Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • గ్యాపకాలు

    "భలే గట్టోడు రా మీ రాం మావ, అటెండన్స్ తక్కువయిందని ఎఫ్.ఏ ఆఖరి పరీక్షలకు కూర్చోనివ్వలా ఆయన్ని ! అప్పుడు సంవత్సరం పాటు తాత తో పాటే ఉండి, గొడ్ల పేడ ఎత్తడం నుంచి కోతల దాకా పనులన్నీ బ్రెమ్మాండంగా నేర్చుకొని, మళ్ళీ ఎఫ్.ఏ పరీక్షలు రాస్తా, ఏ.జీ.బీ.ఎస్.సి చదువుకుంటా అని తాతని ఒప్పిచ్చి, మళ్ళీ పరీక్షకు కూర్చొని పాస్ అయ్యాడు.

    లెక్కల గ్రూప్లో వాడు, ఏ.జీ.బి.ఎస్.సీ ఎట్టా చదవతావురా అని జనాలందరూ నవ్వితే, కాలేజీ వాళ్ళని ఒప్పించుకొని మరీ బాపట్ల కాలేజీ లో చేరాడు.

    మీ పెద్దమ్మ లిద్దరి కంటే గూడా నేనంటేనే ఇది.నాక్కొక్కదానికే రాసే వాడు జాబులు. "నాయన దగ్గర పొలం పని నేర్చుకోడం మంచిదయ్యిందే, నేనేవో వీళ్ళు చెప్పే పనులు ఎడం చేత్తో చేసేస్తూంటే, మిగతా వాళ్ళందరూ తెగ ఇబ్బంది పడ్తున్నారని" జాబుల్లో రాసేవాడు .


    చదువైనా, ఉజ్జోగం అయినా అన్నిట్లో ఫస్టు.


    మనిషి మొండోడులే, మీ పెద్దమ్మకి శేష పెదనాయన సంబంధం ఖాయం చేస్తూంటే ఎంత గొడవ చేసాడని,


    శేష బావ నలుపు, మా అక్క అంత అందగత్తెకి ఆయన్నిచ్చి ఎట్టా చేస్తారు అని ఒకటే గొడవ.


    గొరస కత్తి ఒగటి ఎత్తుకొని, కనపడిన తాటి చెట్టు కల్లా గాట్లు పెట్టుకుంటా పొయ్యాడు. ఈయన్నిశాంత పరిచే కాడికి తాతలు దిగొచ్చారు.


    ఒక్కడే కొడుకు అని చెప్పి, మా అమ్మ గూడ అట్టే చూసేదిలే మీ రాం మావని. డబ్బులు చాలక ఇబ్బంది పడుతూంటే, ఎన్ని సార్లో , నాయనకి తెలీకుండా, వడ్లమ్మి ఎం.ఓ చెయ్యించేదో మా అమ్మ."



    టోల్ గేట్ కనపడుతోంది దూరంగా.


    కారెక్కినప్పట్నుంచీ అమ్మ ఇట్టా మాట్లాడ్తూనే వుంది.


    అడిగా వెనక అద్దంలోంచి అమ్మను చూస్తూ .


    "కాఫీకి ఆపేదా పిడుగురాళ్లలో "


    నాన్న ఏదో చెప్పబొయ్యే లోపల అమ్మే అనింది, "మావ దగ్గరకి పొయ్యే దాకా ఎక్కడ ఆపే పనే లేదు రా"


    రాత్రి నెల్లూరు నుంచి మావ గురించి ఫోన్ వచినప్పట్నుంచీ, అమ్మ అదొక ట్రాన్స్ లోకి వెళ్లి పొయ్యింది.


    వాళ్ళ అన్న గురించి అవే అవే మాటలు. అన్నీ వాళ్ళ చిన్నప్పటి మాటలు.


    వింటున్న నాకూ, నాన్నకూ, ఆమె చెప్పే విషయాల్లో తెలీనివి ఏవీ లేవు.


    కానీ, అమ్మమ్మ దగ్గరే, వూళ్ళో చాలా ఏళ్ళు పెరిగిన నాకు, , మా రాం మావ తో వుండే గ్యాపకాలు వేరు.


    అప్పుడు ఆయన ఉద్యోగం నెల్లూరు అన్నట్టే గుర్తు. మా అత్త ను గూడ తీసుకు రాకుండా, స్కూటర్ వేసుకొని ఊరి కొచ్చి, ముందర ఇంటికి రాకుండా, నేరుగా పక్కీధి లో వుండే మా శంకర అవ్వ వాళ్ళింటికి పొయ్యేవాడు.


    నేను అమ్మమ్మ ను ఏడిపిద్దామని అనేవాణ్ణి.


    "అమ్మమ్మా, శంకర అవ్వ వాళ్ళింట్లో ఫ్యాను కింద కూర్చొని, చక్కెర కాఫీ తాగుతుంటే, వుండే మజా, నీ దగ్గరొకొచ్చి విసనకర్రతో ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తాగే, బెల్లం కాఫీలో ఏవుంటుంది అని."


    "రేయ్ వేలెడంత లేవు, నువ్వేన్దిరా వాడి గురించి మాట్లాడేది, ఎంత పెద్ద ఉజ్జోగంలో వున్నాడు తెలుసా."



    ఇదిగాక మావ వొచ్చిన ప్రతీ సారీ, మా అమ్మమ్మ, ఆయన కొత్తగా కట్టుకున్న ఇంటికి తీసుకెళ్లామని అడగడం, నెల్లూళ్ళో ఆ గోలలో నువ్వు ఒక్క రోజు కూడా వుండలేవే అని మా మావ దాటెయ్యడం నా కళ్ళ ముందే జరిగేది.


    "అవును అమ్మమ్మా, అంత పెద్ద ఉజ్జోగం చేసే మావ, అంతకంటే పెద్ద ఇల్లు కట్టాడు కదా, నెల్లూరులో, పిలిచి చూపిచ్చాడా ఎప్ప్పుడైనా"


    "రేయ్ వందమంది పని చేస్తార్రా, మీ మావ చేతి కింద. ఊపిరాడని ఉజ్జోగం. అయినా గూడా నెల నెలా నాకోసం వూరొచ్చి, మందులు పళ్ళు తెచ్చిచ్చి పోతాడు తెలుసా." అనేది మా అమ్మమ్మ, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూంటే,


    పొడిగించేవాణ్ణి కాదు నేను అక్కణ్ణించీ.


    మా అమ్మమ్మ పొయ్యినప్పుడు గూడా, పిల్లలలకి పరీక్షలు అనిచెప్పి, వాళ్ళను తీస్కరాకుండా, మా మావ, అత్తా నే వచ్చి చిన్న కర్మ పెద్ద కర్మ మరునాడే చేసేసి వెళ్లిపోయారు. ఊపిరాడని ఉద్యోగం కదా మావది !


    ఆ తర్వాత నేను వాళ్ళను పెద్ద కల్సింది లేదు.


    మా కుటుంబాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని సార్లు చేతులు అందిచ్చుకున్నా, మా అమ్మా పెద్దమ్మలిద్దరి మధ్యలోనే, ఆయన ప్రమేయం లేకుండానే , అంతా నడిచిపోయింది.


    నెల్లూరులో వుండే బంధువుల ద్వారా మావ వాళ్ళ విషయాలు అయితే తెలుస్తూ ఉండేవి.


    ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చాలా పెద్ద పొసిషన్ లో రిటైర్ అయ్యాడనీ, ఇద్దరూ కొడుకులూ స్టేట్స్ లో చదువులూ, ఉద్యోగాలతో పాటూ అక్కడ అమ్మాయిల్నే చేసుకొని, సెటిల్ అయిపొయ్యారనీ. మా మావ కొడుకులు పెళ్లిళ్లు అయ్యాక ఇండియా కి రాలేక పోతే, మా అత్తా మావ ప్రతీ రెండేళ్లకే అక్కడికి పొయ్యేసి వస్తూంటారనీ.


    మిర్రర్లో చూస్తే, మాట్లాడి మాట్లాడి అలసిపొయ్యినట్టుంది, అమ్మ అట్టానే నిద్ర పొయ్యింది.


    నెల్లూరు చేరేటప్పటికి మధ్యాహ్నం.


    మావ వాళ్ళ ఇంటి ముందర ఓ షామియానా వేసున్నారు. బయట కాఫీలు తాగుతూ అక్కడే కూర్చోనున్నారు కొంతమంది.


    హాల్లో పడుకోపెట్టున్నారు చాప మీద మావని. ప్రశాంతంగా వుంది మొహం.


    ఇంత అందగాడా మా మావ?


    అమ్మ నేరుగా వెళ్లి అత్త చెయ్యిపట్టుకోని ఆమె పక్కన కూర్చుంది.


    కొడుకులిద్దరూ టైం కి అందుకోలేం అంటే, మా అత్తా వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకబ్బాయి, జరగాల్సిన వన్నీ పూర్తి చేసాడు.


    చిన్న కర్మ రోజున, మా అత్త అమ్మని, వాళ్ళ బంధువులకి పరిచయం చేస్తూ చెప్పింది. "ఈమె, ఆయన చిన్న చెల్లెలు. వీళ్ళ ముగ్గురు అక్క చెళ్ళెళ్ళూ ఈ రోజు దాకా నన్ను ఒక్క మాట అనింది లేదు. నాకెప్పుడూ వీళ్ళని ఏదో ఒకటి అనాలని అనిపించింది లేదు. ఎందుకో ఆయనే దూరంగా వుండి పోదామనుకున్నారు వీళ్ళకి" అని.


    నేనేదో అనపొయ్యి అమ్మ మొహం చూసి ఆగిపొయ్యా.


    నెల్లూరు నించి, హైద్రాబాదుకి వెనక్కొస్తూ ఉంటే, పక్కనే కూర్చున్న అమ్మని ఆపుకోలేక అడిగా.


    "అవునే, అమ్మా! మావ గురించి మొన్న కార్లో, చాలా మాట్లాడావ్ కదా. నువ్వు బాధ పడ్డ సందర్భాలు ఏవీ లేవా?" అని


    "ఏది గుర్తు పెట్టుకోవాలో.... ఏది కూడదో, మన చేతుల్లో వుండే పని గదరా" అంది, అమ్మ కిటికీలోంచి బయటికి చూస్తూ.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    7 min
  • 'ఆర్వీ చారి కరెంటు బిల్లు ' ! - పతంజలి శాస్త్రి గారి కథ

    ఆర్వీ చారి కరెంటు బిల్లు అనే ఈ కథ, శాస్త్రి గారి 'నలుపెఱుపు' అనే కథా సంకలనం లోనిది.

    కథ చివరన మిత్రులు, నండూరి రాజగోపాల్ గారు , కథపై వారి అభిప్రాయాన్ని తెలియజెయ్యడం జరుగుతుంది.

    శాస్త్రి గారి రచనా ప్రక్రియ, రచనా జీవితం గురించి , హర్షణీయంలో ప్రసారమైన ఎపిసోడ్స్ లింకులు ఇదే పేజీ లో కింద ఇవ్వడం జరిగింది.

    ఆర్వీచారి కరెంటు బిల్లు:

    లిఫ్ట్ మూసుకోబోతూండగా రజనీదేశ్ పాండే ఒక్క గెంతులో లోపలికి దూకింది. చారి నవ్వేడు.

    “కనీసం మూడు నిముషాలు ఆదా అయ్యేయి" అందామె.

    “లేదా నీ ముక్కు బద్దలయ్యేది. ఏది నయమో నీకే తెలియాలి" అన్నాడతను.

    అప్పటికే లిఫ్టు గాజు బుడగలో ఆమె డియో కమ్మగా కమ్ముకుంది.

    “వెరీ నైస్. కొన్నావా, బాయ్ ఫ్రెండ్ చేత కొనిపించావా?" అన్నాడు మళ్లీ.

    లిఫ్ట్ పదో అంతస్తు దగ్గర మెత్తగా ఆగి తెరుచుకుంది.

    బయటికి వెళ్తూ “నెక్స్ట్ టైమ్ యువర్ టర్న్” అంది రజని.

    లిఫ్ట్ లోంచి అతనికి వరండాలో అలలా వెళ్తున్న రజనీ వంపు తిరిగి మాయమైంది.

    మిగిలిపోయిన డియో పీల్చుకుని ఆర్వీ పధ్నాలుగో అంతస్తులో దిగేడు. పదకొండు దాటిం తరవాత ఎప్పుడో సిస్టం ముందు నుంచి లేచి ఒళ్లు విరుచుకుని కిటికీ దగ్గిరికి కుర్చీ లాక్కుని కిందికి చూశాడతను..

    వంద ఎకరాలు మెత్తని పచ్చికలో లేత కనకాంబరం రంగులో ఇరవై అంతస్తుల పాలరాయి చెట్టు.

    దాన్లో పదిహేను గూళ్లు తొలిచేరు

    ఎరుపు, పసుపు పచ్చ పూలచెట్లు ఎండలో మెరుస్తున్నాయి.

    రాత్రి రాల్చిన రంగుపూలన్నీ కొంగుపరుచుకున్నట్టు అలాగే ఉండిపోయాయి.

    లోపల చల్లగా, చల్లదనంతో కలిసిన చిన్న పరిమళంతో సహా హాయిగా ఉంది.

    బయట ఎంత వెలుతురుందో లోపలా అంతే.

    గోడలకి, సీలింగుకీ అతుక్కున్న దీపాలు తెల్లగా మెరుస్తున్నాయి.

    బుగ్గల్లాంటి నున్నటి నీలపు ఒట్టి నేల మీద భోజనం చేసినా ఫరవాలేదు.

    చారి వారానికి రెండు మూడుసార్లు కిటికీ పక్కన కూచుని ఇదే దృశ్యాన్ని చూస్తూంటాడు.

    పధ్నాలుగో అంతస్తులో అతని ఉన్నతీ, చుట్టూరా పరుచుకున్న ఖరీదైన చక్కదనం, లోపల చల్లటి భద్రత చారికి సంతృప్తికరంగా వుంటుంది.

    ఆర్వీ చారి ఈ ఏడాది రెండోసారి కాలిఫోర్నియా వెళ్లాచ్చి పది రోజులు కూడా కాలేదు.

    విమానం దిగి ఇంటికి కూడా వెళ్లలేదతను.

    లోపలికి రాగానే జీఎం గారు పిలిపించి అతని భుజం పిండి, కంపెనీ ఆనందాన్ని అతనితో పంచుకున్నాడు.

    చారి వెంట ఆయన గదిలోకి ఒక డాలర్ ప్రవాహం రావడం చూశాడాయన.

    ఇద్దరి మొఖాలూ ఇంకా ఎవరూ ముట్టుకోని కొత్త వందడాలర్ల నోటులా మెరిసిపోయాయి.

    గంట తరవాత కంపెనీ కార్లో ఇంటికి చేరేడతను.

    లోపలికెళ్లి కూచోగానే జ్యోతి ఫోన్ చేసింది.

    ఫ్రిజ్లో అన్నీ ఉన్నాయి.

    సాయంకాలం వరకూ రాలేనంది.

    "ఓకే. లవ్". అన్నాడు చారి.

    సాయంకాలం ఆరు దాటింతరవాత జ్యోతి కాలింగ్ బెల్ నొక్కే వరకూ నిద్రపోయాడు చారి.

    నీలపు డబ్బాలోంచి చల్లటి బీరు గుటక వేస్తూ ప్రాజెక్టు గురించి చెప్పేడతను.

    సంతోషం వెచ్చటి వెలుతురు వలయంలా వాళ్లిద్దరి చుట్టూ పరుచుకుంది.

    *************

    ఫోన్ మోగింది. సున్నితంగా స్పష్టమైన గలగల.

    ఫోను మాట్లాడి కూచోగానే ఆలీ లోపలి కొచ్చేడు.

    “ఏరా?"

    జేబులో చెయి పట్టి కరెంటు బిల్లు రసీదూ, మిగిలిన రెండు వందల ఎనభై రూపాయలూ టేబిలు మీద పెట్టేడు ఆలీ.

    రసీదు చూశాడు చారి.

    “ఓ. కరెంటు బిల్లా? థేంక్స్. ఇదో.” ఏభై రూపాయల నోటు తీసి ఇచ్చేడతను.

    “ఈ సేవలో కట్నా సార్.”

    “ఓకే. థేంక్స్."

    ఆలీ సందేహిస్తూ నిలబడి పోయాడు.

    ఫైల్లోంచి అతని వేపు చూసి అన్నాడు చారి

    “ఏమనుకోకండి సార్. బిల్లు చూసిన్రాసార్ మీరు?”

    "ఆ. చూడకుండా పైసలెలా ఇస్తాను?”

    “అవుసార్. గిట్లనే బిల్లు నాలుగు దఫాలు ఇచ్చినారు సార్. మీరు చూస్తలేరు సార్. ఆడిస్తనే ఉన్నాడు. మీరు జమజేస్తనే ఉన్నారు సార్. చానా ఎక్కువ సార్." |

    కొన్ని క్షణాల వరకూ ఆలీ ఏవంటున్నాడో అర్థం కాలేదు చారికి.

    చివరికి లోపలికి దిగిం తరవాత అన్నాడు. “అదా? ఇంట్లో ఉండం గదా. అంతకు ముందు నెలదే వేస్తున్నాడేమో."

    "అట్లయిత లేదుసార్. చానా ఎక్కువ బిల్లు సార్. మీరు అడగండ్రి సారూ, ఎన్ని పైసలిస్తరు సార్."

    అప్పుడతని వేపు చూశాడు చారి.

    ఆలీ పెదాలు వంపు తిరిగున్నాయి.

    అతని కళ్లలో నల్లటి నింద అతనికి తెలీకుండానే కళ్ల నిండా పరుచుకుని ఉంది. అతని కళ్లలోకి చూడ్డం ఇబ్బందిగా ఉంది.

    ఆలీ చూపులు వీపు మీద సూదుల్లా గుచ్చుకున్నాయి.

    చారి మనసులో ఉక్కపోసినట్టుయింది.

    ఫైలు చూస్తూ "ఓకే" అన్నాడతను.

    ఆలీ వెళ్లబోతూ చిన్న నవ్వుతో అన్నాడు. “అయన్ని నాకు మూడు నెల్ల జీతం లెక్క సౌర్."

    తల అడ్డంగా ఊపుతూ ఆలీ వెళ్లిపోయాడు.

    సూది బాగా లోపలికి దిగిపోయింది. చిల్లర నోట్లు పర్సులో పెట్టుకుంటూ బిల్లుల వేపు చూసాడతను.

    దానికీ, మీటరుకీ, డబ్బుకీ సంబంధం అతనెప్పుడూ ఆలోచించలేదు.

    ఎంతయిందో చూసి ఆలీకి డబ్బులిచ్చి మర్చిపోవడం చారికి అలవాటుగా వస్తోంది. ఇప్పుడు బిల్లు చూస్తుంటే అతనికి ఆశ్చర్యంగానే ఉంది. కాసేపు దానివేపే చూస్తూండిపోయాడు.

    మనసులో ఉక్క ఎక్కువగానే ఉంది. మళ్లీ ఫోను మోగింది. ఈసారి ఫోను చెవిలో గలగల మన్నట్టుంది.

    సాయంకాలం వరకూ చారికి జారిపడ్డానిక్కూడా తీరిక దొరకలేదు.

    సాయంత్రం తన లేత అరిటాకు పచ్చ కారెక్కుతూండగా పక్కనుంచి వెళ్తూ అలీ సలాం కొట్టేడు.

    ఇంటి కెళ్తూ, కారాపినప్పుడల్లా జేబులో చెయ్యి పెట్టి బిల్లు తడుముకున్నాడు చారి.

    కడుపులో ఏవీ బాగా లేనట్టనిపించింది.

    "టీ ఇవ్వనా?" అంది జ్యోతి.

    తల ఊపేడతను.

    పేంటులోంచి చొక్కా బయటికి లాగి, విప్పి పక్కన పడేశాడు.

    టీ తెచ్చి ఇచ్చిందామె.

    ఓ గుక్క మింగి కప్పు టీపాయ్ గ్లాసు మీద పెట్టి చొక్కా జేబులోంచి బిల్లు తీసి ఆమెకిచ్చేడతను.

    "ఏంటిది? ఓ. కరెంటు బిల్లు. కట్టేడా ఆలీ?”

    “కట్టేడు. జ్యోతి బిల్లు చూశావా?"

    “బిల్లే వుంది సార్ చూడ్డానికి?"

    బిల్లు తన చేతిలోకి తీసుకుని చూస్తూ అన్నాడు చారి.

    “మనిద్దరం చూడ్డం లేదు. మూడు నాలుగు నెలల్నించి చాలా ఎక్కవ బిల్లు పడుతోంది. మనకి అందులో సగం కూడా అవదు."

    అతని కనుబొమ్మల మధ్య చిరాకు మడతపడ్డం చూసిందామె. అతని వేపే చూస్తూ ఏవీ అనలేదామె.

    "వాడు గమనించి చెప్పేడు. ఇటీజ్ ఎ లాటాఫ్ మనీ, నేనూ చూడలేదు.”

    "అవును.

    అంటే, మామూలుగా చూడంకదండీ.

    ఏ బిల్లు వచ్చినా మనీ ఎంతో చూసి మీరో నేనే ఇస్తాంగదా. బహుశా ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. పోనీ ఓసారి కంప్లయింటు చేసి చూడండి.”

    తల ఊపేడతను. కానీ లోపలి ఉక్క , ఫేను గాలికి శాంతించడం లేదు.

    “ఒకే. పాత బిల్సున్నాయేమో చూడోసారి." 

    అతనివేపోసారి చూసి లేచి వెళ్లిందామె. టేబిలు సొరుగులో ఏవీ లేవు. కానీ సీడీల పెట్టె కింద నాలుగు విడి వందరూపాయలు దొరికేయి.

    "లేవు. డబ్బులు దొరికేయి." అందామె. ఆలీ సూది పొడుగు పెరిగింది మరీ లోపలికి.

    "బిల్సు లేవా? మనం ఉంచడం లేదా?" చారి ముఖం కొద్దిగా ఎర్రబారడం గమనించిందామె.

    "ఎక్కడో పెట్టినా పట్టించుకోంగదా. పేమెంటు అవగానే పడేస్తూంటాం. పైగా వాటి అవసరం ఎప్పుడూ రాలేదు. ఒక్క టాక్సు కాయితాల్నే పైల్ చేస్తాను.

    ఏంటి అలా ఉన్నారు? ఏవైంది?"

    టీ తాగి కప్పు టేబిలు మీద పెట్టేసి దరిదాపు మామూలుగా అన్నాడు చారి. "ఏం లేదు. తెలుసుకోవాలనిపించింది. అంతే."

    "వెళ్లి స్నానం చేసి రండి. బాగా అలసిపోయినట్టున్నారు. డోంట్ వర్రీ..."

    చారి స్నానం చేసి వచ్చి ఉదయం వదిలేసిన పేపరు వార్తలు చూస్తున్నాడు. పేపర్నిండా దుర్భిక్షం పరుచుకుని ఉంది. నీటి మేఘాలన్నీ చుట్టచుట్టుకుని హిమాలయ సానువులకి వెళ్లిపోయాయి. ఆకాశం భగ్గున మండుతోంది. వేసవి డేగ మళ్లీ రెక్కలు పరుచుకుంటోంది.

    రెండోది ఆర్థికమాంద్యం. మెన్నటి ఉల్లి దోశలాగ.

    ఆర్థికమంత్రి చక్కటి చిరునవ్వు కలిపిన ఇంగ్లీషులో సొరంగం చివర సూర్యుడు కూచున్నాడనీ, భయం లేదని చెప్తున్నాడు.

    కథకి అవసరం అనుకుంటే తప్పకుండా బికినీ వేసుకుంటానంటోంది. పెద్ద తార. పేపర పక్కన పడేసి టీ.వీ. తెరిచాడు చారి.

    పంజాబీ డ్రెస్ వేసుకుని పక్కనే వచ్చి కూచుంది జ్యోతి. డ్రెస్ వేపు చూస్తూ ఏవి టన్నట్టు చూశాడతను.

    “చెప్తాగా" అంది జ్యోతి.

    న్యూస్ రీడర్ ఎర్రటి చక్కటి పెదాలు రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాల్ని చుక్క వర్షం పడని తెలంగాణా ప్రాంతాల్నీ చప్పరిస్తున్నాయి. తెరమీద పొలాలు విచ్చిపోయాయి.

    లావుపాటి ఎమ్మెల్యే మరో అయిదు మండలాల్ని కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తించాలంటున్నాడు.

    హైద్రాబాద్లో రిలయన్స్ మాల్. వెలుగు దీవి.

    చేతుల్లో ప్లాస్టిక్ సంచులతో, పక్కనే పిల్లలతో మెరుస్తూ బయటికి వస్తున్నారు. లోపల చక్రాల బళ్లలో చిన్న పిల్లల్ని సరుకుల్నీ హాల్లో వరసల మధ్య తిప్పుతున్నారు.

    పెద్ద పెద్ద ఏనుగులు, ఎలుగులూ, జీరాఫీలూ వాటి కళేబరాల్లా ప్లాస్టిక్ సంచుల్లో నిలబడి చూస్తున్నాయి.

    కూరల దగ్గిర హడావుడిగా ఉంది. తెలుపు నీలం ప్లాస్టిక్ కవర్లలో అల్లాగే ఉన్న అమ్మాయి నాలుగు చేతులతో కూరగాయలందిస్తోంది.

    చటుక్కున కెమేరా ఎక్కడో కూరలబళ్ల దగ్గరికి వెళ్లింది.

    ప్లాస్టికబుట్టల్లో కూరగాయల్ని చుట్టుముట్టి ఉన్నారు. మహిళలు. బళ్లకింద కేబేజీ చర్మాలు, వంకాయలు, చితికిన టమాటోలు పడి ఉన్నాయి. బెండకాయలు చివరిభాగం విరస్తుంటే ఒప్పుకోడం లేదు. కూరలవాడు.

    చేతిలో కూరల సంచీతో ఒకామె కెమేరాలోకి వచ్చింది.

    వరసకీ ఆమె కూరగాయల ధరలు ఏకరువు పెట్టింది.ధరలు ఇలాగే ఉంటే సామాన్యలందరూ గడ్డి కొనుక్కొని వండుకోక తప్పదంటోంది. రెండో పూట తినే అవకాశం లేదనీ పిల్లలకి పెట్టి మంచినీళ్లు తాగి పడుకునే రోజు వస్తుందని చెప్పి వెళ్లిపోయిందామె. రెండుచేతులతో , వీలయితే నాలుగు చేతుల్తో లంచాలు తింటే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పాటు చేస్తున్నారన్నాడు ఒక ఉద్యోగి.

    సూది తీవ్రంగా పనిచేస్తోంది.

    **************

    నాన్న కడుపు అలారంలా పనిచేసేది. ఓ కంట్లో భూతద్దం పెట్టుకుని బంగారప్పని చేస్తున్నా పదకొండు అయేసరికి ఓ గావుకేక పెట్టేవాడు సుబ్బాచారి.

    అన్నం కూరా అన్నీ వేడిగా ఉంటేనే తినేవాడతను.

    మొత్తానికి వారానికి మూడు రోజులైనా పెరట్లో కూరలూ ఆకు కూరలు తెంపి వండేది అమ్మ.

    సుబ్బాచారికి రాబడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంచి పేరుండేది. ("పోయి చదూకో ఎధవా. దీని జోలికి రామాక.")

    కంచుగ్లాసు నిండా అపుపడప్పుడు సగ్గు బియ్యపు పరమాన్నం పెట్టేది అమ్మ,

    చారి నోరు తియ్యబడింది. తను ఇంజనీరవడం చూళ్లేదామె. ఓసారి శలవలకి ఒచ్చినప్పుడు అమ్మకేవీ బాగాలేదని చెప్పేడు నాన్న.

    ఓరాత్రి తన పాయసం తాగే గ్లాసు లోంచి ఏదో గుటక వేస్తూ చటుక్కున అన్నాడాయన.

    “బాగా బలంగా ఉండే ఆహారం రెండుపూట్లా పెడితే లేచి బాగా తిరుగుద్దంట."

    అమె లేచి తిరగలేదు.

    *************

    "మీరు న్యూస్ చూస్తున్నారా?" అంది జ్యోతి.

    ఉలిక్కిపడ్డా డతను.

    "ఏం చేశావీపూట?"

    "అదే చెప్తానన్నాను. ఏం చెయ్యలే. బయటికి పోదాం. ఆకలిగా ఉందా?"

    "లేదు. కాసేపాగి వెళ్లాం. ఎక్కడికిట?”

    “ఊ. చైనీస్".

    'రైట్. ఎటొచ్చీ దూరం.”

    "నే డ్రైవ్ చేస్తాలే."

    "న్యూస్ చూశారా?"

    ఇబ్బందిగా నవ్వేడు చారి. కూరలధరలు అమ్మని గుర్తు చేశాయి. ఆవిడెవరో అన్నట్టు అమ్మ గడ్డి కూర చేసినా అమృతంలా ఉంటుంది.

    “పదండి."

    "ఏం?"

    "మీరేదో ఆలోచిస్తున్నారు. డ్రైవింగులో మర్చిపోతారు. చల్."

    బట్టలు మార్చుకుని పర్సు జేబులో పడేసుకుని ఇద్దరూ బయటపడ్డారు.

    కార్ల,ఆటోల ఎదురు ప్రవాహాన్ని చీల్చుకుంటూ చైనీస్ రెస్టారెంట్ చేరడానికి నలభై అయిదు నిముషాలు పట్టింది.

    లోపల చల్లగా ఉన్నా ఇద్దరూ చల్లబడ్డానికి పది నిముషాలు పట్టింది.

    తన కిష్టమైనవి వెంటనే ఆర్డర్ చేసింది జ్యోతి. చారి మెన్యూ కార్డు తెరిచాడు. సూపు దగిర్నించీ అనుకోకుండా ఎదురుగుండా ఎర్రటి అంకెల్లో మెరుస్తున్న ధరలు చూస్తున్నాడతను. ఎప్పుడూ ధరలు చూడ్డం అలవాటు లేదతనికి.

    "ఏదో ఒకటి చెప్పండి."

    ముందు సూప్ చెప్పి మళ్లీ ఆలీలా ధరల పట్టా వేపు కళ్లు పెద్దవి చేసి చూస్తూండి పోయాడు.

    ఆమె ఆర్డర్ చేసిన పదార్థాల వేపు చూశాడతను. అంకెలు ఎర్రగా తళుక్కుమన్నాయి.

    అలాగే మెన్యూ తిరగేస్తూ వెనక్కి వాలేడు చారి. ఆలీ సూది కలుక్కుమంది.

    “మెన్యూ బట్టీపడుతున్నారా?"

    "లేదు. ఇక్కడ ముగ్గురున్న ఫేమిలీ భోజనం చేస్తే ఎంతవుతుంది?' అతనివేపు చిత్రంగా చూసిందామె.

    అతనే అన్నాడు. "ఒక పూట భోజనం చాలామంది నెల జీతం అంత అవుతుంది".

    ఆమె అలాగే అతని వేపు చూసింది.

    మళ్లీ కార్డు చూస్తున్నాడతను.

    "సరే. ఆర్డర్ కెన్సిల్ చెయ్యండి వెళ్లిపోదాం."

    చటుక్కున తలెత్తి చూశాడతను. "సారీ."

    ఆమె మెన్యూ తీసుకుని దూరంగా పెడుతూ అంది. "అందరి ఆదాయం ఖర్చూ ఒకలా ఉండవు."

    కానీ రాత్రి పడుకోబోతూ అనుకున్నాడు చారి. పెట్రోలు ఖర్చు, భోజనం ఖర్చుతో ఆలి నెల పైగా బతగ్గలడేమో. 

    బిల్లు ఆలీకి తెలిస్తేనో? ఆలీ జీతం ఎంత ఉంటుంది? కళ్లు మూసుకున్నాడు చారి.

    ఎవరో భుజం తడుతున్నారు. "సార్. సార్." ఆలీ గొంతు.

    గుర్తు పట్టగానే చటుక్కున మెళకువ వచ్చింది. చారికి.

    చిన్న నీలం బల్పు కాంతి. జ్యోతి అటు తిరిగి నిద్రపోతోంది. పడగ్గది నీలంగా ఖాళీగా ఉంది.

    మళ్లీ ఎప్పుడోగాని నిద్రపట్టలేదతనికి. ఏడు దాటిం తరవాత ఏదో మెత్తటి చెయ్యి బుగ్గమీద పడింది. బరువుగా కళ్ల తెరిచాడు చారి.

    "ఏడు దాటిపోయింది. సారీ." కాఫీ తాగుతూ గబ గబ పేపరు పేజీలు తిప్పుతూండగా కాలింగ్ బెల్ మోగింది.

    లేచి తలుపు తియ్యగానే "నేనే సార్. అంటూ లోపలికి వచ్చేడు కిషన్.

    వంటింట్లోంచి వచ్చింది జ్యోతి.

    "నేనమ్మా. ఏం గావాల?" ఫ్రిజ్ తులుపు తీసి చూసి నాలుగు కూరలు చదివిందామె.

    ఆమె అందించిన బుట్ట తీసుకుని వెళ్లిపోయాడు కిషన్.

    చారి కాఫీ తాగి పేపరు తిరగేసే లోపల కూరలతో వచ్చాడు. కిషన్.

    వంటింట్లో బుట్ట పెట్టి వచ్చి గుమ్మం ఇవతలే చిరునవ్వుతో నిలబడ్డాడతను.

    చారికి అర్థం అయింది. "నెలయిందా అప్పుడే?" అన్నాడతను.

    “మీరు లేరు గద సార్. అమ్మగార్ని అడగలేదండి. నెలదాటిపోయింది." అంటూ జేబులోంచి చిన్న పుస్తకం తీసి ఎంతయిందో చెప్పాడు.

    డబ్బులిచ్చి పంపేసి సోఫాలో కూలబడిపోయాడు చారి.

    "లేవండి. అలా కూచుండిపోయారేం?"

    "చాలా అయినట్టుంది జ్యోతి"

    "కూరలా? అలాగే ఉన్నాయి" అని వెళ్లిపోయిందామె.

    చారికి పచ్చి కాకరకాయ నములున్నట్టుంది.

    లేచి లోపలి కెళ్లి బుట్టలో కూరగాయలు చూస్తూ, "ఈ చిక్కుడ కాయలెంత?"

    "ఏమో. వాడు ఎక్కువ చెప్పడండి."

    "తూకం సరిగ్గా ఉంటుందా?" గుప్పిటనిండా చిక్కుళ్లు తీసుకున్నాడతను.

    "ఆ. ఎన్నాళ్లనుంచో ఇస్తున్నాడు, గదండి. మీరు స్నానం చేసి రండి." కేబేజీ ముక్క చేతిలోకి తీసుకుని చూసాడు చారి. పేపరు వెయిటంత ఉంది.

    కారు పార్కు చేసి మెట్లెక్కబోతూండగా “గుడ్ మానింగ్ సార్' అన్నాడు అలీ.

    వెనక్కి తిరిగి చూశాడు చారి.

    చేతిలో పనుప్పచ్చ గుడ్డతో నవ్వుతూ నుంచున్నాడు ఆలీ.

    క్షణం అతన్ని చూసి తల ఊపి వెళ్లిపోయాడు చారి.

    ఆలీ సూది అలాగే ఉండిపోయింది.

    అప్రయత్నంగా అతని కనుబొమలు ముడిపడ్డాయి.

    తరవాత చాలా గంటలు వాచీలో సెకన్ల ముల్లు మింగినట్టు పనిచేశాడతను.

    'సాయంత్రం ఇంటికి వెళ్తూండగా జ్ఞాపకం వచ్చిందతనికి.

    ఎడంచేతి వైపు తిరిగి వెనక్కి వెళ్లి గల్లీలో పళ్లడుకాణం ఇవతలగా కారు దిగేడు.

    ఏపిలు పళ్లు, పీచెస్, విచ్చుకున్న ఎర్రదానిమ్మల, గుత్తులుగా పచ్చలతో చెక్కినట్టున్న ద్రాక్ష గుత్తులు, వేలాడుతూ అరటి పళ్లూ,

    "బోలియేసార్" అన్నాడు కొట్టువాడు.

    ఇద్దరు ముగ్గురి బేరం అయిం తరవాత "చార్ ఏపిల్స్." అన్నాడు చారి.

    ఏపిలుపళ్లు చెక్క పెట్టెలో మెరుస్తున్నాయి.

    పళ్లు తీసుకుంటూ "ఎంత' అన్నాడతను.

    “దేదో సొబ్. మీకు తెల్వదా?"

    "అయినా నువ్వు చెప్పాలి" పక్కనే వచ్చి నుంచుని ఏపిల్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఒకాయన.

    చారి నవ్వేడు.

    డబ్బులిచ్చి మెల్లిగా కారు దగ్గిరికెళ్లి తులుపు తీస్తుండగా పక్కనే వచ్చి "ఎంతిచ్చేరు మీరు?" అన్నాడు అపరిచితుడు.

    చారి చెప్పి 'ఇక్కడే కొంటూంటాను" అన్నాడు.

    అతను నవ్వి "కారులోంచి దిగి అడిగితే అలాగే చెప్తారు సార్. అలవాటయి మాలాంటివాళ్లకి కూడా మొట్టికాయలు పడతా"యన్నాడు. అపరిచితుడు.

    "ఎంత కిచ్చేడు మీకు?"

    అపరిచితుడు చెప్పి వెళ్లిపోయాడు.

    చారి పళ్ల సంచితో అలాగే నిలబడిపోయి కొట్టువాడివేపు చూశాడు. గుడ్డతో ఏపిలుపళ్లకి నగిషి పెడుతున్నాడు.

    రాత్రి భోజనం చేసి టీవీ చూస్తూండగా పక్కనే ప్లేట్లో ఏపిలుముక్కలు పెట్టింది. జ్యోతి.

    ఓ ముక్క చేత్తో తీసుకుని “వీళ్లందరూ మన్ని మోసం చేస్తున్నారు జ్యోతి" అన్నాడు చారి.

    “ఎవరు, ఎవర్ని?" అతనేం మాట్లాడలేదు.

    “తినరేం?" అందామె.

    మర్నాడు మధ్యాహ్నం లంచ్ అయిం తరవాత హాల్లోకి వచ్చేడు చారి.

    కిటికీ దగరికి వెళ్లి నీలపు అద్దంలోంచి బయటికి చూశాడు. ఎండ తెల్లగా సంతోషంగా చలిస్తోంది. కనిపించిన కాస్త ఆకాశం నీలంగా ఉంది. కర్టెన్ వేసి వెనక్కి తిరిగేడతను.

    ఒక లేత పల్చటి నీలం కలిసిన తెల్లటి వెలుతురు చిమ్ముతున్నాయి దీపాలు.

    తన గదిలోకి వెళ్తూ, "రెడ్డి, సగం లైట్లు తీసేయ్యొచ్చనుకుంటాను" అన్నాడు చారి.

    తరువాతి అయిదారు రోజులు, అంతకుముందు అయిదారు రోజుల్లా మెరక మీంచి రంగు గోళీ కాయల్లాగ జారిపోయాయి.

    ప్రతిరోజూ మెట్లెక్కబోతూ ఆలీ కోసం చూడ్డం అలవాటయిపోయింది.

    ఆలీ సూది లోపల పెరుగుతోంది.

    వాడు కనిపించగానే అతని కళ్లలోకి నిశితంగా చూస్తాడు చారి. ఒక్కోసారి నవ్వుతున్నట్టు ఒక్కోసారి నల్ల గానూ నిర్లిప్తంగానూ కనిపించే యతనికి.

    ఆలీ కళ్లలో తనేం వెదుకుతున్నాడో తెలీడం లేదతనికి. ఆలీతో మధ్యలో మాట్లాడుతూంటాడు.

    ఓ రోజు "సార్. ఆ బిల్లు కత ఏమైంది?" అన్నాడు ఆలీ.

    గతుక్కుమని రెండు గుటకలు వేసి చలవకళ్లద్దాలు మళ్లీ పెట్టుకుని " నువ్వన్నదే రైటు" అని వెళ్లిపోయాడు చారి.

    ఆలీ కనిపించని రోజు చిత్రమైన కలవరం కలిగేది. నిజానికి వాడు కనిపించడం కాకతాళీయం.

    కనిపించి మాట్లాడితే మరో రకమైన ఆందోళన శ్వాస కోశంలో చొరబడేది.

    ఒక అయిదురోజుల్లో ఆర్వీ చారి జీవనం అసంకల్పితంగా ఆలీ కేంద్రంగా తిరుగుతోంది. గ్రామఫోను రికార్డూ, సూదిలాగ.

    ఒక నిశ్శబ్దం ఆలీ సూదివల్ల ధ్వని వలయాలుగా అతన్ని కలవరపెడుతోంది.

    గతంలో కంటే పేపరు ఎక్కువ శ్రద్ధతో చదువుతూ కరువు, ఆర్ధిక మాంద్యం, ధరలపెరుగుదల గురించి ఆసక్తిగా ఆందోళనతో చూస్తున్నాడు.

    చూసింది నచ్చడం లేదు. ధరలు ఎవరు పెంచుతారు?

    ఆర్వీచారి జీవితం తలకిందులవలేదు.

    సుతారంగా మెత్తగా గోల్పుకోర్సు బండిలా నడుస్తోన్న దైనందిన జీవనం గతుకులో పడి తేరుకుంది.

    కుదుపు తాలూకు అసౌకర్యం వెన్నుపూసకి అతుక్కుపోయింది..

    శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో చారి పేపరు చదువుతుండగా కాలింగ్ బెల్ మోగింది.

    "అక్కడే ఉన్నారా?" అంది వంటింట్లోంచి జ్యోతి. లేచి తలుపు తీశాడతను.

    రెండు బుట్టలు నెత్తిమీంచి దింపుతూ ఒకడు దించుతూ మరొకతను.

    నెలకోసారి చౌరాస్తాలో ఉన్న డిపార్ట్ మెంట్ స్టోర్నించి సరుకులు లిస్టు, రసీదు ఇచ్చి వెళ్తూంటారు. ఇద్దరూ.

    లోపలికి తీసుకొచ్చి సోఫా పక్కన పెట్టేరు.

    జ్యోతి రుమాలో చెయ్యి తుడుచుకుంటూ వచ్చి "అన్నీ తెచ్చేవా?” అంది.

    ఇద్దర్లో పెద్దవాడు పొడవాటి సరుకుల లిస్టు ఇస్తూ “చెక్ చేస్తరా మేడం?" అన్నాడు.

    “తరవాత చూసి ఫోన్ చేస్తాగానీ, సారు పైసలిస్తారు తీసుకెళ్లు."

    "సరే అమ్మా."

    ఆమె లోపలికి వెళ్లి పోయింది.

    లిస్టు తీసుకుని సరుకుల బుట్టల్ని దగ్గరికి లాక్కున్నాడు చారి.

    "చూస్తారా సార్. తీయమంట్రా అన్నీ".

    చారి లిస్టు చివర అంకెల్ని చూస్తున్నాడు.

    "ఈనెల ఎక్కువైనట్టుందే." అన్నా డతను.

    "తక్కవ అయింది., సారూ మీ బిల్లు."

    క్రితం నెల బిల్లు తను చూడ లేదు. లిస్టు ఆలీ సూదికి గుచ్చుకుంది.

    చారి లోపలికి వెళ్లి డబ్బు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టేడు. జేబులో కుక్కుకుని చిల్లర చూసుకుని “సార్. నమస్తే సార్" అంటూ వెళ్లిపోయారిద్దరూ.

    కొన్ని వస్తువులు బయటికి తీసి చూశాడు చారి. జీడిపప్పు, కిస్మిస్, అగరొత్తుల డబ్బాలు, కందిపప్పు....బుట్ట పక్కకి పెట్టేశాడతను. లిస్టు అంత పొడవాటి నిట్టూర్పు విడిచి

    టీ.వీ తెరిచాడు చారి. తెర వెలిగింది.

    పెంకుటింటి ముందు రెండు చాపలమీద రెండు మృతదేహాలు చుట్టూరా జీవుల వలయం. ఏడుపులతో టీ.వీ. బద్ధలైనంత పనెంది.

    అప్పులు తీర్చే అవకాశం లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ జీవితంతో రుణం అర్చిసుకున్నారు. నాలుగైదుసార్లు నాలుగైదు కోణాల్నించి మృతదేహాల్ని చూపించారు.

    ఛానల్ మార్చి సోఫాలో వెనక్కి వాలేడు చారి.

    మెత్తగా నిశ్శబ్దంగా వేగంగా తిరిగే ఫేను హఠాత్తుగా చిన్న శబ్దం చెయ్యడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చారి పరిస్థితి అలాగే ఉంది.

    తుడిచినా, కడిగినా, తలకిందులు చేసినా శబ్దం ఎందుకు ఎక్కణ్నించి వస్తుందో తెలీదు. చెవులు బద్దలయ్యి గుండె లయ తప్పే శబ్దం కాదు. కానీ రాకూడని శబ్దం. అసలంటూ రొద రావడం. ఉపేక్షించి ఊరుకోలేని శబ్దం.

    గడిచిన అయిదారేళ్లకంటే ఎక్కువగా అమ్మ గుర్తిస్తోంది. చారికి. సుబ్బాచారిలా గాజులు జిల్లాలో ఎవరూ చెయ్యలేరని పేరుం డేది. పేరున్న ఊరు చిన్నది.

    సన్నగా కొబ్బరాకులా, పెద్ద కళ్లతో, పెద్ద బొట్టుతో తెల్లగా ఉండేది అమ్మ. సుబ్బాచారి అరుపులతో ఇంటి తాటాకులు లేచి పోయినా ఆమె మామూలుగా ఉండేది.

    రాత్రిళు అమ్మతో కలిసి తినేవాడు చారి. క్రమం తప్పకుండా వెన్నెలొచ్చినట్టు ఎప్పుడు తలుచుకున్నా సంతోషంతో నిండిపోయేవాడు.

    బోలెడు బొచ్చెడు సంతోషం. ఆమె మంచం పట్టేవరకూ.

    ఇంజనీరైన తరవాత సుబ్బాచార్ని బలవంతంగా అయినా ఒకసారి అమెరికా తీసుకెళ్లాలని ఉండేది చారికి.

    మరో నాలుగు నెలల్లో అమెరికా అవకాశం ఉండగా హైదరాబాదు ఆస్పత్రిలో సుబ్బాచారి ప్రాణాలు వదిలేశాడు. (“ఒరే చంటి మీ యమ్మ పిలుస్తా ఉందిరా.")

    ****************

    ఓరోజు మధ్యాహ్నం టీ తాగి పేపరూ పెన్సిలూ తీసుకుని లెక్కలు వేశాడు చారి. ఎడం చేతి పిడికిలి మీద బుగ్గ ఆనించి తీక్షణంగా జీవితాన్ని పది భాగాలుగా విడదీసి లెక్కలు వెయ్యడం మొదలు పెట్టేడతను.

    తీసేసి కొట్టేసి కలిపేసి మళ్లీ తీసేసి చాలా ముక్కలైన జీవితాన్ని మొత్తానికి ఎనిమిది ముఖ్యభాగాలు చేసి ఒక్కోదాని ఎదురుగా వాటి ధరలు రాశాడు.

    పెదాలు బిగించి ఇండిగో ఇన్ఫోటెక్ వారి భవనంలో జీవితం మొత్తానికి ఒక సమగ్రత తెచ్చి తేల్చి, కొన్ని అంకెల్లో కుదించిన తరవాత, రెండు విషయాలు చారికి అర్థమైనాయి.

    మొదటిది తనకి పరిచమైన అంకెలకీ వీటికీ సంబంధం లేదు.

    రెండోది, మొత్తం, విడిగా, ఇతర లెక్కలతో సంబంధం లేకుండా ఉండడం లేదు. నీరసం ఆవహించి దతన్ని.

    “సార్, నమస్తే." సన్నగా తెల్లగా సూదిలా ఎదురుగా ఆలీ నుంచుని నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో చూశాడతన్ని,

    "రెడ్డి సారు పిల్సిండు సార్. పోతా..."

    వాడు ఆలీయే గదా.

    ఓకే. అన్నాడు చారి.

    ఆలీ వెళ్లిపోయాడు.

    కాయితం మడిచి సొరుగులో పెట్టేడతను.

    అయిదుగంటల వరకూ మళ్లీ చారికి జీవితాన్ని అంకెలకి సరిపోల్చడం కుదరలేదు సరిగదా, పనిచెయ్యడం ఇబ్బంది అయిపోయింది.

    అతని కాయితంలో జీవితం, కొన్ని అంకెలకి ఒకలాగా కొన్ని అంకెలకి మరొకలాగా కనిపించింది.

    సాయంత్రం గేటు దగ్గరికి వస్తూండగా కారు కుడిపక్క , పచ్చికలో గుచ్చిన సూదిలా, కుళాయి పక్కన నుంచుని ఉన్నాడు అలీ.

    తన కారు చూడలేదు వాడు.

    కారు మామూలుగా చల్లగా ఉంది. లోపలి ఉక్కపోత ఇబ్బందిగా ఉంది. టై లాగి పక్క సీట్లో పడేశాడు చారి.

    చీకటి పడింది. నెక్లెస్ రోడ్డులో పక్కగా కారాపి పల్లీలు కొనుక్కుని బెంచీ మీద కూచున్నాడు చారి. ఒక్కో పల్లీ నోట్లో వేసుకుంటూ చాలా సేపు కూచుండిపోయాడతను.

    చీకట్లో హుసేన్ సాగర్ చుట్టూ వెలుగు.

    నీళ్ల నలుపులోనే దీపాలతో కెఫెటీరియా తిరుగుతోంది.

    గాలికి హుస్సేన్ సాగర్ దుర్గంధంలో వాళ్లకి సంతోషంగా ఎలా ఉంటుంది?

    వాళ్లెవరూ కనిపించడం లేదు. పల్లీలు అయిపోయాయి. చారి గమనించలేదు. పల్లీలవాడు వెళ్లిపోయాడు.

    పల్లీలు కొరికి చాలా రోజులైంది. కారంకారంగా బాగున్నాయి. ఓ

    32 min
  • 'ఇల్లు'!

    ఎండాకాలం ఒంటి నిట్టాడి ఇంటిపట్టున రెండు నిట్టాళ్ళ ఇల్లు వేయాలని మా అమ్మా నాయన నిర్ణయించుకొన్నారు. మా చిన్న ఇల్లు పీకి పెద్ద ఇల్లు వేస్తామని పల్లె అంతా టాంటాం వేశాను. ఒంటి నిట్టాడి ఇంటికి మధ్యలో నిట్టాడి ఉంటుంది. రెండు నిట్ఠాళ్ళ ఇంటికి రెండు నిట్టాళ్ళు గోడల మీద ఉంటాయి. ఆ రెండు దూలాల మీద ఇల్లు నిలబడుతుంది.

    చిన్న ఇల్లు, దాని తడిక గోడలు, పీకి చిన్నపాక ఆగ్నేయం మూలకు వేసి, ఇంట్లోని సామాను అందులోకి చేర్చారు. ఆ ఎండల రోజుల్లో మేం అందులోనే ఉండేవాళ్ళం. లేదంటే వేపచెట్టు నీడన చేరేవాళ్ళం. కట్టబోయే ఇల్లు పన్నెండు అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగుల పొడుగు ఒకేగది.

    దానిముందు పంచ ఆరు అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల పొడుగు, గోడలు పది అడుగుల ఎత్తు, పంచ తూర్పుకు వాలి ఉంటుంది. ఉత్తరం దక్షిణం నడవ. దక్షిణం తూర్పు మూల పొయ్యి. ఎడ్లబండ్లు ఎర్రమట్టి తోలితే దక్షిణపు బావి నీటితో తడిపి ముద్దలు ముద్దలు చేస్తే, ముద్దలు కూలీలు అందిస్తే మేస్త్రి కీటు పెట్టేవాడు. అయిదు కీటులు, కీటుకు కీటుకు మధ్య విరామం, కారణం కీటు ఎండాలి, బిగవాలి. ఐదు కీటులు పెట్టడానికి ఐదు వారాలు పట్టింది.

    కంసాలి బత్తుడు రెండు నిట్టాళ్ళు కావాలని ఒకటి పాతది సరిపోతుందని, రెండోది కొత్తది కావాలని తెప్పించాడు. రెండు నిట్టాళ్ళు పడమటి నుంచి తూర్పుకు గోడలమీద పండుకోబెట్టాడు. రెండు నిట్టాళ్ళ మీద మధ్యలో ఎనిమిది అడుగుల ఎత్తు కట్టెలు పాతి, వాటిని కలిపి వాటి మీదగా బొంగులు దిగేట్టు చేసి, నిలువు బొంగులకు అడ్డం వాసాలు వేసి, తాటి నారతో బిగదీసి కట్టేస్తే ఇంటి రూపం కనిపించింది.

    అంగలకుదురు నుంచి మా తాతలు ఎడ్ల బండ్లు రెండింటి నిండా తాటాకు పంపించారు. దాన్ని కప్పితే ఇల్లు ఎంతో అందంగా ఉంది. ఇంక పాక వదిలి, ఇంట్లోకి పోవచ్చును, అనుకుంటే మా అమ్మ 'వీల్లేదు' అంది. ఇంకా పాకలోనే ఉన్నాం .

    ఎండలు ఘోరంగా కాస్తున్నాయి. రోహిణి కార్తె అని, రోళ్ళు పగులుతున్నాయని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. పాక వదిలి బైటికి వస్తే కాలు గాల! నెత్తి గాల ! పాకలో ఉంటే వంట్లో ఉన్న నీళ్ళన్ని చెమటగా కారిపోతున్నై.

    పాకలో చెమట బాధ, బైట ఎండ గోల. బతకలేం అనుకునేవాణి కింద తలా కాలదు, కాలు కాలదు కానీ వడగాలి విదిలించి కొట్టేది. పడమటి శాంబరం నిప్పులు మోసుకొని వచ్చేది.

    పడమటి శాంబరం సుడిగుండం తిరిగితే చిన్న పిల్లల్ని ఆకాశంలోకి ఎతుకు పోయి సముద్రంలో పారేస్తుందని అందరూ భయపెట్టేవాళ్ళు.

    అమ్మ పాటి మట్టిని తెప్పించి, పేడ కలిపి గోడలు లోపలా వెలుపలా అలకడంతో పాటు నట్టిల్లు కూడా నాజూకుగా అలికింది. ఆరితే ఇంట్లోకి పోవచ్చునని చల్లగా ఉంటుందని చాలా ఆశపడ్డాను. ఇల్లు ఆరింది కానీ మా అమ్మ మమ్మల్ని ఇంట్లోకి పోనివ్వలేదు.

    గోడలకు సున్నాలూ కొట్టింది. ఇంక ఇంట్లోకి పోవచ్చునా- అంటే వీల్లేదంది, ఇల్లంతా వల్లమాలినన్ని ముగ్గులు వేసింది. 'ఈ రాత్రికి ఇంట్లో పడుకోవచ్చునాఅంటే 'వీల్లేద'ని అమ్మ కరాఖండిగా, తీక్షణంగా చెప్పింది. దొంగచాటుగా ఇంట్లోకి పోతే, ఇల్లు చల్లగా ఉంది. ఎండలేదు, మంట లేదు, చెమట లేదు. ఇంతలో అమ్మ అలికిడి వినిపించింది. గబగబా లగెత్తుకొచ్చి పాకలో నక్కాను.

    పూజారి వచ్చాడు. ఇంటి చుట్టూ తిరిగాడు. ఏమేమో గొనిగాడు. బియ్యంలో పసుపు కలిపాడు. ఇంటి చుట్టూ చల్లాడు, ఇంట్లో చల్లాడు. పంచలో రంగుదారాలు కట్టాడు. పొయ్యి మీద పాలు పొంగించారు. పాలు పొంగి పొయ్యి ఆరిపోయింది. కుండలోని పాలల్లో బెల్లం వేసి కలిపి, అమ్మ అందరికీ గిలాసుల్లో పోసి ఇచ్చింది.

    పాడి బర్రెను ఇంట్లోకి తోలుకొని పోయింది. ఇల్లంతా తిప్పింది. పంచలో తిప్పింది. తోలుకొని వచ్చి పాకలో కట్టేసింది. సూర్యుడు తూర్పున పొడిచాడో లదు | నన్నూ, చెల్లెల్ని ఇంట్లోకి తరిమింది. ఇల్లంతా తిరగమంది. ఇష్టమొచ్చిన చాటు కూర్చోమంది. లేకపోతే పడుకోమంది. చెల్లికి నడక రాదు. అడుగులు వేస్తుంది.

    పాకలోని సామానంత ఇంట్లోకి తెచ్చి పెట్టుంది. మా నాయన మంచం మీద కూర్చుని చోద్యం చూస్తున్నాడు.

    అమ్మకు సాయం చేయబోతే 'నువ్వాడ కూకో. ఏది ఏడ సర్దుకోవాలో నాకు బాగా తెలుసు,' అంది. ఉట్టి తెచ్చి నాయన కడితే 'అట్టాగేనా కట్టేది' అని గదురుకొంది.

    మెట్టు బల్ల పాకలోంచి తెచ్చి ఇంట్లో పెడుతుంటే “ఆడగాదు ఈడబెట్టు' అంది. నేను దెచ్చుకుంటాగా, నీకెందుకు పో కూకో' అంది. 'మోయలేవే!' అని 'నాయన అంటే 'అదెంత దాని బరువెంత? మోస్తాలే! నువ్వు కూకో' అంది. తేప తేపకూ చెప్పించుకోలేక మంచం మీద కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాడు నాయన.

    ఇల్లంతా సర్దుకొంది. మెట్టుబల్ల మీద వడ్ల బస్తాలు నాలుగు పెట్టాలి. 'ఏందా విచిత్రమైన సూపు? బస్తాలు నేను మోస్తానా?' అంది. 'మోయలేవు!' అన్నాడు నాయన 'మరి తే!! 'తెస్తానుండు'! 'ఏంది ? ఆలస్యం?' గదమాయించింది. నాలుగు బస్తాలు మెట్టు బల్లమీద పెట్టాడు. మా అమ్మ పాక దగ్గరకు వచ్చి, నిటారుగా నిలబడి ఇల్లు చూస్తూ, వెనక్కు వంగి నడ్డి విరుచుకొంది.

    'నడ్డిరిగేను” అన్నాడు నాయన. 'సాల్లే సంబడం' అంది అమ్మ. ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద బతుకీడుస్తున్న బర్రెల్ని దూడల్ని చూపించి 'ఆట్ని సావిట్లో కట్టేయ రాదూ!' అంది అమ్మ. వాటిని తోలుకొచ్చి కట్టేశాడు. అప్పటి దాకా అది మేమున్న ఇల్లు. ఇక పశువుల పాక.

    నాకు ఐదేళ్లు. చెల్లికి ఏడాది దాటలేదు. కొత్త ఇల్లు ఎంత చల్లగానో ఉంది. రాత్రి చాలా సుఖంగా ఉంది. మేం తిని పడుకున్నాం, రాత్రంతా వాళ్ళు మాట్లాడు కుంటూనే ఉన్నారు. 'కొత్త ఇంట్లో నీ కాపురం ఎట్టా ఉందే' అంది మా అమ్మమ్మ. 'మాకేం? బాగానే ఉన్నాం' అంది మా అమ్మ. కొంత నిష్ఠూరం ఉన్నమాట నిజమే!

    మా అమ్మ అన్నలు తమ్ముడు బంధువులు అందరూ వచ్చి ఇల్లంతా కల తిరుగుతున్నారు. 'బురద కాళ్లతో రావొద్దురా' అంటుంది. 'చెప్పుల కాళ్లతో ఇల్లంతా తొక్కొద్దురా' అంటుంది. 'మురికి ముకాల్లారా! ఇటు రావద్దురా' అంటుంది. మా ప్రకాశం పంతులు గారికి ఇల్లంతా చూపించింది. ఇవి కిటికీలు అంది. ఇది మచ్చు అంది. ఏందేందో అంది. పంతులుగారు 'ఆ!' 'ఉ!” అంటూ తల ఊపుతున్నాడు.

    'నీ కొడుకు బడికి వచ్చే వయస్సే!' అన్నారు పంతులుగారు. 'ఏడా? ఆడికి అయిదన్నా నిండలా!” అంది అమ్మ. 'ఇంట్లో సల్లగా, కడుపులోకి సల్ల కదలకుండా, ఈ ఏడన్నా ఉండనీయండి ఇంట్లో పంతులుగారు' అంది అమ్మ.

    'ఇల్లు బాగుందమ్మా బాగా కట్టించుకున్నావు' అన్నారు. ఆ పైట చెంగుకు చేతులు ఊరికే తెగ రుద్దుకుంది. అంది మా అమ్మను మెచ్చుకుంటున్నారు. ఇల్లు బాగుంది. ఎత్తు బాగుంది..? గాలి గంతలు వెడల్పుగా ఉన్నాయి. గుమ్మం భద్రంగా ఉంది... గటివి. ఇలా పడిన కష్టానికి ప్రతిఫలం మెచ్చుకోళ్ళు వస్తుంటే - వింది మా అమ్మ.

    పల్లెలో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇల్లు చూడకపోతే, వాళ్ళ ఇళ్ళకు పోయి తీసుకువచ్చి ఇల్లంతా చూపించి పడిన కష్టమంతా చెప్పి 'అలకలేక నేను బొబ్బలెక్కినై' అని అరచేతులు చూపించేది. మా అమ్మ చేతులు ఎరుపు, నును మెత్తన. ఇల్లు కట్టేలోపల గట్టి పడ్డాయి. రంగు తగ్గాయి. బొబ్బలు లేచాయి.

    అప్పుడు అమ్మ బుగ్గలు పుడికితే వెన్న అద్దినట్లు ఉండేది. ఇప్పుడు అట్లేదు కానీ అమ్మ సంతోషంలో సప్తసముద్రాలు తరంగాలెత్తుతూ ఉండసాగాయి. ఎండమమ్మల్ని ఏమి చేయలేకపోయింది. నేను ఇంట్లోంచి వెలుపలికి వచ్చేవాణి కాను.. రాత్రి ఇంటిముందు, గొడ్డ, సావిడి పక్క నిద్రపోవటం ఎంత సుఖంగానే ఉండేది. అమ్మ అటునుంచి వస్తూ, ఇటునుంచి వస్తూ ఇంటిని చూచుకుంటూ మురిసిపోయేది. మా నాయన మా అమ్మ ఆనందం చూడటం చాలా ఇష్టపడేవాడు. -

    'అటు కోడురోళ్ళు, ఇటు సుద్దపల్లోళ్లు నీ ఇల్లు సూళ్ళా! పో! పోయి, ఆళ్లను పిలుసుకొచ్చి ఇల్లు సూపిచ్చు. సంతోషిస్తారు' అనేవాడు ఎగతాళి చేసినట్లు మా నాయిన. మా అమ్మ 'సాల్లే సంబడం' అని నవ్వేది.

    మా కొత్త ఇల్లు మమ్మల్ని ఎండల నుంచి కాపాడింది. ఎండలు తగ్గాయి. వానలు మొదలయ్యాయి. ఎంత పెద్ద వాన వచ్చినా ఇల్లు తడవటం లేదు. చాలా సుఖంగా ఉంది. వాన కురుస్తున్నప్పుడు మా అమ్మ వేరుసెనక్కాయలు వేయించి, బెల్లం ముక్క ఇచ్చేది.

    వాటిని వలుచుకు తింటూ, బెల్లం ముక్క కొరుక్కు తినటం ఎంతో రుచిగా ఉండేది. తినన్ని పెటేది. తినలేనంటే వేరుసెనకాయలు వొలిచి గుప్పెళ్ళు గుప్పెళ్ళు నోటిలో పోసేది. బెల్లం ముక్క నోట్లో కూరేది. 'కలిపి నమిలి మింగరా మగ పిల్లోడు తెనాలి!' అనేది.

    చెల్లి పాలే తాగుతుంది. వేరుసెనక్కాయలు తినలేదు. బెల్లం ముక్క కొరకలేదు. ఎన్ని నోరు. చిన్ని చిన్ని కళ్ళు! చిన్ని మూతి. పసిది కదా పాపం!

    వేరుసెనక్కాయలు తినవచ్చునని, వానంటే నాకు ఇష్టం. వానలో ఎగుర్లాడ వచ్చునని ఆశ. దుప్పటి కప్పుకొని మూల కూర్చుంటే వెచ్చగా ఉంటుందని బలే కుశాల.

    కానీ ఆ రోజు వాన పెట్టినంత భయం ఈ రోజుకు మరుపురాదు. తెల్లవారక ముందే వాన కురవటం మొదలయింది. వానలోనే ఒంటికి పోయి రావలసివచ్చింది. వానలో చెంబట్టుకుపోయి రాక తప్పలేదు.

    వాన విసిరి విసిరి కొడుతూ ఉంది. చిన్నా చితక వాన కాదు. మాలావు వాన. పిడుగులు పడతాయని భయం. ఆకాశం చింపేస్తున్నట్లు మెరుపులు, ఉరుములు. ఒకేసారి అవి వస్తే పిడుగులు పడతాయి అనేది అమ్మ. వెలుపలికి పోవద్దు అనేది. ఎంత మాలావు వాన కురిసినా ఇల్లు తడవదు కానీ, భయం ఎవరు పోగొడతారు?

    పంచలో కూర్చొని వానను చూడటం ఆనందమే కానీ దాని ఉధృతి చూస్తే వణుకు పుడుతూ ఉంది. చూరులోంచి వాన నీరు ధారలు ధారలుగా పడుతూ ఉంది. డొంకలోంచి దేవళ్ళ చెరువులోకి వాన నీరు రైలు బండి కంటే దూకుడుగా పోతూ ఉంది.

    భయమెరుగని మా అమ్మ 'ఏం వానరా దేముడా!” అంది. వానలో మా నాయనకు వంద రకాలు తినాలని కోరిక. జీతం ఎగరగొట్టి ఇంట్లోనే కూర్చున్నాడు. పొయ్యి అంటుకోక మా అమ్మ తిప్పలు అంతా ఇంతా కాదు. కట్టెలేమో తడిసినై.

    ఈ తిప్పలు అట్టాబెడితే వాన ధాటికి తట్టుకోవడం కష్టంగా ఉంది. సావిట్లో పాడి బర్రె 'అంబా' అని మా అమ్మను పిలుస్తూ ఉంది. వానలోనే పోయి కుడితి పెట్టి, గడ్డి వేసి వచ్చింది. వానలోనే ఇంట్లోకి సావిట్లోకి అమ్మ తిరుగుతుంటే అయ్యో పాపం అమ్మ అనిపించేది.

    తలకే రక్షణగా ఉన్న గొడుగు గాలికి వెనక్కు తిరిగిపోయింది. కాళ్ళ బురద, తడిసిన చీరలోంచి కారే నీళ్ళు, తలలోంచి వళ్ళంతా. జారే నీళ్ళు. అమ్మ నీటి దేవతగా మారింది.

    తడిబట్టలతోనే మా అమ్మ అన్నం వండుతుంటే మా నాయన హాస్యం. 'మీ అమ్మ ఇయ్యాల బేపన పణితి' అని నవ్వేశాడు. తడిబట్టలతో వంట చేస్తున్న అమ్మ మడి బట్టలతో వంట చేస్తున్నట్లుంది.

    అన్నం వండింది. కూరల్లేవు. పచ్చళ్లేసి పెట్టింది. వానలో చలి కప్పుకొని వేడి వేడి అన్నం తినటం బలే రుచిగా ఉంది.

    తెల్లారి చాల సేపయింది. సూర్యుడు నిద్రలేచినట్టు లేడు. ఇంట్లోంచి వెలుపలికి తెల్లారి చాలా సేపయింది. సూర్యుడు నిద్రలేచినట్టు లేడు రాలేదు. మబ్బులు కప్పుకొని ఏ మూలనో నక్కి ఉంటాడు. పాపం చొక్కా నిక్కరు ఉన్నాయో లేవో!

    అంత ఉధృతంగా కురిసే వానకు అంతే వేగంగా గాలి తోడయింది. తన ఎరుగని అమ్మ 'గాలివాన' అంది. 'చూడబోతే అట్టాగే ఉందే' అన్నాడు నాయన ఇద్దరూ కూడబలుక్కొని భయపడుతుంటే నా కుశాల మాయమయింది. చెల్లి ఇంకా నిద్రలేవలేదు. చల్లగా గుడ్డల మధ్య మునగర దీసుకొని పడుకుంది. లేచిందా ముందుగా నవ్వుతుంది. ఆ పైన ఇల్లు ఎగిరిపోయేట్టు ఏడుస్తుంది. ఆకలి కదా పాపం.

    అమ్మా నాయన వానకు గాలికి అల్లాడి పోతున్నారు. నాకూ భయం కలిగింది. మూడు పక్కల కిటికీల లోనుంచి ఈదురుగాలి విదిలించి విదిలించి కొడుతూ ఉంది. చూరుగంతల్లోంచి చలిగాలి దూరి ఇల్లంతా వ్యాపించి, దడ పుట్టిస్తూ ఉంది.

    ఉన్నట్టుండి గాలికి ఇల్లు కదిలింది..! అందరికీ భయం. 'ఏందీ గాలి? ఏందీ ఇల్లు కదలటం?” అంది అమ్మ. మళ్ళీ ఇల్లు వణికింది. అమ్మ వణికింది. నాయనా భయపడ్డాడు.

    'గొడ్డు ఎట్టున్నాయో' అని మంచం దిగాడు. అది పందిరి లాంటి పాక! ఎటునుంచి గాలి వచ్చినా ఎటయినా వెళ్ళిపోతుంది. గోడల్లేవు. పాకకు అడ్డంలేదు. పాకకు ఇబ్బంది లేదు. ఇంటి గోడలు గాలిని ఆపుతున్నాయి. అందుకు ఇల్లు కదులుతూ ఉంది, ఊగుతూ ఉంది. చూస్తూ ఉండగానే పాక ఒరిగింది. నేలమీద కూలింది. పశువులు వానలో నిలబడ్డాయి. వాననీళ్లు వాటికి ఇష్టంగానే ఉన్నట్లుంది. అమ్మకు భయం పట్టుకొంది. 'ఇల్లు కూలితే పిల్లలేం గాను?” అంది. 'మనం లేమా?” అన్నాడు నాయన. 'మన మీదా పడితే' అంది అమ్మ. నాయన ఆలోచనలో పడ్డాడు.

    వానలో బయటికి పోయాడు. అమ్మ మంచాలు లేపి మూలన గోడకు చేర వేసింది. బరిగొడ్డును తోలుకొచ్చి ఇంట్లో తోలాడు. మూలన ముడుచుకొనిపడుకొన్నాయి.

    ఇల్లు ఉయ్యాల లాగా అటూ ఇటూ ఊగింది. 'ఇల్లు భద్రమేనా?” అని భర్తను అడిగింది. 'భయంగానే ఉంది' అన్నాడు. 'కొత్త ఇల్లు!' అని ఏడిచింది. “ఏడవకే వాడు నాయన. నాకూ ఏడుపు వచ్చింది. 'నోరు మూయరా' అన్నాడు నన్ను. అణెందుకు కసురుకుంటా' అంది అమ్మ. 'ఇల్లు భద్రం కాదు' అన్నాడు నాయన. “ఏం చేద్దాం?” అంది అమ్మ. 'ఎక్కడకయినా పోదాం ' అన్నాడు. 'పల్లెలో ఏ ఇల్లు భద్రం? అందరియి అంతంత మాత్రం కొంపలే!” అంది అమ్మ.

    - 'గమిని శ్రీరామయ్య గోరి సావిడి మేలు! రాతి గోడలు, మొద్దుల పై కప్పు! ఆకాశం ఊడిపడ్డా సావిడి పడదు. పోదాం ' అన్నాడు. 'సరే' అంది. ఇంటికి తాళం వేసింది. చెల్లిని పొట్టలో పెట్టుకొని పైట చెంగు కప్పింది. నన్ను మా నాయన చేయి పట్టుకొని లాక్కుపోతున్నాడు. నాయన ఆ యింటి జీతగాడు!

    ఇంటి ముందు గిలకల దాకా నీళ్ళు, వీధిలో మొల లోతు నీళ్ళు, డొంకలో పీకల దాకా నీళ్లు. నాయన నన్నెత్తి భుజం మీద పెట్టుకొన్నాడు. నా తల తడవకుండా చుట్టిన దుప్పటి తడిసిపోయి బరువెక్కింది.

    సావిడి ఎంతో దూరంకాదు. కానీ గాలిలో, వానలో పీకల్లోతు నీళ్ళ డొంకలో | నడుస్తుంటే సావిడి చాలా దూరం అనిపించింది. నేల మీద నడిచినట్లు కాకుండా నీళ్ళలో ఈదినట్లు మేం వెలుతున్నాం .

    'నీకు ఈత వచ్చునంటరా' అన్నాడు నాయన. 'రాదు' అన్నాను. 'నేర్చుకో!' అన్నాడు. 'ఇప్పుడా?” అంది అమ్మ. 'ఎప్పుడైనా' అన్నాడు. నాయనకు ఈతవచ్చు! నాకూ భయం లేదు. అమ్మకో! చెల్లికో? ఈత వచ్చో రాదో! నాకూ భయం. అందువల్ల | ఏడుపు. ఏడవ్వద్దురా! సావిడి కాడికొచ్చేఁవు' అన్నాడు నాయన.

    నన్ను దించాడు. గొడ్డుకు మేత వేశాడు. అంత వానలో వరిగడ్డి పొడిగా ఉంది. నన్ను, చొక్కా నిక్కరు విప్పి, తలగుడ్డ తీసి, దిసె మొలతో ఎండు గడ్డిలో పండుకోబెట్టారు. నాకూ చలిలేదు. మా అమ్మ, చెల్లిని నావళ్ళో పెట్టి, వంటి మీద బట్టలు పిండుకొంటూ ఉంది. గమిని శ్రీరామయ్య గారి ఇల్లు సందుకా పక్క ఉంది. వెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి వచ్చాడు నాయన.

    'ఇల్లు ఏమయిపోతుందో!' అంది అమ్మ. 'ఏం కాదు' అన్నాడు నాయన. "పడిపోయిందేమో' అంది అమ్మ. 'పడితే మళ్ళీ కట్టుకొందాం' అన్నాడు నాయన. ఇల్లు పడిపోతుందంటే నాకూ ఏడుపు వచ్చింది.

    పాలు తాగింది కదా చెల్లి నా వళ్ళో నిద్రపోయింది. నాయన బూసిమ్మ పాసీర తెచ్చి అమ్మకి ఇచ్చాడు. పొడి సీర కట్టుకుంది. తడి సీర ఆర బెట్టింది. నాయన చొక్కా తీసి, పిండి ఆరేశాడు. పంచె పైకి ఎగబీక్కొని పిండుకొని , నా పక్కన ఎండు గడ్డి మీద కూర్చున్నాడు నాయన.

    పశువులు నాయన్ను గుర్తుబట్టి పండుకొన్నాయి. బైట గాలి హోరు జోరు భీతావహంగానే ఉంది. సావిడి గోడలకు కొట్టుకొన్న వాన తలపగిలిలము పడి ఏడుస్తూ, తోటి నీటితో కొట్టుకుపోతూ ఉంది. సావిడి మొద్దుల మీద కపిన తాటాకు మీద ఎండుగడ్డి వేసి ఉండటంతో సావిడి తడవటంలేదు.

    నలుగురం ఎండుగడ్డిమీద మూలన కూర్చున్నాం. చెల్లిని అమ్మ గుండెలకు పొదుకొని కూర్చుంది. గాలివాన విదిలించి విదిలించి కొడుతూ ఉంది. పలె సరే సరి, ఊరూకూడా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూచినా నీరే! పక్కనే ఉన్న వామిలోంచి గట్టి పీకి ఎంత పొడిగా తెద్దామన్నా తడవనే తడిసింది. తడిసినా గొడు గడ్డి మేయడానికి ఇష్టపడుతూనే ఉన్నాయి.

    చీకటి పడింది కానీ, వాన తగ్గలేదు, గాలి ఆగలేదు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. సావిట్లో మూలకు వొదిగి కూర్చుంటే వానపడటంలేదు. చలిగా ఉన్నా, గడ్డి వేడి వల్ల కొంచెం మేలుగానే ఉంది..

    నాయన పోయి, విస్తరి నిండా బువ్వ, దబరా నిండా నీళ్ళు తెచ్చాడు. ఆ రాత్రి. దట్టంగా చీకటి. అయినా తడుంకొని అన్నం తిన్నాం. చెల్లికి ఈ కష్టం లేదు. సుఖంగా అమ్మ పాలు తాగుతుంది. దబరా నీళ్ళు తాగటానికే ఉంచుకొన్నాం. చూరు నీళ్ళతో చేతులు కడుక్కున్నాం.

    నేను అమ్మ కాళ్ళ పక్క చెల్లి అమ్మ వళ్ళో నిద్రపోయేమ్. అమ్మా నాయన రాత్రంతా నిద్రపోలేదని, తెల్లారాక చెప్పారు.

    'అదే మోయిన రాత్రంతా ! గాలివాన దుంపదెంచింది' అని చెప్పారు. ఊరంతా ఇంత ఘోరంగా ఉంటే, పల్లె జనం పాట్లు ఎట్లా ఉన్నాయో అని అమ్మా నాయన దిగులుపడ్డారు. ఎవరి రైతు సావిడికి వాళ్ళు చేరి ఉంటారని మా నాయన చెప్పాడు.

    నాకు ఆకలి అవుతూ ఉంది. పొద్దున్నే పెట్టేది అమ్మ గిన్నె నిండా బువ్వ, 'తెల్లారి చాలాసేపు అయినట్లుంది. పిల్లోడికి ఏవన్నా తెచ్చి పెట్టు!" అంది అమ్మ. 'ఆడసలే ఆకలోడు!' అన్నాడు నాయన.

    వంటి మీది పంచె రాత్రంతా వంటి మీదే ఆరి పోయింది. చొక్కా వేసుకుంటే తడుసుద్దని వేసుకోకుండా దబరా తీసుకుపోయాడు. వస్తూ మళ్ళీ విస్తరి నిండా అన్నం , పప్పు, పచ్చడి దబరా నిండా నీళ్ళు తీసుకువచ్చాడు.

    మేం అన్నం తినబోతున్నప్పుడు గొడ్డు అరిశాయి. వాటికి వామిలోంచి ఎండు గడి పీకి వేశాడు. వానలో, గాలిలో, చలిలో అన్నం బొవ్ రుచిగా ఉంది. విస్తట్లో ఏమి మిగలకుండా ముగ్గురం తినేస్తే విస్తరి దూరం విసిరాడు నాయన.

    గాలి తగ్గింది కానీ వాన కుండపోతగా కురుస్తూనే ఉంది. చలి తగ్గింది కానీ భయం పెరిగింది.

    వాన ఆగదా? ఇంటికి పోలేమా? ఆడుకోలేమా? అని నా దిగులు. నన్ను సావిట్లో కట్టేసినట్లు కదలకుండా ఉంచారు. అమ్మ భయం అమ్మది. 'ఇల్లు పడిపోయిందో ఏమో, గొడ్డు చచ్చాయో ఏమో, మళ్ళీ ఇల్లెట్టా కట్టుకోవాలి రా దేవుడా' అని ఏడిచింది. పాపం మా నాయన అమ్మను ఓదార్చడానికే సరిపోయింది. ఇల్లు పడిపోయిందో ఏమో అని తేపతేపకి అంటుంటే విసుగుపుట్టి 'పడితే పజ్జీ! మళ్ళీ కట్టుకొందాం'! అన్నాడు. ఈ

    మాపిటేలకి వాన కూడా తగ్గుముఖం పట్టింది. పడ్డ వాననీళ్ళు, ప్రవహిస్తూనే ఉన్నాయి. గాలి తగ్గింది. 'ఈదురుగాలి దేవుంది?” అంది అమ్మ. తుంపర పడుతూనే ఉంది. 'వాన తగ్గింది' అంది అమ్మ. 'పడతానే ఉంది' అన్నాడు నాయన. 'ఇంటికి పోదాం' అంది అమ్మ. నాయన కాదనలేదు.

    తుంపర సన్న తుంపరగా మారింది. కాళ్ళ కింద నీళ్ళు చాలా దూకుడుగా ప్రవహిస్తున్నాయి. నీటి ఉరవడికి పడతానేమో అన్నంత భయంగా ఉంది.

    పల్లె నుంచి ఊళ్ళోకి వచ్చేటప్పుడు భుజాల మీద ఎక్కించుకొన్నాడు నన్ను నాయన. కానీ పల్లెకు వెళ్ళేటప్పుడు 'నడుస్తాను' అన్నాను. సరే అన్నాడు. ముందు నీళ్ళు గిలకల దాకా వచ్చాయి. ముందుకుపోతే నడుములు దాకా వచ్చాయి. నాయన చేయి పట్టుకొన్నాను. నీళ్ళు పీకలదాకా వచ్చినా భయం లేకుండా నడిచాను.

    'ఈడికి ధైర్యం ఎక్కువ' అన్నాడు నాయన. 'మరి ఆడు నీ కొడుకు' అంది అమ్మ. సత్రం మలుపు తిరిగాం. పల్లె కనబడుతూ ఉంది. పల్లెలో పడ్డ పాకలు కనిపించసాగాయి. చిన్న ఇళ్ళు! ఒంటి నిట్టాడి ఇళ్ళు! కూలాయి. 'మన ఇల్లు ఎట్టా ఉందో” అంది అమ్మ. 'పోతాంగా సూద్దాం పద!! అన్నాడు నాయన.

    నీళ్ళు పీకలదాకా రావటం లేదు. నడుం దాకా వచ్చాయి. రైలు కట్ట దాకా వచ్చం. గిలకల దాకా కూడా రావటంలేదు నీళ్ళు. మసక వెలుతురులో బూజర బూజర గా మా ఇల్లు కనిపించింది. 'ఇల్లు పడినట్లు లేదు' అన్నాడు నాయన, పక్కకు వొరిగినట్టుంది' అంది ఆ అమ్మ. ఇల్లు చూడగానే నేను నాయన వదిలి పెట్టి, ఇంటివైపు పరుగుతీశాను.

    తుంపర కూడా తగ్గిపోయింది. మేం ఇంటికి పోయేసరికి మా ఇలు నిటారుగా నిలబడి నవ్వుతూ చూస్తూ 'రండి! రండి' అని పిలిచింది, చిల్ల కంప దాటి ఇంటి ముంగిట్లోకి అడుగు పెడితే బురద, పెరుగు అన్నం లాగా అనిపించింది.

    పంచ నిండా బిలబిలలాడుతూ జనం ఉన్నారు. నాలుగు కుటుంబాల వాళు! ఇరవై మంది జనం! పంచలో ఇరుక్కొని కూర్చొని ఉన్నారు. వాళ్ళ పాకలు, ఒంటి నిట్టాడి ఇళ్ళు పడిపోయాయంట.

    పల్లెలో చాలా ఇళ్ళు పడిపోయాయంట. పదో పాతికో పడలేదంట. జనం నెమ్మదిగా బయలుదేరటానికి సిద్ధమవుతున్నారు. మా అమ్మ తలుపు తాళం తీసి, గొళ్ళెం తీసి, తలుపులు బార్లా తెరిచింది. గొడ్డు 'అంబా' అని అరిచాయి. మా

    అమ్మను అవి చుట్టుకొన్నాయి, వాటేసుకున్నాయి. గొడ్డును బయటకు తోలి దూడల్ని కట్టేసింది అమ్మ. ఇంట్లో పడ్డ పేడ తీసేసింది.

    ఇల్లు తడవలేదు. చుక్క నీరు ఇంట్లో లేదు. ఇల్లు పడలేదు సరే, వొరగను కూడా ఒరగలేదు. పంచలోని వాళ్ళు పడిపోయిన వాళ్ళ ఇళ్ళు నిలబెట్టుకోవటానికి వెళ్ళిపోయారు. మా అమ్మ ఇంటిని చూచి నవ్వింది. భయంతో మేం మా ఇంటిని నమ్మలేదు. ధైర్యంగా మా ఇల్లు మమ్మల్ని నమ్మింది.

    పుస్తక లభ్యత వివరాలు:

    ఈ కథ ఆచార్య ఇనాక్ గారి ‘మన ఊళ్ళల్లో మా కథలు’ కథాసంపుటి నుంచి స్వీకరించబడింది.

    ప్రతులకు సంప్రదించండి -

    జ్యోతి గ్రంథమాల

    4-282, యన్ యస్ నగర్

    మీర్ పేట్, హైదరాబాద్ - 500 097.

    ఫోన్: 94402 43433



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    24 min
  • 'నా పేరు సొంబరా' - కథానేపధ్యం - మల్లిపురం జగదీష్ గారు.

    'నా పేరు సొంబరా' కథపై ముందుగా మిత్రుడు రవికాంత్ వ్యాఖ్య, తరువాత , రచయిత జగదీష్ గారి కథానేపధ్యంపై వివరణ వినండి.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    12 min
  • శ్రీరమణ గారి 'మిథునం' - ఫణి డొక్కా గారి స్వరాన!

    కథ పేరు 'మిథునం'. శ్రీరమణ గారి రచన, తెలుగు కథను మరో మారు , అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ.

    సుప్రసిద్ధ కథకులు, పత్రికా ప్రముఖులు శ్రీరమణ గారు సృష్టించిన ఒక అందమైన దాంపత్య జీవిత పొదరిల్లు.

    ఇదే పేరుతో తనికెళ్ళ భరణి గారి దర్శకత్వంలో తెలుగులో, వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో మలయాళంలో చలన చిత్రంగా రూపు దిద్దుకోబడి, అనేక ప్రశంసలను అందుకుంది.

    ఈ కథను ఎంతో శ్రావ్యంగా తన గొంతుకన వినిపించారు, మిత్రులు ఫణి డొక్కా గారు. వారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

    ఫణి డొక్కా గారి పరిచయం:

    వారు, చక్కటి కథా రచయిత, కవి, గాయకుడు, బంగారు నంది అవార్డు & రెమీ ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన లఘు చిత్ర దర్శకుడు. గత ఇరవై ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని అట్లాంటాలో నివసిస్తూ, తన వంతు సాహితీ సేద్యం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 250 కు పైగా కథలు, 1000 కు పైగా ఛందోబద్ధమైన పద్యాలు, 500 కు పైగా వచన కవితలు వ్రాసారు."పసిడి పూర్ణమ్మ" కూచి పూడి నృత్య రూపకాన్ని రచించారు. మేనకా విశ్వామిత్ర నృత్యరూపకానికి గాత్ర ధారణ చేసారు. శ్రీ వెంపటి చినసత్యంగారి శిష్యులచే ప్రదర్శింపబడిన "రుక్మిణీ కల్యాణం" కూచిపూడి నృత్య రూపకంలో పలుమార్లు అగ్నిద్యోతనుని పాత్ర, సూత్ర ధారుని పాత్ర ధరించారు. 

    ఫణి గారికి వంశీ ఇంటర్నేషనల్ సంస్థ, అక్కినేని ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా "సాహితీరత్న" అనే బిరుదు ప్రదానం చేసాయి. భారతీ తీర్థ సంస్థ వారు "సాహితీ కళా భారతి" అనే బిరుదుతో సత్కరించారు. నాటా సంస్థ వారు విశిష్ట సాహితీ పురస్కారం తో సన్మానించారు. ప్రముఖ వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల, కవితల పోటీలలో ఫణి గారు పలుమార్లు ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 'పల్లకీ" (కథా సంపుటి), "టేకిట్ ఈజీ" (హాస్య వ్యంగ్య గల్పికలు) అనే రెండు పుస్తకాలు రచించారు. పల్లకీ పుస్తకాన్ని ఆ దశాబ్దంలో వచ్చిన 10 ఉత్తమమైన పుస్తకాలలో ఒకటిగా ఎంపిక చేసి, రాజా రామమోహన రాయ్ ఫౌండేషన్ వారు ఆ పుస్తకాలను కొనుగోలు చేసి, ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపిణీ చేసారు. 

    కీర్తిశేషులు శ్రీ.పెమ్మరాజు వేణు గోపాలరావు గారి పేరిట మైత్రి సంస్థ అందించే సాహిత్య విభాగపు బంగారు పతకాన్ని ఫణి గారు అందుకున్నారు. తెలుగువన్ రేడియో లో 300 కు పైగా తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఫణి నిర్వహించారు. 

    సుమారు ఐదువందలకు పైగా పాటల కార్యక్రమాలలో పాల్గొని సినీ, లలిత గీతాలు ఆలపించారు. వారాంతాలలో, వీలైనప్పుడల్లా అట్లాంటాలోని పిల్లలకు తెలుగు చదవటం, వ్రాయటం, మాట్లాడటం (అంతర్జాతీయ తెలుగుబడి) నేర్పుతూ ఉంటారు.   



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    55 min
  • 'వడ దెబ్బ'!

     కథ పేరు 'వడ దెబ్బ'.

    వడ దెబ్బ

    “వెధవన్నర వెధవలు! నడుం వాల్చనియ్యరు. మీ మొహాలు మండా! వస్తున్నా నుండండి. మీ బుర్రలు బద్దలు కొడతాను." కోపంతో ఊగిపోతూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ముసిలాయన గేట్లోకి పరిగెట్టేడు.

    గేటు సందుల్లోంచి చూస్తున్న పిల్లలంతా ఆయస గేటు దగ్గర కొచ్చేలోగా తుర్రుమన్నారు.

    ముసిలాయన తలుపు బార్లా తెరచి, జాపోస్తూ నిల్చున్నాడు. పారిపోయిన పిల్లలు సందు మొగని తొంగి తొంగి చూస్తున్నారు.

    "బండ వెధవల్లారా ! బడుద్ధాయి గాడిదల్లారా ! రండి, మీ పని పడతా!" ముసిలాయన గట్టిగా అరిచేడు.

    ఎండాకాలం మధ్యాహ్నం. ఒళ్లు చిట చిట లాడుతోంది. నుదుటి మీంచి చెమట, ధారకట్టి ఆయన మొహం మీద ముడతల్లోంచి కిందికి కారుతోంది. వీపంతా పేత పొక్కులతో, గోనెగుడ్డలా దళసరి ఎక్కి పోయింది. వీధిలో మనిషన్న వాడు లేడు. అందరి ఇంటి తలుపులు బిడాయించుకుని ఉన్నాయి.

    గుంట వెధవలకి ఎండా లేదు కొండా లేదు. సందు మొగని నిల్చుని తొంగి, తొంగి, చూస్తున్నారు. ముసిలాయన ఎండలో నిల్చుని సందు వేపు తీక్షణంగా చూస్తున్నాడు. పిల్లలు ఏమను కొన్నారో ఏమో చల్లగా జారుకున్నారు.

    "పోయారు వెధవలు, వారం రోజులై ఈ భాగోతం మొదలయింది. మధ్యాహ్నం, కాస్త నడుం వాల్చనియ్యరు" ముసిలాయన గొణుక్కుంటూ గేటు వేసి ఇంట్లోకి వచ్చేడు.

    జాపోస్తూ పడక్కుర్చీలో పడుకున్నాడు.

    నరసారావు పేట పడక్కుర్చీ!

    దాంట్లో పడుకుంటే ప్రాణం సేద తీరుతుంది.

    ఆయన ఆ కుర్చీని తన మొదటి జీతంతో కొనుక్కున్నాడు. చిన్నప్పటినుండి ఆలాంటి కుర్చీ ఓటి ఉంటే బాగుంటుందని ఆయనకి మా కోరిగ్గా ఉండేది. మొదటి జీతం చేతికి రావడం ఏమిటి, కుర్చీ కొండం ఏమిటి!

    రిటైరై కొడుకూ కోడలి దగ్గరకి పూర్తిగా వచ్చేస్తున్నప్పుడు మిగతా సామాన్లు వాళ్లకి, వీళ్లకీ పంచేడు కాని, ఆ కుర్చీని మాత్రం జాగ్రత్తగా తనతో కూడా తెచ్చుకున్నాడు. 

    “నాన్న గారూ! మీరూ మీ చాదస్తం గాని, ఆ కుర్చీని అక్కడెవరికన్నా ఇచ్చిలేకపోయారూ ? అంత దూరం నుంచి ఇక్కడికి మోసుకొచ్చేరు!" అన్నాడు కొడుకు.

    కొడుక్కేం తెల్సు, ఈ కుర్చీలో ఉన్న సౌఖ్యం.

    ముసిలాయన కుర్చీ చేతుల మీదకి, రెండు కాళ్లూ జాపుకుని విసనకర్రతో విసురుకుంటూ కళ్లు మూసుకున్నాడు.

    “తెల్ల మీసం! తాటేకు విసనకర్ర, వెండి మీసం తాటేకు విసన కర్ర!"

    పిల్లలు మళ్ళీ వొచ్చిపడ్డారు. నవ్వుతున్నారు. గేటుసందుల్లోంచి చూస్తున్నారు.

    ముసిలాయన కి తాటేకు విసనకర్రే గతి అయింది.

    సీలింగు ఫేను లోపలిగదిలో ఉంది. కొడుకూ కోడలూ అందులో ఉంటారు. ముందు గదిలో ఫేను లేదు.

    తండ్రి రిటైరై వచ్చేడని మరో ఫేను కొడుకు వెంటనే ఎక్కడ కొంటాడూ! ఆదివారం సంతలో ముసిలాయన అరడజను విసనక్రరలు కొనుక్కు తెచ్చుకున్నాడు.

    తాటికమ్మా ! తాటిముంజ! తెల్ల మీసం వెండి మీసం!" ముసిలాయన ఈసారి కుర్చీలోంచి లేవలేదు. కుర్చీలో పడుకునే గేటు వేపు చూస్తూ ఊరుకున్నాడు.

    గేటు సందుల్లోంచి కొన్ని జతల కాళ్లు కని పిస్తున్నాయి. ఎర్రరంగు గౌను, నీలంరంగు రిబ్బనూ కనపడుతున్నాయి.

    అన్ని కాళ్ళకి హవాయి చెప్పులు ఉన్నాయి. ఆ కాళ్లలో బుల్లిగాడి కాళ్లు ఏవైఁ ఉఁటాయో అని ముసిలాయన తేరిపారి చూసేడు. ఆ బుల్లి గాడు మా కాని వెధవ! ఆ వెధవే ఈ సజ్జు నంతటినీ తీసుకొచ్చి గొడవ చేస్తున్నాడు.

    ఇదే తంతు. వెధవ సన్నేసులకి భయం అన్నది ఏ కోశాన్నీ లేదు.

    మధ్యాహ్నం అయీ అవడంతో వొచ్చిపడ్డం. గేటు సందుల్లోంచి చూడ్డం.

    ఒకటా రెండా-కాళ్లు, ఆరుగురో, ఎనమండుగురో! బొత్తిగా చిన్న వెధవలూ ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలూ ఉన్నారు.

    మొదటి రోజు తిట్టేడు. కొడ్తానని కేకలేసేడు. ఎవరి పిల్లలని అదిలించేడు. అన్నిటికీ పకపక నవ్వులే.

    ఆయన తిడుతున్న కొద్దీ వాళ్లకి మరింతనవ్వు. "బుల్లిగా బుల్లిగా!" అంటూ పరుగులు.

    నిన్నటికి నిన్న ముసిలాయనకి చిన్న మాగన్ను పట్టింది. “తాటిముంజలండి ! తాటిముంజలండి !" చెవిలో కేక పడ్డాది. ముసిలాయన లేచి కూచున్నాడు. “ఏయ్ తాటి ముంజలూ!" అని చీడీ మీంచీ కేకేసేడు. “ఏయ్ తాటి ముంజలూ! ఏయ్ తాటి ముంజలూ" అని పిలుస్తూనే ఉన్నాడు.

    తాటిముంజల వాడి అరుపు దూరం అయిపోతూ సందు మొగనుంచి వినపడుతోంది. ఊడిపోతున్న పంచెని దోపుకుంటూ ముసిలాయన గేటువరకూ పరిగెట్టుకు వెళ్ళేడు.

    “తాటిముంజలండోయ్! తాటి ముంజలు", అరుపు వినపడుతోంది. ముసిలాయన వీథిని ఆటూ ఇటూ చూశాడు.

    “ఏయ్ తాటిముంజలూ!" అంటూ కేకేశాడు.

    సందు మొగనుంచి మళ్ళీ “తాటిముంజలండి తాటి ముంజలు!" అని వినిపించింది ముసిలాయన అటు చూసేసరికి పిల్లలంతా గొల్లని నవ్వేరు.

    ఓకుర్రాడు ఏతాడి తాతలా "తాటిముంజలండి తాటిముంజలు" అని అరుస్తున్నాడు.

    ముసిలాయనకి వెర్రి కోపం వచ్చింది.

    “దొంగ వెధవల్లారా! సన్నాసి వెధవల్లారా !" అని తిడుతూ వెర్రి పీరులా ఊగిపోతూ వీదంట పరిగెట్టేడు. -

    “బుల్లిగా! చచ్చేంరోయి!"అంటూ పిల్లలు పరుగు లంకించుకున్నారు.

    . అప్పుడు తెలిసింది 'బుల్లిగాడు' ఆ కుర్ర కుంకల లీడరు గాడని!

    “అమ్మడూ, ఆ బుల్లిగాడెవరో నీకు తెల్సా?" అని కోడల్ని అడిగేడు.

    కోడలు మా తల్లి తిన్నగా జవాబిస్తుందా? తను వచ్చిందగ్గర్నుంచి చూస్తున్నాడు. తన పొడ ఆవిడకి కిట్టటం లేదని తెలుస్తూనే ఉంది.

    “ఏమో ఎవడికి తెల్సు? బుల్లిగాడో, మల్లిగాడో, రోజూ న్యూసెన్సు. వాళ్లూ సరి మీరూ సరి! లక్షా తొంభై సార్లు చెప్పేను. తలుపులు వేసుకు పడుకోండి అని! ఉహూఁ మీరెక్కడ వింటారూ? పోనీ తలుపు తీసుకుంటే తీసుకున్నారు.ఆ కర్టెను ఉండనిస్తారా? చచ్చీ చెడీ ఆ ఎంబ్రాయిడరీ చేసేను. నలిపి నలిపి తలుపు మీదికి ఎత్తి పెట్టారు."

    కోడలు విసుక్కుంది.

    ముసలాయనకి తలువులు బిడాయించుకోవడం, తెర గుడ్డలతో ఇల్లంతా చీకటిమయం చేసుకోవడం ససేమిరా కిట్టదు. గాలీ వెలుతురూ రాకుండా, బైట ప్రపంచం కనపడకుండా ఉండటం ఆయనకిరాదు.

    ఆయన కొడుకు దగ్గరికి రావడం ఏమిటి, సావిడి గదిని తనదిగా చేసు కోడం. వీధి గుమ్మాని కెదురుగా నర్సారావుపేట పడక్కుర్చీ వేసు కోడం, దాంట్లో పడుకుని, వీధి వేపు చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ చుట్ట కాల్చుకోడం మొదలయింది.

    ఆయన బతుకు బతుకంతా బాహాటంగా బతికేడు. బతుకులో రహస్యమన్నది లేదు.

    ఆయన రాక పూర్వం అయితే వీధి తలుపులు వేసి ఉందేవి. అధవా తీసి ఉన్నా నిండా కర్టెను ఉండేది. ముసిలాయన వీధి తలువులు బార్లా తెరవడమే కాదు. ఆ కర్టెను ఎత్తి తలుపు మీదకి పడేస్తాడు. అప్పటికిగాని ఆయనకి ఊపిరి తీసు కున్నట్టు ఉండదు.

    ముసిలాయన చేసే పన్లలో తన యింటి డీసెన్సీ పోయిందని కోడలి బాధ. గుమ్మానికి ఎదురుగా అడ్డంగా అంభేరీలా ఈ గోడ నుంచి ఆ గోడ వరకూ ఇంత పొడుగుని ఆ పడక్కుర్చీ ఓటి !

    దానికి తోడు కంచు ఆపుకోరా, తాటాకు విసనకర్రా! ముసిలాయనా ఆయనచుట్టాను.

    సందు దొరికితే చాలు ఆవిద రుసరుస లాడుతూ నే ఉంది. మొగుడితో ముప్ఫయిసార్లైనా చెప్పి ఉంటుంది.

    “ఎందుకు అలా తొందరపడ్డావు. చెప్తున్నానా! నీకోరిక తీరుతుందన్నానా! ఎటొచ్చీ సీలింగు ఫేను మాత్రం ఇప్పుడు రాదు. వేసం కాలం కదా! కొంచెం కష్టం. నీ సోఫా సెట్టు వస్తుంది. నీ యిష్టం వచ్చినట్టూ నువ్వు ముందుగదిని డెక రేటు చేసుకుందువుగాని." అని మొగుడు ఎంతో ముచ్చటగా చెప్పి ఆవిడ చీకాకుని పటాపంచెలు చేసేడు. మొగుడి చాకచక్యం మీద ఆవిడకి చాలా నమ్మకమే.

    అన్నాడు అంటే చేసేడూ అన్నమాటే! ఎక్కడో ఏదో పాచిక పారిఉంటుంది. అందుకే అంత ఖచ్చితంగా కోరిక తీరుతుంది అంటున్నాడు.

    ఇదిగో, వారం రోజులై పిల్లల సంతొకటి మొదలయిం ది.

    ఆ గుంట వెధవలు రావడం, ముసిలాయన్ని వెక్కిరించడం.. ఈయన వెర్రెత్తి పరుగులు తీయటం.

    ఆ పిల్లల తల్లి తండ్రులకైనా బుద్ది లేదు. ఇంత ఎండల్లో పిల్లల్ని రోడ్డు మీదకి ఎలా వదులుతారో! ఏ వడ దెబ్బో తగిలితే కాని తెలిసిరాదు. కోడలికి మహా చికాగ్గా ఉంది. ఈ వేళ పిల్లల గొడవ తారస్థాయిని అండుకుంది. ఒకటే రొదగా అరుస్తున్నారు. కోడలు విసురుగా వచ్చి వరండా మీద నిల్చుని వాళ్లని తిట్టింది. కోడిల్ని చూడగానే పిల్లలందరూ మాయమై పోయారు. ఆవిడ గేటు వరకూ అయినా వెళ్లలేదు. వీధివరండాలో ఆవిణ్ణి చూసి వాళ్లు హడలిపోయేరు. కోడలు విసవిసలాడుతూ ముసిలాయన పక్కనుంచి ఇంట్లోకి వెళ్లి పోయింది.

    ముసిలాయన తిట్లు పిల్లలకి లెక్క లేదు. ఆయన తిడితే వాళ్లకి ఆనందం! పకపకా నవ్వుతారు! పరిగెడతారు. ముసిలాయన దిగులుపడి పోయేడు. రోజురోజుకీ తను దిగజారిపోతున్నట్టుగా ఆయనకి ఆయనకే తెలుస్తోంది. పిల్లలు తనని చులకన చేసి ఆటపట్టిస్తున్నారని కాదు ఆయన బాధ.

    మొట్ట మొదటి రోజు పిల్లలు గేటు సందులోంచి చూసినప్పుడు వాళ్లని ఆయనే ఉసిగొట్టి రెచ్చకొట్టేడు. ఆయన రెచ్చకొట్టినప్పుడు, తిట్టినప్పుడు పిల్లలకి నవ్వు వచ్చింది. ఆయన తిట్లు వాళ్లకి తిట్లలా అని పించలేదు. ఆయన కేకలు ఉత్తుత్తి గావుకేకలే! పిల్లలకి అదో ఆట అయింది. ముసలాయనకీ వాళ్ల ఆటలో ఏదో ఊరట కలుగుతోంది.

     ముసిలాయనకి బాధగా వుంది. తన బాధనీ దిగులునీ , ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావడం లేదు. 

    ఆ వేళ మనవల్ని సెలవల్లో ఎక్కడికి పంపొద్దనీ వాళ్లకి తను పాఠాలు చెప్తాననీ తనకి కాలక్షేపం అవుతుందనీ, పిల్లలూ మెరుగవుతారనీ అన్నాడు.

    కోడలు ససేమీరా వినలేదు.

    కొడుకో! పెళ్లాం ఎంత చెపితే అంత!

    "ఎలాగా ట్యూషను పెట్టాం. మీరేం చెప్తారూ?" అన్నాది కోడలు.

    “మీ కెందుకండీ! రామ కృష్ణా అని రెస్టు తీసుకోక!" అన్నాడు, కొడుకు.

    “మీకు అక్కర్లేని విషయాల్లో జోక్యం కలగ చేసుకోకండి. పిల్లలూ చదువుసంధ్యలూ వాటి ఊసు మీ కెందుకూ? మేం వాళ్ల మంచి చెడ్డా చూసుకోగలం" అని కోడలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.

    ఎండా కాలం సెలవలు ఇచ్చీ ఇవ్వడం, పిల్లలు వాళ్ల పిన్నిగారి ఊరు వెళ్లి పోయేరు.

    పిల్లలు తిరగడానికి వెళ్లేరు. మంచిదే.

    అదికాదు, ముసిలాయన కడుపులో బాధ.

    మాటకి విలువ ఉండాలే !

    కొడుకుని చూస్తూ ఉంటే. ఆయనకి ఆశ్చర్యం వేస్తోంది. కళ్ళెర్ర చేసి చూస్తే బిక్కచచ్చి నిల్చునే వెధవ వీడేనా! ఆయనంటే వీడొక్క డేనా, అదెంత హడిలి పోయేది? చచ్చి, స్వర్గాన్ని వుంది. ఎంత భయమో! ఒదిగి ఒదిగి ఉండేది.

    ఆయనంటే ఒక్క పెళ్లానికేనా హడలు?

    ఆఫీసులోనో, అందరికీ గడగడే! భయపడకేం చేస్తారు? నిప్పు లాంటి మనిషి.

    ఎవరి పప్పులూ ఆయన దగ్గర ఉడకవు. ఆయన్ని ఎప్రోచ్ అవడమే?

    బతుకు బతుకంతా అలాగే బతికేడు. పిల్లల చదువు విషయంలో తన జోక్యం పనికిరాదన్న వాళ్లనీ,. వాళ్ల బతుకుల్నీ తనేం దిద్దగలడు!

    “మీకేమిటండీ! కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు" అంతా అన్నారు.

    ఆయనా అదే అనుకున్నాడు. రిటైరై కొడుకు దగ్గరికి వచ్చేక, కన్నాడన్న మాటేకాని తనకే మాత్రం కొడుకు రూపం తెలీదన్న నిజం ఆయనకి తెలిసివచ్చింది. ఆయనదే ఆ సూది ముక్కు, ఆయనదే ఆ గెడ్డాం.

    ఆయనదే ఆ ఉంగరాల జుట్టు. ఆయనదే ఆ మిసమిసలాడే తెలుపు. అన్నిటిలో ఆయన కొడుకేనని చూసినవాళ్లు ఆనవాలు కడతారు. కాని ఆయన తన కొడుకులో తనను తాను ఆనవాలు పట్టుకోలేక పోతున్నాడు.

    ఆ డాబు దర్పం! ఆ పొగరు! ఆ గీర, కిందా మీదా కానరాని కావరం, వాడా ఆయన కొడుకు!

    కొడుకు కన్నా నాలుగాకులు ఎక్కువ వల్లించే కోడలు! ఆ మా తల్లి నోట వచ్చే ప్రతీ మాటలోనూ అతిశయమే!

    కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని సుఖంగా ఉన్నాడని అనుకున్నాడే కాని వాడి రూపం ఇలా మారి ఉందని ముసిలాయనకి ఏం తెల్సు?

    ఆయన తన ఉద్యోగంలో తాను ఉన్నాడు. కొడుకు ఈ దూర ప్రాంతాల్లో ఎలా రంగు మారి వున్నాడో , ఆయనకేం ఎరుక? నిజమే. ఈ రోజుల్లో గాలి వాటం అటే వుంది. అందరూ ఆ గాలిలో కొట్టుకు పోతున్నారు. అయితే వీడు - వీడు - తన కొడుకు గాలిలో కొట్టుకు పోతున్నాడు.

    గాలికి ఎదురు వెళ్లాల్సిన వాడు కాదూ? తనకు పుట్టి !

    "ఆయనకేం ఆయన కొడుకు రెండు చేతులా గడిస్తున్నాడు" అంటున్నారందరూ.

    రెండు చేతులా గడిస్తున్నాడా? దోస్తున్నాడా? ముసిలాయన లోలోపల కుంగిపోతున్నాడు.

    వీధిలో గుంట వెధవలు. పసికుంకలు. అతన్ని ఆటపట్టిస్తున్నారని ఆయన బాధపట్టం లేదు. ఓ రకంగా ఓ వారం రోజులు బట్టి ఆ పిల్లలతో ఆయనకి కాల క్షేపం అవుతోంది.

    కడుపులో మండుతున్న మంటని ఆ కుర్రకుంకల మీద చూపెడుతున్నాడు.

    తన దిగులునీ తన బాధనీ పోగొట్టుకోడానికి తన కోపాన్ని ఆ పిల్లల మీద రుద్దుతున్నాడు.

    చెట్టంత కొడుకుని తిట్టడం ఎలాగో తెలీక ఆ కుర్ర వెధవల్ని తిడుతున్నాడు.

    ప్రతిరోజూ ఆ పిల్లలు వచ్చే వేళ కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. మాగన్ను పట్టబోతున్నా ఆ ఆకతాయి పిల్లలు ఇంకా రాలేదేమా అనుకుంటూ రెప్పలు బలవంతాన్ని విప్పి, గేటు వేపు చూడ్డం, ఆయనకి అలవాటు అయింది

    ఆ ఆదివారం ఆయనకి తిక్క ఎక్కి నట్లైంది. ఆయనకి ఇంట్లో ఉండబుద్ధి పుట్టలేదు.

    ఆయన వీధిలో తిరగడానికి వెళ్ళాడు.

    ఆ వెళ్లిన వాడు సూర్యుడు నడి నెత్తికి వచ్చే వరకూ ఇంటికి రాలేదు. ఎర్రగా కంద గడ్డలాంటి మొహంలో చెమటలు కక్కుకుంటూ ఎండపడి వచ్చేడు. ఆయన వచ్చేసరికి పక్కింటావిడా పిల్లలూ సావిట్లో ఉన్నారు. ముసిలాయన రావడం చూసి ఆవిడ వెళ్తానంటూ లేవబోయింది.

    “ పెద్దవారు; ఆయన దగ్గర మీకు మొహమాటం ఏమిటండీ?" అన్నాది కోడలు.

    ముసిలాయనకి అంతా చీకటిగా కనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచి చూసేడు, తన పడక్కుర్చీ సావిట్లో లేదు.....

    “మరేనండి. ఇది సోఫా కమ్ బెడ్డే నండీ. ఎవరన్నా ఇంటికి వస్తే మహా ఇబ్బందిగా ఉందనుకోండి. ఇంటి కొచ్చి, వాళ్లని కింద పడుకో పెట్టలేం కదా!” చెప్తోంది కోడలు.

    “ఆసలే ఖరీదైన ఫర్నీచరు. అందులో ఇప్పుడు మరీ ధరలు పెరిగిపోయాయి. మీరు కాబట్టి కొన్నారు. మాలాంటి వాళ్లు కొండమే!?" అన్నాది పక్కింటావిడ.

    కోడలు ఓ టెక్కు నవ్వు నవ్వింది. ముసిలాయనకి కళ్లు బైర్లు కమ్మినట్లుగా అనిపించింది. ఆయన నుదుటి మీద చెమటని చేత్తో తుడుచు కుంటూ మరోసారి గట్టిగా కళ్లు మూసుకుని తెరిచాడు. పక్కింటావిడ పిల్లలతో వెళ్లి పోయింది.

    ముసిలాయనకి కొత్త సోఫా సెట్టు నల్లగా జీమూతంలా ఆనింది. ఆయనకి తన పడక్కుర్చీలో పడుకో వాలనీ కంచు ఆపుకోరాడు మంచి నీళ్లు గటగటా తాగాలని ఉంది.

    “సోఫా సెట్టు బాగుందా? నాన్న గారూ! కూర్చోండి" లోపల్నించి కొడుకు వచ్చేడు.

    సోఫాలో కూర్చోబడిపోయి “బాగుందిరా బాగుంది. ఎంతయిందీ?" అన్నాడు ముసిలాయన.

    కొడుకూ కోడలూ మొహమొహాలు చూసుకున్నారు.

    “కొనలేదండి. మనకి ఉత్తినే వచ్చింది" తండ్రితో అబద్ధం ఆడలేదు.

    రక్తంలో ఆమాత్రం నిజాయితీ ఇంకా మిగిలి ఉంది.

    “ఉత్తినే రావడం ఏమిటీ?" కళ్లు చిట్లించుకొంటూ అడిగేడు.

    సావిడంతా ఆయనకి చీకట్లు ముసిరినట్లుగా ఆనుతోంది.

    “మీరు ఉత్తి సత్తికాలం వాళ్లండీ మావగారూ! ఉత్తినే రావడం, అంటే మీకు అర్థం కాదు. పెద్ద బిల్లు ఓటి పాసు చేయించేరట. దాంతో ఆ పెద్ద మనిషి మనకిది ఇచ్చేడు.” మొగుడి ప్రయోజకత్వాన్ని చెప్తూ కోడలి మొహం మతాబాలా వెలిగింది.

    నిప్పుల గాడ్పులో ఇంటికి వచ్చేడు. వస్తూనే నిప్పుల గుండంలో కూర్చోబడి పోయాడు.

    ముసిలాయన సర్రుమని లేచేడు. “నా పడక్కుర్చీ ఏదీ?" పెద్దగొంతుకతో బొబ్బ పెట్టేడు.

    "ఇక్కడెందుకూ? పాతడొక్కుది. అదిక్కడుంటే సావిడి అందం మరి అడగక్కర్లేదు. అదిగో చీడీ మీద పడేసాం."

    "ఏదీ , నా కుర్చీ చీడిమీద పడేసారూ?

    నాకుర్చీ ఉంటే సావిడి అందం పోతుందీ! ఓహో! అందం పోతుందా? చూస్తారేం? పారెయ్యండిరా! నన్నూ పారెయ్యండి."

    వెర్రి కోపంతో రెచ్చిపోయి ముసిలాయన కళ్లు తెరుస్తూ మూస్తూ, ఊగిపోతూ చీడీ మీదకి వెళ్లేడు. హఠాత్తుగా ఆయన వేస్తున్న ఈ కేకలు విని కొడుకూ కోడలూ అట్టే ఉండిపోయేరు.

    పెద్ద పెద్ద అంగలతో చీడి మీంచి పడక్కుర్చీని, జాపోస్తూ సావిట్లోకి తెచ్చేడు. పూసకం పట్టిన వాడిలా రెండు చేతుల్తో సోఫాని ఓ పక్కకి లాగేసి తన పడక్కుర్చీని పడాలున వేసేడు. పడక్కుర్చీలో పడి పోతున్నవాడిలా పడుకోబడి పోయేడు. ఆయనకి జూపోత ఎక్కువైంది.

    “ఒరేయి! ఇది — ఈ కుర్చీ నేను చెమటోడ్చి కొన్నదిరా.

    ఇదిగో !ఈ కుర్చీలో ఉండే ఈ ప్రాణి బతుకులో చేతులు తడిపించుకోలేదు. ఆహా! భ్రష్టు వెధవా! ఈకుర్చీ ఉంటే నీ ఇంటి అందం పోతుందా? అమ్మ! హాయ్ ! ఇల్లట్రా? నీ కొంప, నీ కొంప భ్రష్టు కొంప! భ్రష్టు వెధవకీ, భ్రష్టు కొంపకీ, అందం ఏమిటిరా?

    ఒరేయి వెధవా! నీ కొంపలో ఉంటే నా కుర్చీ చక్కదనం పోతుంది. " ముసిలాయనకి ఆయాసం ఎక్కువైంది.

    జాపోస్తూ బెక్కుతూ, చెమటలు కారుతూ ఆయన తిడుతున్నాడు.

    ఆయనకి అంతా చీకటిగా నల్లగా కనపడుతోంది. ఈ హఠాత్పరిణామానికి కొడుకూ కోడలూ నోటమాట రాకుండా అలా నిలుచుండి పోయారు.

    "ఒరేయి అప్రాచ్యుడా! నీ కొంపలో నేను ఉండను. నాకుర్చీ ఉండదు. అమ్మా! అబ్బా! " ముసిలాయన బెక్కుతూ ఉంటే కొడుక్కే ముందు తెలివొచ్చింది.

    పెళ్లాన్ని కేకలేస్తూ కంగారుగా మంచి నీళ్లు ముసిలాయన మొహాన్ని చిలకరించి ఉపచారాలు చేసేడు గాని ముసిలి ప్రాణం హరీమంది.

    “పెద్దవాడయి పోయేడా! ఇంటి పట్టున ఉండకూడదూ! ఎండలో తిరిగి తిరిగి వచ్చేట్ట. పెద్ద ప్రాణం. వడ దెబ్బకి తట్టుకో లేక గుటుక్కు మంది" , వీధి వీధంతా చెప్పుకున్నారు.

    వెండి మీసాల తాత, తెల్ల మీసాల తాత. పడక్కుర్చీ తాత చచ్చి పోయాడని తెలిసి, పిల్లలంతా బిక్కచచ్చి పోయేరు.

    “ఒరే బుల్లిగా! మనం ఎండలో ఆడుతూ తిరుగుతున్నాం కదా! వడదెబ్బ కొట్టి మనమూ చచ్చి పోతామా?" అని ఓ పిల్లడు బుల్లిగాణ్ణి అడిగేడు.

    “ఆ వడ దెబ్బ మన పిల్లలకి కొట్టదు" అన్నాడు బుల్లిగాడు. అన్నీ తెలిసిన పెద్దవాడిలా!

    ------------------------------------------------------------------------------------------------------------------------

    ఈ కథను రాసింది చాగంటి తులసి గారు. మధ్యతరగతి కుటుంబాల గురించే కాకుండా , దిగువ మధ్యతరగతి , బడుగు కుటుంబాలు , వాటిల్లో వున్న సమస్యలు సంఘర్షణలు తన కథల్లో అద్భుతం గా చిత్రీకరిస్తారు, తులసి గారు.

    చిన్నతనం నించే సాహితీ వాతావరణంలో పెరిగిన తులసి గారు, సుప్రసిద్ధ తెలుగు కథారచయిత చాగంటి సోమయాజులు గారి కుమార్తె.

    అనువాదం, సాహితీ విమర్శా, కథ రచన , లాంటి అనేక ప్రక్రియల్లో విశేషమైన కృషి చేశారు తులసి గారు.

    ఇంగ్లీష్, ఒడియా, హిందీ భాషల్లోని సాహిత్యాన్ని అద్భుతంగా తెలుగు లోకి అనువదించారు. 'ఓల్గా నించీ గంగ వరకు' వారి సుప్రసిద్ధమైన అనువాద గ్రంధం.

    ఎన్నో పురస్కారాలతో బాటూ , తెలుగు విశ్వ విద్యాలయం ద్వారా సర్వోత్తమ కథా రచయిత్రిగా బహుమతినందుకున్నారు.

    వారి గురించి మరిన్ని వివరాలు, క్రింద ఇచ్చిన వికీపీడియా లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

    లింక్ :

    https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%B8%E0%B0%BF



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    22 min
  • 'నా పేరు సొంబరా ' - మల్లిపురం జగదీష్ గారు

    హర్షణీయంలో వినబోతున్న కథ శ్రీ మల్లిపురం జగదీష్ గారు రచించిన 'నా పేరు సొంబరా'

    ఇది వారు రచించిన 'గురి' కథాసంకలనం లోనిది.

    (ఈ పుస్తకం లభ్యత గురించిన వివరాలు ఇదే వెబ్ పేజీ క్రిందిభాగం లో ఇవ్వబడ్డాయి.)

    ఏజెన్సీ ప్రాంతాల్లోని జన జీవన సమస్యలపై సాధికారంగా రచనలు చేస్తున్న జగదీశ్వరరావు గారు, విజయనగరం జిల్లాలోని ఒక గిరిజన గ్రామంలో జన్మించి, 'టిక్కబాయి' ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.

    ఇంతకు మునుపు వారు రాసిన 'సిల కోల' కథాసంకలనంలో కానీ, 'గురి' అనే ఈ కథా సంకలనంలో కానీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన కథల రూపంలో విస్తృతంగా చర్చించడం జరిగింది.

    ఈ కథ ద్వారా రచయిత , గిరిజనుల జీవితాల్లో వస్తున్న కొన్ని సామాజిక మార్పుల గురించి , వాటి కారణంగా ఉనికిని పూర్తిగా కోల్పోతూ , వారు పడుతున్న వేదన గురించి మన మనసుకు హత్తుకునేలా నివేదిస్తారు.

    కథ ఆడియో చివరన , జగదీష్ గారు , కథానేపధ్యాన్ని గురించి తెలియజేయడం జరుగుతుంది.

    హర్షణీయం ద్వారా మీకు తన రచనను అందించడానికి అనుమతినిచ్చి, శ్రోతలకు కథ గురించి వివరించిన జగదీష్ గారికి కృతజ్ఞతలు.

    * కథలో బోల్డ్ ఫాంట్ లో వున్న పదాలకు , పేజీ చివరన అర్థాలు ఇవ్వడం జరిగింది.

    నా పేరు సొంబరా

    కలెక్టరు కార్యాలయం... గ్రీవెన్స్ రోజు. గుంపులు గుంపులుగా జనం. సమస్యలన్నీ సాయం కోరుతూ. వరండా నిండా వరుసల్లో. ఎదురు చెట్ల కింద చెల్లా చెదురుగా ఎవరి ఆతృత లో వాళ్ళు.

    ఊపిరాడని ఉక్క,  ఒళ్లంతా చెమట, చికాకు. క్షణ క్షణం నాలో అసహనం. ఎవరి మీదో చెప్పుకోలేని కోపం. వరండా చివర టాయిలెట్స్ లో దూరి ముఖమ్మీద నీళ్లు చల్లుకున్నాను. రిలాక్స్ అయ్యాను. ఎదర అద్దం. నన్ను నేను చూసుకున్నాను.

    వెడల్పాటి ముక్కు, విశాలమైన నుదురు, వంపులు తిరిగిన జుట్టు. నా వయసప్పుడు నాన్న ఇలాగే వుండి వుంటాడు.

    నాన్న ఇప్పుడు ఉండివుంటే, అన్నదమ్ముల్లా వుండే వాళ్ళం.

    నేను పుట్టగానే తాత, నాన్నని కౌగిలించుకొని ముద్దులాడేడట.

    “నిలబెట్టేవురా! జాతి కాపు కాసినోడివనిపించేవురా!!” అని , రెండు ఎడ్లని కొని కానుక గా యిచ్చేడట. పుట్టిన వెంటనే నన్ను చేతుల్లోకి తీసుకొని అడవి వైపు చూపిస్తూ 'ఇదిగో నా రాజు... అడివికే రారాజు" అని గర్వంగా తాతల్నందర్నీ స్మరించుకున్నాడట.

    నేను పుట్టడం ఇంటికే కాదు, ఊరికే పండుగట. ఎందుకంటే వూరికి పెద్ద అయిన తాత కి పుట్టిన ముగ్గురన్నదమ్ముల్లో అందరికీ ఆడపిల్లలే. చిన్నవాడైన నాన్నకి పుట్టిన ఏకైక మగ సంతానం నేను.

    నాకు గుర్తొస్తోంది....

    తాత భుజమ్మీద గుర్రంపండేసుకుంటే తాత వుంగరాల జుట్టు పట్టుకుని నేను రాజునై వీధులన్నీ ఊరేగేను. రెండు చేతుల్లోనూ కిన్నెర పట్టుకుని నన్ను పాటలు పాటలుగా తిప్పేవాడు తాత. అదే భుజాల మీద డప్పు దరువుల్లో కొత్త వూర్లు, కొత్త కొండలూ, వింత వింతల అడవీ చూసేను.

    ఆ భుజాల మీదే... తాత పెదాల మీద పలికిన పిన్ల కర్ర పాటల్లో ముత్తాతల గొంతులు విన్నాను. మా ఇద్దరి వైభవం చూసి వూరంతా ముచ్చట పడేది.

    నాకు పేరు పెట్టడానికి ఇంటికి ఆకుల తోరణం కట్టించేరట. ఎజ్జోడిని పిలిపించి ఇంటి దేవత మూల "కానికు” వేయించేరు. దీపం వెలుగులో అమ్మ ఒడిలో వున్న నన్ను తాత ఎత్తుకుని చేటలో బియ్యం నెరుపుతు గుగ్గిలం వేసి ధూపం పట్టేరట. ఎజ్జోడు ముంతలో నీళ్లను చిలకరిస్తూ రాగాలు తీసి దేవతలందరినీ స్మరించేరట. మా వంశం లోని అందరి పేర్లూ గొంతెత్తి పలుకుతున్నాడట. ఒక్కొక్క పేరుకీ ఒక్కొక్క బియ్యం గింజను నీటిలో వేస్తున్నాడట. చుట్టూ మూగిన చుట్టాలు. వూరి వాళ్లూ, బంధువులూ ఆతృతగా ఆ ముంతలోని బియ్యం గింజలు వైపే చూస్తున్నారట. ఏ పేరు పలికినపుడు గింజ నీటిలో మునుగుతుందో అదే నా పేరు.

    మంగడూ...

    బారికీ...

    ఆ లక్కాయీ...

    సన్నాయీ...

    సుక్కూ ...

    సొంబరా...

    చివరి పేరుకి బియ్యం గింజ నీట మునిగింది. ఒక్కసారిగా ఉల్లల ఉత్సవం... వూరంతా వెలుగు. తాత ఒక్కసారిగా ఎగిరి గెంతేసేడు. వీధుల వెంట నన్నెత్తుకుని ఊరేగించేడు. తుడుం కుండ నడుముకి కట్టి నడిరేయి దాకా వాయిస్తూ... ఏజామునో నిదుర పోయేడట. తాత కంత సంబరం. ఎందుకంటే... నాకు దేవతలిచ్చిన పేరు ఎవరిదో కాదు, మా తాతదే.

    “నా జాతిని నిలబెడతాడు... నా మనవడు” అనే కన్ను మూసేడు తాత.

    ----------------------------------------------

    “రాబర్టూ! రాబర్టూ!!” ఎవరో పిలుస్తున్నారు. నన్నే... నన్నే.... నన్నే.

    నా పిడికిలి బిగుసుకుంది. బలంగా గాల్లోకి చేయి విసిరేను. ఎదురుగా వున్న అద్దం ముక్కలయ్యింది. నా గుండెలాగే.

    ఇప్పుడు నా పేరు రాబర్ట్ విల్సన్... ఔను రాబర్ట్ విల్సన్.

    నన్ను నా నుంచి దూరం చేసిన పేరు, నేను నేను కాకుండా పోయిన పేరు. గుండెలోని గాజు పెంకుల్ని కెలుకుతున్న పేరు. -

    నేను 'సొంబరా' నుంచి 'రాబర్ట్ విల్సన్' గా ఎలా రూపాంతరం చెందేనో లీలగా గుర్తొస్తోంది నాకు. -

    ఆ రోజు నాన్న నన్ను హాస్టల్లో చేర్పించడానికి వచ్చిన రోజు. అప్పటికే వేరే స్కూల్లో నాలుగు చదివి మానేసిన నాకు సీటివ్వడం కుదరదన్నారు. మాష్టారు. ఆ స్కూలు నుండి టీ.సీ. తెస్తే గానీ చేర్పించడం వీలవదని అంటూనే ఒక మార్గం చెప్పేరు. అక్కడ వున్న పేరు కాకుండా వేరే పేరున ఇక్కడ చేరడం. అప్లికేషన్ నింపుతూ మాష్టారికి నచ్చిన సినిమా హీరోల పేర్లు చెప్తూ వచ్చారు... నాన్న దేనికి తల వూపుతాడోనని.

    “అవేవీ ఒద్దండీ... రాబర్ట్ విల్సన్ అని రాయండి? కొత్త గొంతు వినపడింది. అతని వైపు చూసేను. తెల్లబట్టలేసుకొని, చేతిలో నల్లటి పుస్తకంతో వున్నాడతను. మెడలో సిలువ వేలాడుతో.. అతను తరచూ వూరు రావడం, ఇంటికి దగ్గరవడం నాకు గుర్తుకొచ్చింది అప్పుడు.

    "ఇదేటి వోయ్! ఇలగుందీ పేరు?” అని నాన్నని అడిగారు మాష్టారు ఆశ్చర్యంతో. నాన్న నేల చూపులు చూస్తున్నాడు.

    “మీము మతము తీసుకున్నాము” అని నాన్న అమాయకంగా అనడం నాకింకా గుర్తే .

    మతమూ... తీసుకోవడమూ!?

    తీసుకోవడానికి ఎవరిస్తారు? ఎందుకిస్తారు? అసలు ఇవ్వడమేమిటి? మతమంటే ఏమిటి? మా వూరికి మతమెలా వొచ్చింది?

    మరి అప్పుడు మా వూరెలా వుండేది?

    బద్దలైన అద్దం పెంకుల్లో నా ప్రతిబింబంలా... పగిలిన నా గుండె లోతుల్లోంచి వెల్లువెత్తుతున్న హృదయ ఘోషలా...

    ప్రశ్నలు... సందేహాలు....

    తాతల నాటి ముచ్చట్లలో మా వూరిని చూసేను. ఇప్పుడు ప్రధాన రహదారికి నాలుగు కొండల అవతల, అడివికి ఆమడ దూరంలో, చుట్టూ పొలాలతో మూడే మూడు వాసల్లో వుండేది వూరు. భూములున్న వాళ్లు పొలాల్లోనూ, లేనివాళ్లు కొండల మీద పోడు వ్యవసాయం చేసే వాళ్లు. అడవిలొ చింత పండూ, చీపుర్లూ, పనస పళ్లు, ఇప్పమొగ్గలూ సంతలో అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళు.

    అంతా వర్షాధారమే. వాన కురిస్తే తిండి, లేదంటే పస్తులు. వాన కురిపించేది అడివి తల్లి, అందుకు సాక్షులు పూర్వీకులే అని నమ్మకం. చనిపోయిన వాళ్లు చల్లగా చూస్తే అడివి తల్లి కరుణించినట్లే.. లేదంటే కరువు.

    పెద్దల్ని ప్రసన్నం చేసుకుని చినుకుల ఆశీర్వాదం పొందడమే పండుగ.

    పండుగంటే... గూడెంలోని అందరి గుండె చప్పుళ్లనూ డప్పులు చేసి అడవికి వినిపించడం.

    పండుగంటే... కొండమీద పండిన ప్రతి గింజా మీ చలవేనని పిన్ల కర్ర పాటలు పాడడం.

    నీ నీడలో ఒక్కటై వున్నామని అడివి తల్లి ముందు గజ్జె కట్టి థింసా అడుగులు వేయడం... అడవికి దండం పెట్టడం.

    అంతే. అడవే దేవత. పోయిన పెద్దాళ్లే దేవుళ్లు. దేవుళ్ల కనుసన్నల్లో దేవత ఒడిలో బతకడమే మతం. .

    మరి ఇప్పుడు? మా వూరెలా వుంది??

    అనడానికి ఆదివాసీ గ్రామం గానీ అన్ని ఆధునిక సదుపాయాలు అందుకుంది. టి.వీ, సెల్ పోన్, ఫ్రిజ్, మోటారు బైక్. ఈ వస్తువుల కంటే ముందు... వస్తువుల్ని మోసుకొచ్చిన రోడ్డు కంటే ముందు మా వూరికి ఒక సిమెంట్ కట్టడం వొచ్చింది. అది బడి కాదు... పంచాయితీ భవనమూ కాదు... చర్చి! -

    అత్యంత వైభవంగా... ఆధునిక హంగులతో... ఆకుపచ్చని అడవిలో రంగురంగుల కట్టడం. దాని చుట్టూ పూరి గుడిసెల్లో మోకాలిపై మేము..

    చలిచలి గాలుల్లో తుడుము డప్పుల హోరు.

    చలి మంటల్నీ, మంచం క్రింది కుంపట్లనీ వదిలి వూరు వూరంతా వీధుల్లో ప్రవాహమైపోతున్న రాత్రి... యువతీ యువకుల థింసా అడుగుల సవ్వడీ....

    ఇవేవీ నన్ను నిలువనీయడం లేదు. నా కాళ్ల సంకెళ్లు తెంచుకుని నాన్న కు తెలీకుండా పాత వూరి వైపు అడుగులేసేను.

    అక్కడ...

    మేము వదిలేసిన ఇల్లు... ఆ సందడిలో ఎంతో దిగులుతో కనిపించింది. నా కోసం ఎన్నో కలలు గన్న తాత కనిపించేడు. తాత నడిచిన అడుగులు కనిపించేయి. జీవం తొణికిసలాడే వూరు కనిపించింది. సందడితో వున్న సమూహం కనిపించింది.

    అలాంటి వూరు నుంచి ఎందుకు వేరయ్యేము?

    

    ---------------------------------------------

    తాత చనిపోయిన తర్వాత ఊరి పెద్దమనుషుల్లో ఒక నాన్న వ్యవసాయం తో పాటు వ్యాపారం కూడా చేసేవాడు. మా రోడ్డుకు మరీ దూరంగా, కొండల మధ్య వుండడంతో ఏ షావుకారీ వచ్చేవాడు కాదు. అందుకని నాన్న సంతలోని కొన్ని వస్తువుల్ని కొని వూర్లో అమ్మేవాడు. డబ్బు కోసం కాకుండా వూరి అవసరాల కోసం వ్యాపారం చేసే వాడు. ఇప్పమొగ్గలు, కందులు, చింతపండు, చీపుర్లు... ఏవైనా వస్తు మార్పిడి చేసే వాడు.

    అప్పట్లో ఐదు చదివి మానేసిన నాన్నని హాస్టల్లో కుక్కు ఉద్యోగం ఇస్తామని పిలిచిందట ఐటీడీఎ. తీరా అక్కడికెళ్లాక హాస్టల్లో అందరూ తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తప్ప జీతమొచ్చే ఉద్యోగం కాదని తెలిసి మానేసాడు. అప్పటి నుండి నాన్నకి ఆ ఆఫీసంటే రోత పుట్టింది. ఆ తర్వాత రోజుల్లో ఊర్లో వాళ్లు ఏదో సాయం అందుతుందని ప్రతి సోమవారం గ్రీవెన్స్ కి వెళ్లి వస్తున్నా నాన్న మాత్రం ఎప్పుడూ ఆ మెట్లెక్కలేదు. అతని మనసులో 'అది మా కోసం కాదు' అని ముద్ర పడిపోయిందేమో! -

    సరిగ్గా అలాంటి సమయంలోనే తెల్లదుస్తుల్లో వున్న వ్యక్తి వూర్లోకి అడుగు పెట్టేడు. ఆ తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. అతని ద్వారానే మా వూర్లో మతం నడిచొచ్చిందని. తరచూ ఇంటికొస్తూ వుండే వాడు. నాన్నతో సన్నిహితంగా వుండేవాడు. అతనే నాన్న వ్యాపారాభివృద్ధికి ధనసాయం చేసాడని ఆ తర్వాత తెలిసొచ్చింది. ఎవరికైనా ఒంట్లో బాగోలేక పోతే వాక్యం చదివి ప్రార్ధన చేసేవాడు. ఒక్కోసారి మాత్రలని కూడా ఇచ్చేవాడు. మాత్రలతో తగ్గిన జ్వరాన్ని ప్రార్ధనతో తగ్గినదిగా చెప్పేవాడు.

    క్రమక్రమంగా వూర్లోని కొంతమందితో సంఘం స్థాపించాడు. వాళ్లంతా ఒక్కచోట చేరి బైబిల్ చదివి ప్రార్థన చేసే స్థాయికి తీసుకొచ్చేడు.

    ఓ రోజు....

    ప్రార్ధన ముగించి కళ్లు తెరిచేసరికి నాన్న చేతిలో వందల నోట్లు కొన్ని మెరుస్తూ కనిపించేయి. ఎదురుగా అతను. 'ఎందుకు?” అన్నట్లు అడిగాడు నాన్న. “ఇక నుంచి వూరి ప్రజల బాధల్ని ప్రభువుకి నువ్వే వినిపించాలి. ముందుండి అందరినీ దేవుని సన్నిధికి చేర్చాలి. అందరికోసం ప్రార్ధన చేయాలి.” అని ముగించేడు.

    ఆ కొద్ది రోజులకే నాన్న లాంటి వారందరికీ ట్రైనింగు కోసం పంపించేరు. ప్రతిరోజూ విధిగా ప్రార్ధన చేయాలి. ఆడవాళ్లు బొట్టు పెట్టుకోకూడదు. కొత్త వాళ్లెవరైనా వస్తే షేక్ హేండ్ తీసుకోవాలి. సారా మానేయాలి. తుడుం కొట్టకూడదు. డప్పు ముట్టకూడదు. ఇలాంటి కొత్త నిబంధనలెన్నో వూర్లోకొచ్చేయి.

    ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం వొచ్చేది నాన్నకి. వాటితో పాటు సవర భాషలో పాడిన క్రీస్తు గీతాల సీడీలు, బైబిళ్లు, రంగురంగుల కేలండర్లూ తో పాటు విలువైన కానుకలు ఎక్కడి నుండో వచ్చేవి.

    తమ భాష ఆధునిక సంగీత పరికరాలతో అందంగా వినబడుతుంటే ఎవరికి ఆనందంగా వుండదు? ప్రార్ధన కొచ్చిన వాళ్లు పండిన పంటలో తొలికాయ, తొలిగింజ ప్రభువుకి చేరాలనడంతో అందరూ ఏదో ఒకటి తెచ్చిచ్చేవాళ్లు. దాంతో నాన్న మరింత ఉత్సాహంగా పని చేసేవాడు.

    “అయితే... తాత ముత్తాతల కాసి నడుస్తున్న సంప్రతీకము ఎలాగ మానెస్తామూ?” అని వెనకడుగేసిన ముసిలోళ్లూ లేకపోలేదు.

    వాటన్నిటికీ సమాధానం చెప్పింది సంఘం. -

    “ఇన్నాళూ చెట్టుకీ పుట్టకీ మొక్కి మీరేమిటి సాధించేరు? అది మూర్ఖంతోనూ, అనాగరికంతోనూ కూడుకున్నది. ఎంత కాలమని మారకుంట వుంటారు? మనం అభివృద్ధిలోకి మారాలంటే ప్రభువుని నమ్ముకోవాల్సిందే”నని మరొక తీర్మానం కూడ చేసేరారోజు. మతం తీసుకున్నవాళ్లంతా వేరుగా ఒక కొత్త వూరుగా నిర్మించబడతారనిప్రకటించారు

    అలా ఏర్పడిందే మా కొత్త వూరు... పాల్ నగర్

    అక్కడి నుంచి చూస్తే ఈ వూరు చాలా దూరంలోవుంటుంది. ఎంత దూరమంటే ఒకరితో ఒకరు మాట్లాడితే వినిపించినా వెనుతిరిగి వెళ్లి పోయేంత దూరం.

    

    ---------------------------------------

    నా వీపు మీద ఒక దెబ్బ పడ్డాక గానీ నాకు ఆ దూరం తెలిసి రాలేదు. తుడుము డప్పుల హెూరు ఆగిపోయింది. ధింసా నృత్యం మౌనం వహించింది. అందరి కళ్లలో ఆశ్చర్యం అలముకుంది.

    “ఇక్కడేటి సేస్తున్నావురా? మతం తీసుకున్నోల్లు ఇలగ గెంతకూడదని తెలీదేట్రా?” అని నాన్న నన్ను బలవంతంగా అక్కడి నుండి కొత్త వూరికి ఈడ్చుకు వెళ్లిన దృశ్యం ఇంకా సజీవంగానే వుంది.

    నా గుండెల్లో మోగుతున్న డప్పులు మూగబోయాయి. నా కాళ్లకు వేలాడుతున్న గజ్జెలు మోగక సంకెళ్లుగా మారిపోవడం తెలుస్తూనే వుంది.

    బయట దూరంగా పాత వూరిలో డప్పుల హోరు, నాలో నిశ్శబ్దం.

    మా వూరిప్పుడు కొత్త దేవుని నీడలో వుంది.

    ఎవరో విధించిన నిబంధనల్లో బంధీ గా వుంది.

    నా గుండెల్ని కదిలించే డప్పు లేదు. ఉరుము మెరుపుల తుడుము దెబ్బా లేదు.

    అడవిని ఆడించే కిన్నెర పాటా లేదు.

    వెన్నెల రాల్చే పిన్నల కర్రా లేదు. ఆటలేదు. పాట లేదు. థింసా నృత్యపు అడుగుల సందడి అసలే లేదు. -

    అంతా నిశ్శబ్దం... నిశి రాతిరి నిశ్శబ్దం. గుండెలోతుల్లోగుచ్చుకుంటూన్న అద్దం పెంకుల శబ్దం....

    ---------------------------------------

    ఓరోజు సాయంత్రం వూరు సమావేశమయంలో “లాజర్ వున్నాడా?” అడిగాడు అతను.

    అది నాన్న కొత్త పేరు. అసలు పేరు 'లక్కాయి' అని నాన్న ఎప్పుడో మర్చిపోయివుంటాడు. ప్రచారం కోసం కొండ కొండనీ ఎక్కి దిగేవాడు. ఇంటింటినీ పలకరించేవాడు. చుట్టాలూ, బంధువులూ అందరిళ్లకీ వెళ్లి ప్రార్ధనలు చేసి మతం వైపుకి మళ్లించేవాడు నాన్న.

    “లేడు గదా?” అన్నారెవరో.... ప్రచారం కోసం ఎప్పుడూ వూరి బయటే వుంటాడన్న అర్ధంలో.

    "లాజర్ ను సంఘం నుండి బహిష్కరిస్తున్నాం” అని అన్నాడు గొంతు సవరించుకొని తెల్లదుస్తుల్లో వున్న వ్యక్తి. ఊరంతా ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. అందరికీ తెలుసు నాన్న ఎలాంటి వాడో.

    “ఎందుకో తెలుసా? కొత్త నిబంధనని చేతబట్టి మద్యం సేవించేడు. దేవుని కృపని ధిక్కరించేడు కాబట్టి” అని ముగించేడతడు.

    తాగడం తప్పే. కాదనలేదు కానీ కొండోడి బతుకులో సారా తాగడం నేరం కాదు. పొద్దు తూరక ముందె కొండకి చేరి అవిశ్రాంతంగా శ్రమించి పొద్దు ములిగే సమయానికి రెండు జీలుగు చుక్కలు గొంతులో పోసుకొని వూరు చేరి నృత్యం చేయడం ఇక్కడి బతుకులో ఒక భాగం.

    పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమేటీ ?

    రాత్రి వేళ చలి మంట చుట్టూ చేరిన వూరు... తుడుము డప్పుల చప్పుళ్లలో ... సన్నాయి, గొగోయ్ సంగీతాల నడుమ శ్రమని మర్చి పోవడానికి అందరు కలిసి సారా ని సేవించడం... నృత్యం చేయడం కొత్త కాదు. ఆ రాత్రిళ్లలో సారా ఒక సంప్రదాయం . అందరూ కలిసి తాగడం ఒక ఐక్యతా చిహ్నం. ఇంటికొచ్చిన అతిధికి సారా ఇచ్చి మర్యాద చెయ్యడం ఒక జీవన విధానం.

    ఇప్పుడది ఎక్కువై ప్రాణాల మీదికి తెచ్చుకోవడం తప్పే కావచ్చు. కానీ నాన్న అంతలా తాగి వుంటాడా? అలసిన శరీరానికి నిద్ర పుచ్చడానికి రెండు చుక్కల విశ్రాంతినివ్వడం నేరమా? దానికి శిక్ష బహిష్కరణా?

    ఇంటికొచ్చిన నాన్నకి విషయం తెలిసింది. మొదట్లో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత రోజుల్లో నాన్నకి అర్ధమైపోయింది. .. బహిష్కరణ ఎంత బలమైనదో!

    ఇరుగు పొరుగు మాట్లాడక పోవడం... ప్రార్థన సమయంలో కూడ దూరం చేయడం నాన్న మనో వేదనకు కారణమయ్యింది. ఊరి పెద్దరికం ఎవరి చేతుల్లోకి మారిపోయిందో స్పష్టమైపోయింది. తిండీ తిప్పలు మానేసి కొండల మీదే గడిపే వాడు. ఇంటికి చేరే వాడు కాదు. గుండెల్లో కసి నిండిపోయిందేమో... నిజంగానే తాగడం మొదలు పెట్టేడు. తాగి తాగి ఏ తుప్పల్లోనో, డొంకల్లోనో పడుకుని రోజుల తరబడి కనపడే వాడు కాదు. మనుషులు అడివి పట్టీడం అంటారే... అలాగ.

    మమ్మల్నీ, ఇంటినీ వదిలి కేరేజీలో గంజి పట్టుకుని నాన్నని వెదుక్కుంటూ అడివిలంట తిరిగీది అమ్మ. తెల్లవారి బయల్దేరి ఏ రాత్రికో వచ్చేది... కన్నీళ్లని మోసుకుంటూ. “అమ్మా! బువ్వే... ఆకలి” అని చెల్లి తమ్ముడు అమ్మ గుండెలమీదికి ఎగబడే వాళ్లు. పొయ్యి ముట్టించి బువ్వలుడికీ వరకైనా పిల్లలు ఆగాలగదా అని పొరుగింటోల్లకి అంబలో, గెంజో అడిగితే ముఖం చాటేసే వాళ్లు. మతం తీసుకున్న వాళ్లు బహిష్కృతులైతే నరకాన్ని ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తుందని నాకప్పుడే తెలిసింది.

    అందుకే నేనెప్పుడూ హాస్టల్ వదిలే వాడిని కాదు. చెల్లీ, తమ్ముడ్నీ కూడా హాస్టల్లో చేర్పించింది అమ్మ.... తిండి దొరుకుతుందనే. హాస్టల్ లో ఏ తగువుల్లోనూ తలదూర్చేవాడిని కాదు. నాకు భయం. మాష్టారు ఏ కారణం చేతైనా ఇంటికి పంపించేస్తే??? తిండి దొరకదని భయం. అమ్మకి కష్టం కలుగుతుందని భయం.

    ఆ రోజు బట్టలుతుక్కుని తడి బట్టల్తో హాస్టల్ గదిలో కొచ్చేను. నా పెట్టి మీద కూర్చొని నా కోసం ఎదురు చూస్తున్నాడు మండంగి మామ. అతన్ని చూస్తే అమ్మను చూసినట్టియ్యింది. పరుగు పరుగున అతన్ని చేరుకున్నాను.

    “ఇంటికెల్దుమా” అన్నాడు.

    “ఎందుకే?” అన్నాను

    “ఏమీలేదు... నాన్న...” అని ఆగేడు

    “ఇంటికొచ్చేడా?” అన్నాను “ఔ” నన్నట్టు తల వూపేడు.

    “ఎన్నాళ్లింది నాన్నను చూసి? అప్పుడెప్పుడో అమ్మనీ, మమ్మల్ని దగ్గర కూర్చో బెట్టుకొని బైబిలు చదవడం నేర్పించేడు. పాటలు పాడి నిదురపుచ్చేవాడు. మేము గుర్తొచ్చి ఇంటికి చేరివుంటాడు. ఇక పై బైబిలు వూసెత్తడేమో?! కథలు చెప్తాడు. ఇంటి పెద్ద కొడుకు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలో చెప్తాడు. చిన్నపుడు తాతకి ఎలాంటి సాయం చేసేవాడో వివరిస్తాడు. అమ్మనెలా చూసుకోవాలో చెపుతాడు.

    బస్సు దిగి వూరి వైపు నడుస్తున్నాం. కొండ మలుపు తిరిగితే వూరు కనపడుతుంది. రెండు పొలం గట్లు దాటితే ఊరి పొలిమేరల్లోకి చేరిపోతాం. కానీ మండంగి మామ ఊరి దారి కాకుండా కొండదారి నడిపించేడు. కొండవాలులో కురికిమాని చెట్టుకింద ఊరి జనం గుమిగూడి వున్నారు. నన్ను చూసి ఒక్కొక్కరూ దారిచ్చేరు.

    అక్కడ....

    చెట్టుకొమ్మకి వేలాడుతూ కనిపించేడు నాన్న.

    -----------------------------------------

    “రాబర్ట్! రాబర్ట్ విల్సన్?” ఎవరో పిలుస్తున్నారు. మళ్లీ నన్నే. అదే పేరు... నన్ను శూన్యాన్ని చేసిన పేరు. నాలోని 'నన్ను' ని లేకుండా చేసిన పేరు.

    పేరంటే... ఒక గుర్తింపు కదా? పేరంటే... ఒక వ్యక్తిత్వం... ఒక అస్థిత్వం . తరతరాలుగా నడిపిస్తున్న ఒక మానవ జీవన సూత్రం. పేరంటే... ఒక జాతి. ఒక సంస్కృతి. నా పేరుతో నాకు సంబంధించినవేవీ లేవు కదా!

    రాబర్ట్ విల్సన్!

    ఎవరి పేరది? ఏ దేశపు పేరిది? ఈ పేరులో ఎవరి సంస్కృతి దాగి వుంది? ఏ జాతి అనవాళ్లున్నాయి? ఎవరి తరానికి వారసుడను?

    “నువ్వు గిరిజనుడివేనా?” డిగ్రీ పూర్తి చేసి టీచర్ గా సీటు కోసం ఇంటర్వ్యూ లో అడిగారు... నా సర్టిఫికేట్లని ఎగాదిగా చూస్తూ.

    'ఔ ' నన్నాను.

    “ఎలా?” అన్నాడతను .

    “ఇలాంటి పేర్లు మీలో లేవే? మీ బంధువుల పేర్లు కొన్ని చెప్పు”

    “సన్నాయీ... కడాయీ... అప్పారావూ... అన్నమ్మి.... మిలంతి... సొంబరా... గయామి.... జిల్కి.. సోమేసూ...” గుర్తొచిన పేర్లన్నీ చెప్పేను. నన్ను చూసుకునే పేరు ఎక్కడా లేదు.

    “నువ్వు గిరిజనుడిని నీకు రిజర్వేషన్ కల్పించింది. రాజ్యాంగం... నీవది పొందాలంటే నువ్వు గిరిజనుడివని నిరూపించు కోవాలి కదా?” అని టిక్ పెట్టేరతను. "

    నిజమే... ఎవరు నిజమైన గిరిజనుడు? అతన్ని ఎలా గుర్తు పట్టాలి? ఎమ్మార్వో ఇచ్చిన కాగితమ్ముక్క సరిపోతుందా?? అదే అయితే... ఆలాంటి కాగితమ్ముక్కలు ఎన్ని లేవు???

    ఆ రోజు ఎమ్మార్వో ఆఫీసులో సర్టిఫికెట్లు ఇస్తున్న రోజు... ఏమి జరిగింది?

    “ఈ పేరేమిటి ఇలా వుంది? ఎవరితను? రమ్మనూ....” అని ఎమ్మార్వో గారు పిలిచారు. లోపలికి వెళ్లాను.

    “ఏ వూరు?” చెప్పేను.

    “మీ నాన్న పేరు?”

    అదీ చెప్పాను.

    “అయితే... కన్వర్టెడ్ అన్నమాట”

    మౌనంగా తల దించుకున్నాను. - - “మతం సరే... మరి నువ్వు గిరిజనుడివని ఋజువేమిటి?,

    “నీది ఏ వూరు... ఎక్కడ పుట్టేవు? ఎవరికి పుట్టేవు?

    నీ ఆచార వ్యవహారాలేమిటీ? నీ పండుగలేమిటి? నీ సంప్రదాయమేమిటీ?? ఇవన్నీ ఎంక్వైరీ చేసి నీకు సర్టిఫికేట్ ఇస్తాం. సరేనా?” అని లేచేరు.

    'నాన్నా! ఎంత పని చేసేవు నాన్నా?! ఈ పేరు పెట్టి నన్ను జాతి నుండి వెలివేసినట్టు, నా కంటూ ఒక గుర్తింపు లేకుండా చేసావు కద నాన్నా! అడవి లో పుట్టి... అడవిలో పెరిగి.... పేరు మూలంగానే ఈ క్షోభని ఎందుకనుభవించాలి? చిన్నపుడు ఈ పేరున పిలుస్తుంటే అందరిలోనూ ప్రత్యేకంగానూ, కొత్తగానూ వుండేది. రంగుల చొక్కాలా బాగున్నట్టనిపించేది. మరి ఇప్పుడు??? బరువుగా... మోయలేనంత భారంగా... దానికిందే నలిగిపోతున్నంతగా.”

    నాన్న పోయాక అమ్మ మౌనంగా పాత ఇంటికి చేరింది. అమ్మ వెనక మేమూ నడిచేము. అక్కడ ఎప్పటిలాగానే పాత జీవితం గడిపాము. ఆ వూరు మళ్లీ అక్కున చేర్చుకుంది. అప్పుడే తెలిసింది. చినుకు రాలడం పండగని. నేల దున్నడం పండుగనీ. విత్తునాటడం పండుగనీ. మొక్క మొలకెత్తడమే పండుగనీ. పువ్వు పూసి కాయ కోయడమే పండుగనీ. పండుగ ప్రతి కదలిక లోనూ ప్రకృతి తో కలిసి నడుస్తున్నామని అప్పుడే తెలిసొచ్చింది. నేను అడవి మనిషి ననీ... తాతే నా సంస్కృతని అప్పుడే తెలిసింది.

    ఇన్నాళ్లూ... నా వాళ్ల అమాయకత్వాన్ని, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మాపై మరకల్ని అంటిస్తున్నదెవరు? నన్ను నా నుంచి ... నా సంస్కృతి నుంచీ దారి మళ్లిస్తున్నదెవరు? నా సంస్కృతికి మూలాధారమైన నా భాషని మతం కోసం హైజాక్ చేస్తున్నదెవరు? అసలు మతమెందుకు? అది మనిషికి అవసరమా??

    ---------------------------------------------------

    'రాబర్ట్.... రాబర్ట్ విల్సన్ ఎవరయ్యా? ఎన్ని సార్లు పిలవాలి నిన్ను? ఎక్కడికి వెళ్లేవు? పేరు మార్చుకోడానికి గెజిట్ అప్లై చేసింది నువ్వేనా?” అని కలెక్టరు గారి దఫేదారు అడుగుతున్నాడు.

    “ఔనండీ” అని లోపలికి వెళ్లేను.

    ఇప్పుడు చెబుతున్నా.... నా కొండ కొనకు పూచిన సూర్యుణ్ణి డప్పుగ చేసి దరువుల వరుసల్ని మార్చి మార్చి కొట్టి చెపుతున్నా నా పిన్నల కర్ర పాటల్లోంచి... 'టిల్లకాయ' ధ్వనుల్లోంచి.... నా థింసా అడుగుల చప్పుళ్ల లోంచి... గొంతుని 'గొగోయ్' గా మార్చి చెబుతున్నా...

    " నేను మానవుణ్ణి

    నేను ఆదివాసీని

    నాకు మతం లేదూ....

    నా పేరు సొంబరా” అని.

    (ప్రజా ప్రభాతం -నవంబర్, 2013)

    *గ్రీవెన్స్ - ప్రతి సోమవారం ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తీర్చడానికి ITDA వారు నిర్వహించే సమావేశం.

    *గుర్రం పండేసుకోడం - పిల్లలను భుజాన వేసుకోడం.

    *పిన్ల కర్ర - వేణువు

    *ఎజ్జోడు - గ్రామపూజారి.

    *కానికు పొయ్యడం - మంత్రాలు చదవడం

    *జీలుగు - జీలుగు చెట్టు నుంచి తీసే కల్లు.

    *బియ్యం నెరపడం - బియ్యాన్ని చేతి వేళ్ళతో చేటంతా విస్తరింపచేయడం.

    *వాస - వరుస , వీధి

    *కిన్నెర, గొగోయ్ - తీగ వాద్యాలు

    *టిల్ల కాయలు - గజ్జెల లాంటి వాయిద్యం.

    *తుండు కుండ - చర్మ వాయిద్యం, డప్పుకి తోడు.

    *సవర - సవరల భాష.

    *** 'గురి' సంకలనం కొనడానికి పల్లవి పబ్లికేషన్స్ - వెంకట నారాయణ గారిని క్రింది అడ్రస్/ఫోన్ ద్వారా సంప్రదించండి.

    పల్లవి పబ్లికేషన్స్, సాయి టవర్, మొగల్రాజ పురం, రఘురామ స్ట్రీట్ , విజయవాడ - 10.

    వెంకట నారాయణ గారి మొబైల్ : 098661 15655

    BGM credits:Kanmani Anbodu Kadhalan Piano Cover - Jingleman Cover #11 (https://www.youtube.com/watch?v=LSolsKyf6Vs)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    27 min
  • పి.రామకృష్ణ గారి కథ - 'దయ్యం'

    

    'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పీ. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.

    ఇంత చక్కటి కథను హర్షణీయం ద్వారా అందించడానికి, అనుమతిని ఇవ్వడమే కాక, కథ పై హర్షణీయం చేసిన వ్యాఖ్యకు స్పందిస్తూ , కథా నేపధ్యం గురించి, ఆడియో ద్వారా వివరించిన శ్రీ.రామకృష్ణ గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.

    రామకృష్ణ గారి సమగ్ర సాహిత్యం కొనేటందుకు కావలసిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

    ఉపోద్ఘాతం:

    ‘భయం’ అనుభవించని మనిషిని , ఊహించడం కష్టం.

    మన భయానికి  కారణం - ఒక మనిషి కావచ్చు, ప్రత్యేకమైన వాతావరణం  కావచ్చు, ప్రదేశం  కావచ్చు, లేదా అప్పటి మన మానసిక స్థితి కావచ్చు.  

    భయపడుతున్న పరిస్థితుల్లో ,   తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి  మన  జీవితాలని విపరీతంగా ప్రభావితం చెయ్యవచ్చు. నెగటివ్ గా కానీ , పాజిటివ్ గా   కానీ. 

    'భయాన్ని దాటడమే జ్ఞానం' అన్న గొప్ప విషయాన్ని , తేలికైన తేట తెలుగులో మనకు వివరిస్తారు ప్రసిద్ధ కథకులు , విమర్శకులు , పాత్రికేయులు శ్రీ. పి. రామకృష్ణ గారు, తాను రచించిన 'దయ్యం అనే ఈ కథ ద్వారా.

    కథలో ముఖ్య పాత్రలు ఒక పల్లెటూరిలో ప్రభుత్వ పాఠశాల లో పని చేసే ఒక ఉపాధ్యాయుడు (ఆయనే కథకుడు) , ఆయన క్లాస్ లోనే చదువుకునే ఒక బీద విద్యార్ధి, ఆ విద్యార్ధి తల్లి .

    కథలోకొస్తే -

    ఒక రాత్రి,  కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో , కథకుడైన టీచరు గారు,  పక్కనున్న పట్టణం నుంచి , పల్లె కి నడిచి రావాల్సి వస్తుంది,  మధ్యలో వున్న పొలాల గుండా.  

    వాతావరణాన్ని , కథ మొదట్లో  అందంగా ఆహ్లాదంగా  ఉందని వర్ణిస్తారు రచయిత.

    ఆ నడిచే  దారి ఆయనకు కొత్తదేమీ కాదు. అలాగే రాత్రి పూట పొలాల వెంబడి నడక గూడా టీచరు గారికి  అలవాటు లేని విషయం కాదు.

    నడుస్తూ వున్నప్పుడే, అంతర్మధనం మొదలౌతుంది  ఆయనకు.  తన  జీవితంలో అప్పుడున్న పరిస్థితులూ, ఎదుర్కొంటున్న చికాకులూ , నిరాశ చెందే విషయాలూ అన్నీ గుర్తుకొస్తాయి.   కథకుడి మానసిక పరిస్థితి ,  పూర్తిగా  మనకు అవగతమౌతుంది.

     ఇట్లా  అతను నడుస్తూండగానే  , తన పాత్ర  మానసిక పరిస్థితిని, సూచిస్తున్నట్టుగా,  వాతావరణం మారిపోతుంది. చీకటి కమ్ముకుంటుంది . ఉరుములూ మెరుపులూ మొదలౌతాయి. 

    వూరికి వెళ్లాలంటే 'దయ్యం మాను' అనబడే   ఒక చింత  చెట్టుని దాటుకు వెళ్ళాలి.  ఆ దయ్యం మాను గురించి వూళ్ళో వాళ్ళు చెప్పుకునే కథలూ....... ఆ చెట్టుని అంటి  పెట్టుకుని వుంది,  అని అందరూ అనుకునే, ,  చనిపోయిన అంకమ్మ, తన దగ్గర క్లాసులో చదువుకునే అంకమ్మ కొడుకు పది పన్నెండేళ్ల గొల్ల పాపయ్య, వాళ్ళ వికృతమైన రూపాలు   ఇవన్నీ గుర్తుకొస్తాయి.

    ఎన్నోసార్లు ఆ మానుని నిర్భయంగా దాటుకుంటూ వెళ్లిన,  ఆయనకు   మనసులో ఒక  చిన్న సందేహం మొదలౌతుంది. 

    చెట్టువైపు నించి ఏడుపు వినబడడం మొదలౌతుంది.

    వింటున్నది చూస్తున్నది నిజమా , కాదా అనిపించి ఆ సందేహం ,  పెనుభూతంగా మారి మనసూ , వొళ్ళూ,  అంతా  ఆవరిస్తుంది.

     సరళమైన పదాలను  వాడుకొని  అద్భుతమైన   వాక్యాలను సృష్టించి,   కథా నిర్మాణం  చేశారు రామకృష్ణ గారు. 

    ఈ రీతిలో , కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకువెళ్లి ఒక అద్భుతమైన ముగింపు ఇస్తారు రచయిత.

    కథ చివరలో టీచరుని,  స్టూడెంటుగా , స్టూడెంట్ ని టీచరుగా మార్చివేస్తారు రామకృష్ణగారు చాకచక్యంగా. 

    నిస్సదేహంగా 'దెయ్యం' తెలుగు కథాసాహిత్యంలో మనకు లభించిన, అత్యుత్తమ కథల్లో ఒకటి.

    దయ్యం:

    నేను రోడ్డు దిగేటప్పుడు సూర్యుడు పడమటదిగిపోయినాడు. పొలాలదారి వెంటనడుస్తున్నాను. విశాలమైన, పైరులేని సేద్యం చేసిన పొలాలు ప్రశాంతంగా వున్నాయి. నీలం రంగు ఆకాశం కింద దూరానికి కనిపించే నిశ్చల సముద్రం మాదిరి కనిపిస్తున్నాయి. కాళ్ళ కింద బండ్ల జాడలు ఏర్పరచిన గోతులు ఎండి పెళ్ళలుగా మారి చెప్పుల్లేని పాదాలను నొప్పిస్తున్నాయి. వారం రోజుల కిందట పెద్ద వర్షం కురిసింది. తేమ ఆరీ ఆరక ముందే రైతులు పొలాలకు ఎరువుతోలుకున్నారు. ఇప్పుడు ఎరువుతోలి సేద్యం చేసుకుంటే, ఈసారి వర్షానికి విత్తనం వేసుకోవచ్చని వాళ్ళ తొందర. ఒక్కవర్షం వృధా అయితే, ఎంత నష్టమో అది మెట్ట రైతుకే తెలుసు.

    ఈ వేళ పట్టణంలో చెప్పులు కొనుక్కోవాలనే ఆలోచనతో చార్జీలకు గాక పదిరూపాయలు ఎక్కువే జేబులో వేసుకున్నాడు. కానీ, పదిరూపాయలకు చెప్పులు కొనగలిగిన పరిస్థితి నుంచి దేశం చాలా 'అభివృద్ధి'ని సాధించిందని అర్థమయింది. ఎక్కడో ఉరిమిన శబ్దం ఆలోచనను కదిలించింది. ఈ వేళ పగలు ఎండ చాలా తీవ్రంగా వుంది. ఇప్పుడు ఉరిమింది (అది ఉరుమేనా? ఏదన్నా శబ్దమా?) ఇంకా రెండు మైళ్ళ పైనే నడవాలి. దారిలో వర్షమొస్తుందేమో, గొడుగన్నాలేదు. గొడుగు కొనాలన్న 'ఆశయం' కూడా వుంది. ఆ ఆశయం పుట్టినప్పుడు ఏడెనిమిది రూపాయలో సాధ్యమయ్యేది. ఇప్పుడు రెండు మూడు రెట్లకు కానీ సాధ్యమయ్యేట్టు లేదు. అవసరాలు తీరడమే గగనంగా వుంటే, ఆశయాలు తీరేదెన్నడు? చెప్పులూ, గొడుగూ ఇట్లాంటివి అవసరాలే. అవీ అందనంత ఎత్తుకు వెళ్తే ఆశయాలవుతాయి. నవ్వొచ్చింది.

    ఈ సారి స్పష్టంగా ఉత్తరం దిక్కున పుట్టిన ఉరుము తూర్పున సరిగ్గా పొద్దుపొడిచే ప్రాంతం దాకా పయనించింది. ఇంతవరకూ కనిపించనిమేఘాలు ఆకాశం అంచులనుంచి పైకి లేస్తున్నాయి. ఉరుము అనే పిడికిలి దెబ్బకు మేఘం తల బద్దలైనట్టు మెరుపు చీల్చుకుని పోయింది. చల్లని గాలి తాకుతోంది. ఖాయంగా వర్షమొస్తుంది. వర్షమొచ్చేలోపల ఇల్లు చేరుకోడమొక్కటే ఇప్పుడు 'ఆశయం'. వడివడిగా అడుగులేస్తున్నాను. దారి కనిపించని కనుచీకట్లు వ్యాపిస్తున్నాయి. ఇంతకు ముందటి కంటే ఎక్కువగా పాదాలు దెబ్బలు తింటున్నాయి. 

    తోడి టీచర్ను జిల్లా చిట్టచివర్న, గుట్టలనడుమ కట్టిన స్కూలుకు బదిలీ చేశారు విద్యాశాఖాధికారి. టీచర్ భార్య నిండుగర్భవతి, తల్లి గుడ్డిమనిషి, తండ్రి జబ్బు మనిషి, పుడు పనిచేస్తున్న ఊరు ఆయన స్వగ్రామం. కట్టుకొంటున్న కొంప సగంలో వుంది.

    విద్యాశాఖాధికారి యువకుడు, నా తమ్ముడి స్నేహితుడు. ఈ సంగతి తెలుసుకున్న -కోటీచర్, ట్రాన్స్ఫర్ కాన్సిల్ చేయించమని తగులుకున్నాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా అని పరిస్థితి చూసి మెత్తబడ్డాను. అటు మాతమ్ముడినుంచీ డి.ఇ.వో.గారికి ఉత్తరం వచ్చిన తర్వాత, ఈ యన్నుతో డ్కొని సమ్ముఖాన వినిపించడానికి వెళ్ళాను. కాన్సిల్ అయినట్లు త్వరలో తెలియజేస్తామన్న డి. ఇఓ. గారికి కృతజ్ఞత తెలిపి బయలుదేరాము. నేను బస్సెక్కి కూర్చున్నా. అతను కిందనే వుంటే “రావా?” అనడిగాను. 'రాత్రికి వుండి సినిమా చూసొస్తా అని నసిగాడు. సమస్య తీరింది. ఇక సరదా తీరాలన్నమాట. ఏమనుకున్నాడో “మీరూ వుండండి, ఇప్పుడేం పోతారు? ఊరుచేరేసరికి రాత్రవుతుంది. అర్లీ మార్నింగ్ బస్సుకే వెళదాం” అన్నాడు. “కాదులే, నే వెళ్తా" అన్నాను.

    ఇట్లా పొలాల్లో రాత్రిళ్ళ నడవడం నాకు మంచి అనుభవంగా వుంటుంది. పట్టణానికి వెళ్ళినప్పుడు, కావాలనే ఆఖరి బస్సులో వస్తాను. ఎక్కడో కప్పఒకటి గొంతు నరాలు తెగిపోతాయన్నంత బిగింపుతో, బిగించిన తంత్రుల మీద బలంగా నిదానంగా మిటి నట్టు అరిచింది. దారిలోకి సాగిన ఏదో చెట్టు కొమ్మన కూచోనున్న పిట్ట ఒకటి బుర్రున ఎగిరిపోయింది. దాని రెక్కల శబ్దంతో పాటు నాగండె లయగా టపటపా కొట్టుకుంది. పిట్ట ఎగిరిపోతే బెదిరిపోయినానా? దూరాన వర్షం కురుస్తున్నట్టు తేమగాలి తాకుతోంది.

    ఈ సారి పెద్ద తీగె మెరుపు! ఎంత అద్భుతంగా వుంది! ఎందువల్లనో యీ అద్భుత దృశ్యాన్ని స్థిమితంగా చూసి ఆనందించలేకపోతున్నాను. వర్షం వస్తుంది, తడిసిపోతాను.... అన్న భయం కారణమేమో! మెరుపు వెలుతుర్లో అంతదూరంలో పక్కనున్న చింతచెట్టు కనిపించింది. నాలో ఇంతవరకూ వున్న అస్థిమిత సంచలనానికి కారణం తెలిసినట్టుయింది. ఆ చింతచెట్టును 'దయ్యంమాను' అంటారు. చుట్టుపక్క ఊళ్ళలో ఎవరికైనా దయ్యాలుపడితే, మంత్రగాళ్ళు విడిపించి.. యీ చింత చెట్టుకు మేకు కొట్టి దయ్యాన్ని ఇందులో వుంచి పోతారట! ఈ చింత చెట్టు చిగురుకానీ, కాయలు కానీ ఎవరూ కోసుకోరుభయంతో. అంకమ్మ ఒక్కతే నంట ఈ చెట్టు చిగురుకోసి అమ్ముకునేది. -

    మొదట్లో, అంకమ్మ ఈ చెట్టు చిగురు కోసితెస్తే, కొనడానిక్కూడా భయపడేవాళ్ళట. తర్వాత్తర్వాత భయం తగ్గింది. “దయ్యం మానుసిగురుగదూ, బలేరుసిగా పుల్లగా, తియ్యగా వుంటాదిలే, పప్పులో పెడే దయ్యం పట్టినట్లు తినాల్సిందే” అని నవ్వించే దంట అంకమ్మ. ఆఖరికి అంకమ్మ యీ చెట్టు మీదనుంచే పడి చచ్చిపోయింది. 'దయ్యం మాను' భయం మరింత పెద్ద మానయింది. అంకమ్మను దయ్యమే సుడిగాలి రూపంలో చెట్టు మీద నుంచీ తోసేసిందట. చెదరిపోతున్నభయం మళ్ళీ యీ వదంతుల్లో చిక్కబడి, యీ చింత చెట్టు దగ్గరికి ఎవరూ రాకుండా పోయినారు. “మా వానికి పెద్దగా సదువు సెప్పుసోమి! నీరుణం ఎట్టనోకట్టతీర్చుకుంటాను” అనేది అంకమ్మ కనిపించినప్పుడల్లా,

    తను టీచర్‌గా యీ వూరికొచ్చి, బడిలోకి అడుగు పెడుతూనే... పిల్లల్లో అంకమ్మ కొడుకే ముందు కనిపించింది. వాణ్ని చూసి కొయ్యబారిపోయినాడు. ఎంత వికారంగా వున్నాడో! తలకాయ వాడి శరీరానికి మించిన సైజులో, ఏదో ముడిమొద్దు పెట్టినట్టుగా వుంది. అసలు వాని శరీరం పెరక్కుండా వుండడానికి అంత పెద్ద తలను పెట్టినట్లుగా వుంది. ఆ తలకాయ కూడా ఎట్లుంది? గుండ్రంగా లేదు. మాను తోలి చదరం చేసిన మడికయ్య మాదిరుంది. వెంట్రుకల్లేవు. మడికయ్యలో వుండే బురదకు బదులు వాడితలమీద జిడ్డు కారుతూ ఆముదం వుంటుంది. తెల్లగా పెద్దవిగా వున్నకళ్ళు కూడా వాడికి వికారాన్నే ఇచ్చాయి. గుండీలు లేని చొక్కాకింద, రొమ్ము కనిపిస్తోంది. అది పిల్లవాడి రొమ్ముకాదు. నొక్కులు పడిన డొక్కు సత్తుడబ్బా మాదిరుంది. వాన్ని చూడటమే కష్టం, చూస్తే, చూపుమరల్చు కోవడమూ కష్టమే. పిల్లల హాజరువేస్తున్నప్పుడు వాడి పేరు గమనించాడు. జి.పాపయ్య, 'జి' అంటే మరేంలేదు... 'గొల్ల పాపయ్య'. కులం పేరే ఇంటి పేరు. కొంచెం జ్ఞానం వున్న టీచరెవరో... 'జి.పాపయ్య' అని రాసారు. పాఠం చెబుతున్నప్పుడు కూడా వాడిమీద అతుక్కుపోయే చూపుల్ని లాక్కుని... ఆ మూలకూ, ఈ మూలకూ, వాకిలి వైపూ విసరేస్తూ వుండగా...

    వాకిలి వద్ద ఏదో గ్రామదేవత వెలిసినట్టు ఆమె. నెత్తిమీద పేడతో పూసి అలికిన దబ్బలబుట్టవుంది. ఆ బుట్టనామె చేతుల్తో పట్టుకోలేదు. చేతుల్తో... ఆకులకు సున్నంరాయడమూ, మడిచి నోట్లో పెట్టుకోవడమూ, ఇటువంటి పని చేస్తోంది. ఎత్తుగా, బలంగా ఇనుప అవయవాల్లో వుంది. చీరెమోకాళ్ల దాకా పైకి పీకి,

    గోచీ పెట్టుకుంది. (చింత చెట్టు ఎక్కినప్పుడు గోచీ పెట్టుకుంటుందని తర్వాత తెలుసుకున్నాను). ఒకకాలికి ఒకరకం చెప్పు, ఇంకోకాలికి ఇంకోరకం చెప్పువున్నాయి. నేను ఆమెవైపు చూస్తున్నాను. ఆమె ఎవరివైపూ చూడలేదు. ఆమె నోరు దారుణంగా తాంబూల చర్వణం చేస్తోంది. మిగిలిన తమలపాకుల్ని మూసింది. దిండుమాదిరి చుట్టిన చీరకట్టులో దాచి, చూపుడు వేలికి మిగిలిన సున్నాన్ని వాకిలితలుపుకురాసి... అప్పుడు తలెత్తింది. క్లాసులో వున్న పిల్లలు ".... రే.. తోలుగా మీ అమ్మ" అని కేకేసినారు. వాడు.. ఆ గురుమస్తకుడు లేచినాడు. వాడునడుస్తున్నప్పుడు ఇంకా వికారంగా వున్నాడు. కాళ్ళలో ఎముకలు లేనట్టు వంగిపోతాయేమో అనిపించేట్టు, రబ్బరు గొట్టాల్లాగున్నాయి. పాదాలు వెడల్పుగా అరిగిన చెప్పుల మాదిరి ఉన్నాయి. మొత్తం మీద శరీరంలో ఎముకలే లేనట్టు తోలుబొమ్మ మాదిరున్నాడు.

    అందుకే నేమో పిల్లలు వాన్ని 'తోలుగా' అన్నది.

    ఆమె ప్రశ్నలు వేస్తోంది. వాడు తలూపుతున్నాడు. "సద్దితాగినావూ?” “ఊ...." (తల ఊపు). “మజ్జిగ కనుక్కున్నావా?" "ఊ..." (తలూపు), "సద్దివుందా? అయిపోయిందా? ఊహూ!(తల ఊపు అడ్డంగా).

    వాడు సద్దితాగడమూ, మిగలడమూనా...! అనుకున్నాను. ఆ ప్రశ్నలడుగుతూనే ఎడంపక్క రొండిలోంచి ఏదో నాణెం తీసి, వాడి జేబులో వేసింది. - నడుంచుట్టూ చీరెలోనే అరలేర్పరచుకుని, ఒక్కోరకం సంపదనూ దాచుకున్నటుంది. వాడు క్లాసులోకి వస్తుండగా... "రే అబ్బిగా” అని కేకేసింది. వాడు ఆగినాడు. “మీ నాయినొచ్చినాడా?” “రాలా...” “యాడసచ్చినాడో, సరేలే నువ్వుపో” తుపుక్కున వూసి అంత సిగురమ్మో..." అని కీచుగొంతుతో అరుచుకుంటూ పోయింది. మగవాడికి ఆడవేషం చేసినట్లున్న ఆమెకు అంత కీచుగొంతా? అనిపించింది. సరే... ఆమె గొంతు సంగతి అట్లావుండనీ, నేనెంత నిమిత్తమాత్రున్ని అయిపోయినానోతల్చుకోగానే, ఆమె మీదా, ఆమె కొడుకు మీదా కోపమొచ్చింది. ఉపాధ్యాయుడనే వాడిని నేనొకడినుండగా, ఆమె రావడమేమిటి? వచ్చెనుబో... నన్నడక్కుండా వాన్ని పిల్వడమేమిటి? పిల్చెనుబో, వీడు నాతో చెప్పకుండా పోవడమేమిటి? క్లాసులో పిల్లవెధవలైనా తోలుగాడి అమ్మకిచ్చిన గుర్తింపు తోలు బొమ్మమాదిరికుర్చీలో కూర్చునున్న టీచర్ కివ్వకపోవడమేమిటి? అంటే, ఇదికూడా మామూలుగా జరిగేదిగా మారిందన్న మాట. క్లాసులోకి అడుగుపెడుతూనే వాడు కనిపించడం, వాడి అమ్మ ఇట్లా చెయ్యడం... నాకు చిరాకు పెరిగింది. వాన్ని లేపి, కేకలేశాను. నన్నడక్కుండా క్లాసులో నించీ లేవకూడదని అందర్నీ హెచ్చరించాను. అట్లా చేస్తే 'తోలువలుస్తా'నని చెప్పాను. తోలుగాడిని చూసినాక 'తోలు' నాకు పట్టుకుందేమో ననిపించి నవ్వొచ్చింది.

    ఆ తర్వాత మూడు నాల్గురోజులు ఆమె స్కూలు దగ్గరికి రాలేదు. 'ఇక రాదులే' అనుకుంటూండగా ప్రత్యక్షమయ్యింది. అయితే, ఆమె వైఖరిలో మార్పువచ్చింది. “సోమి! మా పిల్లగాన్నిట్టా పంపుదురూ” అని వినయంగా అడిగింది. ఇంతకుముందు ఆమె ప్రవర్తన తప్పని ఎవరూ చెప్పకపోవడం వల్లనే, ఆమె అట్లా చేస్తూ వచ్చిందని అర్ధమయింది. నేను వెళ్ళు' అన్న తర్వాతనే పాపయ్యకూడా వెళ్ళినాడు. దాన్తో, క్రమశిక్షణను నెలకొల్పగలిగానన్న గర్వంతో పాటు, ఉభయపక్షాలూనన్ను గుర్తించాయన్న సంతృప్తి కలిగింది. అది నా భ్రమేనని మరా వారానికి అర్థమయింది. పాపయ్య అమ్మ అంకమ్మ రోజూ రావడమూ, తల్లి కొడుకూ నా పర్మిషన్ అడగడమూ... ఇదితంతుగా మారింది. ఆమె ఎట్లాగూ రావడం తప్పనప్పుడు,

    అనుపట్లాగూ ఒప్పుకోక తప్పనప్పుడు... ఈ అనవసరశ్రమ ఎందుకు? ఇంతకు ముందటి టీచర్లక్కూడా ఇట్లాగే అనిపించి, వాళ్లిద్దరికి స్వేచ్ఛనిచ్చి వుండవచ్చు. దాన్తో... క్రమశిక్షణను నెలకొల్పానన్న గర్వం కరిగిపోయింది. సాయంత్రం వరకూ ఇల్లు చేరుకోలేని ఒక తల్లి, తన కొడుకు అన్నం తిన్నాడో లేదో కనుక్కోరాదనేంత కఠినంగా ఎట్లావుండగలను?

    ఒకరోజు బాగా ఆకలేసి, ఇంటికి చేరుకున్న రోజున చింతచిగురు వేసిన పప్పూ. అన్నమూ తిన్నాను. బ్రహ్మాండంగా వుందనిపించింది. ఆ తర్వాత చింతచిగురుపప్పు తరుచూ కనిపించేది. చింతచిగురు పప్పు నాకిష్టమే. కృష్ణదేవరాయలకే అది ఇష్టంగా వుండినట్టు తెలుస్తోంది. అయితే, మాత్రం రోజూ ఎక్కడ తినగలం? రోజూ తినమంటే, ఆయన కూడా ఆ పప్పును గురించి పద్యం చెప్పక పోవునేమో! “ఏం చేసేది? అంకమ్మ రోజూ వద్దన్నా పోసిపోతుంది. కాయగూరలేం లేక నేనూ చేస్తున్నాను” అంది గృహిణి. అంకమ్మ నా 'రుణం' ఇట్లా తీర్చుకోవాలనుకుంటూందేమో! అంకమ్మ భర్త రైతులకు, సేద్యం పనులకు పోతుంటాడు. వాళ్ళు గింజలేస్తే, అవితీసుకుని అట్లానే సారా కొట్టుకుపోతాడు. అంకమ్మ రైతుల ఇళ్ళలో ధాన్యందంచీ, విసరీ, ఒక్కోసారి పేడారొచ్చు ఎత్తిపోనీ... తననూ కొడుకునూ బతికించుకొంటోంది. పొలాల్లో మగవాళ్ళు చేసేపనీ, ఆడవాళ్ళు చేసేపనీ చేస్తుంది. వర్షాకాలంలో, పొలంపని లేని రోజుల్లో చింతాకు కోసి అమ్ముతుంది.

    పటపట చినుకులురాలేటప్పటికి గమనించి చూస్తే, దయ్యంమాను కెదురుగ్గా దారిలో వున్నాను. వర్షం రానే వచ్చింది. వస్తుందని తెలిసిన పది నిముషాలలోపలే, వచ్చిపడింది. కానీ తనమనస్సులో అంకమ్మ పరిచయానికి సంబంధించిన పూర్వాపర జ్ఞాపకాలన్నీ తిరిగినాయి. అందుకే దీన్ని 'మనోవేగం' అన్నారుగావాల. మెరుపుల్లో చింతచెట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఆ చెట్టును దాటేసి పోబోతున్నానంటే, ఏదో గుండెలో కొంచెం అదురుపాటుగా అనిపించింది. ఇంతకు ముందు ఈ దారిలో వచ్చినప్పటికే ఇక్కడ దయ్యముందన్నపుకార్లు వుండేవి. అప్పుడెప్పుడూ ఇట్లా అనిపించలేదు. ఇప్పడెందుకని పిస్తోంది? ఆ దయ్యాలెవరూ తనకు తెలీదు, ఈ దయ్యం తనకు తెలుసు. అందువల్లనేనా? ఛీ! ఛీ! ఏమిటీ మూఢనమ్మకం! వడిగా నడిచాను. ఇంతవడిగా ఎందుకు నడుస్తున్నాను? భయంవల్లనేనా? భయమేమీ లేదని నాకు నేను చెప్పుకోడానికన్నట్టు ఆ చెట్టు కేసి చూసినాను. అది చింతచెట్టు, దయ్యం మానుకాదు. ఇంతలో మళ్ళీ మెరుపు. చెట్టుకింద...! ఒళ్లు ఝల్లుమంది. అంకమ్మ దయ్యమయింది. నిజమేనా? అయితే, అక్కడ కనిపిస్తున్నది పిల్లవాడి ఆకారం.

    పిల్లవాడి ఆకారంలో వున్న దయ్యమేమో! లేకపోతే, ఇంతరాత్రి, యీ వర్షంలో మనుషుల పిల్లవాడొక్కడూ ఎందుకుంటాడక్కడ?

    పరిగెడదామనుకున్నాను. పరిగెత్తితే దయ్యం గమనించి వెంటపడుతుందేమో! ఎప్పుడెప్పుడో విన్న దయ్యాల కథలన్నీ కమ్ముకున్నాయి. నిశ్శబ్దంగా దాటుకుని తర్వాత అతడమా! ఏడుపు వినిపిస్తోంది. అమ్మా! అమ్మా! అంటున్నట్టుంది. చెట్టుదగ్గరున్న పిలవాడేనేమో ఇదంతా దయ్యం ఎత్తుగడేనేమో! నా గుండె ఆగిపోతుందేమో ననిపించింది. ఎవరూ తోడులేకుండా, ఈ రాత్రి ఈ దారినరావడం పొరపాటేమో! ఒకసారి చుట్టూ చూశాను, ఆకాశం కేసిచూశాను. ఎందుకనో నాబెదురు అర్థం లేని దనిపించింది. ఈ ప్రకృతిలో, యీ పరిసరాల్లో ఏదీకూడా నన్ను భయపెట్టాలన్న ఉద్దేశంతో లేవనీ, పైగా భయపడుతున్నందుకు జాలిపడుతున్నాయనీ, 'భయమెందుకూ?' అంటూ సముదాయింపజూస్తున్నాయని అనిపించింది. కుదించుకపోతున్న నన్ను నిటారుగా నిలబెట్టుకున్నాను. చెట్టుదగ్గరికి పోయి చూడాలనుకున్నాను. అటువంటి ధైర్యం చూపగలిగి నందుకు నామీద నాకు గౌరవం కలిగింది.

    వెంటవెంటనే కళ్ళార్పినట్టు మెరుపులు. ఎవరు... ఎవరు? “పాపయ్యా" ప్రకృతి ధ్వనించింది. “ఈ వేళప్పుడు..... ఇక్కడ...." నాకు ఉద్వేగంతో మాటరాలేదు. వాడు ఏడుపు అందుకున్నాడు. వీపున చెయ్యేసి రాస్తున్నాను. మెల్లిగా నాకాన్చుకుని దారిలోకి నడిపిస్తున్నాను. నా చేతికింద వాడి శరీరం వెక్కిళ్ళతో ఎగసిపడుతోంది.

    "ఈ వేళప్పుడు ఇక్కడి కెందుకొచ్చినావు?” ఇప్పటికి పూర్తి ప్రశ్నను వేయగలిగాను.

    “మా అమ్మ కనిపించలేదు. మా అమ్మ దయ్యం కాలేదు. వట్టిది ఎంతసేపు కూచున్నా కనిపించలా”

    నాకేదో అర్ధమౌతోంది. వాడిచుట్టూ నా చేతులు బిగిసిపోతున్నాయి. ఏడుపు ఊపుకి వాడు కదిలిపోతున్నాడు.

    “మా అమ్మ..." ఈ సారి మాటపూర్తి చెయ్యనీకుండా వాడిని హత్తుకున్నాను.

    నా గుండెలమీద వాడి కన్నీరు! వాడి పెద్ద తలమీద ఒకటి రెండు నాకన్నీటి చుక్కలు. ఇంతకు ముందు వాడిని చూడటానిక్కూడా అసహ్యించుకున్న సంగతి అప్పుడు జ్ఞాపకమేరాలేదు.

    (24-4-75 'ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం)

    *** పుస్తకం క్రింది లింక్ ద్వారా కొనవచ్చు.

    https://www.logili.com/novels/p-ramakrishna-rachanalu-p-ramakrishna/p-7488847-32580481781-cat.html#variant_id=7488847-32580481781

    • BGM credits:Kanmani Anbodu Kadhalan Piano Cover - Jingleman Cover #11 (https://www.youtube.com/watch?v=LSolsKyf6Vs)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    29 min
  • 'నేతి గారెలు' కథ , కథానేపధ్యం - ఆచార్య కొలకలూరి ఇనాక్

    హర్షణీయంలో ఈ ఎపిసోడ్లో మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘నేతి గారెలు ’. ఇది వారి ‘మనూళ్ళల్లో మా కథలు ’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.

    ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత, ఆడియో చివరన కథా నేపధ్యాన్ని ఆచార్య ఇనాక్ గారు స్వయంగా మనకు వివరించటం.

    సంకలనంలోని కథలన్నీ ఆయన బాల్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా, వారు రాసినవి.

    కథలన్నీ కూడా డెబ్బయి ఏళ్ల క్రిందటి గ్రామీణ జీవితాన్ని వివరిస్తూ, అప్పుడున్న సామాజిక పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాయి.

    తమ రచనను హర్షణీయం ద్వారా అందించడానికి అనుమతినిచ్చినందుకు, కథా నేపధ్యం , హర్షణీయం శ్రోతలకు అందించినందుకు ఆచార్య ఇనాక్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

    డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారామీరు వినవచ్చు. అప్పుడు మరిన్ని వివరాలు వారి రచనా జీవితాన్ని గురించి తెలుసుకోవచ్చు.

    ‘మన ఊళ్ళల్లో మా కథలు’ కథాసంపుటి ప్రతులకు సంప్రదించండి -

    జ్యోతి గ్రంథమాల

    4-282, యన్ యస్ నగర్

    మీర్ పేట్, హైదరాబాద్ - 500 097.

    ఫోన్: 94402 43433

    నేతి గారెలు:

    మా వూరు వేజండ్ల. అప్పట్లో గుంటూరు తాలూకాలో, ఇప్పుడు చేబ్రోలు మండలంలో ఉంది. మా వూరు రెండు భాగాలు. రైలు కట్టకవతల ఊరు, ఇవతల పల్లె. పల్లె వాళ్ళల్లో కొందరు, ఊరివాళ్ళ ఇళ్ళల్లో జీతగాళ్ళు.

    గమిని శ్రీరామయ్య గారింట్లో మా నాయన పెద్ద జీతగాడు. పొద్దు పొడవక ముందు ఇల్లొదిలి వెళ్ళేవాడు. పొద్దుమునిగాకే వచ్చేవాడు.

    నాకప్పుడు ఎనిమిదేళ్ళు, చెల్లెలికి నాలుగు, తమ్ముడికి కొన్ని నెలలు. మా నాయన్ని చూసిన రోజు మాకు పండగ..

    నేనప్పుడు మాపల్లె బడిలో మూళ్ళోకొచ్చా. తెలుగు వాచకం కొత్త వాసనింకా పోలా. 

    అప్పుడు శ్రీరామయ్యగారి చిన్నజీతగాడు పెదోడై, పెళ్ళె వెళ్ళిపోయేడు. గొడ్డుగాసే బుడ్డో డొకడు, మా దొరగారికి కావలసి వచ్చేడు. 'మీ బుడ్డాణ్ణి మా గొడ్డకాడ బెట్టరా' అని దొరగారు మా నాయనతో అన్నాడు. మా నాయన 'సరే' నన్నాడు

    మన పెద్దోణ్ణి దొరగారి గొడ్డ గాయటానికి పంపుదా'మన్నాడు మా నాయన మా అమ్మతో.

    మా అమ్మ వద్దంది. 'సదూకోనీయ్' అని అంది. అట్టా కాదన్నాడు మా నాయన. మా అమ్మ 'అదిగాదు' అంది. మా నాయన మొండికి తిరిగాడు. మా అమ్మ తండుకేసి కూసుంది. 'నా మాటపోద్ది” అన్నాడు మా నాయన. “ఆడి సదూ సెడుద్ది” అంది మా అమ్మ. ఆళ్ళూ ఈళ్ళూ పోగయ్యారు, సర్దుబాటు చేశారు.

    ఎప్పటికయినా కూలో నాలో చేసుకు బతకాల్సినోళ్ళమేగా. ఎప్పుడో ఎందుకు ఇప్పుడే సేరనీ' అన్నారు.

    ఆడగూతురు, అమ్మ ఏం జేసుద్ది? పెనిమిటిని కాదంటదా? అన్నలమాట పెడచెవిని పెడతదా? ఏడుస్తూ కళ్ళు తుడుసుకొంది.

    నన్ను పొద్దున్నే నిద్రలేసి, రెక్క పట్టుకొని లాక్కెళ్ళేడు మా నాయన ఊళ్ళోకి, దొరగారి సావిట్లోకి, గొడ్లకాడికి. నాకేడుపు ఆగలేదు.

    సదూకుంటా' నన్నాను. 'ఏడిసేవులే!” అన్నాడు మా నాయన. ఏడుస్తానే ఉన్నాను. పలకా బలపం, తెలుగువాచకం, ఎక్కాల పుస్తకం, సంచీ ఏడుస్తున్నట్టు అనిపించింది.

    పొదున్నే లేవాలి. ఊళ్ళోకి పోవాలి. గొడ్డకాడి కసువు పేడ వేరువేరుగా తీయాలి. అవన్నీ ఊడవాలి అప్పుడు బూసిమ్మ బువ్వ బెట్టుద్ది. ఆనక గొడ్డు దోలుకు పోవాలి. బూసిమ్మకూ, నాకూ, మంచిమాలిమి

    ఆమె మాట్లాడకుండా బువ్వ పెట్టదు. నేను మాట్లాడకుండా తినకూడదు. బూసిమ్మ అంటే శ్రీరామయ్యగారి భార్య. దొడ్డ ఇల్లాలు. పెట్టు పోతల్లో పెద్దసేయి. ఎముకల్లేని సేయి. ఆమెకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రాధాకృష్ణయ్య. కమ్యూనిష్టని పెద్ద పేరు. పెళ్ళయింది.

    రెండో దొర రాఘవయ్య. పెళ్ళీడు కొచ్చేడు. పెద్ద పెడసరపు యవ్వారం. మంచోడే! మూడో ఆయన రాజయ్య. గుంటూరు బళ్ళో సదూలు సదువుతున్నాడని గొప్ప పేరు. ఆ ముగ్గురిలో ఎవురూ గొడ్డు గాయరు. రాజయ్య నాకంటే నాలుగేళ్ళు పెద్దాడు. సదూకొంటున్నాడు. ఉన్నోడుగా, గొడ్డుగాయడు. నేను బడికి పోతున్నా, లేనోణ్ణిగా గొడ్డుగాయాలి. అందుకే జీతానికి కుదిరా.

    బువ్వకాడ బూసిమ్మకూ, నాకూ ఒకటే తంతు. 'ఎందుకురా మొడ్డుకుమల్లె అట్టా నిలబడ్డా, గిన్నె దెచ్చుకోకా?” అనేది. గిన్నె దెచ్చుకొని కూసుంటే 'నోరు లేదా మూగ సన్నాసీ అడగవేం?” అనేది. 'బూసిమ్మా! బువ్వ బెట్టవమ్మా!” అనేవాణ్ణి. 'ఏందిరా సచ్చినోడా బూతులు దిడతన్నా?' అనేది.

    శ్రీరామయ్యగారు కలగజేసుకొని 'ఆడేడ బూతులు దిట్టేడు దొరసానీ!' అనేవాడు. 'మరి ఆడా కూత కూయడే?” అనేది.

    అప్పుడు, 'దొరసానీ! బువ్వబెట్టు' అనేవాణ్ణి. 'ఏందిరా ముదనష్టపోడా ఆ అరుపులు, ఆగలేవా?' అంటూ గిన్నెలో కూడు కుమ్మరించేది. 'తినూ! దిక్కులు జూతావేం?” అని కసిరేది. 'కూరెయ్యవా' అంటే ఎక్కళ్ళేని కూడా, కూరా, కుమ్మూ,

    నీ ఎదానే కొడతంటిని. ఎందుకెయ్యనూ?” అని ఏసేది. 'ఆవగాయో, ఊరగాయో, పప్పో, రసమో ఏసి ఏం కడుపురా నీది, ఎంత దిన్నా నిండదు. ఏమేసినా వొద్దనవూ' అని నవ్వేది.

    నాకు వళ్ళు మండేది. ఏంజేయను? పెట్టేది ఆమె. తినేది నేను. ఆమె ఏం పెట్టినా తినాలి. ఏమన్నా పడాలి.

    'నువ్వు దిన్నట్టుగాదు, గొడ్డను కడుపునిండా మేపుకురా' అనేది. నేను తలూ వాణ్ణి. 'మొద్దు ముండా కొడకా, నోరు లేదా, ఊ అనవూ, ఆ అనవూ' అనేది. నేను 'అట్టాగేలే' అంటా గొడ్డు దోలుకు పోయేవాణ్ణి.

    శ్రీరామయ్యగారికి ఒక ఆవు. రెండెడ్లు, రెండు దున్నలు, నాలుగు పాడి బర్రెలు, రెండు సూడివి ఉండేవి. ఎడు, దున్నలు చేసే పని నాకు లేదు. పాడి బర్రెల దూడలు నాలుగూ పెయ్యలే! బర్రెల్ని దూడల్ని వేరు చేయటం నాకిష్టంకాదు. దూడలు నడవలేవు. సావిట్లోనే కట్టేసేవాళ్ళు. వేళా పాళా లేకుండా దూళ్ళు పాలు తాగేతే ఇంకా ఏమన్నా ఉందా? బూసిమ్మకు పాలు, పెరుగు, పేడ అమ్ముద్దని పెద్ద కీర్తి.

    బరిగొడ్డ పాలు దూడలు తాగేతే నాపనయి పోయిందే! అదేం చిత్రమోగానీ, ఏ బర్రె దగ్గరికి దాని దూడే చేరేది. పొద్దెక్కక ముందే గొడ్డు దోలుకుపోవాలి. గొడ్డుమేత మేసేచోటు, రైలుకట్ట రెండు పక్కలా ఏటవాలుగా ఉన్న తావు. బళ్ళకట్ట నుంచి ఒకటో తూముదాకా ఉన్న గడ్డికి శ్రీరామయ్య గారు హక్కుదారు.

    గొడ్డు రైలుకట్ట కటూఇటూ మేస్తూ, కట్ట దాటేటప్పుడు రైలోస్తే సావు. అదొక్కటే జాగరతగా ఉండాల్సిన పని.

    గడ్డి ఒత్తుగా పెరిగేది. నవనవలాడతూ ఉండేది. మంచుబొట్లు మెరుస్తుంటే చూడ ముచ్చటగా ఉండేది. గొడ్డు మలసబడ మేసేవి. ఎండాకాలం ఆ మేత గొడ్డపాలిట వరమే! ఎంతమేసినా తరిగేది కాదు.

    బరిగొడ్డు ఆశబోతువి. ఎంత తిన్నా ఆటికి ఆకలి తీరదు. కసాబిసా కలేసి, మెలేసి, నమిలేసి, పడుకొని నెమరేసేవి. బుద్ధిపుడితే కుంటల్లో నీళ్ళు తాగేవి. కడుపు నిండితే కట్టవారని కాళ్ళార జాపేవి. ఎంతలెగొట్టినా లేసేవి కావు. పొద్దు ఏటోలుతున్నప్పుడు అయ్యే లేచి ఇంటితోవ పట్టేవి. ఆటి నడక సోకే సోకు!

    తోవలో దేవళ్ళ చెరువులో దిగి. మునిగి, తేలి, నీళ్ళు తాగి, పుక్కిలించి, తోకతో వీపును బాదుకొని, ఆడుకొనేవి. బుద్ధి పుట్టినప్పుడు లేచి ఒడ్డెక్కేవి. అటుపోయేదాన్ని ఇటు మల్లేసి, గుంపుగట్టి, ఊళ్ళోకి సావిట్లోకి తోలుకొచ్చేవాణ్ణి.

    వాటిని గాటికాడ తలుగులకు కట్టిసి, ముందింత గడ్డేసి, వామి ముందు కుందుకూర్చునేవాణ్ణి. బూసిమ్మ వచ్చి పాలు పిండుకు పోయేది.

    దూడల్ని జూత్తూంటే నాకు ఉసూరుమనిపించేంది.

    పొద్దు పడమట మునుగుతున్నప్పుడు, గినె బువ్వబెట్టవమ్మా' అనేవాణ్ణి. ఏందిరా సచ్చినోడా, బూతులు తిడతన్నావనేది. 

    ఇది జీతగాడి దినచర్య.

    ఎడ్లను, దున్నల్ని పెద్ద జీతగాడో, దొరలో, తోలుకుపోయి పొలాల్లో మేపేవాళ్ళు  

    గొడ్డను తోలుకుపొయ్యేటప్పుడో, తోలుకొచ్చేటప్పుడో, నడవలేకో, ఉబలాటం వల్లనో, నాకు నాలుగుర్లా, బరిగొడ్డు మీద స్వారీ చేయాలని బుద్ధిపుట్టేది.

    మీదికెక్కటం మొదట్లో నాకు చేతనయ్యేది కాదు. ఎగిరి ఎక్కేంత ఎత్తులేను అందుకని బర్రె ఎనక్కాళ్ళ మీద కాళ్ళు పెట్టి తోక పట్టుకొని పైకెక్కి వీపు మీద మునేవాణ్ణి. బర్రె నడుస్తున్నప్పుడు పడతానని భయవేసి, వాటేసుకొని, వీపు మీద పడుకొనేవాణ్ణి. కొంత సులువు తెలిశాక కొమ్ములు పట్టుకొని కూర్చునేవాణ్ణి. వీలు చిక్కాక కుదురుగా కూర్చోసాగా.

    బర్రె నడక ఊపుకు నా నడుం ఊపుకు పొంతన కుదిరాక ఏం పట్టుకొనే పనిలేదు. దీవిగా కూర్చునేవాణ్ణి, దిక్కులు చూస్తూ దర్జా వెలగబెట్టేవాణ్ణి. ఇక బర్రెలగెత్తినా భయం లేదు. ఒక్కోసారి లగెత్తమని నేనే దాన్ని డొక్కల్లో తన్నేవాణ్ణి.

    గుర్రం మీద రాజకుమారుడు వెళ్ళే కథలు గుర్తుకు వచ్చినప్పుడు నేనే రాజ - కుమారుణ్ణని, నా బర్రె పంచకళ్యాణి గుర్రమని దిక్కులు చూసేవాణ్ణి.

    ఇదే ఏనుగు, ఇదే అంబారి, నేనే మహారాజునని, నా గొడ్డే నా సైన్యమని, మీసం తిప్పేవాణ్ణి. లేని మీసం! తిమ్మిరి దిగేసరికి గొడ్డు మేతకొంగేవి. లేకపోతే సావిట్లోకి చేరేవి.

    మహారాజునీ, యువరాజునీ, అయిన నేను అంతటితో జీతగాణ్ణి అయి పోయేవాణ్ణి.

    ఒకసారి నేను సూడి దాన్నెక్కి వస్తుంటే మా నాయన చూశాడు. లగెత్తుకొచ్చి, బర్రెనాపి, నన్ను దింపి నెత్తిమీదొకటేసి, 'నీకు సూడిదే దొరికిందిరా సన్నాసి' అన్నాడు. పిచ్చి ముఖంతో చూస్తుంటే అది సూడిదిరా గాడిద' అన్నాడు. 'అంటే?' అని నేనడిగితే 'నీ తలకాయ' అని మొట్టికాయ వేశాడు. ఏమైనా అడిగితే తిడతాడు, కాదంటే కొడతాడు. ఎందుకొచ్చిన గోల అని అడగటం మానేశాను.

    ఒక పాడి బర్రె నన్ను ప్రేమగా చూసేది. దాని దూడననుకొనేదో ఏమో నా వళ్ళు నాకేది. కొమ్ము విసిరేది కాదు. ఎత్తుకొంటా రా' అన్నట్లు చూసేది.

    చెయేతే కూసునేది. ఎక్కికూసుంటే లేచేది, బయలుదేరేది. బర్రె కూడా తలే! | దాని ముద్దూ మురిపం దానిది.

    ఒకరోజు నాకు జొరమొచ్చి జీతానికి పోలేదు. తంబళ్ళ మాధవయ్య గారు మాతర్లిచ్చి, పత్తేం చెప్పేడు.

    'రొండురోజులు బువ్వ పెట్టొద్దు, మజ్జిగ చాలు' అన్నాడు. మా అమ్మము కాడే కూసుంది. కుండలో కూడు పెట్టుకు తింటానేమోనని అమ్మకు అనుమానం అని నాకు సందేహం కలిగింది.

    'నీకు బయిమొద్దు! దొంగ కూడు తినను' అన్నా. అమ్మ నమ్మింది. వాటేసుకొంది. ఏడ్చింది. 'నువ్వు నా బంగారు కొండవురా' అంది. ఆ సాయంత్రానికి జొరం తగ్గింది.

    'ఏడీ సచ్చినోడు?' అంటూ బూసిమ్మ ఊరొదిలి, ఇల్లొదిలి, పల్లెలోకి, మా యింటికి వచ్చింది.

    మా అమ్మ ముక్కాల పీటవేస్తే కూసుంది. 'ఈ ముదనష్టపోడికేమయింది?? అని అడిగింది.

    'యేందిన్నావురా యదవ జొరం తెచ్చుకొన్నావు' అంది. 'నువ్వు బెట్టే పెట్టుకి జొరం రాదా బూసిమ్మా' అన్నా. బూసిమ్మ నవ్వింది. 'యేం బెట్టేవే ఈడికి?” అని మా అమ్మనడిగింది. 'నేనేం బెట్టలా' అంది మా అమ్మ .

    "నేతి గారెలు జేశా, ఈ కడుపాత్ర పోడికి పెట్టకుండా తినబుద్దికాలా, ఎంత వొద్దిగా తింటాడే సన్నాసోడు. తింటున్నప్పుడు ఎంత ముద్దొస్తాడో ఈ దొంగముండా కొడుకు. ఆడికి బెట్టు' అని జలమసిలేరి దబరా నిండా ఉన్న నేతిగారెలు మూతదీసి చూపించింది. నేతివాసన గుప్పుమంది.

    'పత్తేం దొరసానీ' అంది అమ్మ

    ఏరా సన్నాసీ నీ నోట్లో శని ఉందా? ఏడువ్! పోనీ ఒకటి తినిసావ్!” అని నడుం పట్టుకొని లేసి, పోయొత్తానే' అంది వెళుతూ. 'బిడ్డ జాగరత' ఆవటాని హెచ్చరించింది.

    బూసిమ్మ కూడా తల్లే! అమ్మ కూడా అమ్మే!

    'నేతి గారెలురా, పోనీ ! ఒకటి తింటావా?” అని అమ్మ అడిగింది. 'పత్తేం గదే! వద్దులే ! బతికుంటే బోలెడు దినొచ్చు' అన్నా. 

    మా అమ్మ నా బుగ్గలు పుడికి కళ్ళు తుడుచుకొంది. ముద్దు పెట్టుకొంది.

    రాత్రి అమ్మా, నాయనా, చెల్లెలు నేతి గారెలు తింటుంటే, నేను వాసన తింటూ నిద్రపోయేను.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    21 min
  • మా బస్సు భాగోతాలు

    "ఒరే ఎంకా ! యెందాకరా ఒకటే లగెత్తుతుండావు?"

    "ఉండరా! సుబ్బా! పడవెళ్లి పోతుందిరా! నేను నీతో యవ్వారం పెట్టుకుంటే కుదరదు. గెండారం దాకా పోవాలా" అంటూ ఎంకడు హడావిడి పడిపోతాడు. 


    "మా ఉప్పలపాటి గురుంచి ఏమన్నా మీకు ఉప్పు వుండి వుంటే మీరే తెగ ఆశ్చర్య పోవాల! ఉప్పలపాటి కి గెండారానికి మధ్య పిల్లకాల్వ కూడా లేదు, ఈ ఎంకడు ఎలా పడవెక్కుతాడు అని"


    అయితే మీకు బొత్తిగా మా ఉప్పలపాటి వాళ్ళ ఎకసెక్కాలు బొత్తిగా తెలీవన్న మాట.


    ముందు వెనక కర్వ్డ్ రూఫ్ తో ఒక ఇన్వర్టెడ్ పడవలాగా వుండే బస్సుకు మా వాళ్ళెట్టుకున్న ముద్దు పేరు. 


    అలాగే పొట్టిగా, ముందు ఎనకా ఓ గొడ్డలెట్టేసి నరికేసి, ఎత్తు ఎక్కువ పొడవు తక్కువగా వుండే బస్సు పేరు అగ్గిపెట్టి. 


    "మావ! అగ్గిపెట్టెలో వచ్చానా! ఆ సూలం సచ్చినోడు ఎత్తెత్తి నూకేలా! తోలి నా నడుము ఇరగ నూకేసినాడనుకో" అని చాలా ముద్దు గా చెప్పుకుంటారు మావోళ్లు . 


    అలాగే వెంగమాంబా, బాల భాస్కర్, పాలబండి, తపాలా బండి, గోపాలయ్య బండి లాటి ఎన్నెనో పేర్లు ఆ బస్సులకు. ఒక్కో బస్సు ఒక్కో రంగు, ఒక్కో డిజైన్, ఒక్కో హారన్, ఒక్కో వైభోగం. డ్రైవర్, కండక్టర్ తోపాటు బస్సు ఆగగానే రేడియేటర్ లో నీళ్లు పోయడానికి, ఎక్కే మెట్ల మీద నిలబడి పక్క రేకు మీద బాదుతూ రైట్ రైట్ అంటూ అరుస్తూ ఒక క్లీనర్.


     బస్సు కిట కిట లాడుతుండగా ఎనక తలుపు మీద రైట్ రైట్ అని బాది, నేల మీదకి దూకి బసుతో పాటు పరిగెత్తి ముందు తలుపు దగ్గర బస్సులోపలకి గెంతి మరలా రైట్ రైట్ అంటూ ఆడు చేసే హడావిడి మాకయితే భలే ఉండేది. వీళ్ళ ముగ్గురు మీద వూళ్ళ మధ్యలో ఎక్కి చెకింగ్ అంటూ నానా హడావుడి చేసి, మూటలకు టిక్కెట్లు కొట్టలేదని కండక్టర్ మీద యుద్ధం చేసి ఊళ్ళ మధ్యలోనే చక్క దిగి పోయే చెకింగ్ ఒకడు. 


    మాలో ఒక గుస గుస ఉండేది, ఆ చెకింగ్ కి వీళ్ళ ముగ్గురూ ఎందుకంత బయపడతారో అని. ఎందుకంటే ఈ చెకింగ్ లు ఎక్కువగా బస్సు ఓనర్ల కీప్ ల తమ్ముళ్ళో, అన్నలో లేక కొడుకులో


    మాలాటి పిల్లకాయలకి, ఇంతకు ముందు చూడని బస్సు ఎంత డొక్కు దైనా కొత్త బస్సే. అది వచ్చి మా మూలగడ దగ్గర ఆగితే దాన్ని శల్య పరీక్ష చేసి అందరం కలిసి నామకరణం చేయాల్సిందే . కొత్త బస్సుని చూసిన సందడే వేరు. 


    ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయలయితే ఎప్పుడెప్పుడు పెద్దయి పోయి అర్జెంటు గా పడవనో, అగ్గిపెట్టెనో లేక కొత్త బస్సునో ఎక్కి పెదపుత్తేడు ఉన్నత పాఠశాల లో చదివెయ్యాలనే ఉబలాటం. మా లాటి అల్రెడీకే పెద్దోళ్ళయిపోయిన పిల్లకాయలకి రోజుకో కొత్త బస్సు రావాలనే ఆత్రం. 


    అలాగే ఒక్కో బసుకి ఒక్కో ఫ్యాన్ ఫేర్, ఎన్నైనా చెప్పెండె హె అగ్గిపెట్టిపోయినట్టు పడవ వెళ్లగలదా అనే పందేలు. పడవలో వుండే ఆ వయ్యారం అగ్గిపెట్టెలో ఎక్కడుందిరా అనే సౌందర్యోపాసకులు తక్కువ లేరు మా వూర్లో. 


    ఈ బస్సులు వాటి పంచువాలిటీ తెగ పాటించేవి. వాటి టైం దాటి లేట్ గా వచ్చేయంటే, అవి మా వూరు కొచ్చి రిటర్న్ అయ్యే టైం లో తరవాత వచ్చే బస్సోడు అడ్డం పెట్టేసే వాడు, నా కలెక్షన్ అంతా నువ్వెత్తుకు పోతున్నావని. ఆ అడ్డం పెట్టుకోవటం కొన్ని గంటలు లేక కొన్ని పూటలుండేవి. మా పిల్లకాయలకి పండగే బస్సులు అలా అడ్డం పెట్టుకోవటం. ఒక జాతరలాగా వెళ్లి చూసొచ్చే వాళ్ళం. ఆ అడ్డం పెట్టుకొనే ప్రదేశం లో సోడా బండ్లుకూడా వెలిసేవి. 


    ఇలా మా అందాలు, ఆనందాలు, హడావుడీలు సాగిపోతుండగా, రూట్స్ అన్నీ జాతీయమై, ఎర్ర బస్సులు రావటం మొదలెట్టాయి. 


    పాల బండి ఎర్ర బండే , తపాలా బండి ఎర్ర బండే, ఏదొచ్చినా ఎర్రబండే. క్రమంగా మా వాళ్ళు ఆరు గంటల బండి, ఎనిమిది గంటల బండి, పది గంటల బండి అని చెప్పుకోవటం మొదలెట్టారు. 


    రంగుల్లేవు, డిజైన్ లేవు, సోకుల్లేవు, "మీ సామానులకు బస్సువారు జవాబు దారి కాదు", "లైట్ ఆపి సెల్ఫ్ కొట్టుము" లాటి ముసి ముసి నవ్వులు కురిపించే వాక్యాలు లేవు. 


    మాకెందుకో అర్థం అయ్యేది కాదు ఆ ఎర్ర బస్సులు వస్తే ఒకదాని ముడ్డి వెనక ఒకటి వచ్చేవి, రాకపోతే అస్సలు వచ్చేవి కాదు. అడ్డం పెట్టుకొనే కంపిటీషన్ మేమెప్పుడూ చూడలా మా కళ్ళతో. 


    క్రమంగా మేము ఎప్పుడొస్తాయో తెలియని ఎర్ర బస్సుల్ని నమ్ముకోవటం మానేశాము. వాటి స్థానే మా వూరిక్కూడా, షేర్ ఆటోలు రావటం మొదలెట్టాయి, పసుపు బాడీ మీద నల్లని టాప్ ల తో, డబ డబ శబ్దాలతో, ఒకే మాదిరిగా.


    పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టు రంగు రంగులుగా వుండే ప్రైవేట్ బస్సులు రావటం మానేసాక మా ఉప్పలపాటి దారి కళే పోయిందబ్బా.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    6 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners