
Sign up to save your podcasts
Or


డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారితో మూడు వారాలక్రితం, హర్షణీయం నిర్వహించిన ఇంటర్వ్యూ గురించి, సబ్ స్క్రైబర్స్ అభిప్రాయాలను ఆడియో ద్వారా మీరు వినవచ్చు.
ఇంటర్వ్యూ లింక్ ని కూడా ఈ పేజీలో ఇవ్వడం జరిగింది.
ఈ ఎపిసోడ్ ద్వారా తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చిన శ్రీమతి శ్వేత, శ్రీమతి బాల , శ్రీయుతులు శ్రీనివాస రావు , బాలాజీ , మురళీధర్ మరియు శాంతారాం గార్లకు , హర్షణీయం ధన్యవాదాలు తెలుపుకుంటోంది.
ఇదే పేజీలో క్రింది భాగంలో మీ ఇమెయిల్ ని అందజేసి హర్షణీయం లో మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోండి. సభ్యులకు అన్ని అప్ డేట్స్ ఇమెయిల్ ద్వారా జరుగుతుంది.
Bgm credit : 'Envanile' by Jingleman https://www.youtube.com/watch?v=fyM41M0n3lI
https://harshaneeyam.in/2020/09/27/peddibhotla/
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు కథా నీరాజనం శీర్షికలో మీరు వినబోతున్న కథ పేరు 'ఇంగువ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన ఆయన , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.
(ఈ పుస్తకం మొదటి రెండో భాగాలు డిజిటల్ ఎడిషన్, ప్రింటెడ్ వెర్షన్, కొనడానికి కింద లింక్స్ ఇవ్వడం జరిగింది.)
1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.
ముందు గా ఈ కథపై , హర్ష అభిప్రాయాన్ని తెలుసుకుందాం.
కథలు రెండు రకాలు.
చాలా కథలు చదవడం అవ్వగానే ఎదో ఒక ఫీలింగ్ ని వెంటనే మనలో కలగ చేస్తాయి, అది వినోదం కావచ్చు, విషాదం కావచ్చు, విసుగు కావచ్చు , వికారం కావచ్చు, ఇన్స్టెంట్ కాఫీ లాగా....
రెండో రకం కథలు, ఫిల్టర్ కాఫీ లాంటివి, తాగడం అయిపోయింతర్వాత కూడా వదిలిపెట్టవు . మనల్ని వదలకుండా వెంటాడి కలిచేసి , కరిచేసి మన చుట్టూ వుండే ఏదో ఒక సంఘర్షణనో సమస్యనో అద్దం ముందు పెట్టి , చూపిస్తాయి.
ఇలాంటి కథలే మనతో ఉండిపోతాయి , అవార్డులు రివార్డులూ గెల్చుకుంటాయి.
ఇంగువ ఈ రెండో కోవకు చెందిన కథ.
ఏదో ఒక రంధి లో పడి పొయ్యి, మనం చేయాలనుకునే ఒక పని గాని , తెలుసుకోవాలనుకునే విషయం గాని , ఏళ్ళు ఏళ్ళు దాని గురించి ఏమీ చెయ్యకుండా పోవడం , అలాగే దాన్ని గురించి ఒక అసంతృప్తి, అలా ఉండిపోవడం మనలో చాలా మందికి జరిగే విషయం.
ఒక చిన్న వంట సరుకుని తీస్కొని , అదే విషయాన్ని మెటాఫరికల్ గా ఇంత గొప్ప గా చెప్పాలంటే, అది పెద్దిభొట్ల వారి లాంటి గొప్ప రచనా సామర్ధ్యం వున్న రచయితకు మాత్రమే చెల్లు.
ఇదంతా ఒక ఎత్తయితే , వెదుకుతున్న సమాధానం చుట్టుపక్కలే దొరకడం , కథకి అతి గొప్ప కొస మెరుపు.
పుస్తక ప్రచురణ వివరాలు:
ఈ సంకలనం విశాలాంధ్ర పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది.
https://www.visalaandhrapublishinghouse.com/
ఈ పుస్తకం digital edition ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
https://kinige.com/book/Peddibhotla+Subbaramaiah+Kathalu++Part+one
https://kinige.com/book/Peddibhotla+Subbaramaiah+Kathalu++Part+two
లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7
*Intro-outro
Credits:
Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)
హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు వినబోతున్న కథ శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారు రాసిన , కథాసంకలనం 'సోల్ సర్కస్' లోనిది.
వెంకట్ శిద్ధారెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జన్మించి,కోరుకొండ సైనిక్ స్కూల్ , తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించి , దేశ విదేశాల్లో పని చేసిన ఆయన 'సోల్ సర్కస్' అనే కథ తో , రచయితగా పత్రికా రంగంలోకి అడుగుపెట్టారు.
2019 వ సంవత్సరంలో తన మిత్రులతో కలిసి , 'అన్వీక్షికి పబ్లిషర్స్' అనే సంస్థని స్థాపించి, ప్రపంచ సాహిత్యంలోని, తెలుగు సాహిత్యంలోని అనేక చక్కటి పుస్తకాలని తెలుగు పుస్తక ప్రేమికులకు అందచేస్తున్నారు.
ఇదిగాక , ఆయన , తెలుగు సినిమా పరిశ్రమలో డైలాగ్, స్క్రిప్ట్ రైటర్ గా , ఎడిటర్ గా, ప్రొడ్యూసర్ గా , డైరెక్టర్ గా అనేక పాత్రలు నిర్వహిస్తున్నారు.
దృశ్యం, c/o కంచర పాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇంకా అనేక చిత్రాలకు ఆయన పని చేయడం జరిగింది.
హర్షణీయం, వచ్చే వారం ఎపిసోడ్ లో , ఆయనతో ముఖా ముఖీలో , ఆయన గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకోవచ్చు.
వెంకట్ శిద్ధారెడ్డి గారి రచించిన ' ఓ హెన్రీ స్టోరీ' అనే కథ ఇప్పుడు మీరు పై ఆడియో లో వినబోతున్నారు.
పుస్తక ప్రచురణ వివరాలు:
ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.
(https://www.facebook.com/AnvikshikiPublishers/)
ఈ పుస్తకం డిజిటల్ ఎడిషన్ ని , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
https://kinige.com/book/Soul+Circus
లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7
*Intro-outro BGM Credits:
https://www.youtube.com/watch?v=LWpJxRYZb2w
హర్షణీయానికి స్వాగతం. ఈరోజు 'కథా నీరాజనం' శీర్షికన, 'ఏకాదశి చంద్రుడు' అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ' ఖచ్చితంగా నాకు తెలుసు అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది.
(ఈ కథ ఆడియో పై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి https://harshaneeyam.in/2020/09/20/ekadasi/)
కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా.
నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా 'సితార'. ఆ సినిమాలో వంశీ గారి ఫ్రేములకి , ఇళయరాజా గారి సంగీతం తోడై, తెలుగు సినీ ప్రేమికులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగ్గ చిత్రంగా మిగిలిపోయింది.
వంశీ గారి చాలా చిత్రాలకు, ఇళయరాజా గారు సంగీత దర్శకత్వం వహించారు. అలానే వంశీ గారి చాలా కథలకు బాపు గారు బొమ్మలు వేశారు. 'నాకు ఖచ్చితంగా తెలుసు' అనే ఈ కథాసంకలనం లో కూడా అన్నీ బొమ్మలు బాపు గారివే . ఈ పుస్తకాన్ని , అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలా అందంగా ముద్రించారు.
వీరి ముగ్గురి మధ్య ఉన్న ఇంకో అద్భుతమైన లింకు ఏమిటంటే, ఇళయరాజా గారి సంగీతానికి పోటాపోటీ గా , తమ చిత్రాల్లో visuals present చేసిన దర్శకుల్లో బాపు గారు వంశీ గారు మొదటి స్థానంలో వుంటారు.
ఆయన కథా రచన విషయానికొస్తే, దాదాపుగా రెండు వందల యాభైకి పైగా ఆయన కథలు రాయడం జరిగింది. తెలుగు కథా సాహిత్యంలో మనకు చాలా మంచి కథా రచయితలు వున్నారు అలానే కొంత మంది గొప్ప కథా రచయితలు కూడా.
ఒక మంచి కథకీ, గొప్ప కథకీ మధ్యలో వుండే చిన్న వ్యత్యాసం, ఆ కథని రచయిత ముగించే పద్ధతి అని నేను అనుకుంటాను.
ఉదాహరణకి , మన కథానీరాజనంలో, ఇంతకు ముందు విన్న వంశీ గారి కథ , 'శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్సు' నే తీసుకుందాము.
https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/
ఆ కథలో శంకర్ రావు కి , సహాయం చేసిన రాజు గారు , మతి స్థిమితం లేని వ్యక్తి అని మనకి చివర్లో తెలుస్తుంది. అక్కడితో ఆ కథ ఆపేసినా కూడా , ఆ కథ ఒక మంచి కథ కిందికే వస్తుంది. కానీ వంశీ గారు ఆ పని చెయ్యలేదు. వెళ్తూ వెళ్తూ ఒక చిన్న వాక్యం రాసారు. అదేంటో ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం.
"నిజాయితీ పరుడైన ఆయన లోకంలో సమస్యల గురించి ఆలోచించడం వల్ల పిచ్చోడై పొయ్యేడంట. "
ఇక్కడ ఉన్న ఒక కాంట్రడిక్షన్ ఏంటంటే, అబద్దపు ప్రపంచాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆయన, మతిస్థిమితం తప్పింతర్వాత , తాను నిజవనుకుంటున్న ఒక అబద్ధమైన చెక్కునిచ్చి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడ్డం.
ముగింపులో ఈ ఒక్క ముక్క రాయడం ద్వారా , వంశీ గారు , ఒక మంచి కథని ఇంకో రెండు మెట్లు ఎక్కించి, ఉన్న పాటున ఒక గొప్ప కథని చేసేసారు.
ఇప్పుడు మీరు వినబోతున్న కథలో కూడా ఒక ఉదాత్తమైన ముగింపు వుంది.
ఈయన ఇలానే కథా రచనా జీవితాన్ని సాగిస్తూ, ఇంకా మనకోసం ఎన్నో గొప్ప కథల్ని సృష్టించగలరని ఆశిద్దాం.
"ఎవరక్కడా!" అని కోపంగా అరిచాడు మహారాజు.
"తమరి ఆజ్ఞ మహారాజా" అంటూ గజ గజలాడుతూ వచ్చాడు, అంతరంగ రక్షకుడు అయిన భద్రుడు.
"నా రాజ్యం లో, నా రాకుమారుడి కి భోజనం లో ఎండు చేప అందలేదు. మేము దీన్ని ఎంత మాత్రమూ సహింప జాలము. నా దృష్టిలో ఇది ఒక అత్యయిక ఘటన. వెంటనే మన సర్వ సైన్యాధ్యక్షుల వారైన రామానుజాన్నీ మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమనండి"
"చిత్తం మహారాజా" అంటూ అక్కడనుండి నిష్క్రమించి, సర్వ సైన్యాధ్యక్షుల వారి భవనానికి వచ్చి రామానుజాన్ని నిద్ర లేపాడు భద్రుడు.
"ఏమయ్యింది రా! భద్రా" అన్నాడు రామానుజం కళ్ళు నలుపుకుంటూ, ఆవులిస్తూ.
"మన రాజ్యం లో ఓ అత్యయిక ఘటన జరిగింది, అందుకే సర్వసైన్యాధ్యక్షునిగా మిమ్మల్ని బాధ్యత వహించి, మూలకారణాన్ని శోధించి, నివారణోపాయాన్ని పంపమన్నారు, మహారాజులం గారు" అన్నాడు భద్రుడు.
"రాజు గారి ఒక్క కొడుక్కి దొరకలేదా ఎండు చేప లేక ఆయన గారికి మరియు తక్కిన ఆరుగురు కొడుకులక్కూడానా " అడిగాడు రామానుజం.
"లేదండి, ఒక్కరికే అందలేదు అని అన్నారండి రాజు గారు"
"నిన్న అందిన ఎండు చేప, మొన్న అందిన ఎండు చేప ఈ రోజు ఎందుకు అందలేదబ్బా" ఆశ్చర్యపోయారు రామానుజం.
"అయినా ఏడుగురిలో ఒకరికి అందక పోతే అది మన సేవా ధర్మ ప్రకరణ ప్రకారం ఒకటో అంకె లోపం కాకూడదదే" అనుకుంటూ, భద్రా! వెంటనే మన దండనాయకుల వారిని ప్రవేశ పెట్టుము అని ఆజ్ఞ జారీ చేసాడు.
ఐదు నిముషాల్లో, దండనాయకులయిన సీతారాం వేం చేసేసారు, "అలా ఒకటో అంకె సేవా లోపం అని మహారాజా వారు ఎలా నిర్ణయిస్తారు? ఇలా అయితే రేపు బంగాళా దుంపల వేపుడు అందలేదనో, మధువు దొరకలేదనో, ధూమపాన గొట్టం బాగా లేదనో, పాదరక్షలు ఇంపుగా లేవనో, వంటికి రాసుకునే అత్తరు బాగాలేదనో ప్రతీ దానికీ ఒకటో అంకె సేవా లోపం అంటారు భవిష్యత్తులో. ప్రాణాలకు ప్రమాదం సంభవిచినప్పుడు తొమ్మిది ఒకటీ ఒకటీ సేవల్లో లోపం వస్తే గోల చేయాలి గానీ ఇలా ప్రతీ అడ్డమైన దానికీ ఒకటో అంకె సేవా లోపం అంటే ఎలా" అని రుస రుస లాడిపోయాడు.
"ముందు ఒకటో అంకె లోపం గా తీర్మానం చేయి సీతారాం, తర్వాత రెండో లేక మూడో అంకె లోపం గా చేద్దాము" అన్నాడు విసుగ్గా రామానుజం.
ఇద్దరు కలిసి ఒకటో అంకె సేవా లోప పరిస్థిని తెలియజెప్పే గంట మోగించారు. వెంటనే దళ నాయకులూ రంగం లోకి దిగారు. లెక్క ప్రకారం ప్రభావితం అయ్యింది ఏకాకి, అయినా రాజు యొక్క కుటుంబ సభ్యుడు కాబట్టి ఇది ఒకటో అంకె లోపం అని నిర్ధారించుకున్నారు.
ముందు ఆ రాజుగారి కొడుక్కి రామానుజం గారి కుక్క పిల్ల కోసం నిల్వ చేయబడ్డ ఎండు చేప ముక్కని పంపారు వండుకు తినమని, ఆ తర్వాత మూలకారణాన్ని శోధన మొదలెట్టారు
అసలేమీ జరిగింది:
రాజు గారికి ఏడుగురు కుమారులు. ఆ కుమారులు ఒక రోజు వేటకి వెళ్లి ఏడూ చేపలు తెచ్చారు. వాటిల్ని ఎండ బెట్టారు. అన్నీ చేపలు ఎండాయి కానీ ఒక చేప ఎండలేదు.
సమస్యేమిటి:
ఆరు చేపలు ఎండాయి. ఒక చేప మాత్రం ఎండ లేదు.
ఒకటవ ఎందుకు: చేప ఎందుకు ఎండ లేదు?
సమాధానం: గడ్డి మోపు అడ్డం వచ్చింది.
రెండవ ఎందుకు: గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చింది?
సమాధానం: ఆవు గడ్డి మోపును మేయలేదు.
మూడవ ఎందుకు: ఆవు గడ్డి మోపును ఎందుకు మేయలేదు?
సమాధానం: అవ్వ ఆవును మేతకు విడవలేదు.
నాలుగవ ఎందుకు: అవ్వ ఆవును ఎందుకు మేతకు విడవలేదు?
సమాధానం: పిల్లవాడు ఉదయం నుండి ఒకటే ఏడుస్తున్నాడు కాబట్టి.
ఐదవ ఎందుకు: పిల్లవాడు ఉదయం నుండి ఎందుకు ఏడుస్తున్నాడు?
సమాధానం: పిల్లవాడిని ఉదయం చీమ కుట్టింది.
ఈ సమాధానం తో అందరూ ఆహా తెలిసెన్ జుమీ అని అరిచేసేసారు. అందరూ కూడబలుక్కుని మహారాజు కి ఈ క్రిందని సమాచారం పంపించేశారు.
"దైవ సమానులైన మహారాజ శ్రీవారి పాద పద్మములకు నమస్కరించి, మీ దళ, దండ, సర్వ సైన్యాధ్యక్షులు నమస్కరించి విన్నవించుకొను విన్నపము. తమరి ఆఖరి సుపుత్రుల భోజనంలో ఎండు చేప కరవైనదని విని మిక్కిలి దుఃఖపడినాము. ఇది చాల విచారింప దగ్గ విషయము. ఇది దురదృష్టవశాత్తు జరిగిన మానవ తప్పిదనమే కానీ మా సేవ భావం లో లోపము గా మీరు భావించరాదు. మేము ఈ విషయాన్ని కూలంకషం గా శోధించి, ఇక మన రాజ్యం లో చీమలని సమూలంగా గా నిర్మూలించాలని నిర్ణయించాము. కావున తమరు దయయుంచి తమ ఖజానా నుండి మాకు ఓ పదివేల బంగారు మోహరులను కేటాయించ వలసినిది"
ఈ వారం 'కథా నీరాజనం' లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ' శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ' అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది.
(ఈ కథపై మీ వ్యాఖ్యలకు ఈ వెబ్ పేజీ ని సందర్శించండి. https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/)
ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు.
ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన గోదావరి తీరం నేపధ్యం గా ఈ కథ సాగుతుంది.
ఈ కథ , అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రచురించిన 'ఖచ్చితంగా నాకు తెలుసు' అనే వంశీ గారి కథా సంకలనం లోనిది. వంశీ గారు 250కి పైగా కథలు రాసారు. ఈ కథల్లో ఇరవై ఐదు చక్కని కథలను ఆయన ఎంపిక చేసి , ఈ కథా సంకలనం లో చేర్చడం జరిగింది.
ఈ కథలకు బాపు గారు వేసిన బొమ్మలతో అన్వీక్షికి పబ్లిషర్స్ వారు చాలాఅందంగా ముద్రించారు. ప్రతి తెలుగువాడి ఇంటి గ్రంధాలయంలో ఉండాల్సిన పుస్తకం ఇది.
ఈ పుస్తకం కొనదలచుకున్న వారు, క్రింద ఇచ్చిన వెబ్ లింక్ లేదా నవోదయ బుక్ హౌస్ (హైదరాబాద్) అడ్రస్ లను గమనించగలరు.
ఈ కథ పై మీ అభిప్రాయాలను తెలియజెయ్యడానికి 'హర్షణీయం' వెబ్ సైట్ ని క్రింది లింక్ ద్వారా విసిట్ చెయ్యండి.
పుస్తక ప్రచురణ వివరాలు:
ఈ సంకలనం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. వారి ప్రచురణల గురించి అప్ డేట్స్ కి క్రింది లింక్ ని క్లిక్ చెయ్యండి.
(https://www.facebook.com/AnvikshikiPublishers/)
ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
https://www.telugubooks.in/collections/vamsi/products/kacchithanga-naaku-thelusu
లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7
*Intro-outro BGM Credits:
Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)
సాబువ్వ
మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి "ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా" అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది.
"కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని మబ్బులు గూళ్ళు గూళ్ళుగా ఔపిస్తూ ఎందుకే ఆశల్లేపుతాయి.. మనం గూడా మనుసులమే కదా!! ఓ రెండు సినుకులు రాలిస్తే పైన నీళ్ళు ఆవిరైపోతాయా" అని దేవమ్మను చూసి అంటూంటే..
నువ్వు రమ్మని పిలిసి సూడు వత్తాయ్.. నే పోతాండా, ఆడ ఎండుగెడ్డి పీకాల, నువ్వు ఆ మూలంతా సదను సేసి రా.. క్యారీరు చింతచెట్టుకు ఏలాడ గట్టినా, నువ్వొచ్చినంక బువ్వ పెడతా అంటూ వెళ్లిపోయింది దేవమ్మ.
వానెప్పుడు పడాలని ఈడ నేను ఊరకే పీకులాడాల అని గొణుక్కుంటూ వరదయ్య పన్లో పడ్డాడు.
మధ్యాహ్నం రాగి ముద్దను ఎర్రకారం పచ్చడితో మింగుతూ పక్కనే ఉల్లిగడ్డ కొరుకుతూ చివర్లో చిలికిన మజ్జిగ తాగి "దేవమ్మా ఈ పొద్దు ముద్దలో ఏం కలిపినావే.. మా రుచిగుండాది అంటే “స్పూను మంచినూనె ఏసినానయ్యా మెత్తగా ఉండాది" అంది దేవమ్మ.
నాకు "సాబువ్వ ఎప్పుడు పెడతావే" అంటే "ఇప్పుడేం పండగలు లేవు. సామికి పూజ చేసి బెల్లం బువ్వ పెట్టిన రోజే నీకు" అంటూ దేవమ్మ తింటోంది.
రాయలసీమలో అనంతపురం తీవ్ర వర్షాభావానికి లోనైన జిల్లా. టెక్నికల్ గా "రెయిన్ షాడో రీజియన్". దశాబ్దాలుగా వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా ఇంకిపోయి, జిల్లాలో పారే నది లేకపోవడంతో పంట కాలువలు కూడా కనిపించవు. కొన్ని చోట్ల ఎడారిలా ఇసుక మేటలు దర్శనమిస్తాయి. వర్షాధారిత పంటలే దిక్కు. అందులో ముఖ్యమైంది వేరుశనగ.
ఇతరత్రా పంటలు కూడా ఉన్నా ఏదో అంతంత మాత్రమే.. వర్షం ఎంతుంటే అంతలా.
ఇదే జిల్లాలో వరదయ్య దంపతులుండే ఊరు సీతారామపురం. గుడి, బడి, చిన్నాసుపత్రి, సర్పంచ్ ఆఫీసు..
ఇలా పల్లెలో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. వరదయ్య ఇల్లు ఓ మోస్తరుగా ఉంటుంది.
ఒక్కడే కొడుకు శ్రీనివాస్. భార్యతో టౌనులో ఉంటూ ఇద్దరూ ప్రైవేటు స్కూళ్ళలో పనిచేస్తూ తమ ఇద్దరాడపిల్లలతో కలిసి వీరిద్దరికీ తోడుగా ఉంటూ అపుడపుడూ పల్లెకు వచ్చిపోతుంటారు.
వరదయ్యకు ఉండే ఆరెకరాల పొలంలో సెనక్కాయతో పాటు టమాటో ఇంకొన్ని కూరగాయలు పండించి అవి టౌనుకెళ్ళే మస్తాన్ కు అమ్మి జీవితం సాగిస్తున్నాడు. ఉన్న బోరులో నీళ్ళు కూడా ఎక్కువ రావు. ఇంకాస్త లోతుగా మళ్ళీ బోరేస్తే నీళ్ళొస్తాయని ఆశ.
"దేవమ్మా.. ఈతూరి గూడా పంట మీద ఆశలు ఇడిసేయాలా.. పంట కోసం తీసిన బ్యాంకు లోను ఎట్టనే కట్టేది" అంటూ బీడీ పొగ మద్య ఎటో చూస్తూన్న వరదయ్య ప్రశ్న ఆమె కళ్ళను కిందికి దించేశాయి.
ఇద్దరి మౌనం మద్య "వానాకాలం ఇంకా వొచ్చేదుంది కదయ్యా.. సూద్దాం. బ్యాంకోళ్ళతో మాట్లాడు. వడ్డీ కట్టనీకి టైమడుగు. లేదంటే పిల్లోడిని అడుగుదామా"
"వొద్దొద్దు.. నువ్వట్టాంటి ఆలోశన చైరాదు. మనం పిల్లోల్లకి పెట్టాల్నే గానీ ఆల్లనెట్టా అడుగుతావే" అన్నాడు.
సాయంత్రం శ్రీనివాస్ ఫోన్ చేసి ఇద్దరితో మాట్లాడి పెట్టేశాడు. బ్యాంకు ప్రస్తావన రాలేదు.
ఆ వారం చివర్లో ఊళ్ళో ఒక చాటింపేశారు.
భూదేవమ్మ ఇంటికొచ్చి "అయ్యా! సర్పంచాఫీసోళ్ళు చెప్పినారు. మూడు రోజుల తర్వాత ఎవల్నీ బైట తిరగొద్దంటన్నారు. బీడీల కోసం ఊరంతా తిరగొద్దు. శెట్టి గారి అంగట్లో సామాన్లు తీసకరా.. మళ్ళీ బైటికి పంపిస్తారో లేదో!!
వరదయ్య వెళ్ళి తెచ్చిన సరుకులు చూసి "ఏందయ్యా ఇన్ని సబ్బులు, నురగ నీళ్ళు తెచ్చినావు, ఇయన్నీ మనవేనా.. రాగులు తక్కవ రంగులెక్కువైనాయి" అంటే "ఏమో అందరూ కొంటున్నారు.. నన్నూ కొనమన్నారు. దేశంలోకి రోగమేందో వచ్చిందట. చేతులు కాళ్లు సబ్బుతో బాగా కడిగి మూతికి బట్ట కట్టుకోమన్నారు. అందరితో పాటు మనం అని తెచ్చినా" అన్నాడు.
ఇదేం బాధ అని దేవమ్మ వంటింట్లోకి దూరింది.
వరదయ్య కొడుక్కి ఫోన్ చేసి "ఏం సీనయ్యా.. ఆడ ఎట్టుండాది. అన్నీ మూసేస్తారంట గదా.. నువ్వు టీచరమ్మను, పిల్లోల్లను తీసుకొని ఊరికొచ్చేయ్. టౌన్లో వొద్దులే" అంటే సరే అన్నాడు శ్రీనివాస్.
ఆ సాయంత్రం ఊరుచేరిన అందరినీ చూసుకుంటూ ఈ ఇద్దరూ తెగ మురిసిపోయారు.
"తాతయ్యా మా స్కూల్ కూడా మూసేశారు.. మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలీదు. అంతవరకూ మనమంతా ఇక్కడే ఉంటామని నాన్న చెప్పాడు" అంటే "మీకెన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఈడనే ఉండండమ్మా" అని తాత వాళ్ళతో ఆటలు మొదలెట్టాడు.
వరదయ్యకు కోడలంటే చాలా గౌరవం. ఆమెను టీచరమ్మా అని పిలుస్తాడు. కోడలు ఎప్పుడు వంటింట్లో సాయానికి వచ్చినా దేవమ్మ ఆనందమే వేరు.
"దేవమ్మా పిల్లోల్లకి కారం ఎక్కువ పెట్టాకు, తినలేరు" అంటే రాత్రికి కొర్రన్నం లోకి వంకాయ కూర, టమాటా చారు
చివర్లో చిలికిన మజ్జిగతో ముగించారు.
రాత్రి ఇంటి ఆరు బయట వేపచెట్టు కింద మంచాలేసి తండ్రీకొడుకులు మాటామంతీ మొదలెట్టారు. చేతిలో బీడీతో "సీనయ్యా.. ఇట్టా స్కూళ్ళు మూసేస్తే పిల్లోల్లకి సదువెట్టా అబ్బేది. మీ అయ్యవార్లకి జీతాలు ఎట్టయ్యా! అసలు ఇత్తారా లేదా" అంటే తలొంచుకున్నాడు శ్రీనివాస్.
"నీది మీ అమ్మ పోలికరా.. ఇద్దరూ ఏమడిగినా తలకాయ దించేత్తారు" అంటుంటే తలెత్తిన కొడుకు కళ్ళలోంచి కారిపోతున్న నీళ్ళు చూసి గబుక్కున పక్కన కూర్చొని కళ్ళు తుడిచి ఏమైందయ్యా అంటూ ఓదార్చాడు.
"మస్తాన్ కు మనం బాకీ ఉన్నామయ్యా.. స్కూల్ లో అందరినీ నెల కిందే తీసేశారు. జీతాలు లేకపోతే ఈ నెలంతా నువ్వు పంపిన టమాటాలు మస్తాన్ మాకిస్తే అమ్ముకుని ఏదో ఇంత తిన్నామయ్యా. నీకు తన కష్టంలోంచి డబ్బులిఛ్ఛాడు. మమ్మల్ని చెప్పొద్దన్నాడు"
వరదయ్యకు నోట మాట రాలేదు. ఒగరికి ఇంగొగరు సాయం అనుకుని ఏవో ఆలోచిస్తూ ఆ రాత్రి వరదయ్య నిద్ర పోలేదు. గుండెలోని భారాన్ని దించుకున్న శ్రీనివాస్ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాడు.
టపా టపా శబ్దాలకు నిద్ర లేచిన వరదయ్యకు దేవమ్మ చుట్టూ చేరిన కొడుకు, కోడలు, పిల్లలను చూస్తూ ఉండిపోయాడు.
“సూసింది సాల్లేగానీ పల్లు తోమి రా! టీ నీళ్ళు ఇస్తా” అని దేవమ్మ అంటే దగ్గరగా పోయి చూస్తే ప్లేటులో జొన్నరొట్టె, పుంటికూర పప్పు, ఎర్ర కారం, ఉల్లిగడ్డతో వేరే లోకంలో ఉన్న కొడుకు, పిల్లలు..
పక్కనే రొట్టెలు టపా టపా తడుతూ దేవమ్మ అవి కాలుస్తున్న టీచరమ్మను చూసి నిద్రలేని ఆ రాత్రి మొత్తం మర్చిపోయాడు. "అయ్యా.. నువ్వు తిన్న తర్వాత పొలం చూసొద్దాం" అంటూ ఇంకో రొట్టె మీద పడ్డాడు కొడుకు.
చిన్నప్పటి నుండి చూస్తూ కాసింత వ్యవసాయం నేర్పించిన పొలమంతా తిరుగుతున్న కొడుకు అడిగే ప్రశ్నలకు జవాబులిస్తూ అలవాటుగా ఆకాశాన్ని చూస్తూ ఇద్దరూ చింతచెట్టు కింద చేరారు.
“అయ్యా.. నీ బ్యాంకు లోన్ సంగతి సర్పంచ్ యాదన్న చెప్పాడు. వాళ్ళొచ్చి నోటీసులు ఇస్తే బాగుండదు. మాలాంటి లక్షలమంది టీచర్ల ఉద్యోగాలు ఏమైతాయో కూడా తెలీదు. అందుకే ఆ విషయాన్ని పక్కనబెట్టి నీతో కలిసి ఇక్కడే వ్యవసాయం చేస్తాను. మీ కోడలు ఇల్లు, పిల్లల సంగతి చూస్తుంది. మస్తాన్ బాకీ కూడా ఇచ్చేద్దాం” అన్నాడు.
ఇంటికొచ్చి దేవమ్మకు చెప్తే సరే అంది పిల్లల కష్టాన్ని తలుచుకొని, మాయదారి రోగాన్ని తిట్టుకుంటూ..
సర్పంచ్ యాదిరెడ్డి ఇంటికెళ్ళిన ఇద్దరికీ ట్రాక్టరు బైట కనిపించింది.
“ఏంది సీనయ్యా మీ నాయనతో వచ్చినావు, అంతా బాగానే ఉంది కదా.. లోనికి రండి” అంటూంటే "యాదన్నా.. పొలం పనులు అయిపోయాయా.. ట్రాక్టరు ఇక్కడుంది" అంటే "ఏం పనుల్లే అయ్యా.. కూలికి ఎవరూ రావట్లేదుగా.. ఖాళీగా పడుంది" అన్నాడు యాదిరెడ్డి.
"యాదన్నా.. నువ్వు సరేనంటే ఓ రెండు వారాలకు ట్రాక్టరు తీసుకుపోతా.. ఖర్చులు, రిపేర్లు నా లెక్క" అన్నాడు శ్రీనివాస్.
"రెండు కాకపోతే నాలుగు వారాలు పెట్టుకో.. నీకన్నానా సీనయ్యా" అనడంతో తండ్రీకొడుకులు బండెక్కి ఇల్లుజేరారు.
శ్రీనివాస్ దంపతులిద్దరికీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీలున్నాయి. ఇద్దరూ కలిసి ముందుకెలా వెళ్ళాలని చిన్న ప్రాజెక్ట్ లాంటిది రాసుకుని, అందుకు ఊళ్ళోనే ఉంటున్న అగ్రికల్చరల్ ఆఫీసర్ తో మాట్లాడి కొన్ని వ్యవసాయపు మెళుకువలు తెలుసుకున్నారు.
వ్యవసాయం తగ్గటంతో మిగిలిపోయిన రకరకాల పంటల విత్తనాలు ఉచితంగా ఇచ్చారు ఆఫీసర్.
ట్రాక్టరుకు డీజల్, ఆయిల్ ఇబ్బంది కాకుండా మస్తాన్ చూశాడు.
“అయ్యా.. ఉన్న నీళ్ళతో ముందు ఆకుకూరలు, కూరగాయలు సాగుతో ఆదాయం పెంచాలి అని ఓ మంచి రోజు చూసి వాడకంలో లేని భూమిని ట్రాక్టర్ తో చదును చేస్తే తోడుకు కొన్ని చినుకులు పడి భూమి కాస్త మెత్తబడింది.
ఈసారి సేంద్రియ వ్యవసాయం దానికి తగ్గట్టుగానే ఎరువులు వాడదాం.. మార్కెట్లోవి వద్దు” అంటే
అయోమయంగా మొహం పెట్టాడు వరదయ్య.
పొద్దున్నేఎర్ర కారం దోసెలు శెనక్కాయ చెట్నీతో తింటూ పాత రోజులు గుర్తు చేసుకుంటే పిల్లలు మాకు దోసెలు వద్దు తెల్లన్నం కావాలన్నారు.
వరదయ్య వాళ్ళతో "ఈ వారమంతా నాన్నమ్మ పెట్టింది తినండి, వచ్చేవారం మీకు శెనగబేళ్ళ పాయసం, సామికి పెట్టే వరి అన్నంతో సాబువ్వ, చెనిక్కాయ బెల్లం ఉండలు ఇస్తా" అంటే ఇద్దరూ తాత పక్క చేరిపోయారు.
వరదయ్య ఇంట్లో భోజనమేదైనా సరే.. వెన్న తీసిన మజ్జిగ ఎప్పుడూ ఉండాల్సిందే.
మస్తాన్ ను కలిసొస్తానని శ్రీనివాస్ వెళుతుంటే దారిలో శెట్టి కనిపించి "సీనయ్యా నీ స్కూలు కధ తెలిసిందయ్యా. యాదన్న తన ట్రాక్టర్ ఇచ్చినాడని విన్నా. నా దగ్గర డ్రిప్ తో నీళ్ళు పారించే సామానంతా ఉంది. ఇస్తాను, ట్రాక్టర్ లో పెట్టుకుపో” అన్నాడు. కొత్తగా చేరిన ఈ పరికరాల వల్ల నీళ్ళు ఎంతో పొదుపై ఖర్చు చాలా తగ్గుతుంది.
పనులు చకచకా పరుగులు తీస్తున్నాయి. వేపాకు, రావాకు లాంటి ఇతరత్రా ఆకులతో కషాయాలు కలిపి పిచికారీగా టమాటాలకు ఇతర కూరగాయలు, ఆకుకూరలకు కొట్టడం, భూసారం పెంచేలా పశువుల పేడను చల్లడం, డ్రిప్ వల్ల తక్కువ నీళ్ళు పంటలకు పుష్కలంగా సరిపోవడం, పొలంలో ఇంకుడు గుంతలు తవ్వడం లాంటి పనుల్లో అందరూ చాలా శ్రమించారు.
మూడు వారాల్లో పంట దిగుబడి పెరగడం వరదయ్యకు నమ్మబుద్ది కాలేదు. పెరిగిన దిగుబడి నాలుగు భాగాలు చేసి సాయం చేసిన మస్తాన్, యాదిరెడ్డి, ఆఫీసర్, శెట్టికి పంచారు. వరదయ్యకు తెలియకుండానే బ్యాంకుకు కొంచెం వడ్డీ కూడా చేరింది.
ఆరోజు వరదయ్యకు సాబువ్వ తినే అదృష్టం దొరికింది. అందరితో కలిసి..
కొడుకు నేర్పిన కొత్త వ్యవసాయ పాఠాలతో వరదయ్య, దేవమ్మ కష్టం తోడై పొలం మిశ్రమ పంటలతో కళకళలాడుతూ నిలకడగా కాపు పెరిగి ఇద్దరికీ ఆత్మవిశ్వాసం నింపింది.
ఆఫీసరు చెప్పినట్టు కొత్తగా పాలీహౌస్ లో వేసిన క్యాప్సికమ్ మూడు రంగుల్లో చూస్తూ వరదయ్య "దేవమ్మా..ఇది మన పొలమేనా" అంటే ఈసారి తల దించలేదు ఆమె.
పల్లెలో కౌలుకు కొంత భూమి తీసుకుని పంట ఉత్పత్తి పెంచి ఊరివాళ్ళ అభిమానం పెంచుకున్నాడు.
వచ్చిన పంటలో మస్తాన్ కు కొంత భాగమిచ్చి మిగతా పంటను నేరుగా కస్టమర్లు కొనేలా ఉద్యోగం లేని తోటి టీచర్లను ఎక్కడికక్కడ చిన్న గ్రూపులుగా చేసి మార్కెటింగ్ ప్రారంభించాడు శ్రీనివాస్.
ఈ ప్రేరణ పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేని వారికి తమ పల్లె మూలాలు వెతుక్కునే అవకాశం కల్పించింది.
బ్యాంకు లోన్ మొత్తం తీరిపోయి పొలం పాసుబుక్కు వరదయ్య చేతిలో పెడుతున్న కొడుకును చూసి దేవమ్మ పడ్డ సంతోషం తడిసిన కళ్ళు చేప్పకనే చెప్పాయి.
పల్లె తల్లి లాంటిది. అందరినీ అక్కున అక్కున చేర్చేసుకుంటాది.
1976 వ సంవత్సరం - చిన్నా :
" అమ్మా ! నేనొచ్చేసా " అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్ నుండి వొచ్చేటప్పటికి అమ్మ ఎదురుచూస్తూ కనపడితే వాడి ఆనందం పట్టనలివి కాదెవ్వరికీ.
" అబ్బో! మా చిన్న ఐదు ఊర్లు ఏలేసి వచ్చాడమ్మా" అంటూ ఒక ముద్దు పెట్టుకుంది చిన్నాని, అమ్మ.
"అమ్మా ! ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా. ఊర్లోకి రెండు కార్లు వస్తూ కనపడ్డాయమ్మా. ఎవరింటికో తెలుసా నీకు"
" రాఘవన్న వొచ్చాడ్రా అమెరికా నించి, శంకరవ్వ కోసం ." అంటూ చిన్నా కోసం రెండు మనుగుబూవులు ఒక చిన్న గిన్నె లో పెట్టి ఇస్తూ, "నువ్వు తింటూ ఉండరా తండ్రీ, నీ ప్రశ్నలతో చంపకుండా, నాకు చాలా పనుంది, నీకు రేపు టిఫిన్ కోసం బియ్యం నానెయ్యాలి " అంటూ చిన్న వాళ్ళ అమ్మ వసారాలోకెళ్లింది.
"అమ్మా! రాఘవన్న ఇంక మన ఊర్లోనే ఉంటాడా?, నేను వాళ్ళింటికెళ్తే మాట్లాడతాడా?" అంటూ అమ్మ వెనకాలే వెళ్ళాడు చిన్నా.
" ఇక్కడ ఓ నెల ఉండి పెళ్లి చేసుకొని పోతాడటరా . నీతో ఎందుకు మాట్లాడ్డు ? చిన్నప్పుడు నిన్ను తెగ ఆడిచ్చే వాడు కదా! "
" ఇప్పుడు నువ్వు గూడ తోడు రామ్మా! శంకరవ్వ వాళ్ళింటికి. నాకు వాళ్ళ వాకిట్లోనే వుండే ఆ నల్ల కుక్క అంటే భయం."
"నీకు, ఆ మురళీ గాడికి సవాలక్ష సార్లు చెప్పానురా, దాని మీద రాళ్లు విసరొద్దని. వింటారా మీరు" అంటూ విసుక్కుంది అమ్మ.
అమ్మ వచ్చేటట్టు లేదు గాని, మనమే శంకరవ్వ ఇంటి ముందు నాలుగు రౌండులు కొడదాము, ఎవరన్నా లోపలి కెళ్తుంటే వాళ్ళ వెంట పడి పోవొచ్చు అనుకుంటూ బయటకెళ్ళాడు చిన్నా.
కుక్క భయమో, లేక రాఘవన్నని ఎలా పలకరించాలి అనే బెరుకో లేక సిగ్గో కానీ, శంకరవ్వ వాళ్ళ ఇంటి ముందు తచ్చాడడం మొదలు పెట్టాడు చిన్నా.
ఇంతలో రాఘవ అన్నే శంకరవ్వని చిన్నగా నడిపించుకుని ఇంట్లోంచి బయటకి వచ్చాడు.
చిన్నాకి ఏనుగెక్కినంత సంబరం వేసింది.
ఇంక వీధిలో అందరూ రాఘవన్నని కుశల ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. "రాఘవయ్య, ఎప్పుడొచ్చావు?, వుంటావా నాలుగు రోజులు?, పెళ్లి ఎప్పుడయ్యా?, అమ్మనేమన్న అమెరికాకి తీసుకెళ్తావా?" అంటూ.
వాళ్లందరికీ ఓపిగ్గా సమాధానాలిస్తూ వెళ్తున్నాడు రాఘవన్న,
చక్కని పలువరుసతో, తెల్లని మేనిచ్ఛాయతో అచ్చు సినిమాలో జగ్గయ్యలాగ కనపడతా వుండాడు, చిన్నాకి రాఘవన్న.
అప్పటికే అమ్మలక్కలు, "మన రాఘవయ్యకు చూడు వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమో!, అమెరికా నించొచ్చి వవాళ్ళ అమ్మని ఎంత జాగర్తగా దేవళం తీసుకెళ్తున్నాడు" అంటూ గుసగుసలు మొదలెట్టేశారు.
చిన్నా వాళ్ళ వెనకే నడుస్తూ, రాఘవన్న కళ్ళల్లో పడ్డానికి , రయ్ రయ్ అని శబ్దం చేస్తూ, రాఘవన్న పక్కనుంచే పరిగెత్తాడు.
"ఎవర్రా! అలా పరిగెత్తేది" అంటూ శంకరవ్వ కేక పెట్టింది.
చిన్నా ఆగిపోయాడు. రాఘవన్న వేపే చూస్తున్నాడు, శంకరవ్వను పట్టించుకోకుండా.
చిన్నా ఇంట్రడక్షన్ ఇవ్వడం మొదలు పెట్టింది శంకరవ్వ తన కొడుక్కి, " ఒరే రాఘవా ! వీడు మీ సుజాతక్క కొడుకు, భలే తెలివి గలోడు . వీడి బుర్ర నిండా ఎప్పుడూ ప్రశ్నలే! మనింటికొస్తే అదేంది, ఇదేందీ అంటూ చంపుతాడు, ఒక్క నిమిషం కుదురుగా ఉండడు " అనుకుంటూ.
ఈలోపల దేవళం రావటం, శంకరవ్వ లోపలి వెళ్ళటం, రాఘవన్న దేవళానికి ముందున్న అరుగు మీద కూర్చోడం జరిగిపోయాయి.
చిన్నా కూడా వెనక్కి ఓ పదడుగులు వేసి, ఒక్క లగు లగెత్తి, ఎగిరి రాఘవన్న పక్కన కూర్చున్నాడు అరుగు మీద.
"ఏమి చదువుతున్నావు" అడిగాడు రాఘవన్న చిన్నా భుజం మీద చెయ్యేసి.
"ఆరో క్లాస్, జెడ్.పీ ఉన్నత పాఠశాల, రామలింగాపురం అఫ్ పెదపుత్తేడు"
"అబ్బో! నేను కూడా అక్కడే చదివేను తెలుసా!. మా హెడ్ మాస్టర్ మీరా రెడ్డి గారు, బహుశా ఇప్పుడు వేరే ఆయనేమో? ”
"రాఘవన్నా! ఎక్కడైనా హెడ్ మాస్టర్లు మార్తారేంటి, మాక్కూడా ఆయనే"
"సైన్స్ కి ఎవరు మీకు, ప్రఫుల్ల దేవి గారేనా"
"మాకా పుల్లా దేవి కాదన్నా! కే .ఎస్ అయ్యోరు సైన్స్ కి, లెక్కల కి" అంటూ పళ్ళు ఇకిలిచ్చాడు చిన్న.
ఓ చిన్న నవ్వు నవ్వేసి , రాఘవన్న వాళ్ళు చదువుకొనే టప్పుడు పని చేసిన టీచర్స్ ఎవరన్నా ఉన్నారా అంటూ ఒక్కోరి పేర్లు అడుగుతూ మొదలుపెట్టి , ఒక్కొక్క అయ్యవారు ఎట్టా పాఠాలు చెప్పే వారో, అప్పుడు బడి ఎట్టా ఉండేదో, వాళ్ళు ఎట్టా చదివే వారో, ఎట్టా ఆడేవారో, చెబుతూంటే చిన్నా కళ్ళార్పకుండా వినడం మొదలుపెట్టాడు.
రాఘవన్న ఆపకుండా చెప్పుకుంటూనే పోతావున్నాడు ఊరిగురించి , తన చిన్నతనం రోజుల్లోకి పూర్తిగా వెళ్ళిపొయ్యి -
అప్పటి ఊరి గురించి , యానాదిరెడ్డి బాయిలో వాళ్ళ ఈతలగురించి , దేవళంలో సందడిగురించి, వూరెన్కాలుండే వాగు గురించి , వాగొడ్డున పరిగెడుతూంటే కాళ్ళ కింద తగిలే ఇసక మెత్తదనం గురించి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో -
ఇలా చెప్తున్నవాడు ఒక్కసారిగా ఆగిపొయ్యి ఎటోచూస్తూ నిట్టూర్చాడు.
"వూరు ఒకప్పటిలా లేదురా చిన్నా! నేను అమెరికాకి వెళ్లి పోయాక ఈ ఊరి కళే పోయిందిరా " అన్నాడు.
ఆయన చెప్పిన కబుర్లన్నీ బాగున్నాయి, చిన్నోడికి, కానీ రాఘవన్న అమెరికాకి వెళ్ళిపోయాక వూరు కళ తప్పటం అన్న మాట తప్ప.
వాడికి ఇప్పటి స్కూల్ బాగుంది, అయ్యోర్లు బాగున్నారు, చదువులు బాగున్నాయి, వూరినిండా సావాస గాళ్ళున్నారు, చెరువు అలాగే వుంది, నీళ్లు తగ్గినప్పుడు పెరిగే తుంగ అలాగే పెరుగుతుంది, రాములోరి గుడి అలాగే వుంది, తిరునాళ్ళు అలాగే జరుగుతున్నాయి సందడి గా, దేవళం ముందర వాడి సావాసం గాళ్ళు అలాగే ఆడుకుంటున్నారు, తాటి చెట్లు ఈత చెట్లు సీమ చింత చెట్లు కాయలు కాస్తూనే వున్నాయి, నేరేడు చెట్లకి ఎంట్లు వేసి పిల్లకాయలు అలాగే ఊయళ్ళు వూగుతున్నారు, ఊరి వాగులో దొరికే చంద మామ బేడీసి చేపలు ఊరి జనాలు ఎప్పటిలాగే చప్పరిస్తున్నారు, పిల్లకాయలు పాటికి పిల్లకాయలు ఆటలు ఆడేసుకుంటుంటే అవ్వలు వాళ్ళ కోసం ఎప్పటిలాగే వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. వాగొడ్డున పరిగెడుతూంటే ఇసక అమ్మ ఒళ్ళంత మృదువుగా అలానే వుంది.
అయినా ఈ రాఘవన్న బాదేంటి, వూరు కళ తప్పటమేంటి ఈయన అమెరికాకి వెళ్ళాక. వాడికేమీ అర్థం కాలా.
2005 వ సంవత్సరం - నేను:
" మన ఊరి దాకా వెళ్ళొద్దామురా! నువ్వు నెల్లూరు వస్తేనే మమ్మల్ని తిప్పేది, లేక పోతే లేవటం, వండి పెట్టటం, తినటం, పడుకోవటం, ఇంతే జీవితం. నువ్వు తీసుకెళ్తానంటే చెప్పు, బేబీ అక్కని, సునీతక్కని కూడా రమ్మంటాను" అంది సుజనక్క - నేను హైద్రాబాదు నించిపొద్దున్నే, నెల్లూళ్ళో దిగంగానే -
"సరే అక్కా ! వెళదాం. మనం వూరికెళ్లే, దశాబ్దాలు అవుతుంది, సుప్రియాకు గూడ చూపించినట్టుంది " అన్నా నేను.
ఏడవతరగతి వరకే మా వూర్లో వున్నా నేను . తరవాత నెల్లూరుకు వచ్చేసాం మేమంతా .
దాంతర్వాత చదువులు, ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వున్న పొలాలు అమ్మటాలు, చివరగా వూర్లో వుండే పెద్దమ్మ పెదనాన్నలు కూడా, వున్నది అమ్మేసి హైదరాబాద్ లో వుండే కొడుకు దగ్గర కు వెళ్ళిపోవటం తో, దాదాపుగా మాకు మా ఊరితో వున్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
ఎలా వుందో వూరు, వూళ్ళో ఒకరన్న మనల్ని గుర్తు పడుతారా లేదా అంటూ బయల్దేరాం, మా అక్కలు , సుప్రియ , నేను , ఐదేళ్ల నా పెద్దకూతురు అమృత ను గూడా తీస్కొని. .
వూరు దగ్గర అయ్యేకొద్దీ ఎదో తెలియని ఉద్విగ్నత.
ఊరి మొదల్లో ఊట నీటితో - గల గల పారే కల్జు పగిలిపోయి, చాలా నిశ్శబ్దం గా వుంది.
ఊరి మొదలు నుండి మూల కడ వరకు దారి పొడవునా నీళ్ల తో నిండుగా వుండే చెరువు, నీరే కనపడనంతగా తుంగతో పెరిగిపోయి ఎదో అపశకునంగా తోస్తుంది. ఎన్నో ఊర్లలో కాన వచ్చే సిమెంట్ రోడ్ లు మచ్చుకు కూడా లేవు. చిన్నగా మూల కడ దగ్గర రైట్ టర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్లి దేవళం దగ్గర కారాపాను నేను .
అప్పటికే బిక్క మొహాలేసేసి వున్నారు మా అక్కలంతా.
"దేవళం, వరండా ఏమిటి నేలలోకి ఇంత కుంగిపోయింది" అంటూ మొదలు పెట్టింది ఒక అక్క.
"ఈ వీధులేమిటి ఇంత ఇరుకు అయిపోయాయి" అంటూ బోరుమంది ఇంకో అక్క.
"గుడికి ఎదురుగా వుండే ఈ బడికి రంగులు వేసి ఎంత కాలమయ్యిందో" అని నసుగుతుంది మూడో అక్క.
"సరే మేముమా దోస్తులు ప్రసూనని, అన్న పూర్ణని కలిసొస్తామని" తుర్ మన్నారు అక్క చెల్లెల్లు.
వెళ్లినంత సేపు పట్టలా, మొహం వేలాడేసుకొని రావడానికి, "ప్రసన్న ఎప్పుడో ఊరొదిలి వెళ్లిపోయిందట, అన్నపూర్ణ కూతురు దగ్గరకి వెళ్లిందట" అంటూ.
"సరే అలా పొలాల వెంట అన్నా వెళదాము" అన్నారు వాళ్ళు.
" నార్లు వేసి పచ్చా పచ్చగుండాలి పొలాలు. ఇలా బీళ్ల లాగా వున్నాయేమిటి' ?అంటూ దబాయించారు ఆ దారిన వెళ్తున్న నారాయణ ని గుర్తు పట్టి.
మా వాళ్ళ ఉధృతి ,చూసి బిక్క మొహం వేసాడాయన.
"సుప్రియా! మా వూరు చాలా బాగుండేది, ఇలా ఉండేది కాదు అస్సలికే" అంటూ మా ఆవిణ్ణి నమ్మించడానికి విశ్వప్రయత్నాలు మొదలు పెట్టేసారు, మా అక్కలు.
ఎక్కడ సుప్రియా, ఈ అనాగరిక వూర్లోనా మా ఆయన మరియు మా ఆయన ఘనత వహించిన అక్కలు పుట్టి పెరిగింది అనుకుంటుందేమో అనే భయం తో.
చెప్పడం మొదలుపెట్టారు, వాళ్ళ మాటల్లోనే చిన్నప్పుడు వూరు ఎలా ఉండేదో,, , రాములోరి గుడి ఎలా ఉండేదో , తతిరునాళ్ళు ఎలా జరిగేవో, నేరేడు చెట్లకి ఎంట్లు వేసి పిల్లకాయలు ఎలా ఊయాళ్ళు ఊగే వారో, పిల్లకాయలు పాటికి పిల్లకాయలు ఆటలు ఆడేసుకుంటుంటే అవ్వలు వాళ్ళ కోసం ఎలా వెతుక్కుంటూ వచ్చేసేవారో, వూరెనక వాగు ఎంత అందం గా ఉండేదో, వాగొడ్డున పరిగెడుతూంటే కళ్లకింద ఇసక ఎంత మెత్తగా తగిలేదో గట్రా, గట్రా..
చివరకి, "సుప్రియా! మేము ఈ వూరు వదిలి వెళ్ళాము ఈ వూరు కళే బోయిందబ్బా" అని తీర్మానించేసారు.
"మీరు మాట్లాడుకుంటూ వుండండి, లేకపోతే ఇంకా ఎవరన్నా మీ ముఖాలను గుర్తు పడతారేమో పరీక్షించుకుంటూ వుండండి నేను ఇప్పుడే వస్తాను" అంటూ నేను ఊరి గట్టుకేసి నడిచాను.
చెరువు గట్టు మీద నిల్చోనున్నాయి, రావి చెట్టు, వేప చెట్టు అలానే ఒకదానితో ఒకటి కల్సిపొయ్యి .
వాటికిందనే మేము చిన్నప్పుడు ఆడుకుంటూవుండే అరుగు. ఆరుగ్గూడా అలానే వుంది.
ఆ అరుగు మీద వెల్లికిలా పడుకొని, ఆ రావి చెట్టు గల గల వింటూ నిద్రలోకి జారుకున్నా
ఆ మగత నిద్రలో, మా వూరమ్మ, కనిపించింది. "ఏరా ! చిన్నా ఎందుకంత కలతగా వున్నావు" అంటూ.
"ఏంది వూరమ్మ ఇంత మారిపోయావు" అంటూ బావురుమన్న నేను.
"మారడం అంటే ఏమిటో చెప్పు ముందు అంటూ నిలదీసింది" వూరమ్మ.
"నేను పచ్చటి పొలాలు చూడాలని వచ్చాను, అవి కనపడటం లేదు"
"నువ్వొచ్చినప్పుడే పొలాలు పచ్చగా ఉండాలి అనుకోవటం నీ తప్పు, కోతల కాలం లో రావటం నీ తప్పుకాని, దానికి వూరు మారిందని బావురు మానటం ఎంత వరకు సబబు" అడిగింది ఆవిడ.
"నా చిన్నప్పుడు వీధులు ఎంతో విశాలం గా ఉండేవి, గుడి వరండా ఎక్కాలంటే పరిగెత్తు కొచ్చి ఒక్క ఎగురు ఎగరాల్సి వచ్చేది, ఇప్పుడేమో వీధులు ఇరుకిరుకుగా, గుడి వరండా నేలకు అంటుకు పోయి వుంది"
"పిచ్చి నాగన్నా నువ్వు సిటీ లో రోడ్ లకు అలవాటు పడ్డావు కాబట్టి ఇవి ఇరుకుగా వున్నాయి. అదీ కాక అప్పుడు నువ్వెంతరా నాయనా ఎత్తు, మహా అయితే మూడున్నర అడుగో లేక నాలుగు అడుగులో, అప్పుడు ఆ ఆకారం తో చూస్తే నీకు అన్నీ పెద్దవిగా, ఇప్పుడు రేవులో తాటి చెట్టులా ఎదిగిన ఆకారం తో చూస్తే అన్నీ చిన్నవిగా కనపడతాయి"
ఇంకా చాలా చెప్పింది వూరమ్మ.
"మీ అవసరాలు పెరిగి, మీరు ఒక్కొక్కరే ఎగిరి పోయారు వూరు విడిచి. మారింది నేను కాదురా అబ్బాయీ, మీరు మీ అవసరాలు. నాకు మట్టుకు నేను ఇక్కడ వుండే వాళ్ళ చిన్న చిన్న అవసరాలు తీరుస్తూనే వున్నా ఒక అమ్మలా. నేను ఇచ్చేది చాలదు అనుకున్న వారంతా ఎగిరి పోతూనే వున్నారు. ఎప్పుడో దశాబ్దానికోసారి, వచ్చి ఇట్టా బాధపడ్తున్నారు . ఇంకా నాకు నవ్వు వచ్చేది ఏమిటంటే, ప్రతీ వాడు వాడు వెళ్లి పోయాక నేను కళ తప్పాను అనటం. బాగుందిరా అబ్బాయీ" అంటూ నవ్వటం మొదలెట్టింది.
నవ్వీ! నవ్వీ! చెప్పింది, " నేను కాదు కానీ నీ ఈ సందేహం ముందు ముందు నీ సంతానము తీర్చు గాక !" అంది వూరమ్మ మాయమవుతూ తన వామ హస్తం పైకెత్తి నన్ను ఆశీర్వదిస్తూ. .
ఈలోపల, " చిన్నా ! ఇక్కడున్నావా! ఊరంతా వెతుకున్నాము" ఆంటూ లేపేసేరు నన్ను అక్కలు.
ఏడేళ్ల నా కూతురు అమృతా వాగుని చూసి ఉత్సాహంతో ఒడ్డునుండే, ఇసుకలో అటూ ఇటూ పరిగెత్తడం మొదలు పెట్టింది.
ఒక పదినిముషాలు పరిగెట్టింతర్వాత , అలసి పొయ్యి , నా దగ్గరకొచ్చి, ఆయాసపడ్తూ చెప్పింది , “ డాడీ , ఇక్కడ ఇసుకెంత బావుందో, నానమ్మ ఒళ్ళంత , మెత్తగా !
నేను తన కళ్ళల్లోకి చూసాను.
అమృతా కళ్ళు, ఎదురుగా వుండే వాగు నీళ్లలాగా స్వచ్ఛం గా, మెరిసిపోతున్నాయి.
నా చూపులు ఊరివైపు తిరిగాయి.
నాలో తెరుచుకొన్న, చిన్నా కళ్ళ తో, ఊరంతా నాకు చాలా అందం గా కన్పించటం మొదలు పెట్టింది.
'కథా నీరాజనం' శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, 'కాకులు గ్రద్దలు'
కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు.
ఈ కథ వారి పాత్రల సహజ చిత్రీకరణ కు , రచనా చాతుర్యానికి ప్రతీక.
కథలో నాలుగు అంకాలు , ప్రతి అంకంలో రెండు పాత్రలు. ఏ అంకంలోని ప్రధాన పాత్రలు కూడా, మిగతా అంకాల్లోని , ప్రధాన పాత్రలను కలపకుండా , కథ గొప్పగా ముగించడం, శ్రీ నరేంద్ర గారి కథ శిల్పవిశిష్టతను మనకు తెలియజేస్తుంది.
ఈ కథ పై మా ప్రశ్నలకు, నరేంద్రగారిచ్చిన సమాధానాలను , అంతేకాకుండా నరేంద్ర గారి, రచనలగురించి, రచనా ప్రక్రియ గురించి తెలుసుకోవాలంటే, వారితో మేము జరిపిన పూర్తి ఇంటర్వ్యూ , హర్షణీయం లో క్రింది లింక్ ద్వారా వినవచ్చు.
https://harshaneeyam.in/2020/09/11/srinarendra/
ఇతర వివరాలు:
'కాకులు గ్రద్దలు' అనే కథ శ్రీ నరేంద్ర గారి 'నాలుగు కాళ్ళ మంటపం' అనే కథా సంకలనం నించి సంగ్రహించ బడింది.
ఈ పుస్తకం అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా ప్రచురింపబడింది. (https://www.facebook.com/AnvikshikiPublishers/)
ఈ పుస్తకం , క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చెయ్యవచ్చు.
https://www.telugubooks.in/products/naalugu-kaalla-mandapam?_pos=4&_sid=7dd5697ad&_ss=r
లేదా 'నవోదయ' సాంబశివరావు గారిని క్రింది అడ్రసు, మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించండి.
నవోదయ బుక్ హౌస్
3, కాచిగూడ స్టేషన్ రోడ్ , చప్పల్ బజార్ , కాచిగూడ , హైదరాబాద్
ఫోన్ నెంబర్: 090004 13413
https://goo.gl/maps/nC4BSr2bBvfZgwsm7*Intro-outro
BGM Credits:
Mounaragam Theme - Manaswini Anand (https://youtu.be/s4cARPm3LZ8)
A Story by Sri.Murali from his Blog 'Nemali Kannu"
http://nemalikannu.blogspot.com/2009/12/blog-post_17.html
yikKeWfiPocxqEy9L858
From the publisher's feed

52 Listeners