలు తిరిగిన తెల్లని పాములా కనిపిస్తోంది. ముణుకుల లోతు వచ్చేసరికి నీరు కింద నుంచి లాగేస్తోంది. ఎండిపోయిన కొమ్మలు, దుంగలూ శరవేగంగా కొట్టుకుని పోతున్నాయి. ఉండుండి ఒడ్డున మట్టి పెళ్ళలు విరిగి నీటిలో గుభిల్లు గుభిల్లుమని పడుతున్నాయి. నీరు నడుమును తాకుతోంది. సగం దూరం దాటేడు. నీటి వేగం మరింత ఎక్కువగా క్రింద నుంచి లాగేస్తోంది.

    మెల్లిగా వీపు మీద బరువు కాసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. .. అమాంతంగా గోతిలో కాలు పడింది. అంతే! తూలిపోయి బోర్లా నీట్లో పడ్డాడు. దుప్పి దూరంగా తుళ్ళిపోయింది. నీట్లో పడడం తో ప్రవాహ వేగంతో కొట్టుకుపోయాడు. నీళ్ళలో దొర్లి కొట్టుకుపోతున్నాడు. మునకలు వేస్తు న్నాడు. నేలకి కాళ్ళు తగులుతున్నా ప్రవాహం వేగానికి తట్టుకుని నిలబడలేకపోతున్నాడు. అలాపడుతూ లేస్తూ కొట్టుకుపోతున్న వాడికి తనకంటే ముందుగా దుప్పి తేలుతూ కొట్టుకుపో తుండడం కనిపించింది. అంతటి జీవన్మరణ సమయంలో కూడా బైరిగాడికి సూరయ్య బాకీ మెదడులో చరాలున మెదిలింది. అలా మునకలు వేస్తూనే తమాయించుకుని ఈదుకుంటూ దుప్పి మీద గభాలున దూకి గట్టిగా పట్టుకున్నాడు.

    అక్కడ గెడ్డ వెడల్పు తక్కువవటం వల్ల ప్రవాహ వేగం మరింత పుంజుకుంది. దుప్పిని విడవ కుండా నీట్లో క్రిందా మీదా ఆపుతూ ఎదురీదుతూ కొట్టుకుపోతున్నాడు. తన ప్రక్క నుంచి దుంగలూ, కర్రలూ, వాటిని అంటి పెట్టుకున్న నీటి పాములూ విసురుగా రాసుకుపోతున్నాయి. అలా దుప్పిని పట్టుకుని రెండు ఫర్లాంగులు కొట్టుకు పోయేటప్పటికి అక్కడ గెడ్డ తిరిగి వెడల్పుగా వుండడం వల్ల ప్రవాహాన్ని తట్టుకుని నిలదొక్కుకుంటూ ఒడ్డున నీట్లో వేలాడుతున్న చెట్టుకొమ్మని అందుకుని వేలాడాడు. దుప్పిని మాత్రం విడవలేదు. అతికష్టం మీద కొమ్మ ఆసరాతో ఒడ్డున కాలుమోపాడు. దుప్పిని కూడా పైకి లాగేశాడు. అదృష్టవశాత్తూ అది అవతలిగట్టు. అక్కడ ఒక గంటకి పైగా విశ్రాంతి తీసుకుని దుప్పిని మోసేబలం చాలక దాన్ని కాళ్ళు పట్టుకుని గట్టు వెంబడి ఈడ్చుకుంటూ తను మునిగిపోయిన జాగా దగ్గరకు వచ్చాడు. తుప్పల్లో పడున్న తుపాకీని తీశాడు. తెల్లవారు ఝాము కావస్తూ ఉండడం వల్ల అడవిలో పిట్టలు ఒక్కటొక్కటీ అరుస్తున్నాయి. అడవి కోళ్ళు కూడా కూస్తున్నాయి. చల్లగాలికి, తడిసిపోయిన ఒళ్ళు గబ గబిలాడుతున్నా పొద్దు పొడవకముందే ఇల్లు చేరుకోవాలని దుప్పిని తిరిగి భుజాన్ని వేసుకుని రొప్పుకుంటూ రోజుకుంటూ గుడిసె దగ్గరికి వచ్చేటప్పటికి బాగా తెల్లారిపోయింది. గూడెంలో పశువులు అరుస్తున్నాయి.

    దుప్పిని దింపి, తుపాకీ గుమ్మానికి జారేసి ఆయాసంతో అరుగుమీద చతికిల పడ్డాడు. వళ్ళంతా పచ్చిపుండులా ఉంది. వంటినిండా ముళ్ళ రక్కులు- నెత్తురు చిమ్ముతోంది. బరువు మోతకి మెడ కదుంకట్టిపోయింది. దుప్పి డెక్కతో చీరుకుపోయిన భుజం వాచిపోయి; సలుపూ పోటు పెడ్తోంది. వీటికితోడు కడుపులో ఆకలి రాజాకుంటోంది. బాధగా కళ్ళు మూసుకుని గోడకి చారబడ్డాడు. ““ఇంత కష్టపడినా మరేం ఫర్వాలేదు. సూరయ్య బాకీ తీరిపోతుంది. పొలం చెక్కపోకుండా దక్కుతుంది”. అనుకుంటూండగా వాకిట్లో ఎవరో...

    38 min
  • రోహిణి - పతంజలి శాస్త్రి గారి కథ , కథా పరిచయం

    రోహిణి’ పతంజలి శాస్త్రి గారి ‘రామేశ్వరం కాకులు’ అనే కథాసంకలనం లోనిది.

    • ఈ కథపై చక్కని సూచనలిచ్చి, ఆడియోని మీకందించడానికి సహకరించిన మిత్రులు ఛాయా మోహన్ గారికి కృతజ్ఞతలు.

    **’రామేశ్వరం కాకులు పుస్తకం’ అమెజాన్ లో దొరుకుతోంది. – http://amzn.to/3bFv5W2.

    కథనం:

    చరిత్ర లోని ఒక కథను Allegorical గా తీసుకొని, సమకాలీన సమస్యను ఎత్తిచూపుతూ, ఒక పరిష్కార మార్గాన్ని సూచనగా చెప్పడం, ఈ కథలో ముఖ్య ప్రక్రియ. ఈ ప్రక్రియ తో తెలుగు లో వచ్చిన మరో రెండు కథలు – చలం గారి ‘ ఓ పువ్వు పూసింది’ రావూరి భరద్వాజ గారి ‘ పాటకు తగిన రోలు’.

    కథలో ముఖ్యాంశం నదీజలాల వివాదం. రోహిణి నదీజలాల పై శాక్య , కోలీయుల వివాదం గురించి రెండు కథనాలు ప్రచారంలో వున్నాయి.

    తాను చూసిన కొన్ని సంఘటనల వల్ల సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడుగా మారిన తర్వాత,జలాల గురించి ఇరువర్గాలూ యుద్దానికి సిద్ధమైతే, గౌతముడు యుద్ధభూమికి వెళ్లినట్టుగా, ఆయన సమక్షంలో ఇరు వర్గాలూ తమ ఆయుధాలు విసర్జించి యుద్ధాన్ని మానివేశాయి అని ఒక కథనం చెప్తే… ( http://bit.ly/warsankyans)

    శాక్య వంశానికి చెందిన సిద్ధార్థుడు, జలాల వివాదం మీద జరిగిన శాక్యుల సమావేశంలో , తాను యుద్ధం యొక్క ఫలితాలను, అనర్థాలను ఎత్తిచూపినప్పుడు, వర్ణాశ్రమ ధర్మం గురించి చర్చ జరగడం, యుద్ధానికే, ఎక్కువమంది మొగ్గు చూపడంతో , వ్యతిరేకిస్తూ , సిద్ధార్థుడు సన్యసించడం , ఆ తరువాత కొంత కాలానికి ఇరువర్గాలూ యుద్ధాన్ని విరమించడం రెండో కథనం. (http://bit.ly/ambedkars (24-29, 56-57))

    పతంజలి శాస్త్రి గారు రాసిన ఈ కథలోని విశేషం, ఈ రెండు కథనాలనూ సమన్వయం చేయడం.ఇలా ఒకే చారిత్రిక ఇతివృత్తం పై వున్న రెండు వేరు వేరు కథనాలలోని ముఖ్య అంశాలను స్పృశిస్తూ, ఒక సమకాలీన సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించారు ఈ కథ ద్వారా రచయిత.

    కథలోని సమస్య గురించే గాక , నేటి సమాజంలో ఉండే ఎన్నో ప్రధాన సమస్యలపై , పరిష్కారం దిశగా, గౌతముని వాక్యాలను ఎన్నుకుని కథలో భాగంగా మనకందించడం శాస్త్రి గారి రచనా ప్రతిభకు ఒక నిదర్శనం.ఏ సమస్య పరిష్కారానికైనా , సరైన దృక్పధం, సమస్య పరిమితులు అర్థం చేసుకోవడం ముఖ్యమన్న విషయం కథ మనకు తెలియజెప్తుంది.కథలో భాగంగానే, ఈనాటి సామాజిక వర్గీకరణను సూచిస్త, వ్యాపార, శ్రామిక వర్గాలకు ఉండవలసిన సరైన దృక్పధం గురించి , వారికి సమాజం పట్ల ఉండవలసిన బాధ్యత గురించి కూడా చర్చించడం జరుగుతుంది.

    కథ చివరి అంకం అంతా గౌతమ బుద్ధుడి ఆశ్రమంలో జరగడం, చర్చలకు కావలసిన వాతావరణం ప్రాధాన్యత ను గురించి రచయిత చెప్పినట్టుగా ఉంటుంది. అదే విధంగా రోహిణి నదిని వర్ణించేటప్పుడు , కథలో రాబోయే సందర్భం గురించి సూచిస్తున్నట్టుగా ఉంటుంది.కథలో ముఖ్యంగా గమనించవలసింది గౌతమబుద్ధుడు (శాస్త) పలికిన వాక్యాలు, ఇంకా ఆయన సమక్షం లో శ్రోతలు పొందే అనుభూతిని గురించి రచయిత వర్ణన.కథలోని ముఖ్య సన్నివేశాలలో తటస్థపడే నెమలి, బౌద్ధమతస్థుల నమ్మక ప్రకారం, విశాలహృదయానికీ, అంగీకారానికీ, చిహ్నం. ( http://bit.ly/buddhismpeacock )

    అలాగే, రోహిణి నది వివాదం, మన దేశంలో కావేరీ జలాల సమస్య, పాలస్తీనా ప్రాంత వ్యవహారాలూ, అక్కడి జోర్డాన్ నది వినాశనం మనకు గుర్తుకుతెస్తుంది. (http://bit.ly/jordanpollution)

    ఈ కథ ఆడియో రూపం లో , సుప్రసిద్ధ రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారి గళాన మీరు వినవచ్చు.

    కథ:

    రోహిణీ నది, సంధ్యాసమయంలో శాన్త భుజం మీది నుంచి జారిన కాషాయాంబరంలా వుంది. ఇప్పటి పరిస్థితి విషమిస్తే ఇరుపక్షాల రక్తంతో రోహిణికి రక్తపుజీర పడుతుందనుకున్నాడు ఉపాలి. ఉపాలి భిక్షు అంతకుముందే నదిలో స్నానించి, బట్టలు పిండుకుని, ఒడ్డుకు చేరి మంద్రంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ అట్లా అనుకున్నాడు.

    ఎగువ నుంచి ఒడ్డుకు సమీపంగా పొడవాటి గెడ సాయంతో వంపు తిరుగుతోంది పడవ. అట్లాగే చూస్తూండిపోయాడు ఉపాలి. మనోహరమైన సంధ్యగాలి అలలు ఉపాలి శరీరాన్ని మనసునీ మృదువుగా తాకి వెళ్లిపోతున్నాయి. 

    ఈవలివైపు ఆమ్ర వన విహారం చేరిన కొద్ది దినాల నుంచి నదిని చూసినప్పుడల్లా, కంఠం వరకూ మునిగినప్పుడల్లా తన నుంచి తాను వేరుపడి ఆవల బాల్యం గడిపిన అస్పష్టమైన శాక్యసీమను చూశాడతను. అక్కడే ఒక రాకుమారుడు ఉదయకాంతిలోకి గుర్రం మీద వెళ్లిపోవడం కూడా జ్ఞాపకం వస్తుంది. 

    ఈ నది వేరు, ఆ నది వేరు. అతని పెదాల్ని దాటి చిరునవ్వు వెలువ డింది. జేవురించిన సూర్యుడు, ఎర్రబారిన నది- అనేక దినాలుగా నది కావల, ఈవల రాజుకున్న ఆగ్రహావేశాల్ని తలపిస్తున్నాయి. 

    ఉపాలితో పాటు స్నానం చేసిన భిక్షువులు అప్పటికే విహారం వేపు నడిచి వెళ్లిపోయారు. సంధ్యా సమయంలో నీడల్లా దూరంగా కనిపిస్తున్నారు. ఉపాలి భిక్షు మనసులో చిన్న కలవరం కూడా లేకపోలేదు.

    ఆ దినం ఉదయమే ఆనందుణ్ని అడిగాడు. “భన్తే, ఆవలితీరం భగవానుడి పుట్టుక వల్ల పునీతమైంది. ఈవల వారి నివాసం వల్ల పవిత్రమైంది. మరి ఈ కోలీయులు, శాక్యులు రక్తం చిందించడానికి ఎందుకు ఆయత్తమవుతున్నారు?”

    దీర్ఘంగా ఉపాలివేపు చూస్తూ అన్నాడు ఆనందుడు. “అవిద్య అత్యంత కఠినమైన స్థితి. అగ్నికి గాలివలె కాపీర్ణం, ఆగ్రహం, మనుషుల బుద్ధిని బూడిద చేస్తాయి. వర్షాన్ని కలుపుకుంటేనే నది అవుతుంది. శాస్త్ర ధర్మోపదేశం వినడం వేరు. శ్రోతాపత్తి ఫలాన్ని పొందడం వేరని నీకు తెలిసినదే.”

    “తలలు పగలగొట్టుకోవాలనే వారి ఉత్సాహం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.” 

    “పొగరుబోతు ఏనుగు తథాగతుని ముందు మోకరిల్లింది.” 

    “సుద్ధోదన మహారాజు మౌనసందేశాలు మాత్రమే పంపుతున్నాడను కుంటాను.”

    నవ్వి ఆనందుడు అన్నాడు. “కానీ శాక్య ఉపాసకులు ఇక్కడకు వస్తూనే వున్నారు. శాస్తకు ఎవరి సందేశాలు, ఆహ్వానాలు అవసరం లేదుగదా?”

    ఆలోచనలో పడి ఉపాలి నదిమీద పల్చటి చీకటి పొర పరచుకోవడం గమ నించలేదు. పడవవాడు పడవని ఒడ్డుకు లాగి తాడు కడుతున్నాడు. పడవవాణ్ని చూడగానే అనుకున్నాడు. ఈ వ్యక్తికీ, ఈ నదికీ, ఈ పడవకీ, పడవెక్కి తీరం చేరే యాత్రికులకీ ఏమిటి సంబంధం? నవ్వుకుంటూ ఉపాలి వెనక్కి తిరిగి విహారం వేపు నడిచాడు. 

    తీసి ఉన్న వెదురుతలుపు పక్కకి నెడుతూ శ్రేష్టి కుటుంబం, విహారంలోకి అడుగు పెట్టకముందే ఎదురు వచ్చింది. ఉపాలి ఎదురవగానే వారంతా ఆగి అభివాదం చేసి అతను లోపలికి వెళ్లేవరకూ ఆగి మరీ బయలుదేరారు.

    ఆమ్ర విహారం అంత పెద్దది కాదు. అనుకోకుండా శాస్త రాక గురించి తెలియడంతో విడిది ఏర్పాటు చేశారు. భిక్షకోసం జనపదంలో సంచరిస్తున్న భిక్షువుల్ని గృహపతులు ఆదరంగా ఆహ్వానిస్తున్నారు. 

    తథాగతుడు రావడంతో నదిలోకి కొత్త నీరు ప్రవేశించినట్టయింది. సమీప జనపదాల నుంచి బళ్లు, నడక, కొంతమంది పడవల్లో జనం వచ్చి శాస్త దర్శనం చేసి ధర్మోపదేశం విని వెడుతున్నారు. శ్రేష్ఠి. ఇతర పెద్దలు కొద్దిమంది, రెండు పూటలా విహారానికి భిక్షుక సంఘాన్ని కలిసి పరామర్శించి వస్తుంటారు. మొత్తానికందరికీ తథాగతుడి రాకతో ప్రశాంతంగా, వేసవిలో చిరువర్షం, చల్లగాలిలాగా వుంది.

    విహారంలో కాగడాలు వెలిగించారు. కుటీరాల్లో దీపాలు వెలుగుతున్నాయి. తథాగతుడి ప్రధాన అంతేవాసులు ఆనందుడు, ఉపాలి మరో నలుగురు వృద్ధ స్థవిరులు ఆనందుడి కుటీరంలో కూచుని వున్నారు. వేడిపాలు సేవించారందరూ. ఆనందుడు ఉత్తరీయం తీసి ఒళ్ళో వేసుకుని రెండు చేతులు వెనక్కి నేలమీద ఆనించి నిట్రాటకు అనుకుని అందరివేపూ చూశాడు. మట్టి దీపాల వెలుగు ఆయన శరీరం మీద కదులుతూఉత్తరీయం కప్పుతున్నట్టుంది. ఉపాలిని చూస్తూ చటుక్కున అన్నాడు ఆనందుడు.

    “త్వరలో శాక్యులు పెద్దమనుషుల్ని పంపుతారని వినికిడి.”

    “అనగా రాజకుటుంబం, అధికారులు…”

    “కాదు… వారి అనుమతితోనే శాస్తను సంప్రదించడానికి వస్తున్నారు,” ఒక వృద్ధ స్థవిరుడన్నాడు.

    “స్వయంగా శాస్త శాక్యసీమ వస్తాడని నమ్మకం సడలి వుంటుంది. సుద్దోధనుడి ఆంతర్యం అదే అయి వుంటుంది.”

    మరో స్థవిరుడన్నాడు. “ఇది శుభసూచకం. ఇక్కడ శాస్త వుండగా ఇరుపక్షాలూ యుద్ధానికి దిగడం మంచిదికాదు. అప్పుడే ఆయుధాలు సమకూర్చుకుంటున్నారని వింటున్నాం. పెద్ద కర్రలు, విల్లమ్ములు, రాళ్లు రేవు దగ్గరికి చేర్చడానికి సిద్ధంగా వున్నారు. మహిళలు కూడా వెదురుశూలాల్ని సూదిగా చెక్కి సిద్ధం చేస్తున్నారు.” .

    ఆనందుడు తల వూపుతూ అన్నాడు. “సాగునీటిని నిరోధించడం, చెరువుల్ని కలుషితం చెయ్యడం పాపకర్మలు. వర్షం అందరికోసం పడుతుంది. నదికి నీరిస్తుంది. ఏ ఒకరికోసమో దాచి ఇవ్వదు. నదీధర్మాన్ని అర్థం చేసుకోవాలి. నదిని అడ్డగించి సాగునీటి కోసం ఒకరినొకరు చంపు కోవడం పాపకర్మకు పరాకాష్ఠ. పొగరుబోతు ఎడ్లలా ఒకరినొకరు పొడుచుకోవడానికి సిద్ధపడుతున్నారు.”

    “అవును. అయినా రాజధర్మం విస్మరించిన తరువాత ప్రజలు మూర్ఖులవడం ఆశ్చర్యం లేదు.” అన్నాడు ఉపాలి. మళ్లీ అతనే స్థవిర మిత్రుల్ని చూస్తూ అన్నాడు. “యుద్ధం వరకూ వెళుతుందని నేను అనుకోవడం లేదు.”

    స్థవిరులు తలలూపేరు. చాలా సేపటి వరకూ ఎవరి ఆలోచనల్లో వారుండి పోయారు. విహారంలో ఏదో పక్షికూత దూరంగా వినిపించింది. అందరూ కుటీరంలో మేల్కొన్నారు. ఉపాలి మనసు శాంతించింది.

    ఆనందుడు అన్నాడు. “ఇక్కడ సమస్య ప్రధానం కాదు. సమస్యను అర్థం చేసుకునే దృష్టి ముఖ్యం. దానివల్ల సమస్య పరిమితులు అర్థం అవుతాయి. అది వారికి తెలియవలసిన విషయం.”

    ఎక్కడో శుభ్రంగా స్నానించి సూర్యుడు రోహిణి నదిలో లేత బంగారం కలుపుతున్నాడు. ఆమ్ర విహారంలో పక్షులు లేత సూర్యకాంతిని తింటూ నదివేపు ఎగిరి పోయాయి. స్థవిరులు , కొద్దిమంది ఉపాసకులు వెంటరాగా పెద్ద బంగారు గొలుసులా మెరుస్తున్న రోహిణిలో శాస్త స్నానానికి దిగాడు. 

    చల్లటి ఉదయపు గాలివల్ల నదీ తరంగాలు శాస్త దేహాన్ని స్పృశించడానికి వేగిరపడుతున్నాయి. వ్యక్తమౌతున్న వెలుగు ముడతలు పడి కదులుతున్న నది, మునిగి తేలుతున్న శాస్త శరీరం అవిభాజ్యంగా కనిపించాయి. మనోహరమైన ఈ దృశ్యం ప్రతిదినమూ అంతేవాసులందరూ చూస్తూనే ఉన్నా, ఎప్పటికప్పుడు, ప్రతి ఉదయం ఒక నూతన శుభ్రధావళ్యాన్ని సంతరించు కుంటున్నట్టు అనిపిస్తోంది. తథాగతుడి దేహం ఉదయకాంతిని పీల్చుకోగానే ఆయన తిరిగి విహారానికి బయలుదేరాడు.

    విహారంలో ఎక్కడివారక్కడ చెట్లకింద, దారి కటూ ఇటూ నిశ్శబ్దంగా నుంచుని శాస్త అభివాదం చేశారు. ఎక్కడో చెట్టుకింద నుంచుని గొప్ప ఆశతో నెమలి కూసింది. నిశ్శబ్దాన్ని పూరించింది మయూర ఓంకారం. మరికాసేపటికి ఎప్పటిలాగే పెద్ద మామిడి చెట్టు కింద తాటి ఆకుల చాప వేసి దానిమీద గుడ్డ వేసి రెండు దిండు ఏర్పాటుచేశారు. భిక్షువులు, ఉపాసకులు, కొద్దిమంది జానపదులు, శాస్త ఆసీనుడైన తరువాత కూచున్నారు. చెట్లు ఆకులు తొడిగినట్టు వారి శరీరాలకు మొత్తం చెవులు మొలిచాయి.

    తథాగతుడు సంపద మీద, సంపద పంచుకోవడం గురించి, వితరణ. క్లుప్తమైన ధార్మికజీవనం గురించి, సమ్యక్ దృష్టి గురించి ఉపదేశం ప్రారంభించాడు. “పండ్ల చెట్టు విడిచిన పండ్లని ఏరుకుని తినడం వేరు. చెట్టుని కుదిపి కుదిపి కాసిని పళ్లు తీసుకుని ఎక్కువ పళ్లను వదిలివెయ్యడం అపరాధం,” అన్నాడు శాస్త. మళ్లీ ఎక్కడ్నుంచో అర్థమైందన్నట్టుగా నెమలి కూసింది. “ఒక నియతి ఉంటుంది. ఆయుష్మంతులారా, ఈ నియతిని అర్థం చేసుకోవడం మన ధర్మం,” అన్నాడాయన. శాస్త్ర మాట్లాడుతున్నంత సేపూ ఒక మంగళకరమైన శాంతి ఏదో అందర్నీ మృదువుగా ఆవరిం చింది.

    రోహిణి నది ఎండకి వేడెక్కుతూ నిర్లిప్తంగా నీరసించి సాగుతోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి నది నీరసించడం వల్లనే రోహిణి బిడ్డలిద్దరూ పరస్పరం చంపుకోడానికి సిద్ధపడ్డారు. పాలు పల్చనైపోయిన తల్లి రొమ్ములు కొరుక్కు తినే బిడ్డల్లా తయారైనారు. రోహిణి శాక్య కోలీయుల రాజ్యాన్ని విడదీస్తూ వెళుతుంది. లేదా ఇరువురికీ మధ్యగా వెడుతోంది. ఇరువేపుల కర్మకారులూ నదికి అడ్డంగా గట్టు వేసుకుని నీటిని మళ్లించుకుంటూ వ్యవసాయం చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు చిన్న పాటి ఇబ్బందులు వచ్చినా సర్దుకుపోయేవారు. వరి, అనప, దోస, గుమ్మడి వంటి పంటలు వేసుకుని బళ్ల మీద వెళ్లి వర్తకం చేస్తుంటారు.

    ఎక్కువగా వరి మిగులు పంటను అమ్ముకుంటూ శాక్యులు సంపన్నులైన మాట వాస్తవం. పొలాలకు కంచెలు వేసుకుని జింకల బారి నుంచి పంట కాపాడుకోవడం కోసం ఉచ్చులు కూడా పెట్టే వారు. శాక్యపౌరుల సంపద పానశాలల్లోకీ, సౌందర్యవతులైన గణికల ఇళ్లలోకి చేరుతుంటుంది. పంట రాగానే బళ్లమీద వేసుకుని కొండ చీమల బారువలె ధాన్యాన్ని దూరప్రాంతాలకు తోలుకు వెళతారు. రైతుల దగ్గిర వర్తకులు కొంటారు. కోలీయుల సీమలో కక్కర పట్టణం పేరున్న వర్తక కేంద్రం.

    కోలీయుల రామ గ్రామం కంటే శాక్యుల కపిలవస్తు అందంగా వుంటుందంటారు.. పంటలని సంపదగా మార్చుకో వడం శాక్యులకు తెలిసినంతగా కోలీయులకు తెలియదని వారి అభిప్రాయం.

    “ఎందుచేత?” అని అడిగాడు ఉపాలి.

    కొద్దీ దినాల క్రిందట శ్రేష్టి ఇరుప్రాంతాల మధ్య రగులుతున్న గొడవ గురించి, దాని పూర్వాపరాల గురించి ఉపాలికి వివరించాడు. నవ్వి అన్నాడాయన, “మా స్వభావం కావచ్చు. కోలీయులు ప్రాచీనకాలం నుంచి అమాయకులు. శాక్యుల విలాసాలు మాకు తెలియవు. కృషి, న్యాయమైన వర్తకం మాకు తెలుసు.”

    శ్రేష్టి కథనం ప్రకారం శాక్యుల సంపదకీ, అహంకారానికీ, విలాసాలకీ, సుఖ లౌల్యానికి కారణం ఎక్కువ వరి పండించడం. వారే కొంత ఔదార్యం చూపించి వుంటే ఇప్పుడీ అనర్థం జరిగేది కాదంటాడాయన.

    “భన్తే, జ్యేష్ఠ మాసానికల్లా నదిలో నీరు తక్కువైపోయింది. అలా ఎన్నడూ జరిగినట్లు గుర్తులేదు. ఒక్క తడుపుకు అవకాశం ఇస్తే పంట దక్కించుకుంటామని అడిగారు మా రైతులు.”

    “వారేమంటారు?”

    “వల్లకాదు. ఒక తడుపుతో మాకు పంట దక్కుతుంది. ఈసారికి మేమే నీళ్లు పట్టుకుంటామని వాదనకి దిగారు. పైగా, మీ ధాన్యాగారాలు నిండడాన్ని చూసి మేం మీ చుట్టూ రత్నాలనీ, సువర్ణముద్రలనీ, నీలమణులనీ, నల్లకార్షాపణాలనీ తట్టలనీ బుట్టలనీ మోసుకుంటూ మేం తిరగలేం అన్నారు. మాటా మాటా పెరిగింది. చేతులకి పని చెప్పారు. తోసుకుని కొట్టుకుని తిట్టుకుని….”

    “శ్రేష్టీ!, వారూ వీరూ రైతులే గదా. శాక్యుల అధికారులుగానీ కోలీయుల అధికారులు గానీ కలిగించుకోనప్పుడు సాటి రైతుల కష్టాల్ని అర్థం చేసుకోలేరా? ‘ఇతరులెందుకు? వారే పరిష్కరించుకోవలె గదా? నదికి లేని వివక్ష వీరికెందుకు? రైతులందరూ ఒకటే!”

    “భన్తే! , ఆ ఇంగితం ఉంటే ఇంత జరగదు. ఇంక ఇప్పుడు అధికారులు కూడా ‘కలిగించుకోవడం వల రెండు రాజ్యాల మధ్య అహంకారం యుద్ధంగా పరిణమి స్తుంది. ఈ పరిస్థితి రైతులే కల్పించారు. దీనికితోడు జాతిని అవమానించారని శాక్యులంటున్నారు.”

    “జాతికేం అవమానం జరిగిందట?”

    ” శ్రేష్ఠి గాఢంగా నిటూర్చాడు. వెంటనే ఏమీ అనలేక కిటికీలోంచి బయటకు ‘చూశాడాయన. అక్కడ భిక్షువులు నలుగురు బట్టలకి కాషాయం రంగు అద్దుకోవడం కనిపించింది. రంగువేసిన వస్త్రాలు ఆరుతున్నాయి. ఉపాలి ఆయనవేపే చూస్తున్నాడు.

    ఆయన బయటికి చూస్తూ అన్నాడు.

    “భన్తే! కోపం వచ్చినప్పుడు పాములాంటి నాలిక కాటు వేస్తుంది. భన్తే…. శాక్యులను అక్కచెల్లెళ్లతో సంసారం చేసిన జాతివారని నిందించారు. వారు, కుష్టువాడికి పుట్టిన జాతి అనీ, అనాధలనీ, కొలియచెట్ల మీద పక్షుల్లాటివారనీ తిరిగి అన్నారు. ఇటువేపు యువకులందరూ నెత్తురు చిందించడానికి సిద్ధంగా వున్నారు. తథాగతుడు ఒక్కడే ఈ అనర్ధాన్ని నివారించగలడు.”

    ఉపాలి కనుబొమలు ముడివడ్డాయి. శాక్యుల పూర్వజుల గురించి కథలు అతనికి స్ఫురణకు వచ్చాయి. ప్రాచీన శాక్యులు వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం అక్కచెల్లెళ్లతో కాపురాలు చేశారు. కోలీయుల పూర్వజుడు రాముడనే శ్వేతకుష్టు. అతని వారసులు కోలీయులు – కోలిచెట్లతో, తోపులతో నిండిన ప్రాంతాన్ని వాసయోగ్యంగా చేసుకున్నారు.

    శాక్య కుటుంబాలలో సగోత్రీకులలో పాణిగ్రహణం చేసుకునే ఆచారం ఉండడంతో నింద మరీ గాయపరిచి వుంటుంది.

    మరికాసేపు కూచుని శ్రేష్ఠి ప్రణామం చేసి వెళ్లిపోయాడు. అతను వెళ్లగానే దీర్ఘజానువు తథాగతుణ్ని కలవడం, అతని మాటలూ జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు ఉపాలి భిక్షు. అప్పటికి కొన్ని దినాల క్రితం శాస్త కక్కరపట్టణలో వున్నాడు. అక్కడి శ్రేష్ఠి సంఘం ప్రార్థన మన్నించి భిక్ష స్వీకరించాడు.

    ఆయన దర్శనానికి వచ్చిన సందర్శకులు కాసేపు కూచుని శాస్త రూపాన్ని కళ్లలో పెట్టుకుని వెళ్లిపోగానే, దీర్ఘజానువు అనే సంపన్న గృహస్థుడు వేచి వున్నాడని తెలియ వచ్చింది. క్షణం ఆలోచించి రమ్మని తలవూపాడు తథాగతుడు. తన పొడవాటి శరీరాన్ని చర్మంలోకి కుదించుకునే ప్రయత్నం చేస్తూ దీర్ఘజానువు వచ్చి శాస్త్రను కళ్లారా చూసు కుంటూ అభివాదం చేసి కూచున్నాడు.

    శాస్త అన్నాడు.“ఆయుష్మాన్, నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావు?”

    “భన్తే, మా జీవితం గురించి.”

    “మీ సంపదకి కలిగిన నష్టం ఏమిటి?”

    “భన్తే , లేదు. సంపద వల్లనే నష్టం జరుగుతోంది. మేము సుఖాల్లో మునిగి తేలుతున్నాం. వర్తకం బాగా సాగుతోంది. మా బతుకుల నిండా సుగంధ లేపనాలు, పూలు, స్త్రీలు, మద్యం, కాశీ చీవరాలు. భన్తే మాకు ఊపిరి తీసుకోలేనంత సుఖమదం పట్టుకుంది. మాకు ధర్మాన్ని ఉపదేశించండి.”

    “ఆయుష్మాన్, మంచిది. నీవు సుఖంగా వున్నావు. నీ సాటి వర్తకులు సుఖంగా వున్నారు. కానీ అనేకమంది సుఖం ఎరుగనివారున్నారు. సంపద హానికరం కాదు. అధిక సంపద, అధిక వాంఛల్ని పుట్టిస్తుంది. వాటికి అంతు వుండదు. విశృంఖలమైన ఈ లౌల్యం పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని కలిగించదు. దీర్ఘజానూ దీని కారణంగా చిత్త సంస్కారం కలగదు. వ్యక్తికీ, సంఘానికి కూడా అధిక సంపద మంచిది కాదు. అది బహిరంతర ఘర్షణకీ, విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. ఎందుచేత? సంపదకి దూరం అయిన పేదలు.

    ఆయుష్మాన్, ఇవన్నీ దుఃఖహేతువులు. అందుచేత సంతృప్తికరమైననికీ, సంతోషకరమైన ఆధ్యాత్మిక జీవితానికి నాలుగు ప్రాథమిక సూత్రాలు త్రికరణశుద్ధిగా పాటించాలి.”

    “భన్తే!, అవి ఏవి?”

    అప్పుడు శాస్త సమ్యక్ జీవనం గురించీ, స్నేహం గురించీ శ్రద్ధ, త్యాగ, శీల, ప్రజ్ఞ వంటి వాటి గురించి ఉపదేశించాడు. వింటున్న దీర్ఘ జానువు కళ్లు చమరించాయి. శ్రద్ధాసక్తులతో అవి మూతబడ్డాయి. తేరుకుని తథాగతుని ముందు మోకరిల్లి ఆయన ఆశీస్సులు పొంది, సుబుద్ధితో జీవిస్తానని మాట ఇచ్చి వెళ్లిపోయాడు.

    ఆవలి తీరాన తథాగతుడు వస్తాడనే అందరూ అనుకుంటున్నారు. ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా శాస్త ఆగమనం గురించే మాట్లాడుకుంటున్నారు. వృద్ధుడైన సుద్ధోదనుణ్ణి పలకరించడానికి వస్తాడనే వదంతులు ఈ నమ్మకానికి కారణం. ఎవరి ప్రోద్బలమో తెలియకపోయినా కొద్దిమంది శాక్యముఖ్యులు నది దాటి వెళ్లి ఆమ్ర వనవిహారం చేరుకున్నారు. వారి గురించి తెలుసుకుని భిక్షువులు ఆనందుడికి వివరిం చారు. ఆనందుడు తథాగతుడి కుటీరం చేరుకోగానే బయటికి వస్తున్న ఉపాలి ఎదురయ్యాడు. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు.

    “భన్తే , శాక్య ముఖ్యులు మీ దర్శనం కోసం వచ్చారు.”

    “అలాగే, రమ్మని చెప్పు.”

    శాస్త ఉపాలివేపు చూసి చిరునవ్వు నవ్వాడు. కొద్దిక్షణాల తరువాత నలుగురు పెద్దలు లోపలికి వచ్చి తథాగతుడికి ప్రణామం చేశాక అందరూ ఆశీనులైనారు. శాస్త్ర దర్శన ప్రభావం వారి కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఏమీ మాట్లాడలేదు. చివరికి నలుగురిలో ఒక వృద్ధుడన్నాడు.

    “భన్తే … విషయం మీకు తెలియనిది కాదు. మేమంతా…”

    “ఏ విషయం ?” తటపటాయించి అన్నాడతను.

    “శాక్య కర్మకారులూ, కోలియ కర్మకారులూ ఘర్షణకు దిగారు. సంయమనం కోల్పోయి యుద్ధ పరిస్థితులు కల్పించారు!”

    “నేనేమి చెయ్యగలను? అది వారి సమస్య. సంయమనం కోల్పోనివారు ఏం చేస్తున్నారు?”

    శాక్య పెద్ద గొంతులో చిన్న మామిడి టెంక అడ్డుపడింది.

    “భన్తే , పరిస్థితి చేతులు దాటిపోయింది. ఇది మా ప్రార్థన. మీరు వారించ గలరు. వారిని ధర్మమార్గంలో పెట్టమని మా కోరిక.”

    శాస్త చిరునవ్వు నవ్వి అన్నారు.

    “సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించడానికి, స్థూలదృష్టి, నిరాపేక్ష, ఔదార్యం వుండాలి. పెద్దలారా, ఈ లక్షణాలు రాజ్యాధికారులకు వుండాలి. వారేమి చేస్తున్నారు?”

    “భన్తే, అందరూ ఆవేశంతో ఆలోచించడం మానివేశారు. అబద్దాలు ప్రచారం అయి వాస్తవాలుగా మారుతున్నాయి.

    “మంచిది. ధర్మానుసరణమే మంచిదని మీ ఏలికకు చెప్పండి.”

    ఏలిక అనగానే అతనికి వాగ్బంధం అయిపోయింది. మాట్లాడలేక ఊరుకున్నాడు. వచ్చినవారిలో ఒకడు సాహసించి శాస్తవేపు సూటిగా చూస్తూ అనగలిగాడు.

    “భన్తే , మన్నించండి. శాక్యులు మీ స్వజనులు. శాక్యరాజు అన్యుడు కాదు. మీ కన్నతండ్రి. ఘర్షణ వారించడం మీ బాధ్యత అని కూడా మేం భావిస్తున్నాం .”

    తథాగతుడతగాడి మాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు. క్షణం తరువాత కళ్లు తెరిచి ప్రశాంతంగా అందరివేపూ చూస్తూ అన్నాడాయన.

    “మీరు ఎవరి గురించి అంటున్నారు? బంధాలు తెంచుకుని రాజకుటుంబం వీడిన రాకుమారుడు వేరు. అతనిప్పుడు లేడు. అందుచేత సుద్ధోధనుడు అతనికి తండ్రి కాదు. బంధాలు లేనందువల్ల అతనికి స్వజనులు లేరు. నేను వేరు. నేను వేరు కావడం వల్ల నాకు ఎటువంటి బాధ్యతలు వుండవు.”

    ఆనందుడు, ఉపాలి ఆగంతుకుల వేపే చూస్తూ మౌనంగా వుండిపోయారు. ఆగంతక బృందానికి నెత్తిమీద గుమ్మడికాయ పడినట్టు జరిగిన పొరపాటు అర్థమైంది. తలలు వంచుకుని కాసేపు మాటల్ని మర్చిపోయి నోట్లో నాలుక ఉందనే స్పృహ పోగొట్టుకున్నారు.

    “మీరు వెళ్లిరండి. మీరు చెప్పిన కారణం వల్ల నేను నిర్ణయం తీసుకోలేను. మంచి చెడులు ప్రజలకు చెప్పడం, నిజం చెప్పడం రాజు బాధ్యత. అది రాజు ధర్మం. మధ్యలో ఏరుండగా ఇరువైపుల రైతులూ యుద్ధానికి దిగడం రాజు అసమర్థత, బాధ్యతారాహిత్యం కారణం. రైతుల స్వార్థం కారణం. పెద్దలారా, మీకు శుభం కలుగు గాక.”

    శాస్త వాక్కులు పరిమళభరితమైన పూలు వెదజల్లిన చిరుచినుకుల్లా వున్నాయి.

    ఆస్వాదించి, కృతజ్ఞతాభావం మెరుస్తుండగా ఆయనకి మోకరిల్లి మాట్లాడకుండా వెళ్లిపోయారు శాక్య పెద్దలు. “ఆనందా, వారితో మాట్లాడిన తరువాత దాహం వేస్తున్నది.”

    ఉపాలి నవ్వాడు. ఆనందుడు చిన్న సొరకాయతో నీరందించాడు. గటగట తాగి మూసుకున్నాడు తథాగతుడు. ఉపాలి అర్థవంతంగా తల ఊపాడు. చటుక్కున కళ్లు తెరిచి అన్నాడు శాస్త.

    “శ్రేష్టికి చెప్పండి. రేపు కర్మకారుల్ని సమావేశపరచమని చెప్పండి.”

    కాసేపటికి భోజనానికి కూచోబోతున్న శ్రేష్ఠికి వర్తమానం వెళ్లింది. భోజనం అవకుండానే అతనికి కడుపు నిండిపోయింది.

    “ఇప్పుడు అందరి విస్తళ్లలో అన్నం నిండుగా వుంటుంది,” అనుకున్నాడతను.

    మరునాడు విహారంలో చెట్ల చల్లటినీడలో చెట్టెక్కి కూచున్న నెమలి కనుసన్నల్లో అందరూ ఆశీనులైనారు. ఇరుపక్షాల నుంచీ పెద్దలు వచ్చి కూచున్నారు. ఒకరికొకరు దూరంగా కూచున్నారు. వారు ముఖం తిప్పుకుంటున్నారు. చల్లటి మావి నీడలు వారి వైషమ్యాలకి వెచ్చబడుతున్నట్టనిపిస్తోంది. చెట్టు కింద ఉన్నతాసనం పరిచి వుంది. అందరూ నిశ్శబ్దంగా తథాగతుడి రాకకోసం నిరీక్షిస్తున్నారు. ఆనందుడు, ఉపాలి, ఇతర స్థవిరులు వెంట నడుస్తుండగా తథాగతుడు అటు వేగంగానూ, ఇటు మెల్లగానూ కాకుండా ఆయన పాదాలే ఏదో లక్ష్యం వేపు నడిపిస్తున్నట్టుగా కాలిబాటలో ఒంపు తిరుగుతూ కనిపించాడు. ఆయన కనిపించగానే ముందు నెమలి కూసింది. అందరూ లేచి నుంచున్నారు. తథాగతుడు కూచుని తలెత్తి కొమ్మ మీద కూచున్న నెమలిని చూస్తుండిపోయాడు. ఆవల తీరం నుంచి వచ్చిన శాక్యులు తథాగతుణ్ని చూసి ఎరుగరు. ఒకరిద్దరు ఆయన్ని రాకుమారుడిగా చూసినవారున్నారు. అందర్నీ ఒకసారి పరికించి చూశాడు శాస్త. ఆయన చూపు పడినంత మేరా అందరి మనసుల్లో లేత సూర్యకాంతి ఏదో చొరబడిన అనుభూతి కలిగింది. కొంచెం భుజాల దగ్గిర ఒంగి, సన్నగా, చామనచాయలో, దరిదాపు నెరిసిపోయిన గడ్డంతో తథాగతుడు చిరునవ్వు నవ్వాడు. నిజానికి ఆయన దృష్టి ఎవరిమీదా లేదు. అందర్నీ చూపులతో కలియ తిప్పుతున్నా ఎవరినీ చూడ్డం లేదాయన.

    ఆనందుడు చెయ్యి ఊపగానే ముందు కోలియశ్రేష్ఠి లేచి నీరులేక ఎండి పోతున్న పంట గురించి, దానివల్ల జరిగే నష్టం గురించి వివరించాడు. శ్రేష్ఠి లోకజ్ఞుడు. ఎక్కువ మాట్లాడకుండా శాక్యులను నిందించకుండా తమ అవసరం గురించి మాత్రమే మాట్లాడాడు. ఆయన కూచోగానే శాక్యుల పక్షాన ఒక వృద్దరైతు లేచి మాట్లాడాడు.

    చెట్టుమీది నెమలి మెడ సాచి అందరి మాటలు వింటోంది. మధ్యలో శాస్త తల ఎతి దాన్ని చూస్తూనే వున్నాడు. తరువాత మరో ఇద్దరు మాట్లాడి చిన్న రైతుల కష్టాల్ని వివరించారు. అప్పటికి ఇంక ఎవరికీ...

    35 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners