
Sign up to save your podcasts
Or


రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా"
"ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ"
"ఇంకెవరి తో రా మా అన్న శుంఠ తో"
"నిన్ననే కదరా! ఇద్దరు కొట్టుకున్నారు"
"అలా అనిపించిందా మీ అందరికీ, ఎక్కడ కొట్టుకున్నాం రా , వాడు కొట్టటమే కానీ నన్ను"
"సర్లే రా! మళ్ళీ వాడితోనే సిగ్గులేకుండా వెళ్తున్నావా మళ్ళీ"
"రేయ్! కిరణ్ గా, నువ్వెవడివిరా మా అన్నని వాడితో గీడీతో అనడానికి. అయినా మా అన్న దార్లో పది దొంగలొచ్చినా కొట్టేస్తాడురా"
"సరే రా గిరిబావ, మా అన్న, మీ అన్న కొట్టిన వాళ్ళ కంటే +1 రా"
ఇలా మా గిరి గాడు ఎన్నైనా చెప్పనీ, దానికంటే మనం దానికి ఓ +1 కలపటం.
ఇక వాడికి చిరాకు పుట్టి, నువ్వు మీ అన్న, మనూరి వాగులో దూకి ఛావండిరా అనే దాకా వెళ్ళేది మా అన్నల గురుంచి మా బాకాలు.
గిరిగాడు నాకు వరసకి బావ, ఒకటో క్లాసు నించి మేమిద్దరం ఒకటే బెంచీ.
అలా ఇంకో రోజు, మా గిరి బావ గాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు,
నా మా చెడ్డ సరదా వేసేసింది వాడి ఏడుపు చూసి, "ఏరా గిరి బావా! మళ్ళీ నాలుగు పీకినాడా మీ అన్నా"
"దొంగ ఎదవ రా మా అన్న, మా అన్న, వాళ్ళ స్నేహితులతో ఆడుతుంటే, నన్ను కూడా ఆడించుకోమంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తో నేను ఆడకూడదని చెప్పి తరిమేసాడురా"
"అదేందిరా గిరిబావ! నే వెళ్లి మా అన్న వాళ్ళ జట్టుతో చేరతా నుండు, మా అన్న నన్ను చేర్చుకుంటాడు చూడరా"
"వద్దురా కిరణు, మీ అన్నే రా మా అన్నకి ఎక్క జెప్పింది, నా గురుంచి, వాళ్లిద్దరూ తోడు దొంగలురా, వెళ్ళొద్దురా" అని మా గిరి బావ చెప్పి నా వినకుండా మా అన్న చేత నాలుగు తన్నిచ్చుకొని వచ్చా.
"మీ అన్నే నయం రా గిరిబావ, మా వాడు , నేను వాళ్ళు ఆడే వీధిలోక్కూడా రాకూడదు అంటూ నాలుగు తగిలించాడురా!"
"మా యన్న ఎదవ రా గిరిబావా"
"మా యన్న ఎదవన్నర ఎధవరా, కిరణు"
"మా యన్న మీ అన్నకంటే ఎదవ ల్లో ఎదవ + 1 రా గిరి బావా!
అవడానికి ఓ సంవత్సరమో లేక రెండేళ్లో పెద్ద అయిన దానికి ఈ అన్నలకి తమ్ముళ్ల మీద ఇంత జులుము చేసే అధికారం ఎవరిచ్చారో, మాకెప్పుడూ అర్థం అయ్యేది కాదు.
అసలు నేను మా గిరిబావ, ఇంకా ఎధవన్న ఎదవ అన్న - లున్న తమ్ముళ్ళంతా ఒక అన్న బాధిత సంఘం పెడదామని ఆలోచన కూడా చేసేసాము.
దానికి తోడు! ఎక్కడకి బోయినా, వీడు ఆ ప్రవీణ్ గాడి తమ్ముడు రా అన్న బిరుదు నాకు.
దానికి అబ్బా ప్రవీణ్ తెల్ల గా బుర్రగా ఉంటాడు, వీడేందిరా కర్రి మోహమేసుకోని. ఇది గాక ప్రవీణ్ గాడి తెలివి వీడికేడుందిరా అనే పోలిక మళ్ళీ.
ఏడో క్లాస్ లో అనుకుంటా మా అన్న, ఆయన పుస్తకాల మీద, "ప్రవీణ్ కుమార్, బి.టెక్, ఎం.టెక్" అని రాసేసుకోవటం మొదలు పెట్టాడు.
"మరి నువ్వే మవుతావురా , కిరణ్ గా అంటే, నేను పెద్దయ్యి, ఉషా ని పెళ్లి చేసుకుంటా" అనే వాడిని.
అది సరేరా పెద్దయ్యాక ఉద్యోగమంటూ చేయాలి గా, దానికేమి చేస్తావురా అంటే, "నేను మన సూలం లాగా బస్సు తోలతాను" అనే వాడిని.
అలా మా అన్న ఫస్ట్ గ్రేడ్ సిటిజెన్ అయితే నా దంతా సెకండ్ గ్రేడ్ సిటిజెన్ యవ్వారం.
వీళ్లందరి మధ్య, మా శేష మామే నయం, మీరందరు ఎన్నైనా చెప్పండి, చిన్నోడు రంగు తక్కువయినా వాడి మొహం లో కళ, ఆ పెద్దోడికి ఎక్కడొస్తుంది అనే వాడు.
ఏడో క్లాస్ లోనే మా అన్న సైకిల్ అర పెడల్ తొక్కటం మొదలెట్టాడు.
సీట్ ఎక్కి తొక్కలేదు, పొట్టోడు కదా. ఓ రోజు, "రారా! రామ లింగాపురం దాకా వెళ్లొద్దాము" అన్నాడు పెద్ద పోటుగాడిలా!
"ఛా, వీడితో ఏందీ నేను వెళ్ళేది” అనుకుంటానే, మళ్ళీ రామ లింగా పురం అంటే పెద్ద వుర వుర నాకు, అందుకే సరే అన్నా.
వెనక సీట్ మీద ఎగిరి ఎక్కాలి, నేను ఎక్కలేను, నేను అంత కన్నా పొట్టి కదా.
మా ఇద్దరి అవస్థలు చూసి మా ఊరోళ్లు, నన్ను వెనక కారేజీ మీద ఎక్కిచ్చి, మా అన్న సైకిల్ కంట్రోల్ అయ్యేదాకా నెట్టి పంపారు మమ్మల్ని.
వాళ్ళకీ డౌట్ రాలా, మాకు రాలా మా సామర్ధ్యం మీద, మధ్యలో ఆగితే ఎలా అని.
కొంత దూరం పోగానే దారి కాస్త ఎగుడు.
మా అన్నకి తొక్క లేక ఆయాసం, దిగరా అని ఒక్క కసురు కసిరాడు.
నేను దూకేశా. ఎగుడు అంతా నడిచాము, రామలింగా పురం వరకు అలాగే ఎగుడు ఉండినా బాగుండు, నడుచుకుంటా వెళ్లే వాళ్ళము.
దారి మామూలు కాగానే మావాడు తొక్కటం మొదలెట్టాడు,
నేను కారేజీ మీద కు ఎగరటం మొదలెట్టా.
నేను ఎగరడం , మా వాడు బాలన్స్ తప్పడం.
నేను ఎగరడం , మా వాడు బాలన్స్ తప్పడం.
ఇట్టగాదు అనిచెప్పి నేను వెనక్కి పది అడుగులు వేసి, పరిగెత్తు కుంటూ ఎగిరి కారేజీ మీద కూర్చున్నా.
ఆ దెబ్బకి మావాడేమో, దారి పక్కన పెద్ద కాలవలో తేలాడు.
ఇక అంతే అక్కడ నుండి ఇంటి దాకా నన్ను, వీర కొట్టుడు కొట్టుకుంటూ వచ్చాడు.
కొన్నాళ్ల తరవాత ఒక రోజు నేను మా సావాస గాళ్ళం, ఎప్పటిలాగే మా ఊరి చెరువు గట్టున షికారు కెళ్ళాము. చెరువులో నీళ్లు మరీ ఎక్కువ లేవు, గట్టు దిగాక మాకు కొంత దూరంగా మా ఊరి బెస్త వాళ్ళు చేపలు ఉపయోగించే తెప్ప ఒకటి పక్కనే ఒక గుంజకి ఒక మోకుతో కట్టి కనపడింది.
మాకు దాన్ని ఎక్కి నీళ్ళలోకి వెళ్ళాలి అనే వుర వుర కలిగింది, వెంటనే మోకు ని విప్పేసాము, తెప్పని నీళ్లలోకి నెట్టాము. ఆ తర్వాత ఎక్కడానికి అందరికీ భయమే. నువ్వంటే నువ్వు అనుకున్నాము. ఎవరూ ఎక్కటానికి సాహసించక పోతే, మా గుంపులోనే ఎవడో అన్నాడు, "కిరణ్ గాడికే ఈత వచ్చురా, వాడే ఎక్కాలి అని".
"ఆహా! ఈ విషయం మన ఉషా కి తెలిస్తే అబ్బో మన కిరణ్ ఎంత ఇదో అంటుందని", ఎక్కేసా తెప్ప. మావాళ్లు తెప్పని లోపలకి నెట్టేశారు, వాళ్ళ మోకాళ్ళ దాకా నీళ్లు వచ్చే దాకా, ఆ తర్వాత గట్టెక్కారు.
కొంచెం లోపలకు వెళ్ళ గానే నాకు భయం వేసింది. ఈత కాదు కదా, కాళ్ళు తెప్పలోంచి బయటకు పెట్టడానికి కూడా వణుకు, అదేమో తెడ్డు వేసినా ముందుకు పోదు, వెనక్కి రాదు, అక్కడక్కడే గింగిరాలు కొడుతుంది. నా భయం కేకలు గా మారాయి. ఇంతలో మా వాళ్ళల్లో ఎవడో పోయి మా అన్నని పట్ట కొచ్చారు.
పాపం మా వాడు, ఒడ్డున్నే వున్న మోకుని తీసు కొని, వాడి మోకాళ్ల దాకా నీళ్లు వచ్చే దాకా లోపలకి వచ్చి, మోకుని నాకు విసిరాడు. రెండు మూడు విసురుళ్ల తర్వాత మోకు నాకు దొరికింది. నేను మోకు పట్టుకోగానే లాగటం మొదలెట్టాడు. తెప్ప కాస్త భారం గానే వుంది, ఒక్కొక్క అంగుళం చొప్పున కదులుతుంది, మా వాడు తన బలమంతా వుపయోగించి లాగినా.
దాదాపు ఇక నా మోకాళ్ళ దగ్గరకు ఉంటాయి నీళ్లు అనగా, నా బుర్రలో ఒక వెదవ ఆలోచన వచ్చింది. మావోడు భలే బలంగా లాగుతున్నాడు కదా, ఇప్పుడు గాని మోకుని నేను వదిలేస్తే మా వోడు వెళ్లి ఎక్కడ పడతాడో చూద్దామని.
అంతే, ఒక సారి గట్టిగా లాగరా నాయనా అని చెప్పి, మోకుని వదిలేసా. వెళ్లి నీళ్ళకి గట్టుకి మధ్యన వుండే బురదలో పడ్డాడు మా వాడు. ఇక మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా నా వీపు ఎలా మోగిందో దొరికాక.
ఓ సారి మాకు ఎక్సామ్ సీజన్. ఎందుకో ఆ రోజు మా నెల్లూరి లో ఒకటే హెలికాఫ్టర్ల మోత. నాకు మా అన్నకీ పోలీస్ గ్రౌండ్ కి వెళ్లి వాటిల్ని చూడాలనే కోరిక తెగ బలం గా కలిగింది. ఇద్దరం ప్లాన్ వేసేసాం వెళ్లి చూడాలని. సైకిల్ కూడా రెడీ గా పెట్టుకున్నాము, సంత పేట నుండి తొక్కుకుంటా వెళ్లి రావడానికి, పాత బైపాస్ మీదుగా వెళ్లి. మా అన్ననే ముందుకు తోసా, మా నాయినని పర్మిషన్ అడగడానికి,
వెళ్లి, "నాన్న! నేను హెలికాప్టర్ ని చుడాలని అనుకుంటున్నా, వెళ్ళనా" అని అడిగేశాడు.
ఆ రోజు మా నాయన ఏ మూడ్ లో వున్నాడో, "పరీక్షలు పెట్టుకొని, చదువుకోకుండా, వెళ్లి బలాదూర్ తిరుగుళ్ళకి నన్ను పర్మిషన్ అడగడానికి ఎంత ధైర్యం " అంటూ బాగా మా వాడి వీపు సాఫీ చేసేసాడు.
మా వాడు ఊరుకుంటాడా, "నాన్న! నాకు ఇచ్చిన దాన్లో వాటా సగం నీదిరా" అంటూ నా వాటా నాకు వాడే స్వయం ఇచ్చాడు. ఇలా మా వాడికి మా నాయన చేతిలో పడ్డప్పుడల్లా, దాన్లో సగం వాటా నాకు వాడి చేతుల మీదుగా దక్కేది. మా వాడిలో ఇలా సోషలిస్ట్ భావాలు బాగా బల పడ్డాయి.
రెండేళ్ల తర్వాత నాకు టెన్త్ లో మా అన్న కంటే బాగా ఎక్కువ మార్కులు వచ్చాయి. కానీ మా జనాలు, "వాడి టైం లో పేపర్స్ చాల కఠినం గా దిద్దేవాళ్ళురా కిరణ్ గా, నీ దగ్గరకొచ్చేసరికి పొయ్యటమే పొయ్యటం మార్కులు" అని, మా అన్న తెలివి ముందర నా తెలివి పనికి రాదనీ మళ్ళీ తేల్చి పారేశారు.
మా వాడిక్కూడా వాడికి మార్కులు తగ్గితే ఒక రూల్. నాకు తగ్గితే ఒక రూల్. నాకు తగ్గితే అష్టోత్తరాలు శతనామాలే, ఆయన స్నేహితుల దగ్గర నా మార్కుల వాళ్ళ పరువు పొయ్యింది అనిచెప్పి.
ఉద్యోగం వెలగ బెట్టినా, పెళ్లి అయ్యి ఇద్దరి పిల్లల తండ్రి అయినా, చాలా సంవత్సరాలు జీతం అంతా ఇంట్లో ఇచ్చి ఖర్చులకు మా అన్న దగ్గర చేయి చాచటం చూసి సుప్రియా కిసుక్కుమని నవ్విన సందర్భాలెన్నో. నాకిచ్చే చిల్లర డబ్బులక్కూడా వాడు నాకు చెప్పేవాడు సవా లక్ష జాగ్రత్తలు.
వాడికి పడ్డ తన్నులు లో సగం వాటా ఇచ్చే మా అన్నలో చాలా సోషలిస్ట్ భావాలు చూసిన నాకు, మా అక్క పెళ్లి కోసమని, మాకున్న ఐదు ఎకరాలు అమ్మేసినప్పుడు ఆస్తిలో చెల్లెలికి పూర్తి వాటా ఇచ్చిన మా అన్న లో ఆల్ట్రూయిస్ట్ కనపడ్డాడు. నాకన్నా వుద్యోగం వుంది అప్పటికే, మావాడి కి వుద్యోగం లేదు, వెనక పైసా లేదు. అప్పుడనుకున్నా, ఎప్పుడో ఒడ్డుకు రాగానే మోకును వదిలేసినట్టు, ఎప్పటికీ వదలకూడదు మా వాడిని అని.
ఒడ్డు అంటే గుర్తొచ్చింది, ఇంటర్ లో అనుకుంటా చుట్టూ పక్కల పిల్ల జిల్లా అందరం కలిసి మైపాడు కి పిక్నిక్ వెళ్ళాము. నేను నా స్నేహితులతో కలిసి సముద్రం లో దిగి ఆడుతున్నా.
మా అన్న ఒడ్డునే నిలబడ్డాడు.
నా కర్థం కాలేదు ఎందుకు ఒడ్డున్నే వున్నాడో కూడా, లోపలి ఆడుకోడానికి రాకుండా.
నేను నా దోస్తులతో, అలలతో పాటు ఆడుకుంటూ ఉంటే , మమ్మల్నే చూస్తున్నాడు మా వాడు.
మైపాడు దగ్గర సముద్రం ఎగుడు దిగుడు , చాలా ప్రమాదం అట. మనకేం తెల్సు. ఆడుతూ ఉంటే, నా సైజు కి ఓ పెద్ద ఆల అలా వచ్చింది. ఏమైందో నాకర్థం కాలా.
లోపల లోపలి వెళ్లిపోతున్నా. నోట్లో అంతా ఉప్పు నీళ్లు . ఊపిరి తీస్కోడం కష్టమైపోతా వుంది.
ఇంతలో ఆ నీళ్లలో , ఆ ఉధ్రుతంలో ఎవరో నన్ను పట్టుకున్నట్టు అనిపించింది. భయమేసిపోయింది. స్పృహ తప్పింది నాకు. ఆ పట్టుకున్న చెయ్యి లాక్కుంటా వచ్చింది నన్ను. బతికిపోయా.
.
ఆరోజు నించీ ఒక ధైర్యం అయితే వచ్చేసింది, నేను ఎక్కడన్నా చిక్కుకుపొయ్యి , కొట్టుకుపోతుంటే మటుకు, పక్కనే వున్నాడు, చూసుకుంటాడు, వాడు అని, ఆ రోజు , మైపాడు బీచిలో, ప్రాణాలకి తెగించి సముద్రం లోకి దూకి, అ
80 వ దశకంలో తొలి సంవత్సరాలవి. ఇప్పటిలాగా కాకుండా మాకప్పుడు ఐదు తరగతుల లోపునే తెలుగు చాలా బాగా నేర్పేవారు. అంటే బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, బాలల బొమ్మల భాగవతం ఇలాంటివి ధారాళంగా చదవ గలగడానికి, చదివి అర్థం చేసుకోవడాని ఎటువంటి ఇబ్బంది కానీ ఎవరి సహాయం కానీ అవసరం లేనంతగా నేర్పించేవారు. అలాంటి ప్రాధమిక పాఠశాలల్లో అంబవరం పాఠశాల ఒకటి. ఈ ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో భైరవకోన. ప్రకృతి మధ్యన వెలసిన శైవ క్షేత్రం. ఒక కొండను పూర్తిగా చెక్కి చిన్న చిన్న గుడులుగా మలచి శివాలయలుగా తీర్చి దిద్దారు. ఆ ఆలయాల్లో విగ్రహాలు కూడా విడిగా చెక్కి పెట్టినవి కావు. అన్నీ ఆ కొండలో అంతర్భాగాలే. అంటే ఏకశిలా మందిరాలు. ఇక ఊరికి కొద్ది దూరంలో కొత్తపల్లి, దర్శిగుంట పేట అనే ఊర్లు. ఏఊరికి ఆ ఊరిలో ప్రాధమిక పాఠశాల వున్నా గానీ ఉన్నత పాఠశాల మాత్రం మా ఊర్లోనే. అంటే అంబవరం లో. ఇక ఈ ఊరి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే చుట్టూ దట్టమైన అడవులు [ అప్పట్లో, ఇప్పుడు చాలా వరకు హరించుకు పోయాయి ]. ఆ అడవుల్లో బీర కాయలు, ఇవి కూర వండుకునేవి కాదు, రంగులోఎర్రగా రుచికి తియ్యగా, చిన్న విత్తనం కలిగి తిన్నప్పుడు చాలా బాగా వుంటాయి. వీటితో పాటి ఉసిరిక, నెమ్మి, ఏలక, బిక్కి కాయల లాంటివి విస్తారంగా దొరికేవి. అలాంటి ప్రకృతి మధ్యన నివసించే ప్రజలు ఆ ఊరివాళ్ళు. ఊరి పొలాల్లో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, పసుపు, ఆముదాలు, నువ్వులు ఇలాంటి పంటలు ఎక్కువగా పండేవి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే అక్కడ అప్పటికి పట్నపు పోకడలు చాలా చాలా తక్కువ. అలాగే పైవన్నీ ఎక్కువగా దొరకడం మూలానే ఈ టపాలో మాకు పసుపు కానీ, పూజకు ఆముదం కానీ చాలా సులభంగా దొరికాయి. ఊరి రామాలయంలో హరికథా గానాలు, శివరాత్రికి రకరకాల పౌరాణిక పద్య నాటకాలు, అప్పుడప్పుడు తోలుబొమ్మలాటలు. ఇవి ఎనభైల్లో ఆ ఊరికి వినోదమందించే దృశ్య, శ్రవణ మాధ్యమాలు. ఇవన్నీ వంటబట్టించుకున్న మాలాంటి చిన్న పిల్లలకు సహజంగానే పాండవులంటే [ భారతంలో హీరోలు ] అమిత ఆరాధానాభావం. నాకు మరీ ముఖ్యంగా అర్జునుడంటే మహాయిష్టం. ఎంతగా ఇష్టం అంటే అరణ్య/అజ్ఞాత పర్వంలో అర్జునుడు బాణాలు విల్లు తీసుకొని అడవులవెంట తిరుగుతాడుకదా. ఆ సన్నివేశం ప్రతిరోజూ కొన్ని నెలలపాటుగా నాకు కలలో,
నేనే అర్జునుడుగా వెదురుతో చేసిన విల్లు తీసుకొని మా తోటలో పహారా కాసినట్టు కలలొచ్చేవి. అవునండోయ్ మా ఊర్లో వెదురు కూడా బాగానే దొరికేది. పచ్చి వెదురు బొంగును కొడవలి తో రెండుగా చీల్చి నిజంగా నా అంతటి నేనే నాలుగోతరగతిలోనే విల్లు తయారుజేయడం నేర్చుకొని గురిచూసి పిట్టల గొట్టడం నేర్చుకొన్నాను. అప్పట్లో ఇంటో నాకు పిట్టలదొర అని కూడా నామకరణం చేసేసారు :-). వాళ్ళకు నా మనసు అర్థమయి అర్జునా అని పిలిస్తే వినాలని హెంత కోరికగా వుండేదో. అబ్బే ఈ పెద్దోళ్ళున్నారే వాళ్ళకి మన పిల్లకాయల మనసు ఎప్పుడు అర్థమవ్వాలి ;-)
అలా అలా స్కూల్లో నాలుగోతరగతి వెలగబెట్టే రోజుల్లో నాకు బాబుగాడని ఒక సావసగాడు తగిలాడు. వాళ్ళయ్య హైస్కూల్ లో హెడ్మాస్టర్. వీడు మహా మాయగాడు. ప్రతిదాంతో నాకు పోటీ వచ్చేవాడు. స్కూల్లో మాకు చదువులో కాదు పోటీ... ఎవరు తెలుగు పుస్తంకంలో ఎన్ని పేజూలు చించి వేస్తారో అని :-). కాకపోతే బాపనయ్య అవడంతో వాడికి తెలివి మస్తుగా వుండేది. పోటీ మొదలౌద్దా, ముందుగా వాడు వాడిపుస్తకంలో ఒక పేజీ సగం చింపేపాడు. మరి పోటీలో మనం ఓడిపోకూడదు కదా, అందుకని నేను నా పుస్తకంలో మొత్తం పేజీ చింపేసేవాడిని. అలా ఓరోజు ఓ అశుభ ముహూర్తంలో మొదలైన చింపటం అనే కార్యక్రమ ఫలితం ఓ పదినిమిషాల్లో నాచేతిలో తెలుగు పుస్తకం అట్ట దప్ప ఏమీ మిగల్లేదు. అంతే కాదు వాడు పేజీలను ఏంచక్కగా ఒక క్రమ పద్దతిలో చించాడు. అంటే మళ్ళీ బంక పెట్టి అతికించినా లేదా సూదితో కుట్టుకున్నా పనికొచ్చేటట్టు. మరి నేనో :-) ఏదో సినిమాలో బ్రహ్మానందం పేపరు చింపడం గుర్తు తెచ్చుకోండి :-)
చింపేటప్పుడు మహా ఆనందంగా వున్నది కానీ తరగతి గదిలోకి అయ్యవారు వచ్చి వీపు చీరగానే నేనాలపించిన గీతం మాత్రం నాకు కర్ణకఠోరంగా ప్రక్కనున్న సావాసగళ్ళకు మహా పసందుగా వినిపించింది :-). అంతటితో ఆగిందా నేను మా ఇంటికెళ్ళడానికంటే ముందే ఈ వార్త ఇంట్లో తెలిసింది. నాకంటే ముందు నా సావాసగాళ్ళందరూ ఇంటిముందు గుమిగూడి ఎప్పుడెప్పుడు సంగీతం విందామా అని ఏనుగు చెవులేసుకొని గుంటనక్కల్లా కాచుకోనున్నారు. మరి ఎన్నైనా అయ్యవారు పరాయి వాడుకాబట్టి కొద్దిగా నాలుగు దెబ్బలతో సరిపెట్టాడు కానీ , ఇంట్లో వాళ్ళు సొంత మనుషులు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ముట్టచెప్పారు. దానికి ప్రతిఫలంగా నా శాయశక్తులా నేనూ తిరిగి రాగాలాపన చేసాను :-)
ఇలాంటిది ఒకటేమిటి చెప్పుకుంటా పోతే ఒక రసవత్తరమైన బాల చిత్రం అవుతుంది. అలాంటి సెట్టింగే మరొకటి. అప్పట్లో మాకు కావాల్సిన ఆటవస్తువులను మేమే చేసుకొనేవాళ్ళం. అంటే కారు, బస్సు, రైలు ఇలాంటివి కావాలంటే ఖాళీ అగ్గిపెట్టెలను ఆ ఆకారంలో మార్చుకొని వాటికి మందుసీసాల రబ్బరు మూతలను చక్రాలుగా అమర్చి మాకు కావాల్సిన వాహనాన్ని చేసుకొనేవాళ్ళం. నిజంగా ఎంత తృప్తిగా వుండేదో. ఈ బాబుగాడున్నాడే వాడు నా బాల్య జీవితంలో ఒక విలన్ లాంటోడు. వాళ్ళ నాయన హైస్కూల్ హెడ్మాస్టరే కాదు . R.M.P. వైద్యుడు కూడా. కాబట్టి వాళ్ళింట్లో ఎప్పుడూ ఖాళీ మందు సీసాలకు కొదవుండేది కాదు. ఓరోజు ఇద్దరమూ కలిసి రైలు తయారు చేసుకుందామని గుసగుసలాడుకొని ప్రణాళికా రచనలో పడ్డాము. నేనెలాగు రబ్బరు మూతలు తేలేను కనుక వాడు చెప్పిన ప్రపోజల్ కు సరే అన్నాను. అంటే వాడు రబ్బరు గాన్లు తెచ్చేటట్టు, నేనేమో అవసరమైన అగ్గిపెట్టెలు తెచ్చేటట్టు. ఆ విధంగా పనులు విభజించుకొన్నాక వాడలా ఇంటికెళ్ళి ఓ ఇరవై మంది సీసాలు బుడక్కిన తీసుకొచ్చాడు. మరి నాకు అగ్గిపెట్టెలు ఇప్పుడు కనీసం ఒక ఇరవై కావాలి. అక్కడా ఇక్కడా అడుక్కోని ఒక ఐదో ఆరో సంపాయించాను. ఇక మిగిలినవాటికోసం ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. అదుగో అప్పుడు నాలోని మరో మనిషి నిద్రలేచి ఓ సలహా ఇచ్చింది. వెంటనే ఇంట్లో ఉన్న డజను నిండు అగ్గిపెట్టెలు మాయం. పుల్లలు తీసి ఇంటివెనకాల సందులో పారబోసి రైలు పెట్టెలు తయారు చేసి వాడొకరోజు, నేనొక రోజు హాయిగా ఆడుకొంటూ స్వర్గలోకాల్లో విహరించే ఒకానొక రోజు.....
ఇంట్లో వాళ్ళకి కొత్త అగ్గిపెట్టె అవసరం పడి చూస్తే ... ఇంకెక్కడి అగ్గిపెట్టెలు... కట్ చేస్తే షరా మామూలే.. ఇంట్లో సినిమా... ఇంటిబయట ప్రేక్షకులు :-)
అలా ఆ అమాయకత్వం అంతటితో ఆగిందా..అబ్బే ఆరోతరగతికి వచ్చేటప్పటికి బాలల పురాణ పుస్తకాలు చదవడంతో అందులో హీరోలు ఎవరైతే వారుగా మమ్మల్ని ఊహించుకోవడం బాగా తలకెక్కేసింది. ఊర్లో అంతకుముందు కొన్ని రోజులక్రితమే శ్రీరామనవమికి లవకుశ నాటకమేసారు. అప్పుడు మొదటిసారిగా "రామనీల మేఘశ్యామా..కోదండరామా" అనే పాట విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇంకేముంది అప్పటినుండి రాముని అవతారంగా పరకాయప్రవేశం చేసేసాను. అదుగో అప్పుడూ ఈ బాబుగాడు నాకు పోటీనే..రేయ్ నీకంటే నేను పెద్దోడ్ని నేనే రాముణ్ణి , నువ్వు లక్ష్మణుడివని. కానీ ఈసారి కుదరదంటే కుదరదని వాడ్ని లక్షణుడిగా సెటిల్ చేసేసి నేనే రాముడి నయ్యాను. ఇంతవరకూ బాగానే వుంది. మరి సీత?
అక్కడన్నమాట మా హీరోయిన్ రంగ ప్రవేశం. ఊర్లో అంతా సూర్యవంశ రాజులు, గొల్లవారు ఎక్కువ. కాబట్టి బడికి అమ్మాయిలను పెద్దగా పంపేవారు కాదు. మరి వచ్చిన వాళ్ళల్లో కొద్దిగా మాకు నచ్చిన పిల్ల నాగేశ్వరి [ పేరు మార్చాను ]. ఆ పిల్లకు కాస్త చింతపండు,జీలకర్ర కలిపి ముద్దగా చేసి ఓ చీపురు పుల్లకు గ్రుచ్చి లంచంగా ఇచ్చి మచ్చిక చేసుకున్నాము. ఇంతకీ ఇదేమి బాగుంటుందనుకొనేరు. కొత్త చింతపండు, జిలకర,ఉప్పు కలిపి ముద్దచేసి తిని చూడండి. సూపర్ గా వుంటుంది. ఇలా నాగేశ్వరిని సీతగా మార్చేసాము. నేను రాముడిని కదా..కొంచెం నీలి రంగులో వుండాలికదా. అందుకని ప్రతిరోజు స్కూల్ కి వచ్చేటప్పుడు మొఖానికి అరచేతి నిండా పాండ్స్ పౌడరు దట్టంగా దట్టించి స్కూల్ కి వచ్చేవాడిని. బాబుగాడు, నాగేశ్వరీ కూడా వచ్చాక ముగ్గురం కలిసి ఒక బావి దగ్గర చేరేవాళ్ళం. ఎందుకంటే అంతకుముందే అప్పటికే అక్కడ ఇటుకలతో ఒక చిన్న గుడిని, ఒక దీపకుందీని, ఆముదపు డబ్బాని తయారుగా పెట్టుకొని వున్నాము.
పెళ్ళి పత్రికల్లో ఆరోజుల్లో కచ్చితంగా రాముడు సీత ఇద్దర్నీ ప్రింట్ చేసేవాళ్ళు. అలాంటి పెళ్ళి పత్రికను ఒకటి మేము ఇటుకలతో కట్టిన ఆ గుడిలో పెట్టి దేవునిగా చేసి దీపారాధన చేసి, ఎవరూ చూడకుండా దానికి ఒక పెద్ద అట్టముక్కను వాకిలిగా పెట్టి మళ్ళీ స్కూల్ కి చేరుకొనేవాళ్ళం. ఒంటేలు గంట కొట్టగానే ముగ్గరం కలిసి మళ్ళీ మా గుడి దగ్గరకు పోయి పూజ చేసేవాళ్ళం. మరి అప్పటికి రాముడి మేకప్ పోయుంటుందికదా! సీత మేకప్ వేస్తుంటే హాయిగా వేపించుకొనేవాడిని. లక్ష్మణుడు మేము దీపారాధన చెసేటప్పుడు చుట్టుప్రక్కల జనసంచారమైతే మాకు సమాచారం ఇవ్వడానికి కాపలాగా వుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాకా ఈ ఆట బాబుగాడికి మహా బోర్ కొట్టేసింది. ఎందుకంటే వాడెంత సేపున్నా దీపారాధన చెయ్యలేడు,పౌడరు పూపించుకోలేడు :-). సరే అని వేరే ఆట ఆడాలని ముగ్గురం డిసైడ్ అయ్యాం. ఈసారి మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరం మా ఆటకు మూల వస్తువు.
ఇంతకీ ఆటఏమిటంటే ఒక ఐదుమందిమి కలిసి ద్రౌపతి ని పెళ్ళి చేసుకోవడం. కానీ ఇక్కడ మాకొక చిక్కు వచ్చింది. మేము ముగ్గరం ఇప్పటికే ఎవరికీ తెలియకుండా రామ,లక్ష్మణ, సీత అవతారాలెత్తాము. ఇప్పుడు మరో ముగ్గురు అంటే ఎక్కడ గొడవలౌతాయో అని భయం కూడా వేసింది. అందుకని మేమిద్దరమే పాండవులం. నాగేశ్వరి ద్రౌపతి అన్నమాట. ఇక పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించేసుకున్నాం. ఇంతకీ పెళ్ళి చేసుకోవాలనుకున్నాం కానీ మా ముగ్గురికీ ఒకటే భయం. పెళ్ళయితే పిల్లలు పుడతారాని :-)
కానీ పెళ్ళి చేసుకోవాలని ఆలోచన ఒకసారి వచ్చాక ఇక మనసూరుకుంటుందా? హబ్బే రాత్రులు నిద్రపట్టేది కాదు. ఎలా? ఎలా? ఎలా?... ఏదైతే అది అవుతుందని ముగ్గురం ధైర్యం చేసాము. మా స్కూలు వెనకాల ఒక పెద్ద ఇసుక గ్రౌండ్ వుండేది. ఇప్పటికీ వుంది కానీ ఇసుక మాత్రం చాలా తక్కువగా వుంది. ఒక రోజు, అపర సంధ్యవేళ, చుట్టు ప్రక్కల ఆడుకొనే పిల్లలు అందరూ ఇంటికెళ్ళాక ఎవరూ లేని సమయం చూసి ముగ్గురం సమావేశమయ్యాము. పెళ్ళి చేసుకుంటే పిల్లలు పుడతారనే భయం ఒకప్రక్క తొలుస్తూనే వున్నా మిగతా కార్యాచరణకు మంతనాలు సాగించాం. ఈ సారి నా వంతు తాళిబొట్టు తయారు చేయడం. బాబుగాడి వంతు పసుపు త్రాడు సంపాయించడం. అప్పటికి మాకు పెళ్ళిలో బెల్లం జీలకర్ర నెత్తిన పెడతారని తెలియదు. తాళి కట్టేస్తే ఇక పెళ్ళయిపోయి పిల్లలు పుట్టేస్తారని మాత్రమే తెలుసు :-)
ఇలా ముచ్చటించుకోని మంచి ముహూర్తం కోసం నేను, బాబుగాడు ఊర్లో రామాలయంలో హరికథలు చెప్తున్న హరిదాసు గారిని కలిసి, " మేము బాగా చదవుకోవాలనుకుంటున్నాము ఏరోజు మొదలు పెడితే ఫస్టు మార్కులు వస్తాయో " చెప్పమని కోరాము. ఇక్కడ మరో విషయం ఈ హరికథా దాసు గారితో మాకు అప్పటికే కొంచెం చనువు ఎక్కువ. వారి పేరు గుర్తు లేదుకానీ వారు చెప్పే రుక్మిణీ కల్యాణం హరికథకు రోజూ వెళ్ళి ముందు వరుసలో కూర్చొని గడ్డం క్రింద చెయ్యి పెట్టుకొని శ్రద్ధగా వినేవాళ్ళం. అలాగే మాకు నచ్చిన పద్యాలను ఆయనచేత ఒక తెల్లకాగితం మీద వ్రాయించుకొని ఊరు బయటుండే పెద్ద రావిచెట్టు మీదెక్కి వచ్చేదాకా రాగాలు తీసేవాళ్ళం :-)
ఈ చనువుతో పాపం ఆయన నిజమేననుకొని ఒక మంచిరోజు చెప్పారు :-). ఇక నేను తాళి ఎలా సంపాయించాలి? బంగారం అంటే దొంగతనం చేయ్యాలి కదా ! హబ్బే అప్పటికి ఎదో ఇంట్లో అగ్గిపెట్టెలు తప్ప ఇలా విలువైనవి కాజేసేటంత సీనులేదు. అదీకాక మనం ఏపని చేసినా ఎలా కనిపెట్టేస్తారో గానీ ఇంట్లో వెంటనే తెలిసిపోయేది. అప్పుడే డిసైడ్ అయిపొయ్యా..నేను పెద్దాయ్యాక నా పిల్లోల్లకు ఏది అడిగితే అది కొనిచ్చేయాలని :-)
అద్దో అలా చించి చించి, ఒక చిల్లపెంకు తో తాళి తయారు చెయ్యడానికి నిర్ణయించుకొన్నాను. ఒక మోస్తారు చిల్లపెంకు సంపాయించి. ముందుగా ఒక చీలతో దానికి అతి జాగ్రత్తగా రెండు రంధ్రాలు పెట్టి చుట్టూ బాగా అరగదిద్ది గుండ్రంగా తయారు చేసి ఒక కాగితంలో చుట్టి ఇక పెళ్ళిరోజుకోసం వైటింగ్....
ఆ రోజు రానే వచ్చింది. బాబుగాడు ఇంట్లో ఒక దారపు వుండ కాజేసి , ఒక పొట్లంలో దంపుడు పసుపు తెచ్చాడు. వాడికి అప్పటికి దారాన్ని తొడల మీద పెట్టి ఎలా నెయ్యాలో రాదు. కాబట్టి ఆ పనీ నేనే చేసి ఆ దారానికి "చిల్లపెంకు తాళి బొట్టు" దూర్చి సిద్ధం చేసాము. ఇంతకుముందు మేము రాముడికి గుడికట్టిన బావి దగ్గర నుంచి కొద్దిగా నీళ్ళుతెచ్చి "పసుపు" ఆ నీళ్ళలో వేసి పేనిన దారానికి దట్టంగా పసుపు పట్టించాము. అలా మేము ఈ పనులన్నీ చేసుకొని గ్రౌండ్ చేరేటప్పటికి మా ద్రౌపతి మాకోసం ఎదురు చూస్తూ వుంది.:-)
అంతా బాగానే వుంది కానీ మళ్ళీ మాకొక సమస్య :-) ముందు ఎవరు ఈ చిల్లపెంకు తాళిని కట్టాలని.. చూసి చూసి మా ద్రౌపతి నేనుపోతానని బెదిరించింది. ఇలా లాభం లేదనుకోని ఇద్దరం ఒకేసారి మెళ్ళో వేసేసాము.
వెయ్యడమైతే వేసాం కానీ ఇంక అప్పుడు చూడాలి మా పరిస్థితి. గుండెల్లో ఒకటే దడ. పిల్లో పిల్లోడు పుడితే ఓరిదేవుడా :-౦ ... ఆ భయానికి ముగ్గరం మూడు ప్రక్కలకు ఒకటే పరుగు. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రెండో రోజు స్కూల్ కి భయం భయంగా వెళ్ళాను. బాబు గాడు ఆబ్సెంట్. ఆ పిల్ల మాత్రం ఏమీ ఎరుగనట్టు చూస్తుంది. నాకు ఒకటే దడ. కాసేపాగి కడుపు వైపు చూడండం, హమ్మయ్య అనుకోవడం.:-) ఆ రోజునుండి ద్రౌపతి తో మాట్లాడాలంటే భయం. ఆ పిల్ల కడుపుమీద చెయ్యేసుకుంటే భయం. అబ్బా మా బాధలు ఒకటని ఏంచెప్పేదిలే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే బాబు గాడి నాన్నకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి నన్నొంటరిని చేసేసాడు.
అప్పుడు తట్టింది నాకొక ఐడియా! నేను కూడా మా బాబాయికి ఇలాగే ట్రాన్స్ఫర్ అవ్వాలని ఒక్కడినే మేము ముగ్గురము కట్టిన గుడికి వెళ్ళి దీపారాధన చేసి దండం పెట్టుకోని వచ్చాను. మరి ఆ రాముడికి ఏమి అర్థమయిందో ఏమో కానీ ఒక నెలలోపే ట్రాన్స్ఫర్ రావడం మా సొంత ఊరికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. వెళ్ళానే కానీ మళ్ళీ పిల్లో పిల్లోడో పుట్టాక ద్రౌపతి అమ్మా నాన్నవాళ్ళు వచ్చి ఎక్కడ మాయింట్లో చెప్తారో అని భయం వెన్నాడుతూనే వుందేది. కానీ ఏడో తరగతిలో నాగభూషణం గాడు "ఆ టైపు" పుస్తకం నాచేత చదివించినా కూడా పిల్లలు ఎలా పుడతారో తెలియనేలేదు. :-). పదవ తరగతి సామాన్య శాస్త్రం లో పునరుత్పత్తి వ్యవస్థ చదివాక హమ్మయ్య అని గాలి పీల్చుకోగలిగాను :-)
అదండీ పెళ్ళి పిల్లలు, తాళి సినిమా... ఓ నాలుగు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు భైరవకోన చూడాలని అదే పనిగా వెళ్ళి వస్తూ అంబవరంలో ఆగి స్కూల్ ఫోటోస్ ను, ఆ గ్రౌండ్ ను, మేము గుడి కట్టిన బావిని తనివితీరా చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చాను. కానీ నాగేశ్వరి ఎక్కడవుందో తెలియలేదు. అలాగే బాబుగాడు కూడా ఇప్పటిదాకా మళ్ళీ తారస పడలేదు. :(
కేరళ - ఒక కేళీరవం, కళల మౌక్తికం..
ప్రపంచమంతా ప్రేమగా పిలిచే " గాడ్స్ ఓన్ కంట్రీ "
ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!
పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి మబ్బుల్లా, మున్నార్ టీ తోటల్లో వీచే పిల్లగాలుల్లా, జారే జలపాతాల్లా, సోయాగాల సాగర తీరాల్లా, బ్యాక్ వాటర్స్ లా, రబ్బర్ తోటల్లా, వంద శాతం అక్షరాస్యతలా..
దేవుళ్ళంతా ఆనంతపద్మనాభుడిలా, గురువాయూర్ కృష్ణుడిలా, శబరిమల మణికంఠుడిలా మాకు రక్ష.
మాది ఒక వ్యవసాయం కుటుంబం. వరి మా ఇంటి సిరి.
కాస్త డబ్బు వెనకేసి నాన్న మున్నార్ లో ఓ చిన్న 'టీ ఎస్టేట్' కొని దాని భాద్యత అన్నయ్య ఇచ్చాడు.
టూరిజంలో భాగంగా పర్యాటకులకు మా ఇంటి భోజనం పెట్టే లైసెన్స్ ఉండి ఎన్నో అవార్డ్లు తెచ్చిపెట్టాయి. ఆ విషయాలు అమ్మ వదిన చూస్తారు.
ఓణం పండుగ, బోట్ రేసులు, టూరిస్టులు మా ఇంట్లో భోజనం చేయడం ఎంతో మధురమైన క్షణాలు.
ఎంబిఎ చేసిన నేను, అందరికీ సాయంగా ఉంటూ ఏదైనా స్టార్టప్ స్ధాపించాలని కల.
ఓ రోజు మా భోజన మీటింగ్ లో నాన్న నా గురించి అడగడం, నా ఆలోచనలు చెబితే సరేననడంతో కాస్త కుదుటపడ్డా.. నాకైతే ఇక రంగంలో దిగాల్సిన టైమ్ వచ్చిందనిపించింది.
రెండు బెడ్ రూమ్స్ ఉండే హౌస్ బోట్ ప్రాజెక్ట్ అనుకున్నాను. ఇంట్లో ఓకే అనడంతో పని మొదలుపెట్టాను.
నేను లంచం ఇవ్వకపోవడంతో పర్యాటక విభాగంలో నా ప్రాజెక్ట్ ఫైల్ బ్యాంక్ లోన్ కోసం ఆమోదం ఆలస్యం అయితే విజిలెన్స్ కమిషనర్కు నేను రాసిన లేఖ పని చేసి పెట్టింది. బోటును షూరిటీగా పెట్టి లోన్ తీసుకునే స్కీంతో కొత్త బోటు తీసుకున్నాను.
అలెప్పిలో నా ఆరు నెలల టూరిజం ట్రైనింగ్ అయ్యాక నాన్న అన్న మాటలు " నీ ప్రొఫెషన్ లో నమ్మకమే పెట్టుబడి. అది నిలబెట్టాలి అంటే లాభ నష్టాలు ఒక్కో క్షణాన మర్చిపోవాలి అని "
హౌస్ బోట్ నీళ్ళ మీద రిసార్ట్ లాంటిది, సదుపాయాల కొదవే లేదు. ఏసి బెడ్రూంలు, హాల్, కిచన్, పై ఫ్లోర్ లో డైనింగ్ పర్యాటకులను ఆకర్షిస్తాయి. 24గంటల పాటు వాళ్ళే యజమానులు.
నా బోట్లో ముగ్జురు ఉద్యోగులు. ఒక కుక్, బోట్ కీపర్, బోట్ క్యాప్టెన్. ఒక్కరోజు ప్యాకేజీలో లంచ్, డిన్నర్, ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఉంటాయి. ప్రతిరోజూ ట్రిప్ వివరాలు ముందే మాకు అందుతాయి.
వెంబనాడ్ సరస్సు కేరళలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది మా జీవనోపాధి. పర్యాటక రంగానికి ఆయువుపట్టు. వరి, చేపల ద్వారా జీవనోపాధిని అందిస్తుంది. నది ఒడ్డున ఉన్నవారికి ప్రధాన రవాణా సొంత బోట్లే.
ఇక ముందు రోజు వేసిన టెండర్లు తెల్లారే తెరిచే ప్రోగ్రాం ఉండడంతో బోట్లన్నీ ఆపేశారు. నాకు చాలా ముఖ్యమైన రోజది. చుట్టూతా చాలా హడావిడి. దాదాపు అయిదొందల బోట్ల కొత్త పర్మిట్ కావడంతో కాస్త రాజకీయ వేడి కూడా తగులుతోంది. అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతోంది.
టూరిజం అధికారులు, లేక్ పోలీస్ బృందాలు కలిసీ పడవ నాణ్యత, ఫిట్ నెస్, సౌకర్యాల తనిఖీలు చేస్తున్నారు.
టెండర్లు కొందరికి దక్కితే కొంతమందికి రాలేదు. నా బోటు ఓకే చేసి పర్మిట్ ఇచ్చారు. ఇక రెండేళ్లు భయం లేదు. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పేశా, రాత్రి బోట్లో ఉంటా అని.. ఎందుకో బోట్లో సరస్సంతా తిరగాలనిపించింది.
టెండర్ రాని వాళ్లలో ఎవరో ఎమ్మెల్యే, నా పర్మిట్ ఇవ్వాలని బలవంతంగా బెదిరించేలా వేడుకున్నా నేనివ్వలేదు. నేను కొత్త కదా అని నన్నడిగాడేమో!!
కలెక్టర్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి నన్ను ప్రోత్సహించాడు.
ఆ రోజు బోట్ మొత్తం ఇద్దరి పేర్ల మీద ఉంది. వీళ్ళిద్దరి కోసం చూస్తుంటే వాళ్లకు తోడుగా వచ్చిన ఓ ముగ్గురు సెండాఫ్ ఇస్తే బోటు మాతో, వాళ్ళిద్దరితో కలిపి బయలుదేరింది.
వెల్ కమ్ డ్రింక్ సర్వ్ చేసి వాళ్ళను పరిచయం చేసుకుని టూర్ గైడ్ అయిపోయా.
వినయ్, అంజలి కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ ట్రిప్ అది. కేరళ కాస్త తిరిగి రేపు రాత్రి కొచ్చిన్ టు ఢిల్లీ ఫ్లైట్లో వెళ్ళిపోతారు. కేరళలో మా హౌస్ బోట్ వారి చివరి మజిలీ..
ఈ మద్య కాలంలో మా అతిథులతో ప్రయాణించింది చాలా అరుదు. ఒడ్డున నిలబడి సెండాఫ్ ఇవ్వడం, వచ్చాక రిసీవ్ చేయడమే నా పనిగా ఉండేది. కొత్త జంట కావడంతో నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నా..
మాతో పాటు వెంబనాడ్ అలలపై తేలుతున్న ఓ రెండొందల బోట్లని చూసి వారు మైమరచిపోయారు. అటూ ఇటూ కనపడే వరి పైరు, పక్కనే ఇళ్ళు, సరస్సులో చేపలు, వాటి కోసమొచ్చే కొంగలు, అవన్నీ చూడ్డానికే అన్నట్టు బరువుగా ముందుకెళుతున్న మా బోటు, ఒక్కో కవికి ఒక్కో ఊహకందని వర్ణనాచిత్రం.
మధ్యాన్న భోజనంలో ప్రపంచం మెచ్చే "కేరళ సద్య" లో అన్ని రకాల వంటలను ఆస్వాదిస్తూ తృప్తిగా భోంచేశారు. సాయంత్రానికి మా బోటు ఒడ్డు చేరింది.
బోట్ ఆసిస్టెంటుకు కావలసినవి చెప్పి ఊళ్ళోకి పంపితే అరగంటలో అన్నీ తెచ్చేసి బోటు కిచన్లో ముగ్గురూ బిజీ అయ్యారు.
రాత్రి భోజనానికి మా రూఫ్ టాప్ డైనింగ్ రూమ్ క్యాండిల్ లైట్ డిన్నర్ తో స్వాగతం పలికింది. కేరళ సీఫుడ్, పరోటా, తలశేరి స్టైల్ బిరియాని, ఇతర రుచులతో కేరళ వాళ్ళని హక్కున చేర్చేసుకుంది.
టెన్షన్ తో మొదలైన ఆ రోజు ప్రశాంతంగా ముగిసింది.
తెలిమంచు కరుగుతూ తెలవారుతోంది. పక్షుల కిల కిల రావాల మద్య వెంబనాడ్ మేల్కొంటోంది
తెల్లవారుజామున సమయంలో కుమరకం రిసార్ట్ నది ఒడ్డు గందరగోళంగా ఉంది అని ఫోన్.
నిద్రపోతున్న కొత్తజంటను, కిచెన్ లో మా వాళ్ళను డిస్ట్రబ్ చేయక బోట్ డెక్ మీద నిశ్శబ్దంగా కూర్చున్న నన్ను కాసేపటికి వాళ్ళ చేతిలో స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీతో విష్ చేశారు.
కాసేపు తరువాత బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, ఆప్పం, పైనాపిల్ సర్వే చేశాం.
అసలేం జరిగిందంటే.. నిన్న వినయ్, అంజలి ఉన్న రిసార్ట్లో అదే ఎమ్మెల్యే తన వాళ్ళతో బోట్ల టెండర్ల గురించి వచ్చాడు. టెండర్లు గెలిచిన వాళ్ళతో కలిసో బెదిరించో సిండికేట్ కావాలని ప్లాన్.
అదే రిసార్ట్లో ఉన్న వీళ్ళతో ఎమ్మెల్యే మనిషి ఒకడు అసభ్యంగా మాట్లాడితే అంజలి వాడి చెంప వాచేలా కొట్టింది. వెంటనే హోటల్ మేనేజర్, సెక్యూరిటీతో కలిసి వాళ్ళని సురక్షితంగా మా బోటు చేరుకునేలా చూశారు.
ఇప్పుడా మనుషులు మా బోటు కోసం చూస్తున్నారు.
వాళ్ళు తినేశాక లగేజ్ సర్దుకుంటుంటే అన్నయ్యకు ఫోన్ చేసి విషయం వివరించా. ఓ పది నిమిషాల్లో మూడు బొట్లలో ఒక పన్నెండు మంది మా బోటుకు సెక్యూరిటీ అయ్యారు. అందరూ మాకు తెలిసినవారే..
సంక్షోభ నివారణలో నేర్చుకున్న మొదటి పర్వం, ఇక ముందెన్ని చూడాలో!!
కుమరకం చేరగానే నది ఒడ్డున ఉన్న వాళ్ళూ, అప్పటికే అక్కడికి చేరుకున్న టూరిజం, మున్సిపల్, పోలీసు అధికారులను చూసి అన్నయ్య జిల్లా కలెక్టరుగారితో మాట్లాడాడని తెలుస్తోంది.
ఆ ఎమ్మెల్యే మనుషులు వెనక్కి తగ్గడంతో సమస్య తీరినట్టైంది.. కానీ ఇద్దరూ చాలా భయపడ్డారు. ఊరు గాని ఊరాయె!!
తోడుగా నేనున్నాను కదరా అని అన్నయ్య అన్నట్టు అనిపించింది.
భద్రత, రక్షణ ఇవ్వడానికి, నిబద్ధతతో మన రాష్ట్ర పరువు దిగజారకుండా అందరం చేసిన కృషి సంతృప్తినిచ్చింది.
సాటి మనిషికి గౌరవం ఇవ్వలేని ఈ మూర్ఖులకు తమ స్థానాన్ని చూపించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతాను. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చే పర్యాటకులను ఇబ్బంది పెట్టకుండా స్థానిక సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలి.
నిన్న ఇబ్బందుల్లో ఉన్నది మీరేనా అని ఇద్దరినీ అడిగితే ఆశ్చర్యపోయారు. తర్వాత విషయం తెలుసుకుని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదంతా ఎందుకు చేయాలంటే ఇది మా రోజువారీ కష్టం. నేను సర్వీస్ తో హృదయాలను గెలవాలి, వారు గడిపిన ప్రతి క్షణం వారు ఖర్చు చేసే ప్రతీ పైసా మా సేవలతో సంతృప్తి చెందాలి.
కానుకగా రవివర్మ పెయింటింగ్ ఇచ్చాక, కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ వరకూ రెండు కార్లు తోడుగా వెళ్లి ఇద్దరినీ డ్రాప్ చేశాయి.
మొత్తం సంఘటనలో నేను ఎంత డబ్బును కోల్పోయానో కూడా చూడలేదు,
కాని నేను, మేము, మొత్తం రాష్ట్రం మా లాభాన్ని విశ్వసనీయతతో చాటుకున్నాము.
ఇల్లు చేరాక అందరూ నన్ను, అన్నయ్యను ప్రశంసించారు. అందరి భోజనాల మద్య నాన్న నవ్వుతూ.. "ఒకడు మార్గం చూపిస్తే ఇంకోకడు దాన్ని సుగమం చేశాడన్నాడు".
ఇక బెడ్రూంలో నిద్ర మెల్లగా పిలుస్తోంది, ఇంతలో ఫోన్ మోగింది. ఢిల్లీ క్షేమంగా చేరాం అని.. అవతల వినయ్. అది చాలు నాకు.. ఏదో చెబుతున్నాడు కానీ నిద్రకు కళ్ళు మూసుకుపోతున్నాయి..
రేపటి పర్యాటకులను సంతోషంగా ఆలింగనం చేసుకోడానికి వెంబనాడ్ నిశ్శబ్దంగా వేచి ఉంది.
"చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు"
ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు రాత్రి, పక్కరోజు వినాయక చవితి అవటం తో,
డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకొని, సాయంత్రం నాలుగప్పుడు ఇంటికి చేరుకున్నా, వళ్ళంతా నొప్పులు , పులిసిపొయ్యినట్టుంది ఎడ తెగని తిరుగుళ్ల వల్ల.
కాస్త నడుము వాలుద్దామని ఇంటికొచ్చా, లేక పోతే వంట వాళ్ళ దగ్గరే సరిపోయుండేది నాకు ఆ సాయంత్రమంతా.
అంత అలసట లో కూడా, నాకు పెళ్లి చూపులు అంటే ఎదో తెలియని ఉత్సుకత, ఉత్సాహం. అమ్మాయి ఫోటో ఉందా, నా ఫోటో అమ్మాయి చూసిందా అనే జ్ఞానం కూడా లేదు మరి. ముంజేతి కంకణానికి అద్దం ఏల అన్నట్టు.
"సరే నాన్న, ఒక గంట నడుము వాలుస్తా, ఐదున్నర పైన బయల్దేరి వెళ్తాము" అన్నా.
అలా ఆరుగంటలకు వాళ్ళ ఇల్లు చేరుకున్నాము, సదరు అమ్మాయి వాళ్ళ అక్క గారింటికి, పెళ్లి చూపుల బాధ్యత ఆవిడ తీసుకోవటం తో.
మేము వెళ్లే సరికి, వాళ్ళ తరపున కొందరు పెద్ద మనుషులు, అమ్మాయి తాత గారు కూర్చొని వున్నారు హాల్లో
వాళ్ళ అక్క పిల్లలు అనుకుంటా, ఒక రెండేళ్ల పాపా ఒక నాలుగేళ్ళ బాబూ అక్కడ వేసిన కుర్చీలు, టేబుళ్ల మధ్య పరిగెడుతూ ఆడుకుంటున్నారు.
వాళ్ళ ఆటలు గమనిస్తూ, వాళ్ళని దగ్గరకి రమ్మంటూ బతిమాలుకుంటూ, పెద్ద వాళ్ళు అడిగే చదువు, ఉద్యోగం, ఉద్యోగం వెలగబెట్టే ఊరి గురించి ప్రశ్నలు కొన్నిటికి మనస్కం గాను కొన్నిటికి అన్యమనస్కం గాను సమాధానాలు ఇస్తూ వున్నా.
ఈ లోపల కొన్ని బిస్కట్స్ , తాగడానికి కొబ్బరి నీళ్లు వచ్చాయి.
"బానేవుంది ఈ కొబ్బరి నీళ్ల ఏర్పాటు, రొటీన్ గా ఇచ్చే టీలు కాఫీలు కాకుండా " అనుకుంటుండంగానే, అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటా, "కొబ్బిరి నీళ్లు తీసుకో నాయన! అవి మన ఊరి నుండి వచ్చినవే", అంటూ పలకరించేశారు.
ఈ లోపల, నా చేతుల్లోని ఆడుకుంటున్న, ఆ రెండేళ్ల బుడ్డది, గబుక్కున దూకి, అక్కడే మా మధ్యన వున్న టేబుల్ మీద నున్న, ఓ క్రీం బిస్కట్ ను రెండు చక్రాలు గా విడ గొట్టి, వాటి మధ్యన వున్న క్రీం నాలుక పెట్టి నాక్కొని, ఆ చక్రాలు నా చేతిలో పెట్టి, "నువ్వు తిను బాబాయ్", అనేసింది.
ఆ బుడ్డ దానికి మాటలకు చేతలకు, అప్పటికే మైమరిచిపోయి వున్న నేను ఏమాత్రం సందేహించకుండా వాటిల్ని తినేసాను.
ఆ లోపల అమ్మాయిని తీసుకొని వచ్చి కూర్చోపెట్టారు. చిన్న పాప తో ఆడుకుంటూనే , అమ్మాయిని గమనించడం మొదలు పెట్టాను. తాను బహు పొడగరి, బాగా కళగా వుంది అమ్మాయి, ఇదిగాక ఆమె కళ్ళల్లో ప్రశాంతత, సౌమ్యత నాకు చాలా ప్రత్యేక మనిపించింది.
ఎప్పుడు మా ఎక్సప్రెస్ పెళ్లి చూపులు ముగిసాయి కూడా నాకు తెలియదు.
లేచి వాళ్ళ ఇంటి ముందున్న ఆరు బయల్లో నిలబడ్డాము.
వాళ్ళ తాత గారు, దగ్గర కొచ్చారు, "అబ్బయ్య! నా మనవరాలు అని చెప్పుకోవటం కాదు కానీ, బాగా మెతకయ్యా! అందుకే ఓ మంచి అయ్య చేతిలో పెట్టాలని ఈ వయస్సులో నా తాపత్రయం నువ్వు నాకైతే నచ్చావయ్యా! అమ్మాయి గురుంచి ఏమంటావు" అంటూ.
"మీ మనవరాలుకేమి తాతా ! వంకలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికైనా నచ్చుతుంది"
"నీకు నచ్చిందా! అయ్యా" అన్నారాయన.
"అదే కదా తాతా నేను కూడా చెప్పేది" అన్నా నేను, డొంకతిరుగుడు గా. వెంటనే నచ్చేసింది అని చెప్పొచ్చో లేదో అన్న సందేహంతో.
"నేను ఉదయం, అమ్మాయి వాళ్ళ అన్నయ్యని, మీ అన్న పెళ్ళికి పంపిచ్చానయ్యా ! నిన్ను చూసి ఎలా వున్నావో వచ్చి చెప్పమని".
"..."
"పిల్లగాడు బాగున్నాడు. కాక పోతే మన అమ్మాయికి పొట్టి అవుతాడు అన్నాడయ్యా."
"..."
"కానీ నేను నా కళ్ళతో చూసిన దాకా నమ్మను. అందుకే ఈ ఏర్పాట్లు. మా అమ్మాయికన్నా నువ్వే రెండు అంగుళాలు హెచ్చు గున్నావు" అంటూ నవ్వారు ఆయన.
"మా అన్న పెళ్లి గురించి వీళ్లకు ఎలా తెలిసిందబ్బా " అనుకుంటున్న నాకు,
ఆయనే, అక్కడ వున్న ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తూ, "ఇదిగోనయ్యా ఈయన మా బంధువు, ఇప్పుడు మీ అన్నకి బంధువు, మీ వదిన తరపున" అంటూ నా సందేహాన్ని తీర్చేసాడు.
"సరే వెళ్లొస్తాం తాతా!", అని ఆయన దగ్గర సెలవు తీసుకొని మా ఇంటికి బయలుదేరాము, హడావుడిగా, మా అన్న రిసెప్షన్ టైం దగ్గర పడటం తో.
ఆ తర్వాత మా అన్న పెళ్లి ఆ తదుపరి కార్యక్రమాల హడావుడి తగ్గటం తో, మా వాళ్లంతా కలిసి నిశ్చయించేశారు, అందరు ఆ అమ్మాయిని చూసేసి, నాకు తగ్గ అమ్మాయి కాదో నిర్ణయించెయ్యాలని.
నాకు కనపడ్డ అమ్మాయిల్లా నచ్చేస్తుంది అని మా వాళ్ళ అభిప్రాయం.
తీరిగ్గా ఒక రోజు సాయంత్రం ఒక పటాలం వెళ్లి నట్టు వెళ్లి వాళ్ళ ఇంటి మీద పడిపోయారు. ఆ వెళ్లిన పటాలం లో ఏ లేడీ ఇన్స్పెక్టర్ కంటికి ఆ అమ్మాయి అనలేదు. మనోడు బాబు మోహన్ అయినా అవతల అమ్మాయి ఐశ్వర్య రాయ్ కావాలనే బ్యాచ్ అక్కడికి వెళ్ళింది.
మొహాలు వేలాడేసుకొని వచ్చారు ఇంటికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే నా మీద నిరసన వ్రత దీక్ష పట్టారు.
మా అమ్మ, మా అక్క అయితే ససేమిరా అంటే ససేమిరా అన్నారు.
నేను కూడా వాళ్ళ మాట విన్నంత సేపు విని, ఆ తరువాత మీరుఏవన్నా చెప్పండి, చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అనే వాడిని.
మధ్యవర్తితో చెప్పి పంపిచ్చారు మా వాళ్ళు , ఏమీ అనుకోవొద్దు, మా అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చెయ్యట్లేదు , మీ అమ్మాయికి వేరే సంబంధాలు చూసుకోండి అని.
ఆలా చెప్పి పంపిన పక్క రోజు, నేను పెళ్లి చూపుల్లో కలిసిన తాత వచ్చారు మా ఇంటికి. ఇంకా మా ఇల్లంతా బంధువులతో సందడి గానే వుంది.
ఆ మాట ఈ మాట మాట్లాడారు తాత గారు, వెళ్తూ వెళ్తూ, మా వాళ్ళతో -
"మీ ఇల్లు చూసాను, బంధు బలగం చూసాను, నా మనవరాలు మీ ఇంట్లో బాగుంటుంది అని గట్టి నమ్మకం వచ్చేసింది నాకు. అయినా మీ అబ్బాయికి నచ్చినప్పుడు, ఇక అభ్యంతర మెందుకు" అన్నారు.
మా వాళ్ళు కూడా , "ఎందుకులే తాతా! మీ అమ్మాయికి మంచి సంబంధమే దొరుకుతుంది" అని ఆయనకి సర్ది చెప్పి పంపారు.
అదే రోజు రాత్రి! మా అక్క కూతురు, రెండు నెలల పాప, ఆకారణం గా ఏడుపుకెత్తుకున్నది. ఎవరు ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. కొన్ని గంటల తర్వాత కానీ మామూలు కాలేదు.
మా అక్క భయపడి పోయింది ఆ రోజు, తాను ఒక ఆడ పిల్లని వద్దు అని చెప్పినందుకు, ఇలా జరిగింది అని నమ్మేసింది. తర్వాత రోజు ఉదయం తను నా పక్షం లో చేరిపోయింది.
ఇప్పుడు నా పక్షాన, నాతో పాటు పెళ్లి చూపులకు వచ్చిన మా పెద్దమ్మ కూతురు, ఆవిడ భర్త, మా అక్క.
త్రాసు కొంచెం నా వైపే తూగుతూ వుంది.
అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటిలో తాత గారు నా గురించే పట్టుబట్టడంతో,
"వాళ్ళు వద్దు మొర్రో అంటున్నా మనకేమన్న గతి లేకనా వాళ్ళ వెంట పడటం" అనిఆయన మీద యుద్ధాలు జరిగాయి.
అమ్మాయి సహితం గా గుడికి గూడా వెళ్లి, వాళ్ళు టెంకాయ కూడా కొట్టేసుకున్నారు, "హమ్మయ్య వీళ్ళ సంబంధం తప్పి పోయింది" అని
ఇక నా ప్రయాణం రెండు రోజులే నేను పెట్టిన సెలవుల అనంతరం ఉద్యోగం లో చేరడానికి.
ప్రయాణం రేపు అనగా, సాయంత్రం నాలుగప్పుడు, మేము అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము మా ఇంట్లో, మా ఇంటి ముందు ఓ అంబాసిడర్ కారు ఆగింది, అందులోంచి తాత , ఆయన అన్న గారు, ఆయన తమ్ముడు గారు దిగారు.
వాళ్ళ కారు డ్రైవ్ చేసుకొని వచ్చిన అమ్మాయి అన్న మటుకు , కారులో వీళ్ళని దించి మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా చక్క బోయాడు.
వీళ్ళు వచ్చారు లోపలకి త్రిమూర్తులు లాగా. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడారు -
"ముగ్గురం పెద్ద వాళ్ళం వచ్చాము, మేము వచ్చామన్న గౌరవం తో మీరు పునరాలోచించు కుంటారని అనుకుంటున్నాము" అంటూ బయల్దేరారు.
అంతే ఆ మాట మా వాళ్ళను చాలా సూటిగా తాకింది!
నవ్వుతూ నడిచారు ఆ ముగ్గురు, మా ఇంటి బయటకి, మా వాళ్ళ సమాధానమేదో వాళ్లకి ముందే తెలిసినట్టు.
ఆ తర్వాత తెల్సింది, అమ్మాయి వాళ్ళకీ తెలుసట, "ఈ ముసలి త్రయం కలిసి వెళ్లిన పనేదీ ఇప్పటి వరకూ జరగ కుండా పోలేదని"
మా పెళ్లి అయిన ఓ సంవత్సరం తర్వాత. తాతను అడిగా, "ఎందుకు అంత పట్టు పట్టావు, ఇంకెవరూ దొరకరన్నట్టు, అనుకున్నది సాధించుకునే దాకా పట్టు విడుపులు లేవా మీకు" అని
"హర్షయ్య! నీకేనా నా మనవరాలి మొహం లో ప్రశాంతత కనిపించింది, నీ మొహం చూస్తే నాకు ఏమీ కనపడదా ఏందీ? నా మనవరాలు ఎక్కడ నిశ్చింతగా ఉంటుందో! అరచేతుల్లో పెట్టి పెంచుకున్నానయ్యా పిల్లని " అన్నాడాయన.
"నా విషయం లో మీ అంచనా నిజమో కాదో నాకు తెలియదు, కానీ మీ అమ్మాయి విషయం లో నా అంచనా నిజమే" అన్నా గర్వం గా.
"ఈ మాట ఓ మూడేళ్లు ఆగాక కూడా అను, అప్పుడు ఏకీభవిస్తా నీ మాటతో నేను" అంటూ నవ్వేశాడాయన బోసి నోటితో.
నిజమే, పెళ్ళికి ముందర జరిగిన ఘట్టాలు, అపోహలతో, ఇరు పక్షాలకీ మూడేళ్ళకి పైగా పట్టింది ఒకరి మీద ఒకరికి నమ్మకాలు కుదరటానికి.
దాని తర్వాత ఆ అమ్మాయి మా ఇంట్లో అందరికీ ఫేవరేట్ అయిపోయింది, అత్తా మామలకి, నలుగురాడబడుచులకి, ముగ్గురు తోడి కోడళ్ళకి, సకల బంధు జనాలకి.
ఆ అమ్మాయి మొహం లో అదే ప్రశాంతత ఇప్పటికీ , కష్ట మొచ్చినా, నష్ట మొచ్చినా.
ఓ ఐదేళ్ల క్రితం శ్వాస కష్ట మవటం తో హాస్పిటల్ లో చేరాడు తాత. అందరం నెల్లూరు చేరాము. ఎందుకో నన్నే ముందు వెళ్ల మన్నారు ఐ.సి.యూ కి ఆయన కి స్పృహ రావటం తో.
కళ్ళు తెరిచి నా చెయ్యి పట్టుకున్నాడాయన, బోసి నోటితో ఓ నవ్వు నవ్వాడు.
నా తర్వాత వెళ్లిన ఆయన ఆయన మనవడు, మనవ రాళ్లు, ముని మనవరాళ్లకు, ఆయన కళ్ళు తెరవటం కనపడలా, ఆ బోసి నవ్వు కనపడలా.
చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు. ఆ ఊళ్ళో మనకు ఎవరూ పరిచయం లేరే అనుకుని వచ్చిన అడ్రస్ చూస్తే నా పేరు మీద కరెక్టుగానే ఉంది.
ఎవరబ్బా అనుకుంటూ జాగ్రత్తగా టేపులన్నీ దాటి కవర్ మెల్లగా తెరిస్తే లోపల ఒక ఫోటోలో బాటు ఏదో లెటర్ ఉంది. ఫోటోలో ఓ అమ్మాయి!! మస్తిష్కంలో ఏవేవో ఆలోచనలు. అలా చూస్తూ ఉండాలనిపించే అందం నన్ను ఓ తెలియని ఏకాంతానికి తీసుకెళ్ళింది.
ఇంతలో పక్కనే ఉన్న రెడ్డినాయుడు 'ఏందియ్యో' కధ అంటూ వాడి చిత్తూరి మాండలికం మొదలుపెట్టి నే చెప్పేలోపే ముందు ఉత్తరం 'సదూవన్నా' అంటూ నన్నొదల్లేదు.
లెటర్ మంచి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీషులో రాసుంది.
ప్రస్తావన వాళ్ళమ్మాయి పెళ్లిచూపులు.
రెండు కుటుంబాలకు తెలిసిన వ్యక్తి పేరు చెబుతూ అమ్మాయి ఫోటోతో పాటు జాతకం పంపారు. అందులోని గళ్ళు నాకేం అర్థం కాలేదు.
వెంటనే అమ్మకో ఫోన్ కొట్టి విషయం చెబితే అప్పుడే పంపించేశారా అంటూ చిన్ని నవ్వుతో నువ్వు ఎప్పుడు ఖాళీ అంటూ అడిగింది. దేనికి అన్నా చేతిలో ఫోటో తదేకంగా చూస్తూ!! అదేంటి.. మరి మదనపల్లె వెళ్ళాలి కదా అంది. సరే సరే నేను రేపు చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆ ఫోటో లోకంలో మునిగిపోయా..
అమ్మాయి పేరు మధుర ప్రణవి. ఓ ప్రణవ నాదంలా పేరులో ఏదో తెలియని కొత్తదనం. పుట్టిన తేదీ చూస్తే మూడు సంవత్సరాలు చిన్న. వెంటనే నా ఆలోచన "జ్యోతిష్కురాలు లిండా గుడ్ మాన్స్ సన్ సైన్స్" బుక్కు మీద పడిండి.
అది మన పుట్టిన రోజు ప్రకారం వచ్చే ఇంగ్షీషు రాశుల గురించి ఆమె రాసిన ప్రఖ్యాత గ్రంధం. ఫోన్ లో ఆ బుక్కు ఓపెన్ చేసి మా ఇద్దరి ఇంగ్షీషు పుట్టిన రోజుల ప్రకారం కుదిరే గుణాల గురించి చదివేయడం, బుక్కులో చెప్పిన పాజిటివిటీయో ఏమో మెల్లగా ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడ్డం మొదలైంది. అమ్మాయి అందంగా ఉంది. ఫోటోలో ఇలా ఉందంటే ఎదురుగా చూడాలనిపించే ఒక తెలియని ఆత్రుత, ఉత్సాహం, నవ్వు నా గురించి నాకు తెలిసిన నా మొహం మీద తెలుస్తోంది.
అన్నో ఏంది.. తెగ 'నౌతాన్నావ్' అక్కడ ప్రొడక్షన్ లో సాండల్ ఆయిల్ అయిపోతోంది.. హెడ్ అఫీసుకు ఫోను కొట్టు అని మా చిత్తూరు నాయుడు అంటూంటే వాడి జిల్లాకే అల్లుడైనంత ఆవేశం నాకు ఆ రాత్రి నిద్ర లేకుండా చేసింది.
ఫోన్ మోగుతున్న శబ్దం ఆ తెల్లవారి నా నిద్రను డిస్టర్బ్ చేస్తూ నన్ను లేపింది. చూస్తే అమ్మ.. ఫోన్ ఎత్తడంతోనే 'ఏంట్రా రాత్రి సరిగా నిద్ర పోలేదా' అంటూ అదే చిన్ని నవ్వు.
అసలు వీళ్ళకు ఇవన్నీ ఎలా తెలుస్తాయో ఏంటో!!
సరేలే ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేయి అంటూ నాకు ఓ బ్రేక్ ఇచ్చింది. నేను రెడ్డి నాయుడు ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా కోలీగ్స్ అన్నమాట.
అసలు మీకు మా గురించి చెప్పనే లేదు కదా.. మీకు మైసూర్ సాండల్ సోపులు తెలుసుగా.. బెంగుళూరులోని ఆ ఫ్యాక్టరీ లో నేను అసిస్టెంట్ మేనేజర్ గా నాయుడు నా కింద సీనియర్ ప్రాడక్ట్ ఇంజనీర్ గా పని చేస్తూ కలిసే ఉంటాం. అమ్మ మైసూరులో ఉంటుంది.
నాన్నే లేరు!!
మేం తెలుగు వాళ్ళే అయినా తాతల కాలం నుండి వొడెయార్ మహారాజా వారి సంస్థానంలో సేద తీరాం. మీ అందరికి తెలుసు కదా దసరా ఉత్సవాలకు మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుందో.. క్లుప్తంగా చెప్పాలంటే
మా దేవత చాముండి, మా తియ్యదనం మైసూర్ పాక్, మా దోశె మైసూర్ మైలారి, మా నీరు కావేరి. మా శుభ్రత మైసూర్..
అప్పటికే నాయుడు లేచిపోయి వంటింట్లో ఏవో శబ్దాలు చేస్తున్నాడు . ఏంటదీ అని అడిగేలోపు చేతిలో కాఫీతో గూడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేశాడు. నాయుడు ఏ విషయమైన నవ్వుతూనే మాట్లాడుతాడు..అది ఒక అదృష్టం. ఇద్దరూ వంటలు చేసేస్తాం కానీ ఆ వంటల్లో మా మద్య కత్తులు నూరుకునేంత వివాదం ఒకటుంది. అదే "ఉబాసం" ( ఉప్మా బాధితుల సంఘం ), "ఉప్రేసం" ( ఉప్మా ప్రేమికుల సంఘం ) పదాలు. నేను మొదటి దాని ప్రెసిడెంటు అయితే వాడు రెండో సంఘానికి. ఇది తెగని గొడవ.
నా ఖర్మ కు ఆ రోజు టిఫిను ఉప్మానే. నాయుడు ఆ కాంక్రీటు చాలా ప్రేమతో చేసి నన్ను చూస్తూ కన్ను కొట్టాడు. నాకు అది చూస్తే పరమ చిరాకు. ఏవో నాలుగు స్పూన్లు లోపలికి తోసి అమ్మకు ఫోన్ చేశా..
ఉభయకుశలోపరి అయ్యాక అమ్మ అసలు విషయం చెప్పింది. ఫలానా వారి బంధువులట. నేను ఫోటో చూసా.. నీకు నచ్చితే వెళ్ళి అమ్మాయిని చూసి రావొచ్చు అంది.
ఎప్పుడు వెళ్ళాలి అన్నా. శుక్రవారం రోజు బాగుంది రా నీకు వీలౌతుందా! లీవ్ పెటాలేమో కదా లేకపోతే ఇంకో రోజుకు మారుద్దామా..
వాళ్ళకి చెప్పాలి కదా అంది.
ఏదో ఆలోచిస్తుంటే నాకైతే శుక్రవారమే బాగుంది ఇక నీ ఇష్టం.. సాయంత్రం లోపు ఫోన్ చెయ్యి, నాయుణ్ణి అడిగానని చెప్పు ఉంటా అని ఫోన్ పెట్టేసింది. పక్కనే ఉన్న నాయుడికి విషయం చెబితే.. ఓస్ ఇంతే కదా రత్నం సార్ ని ఆడగన్నా అన్నాడు.
రత్నం సార్ నాకు బాసు కానీ అలా ఎప్పుడూ ఉండడు. ఫాక్టరీకి ఆయనే నిండుగుండె. మేమిద్దరం వాళ్ళింట్లో చాలాసార్లు మొహమాటం లేకుండా భోజనాలు కూడా చేసేవాళ్ళం. ఇల్లు దగ్గిరే కదా అని నడిచి వెళ్ళా.. అక్కడ ఇంకో రౌండు కాఫీ అయ్యాక విషయం చెబితే లీవుతో పాటు కారు కూడా ఇచ్చాడు మదనపల్లెకు వెళ్ళడానికి.. అమ్మకు ఫోన్ చేసి చెప్పడంతో సంతోషించింది. ఇక మదవపల్లె వెళ్లాడమే తరువాయి.
ఆ నాలుగు రోజులు ఎలా గడిచాయో అస్సలు తెలిసి రాలేదు. ఏదో తెలియని ఓ కొత్త అసహనం, మద్యలో నాయుడి నవ్వులు. మొదటిసారి సెళ్ళిచూపుల ప్రభావం అని క్లియర్ గా తెలుస్తోంది.
అమ్మ గురువారం తెల్లారే బయలుదేరి మా ఊళ్ళోనే ఉండే మామయ్య ఇల్లు చేరింది. అమ్మ ఇద్దరి తమ్ముళ్ళూ ఇక్కడే ఉన్నా నాకు స్వతంత్రంగా ఉండడమే ఇష్టం.
సాయంత్రం రత్నం గారి కారు తెచ్చేసి అమ్మకు ఫోన్ చేశాను. మనతో పాటు మావయ్యలు, పెద్దోడి పిల్లలు కూడా వస్తారట అంది.
మదనపల్లెకు ఆరుగురా!! చిరాగ్గా ఇంతమంది ఎందుకు అని అంటే అమ్మ సైలెంట్ అయింది. నాకు తమ్ముళ్ళే పెద్ద దిక్కు అన్నట్టుంది ఆ నిశబ్దత. నేనే కలగజేసుకుని సరే పొద్దున్నే ఆరుకే వస్తాను. మూడు గంటల ప్రయాణం, పెద మావయ్యను మద్యలో పికప్ చేద్దాం అన్నా. నేను ఫోన్ చేసి చెప్తా అని అమ్మ అనడంతో ఆ రోజు అలా ముగిసింది.
కారులో స్పీడు ముల్లు వంద టచ్ చేస్తూ మదనపల్లె వైపు ఉరకలేస్తోంది. ఆరుగురితో అప్పటికే సిటీ దాటి ఓ ఇరవై కిలోమీటర్లు వచ్చాం. తెల్లవారే సూర్యుడి వెలుగును చూస్తూ అందరూ మైమరచిపోయారు. మద్యలో వచ్చే కోలార్ ఊరు ఏడున్నరకు చేరి మెడికల్ కాలేజ్ పక్కనున్న వుడీస్ రెస్టారెంట్ లో ఆపి బ్రేక్ ఫాస్ట్ కు ఇరవై నిముషాల స్టాప్ అంటూ ట్రావెల్స్ బస్సుగాడి లాగా అనేసి లోపల తినేసి తిరిగి ప్రయాణం సాగించాం. అక్కడ తింటున్నప్పుడు వాళ్ళని చాదస్తం మాటలతో విసిగించొద్దు అని నే చెప్పింది కారులో అందరూ గుర్తు చేసుకుంటూ ఇక మదనపల్లె దాకా నన్ను మంచింగ్ మొదలెట్టారు.
తొమ్మిదిన్నరకు ఆ ఊరు చేరి ఆనంద రావు గారికి ఫోన్ చేసి వాళ్ళింటికి రూట్ తెలుసుకున్నా. హార్స్లీ హిల్స్ వైపు వెళ్ళే దారిలో వాళ్ళ కాలనీ చెట్లతో చాలా అందంగా ఉంది. కరెక్టుగా ఇంటి ముందు కారాపుతుంటే అయ్యో.. పూలు పళ్ళు మర్చిపోయాం వెళ్ళి తేరా అని అమ్మ అనడంతో వాళ్ళని దింపేసి అవన్నీ తెచ్చా.
లోపలికి వస్తుంటే ఒక పెద్దాయన నమస్కారం పెట్టి రండి అని తీసుకెళ్ళారు. అప్పటికే మావాళ్లు ఏవో జోకులు కూడా వేసుకుంటున్నారు.
నేను లోపలికి రావడంతో ఒక్కసారి సైలెన్స్. ఎవరెవరో ఉన్నారు.. రావుగారు అందరినీ పరిచయం చేస్తున్నారు ప్రతి నమస్కారం చేస్తున్నా ఏమీ అర్థం కాక అమ్మను చూశా.. కాసేపు ఆగు అని కళ్ళతో చెప్పింది. చాలా మంది నన్ను స్కాన్ చేస్తున్న ఫీలింగ్, ఇంకొన్ని గుసగుసల మద్య మధుర ప్రణవి కనిపించింది.
చాలా అందంగా ఉంది. ఫోటో తీసిన వాడిని తిట్టుకున్నా.. నేను అమ్మాయిని గమనిస్తున్న విషయం అందరికీ తెలిసిందేమో, నన్నే చూస్తున్నారు. మెల్లగా కాస్త రిలాక్స్ అయ్యి చుట్టుపక్కల వాతావరణం గమనించడంతో ఆనందరావు గారు వాళ్ళ ఇంటి గురించి చెబుతూ కట్టించినప్పటి తన కష్టాలన్నీ చెప్పారు కానీ నాకన్నీ సగం సగమే ఎక్కాయి. అమ్మ కూడా మా మధ్యతరగతి జీవితం గురించి ఏదో చెప్పింది.
వచ్చింది చూడ్డానికే కదా అన్నట్లు కాసేపు అలా ప్రణవిని చూస్తుంటే ఇంకా చూడాలనిపించే అందం. ఇంతలో చటుక్కున తనూ నన్ను చూసింది. నేను తల తిప్పేశాను. తను ఇంకో పది నిమిషాల వరకు ఏదో పనున్నట్టు తల అటూ ఇటూ తిప్పుతూ మద్యలో నన్ను చూడ్డం మానలేదు.
నా కళ్ళు నన్ను పట్టించుకోక ఆమె వైపే అతుక్కుపోయాయి. ఆమె పలువరస ఎంతో అందంగా తళుక్కుమంటోంది. మొదటి సారి నేను ఒక అమ్మాయిని ఇంతలా చూడ్డం నాకే ఆశ్చర్యమేసింది.
ప్రయాణపు బడలిక ఎప్పుడు ఎగిరిపోయిందో నాకే తెలియలేదు.
వాళ్ళంతా సబ్బుల నుండి రాష్ట్రాలు దాటి దేశాల మీద ఏవో చర్చలు పెట్టారు. అవేవీ నా కాన్సంట్రేషన్ దెబ్బ తీయలేదు.
కానీ ఇదిగో అంటూ అప్పుడొచ్చింది నా ఉభాసం. చిరాకు దాచేసి ఆ ఉప్మా మీద ఆలోచనలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక అమ్మను చూశా.. వాడు ఉప్మా తినడు లేండి కాఫీ తాగుతాడు అని రక్షించింది.
ప్రణవి మాత్రం చాలా సున్నితంగా నవ్వుతూ అమ్మ ఏదో అడిగితే జవాబిస్తోంది. ఆమె భావాలు చూస్తే కాసేపు నాతో మాట్లాడాలని అనిపించిందేమో! ఈ ఉప్మా గోల అయ్యాక ఇచ్చిన కాఫీ తాగితే ఓ పెద్ద రిలీఫ్.
అరచేతిలోని ఇసక లోకమంతా చూసినట్టు నాకు అమ్మాయిని చూసే ఫ్రీడం ఇచ్చి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదుగా.. అసలు ఇస్తారా లేదా అని నా ఆలోచన.
మా ఇద్దరిని వదిలేసి వాళ్ళంతా ఏవో ఫోటోలు అవీ ఇవీ అంటూ మాట్లాడటం కాస్త వినిపించినా మా కళ్ళు మాత్రం ఏవో కధలు చెప్పుకుంటున్న ఓ చిన్న సంతృప్తి.
ఇంతలో అమ్మ నన్ను చూస్తూ నువ్వు ఆ పూలు పళ్ళ కోసం వెళితే నీకన్నా ముందే మేమంతా లోపలికి రావడంతో వాళ్ళకు అబ్బాయి ఎవరో అర్థం కాలేదట.. నీ ఫోటో చూడలేదుగా అంది.
నా నోట మాట రాలేదు. తల గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. అసలు నేను ఎలా ఉంటానో తెలియకుండా, చూడకుండా ప్రణవి పెళ్ళిచూపులకు ఒప్పుకుందా!! ఒప్పించారా!! ఏం అర్థం కావట్లేదు.
అంతవరకూ ఉన్న నా ఉత్సాహం ఎవరో పీల్చేస్తున్నట్టు ఇంకిపోతోంది.
అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసి ఏవేవో ఊహించుకున్న అబ్బాయికి, అసలు అబ్బాయే ఎలా ఉంటాడో తెలియని అమ్మాయికి మద్య ఉన్న స్పష్టమైన తేడా నన్ను ఇక మాట్లాడనివ్వలేదు.
ఎవడో అనామకుడి ముందు కూర్చుని తమ ప్రైవసీ తెంపుకుని గోప్యతంతా వదిలేసి మాట్లాడటం నాకే సిగ్గనిపించే విషయం. ఇదే ప్రణవి ఏదన్నా బస్టాప్ లో నాతో ఇలాగే ప్రవర్తించేదా అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు.
ఎందుకిలా జరుగుతోంది.. స్త్రీ పురుష సమానత్వం ఒట్టి పేపరుకే పరిమితమా!! మగవాడి ఆధిపత్యం ఇంకా సాగుతూనే ఉందా!! మహిళా సాధికారత అంతా బూటకమా!!
ఇలాంటి ఆలోచనలు నన్ను బ్యాలెన్స్ చేయట్లేదు.
ఏదో ఫోన్ మాట్లాడాలి అని బయటకొచ్చా.. చుట్టూతా ఉన్న చెట్లు నాతో ఏకీభవిస్తున్నట్టు తలలు ఊపుతున్నాయి. ఆ వాతావరణం నాలో అలజడి కాస్త తగ్గించింది.
ఒక్కో విషయం మెల్లగా అర్థమౌతోంది. వాళ్ళు నన్ను స్కాన్ చేయలేదు. మొట్టమొదటి సారి చూస్తున్నారు. అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. జాతకం ఫోటో అంత త్వరగా పంపారా! అమ్మ మాట్లాడినవారు అసలు నా ఫోటో వీళ్ళకు పంపించారా అని!
ఎందుకో ఆనందరావు గారిని, వారి తాపత్రయాన్ని చూసి బాధేసింది. అమ్మాయిని కన్న తల్లిదండ్రులకెంత కష్టం!!
మావైపే తప్పు జరిగిందని తెలుస్తోంది కాని అది ఎలా దిద్దుకోవాలో అర్థం కావట్లేదు. ఏదో తెలియని సానుభూతి నాలో రకరకాల ఆలోచనలతో ఇబ్బంది పెడుతూంటే అమ్మ పిలిచింది.
ఇక బయలుదేరే సమయం రాగానే నాకు తెలియకుండానే అప్పటికప్పుడు నన్ను మారుస్తున్న ప్రణవిని చూస్తూ మనసు నిండిపోయేలా నవ్వడంతో ఆమె కూడా హాయిగా ఒక మంచి నవ్వుతో నాకు బై చెప్పింది.
బెంగుళూరు చేరుకోగానే అమ్మతో ఒంటరిగా కూర్చొని నేనాలోచించిన విషయం అంతా చెబితే కళ్ళలో చిరుచెమ్మతో నా మైసూర్ మహారాజు ఇంతగా ఎదిగిపోయాడా అంటూ పొంగిపోయింది.
ఇక నేను అంగీకారం చెప్పడం, ఆ విషయాన్ని వాళ్ళకి చేరవేయడంతో మైసూర్ ప్యాలెస్ ఈసారి నా పెళ్ళి కోసం వేచి చూడడం మొదలెట్టింది.
"అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు" ?
మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర . ఎండాకాలం . హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న.
“ ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం !, ఇంటికి పొయ్యి రాజయ్య తో ఆడుకుంటా!"
"లేదు చిన్నా! నీకు ఒంట్లో బాగ లేదు కదా , నెల్లూరు పొయ్యేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకుందాం. నెల్లూళ్ళో బొమ్మల పుస్తకం కూడా కొనిస్తా ! బస్సొచ్చే లోపల , అక్కడ పొయ్యే గూడ్స్ రైలు కి ఎన్ని పెట్టెలో లెక్క పెట్టి చెప్పు, అమ్మకి"
అది ఇంటికెళ్లి పోదాం అనే నా గోల భరించలేక , మా అమ్మ మాయ చెయ్యడానికి , ఉపయోగించిన మంత్రం అని తెలియని నేను, నీరసం లో కూడా ఉత్సాహం తెచ్చుకొని,
"ఒకటి, రెండు, మూడు ..." అంటూ లెక్క పెట్టుకు పోతున్న.
కొంత సేపు అయ్యాక చెప్పా, "అమ్మ ఏభై ఆఱు!"
"కాదు నాన్నా! ఏభై ఎనిమిది! ముందు ఈ మంచినీళ్లు తాగు, పెదాలు ఎండి పోతున్నాయి నీకు"
మంచి నీళ్లు తాగి చెప్పా నేను, "ఓహ్! నేను ఇంజను, గార్డు పెట్టె కలపలేదమ్మా!"
ఎదురుంగా, దూరం నించి ఓ ఎర్ర బస్సు వస్తా వుంది.
"ఈ రెండు వేళ్ళల్లో ఒకటి పట్టుకో చిన్నా !" అనిందమ్మ.
నేను పట్టుకున్నా ఒక వేలు.
మళ్ళీ మా నాన్న చెయ్యి ఎత్తటం, ఆ బస్సు ఆగకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం.
నా మొహం లో నిరాశ చూసి చెప్పింది అమ్మ, "ఈ సారి బస్సు ఆగుతుందనే వేలు పట్టుకుందిగాని లేరా చిన్నా ! " అని.
మా అమ్మ భుజం మీద తల వాల్చా!
నన్ను అలా తలవాల్చనీయ కుండా వుంచాలని మా అమ్మ ప్రయత్నం.
" చిన్నా! దాహమైతా ఉందా , మళ్లీ నీళ్లు కాసిన్ని తాగతావా!"
"లేదమ్మా! అస్సలకి లేదు , గొంతంతా బాగా నొప్పి గూడ !"
ఓ అర నిముషం ఆగి చెప్పిందమ్మ!
"ఈసారి వేరే ఆట ఆడదాం చిన్నా ! కళ్ళు మూసుకొని, ఏ లారీ పొయ్యినా, ఏ కంపెనీ దో చెప్తావ్ కదా!"
అమ్మ ఆ మాట అనంగానే కళ్ళు మూసుకున్నా చప్పున!
" ఇప్పుడు పొయ్యే లారీ ప్రీమియర్, పేరు పలక లేక నాన్న దాన్ని రాకెట్ అంటాడుగా, దాని తర్వాత వస్తా ఉండేది లేలాండు బండి ...", ఇట్టా చెబుతూ పోతూనే వున్నా, ఒక దాని తర్వాత ఒకటి ఆపకుండా.
ఇంకో పక్క, మా నాన్న అలసి పోకుండా పాపం, చెయ్యెత్తి దించీ కుస్తీలు పడతానే వున్నారు.
ఎందుకో గానీ ఏ బస్సు ఆగట్లా, మా కోసం. ఎండ మండిపోతావుంది.
"భలే రా చిన్నా! అన్నీ కరెక్ట్ గా చెప్పేస్తున్నావు అంది " అమ్మ నా తల మీద చెయ్యేసి.
"అమ్మా! నీకు తెలుసా? నేను లారీలే గాదు . బైకుల పేర్లు గూడా చెప్తా కళ్ళు మూస్కోని , బులెట్, జావా , రాజదూత్ అన్నీ ‘“
అప్పటికి గంట అయ్యిందేమో నాన్న అమ్మలతో , నెల్లూరు వెళ్లే ఎర్ర బస్సు కోసం, మా వూరికి ఉత్తరాన కూసింత వేటు దూరం లో వుండే నేషనల్ హైవే మీదికొచ్చి.
నేనేసుకున్న రబ్బరు చెప్పులు గూడ కాల్తా వున్నాయి.
నాన్న పాపం రోడ్డు మీద నిలబడి చేతులెత్తుతూనే వున్నాడు.
చూసి చూసి, నన్ను తీస్కొని అమ్మ రోడ్డు పక్కనుండే, కర్ర తుమ్మ నీడ లో కూర్చోబెట్టింది. తాను గూడ రోడ్డు మీద కళ్లంతా బెట్టి, , అప్పుడప్పుడూ నన్ను సముదాయిస్తూ నా పక్కనే అట్టానే నిల్చోని వుంది.
మా వూరినించి, నెల్లూరుకో లేక రాజు పాళేనికో వెళ్లాల్సొచ్చినప్పుడు. ఇట్టా ఆపకుండా వెళ్ళిపొయ్యే ఎర్ర బస్సులతో పడిగాపులు కొత్త కాదు, మాకు .
దూరాన్నించి ఎవరో ఒకాయన ఎర్ర బట్టలతో నడిచొస్తున్నాడు. దగ్గరకి రాంగానే నాన్న చూసి ఆగి పొయ్యాడు మా ఊరి పూజారి..
"సుందరయ్యా ! వేళ కానీ వేళలో పిల్లగాడి నేసుకొని ఎందాక ప్రయాణం"
"నెల్లూరి దాకా అయ్యోరా! పిల్లగాడికి నిన్నటి నుండి గొంతు లో చిన్న పుండు అయ్యున్నాది. వాళ్ళమ్మ నిన్నటి నుండి ఒకటే సతాయింపు, డాక్టర్ దగ్గరకి తీసు కెల్దామని, మాటలా? అప్పటికప్పుడు నెల్లూరు బోవాలంటే., ఎదో నాలుగు డబ్బులు సర్దుబాటు చేసుకొని బయలుదేరే సరికి ఈ వేళ అయ్యింది" అని మా నాన్న సాధక బాధలు చెప్పటం మొదలెట్టేసాడు.
నన్ను ఓసారి తేరిపార చూసాడు మా పూజారి గారు. మేము కూర్చోనున్న చెట్టుని గూడ ఒక పారి చూసి, ఆయన చేతి కుండే , బ్రిటిష్ కాలం వాచీ లో టైం చూస్కోని చెప్పాడు, గబ గబా
"సుందరయ్య! ఇక్కడ యమ గండ ముందయ్యా! పిల్లోడు ని చూస్తే గుడ్లు తేలేస్తున్నాడు! ముందు ఇక్కడ నుండి వెళ్లిపోండి! కావాలంటే ఎగువు కి వెళ్లి ఆ నేరేడు చెట్ల దగ్గర కూర్చోండి. ఇక్కడ ఒక్క క్షణం గూడ ఉండొద్దు. అక్కడ నుండి అల్లూరు మీద వెళ్లే బస్సు పట్టుకొని, నెల్లూరి కి వెళ్ళండి" అని చెప్పాడు.
మా నాన్నా , అమ్మా , మొహా మొహాలు చూసుకున్నారు. మా అమ్మ ఆరోజుల్లోనే హేతువాది, ఓ పెద్ద కమ్యూనిస్టు గారి పుత్రిక. ఆమేమో కదలనంటోంది.
పూజారి గారి మీద విపరీతమైన గురుండే , మా నాన్నేమో కళ్ళతోనే బతిమాలాడ్తున్నాడు అమ్మని.
మా పూజారి గారు మేము కదిలే దాకా అక్కడ్నించి పొయ్యేటట్టు కనపళ్ళా .
ఇంకో పక్క ఒక అర కిలో మీటరు దూరంలో వుంది , పూజారి గారు చెప్పిన నేరేడు చెట్టు.
ఏమనుకుందో ఏమో అమ్మ , అక్కడ్నించి కదిలింది.
మేము అక్కడ నుంచి, ఒక ఫర్లాన్గ్ నడిచేదాకా , అక్కడే ఉండి చూసి, పూజారి గారు చక్కా ఊర్లోకి వెళ్లి పోయారు.
ఇంత ఎండలో, వొంట్లో బాలేని బిడ్డనేసుకొని, అటూ ఇటూ ఈ తిరుగుళ్ళు ఏందో అని సణుక్కుంటూ అమ్మ, నన్ను చంక నేసుకొని నాన్న వడి వడి గా నడుస్తున్నారు.
ఓ పది నిముషాల నడక తర్వాత చేరుకున్నాం మా అయ్యోరు చెప్పిన నేరేడు చెట్టు కిందకి.
ఇంకో అరగంట అయ్యాక ఆగింది, ఓ ఎర్ర బస్సు మా ముందర , మమ్మల్ని ఎక్కిచ్చుకోడానికి.
వెనకాల సీట్లు ఖాళీగున్నాయి.
బస్సు పైన కమ్మీ పట్టుకొని, నన్ను పట్టుకొని సీట్లో గూర్చోడానికి కెళ్తున్నారు, అమ్మ నాన్న..
సడన్ బ్రేక్ వేసాడు మా బస్సు డ్రైవర్.
బస్సు ఆపింది మేము ఇంతకుముందు నిలబడ్డ చోటు, కరెక్ట్ గా, అదే ప్లేసు.
మా అమ్మ, మా నాయన కేసి కోపం గా చూస్తా వుంది, చూసావా అనవసరం గా ఇంత దూరం ఆ పూజారి మాట విని, నడిపిచ్చు కొచ్చావు అన్నట్టు.
బస్సులోకి ఎవరూ ఎక్కలా .
కండక్టరు కిందికి దిగాడు. ఆయనతోబాటూ ఓ ఇద్దరు ముగ్గురు పాసెంజర్లు హడావుడిగా.
నాన్న కిటికీలోంచి ఒంగి , రోడ్డు మీదకి చూస్తే, క్రింద ఒక చిన్న గుంపు.
గుంపు మధ్యలో పడున్నాడు ఓ పాతికేళ్ల మనిషి, రక్తపు మడుగులో.
నాన్న కిందికి దిగబోతే, అమ్మ ఆపేసింది.
ఒక పదినిముషాల తర్వాత కండక్టరు బస్సుల్లోకెక్కుతూ చెప్పాడు, మేము కింద కూర్చున్న తుమ్మచెట్టు ని చూపిస్తూ , " ఓ పది నిముషాల క్రితం వచ్చి కూర్చున్నాడట పాపం నీడ ఉందని చెప్పి అతను, లారీ అదుపుతప్పి మీదికి ఎక్కేసింది. ప్రాణం అక్కడికక్కడే పొయ్యింది." అని.
ఈ సంఘటన జరిగిన పదిహేనేళ్ళకి నాకు గుర్తు చేసింది అమ్మ ఆ రోజు జరిగిందంతా.
అడిగా నేను తమాషాగా, " ఇంత జరిగినా, ఇన్నేళ్ల తర్వాత గూడ , చెయ్యెత్తి, ఒక దణ్ణం గూడా పెట్టవు గదే అమ్మా" అని.
నా తల మీద మొట్టికాయేసి చెప్పింది.
" నేను నీ పక్కనుంటే నీకేం అవుతుంది రా. అయినా నీకు మంచి జరుగుద్ది అంటే దయ్యాలకైనా దండలేయడానికి రెడీ " అని మా నాన్న కి వినపడకుండా.
తలుపులు దబదబా బాదుతున్న శబ్దం .
గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది..
డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు - బ్లాక్ జీన్సు, బ్లాక్ టీషర్ట్ లో రామకృష్ణ.
"మంచి నిద్ర పాడుచేశావ్ ! కొంపలేంమునిగాయనీ" ?
"బైకు తాళాలిస్తావా, ఇప్పటికే లేట్ అయిపోయింది." ?
తాళాలు ఇస్తూ చెప్పాను , " పొద్దున్నే ఫ్యాక్టరీ నించి వస్తూంటే రిజర్వు లోకి వచ్చింది , పెట్రోల్ చూసుకో" అని.
సమాధానం గూడ చెప్పకుండా తాళాలు తీస్కొని పరిగెత్తాడు రావకృష్ణ.
వెనకనించి అరిచాను , "జాగర్త బండి మనది కూడా కాదు" .
ఆకాశం చూస్తే నల్ల మబ్బులతో ముసురుకోని వుంది.
రామకృష్ణ తొందర చూస్తుంటే, మనిషికో, బండికో షేపులు మారడం ఖాయం అనిపిస్తోంది ఈ రోజు.
తలుపేసి వొచ్చి మళ్ళీ తల వాల్చా.
నేను రామకృష్ణా, ఎచ్ ఎం టీ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాం తొమ్మిది నెల్ల క్రితం.
ఒక మెషీన్ కమిషనింగ్ కి అని చెప్పి , మేము వైజాగ్ కి వచ్చి నెల అయ్యింది.
మా బస ఊరవతల, వర్క్ సైట్ కి దగ్గర్లో. ఫ్యాక్టరీ గెస్టుహౌస్ అనబడే రెండంతస్తుల ఇంట్లో.
రోజూ, మమ్మల్ని ఫ్యాక్టరీ కి తీసుకెళ్లే కార్ డ్రైవర్ నరసింహం దగ్గర్లోనే ఉండేవాడు.
తను చెప్పాడు, " సాయంత్రం ఆరు దాటితే , సిటీ బస్సు గూడా దొరకదు సిటీ నుంచి రావడానికి" , అని చెప్పి.
ఇంటికంతా మేమిద్దరమే, ఫస్ట్ ఫ్లోర్ లో వుండే పక్క పక్క రూముల్లో . ఇంకెవరూ లేరు.
వున్న వంటతను గూడా ఎదో ఒంట్లో బాగాలేదని వూరెళ్ళిపొయ్యాడు, మేమొచ్చిన రెండు రోజుల్లోనే.
కాఫీ తాగాలన్నా రెండు కిలోమీటర్లు పోవాల్సిందే గెస్ట్ హౌస్ నించి.
నేను రామకృష్ణ నాలుగేళ్లు ఒకే కాలేజీలో చదూకున్నాం హైద్రాబాద్లో. అప్పటికే సకల కళాపోషకుడు. నాకు తెల్సి గ్రాడ్యుయేషన్ అయ్యేలోపల మా కాలేజీలో, రామకృష్ణని ఆరుగురు గాళ్ ఫ్రెండ్స్ మార్చేసుకున్నారు. అప్పట్లో అతనితో పెద్ద పరిచయం లేదు నాకు. అతనికంత టైమూ వుండేది కాదు. ఈ వూర్లో గూడా, రామకృష్ణ ఉధృతి తగ్గట్లేదు.
ఫ్యాక్టరీ నించి రాంగానే, బండేసుకొని వెళ్లపోతాడు , సాయంకాలం ఈ టైం కి . మళ్ళీ వచ్చేది రాత్రి బాగా పొద్దు పోయింతర్వాత. అతని ఎనెర్జీ లెవెల్సు విపరీతం.
ఇంత తొందరగా ఎవరితో పరిచయాలు పెంచుకున్నాడో, ఇక్కడికొచ్చి. ఏవైనా, వూరు గాని వూర్లో రామకృష్ణ తిరుగుళ్ళు రిస్కీ నే.
ఇట్లా ఆలోచిస్తూంటే నిద్ర పట్టేసింది.
గట్టిగా డబ డబా , కిటికీ తలుపులు కొట్టుకుంటున్న శబ్దం వినపడితే లేచాను.
ఒక రెండు అడుగులేసి, బయట బాల్కనీ లోకొచ్చి నిలబడ్డా ఒళ్లు విరుచుకుంటూ.
చీకటి ముసురుకోనుంది.
నెలరోజుల్నించీ నైట్ షిఫ్టు, డే షిఫ్ట్ ఇట్టా మారడం తలనొప్పిగా వుంది. ఇంకా అలవాటు పళ్ళేదు. బాగా నిద్రపొయ్యి , లేచినా మగత గానే ఉంటుంది.
ఇది గాక , నా బద్ధకం వల్ల, బ్రెడ్డు పాలతో అలవాటు లేని భోజనం.ఇంకో నాలుగు రోజులు ఈ నరకం తట్టుకుంటే, మా ప్రాజెక్ట్ కమీషనింగ్ అయిపోతుంది.
కూత వేటు దూరంలో వుంది సముద్రం, మేముండే లీల కాలనీకి. కాలనీ అంతా కల్పి ఒక రెండు మూడు వీధులు అంతే.
అదే కాలనీ ఎంట్రన్స్ లో ఒక అమ్మవారి గుడి. సముద్రం అనుకునే వుండే వీధి లో మా గెస్ట్ హౌస్.
బాగా తూగొస్తోంది. దూరం నుంచి సముద్రం హోరు , విపరీతమైన గాలి. గాలి పెరిగిపోతోంది. పొద్దున్న ఫ్యాక్టరీ లో ఎవరో చెప్పారు, ఈ నెల లో తుఫాను వుంది వైజాగుకి అనిచెప్పి.
చిన్నగా వర్షం మొదలైంది. ఇంతలో ఎదురు ఇంటి మీద ఎవరో కదిలినట్టు అనిపిస్తే అటు చూసాను.
సన్నటి ఆకారం, ఎవరో ఒక ఆడమనిషని అయితే మటుకు తెలుస్తోంది, స్ట్రీట్ లాంప్ వెలుగులో ఓ ఇరవై ఏళ్ళు ఉండొచ్చు. మేడ మీద పిట్టగోడ దగ్గర, చీకట్లో వర్షంలో తడుస్తూ, వీధి వైపే చూస్తూ. అంత చీకట్లోనూ ఆ అమ్మాయి ముక్కుపుడక అనుకుంటా మెరిసిపోతోంది.
నా గొడవలో చుట్టుపక్కల వుండే వాళ్ళని పెద్దగా గమనించింది లేదు. ఎదురు ఇంట్లో ఓ యాభై ఏళ్ల మనిషిని అప్పుడప్పుడు ఆయనతో బైక్ మీద వెళ్లే ఒక ఆవిడ్ని చూసా. డాబా మీద నిలబడుంది, వాళ్ళ అమ్మాయి అయ్యుండొచ్చు.
ఓ రెండు నిమిషాలు చూసి లోపలికొచ్చేసాను. ఆకలి మొదలవ్వడంతో.
రూమ్ లోకి ఎంటర్ అయ్యి, .టైం చూస్కుంటే రాత్రి పదిన్నర దాటింది.
వున్న రెండు బ్రెడ్డు ముక్కలూ పీక్కు తింటూ బాల్కనీ లోకి మళ్ళీ వచ్చా.
ఎదురు ఇంటి డాబా వైపు చూస్తే, ఎవ్వరూ కనపడలేదు.
లోపలికొచ్చి పడుకున్నా.
పొద్దున్న లేచేటప్పటికి, రామకృష్ణ కాఫీ, టిఫిన్ పొట్లాలతో రెడీ గా వున్నాడు.
"ఎన్నింటికొచ్చావు రాత్రి" ?
"రెండయ్యింది. సెకండ్ షోకి వెళ్ళాను" అన్నాడు రామకృష్ణ.
"ఇక్కడ గూడ ఫ్రెండ్సు దొరికారా ఏందీ నీకు"?.
"'ఫ్రెండ్సు ' కాదు, ఫ్రెండుతో వెళ్ళా సెకండ్ షో కి - సింగులర్ "
" ఇంత తొందరగా ఎలా? " అడిగాను నేను ఆశ్చర్యంగా.
నవ్వాడు అతను. " ఈ కాలనీయే ఆ అమ్మాయిది ,యూనివర్సిటీ విమెన్ హాస్టల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళది మన ఎదురిల్లే".
"నిన్న రాత్రి అదే టైం లో ఒక అమ్మాయిని చూసానే ఎదురింటి మీద?"
రామకృష్ణ అయోమయంగా మొహం పెట్టాడు.
"నిన్న సెకండ్ షో తర్వాత, హాస్టల్ వాచ్ మన్ కి టీ డబ్బులు ఇచ్చి మరీ దిగబెట్టొచ్చా ఆ అమ్మాయిని. ఎవర్ని చూసి ఎవరు అనుకున్నావో. ఎప్పుడూ సగం నిద్ర లో వుంటావుగదా!"
" ఇక్కడ ఉండదా ఆ అమ్మాయి ! అయితే"
ఓపిగ్గా చెప్పాడు రామకృష్ణ , "చెప్పా కదా, హాస్టల్ అని, రోజూ సాయంత్రం ఇంత దూరం ట్రావెల్ చెయ్యడం అంత సేఫ్ కాదనో ఏమో, ఆ అమ్మాయిని హాస్టల్ లో పెట్టారు.. క్రితం వారం ఒక సారి ఇంటికొచ్చి వెళ్ళింది - చూసా, కనుక్కున్నా , పరిచయం చేసేసుకున్నా - అని విని విడి విసి స్టయిల్లో " .
"రెండ్రోజుల్లో వూరెళ్ళిపొయ్యేదానికి , ఇట్టాటివి ఎందుకు రామకృష్ణా ? , తెలిస్తే కాలనీ వాళ్ళు నిన్ను , నీతో పాటూ నన్ను ఇద్దర్నీ కట్ట కట్టి సముద్రం లోకి విసిరేస్తారు."
నవ్వాడతను "రెండు రోజుల్లో ఎవరెళ్ళిపోతున్నారు. కమిషనింగ్ అయింతర్వాత , ట్రైనింగ్ అనిచెప్పి, ఒక ఇంజనీర్ ఇంకో నెల ఇక్కడే వుండాలని , అదీ రామకృష్ణ మాత్రమే అయ్యుండాలి అని , నిన్ననే మన బాస్ రత్నం గారికి ఫోన్ వెళ్ళింది ఇక్కణ్ణుంచి."
"నువ్వు కాలాంతకుడివి" అని చెప్పి స్నానానికి పరిగెత్తా నేను, ఫ్యాక్టరీ టైం అవుతుండడంతో,
ఆ పక్కరోజు శనివారం రామకృష్ణ మామూలు కంటే ఉత్సాహం గా కనపడ్డాడు.
"విషయం ఏందీ" అడిగాను
"రేపొద్దున్నే భీమ్లీ కి వెళ్తున్నాం. అక్కడే బీచు పక్కన ఒక చిన్న హోమ్ స్టే లాగ . ఎల్లుండి పొద్దున్న వెనక్కి రావొచ్చు."
"నేను రాలేనోయ్, రేపు గూడా పని చేసి మెషీన్ ఒక ట్రయిల్ తీసుకుంటే, హ్యాండ్ ఓవర్ చేసి హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. మన బాస్ కు కూడా చెప్పాను."
నవ్వాడు రామకృష్ణ "నిన్ను అంత కష్ట పెడతానా చెప్పు"
అప్పుడర్థం అయ్యింది నాకు, "ఆ అమ్మాయి ఒప్పుకుందా"
"లేదు. చిన్న డే టైం పిక్నిక్ అనిచెప్పి తీసుకెళ్తా . అక్కడికి వెళ్ళింతర్వాత ఎలాగో ఒకలాగా కన్విన్స్ చేస్తా. ఈ అమ్మాయిని హేండిల్ చెయ్యడం చాలా తేలిక. ఒకరోజు పరిచయం తోనే సినిమా కి తీస్కెళ్ళిపొయ్యా."
" సినిమాలూ , షికార్లూ కొంత దాకా ఓకే , ఇలాంటివి చాలా ప్రమాదకరం , ఆ అమ్మాయి కి నీకూ."
కన్ను కొట్టి చెప్పాడతను , "ప్రమాదం అనే కదా , నిన్ను తీసుకెళ్లట్లేదు. అయినా సాయంత్రం ఫస్ట్ షో కి వెళదాం, బయట మంచి భోజనం పెట్టిస్తా నీకు. వూరికి వెళ్లి పోతున్నావ్ కదా సోమవారం."
నేను ఇంకేం మాట్లాడలేదు. మానవ ప్రయత్నాలు పనికిరావు మా రామ కృష్ణ , రాస కృష్ణ మోడ్ లో ఉన్నప్పుడు.
సాయంత్రం ఫస్ట్ షో సినిమా కి ఎదో కొత్త సినిమా అనిచెప్పి నన్ను తీసుకెళ్లాడు రామకృష్ణ . అప్పటికే రెండు సార్లు చూసాట్ట ఎదో "దేవి" అనిచెప్పి. అంతా గోల గోల, దెయ్యాలూ , దేవుళ్ళూ, మనుషులూ. ఎవరు ఎవరో అర్థం కాలే నాకు.
హీరోయిన్ ముక్కు పుడకను చూస్తే మటుకు , మొన్న రాత్రి చీకట్లో చూసిన అమ్మాయి గుర్తొచ్చింది.
భోజనం చేసిన తర్వాత తీసుకెళ్లి బీచ్ లో కూర్చోపెట్టాడు రామకృష్ణ.
భీమ్లీ లో ఏమి చెయ్యబోతాడు, ఆ మిగతా నెలంతా ఆ అమ్మాయి తో ఎలా ఎంటర్టైన్ అవుతాడు, దీని గురించే అతని వాగుడంతా, పెట్రోలింగ్ జీప్ వచ్చి , మమ్మల్ని బీచినించీ తరిమే దాకా ,
నాకు మామూలు గానే నెల నించీ నిద్ర లేదు. ఇప్పుడింకా నిద్ర వొస్తోంది. టైం చూస్కుంటే వొంటి గంట అవుతోంది. ఎప్పుడెప్పుడు రూమ్ కెళ్ళి మంచం మీదకి దూకుదామా అని చూస్తున్నా.
విపరీతమైన స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నాడు, రోడ్లంతా ఖాళీ గా ఉండడంతో.
బైకు, మా కాలనీ లోకి ఎంటర్ అయ్యి , గుడిని దాటి ముందుకెళ్తోంది. . స్ట్రీట్ లైట్స్ గూడా ఆరిపోయియున్నాయి. చిమ్మ చీకటి.
మా వీధి లోకి ఎంటర్ కాంగానే, చీకట్లోంచి, ఎవరో సడన్ గా ఒక మనిషి ఆకారం అడ్డం వచ్చింది.
సడన్ బ్రేక్ వేసాడు. బండి ఆగలేదు. స్కిడ్ అయిపోతోంది.
ఆ స్పీడ్ లో బైకు తో బాటు జారుతూనో , దొర్లుతూనో వెళ్ళిపోయా. తల కేదో, గట్టి గా తగిలినట్టు అనిపించింది.
నాకు కొంచెం దూరం లో రామకృష్ణ పడున్నాడు, అతని చుట్టూ రక్తం.
దూరంగా నిలబడి మమ్మల్నే చూస్తోంది, ఎదురింటి ముక్కుపుడక అమ్మాయి.
నా తల మీద ఎదో తడి తడి గా .
నాకు స్పృహ తప్పింది.
ఎవరో నా పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచా. చేతికి ఒక సెలైన్. పక్కనే హైదరాబాద్ నించి వచ్చిన మా జీ ఎం రత్నం గారు.
"మీరెప్పుడు వచ్చారు సర్"?. అడిగాను నీరసం గా.
"వైజాగ్ లో పనుండి , పొద్దున ఫస్ట్ ఫ్లైట్ కొచ్చానయ్యా. రాగానే ఈ న్యూసు."
"సర్, రామకృష్ణ"?
" కాలికి ఒకటి , చేతి కి ఒకటి రెండు ఫ్రాక్చర్లు. హీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. నువ్వు అదృష్ట వంతుడివి ఒంటి మీద ఒక చిన్న స్క్రాచ్ గూడ లేదు. షాక్ వల్లా , అనీమిక్ అవడం వల్లా , స్పృహ తప్పింది అని చెప్పారు డాక్టర్లు. మీ నైబర్స్ ఎవరో టైం కి రెస్పాండ్ అయ్యారట."
నా తల తడుముకున్నా . ఒక చిన్న ప్లాస్టర్ గూడా లేదు.
ఎదురింటి అమ్మాయికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నా.
ఏదో మాట్లాడే లోపలే, జీ ఎం గారు అన్నారు, " రామకృష్ణ గూడా ట్రావెల్ చెయ్యొచ్చన్నారు. రేపొద్దున ఫ్లైటు కి మన ముగ్గురికి టికెట్స్ బుక్ చేశా. మీ ఇద్దరి రీ ప్లేసెమెంట్లు , ఎల్లుండి పొద్దున కల్లా రిపోర్ట్ చేస్తారు. పొద్దున్న ఎనిమిది కల్లా బయలు దేరదాం. అవుట్ స్టేషన్ డ్యూటీ లో ఆక్సిడెంట్ కదా. లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువ రోజులు ఇక్కడుండే కొద్దీ."
"రేపొద్దున అంటే , లగేజి, అదీ . అది గాక మా తమ్ముడి ఫ్రెండు బైకు ఒకటుందండి. అది గూడా రిపేర్ చేయించి హ్యాండ్ ఓవర్ చెయ్యాలి", అన్నా నేను.
తాపీ గా చెప్పారు మా రత్నం గారు, " నువ్వు నిక్షేపం గా వున్నావు. నీకింకో సెలైన్ పెడ్తావన్నారు, అది అయింతర్వాత భోజనం పెడ్తారు - తిను. , ఫ్యాక్టరీ వాళ్ళ కార్ ఇక్కడే వుంది. దాంట్లో గెస్ట్ హౌస్ కి వెళ్ళు . వున్న ఆ రెండో మూడో సూటు కేసులు తెచ్చెయ్యి . ఆ బైకు గూడ గెస్ట్ హౌస్ దగ్గరే ఉందట . నీతో వచ్చే కార్ డ్రైవర్ కి దాన్ని అప్పజెప్పు . అతను ఇచ్చేస్తాడు రిపేర్ చేయించి ఎవరికివ్వాలో. " అని.
టైం చూస్కుంటే, మధ్యాన్నం రెండు అవుతోంది.
డాక్టరు వచ్చి స్కాను , గీనూ చెక్ చేసి డిశ్చార్జ్ చేసేటప్పటికి, రాత్రి ఎనిమిది అయ్యింది.
బయటికొచ్చి చూస్తే, అదే వాతావరణం. భీభత్సమైన వర్షం పడేటట్టు వుంది.
కార్లో ఎక్కితే , డ్రైవరు మాతో రోజూ తిరిగే నరసింహమే.
కారు ఎక్కంగానే, ఏమయ్యింది , ఎట్లా అయ్యింది అని వివరాలు అడగడం మొదలు పెట్టాడు.
ఏదో నాకు తోచిన సమాధానాలు నేను చెప్తూ వచ్చా.
కారు గెస్టు హౌస్ ముందర ఆగింది. ఇంట్లో కెళ్ళి చూస్కుంటే బైకుఅక్కడ కనపళ్ళేదు.
రోడ్డు మీద కొచ్చి చూస్తే, ఎదురింటి కాంపౌండ్ లో పార్క్ చేసి కనిపించింది.
వాళ్ళింటి లోపలి కెళ్ళాను , గేట్ తీస్కొని,
బైక్ దగ్గరి కెళ్ళి చూస్తే, ఎక్కడో రెండు మూడు పెయింట్ పోయిన గుర్తులు తప్ప, బాగానే వుంది.
గేట్ తీసిన శబ్దం విని అనుకుంటా, ఈలోపల తలుపు తీస్కొని, ఆ ఇంటాయన బయటకొచ్చి, ఇంట్లో కి రమ్మన్నాడు.
లోపలి కెళ్ళి కూర్చున్నాను.
బైకు తాళం చేతిలో పెట్టి చెప్పాడాయన
" ఆరోజు రాత్రి, వీధిలో ఏదో పెద్ద శబ్దం అయినట్టు వినిపిస్తే బయటకొచ్చాను. చూస్తే మీరు ఇద్దరు స్పృహ తప్పి పడిపోయి వున్నారు. లక్కీ గా దగ్గర్లో తెలిసిన ఆయన ఒకాయన అంబులెన్సు సర్వీస్ రన్ చేస్తారు."
నాకు అర్థం కాలేదు. "ఆ రోజు రాత్రి బయటకొచ్చి మమ్మల్ని మొదట చూసింది , మీ అమ్మాయి కాదా" ?
"ఆ అవకాశం లేదండి. మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. సిటీ లో" , అంది అప్పుడే కాఫీ గ్లాసు తో వచ్చిన వాళ్ళావిడ.
కాఫీ గ్లాసు కింద పెట్టి, కుర్చీలోంచి లేస్తూంటే, కనపడింది ఒక అమ్మాయి ఫోటో ముక్కుపుడక తో.
ఈవిడ అన్నాను సందేహం గా.
"మా పెద్దమ్మాయి 'లీల" అండీ , చనిపోయి మూడేళ్లయింది" .
నాకు చెమటలు పట్టడం మొదలయ్యింది.
బైకు తీస్కొని, ఎప్పుడు ఇంట్లోనించి బయటకొచ్చానో నాకే తెలీదు.
గెస్ట్ హౌస్ లోకెళ్ళి, అన్యమనస్కంగా నా సూటుకేసు , రామకృష్ణ సూటుకేసు, సర్దుతున్నా.
నా వెనకాలే సహాయం కోసం నరసింహం వచ్చాడు .
నరసింహం ఇల్లు అక్కడికి దగ్గర్లోనే అని గుర్తుకొచ్చింది.
ఈ ఎదురింటి వాళ్ళ గురించి నీకేమన్నా తెల్సా?
"తెలీకపోవడం ఏంటండీ. పాపం వాళ్ళ అమ్మాయే గదా! మూడు ఏళ్ళక్రితం కనపడకుండా పొయ్యి , రెండు రోజుల తర్వాత సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చింది."
ఇంకా నాకు ఒక్క క్షణం కూడా ఇంకా అక్కడ ఉండాలని అనిపించలేదు.
గబ గబా సూటుకేసులు సర్దుకొని , కిందికి దిగొచ్చా. నాతో పాటూ నరసింహం.
కార్లో ఎక్కి, బైకు తాళం , బైకు ఇవ్వాల్సిన అడ్రస్ నరసింహం చేతిలో పెట్టాను.
కార్ స్టార్ట్ చేసి, అన్నాడు అతను.
" ఒక్క విషయం మటుకు అర్థం కాలేదండి. రామకృష్ణ గారికి అన్ని దెబ్బలు తగిలితే, మీకు గాని , మీ బైకు గాని, చిన్న దెబ్బ గూడా తాకలేదు"
నేనేమీ మాట్లాడలేదు.
కారు కాలనీ బయటకొస్తోంది, హోరున గాలి , వర్షం మొదలయ్యాయి,
కాలనీ ఎంట్రన్స్ లో వుండే అమ్మవారి గుడి దాటుతూంటే -
ఆ చీకట్లో కనపడిందా ఆ అమ్మాయి ముక్కు పుడక తో మెరిసిపోతూ, నా వైపే చూస్తూ , చిన్నగా నవ్వుతూ.
"కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!"
"ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!"
"కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ కూర వేద్దామనుకున్నా!"
"ఇంక ఇక రసం వేసుకొని, అరటికాయ కూర నంజుకో, ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకుందురు కానీ!"
నాకర్థమయ్యింది మా అమ్మ మా నాన్న కి భోజనం వడ్డిస్తుందని, కాదు, కాదు, ఏమి తినాలో ఎంత తినాలో ఓ బొమ్మరిల్లు భార్యలా ఆయన చేయి పట్టుకునే ఉందని.
"అమ్మా! ఆయన ఏమి తినాలో కూడా నువ్వే శాసిస్తే ఎలా? ఆయన అడగ గలరు గా ఏమి కావాలో అప్పుడు అడిగింది, వడ్డించ వచ్చుగా"
"పోరా! గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందట! నువ్వు కూడా నాకు చెప్పే వాడివే"
మరి కొన్ని రోజుల తర్వాత -
"అవునే! పిల్ల బాగుందా!"
"మరి ఎత్తు?"
"ఐదడుగుల ఐదంగుళాలా! అబ్బో మంచి ఎత్తే, మనోడు ఐదు పది ఉంటాడా! పిల్ల మంచి రంగు కూడానా"
"ఉద్యోగం కూడా చేస్తుందా! గవర్నమెంట్ జాబ్ నా! ఇంకేందయితే జాబ్ గురుంచి విచారించేది"
"నా మాట విని పద్మజ కి చెప్పు కట్నాలతో పెట్టుకోకుండా చేసేసుకోమని"
నా కర్థమయ్యింది, మా అమ్మ తన స్నేహితురాలితో, ఫోన్ సంభాషణ లో ఉందని.
ఫోన్ అయ్యాక, "అవునే అమ్మ! నా పెళ్ళికి మా నాయన, అంటే మీ ఆయన కట్నం తీసుకోకుండా ఎంత మాత్రం ఆప గలిగావ్"
మొహం ఎర్ర బడుతుండగా, "ఆఖరికి నీతో కూడా చెప్పించు కోవాల్సి వచ్చింది", అనేసి అలిగేసింది మా అమ్మ.
మా అమ్మ అలిగితే, "ఆమె అన్నం తిన్నదాకా నాకు చుక్కలే!"
ఇదంతా చూసి మా దగ్గరే ఉంటూ, ఉద్యోగం చేసుకొనే మా అక్క కూతురు, కయ్య్ మని, "అమ్మమ్మ! మొన్న పెద్ద మామయ్య అంతలేసి మాటలంటున్న, నీకు చీమ చిటుక్కుమన్నా లేదు, చిన్న మామయ్య ఒక్క మాట అనగానే నీకు అంత రోషం వచ్చేసింది అని"
మరల షరా మాములే, దానిక్కూడా, తలంట్లే! "గుడ్డొచ్చి పిల్లనెక్కిరిస్తుందా అంటూ."
అమ్మ, కోపం ఇంకా తగ్గలా!
"నేను నీ దగ్గర హాయిగా లేను, మీ అన్న దగ్గర హాయిగా లేను, మీ నాన్న దగ్గర అస్సలకే లేను"
"మరి ఎవరి దగ్గర హాయిగా వున్నావే! అమ్మా", నువ్వు అన్నా ఇంకా రెచ్చకొడుతూ.
"మా నాన్న దగ్గఱ రా"
డెబ్భై రెండేళ్ల మా అమ్మ! తన నాన్న దగ్గర వున్న కాలాన్ని, ఇన్నేళ్లకి మరువలేదు.
మా అమ్మని నేను బాగా చూసు కుంటున్నాను అనే నా అహానికి ఓ చెంప పెట్టు.
టేబుళ్ల మీద పదార్థాలు పెట్టి వెళ్లి పోతే మన పాటికి మన వడ్డించుకు తినటం అలవాటు అయినమన తరానికి, అలా కొసరి కొసరి ఏమి తినాలో, ఎంత తినాలో చెప్పు కుంటూ అన్నం వడ్డించే ఆ తరం -
పక్కనోడు ఏమి చేసుకున్నా మనకెందుకు అని మనలా అనుకోకుండా, పాటించరని తెలిసినా వాళ్లకు ఉబుసు పోక సలహా అయినా మంచిదే ఇచ్చే ఆ తరం -
మన కళ్ళకి మన లేక ఇతరుల వ్యక్తి గత స్వేచ్ఛను హరించే శకం!
ఇలా అయితే మనకి మాటలు చెప్పే తరమే ఉండదేమో ఇక. తలా ఒక స్మార్ట్ డివైస్ పట్టుకొని, ముంగిల్లా ఓ మూల పడి ఉండవచ్చు, ఎవరన్నా ఏదన్న మాట చెప్ప బోతే, "మైండ్ యువర్ ఓన్ బిజినెస్" అనే ఎక్స్ప్రెషన్ మొహానికి తగిలించేసుకొని.
ఇప్పటి తరానికి సలహా అనేది ఇప్పటికే చాలా ఇర్రిటేటింగ్ గా వుంది. అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వెళితే ఇద్దరి మధ్య మాటలు ఎలా సాగుతాయి
భయం వేసింది నా ఆలోచనలకు. నాకు మాటలు కావాలి. వింటారో లేదో కూడా పట్టించుకోకుండా మా అమ్మ స్వపర బేధం లేకుండా అందరికీ చెప్పే మాటలు నాకు వినపడాలి, నిత్యం.
తటాలున వెళ్లి హత్తుకున్నా అమ్మని.
"పోరా! ఈ వేషాలకి తక్కువ లేదు! వదులు నన్ను"
"వదలను నేను! అస్సలకి, నువ్వు తోసినా! తిట్టినా"
"పిచ్చోడా!!"
"అవును, నేను అమ్మ పిచ్చోడినే! ఇంకెప్పుడూ అనకు, మీ నాయనే, పెద్ద ఇది అని"
"అంటానురా! ఒక సారి కాదు! వెయ్యి సార్లు!"
"నేను మీ నాయన, శంకరయ్యను అయితే!"
"అవటానికి ట్రై చెయ్యి రా అప్పుడు చూద్దాం!"
హత! విధీ, ఈ నాయన లని కట్ట కట్టి ఎక్కడన్నా పడెయ్యాలి.
అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్లు.
కళ్ళముందు, హాస్పిటల్ లో వాడే టూల్స్ కనిపించీ కనిపించక, శబ్దాలు వినిపించీ వినిపించక నా అయోమయంలో నేను ఉంటే, ఏవో మాటలు కూడా, "వీడు తెల్లగా బొద్దుగా భలేగున్నాడు అంటూ".
అలా ఓ నాలుగు చేతులు మారాక, "ఇంకా ఎన్ని చేతులు మారాలి రా నాయనా అనుకుంటూ, ఉన్న పళాన నాలుగు ఆవులింతలు అరువు తెచ్చేసుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నా".
ముప్పావు వంతు నిద్ర, పావు వంతు మెలుకువ, మెలకువలో అమ్మ స్పర్శ, అమ్మ గొంతు కోసం వెతుక్కునే నన్ను, పెద్దైయ్యాక ఏమైతాడో వీడు అని అమ్మా నాన్నతో పాటు అందరూ అనుకుని అన్నప్రాసన మొదలెట్టేసి, ఏవో బుక్కు, పెన్ను, బంగారు గొలుసు లాంటివి ముందర పెట్టారు ఆ రోజున,
కానీ చూసేవాళ్ళని సంభ్రమాశ్చర్యాలలో ముంచుతూ, వాటిలోంచి ఓ చిన్ని కత్తిని పట్టుకుని అప్పటికప్పుడే వీరులమైపోయాం. కానీ బహుశా అక్కడే నా ఫ్యూచర్ కు నాంది పడిందేమో, పనిముట్ల తో ముడిపడి వుండే వృత్తి తో! రాజ్యాలు, వాటినేలే రాజులు అప్పటికే అంతరించి పోవటం తో.
అందుకు తగ్గట్టే, చిన్నప్పుటి నుండి ఇంట్లో ఉండే స్పాన్సర్, హ్యామర్, టెస్టర్ లాంటివి నన్ను తెగ ఆకర్షించి వాటితో ఆడుకోవాలనిపించేది. అవన్నీ మా నాన్న చిన్న చిన్న పనులకోసం వాడేవారు. అవి ఎలా వాడాలి అని మా నాన్నను విసిగిస్తూ గమనిస్తూ, ఛాన్స్ దొరికితే అవి ఎలా వాడాలో కాస్త తెలుసుకున్నా.
ఇక ఆ విజ్ఞాన రస గుళిక, మన బుర్రలో పనిచేయడం మొదలెట్టి, మా నాన్న ప్రేమతో కొనిచ్చిన సైకిల్ మొత్తం విప్పేసి, తిరిగి ఎన్ని సార్లు బిగించినా బోల్డెన్ని నట్లు, బోల్టులు మిగిలిపోతూ ఉండటంతో, మెకానిక్ వచ్చి బిగించేవాడు. ఒక విషయం తెలుసుకోడానికి, అది నాన్న నాకు ఫ్రీడంతో ఇచ్చిన అవకాశం అనుకుంటా!! అదే ఇంకాస్త ముందుకెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా కలిగించిందేమో!
అమ్మ డాక్టరుగా, నాన్న ఇంజినీరుగా పని చేస్తూ, నేను, చెల్లెలుస్కూలుకు వెళ్ళొస్తూ మా ఇల్లంతా తెగ హడావిడిగా ఉండేది. ఇంత జరుగుతున్నా మద్యలో మధ్యలో మన ప్రయోగాలు మనవే కదా!!
ఓసారి అమ్మ అడిగింది, "పెద్దయ్యాక ఏమౌతావురా" అని.
ఠక్కున మన సమాధానం, "డ్రైవర్ అవుతా"!!
కాసేపు ఓ భయంకరమైన నిశబ్దం. అమ్మకు మన రుచులు, అభిరుచుల సంగతి తెలియదు కదా పాపం. నన్నదోలా చూస్తూ ఏదో అనుకుంటూ వెళ్ళిపోయింది.
నాకు అత్యంత ఇష్టమైన బస్సు ప్రయాణంలో ఎప్పుడూ ఓ స్పెషల్ సీటు రెడీ. అదే డ్రైవర్ పక్కనే ఉన్న ఇంజిన్ బానెట్. అది ఎలా ఉన్నా సరే, డ్రైవింగ్ గమనిస్తూ కాస్త ఆయన బుర్ర తింటూ మనక్కావలసిన విషయాలు రాబడుతూంటే కొన్న టిక్కెట్టుకు పూర్తి న్యాయం చేసినట్లే. అలా బోనెట్ మీద కూర్చొని అద్దం లోంచి సుదూరాన తారు రోడ్ మీద ఏర్పడే ఎండమావులను చూడటం గొప్ప అనుభూతి.
నాన్నలో కాస్త నిశబ్దత, గంభీరత ఎక్కువ. అది పని ఒత్తిడి వల్ల అని తాతయ్య చెప్పేవాడు. నాన్నకు మంచి మూడ్ ఉంది అనే గుడ్డి గుర్తు , ఇంట్లో ఘంటసాల గారి పాట వినిపిస్తే , నాన్న చక్కటి గొంతుతో పాడుతుంటే, ఆ టైమ్ లో ఎవరూ ఆయన్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళం కాదు. అది అమ్మ పెట్టిన రూల్.
స్కూల్లో నా చదువులు టాప్ క్లాస్ కాక పోయినా, ఇంట్లో ఏ రోజూ ఇబ్బంది రాలేదు. స్కూల్లో మేం ఓ ముగ్గురం బాగా ఫ్రెండ్స్. మమ్మల్ని అమర్ అక్బర్ ఆంటోని అనేవారు తక్కిన వాళ్ళు. పేర్లకు తగ్గట్టుగా మాది ఓ సర్వమతసమ్మేళణం. ఒకరి లంచ్ బాక్స్ ఇంకోడిది. మాలోని ఆంటోని గాడు ఇప్పుడెక్కడికెళ్ళిపొయ్యాడో!!
చిన్నప్పుడు నన్ను బాగా వేధించిన విషయం అంటే మా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే ఇంట్లో లేకపోవడం. గవర్నమెంట్ ఉద్యోగులుగా అమ్మా నాన్న చాలా ఊళ్ళు తిరుగుతూ మా ఇద్దర్ని, చెరీ ఒకరు పంచుకుని చదివించేవారు.
తాతయ్యను అడిగితే నిజాయితీకి శిక్ష అనే వాడు. అర్థం అయ్యేది కాదు. నా ప్రయాణ పదనిసలు ఇంకొంచెం ముదిరి, హాస్టల్ లో ఉండాల్సొచ్చో , లేక టౌన్ పక్క పల్లెలో బంధువులతో ఉంటూ, రోజూ బస్సులో వచ్చి , స్కూల్ బస్సు పట్టుకుని తిరిగి, మళ్ళీ పల్లె బస్సులో ఇల్లు చేరాల్సొచ్చేది.
కానీ ఆ తిరిగే శిక్ష , మెల్లగా నన్ను బస్సు మీద ప్రేమకు దూరం చేయడం మొదలెట్టింది.
నేను పదో తరగతిలో ఉన్నప్పుడు తాతయ్య అన్న మాటలు అర్ధమైన రోజు రానే వచ్చింది. నాన్న పనిచేసే కరెంటు సబ్ స్టేషన్, క్వార్టర్స్ అన్నీ కలిపి కాలనీలోనే ఉండేవి. ఆఫీసు ఇల్లు పక్కపక్కనే ఉండేవి. పనుల కోసం చాలా మంది రాకపోకలు సాగేవి. అలా రాజకీయ నాయకులు కూడా వచ్చి కాస్త కఠినంగా మాట్లాడితే నాన్న వాళ్ళను గెటౌట్ అనడం, తోటి ఆఫీసర్లు నాన్నకు సపోర్టు చేయడం, జీపు డ్రైవర్ వాళ్ళకి సర్దిచెప్పడం ఇలా రభస అయ్యింది.
రికమెండేషన్ పద్దతిలో వాళ్ళ పని కావాలనడం, నాన్న రూల్స్ మాట్లాడటంతో గొడవ. ఇక మళ్ళీ ట్రాన్స్ఫర్ మామూలే. ఇవే విషయాల మీద అమ్మ కూడా నాన్నకు వత్తాసు పలకడం జరిగేది. నాన్న ఎందుకు గంభీరంగా నిశ్శబ్దంగా ఉండేవాడో అర్థమైంది. తన నిజాయితీ తన మనస్సు విరిచేసిందేమో అనేంత.
అమ్మకు మా ఇద్దరిలో ఎవరినైనా డాక్టరుగా చూడాలన్న కోరిక బలంగా ఉండేది. చాలాసార్లు ఈ మాట బయటపెట్టింది కానీ మన లోకం వేరాయె. నాన్న చదివిన కాలేజీలోనే తాను కాలుపెట్టాలన్న చెల్లెలి కోరిక, అమ్మను తన ఇష్టాన్ని వదులుకునేలా చేసింది.
నేననుకున్న మెకానికల్ బ్రాంచ్ చేరాక అత్యంత బోరు కొట్టిన సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ . ఇదే విషయంపై ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన నాన్నతో మంచి డిబేట్ కూడా నడిచేది. నా లాజిక్ ఒకటే! కనపడని దాని గురించి ఊహించి ఎలా చదవడం అని!! "ప్లగ్ లో వేలెట్టి చూడు, అండ పిండ బ్రహ్మాండాలు కనిపిస్తాయి" అని నాన్న అనడం ఇంకా గుర్తు. మా చర్చ చాలా ఆసక్తికరంగా ఉంటూ నాన్న దగ్గర విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం కలిగించింది.
నా చిన్నప్పటి నాన్నకు, ఇప్పటి నాన్నకు మధ్య ఈ చర్చల ద్వారా వచ్చిన కొత్త మార్పు నేనూ అమ్మ గమనించాం, చాలా ఆనందపడ్డాం. అలా సాగుతున్న నా కాలేజీ లైఫ్ లో ఒక పెద్ద షాక్ మా నాన్న చనిపోవడం. సడన్ గా గుండెపోటు. డాక్టర్ గా పక్కనే ఉండి అమ్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ బాధలోంచి అమ్మ ఒక బదిలీ రూపంలో తేరుకుంది.
ఎందుకో అమ్మ ఆ తర్వాత తీరిక లేనంతగా బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతూ ఉద్యోగంతో పాటు అనేక రకాల వ్యాపకాలతో రోజు మొత్తం గడిపేది. రిటైర్ అయ్యాక మాతో కూడా ఎక్కువ రోజులు గడిపేది కాదు.
అమెరికా బోరుకొట్టి చెల్లెలి దగ్గర నుండి రెండు నెల్లకే తిరిగొచ్చి నాకు ఇవన్నీ జైలు జీవితాల్లా ఉన్నాయ్, నాకంటూ గుర్తింపు ఉన్న నా చిన్న ఊరే నా ప్రపంచం అది నాకు చాలు అనేది.
ఒకరోజు అర్ధరాత్రి కిందింటి వారిని నిద్రలేపి హాస్పిటల్ కు తొందరగా తీసుకెళ్ళమని అడగడం, మెల్లగా వాలిపోపడం జరిగాయి. అప్పటికే తనకు గుండెపోటు రావడం. తాను రిటైరైన హాస్పిటల్ లోనే తుది శ్వాస వదలడం జరిగిపోయాయి.
ఇద్దరికీ వెళ్ళిపోడాానికి ఎందుకంత అర్జంటట!!
బహుశా, ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేసి ఊళ్ళో, మిత్రులు, బంధువుల దగ్గర మంచి పేరు సంపాదించి చివరకు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేదేమో!!
నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని చేపట్టాము. అదేమియనగా మా ఖాతాదారుని యొక్క ఖాతాదారుల వివరాలను ఒక పాత డేటాబేస్ నుండి కొత్త డేటా బేస్ కి వలస యొనర్చటం. ఈ క్రమంలో మేమిద్దరం కలిసి ఒక ఇరవై లక్షల ఖాతాదారుల వివరాలలో దాదాపు ఒక లక్ష (అక్కడ లక్ష అనకూడదు, ఓ వంద వేలు అనాలి) ఖాతాదారుల వివరాలని కృష్ణార్పణం చేసేసాము. ఒక లక్షే కదా అని ఊరుకోవొచ్చుగా మా ఖాతాదారుడు, ఊరుకోకుండా మా చేత ఆ తప్పిపోయిన వివరాలను వెతికించి, వలస చేయించి మాకు ఉద్వాసన పలికాడు. ఈ ఉద్వాసన పర్వం గురించి రాస్తే ఓ భారతమంత అవుతుంది ఈ కథ. ఆ విధంగ నా డెన్వర్ కొలువు మూన్నాళ్ళ ముచ్చట అయ్యింది.
మా రెసిడెంట్ మేనేజర్ పెద్దాయన మంచివాడు కాబట్టి, నన్ను డెన్వర్ కి ఓ ముప్పై మైళ్ళ దూరం లో వున్నబౌల్డర్ అనే వూరిలో వున్న జి.ఈ కంపెనీలో పడేసాడు. అందరూ చల్ల కదలకుండా డెన్వర్లో కొలువు చేసుకుంటూ వుంటుంటే నేను మాత్రం, ఓ సంవత్సరం పాటు డెన్వర్ కి బౌల్డర్ కి మధ్య బంతిలాగ దొర్లా. అట్టి ఆ జి.ఈ లో మా మేనేజర్ ఉమేష్ నారాయణస్వామి. చాలా సదాచార సంపన్నుడు మరియు కొంచెం చాదస్తుడు. ఏడు గంటలకల్లా ఆఫీసులో ఉండేవాడు, కొంపలేదో మునిగేటట్టు. నేను పడుతూ లేస్తూ డెన్వర్ నుండి ఎప్పుడన్నా, ఎనిమిది కన్నా ఓ పదినిమిషాలు మాత్రమే, ఆలస్యంగా వెళితే నా కుర్చీ వరకు వచ్చి శుభమధ్యాహ్నం అని చెప్పి వెళ్లేవాడా దుర్మార్గుడు. ఏమాటకామాట చెప్పుకోవాలి పనిమాత్రం బాగా నేర్పాడు నాకు దగ్గరుండి మరి. మా పనిలో ఎమన్నా పొరపాటు వుంటే ఉగ్రనరసింహావతారమెత్తే వాడు.
ఆయన పోరగా పోరగా సంవత్సరం తర్వాత నేను డెన్వర్ కి మరియు బౌల్డర్ కి మధ్యనున్న లూయిస్విల్ కి మకాం మార్చేసాను. అక్కడ మన భారతీయ సమూహం అస్సలుండే వారు కాదు. మేమైతే అక్కడ నివసించటమొక శిక్షగా భావించే వారము. ఎప్పుడెప్పుడు తిరిగి డెన్వర్ లో పడుదామా అని ఎదురుచూసే వారము. మా ఉమేష్ ఆ సంవత్సరము తనకు తానుగా కల్పించుకొని అందరు ప్రోడక్ట్ వెండార్స్ తో బేరాలు ఆడి ఒక మిలియన్ డాలర్స్ మిగిల్చాడు, జి.ఈ కి, లైసెన్సుల ఖరీదు మీద. అవన్నీ పూర్తి అయ్యాక వచ్చి చెప్పాడు, "హర్ష తట్ట బుట్ట సర్దుకో నువ్వు కూడా, నేను కూడా సర్దుకుంటున్నా", అని. అదేమిటి ఉమేష్, నువ్వు జి.ఈ కి ఒక మిలియన్ మిగిల్చావు నిన్నెందుకు సాగనంపుతారు అంటే, "లేదు హర్ష ! నీకు తెలియదు ఈ జి.ఈ నాయకత్వపు జనాల ఆలోచన, నేను ! ఈ సంవత్సరానికి ఒక మిలియన్, మిగల్చటంతో ఇక ఈ సంవత్సరమంతా నా దగ్గర నుండి ఇక కొత్త ఉత్పాదకత ఏమి ఉండదు, నేను కూడా ఈ ఘనకార్యాన్ని గురుంచే డప్పుకొట్టుకుంటానని వాళ్లకు తెలుసు", అని చెప్పాడు. నిజమే, ఆయన అన్నట్టే ఆయన్ని మేనేజర్ పదవి నుండి జి.ఈ తొలిగించింది. నాకొక ఆర్నెల్ల పొడిగింపు వచ్చింది. కానీ నాకు మా ఉమేష్ లేని అక్కడ పని చేయాలని అనిపించలేదు. అదియును కాక, ఎప్పుడెప్పుడు డెన్వర్ లో పడదామా అన్న కోరిక మాకు.
సరే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాము. ముందు మా పెద్దదానికి డెన్వర్ లో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద నాలుగు ఏళ్ళు నిండితే సీట్ ఇచ్చే స్కూల్ లో ప్రవేశం కోసం ప్రయత్నిద్దామని అనుకున్నాము. అందుకని ఓ రోజు మంచి ముహూర్తాన డెన్వర్ కి మా ఇంజనీరింగ్లో సీనియర్ అయినా శివకోటన్నఇంటికి వచ్చాము. పిల్లలు కాస్త తేరుకున్నాక, స్కూల్ కి పోదామని కార్ దగ్గరకొచ్చాము. పిల్లలిద్దర్నీ వెనక కార్ సీట్స్ లో కూర్చోపెట్టే క్రమంలో నేను తెచ్చిన ఫైల్ ని కార్ మీద పెట్టి, వాళ్ళని కుర్చోపెట్టాక, ఆ ఫైల్ తీసుకొని లోపలపెట్టుకోవటం మరచి అలాగే బర్రుమని స్కూల్ కి వెళ్లిపోయాం. అక్కడికెళ్లి చూసుకుంటే ఫైల్ కనపడలేదు. మా సర్వ సమస్తం ఆ ఫైల్ లోనే, మా పాస్పోర్ట్స్, నా సర్టిఫికెట్స్, పిల్లల బర్త్ మరియు వాక్సినేషన్ రికార్డ్స్, ఒకటేమిటి సమస్తం అందులోనే. మా గుండెలు జారిపోయాయి, వెంటనే పరుగు పరుగున శివకోటన్న అపార్ట్మెంట్ కి వచ్చాము. అక్కడ మాకు మా ఫైల్ కనపడలేదు, ఒక్క సారి కుప్పకూలిపోయాము. దేశంగాని దేశంలో సంబంధిత కాగితాలన్నీ పోగొట్టుకొని, ఏమిరా ఈ శిక్ష అనుకుంటూ. సరే ధైర్యం తెచ్చుకొని శివకోటన్న వాళ్ళ అపార్ట్మెంట్ లోని అన్నీ కామన్ పరిసరాల్లో ఒక నోటీసు పెట్టాము, ఎవరికన్నా మెరూన్ కలర్ ఫైల్ దొరికితే మాకు ఫోన్ చేయండి అని. ఎవరూ చేయలా, ఆ రోజు సాయంత్రం దాకా ఎదురు చూసి, మా వూరెళ్ళిపోయాము.
శివకోటన్న మరునాడు ఫోన్ చేసి, ఫైల్ తెచ్చి ఇచ్చినవాళ్లకు 5
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
From the publisher's feed

52 Listeners