Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’

    హర్షణీయంలో ఇప్పుడు మీరు వినబోతున్న కథ, సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ‘సిలారు సాయబు’. ఇది వారి ‘గుడి’ అనే కథాసంకలనం నుంచి స్వీకరించబడింది.

    తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు. 

    ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది. 

    తమ రచనను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

    డిసెంబర్ నెలలో వారి ఇంటర్వ్యూ ‘హర్షణీయం’ ద్వారా మీకందించబడుతుంది. 

    ‘గుడి’ కథాసంపుటి ని కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీలో ఇవ్వబడ్డాయి.


    ‘సిలారు సాయబు’:


    నాగడు సిలారు సాయిబును కొట్టాడు. సిలారు నవ్వాడు. నాగడికి ఏడుపు వచ్చింది. మళ్ళీ కొట్టాడు. సిలారు ఇంకా నవ్వాడు.

    వాడు కొట్టా . వీడు నవ్వా. ఇదే తంతు. వాడు బలవంతుడు. వీడు బల హీనుడు. 

    వాడున్నవాడు. వీడు లేనివాడు. వాడు సంసారి. వీడు బికారి.

    నాగడికి తిక్క ముదిరింది. కర్రతో బాదాడు.

    'నన్ను తిట్టరా' అన్నాడు. సిలారు తిట్టలేదు. 'నన్నుకొట్టరా' అన్నాడు. సిలారు కొట్టలేదు. 'నన్ను వాటేసుకోరా' అన్నాడు. సిలారు వాటేసుకోలేదు.

    సిలారుసాయిబు తనను తిట్టాలని, కొట్టాలని, వాటేసుకోవాలని నాగడికి ఆశ, ఇష్టం, ఉబలాటం, ఆరాటం. అందుకే ఈ చావు.

    నాగడు తనకు వచ్చిన బూతులన్నీ తిట్టాడు. సిలారు నవ్వుతాడు కానీ తిట్టడు.

    సిలారుకు ఒక ప్రఖ్యాతి ఉంది. వీడు తిట్టినా కొట్టినా తాకినా మేలు జరుగు తుందని.

    అతడి ఊరూ పేరూ ఎవరికీ తెలియదు. ఎప్పుడో ఎవరితోనో సిలారుసాయిబు అని తన పేరు చెప్పాడని అందరూ అనుకొంటారు. అలా అతడికి ఆ పేరు స్థిర పడింది. ఆ పేరుతో పిలిస్తే తిరిగి చూస్తాడు కానీ 'ఏమీ?' అని అడగడు.

    మర్రిచెట్టు కింద పడుకొంటాడు. దేవుళ్ళ చెరువులో బుద్ది పుట్టినంత సేపుమునుగుతూ తేలుతూ ఉంటాడు. బర్రెలు, దున్నలు, పెయ్యలు, దూడలు నీళ్ళలో మునిగినట్లే సిలారు సాయిబూ మునుగుతూ తేలుతూ ఉంటాడు.  బరి గొడ్డు గట్టెక్కగానే తానూ ఒడ్డు కెక్కి వేప చెట్టు కింద కూర్చుంటాడు.

    బట్టలు ఒంటి మీదే ఆరి పోతాయి. ఎవర్నీ ఏమీ పెట్టమని అడగడు. ఏం పెట్టినా తీసుకోడు. ఇష్టమైంది ఎక్కడున్నా తీసుకుంటాడు.

    చలిలేదు, వానలేదు, ఎండలేదు. మర్రి చెట్టు కిందే మకాం. పగల్లేదు, రాత్రిలేదు, ఎప్పుడయినా నిద్రపోతాడు, నిద్రపో యినప్పుడు తప్ప చెట్టు కింద ఉండడు. ఎవరైనా చిరుగులబొంత ఇచ్చినా కప్పు కోడు. పక్కనేసుకోడు. బుద్ధి పుడితే దాని మీద పడుకొంటాడు. లేకపోతే అది అక్కడ ఉండగానే గడ్డి మీద పడి నిద్రపోతాడు. వాడికి దినచర్య లేదు. ఇప్పుడు నిద్రపోవాలని గానీ ఇప్పుడు నిద్ర లేవాలనిగాని నియమమేమీ లేదు.


    సిలారు సాయిబుకు ఏం తొందరో అంగలు పంగలు వేసుకుంటూ వస్తాడు. గబగబా పోతాడు. పరుగూ కాదు. నడకా కాదు. అడ్డదిడ్డంగా పడుతూ లేస్తూ వస్తూ పోతూ ఉంటాడు. మాదిగ పల్లెను వదిలి ఎక్కడికీ పోడు.

    పల్లె పెద్ద ఎక్క డిదో పాత నిక్కరుంటే సిలారు సాయిబును పట్టుకొని తొడిగాడు. అది జారి పోకుండా మోకులాంటి మొలతాడు కట్టాడు. మొలతాడు అదుపాజ్ఞల్లో నిక్కరు ఖైదు అయింది.

    నెలకో ఆర్నెల్లకో పల్లె పెద్దకు బుద్ధిపుడితే పై బట్టలు పీకేసి ఉతికి నవేవో తొడుగుతాడు. పల్లెమొత్తం మీద పెద్ద మాదిగకు మాత్రమే సిలారు సాయిబు దొరికేవాడు. ఏ బట్ట పీకి పారేసినా ఓర్చుకునేవాడు. ఏ ఉతికిన బట్టలు వేసినా ఒప్పుకొనేవాడు. ఇక పల్లెలో ఎవరి చేతికి దొరకడు. ఏం పనీ ఉండదు. పల్లె వీధు లన్నీ మళ్ళీ మళ్ళీ తిరుగుతుంటాడు. ఎవురైనా ఎదురైతే అల్లంత దూరంగా తప్పు కొని తప్పించుకొని పోతాడు.

    ఎవరైనా వీధిలో కూర్చుని అన్నం తింటుంటే తినే గిన్నెలో నుంచి గుప్పెడు మెతుకులు లాక్కొని తింటాడు. అంతా నోట్లోకి పోని వ్వడు. రెండు మెతుకులటు రెండిటు పడేసుకుంటూ బొక్కుతాడు.


    చెరువులో నీళ్ళయినా తాగుతాడు. కుడితి తొట్లెలో నీళ్ళయినా తాగుతాడు. చెంబట్టుకు పోయేవాళ్ళ చెంబు తీసుకోనైనా తాగుతాడు. బావి దగ్గరకు పోడు. నీళ్ళు దోసిట్లో పోయించుకోడు.


    ముంత లేదు. మూకుడు లేదు. కుండలేదు. సట్టిలేదు. వాడికి కూడు వండుకునే పనిలేదు. పొలాలో అడ్డం పడిపోతుంటాడు. చేతికందినవి తింటాడు. అవి కాకరకాయ లైనా చింతలేదు. చింతకాయలైనా తొందరలేదు. దోసకాయలైనా ఇబ్బందిలేదు. రాంములక్కాయలైనా ఫరవాలేదు. పొలంలో పండే ఏ కూరగాయనూ ఆకు కూర నూ వద్దనకుండా తింటాడు. పచ్చిగడ్డి కూడా పరమాన్నంలా భుజిస్తాడు...


    సిలారు సాయిబు మాదిగపల్లెలో వింతజీవి. అతడు తుమ్మినట్లు కానీ, దగ్గి నట్లు కానీ, జ్వరం వచ్చిందని కానీ, లేవలేకుండా ఉన్నాడని కానీ ఎవరూ ఎప్పుడూ చెప్పుకోలేదు.

    'నా చిన్నతనం నుంచి సిలారు సాయిబు ఇట్లానే ఉన్నాడ'ని ముసలివాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు.

    అతను ఏం తిన్నా ఎవరూ ఏమీ అనరు. ఏం తాగినా తాగిస్తారు. వాడు తాము భరించవలసిన ఒక ప్రాణి అని మానవమాత్రుడని పల్లెవాళ్ళు గుర్తించారు.

    ఏ నియమం, ఏ హద్దు, ఏ అడ్డు, ఏ ప్రతిబంధకం లేకుండా సిలారు సాయిబు మాదిగపల్లెలో స్వేచ్ఛాజీవిగా ఉన్నాడు.

    ఏ పంట బాగా పండినా సిలారు సాయిబే కారణమనుకోసాగారు. ఒకరింట్లో చొరబడి గుప్పెడు కందులు తీసుకొని తింటూ వెళ్ళిపోయాడని, ఆ సంవత్సరం ఆ ఇంటికి కందిపంట ఇబ్బడి ముబ్బడిగా వచ్చిందని వాళ్ళ ఆనందం.

    ఆ సంతో షంతో వాళ్ళు కందిపప్పు వండి, ముద్దపప్పు మధ్య గుంట చేసి గుంట నిండా నేయి పోసి, తీసుకొనిపోయి ఇస్తే ముఖంలోకి చూచి ఇకిలించి, చేత్తో విస్తరిని విసిరి కొట్టాడని చెప్పుకుంటుంటారు.

    ముద్దపప్పు నేల పాలయినందుకు తెచ్చిన మనిషే చింతపడలేదు. సిలారు సాయిబు ఇకిలించటం మానలేదు.

    రామికి పెళ్లి కాలేదు. పిల్ల ముదిరిపోయిందని తల్లి, తండ్రీ, పల్లె గగ్గోలు పెడుతుంటే కుమిలిపోతూ ఏడుస్తూ ఇంటి మట్టి గోడకానుకొని, చూరుకింద కూర్చుని, బియ్యంలో మట్టిబెడ్డలు ఏరి తింటూ కనిపించేది.

    పిల్ల తల్లిదండ్రులు పెద్ద ఆస్తిపరులేం కాదుగాని తినడానికి ఉన్నవాళ్ళే. పిల్ల కురూపా అంటే అదేం కాదు. చూడముచ్చటగానే ఉంటుంది. పన్నెండు ఏళ్ళ వయస్సు రాగానే పెద్ద పిల్లయి కూర్చుంది.

    తండ్రి పెండ్లి సంబంధాల కోసం తిరిగిన ఊరు తిరగకుండా పదూళ్ళు తిరి గాడు. రెండు జతల చెప్పులు మార్చాడు. పెళ్ళి కుదరలేదు.

    పిల్ల ముదిరిపోతూ ఉందని అందరూ గోల చేస్తున్నారు. ఈ ఊర్లో రెండో పెళ్ళివాడో, పోనీ పెళ్ళామున్నవాడో నేనున్నానంటూ పిల్ల కన్నెచెర తొలగిస్తానంటూ ముందుకు రాలేదు.

    పిల్ల పెళ్ళి అవసరం కంటే పల్లెకు ఆ పిల్లను వదిలించుకోవలసిన అవసరం ఎక్కువైనట్లుగా వుంది. 

     గోలంతా చూస్తే ప్రతి భార్యా, భర్తను కట్టుబాట్ల మధ్య కట్టేసుకోలేక నానా తిప్పలు పడుతూ ఉందనిపిస్తుంది.

    ఈ ఆడవాళ్ళ సూటిపోటి మాటలతో పిల్ల మరింత ముడుసుకుపోతూ ఉంది. కుమిలి పోతూ ఉంది. కుంగిపోతూ ఉంది. బావిలో నీళ్ళన్నీ కళ్ళలో ఉన్నట్లే కన్నీరు కారుస్తూ ఉంది.

    ఒకరోజు అటుపోతున్న సిలారు సాయిబు పిల్ల భుజం మీద ఉన్న ఓణీ లాక్కొని, తెలి మీద మొట్టికాయ కొట్టి, ఓణీని జెండాలా ఎగరేస్తూ పోతూ ఉండటం పల్లెంతా చూచింది. 

    ఎదురొమ్ములకు చాట అడ్డం పెట్టుకొని పిల్ల ఇంట్లోకి దూరింది. సిలారు సాయిబు పిల్ల ఓణీ జెండా చేసుకున్నాడన్న వార్త గాలికంటే వేగంగా ప్రయాణం చేసింది.

    వారం రోజుల్లో రెండు సంబంధాలు వచ్చాయి. అమ్మాయి ఆనందానికి తిరుగు లేదు.

    ఎవరైనా సరే' అంది. అంతే. పదిరోజుల్లో పెళ్ళయింది. ఏడాదికి కొడుకునె త్తుకుంది. సిలారు సాయిబుకు చూపిస్తే వాడేలోకాన వాడున్నాడు. చూళ్ళేదు. తిట్ట లేదు. కొట్టలేదు. 'సిలారు సాయిబు సలవ' అన్నారు ఆడవాళ్ళు. 'దేవుడి దయ' అన్నారు మగవాళ్ళు. 'ఈడేరిన పిల్ల. పెళ్ళయింది. పెళ్ళయితే పిల్లలు పుట్టరా. పుట్టేరు. అంతే. కిందోడి సలవా లేదు, పైవాడి దయా లేదు' అన్నారు పంతులుగారు.

    పంతులుగారు అంటే బాపనాయన కాదు. మాదిగాయనే. పల్లె బళ్ళో పంతులు. పంతులు చెప్పే అఆఇఈలు ఎవరైనా వింటారు. ఒప్పుకొంటారు.

    పిల్లలు చదువుకొంటారు. కానీ సిలారు సాయిబు చలవ లేదన్నా, దేవుడి దయ కాదన్నా పల్లెవాళ్ళు ఒప్పుకోరు.

    కారణం లేనిదే కార్యం జరగదంటాడు పంతులు.

    మాదిగపల్లెలో కార్యం అంటే పెళ్ళయిన ఆడపిల్లని, మగపిల్లాణ్ణి ఒక మంచం మీద పడుకోబెట్టి తలుపేయటం.

    'పెళ్ళి చేయటం కారణం. ఈ కారణం లేనిదే ఆ కార్యం లేదు' అంటాడు పంతులు.

    పెడసరపువాడు ఒకడు 'పెళ్ళే ఒక కార్యం ' అంటే

    పంతులు నవ్వి 'ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల పుట్టి ఉండడం కారణం' అన్నాడు.

    ''వాళ్ళు పుట్టడమే ఒక కార్యం' అన్నాడు పెడసరపువాడు.

    'వాళ్ళ అమ్మా నాన్నలకు పెళ్ళి కావడమే కారణం' అన్నాడు పంతులు. 'ఒక కారణం లేందే ఒక కార్యం జరగదు' అన్నాడు.

    ఒప్పుకొన్నారు కానీ కొన్ని సార్లు ఒకటే కార్యమూ, కారణమూ కావటం విచిత్రంగా ఉంది. ఏమైనా జరగవని సిందేదో జరుగుతుంది అనుకొన్నారు మెట్ట వేదాంతవేత్తలు. -

    సుబ్బడు మూడేళ్ళుగా ఎస్సెస్సెల్సీ తప్పుతున్నాడు. నాలుగో ఏడు కూడా తప్పితే ఇక వాడికి ఎస్సెస్సెల్సీ పాసయ్యే యోగ్యత ఉండదు. కాలేజీలో చేరే రాత ఉండదు.


    'ఎందువల్ల?


     'ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కలేదు' 


    'ఐదోసారి ఉట్టిమీదికి ఎందుకు ఎక్కనీయకూడదు'

    'ఉట్టి తెగుద్ది'

    పంతులుగారితో పెడసరపోడు మాట్లాడుతున్నపుడు సుబ్బడు సజ్జబువ్వలో పెరుగు కలుపుకొని మల్ల వళ్ళో పెట్టుకొని, నడిమంచం మీద కూర్చున్నాడు.

    మంచం నులక వదులై ముడ్డి నేల కానింది. సుబ్బడు వంచిన తల ఎత్తకుండా జుర్రుకొంటున్నాడు.

    అందుకు కారణాలు రెండు. ఒకటి రైలుకి సిగ్నలు ఇచ్చారు. రెండు రైలెక్కి గుంటూరు పోయి ఎస్ఎల్సీ నాలుగోసారి పరీక్ష రాయాలి. ఈసారయినా పాసు కావాలి అని పట్టుదలతో, పట్టు బట్టి పెరుగు సజ్జబువ్వ జమాయించి లాగుతున్నాడు వాడు. తింటూ సుర్రుసుర్రు మంటూ బువ్వకు నాలుకకూ మధ్య శబ్ద బ్రహ్మను సృష్టిస్తున్నాడు సుబ్బడు.

    అప్పుడు వచ్చాడు సిలారు సాయిబు. ఏడ నుంచి వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు. అంగలు పంగలు వేసుకుంటూ సరాసరి సుబ్బడు కూర్చుని ఉన్న మంచం కాడికి చేరాడు. మల్ల లాక్కోలేదు. పెరుగుబువ్వ పీక్కోలేదు. అటు తిరిగి తల వంచుకొని మల్లకు మూతికి చేయి తిప్పి మధ్యలో ఖాళీ లేకుండా రవం దాడిగా జుర్రుకొంటున్న సుబ్బణ్ణి చూశాడు.

    అప్పుడు సిలారు సాయిబు చేయి లేచింది. టపీమని సుబ్బడి నెత్తి మీద ఒక చరుపు చరిచాడు. అక్కణుంచి సిలారుసాయిబు ఆగకుండా వెళ్ళిపోయాడు.

    దెబ్బ తిన్న సుబ్బడి మూతి మల్లలో ఇరుక్కుపోయింది. మల్ల పగిలింది. పెరుగుబువ్వ మంచం మీద పడింది. నులక సందిచ్చేసరికి నేలపాలయింది. మల్ల రెండు ముక్కలు ఎడం చేస్తే సుబ్బడి ముఖం కనిపించింది.

    నోరు బదులు ముక్కు, కళ్ళు, నొసలు, చెంపలు , చెవులు సజ్జ పెరుగన్నం నున్నగా తిన్నాయి.

    సుబ్బడి తల్లి తతంగమంతా చూచింది. సిలారు సాయిబును ఏమీ అనలేదు. దండం పెట్టింది. కొడుకు మూతి తుడిచింది. ముక్కు పిండింది. ముఖం కడిగింది . ఉతికిన చొక్కా నిక్కరు మార్చింది.

    ముద్దుల మీద ముద్దులు పెట్టింది. 'కొడకా ! ఈ ఏడు నువ్వు పరీక్ష పాసవుతావు పోరా' అంది.

    సుబ్బడు అయోమయంగా చూశాడు. రైలు కూత వినిపించింది. పరీక్ష అట్టా, పెన్నూ పెన్సిలు తీసుకొని లగెత్తుకెల్లి రైలెక్కాడు.

    పంతులూ, పెడసరపోడు జరిగిందంతా చూశారు.

    'సుబ్బడు పాసవుతాడా?' పెడసరిపోడు అడిగాడు.

    'బాగా చదివి వుంటే పాసవుతాడు. లేకుంటే ఫెయిల్ అవుతాడు'

    'ఫెయిల్ కాడు. పాస్ అవుతాడు. ఏమనుకొంటున్నావు పంతులూ! అది సిలారు సాయిబు దెబ్బ' అన్నాడు పెడసరపోడు.

    సుబ్బడు ఆ సంవత్సరం ఎస్సెస్సెల్సీ పాసయ్యాడు.

    'ఇప్పుడేమంటావు?' అన్నాడు పెడసరపోడు.

    'బాగా చదివుంటాడు. పాసయ్యాడు' అన్నాడు పంతులు.

    'కాదు. అది సిలారు సాయిబు సలవ' తేల్చాడు పెడసరపోడు.

    పంతులు ఏమీ మాట్లాడలేదు.

    సిలారు సాయిబుకు కృతజ్ఞత తెలుపుకోవాలని సుబ్బడి తల్లికి యమ ఆరాటంగా ఉంది.

    డబ్బిస్తే చెల్లపెంకుల్లా పారేస్తాడు. అన్నంపెడితే తినడు. కుక్కలకేస్తాడు.

    ఆమె ఒక పన్నాగం పన్నింది. నేతిగారెలు వండింది. గారెలన్ని దండగుచ్చింది. దండమె శ్ళోవేసి మెడకు కట్టింది. గారెలు నోటికి అందుతాయి.

    పీకి పారేస్తే తాడుకొస గొంతు పిసుకుతుంది. ఏ ఎదాన ఉన్నాడో ఒక్కొక్కటి పీకి పీకి తిని పురికోస కంటె లాగా పెట్టుకొని తిరగసాగాడు.

    ఒకసారి లేగదూడ అడ్డంపడి ఈనలేక అవు గింజుకులాడింది. ఆవు దుఃఖం తమ దుఃఖంగా అల్లాడుతున్నారు జనం.

    సిలారుసాయిబు ఏమనుకొన్నాడో అందర్నీ తోసుకొని ముందుకుపోయి ఆవు ముడ్డిమీద సుతారంగా చేతో రాశాడు. అంత సుతారంగా సున్నితంగా సుకుమారంగా కోమలంగా వాడి చేయి ఉంటుందని పల్లెకు తెలియదు. ప్రపంచానికి తెలియదు. వాడికి తెలియదు.

    మరుక్షణం దూడ తలకాయ పట్టుకొని, వాముల్లోంచి చొప్పకట్ట లాగినట్లు లాగి, దూడను తల్లి మూతి కాడ పెట్టి అదే పోవడం. అంగలుపంగలు వేసుకొంటూ ఆగకుండా లగెత్తినట్టు వెళ్ళిపోయాడు.

    'సిలారుసాయిబు హస్తవాసి మంచిది' అన్నాడు పెడసరపోడు.

    'ఆవు ముక్కితే దూడ పడేదే' అన్నాడు పంతులు.

    'ఆవెందుకు ముక్కలేదు. దూడెందుకు పళ్ళేదు' అడిగాడు పెడసరపోడు.

    “పోరాడి పోరాడి దానికి ఓపిక తగ్గింది' అన్నాడు పంతులు.

    ఎందుకు తగ్గింది. ఎంత చెట్టుకంత గాలికదా. సిలారు సాయిబు రాకపోతే ఆవు సచ్చేది. ఆవుతో పాటు దూడ సచ్చేది. రెండు జీవాలకు ప్రాణం పోసేడు సిలారు సాయిబు'

    'అందుకే ఈనబోయే ముందు పశువుల్ని ఆస్పత్రికి తోలాలి.”

    'అక్కడేం చేస్తారు....?"

    'స్త్రీల కాన్పుకు మంత్రసానులున్నట్లే ఆవు ఈనటానికి డాక్టర్లు సహాయం చేస్తారు

    'ఈనబోయే ఆవును గుంటూరు తోలుకు పోవటం ఎట్టా'

    పెడసరపోడు అడ్డదిడ్డపోడు, ముదనష్టపోడు, తిక్కలోడు అంటారు కానీ పంతులు వాడి అడ్డగోలు ప్రశ్నలకు ఓపిగ్గా బదులు చెబుతుంటాడు. అప్పుడెం దుకో మౌనంగా ఉన్నాడు.

    ఇటువంటి చాలా సందర్భాల్లో సిలారుసాయిబు మీద పల్లెకు గురి కుదిరింది. సిలారు సాయిబు తిట్టినా, కొట్టినా, ముట్టినా మేలనే ఖ్యాతి స్థిరపడింది.

    అతడి ప్రఖ్యాతి అతడికి తెలుసునో తెలియదో పల్లెకు తెలియదు. పల్లెవాళ్ళుమాత్రం సిలారు సాయిబు కొట్టాలని, తిట్టాలని ప్రతిక్షణం ఎదురుచూస్తుంటారు.

    సిలారు సాయిబు ఎప్పుడూ గొణుగుతూ తిరుగుతుంటాడు. ఏం గొణుగుతాడో తెలియదు. అదేం భాషో అర్ధం కాదు.

    రోజుకు అయిదుసార్లు కూర్చునే దండం పెడుతూ గొణుగుతాడు. నుదురు నేలకానించి, మళ్ళీ లేచి, ఏదో మంత్రం చదివి నట్లు గొణుగుతాడు.

    ఇలా చేయటం చూచిన ఊళ్ళోని సాయిబులు నమాజు చేస్తు న్నాడని, పీర్లుండే సావిడి వద్ద పడుకోమని చెబితే వినలేదు. బలవంతంగా లాక్కు పోతే పోయినట్లే పోయి తిరిగి మాదిగ పల్లెకి వచ్చి మర్రిచెట్టు కింద పడుకొన్నాడు.

    ఎవరో సిలారు సాయిబును మాదిగోళ్ళ దేవుడు అని కూడా అన్నారు. దేవుడు స్వర్గంలో ఉంటాడని నమ్మే జనం బతుకున్న మనిషిని, పల్లెలో ఉన్న మనిషిని, దేవుడనుకొన్నా పూజించలేదు. మొక్కులను, కానుకలివ్వలేదు.

    సిలారు సాయిబు కూడా ఏమీ కోరడు, అడగడు. ఎప్పుడూ అల్లల్లల్లా అంటాడు. దేవుణ్ణి తలచు కొంటున్నాడని సాయిబులు, కుక్కల్ని పిలుస్తున్నాడని మాదిగలు భావిస్తుంటారు.

    ఒకరోజు కానుపు కష్టమయితే పేగడ్డం పడిందని మంత్రసాని చేతులెత్తేసింది. గుంటూరు పోయే రైలు వస్తే పెద్దాసుపత్రికి తీసుకుపోవాలని చూస్తున్నారు. అంత దాకా ఆగలేమని తల్లీబిడ్డల ప్రాణానికి ముప్పని అందరూ ఆరాటపడుతున్నారు.

    ఎందుకొచ్చాడో సిలారు సాయిబు ఇంట్లో చొరబడ్డాడు. లబలబలాడుతున్న అటు ఆడోళ్ళనటు, ఇటు ఆడోళ్ళనిటు తోసేసి, నేల మీద అరుస్తూ పడి ఉన్న నిండు చూలాలు పొట్ట మీద చీర తీసి పొట్టంతా నిమిరాడు.

    అంత బాధలోనూ సిలారు సాయిబు మగవాడని, తాను ఆడమనిషి అని గుర్తించిన గర్భవతి చీరె సర్దుకుంది.

    సిలారు సాయిబు చేయి పూర్తిగా చాచి చెళ్ళున ఆమె చెంప మీద కొట్టాడు. బళ్ళున పొట్ట పగిలింది. కెవ్వుమని అరిచింది ఆ చూలాలు. కెవ్వుమన్నాడు పుట్టి నోడు.

    మంత్రసానితో సహా అందరూ ఆడికాళ్ళ మీద పడ్డారు. ఆడక్కడలేడు. ఎగిరి పోయాడో ఎక్కడ అంగలు పంగల నడకలు నడుస్తున్నాడో.

    అంతవరకు దేవుడిలాంటోడు అనుకొనే వాళ్ళు ఆ రోజు నుంచి దేవుడనుకో సాగారు.

    పూజలొక్కటి తక్కువ గాని, ఆడవాళ్ళందరూ దండం పెట్టసాగారు. వాళ్ళ మొగుళ్ళు మొక్కుకోసాగారు. వాళ్ళను చూచి పిల్లలు దండం పెడుతున్నారు.

    సిలారు సాయిబుకు తన తిరుగుడు తనదే. తన నిద్ర తనదే. తన నమాజు తనదే. తనకింకేం తెలియదు.

    చెరువుగట్టుకు పోయి వస్తూ “దీనికే వంటా?” అన్నాడు పెడసరపోడు.

    'గర్భవతి కావటం కారణం, కొడుకు పుట్టడం కార్యం' అన్నాడు పంతులు.

    'కాదు సిలారు సాయిబు కొట్టడం కారణం, కొడుకు పుట్టడం కార్యం' అన్నాడు పెడసరపోడు.

    'తాటిపండు మగ్గింది. అది కింద పడాలి. అప్పుడు కాకి వాలింది. కాయ పడింది. కాకి వాలకపోయినా కాయ పడేది.

    ఆమెకు నెలలు నిండాయి. కొడుకు పుట్టేవాడే. సిలారు సాయిబు కొట్టాడు. వీడు కొట్టకపోయినా వాడు పుట్టేవాడే'

    'మంత్రసాని తనవల్ల కాదంది కదా

    'లేడీ డాక్టరయితే అనదు'

    వీళ్ళ కారణ కార్య సంబంధం ఎలా ఉన్నా పల్లెజనం అంతా సిలారు సాయిబును దేవుడనసాగారు.

    ఇలా ఉన్నప్పుడు నాగడి పెళ్ళాం పుట్టింటికి పోయింది. ఆమె రాలేదు. వీడు పోయి పిలిస్తే వస్తాను పొమ్మంది కానీ రాలేదు.

    తేపతేపకు వాడు పోతుంటే 'మళ్ళీ మళ్ళీ రావద్దు. నేను మీ ఊరు రాను' అంది.

    బ్రతిమాలాడు. బామాడాడు.

    ఛీకొట్టింది. చీదరించుకొంది.

    'దొంగ తిళ్ళు మరిగిన గొడ్డును ఎవరు మల్లేయగలరు' అన్నారు పల్లెలోని మగాళ్ళలో కొందరు.

    'మగతనం లేని నాగడితో ఏ ఆడది కాపరం చేసుద్ది' అన్నారు ఆడవాళ్ళు.

    తాను మగతనం లేనివాణ్ని కానని, భార్య మంచిదే అని నాగడి నమ్మకం.

    ఏం జరిగిందో ఏమో కాపరం చెడింది.

    అది రాదు. ఈడుదాన్ని వదలడు. దానికి వీడు అక్కరలేదు. వీడికి అదే దిక్కు.

    "ఏందీ చిక్కు' అన్నాడు పెడసరపోడు పంతులుతో

    'ఈడు మొగాడే. అది ఆడదే. కానీ ఈడికి తేలుమంత్రం తెలిసినట్టు లేదు' అన్నాడు పంతులు. '

    "తేలుమంత్రం అంటే"

    "నీకు పెళ్ళయ్యాక తెలుసుద్ది."

    తన పెళ్ళాం తన దగ్గరకు రావాలంటే సిలారు సాయిబే గతి అని నాగడు భావించాడు. కొట్టటమో, తిట్టటమో కావాలి. నాగడికి ప్రసాదించాలి. ఆ దెబ్బకు తన భార్య కాపరానికి రావాలని సిలారు సాయిబును దూషించాడు. వాడు విన లేదు. వీడు నెట్టాడు. తిరిగి వాడు నెట్టలేదు. వీడు తిట్టాడు. మళ్ళీ వాడు తిట్ట లేదు. నాగడు కొట్టాడు. సిలారు సాయిబు నవ్వాడు.

    చూస్తూ ఉన్న పల్లెవాళ్ళు 'నాగడికి ఏదో మూడింది' అనుకొన్నారు.

    పెద్ద మాదిగ నాగజ్జి మందలించాడు. 'తప్పు' అని పంపించాడు.

    సిలారు సాయిబు చాలాసేపు నవ్వాడు. వాడంతగా నవ్వటం ఎవరూ చూడలేదు. 'వాడి నవ్వు వీడికి కీడు' అనుకొన్నారు.

    నాగడి పెళ్ళాం తెగతెంపులు చేసుకుంది. 'నీతో నాకు చెల్లు. ఇక ఏ సంబంధం లేదు' అని పదిమంది పెద్దల ముందు వాగ్దానాలు చేశారు. పెళ్ళి రద్దయింది. ఉన్నూరు పిల్లోడితోనే ఆమెకు పెళ్ళయింది.

    నాగడు భార్య కోసం కొంతకాలం ఏడ్చి గంజి కాచే మనిషి లేక మళ్ళీ పెళ్ళికుందామనుకున్నాడు. 

    తనకు ఈడైన వరసైన పిల్లలు ఊళ్ళలేరు. పొరుగూ లో సంబంధాలు కుదరలేదు. ఊళ్ళోనే ఉన్న మొగుడు సచ్చిన విధవరాలిని పెళ్ళి చేసుకుందామని చూస్తే 'గట్టిదనం లేనోణ్ణి నేనేం చేసుకొంటా'నంది.

    రెండేళ్ళకు రైలు కిందపడి నాగడు చనిపోయాడు. అప్పటి నుంచి సిలారు సాయిబును స్త్రీలు పురుషులు పిల్లా పీచూ మొక్క సాగారు. మొక్కులు వీడికి...

    25 min
  • సత్యం - చంద్ర కన్నెగంటి గారి రచన

    హర్షణీయానికి స్వాగతం.

    ఈ ఎపిసోడ్ లోని కథ 'సత్యం' శ్రీ చంద్ర కన్నెగంటి గారి రచన.

    ఇది వారి 'మూడో ముద్రణ' అనే కథా సంకలనం లోనిది.

    ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో ఇవ్వడం జరిగింది.

    గుంటూరు జిల్లాలో జన్మించిన శ్రీ చంద్ర కన్నెగంటి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగ నిపుణులుగా యూఎస్ ఏ లో పని చేస్తున్నారు.

    తానా పత్రికకు సంపాదకులుగా కూడా వారు ఇంతకు మునుపు , బాధ్యతలు నిర్వహించారు.

    గత మూడు దశాబ్దాలుగా వారి రాసిన కథలు, ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

    "రచయితగా నేనేమీ పాఠకుడికంటే నైతికంగానూ , బౌద్ధికంగానూ ఉన్నతస్థాయిలో లేను " అని నమ్రత తో చెప్పే చంద్ర గారు, ఉత్తమమైన కథా వస్తువులను ఎంచుకుంటూ , పాఠకులను ఆలోంచింపజేసే చాలా మంచి రచనలను చేస్తూ వస్తున్నారు.

    కథను హర్షణీయం ద్వారా అందించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీ చంద్ర గారికి కృతజ్ఞతలు.

    సత్యం:

    ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్య మయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్ లో జుట్టుకు వేసుకునే నల్లరంగు కొనుక్కున్నాడు. దానికితోడు ఒకటే వాన కావడంతో ట్రాఫిక్ గొడవ.

    ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్కడ వాతావరణం బిగుసు కుని ఉన్నట్లు తెలిసిపోయింది. రణగొణ ధ్వనులు చేసే టీవీ కట్టేసి ఉంది. పుస్తకం ముందేసుకుని కళ్ళు తుడుచుకుంటూ కూచుని ఉన్నాడు బాబు. పాప బిక్కచిక్కిన మొహంతో వాడివే పే చూస్తూ ఉంది ఆడటం మానేసి.

    “ఏమిటీ ఏమయింది?” ఆమెని అడిగాడు దగ్గరకొచ్చి కాళ్ళకు చుట్టుకున్న పాపను ఎత్తుకుని ముద్దాడుతూనే.

    “పోయినవారం వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ రావలసింది, ఇంకా రాలేదు. ఏదిరా అంటే వాడి టీచర్ ఇవ్వలేదంటాడు.”

    “ఇవ్వలేదేమోలే! అప్పుడప్పుడూ ఆలస్యమవుతుంది కదా!”

    “ఇన్ని రోజులు ఎప్పుడూ ఆలస్యం కాలేదు. వాడు చెప్పే తీరు చూస్తుంటే ఏదో దాస్తున్నట్టనిపిస్తుంది!”

    “మర్చిపోయాడేమో వాడి బ్యాగ్ లో వెతక్కపోయావా?”

     “వెతికాను. లేదు!”

    “నేనేమీ అబద్ధం చెప్పటం లేదు.” వెక్కి వెక్కి ఏడుస్తూనే అంటున్నాడు బాబు.

    “నువ్వు ఏడవటం ఆపు ముందు. పోనీ సోమవారం వాడి టీచర్ని కనుక్కుంటే పోతుంది కదా!”

    “వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు. మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా? అయినా సోమవారం దాకా ఎందుకు. ఇప్పుడే వాడి నోటితోటే నిజం చెప్పించాలి.”

    “వాడు అట్లా అబద్దమెందుకాడుతాడు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చని పిస్తూంది నాకయితే!” ఆమెకి దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పాడు వాడికి వినపడకుండా.

    “ఏమో ఏం తెలుసు? మనం నమ్మేం కనక అన్నీ నిజాలే. అయినా వాడి సంగతి నాకు తెలుసు. మీరు వాడి చేత నిజం చెప్పించగలిగితే చెప్పించండి, లేకపోతే నాకు వదిలేయండి.”

    ఎర్రటి కళ్ళూ, పసిబుగ్గల మీద కన్నీటి చారికలూ, మధ్య మధ్య చొక్కా చేతు లతో తుడుచుకుంటూ వాడి ఏడుపు చూస్తుంటే అబద్దమాడుతున్నట్టు అనిపించడం లేదు. 

    అట్లాగని అమెకి నచ్చచెప్పనూ లేడు.

    పిల్లలకెదురుగా వాదులాడుకోకూడదని వాళ్ళ మధ్య ఓ వొప్పందం. వాడు రక్షించమన్నట్టు తనవేపే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్. అయినా తల్లినుంచి కొడుకుని కాపాడేదేమిటి అని సర్దిచెప్పుకుంటూ పాపను తీసుకుని బెడ్ రూమ్ లోకి నడిచాడు.

    మామూలుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిన రోజు గొడవ వేరేగా ఉండేది. వాడి ఖర్మ కాలి అన్నిట్లోకీ వాడికి సైన్స్ లో తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడూ. ఇక వాడిని కూచోబెట్టి ముందు కోపంగానూ, చివరికి అనునయంగానూ వాడికి నూరిపోసేది సైన్సులో తొంభయి అయిదు శాతం కంటే మార్కులు తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో. 

    తర్వాత వాడికి వారం రోజులు టీవీ కట్.

    రాత్రిళ్ళు వాడి దగ్గరే కూచుని కదలకుండా, కదలనీయకుండా చదివించేది.

    చాలాసార్లు చెప్పాడామెకి. వాడినట్లా భయ పెట్టటం వల్లా, దండించటం వల్లా ఉపయోగమేమీ ఉండదనీ. వాడికి తక్కువ మార్కులు వచ్చినప్పుడు వాడికే పాఠం అర్థంకాలేదో, ఏ జవాబులు రాయటంలో తప్పులు చేశాడో కనుక్కుని వాడికి సాయం చేయాలనీ.

    పాపను కాస్త ముద్దు చేసి టీవీ ముందు కూచోబెట్టి స్నానం చేసి వచ్చేసరికి ఇంకా పరిస్థితిలో మార్పేమీ లేదు. వాడు అట్లాగే ముక్కు ఎగబీలుస్తూ, కళ్ళు తుడుచు కుంటూ ఉన్నాడు. ఆమె భోజనం వడ్డించి ఎదురు చూస్తూ ఉంది.

    “ముందా ఏడుపు ఆపి హోమ్ వర్క్ చేయి!" వాడిని కసిరాడు.

    వాడు బదులేమీ చెప్పలేదు.

    “ఇంతకీ వాడు తిన్నాడా?” ఆమెతో పాటు తింటూ అడిగాడు. 

    “తిన్నాడు,” పొడిగా చెప్పింది, అంతకంటే మాట్లాడటం ఇష్టం లేనట్టు. అతనూ మాట్లాడకుండానే భోజనం కానిచ్చాడు. ఆమె గిన్నెలు సర్దుతుంటే వాడి దగ్గరకొచ్చి కూచున్నాడు.

    “ఏరా నీకు నాన్నా పులి కథ చెప్పాను గుర్తుందా?" వాడు తల నిలువుగా వూగించాడు ఎత్తి చూడకుండానే.

    “నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావనుకో ఇక నీ మాట ఎవరూ నమ్మరు ఆ కథలోలాగా!”

    “నేను నిజమే చెబుతున్నా. అయినా మీరు నమ్మటం లేదు నన్ను!” ఏడుపు కాస్త ఎక్కువ చేసి అంటున్నాడు.

    “ముందు ఆ ఏడుపు ఆపు! నిన్నేమీ తిట్టలేదూ తన్నలేదూ ఇప్పుడు. మమ్మీ ఎటూ మండే మీ టీచర్ తో మాట్లాడుతుంది. నిజం ఎటూ తెలిసిపోతుంది. నువ్విప్పుడు చెప్పేది అబద్ధమని తెలిసిందనుకో, ఇక ఎప్పుడయినా నువ్వు చెప్పేది మేమెట్లా నమ్ముతాము? నువ్వు చెప్పేదేదీ మేం నమ్మకపోతే ఎట్లా ఉంటుంది నీకు?” 

    వాడు చెబుతున్నది నిజమే అయితే బాగుంటుందనిపిస్తుందతనికి. ఇద్దరి మధ్య సంబంధంలో నమ్మకం పోవటంకంటే దారుణమయినదేముంటుంది?

    “నేను అబద్ధమేమీ ఆడటం లేదు!”

    అతనికి ఒక పక్క జాలేస్తూంది. తమ పదేళ్ళ కొడుకు ఇంత పట్టుతో అబద్ధం చెప్పగలడా? ఒక మూల సందేహం. అనవసరంగా వేధిస్తున్నారా తామిద్దరూ వాణ్ణి ? వాడు నిజమే చెపుతున్న పక్షంలో వాడు క్షమిస్తాడా ఇక తమని?

    ఆమె వచ్చి అందుకుంది. “అది ఇంకో అబద్దం. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఆడుతూనే ఉండాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి తేకపోవటం ఒక తప్పు. ఇవ్వలేదని అబద్దం రెండో తప్పు. అబద్దమాడలేదని చెప్పటం మూడో తప్పు. నీకు ఒక తప్పుకయితే ఒక పనిష్మెంటే కదా? ఇన్ని తప్పులు చేసి మరికాసిని తన్నులు తినడం హాయిగా ఉంటుందా నీకు?”


    మరీ పోలీస్ స్టేషన్లో నేరస్థుడిని ఇంటరాగేట్ చేస్తున్నట్టనిపించి పక్కకి వెళ్ళాడు అతను.

    “సరే, నిన్నేమీ అనను. తిట్లూలేవు, దెబ్బలూలేవు. ఏ పనిష్మెంటూలేదు ఇప్పటి కిప్పుడు నిజం చెప్తా. మళ్ళీ మండే మీ టీచర్ని కనుక్కున్నాక నేనేం చేస్తానో నాకే తెలియదు.” వాడి వంకే చూస్తూ నెమ్మదిగా చెప్పింది.

    ఏం సమాధానం లేదు. “ఏం చేయనందికదరా ఇప్పటికయినా నిజం చెప్పు!" వెక్కటం ఆగింది. “అది... దార్లో పోయింది...” “పోయిందా... నిజం చెప్పు. ఏం చేయనన్నాగా! నాకు మొత్తం నిజం కావాలి!” “పడేశాను... దార్లో.” “ఎందుకు?” ఏం మాట్లాడలేదు.

    “ఎందులోనన్నా తక్కువ మార్కులు వచ్చాయా?” “సైన్సులో,” తల దించుకునే చెపుతున్నాడు. “ఎన్ని వచ్చాయి?” “డెభ్బయి రెండు.”

    బాబు చెంప ఛెళ్ మంది. ఒక క్షణం బిత్తరపోయి ఏడుపు ఆపేశాడు. మరుక్షణం బిగ్గరగా ఏడుపు అందుకున్నాడు. చేయి పట్టి గుంజి వీపు మీద రెండు దెబ్బలు చరిచింది. ఈలోపల అతను తేరుకుని ఆమెని ఆపాడు. వాడి ఏడుపు చూసి పాప కూడా ఏడుపు అందుకుంది.

    “వెధవ! గాడిద! అంత అబద్ధమాడతావా? ఎక్కడ నేర్చావివన్నీ? అప్పట్నుంచీ అడుగుతుంటే నోటమ్మట నిజం రాదా? ఇంత అబద్దాలకోరువు ఎట్లా అయ్యావురా?” అరుస్తూ ఆవేశంతో రొప్పుతుందామె.

    అతనికి నమ్మబుద్ది కాలేదు. ఏదో భార్య చెపుతుందని సందేహించాడు తప్ప, ఆమెదే పొరబాటని తెలిస్తే ఆమెను చీవాట్లు పెట్టటానికి సిద్ధమయే ఉన్నాడు. ఎంతో బుద్ధిమంతుడనీ, అమాయకుడనీ తాము అనుకునే కొడుకు ఇంత ఇదిగా అబద్దమెట్ల ఆడగలిగాడు? బాధా, అంతలోనే కోపమూ.

    “ఛీ! నీకు బుద్ధిలేదురా! అంత ఇదిగా నేనడిగినప్పుడయినా నిజం చెప్పొచ్చు గదా? ఇక నిన్ను జన్మలో నమ్మగలమా?” అంతకంటే ఏం తిట్టాలో కూడా తెలియ లేదతనికి.

    వాళ్ళమ్మే ఇంకో రెండు తగిలించింది. అతడూ ఈసారి అడ్డు వెళ్ళలేదు. వాడు ఏడుపు ఇంకా పెద్దది చేశాడు. “ముందా ఏడుపు ఆపు! ఆపుతావా... ఆ ఏడుపు ఆపుతావా లేదా?” అంటూ ఇంకొకటి వేసింది. “అసలు సైన్సులో డెభ్బయి రెండు రావడమేమిట్రా?” అని ఇంకొకటి.


    వాడు ఏడుస్తూనే, “కొట్టనన్నావు.... ఏం చేయనన్నావు....” అంటున్నాడు పెద్దగా. అప్పటికే బుగ్గమీద నాలుగు వేళ్ళు పొంగాయి.

    “కొట్టక ముద్దు పెట్టుకుంటారేం మరి నువు చేసిన నిర్వాకానికి?”

    “అబద్ధమాడావు... నువ్వూ అబద్ధమాడావు...” ఏడుపూ మాటలూ కలగలిశాయి.

    “మామూలుగా అడిగితే చెప్పావా నువ్వు? ఇంకా నోరెత్తావంటే మండిపోతుంది నాకు. పో, నీ గదిలోకి పో!” అరిచిందామె.

    “నేను పడుకోబెడతాలే,” అంటూ ఏడుస్తున్న పాపని ఆమెకి అందించి వాణ్ణి లాక్కెళ్ళాడు.

    వాడి పక్కనే పడుకుని వాడు ఏడుపు తగ్గాక మొదలు పెట్టాడు. “అసలు నువ్వేం చేశావో అర్థమయిందా నీకు? అబద్దమెందుకాడావు? అబద్దాలాడకూడదని ఎన్నిసార్లు చెప్పాము? అబద్ధమాడితే కళ్ళు పోతాయని చెప్పలేదూ?”

    వాడు కొంచెం తేరుకున్నాడు. “అదేం నిజం కాదు. నాకు కళ్ళేం  పోలేదు.”

    నవ్వొచ్చినా పైకి నవ్వలేదు. “ఇంత తెలివయినవాడివి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పటిలా ఇంటికి తీసుకుని వస్తే ఈ రాద్ధాంతమంతా ఉండేది కాదు కదా!”

    “మార్కులు తక్కువ వచ్చాయని అమ్మ కొడుతుందని భయమేసింది.”



    “ఇప్పుడు మాత్రమేమయింది? అసలు ఎక్కడ నేర్చావు ఈ అబద్దాలాడటం? స్కూల్లో పాడుపిల్లల స్నేహాలవీ చేస్తున్నావా?”

    ఏం మాట్లాడలేదు.

    “అసలు అమ్మానాన్నల దగ్గర అబద్ధం చెప్పొచ్చా? నీ మంచికోరే కదా మేం తిట్టినా కొట్టినా!”

    “మీరూ నాతో అబద్ధం చెప్పారు కదా?” ““మేమా? ఎప్పుడురా?” “అప్పుడు నా బర్త్ డేకి స్పైడర్ మాన్ గేం కొని పెడతానని ప్రామిస్ చేసి కొనివ్వలేదు.”

    “అన్ని డబ్బులు పోసి అది కొనటం దండగని చెపితే నువ్వు వినవుగదా మరి?”

    “అయినా అబద్ధమేగా! మమ్మీ ఏమో నాకు స్కూల్లో గెస్ లో థర్డ్ ప్రయిజు వస్తే ఫస్ట్ వచ్చానని అందరికీ చెప్పింది.”

    అతనేం మాట్లాడలేకపోయాడు.

    “మొన్నేమో ఆ అంకుల్ ఫోన్ చేస్తే మీరు ఇంట్లో ఉన్నా లేరని చెప్పమంది మమ్మీ. అదీ అబద్దమేగా!”


    అదృష్టవశాత్తూ వాళ్ళమ్మ వచ్చింది, “నేను పడుకోబెడతాలే వీణ్ణి,” అంటూ.

    బాబుని నిద్రపుచ్చి వచ్చి పడుకుంటూ అంది, “వీడిట్లా తయారయాడేమిటి? పెద్ద అబద్దాలకోరవుతాడేమోనని భయంగా ఉంది. మన పెంపకంలో లోపమం టారా?”

    “అంతప్పుడు నువ్వేమీ అబద్దాలు ఆడలేదా?” 

    “ఆడే ఉంటాను. మా అమ్మ ఏమనేది కాదుగానీ మా నాన్న చావబాదేవాడు.”



    “నాకయితే గిల్టీగా ఉంది. మనం తప్పు చేస్తూ, వాణ్ణి అదే తప్పు చేయొద్దని ఎట్లా చెప్పగలం, దండించగలం? ఎక్కడో చివుక్కుమంటూ ఉంటుంది మనకు, నైతికంగా ఆ హక్కు ఉందా అని!”

    “అదేమిటి మనమేమన్నా అబద్ధాలాడుతున్నామా ఏమిటి ఇప్పుడు?”

    “మనకి మనమాడే అబద్ధాలు అంతగా అలవాటు అయిపోయినట్లున్నాయి. ఎందుకూ, వాణ్ణి ఇందాక కొట్టనని చెప్పి నమ్మించి నిజం చెప్పాక కొట్టావా లేదా?”

    “అది వాడి మంచికే కదా! వాడి వ్యక్తిత్వానికి సంబంధించి భవిష్యత్తులో వాడికి దీనివల్ల జరిగేది మేలే కదా! మనమాడే అబద్దాలు ఎవరికీ కీడు చేయనంతవరకూ తప్పేముందందులో?”

    “అబద్ధమన్న తర్వాత ఏదైనా అబద్ధమే! చిన్నదీ, పెద్దదీ, హానికరమయిందీ, కానిదీ అనుకునేది మనని మనం సమర్థించుకోటానికే!”


    “ప్రాణాపాయ స్థితిలో ఆడే అబద్ధమూ, ఇంకొకరిని మోసంచేసి దోచుకునే అబద్ధమూ ఒకటేనా?”

    “రెంటికీ మధ్య గీత ఎవరు గీస్తారు. ఇవి మంచి అబద్దాలూ, ఇవి చెడ్డ అబద్ధాలూ అని. నువు రెజ్యూమ్ లో లేని ఎక్స్ పీరియన్స్ పెట్టి ఉద్యోగం సంపా యించావు.

    దానిమూలాన న్యాయంగా ఇంకెవరికో రావలసిన ఉద్యోగం రాలేదు. ఇప్పుడది మంచి అబద్ధమేనా?”

    “అంటే మీరు చెప్పేదేమిటి? వాడికి అబద్దాలాడొద్దని చెప్పటం తప్పంటారా? ఇక తల్లిదండ్రులంతా పిల్లలికి మంచిచెడ్డలు నేర్పడం మానేసి వాళ్ళ మానానికి వాళ్ళని వొదిలేయాలా? వెనకటికి ఆ దొంగ ఎవడో తల్లి చెవి కొరికి తోటకూర నాడే తన్నకపోతివి కదమ్మా అన్న కథ గుర్తులేదా?”

    “వాడెదురుగా మనం అబద్దాలాడుతూ ఉంటాము. వాడికి అబద్దాలాడ కూడదు అని చెబుతుంటాం. వాడేం గ్రహిస్తాడు దీన్నుంచి? వాడికి మనమేమీ మంచి అబద్దాలాడొచ్చు, చెడ్డ అబద్దాలాడకూడదు అని చెప్పం కదా? మంచీచెడులు నలుపూ తెలుపులన్నంత తేలిగ్గా విడమరిచి చెప్పేవేనా?”

    “నాకసలే వాణ్ణి కొట్టినందుకు తిక్కగా ఉంది. ఈ వాదనలన్నీ మొదలు పెట్ట కండిప్పుడు,” అంటూ అటు తిరిగి పడుకుంది.

    తమతో అబద్ధం చెప్పినందుకు కోపమొచ్చి కొట్టిందా లేక వాడు ఇక అబద్దా లాడకుండా బెదిరించడానికి కొట్టిందా?

    “నాకనిపించిందేమిటంటే వాడు అబద్ధాలాడాడన్న దానికంటే మనతో అబద్ధం చెప్పాడన్న సంగతి మనని ఎక్కువ బాధిస్తుందని!"

    ఆమెనించి బదులు లేదు.


    మరుసటి రోజు ఉదయం బాబు చెల్లితో ఆటల్లో మునిగిపోయాడు.

    రాత్రి జరిగింది వాడికి ఏమీ గుర్తుకూడా ఉన్నట్లు లేదు.

    వాళ్ళ కొడుకుని తీసుకుని అమె తమ్ముడు వచ్చాడు, “పిల్లల్ని జూకి తీసుకు వెళతానక్కా!” అంటూ.

    పిల్లలిద్దరూ మామ చేతిలో నుంచి చాక్లెట్లు తీసుకుని మళ్ళీ ఆటల్లో పడ్డారు.

    “జూ లేదు పాడూ లేదు పాపని తీసుకెళ్ళు. వాడు రాడులే!" “అదేమిటి? వొంట్లో బాగా లేదా ఏమిటి? బాగనే ఆడుతున్నాడుగా?” “వాడికి పనిష్మెంట్ లే!” అతడు చెప్పాడు.

    “ఎందుకు ఏం చేశాడేమిటి? వీడు అల్లరి పనులు చేసే రకం కాదుగా!” వాళ్ళబ్బాయయితే అల్లరీ మొండీ.

    “నిన్న రాత్రి వాడికి పడ్డయిలే! మార్కులు తక్కువ వచ్చినయ్యని ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించకుండా పారేసి వచ్చాడు,” ఆమె చెప్పింది.

    “ఆ మాత్రానికి కొట్టాలా? ఆ లెక్కన మావాడికి రోజూ బడితె పూజ చెయ్యా ల్సిందే!” నవ్వాడు.

    “అసలు స్కూల్లో రిపోర్ట్ ఇవ్వలేదని మళ్ళీ మాతోటి అబద్దాలు. ఇప్పుడు అబద్దాలతో మొదలవుతుంది, రేపు దొంగతనాలదాకా వస్తుంది. రాత్రంతా ఒకటే దిగులు...” తమ్ముడికి కాఫీ ఇస్తూ చెప్పిందామె.

    “అంత సీను లేదులే అక్కా!” తీసి పారేశాడు తమ్ముడు. “అదేదో సినిమాలో చూపించలా, అంతా నిజమే చెప్పాలంటే కుదిరేపని కాదు. ఆ హరిశ్చంద్రుడి కథ చెప్పి పిల్లల్ని ఎన్నాళ్ళు మభ్య పెడతాం?"

    “చాల్లే నువ్వు పిల్లలకి ఇదే నేర్పు!” కసురుకుంది.

    “నన్నడిగితే అబద్దాలాడారని కాదు, సరిగ్గా అబద్ధమాడలేకపోతున్నారని దిగులుపడాలిప్పుడు. ఈ స్కూళ్ళలో ఆర్ట్ ఆఫ్ లయింగ్ అని కోర్సు మొదలు పెడితే బావుండనిపిస్తుంది. పిల్లలు ఆ మాత్రం స్ట్రీట్ స్మార్ట్ గా ఉండకపోతే రేపు ఎట్లా బతుకుతారు?”

    భార్యాభర్తలిద్దరూ మాట్లాడలేకపోయారు.

    “రేయ్.... పదండ్రా బట్టలు మార్చుకుని! జూకి వెళదాం!” పిల్లల్ని కేకేసి చెప్పాడు. “రాత్రికి రండక్కా అక్కడే డిన్నర్ చేద్దాము!” అంటూ లేచాడు.


    పుస్తకం వివరాలు :

    'మూడో ముద్రణ ' డిజిటల్ ఎడిషన్ కొనడానికి క్రింది లింక్ ని ఉపయోగించండి.

    https://kinige.com/book/Moodo+Mudrana

    *Intro- outro BGM credits: *Intro- outro BGM credits: en vanile - jingle man (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    16 min
  • కే ఎన్ వై పతంజలి గారి 'మోటుమనిషి '

    "సామాజిక పరిణామాల్లో మంచికో చెడ్డకో బాధ్యులు కానివారెవ్వరూ ఉండరు. నా చుట్టూ ఉన్న సమాజం ఇంత దుర్మార్గంగా ఉండడానికి కచ్చితంగా నా బాధ్యత ఎంతో కొంత ఉండి తీరుతుంది. అది మార్చడానికి ఎంతో కొంత నా భాగస్వామ్యముంటుంది. ఆ బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు" - సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు కె ఎన్ వై పతంజలి .

    హర్షణీయానికి స్వాగతం.

    ఇప్పుడు పరిచయం చేయబోతున్న కథ పేరు 'మోటుమనిషి'.

    ఈ కథను హర్షణీయం ద్వారా పరిచయం చేయడానికి అనుమతినిచ్చిన శ్రీమతి ప్రమీల పతంజలి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

    పతంజలి గారి సాహిత్యం , మీరు కొనేటందుకు కావలసిన వివరాలు ఇదే పేజీ లో ఇవ్వబడ్డాయి.

    పతంజలి గారు , అనేక కథలూ నవలలూ రాయడమే గాక, మూడు దశాబ్దాలకు పైగా పత్రికారంగానికి కూడా తన సేవలను అందించారు.

    తెలుగు కథ ను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన కే ఎన్ వై పతంజలి గారి గురించి, ఆయన చిరకాల మిత్రులు , సుప్రసిద్ధ రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు ఏమంటారంటే

    '' రచయిత అయినవాడు తన ఆవరణంలోంచి ఎదిగి మరో ఆవరణం నుంచి జీవితాన్ని దర్శించగలగాలి. అట్లా దర్శించగలిగిన వాళ్లు గొప్ప రచయితలుగా మిగిలిపోతారు. ఒక సంకుచితమైన పరిమితిని విధించుకుని చేసే రచనలకీ వార్తా కథనాలకీ పెద్ద తేడా ఉండదు. ప్రపంచ సాహిత్యంలో గొప్ప వనుకుంటున్న రచనలన్నీ సమకాలీనతని జీర్ణించుకుంటూనే దాన్ని అధిగమించినవే. పతంజలి రచనలు ఆ కోవలోకి వస్తాయి.మంచి రచనకీ గొప్ప రచనకీ ఉండే మౌలికమైన భేదం అదే. పూర్తిస్థానీయత, సమకాలీనత రచయితకి సంకెళ్లు కాకూడదు. గొప్ప రచన అనేక పొరలుగా, అనేక స్థాయిలలో పాఠకుడికి చేరువవుతుంది. అట్లా ఎప్పుడు ఏ కాలంలో చదివినా పాఠకుడు ఆ రచనలో రిలేట్ అవుతాడు. అటువంటి రచనలు ఉత్తమ సృజనాత్మకతకి ఉ దాహరణలు..."

    మోటుమనిషి

    అతని వయసు నా వయసుచేత రెండుసార్లు భాగారింపబడుతుంది. అతని ఒళ్లు కూడా నా సైజు ఇద్దరు మనుషులకు సరిపడా ఉంది. అతను వ్యవసాయదారుడే అయిన పక్షంలో, పొలానికి సరిపడే ఎరువు అతని ఒంటినే ఉంది.

    కాని, వెధవకి బుద్దే ఉన్నట్టు లేదు. ఖచ్చితంగా చెప్పగలను. లేదు. ఉంటే నేనతన్ని మర్యాదగానే - "మీరు నా సీట్లోకి వచ్చేస్తారా - నా కా కిటికీ పక్క చోటిచ్చేసి?” అనడిగినప్పుడు - “రాను... నాను సుట్ట కాల్చుకోవాలి” అని నిర్మొహమాటంగా చెప్పడు.

    'వీణ్ణి చుట్ట కాల్చుకోనివ్వకూడదు.” గట్టిగా నిశ్చయించుకున్నాను. బస్సు వేగంగా పోతూంది. గాలికి కామోసు అతని తలమాత్రం కొంచెం కదులుతూంది. జిడ్డు తల.

    అరచేతులంతేసి చెవులు. వాటికి స్కూటర్ చక్రాలంతేసి తమ్మెట్లు. వాటికి మురికి పూసుకున్న ఎరుపూ, తెలుపూ పొళ్లు.

    బుద్ది లేకపోయిన తరువాత ఇంకా ఏమేం ఉంటే మాత్రం ఏమిటి లాభం ? అసలు ఉదయం లేచిన దగ్గరి నుంచి తల నొప్పిగా ఉంది. దరిద్రపు తలనొప్పి, తెలుగు సినిమాలాగన్నా వచ్చిన వెంటనే తిరిగిపోదు. నిద్రలేచి మంచంమీద నుంచి కాళ్లు కింద మోపేసరికి, పనిలేని పెళ్లాం లాగ, పనున్న స్నేహితుడిలాగ వచ్చేసి నెత్తికెక్కి కూర్చుంది దిక్కుమాలిన తలనొప్పి.

    మళ్లీ పక్కన కూర్చున్న నాయుడికేసి చూశాను. అతను కిటికీలోంచి కనబడుతూన్న చెట్లకేసీ, చేమలకేసీ కాబోలు దీక్షగా చూస్తున్నాడు. వీడి దృష్టి తగిలితే అవి చటుక్కున చచ్చి ఊరుకుంటాయి.

    వీడు ఎంతకీ చుట్ట కాల్చటానికి ప్రయత్నించటం లేదు. ఇలా వాడు చుట్ట తీసి ముట్టించ ప్రయత్నించడం, నేనిలా మొదట ఇంగ్లీషులోనూ తరువాత తెలుగులోనూ అభ్యంతరం చెప్పి పగ తీర్చుకోవడం - ఈ పూటకి సరదా తీరేలా లేదు.

    కిటికీ పక్క సీటయితే ఓ చేయి కిటికీ చువ్వల మీద ఆన్చి, రెండో చేయి ఎదుటి సీటు తాలూకు చట్రం మీద ఆన్చి, చేతుల మీద తలాన్చుకుని పడుకోవచ్చు - ముఖ్యంగా ఇలా తలనొప్పిగా ఉన్న సమయాల్లో,

    కానీ, ఈ భారతదేశపు హృదయాలయిన పల్లెటూరి తాలూకు పౌరుడు, రాతి గుండెవాడు. ఎక్కడ దిగిపోయి నన్ను సంతోష శిఖరాల మీదికి ఎక్కిస్తాడో? “ఎక్కడ దిగుతారు?” అడిగాను. 

    అతను నాకేసి పరీక్షగా చూశాడు. “సోడారం.” చచ్చాం .

    వీడు నన్ను చివరివరకూ వదలడు. “మందే ఊరు?” నాయుడడిగాడు నన్ను.

    నా ఎడమచేతి పక్కకి చూశాను. ఓ ముఫ్ఫై ఏళ్ళ వయసున్న టెరిలిన్ బట్టల ఆసామీ వీక్లీ ఒకటి మధ్యకి మడత పెట్టి చదువుతున్నాడు.

    “ఎక్కడి కెళ్తన్నావు?” నాయుడే మళ్లీ అడిగాడు.

    గొంతు తగ్గించి, “వెస్ట్ జర్మనీ” అన్నాను నెమ్మదిగా. నాయుడికి అర్థమయినట్టు లేదు. “అదెక్కడ?” ఆశ్చర్యంగా అడిగాడు.

    “చోడవరానికి ఇంకా అవతలుందిలే” అన్నాను.

    “చోడారంలో ఈ బస్సాగిపోద్ది. ఆ మీదికెళ్ళదు.” నాయుడు ముతకగా నవ్వాడు.

    “చోడవరంలో దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే.” విసుగ్గా అన్నాను.

    దెబ్బతో నోరు మూసుకున్నాడు.

    బస్సు ఆగింది. చిన్నాపురం జంక్షన్. ఇద్దరో ముగ్గురో దిగి, ఆరుగురనుకున్నాను కానీ - ఏడుగురెక్కారు.

    లాభం లేదు. నాకు తెలియకుండానే ఏయే ఊర్లలో ఎందరెందరు దిగి ఎంతమందెక్కారో లెక్క పెడుతూ చెక్కర్ ఉద్యోగం చేస్తున్నాను.

    తలనొప్పి రానురానూ ఎక్కువవుతూంది. చిరాకుగా ఉంది.

    జీనియస్సులు పరాకుగాను, కాదలుచుకునే నాలాంటి జీనియస్సులు చిరాకుగానూ ఉంటారు కామోసు. .

    పక్కాయన్ని వీక్లీ అడిగినా బాగుండును. చూసి ఇచ్చేయవచ్చు. సరే “వీక్లీ ఓసారిస్తారా?” అడిగాను.

    అతను నాకేసి సీరియస్ గా చూశాడు.

    “ఇవ్వను.” ఖచ్చితంగా చెప్పాడు. ఆహా! దుర్మార్గుడు. పైగా హృదయం లేనివాడు. ఏ కో-ఎడ్యుకేషన్ లేని కాలేజీకో ప్రిన్సిపాలుగా ఉండదగ్గవాడు.

    కుడిచేతి పక్క నాయుడే బెటర్. అడిగితే చుట్టన్నా ఇచ్చేలా ఉన్నాడు.

    చుట్టేం ఖర్మ? గారంటీగా భుజంమీదున్న తువ్వాలు కూడా ఇచ్చేసే అంత ధాటీగా ఉన్నాడు.

    కానీ, నాకు కావలసిన ఆ కిటికీ పక్క సీటే ఇవ్వడు.

    పక్కనున్న వీక్లీ వెధవని టైమడిగితే, అదన్నా చెబుతాడా? చెప్పకపోయినా చెప్పకపోవచ్చు. ఏ దుర్మార్గుడి నోటి వెంట ఎలాంటి సమాధానం వస్తుందో ఎవరికి తెలుసు?

    వీడిని టైముగాని, వీక్లీగాని, అప్పుగాని ఏమీ అడగకూడదు. నాయుడిని చుట్టకాని, సీటు కాని, ఓ భోగట్టాకాని అడగకూడదు.

    పక్కవాడిని అడగనవసరం లేకుండానే టైమెంతో తెలుసుకోవచ్చు. ఈజీ. వాడు చేయి కిందకి దించినప్పుడు

    చూశాను.

    “ఒంటిగంట.” పెళ్లికెళ్ళి జోడు పోగొట్టుకున్న వాడిలాగ ఎండ మండిపోతూంది.

    చోడవరం చేరడాని కింకా గంటన్నర టైముంది. గంటన్నర... దుర్మార్గులిద్దరి మధ్యా... ముఖ్యంగా తలనొప్పితో.

    పరీక్ష హాలులో మూడు గంటలు తెల్ల కాగితం వాడకుండా ప్రయత్నం మీద కూర్చోవచ్చు. తెలుగు నాటకం కాని, సినిమా కానీ కదలకుండా చూడొచ్చు ఆ మాటకొస్తే.

    కానీ, వీళ్ళద్దరి మధ్యా...???

    భోజనం చేసి విజయనగరంలో బస్సెక్కెను. ఎంతో పాపం చేసుకోబట్టి వీద్దరి మధ్యా పడ్డాను. ఇంకో సీట్లోకి మారిపోవచ్చు. ప్రభుత్వం కాని, కండక్టర్ కాని, ప్రయాణికులు గాని ఎవరూ అభ్యంతరం చెప్పరు.

    కానీ, ఇంకే సీటూ ఖాళీగా లేదు.

    బస్సు అక్కడక్కడ ఆగుతూ జిడ్డుగా ముందుకి వెళుతూంది. తలనొప్పి మాత్రం ఎక్కడా ఆగకుండా చురుగ్గా పెరుగుతూంది.

    కొంతమంది మగాళ్ళని చూస్తే చిరాకేస్తుంది. చంపేయబుద్ధవుతుంది.

    నమ్మకంలో ప్రస్తుతం కుడి ఎడమయినా పొరబాటు లేదు.

    ఈ చిరాకూ, తరవాతదీ మగవాళ్ళకి మాత్రమే పరిమితం.

    అదేమిటో గాని అమ్మాయిల్ని ఎవర్ని చూసినా చిరాకెయ్యదు. పైగా ఎంతో ముచ్చటేస్తుంది. అదీ గమ్మత్తు.

    బస్సు జిడ్డుగా ముందుకు పోతూంది. గాలి మొహమాటపడి వీస్తున్నా - నాయుణ్ణి దాటి నా దగ్గరికి చేరలేక పోతూంది. చిరాకుగా ఉంది.

    ముందు సీటుకి చేతులాన్చి, చేతులమీద తల వాల్చి పడుకున్నాను. దుమ్ము పూసుకున్న నాయుడి రాకాసి పాదాలు టైరు చెప్పులు వేసుకుని ఉన్నాయి. కాళ్ళ వెనక, సీటు క్రింద మైకా సంచీ ఒకటి ఉంది.

    కళ్లు మూసుకున్నాను. కళ్లు మూసుకుంటే ఒళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. కళ్లు విప్పి కిందికి చూస్తున్నాను.

    నాయుడు క్రిందికి వంగి కాళ్ళ మధ్య నుంచి మైకా సంచీ ఇవతలికి లాగాడు.

    దాన్నిండా వేరుశెనక్కాయలు, రెండు గుప్పిళ్ళు తీసి కాలితో సంచీ మళ్లీ వెనక్కి తోసేశాడు.

    బహుశా గడ్డి తవ్వడానికో, గొడ్డలితో కర్ర మొద్దులు చీల్చటానికో పుట్టిన మొద్దు వేళ్ళతో వేరుశనగ ఒలుస్తున్నాడు. చిటుకూ, చిటుకూమని.

    ఒలుస్తున్న చప్పుడు. నములుతూన్న మెత్తని, అసహ్యకరమయిన శబ్దం... క్షణాలు గడుస్తున్న కొద్దీ అన్ బేరబుల్ గా, పెయిన్ ఫుల్ గా ఉంది.

    బస్సు ముందుకి వెళుతున్న కొద్దీ దూరంతోపాటు ఓర్పు తగ్గుతూంది.

    చిటుక్... చిటుక్... చెవుల్లో కాదు, మెదడులో కాదు నా సహనం మీద సమ్మెట దెబ్బలు.

    దుర్భరంగా ఉంది. నా పక్క ఉన్న ప్రిన్సిపాల్ బుద్ధులున్న వీక్లీ వాడి కిదేం పట్టినట్టు లేదు.

    వెధవలు. ప్రక్క మనిషి బాధ అర్థం కాదు.

    సినిమా చూసేవాడి బాధ తీసేవాడికి అర్థం కాదు. చదివేవాడి అవస్థ వ్రాసేవాడికి అక్కర్లేదు.

    బస్సులో కూర్చున్న వాడి బాధ కండక్టర్ కి అవసరం లేదు.

    రిజల్ట్ను చూసే విద్యార్థుల ఘోష కంపోజ్ చేసేవాడికి అక్కర్లేదు.

    ముఖ్యంగా ఇల్లాంటి రూట్ బస్సులలో నాలాంటి నాజూకు మనిషికి నరకం.

    అసలు అడ్డమైన వాడినీ బస్సులలో ఎక్కనివ్వకూడదు.

    ఎక్కనిచ్చినా బస్సులో కూర్చుని ఏ గడ్డీ నమలరాదని రూలింగివ్వాలి.

    తింటే జేబులోని డబ్బులన్నీ లాక్కుని సగం దారిలో దించెయ్యాలి.

    నా మటుకు నాకో రోజు సర్వాధికారం ఇస్తే, ఈ నాయుడితో మొదలెట్టి అనాగరికులందరినీ ఉరి తీయించి పారేస్తాను.

    అఫ్ కోర్స్! మనకి ఇష్టంలేని లెక్చరర్స్ నీ, ప్రిన్సిపాల్స్ నీ, కొంతమంది కథకుల్నీ, మరికొంతమంది సినిమావాళ్ళనీ, కొంతమంది ఆడపిల్లల తాలూకు క్రూరులైన తండ్రుల్నీ ఈ స్కీములో కలిపేయవచ్చు.

    ఎన్నయినా చేయచ్చు కాని, ఈ నాయుడు చేత శనక్కాయలు తినడం మాత్రం తక్షణం మానిపించలేం.

    తలనొప్పి తల కొరుకుతూనే ఉంది. వేరుశనగ తింటూనే ఉన్నాడు నాయుడు. నా చేతిని లేని, నాది కాని, నా ప్రక్క ఉన్న ప్రిన్సిపాల్ పోలికగాడి చేతినున్న గడియారం తిరుగుతూనే ఉంది. 

    బస్సు కొత్తవలసలో ఆగింది.

    ప్రిన్సిపాల్ దిగిపోయాడు. అతను ఖాళీ చేసిన స్థలంలో ఒక బెల్ బాటమ్ అబ్బాయి కూర్చున్నాడు. ఎర్రగా, నాజుకుగా, సన్నగా ఉన్నాడు. నాకేసి చూసి పలకరింపుగా నవ్వాడు.

    నాయుడు జంతికలు కొనుక్కుని, గ్లాసుడు మజ్జిగ కొనుక్కుని తాగాడు. ఇండీసెంట్, అన్ హైజినిక్. అడ్డమయిన గడ్డి తినడం, తాగడం. మొత్తం సమాజం ఇంకా తిండి అవస్థకి మించి ఎదగలేదు.

    కొంతమంది దిగారు కాని, నా నెత్తిమీదున్న తలనొప్పి మాత్రం దిగలేదు. కొంత సేపు పోయిన తరువాత బస్సు బయలుదేరింది. తలనొప్పికి తోడు, ప్రాణాల్ని తినేస్తున్న దరిద్రపు జంతికల చప్పుడుకు తోడు కడుపులో తిప్పుతూంది. నోట్లో విజృంభిస్తున్న ఉమ్మి.

    కొత్తగా వచ్చి కూర్చున్న కుర్రాడు అతి మంచివాడులాగానూ, సంస్కారవంతుడు లాగానూ ఉన్నాడు. స్నేహపూర్వకంగా నవ్వి వక్కపొడి ఆఫర్ చేశాడు. మొహమాటపడినా ఒకే ఒక్క పలుకు మాత్రం తీసుకున్నాను. అంతమంచి అబ్బాయితో మంచీ చెడ్డా మాటాడితే బాగుండును.

    కానీ, ఒంట్లో ఓపిక మాత్రం లేదు. బస్సు మెలికలు తిరుగుతూంది. కడుపులో తిప్పు లావయింది. భోజనం చెయ్యకుండా బస్సెక్కి ఉండవలసింది.

    లాభం లేదు, లాభం లేదు. వాంతయ్యేట్టుంది. ఇంక ఆగేలా లేదు. దుస్సహంగా ఉంది. భళ్లున వాంతి అయింది.

    నా బూటు మీదా, నాయుడి దుమ్ము కొట్టుకున్న పాదాల నిండా అసహ్యంగా అరిగీ అరగని అన్నం మెతుకులు. నాయుడీ వేళ నా అంతు చూస్తాడు... తప్పదు.

    “అరర్రే!...” నాయుడు గాభరా పడ్డాడు. ఇక తన్నడం తరవాయి.

    “ఏక్...”

    నా పక్కనున్న అబ్బాయి అసహ్యించుకుని లేచి ముందుకు వెళ్లి నిలబడ్డాడు. చివుక్కుమంది మనసు.

    “ఛ! ఛ! కొంచెం చెబితే బస్సాపుదుం కదండీ... ఫ్లోరంతా పాడయిపోయింది.” కండక్టర్ విసుక్కున్నాడు.

    ఒళ్లు స్వాధీనం తప్పుతూంది. గుండెలు ఎంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. ముందుకు తూలి ఎదుటి సీటుకి నుదురు కొట్టుకుంది.

    “అరర్రే... పాపం...” నాయుడి గొంతుకే అది.

    నా తలని, గడ్డి తవ్వడానికీ, కట్టెలు చీల్చటానికీ, వేరుశనగ మోటుగా ఒలవటానికి పుట్టాయనుకున్న మోటు చేతులే జాలిపడి అప్యాయంగా పట్టుకుని, దుమ్ముపట్టిన, తెగ మాసిన, అసహ్యకరమయిన ఒడిలోనే పడుకో బెట్టుకున్నాయి.

    ***************

    పుస్తకం వివరాలు :

    'పతంజలి సాహిత్యం : సంపుటం - 2'

    పుస్తకం కొనడానికి 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

    నవోదయ బుక్ హౌస్

    3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

    ఫోన్ నెంబర్: 90004 13413

    https://kinige.com/book/Patanjali+Sahityam+Volume+2

    లేదా డిజిటల్ ఎడిషన్ కొనడానికి పై లింకుని క్లిక్ చెయ్యండి.

    *Intro- outro BGM credits: Envanile | Jingleman (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    16 min
  • రావిశాస్త్రి గారి 'వర్షం'

    హర్షణీయానికి స్వాగతం.

    “ రచయిత ప్రతివాడు, తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో , ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను.” ఈ మాటలన్నది తెలుగు కథారచయితల్లో అగ్రగణ్యుడుగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు.

    కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని, కథల్లో రావిశాస్త్రి గారు చేశారని, 1993 లో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది.

    తన రచనలకు ప్రదానం చేసిన ‘సాహిత్య అకాడమీ’ పురస్కారాన్ని, ఆంధ్రా యూనివర్సిటీ వారి ‘ కళాప్రపూర్ణ’ బిరుదుని ఆయన తిరస్కరించడం గూడ జరిగింది.

    ఇప్పుడు మీరు వినబోయే ‘ వర్షం ‘ ఆయన రచించిన అనేక అత్యుత్తమ కథలలో ఒకటి. 

    ఈ కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి, తన అనుమతిని ఇవ్వడమే కాక, ఆడియో రూపంలో రావడానికి ఎంతో సహకరించిన శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి గారికి , మా కృతజ్ఞతలు.

    ఈ కథ అరసం వారు ప్రచురించిన, రావిశాస్త్రి గారి కథాసంకలనంలోనిది.

    ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు వెబ్ పేజీ చివరలో అందించడం జరిగింది.

    వర్షం: 

    వర్షం దబాయించి జబర్దస్తీ చేస్తోంది. సాయంకాలం అవుతోంది. 

    మబ్బులవల్ల, మామూలుకంటె, చీకటి ఎక్కువగా వుంది. రోడ్డుపక్క కమ్మలపాక - టీ దుకాణంలో

    చీకటి చికాగ్గా వుంది. 

    అడివిపాలెంనుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబుని ఉద్దేశించి,

    “మూడ్రోజులక్కాని ఒగ్గ దీ ఒరసం” అన్నాడు దుకాణం తాత. ఒగ్గితే సెవి కదపాయిస్తానన్నాడు. 

    బల్లమీద దిగులుబడి కూర్చుండిపోయేడు, సిటీబాబు అనబడే పురుషోత్తం. 

    “టేసన్ కి కదు బాబూ ఎళ్ళాలన్నావు?” ఆకాశం మెరుపుతో చీల్చుకొంది. 

    “అవును” 

    “అబ్బో! ఎక్కడ, రొండుకోసులుందే!" అన్నాడు దుకాణం తాత. 

    పిడుగు పడ్డట్టుగా ఉరిమింది.

     “ఏఁవిఁటీ?" 

    “రొండుకోసు లుందయ్యా బాబూ! బొగ్గులకోసం కుట్టోణ్ని అక్కడికే తగిల్నాను. సదువుకోనేదుగాని నాకేరికే. రెండుకోసులుంది” అది రెండువేల మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పేడు దుకాణం తాత.

    “బస్సు దొరకదా?” అని హీనస్వరంతో అడిగేడు పురుషోత్తం.

    “ఈ ఒరసంలో బస్సు రాగల్గా? ఎర్రటి నీకు - ఉత్తప్పుడేరాదు. మా కుర్రాడు నడిసే ఎళ్ళేడు. " 

    పురుషోత్తానికి కొంచెం గాభరా వేసింది. అత్యవసరమైన పనిమీద అతను కలకత్తా వెళ్ళవలసి వుంది. మూడు రోజుల లోపల అక్కడికి వెళ్ళాలీ అంటే మరో రెండుగంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి. బస్సు రాదట. బళ్ళు కనిపించవు. వర్షం చూస్తే పెను ప్రళయంలా ఉంది.

    “నేను కలకత్తా వెళ్ళాలే" అన్నాడు పురుషోత్తం 

    “ఏ వూరూ?” “అబ్బో! శానా దూరఁవేఁ! అక్కడి కెళ్ళాలా నువ్వు?” 

    “అవును” అన్నాడు పురుషోత్తం. 

    “ఎళ్ళలేవు” చాలా ఖచ్చితంగా చెప్పేడు దుకాణంతాత. 

    దిగులుపడి కూర్చుండిపోయేడు పురుషోత్తం. కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి. కొండలు బద్దలయినట్టు ఉరుములు ఉరుముతున్నాయి. శివాలెత్తి గాలి పరిగెడుతోంది. పగపట్టినట్టుగా వర్షం తెగపడుతోంది. చీకటి పట్టినపాకలో.... కొత్త పంట్లాం, కొత్త చొక్కా కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి. ఆ మూడు పురుషోత్తం వేసుకున్నాడు. అతన్ని బాగా చూడాలీ అంటే దీపం వెలిగించి చూడాలి. అతను చక్కనివాడా? ఒప్పుకొనేవాళ్ళు తక్కువ. అతని నడుం మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది అతను సింహమధ్యముడే కాని సింహంలా ఉండడు. అతని పదిహేనోయేట “ఇరవయ్యేళ్ళుండవా?" అని చాలామంది అనుకొనేవారు. దుకాణం తాతని ఆ సమయంలో అడిగితే “నలభై దగ్గిరుండవా" అని అడగ్గలడు. పురుషోత్తం పాతిక సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి, ఆ పుట్టుక తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు. అతను ఎదగని పడ్డలా వుండిపోయేడు.

    *******************

    ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయల్దేరేడు. పయనమవడం కలకత్తాకనే పయనమయేడు. అంతలో అతని మేనమామ గాలీ ధూళిలా వచ్చిపడ్డాడు. ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహా లివ్వగలడు; అవలీలగా పనులు పురమాయించగలడు. 

    అతగాడు వచ్చిపడి “నీకు పెళ్ళి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా?” అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించేడు. టకాయించి "వెళ్ళు వెళ్ళు మంచిది, వయసుది, డబ్బుది. అడివిపాలెంలో మున్సబుకూతురుంది,పిల్లని చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి చూడు” అని మేనల్లుణ్ణి వెంట తరిమేడు. 

    దాన్తో చేతిలో పెదసంచీ వట్టుకొని అడివిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మున్సబుగారింట్లో కొత్త బట్టల్తో పెళ్ళికూతురి ముందు ప్రత్యక్షమయేడు పురుషోత్తం, ఆ పిల్ల తన చూపుతో అతనికొక చిక్కు ప్రశ్న వేసింది.

    “మునసబు"గారిది పాతకాలపు పెంకుటిల్లు, లోపల వరండాల్లో చాపమీద కూర్చోబెట్టేరు పెళ్ళికుమార్తెని. ఆ పిల్ల మఠం వేసుకొని కూర్చొంది. 

    పక్కనే వాకిట్లో తులసి కోట పక్క దండెం మీద తెల్లచీర ఒకటి ఆరవేసి వుంది. వాకిట్లో తోమిన ఇత్తడిగిన్నెలు తడితో మెరుస్తున్నాయి. ఇంటివెనక మామిడి చెట్టొకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది. దానిపక్కనే కొబ్బరిచెట్టొకటి నిటారుగా ఎత్తుగా గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధంగా నిల్చొంది. అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన్న సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు. అంతలో గది తలుపులన్నీ గప్పున తెరచి ఆకాశమంతటా కుంకాన్నెవరో కుమ్మరించేరు. అంతట చెట్టున మామిడి చిగుళ్ళు, చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వు నవ్వేయి, ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పున వెదజల్లింది. మెరిసే ఇత్తడిగిన్నెలు రాగిరంగు కలుపుకొని బంగారంలా మెరిశాయి. తులసికోటలో తులసి మొక్క నర్తకిలా నిల్చొంది.

    దీపపు వెలుగున దేవి విగ్రహంలా కనిపిస్తోంది పెళ్ళికూతురు. ఆమె తల కొంచెం దించి, రెప్పలు కొంచెం పైకెత్తి పురుషోత్తాన్ని నిదానంగా పరిశీలనగా చూసింది. ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైననీటితో నిండిన తటాకాల్లా ఉన్నాయి. మారుమూల కుగ్రామంలోనే ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్నీ, వెలిగే చంద్రుణ్నీ, మండే సూర్యుణ్నీ కూడా సుస్పష్టంగా చూడగలవు. అవి చాలా దూరం చూడగలవు.

    ఏవేవో ప్రశ్నలువేసి కూతురిచేత జవాబులు చెప్పిస్తోంది తల్లి. ఆ పిల్ల సన్నంగానే మాట్లాడుతోందిగాని, గుహలో మాట్లాడినట్టుగా గంభీరంగా మాట్లాడుతోంది. ఇంటర్వ్యూ ముగిశాక పురుషోత్తం లేచి నిల్చున్నప్పుడు, ఆమె చాపమీద కూర్చునే అతణ్ని నిదానంగా మరోసారి బరువుగా రెప్పలు కొంచెం పైకివంచి చూసింది. చూసి, నెమ్మదిగా నిల్చొని లోనికి వెళ్ళిపోయింది. ఆమె చూపు అతన్లో ఏదో అలజడి పుట్టించింది. కాని అతనికేమీ సరిగా అర్థం కాలేదు.

    మర్నాడు బంధువులింట్లో మధ్యాహ్నం భోజనం చేసి రెండెడ్ల బండి ఎక్కి రోడ్డు జంక్షన్ కి బయల్దేరేడు. మధ్యాహ్నం ఒంటిగంటయింది. మువ్వలు చప్పుడు చేస్తూ ఎడ్లు ముందుకు సాగేయి. దార్లోనే ఉన్న మున్సబుగారింటిని, బండి దాటుతుండగా ఆ అమ్మాయి ఎందుకోసమో వీధి నడవలోకి వచ్చి బండీ చూచి ఇంటిలోకి వెళ్ళిపోకుండా, అక్కడే ఆగి, గుమ్మాన్ని ఓ చేత్తో ఆనుకొని నిశ్చలంగా నిల్చొని అతణ్ని నిశ్చలంగా చూసింది. బండీ ముందుకి సాగిపోయింది. ఆమె దూరాన్న ఉండిపోయింది. కాని ఆ చూపు అతణ్ని వెంట తరుముతోంది. మరో విధంగా చెప్పాలంటే, ఆ చూపు ఆతన్లో గోతులు తవ్వుతోంది. 

    ***************************

    కొన్నాళ్ల క్రిందట పురుషోత్తం జబ్బుపడి ఆస్పత్రికి వెళ్ళేడు. అప్పుడతను చాలా నీరసపడి చిక్కిపోయున్నాడు. ఆస్పత్రిలో డాక్టర్ల వెనకనుంచి ఓ నర్సు ముందుకొచ్చి “ఇలారా" అని అతణ్ని తూకపు మెషీను దగ్గరికి తీసుకువెళ్ళింది. తీసుకువెళుతూ తనని ఆమె చూడ్డం అతను గమనించాడు. ఆమె చాలా లేతగా వుంది. రోగుల బాధలకి బాగా అలవాటుపడిపోగా ఆమె ఇంకా అమానుషంగా తయారవలేదు. ఆమె కళ్ళు చాలా చిన్నవి. ఆమె చూపులో అర్థం అతనికి తూకం మెషీను చూసేదాక బోధపడలేదు. 

    దాన్ని చూశాక "ఓహో! ఈమె నా బరువెంతో అంచనా కడుతోంది" అనుకున్నాడు. మెషీన్ మీంచి అతను దిగిన తర్వాత ఆమె జాలిగా చూసి, హెచ్చరికగా నవ్వి, “మరేం భయం లేదు. ధైర్యంగా వుండు. నిమిషంలో నయంమవుతుంది జబ్బు" అని హుషారిచ్చింది. కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియక అతనప్పుడు కంటతడి పెట్టేడు. 

    **************************

    బండిలో కూర్చుని వెళుతూంటే ఆ లేతనర్సెందుకోగాని గుర్తుకొచ్చింది పురుషోత్తానికి.దూరంలో నల్ల కొండలు, ఇవతల కొబ్బరితోటలు, ప్రక్కన పచ్చని చేలు, పైన తెల్లటిమేఘాల చాందినీ, అంతా అలా చూస్తోనే అతడు ఆలోచనలో పడిపోయేడు. నేను సరియైన బరువులేనా? అని ఓసారి అనుకున్నాడు. కాని అతనికేమీ సరిగా అర్థం కావడం లేదు. తడికర్రకి నిప్పంటనట్టుగా, అతని మనసు రాజుకోవడం లేదు. బండి తాజుగా వెళోంది. “ఒహోయ్ హోయ్ హోయ్, మంటూ బండివాడు ఎడ్లని ఆ పేటప్పటికి త్రుళ్ళిపడి, బండిలోంచి దిగేడు పురుషోత్తం. ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది. తోటల్లో గాలి గలగలమంది! రివ్వురివ్వుమంది. పురుషోత్తం ఆకాశంకేసి చూసేడు. తెల్లమబ్బుల్ని గాలి తుడిచిపారేసింది. ఓ పక్క నల్లమబ్బులు లావాలా, పెనుగడ్డలా పెల్లుబికి, వాహినిగా విజృంభించి ముందుకొస్తున్నాయి.

    నాటురోడ్డు ట్రంకు రోడ్డు కలిసేచోట రోడ్డుప్రక్క అధికారిలా నిల్చున్న చింతచెట్టు ఈదురుగాలికి తలవిసిరి ఆకాశాన్ని ఎదిరిస్తోంది. చెట్టుకింద కమ్మలపాక చలిగాలికి ముసలమ్మ వణికినట్టు వణుకుతోంది. అంతలోనే మబ్బులు ముంచుకొచ్చేయి. ఎండ వేడికి పలకమీద నీరు మాయమైనట్టు ఎండంతా కూడా చూస్తోండగా మాయమయింది. పొలాల మీద మబ్బుల నీడ ప్రవాహంలా పరిగెట్టింది. 

    ఆబండివాడు గాలినీ ధూళినీ బూతులు తిడుతూ బండిని మళ్ళించి మొత్తాల మీదికి చెంగున ఎగిరేడు. ధూళిని చీలుస్తూ ఎడ్లు దౌడుతీశాయి. పురుషోత్తం ఎదురుగా వున్న కమ్మలపాకలోకి దూరేసరికి వర్షం దడదడలాడుతూ దిగింది. జోరుగా వీస్తోన్న గాలి మరికొంత జోరుచేసేసరికి, ప్రవాహం ఒక్కసారిగా పల్లానికి దిగినట్టు, వర్షపుధార పాకని ముంచేసి హోరుమంటూ ముందుకిపోయింది.

    ******************************

    కమ్ములపాక 'టీ' దుకాణంలో బల్లమీద గంట పై నుంచీ కూర్చున్నాడు పురుషోత్తం. 'టీ' బల్లమీద గళాసులు పనిలేక పడున్నాయి. కెటిల్ వంటి దొకటి పొయ్యిమీద పడుకుంది. పొయ్యిలో నిప్పు చల్లబడిపోతోంది. దుకాణం అంతా తీరుబాటుగా ఉంది.

     టీ చెయ్యడం తనపని కానట్టుగా ముక్కాలి పీటమీద ముసలిపిల్లిలా కూర్చున్న దుకాణం తాత, ఆరిపోయిన చుట్టని రెండు పీల్చులుపీల్చి, అంటించకుండా దాన్ని టీ బల్లమీది పెట్టి, 'ఏ వూరు బాబూ మనిది?” అని పురుషోత్తాన్ని మొదటి ప్రశ్నగా అడిగేడు. తర్వాత వరుసగా, నెమ్మదిగా - కమ్మలచూరు నుంచి వానజల్లుకి ఒకటొకటిగా నీటి బొట్టు తాజాగా కిందికి దిగినట్టు - ప్రశ్నల్ని వరసగా దింపడం ప్రారంభించేడు. 

    జవాబివ్వకపోతే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు వాటన్నంటికీ పురుషోత్తం జవాబిస్తున్నాడు.

    అన్నీ తెలుసుకొని, ఆఖరికి, నువ్వు వెళ్ళదల్చుకున్న చోటికి వెళ్ళలేవు అని ఖచ్చితంగా పురుషోత్తంతో చెప్పేసి అందుగురించి సంతృప్తిపడి నవ్వుకున్నాడు దుకాణం తాత.

    పైన వర్షం జోరుచేస్తోంది. గాలి గీఁకొడుతోంది. ఆకాశాన్ని మెరుపులు చీలుస్తున్నాయి. ఉరుములు బద్దలు కొడుతున్నాయి. కొండలన్నీ వాన తాకిడికి మొండికెత్తి నిల్చున్నాయి. చెట్లన్నీ తిరగబడుతున్నాయి. దుకాణంలో పొయ్యిలో నిప్పుకి గాలి అందడం లేదు. మీద నుంచి కురిసే నీరుమాత్రం కెటిల్ మీంచి జారి నిప్పుల్లో ఇంకుతోంది.

    నవ్విన నవ్వుని మాసిన గడ్డంలో మాయం చేసి “బొగ్గుల కెళ్ళేడు. కుర్రోడింకా రానేదు బాబూ, ఎక్కడుండి పోనాడో ఏదో” అన్నాడు దుకాణం తాత.

    “అయితే బస్సు రాదంటావా?” అన్నాడు పురుషోత్తం.

     “ఆ మాట కొస్తే రెయిల్ గాడీనేరాదు. ముండమోపి బస్సుకి నెక్కేటి? అని, ప్రపంచమంతా ఆవిధంగా వర్షం వల్ల స్తంభించిపోయినందుకు, హర్షం వెలిబుచ్చేడు దుకాణం తాత.

    గాలికీ వానకీ పాకమీద పాములు జారినట్టుగా చప్పుడౌతోంది. బ్రెయిన్ రావడానికి పూర్తిగా రెండు గంటలైనా వ్యవధి లేదు.

    "పెందలకాడే బయలెల్లి నడిచేసినా అందేద్దువు. మరింకిప్పుడీల్లేదు. ఏళ్ళూ వూళ్ళూ ఏకవేఁ మరింక”. నడిచి వెళ్ళడానికి వీలుపడనందుక్కూడా హర్షం వెలిబుచ్చేడు దుకాణం తాత. 

    బాధింపబడుతూ అలానే కూర్చున్నాడు పురుషోత్తం. బొగ్గుల కోసం పయనమైన కొడకడింకారానేదని దుకాణం తాత విసుక్కుంటున్నాడు. పాకంతా తడిసి ముద్దయింది. చలి హెచ్చూ, చలిగాలి జోరూ అయేయి. పైన వర్షం పడుతోంది. 

    “పడకేటి చేస్ది బాబూ! దానిటయాం అది". 

    ట్రెయిన్ రావడానికి రెండు గంటలైనా వ్యవధి లేదు. రెండు కోసుల దూరం అలానే ఉండిపోయింది. బస్సు ఎక్కడో ఆగిపోయింది. ఆకాశం విరుచుకుపడిపోతోంది. పురుషోత్తం లేచి నిల్చున్నాడు.

    “నరమానవుడన్న వోడూ బైట అడుగెట్టడానికీల్లేదు” అన్నాడు తాత. 

    రెస్టు లేనివాళ్ళా పురుషోత్తం అటూ ఇటూ తిరిగేడు. పనిలేక గింజుకున్న వాళ్ళ గింజుకున్నాడు.

    "అగ్గుందా బాబూ?" అడిగాడు తాత. 

    “లేదు”

    “ఉండదనే అనుకున్నాన్డే. నీట్లో అగ్గి పుట్టించాలగాని, మరి దొరకదు. ఈడు జూస్తే ఇంకా రాలేదు. ఎక్కడ చిక్కడి పోనాడో ఏటో? గేటుకాణ్నుండి బొగ్గులు పట్టుకొస్తానని పారెళ్ళాడు బాబూ! కుర్రోడేగాని శండసేసనమ్ముండకుడులే! ఒరసవేఁ నన్నమాటేటి. దిమదిమలాడుతూ ఏనుగులు దిగేసినా నెక్కసెయ్యడు". 

    కుర్రవాడు వెళ్ళడం, బొగ్గులు తేవడం, ఏనుగులు దిగడం వీటిగురించి వినడం లేదు. పురుషోత్తం చుట్టూ పాకంతా బందిఖానాలా అవుపిస్తోందతనికి. ఇనుప ఊచలు దిగొడుతున్నట్టుగా వర్షధారాలు చుట్టూ దిగుతున్నాయి. అతను ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. పరిస్థితులకి చిరాకుపడిపోతున్నాడు.

    వెళ్ళు వెళ్ళంటే వెళ్ళిపోయి వచ్చాడు తను. ముందు కలకత్తానే వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకొని ఆ తరవాతే వచ్చి పెళ్ళికూతుర్ని చూడవలసింది. ఎప్పుడూ ఇలాగే అవుతోంది. 

    ఆ పిల్ల కరెక్టుగానే ఆచోకీ కట్టినట్టుంది. ఛ! తనెప్పుడూ ఇంతే, కలకత్తా రావాలిస్మా అన్నారు. ఒస్తున్నానన్నాడు. అడివిపాలెం ఫో అన్నాడు మావ. పోతున్నానన్నాడు. చిన్నప్పటినుంచీ కూడా ఇంతే. చదువుకోకపోతే చెడిపోతావు చదువుకో అన్నారు. చదువుకుంటానన్నాడు. బుద్ధిగా ఉండకపోతే బాగుపడవుస్మీ అన్నారు. బుద్ధిగా ఉంటానని లెంపలు వేసుకున్నాడు. మజాలేని వెధవలు మంచిగానే ఉంటారు మరి అన్నాడొక స్నేహితుడు. అవునవునని తను ఒప్పుకున్నాడు. ఇలాగే అన్నీను. 

    ఈత రాకుండా నీట్లోకి దిగేవు జాగ్రత్త! “దిగను",

    దీపం లేకుండా చీకట్లో నడిచేవు జాగ్రత్త. “నడవను”

    చక్కని రాజ మార్గాలుండగా సందులంట తిరిగేవు జాగ్రత్త! "తిరగను".

    వాళ్ళెలా చేస్తే నీకెందుకు? వాళ్ళ జట్టీల్లోకి నువ్వు వెళ్లేవు జాగ్రత్త "వెళ్ళను”.

    అన్యాయం. అధర్మం! నీకేలదంతా? నీ పని నువ్వు చూసుకోలేకపోతే తన్నులు తగిలేను జాగ్రత్త! “అదంతా నాకెందుకు?! ఆ తన్నులు నాకెందుకు? నాపని నే చూసుకుంటాను.”

    టైఫాయిడ్, న్యుమోనియా, మరేదో ఏదైనా ఒస్తుంది, వర్షంలో చొరబడేవు జాగ్రత్త! “చొరబడ్నే. ఇక్కడే ఉంటాను".

    తుళ్ళిపడ్డాడు పురుషోత్తం. మరైతే కలకత్తా వెళ్ళడం ఎలాగ? గంటన్నరకంటె మరింక టైము లేదు. ఏం చెయ్యడానికి పాలుపోక 

    పురుషోత్తం మళ్ళీ బల్లమీద కూర్చోబోతూ వుండగా దుకాణం తాత చూరికింద నుంచి రోడ్డువైపు చూసి “ఆ! ఒస్తుడొస్తండు హదిగదీ! రేసుకుక్కే! పార్రా! పార్రా!” అని వుత్సాహంతో కేకలు వేసేడు. 

    పురుషోత్తం కూడా వంగొని, చూరుకిందనుంచి చూసేడు.

    ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు. రెండుపక్కలా ఉన్నచెట్లు సిపాయిల్లా నిల్చొని అలజడి చేస్తున్నాయి. రోడ్డంతా నీటితో ఏటి కాలవలా ఉంది. అందుమీద ఆరని నిప్పుతునకలా, నీటిమీద బోటులా, చెట్లని చీల్చుకొని బాట వేసుకొని వస్తున్నట్టుగా ఓ కుర్రవాడు భుజాన్న మూట వేసుకొని పరిగెట్టుకొని కొట్కొస్తున్నాడు.

    “ఒచ్చీసినాన్ తాతా" అని వచ్చీ రావడంతో కేకవేసి, మూట నుండి భుజాన్ని సుళువుగా తప్పించి, బొగ్గుమూటని చక్కున కిందికి విసిరేడు. 

    కుర్రవాడికి పన్నెండేళ్ళకి మించి ఉండదు వయసు. సరిగ్గా రేచుకుక్కలాగే వున్నాడు అరనిమిషంలో జుట్టునుంచి నీటినినొక్కేసి బట్టల్నించి నీటిని పిండేసి ఆ పాకలో పొడిగా గెంతులు వేసేడు.

    “ఒరసంలో దార్లో సత్తే ఏటిజేద్దువురా మనవడా” అన్నాడు దుకాణం తాత బొగ్గులమూట విప్పుతూ, మూట విప్పగానే రాక్షసి బొగ్గులు నిగనిగ మెరిసేయి. 

    “ఒరసవాఁ! మనసంగతౌల్టేటి తాతా? ఒరసాన్ని సంపిడిసి పెడతా డీ పోతురాజు" అని మూడులోకాలూ ఏలేవాళ్ళా జవాబు చెప్పి, పొయ్యి విసరడానికి విర్రవీగుతూ వెళ్ళేడు కుర్రవాడు.

    ఆ పాకలో పాతుకుపోయినట్టుగా నిశ్చలుడై నిల్చుండిపోయేడు పురుషోత్తం. 

    ఆకాశం ఒక్కసారిగా గప్పున మెరిసింది. అంతవరకూ పురుషోత్తాన్ని వెంటతరిమిన పెళ్ళికుమార్తె చూపు ఆ క్షణంలో అతని ముందుకొచ్చి మూర్తీభవించి నిలుచొంది. ఆమె చూసిన చూపు ఆనాటి నర్సు నవ్విన లేనవ్వు: చిగిర్చిన మామిడి మొక్క, ఎగిసిన కొబ్బరి చెట్టు, ఈదురుగాలి, హోరున వర్షం ; నీటిలో నిప్పు, మనిషిలో జ్వాల - అన్నీ అతనికి అర్థమయ్యేయి. అర్థయుక్తంగా, స్పష్టంగా తెరమీద కథలా అతనికంతా బోధపడింది. అంతా చూస్తూ అతనలా నిల్చుండిపోయేడు.

    పైన వర్షపుధారలు స్తంభించినట్టుగా అలానే ఉండిపోయేయా అన్నట్టుగా అనిపిస్తోంది. ఆకాశం ఇంకా దట్టంగా మూసుకొంటోందేగాని పల్చబడ్డం లేదు. గుర్రాల్ని కట్టుకొని ఝాంమ్మని అన్నింటినీ తొక్కుకుబోతుంది ఈదురుగాలి. మెరుపులు పిడుగులయి, మబ్బులు కమ్మినకొద్దీ పాకలో చీకటి చిక్కనవుతోంది. పొయ్యి విసురుతూన్న కుర్రవాడు ఇనుంలా ఎర్రగా మెరుస్తున్నాడు. 

    కొద్దిసేపయింది.అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూన్న దుకాణం తాత ఏదో గుర్తు కొచ్చినట్టుగా టక్కున ఆగి, కళ్ళు చిట్లించి, అటూ ఇటూ చూసి, మనవణ్ని “పోతురాజురే” అని పిల్చి “ఇప్పుడిక్కడున్నాడు! చిట్టిబాబెక్కడికి పోనాడ్రా" అని ఆశ్చర్యపడుతూ, చిట్టి బాబుని ఎన్నెమ్మకాని ఎత్తుకుపోయిందా? అన్నట్టుగా అడిగాడు. 

    “అడుగో” అన్నారు పోతురాజు. “ఏడీ?" “అడుగడుగడుగో” అని రోడ్డువైపు చూపించేడు పోతురాజు. 

    “ఏటి?! పప్పు ముద్దలా సతికిలబడిపోన్డు . ఒరసం ఒగ్గనట్టు పాకొగ్గడనుకున్నానొరె, ఆ! ఆ! కదిల్నాడే!” అంటూ మోకాళ్ళు వంచి వీపు విరిచి చూర్లోంచి పైకి చూసేడు దుకాణం తాత.

    మసక చీకట్లో తిన్నగా, ఈదురుగాలి కెదురుగా, వర్షాన్ని సరకు చేయకుండా, తెరల్ని ఛేదించుకొంటూ చకచకా ముందుకు వెళుతున్నాడు పురుషోత్తం. 

    అతణ్ని చూసి తలపంకించి, హసించి 'సెబాసో' అని మెచ్చుకున్నాడు దుకాణం తాత. 

    ***

    మే 1959 ఆంధ్ర పత్రిక. 

    పుస్తకం వివరాలు :

    పుస్తకం కొనడానికి 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

    నవోదయ బుక్ హౌస్

    3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

    ఫోన్ నెంబర్: 090004 13413

    https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7

    లేదా ఆన్లైన్ లో కొనడానికి క్రింది నవోదయ వెబ్సైటు లింకుని క్లిక్ చెయ్యండి.

    https://www.telugubooks.in/products/raavi-sastry-kathalu-katha-sravanthi?_pos=11&_sid=edd4e5812&_ss=r

    *Intro- outro BGM credits: *Intro- outro BGM credits: en vanile - jingle man (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    24 min
  • 'గోమెజ్ ఎప్పుడొస్తాడో'

    'గోమెజ్ ఎప్పుడొస్తాడో' అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వెంకటేశ్వర రావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వెంకటేశ్వర రావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో 'తెలుగు వెలుగు' పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం 'ఈమాట' అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ వెంకటేశ్వర రావు గారి "ఆ నెల ఆ నీరు ఆ గాలి' అనే కథాసంకలనం నించి సేకరించబడింది. పుస్తకం కొనేటందుకు మరిన్ని వివరాలు 'వెబ్ పేజీ ' చివరలో ఇవ్వడం జరిగింది. ఈ కథలో ఆయన అమెరికాకు వచ్చే మెక్సికన్ ఇమిగ్రెంట్ లేబర్ అవస్థల గురించి చాల హృద్యంగా చిత్రీకరించారు. తానా వారు 2013 వ సంవత్సరం లో ముద్రించిన ' కథ - నేపధ్యం' అనే అనే ప్రత్యేక సంకలనం లో ఈ కథ ఎంపిక కాబడింది. కథను హర్షణీయం ద్వారా మీ కందించడానికి అనుమతినిచ్చిన శ్రీ వెకంకటేశ్వర రావు గారికి మా కృతజ్ఞతలు.

    గోమెజ్ ఇవాళా రాలేదు. పోయిన శనివారమే రావా ల్సినవాడు. పదు హేను రోజులకోసారి, శనివారం పొద్దున్నే వచ్చి లాస్ చెయ్యమని ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు. ప్రతీసారీ 'యస్ యస్, సీ సీ,' అంటూ నవ్వుతూ తలకాయ ఊపుతాడు. అంతే. వాడికి తీరికైనప్పుడే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతిసారీ శ్రద్ధగా గడ్డికోసి, ఇంటి ముందు, వెనకా పెరిగిన పొదలన్నింటినీ అందంగా కత్తిరిస్తాడు. అదేం ఖర్మమో మరి! ఎప్పుడూ మధ్యాన్నం ఒంటిగంటకి వస్తాడు. కనీసం రెండు గంటలు మండు టెండలో పనిచేస్తాడు. రోడ్డు మీద ఎవరిని చూసినా చెయ్యి ఊపుతూ నవ్వుతూనే ఉంటాడు. అందుకనే కాబోలు, వాడు రావలసిన రోజున టైముకి రాలేదని సుజాత ఎంత చిరాకుపడినా గోమెజ్ చేతే లాన్ పను లన్నీ దగ్గిర ఉండి చేయిస్తుంది. తను మంచినీళ్లు తాగుతూ వాడికి కోక్ బాటిల్ ఇస్తుంది.

    గోమెజ్ కి ఇంగ్లీషు రాదు, యస్ యస్, అనడంతప్ప! ఇంగ్లీషు నేర్చు కుందామన్న కుతూహలం కూడా ఉన్నట్టు కనిపించదు. సుజాతకి స్పానిష్ రాదు. నేర్చుకుందామని అనుకోవడమే కాని, పనికట్టుకొని ఈ వయస్సులో కొత్త భాష నేర్చు కోవడానికి కావలసిన ఓపికా లేదు. అయితేనేం, వాళ్ళిద్దరూ చేతులతో సైగలు చేస్తూ సంభాషణ చెయ్యడం మూకీ సినిమాలని మరిపిస్తుంది. నిజం చెప్పొద్దూ! వీళ్ళ ముందు మార్సెల్ మార్సో ఎందుకూ పనికి రాడనిపిస్తుంది. గుబురుగా పెరిగిన పొదలు ఎంత ఎత్తు ఉంచాలో, ఎంత కిందకి కత్తిరించాలో, ఏ పూలమొక్కలు ఎప్పుడు ఎక్కడ తిరిగి పాతాలో, ఈ వివరాలన్నీ సుజాత చేతులు తిప్పుకుంటూ సైగలు చేస్తూ చెప్పడం, వాడు యస్ యస్! అని తలకాయ ఊపడం చూడముచ్చటగా ఉంటుంది. ఈ రెండేళ్ళన్నరలో వాడు సుజాతతో మాట్లాడుతూ నేర్చుకున్న తెలుగు మాటలు ముత్యంగా మూడు- ఆగు, ఇలారా, కాదు. సుజాత నానాయాతనా పడి వాడితో మాట్లాడుతూ నేర్చుకున్న స్పానిష్ మాటలు- అమీగో, సబాదో, దొమింగో.

    రెండున్నర సంవత్సరాల పైనే అయ్యింది సుజాత, మోహన్లు ఆ వీధిలో ఒక పెద్ద పాత ఇల్లు కొనుక్కొని. ఇంటి ముందు, వెనక ఖాళీస్థలం అర ఎకరం పైనే ఉంటుంది. ముందు పెద్ద లాను, రకరకాల పూల పొదలు. వెనక అటూ ఇటూ రెండు వీపింగ్ విల్లో చెట్లు ఉన్నాయి. వెనకాల సరిహద్దులో పెద్ద బర్మ్.దాని కింద ఆరడుగు లెత్తున హెడ్డింగ్ పొదలూ ఉన్నాయి. వాళ్ళు కొత్త ఇంట్లోకి చేరిన రోజునే ఎదురింట్లోకి కేథరీన్, ఫ్రాంక్ కూడా వచ్చారు. ఇద్దరికీ సంసార బాధ్యతలు, ఇతర బాదరబందీలు ఏవీలేవు. దానికి తోడు ఒకే వయసు వాళ్ళవడంతో సుజాతకి, కేథరీన్ కీ ఇట్టే స్నేహం కుదిరింది. రోజూ పొద్దున్నే లేచి సబ్ డివిజన్ లో వీధులన్నీ కొలుచు కుంటూ మెల్లిగా నడవడం, అమ్మకానికున్న ప్రతి ఇంటి మీదా కామెంట్లు చెయ్యడం, సాయంత్రం పూట ఎవరి డ్రైవ్ వేలో వాళ్ళు నిలబడి గంటల తరబడి పిచ్చాపాటీ చెయ్యడం అలవాటయ్యింది. సుజాత అమెరికా వచ్చి ము ప్ఫై ఏళ్ళయ్యింది. ఇన్ని ఏళ్ళున్నా ఫలానా తెల్లవాళ్ళు స్నేహితులు అని చెప్పుకోవటానికి ఎవరూ ఉన్నట్టులేదు. అలాగని నల్లవాళ్ళూ కూడా లేరు. ఇంతకుముందు వాళ్ళున్న ఇంటి సంగతి సరేసరి! తను పెరట్లోకి వెళ్ళితే చాలు, తను చెయ్యి ఊపుతూ పలకరిద్దామనుకున్నా ఆవెనకింటి ఆవిడ హాయ్ అని కూడా అనేది కాదు! ఈ సబ్ డివిజన్ లోకి రావడం, వచ్చిన రోజే కేథరీతో స్నేహం కుదరడం కలిసివచ్చింది.

    ఒక శనివారం సాయంత్రం సుజాత, కేథరీన్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ట్రక్ నిండా పైన్ స్ట్రా బేళ్ళు పెట్టుకొని ఒక పాతికేళ్ళ కుర్రాడు వచ్చాడు. ఒక కట్ట పైన్ స్ట్రా చేత్తో పట్టుకొని, ఇంటిముందు చెట్లకుదుళ్ళకి స్ట్రా వేస్తానని సైగ చేస్తూస్పానిష్ లో వటవట వాగడం మొదలెట్టాడు. కాథెరీన్ మాట్లాడద్దని తర్జని తన పెదాల పై పెట్టుకొని సైగ చేస్తూ, 'హౌ మచ్?' అని అడిగింది. వాడు మూడు వేళ్ళు చూపించాడు. అంతే! కేథరీన్ ఇంటి ముందు, సుజాత ఇంటి ముందూ చెట్లకి, పొదలకీ ఓపిగ్గా కుదుళ్ళు చేసి పై' వేశాడు. బహుశా ఒక్కొక్క ఇంటికి పాతికబేళ్ళు పట్టి ఉంటాయి. అంటే డెబ్బై ఐదు డాలర్లు! ఏ హోమ్ డిపోలోనో పైన్ స్ట్రా కొంటే నూటపాతిక పైనే అవుతుంది. దానికి తోడు, అది తెచ్చి వేసినందుకు కూలి కనీసం మరో పాతిక డాలర్లు. చులాగ్గా ఒక్కొక్కళ్ళకీ నూట యాభై డాలర్లు ఖర్చు. సుజాత, కేథరీన్ లిద్దరికీ కలిపి నూటయభై డాలర్లతో ఇంటి ముందు అన్ని చెట్లకీ, పొదలకీ పైన్ స్ట్రా చవగ్గా దొరికింది.

    సుజాత, కేథరీన్ ఇద్దరూ ఒకేసారి వాడిని, 'గడ్డి కూడా కోస్తావా?' అని సైగ చేశారు, లాన్ చూపిస్తూ! వాడు యస్, యస్ అన్నాడు. కేథరీన్ కి సుజాతకన్నా ఓ నాలుగు స్పానిష్ మాటలు ఎక్కువ వచ్చు. ఇంగ్లీషు, స్పానిష్ కలిపి మాట్లాడేస్తుంది. వాడిని, 'లాన్ మోవర్ ఉన్నదా?' అని అడిగింది, వచ్చీరాని స్పాంగ్లిషే! వాడు, 'సీ, సీ' అన్నాడు చిరునవ్వు నవ్వుతూ! లాన్ చెయ్యడానికి ఎంత కావాలి, అని కూడా అడగలేదు. అడగడం ఎల్లాగో తెలిస్తేగా! ఆ రోజునుంచీ సుజాతకీ, కేథరీన్కీ గోమెజ్ తోటమాలి. ఇద్దరూ కూడబలుక్కొని చెరో ము ప్ఫై డాలర్లు ఇద్దామనుకున్నారు, అంతే.

    ఆ నెల వర్షాలు బాగా పడ్డాయో ఏమో, రెండు వారాలు తిరక్కుండా ఇంటి ముందు గడ్డి కనీసం అరడుగు పైగా పెరిగింది. వెనక బల్మ్ మీద డాన్ డెల్యన్ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. గడ్డి కొసన సన్నగా మట్టిరంగు పూలు కూడా పూస్తున్నాయి. వారం నుంచీ సుజాత గోమెజ్ కి ప్రతిరోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది.

    గోమెజ్ దగ్గిర నుంచి సమాధానం లేదు.

    అప్పటికి రెండు నెలల కిందట వీధి చివర కార్నర్ లో ఉన్న పెద్ద ఇంట్లోకి కొత్తగా గుజరాతీ వాళ్ళు దిగారు, రెండు హోండాలు, ముగ్గురు పిల్లలతో సహా! ఈ ఇల్లు ఏడాది నుంచీ అమ్మకానికుంది. కార్నర్ లో ఉన్న ఇళ్ళు తొందరగా అమ్ముడు పోవు కాబోలు! కారణం, మిగితా ఇళ్ళకన్నా ఖాళీస్థలం భారీగా ఉంటుంది అందు లోనూ, ఈ ఇల్లు కొండ మీద ఉన్నట్టే ఉంటుంది. మూడు పక్కలా స్థలం కూడా సుజాత ఇంటికన్నా బాగా పెద్దది. రెండు లాట్లు కలిపి కట్టిన ఇల్లు. ఇల్లు ఫోర్ క్లోజర్ లోకి పోయింది కాబట్టి బాగా చవగ్గానే దొరికి ఉండాలి గుజరాతీ ఫేమిలీకి. వాళ్ళు ఇంట్లోకి దిగిన రెండో రోజున సుజాత, కేథరీన్, ఇద్దరూ ఒక క్రోటన్ మొక్క తీసుకొని 'వెల్కమ్ టు నైబర్ ‌హుడ్' అని చెప్పటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఇచ్చిన టీ తాగుతూ వచ్చీరాని హిందీలో వాళ్ళ భోగట్టా కనుక్కుంది సుజాత. ఆవిడ పేరు మాలిని; ఆయన పేరు జాయ్. అతనికి ఏదో ట్రక్కింగు కంపెనీ ఉందిట. ఆవిడ పిల్లలని బళ్ళో దింపిన తరువాత స్వామినారాయణ్ గుడిలో వాలంటీర్ పనికి పోతుం దిట. వాళ్ళ గురించి ఇంత సొద ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సుజాత రికమం డేషన్‌, గోమెజ్ వాళ్ళకి ఒకే ఒక్కసారి లాన్ కూడా చేశాడు, అందుకని!

    సుజాత గోమెజ్ జాడ గురించి కేథరీనిని అడిగింది. ఆ సాయంత్రం మాలిని ఇంటి ముందు ఆగి ఆవిడని కూడా అడిగింది. ఆవిడ ఏదో గుజరాతీలోనో, హిందీ లోనో గొణిగింది. సుజాతకి ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కేథరీన్ కూడా రోజూ టెలిఫోన్ చేస్తూనే ఉన్నది. కాని, ఫలితం శూన్యం.

    గోమెజ్ శనివారం, ఆదివారం మాత్రమే లాన్ పని చేస్తాడు. మిగిలిన ఐదు రోజులూ వందమైళ్ళ దూరంగా ఏదో పూల మొక్కల కంపెనీలో పని చేస్తాడు. వీడితో పాటు నలుగురు అమీగోలు రోజూ పొద్దున్నే ఆ కం పెనీకి వెళ్ళి రాత్రి పదిగంటలదాకా తిరిగి రారని కేథరీన్ భోగట్టా. అందుకనే కాబోలు, ఎవరు ఎన్నిసార్లు ఫోను చేసినా సమాధానం ఇవ్వడు.

    'కాస్త నమ్మకంగా, ఖచ్చితంగా రెండువారాల కొకసారి వచ్చి లాస్ చేసేవాడిని, మరొకణ్ణి చూసుకోవాలి,” అని ఇద్దరూ అనుకుంటారు, గోమెజ్ రానప్పుడల్లా!గోమెజ్ రాగానే ఇద్దరూ ఆ విషయం మరిచిపోతారు! కారణం, వచ్చినప్పుడు లాన్ పని బాగా చేస్తాడు. పై పై పనులెన్ని చెయ్యమని చెప్పినా విసుక్కోడు; అందుకుగాను పైకం అడగడు; టిప్ ఎంత ఇస్తే అంతే తీసుకుంటాడు. నవ్వుతూ యస్ యస్ అంటాడు. అంతే!

    గోమెజ్ వస్తాడని చూసిచూసి చివరకి విసుగెత్తి, సోమవారంనాడు పొద్దున్నే యెల్లో పేజీల్లో చూసి ఏదో సర్వీసు కంపెనీని పిలిచింది, కేథరీన్. ఆ విషయం సుజాతకి చెప్పింది. ఆ కంపెనీ వాళ్ళు యూనిఫారాలు వేసుకొని, పెద్ద ట్రక్ లో వచ్చారు, మధ్యాన్నానికల్లా! మొత్తం ముగ్గురొచ్చారు. రెండు ఇళ్ళ ముందూ వెనకా లానులు పరీక్షగా చూశారు. ఒకడు టేపుతో కొలతలు కూడా తీసుకున్నాడు. మొట్టమొదటిసారి గడ్డి కోసి బుషులన్నీ కత్తిరించి పూలమొక్కలన్నింటికీ కుదుళ్ళు తవ్వి శుభ్రం చెయ్యడానికి ఒక్కొక్కళ్ళకీ నూటైయభై డాలర్లు అవుతుందని అంచనా ఇచ్చారు. వారానికొకసారి లాను పని చేయించుకుంటామని కాంట్రాక్ట్ రాస్తే, ప్రతివారం అరవై ఐదు డాలర్లకి లాన్ చేస్తామని, పూల పొదలు బుషులు కత్తిరించడానికి వేరే నెలకి నలభై డాలర్లు అని చెప్పి రిబేట్ కాయితాలు, కాంట్రాక్ట్ కాయితాలూ అన్నీ కేథరీన్ కి, సుజాతకీ ఇచ్చి రెండు రోజుల్లో పిలిచి ఏ విషయం చెప్పండని వెళ్ళిపోయారు.

    వీళ్ళిద్దరికీ గుండె ఆగినంత పని అయ్యింది. 'ఇది నిలువు దోపిడీ,' అని సుజాత, 'హైవే రాబరీ,' అని కేథరీన్ ఒకేసారి అనేశారు. వస్తానని చెప్పి, మాట నిలబెట్టుకోకండా

    మోసం చేసి ఎగగొట్టినందుకు, గోమెజ్ ని నానా తిట్లు తిట్టుకున్నారు: సుజాత తెలుగులోను, కేథరీన్ ఇంగ్లీష్ లోనూ!

    అయినా తప్పదు కదా!

    ఈ దేశంలో, ఎవడి ఇల్లు వాడు లోపల ఎంత చెత్తగా పెట్టుకున్నా పరవాలేదు. శానిటరీ డం' వున్నా నష్టం లేదు. 'నా ఇల్లు. నా సొంతం' అని దబాయించవచ్చు. ఇండివిడ్యువల్ ఫ్రీడం! కానీ, ఏ ఇంటి ముందు, వెనకా ఖాళీస్థలంలో గడ్డి ముత్యంగా మూడంగుళాలకన్నా ఎత్తుగా పెంచకూడదు. ఏ ఇంటి ముందన్నా కాస్త గడ్డి గాదర దుబ్బుగా పెరిగితే, ఇంటి ధరలు అమాంతం పడిపోతాయని బెంబేలు పడిపోతారు, ఇక్కడి జనం! ఇరుగుపొరుగు వాళ్ళు టౌన్‌హాలుకి పిలిచి రిపోర్ట్ చేస్తారు కూడాను! టౌన్‌హాల్ వాళ్ళే గనక మీ ఇంటి ముందు గడ్డి కోయిస్తే తడిసి మో పెడవుతుంది. అంతేకాదు; అది అప్రతిష్ట కూడాను! పెద్ద న్యూసెన్స్! అందుకైనా గడ్డి కోయించి తీరాలి.

    ఆ రోజు బుధవారం.

    పొద్దున్నే సబ్ డివిజన్లో నడుస్తూ, కేథరీనూ, సుజాతా ఇవాళ సర్వీసు కంపెనీని పిలుద్దామని ఒప్పందం చేసుకున్నారు. మిట్టమధ్యాన్నం. జులై ఎండ మాడ్చే స్తూన్నది. కాసేపు కునుకు తీద్దామని సోఫాలో వాలింది, సుజాత.అరగంట కూడా పట్టలేదు ఉలిక్కిపడి లేచింది, బయట లాన్ మోవర్ చప్పుడుకి! తలుపు తీసి చూసింది. అదేమీ మామూలు లాస్ మోవర్ కాదు. చక్కగా సీటు మీద కూర్చొని గడ్డి చేసుకునే మోవర్. కావి రంగు హోండా రైడింగ్ మోవర్. వెనక పెద్ద గోనె సంచి; పక్కన మరో మనిషి నిలబడటానికి చిన్న ఇనప మెట్టు కూడా ఉన్నట్టున్నది. గోమెజ్ బండి నడుపుతున్నాడు; పక్కనే మరో అమీగో హుషారుగా చేతులూపుతున్నాడు. సుజాతని చూడగానే గోమెజ్ ఎడమచెయ్యి ఊపుతూ హాయ్ అని సైగ చేసి మోవర్ ఆపాడు. వాడి స్నేహితుడిని గుమ్మం దగ్గిరకి తీసుకొని వచ్చాడు. సుజాత సైగ చెయ్యకముందే, వాడికేసి చూపుడు వేలు చూపిస్తూ 'మార్సెలీనో' అని చెప్పాడు. చూస్తే వీడికి పదిహేను పదహారు ఏళ్ళకన్నా ఎక్కువ వయస్సుండదు. మార్సెలీనోని 'ఇంగ్లీషు అర్థం అవుతుందా?' అని అడిగింది, సుజాత. వాడు వెంటనే 'లిటిల్..... లిటిల్...' అని సమాధానం చెప్పాడు. వీడే నయం. ఆ గుజరాతీ ఆవిడయితే 'థోడా థోడా' అనేది. ఇంతలో ఎదురింటి కేథరీన్ కూడా బయటికొచ్చింది. చెప్పద్దూ! కేథరీన్ కీ, సుజాతకీ మొహాలు విప్పారిపోయాయి.

    గోమెజ్ మోవర్ ఎక్కి గడ్డి చెయ్యడం మొదలు పెట్టాడు; కేథరీను మార్సెలీనోతో మాట్లాడటం మొదలెట్టింది. రకరకాల ఆరాలు తీసింది. రైడింగ్ మోవర్, వాళ్ళు పని చేసే పూలకం పెనీ ఓనర్ ది. రోజుకి ముప్పై డాలర్లకి అద్దెకి తీసుకున్నారట! ఒక్క రోజులో అధమ పక్షం అరడజను లానులు చెయ్యచ్చు. ఒక్క గంటలో రెండు లాన్లూ కత్తిరించేశారు. పాత తోపుడు బండి మోవర్ అయితే కనీసం రెండు గంటలు పట్టేది. మార్సెలీనో గడ్డి ప్లాస్టిక్ బస్తాల్లోకి పట్టి ట్రక్ వెనకాల పడేశాడు. డబ్బులిస్తూ కేథరీన్ “ఇప్పుడు కచ్చితంగా రెండు వారాలకొకసారి రావాలి,' అని మార్సెలీనోతో చెప్పింది. వాడు, సీ సీ కి బదులు 'షూర్... షూర్...' అన్నాడు. సుజాత చెరొకడికీ లీటర్ కోకు సీసాలిచ్చింది. మంచి ఎండగా ఉన్నదేమో, మార్సిలీనో సీసా మొత్తం ఒక్క గుక్కలో ఖాళీ చేశాడు.

    ఇప్పుడు గోమెజ్ ఠంచనుగానే వస్తున్నాడు. అనుకున్నట్టుగానే రెండు వారాల కొకసారి శనివారమో, వీలు కుదరకపోతే అదివారమో గోమెజ్, మార్సిలీనో, ఇద్దరూ కొత్త మోవర్ని టొయోటా ట్రక్కులో కెత్తుకొని వచ్చేవాళ్ళు. ఒక గంటలో రెండు ఇళ్ళ ముందూ వెనకా గడ్డి కత్తిరించేసి పోయేవాళ్ళు. ఆరోజు ఇంట్లో ఎవరూ లేకపోతే, డబ్బులకోసం మార్సిలీనో సోమవారమో, మంగళవారమో సాయంత్రం బాగా చీకటి పడింతర్వాత వచ్చేవాడు.

    ఆరోజు శనివారం.

    సెప్టెంబర్ నెలాఖరయ్యింది. ఎండలు బాగా తగ్గాయి. బయట కాస్త చల్లబడు తూన్నది. తొందరగా చీకటి పడుతూన్నది కూడాను. సాయంత్రం గోమెజ్, మార్సిలీనో గుజరాతీ వాళ్ళ ఇంటి ముందు గడ్డి చేస్తున్నారు. మార్సిలీనో మోవర్ తోలుతున్నాడు, గోమెజ్ మోవర్ కి ఎడమ పక్కన మోవర్ని తప్పుకుంటున్నట్టుగా నటిస్తూ చకచక మోవర్ పక్కనే నడుస్తున్నాడు. మార్సిలీనో మోవర్ని ఎడమ పక్కకి, కుడి పక్కకీ వెంటవెంటనే అదొక ఆటలా తిప్పటం మొదలెట్టాడు.

    గోమెజ్ మోవర్ని తప్పించుకోవటం; మార్సిలీనో గోమెజ్ ని మోవర్ లో తరమటం మొదలెట్టాడు. కుర్రతనం చేష్టలు.

    అప్పుడే సుజాత కారు ఎడమపక్కకి తిప్పుతూ కుడిచేతి వైపున ఉన్న మాలిని ఇంటికేసి చూసింది.

    గోమెజ్ ని, మార్సిలీనోని చూసింది. ఒక్కక్షణం, అంతే! మోవర్ ఎత్తు నుంచి పల్లంలోకి వస్తోందో ఏమో, మార్సిలోనోకి బేలెన్స్ దొరకలేదు. మోవర్ ఎడమపక్కకి పల్టీ కొట్టింది. పక్కనే ఉన్న గోమెజ్ కుడికాలి మీద పడింది.గోమెజ్ కిందపడ్డాడు. మోవర్ స్టీరింగ్ వాడి తలకి కొట్టుకుంది. మార్సిలీనో కుడిపక్కకి దూకా డేమో, వాడు నిలబడే ఉన్నాడు. ఇదంతా ఒక్కక్షణంలో జరిగింది.గోమెజ్ మార్సిలీనోని ఏదో తిడుతూ ఏడుస్తున్నాడు. మార్సిలీనో అతికష్టం మీద మోవర్ని లేపి నిలబెట్టాడు. అదృష్టం బాగుండి, ఇంజన్ ఆగిపోయింది. .

    సుజాత కారు ఆపి గోమెజ్ దగ్గిరకి పరిగెత్తుకొని వచ్చింది. వాడు కుడికాలు మణిమ పట్టుకొని ఏడుస్తున్నాడు. మార్సిలీనో కళ్ళనిండా నీళ్ళు నిండాయి.గోమెజ్ తలకి దెబ్బ తగిలింది. నుదురు నుంచి రక్తం కూడా వస్తోంది. రక్తాన్ని ఎడం చేత్తో తుడుస్తూంటే సుజాత వాడిని వారించి, తన కారులోంచి టిష్యూ పేపర్ తెచ్చి తుడిచింది. రక్తం ఎక్కువగా లేదు కాని, నుదురు మీద పెద్ద బొప్పి బాగా కనిపిస్తోంది. కుడికాలు నేల మీద అదిమిపట్టి ఎడమచెయ్యి ఒత్తు పెట్టుకొని లేవడానికి ప్రయత్ని స్తున్నాడు. విపరీతమైన నెప్పి కాబోలు; లేవటం కష్టం అయ్యింది. మార్సిలీనో చెయ్యి ఊతగా పట్టుకొని అతికష్టం మీద లేచి నిలబడ్డాడు. సుజాత వాడిని తన కారులో కెక్కించింది, మార్సిలీనో సాయంతో. మార్సిలీనోని వెనక ట్రక్ లో రమ్మంది. యస్ యస్ అన్నాడు మార్సిలీనో.

    “హాస్పటల్ ఎమర్జెన్సీకి తీసికెళ్ళాలి,” అంది. “హాస్పటల్? నో! నో హాస్పటల్ మామ్! నో! నో!” అంటున్నాడు గోమెజ్.

    సుజాత వాడి మాట ఖాతరు చెయ్యలేదు. మెడికల్ సెంటర్ ఎమర్జెన్సీకి తీసికెళ్ళింది. అరడజను కాగితాలిచ్చింది అక్కడి రిసెప్షనిస్ట్. వివరాలన్నీ పూర్తిచేసిన తరువాత డాక్టర్ చూస్తాడని చెప్పింది. మార్సిలీనో రావడంతో కాస్త ఇబ్బంది తప్పింది. పూర్తి పేరు, అడ్రెస్, వయస్సు, వగైరా వగైరా వాడే పూర్తిచేశాడు. ఈ తతంగం అవు తున్నంత సేపూ,

    గోమెజ్ నో నో హాస్పటల్ అని అరుస్తూనే ఉన్నాడు. ఆ కాగితాలు రిసెప్షనిస్ట్ తీసుకుంటూ ఇన్స్యూరెన్స్ భోగట్టా అడిగింది.

    గోమెజ్ కి ఇన్స్యూరెన్స్ లేదు. ఈలోగా మార్సిలీనో మాయమయ్యాడు. హాస్పటల్ కి ఎవరో ఒకరు హామీ ఇవ్వాలని రిసెప్షనిస్ట్ చెప్పింది, ఆ కాగితాలని సుజాత ముందుకి నెడుతూ. సుజాత హామీ పత్రం మీద సంతకం పెట్టింది, మోహన్ తో చివాట్లు తినాలని అనుకుంటూ!

    గోమెజ్ ని డాక్టర్ ఒక ఐదు నిమిషాలు పరీక్ష చేసాడు. తలమీద బొప్పి చూసాడు. కాలు చివర పట్టుకొని గట్టిగా లాగాడు.

    గోమెజ్ బాధగా ఉన్నా అరవలేక పోయాడు. కాలికి ఎక్స్-రే తీయాలని చెప్పాడు. తలమీద దెబ్బ తగిలింది కాబట్టి గోమెజ్ సోమవారం వరకూ హాస్పటల్లో ఉండవలసి వస్తుందని చెప్పి ఏవో కాగితాలుపూర్తి చేసి, నెప్పికి మందు రాసి వెళ్ళిపోయాడు. నర్స్ గోమెజ్ ని కుర్చీలో కూర్చోబెట్టి వాలోకి తీసుకెళ్ళింది. నర్స్ తో పాటు సుజాత కూడా గోమెజ్ బెడ్ దాకా వెళ్ళింది. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో మార్సిలీనో తన వెనకాలే వచ్చాడు.

    మార్సిలీనోతో సుజాత చెప్పింది, “రేపు వచ్చి చూస్తానని గోమెజ్ కి చెప్పు.రాత్రికి మందు వేసుకొని పడుకోమను. సరేనా?” మార్సిలీనో యస్ యస్ అని తలకాయ ఊపాడు. ఈలోగా సుజాత కేథరీన్ నిపిలిచింది. అన్ని విషయాలూ పూసగుచ్చినట్టు చెప్పింది.

    గోమెజ్ విపరీతమైన నొప్పితో బాధపడుతూ కూడా, “మి పే, మి పే, మామ్... మి పే, యస్ యస్, మి పే,” అని కలవరిస్తున్నట్టు చెపుతున్నాడు. వాడు ఏమంటు న్నదీ సుజాతకి బోధ పడలేదు. ఏమిటీ? అన్నట్టు మార్సిలీనో కేసి చూసింది. మార్సిలీనో చెప్పాడు హాస్పటల్ ఖర్చు తను ఇస్తానని అంటున్నాడు, అని.ఆదివారం మూడు గంటలకి సుజాత, కేథరీన్ హాస్పటల్ కి వచ్చారు. తిన్నగా గోమెజ్ గదికి వెళ్ళారు. గోమెజ్ గదిలో లేడు. అక్కడ ఉన్న నర్స్ స్టేషన్ కెళ్ళి గోమెజ్ గురించి అడిగింది. వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు. ముందు ఆఫీస్ లో అడగమని సలహా ఇచ్చారు. పొద్దున్నే గోమెజ్ గదిలో నుంచి వెళ్ళిపోయాడని చెప్పాడు, పక్కనున్న పేషేంట్. ముందు ఆఫీస్ కెళ్ళి అడిగింది కేథరీన్.

    గోమెజ్ రిలీజ్ చెయ్యక ముందే ఎవరికీ చెప్పాచెయ్యకండా పారిపోయాడని చెప్పింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చామని చెప్పింది కూడాను. కేథరీన్ కి బోధపడింది; గోమెజ్ భయపడి పారిపోయాడని! 'పోలీస్ రిపోర్ట్ చెప్పకుండా హాస్పటల్ నుంచి పారిపోయినందుకు చేశారా? మరెందుకైనా రిపోర్ట్ చేశారా?' అని అడుగుదామనుకున్నది కానీ, ఏ కళలో ఉన్నదో ఆ ప్రశ్నలు మాత్రం అడగలేదు, కేథరీన్. తిరిగి వస్తూ సుజాత గోమెజ్ కి ఫోన్ చేసింది. సమధానం లేదు.గోమెజ్ పోలీసు లకి భయపడి పారిపోయాడేమో అన్న అనుమానం ఇద్దరికీ వచ్చింది. అయినా ఇంటి కొచ్చే వరకూ ఇద్దరూ ఆ విషయం ఎత్తలేదు. మర్నాడు సాయంత్రం,గోమెజ్ ఇచ్చిన ఎడ్రస్ పట్టుకొని ఇద్దరూ ఆ ఇంటికెళ్ళారు. తలుపు కొట్టారు. ఇద్దరు లాటినో కుర్రాళ్లు తలుపు తీసారు. ఇద్దరూ టీనేజర్స్!

    గోమెజ్ గురించి, మార్సిలీనో గురించి అడిగింది, కేథరీన్. వాళ్ళు స్కూల్ కెళ్ళే పిల్లలు కాబోలు; ఇంగ్లీషులో అడిగితే, ఇంగ్లీషు లోనే సమాధానం చెప్పారు; గోమెజ్, మార్సిలీనో ఇక్కడ లేరు, అని.

    “గోమెజ్ ఎవరో మాకు తెలియదు,” అన్నాడు ఒకడు. “ప్లీజ్! గో,” అని తలుపు మూశాడు రెండోవాడు.

    గోమెజ్, మార్సిలీనో ఇద్దరూ ఇల్లీగల్స్ అయి ఉండాలి, అని నచ్చచెప్పుకున్నారు, సుజాత, కేథరీన్. వచ్చే మే నెలదాకా గడ్డి చెయ్యవలసిన అవసరం అంతగా ఉండ దుగా! అప్పుడెవరినో చూసుకోవచ్చులే అన్నది, కేథరీన్ .

    గోమెజ్ తిరిగి వస్తాడని గట్టి నమ్మకం ఉన్నది, సుజాతకి. అలాగని కేథరీన్ తో అనలేదు, నవ్వుతుందేమోనని!

    ఆ రోజు సోమవారం.

    డిసెంబర్ లో హాస్పటల్ నుంచి వెయ్యి అరవై డాలర్లకి బిల్లు వచ్చింది. సుజాత గుండె గుభేలుమన్నది. కేథరీన్ తో చెప్పింది.

    “గోమెజ్ కి జరిగిన యాక్సిడెంట్ ఆ కార్నర్ ఇంటిముందే కదా?” అన్నది కేథరీన్.

    “యస్.” “ఆ ఇంటి ఆవరణలోనే యాక్సిడెంట్ అయ్యిందా?”

    “యస్,” చెప్పింది సుజాత. “నేను గోమెజ్ ని వాళ్ళ లా లో నుంచే లేవదీసి నా కారులో హాస్పటల్ కి తీసికెళ్ళాను.”

    ““మరయితే, ఈ మెడికల్ బిల్ వాళ్ళ బాధ్యత కాదూ?” “యస్.” “అయితే, వెళ్ళి ఆవిడతో మాట్లాడు.” “నువ్వు కూడా వస్తావా?” అని అడిగింది, సుజాత.

    “వత్తాసు కోసం వస్తాను, కానీ నేను యాక్సిడెంట్ చూడలేదుగా? అందుకని ఆవిడని నిలదీసి అడగలేను,” అన్నది, కేథరీన్. నయమే! కనీసం వస్తానన్నది, రాను పో అనలేదు, అని సంతృప్తి పడింది సుజాత.

    మర్నాడు సాయంత్రం ఇద్దరూ మాలిని ఇంటికెళ్ళారు. మాలిని గుడి నించి తెచ్చిన ప్రసాదం పెట్టింది. మసాలా టీ ఇచ్చింది. సుజాత జరిగిన విషయం పూస గుచ్చినట్టు చెప్పింది.

    “యాక్సిడెంట్ అయిన రోజునే నీకు చెప్పి ఉండాల్సింది. కానీ,” వాక్యం పూర్తి కాకముందే మాలిని గబగబ హిందీ, ఇంగ్లీషు కలిపి మొదలెట్టింది.“నేను గడ్డి చెయ్యమని అడగలేదే? అసలు ఆరోజు ఎందుకొచ్చాడు? అడగకండా పెట్టకండా మా లాన్ ఎందుకు చేశాడు? నేను వాడితో కచ్చితంగా చెప్పాను. నేను పిలిచినప్పుడే వచ్చి మా లాన్ చెయ్యాలి అని!”ఈవిడగారు తప్పుకొని పోతున్నదని తెలిసిపోయింది. కేథరీన్, సుజాత తిరుగు ముఖం పట్టారు మళ్ళీ మాట్లాడకండా! ఇచ్చిన టీ అక్కడే వదిలి పెట్టి. బయటికి వస్తూ, “గోమెజ్ ని పిలిచి మాలిని ఏ భాషలో చెప్పిందో?” అని నవ్వింది, సుజాత. కేథరీన్ వంతపాడింది.

    ఒక వారంరోజులు పోయిన తరువాత, హాస్పటల్ కి వెళ్ళారు, కేథరీన్, సుజాతానూ! ఒక వంద డాలర్లు ఇచ్చి సరిపెట్టుకుందామని. హాస్పటల్ ఎడ్మిని స్టేటర్ తో అరగంట బేరం ఆడారు. మొత్తానికి బేరమాడి, మూడువందల అరవైకి ఒప్పించారు. “మీరు మంచి పనిచేసి ఆపదలో ఉన్న వాడికి సాయం చేశారు కాబట్టి.

    “ఐ థింక్... వుయ్ ఓ మోర్ టు గోమెజ్ ఫర్ హిజ్ సర్వీసెస్...” అని సరిపెట్టుకుంది సుజాత.

    ఇవాళ శనివారం.

    ఏప్రిల్లో కూడా ఇంకా చలి చలిగానే ఉన్నది. సుజాత, మోహన్లు రెండు వారాల పాటు ఫ్లారిడాలో మకాం చేసి తిరిగొచ్చారు, నెలాఖరుకి.

    సుజాత రెండు వారాల మెయిల్ చూస్తున్నది. చాలా భాగం జంక్ మెయిల్. తట్టెడు బిల్లులు. రాఫెల్లో ఐదు మిలియన్లు నెగ్గటానికి చదవాల్సిన ఉత్తరాలు ఐదు;

    మోహన్ పేరున మూడు, తన పేరున రెండు! అంతా కలిపి ఓ రెండు పౌండ్ల బరువుం టాయి. అన్నీ పక్కకు బొత్తిగా పెడుతుంటే కనిపించింది ఒకే ఒక్క మాసిపోయిన కవరు. ఈ ఉత్తరం చాంద్రాయణం చేసి వచ్చినట్టుంది. ఉత్తరం చింపి చూసింది. తెల్లకాయితం మడతలో నలిగిపోయిన ఐదు డాలర్ల బిల్లులు మూడో నాలుగో. పైనున్న బిల్లు వాటర్ మార్క్ మీద పొడి పొడి ఇంగ్లీషు అక్షరాలు. -

    “థాంక్స్ మామ్.” ఎడ్రస్ లేదు; ఎల్ పాసో పోస్టు ముద్ర తప్ప.

    ‘మి పే! మి పే!' అని హాస్పటల్ లో కలవరిస్తున్న గోమెజ్ గుర్తుకొచ్చాడు. సుజాత కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఒక్క చుక్క కూడా ఐదు డాలర్ల బిల్లు మీద పడలేదు.

    ********

    పుస్తకం లభ్యత:

    ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

    https://kinige.com/book/Aa+Nela+Aa+Neeru+Aa+Gaali

    *Intro- outro BGM credits: *Intro- outro BGM credits: en vanile - jingle man (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    27 min
  • జన జీవన స్రవంతి

    జన జీవన స్రవంతి :

    చీకటి ఊరిని, నెమ్మదిగా కమ్ముకోడం కనిపిస్తోంది, కిటికీలోంచి చూస్తే. 

     దూరాన కనపడే మావిడి తోటల వెనకాల్నించీ సూర్యుడు ఎవరో తరుముతున్నట్టు హడావిడిగా కిందికి దిగిపోతున్నాడు . 

    చదూతున్న పాత ఆంధ్రభూమి మూసి పక్కన పడేసా నేను . మిద్దె మీద గదిలో కూర్చోనున్నా. 

    అమ్మమ్మ వాళ్ళ వూరు, పమిడిపాడు కొచ్చి రెండు రోజులైంది.  

    ఎంసెట్ రాసి రిసల్ట్ కోసం వెయిటింగ్. పన్నెండు మైళ్ళు పమిడిపాడు గుంటూరుకి. 

    మా అమ్మ ఏకైక తమ్ముడు, గంగాధరం మావ, ఆయన భార్య రాజత్త , అమ్మమ్మ వుంటారు ఇక్కడ. 

    నేను వొచ్చిన రోజు సాయంకాలం నించీ మావ క్షణం తీరిక లేకుండా వున్నాడు

    మామూలుగా ఇంటి పట్టున ఎపుడూ ఉండని గంగాధరం మావ, ఇల్లు వదట్లేదు. 

    ఎదురింటి రాజా రావు గారు , ఇంకా మా వీధిలో వుండే కొన్ని పెద్ద తలకాయలూ , వచ్చి పొద్దున్నించీ రాత్రి దాకా మంతనాలు, ముందు హాల్లో కూర్చోని, మావతో.  

    నన్నేమో ఈ రూములో పడేసారు, ఓ బండెడు పుస్తకాలూ , ఒక ట్రాన్సిస్టరూ ఇచ్చి. 

    అప్పుడప్పుడు రాజత్త వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్తుంది. టిఫిన్ , భోజనానికి పడుకోడానికి మాత్రమే కిందికి. 

    కిటికీ లోంచి, కిందికి వీధిలోకి చూసా.  వీధి అంతా నిర్మానుష్యం. మామూలుగా అయితే ఈ పాటికి వీధి అంతా సందడి సందడి గా ఉండాల. పొలాలకు పొయ్యినోళ్లూ వెనక్కొస్తూ.  

    పైనున్న శాతవాహనుల కాలం నాటి ఫ్యాను గూడ నెమ్మదిగా తిరుగుతోంది. బైట గాలి గూడ బిగుసుకొపొయ్యింది. జైల్లో ఉన్నట్టుంది .

    ఊరికొచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి. ఇల్లు దాటనివ్వట్లేదు ఎవ్వరూ. నాకేమో ఏదోరకంగా బయటికెళ్లి వెంకటి గాణ్ణి కలవాలనుంది. 

    వెంకటి గాడు మూడో క్లాసు దాకా నాతో చదివి , స్కూలు మానేసాడు. పొలం పనులకు పోతాడు. చెర్వు అవతల వుండే గుడిసెల్లో ఉంటాడు వెంకటి గాడు, గంగాధరం మావ పాలేరు ఓబులేసు, ఉండేది కూడా అదే గుడిసెల్లో.  

    ఐదు దాకా ఇదే వూళ్ళో, అమ్మమ్మ దగ్గరుండి చదూకున్నా నేను. వూళ్ళో వున్న ఒకే స్కూల్లో . పమిడిపాడు లో నేనూ, వెంకటిగాడూ కలసి చెయ్యని కోతి పన్లు అంటూ లేవు. 

    గంగాధరం మావకి పెళ్ళై పదిహేనేళ్ళు అయ్యినా ఇంకా పిల్లలు లేరు. ఆయనకి చదువు పెద్ద అబ్బలేదు. సావాసాలు ఎక్కువ. ఎవరినో ఒకరిని వేసుకోని వారంలో రెండురోజులు గుంటూరు పొయ్యిరాందే మనిషి నిలవలేడు. 

    పొలాలన్నీ కౌలు కి ఇచ్చేసాడు. రెండెకరాల మావిడి తోట తప్ప. మామిడి తోట చూసుకునే ఓబులేసు, గంగాధరం మావకి కుడిభుజం. 

    వారానికోసారి చీట్ల పేక ఆడుకోడానికి తప్ప తోటగ్గూడా పోడు, గంగాధరం మావ. ఎవడికి గుంటూర్లో పనున్నా , వాడ్ని తన బైకు ఎక్కించుకొని గుంటూరు తీసుకోబోతూంటాడు. ఆయన బైకు, టికెట్ లేని ఓ మినీ టౌన్ బస్సు, వూళ్ళో జనాలకి. 

    రాజత్త, అమ్మమ్మ కు అన్ని పనులలో చేదోడు వాదోడు. అమ్మమ్మ అంటూ ఉంటుంది, మీ అమ్మ పక్కన లేని లోటు లేదురా నాకు అని రాజత్త గురించి. ఇది గాక రాజత్త పుస్తకాల పురుగు. గంగాధరం మావ గుంటూరెళ్లిన ప్రతీ సారి పుస్తకాలూ కొనుక్కొస్తాడు. ఇంట్లో పన్లయ్యాక వాటిల్లో మునిగిపోతుంది. ఇంట్లో ఉంటే, నేను గూడ అత్త వెనకాలే. అత్త చదివే పుస్తకాల గురించీ మాటలే మాటలు.

    ఉన్నట్టుండి కర కర మని మూల్గుతూ, ఫ్యాన్ ఆగిపోయింది. 

    గది బయటకొచ్చి అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లు దిగడం మొదలుపెట్టా, 

    వరండాలోంచీ మాటల శబ్దం. రాజత్త , గంగాధరం మావ గొంతులు.

    తడుముకుంటూ వంటింట్లోకి వచ్చి చూసా. అమ్మమ్మ గూడ కనపళ్ళేదు. అంతా చీకటి. వంటింటిలోంచి పెరట్లోకి తలుపు తెరిచి ఉండడం, కుంపటి వెలుగులో కనపడింది. చిన్నగా పెరట్లోకి వచ్చి పిట్ట గోడ ఎక్కి దూకేసా. 

    *********************************************

    వీధిలో రెండడుగులు వెయ్యంగానే, కరంటు వచ్చినట్టుంది, రోడ్డు మీద అక్కడక్కడా విసిరేసినట్టుండే వీధి దీపాలు వెలగడం మొదలుపెట్టాయి. వడి వడి గా అడుగులేసుకుంటూ చెరువు అవతల గుడిసెల దగ్గరికి చేరుకున్నా. 

    ఇంటి ముందర మట్టి అరుగుమీద కూర్చొని, లాంతరు సరిచేస్తూ కనపడ్డాడు వెంకటి గాడు. 

    వాడు చూడకుండా , దగ్గరిగా పొయ్యి “ వెంకటీ !” అని అరిచా నేను. 

    దడఁచుకొని వెనక్కి తిరిగాడు వెంకటి. నన్ను చూడంగానే వాడి మొహం లో ఒక వెలుగు వెలిగింది. మరు క్షణంలో వెలుగు ఆవిరై పొయ్యి భయం బయటికి రావడం మొదలైంది. మాట్లాడే లోపలే వెంకటి గాడే అన్నాడు. “ఇక్కడుండొద్దు రా రాంబాబు. ఇంటికెళ్ళిపో” 

    “ఇంట్లో గూడ గోల గోలరా, బయటికి రానివ్వట్లేదు. ఏమైంది ఊరికంతా” ? 

    “నీకేం తెలవదా ”?

    అటూ ఇటూ తలూపా నేను.  

    “మూడ్రోజులకిందట మీ మామిడి తోటలో పంచేస్తూంటే , లచ్చక్కని పక్క పొదల్లో కి తీస్కపొయ్యి గలాభా చేసారంట”.. 

    వాడింకా ఏదో చెప్పబో తూంటే , అడిగేశా ఆదుర్దాగా, “ఎవరు” ?

    “మీ పక్కతోట నాగోజీ సారు కొడుకు రవిబాబు” . 

    లచ్చక్క అంటే, మావ ఇంట్లో పాలేరు, ఓబులేసుభార్య . 

    నాగోజీగారిల్లు గూడ మా గంగాధరం మావ వాళ్ళ వీధి చివర్లో. రవిగాడు డిగ్రీ మధ్యలోనే మానేసాడు . ఊరి మీద తిరుగుతుంటాడు. 

    ఇంకా ఏదోఆలోచిస్తూంటే వెంకటిగాడు అన్నాడు. 

    “మా పెద్దోళ్లంతా ఓబులేసు ఇంటిదగ్గరే గూడుకొని వుంటున్నారు రోజంతా, ఎవ్వరూ గూడెం దాటి బయటకు పోవట్లా పనులకు.”

    ఇంకేం మాట్లాడాలనే వాడు పడనిచ్చేటట్టు లేదు. గమ్మని ఎనక్కి తిరిగా.. 

    *******************************************

    ఇంటి వెనక వైపు కొచ్చి జాగర్తగా చూసుకుంటూ పెరట్లోకి దూకాను. 

    నెమ్మదిగా అడుగులేస్తూ వంటిట్లో దూరా.  

    ఇంకా ముందు హాల్లో నించి మాటలు వినబడుతున్నాయి. ఎవ్వరూ నేను ఇంట్లోంచి బైటికెళ్లినట్టు గమనించనట్టున్నారు. ఊపిరి పీల్చుకున్నా. 

    రాజత్త స్వరం హెచ్చితే ఆగి పొయ్యా. 

    అంటోంది ఆవిడ , “చేసినవాడు మనోడు గదా అని మీరందరూ కట్ట కట్టుకొని కళ్ళు మూసుకుంటే, అది ఆ రోజు జరిగిన దాని కన్నా పెద్ద అత్యాచారం. వూరికే పోదు . ఊరికంతా కొడ్తుంది. “

    మావ ఏవన్నాడో సరిగ్గా వినిపించలేదు నాకు. ఏదో లీలగా.. “కోర్టులు కేసులూ”.. 

    ఇంకొంచెం ముందుకు పొయ్యి హాలు తలుపు పక్కనే నిలబడ్డా . 

    అత్తే మళ్ళీ మాట్లాడుతోంది. “ మన చేతిలో ఏది ఉందొ అది మనం చెయ్యాల. ఓబులేసు ఈ ఇంటిని నమ్ముకొని ఇరవై ఏళ్ళు గా పని చేస్తున్నాడు. వాళ్ళ నాయన గూడ ఈ ఇంటితోనే వున్నాడు బతికినన్నాళ్ళూ.” 

    అంటున్నాడు మావ “ రాజారావు అన్న గూడ, గూడెం పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాడు. డబ్బులు ఎవరి నోర్లన్నా మూయించగలవు.”

    ఇంకా ఏదో అనపోతూంటే , అమ్మమ్మ నిశ్చయంగా చెప్పింది. “అమ్మాయి చెప్పింది కరెక్టు మాట. నేను రేపు ఓబులేసుని పిల్చి మాట్లాడ్తాను. వాణ్ని తీసుకెళ్లి కేసు పెట్టించు. ఎవడు అడ్డం వస్తాడో చూద్దాం.”

    ఓ నిమిషం నిశబ్దం తర్వాత, గంగాధరం మావ “ఈ గొడవల్లో అంతా రాంబాబు గాడు ఇక్కడుండడం మంచిది కాదు.”

    పక్కరోజు పొద్దున్నే నన్ను, గుంటూరు బైకులో తీసుకెళ్లి , తిరుపతి బస్సెక్కిచ్చాడు గంగాధరం మావ. 

    ఆ తర్వాత నా చదువు గొడవల్లో నేను పడిపొయ్యి, వూరు వైపు పోలేదు. 

    *************************************************************

    ఈ ఇన్సిడెంట్ తర్వాత ఓ పదేళ్లకు, నాన్న ఫ్రెండు డాటర్, పెళ్లి కెళ్ళాం నేను మా అన్న.    

    మంచి ఎండాకాలం. తెగ ఉక్కగా వుంది.

    అక్కడ పెళ్ళికొడుకు పక్కన ఎవడో తోలాయ్ గాడు సూటు వేస్కొని చాలా హడావుడి చేస్తున్నాడు. “వీడెవడా ఎక్కడో చూసినట్టుందే” అంటూ బుర్ర గోక్కుంటున్నా. 

    “ఎవడ్రా ఈ పులి వేషగాడు“ మా అన్ననడిగాను.

    మా వాడు ఎక్కడో చూసి ఏదో గొణిగాడు. 

    రెట్టించా. 

    విసుగ్గా అన్నాడు వాడు “ గుర్తు పట్లా. పమిడిపాడు రవి బాబు గాడు. పెళ్ళికొడుకు ఫ్రెండట.”

    ఇంతలో సూటేస్కున్న రవిబాబు గారు , తన భార్యా పిల్లలతో కలిసి, కొత్త దంపతుల తోటి ఫోటో లు దిగేస్తున్నాడు. 

    తట్టుకోలేక అడిగేసా మా అన్నని,

     "మరి కేసు, జైలు ఏమయ్యింది?. గంగాధరం మావ గమ్మనున్నాడా "? అని. 

    "లేదురా, రాజత్తా, మావ, ఓబులేసు పక్కనే ఉండి కేసు పెట్టిచ్చారు. దీని దెబ్బ, వాళ్ళకి ఓ ఐదేళ్లు, వూళ్ళో ఎవ్వరితో మాటలు లేవు. కేసు నత్త నడక నడిచి నడిచి చివరికి , సాక్షాలు లేవని కొట్టేశారు" అన్నాడు మావాడు. 

    “లచ్చక్క , ఓబులేసు ఏవయ్యారు” ?, అడిగా నేను. 

    “ఏవోరా . గ్రూప్ ఫోటో కి పిలుస్తున్నారు స్టేజి మీదకు పా.” అన్నాడు మా వాడు అభావంగా. 

    ఉక్కపోయ్యడం ఆగిపోయింది. 

    లేచి బయల్దేరా నేను గూడ ‘జన జీవన స్రవంతి’ లోకలవడానికి.

    *Intro- outro BGM credits: *Intro- outro BGM credits: en vanile - jingle man (https://www.youtube.com/watch?v=fyM41M0n3lI)


    *






    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    9 min
  • శ్రీమతి మణి వడ్లమాని గారి 'వాడు - నేను '
    రచయిత పరిచయం:
    శ్రీమతి మణి వడ్లమాని 2010లో కథారచన మొదలు పెట్టారు . ఇప్పటి వరకు దాదాపు డెబ్బయి కధలు పైగా వ్రాసారు.
    వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పొందారు... . తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. “వాత్సల్య గోదావరి” అనే కథాసంపుటిని ‘కాశీపట్నం చూడర బాబు’ నవల లు పుస్తకాలుగా వచ్చాయి. , ‘ప్రయాణం’ వారు రచించిన మూడో నవలిక.
    This podcast uses the following third-party services for analysis:
    Chartable - https://chartable.com/privacy
    13 min
  • శ్రీరమణ గారు - బంగారు మురుగు

    తెలుగు వారికి శ్రీ శ్రీ రమణ గారు కథా రచయిత గా , కాలమిస్ట్ గా , సంపాదకీయులుగా అత్యంత సుపరిచితులు.

    బంగారు మురుగు - శ్రీ రమణ గారి రచించిన 'మిధునం ' కథా సంకలనం లోనిది.

    ఒక బామ్మ గారు, మనవణ్ణి తన ప్రాణానికి ప్రాణంలా ఎలా చూసుకుంది? తన తదనంతరం అదే ప్రేమను అందించడానికి, తన బంగారాన్ని, ఇంకో యోగ్యురాలైన వ్యక్తి చేతికి ఎలా అందించిందీ ? అనేదే ఈ కథలో ముఖ్యాంశం.

    ఇప్పటిదాకా ఆయన కేవలం ఒక పాతిక కథలు మాత్రమే రాసారు. ఈ కథ చదివిన తర్వాత, సుప్రసిద్ధ రచయిత , సాహితీ వేత్త శ్రీ ఆరుద్ర గారు ఏవన్నారంటే , " కడిమి చెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది. ఇదిగో ఇప్పుడు శ్రీరమణ పూశాడు. ఆ కురింజి పేరు 'బంగారు మురుగు' "

    హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ప్రసారం అయ్యే శ్రీ శ్రీరమణ గారి ఇంటర్వ్యూలో , ఈ కథ గురించి మరిన్ని వివరాలు మనం తెల్సుకోవచ్చు.

    ఇంటర్వ్యూ కు , వారి కథలు/వ్యాసాలూ ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    ఈ పుస్తకం మీరు కొనడానికి, కావాల్సిన వివరాలు ఇదే వెబ్ పేజీ లో చివర ఇవ్వబడ్డాయి.

    బంగారు మురుగు:

    నాకు ఆరేళ్ళప్పుడు మా బామ్మకి అరవై ఏళ్లు.

    మా అమ్మానాన్న ఎప్పుడూ పూజలూ పునస్కారాలూ, మళ్ళూ దేవుళ్ళూ గొడవల్లో వుండేవారు. స్వాములార్లు, పీఠాధిపతులూ ఎత్తే పల్లకీ, దింపే పల్లకీలతో మా ఇల్లు మరంలా వుండేది. అమ్మ తడిచీర కట్టుకుని పీఠాన్ని సేవిస్తూ - నే దగ్గరకు వెళితే దూరం దూరం తాక్కూడదు అనేది.

    బామ్మకి యీ గొడవలేం పట్టేవి కావు. అమ్మ నాన్న చుట్టం పక్కం అన్నీ నాకు బామ్మే. మా బామ్మకి కాశీ రామేశ్వరం అన్నీ నేనే. ఓకంచంలో తిని ఓ మంచంలో పడుకునేవాళ్ళం.

    పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ వేధింపులూ బామ్మ దగ్గర లేవు. ఎవరేనా "ఈ ముసలమ్మకి భయమూ భక్తీ రెండూ లేవు..." అంటే - "దయకంటే పుణ్యంలేదు. నిర్దయకంటే పాపం లేదు. చెట్టుకి చెంబెడు నీళ్లు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వేయడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం - నాకు తెలిసిందివే "అనేది.

    బామ్మకి పుట్టింటి వాళ్ళిచ్చిన భూమి నాలుగైదెకరాలు ఇంకో ఊళ్ళో ఉండేది. మా ఊరికి పది కోసుల దూరం. ఏటా పంటల కాలంలో కౌలు చెల్లించటానికి రైతులు వచ్చేవాళ్ళు . వచ్చీ రాగానే వాళ్ళని ఆప్యాయంగా పలకరించేది. పుట్టిన ఊరు విశేషాలన్నీ గుక్క తిప్పుకోకుండా అడిగేది. వాళ్ళు బదులుచెప్పకుండానే మళ్ళీ ప్రశ్న - ప్రశ్న మీద ప్రశ్న వర్షం కురిపించేది. రైతులేమొ పంట తెగుళ్ళగురించి, అకాల వర్షాల గురించి సాకులు చెప్పి పావలో బేడో చేతిలో పెట్టి వెళ్ళాలనే ఆలోచనతో దిగులు మొహాలు తగిలించుకు వచ్చే వాళ్ళు. ఆ మాట ఎత్తడానికి బామ్మ అవకాశం యిస్తేనా ?

    "ఎండన పడి వచ్చారు, కాళ్ళు కడుక్కోండరా" అనేసి వడ్డన ఏర్పాట్లలో పడిపోయేది. విస్తరి వేసిందగ్గర్నించి పెరుగు అన్నంలోకి వచ్చేదాకా వాళ్ళతో ఊరివాళ్ళ కబుర్లన్నీ వాగించేది.

    తీరా పెరుగన్నం చివర్లో "ఏరా అబ్బీ, యీ ఏడాది పంటలెలా వున్నాయిరా " అని అడిగేది.

    వాళ్ళకి పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయేది. కమ్మటి భోజనం కొసరి కొసరి వడ్డిస్తే తిని, పైగా తిన్న విస్తరి ముందు కూచుని "పంటలు పోయాయి" అని చెప్పడానికి నోరాడక "ఫర్వాదేదమ్మా దేవుడి దయవల్ల" అనేవాళ్ళు. ఇంకేం చేస్తారు పాపం అణా పైసలతో శిస్తు అప్పగించి వెళ్ళేవాళ్లు. వెళ్లేప్పుడు "ఇదిగో బుల్లి పంతులూ! మీ అవ్వ గట్టి పిండమే !" అని ఎగతాళి చేసి వెళ్ళే వాళ్ళు.

    బడికి వెళ్ళనని మారాం చేసినపుడల్లా బామ్మ నాకు అండగా వుండేది. "పసి వెధవ, గ్రాహ్యం వస్తే వాడే వెళ్తాడు- అయినా ఒక్కగానొక్కడు బతకలేక పోతాడా..." అంటూ నన్ను చంకన వేసుకు బయటకు నడిచేది.

    మా ఇంటి పెరడు దాటగానే పెద్ద బాదం చెట్టు వుండేది. అది మా స్థావరం. రోజులో మూడొంతులు అక్కడే మా కాలక్షేపం. బాదంచెట్టు పచ్చటి గొడుగు పాతేసినట్టు వుండేది. రాలిన పండు ఆకులు విస్తరి కుట్టుకుని బామ్మ భోజనం చేసేది. దాని చుట్టూ చిన్న మట్టిఅరుగు వుండేది. "దీన్ని కాపరానికొచ్చేప్పుడు మా పుట్టించినించి తెచ్చా... అప్పుడు జానాబెత్తెడుండేది... నువ్ నమ్మవ్... పిచ్చి ముండకి మూడే ఆకులు బుల్లి బుల్లివి వుండేవి..." రోజు ఒకసారైనా ఈ మాట నాకు చెప్పేది. నే కాపరానికొచ్చి ఎన్నేళ్ళో ఈ పిచ్చి మొద్దుకి అన్నేళ్లు అంటూ మానుని చేత్తో తట్టేది ఆపేక్షగా.

    ఇప్పటికీ బామ్మ చెంబెడు నీళ్ళు దానికి పోస్తూనే వుంటుంది. మానుకి రెండు తొర్రలుండేవి. పై తొర్రలో రెండు రామచిలకలు కిలకిలలాడుతూ కాపరం చేస్తుండేవి. ఇంకో తొర్రలో బామ్మ నాకోసం చిరుతిళ్ళు దాచేది. కొమ్మకి తాళ్ల ఉయ్యాల వుండేది. నీడన ఆవుదూడ కట్టేసి వుండేది. దానికి బామ్మ పచ్చి పరకలు వేస్తూ వుండేది. కాకులు పడేసిన బాదంకాయలు వైనంగా కొట్టి నాచేత బాదం పప్పులు తినిపించేది. - ఆ బాదం చెట్టు మా ఇద్దరికీ తోడూ నీడా - ఊరు లేచేసరికి వాకిలంతా తీర్చిదిద్ది ముగ్గులు పెట్టేది బామ్మ. రాత్రి నాకు జోలపాడుతూ రేపటి ముగ్గు మనసులో వేసుకునేది. ముగ్గులు అయ్యేదాకా నేను బామ్మ వీపు మీద బల్లిలా కరుచుకు పడుకుని కునుకు తీస్తుండేవాణ్ణి. "అసలే నడుం వంగిపోయె... పైగా ఆ మూట కూడా దేనికి" - అని మా అమ్మ అంటే "వాడు బరువేంటే. వాడు వీపున లేపోతే ముగ్గు పడదే తల్లీ - చూపు ఆనదే అమ్మా" అనేది బామ్మ.

    సమస్త దేవుళ్ళకీ మేలుకొలుపులు పాడుతూ వాకిలి నాలుగు దిక్కుల్నీ ముగ్గుతో కలిపేది. అప్పుడు మా మండువా లోగిలి నిండుగా పమిటకప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువులా వుండేది. "పాటలు పాడి దేవుళ్ళని లేపకపోతే వాళ్లు లేవరా" అని అడిగితే "పిచ్చి సన్నాసీ దేవుళ్ళు నిద్దరోతారా! దేవుడు నిద్దరోతే యింకేమైనా వుందీ-! మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే" అనేది బామ్మ.

    తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపందిరికింద ముక్కాలిపీట మీద కూచోపెట్టి వేడినీళ్ళు పోసేది. "చిక్కిపోయాడమ్మా పిల్లాడు... పొడుగు సాగుతున్నాడో ఏమో" అని బామ్మ రోజు నలుగు పెడుతూ దిగులుపడేది. ఒంటి మీద చిన్న గాటో, దెబ్బో, పొక్కో కనిపిస్తే "అఘాయిత్యం వెధవ్వి ఎక్కడ తగిలించుకున్నావ్" అని గారాబంగా కేకలేసి తెగ దిగులుపడిపోయేది. నాకప్పుడు ఎంతో హాయిగా అనిపించేది.

    నెలకోసారి భజంత్రీవాడు వచ్చేవాడు బాదం చెట్టుకింద నేను మా బామ్మ తలపని చేయించుకునేవాళ్ళం. ముందు నావంతు.

    "ఒరేవ్ జాగ్రత్తగా చెయ్ - పిల్లాడి క్రాపు తెల్లదొర క్రాపింగ్ లా వుండాలి" అని హెచ్చరికలూ, సలహాలూ యిస్తూ ఎదురుగా కూర్చునేది బామ్మ. అయినా వాడి పద్ధతిలో వాడు తిరపతి మెట్లతో డిప్ప కొట్టుడు కొట్టేసేవాడు. తనవంతు వచ్చినపుడు చేతిన వున్న బంగారుమురుగుతీసి నా చేతికి తొడిగేది. స్నానం చేశాక కుంకుడురసంతో ఆ బంగారు మరుగుకి మెరుగు తెప్పించి తన చేతికి వేసుకునేది. మెరుస్తున్న చేతిని తృప్తిగా చూసుకునేది.

    బజారు చిరుతిళ్లు తినకూడదని నా మీద గట్టి ఆంక్ష వుండేది. ఆరోగ్యం కంటె కుటుంబమర్యాద దెబ్బ తింటుందని- నాకవేం తెలిసేవి కావు. బెల్లపు జీళ్లు, పీచుమిఠాయి, జంతికలు, తేగలూ కొనుక్కు తినాలని నాలిక పీకేది. బామ్మని అడిగితే "ఓస్ అంతేకదాపద" అనేసి కోరినన్ని కొనిపెట్టేది. మరికొన్ని బాదంచెట్టు భోషాణంలో దాచిపెట్టేది.

    బామ్మ నా పాలిట వరాలిచ్చే దేవత!

    మనవడికి అడ్డమైన గడ్డీ కొనిపెడ్తోందని తెలిసిబామ్మకి డబ్బు దొరక్కుండా ఇంట్లో కట్టడి చేశారు దీని మీద ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి.

    బామ్మ మీద నిఘా వేసినా నా చిరుతిళ్ళకి లోటు రాకుండా చూస్తోంది. బియ్యం ఒళ్లో పోసుకొచ్చి జీళ్లు తేగలూ నైవేద్యం పెట్టేది నాకు. అదీ తెలిసిపోయింది. బియ్యం డబ్బాకి తాళం పడింది. దాంతో నా నోటికి కూడా, అత్తగారి ఆటకట్టిందని అమ్మ సంతోషించింది.

    " ఇంటి దీపానివి, చక్రవర్తివి , నీకీ కరువేంటి నాయనా" అని బామ్మ బాధపడింది.

    ఆరోజు పీచుమిరాయివాడు ఊళ్లోకి వచ్చాడు. వాడు రోజు రాడు. సంతరోజు మాత్రమే వస్తాడు. మూడువైపులా రేకు, ఓవైపు సరుకు కనిపించేలా అద్దం వున్న డబ్బా -విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయి పొత్తులు - వాడు డబ్బా చప్పుడు చేస్తూ "పిచ్మిరా" అని చిత్రంగా అరుస్తూ వీధిన వెళ్తుంటే నా నోరెంత వూరిందో బళ్లో వున్న నాకు తెలుసు- ఇంట్లో వున్న మా బామ్మకి తెలుసు. "పిచ్మిరా" అరుపు దూరం అవుతున్న కొద్దీ నాలో బెంగ ఎక్కువవుతోంది. ఆక్షణంలో బామ్మ బడిగుమ్మంలో ప్రత్యక్షమైంది.

    పంతులుగారు ప్రభవ విభవలు చెప్పిస్తున్నారు. బామ్మ రాకతో ప్రమోదూత దగ్గర రక్కున వల్లింపు ఆగి తరగతి నిశ్శబ్దం అయింది. నరసింహం పంతులుగారంటే గండభేరుండం! పిల్లలూ పెద్దలూ హడిలి చచ్చేవారు. ఆయనకి బుర్రమీసాలు, కళ్లద్దాలు, గుండూ పిలక, చేతిలో బెత్తం, నాలుగువైపులా చూడగల మిడిగుడ్లూ వుండేవి. మా బామ్మ బడిగుమ్మంలోకి వస్తూనే "ఒరే నరసింహా, నా మనవణ్ణి పంపరా" అంది. ఆయన నా వైపు చూసి పోరా అనే లోగానే పలకా పుస్తకంతో నిలబడి వున్నాను. "పో..." అనడమేమిటి తొర్రలో రామచిలకలా తుర్రున దాటుకున్నాను.

    అవతల వీధి చివర పీచ్మిఠ వాడు నా కోసమే నిలబడి వున్నాడు. అప్పటికే వాడితో బేరసారాలు పూర్తిచేసింది బామ్మ. రెండు మిఠాయి పొత్తులూ, నాలుగు పుంజీల జీళ్లు ఇప్పించింది. జీళ్లు జేబులో పోసుకుని, బామ్మ కొంగుచాటు చేసుకుని మిఠాయిలు రెండూ మింగేశాను. ఆ రంగుకి నోరు ఎర్రగా హనుమంతుడి మూతిలా అయిపోయింది.

    "ఈ మొహంతో ఇంటికెళ్తే ఏవన్నా వుందీ.." అంటూ కాసేపు బజారు పెత్తనం చేయించి, బడిగంట కొట్టాక బావిదగ్గర మూతి కడిగి, కొంగుతో తుడిచి ఇంట్లో ప్రవేశపెట్టింది.

    తెల్లారి పొద్దున దేవతార్చనలో వుండే బుల్లి కంచుగంట కనిపించలేదని అమ్మ కంగారుగా వెదికేస్తోంది.

    "ఎక్కడికి పోతుంది... ఎలికముండలు లాక్కెళ్ళి వుంటాయి..." అని బామ్మ పట్టీ పట్టనట్టు సద్దేస్తూ మాట్లాడుతోంది.

    "అయినా ఎలికలు గంటనేం చేసుకుంటాయి బామ్మా" అంటే "పిల్లికి కడతాయ్... వెధవాయ్..." అని అరిచి నా నోరు నొక్కి బయటకులాక్కెళ్ళింది.

    తొర్రలో దాచుకున్న నాలుగు పుంజీల జీళ్లు రెండ్రోజుల్లో పూర్తయినాయి.

    మళ్లీ సంతరోజు వచ్చింది. ఇంట్లో పెద్ద గాలిదుమారం లేచింది. నాన్న అరుపుల ముందు బామ్మ ముద్దాయిలా నిలబడి వుంది. వాకిట్లో పీచుమిరాయి వాడు నిలబడి వున్నాడు. క్రితం వారం వాడికి బామ్మ కంచుగంట యిచ్చిందట. ఆ లెబ్బల్లో వాడు మనకి నాలుగు మిరాయిలు, ఆరుపుంజీల జీళ్ళు ఇంకా బాకీ వున్నాట్ట! అవి యిచ్చేసి వెళ్తామని సరాసరి వాడు ఇంటికి వచ్చాడు. అదీ గొడవ. సడీచప్పుడు చెయ్యదనుకున్న గంట గణగణా బామ్మ గుండెల్లో మోగింది.

    "దేవుడి గంటనే పాపభీతి కూడా లేకపోయె..." అంది అమ్మ నిష్ఠూరంగా.

    "అంత పాపభీతి పడాల్సిందేముందీ... అయినా ఘంటలో వుంటాడా దేవుడు.... పసివాళ్ళ బొజ్జలో వుంటాడుగాని..." బామ్మ సాయకారం తీసింది.

    "ఈ మెట్ట వేదాంతాలకేం లెండి... ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడూ కలిసి ఆ చేతిమురుగు కూడా కరిగించేసుకు తింటారు." అంది అమ్మ , నాన్న కి బోధపడాలని. నాన్న కలిగించుకు మాట్లాడేలోగా బామ్మ, కోపంగా గొణుక్కుంటూ చరచరా వెళ్లి బాదం చెట్టుకింద కూచుంది. నేను వెనకే భయం భయంగా వెళ్ళా... కొంచెం దూరంగా నిలబడ్డా.

    ..." నువ్వు కాదుగాని....... నీతో నా చావుకొచ్చిందిరా. ఇన్నేళ్ళోచ్చి ఆహరికి నా బతుకు దొంగ బతుకైపోయింది... ఫో అసలు నా చాయలకి రావద్దు... మీ అమ్మా నాన్నావున్నారుగా... వాళ్ళతోనే వూరేగు... నాది అనుకుంటే దుఃఖం... కాదు అనుకుంటే సుఖం..." అంటూ బామ్మ బావురుమని ఏడ్చింది.

    కంటి ధార ఎండిన బాదం ఆకులమీద టపటపా రాలాయి. పిడుగులు రాలున్నంత చప్పుడు నా చెవికి... దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది... దిక్క లేని వాళ్ళకి?

    ఒక్కసారి బేర్ మని పెద్దగా ఏడ్చాను.

    బామ్మ తటాలున చేతులు జాపి ఒళ్ళోకి లాక్కుంది. అక్కడే చెట్టుకింద ఎండాకుల మీద బామ్మ ముడుచుకు పడుకుంది. నేను బామ్మ పక్కనే వొదిగి దిగాలుగా కూచున్నా, బామ్మ గుర్రుపెట్టి నిద్రపోయింది. బామ్మ మీద గండుచీమలు పాకుతుంటే వాటిని దులిపేస్తూ -

    వెన్ను మీద చెయ్యివేసి నా పక్కలో కూచునే బామ్మలా కూచున్నాను. కాకి రాల్చిన రెండు బాదంకాయలు గుండుమీద పడితే బామ్మ ఉలిక్కిపడి లేచింది. నాకు నవ్వొచ్చింది. సంగతి అర్ధంకాగానే బామ్మ కూడా పక్కున నవ్వింది. ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నా వరించింది.

    రాలిన బాదంకాయల్ని పప్పులు వొలిచే పనిలో పడింది. "ఒరే, మీ అమ్మకి ఈ మురుగు చెరిపించి ఒక జత ఒంటిమిరియం గాజులు చేయించుకోవాలని ఎప్పట్నించో ఆశ... చూశావా అటు తిప్పి ఇటుతిప్పి... బోడిగుండుకీ బొటనవేలుకీ ముడిపెట్టినట్టు...ధోరణి నా నగమీదికి లాగింది..." బాదంపప్పులు పెడుతూ బామ్మ మాటలు.

    నాకు అర్ధం కాకపోయినా "ఔనౌను...' అన్నాను ఆరిందాలాగా ఆమెని సంతోషపెట్టడానికి

    దసరా రోజులు వచ్చాయి.

    ఒక పెద్ద పీఠం మందీ మార్బలంతో మా ఇంట్లో దిగింది. స్వాములారు, శిష్యగణం, సేవకులు, వంటలక్కలు, గున్న ఏనుగు, నాలుగు ఆవులూ వాటి దూడలూ, జింకపిల్ల, రెండుపల్లకీలు, ఇవిగాక బోలెడు సాధన సామాగ్రి నాలుగు గూడు బళ్ళ నిండా దిగాయి.

    ఇల్లంతా ఆక్రమించుకుని సిపాయిల్లాగా వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేమిటి ఎట్లా అమర్చుకోవాలో చూసుకుంటున్నారు. నేను, బామ్మ పరాయివాళ్లలా చోద్యం చూస్తున్నాం.

    " ఇవాల్టినించి మన కొంప సర్కస్ డేరా అనుకో" అంది బామ్మ.

    వాళ్లు మాట్లాడే భాష కూడా చిత్రంగా వుంది. మా నాన్నని 'గృహస్థు' అని పిలిచేవాళ్ళు. సామాజికులు, పూర్ణదీక్షాపరులు, శిష్యపరమాణువులు, పాదరేణువులు... ఏమిటో నాకు అర్ధంకాని మాటలు చాలా వినిపించేవి.

    అంటే ఏవిటని బామ్మని అడిగితే 'అంతా మనుషులేరా అబ్బీ- వుత్తినే... అదో ఆడంబరం" అన్నది బామ్మ.

    గున్న ఏనుగుకి రోజు బెల్లం బుట్ట. అరటిపళ్ళ గెల అందించేవారు. దాని సేవకి ఇద్దరు మావటీలు, శ్రీ మావటీ గారిని మంచి చేసుకుని నన్ను ఒక్కసారైనా ఏనుగు ఎక్కించాలని బామ్మ తంటాలు పడ్డది కాని వారు సాధ్యపడదన్నారు. పల్లకీలపైన వుండే శాటిన్ వస్త్రం చుట్టేసి, పల్లకీలని దేవిడీలో జాగ్రత్త చేశారు.

    పల్లకి ఎక్కించమని హటం చేస్తే "ఆ సన్నాసి పల్లకీ మనకెందుకురా- నీ పెళ్ళికి దీని జేజెమ్మ లాంటి పూసల పల్లకీ పెట్టించి ఊరూ, పేటా ఊరేగిస్తా..." అని బామ్మ సముదాయించింది. అందరూ నిద్దర్లు పోయాక సాములారి జింకచర్మం మీద నన్ను కాసేపు పడుకోపెట్టింది బామ్మ. బలె మెత్తగా నూ, తమాషాగానూ వుంది. జింకపిల్లతో ఆడుకోవాలనిపించేది కాని బామ్మ దాన్ని శత్రువర్గంగా భావించి దూరంగా వుంచేది.

    మా ఇంట్లో అర్చనలూ, దీక్షలూ, హోమాలూ ఘోటకంగా సాగుతున్నాయి. వచ్చే పోయే భక్తులు, బంధువులు అంతా కోలాహలంగా వుంది.

    స్వామివారు వెండి రేకులు తాపడం చేసిన సిహాసనం మీద కూచుని తావళం తిప్పుతూ వుండేవారు. ఎప్పుడూ గంభీరంగా వుండేవారు. ఎప్పుడేనా ఒక చిరునవ్వు ప్రసాదించేవారు భక్తులికి. అలౌకిక విషయాల్లోనూ, లౌకిక వ్యవహారాల్లో కూడాతలదూర్చేవారు. వంటలూ - పిండివంటలూ, కూరలూ, పులుసులూ అన్నీ ఏమేం ఎట్లా చెయ్యాలో ఆయనే చెప్పేవారు.

    చెప్పడం అనకూడదుట ఆదేశించారు అనాలిట! చుట్టానికి వచ్చారనకూడదు దర్శనానికి వచ్చారనాలిట.

    "పాదాలివ్వండి స్వామీ" అని ప్రాధేయపడేవాళ్ళు. వాళ్ళకి ప్రాప్తం వుంటే పాదాలిచ్చేవారు. లేనివాళ్ళు పాంకోళ్ళకి మొక్కి వెళ్ళిపోతుండేవారు.

    సాములారు భోజనం చేశాక (అపచారం, భిక్ష స్వీకరించాక)వెండి గొలుసుల ఉయ్యాలబల్లమీద పట్టు బాలీసుల మీద వాలి అరమోడ్పు కన్ను లతో భుక్తాయాసం తీర్చుకునేవారు.

    వింజామరలు విసరడానికి మేవంటే మేమని వంతులకోసం పోట్లాడుకునేవాళ్ళు భక్తులు.

    "జార్జి చక్రవర్తిదే భోగం - మళ్లీ మీ స్వామివారిదే భోగం" అనేది శిష్యుల దగ్గర మా బామ్మ. వాళ్ళు దానికెంతో గర్వపడేవాళ్ళు.

    సాయంత్రం ఆయన వేదాంత విషయాలు బోధించేవారు. అర్ధం అయినా కాకపోయినా అంతా శ్రద్ధగా వినేవాళ్ళు. అయ్యవారికి శాలువలు, అమ్మవారికి పట్టువస్త్రాలు, పళ్లు, రొక్కం కానుకలుగా సమర్పించుకునేవాళ్ళు.

    ఒకరోజు శిల్కులాల్చీ, నాలుగు వేళ్ళకీ ఉంగరాలు, మెడలో పతకపు గొలుసుతో ఆర్భాటంగా గుర్రబ్బండి దిగాడొక భక్తుడు. వస్తూనే స్వామి వారి పాదాలమీద వాలాడుస్వామివారు వాత్సల్యంతో వందనం స్వీకరించారు.

    జోడించిన ఉంగరాల చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని "ఎట్లా వుందిరా వ్యాపారం" అని అడిగారు.

    "అంతా తమ దయ"అన్నాడా భక్తుడు.

    "రాహువు ఇల్లు మారుతున్నాడు. ఇక నీకు తిరుగులేదురా పట్టిందంతా బంగారమే" అన్నారు స్వామి భక్తుడి చేతులు వదిలిపెడుతూ - భక్తుడి నడిమి వేలునున్నఎర్రరాయి వుంగరం స్వామి చేతిలోకి వచ్చింది.

    పక్కనే వున్న శిష్యుడి దోసిట్లో వేసి "అమ్మవారికి ముక్కెర చేయించండి" అని చిరునవ్వుతో ఆదేశించారు. ఆ భక్తుడికి వేలు వూడినంత బాధ కలిగింది. పెదాలు తడారిపోయినాయి. బిక్కచచ్చి "తమ చిత్తం" అన్నాడు ఎప్పటికో తేరుకుని.

    "కాదు తల్లి ఆజ్ఞ" అన్నారు స్వామి గంభీరంగా.

    మనోవాక్కాయ కర్మలమీద స్వామివారు ప్రసంగం కొనసాగించారు. బామ్మ నవ్వాపుకోలేక సభలోంచి జారుకుంది. శిష్యుడు ఎదురైతే "మీ దేవుడికి పట్టిందంతా బంగారమే" అని ఎగతాళి చేసింది.

    లోగడ విడిది చేసినపుడు ఆయన చూపు బామ్మ బంగారుమురుగు మీదపడిందిట. "తల్లి చిట్టికాసులపేరు కావాలని గోల చేస్తోంది- నువ్వు చెయ్యివిదిలిస్తే తల్లి కోరిక తీరుస్తా..." అన్నారుట స్వామి బామ్మతో- "అయ్యో... ఆ తల్లికి నేనిచ్చే పాటిదాన్నా సాక్షాత్తూ మహాలక్ష్మి ఆమెకేం తక్కువస్వామీ" అని బామ్మ భక్తిభావంతో సవినయంగా సమాధానం చెప్పిందట.

    "ఒరేవ్ హనుమంతుడి ముందా కుప్పిగంతులు? ఇచ్చేదాన్నయితే ఆనాడు గాంధీగారు గుమ్మంలోకొచ్చి సొరాజ్జెమ్ కోసం జోలెపట్టిన రోజే యిద్దును కదా... మహా మహా ఆయనకే ఇవ్వలేదు... ఈ సర్కస్ కంపెనీకి యిస్తానా..." అంది బామ్మ.

    అది తీర్ధప్రసాదాల సమయం.

    భక్తులంతా కాళ్ళకి మొక్కి, తీర్ధం పుచ్చుకుని మళ్ళీ మొక్కి వెళ్తున్నారు. నేనూ వెళ్ళి చెయ్యి జాపా. స్వాములారు హూగ్రంగా గుడ్లురిమి "పో అవతలికి " అని గసిరారు. చొక్కా తొడుక్కుని మొక్కడం, తీర్ధాలు తీసుకోడం మహాపచారంట! ఇంకేముంది కొంపలు మునిగి పోయినట్టు అందరూ హాహాకారాలు చేయడం మొదలెట్టారు. ఆ సందట్లో నా లాగూ చొక్కా విప్పేసి ఒంటిమీద నూలుపోగు లేకుండా ఆయన ముందు నిలబెట్టారు. అయినా ఆయన కటాక్షించలేదు. నన్ను బయటకి పంపెయ్యమని తీర్ధపు శంఖుతో సైగచేశారు. తెలియక జరిగిన అపచారానికి మన్నింపు కోరాలని అమ్మ వెళ్ళి ఆయన ముందు నిలబడితే - మరీ రెచ్చిపోయి "ఇవ్వాళ అమృతం ఎవరికీ ప్రాప్తం లేదు... అపచారానికి ప్రాయశ్చిత్తం..." అన్నారు కఠినంగా - శంఖుకింద పెట్టేసి తావళం అందుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు.

    భక్తులు, శిష్యులు అంతా నన్ను దోషిని చూసినట్టు చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న మానాన్నలో సహనం చచ్చిపోయింది. నన్ను బయటికి బరబరా లాక్కెళ్ళి, పూనకం వచ్చిన మనిషిలా చావకొట్టారు. ఒంటిమీద అచ్చాదన కూడా లేదేమో వొళ్ళంతా వాతలు తేలాయి. గుక్కపెట్టి పరుగెత్తాను. బామ్మ పరుగు పరుగున ఎదురొచ్చి రెండు చేతులా నన్నెత్తుకుని గుండెలకు పొదువుకుంది. భయం, బాధ, ఉక్రోషం, ఒంటరితనం ఇవన్నీ ఆవరించిన నాకు మా బామ్మ వెయ్యి చేతులు నాకోసం జాపిన అమ్మవారిలా కన్పించింది- గబగబా బాదంచెట్టు కిందకి తీసుకెళ్లింది వాతలు చూసింది. వలవలా ఏడ్చింది. ఒళ్ళంతా నిమిరింది. పై కొంగు కప్పింది. "ఆ బడుద్ధాయికి నిన్ను కొట్టేందుకు చేతులెలా వచ్చాయిరా దూర్వాసపు పుటకా వాడూనూ..." అంటూ నాన్నని తిట్టింది. నా ఏడుపు ఎక్కిళ్ళ స్థాయికి తగ్గింది.

    బామ్మ మాత్రం బుసలు కొడుతోంది. ఇంతలో స్వాములారి అంతరంగిక శిష్యుడు ముడిధోవతులు ఆరెయ్యడానికి పెరడువైపు వచ్చాడు.

    "దీక్షితులు ఇట్రా" అని గద్దింపుగా పిలిచింది. ఆ పిలుపుకి ఆయన వులిక్కిపడ్డాడు. ఆ సంబోధన... ఆ ధాటీ - దీక్షితులు గారంటే స్వాములోరి తర్వాత స్వాములారంతటివాడు. పెద్దాయన అలవాట్లు, ఇష్టాయిష్టాలు, వేళావేళలు, కళాకళలూ అన్నీ తెలిసినవాడు. స్వామివారికి జలుబుచేస్తే దీక్షితులు గారికి తుమ్ములు వస్తాయి. అలాంటిది వారి సంబంధం - దీక్షితులు సంకోచిస్తూనే నాలుగడుగులు బామ్మ వైపు వేశాడు .

    "ఏం స్వాములారయ్యా బోడి సాములారు... పసివెధవకి ఎలా వాతలు తేలాయో చూడు... పైన చొక్కా వుంటేనే అంట్ల వెధవ అయిపోయాడా అభం శుభం తెలీని పసిబిడ్డ....? ఆ మాటకొస్తే దేహశుద్ధి లేని పుండాకోర్లు చాలా మందున్నారు మీ గుంపులో... చేతనైతే వాళ్ళ చర్మాలు వొలిపించి తీర్థాలు పోయమను. వూరిఖే బృహదారణ్యాలు భగవద్గీతలూ వల్లిస్తే లాభం లేదు... మానికతో జొన్నలు కొలిస్తే బలం వస్తుందా? దంచాలి వండాలి తినాలి హరాయించుకోవాలి- అప్పుడొస్తుంది బలం... ఔనా? మీ పీరాయ్ కి చెప్పు... నాకేం భయం లేదు... వాడి బోడి శాపం నన్నేం చేయదు..." - బుసలు కొట్టే బామ్మ మాటలకి దీక్షితులు బుర్ర తిరిగిపోయింది. పిలక తడుముకుంటూ పిల్లిలా జారుకున్నాడు. అయినా బామ్మ ఆగలేదు.

    "ధిక్కారము సైతునా అని వేమూరి గగ్గయ్యలా, గుడ్లూ వీడూనూ...పిచికమీద బ్రహ్మాస్త్రం అనీ... ఒక పక్క నించి ఎకరాలు హరించిపోతున్నా తెలీడం లేదు... అరిశెల్ని అప్పాల్ని వదల్లేనివాడు అరిషడ్వర్గాల్నేం వదుల్తాడు..." స్వాములారిని, మా నాన్న ని కలగలుపుగా దీక్షితులు వెళ్ళిన అరగంటదాకా బామ్మ తిడుతూనే వుంది.

    రాత్రి అమ్మ నన్ను గట్టిగా కరుచుకుని కంటినిండా ఏడ్చింది. నూనె రాసింది. నాన్న రోజంతా అన్నం తినలేదు.

    "ముందే వుండాలి నిగ్రహం... ఉపోషం వుంటే పిల్లాడి వాతలు పోతాయా... అంత తామసం కూడదు" అని బామ్మ మందలించింది. తలదించుకున్నారు గాని నాన్న మారు మాట్లాడలేదు.

    స్వాములారి మీద కాదు యావత్తు పీఠం మీద బామ్మ కత్తి కట్టింది. పాకశాలలో వంటవాడి మీద దాష్టీకం చేసి నాలుగు చిట్టిగారెలు కొంగులో వేసుకొచ్చి వేడివేడిగా నాచేతతినిపించింది. దీక్షితుల్ని పనిమాలా పిలిచి "ఇదిగో మహా నివేదన కాకుండానే చిట్టిగారెలు పిల్లాడికి పెట్టా....చెప్పుకో దిక్కున్నచోట.. మొక్కకి చెంబుడు నీళ్ళు పొయ్యడం... పక్షికి గుప్పెడు గింజలు జల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడన్నం పెట్టడం ఇదే నాకు తెలిసిన బ్రహ్మసూత్రం-" సవాలు చేసింది బామ్మ, పాపం దీక్షితులకి బామ్మంటే సింహస్వప్నం అయింది - ఎప్పుడు పిలిపిస్తుందో తెలీదు - ఏం తిడుతుందో తెలీదు.

    రెండోరోజు సాయంత్రం వేదాంత సభలో నన్ను పిలిచి ఒళ్ళో కూచోపెట్టు కున్నారు స్వామి వారు.

    జామపండు యిచ్చి "మొత్తం తినాల్రా" అని తినిపించారు. నాకు పులిమీద కూచున్నట్టుంది. రుద్రాక్షలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఎటూ కదలడానికి లేదు. తర్వాత మరికాస్త ముద్దుచేసి వారి పాంకోళ్ళు తొడిగించి నడవమన్నారు. నేను రక రకా చప్పుడు చేస్తూ సభలో తప్పటడుగులు వేస్తుంటే "ఏవమ్మో, నీ మనవడు బాలకృష్ణుడు..." అన్నారు స్వాములారు పెద్దగా నవ్వుతూ, శిష్యులంతా ఆమోదిస్తున్నట్టు ముఖాలు వికసింపచేశారు.

    "అంతా తమరి వాత్సల్యం. పసివాడి అదృష్టం" అంది బామ్మ. ఈ సంఘటన తర్వాత దీక్షితులు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు.

    ఆ పీఠం మరోచోటికి తరలింది.

    బామ్మ మేలుకొలుపులు పాడుతూనే వుంది. ముగ్గులు వేస్తూనే వుంది. కాని నా చిన్న తనం బామ్మ వీపు మీంచిజారిపోయింది. నా కంచం నాదే - నా మంచం నాదే. హైస్కూలు చదువులో పడ్డాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందనీ, నాకు వడకపోగు వెయ్యాలనీ నిర్ణయించారు.

    వారం ముందుగానే సందడి ప్రారంభమైంది. గురుపరంపరతో బాటు బంధువులతో ఇల్లు నిండింది. మా అత్తయ్య, మామయ్య వాళ్ళమ్మాయి కల్యాణి వచ్చారు. కల్యాణికి పదేళ్ళుంటాయి. ప్రతి ఇంట్లోలాగే మేనత్త కూతురు కాబట్టి "నీ పెళ్లాం వచ్చిందిరోయ్" అని పాత సరసం ఆడారందరూ.

    అత్తయ్య వస్తూనే బామ్మని చూసి "ఏమిటే అమ్మా అంతగా చిక్కిపోయావ్..." అని బాధ నటించింది.

    "నేను చిక్కేదాన్ని కాదు లేవే ఎవరికీ - నువ్వు బాధపడకు" అంది వ్యంగ్యంగా బామ్మ.

    "చూడు... ఆ చేతులు పుల్లల్లాగా అయిపోయాయ్... బావిలో చేద వేసినపుడు ఆ మురుగు జారి నూతిలో పడ్తుందేమో చూసుకో..." - సలహాగా అత్తయ్య అంటే

    "నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు... చచ్చినా నా చేతి మురుగు నీకివ్వను..." తెగేసినట్టు అన్నది బామ్మ.

    అత్తయ్య కస్సున లేచింది ఆ మాటకి. "అంటే నీ ముష్టి మురుగు కోసం పడి చస్తున్నానా" "ముష్ఠిది కాదది బంగారపుది - సువీ అంటే రోకలి పోటని తెలుసులేవే..." అందిబామ్మ.

    "ఒక్కగానొక్క ఆడపిల్లని... కన్న కూతుర్ని ... దయాపేక్షలు లేవు. మీ పెట్టుపోతలకి మేం ఎప్పుడైనా ఏడ్చామా...." అని గద్గద స్వరంతో అత్తయ్య విజృంభించింది.

    తల్లీ కూతుళ్ళ వాదులాట విని అమ్మ లోపల్లోపల ఆనందపడ్డది. మాటా మాటా మరీ పెరక్కుండా...

    40 min
  • దొంగ - తిలక్ గారి రచన

    తెలుగువచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

    తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

    ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

    ఇప్పుడు వినబోయే కథ 'దొంగ' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

    తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి, ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.

    కథ - 'దొంగ' :

    మసక మసకగా వుంది వెన్నెల. చెట్లకిందవున్న చీకటిలోంచి నడుస్తున్నాడు గోపాలం. మోకాళ్ళపైకి ఎగకట్టిన పంచెకట్టూ, ఛాతీకి బిగుతుగా అంటుకొనిపోయిన బనీనూ, మొలలో చిన్న కత్తి - ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ఉన్నాడు గోపాలం...

    మధ్య మధ్య త్రేన్పులు వస్తున్నాయి పుల్లపుల్లగా - ఒకే ఒక గ్లాసుడు నాటుసారా పుచ్చుకున్నాడు బలానికీ, హుషారుకీ. చదువురానివాడైనా, ప్రతీదీ ఒక ప్లానుప్రకారం నడవాలి గోపాలానికి. ఏ పని చేసినా ముందూ వెనకా చూసి ఆలోచించి బేరీజువేసే అలవాటు వుంది అతనికి. ఒక స్వాభావికమైన వివేకం వుంది. అందుకే రత్తయ్యా, సోములూ ఎంతో నమ్మకంవుంచి అతనిమీద యీ బాధ్యత వేశారు. వాళ్ళిద్దరూ లేకుండా వుంటే, పనులు సవ్యంగా జరుగుతాయి. వాళ్ళిద్దరికీ నిదానం లేదు. ఉత్త కంగారు. ఉత్తి ఆశ తప్ప.

    రాత్రి ఒంటిగంట దాటితేకాని ఆవిడ మొగుడింటికి రాడు, రెండు వారాలు పరిశీలనగా చూసి యీ విషయం గ్రహించాడు. ఆ క్లబ్ లో కూర్చుని ఖరీదైన మందు తాగుతూ పేకాడుతూ డబ్బయిపోయేవరకూ అక్కడే వుంటాడు. ఈలోగా అతని భార్యవొంటరిగా యింట్లో వంటగదికి పక్కగా వున్న గదిలో పడుకుని నిద్రపోతుంది. వంటగదికి దొడ్లో నుంచి వెళ్ళాలి. దొడ్డి చాలా పెద్దది. ఎన్నో మొక్కలూ చెట్లూ వున్నాయి. వాటి నీడలో తాను కనుపించడు. మరీ మంచిది. వంటగది కిటికీ వానకి తడిసి ఎండకి ఎండి కమ్ములు పట్టుతప్పివున్నాయి. బలంగా తెలివిగా పనిచేస్తే మూడు నాలుగు ఊచల్ని తీసెయ్యవచ్చును. ఇంక ఒకసారి వంటగదిలో ప్రవేశించాక పనిచాలా సులభం. తాను అవతల గదితలుపు కొడతాడు మెల్లగా, ఆవిడ ఏ ఎలకో. పిల్లో అనుకుని తలుపు తీస్తుంది. అంతే, తాను కత్తి చూపించి భయపెడతాడు. మెళ్ళో వున్న నాలుగు పేటలగొలుసు ఒడుపుగా తాపీగా తీసుకుంటాడు. ఆమె తెప్పరిల్లే లోపల. కేకవేసేలోపల తోటలోకి చీకట్లోకి అదృశ్యుడైపోతాడు.

    గోపాలం యిలాగ తన ప్లానంతా ఆలోచించుకుంటూ నిబ్బరంగా నడుస్తున్నాడు. రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి - అక్కడక్కడ ఒకరిద్దరు రాత్రించరుల్ని తప్పించి, ఊరికి దూరంగా ఉన్న కొత్తపేట యిది. ఊళ్ళోవున్న జనసంచారమూ, అలజడి ఇక్కడ ఉండవు

    మొదట ఆట అయిపోగానే మొగలోవున్న కిళ్ళీకొట్లూ, చిన్న కాఫీ హోటలూ మూసేస్తారు. చాలా ఇళ్ళు నిద్రలో మునిగిపోయాయి. కొన్ని ఇళ్ళలోంచి మాత్రం విద్యుద్దీప కాంతి కిటికీలోంచి వస్తోంది. మొత్తమ్మీద వీధులూ, ఇళ్ళూ ఆ మసక వెన్నెలలో ఒంటరిగా గోపాలంకోసం యెదురు చూస్తోన్నట్లు వున్నాయి.

    గోపాలానికి తనుచేసే పనిమీద నైతిక సందేహాలు ఏమీలేవు. దొంగతనం తప్పనీ, పాపమనీ అతను అనుకోలేదు. ఎందరో తమ తమ అవసరాలకి ఎన్నో వృత్తులూ , ఉద్యోగాలు చేసినట్టుగా అతనూ యిది చేస్తున్నాడే తప్ప మంచి చెడ్డల సూక్ష్మ విచారణచేసే పిరికితనం కాని, అసలటువంటి ఆలోచనకి అవసరంకాని అతనికి కనిపించలేదు. అందువలన అతనికి అంతరాత్మని నొక్కివేయడమూ ఒప్పించడమూ లాంటి బాధలు కలుగలేదు. తనపనిలో దొరికిపోతే జైలుకి వెళ్ళాలన్న భయమూ జ్ఞానమూ వున్నాయి అతనికి. అందుకే జాగ్రత్తగా ప్లానువేసుకుంటాడు. ఎంతో అవసరమైతేకాని రత్తయ్యనీ, సోముల్నీ వెంటతీసుకుని వెళ్ళడు. వాళ్ళిప్పుడు తనకోసం ఆశగా ఎదురు చూస్తూంటారన్న ఆలోచన అతనికి మరింత ఉత్సాహం ఇచ్చింది.

    ఆ యిల్లు మసక వెన్నెల్లో ముడుచుకున్న తాబేలులా వుంది. ప్లాను ప్రకారం ఇంటివెనక్కి వెళ్ళి దొడ్లోకి ప్రవేశించాడు. అరటిచెట్లూ, కొబ్బరిచెట్లూ ఏవేవో మొక్కలూ , తుప్పలూ, అంతా గలీజుగా చీకటిగా ఉంది.

    నెమ్మదిగా నడిచి వంటగది దగ్గరకు వచ్చాడు గోపాలం. కిటికీ వూచల్ని ఒకసారి లాగిచూశాడు. ఇంతలో అతనికి లోపల్నుంచి మాటలు వినిపించాయి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అతని పథకం అప్పుడే దెబ్బతిన్నట్టనిపించింది. ఈసారి మాటలు కొంచెం గట్టిగా కోపంగా వినవచ్చాయి. గోపాలానికి కుతూహలం కలిగింది.బహుశా ఆ వచ్చిన వాళ్ళెవరైనా మళ్ళీ వెళ్ళిపోవచ్చును. తన మార్గం నిరాటంక మనవవచ్చును అనికూడా అనిపించింది. ఒకవేళ ఎవరైనా ప్రియుడేమో- మొగుడు లేకుండా చూసి ప్రేమకలాపం జరుపుతోందేమో అని ఊహ తట్టింది. మాటలు తొందరగా గట్టిగా వినబడుతున్నాయి. ఆవిడ గొంతు ఏదో భయం. బాధావున్నాయి. అతని కుతూహలం హెచ్చింది. బలంగా వూచల్ని లాగి కదిపి ఊడదీశాడు. నేర్పుగా ఏర్పడిన జాగాలోనుంచి వంటింట్లోకి ప్రవేశించాడు. పక్క గదిలోనుంచి మాటలు వినబడుతున్నాయి.

    " వద్దండీ నామాట వినండి " ఆవిడ గొంతు.

    " ఇస్తావా - తగలనియ్యనా" మగ గొంతు.

    "ఎందుకు జూదమాడి తగలేస్తారు చెప్పండి. కాపరానికొచ్చిన నాటినుండి సరదాలేదు. సుఖంలేదు. ఉన్న ఆస్తంతా తగలేశారు చాలదా? "

    "వెధవ లెక్చరివ్వక మర్యాదగా తీసి ఇలా ఇయ్యి. లేకపోతే..."

    "ఈ ఉన్న ఒక్క గొలుసూ ఇస్తే నా గతేంకాను. బాబు గతి ఏంకాను! చూడండి వాణ్ని-కన్న కొడుకుని. మీకు దయలేదా? జాలిలేదా! ఏమండీ- ఈ వాళికి ఊరుకోండి. పన్నెండు గంటలవుతోంది. ఒక్కరినీ బిక్కుబిక్కుమంటూ ఇంట్లో - రండి. పడుకోండి."

    కర్కశంగా వినబడింది. యీసారి మగ గొంతు - "ఇస్తావా - పీక పిసికి చంపెయ్యమన్నావా, వెధవ పీడ వదుల్తుంది."

    " ఇవ్వను."

    " ఇవ్వనా?"

    " ఇవ్వనుగాక ఇవ్వను. ఇది మా పుట్టింటివారు పెట్టింది. ఇది నా ఆస్తి."

    వింటూన్న గోపాలానికి ఆవిడ మాటలలో ఏదో న్యాయం గోచరించింది. ఆవిడ గొంతు తియ్యగా సన్నగా జాలిగా వుంది. గోపాలానికి ఆవిడ మొగుడి మీద కోపం వచ్చింది.

    "నీ ఆస్తా-? ఏవిటీ పేలావు, ఇన్నాళ్ళూ తిన్నది నా డబ్బు కాదూ! తే- ఆ గొలుసు తే."

    "ఏవండీ. ఇలా అన్యాయంగా మాట్లాడతారేమండి... నేను మాత్రం మీకోసం, మీ బాగుకోసం కాదూ చెబుతున్నది. ఈ గొలుసొక్కటే యింక మనకి ఆధారం. నాకు పసుపు కుంకుమకింద మా వాళ్ళు రాసిచ్చిన ఎకరమూ మీరు అమ్మేస్తే యేమైనా అన్నానా?

    మీరు తాగుతారు, జూదమాడతారు. మీకు మంచి, చెడ్డా: భార్యా కొడుకూ అన్న విచక్షణ పోయింది. ఈ నరకంలో మగ్గిపోతూ ఉండాల్సిందేనా, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట వినండి"

    ఛెళ్ళుమని చప్పుడు వినిపించింది గోపాలానికి, ఆవిడని మొగుడు కొడుతున్నాడు. గోపాలానికి జాలీ ఉద్రేకమూ కలిగాయి. దీనంగా మధురంగా గద్గదికంగా ఉన్న ఆమె గొంతు అతన్ని ఆకట్టింది.

    " కొట్టండి, చంపండి. నా గొలుసుమాత్రం యివ్వను"

    " ఇవ్వవూ, ఇవ్వవుటే ." మళ్ళీ గుద్దినట్టు చప్పుడు. ఆమె ఏడుస్తోంది. నిస్సహాయంగా, దీనంగా. బాధగా, ఆమె ఆక్రోశించింది. ఇద్దరూ పెనుగులాడుతూన్న ధ్వని వినపడింది గోపాలానికి.

    "వొదలండి. నన్నొదలండి. అమ్మో."

    గోపాలం పిడికిళ్ళు బిగించాడు.అతని కళ్ళలో ఎర్రజీర కదలింది ;

    "పీక పిసికి తీసుకెళతాను. గొలుసు ఇలా పడెయ్యి"

    "ఎందుకివ్వాలి మీకు, జూదంలో తగలెయ్యడానికా?" ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే మాట్లాడుతోంది. "పిల్ల వాడికి దగ్గుమందైనా తీసుకురాలేదు. ఒక్క మంచిచీర లేదు. కట్టుకున్న పెళ్ళాం చచ్చిందో బతికిందో చూడరు. ఇంక వీధులమ్మట ముప్టెత్తుకుని బతకాలి నేను."

    "ఈ వేలెడు వెధవ కోసం నా కివ్వవన్న మాట. ఆగువీడిని చంపేస్తాను. వీడి పీక నులిమేస్తాను."

    "అయ్యో అయ్యో వాణ్ణి ఏం చెయ్యకండి. అయ్యో అయ్యో" ఆవిడ పెద్ద పెట్టున కేకలు.

    పిల్లవాడు కెవ్వుమని ఏడుపు.

    గోపాలం ఇంక ఆగలేకపోయాడు. కుర్రవాణ్ణి పీక నులిమి చంపి వేస్తున్న దృశ్యం అతని కళ్ళముందు కదలింది. బలమంతా ఉపయోగించి తలుపు తన్నాడు.

    రాలేదు. తిరిగి దడదడా తన్నాడు; తలుపులు విచ్చుకున్నాయి. ఆమె కుర్రవాణ్ణి ఎత్తుకొని గోడమూలగా నక్కి వుంది. వణకి పోతూ వుంది.

    "బాబు నేమీ చెయ్యకండి. వొదలండి. ఇదిగో గొలుసు" అంటూ మీదకి రాక్షసుడిలా వొంగిన అతనికి గొలుసు ఇస్తోంది. మొగుడు తీసుకుని వెనక్కి తిరిగాడు.

    ఎదురుగా గోపాలం.

    "ఎవడవురా నువ్వు? " అన్నాడు మొగుడు.

    గోపాలం బలంగా అతని దవడమీద ఒకటి వేశాడు. మొగుడు తూలిపడబోయాడు. గోపాలం యీసారి మీదకురికి అతని తలవంచి బలంగా గుద్దాడు. అతను కిందపడ్డాడు.

    "ఆడకూతుర్ని కొడతావా? ఆ గొలుసు కాజెయ్యాలని చూస్తావా? దొంగ యెదవా. సిగ్గులేదురా నీకు. బుద్ది లేదురా. ఏది ఆ గొలుసు ఇలా యియ్యి. లేవకు, లేచావంటే సంపేత్తాను."

    గోపాలం అతని చేతిలోంచి గొలుసు లాక్కున్నాడు. అతను కింద పడి వగరుస్తున్నాడు. రొప్పుతున్నాడు. ఆమె యీ హఠాత్పరిణామం అర్ధంకాక నిశ్చేష్టురాలై గోడకి బల్లిలా అంటుకుని కళ్ళప్పగించి చూస్తోంది.

    "తాగుడూ జూదమూసట్రా నీకు. సదువుకున్నోడివి. ఉద్యోగం చేసి పెళ్ళాం పిల్లల్ని పోషించాల్సింది. పైగా పెళ్ళాం నగలే ఎత్తుకు పోతావట్రా దొంగనాయాల......"

    నేలను కరుచుకున్నా మొగుడు అస్పష్టంగా బూతులు తిడుతున్నాడు.

    గోపాలం డొక్కలో ఒకటి తన్ని "నోర్ముయ్యి"అన్నాడు.

    ఆమె " వద్దు వద్దు కొట్టకు " అని అరిచింది.

    గోపాలం చేతిలో గొలుసుతో గోడవారనున్న ఆమెను సమీపించాడు. ఆమె సన్నగా ఎర్రగా నాజుకుగా వుంది. జుట్టంతా రేగిపోయి వుంది. చెక్కిళ్ళు కన్నీళ్ళతో తడిసిపోయి వున్నాయి. పాతికేళ్ళయినా వుండవు. ఆమె కళ్ళలో భయాశ్చర్యాలు పెనవేసుకున్నాయి. చంకలో పిల్లవాడు ఏడుస్తున్నాడు.

    "ఇదిగోనమ్మా గొలుసు" అంటూ ఆమె చేతికి గొలుసు ఇచ్చాడు. కింద దొర్లుతూన్న మొగుడు లేవబోయాడు. గోపాలం మొలనుండి కత్తితీశాడు.

    " ఇదేవిటో చూశావా! లేవడానికి ప్రయత్నించావా పొడిచేస్తాను కబడ్డార్. దెబ్బకి యెగిరిపోతావు"

    మొగుడు దండం పెట్టాడు.

    " నువ్వు మళ్ళీ ఎప్పుడైనా గొలుసు తీసుకున్నట్టు కాని ఆవిడవంటి మీద దెబ్బపడినట్లుగాని తెలిసిందా నీ ప్రాణం తీసేస్తాను" గోపాలం కత్తిని అతని ముఖానికి దగ్గరగా పెట్టి ఝళించాడు.

    మొగుడు తలవూపాడు ఇంకెప్పుడూ చెయ్యనన్నట్టుగా. గోపాలం ఆమె వైపు తిరిగాడు. "ఏం భయంలేదు. ధైర్యంగా వుండమ్మా" అన్నాడు. ఆమె భయంతో కృతజ్ఞతలతో తల వూపింది.

    గోపాలం కత్తి మొలలో పెట్టుకుని వెళ్ళిపోబోయాడు, ఆమె హీనస్వరంతో అడిగింది "ఎవ్వరు బాబూ నువ్వు..."

    "నేనా... నేనా" తెల్లబోయాడు గోపాలం. "నన్ను గోపాలం అంటారు లెండి. అంతే" అంటూ గోపాలం తలెత్తకుండా వడివడిగా పెరట్లోకి చీకట్లోకి వెళ్ళిపోయాడు.

    (జ్యోతి, మార్చి 1964- ఉగాది సంచిక)

    పుస్తక ప్రచురణ వివరాలు:

    ఈ పుస్తకం, నవచేతన పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది.

    ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

    https://www.amazon.in/Tilak-Kathalu-Devarakonda-Balagangadhar/

    *Intro- outro BGM credits: Edhedho Ennam Valarthen | Durai Srinivasan | Soul Strings

    (https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    14 min
  • 'పీవీ తో నేను' - శ్రీరమణ గారి రచన 'వెంకట సత్య స్టాలిన్' నించి.

    తెలుగు వారు గర్వపడే కథలు రచించిన రచయితల మొదటి వరుసలో శ్రీ శ్రీరమణ గారు వుంటారు. ఇది గాక వారు తెలుగు ప్రసార మాధ్యమాలన్నిటిలోనూ గత యాభై ఏళ్లపైబడి విమర్శ, సమీక్ష , సంపాదకీయం లాంటి అనేక రంగాల్లో పని చేస్తూ ఎంతోమందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.

    అతి సున్నితమైన హాస్యం తో రచనలు చేయడంలో ఆయన సిద్దహస్తులు. తెలుగులో పేరడీ ప్రక్రియకు , ఒక గౌరవ ప్రదమైన సాహితీ స్థాయి కల్పించిన రచయిత గా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.

    ఆయన కథా రచన 'మిధునం' మలయాళం లో వాసుదేవన్ నాయర్ గారి దర్శకత్వంలో , తెలుగు లో భరణి గారి దర్శకత్వంలో సినిమా గా తీయడం జరిగింది.

    హర్షణీయంలో ఈ విజయదశమి రోజున ఆయనతో ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది.

    ఇంటర్వ్యూ కు , వారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ రమణ గారికి హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    ఇప్పుడు మీరు వినబోతున్న ఆడియో శ్రీ రమణ గారి సరికొత్త హాస్య రచనా సంకలనం 'వెంకట సత్య స్టాలిన్' లోని ఒక భాగం.

    ఈ పుస్తకం మీరు డిజిటల్ ఎడిషన్ లేదా ప్రింటెడ్ ఎడిషన్ కొనడానికి , ఇదే వెబ్ పేజీ లో వివరాలు ఇవ్వబడ్డాయి.

    ముందుగా వెంకట్ సత్య స్టాలిన్ గురించి , శ్రీరమణ గారి మాటల్లోనే ఓ రెండు ముక్కలు -

    " ఇంతవరకు తెలుగు లిటరేచర్‌లో వచ్చిన అత్యుత్తమ హాస్యపాత్ర వెంకట సత్యస్టాలిన్! ఈ ముక్క ఎవరన్నారు?

    - అప్పుడప్పుడు నాకే అనిపిస్తూ వుంటుంది.

    ఇంత గొప్ప క్యారెక్టర్‌ని సినిమాలో పెట్టి తీరాల్సిందే!

    - నిబిడాశ్చర్యంతో కొందరూ,

    - ఆఁ, పెట్టి తీసిందేనని చప్పరిస్తూ యింకొందరూ,

    అడయార్ మర్రిచెట్టుకి నాలుగంటే నాలుగే ఆకులు ఉండటం స్టాలిన్‌బాబుకి తెలుసు. కొంచెం ముదురు.

    - ఇలా రకరకాలుగా చెప్పుకుంటారు. మీరు తప్పక ఓ కాపీ కొని చదవండి. ఈ బ్రహ్మపదార్థాన్ని మీకు తోచిన విధంగా అంచనా వేసుకోండి. అర్థం చేసుకోండి. అర్థంకాపోతే వెనకనించి ముందుకు చదవండి. తప్పక అవుతాడు. కాపోతే మళ్లీ మొదట్నించి..."

    ఇలాంటి వెంకట సత్య స్టాలిన్ గారు మన పూర్వ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారి జీవితంలో , ఎలాంటి ముఖ్య పాత్ర వహించారు అనేది, ఆయన స్వగతం లోనే విందాం. స్టాలిన్ గారు తన పేరులోనే సత్యాన్ని ఇముడ్చుకోవడం ద్వారా , తన మాటల్లోనిజం ఎంత ఉందొ మనకు అన్యాపదేశంగా చెబుతున్నారని శ్రోతలందరూ గ్రహించ ప్రార్థన.

    పుస్తక ప్రచురణ వివరాలు:

    ఈ సంకలనం అనల్ప పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.

    https://www.amazon.in/Telugu-Books-ANALPA/s?rh=n%3A8882241031%2Cp_6%3AA32BM6ZYE70A9L

    ఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.

    https://kinige.com/book/Venkata+Satya+Stalin

    లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.

    నవోదయ బుక్ హౌస్

    3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్

    ఫోన్ నెంబర్: 090004 13413

    https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7

    *Intro- outro BGM credits:



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    11 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners