Sign up to save your podcasts
Or

‘అంటుకొమ్మ’ కథ శ్రీ అక్కిరాజు భట్టిప్రోలు గారు రాసిన ‘మూడు బీర్ల తర్వాత’ అనే పుస్తకం లోనిది. తన మూలాలను వెతుక్కుంటూ, ఒక మహిళ చేసే ప్రయాణమే ఈ కథ. కథను చాలా వాస్తవికంగా, ముగింపును హృద్యంగా చిత్రీకరించారు రచయిత.
విభిన్న అంశాలను స్పృశిస్తూ అక్కిరాజు గారు రాసిన ‘ మూడు బీర్ల తర్వాత’ ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన అతి చక్కని కథాసంపుటాల్లో ఒకటి.
పుస్తకం కొనడానికి కావాల్సిన web link …. https://bit.ly/3d4M0lv
కథను మీకందించడానికి అనుమతినిచ్చిన అక్కిరాజు గారికి కృతజ్ఞతలు.
అంటుకొమ్మ
“అంటు కట్టడం” అంటే? ఈ చెట్టు కొమ్మని నరికి, కొంతమేర పై చెక్కు తీసి మరో చెట్టు కొమ్మకి అతికించి, పైన మట్టి కప్పి గట్టిగా కట్టెయ్యడం. ఈ కొమ్మ ఇమడ గలిగితే ఆ చెట్టు కొమ్మే అయి పూలూ పండ్లు కాస్తుంది. లేదా మాడి చస్తుంది. అప్పుడు మరో కొమ్మని తెచ్చి అతికించుకోవచ్చు. విషయ మేమంటే, అతుకుకొమ్మకు కాసే పండ్లని కూడా కొత్త చెట్టు పండ్లనే పిలుస్తారు. అదీ తమాషా! అతుకు కొమ్మలు బతికినా చచ్చినా ఒకటే… లెక్కలోకి రావు.
నల్లటి రోడ్డు మీద పరిగెడుతోంది కువాలిస్. “సంధ్యా! కాస్తా వాటర్ బాటిల్ అందుకోవే…. మీ నాన్నకి”
మధ్య సీట్లో కూర్చున్న అనసూయమ్మ వెనక సీట్లో ఉన్న కూతుర్ని అడిగారు. బయటికి చూస్తున్న సంధ్య కాళ్ళ దగ్గరున్న బాటిల్ తీసి తల్లికిచ్చింది.
బాటిల్లో నీళ్ళు, తన దగ్గరున్న డిస్పోజబుల్ గ్లాసులో పోసి భర్త కందించారు అనసూయమ్మ. ఆ మంచి నీళ్ళు రెండు గుక్కల్లో తాగేసి మళ్ళీ ఖాళీ గ్లాసు భార్య కందించారు సదాశివరావు. ఆవిడ ఆ గ్లాసుని ముందున్న డ్రైవర్ కిచ్చి “కాస్త బయట పడెయ్యి నాయనా” అంది.
ఏ.సి. కారు పుణ్యమా అని అన్ని డోర్లూ బిగదీసుకు కూర్చున్నారేమో, పెద్దావిడకి అద్దం ఎలా దించి గ్లాసు బయట పడేయాలో తెలీదు. తదేక దీక్షతో డ్రైవ్ చేస్తున్న రాముడు ఒకచేతిని స్టీరింగు మీదే ఉంచి, అలవోకగా మరో చేత్తో గ్లాసందుకుని, అదే చేత్తో అద్దాన్ని కూడా దింపేసి, గ్లాసు బయట పడేసి మళ్ళీ అద్దాన్ని మూసేశాడు.
తను మంచినీళ్ళు తాగడం అనే కార్యక్రమంలో మొత్తం ముగ్గురు పాలు పంచుకుని అంకిత భావంతో నిర్వర్తించడాన్ని తృప్తిగా గమనించి, గమనించకుండా అన్నారు సదాశివరావు…
“ఈ ఊళ్ళెంత మారిపోయాయో…”
“మనం రావట్లేదని ఊళ్ళు మారకుండా ఉంటాయేమిటి” అన్నారు అనసూయమ్మ.
ఆవిడ మాట పూర్తవకుండానే అరచినట్టుగా అన్నాడు ముందు సీట్లో కూర్చున్న పన్నెండేళ్ళ శశి. “దిసీజ్ సో ఫన్నీ”
అంటూనే తన చేతిలో ఉన్న కాంకాక్టర్ని ముందుకు ఫోకస్ చేశాడు. అంత ఆశ్చర్యం కలిగించే విషయమేమిటా అని అందరూ చూశారు.
కువాలీస్ కి అడ్డంగా రోడ్డు మీద మేకల దండు. ఆ మందకి అటువైపు ఓ లారీ ఆగి ఉంది. ఈ మధ్యలో ఓ ఆసామి ఆ మేకలన్నింటినీ ఓ వరసలో అమర్చి ట్రాఫిక్ ని పంపించే ప్రయత్నంలో ఉన్నాడు.
అతి సహజంగా ఉన్న ఈ సంఘటన శశికి మాత్రం ఆశ్చర్యమే. వెనక సీట్లోంచి సంధ్య అందుకుంది.
“రోడ్డు మీద గొడ్డూ గోదా అడ్డం రావడం వీడెప్పుడు చూశాడు…”
అమెరికాలో పెరుగుతున్న తన కొడుకు శశిని మిగతా వాళ్ళందరికీ అర్థం చేసే ప్రయత్నం చేసింది.
“ఏవిట్రా మీ దేశంలో గొడ్డూ గొదా ఉండదేవిరా? ఏం తింటారూ ఏం తాగుతారూ?” తాత గారు మధ్య సీట్లోంచి.
“అక్కడ గొడ్డూ గోదా లేక పోవట మేంటి నాన్నా… పాలూ పెరుగూ చీజ్ సుబ్బరంగా తింటారు. పాలూ పెరుగూ మాత్రమేనా… ఆ గొడ్డూ గోదానే ఏకంగా తినేస్తారు. కాకపోతే అవిలా రోడ్డు మీదకి రావు. పొరపాటున వచ్చినా ఏ ట్రక్కు కిందో పడి పోవాల్సిందే తప్ప, ఇలా తీరిగ్గా తోలుతూ కూచోరు” అంది సంధ్య.
అడ్డు తొలగటంతో మళ్ళీ బయల్దేరింది వాహనం.
మొత్తం అందులో ఇద్దరు పిల్లలూ, ఐదుగురు పెద్దవాళ్ళూ ఉన్నారు, రాముడు కాక. డ్రైవర్ సీటు పక్కన ఇద్దరు పిల్లలు సంధ్య కొడుకు శశి, శంకరం కూతురు భార్గవి కూర్చున్నారు.
మధ్యసీట్లో పెద్దవాళ్ళిద్దరూ అనసూయమ్మ, సదాశివరావు గారు.
చివరి సీట్లో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవచ్చని శంకరం, శంకరం భార్య లత, శంకరం చెల్లెలు సంధ్య కూర్చున్నారు.
“అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది” అంది లత, సంధ్య ని ఉద్దేశించి.
“వస్తాననే అన్నారు వదినా. బెజవాడలో వాళ్ళ ఫ్రెండ్స్ వదల్లేదు. మనతో రావాలో వాళ్ళతో వెళ్ళాలో తికమక పడుతుంటే నేనే అన్నా, మన వాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు కలుస్తూనే ఉంటాం, మీ ఫ్రెండ్‌తోనే వెళ్ళండి అని” భర్త రాక పోవడాన్ని తన మీదే వేసుకుంది సంధ్య.
“అయినా మనం తిరిగి ఇంటికి చేరేటప్పటికి ఆయన కూడా వచ్చేసే ఉంటార్లే” అని ముక్తాయించింది.
ఎంత ఎ.సి. కారు అయినా, నిండుగా ఉన్న మనుషులు, వేసవి కాక పోయినా కాస్తున్న బయటి ఎర్రటి ఎండ కలిసి లోపల ఉక్కగానే ఉంది.
ఏదన్నా కూల్ డ్రింక్ తాగుదాం. ఇక్కడ ఏవన్నా చల్లగా దొరుకుతాయేమో చూడు” అన్న శంకరాన్ని ఉద్దేశించి సంధ్య.
ఇక్కడేం చల్లగా దొరుకుతాయే. ఏదో ఓ చిన్న ఫ్రిజ్ పెట్టుకుని కూర్చుంటారు. వచ్చీ పోయే కరెంటుతో నీకు కావాల్సినంత చల్లగా ఏమీ దొరకవు. ఆ బాటిల్ లో ఉన్న నీళ్ళే నయం” తేల్చి చెప్పాడు శంకరం.
తనలా అంటుండగానే అందరి తలలు అప్రయత్నంగా కారు బయటకి, రోడ్డు వెంబడి చూట్టం మొదలు పెట్టాయి, కూల్ డ్రింక్ షాప్ కోసం.
“రెండేళ్ళనించీ సరయిన వానల్లేవు. కాలవల్లో నీళ్ళు రావటం మానేశాయి. నాట్లు కూడా పళ్ళేదు ఇంకా. అదంతా పిచ్చి గడ్డి. ఇక్కడే ఇలా ఉంటే మెట్ట ప్రాంతాల పరిస్థితి ఏమిటో. జనాలు పురుగుల మందులు తాగేస్తున్నారంటే తాగరూ?” వరి పొలాల్లో మొలిచిన పిచ్చిగడ్డిని చూపిస్తూ బయట దృశ్యాన్ని స్వగతంలా వివరించాడు శంకరం.
“మరే! ఏమిట్రా నాయనా ఆ వార్తలు. తెలుగు పేపర్ చదవాలంటేనే భయమేస్తోంది. మొదటి పేజీలో ఆత్మహత్యల స్కోరూ, చివరి పేజీలో క్రికెట్ స్కోరు” విరక్తిగా అంది సంధ్య.
“ఆ రెండు పేజీల మధ్య చూడాలి స్టాకు మార్కెట్, హైటెక్ వైభోగం” కసిగా అన్నాడు శంకరం.
“సర్లేరా! నువ్వు మరీ అతి, వానలు పడక పోవటానికి రైలు లేగా రావటనికి కూడా హైటెక్కే కారణమనగల సమర్థుడివి” తేల్చేసింది సంధ్య.
“వాట్స్ దట్ మాం?” అన్నా చెల్లెళ్ళ సంభాషణని తుంచేస్తూ అడిగాడు శశి.
రోడ్డు పక్క నల్లటి కుండల్లోంచి తెల్లటి నురగతో తొంగి చూస్తూ అమ్మాకానికి దంగా కల్లు. కనీసం కిలో మీటరుకు ఒక చోటన్నా కుండల్లో కల్లు పెట్టుకుని కూర్చున్నారు.
“అదా! కల్లు… ఆ తాటి చెట్లలోంచి వస్తుంది. ఆ పైన చూడు చెట్లకి కుండలు కట్టి ఉన్నాయా… అందులోంచి వచ్చిన కల్లుని ఇలా అమ్ముకుంటారు” విడమర్చి మేనల్లుడికి చెప్పాడు శంకరం. అక్కడితో ఆగకుండా……
“అవునే.. నీకు ఏదన్నా చల్లగా కావాలన్నావుగా… ఇంతకు మించి చల్లటిది ఈ ప్రాంతంలో దొరకదు. ఓ కుండ కొనమంటా వేమిటి” చెల్లెలితో పరాచికాలాడాడు.
“కొనరా! బెదిరిస్తున్నావా… నువ్వొకటి తాగు, ఆ తర్వాత నేనొకటి తాగుతా” అన్నని కవ్వించింది సంధ్య.
“వాడితో పెట్టుకోకే… కల్లు కొన్నా కొంటాడు. గొడ్లని కాసుకునే వాళ్ళతో పెరిగాడు. ఇప్పడూ వాళ్ళ వెంటే, వాళ్లని వెనకేసుకునే వస్తాడు వాడు. బ్రాహ్మణ పుటక పుట్టి చెరువు గట్టున పిట్ట మాంసం తింటుంటే ఈడ్చుకొచ్చాను వెళ్లి వోసారి. వాళ్లే అడుగు.” తండ్రి మధ్యలో ప్రవేశిస్తూ అన్నాడు.
సంధ్య గతుక్కు మంది. తన భర్తా, కొడుకూ సుబ్బరంగా బీఫ్, పోర్క్ అన్నీ తింటారని తెలిస్తే అనుకుంది. తను కూడా కల్లు కాక పోయినా చక్కగా వైన్ తాగగలదని తెలిస్తే వీళ్లెలా రియాక్ట్ అవుతారో అనుకుంది.
“పెట్టమాంసమేం ఖర్మా… కల్లు కూడా గొప్పగానే ఉంటుంది. మా క్లాసులో త్రిమూర్తులు గాడుండే వాడు ఐదు నుండి పది దాకా. వాడెప్పుడూ ఏ తాటిచెట్టుకు ఎన్ని కుండలున్నాయో చూస్తుండే వాడు. వాడికి బలే లెక్క ఉండేది. ఒక్కోసారి వెంటనే కుండని దించక పోతే కుండనిండి ఒక్కో చుక్కా కింద పడుతుండేది. అది ఆగి ఆగి పడుతుంది. వీడు బలే కని పెట్టేవాడు. చెట్టు కింద నించుని పైకి చూసే వాడు. రెండు నిమిషాలకో చుక్క పడేది. వీడు అరచేత్తో దాన్ని కాచ్ పట్టి నాకే వాడు. కొన్ని రోజులకి మా గాంగ్ అంతా వాడి పక్కన చేరి పడే ప్రతి చుక్కనీ పోటీ పడి కాచ్ పట్టే వాళ్ళం. ఫ్రెష్ కల్లు ఎంత తియ్యగా ఉంటుందనుకున్నావ్” చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటూ శంకరం.
“నాకు తెలియని వెధవ్వేషాలు ఇంకా ఎన్ని వేశావురా. నేను పోయే దాకా నీ గురించి కొత్త సంగతులు తెలుసుకుంటూనే ఉంటాను” పెదవి విరిచేశారు సదాశివరావు.
“ఛీ కల్లు తాగావా డాడీ” అంది అంతసేపూ మౌనంగా ఉన్న శంకరం కూతురు భార్గవి.
“పిల్లల ముందు ఇలాంటివే మాట్లాడండి” మందలించింది లత. మళ్ళీ వెలక్కాయ గొంతులో పడింది సంధ్యకి.
మందు, మాంసం గురించిన విషయాలు పిల్లల ముందు మాట్లాడ్డం కూడా తప్పునుకునే ఈ కుటుంబంలోంచి వచ్చిన తాను ఎంతదూరం ప్రయాణించానా అనుకుంది. అయినా అన్న గానీ, తాను గానీ ఏనాడూ అంత చాదస్తంగా పెరగలేదులే అనుకుని సమాధాన పడింది.
“దాన్ని నాగలి అంటారు. దుక్కి దున్నుతారు దాంతో” శశికి చెప్తోంది భారవి. రోడ్డు పక్క పొలంలో ఓ నాగలి, జోడెడ్లు, వాటిని అదుపు చేస్తున్న రైతు, ఆతని చేతిలో ఓ చిన్న ముల్లు కర్ర.
“ఇంకా నాగళ్ళు ఉన్నాయా. ఈ పాటికి ట్రాక్టర్లు మింగేసి ఉంటాయనుకున్నాను” అంది సంధ్య.
“నాగళ్ళు ఇంకా ఉన్నాయి కొదో గొప్పో. ఎడ్ల బళ్ళు మాత్రం చాలా తగ్గి పోయాయే” అన్నాడు శంకరం.
“గుర్తుందిరా… చట్రాన్ని పిడకల్లో కాల్చి బండి చక్రానికి బిగించే వాళ్ళు. ఎర్రగా కాలిన చట్రం చక్రానికి తగలగానే మంటలు లేచేవి. వడ్డా వాళ్ళ పిల్లలు గబ గబా బక్కెట్లలో నీళ్ళని చెంబులో ఆ చట్రం చుట్టూతా పోస్తూ మంటల్ని ఆర్పే వాళ్ళు.”
ఎక్కడో పడి ఉన్న చిన్నప్పటి పల్లె జ్ఞాపకాల్ని తిరగతోడుకుంటూ అంది సంధ్య.
చెల్లెలి వంక చూశాడు శంకరం. ఎడమ చేతి మణికట్టు మీద మచ్చ కనపడింది, సన్నటి అమెరికన్ బ్రాండ్ వాచీ కిందనించి. తన పక్క తొక్కుడు సైకిలు మీంచి కిందపడి, చేతి గాజులు పగిలి గుచ్చుకున్నప్పుడు పడింది ఆ గాటు. ఎక్కడో అమెరికా వెళ్ళి దూరమయిపోయిన అమెరికా “సంధ్య” లోంచి తనకి తెలిసిన చెల్లెల్ని చూసుకున్నాడు.
“ఇంకా ఎంత దూరంరా…” బయటకు చూస్తూ అడిగింది తల్లి.
“వడ్లమన్నాడు రావటానికి ఇంకో అరగంట. అక్కణ్ణించి ఇంకో పావుగంట గురివింద గుంటకి” లెక్కేసి చెప్పాడు శంకరం.
గురివిందగుంట అనసూయమ్మ గారి పుట్టినిల్లు. ఆవిడ చిన్నతనమంతా అక్కడే గడిచింది. శంకరం, సంధ్యలక్కూడా అమ్మమ్మగారి ఊరు ఆటవిడుపు చిన్నతనంలో, ఎండాకాలం శెలవులకోసం ఎదురుచూస్తూ ఉండేవారు అమ్మమ్మ దగ్గరికి పోవటానికి,
విమానం దిగుతూనే అంది సంధ్య “ఒరేయ్, ఈసారి ఏమయినా సరే గురివిందగుంట వెళ్ళి తీరాల్సిందే అని.”
“అక్కడేం ఉందే. ఊరు ఊరే లేకుండా పోయింది. మనకి సంబంధించి ఏమీలేదు, మనకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అయినా మనవాళ్ళేమిటీ… అసలు ఊరే మాయమయిందంటుంటే…” శంకరం.
“ఏమున్నా లేకపోయినా ఆవూరు వెళ్ళాల్సిందే” నని తీర్మానించింది సంధ్య.
నిజానికి కావాలనే భర్తని ఈ ప్రోగ్రాం నించి తప్పించింది సంధ్య. ఆ ఊరిని చూసి ఎంతో ఉద్వేగానికి లోనవుతుంది తల్లి అని ఆమెకు తెలుసు.అల్లుడి ముందు అనవసరపు భేషజాలతో పూర్తిగా ఆ ఆనందాన్ని అనుభవించలేదేమోనని సంధ్య భయం.
“అమ్మగారూ కొత్త ఆంజనేయ సామి గుడి” రాముడు రాబోతున్న గుడిని చూపిస్తూ. చక్కటి రంగులతో, చుట్టూతా ప్రహరీ గోడతో మంచి గుడి.
అప్రయత్నంగా సంధ్య, లతలు కళ్ళకద్దుకున్నారు.
కొద్దిగా ముందుకెళ్ళాక ఓ చిన్న కూలిపోవడానికి సిద్ధంగా ఓ బడి. “మండల ప్రాథమిక పాఠశాల” తడువుకుంటూ చదివింది సంధ్య. దాని పక్కనే “గ్రామ పంచాయతీ” కార్యాలయం అదే స్థితిలో.
ఆ ఊరు దాటి కొంచెం దూరం వెళ్ళాక. –
“సంధ్య, చూడవే 100 అడుగుల వినాయకుడి విగ్రహం. కిందటి సంవత్సరమే పెట్టారు” రోడ్డు పక్కనే అంతెత్తున ఉన్న బ్రహ్మాండమయిన విగ్రహం.
సంధ్య ఈసారి కళ్ళ కద్దుకోలేదు.
అనుమానంగా చూస్తూ “వానల్లేవు, అంతా దరిద్రం అన్నావు కదరా. ఇన్ని కొత్తగుళ్ళేమిట్రా” అంది.
“దరిద్రం మనిషికి గానీ దేవుడికి కాదుగా” వైరాగ్యంగా అన్నాడు శంకరం.
“అమ్మగారూ వచ్చేవూరు చూడండి. కొంచెం పెద్దదే ఊరు. రెండు సాయిబాబా గుళ్ళు అక్కడ. రెండూ ఈ మధ్యనే కట్టారు” రాముడు.
“రెండా… రెండూ షిర్డీ సాయి బాబావే?” అనుమానంగా సంధ్య.
“ఆహా! రెండూ షిర్డీ సాయివే… కాకపోతే ఒకటి కమ్మ సాయిబాబా, ఒకటి కాపు సాయి బాబా” అంటూ విరగబడి నవ్వాడు శంకరం.
“అవున్నాన్నా, బ్రాహ్మల రామాలయం ఏమయింది” నవ్వాపుకుంటూ తండ్రిని రెచ్చగొడుతున్నట్టుగా అడిగాడు శంకరం.
విననట్టుగా నటించి తలతిప్పుకున్నాడు తండ్రి.
“భగవంతుడా, నీకే గతి పట్టింది” పై పైన చెంపలు వేసుకుంటూ బయటకే అంది సంధ్య.
ఎవరి ఆలోచనల్లోకి వాళ్ళు వెళ్ళి పోయారు. కొంతసేపు మౌనంగా గడిచింది. “వడ్లమన్నాడు వచ్చేశాం” అని రాముడు డిక్లేర్ చేసిందాకా.
ఇక్కడ అర్థరాత్రిళ్ళు దిగేవాళ్లం. వానల్లో అయితే మోకాల్లోతు బురదలో పోవాల్సిందే. చచ్చేవాళ్ళం” అందరికీ తెలిసిన సంగతే చెపుతున్నారు అనసూయమ్మ. ఆ గొంతులో కొత్తగా వచ్చిన ఉత్సాహాన్ని అందరూ గమనించారు. బహుశా ఇక్కణ్ణించే ఆవిడ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి కావును.
వాను మెయిన్ రోడ్డు విడిచి గురివిందగుంట దారి పట్టింది. అదికూడా తారు రోడ్డే, చిన్నదిగా, గుంతలతో ఉంది.
“ఇక్కడే మా చంద్రం బాబాయి తల పగలగొట్టారు. కాలవల దగ్గర గొడవ. బతుకుతాడనుకోలా.”
“మా మావయ్యగారి రెండో అమ్మాయిని ఈ ఊరే ఇచ్చారు. ఇప్పుడేమయి పోయారో.”
“ఇక్కడో మూగాడుండేవాడు. వాడికి అప్పుడప్పుడూ పిచ్చ కూడా పడుతుండేది. మగవాళ్ళూ, పెద్దవాళ్ళు కూడా భయపడే వాళ్ళు రాత్రుళ్ళు ఒంటరిగా రావటానికి ఈ దా వాడి పిచ్చ ముదిరినప్పుడల్లా.”
“ఇక్కడో డాబా ఉండాలి. అప్పట్లో అదొక్కటే ఇక్కడ.
కోమట్లది.” గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా ఆవిడ చెప్తూనే ఉంది.
అవన్నీ ఏదో చరిత్రలోకెక్కాల్సిన సంఘటనల్లా చెప్తున్న ఆవిడని ఎవరూ వారించలేదు. ఆశ్చర్యంగా అవన్నీ అందరికీ ఆసక్తి కరంగా ఉన్నాయి.
అలా సాగుతుండగానే గురివిందగుంట వచ్చేసింది. పక్కగా చెట్టుకిందకి తీసి ఆపేశాడు రాముడు. మెల్లగా అందరూ దిగారు.
తన చిన్న పర్సు తీసుకుని దిగారు అనసూయమ్మ. తన వూరు. తాను చిన్న పిల్లలా పరుగులెట్టి అల్లరి చేసిన ఊరు. ఆయాసంతో నడవలేనేమో నని భయంతో ఇన్హేలర్ ని చిన్న పర్సులో పెట్టుకుని దిగింది.
“ఏమిట్రా ఇదేనా మన వీధి. ఇళ్ళే లేవేమిట్రా” శంకరాన్ని ఉద్దేశించి.
“ఇక్కడెవరూ ఉండట్లేదుటమ్మా. ఉన్న కొంతమంది కూడా వడ్లమన్నాడు వైపుకు కదిలారు. ఎందుకో తెలీదు” జవాబిచ్చాడు శంకరం.
నడుస్తున్న అనసూయమ్మ ఆగిపోయారు.
“ఇదే ఇక్కడే మన ఇల్లు ఉండేది. మట్టి ఇల్లు. పెద్ద వసారా. గుర్తుపట్టలేక పోయాను ఒక్క నిమిషం.” ఓ గొడ్ల సావిడి చూపిస్తూ అంది.
“శశీ మీ అమ్మ పుట్టింది అక్కడే” గొడ్ల సావిణ్ణి చూపిస్తూ చెప్పాడు శంకరం. “తనెక్కడ పుట్టాడో అడగరా మావయ్యని” తిప్పి కొట్టింది సంధ్య.
శశి ఇద్దరి మాటలు వినకుండా శ్రద్ధగా కాంకార్డర్లో అన్నీ రికార్డ్ చేసుకుంటున్నాడు.
“ఎదురుగా మా పెదనాన్న గారి పెంకుటిల్లు ఉండాలి. వాళ్ళు మేమూ ఇక్కడే నడి వీధిలో నులక మంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం ఆరుబయట.” సగం కూలిన ప్రహరీ గోడని చూపిస్తూ అనసూయమ్మగారు. .
ఈ లోగా ఆగిన వాన్ నీ పట్నం మనుషులనీ చూసి కొందరు ఊళ్ళో వాళ్ళు చేరారు. ఎవరూ ఏమిటీ అని ఆరా తీశారు. అందులో ఎవరో ఒకరిద్దరు పెద్దవాళ్ళు అనసూయమ్మగారిని గుర్తుపట్టారు… లేదా గుర్తించారు. ఎవరి తాలూకానో.
అరనిమిషంలో వాళ్ళమధ్య కల్సిపోయారు అనసూయమ్మ. ఎక్కడెక్కడివో పేర్లు. వాళ్ళెక్కడా, వీళ్ళెక్కడా, ఆయ్యో ఆయన పోయారా, ఈ విడది ఇప్పుడు ఏవూరూ… మాటలు సాగిపోతున్నాయి.
“ఎందుకులేమ్మా… ఈ ఊరేకాదు… చుట్టు పక్కల చాలా దూరందాకా బ్రాహ్మణ కుటుంబాల్ని వెతికి పట్టుకోవాల్సిందే. ఈ ఊళ్ళో అయితే ఒక్కటీ మిగల్లేదు” ఓ పెద్దావిడ చెప్తోంది.
“అందరికంటే ముందు ఈ ఊళ్ళని వదిలేసింది బ్రాహ్మలే” ఓ పెద్దాయన. అది నిందో, మరోటో తెలీలేదు శంకరానికి.
వ్యవసాయమూ, వృత్తులూ పోయి పల్లెలు వదిలేసి బతుకు తెరువు కోసం పట్టాణాలకి పోవటం సరే, జరుగుతున్నదే. బ్రాహ్మలు నగరాలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కరణీకాలు పోకముందు, పౌరోహిత్యాలు దొరుకుతున్నప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు?
‘పల్లెల్లో బ్రాహ్మలు కూడా వ్యవసాయాలు చేశారు” అంటాడు తండ్రి. ఆ వ్యవసాయాన్ని కూడా ముందే వదిలేసింది బ్రాహ్మలే అని ఇక్కడి పెద్దాయన అభియోగం.
“అవసరాలు, అవకాశాలు రెండూ తరిమేశాయిరా మనుషుల్ని పల్లెల్నించి. బ్రాహ్మలెప్పుడూ చదువులవెంటే పరిగెట్టారు. వ్యవసాయం నించీ, కులవృత్తి నించీ కూడా గవర్నమెంటు ఉద్యోగాలు వెతుక్కుంటూ పరిగెట్టారు. అలా అవకాశాల్ని వెతుక్కుంటూ వెళ్ళిన మొదటి వాళ్ళు బ్రాహ్మలు. ఇవ్వాళ కరువుతో కడుపు పట్టుకు పరిగెడుతున్న వాళ్ళు రెండో రకం.” పెద్దగా చదువుకోక పోయినా తల్లి చెప్పిన సాంఘికశాస్త్రం గుర్తుకు వచ్చింది శంకరానికి.
“చెరువు దగ్గరికి నడుద్దాం” పక్కనే ఉన్న చెరువు వైపు అడుగులు వేస్తూ అనసూయమ్మ గారు.
రెండడుగులేస్తే ఆయాసంతో ఇబ్బంది పడే పెద్దావిడకి ఇంత శక్తి ఎక్కణ్ణించి వచ్చిందా? అని ఆశ్చర్యపడుతూ అనుసరించారు అందరూ.
పెద్ద మురుగ్గుంటలా ఉంది. చెరువు.
“శశీ ఇక్కణ్ణించే బంకమన్ను తీసి బొమ్మలూ, గురుగులు చేసే వాళ్ళం” చిన్న పిల్లలా అరిచింది సంధ్య.
“యు మీన్ ఫ్రం దిస్ అగ్లీ లేక్ “ మొహం అసహ్యంగా పెట్టి శశి.
“అప్పుడు బానే ఉండేదిరా. ఈ నీళ్ళే తాగే వాళ్ళం. చెరువులో స్నానాలూ అవీ చేసే వాళ్ళం కాదు.
జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం చెరువుని. మా అమ్మ మడి కట్టుకుని, ఆ తడి గుడ్డలతోనే బిందెలతో తాగడానికి నీళ్ళు తెచ్చేది. పాలేళ్ళు కావిళ్ళలో మామూలు అవసరాలకి నీళ్ళు తెచ్చేవాళ్ళు ఇక్కణ్ణించే. గేదెలు ఈనితే జున్ను పాలు బోలెడు మిగిలి పోయేవి… తిన్నంత తినగా. తెల్లవారు ఝామున బిందెతో ఆ పాలన్నీ తీసుకెళ్ళి చెరువులో కలిపేసేది మా అమ్మ.” అనసూయమ్మ గారి జ్ఞాపకాల వరద ప్రవహిస్తూనే ఉంది.
“అయ్యో వేరే వాళ్ళకి ఇవ్వచ్చుకదే” నొచ్చుకుంటూ అంది సంధ్య.
“ఆ రోజుల్లో ఎవరింట్లో పాడిలేదు? అదీకాక అన్ని జున్ను పాలు చూస్తే గేదెలకి దిష్టి తగులుతుందని భయం కూడా…. ఏదో పిచ్చ” అనసూయమ్మగారు. _
“అమ్మా ఇక్కడ గుడి ఉండాలి కదే” సంధ్య, తనకి గుర్తున్న వైపు చూస్తూ,
“అటే పద” అంటూ నడిచింది తల్లి.
ఓ చిన్న పాడుబడి, కూలిపోవడానికి సిద్దంగా ఉన్న గుడి. ముందు ఊడ్చి చిన్న ముగ్గేసి ఉంది. లోపలికి తొంగి చూసి ఎవరో దీపం పెడుతున్న ఆనవాళ్ళున్నాయని నిర్ధారణ చేసుకున్నారు అనసూయమ్మ.
పక్కూరినించి వారానికోసారి పూజారి వచ్చి దీపం పెడతాట్ట. గుడిపక్కన ఇంటావిడ రోజూ వాళ్ళ గుమ్మంతో పాటు గుడి ముందు కూడా ఊడుస్తుందట.
“ఇదెంత పాత గుడో తెలుసా? 150 ఏళ్ళకి పైమాటే. స్వాతంత్ర్యానికి ముందు బందరు నించి కాంగ్రెసాయన ఒకరు ఏవో కరపత్రాలు తీసుకుని అన్ని పిల్లలు కాలి నడకన తిరిగి పంచే వాడు. ఆయన ఈ గుడిముందే నుంచుని గట్టిగా చదవటం నాకింకా గుర్తె. ఇలాంటి చరిత్ర ఉన్న గుళ్ళన్నీ ఇట్లా పాడుబడి పోతుంటే… కొత్త కొత్త గుళ్ళు కావల్సి వచ్చాయి ఒక్కొక్కడికి. అయోధ్య పరిగెడతార్ట గుడి కట్టడానికి. దౌర్భాగ్యపు తరంరా మీది” అక్కసుగా అన్నారు అనసూయమ్మ.
“నీకు తెలిసిన రాజకీయాలు ఆపవే” సదాశివరావు గారు తన సహజ ధోరణిలో భార్య ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు.
“మనమిక్కడ ఉండనే ఉండము. ఇక్కడ వాళ్ళు ఎలా ఉండాలో మనమెలా చెప్తామే? ఏం హైదరాబాదు మాత్రం అలాగే ఉందా? ఒకప్పుడు హైదరాబాదు అని ఒక్క బొమ్మలో చెప్పాలంటే అందమైన చార్మినార్ బొమ్మని వేసి చూపించే వాళ్ళు. ఇప్పుడు హైటెక్ సిటీ బొమ్మ చార్మినార్ ని చెరిపేసింది” రెంటికీ సంబంధం ఉందో లేదో గానీ, తనకి తోచింది చెప్పాడు శంకరం.
“సరే ఇహ బయల్దేరదామా?” సదాశివరావు గారు వాచీ చూసుకుంటూ అన్నారు.
ఆయన మాట ఓ ఆజ్ఞలా అందరూ తిరిగి వాన్ వైపు బయలు దేరారు. వాన్ ఎక్కాక అన్నారు అనసూయమ్మ.
“ఒక్కసారి పుల్లపాడులో ఆగుదాంరా… పెద్దగా రాకపోకలు లేకపోయినా, మా బాబాయి వరసయే కుటుంబం ఒకటి ఉంది అక్కడ. ఆ బాబాయి మనవల్లో ఒకడింకా అక్కడే ఉన్నాట్ట. వాళ్ళ ఇంటి పేరూ మా ఇంటి పేరూ ఒకటేట. వాళ్ళింట్లో మా కుటుంబానిది వంశవృక్షం కూడా ఉందిట” ఎప్పుడు, ఎక్కణ్ణించి ఈ విషయాన్ని సేకరించిందో తెలీదు.
“అదేనా ఇంకా ఏమన్నా ప్రోగ్రాములున్నాయా? ముందే చెప్పు సరిగ్గా ప్లాన్ చేసుకుందాం” నవ్వుతూ అన్నాడు శంకరం.
వాన్ మళ్ళీ దారి పట్టింది. అరగంటలో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్లపాడు చేరింది వాన్. శంకరం దిగి వాకబు చేశాడు. ఇంటి పేరు చెప్పి బ్రాహ్మల ఇల్లు అని అడిగిన వెంటనే వచ్చింది సమాధానం. అయిదు నిమిషాల్లో వాన్ ఓ పాత మట్టి ఇంటి ముందు ఆగింది.
అందరూ దిగారు. పెద్ద మనిషిలా సదాశివరావు గారు ముందుగా ఇంట్లోకి నడిచి పరిచయం చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు హడావిడిగా మంచాలూ, కుర్చీలు వాల్చి వచ్చిన వాళ్ళని కూర్చో పెట్టారు.
మొత్తానికి అనసూయమ్మ గారి బాబాయి వరస పెద్దాయన పోగా, ఆయన మనవల్లో ఒకడైన విశ్వం ఆ ఇంటినే అంటి పెట్టుకుని ఉన్నాడని తెలిసింది. వాళ్ళ అమ్మానాన్న కూడా హైదరాబాదులో వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నార్ట.
“మీ నాన్న తాత, మా తాత అన్నదమ్ముల వరస. మరీ దూరపు చుట్టరికమేం కాదు.” అనసూయమ్మ చెప్తున్నారు.
మర్యాదలూ అవీ అయ్యాక మొత్తానికి ఇద్దరికీ తెలిసిన బంధువుల పేర్లూ ఊర్లూ కబుర్లూ దొరికించుకున్నారు. ఆ సంభాషణని తుంచలేకా, పాలు పంచుకోలేకా ఇబ్బంది పడ్డారు శంకరం, సంధ్య, లతలు.
“మీ దగ్గర వంశవృక్షం ఉందిట కదా… మీరు మాట్లాడుతూ ఉంటే మేం ఓసారి చూస్తాం” శంకరం మర్యాదగా అడిగాడు.
“అవునవును…. ఆ సంగతే మర్చేపోయాను” అన్నారు అనసూయమ్మ గారు.
లోపలున్న భార్యని పిలిచి వంశవృక్షం తెప్పించాడు విశ్వం. ఓ పెద్ద కాగితాన్ని చుట్టలా చుట్టి ఉంచారు. దాన్ని జాగ్రత్తగా విప్పిదీసి చూపించారు. అది కంప్యూటర్‌లోంచి ప్రింట్ చేసిందని తెలుస్తోంది. ప్రింట్లో ఇంగ్లీషులో ఉన్న పేర్లకింద బ్రాకెట్లో తెలుగులో మళ్ళీ రాసి ఉన్నాయి పెన్సిల్‌తో.
“మా అన్నయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు.వాడే ఇవన్నీ కంప్యూటర్లోకి ఎక్కించాడు. పెద్దవాళ్ళంతా చదవలేకపోతున్నారని తెలుగులో నేనే రాశాను” వివరించాడు విశ్వం.
సదాశివరావుగారు, అనసూయమ్మ గారు శ్రద్ధగా చూట్టం మొదలెట్టారు. విశ్వంగారు ఆయనకి తెలిసిన కుటుంబం గురించి చెపుతున్నారు.
“…ఇదిగో ఇదో పెద్ద కుదురు మళ్ళీ. ఈయన ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళి వచ్చాట్ట.”
“…. వీళ్ళ పిల్లల్లో ఒకాయన వైజాగ్ షిప్‌యార్డ్ లో ఉన్నాట్ట. ” సంభాషణ సాగిపోతోంది.
అనసూయమ్మ తన తండ్రి పేరు వెతికి పట్టుకున్నారు. తన తండ్రి పేరు, తాత పేరు చూసి అలా పైకి మరో 4 తరాల దాకా ఉన్న ఉన్న బంధాల్ని చూసుకుంది.
ఓ పేరు పక్కనే D.W.M అని బ్రాకెట్లో పెట్టి ఉంది. ఆ కొమ్మ అక్కడితో ఆగిపోయి ఉంది.
“’D.W.M అంటే ఏమిటి” అడిగాడు శంకరం.
“డైడ్ వితౌట్ మారేజ్… పెళ్ళి కాకుండానే చనిపోయారు అని అర్థం” వివరించాడు విశ్వం.
ఆ మాట వినగానే ఆసక్తిగా మరో సారి చూశారు అనసూయమ్మ.” N.M.C అంటే?” ఈసారి అనసూయమ్మగారు.
“నో మేల్ చైల్డ్ … మగ పిల్లలు లేరు అని అర్థం” అన్నాడు విశ్వం.
శంకరానికి అర్థమయ్యింది. వంశవృక్షంలోకి తొంగి చూశాడు. అనసూయమ్మ రి చెయ్యి ఆవిడ తండ్రి పేరుమీద కదులు తోంది. ఆ పేరు పక్కన N.M.C అని బ్రాకెట్లో ఉంది. ఆవిడ తండ్రి పేరుతో కొమ్మ ఆగి పోయింది. మిగతా కొమ్మలు శాఖోప శాఖోపలుగా విస్తరించి ఉంటే, ఇది బోడిగా విరిగిపోయి ఉంది తన తండ్రి పేరు దగ్గర.
పిల్లల్లేక పోయినా,పిల్లల్లేకుండానే పోయినా, మగ పిల్లల్లేకపోయినా కొమ్మ ముందుకు పోదు!
అతడికి అంటు కొమ్మలు గొర్తొచ్చాయి. ఈ చెట్టు కొమ్మని నరికి, కొంతమేర పై చెక్కు తీసి మరో చెట్టు కొమ్మకి అతికించి, పైన మట్టి కప్పి గట్టిగా కట్టేసేవాళ్ళు. ఈ కొమ్మ ఇమడ గలిగితే ఆ చెట్టు కొమ్మే అయి పూలూ పండ్లు కాస్తుంది. లేదా మాడి చస్తుంది. అప్పుడు మరో కొమ్మని తెచ్చి అతికించేవాళ్ళు. విషయ మేమంటే, అతుకుకొమ్మకు కాసే పండ్లని కూడా కొత్త చెట్టు పండ్లనే పిలిచేవాళ్ళు. అదీ తమాషా! అతుకు కొమ్మలు బతికినా చచ్చినా ఒకటే లెక్కలోకి రావు.
“నలుగురం అక్కాచెల్లెళ్ళం. ఒక్కళ్ళమైనా మగ పిల్లాడిగా పుట్టలేక పోయాం” పైకే అనేసారు...
చాగంటి సోమయాజులు గారు 'చాసో' గా తెలుగు పాఠక లోకానికి సుపరిచితులు. ఆధునిక తెలుగు కథను ప్రగతి శీల భావాలతో సుసంపన్నం చేసిన చాసో ఎన్నో గొప్ప కథలను రచించారు. 1945 వ సంవత్సరంలో 'భారతి' మాస పత్రికలో ప్రచురితమైన ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చింది చాగంటి తులసి గారికి , కథకు ఆడియో ని అందించిన చాగంటి కృష్ణ కుమారి గారికి కృతజ్ఞతలు.
ఇదే పేజీలో ఈ కథపై, సారంగ వెబ్ మ్యాగజైన్ లో ప్రముఖ రచయిత శ్రీ అరిపిరాల సత్య ప్రసాద్ గారు చేసిన చక్కని సమీక్షను కూడ వెబ్ లింక్ ద్వారా మీరు చదవొచ్చు.
కథ :
చెల్లిని వొళ్ళో కూచో పెట్టుకుని కృష్ణుడు వంటింట్లో కబుర్లు చెప్పుతున్నాడు. వాళ్ళనాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చేడు.
కృష్ణుడు వీధిముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగ ఇంట్లో దూరి కూచుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు. హైస్కూలుదాటి -చుట్టల దుకాణానికెళ్ళాలి. మేష్టర్లు, తోటి విద్యార్థులు అక్కడుంటారు. కృష్ణుడికి రోడ్డెక్కటమే నామోషిగా ఉంది. బడిపక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరేడు.
ఉదయం ఎనిమిది గంటలు కావొస్తున్నది. బడి పెట్టేవేళ. వీధి చివరనుంచే బడిగోల సముద్రపు ఘోషలాగ వినబడుతున్నాది. బడిపక్క నుంచి వెళ్ళక తప్పదు; రాక తప్పదు.
బడి కనబడగానే కృష్ణుడికి బెంగపట్టుకుంది. హైస్కూలు పిల్లల గందరగోళంతో కలకల్లాడుతున్నాది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లూ, విద్యార్థులతో, విద్యార్థినులతో చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలొంచుకుని పరిగెట్టాడు.
"కృష్ణా!" అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు.
నరిశింహం పరి గెట్టుకొచ్చి వాడి భుజంమీద చెయ్యేసి “ఏంరా, నువ్వు బళ్ళోకి రావడం లేదు.” అనడిగేడు.
“సోమవారం చేరుతాను” అని కృష్ణుడు చెప్పేడు.
“పుస్తకాలు కొన్నావా?"
“ఇంకా లేదు.”
“ వేగిరం కొనుక్కో. మళ్ళా అయిపోతాయి. ఎక్సరు సైజు పుస్తకాలు షాపుల్లో కొనకేం స్టోర్సులో చవగ్గా వున్నాయి. ధరలన్నీ దారుణంగా పెరిగిపోయాయిరా!" - నరశింహం డబుల్ కప్పు చొక్కా, జనావా పేంటూ, జోళ్ళూ తొడుక్కుని నీటుగా ఉన్నాడు.
కృష్ణుడికి ఉన్న బట్టలన్నీ రెండు నిక్కర్లు, రెండు చొక్కాలు; ఉన్నాయంటే ఉన్నాయి. ఒక నిక్కరుకి పోస్టాఫీసుంది. ఒక చొక్కా భుజం చిరిగి జారిపోతే, వాళ్ళమ్మ ఎత్తి కుట్టింది. చెయ్యి బుట్టలాగ లేచిపోయింది. రేవుకో జత. కృష్ణుడు పేంట్లు కుట్టించమని ఎప్పుడూ ఏడవ లేదు. పేంటుకైతే బట్ట ఎక్కువ పడుతుంది. బట్ట ఎక్కువైతే డబ్బు ఎక్కువవుతుందని వాడికి తెలుసు. మరి రెండు జతలు కుట్టించమని బతిమాలుకున్నాడు. కాళ్ళా వేళ్లా పడ్డాడు. ఏడ్చుకొన్నాడు. ప్రయోజనం లేకపోయింది.
నరశింహం చంకలో కృష్ణుడికి కొత్త పుస్తకం కనబడ్డాది. “ఏం పుస్తకంరా అదీ?" అనడి గేడు.
“ఇంగ్లీషు పుస్తకం. నేనన్ని పుస్తకాలూ కొనేశాను. జాగ్రఫీ పుస్తకమే కొనలేదు. జాగ్రఫీ పుస్తకాలింకా స్టోర్సువాళ్ళకి రాలేదు. చూడు పుస్తకం" అని ఇచ్చేడు.
కృష్ణుడు పేజీలు తిరగేశాడు. కొత్త పుస్తకంలోంచి ఒక విధమైన పరిమళం పైకి వచ్చింది. కృష్ణుడు పుస్తకంలోకి మొహం పెట్టి వాసన చూశాడు.
“కొత్తపుస్తకం వాసన బాగుంటుందికదరా?” అన్నాడు నరశింహం.
"కమ్మగా ఉంటుంది. నా కెంతో యిష్టం" అన్నాడు కృష్ణుడు.
“నీ కింగ్లీషులో ఫస్టుమార్కు రాలేదు, కదరా?”
“నాలుగు మార్కుల్లో పోయింది."
“ఎవరి కొచ్చిందిరా?" . “శకుంతల కొట్టేసింది.”
“నిజమే! నేన్నమ్మ లేదు; దాని కెన్నొచ్చాయి.”
“నా కరవై నాలుగు, దాని కరవై ఎనిమిది,"
“ఆడపిల్లని మేష్టరు వేసేసుంటాడు."
“నీ మొహం! అది తెలివైంది.”
“తస్సాచెక్కా! ఆడపిల్లలు చదివేస్తున్నారురా!"
కృష్ణుడు మార్కుల గొడవ తేగానే గొప్పవాడయిపోయాడు. తెలివైనవాడు కాబట్టే నలుగురూ గౌరవిస్తున్నారు. లేకపోతే వాడి కుళ్ళుగుడ్డలని చూసి అంతా దూరంగా ఉండేవాళ్ళే. వాడికి బడిపక్కని నిలబడడం, బడి కెళుతున్న నరశింహాన్ని చూడడం చాలా కష్టంగా ఉంది. ఎంచేతంటే, కృష్ణుడు బడి కెళ్ళి చదువుకొనే అవకాశాలు తప్పిపోయాయి. వాళ్ళ నాన్న ఈ ఏడాది కృష్ణుడికి చదువు చెప్పించనని నిశ్చయంగా చెప్పేశాడు.
“ఎక్కడేనా చదువు మాన్పించుతారండి?
ఋణమో పణమో చేసి ముక్క చెప్పించకపోతే కుర్రా డెందుకేనా పనికొస్తాడా? చదువుకునే ఈడులో బడి మానిపించి, ఇంట్లో కూచోబెడితే తరవాత గాడిదలని కాయడానికేనా పనికిరాకుండా పోతాడు. ఏదో చూసి బడిలో వెయ్యండి" అని వాళ్ళమ్మ శతపోరి చెప్పుకొస్తున్నాది.
“బళ్ళో వెయ్యగనే సంబరమా? వాడు చదివేది ఫోర్తు ఫారమ్. జీతమెక్కువ. నెల నెలా ఎంత కట్టాలో తెలుసా? తూగ్గలనా? ప్రవేశ పెట్టడానికి, పుస్తకాలకే డౌతుంది ఏభై రూపాయలు. దస్తాకాగితాలు రూపాయి, అర్ధగా పెనసలు ఆరణాలు! ఎక్కణ్ణుంచి తేవడం. మొహాన్ని వాడికి లేందే! వాడి ప్రారబ్ధం, మన ప్రారబ్దం! వారం వారం ఎక్కడ లేని డబ్బూ బియ్యానికి ముడుపు చెల్లించడానికే తలప్రాణం తోక్కొస్తున్నాది. మాటలా?" అని వాళ్ళ నాన్న చెప్పుకొస్తున్నాడు.
తల్లి మాటే నెగ్గుతుందో, తండ్రిమాటే నెగ్గుతుందో ఇంకా తేల లేదు. కృష్ణుడికి మాత్రం సందిగ్ధం లేదు. వాడు తలిదండ్రులని బాగా ఎరుగు. తల్లి ప్రతీ విషయంలోనూ బడబడలాడడమేకాని ఆఖరికి తండ్రి చెప్పినట్టే జరుగుతూ ఉంటుంది. అంచేత చదువుకి స్వస్తి చెప్పడమే ఖాయమని నిర్ధారణ చేసుకొని నామార్దాతో కృష్ణుడు కుళ్ళిపోతున్నాడు.
శ్రీ కృష్ణుడికి కొత్త ఇంగ్లీషు పుస్తకం పేజీలు తిరగేసినకొద్దీ గుండెల్లో గాభరా పుట్టింది. చదువుతున్న కుర్రాళ్ళమీద ఈర్ష్యా, తనకి చదువు లేకుండా పోయిందన్న దుఃఖము - రెండూ రెండు లేడిక పాములై అతని బుర్రని కరకర లాడిస్తున్నాయి.
“కృష్ణా, వేగం చేరరా! డివిజన్లు పెట్టేశారు. నేను 'జే' డివిజనులో పడ్డాను . మన బేచివాళ్ళంతా 'జే' జీవిజనులోనే పడ్డారు” అన్నాడు. నరశింహం.
“అమ్మబాబో! 'జై' డివిజనుదాకా పిల్లలున్నారా?" అని ఆశ్చర్యపడ్డాడు. కృష్ణుడు. - 'జే' తో ఐపోలేదు. 'కే' డివిజను కూడా ఉన్నాది."
ఏ, బి, సి, డి, అని లెక్కబెట్టి - "పదకొండు డివిజన్లో!" అన్నాడు కృష్ణుడు. ఒక్క ఫోర్తు ఫారములో సుమారు ఐదు వందలమంది విద్యార్థులున్నారు.
కృష్ణుడు అక్కడ నిలబడ లేక పుస్తకాన్ని చ్చేసి “నేను చుట్టల కెళ్ళాలి, పోతా” నన్నాడు.
"ఈ బొమ్మ చూశావట్రా?" అని నరశింహం పాఠాలకి ముందున్న త్రివర్ణ చిత్రం తీసి చూపించేడు.
రైతులు జొన్న చేలు కోస్తున్నారు. జొన్న రేకులని కూడదీసి కట్టుకొన్న పిట్టగూడు గుడ్ల తోటే జారిపోతున్నాది. చేలమీద రెండు పిట్టలు ముక్కులు విప్పి ఎగురుతున్నాయి. కోతల వాళ్ళు తలలెత్తి పిట్టలని చూస్తున్నారు. అదీ త్రివర్ణ చిత్రం!
హైస్కూలు మొదటిబెల్లు ఖంగు ఖంగు మంటూ దూరంగా ఉన్న పిల్లలం దరినీ పిలుస్తున్నాది. రోడ్డు, వరండాలు, గదులూ విద్యార్థులతో, విద్యార్థినులతో, ఉపాధ్యాయులతో కలకల్లాడుతున్నాయి.
పుస్తకాలు పట్టుకుని సరస్వతీ దేవిలాగు శకుంతల వొచ్చింది. ఆమె చిన్నపిల్ల. పదకొండేళ్ళది. సూదిముక్కు, సూది గెడ్డాం, ఆ రెంటికీ పొందికయిన నోరు కలిగి ముదొస్తూ ఉంటుంది. తెలివితేటల తళుకుతో దాని కళ్ళు చాంచల్యాన్ని పొందుతున్నాయి.
"కృష్ణా! ఇంగ్లీషులో ఫస్టుమార్కు నాది!" అని వొస్తూనే ఉడికించింది. - “ఒక్క ఇంగ్లీషులో నేకదా! నాకు మూడింట్లో ఫస్టుమార్కు లొచ్చాయి, లెజ్జల్లో నూటికి నూరు!" అన్నాడు కృష్ణుడు.
"ఇంగ్లీషు ముఖ్యమైందండీ!" అన్నాది శకుంతల.
“లెస్టైలంతకన్నానండి. ఆమాటకొస్తే తెనుగు ముఖ్యమండి. తెనుగులో ఫస్టు ఆ మార్కెవరిదండి." - ఇంగ్లీషే ముఖ్యమండి. ఎవరి నడుగుతావో అడుగు!"
“తెను గేనండి. బియ్యేవాళ్ళక్కూడా ఇంగ్లీషులో మానేసి లెక్కలూ అవీ తెనుగులోనే : చెప్పాలని పేపర్లో పడ్డాడండి. -
.
“నువ్వు మహా పేపరు చదివి ఏడిశావు!"
"నే నాంధ్రపత్రిక రోజూ చదువుతాను. మా యింటి దగ్గర వాళ్ళకొస్తుంది."
రెండోబెల్లు ఖంగు ఖంగుమని ప్రారంభమైంది.
నరశింహానికి శకుంతల మొహం చూడ్డానికి లజ్జ వేసింది. వాడు చదువూ సంధ్యారాని దద్దమ్మ. వాళ్ళతోపాటు సంభాషించడానికి తాహతులేక తల వాల్చుకుని మౌనవ్రతం పట్టేడు. తన హనావా పంట్లాము ధగధగలాడుతున్నా,
కృష్ణుడి కుళ్ళు నిక్కరు కనబడుతున్నా వాడికి తక్కువతనం పట్టుకుంది. రెండోబెల్లు కాగానే చల్లగా బడిలోకి జారిపోయాడు.
“బెల్లయింది, బళ్ళోకిరా!" అన్నాది శకుంతల.
“నేను సోమవారం నుంచి వస్తాను" అన్నాడు కృష్ణుడు.
“ఫోర్తు ఫారమ్ లో నీ పని చెపుతాను. ఒక్క ఫస్టుమార్కు రానివ్వను."
“ఇహనన్నీ ఫస్టుమార్కులూ నీవేలే!"
“ఏం?"
“ఏమీ లేదు.”
“నువ్వు మా ఇంటికి రావడం మానేశావేంరా? మా అమ్మా, నాన్నా 'కృష్ణుడు రాలేదేమా' అని రోజూ అంటారు."
"ఏమీ లేదు."
“నేను బళ్ళోకి పోవాలి బాబూ!" అని పరిగెట్టింది.
“శకుంతలా?” అని పిలిచాడు.
“ఏం!" అని ఆగింది.
ఎందుకు పిలిచాడు. ఆమెతో నిజం దుఃఖోపశమనం చేసుకుందుకా? ఎందుకు పిలిచాడో వాడికే తెలియలేదు. .
"ఏమీ లేదు" అన్నాడు.
శకుంతల వెళ్ళిపోయింది. ఇద్దరూ ఒక్క ఈడువాళ్ళు. క్లాసుకి వాళ్ళిద్దరే అందరికన్నా తెలివైనవాళ్ళు. ఒకరి నోట్సు ఒకరు పుచ్చుకుంటూ స్నేహంగా వుండేవాళ్ళు. పంతంతో చదివేవాళ్లు. శకుంతలతో పోటీ కృష్ణుడికి వికాసవంతంగా ఉండేది. శకుంతల దస్తూరీ కృష్ణుడికి జ్ఞాపకమొచ్చింది. ఆమె దస్తూరీ మంచిదికాదు. కొక్కిరిబిక్కిరిగా రాస్తుంది. అతనిది ముత్యాలకోవ.
శకుంతల బడిలోకి పరిగెడుతుంటే కృష్ణుడు స్తంభించిపోయి చూస్తూ నిల బడిపోయాడు. పిల్లల గోలంతా క్రమేణా అణిగిపోయింది. వరండాలన్నీ ఖాళీ అయిపోయాయి. మేష్టర్ల మాటలు ఉండుండి వినబడుతున్నాయి. వేలకొద్దీ విద్యార్థులు డెస్కులు మీదవాలి కూచుని పాఠాలు వింటున్నారు. - బడిదగ్గరనుంచి కృష్ణుడు కదలలేకపోయాడు. తన చదువుపోయింది కదా అని కుమిలిపోతున్నాడు స్కూలు వరండాలో కెళ్ళాడు.
“నే నిక్కణ్ణుంచి కదలను” అనుకొని స్తంభానికి జేరబడ్డాడు.
"నే నింటికే వెళ్ళను" అని నిశ్చయించుకొన్నాడు.
నాలుగోక్లాసు దగ్గరనుంచి బడిలో తను చదివిన ఐదేళ్ళ సంగతులూ ఒక్కొక్క టే జ్ఞప్తికి వొచ్చాయి.
ఐదవక్లాసు చదువుతుండగా ఒక పిల్లడు కృష్ణుడు మీద మేష్టరుతో చాడీలు చెప్పేడు. మేష్టరు నమ్మక, అబద్ధాలు చెప్పేడని వాళ్లే చితకతన్నేడు.
మూడవఫారంలో తెలుగు మాష్టరు "గాంధారపతి" అంటే అర్థం చెప్పమన్నాడు. అంతా నేలచూసి, ఇంటికప్పుచూసి, ధృతరాష్ట్రుడని చెప్పేరు. తనొక్కడే "గాంధార దేశపు రాజు" అని చెప్పేడు.
రెండవఫారం చదువుతుండగా దసరా తరువాత ఒక కుర్రవాడు బడికి రావడం మానేశాడు. వాడి పేరు రోజూ పిలిచి మేష్టరు ఆబ్సెంటు వేస్తూ ఉండేవాడు. ఆఖరికి వాడు. చదువు మానేశాడని తెలిసింది. ఆవేళ అటెండెన్సు రిజిష్టరులో వాడి పేరు కొట్టేసి, మేష్టరు "డిస్కంటిన్యూడ్ " అని రాసి, ఇంగ్లీషు మాటకి అర్థం క్లాసులో చెప్పాడు. ఆనాటి నుండి కృష్ణుడు "డిస్కంటిన్యూ" అన్నమాటకు అర్థం మరచిపోలేదు. ఆ పదం జ్ఞాపకం రాగానే అతనికి దుఃఖం పొర్లుకుంటూ వొచ్చింది.
“నే నింటికే వెళ్ళను” అని పునఃనిశ్చయించుకొన్నాడు. “నేను భోజనానికి వెళ్ళను” అనుకొన్నాడు.
అతని మొహం గాలికొట్టిన కొత్త ఫుట్ బాలులాగ దుఃఖంలో పొంగి కందగడ్డ అయిపోయింది. ముక్కు నీటితో బరువెక్కి దిబ్బ డేసిపోయింది. ముక్కు ఎగబీల్చు కుంటూ పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్టలు కట్టి దిగమింగుతూ స్తంభానికి జేరబడి పోయాడు.
మొదటి పీరీడైపోయింది. కృష్ణుడు కదలలేదు. వాళ్ళ నాన్న బజారుకి బయలుదేరేడు. వరండాలో కొడుకుని చూశాడు.
“ఓరి వెధవా! చుట్టలు తెమ్మంటే ఇక్కడ దిగమారేవేం?” అన్నాడు.
“చూడు!" అన్నాడు కృష్ణుడు.
“ఏమిట్రా చూడ్డం!” అన్నాడు తండ్రి.
“పాపం, కనబడదు!" “ఏమిటిరా నీ శ్రాద్ధం ."
“నా శ్రాద్ధమే!" “ఏమిటిరా!?”
“వాళ్ళంతా బడి కెళ్ళారు! అప్పుడు తండ్రికి కొడుకు మొహంలో విచార రేఖలన్నీ కనబడ్డాయి.
“వెర్రి నాగమ్మా. అదిరా!" అన్నాడు.
కృష్ణుడికి ఆనకట్టలు తెగొట్టుకొని దుఃఖం కొట్టుకొచ్చింది. వెక్కి వెక్కి చుట్టుకుపోతూ ఏడుపు మొదలెట్టేడు.
కొడుకు బాధంతా తండ్రికి బోధపడ్డాది. కొడుకు బాధంతా తండ్రి పడ్డాడు.
"చదువు మానిపించానని అంత బాధపడుతున్నావా? బడివరండాలు పట్టుకుని దేవుళ్ళాడుతున్నావా నాయనా? పద ఇంటికి!" అన్నాడు.
"నే న్రాను!" అని భూమి బద్దలైపోయినంత గట్టిగా అరిచేడు. “ఏం చేస్తావురా?"
“గోడ కేసి బుర్ర బద్దలుకొట్టుకొంటాను!" అని ఇంకా గట్టిగా అరిచేడు.
అంతపనీ చేస్తాడేమోనని వెళ్ళి తండ్రి కౌగలించుకొన్నాడు.
“పద నాయనా, ఇంటికి!” అన్నాడు.
“బడి నాది!" అని గట్టిగా కేకేశాడు.
“నీదేనురా బాబూ!" “బడిలోకి తీసి కెళ్ళు మరి.”
“తల తాకట్టు పెట్టుకునేనా బళ్ళో వేస్తాను, ఇంటికి పద.”
“ఇప్పుడే వెయ్యి!”
“డబ్బు చూసి వేస్తాను."
“ఇంటికి వెళ్ళి లేదంటావు."
“అన్ను రా!”
“ఐతే పుస్తకాలు ముందు కొను!"
“వెర్రి నాయనా! వాటికి మాత్రం డబ్బులుండొద్దూ”
“ఒక్క పుస్తకం కొను."
“ఏ పుస్తకం కొనమన్నావు."
“ఇంగ్లీషు పుస్తకం కొను.”
“కొందాం, పద. ఏడవకు నాయనా, నే చచ్చిపోయాను, ఏడవకు!" అన్నాడు తండ్రి.
తండ్రి చెయ్యిని చంకలో పెట్టుకొని గిలగిల కొట్టుకొని ఏడుస్తూ బడిలో స్టోర్సుకి తోవతీసాడు.
తండ్రి దీర్ఘంగా ఆలోచించాడు. చుట్టలు మానేద్దామనుకొన్నాడు. ఎంత మానుదా మనుకొన్నా మానలేక పోతున్నాడు. చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుంది. ఇంకోవిధంగా పాలుపోలేదు.
“ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులున్నయా, పారేశావా?" అనడిగేడు కొడుకుని.
“ప ప .....ప్పారీలేదు. జేబులో ఉన్నాయి....ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్నాడు కృష్ణుడు.
భారతి, 1945.
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారి సమీక్ష ఈ కథ పై - http://bit.ly/aripirala
చాసోని కథకుల కథకుడుగా వర్ణించారు కొకు. ఆ మాటేమో నిజమే. కానీ అందుకు నిదర్శనం? చాసో ఏ కథ తీసుకున్నా అందుకు నిదర్శనం కనపడుతుంది. ముఖ్యంగా ఆయన శిల్పాన్ని గమనిస్తే అందుకు తార్కాణాలు కథ కథలోను కనిపిస్తాయి. “వాయులీనం”, “ఏలూరెళ్ళాలి”, “బొండుమల్లెలు”, “ఎంపు”, “కుంకుడాకు” ఇంకా ఎన్నో…! ప్రతి కథలో ఓ వైవిధ్యమైన కథా వస్తువు, అలవోకగా సాగిపోయే నడక, అమాంతంగా వచ్చి మీదపడే ముగింపు. ఇవన్నీ గమనించుకుంటూ చదివితే ప్రతి కథకుడూ ఓ మెట్టు పైకెక్కడం ఖాయం. అలా ఎదిగిన ప్రతి కథకుడూ మళ్ళీ అదే మాట అంటాడు – “చాసో కథకుల కథకుడు” అని.
చాసో కథలలో బాగా నచ్చిన కథ ఏది అంటే చెప్పటం చాలా కష్టం. “ఎంపు” నేను మొట్టమొదట చదివిన చాసో కథ. అందులో నిష్కర్షగా, కఠోరంగా ఓ చెప్పిన జీవిత పాఠాన్ని ఆకళింపు చేసుకోడానికి గడిపిన ఒంటరి రాత్రి గుర్తొస్తుంది. “వాయులోనం” కథ చదవడం అయిపోయినా అందులో లీనమై బయటపడలేక గిలగిలలాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కనీసం పది కథలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ పాఠకుడిగా. ఈ మధ్యకాలంలో ఓ కథకుడిగా ఆయన్ని మళ్ళీ చదివినప్పుడు నాకు చాసోలో కనపడ్డవి జీవిత పాఠాలే కాదు, కథా రచన పాఠాలు కూడా. ఆ దృష్టికోణంలో చూస్తే నాకు చాలా బాగా నచ్చినది, ప్రభావితం చేసినది “ఎందుకు పారేస్తాను నాన్నా” అనే కథ.
(కథ చదవనివారుంటే ఆ కథని చదివి ఈ వ్యాసం కొనసాగించగలరు. ఇక్కడినుంచి తొలిపఠనానుభూతిని తగ్గించే సంగతులు వుండగలవు)
కృష్ణుడనే కుర్రవాడు. చదవాలని ఆశ. పేదరికం వాడి చదువుని మింగేసిన భూతం. తండ్రి చుట్టలు తెమ్మంటాడు. బడిమీదుగా పోక తప్పదు. నామోషీగా అటు వైపు వెళ్తాడు. నరిశింహం, శకుంతల అనే సహాధ్యాయులతో మాట్లాడతాడు. బడి మొదలైనా అక్కడి వరండాలో స్తంభానికి జేరబడి వుండిపోతాడు. తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు బాధని తెలుసుకుంటాడు. కొడుకు బాధని తనూ పడతాడు. చుట్టాలు తెమ్మని ఇచ్చిన డబ్బులు వున్నాయా పారేశావా అంటాడు. – “ప… ప్ప… ప్పారీలేదు. జేబులో ఉన్నాయి… ఎందుకు పారేస్తాను నాన్నా?” అంటాడు కృష్ణుడు.
ఆ వాక్యంతో కథ అయిపోయింది. అదే వాక్యంలో మాట కథకి శీర్షిక అయ్యింది.
అదలా పక్కనపెడదాం. ఏమిటీ కథలో గొప్పదనం? చెప్పాలనుకున్న విషయం చిన్నదే. స్పష్టంగా చెప్పేడు కూడా. “ఎందుకు పారేస్తాను నాన్నా?” అన్న ఒక్క ప్రశ్న ఎన్ని ప్రశ్నలు పుట్టిస్తుంది? “ఎందుకు పారేస్తాను? ఎలా పారేస్తాను? నాకు బాధ్యత తెలుసు కదా నాన్నా. నా చదువాపేసిన పేదరికం గురించి కూడా తెలుసు కదా నాన్నా. ప్రతి రూపాయినీ పారేయకుండా ఉంచుకుంటే అవి నా పుస్తకాలకు పనికొస్తాయనీ తెలుసు కదా నాన్నా..” అంటూ పిల్లాడు అడిగనట్లు అనిపిస్తుంది. అంతకు ముందే పుస్తకం కొంటానని మాట ఇచ్చిన నాన్న, చుట్టలు మానేస్తే కృష్ణుడి జీతానికి సరిపోతుందనుకున్న నాన్నా, పిల్లాడు పారేయకుండా వుంచిన డబ్బుతో అప్పటికప్పుడు ఇంగ్లీషు పుస్తకం కొన్నాడా? ఎమో తెలియదు. కానీ తెలుసుకోవాలనిపిస్తుంది. కథ అయిపోయిన తరువాత ఏం జరిగుంటుందో అన్న ఆలోచనపుడుతుంది. ఇలా జరిగి వుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చేదాకా వెంటాడుతుంది. అదీ గొప్ప ముగింపు లక్షణం. చాసొ ప్రతి కథలో, (ప్రత్యేకించి ఈ కథలో) ఇలాంటి ముగింపులే వుంటాయి. తెలుగు కథలలో వచ్చిన అత్యుత్తమ ముగింపు వాక్యాలు రాస్తే అందులో పదింట అయిదు చాసోవి వుండితీరాల్సిందే..!
ముగింపుకు అంత బలం ఎక్కడ్నుంచి వచ్చింది? కథ మొదటి ముగింపుకి బలాన్ని ఇస్తూనే వుంటాడు చాసో. వాతావరణ చిత్రణ, పాత్ర చిత్రణ అన్నీ క్రమంగా ఈ సొరంగం తొవ్వుతున్నట్లు నిర్దేశించిన ముగింపు వైపు వెళుతూనే వుంటాయి. పాఠకుడి గమనించినా గమనించకపోయినా.
(కేవలం ఆరు పేజీల కథ ఇది. నేను పూర్తిగా విశ్లేషిస్తే అంతకన్నా ఎక్కువే అవుతుందేమో)
నవలా రచయితగా, లక్షల కొద్దీ అభిమానుల ఆదరం చూరగొన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు, గొప్ప నాటికలను రచించారు, అలాగే అతి చక్కటి కథలను కూడా . ఆయన రచించిన కథలలోనించి ఎంపిక చేసిన 25 కథలతో వచ్చిన పుస్తకం ' ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్' .
ఆ పుస్తకంలోని చివరి కథ ఇప్పుడు మీరు వినబోయే, 'సీతా... రాముడొస్తున్నాడోయ్'.
ఈ కథను హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన వీరేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి
https://www.telugubooks.in/products/the-best-of-yandamoori-veerendranath
హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
ఆ రాత్రి - అయోధ్య నిశ్శబ్దంతో సయోధ్య చేసినట్టుంది.
శ్రీహితుడికి కన్ను మూత పడటంలేదు. మెత్తటి పాన్సు అంపశయ్యలా తోచింది. కొంచెం సేపు నిదురించే ప్రయత్నం చేస్తున్నాడు. లేచి కూర్చుంటున్నాడు. అంతకు మునుపే, దూరంగా రోదన వినిపించింది. వినిపించిన వైపు వెళ్ళాడు.
సరయూ నది ఒడ్డున ఒకామె రోదిస్తూ కనబడింది. “ఎవరు తల్లీ నీవు? ఎందుకు రోదిస్తున్నావు?” అని అడిగాడు. "నాయనా! నేను నిద్రాదేవిని. నిన్ను సమీపించుటకు చేతకాని అవమాన భారంతో రోదిస్తున్నాను” అన్నది.
ఆమె రోదనకు సరయూనది గలగలలు ఉపశృతులు అవుతున్నవి. ఏమి చేయాలో తోచనట్టు నిలబడినాడు.
అంతలోనే అతడికి మెలకువ వచ్చింది. అంతా కల అని తెలిసింది. మళ్ళీ అనుమానం నిదుర రాకపోతే కల వుండదుకదా. మరి అది కలా? లేక తన భావావేశమా? అంతా అయోమయమే! ఈ అయోమయం వేకువ నుంచీ వున్నది. ఏ పనీ చేయబుద్ధి కాదు. ఊరికే ఉండబుద్దికాదు. కాలు ఒక చోట నిలువదు. అది నిలుచున్నా మనసు నిలవదు. అవును మరి అతడికి అలజడికి కారణమున్నది.
రాముడు బయల్దేరినాడట. పుష్పక విమానంపై సీతా సమేతుడై వస్తున్నాడట. రావణ సంహారానంతరం అయోధ్యలో అడుగిడుతున్నాడట.
- శ్రీహితుడికి ప్రస్తుతం ఇరవయ్యేళ్ళ ప్రాయం. అతడి తల్లి కైకేయి వద్ద ముఖ్య పరిచారిక. తండ్రి దశరధ రథ చోదకుడు.
అతడికి గతము బాగా గుర్తున్నది. అప్పుడతడికి ఆరో వసంతము. ఆడవారితో వామన గుంటలు, ఈడు వారితో కోతి కొమ్మచ్చులు ఆడుకునేవాడు. ఆరోజు ఎవరూ అతనితో ఆడేటందుకు రాలేదు. పలకరించనయినా లేదు. అంతా దుఃఖ సాగరంలో మునిగి వున్నారు. ఆటకెవరూ తోడు లేనందున అతడికి కోపము వచ్చింది. కసి పెరిగింది. బిక్కు - బిక్కు మంటూ ఒక్కడే కూర్చున్నాడు. గదిలో ఒక మూల తల్లి రోదిస్తున్నది. - అంతలో పుర వీధిలో కలకలం వినిపించింది. పరుగు పరుగున బయటకొచ్చాడు. ఆ దృశ్యాన్ని అతడు, తరువాత జీవితంలో ఎన్నడూ మర్చిపోలేదు.
నార బట్టలతో రాముడు, సీతతో కలిసి నడుస్తున్నాడు. లక్ష్మణుడు వారిని అనుసరిస్తున్నాడు. వెనుక అయోధ్య నడుస్తున్నది. శ్రీహితుడు కనులు పెద్దవి చేసుకుని చూసాడు. అతడి పసి మనసుకి అర్థం కాలేదు. పరుగెత్తుకుపోయి, “అమ్మా! అందరూ వూరొదిలి పోతున్నారే” అన్నాడు.
తల్లి అతడి పొదివి పట్టుకొని ఎలుగెత్తి ఏడ్చింది.
ఆమె దుఃఖమునకు మరొక కారణము కూడా వున్నది.
కైకను తిట్టనివారు లేరు. ముఖ్య పరిచారక కాబట్టి ఆమెది కూడా తప్పన్నటు తూలనాడారు. ఆ తల్లి దుఃఖం అందుకే. శ్రీహితుడికి తల్లి దుఃఖం అర్థం కాలేదు. తనూ ఏడ్చినాడు.
ఎప్పటిమాట అది! పధ్నాలుగు వసంతాల క్రిందటి మాట!
ఆ తరువాత రాముని కథలు ఒకటి తరవాత ఒకటి విని పులకించి పోయినాడు. వాస్తవముకంటే ఊహ గొప్పది కదా! శ్రీహితుడి మనసులో శ్రీరాముడట్లే పెరిగిపోయినాడు. కథలన్నీ తల్లే చెప్పినది.
రాతిని నాతిగ చేసినాడని చెప్పగ నోటిని తెరుచుకు విన్నాడు. దండిగ నసురుల చెండిన రాముని, కంటికి నిండుగ వూహించుకున్నాడు. ధనస్సు వంచిన దనుజభిరాముని మనస్సునందే నింపుకొన్నాడు.
ఆ విధంగా రాముడు, శ్రీహితుడి మనసులో వయసుతో పాటే ఎదిగినాడు. అటువంటి రాముడు ఈ రోజు.... ఇన్నాళ్ళకి వస్తున్నాడంటే నిద్ర ఎలా పడుతుంది?
లేచి బయటకు వచ్చాడు.
శ్రీహితుడికి అయోధ్య మీద చాలా కోపంగా వుంది. దానికి కారణం కూడా వున్నది. రాముడొస్తున్న రాత్రి, ఇంత హాయిగా అందరూ ఎలా నిద్ర పోతున్నారన్నదే ఆ కారణం.
అంతకు ముందు రోజే భరతుడు అగ్ని ప్రవేశం చేయబోయాడు. పదునాలుగు సంవత్సరములు దాటినా రాముడు రాకపోయే సరికి ప్రాణాలు తీసుకోబోయాడు. అంతలో హనుమంతుడొచ్చి రామాగమన సందేశాన్ని వినిపించాడు. -
అంతే! ఆ క్షణము నుంచీ అయోధ్యలో ఎవరికీ నిద్రాహారాలు లేవు. నగరాన్ని అలంకరించటము ప్రారంభించారు.
కౌసల్య కళ్ళలో తెలి మంచుముత్యాలూ, సుమిత్ర కళ్ళల్లో మణిదీపాలు వెలిగితే, కైకకి వళ్ళంతా కళ్ళే అయినవి. ముగ్గురు తల్లులూ, కళ్ళని దీపాలు చేసి, రాముడొచ్చే దారిని వెలిగించారు.
భవంతులకి రంగులు వేసారు. దారులని నీటిలో కడిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాముని అవతార మెత్తిన విష్ణువుని వదిలి వుండలేని ఆదిశేషువు అయోధ్య కొచ్చి, తన శరీరాన్ని కోటగానూ, పడగలను సౌధాలుగానూ చేసినట్లున్నాడు.
ఇంతాజేస్తే రాముడేమో అన్నీ వదిలి అడివికి పోయినాడు. నిస్తేజుడైన ఆదిశేషుడికి కూడా ఆ రోజు రామాగమన వార్త తెలిసినట్టుంది. ఒక్క సారిగా పడగ విప్పాడు. సౌధాగ్రాల్లో వెలిగించిన మాణిక్యపు దివ్వెలు ఆ శేషువు పడగలపై మణుల వలె భాసిస్తున్నాయి.
ఎక్కడ చూసినా మకర తోరణాలు, పరిమళ గంధాలు... కస్తూరి కలిపిన కన్నీటి కలయంపి ఊరు వూరంతా కలాపి జల్లి, రత్నాల రంగవల్లులూ, ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దారు ముదితలు.
పనికి అడ్డు వస్తున్నారని పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చబోయారు తల్లులు. స్తన్యమిచ్చి జోకొడుతూ, “లాలీ... లాలీ.. మేఘశ్యామా లాలీ.... తామ రస నయన ...... దశరథ తనయ లాలీ ... రామ లాలీ...”. అని పాడసాగారు. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్న పసివాళ్ళు, పాటలో రాముని శబ్దం వినగానే తత్తరపడి మళ్ళీ మేల్కొంటున్నారు.
ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని తల్లుల పవిటలు పిల్లలు అడ్డు తీస్తున్నారు. ఆ విధంగా రెండు రోజులనుంచీ సాగుతోంది.
రాముని రాక కోసం అయోధ్య నలంకరించిన నగర వాసులందరూ ప్రస్తుతం గాఢనిద్రలో మునిగి వున్నట్టున్నారు. పుర వీధులన్నీ నిశ్శబ్దంగా వున్నాయి. పిల్లగాలి హితుడిని పరామర్శగా తాకింది. దక్షిణం వైపునుంచి వస్తోంది అది. ఎక్కడో యోజనాల గరంలో వున్న రామచంద్రుని తాకి పునీత మైనట్టుంది. ఆ ఆలోచనతోనే అతడి శరీరం పులకించింది.
అతడికి ఒంటికాలి తిన్నడు గుర్తొచ్చాడు. వాడికి రాముడంటే మరీ భక్తి. చెట్టు పైకెక్కి రాముడు శివ ధనుస్సు నెలావంచాడో సోదాహరణగా మిత్రులకి వర్ణిస్తుండగా కొమ్మ విరిగింది. కాలు విరిగింది. అప్పటినుంచీ ఒంటికాలి తిన్నడు అయ్యాడు. అదీ వాడికి సంతోషమే! కన్నుపోయిన కాకి కన్నా తనే గొప్ప అంటాడు. వాడూ నిదురోతున్నట్టున్నాడు. నిన్న సాయంకాలం మోగిన భేరీ వాద్యాలూ, మంగళస్వనాలూ కూడా విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నాయి.
శ్రీహితుడు ఆకాశం వైపు చూసాడు. చంద్రుడు లేడు. మేఘాలు మాత్రం వున్నాయి. చంద్రుడికి మచ్చ ఎలా వచ్చిందో తిన్నడు చెప్పాడు. 'రాముని జైత్రయాత్రలో వానరుల కాళ్ళ క్రింద రేగిన దుమ్ము, పాల సముద్రంలో పడి బురద అయ్యిందట. ఆ సముద్రం నుంచి పుట్టినందువల్ల చంద్రుడి మీద మచ్చ అయిందట.....
కథ విన్న శ్రీహితుడికి అనుమానం వచ్చింది. 'చంద్రుడు ముందు పుట్టాడా? రామచంద్రుడు ముందు పుట్టాడా?” అని. చంద్రుడు కావాలని అడిగినప్పుడు కౌసల్య పాడిన పాట, “ఎందుకు ఆ చందమామ?... అందగాడనా నీకన్నా? అందరాడనా ఓ కన్నా” అన్నది కదా! అది గుర్తుంది. ఆ సందేహాన్నే తిన్నడి ముందుంచాడు. ఒంటికాలిమీద లేచాడు తిన్నడు. భక్తి వున్నచోట సందేహముండకూడదని బోధన చేసాడు. సంయుక్తంగా లెంపలు చేసుకున్నారు ఇద్దరూ.
అటువంటి తిన్నడు ఈ రాత్రి ఎలా నిద్రపోతున్నాడు?
శ్రీహితుడు నడక సాగించాడు. వీధుల్లో శునకాల అలికిడి కూడా లేదు. అందరూ కలిసి నిద్రిస్తున్నట్టున్నారు. అందరూ సరే! జనకులవారి మాటేమిటి? కూతురు రాక్షస చెరలో అష్టకష్టాలూ పడి, అగ్నిచేరి పునీతురాలిననిపించుకుని వస్తున్నదే.... మంగళహారతులతో, పచ్చనక్షంతలతో ఎదురేగవలసిన ఆడపడుచులు అలసి పోయినారు సరే- ఆయన ఎదురేగవచ్చుగా. భూమిలో దొరికినది కాక, కడుపున బుట్టినదయితే ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలడా?
శ్రీహితుడికి అయోధ్యమీద కినుక కలిగింది.
“ఆరేళ్ళ ప్రాయంలో రాముడు వనవాసానికి వెళ్తుంటే, ఆ సమయంలో బొంగరాలాట ఆడినందుకు తిట్టిపోసిన ఇరుగమ్మలు పొరుగమ్మలు ఇప్పుడేం చేస్తున్నారో” అనుకున్నాడు కసిగా.
రాముడు వెళ్ళే రోజు మన్ను మిన్ను ఏకమయ్యేలా శోకించిన ప్రజలేనా వీళ్ళు?” అనుకున్నాడు ఉక్రోషంగా.
జోలపాటలో రామనామము విని లేచి కూర్చున్న పిల్లలు కూడా పాల బువ్వ తిని హాయిగా నిద్రపోతున్నారట్లే వుంది. మనుష్యుల సంగతి సరే. మర్చిపోతారు. పశువులూ, పక్షులూ ఏమయ్యాయి? కలరవాలు, హయ హుషలు, గజ కలాప కరవాలు వినపడవేం?
ఒక్క పావురవైనా నా రాముని రాక కోసం కువ కువలాడదే? ఒక్క లేగదూడ కూడా నిద్దురలో ఉలిక్కిపడదే?
తానెంత వెర్రివాడు? ఊర్మిళాదేవి తప్ప, చివరికి ఆమె పెంపుడు కీరవాణితో సహా మొత్తం అయోధ్యంతా ఆ రాత్రి మేలుకొని వుండి, రాముడికి స్వాగతం చెపుతుందనుకున్నాడు.
"ఓ నిద్రాదేవీ! నువ్వు నిజంగా గొప్పదానివి. పధ్నాలుగేళ్ళు...కళ్ళు మూసినా తెరిచినా కూడా రాముని పాదపద్మాలే దర్శిస్తూ రాముడిని స్మరిస్తూ, రాముడికోసం నిరీక్షిస్తూ తపించిన వాళ్ళని కూడా నీ మాయతో, మరోమాట లేకుండా నిద్రపుచ్చావే! సరయూనది గల గలలు నీ విజయానికి మంగళకైవారాలని అనుకోకు. అయోధ్యపై నీ విజయానికి అస్థిత్వం లేకుండా, ఇదిగో... రాముడిని నా కళ్ళల్లో, ఊపిరిలో, రక్తంలో నింపుకోవటానికి అనిమేషుడివై నేను వెళ్తున్నాను”.
“జయోస్తు!” అన్నట్టు వర్షపు చినుకులు పడ్డాయి. అతడి శరీరం పులకించింది. అరచేతిమీద పడిన నీటి చినుకువైపు చూసాడు. తలెత్తి మేఘం వేపు చూసాడు. వర్షమెందుకు పడిందో అతనికి తెలుసు. అర్థమైనట్టు నవ్వేడు.
భూదేవి అలిగింది. అలగదూ మరి...!
ఆమె అనుకుని వుంటుంది... 'వనవాసానికి వెళ్ళినప్పుడు అల్లుడు నన్ను స్పర్శిస్తూ ..... గిరులు, ఝరులు దాటుకుంటూ న..డు..చు..కుంటూ వెళ్ళినవాడు, పట్టాభిషేకం వచ్చేసరికి గాలిలో తేలుతూ వస్తున్నాడు. పుష్పక విమానం ఎక్కి ఆకాశంతోనూ, మేఘాలతోనూ చెలిమి చేస్తున్నాడు. లోకంలో జామాతలను ఏనాడూ నమ్మరాదు కదా' అని అలిగిందట.
ఆమె అలక తీర్చటానికి మేఘాలు వర్షపు చినుకులతో రాయబార మంపుతున్నాయి. “తల్లీ నీ కూతురూ, అల్లుడూ ఎప్పుడూ నీ వద్దే వుండేవారే కదమ్మా. కొద్ది సేపైనా మాతో ముచ్చటించనీ” అని.
"మరి గుహుడూ ఈ విధంగానే అలిగి వుంటాడు కదా. అతడి అలకా సహేతుకమే! అతడినే విధంగా ఓదారుస్తాయో ఈ మేఘాలు-?” అనుకుంటూ శ్రీహితుడు ఆకాశంవైపు చూసాడు.
చంద్రుడి జాడే లేదు. విజయదశమినాడు రావణ వధ. అయోధ్యకు అమావాస్య నాడు రాక. శ్రీహితుడు అలా అనుకోలేదు.
“ఏమయ్యా చంద్రుడా! అమ్మవారి అనుంగు సోదరా! ఎదురేగి బావగార్ని తీసుకు రావటానికి వెళ్ళవా?” అనుకున్నాడు.
తూరుపుకు తిరిగి, రాజమార్గాన ప్రవేశించాడు. అశోక చెట్ల గుబురులు గాలికి తలలూపుతున్నాయి.
అతడికి హనుమంతుడు, 'సీతాదేవి అశోక వృక్షం క్రిందే కూర్చొని శోకించింద'ని చెప్పిన వైనం గుర్తు వచ్చింది. ఆర్ద్రంగా ఆ చెట్ల కేసి చూసాడు.
“లోక పావనికి నీడ నిచ్చిన పుణ్య తరువులు మీరు. అందుకే భూదేవి తన కుమార్తెకు మీరు చేసిన ఉపకారాన్ని గుర్తించి, ఏ ఋతువు లోనూ ఆకులు రాలకుండా నిత్యవసంతాన్ని వరమిచ్చింది కదా!” అనుకున్నాడు. నాలుగు అడుగులు వేసాక, అంతఃపురాంతర్భాగం నుంచి కస్తూరీ, మృగ మదమూ కలిసిన సౌరభం నాసికా పుటాల్ని తాకింది.
పొరుగింటి పడతితో తల్లి చెపుతున్న మాటలు గుర్తొచ్చాయి. సీతారామ లక్ష్మణులు వనవాసాన్నించి రాగానే అన్నదమ్ములు నలుగురికీ శోభన ముహూర్తాలట.
తన తల్లి “కైక పరిచారిక కదా. ఆ పర్యవేక్షణంతా కైకదయితే, పని తన తల్లిది. అందుకే ఏర్పాట్లనన్నీ వర్ణించి మరీ చెబుతోంది.
ఆ శ్రీహితుడి వయసు ఇరవై వసంతాలు. ఉరకలేసే ప్రాయం. ఉత్సుకంగా అంతా విన్నాడు చాటునుంచి. భగవంతుడి గురించి ఏమి ఆలోచిస్తే ఏమి తప్పున్నది? దానినీ వూహించుకొన్నాడు.
సీతాపతి అర్ధాంగికి ప్రథమ చుంబనం ఎక్కడ ఇస్తాడు?
'సిరి' అంటే మక్కువ కదా. శ్రీకారమును తలదన్ను ఆమె కర్ణములకా ఆ అదృష్టం? శంకు చక్రములంటే విష్ణువుకి ప్రీతి పాత్రములు కదా. శంఖమైతే కంఠము మీదే ప్రథమ చుంబనం. లేక చక్రమే అయితే, మన్మధుని రధ చక్రముల పోలు ఆమె నితంబములదే ఆ పుణ్యం. లేక కౌమోదకి ధరించేవాడు కాన ఆమె ఊరువులకా ఆ భాగ్యం?
వనవాస సమయాన శబరి సమర్పించిన ఫలములను ప్రీతి నారగించాడు కనుక బింబాధరాలను ప్రథమంగా చుంబిస్తాడా, లేక కోదండపాణి కాబట్టి విల్లును పరిహసించే ఆమె నడుమును ముందు చుంబిస్తాడా?
“అమృతం త్వమంగే...” అంటున్నాడు రాముడు. అతడి శరీరానికి ఆమే అమృతం! “త్వం నయనమో కౌముదీ” అంటోంది మైధిలి. ఆమె కన్నుల వెన్నెల అతడేనట!
అతడావిధంగా కల్పనలోంచీ, కవితావేశం నుంచీ బయటపడి చూసేసరికి సరయూ తీరాన నిలబడి వున్నాడు. ప్రకృతి నిశ్శబ్దంతో చెలిమి చేసినట్టుంది. అంతా ప్రశాంతంగా వుంది. అతడికి దిగులేసింది. స్వపురవాసుల మీద అంతులేని ఆగ్రహం కలిగింది. కలలో కనపడిన నిద్రాదేవి ఒడ్డున లేదు. ఎందుకుంటుంది? అయోధ్య ప్రజల కనురెప్పలపై లాస్యం చేస్తూ వుంటుంది
కానీ..ఆగ్రహమో, రాముని ముందు చూడాలన్న ఆరాటమో-నడుము బిగించి నదిలోకి దూకాడు. ఆజానుబాహువులతోనే ఈ దాడో, రాముని చూడాలన్న ఆరాటంతోనే ఈ దాడో కానీ అనతికాలంలోనే ఆవలి ఒడ్డుకి చేరుకున్నాడు. అక్కడ....
“రాముని చేరటం అంత సులభమా?” అని పరిహసిస్తున్నట్టు రొమ్ము విరుచుకుని నిలబడి వున్నది అడ్డుగా ఒక కొండ.
అతనికి కాలు నిలువలేదు. తానొక్కడే... రామ దర్శనామృతమంతా తనకొక్కడికే అన్న ఆశ డెందమున సందడి జేయ, వెనుకనున్న అయోధ్య వంక ఎడమ కంటి కొస నుంచి ఒక నిరాశనా పూర్వకమైన చూపు సారించి, కొండ నెక్కటం ఆరంభించాడు.
శిఖరం అంచు ఆవలివైపు నుంచి ప్రజ్వలమైన వెలుగు కనిపిస్తోంది. వస్తున్నాడు సీతారాముడు! పుష్పక విమానం వచ్చేస్తుంది!
అతడు కొండపైకి పరుగు దీయటం ప్రారంభించాడు.
“పాహిమాం రాజరాజేశ్వరీ! మమ్ముల అనుగ్రహించు. ఆహ్వానం పలుకలేని మా వూరి వారి అమర్యాదని క్షమించు. వాహిని... దయాప్రవాహినీ.. భండ చండ నిమహిష భంజనీ నిరంజనీ జన రంజనీ పండిత శ్రీధుహదాస పోషణీ సుభాషిణీ-రివు భీషణీ - వరభూషణీ- పాహిమాం” అనుకొంటూ కొండ కొమ్ముని అతి ప్రయాసమీద చేరుకున్నాడు.
ఆవలి దిమ్మను దృష్టి నిగిడ్చి చూసాడు. అచ్చెరువుతో చిత్తరువు అయ్యాడు. ఏమున్నది అక్కడ?
మొత్తం అయోధ్య అంతా అక్కడే వున్నది. పసి పిల్లలు, పావురాలు, లేడి కూనలతో సహా అక్కడ పరివేష్టించి ఆకాశం కేసి చూస్తోంది. అనిమేషత్వంతో... రాముడి నిరీక్షణలో,
అందరికన్నా చివరున్న ఒంటికాలి తిన్నడు అలికిడికి తల తిప్పి శ్రీహితుడిని
“ఇప్పుడా రావటం?” అన్నట్టు చూసాడు.
‘సీతా! రాముడొస్తున్నాడోయ్’ - యండమూరి వీరేంద్రనాథ్ (రచన - 1994)
తోటి వేటగాళ్లపై మందలపర్తి కిషోర్ గారి సమీక్ష
'తోటి వేటగాళ్లు' కే ఎన్ వై పతంజలి గారు రాసిన , వేట కథలు అనే కథాసంపుటం లోనిది.
ఈ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి.
https://www.telugubooks.in/products/patanjali-sahityam-1
తోటి వేటగాళ్లు కథపై శ్రీ మండలపర్తి కిషోర్ గారి సమీక్ష కూడా ఆడియోలో మీరు వినవచ్చు.
తోటి వేటగాళ్ళు !
బండివేగిసచెట్టు చేతులెత్తి, జుత్తు విరబోసుకు నిల్చుని రాక్షసుడిలాగుంది ఆ చీకటిలో.
దానినీ , దానితో కొమ్మలు కలిపి నిల్చున్న పచ్చగాత చెట్టునీ అల్లుకుని పాకిన అడ్డతీగ పాదు కొసలు కొన్ని ఉరిత్రాళ్ళలాగ వేలాడు తున్నాయి. బండి వేగిసచెట్టు మీద ఇరవయి అడుగుల ఎత్తున కట్టిన మాటులో (మంచెమీద) మందసా రాజు కూర్చున్నాడు. అతని దగిర అతి శక్తిమంతమైన రైఫిల్ వుంది. మంచె కింద, రెండు చెట్టు కొమ్మల మీద ఇద్దరు తోటి వేటగాళ్ళు కూర్చున్నారు. వాళ్ళిద్దరి దగ్గరా రెండు తుపాకులున్నాయి. అంత దూరాన జువ్వి చెట్టుకు కట్టిన ఆవుదూడ బేలగా అరుస్తున్నాది. గుంజి పిట్టలు 'కరకరకర' మని అరుస్తున్నాయి.
అడవి నిద్రతో తూలుతూంది. పులి అలికిడి లేదు. ముందురోజు, అంతకు ముందు రోజూ ఆ ప్రాంతంలో అది రెండు ఆవుల్ని ఎత్తేసింది. అడుగుల్ని బట్టి చూస్తే భారీ పులి. ఎరను బెట్టి, మాటు కట్టించి కూర్చున్నాడు రాజు. అర్ధరాత్రి దాటి చాలా సేపయింది. ఆ ప్రాంతంలో పులి ఎక్కడున్నా దానికి ఆవుదూడ అరుపు వినిపించే తీరాలి. అయినా రాలేదంటే రాజుకి ఆశ్చర్యంగా వుంది. ఇంకో అడివికి వెళ్ళిపోయిందా?
తెలీడం లేదు. గాలి చల్లగా వేస్తోంది. తెల్లారగట్ట గాలి అలాగే వుంటుంది. శ్రీనివాసదేవ్ తలెత్తి చూశాడు. చుక్కల కదలిక తెలుసునతనికి. ఒకటి రెండు గంటల్లో తెల్లారిపోతుంది.
మరి, అదిరాదు, మొన్ననే తెలిసినందుకు నిన్న మాటు కట్టేస్తే ఖచ్చితంగా దొరికిపోను. అవకాశం జారిపోయింది. నొచ్చుకున్నాడతను. నడుంకట్టు బిగువుగా, ఇబ్బందిగా వుంది. దానికి తోడు పిడిబాకు ఒర ఒరుసుకుంటోంది. చేయి పెట్టి నడుంకట్టుని కాస్త కదిపాడు. చప్పుడు కాకుండా వంగి మాటు అంచుమీద నుంచి కిందికి చూశాడు. తోటి వేటగాళ్ళిద్దరూ, ఒకేసారి తలెత్తి రాజుగారికేసి చూశారు. ఆ చీకటిలో వాళ్ళిద్దరి కళ్ళు జాలిగా, భయంగా కనిపించాయి. తల వెనక్కి లాక్కొని మళ్ళీ మామూలుగా కూర్చున్నాడు మాటులో. రాదల్చుకుంటే దానికి ఎంత సేపు. మెరుపులాగ రావచ్చు. మళ్ళీ ఆశ. ఒక్క షాట్ చాలు. మంచి నీళ్ళయినా అడక్కుండా చచ్చిపోతుంది. పులిని కొట్టి చాలా కాలం అయిపోయింది. ఈ సైజు పులి తిరగడం తక్కువే. అలాగ కూర్చున్నాడు. కారుకోడి కూసింది. తెల్లవారుజామున విచ్చుకునే ఏ కొండ పువ్వులు కళ్ళు తెరిచాయో గానీ చక్కని సువాసన నిండిన గాలితెర ఒకటి చెట్లని పలకరించుకుంటూ పోయింది. పిట్టలు లేచిపోతున్నాయి. కొండగొర్రె వేసిన వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.
కేక లీలగా వినిపిస్తోంది. అడివంతా నిద్ర లేచిపోతోంది. వెలుతురు రెప్పలు ఆర్చుతోంది.
ఇంకరాదు! నిరాశతో నిట్టూర్చాడు. శ్రీనివాస్ దేవ్. నిద్ర దండగ. కారు దండుగ. ఎంతో సుఖంగా నిద్రపోవలసిన వాడికి కొండ చెట్ల మీద పడిగాపుల ఖర్మమేమి? వేట సరదా.
ఎరగా చెట్టుకు కట్టి వుంచిన ఆవు దూడ ఇంకా అరుస్తోంది. అడివిని చూస్తే దానికి భయం వేసింది. చూస్తూ వుండగానే వెల్తురు ఎక్కువైంది. చెట్ల మధ్య నుంచి రేవులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాదులే అను కుని మంచె మీద నిల్చున్నాడు శ్రీనివాస్ దేవ్. ఒళ్ళు విరుచుకున్నాడు.
“దిగుదాం” అన్నాడు శ్రీనివాసదేవ్.
చిత్తం! అన్నారు తోటి వేటగాళ్ళు. శ్రీనివాసదేవ్ తుపాకీ మంచె మీదే వుంది.
జాగ్రత్తగా మంచె దిగి చెట్ల కొమ్మలు పట్టుకుని దిగుతున్నాడు.
“జాగర్తండీ... ఆ కొమ్మ పట్టుకుని కుడి కాలు ఆ తొర్ర ఒడ్డున పెట్టండి..” అన్నాడో తోటి వేటగాడు.
“రైఫిల్ మంచె మీద నుంచి... జాగ్రత్తగా దించండి. లోడ్ చేసి వుంచేను సుమా... కొంపలు అంటుకుపోతాయి” అన్నాడు శ్రీనివాసదేవ్ చెట్టు దిగుతూ.
'చిత్తం'.
శ్రీనివాసదేవ్ కుడికాలు ముందు నేలని తాకింది. తరువాత ఎడమకాలు.
చేతులు రెండు ఇంకా చెట్టుమానుని అంటి పెట్టుకుని వుండగానే 'గాండ్రు' మనే అరుపు వినబడింది.
అంతసేపు ఎక్కడ ఉన్నదో గాని ఉరమని, కురవని పిడుగులాగ అతని మీదకి దూకింది.
పెద్దపులి.
తెల్లవారి వెలుగులో అది భయంకరమైన అందంతో మెరిసిపోతోంది. దాని కళ్ళూ కోరలూ మరీని.
శ్రీనివాసదేవ్ చటాలున నిల్చున్న చోటునించి కొంచెం తప్పుకున్నాడు. పులి విసిరిన పంజా అతని భుజాన్ని రాసుకుంటూ చెట్టు మానుకి తగిలింది. శ్రీనివాసదేవ్ చటాలున ఆ పంజా అందుకున్నాడు. చెట్టు మొదటిని సందిట్లో పెట్టుకుని రెండో చేత్తో రెండో పంజా అందీసేడు. బలమంతా కేంద్రీకరించి, కాళ్ళు రెండో చెట్టు మొదటికి ఆన్చి తన్ని పెట్టి వెనక్కి లాగేడు. ఆ బలానికి ఆ ఊపుకి పులి తల వేగిస చెట్టు మొదటికి కొట్టుకుంది. అది ప్రళయ భీకరంగా గర్జించి గింజుకుంది.
శ్రీనివాసదేవ్ బలమైన మనిషి పులి పంజాలు రెండూ అతని ఉక్కు పిడికిటిలో చిక్కుకుపోయాయి. ఆ పైన పులికీ, అతనికీ మధ్య బండివేగిస మానుంది. పంజాలు తన చేతిలోంచి జారిపోకుండా చూపుడు వేల్తో బొటన వేలు మరింత బిగించి పట్టుకున్నాడు. పులి చెట్ల ఆకులు కంపించి పోయేలాగ అరుస్తోంది.
“... ఎవడో ఒకడు దిగండి... నా బొడ్లో బాకు దీసి దీన్ని పొడిచేయండి.. లేదా తుపాకీతో దాన్ని కాల్చేండి..." అని కేక వేశాడు శ్రీనివాసదేవ్ అరుస్తూనే తలెత్తి చూశాడు.
తోటి వేటగాళ్ళిద్దరూ చెట్టుమీద కొమ్మల్ని అంటి పెట్టుకున్న కర్రిబల్లుల్లాగా పించారతని కంటికి. వాళ్ళిద్దరూ తుపాకులు ఎప్పుడో కిందపడేసి కొమ్మల్ని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుని గజగజ వణికి పోతున్నారు.
పులి వేస్తున్న కేకలకి హడలిపోయిన ఆవుదూడ కాలికి కట్టిన మోకు తెంపుకుని పుటాయించి పారిపోవడానికి యమయాతన పడుతోంది. అది తోక లేపి చెట్టు చుట్టూ పరిగెడుతోంది.
పులి వెనుక కాళ్ళ మీద నిల్చుని నేలంతా తవ్వి పారేస్తోంది. ముందుకాళ్ళు విడిపించుకోవాలని అది తెగ ప్రయత్నిస్తోంది. శ్రీనివాసదేవ్ పళ్లు గట్టిగా బిగించి, చెయ్యి పట్టు తప్పిపోకుండా గట్టిగా దాని ముంగాళ్ళు పట్టుకునే వున్నాడు.
“రేయ్.. వెధవల్లారా రండర్రా... వచ్చి దీన్ని చంపేయండి... నేను దీని ముందు కాళ్పు కదలకుండా పట్టేసుకున్నాను. మీకొచ్చిన భయం లేదు. మీ ప్రాణానికి నా ప్రాణం అదు... ఎంతసేపు ఇలాగ... ఇంత జంతువుని ఆపగలను. వెంటనే దిగండి. తుపాకి తీసి పేల్చేయండి ...” అని మళ్ళీ అరిచాడు శ్రీనివాసదేవ్.
తోటివేటగాళ్ళు ఉలుకూ, పలుకూ లేదు. పులి పంజాలోంచి పొడుచుకొచ్చిన గోళ్ళు చెట్టు బెరడు మీద గీసుకున్నాయి.
అది గీసుకున్న చోట్నించి ఎర్రటి రక్తం లాంటి పాలు చిమ్ముతోంది బండివేగిస చెటు. పులి అలాగ పంజాతో చెట్టును గీకుతున్నప్పుడు శ్రీనివాసదేవ్ చేతి బొటన వేళ్ళు రెండూ, చెట్టుకు పంజాకు మధ్య పడి నలిగిపోయాయి.
అయినా అతను పట్టు విడువలేదు. పులి ఘోరమైన పట్టుదలతో గింజుకుంటోంది. వదిలితే చచ్చిపోతానని తెలుసుకున్న శ్రీనివాస్ దేవ్ చచ్చినా వదలను అనుకున్నాడు. అది వెనక్కి గింజుకుంటోంది.
శ్రీనివాస్ దేవ్ కాళ్ళు రెండు చెట్టుకు తన్ని పెట్టి దాన్ని ముందుకు లాగాడు. “ఒరే దొంగలంజకొడకల్లారా... పులిని నేను పట్టుకున్నాన్రా రండి.. దిగొచ్చి తుపాకీతో కొట్టేయండి...”
నిశ్శబ్దం.
“వినబడ్డం లేదే ట్రా... మిమ్మల్నే... ఒరే బుచ్చయ్య, ఒరే నరిసీ ....” అని మళ్ళీ కేకలేశాడు శ్రీనివాస్ దేవ్.
పులి కొండలు అదిరిపోయేలాగ అరిచింది. మునిపళ్ళతో చెట్టు బెరడుని కొరికేసింది. ఆ నోటితోనే శ్రీనివాస్ దేవ్ చేతుల్ని కొరికేయాలని చూసింది గానీ అతను చేతులు పైకెత్తి కుదరనివ్వలేదు.
ఒళ్ళంతా చెమటలు పట్టేసేయాతనికి. ఒంటిలోని కండరాలన్నీ అలసిపోయి నొప్పి పెడుతున్నాయి.
“ఒరే... ఒరే... ఒరే... ఒరే... దొంగ లంజా కొడకల్లారా చెట్టు దిగుతారా లేదా?” 'అని మరోసారి కేకలేశాడు శ్రీనివాస్ దేవ్.
తోటివేటగాళ్ళు పులుగు పిట్ట లాగ కిందికి భయంగా చూశారు తప్పించి దిగలేదు.
ఎవరో పరిగెడుతున్న చప్పుడు వినబడుతోంది.
“ఒచ్చే ఒచ్చే... ఓ మనిషో ఒచ్చే ఒచ్చే” అన్న కేక వినిపించింది.
ఆ కేక విన్నాక శ్రీనివాసదేవ్ బలం పుంజుకున్నాడు.
పంజాలు పట్టుకుని పులిని ఒక్కసారిగా ముందు ఒక గుంజు గుంజాడు.
ఆ విసురికి పులి బుర్ర చెట్టుకు టపాలున కొట్టుకుంది. - “రారారా! పులి... పులుంది... పట్టేసేను... రారారా!" అని శ్రీనివాసదేవ్ కేకవేశాడు.
అంత దూరం నుంచి ఒక మనిషి పరుగెత్తుకు వస్తూ కనిపిస్తున్నాడు. ఒంటి మీద గోచీ తప్ప ఇంకేమీ లేని బలమైన మనిషి, చేతిలో గొర్రెల కాపరుల కర్ర వుంది. అతను ఆయాసపడి ఒగుర్చుతూ వచ్చాడు.
“నీకు తుపాకీ వేయడం వచ్చునా?"
“ రాదండి”
“పోనీలే... ఇలా నా వెనక్కి వచ్చి నా మొలనున్న బాకు తీసి పులిని పొడిచీ...." ఆ మనిషి చేతిలోని కర్రను కింద పారేసి శ్రీనివాసదేవ్ వెనక్కి వచ్చాడు.
"పులిని మాత్రం ఒగ్గీకండి ... బాకు ఇలాగివ్వండి”
“మొలనుంచి తీయి...” ఆ గొర్రెల కాపరి తడిమి శ్రీనివాసదేవ్ మొలనున్న బాకు తీశాడు.
“వెళ్ళు... బోర ఎముకల్లోంచి దూరి గుండెకాయ చీలిపోయీలాగ పొడిచీయాలి... సత్తుపూరా పొడవాలి” అన్నాడు శ్రీనివాసదేవ్.
అప్పటికి అతని చేతులు వణుకుతున్నాయి. అరచేతులు చెమటలు పట్టిపోతున్నాయి. పులిని కాయడం ప్రాణాంతకంగా వుంది. గొర్రెల కాపరి పులి వెనక్కి వెళ్ళాడు. పులి గాండ్రించింది.
దానిలో ఈసారి ఒకటి నెత్తుటి జీర వుంది. మరోసారి అరిచింది.
అది ఒక జంతువు ఏడుపు మాత్రమే. అక్కడ ఆవుదూడ తెరిపి లేకుండా 'అంబా' అని అరుస్తోంది.
చెటు మీద గోరలు చేరి నానా గొడవా చేస్తున్నాయి. పులి అరుపు మరి వినిపించలేదు..!
దాని పంజాల్‌లోని శక్తి క్షీణించిపోయి దాని బరువుకి శ్రీనివాసదేవ్ పట్టుసడలిపోయింది.
పులి కింద పడిపోయింది.
మూడు పోట్లు పొడిచీసేనండి... నంజికూతురు సచ్చింది... ఎవురండీ తవరు?" అని వాకబు చేశాడు గొర్రెల కాపరి.
శ్రీనివాసదేవ్ ఏమీ మాటాడలేదు. కిందున్న తుపాకుల్లో డబుల్ బ్యారెల్ గన్ తీశాడు. నల్లీ విరిచి చూశాడు.
రెండు తూటాలున్నాయి.
“ఎవురండీ. తవురు...” అని పశులకాపరి మళ్ళీ అడిగాడు.
శ్రీనివాస్ దేవ్ సమాధానం చెప్పలేదు. తుపాకీ సరిచేశాడు.
'పులిమాత్రం ఏనుగంత వుందండి. భలేగా పట్టేసుకున్నారు. నేకపోతే తమర్ని నలిపేసిపోను...' అన్నాడు గొర్రెల కాపరి బాకుని అంటిన నెత్తుటి బురదను చేత్తో తుడుస్తూ.
శ్రీనివాస్ దేవ్ తుపాకీ మాను భుజానికి ఆనించి చెట్టుమీదే ఇంకా గడగడ వణుకుతూ కూర్చున్న తోటి వేటగాళ్ళకి గురిపెట్టారు.
ఢాం !
ఢాం !
అని రెండుసార్లు మోగిందా జోడుబారుల తుపాకీ.
తోటి వేటగాళ్ళ మృతదేహాలు చెట్టు మీదనుంచి దబ్ దబ్ మని కిందపడ్డాయి.
“బాబు ఎవురండీ తవురూ?” అని భయంగా అడిగాడు గొర్రెలకాపరి.
హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
'సచ్చిసాదించడం ' ఎండపల్లి భారతి గారు రాసిన ' ఎదారి బతుకులు' లోని కథ . ఈ కథలో వాళ్ళ పల్లెలో వుండే ఒక మూఢ ఆచారాన్ని గురించీ, దానివల్ల వాళ్ళ కుటుంబం పడిన ఇబ్బంది గురించి రాసారు భారతి గారు.
...............................................................................................................................................................................
మాయత్తకు, మొగుడు ఉండి గూడా అందరి ముందరా ముండమోపి బతుకు బతకాల్సి వచ్చింది.
మాది పెద్ద సంసారం. నాకు కొత్తగా పెండ్లయినబ్బుడు అందరం కూడా ఉండేవాళ్లం. మా ఇంట్లో మాయత్త, మా మామ, నేను, నా మొగుడు, మా తోడు కోడలు, మా బావ ఉండేవాళ్లం.
నాకు ఒక కూతురు. మా బావకి గూడా ఒక కూతురు. బిడ్డలకి ఒక ఏడాది వయసు ఉంటాది....
దినమ్మూ అట్లానే ఆపొద్దు గూడా నా మొగుడు, మా బావ ఇద్దరూ సేద్యంకాడికి పోయిరి. మా మామ ముసిలోడు. పనిచేయలేడు. ఆయప్ప ఒక మూల కుచ్చోని బిడ్డల్ని ఆడిచ్చుకుంటా ఉండాడు. నేను, మా తోడుకోడాలు తలా ఒకపని చేసి కూలికి పోయేదానికి పొద్దయిందని, అదరాబదరాగా మొగాలు కడిగేదానికి పొయిలో బొగెత్తి నోట్లో వేసుకుని దుద్దుకుంటా ఉంటిమి.
మాకాడికి ముందే, మాయత్త మొగం కడిగి, అద్ది, గోడకు అతికిచ్చిన అద్దంలో మొగం చూసుకుంటా దాసరోళ్ల దగ్గర తీసుకున్న సునో డబ్బాలో పట్టెడు సునోను చూపుడేలుతో లోడుకుని గోరుమందం మొగానికి రుద్దుకునింది. నొస్టన వేలితో మైనం మెల్లించుకుని, అరచేతిలో వేసుకున్న ఎర్రకుంకాన్ని నడిమేలుతో ఎత్తుకుని అనపగింజంత ఎడం బొట్టు పెట్టుకుంటా ఉండాది. ఈ ముసిలిది ఏమి సొగసు పడతా ఉండాది. వయసులో ఇంకెట్ల ఉండిందో అనుకుంటా నేను నా పండ్లను పరపరా దుద్దు కుంటుండా.
ఈలోపల మొగంపని చూసుకుని, మాయత్త తలకాయ నున్నంగా దువ్వి కొప్పేసింది. దానికితోడు మా ముసిలోడు ఇంటి ముందర దాసాని పువ్వు పూసుంటే పెరుక్కొచ్చి, ఇందే తలకాయలో పెట్టుకో అని ఇచ్చె. మాయత్త, దేవునికి పువ్వన్నా ఏమారతాది కాని తలకాయలో పువ్వు ఏమారదు. ఆయమ్మ మరిచిపోయినా మామామ గుర్తుచేసేవాడు, పువ్వు పెట్టుకోమని. ఆయమ్మ సొగసు ఉండేదే కదా అని నేను, మా తోడుకోడలు సంగటి తిని, పనికి పోయేదానికి దండెంమింద ఉండే పై గుడ్డల్ని బుజానేసుకుని, బిడ్డలకి పాలిచ్చి, వాళ్లరినీ ముసిలోళ్ల దగ్గర వదిలితిమి.
నా కూతురు పాలు మానలేదు. చిన్న కలబందని రొమ్ములకి పూసుకున్నా గూడా అట్లే పాలు తాగే సేది. ఇంక నాకు వల్లకాక పాలిచ్చేసి బిడ్డల్ని బద్రంగా చూసుకోమని మా మామకి చెప్పేసి వాకిట్లోకి ఒక అడుగు పెడితిని.
అంతలోకే చుట్టం వచ్చె, చెంబుతో నీళ్లిచ్చి నట్టింట చాపేసి కుచ్చోమంటిమి. ఆ చుట్టాన్ని మేమెరగం. ఆయప్ప “ఏమొద్దు, పలానాయన కాలమైపొయినాడు” అని మాయత్తకు చెప్పె. కాలం అయిపొయినాయప్ప మాయత్తకు తెలిసినట్లుంది. మాకు తెలీదు.
అంతవరకు సంతోసంగా ఉండిన మాయత్తా మామా మొగాల్లో మబ్బు కమ్మేసింది. ఇద్దరూ నిరుజీవులై పోయిరి. వాళ్లను చూసి మేము గమ్మున అయితిమి. ఇంతకూ సచ్చిపొయినాయప్ప వీళ్లకి బాగా కావల్సినాయప్పో ఏమో అందుకే వీళ్లు వెతపడతుండారు అని అనుకుంటిని.
కబురు తెచ్చినాయన మాయత్తతో మాట్లాడతా “సరేక్కా నేను ఊర్లో చానామందికి చెప్పల్ల, మన్నుపొద్దుకి చేరుకోవల్ల. వెనుకాముందు అయితే శవాన్ని ఎత్తరు" అని ఆయప్ప పోయె. కబురు చెప్పను వచ్చినోడు ఎంతదూరమన్నా పోనీ, వేళకి గుంటకాడకి చేరుకోవల్ల.
ఆయప్ప అట్ల పోతానే మా ఇంట్లో చిన్నబిడ్డ అరుపులు తప్ప సద్దే లేదు. అంతా గమ్మునే వుండారు. ఇంతలో మా పక్కింటి పెద్దమ్మ వచ్చె. “ఏమ్మేవాడు కాలం అయిపొయినాడంట, ఏం చేద్దాము, పదే పోదాము, వాడు కట్టిన తాళి వాడికే తెంపల” అనింది మాయత్తతో.
నేనుండుకుని అర్దంకాక, “ఏందమ్మా ఏం జరిగింది, ఎవరికి ఆయమ్మ తాళి తెంచేది" అని అడిగితి. ఒక పక్క మా మామ నెత్తిన చేతులు పెట్టుకుని కుచ్చో నుండాడు. నేను బలే నసుగుదాన్ని మా పెద్దమ్మ నడిగితి "కాదు పెద్దమా చచ్చిపోయినాయప్ప
నాకేమవుతాడు" అని.
కాదే నా బట్ట ముండా, మీకేంగాడే వాడు. మీయత్తకు తొలీత బొట్టు కట్టినోడు. మీయత్తకు ఏడేండ్లబుడు వాళ్లమ్మ తమ్మునికిచ్చి పెండ్లి చేసి. వాడు మీయత్తని ఈదాబాదా పెడతా ఉంటే, ఆయన దగ్గిర ఇమడలేక వదిలేసి వచ్చేసింది. మల్లా మీ తాతను తగలాటం చేసుకునింది. లెక్క పకారం తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్ల" అనింది.
నేను "అయ్యో ఇదెక్కడ న్యాయమమ్మ, ఎబుడో చిన్నబుడు నెరవాది కాకముందు పెండ్లైతే ఇబుడేందమ్మా ముండమోసేది. మా మామని పెండ్లి చేసుకుని ఇబ్బుటికి ఏ ఏబైయేండ్లో కావస్తా ఉండాది. అబుడు నింటి బిడ్డా పాపలను కని సంసారం చేసి, ఇబుడు ఆయప్ప ప్రాణంతో ఉంటే ఎట్లమ్మా వదిలేసి ముండ మోసేది" అంటిని.
దానికి మా పెద్దమ్మ “అయ్యో కాదమ్మా, అట్ల ఒప్పుకోరు. ఎవరు తొలిత బొట్టు కడితే వాడు కట్టిన తాళి వానికే తెంపల్ల, లేదంటే మీ కుటుంబానికి మంచిదికాదు" అనింది.
మామామ ఏమి జరగతాదో అని కుమిలిపోతా ఉండాడు. నిజమే కదా ఆయప్ప ప్రాణంతో ఉన్నెబుడే ముండ మోయల్లంటే ఆయప్పకి ఎంత బాదయితుంది.
ఇంక అయిందెట్లా అయింది అని, ఇంట్లో వాళ్లు బాదపడుకుంటా ఆయమ్మని పిలుసుకుని పోతిమి. ఆడికి పొయినంక నాకు ఇంకా కొత్త కతలు తెల్సినాయి. ఆ సచ్చినోనికి, మాయత్త వచ్చేసినంక మాయత్తకి చెల్లిలివరసైన ఆమెను ఇచ్చి పెండ్లి చేసిరంట.
తొలిది తోలు తెగదు, మలిది మాను తెగతాదా అన్నెట్లు ఆయమ్మ గూడా ఆయప్ప దగ్గిర సంసారం చేయకుండా యెల్లిపోయి వేరే ఆయనను పెండ్లి చేసుకుని నలుగురు బిడ్లకు | తల్లయింది. ఇబుడు బిడ్లకు పెండ్లిండ్లు అయినాయి. పెండ్లి చేసుకున్నాయన బతికే ఉండాడు.
ఆయమ్మని గూడా ఇట్లనే తొలీత బొట్టు కట్టినోడికి ముండమొయ్యల్లని చెప్పినట్లుండారు. ఆయమ్మ వచ్చి నట్టింట కుచ్చోని ఉండాది. సచ్చిపోయినాయన, ఇద్దరు పెండ్లాలూ వదిలేసినంక ఇంకొకరి ఆలిని తోడుకొచ్చుకున్నాడు. ఈయప్పకు ఆయమ్మ కుదిరి నిలబడిపోయింది. ఆయమ్మా ఉండాది. ఆయమ్మ ఒగని ఆలి కాబట్టి, ఈయప్పకు ముండమోసే పనిలేదంట.
మాయత్తని, రెండో ఆయమ్మని నట్టింట కుచ్చోబెట్టి, వచ్చిన అమ్మలక్కలు ఊరికే ఉంటారా, వాళ్లకు పసుపుకుంకుమ పూసి, గంగమ్మ బొట్టు పెట్టి, తల నిండా పూలు పెటి. ఆయప్పకు తెచ్చిన పూలారాలు వీళ్లకూ ఒకొకటి వేసి తలకాడ ఒకరిని, కాళ్లకాడ ఒకరిని కుచ్చోబెట్టిరి.
ఆ ఊరు చిన్నూరు కాదు. సుమారు మున్నూరు పైన ఇండ్లుండాయి. వీళ్లకు పెండ్లిండ్లు అయినబ్బుటి నింటి ఇబ్బుటికి ఏబైయేండ్లు అయింది. కొత్త కోడాండ్లు, మల్లా పుట్టిన పిల్లోళ్లు, వాళ్ల బిడ్డలు, చుట్టుపక్కల ఊర్లనించి వచ్చిన చుట్టాలు, ఇట్లా లెక్కేస్తే నన్నూరు మందికి పైనే వచ్చింటారు. వచ్చిన ప్రతి ఒక్కరూ, ఎవరు ఆయప్ప పెద్ద పెండ్లాము, చిన్న పెండ్లాము , ఇబుడు ఉండే ఆయమ్మ ఎవరు అని ఆరా తీసేది. సచ్చినోడిని చూడను వచ్చి ఆయప్పను కాదు చూసేది, తొలిత వీళ్లను చూసేది. నేను అనుకుంటి, పెండ్లి చూపుల్లో గూడా ఇంతమంది వచ్చి చూసిండరు, ఈ పొద్దే వీళ్లకు పెండ్లిచూపులు జరగతున్నట్లుండాయే అని.
అమ్మలక్కల్లో కొందరు చిన్నాయమ్మకంటే పెద్దాయమ్మ బాగుండాదే అంటే, మరికొందరు చిన్నాయమ్మ కూడా బాగానే ఉండాదే, వీనికి పెండ్లాలను పెట్టుకొనే రాతుంటే కదా అని మాట్లాడుకుంటుండారు.
కడాకు ఆయప్పను మంటి మరుగు చేసిరి. మేము మాయత్తను ఆడనే వదిలి వచ్చేస్తిమి. దినాలు అయ్యేంతవరకు ఆయమ్మ ఏడకూ రాకూడదు. తొమ్మిదో దినం, గాజూ పూసా తీసేసి, తెల్లచీర ముసుగు వేసుకుని దీపం చూడను ఇంటికి రావల్ల. కొత్తగా ముండమోస్తే ఏడేడ చుట్టాలు ఉండారో వాళ్లిండ్లకు పోయి దీపం చూడల్ల. లేదంటే మల్లా జీవితంలో వాళ్ల ఇండ్లకు పోకూడదంట. అన్ని ఊర్లూ చూసుకుని మా ఇంటికి వచ్చింది.
మేము నట్టింట దీపం పెట్టి, కడప మానులో ఆ పక్క , ఈ పక్క, నాలుగు బియ్యం గింజలు వేసి, దీపం చూపించి, ఉప్పుసట్లో చేయి పెట్టిస్తిమి. పెండ్లయినబుడూ అదేపని చేపిస్తారు, ముండమోసినబుడూ అదేపని చేపిస్తారు.
ఎబుడు మాయత్త తెల్లచీర కట్టుకుని వచ్చెనో, మామామ ఆయమ్మ మొగం చూడలేక ఇంటెనకాలకు పొయి ఏడుసుకుంటా ఉండాడు.
మాకూ ఏడుపు వచ్చె. ముత్తైదువుగా మాకండ్ల ముందర కళకళలాడతా ఉండింది, ఇబుడు ఇట్లైపోయిందే అని. ఎబుడో బొట్టు కట్టిచ్చుకున్న పాపానికి, ఈ పొద్దు మామామ బతికే ఉండినా అన్నీ తీసేసి తిరగాల్సి వచ్చిందే అని.
"ఎర్తి తెలీని వయసులో వానికిచ్చి పెండ్లి చేసిరి. వాని దగ్గర వంగినా తప్పే లేసినా తప్పే. అయినదానికి కానిదానికి, ఆచింతకి ఈచింతకి తగువేసుకుని కొట్టేది. వాని దగ్గిర నాకు విరిగిన ఎమకేకాని విరగని ఎమక లేదే! గుణం చెడినా సుకందక్కాల అని యెల్లిపోయి, నా బతుకు నేను బతకతా ఉంటే, వాడు ఇబ్బుడు సచ్చి నన్ను సాదిస్తుండాడు. తొలిత బొట్టు కట్టినోడికి తాడు తెంపల్ల అనే సాంగెం వల్ల నాకు ఈ బాద. లేకుంటే నాకేం కర్మ”
అని మాయత్త బాదపడతా ఉంటే, మామామ ఆయమ్మ చేత్తో ఇచ్చిన నీళ్లు గూడా తాగేదిలే..
మాయత్తను బాగా చూసుకుంటా ఉండిన మామామ అబ్బుటి నింటీ ఎడంగా చూసే!
మాతృక మాసపత్రిక, 2017
నెరవాది : సమర్త / పెద్దమనిషి
మంతిమరుగు : పూడ్చిపెట్టడం
ఎర్తి : జ్ఞానం
ఈ పుస్తకం కొనడానికి - https://hyderabadbooktrust.com/product/edari-batukulu-endapalli-bharathi-2
‘హర్షణీయం’ పాడ్‌కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.
ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.
ఈ పుస్తకం కొనాలంటే - https://www.anandbooks.com/R-Vasundhara-Devi
“టేపులో నీ పాట తీసేసి కొత్త పాట, జానీ మేరా నామ్ లోది. మంచిది పెట్టేశాడు. అన్న..." పాప చెప్పింది.
గబగబా ముందు హాల్లోకి వెళ్ళాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్దగా టేప్ రికార్డర్లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.
“ఎందుకని నా పాట తీసేశావ్?" అనడిగాను.
"ఇష్" అన్నాడు నావేపు చూడకుండానే.
రికార్డింగ్ అయ్యాక "మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్" అన్నాడు.
నాపాట పోగొట్టి ఇంకా పైగాను!
“అది పాతపాట. ఎవరిగ్గావాలి?" అన్నాడు.
“నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తియ్యొద్దని చెప్పానుకదా!" అన్నాను.
"అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులోవుంటే నీకేం, లేకుంటే నీకేం?... మంచిపాట వస్తున్నది. తొందరలో దాని మీద పెట్టేశాను" అన్నాడు.
అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.
ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?
నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఎదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపులోవుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.
ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.
'ఆడేపాడే పసివాడ.... అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలో భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో, సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫానునాటి సముద్రంలాగా అయిపోతుంది మనసు.
....ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితం కల ఒక అమ్మాయి. ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది. ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్ళీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది...
ఆనందానికి విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి... ఉక్కిరిబిక్కిరై నలిగిపోతుంది. గుండె.
ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం....
మనిషి మనసు చిత్రమైనది. ఆ పాట అక్కడ ఉన్నన్నాళ్ళూ నేను దాని గురించి తలచలేదు. కాని అది చెరిగిపోయేసరికి దాని గురించి యింతగా ఆలోచించుకున్నాను. అది మాటల్లేని మూగరాగమై నాలో నిలిచిపోయింది....
ఇంట్లో ఇంకో బీరువా ఉంటే నాకు ముఖ్యమైనవి పిల్లల చేతుల్లో పడకుండా భద్రంగా దాచుకోవచ్చును.
కావలసినవి జారిపోకుండా, మాసిపోకుండా, చెరిగిపోకుండా, పోకుండా దాచుకోగలను.
ఈ యింట్లో నాకు ఓ బీరువా చాలా అవసరం!
*********************
'జాన్‌పాల్ బలే టక్కరివాడమ్మా"
మా యింట్లో పనులు చేసి వెళ్తుండే పనివాళ్లు ముగ్గురూ ఒక్కరకంగానే చెప్పారు, జాన్ గురించి. ఆ విషయం నాకూ కొంచెం అనుభవమే. కాని 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెత ననుసరించి నడుస్తుంది నా బుద్ధి.
బీరువాను రెడీమేడ్ గా కొనాలంటే పాతిక మైళ్ళవతల ఉన్న పట్నం వెళ్లి కావలసిన సైజులో ఆర్డరిచ్చి రావాలి. షాపువాళ్లు యిప్పుడిస్తాం, అప్పుడిస్తాం అంటుంటే అక్కడకు నాలుగుసార్లు వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా పాక్ చేయించి దెబ్బ తగలకుండా బస్సుమీదనో లారీ మీదనో తీసుకురావాలి. ఇంతా చేశాక వాళ్లు రెండోరకం కొయ్యవేసిన చక్కగా పాలిష్ చేసి, ఘనంగా వార్నిష్ చేసి మసిపూసి చేసిన మారేడుకాయలాంటిది అంటగడితే ఎలాగా? చెక్క క్వాలిటీ మనం సరిగా కనుక్కోగలమా?
అద్దంలా మెరిసే అందమైన బీరువా కావాలి. కాని దానికోసం ఎక్కువ యాతన పడడానికి ఓపికలేదు.
అటువంటి సమయంలో జ్ఞాపకం వచ్చాడు జాన్‌పాల్.
ఇదివరలో ఒకసారి పుస్తకాల షెల్పులు తయారు చెయ్యడానికి ఒచ్చినప్పుడు ఎన్నాళ్ళ బట్టో మా యింట్లో వుంటున్న బుక్ కేస్‌ను చూసి
“ఇది. ఇంగ్లండులో దొరికే, పియానోలు చేసే వాల్నట్ కొయ్యతో చేసింది...అమ్మో! ఇదిక్కడ దొరికేదిగాదు...అమ్మా, ఇది ఫారిన్ చెక్క!' అన్నాడు.
ఆ మాటలంటుంటే జాన్ మొహంలో కనిపించిన గాంభీర్యాన్ని, గౌరవభావాన్ని చూచి ఆ బుక్కేస్ గొప్పదనాన్ని ఊహించుకున్నాను. అల్లాగే ఒక పాత. బీరువాను చూడగానే 'ఇది బర్మాటేకులో ఒకటోరకం' అని చెబుతూ టేకుల్లో ఎన్నిరకాలో, వాటి చరిత్రలగురించి ఒక ఉపన్యాసంలాంటిది ఇచ్చాడు. కొయ్యల్లో ఇన్ని రకాలున్నాయని నాకు ఇది వరకు తెలియదు. జాన్ మీద చాలా గౌరవం కలిగింది నాకు. అద్దంలో మెరిసే అందమైన బీరువాను ఒకటోరకం టేకుతో తయారు చెయ్యగల సామర్థ్యం జాన్ కు ఉన్నది అనుకున్నాను.
కాని ఈ జాన్ తో ఇతరవిధాలైన చిక్కులు వస్తాయి. ఇదివరలో బుక్ రాక్లు చేసినప్పుడు పట్నంవెళ్ళి సామాన్లు తెస్తానని కొయ్యలు మేకులూ అంటూ, రెట్టింపుధరలు వేసిన దొంగబిల్లులు తెచ్చి డబ్బు తీసుకున్నాడు.
అవి ఫ్లయివుడ్ షీట్లు కనుక, వాటి ధరలు వేరుగా కనుక్కోగా, మోసం బయటపడింది. జాన్ అప్పటికే డబ్బు తీసుకున్నాడు. మళ్లీ పిలిపించి అడిగాము. కొట్లవాళ్ళ మోసాలను గురించి చిన్న ఉపన్యాసం చాలా 'ఇన్ఫర్మేటివ్'గా ఉండేది. ఒకటి ఇచ్చాడు.
వడ్రంగిపనికి సంబంధించిన ఏ విషయం మీద మాట్లాడవలసి వచ్చినా ఇటువంటి మంచి ఉపన్యాసాలు ఇస్తాడు. అవి విన్న తర్వాత జాన్ మీదా, వడ్రంగి పనిమీదా కలిగిన గౌరవభావంతో నోరు మెదపలేము.
పల్లెటూళ్ళలో ఏ పని జరగాలన్నా ఒక భగీరథ ప్రయత్నం కావాలి. ఒక ఇల్లు కట్టించుకోవాలంటే బేలుదారీలు, వడ్రంగులు, పెయింట్లు వేసే వాళ్ళు అంటూ అన్ని రకాలైన పనివాళ్ళకీ పనులు జరుగుతున్నంతకాలమూ ఇంట్లోనే భోజనాలు పెట్టాలి.
కరెంటు వేయించుకోవాలంటే వైరింగు చేసేవాళ్లకూ అంతే. ఏదైనా వస్తువు చేయించాలంటే వడ్రంగులకూ అంతే. ఆఖరుకు బట్టలు కుట్టే టైలర్లకు కూడా అంతే. వాళ్ళ భోజనాలకు గడిచిపోగా, పనిచేసినన్ని రోజులకు కూలిడబ్బులు చేతబట్టుకొని ఇళ్ళకు వెళ్తారు. వాళ్ళు పనిని సాగదీసి, ఇంకో వారం రోజులు గడిపే తత్వంలో వుంటారు. .. మన పనిచేసే వాళ్ళు మనింట్లో భోజనం చెయ్యడం, తృప్తిగా పనిచెయ్యడం న్యాయమే కావచ్చును.
కాని ఏ పని జరగాలన్నా ఇంత ప్రయత్నం కావలిసి రావడం పట్నాలనుండి వచ్చినవాళ్ళకు విసుగ్గా ఉంటుంది. డబ్బు పారేస్తే పని జరగటం, వస్తువు ఇంటికి రావడం అన్న పద్ధతికాదు ఇక్కడ. ఇది ఒక పాతపద్ధతి. వస్తువుకి, అది చేసే వారి మంచి చెడ్డలకీ గల అవినాభావ సంబంధాన్ని గుర్తించితీరాలి..
మా వారు ఇక్కడ కొత్తగా పెట్టిన చక్కెరమిల్లులో అసిస్టెంట్ మేనేజర్‌గా చేరారు. అందువలన ఈ పల్లెటూరికి వొచ్చాం మేము. ఊళ్ళో మరో ముగ్గురు వడ్రంగులు ఉన్నారు. కాని అందరిలోకీ జాన్ కి పని బాగా చేతనవునని...జాన్, ఇతరులు కూడా చెపుతూవుంటారు. మిల్లులో ఏవైనా కొయ్యపనులు జరగాల్సినప్పుడు జాన్ ని పిలుస్తారు. ఇది ఒకరకంగా జాన్ కి సహాయం చెయ్యడమే. ఆ సంబంధంవలన ఇదివరలో ఒకసారి వచ్చి బుక్ రాక్స్ చేశాడు.
"అమ్మో, అయ్యగారింట్లో భోజనం పెట్టమని నేనడుగుతానా! వూళ్ళో నాకు ఇల్లుంది. వంట చేసుకుంటాను... కూలి కూడా అయ్యగారి దగ్గర ఒక్క రూపాయి తక్కువే తీసుకుంటాను" అన్నాడు జాన్.
పెద్దాచిన్నా బాగా ఎరిగినవాడు. పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండటం నేర్చినవాడు. కొయ్యలూ వగైరాలు తేవడంలోనూ, కూలిలోనూ కూడా. ఎక్కు వ డబ్బు తీసుకున్నాడంటే అది వేరే మాట. వాళ్ళూ బతకాలిగద...
అన్ని విషయాలూ ఆలోచించిన మీదట జాన్ కు కబురుపెట్టాను. మిల్లులో పనులు చేస్తూనే ఉంటాడు అడపాదడపా. కనుక మనల్ని చిక్కున పెట్టడు లెమ్మనుకున్నాను.
పొట్టిగా దిట్టంగా చామననలుపులో ఉంటాడు జాన్. అరవై దగ్గరగా వయస్సయినా నలభైకి మించినట్లు కనబడడు. మొహం, ఎదురురొమ్మూ , చేతులూ, కాళ్ళూ అన్నీ వేటికవి బలంగా ధృడంగా కనిపిస్తాయి. పై వరుసలో ముందుపళ్ళు రెండు లేవుగాని మిగతా పళ్ళు రాళ్ళ మాదిరి గట్టిగా ఉన్నాయి. ఎత్తయిన నుదుటి క్రింద లోతుల్లో కనిపించే కళ్లు నల్లగా ఉండి ఎప్పుడూ చురుగ్గా చూస్తుంటాయి. రూపం, మాటతీరు
అన్ని ప్రత్యేకంగా ఉండటాన జాన్ని ఒకసారి చూస్తే ఎవరూ మరచిపోలేరు.
జాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే...బలశాలి. మాటలో, చేతలో, చూపులో | అన్నిట్లోనూ బలం. అదీ జాన్ అంటే!
నిజం చెప్పాలంటే జానన్ను చూస్తే కొద్దిగా భయం నాకు. దుర్బలులకు శక్తిని చూసినప్పుడు కలిగే భయం. స్థూలంగా చూస్తే దానికి వేరే కారణం లేదు మరి!
చకచకా లెక్కలు వేశాడు జాన్. అంతా ఒక వందరూపాయలకు సామాను తెస్తే టేకు బీరువా యీ సైజుది తయారు చెయ్యొచ్చునట. పట్నంలో షాపునుంచీ ప్లైవుడ్ బీరువా యీ సైజుది నాలుగువందలకు తెచ్చారు. పక్కింటివాళ్ళు. అట్లాగని జాన్ తో నేను అనలేదు.
'రోజ్ వుడ్ అయితే ఎక్కువ ఖరీదవుతుందా?” అనడిగాను.
“లేదు. రెండూ ఒకటే” నన్నాడు.
“తక్కువరకం సరుకు తెస్తాడేమో, లేకుంటే ఇంత చవగ్గా ఎలా వస్తుందీ” అనుకున్నాను.
“మంచిరకం టేకు తేవాల”న్నాను.
'అయ్యగారికి ఎట్లాంటివి తేవాలో నాకు తెలియదా? అంటూ తాను పట్నంలో పెద్ద పెద్ద ఆఫీసర్లకు ఎన్నెన్ని వస్తువులు చేసింది, వాటిని చూచి వాళ్ళు ఎంతెంత ఆశ్చర్యపడిందీ, మెచ్చుకున్నదీ అంతా చెప్పాడు.
జాన్ క్రిష్టియన్ మిషనరీల దగ్గర పెరిగాడు. పని నేర్చుకున్నాడు. ఒక ఇంగ్లీష్ దొరగారు...పీటర్స్ దొరగారు..దయతో అన్ని పనులు నేర్పించారు. జాన్‌కు ఎంతో సహాయం చేశారు. ఆయన దయవల్ల ఎట్లాంటి వస్తువైనా చెయ్యగల నేర్పు అబ్బింది జాన్ కు .
“ఒరే, ముండాకొడకా, సరిగ్గా చెయ్యకపోతే తంతాను” అన్నాట్ట కలెక్టరుగారు. ధైర్యంగా చేస్తానన్నాడు జాన్. పెద్దవాళ్ళను మెప్పించాలని జాన్ పట్టుదల. రోల్ టాప్ డెస్క్ చెయ్యాలి. ఆ పట్నంలో ఎవరికీ చేతగాని పని అది. అలాటిదాన్ని ఇదివరలో పీటర్ దొరగారి దగ్గర చూచివున్నాడు జాన్. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నాడు. చేశాడు. కలెక్టరుగారు 'సెభాష్' అన్నారు.
ఇంకోసారి ఒక పెద్ద డాక్టరుగారికి అసుపత్రిలో ఉపయోగించే ఒక వస్తువు చేయించవలసిన పనిబడింది. ఆ వస్తువును పై దేశాల్నుంచీ తెప్పించాలంటే చాలా ఆలస్యమూ, ఖర్చూను. అందువలన జాన్‌ను పిలిపించి చెప్పారు.
జాన్ ఆలోచన చేశాడు. ఒకరకంగా ఊహించుకున్నాడు. దాన్ని చేశాడు. తప్పు అయింది. పారేశాడు. మళ్లీ చేశాడు. డాక్టరుగారు సరిగ్గానే ఉందన్నారు. ఇహ ఒక అద్దం బిగించాలి దానికి. అది ఎట్లా బిగించాలో చెప్పారు డాక్టరుగారు.
కాని తాను దగ్గర ఉన్నప్పుడే బిగించాలనీ తొందరగా వొస్తానని చెప్పి వెళ్లారు. ఎంత సేపు చూచినా ఆయన రాలేదు. పని పూర్తి చేసుకుని డబ్బు తీసుకుని వెళ్ళాలని జాన్ ఆదుర్దా. డాక్టరుగారు చెప్పిన ప్రకారంగానే ఆయన రాకుండానే బిగించేశాడు.
డాక్టరుగారు ఇంటికొచ్చారు. పనయిపోయింది, డబ్బులివ్వమని చెప్పుకున్నాడు జాన్. డాక్టరుగారికి కోపం మండిపోయింది.
“నిన్నెవరు బిగించమన్నారురా రాస్కెల్! నేను రాకుండా బిగించవద్దనలేదా?' అంటూ చెయ్యిచాచి మొహం మీదకొట్టారు”
ముందుపళ్ళు రెండూ రాలిపడ్డాయి. జాన్ బయటికెళ్ళి రక్తం వూసివచ్చాడు. డాక్టరుగారు వస్తువు చూసుకున్నారు. సరిగ్గానే చేశాడు. జాన్. డబ్బులిచ్చి పంపేశారు. ఇప్పుడా డాక్టరుగారు పనిలో లేరు. ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కనబడితే అప్పుడు విషయం జ్ఞాపకం చేస్తూ పలకరిస్తారు...
ఈ తీరులో జాన్ సొంతంగా ఊహతో వస్తువులు తయారుచేసి పెద్దలను మెప్పించిన వృత్తాంతాలు చెప్పాడు. పెద్దవాళ్లు కొట్టడంలోనూ మెచ్చుకోవడంలోనూ కూడా కుక్కను చూచినట్లు చూడడం నాకు నచ్చలేదు. కాని మా బీరువా చెయ్యడానికి తగినవాడని తెలిసిపోయింది.
ఆయన ఆఫీసునుండి రాగానే బీరువా చేయించడానికి జాన్‌ను పిలిసి చెప్పాను. జాన్ ఆయనకు వివరాలన్నీ చెప్పాడు. ఒకటోరకం టేకు బీరువా.
ముందుగా కొయ్యలు నూటయాభై రూపాయిలకి తేవాలి. కూలి డబ్బుల మాట అడగడు.
"అయ్యగారి ఇష్టం. పదిరూపాయిలిస్తే పదే తీసుకుంటాడు…”
"ఇందాక కొయ్యలు నూరురూపాయిలకు చాలన్నావే”అన్నాను.
“అయ్యగారి దగ్గర కరెక్టుగా చెప్పాలి కదమ్మా. తర్వాత పొరపాటు రాకూడదు. పెద్ద దొరల దగ్గర ఎట్లా ఉండాలి?' అంటూ నన్ను మందలించాడు.
అది నిజమే. ఇప్పటి లెక్కలి బట్టి బీరువా ధర నూరు దగ్గర కాకుండా రెండునూర్లు అయేట్లుంది. కాని మంచిచెక్క చూసి తెచ్చి జాగ్రత్తగా ఇంట్లో చేస్తాడు. ఎట్లయినా షాపు వాళ్ళ దగ్గర కొన్నదానికంటే ధర తక్కువే పడుతున్నది గదా!
నూట తొంభై రూపాయలకు బిల్లుతో కొయ్యలు తెచ్చి కట్ట యింట్లో పడేశాడు జాన్. తర్వాత నాలుగు రోజులు అంతులేడు.
ఇంతకూ పని చేస్తాడో లేదో, వూరికే కొయ్యలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామే అనిపించింది.
మా పనివాడు కొయ్యల్ని చూచి “కొయ్య ముళ్ళుగా వున్నది. అంత మంచిగా లేదు” అన్నాడు.
ఇంతా చేసి నిగనిగ మెరిసే అందమైన బీరువా రాదా ఏమిటి? నాకు చాలా కోపం వచ్చింది. ఈయనేమో ఏ సంగతీ పట్టించుకోరు!
నాలుగుసార్లు పిలిపించగా జాన్ వచ్చాడు.
“అమ్మా ఫర్నీచరు షాపులవాళ్లు ఎక్కువగా కొంటారుగనుక వాళ్లని మంచి కొయ్యలు ఏరుకోనిస్తారు గాని నాబోటివాళ్లు ఒక్క బీరువాకు కొంటే ఏరుకోనివ్వరు. చెయ్యి పెట్టనివ్వరు. అయినా యివి దొరగారి కోసమని చెప్పి బలవంతాన రెండు మూడు మంచికొయ్యలు ఏరివేశాను.... ఆ ముళ్లూ అవీ తోపడంలో పోతై. కనపడవు. బాగానే వుంటుందిలెండి బీరువా” అన్నాడు.
“పని చెయ్యడం లేదు. ఎందువలన" అనడిగాను.
“కొయ్యలన్నీ మా ఇంటికే తీసుకెళ్లి చేస్తానంటే దొరగారు 'ఒద్దు యింట్లోనే చెయ్యి' అన్నారు. నేను పక్క వూళ్ళో హోటలుకు బల్లలు చేస్తున్నాను. ఇక్కడ పని చేస్తూ నడి మధ్యలో వొదిలి అక్కడకు పోతే... దొరగారి పని అట్లా చెయ్యకూడదు! పనిలో దిగితే |పూర్తి చెయ్యాల్సిందే. అందుకని ఆ పని పూర్తి చేసి వొద్దామని ఆలస్యం చేస్తున్నాను.
మూడు నాలుగు రోజుల్లో వొచ్చి చేసెయ్యనా. అమ్మా!...దొరగారి పనంటే మాటలా!". అన్నాడు.
పదిహేను రోజుల తర్వాత వొచ్చాడు పనికి. ఆయన బాగా చీవాట్లు వేశారు. వంచిన తల ఎత్తలేదు జాన్.
“అవును తప్పుచేశాను. పెద్దవాళ్లు...తిడితే పడాలి” అన్నాడు.
దాని తర్వాత ఒక్క రోజు పని చేసి మళ్ళీ మాయమైపోయాడు. ఊళ్ళోనే ఎక్కడో దూలాలు కోస్తున్నాడట. రెండు రోజుల తర్వాత వచ్చాడు.
“వాళ్లు నాకు ఇదివరలో డబ్బు ఇచ్చి ఉన్నారమ్మా. పీకలమీద కూచుంటే వెళ్ళవలసి వచ్చింది. అందులోనూ పెద్దవాళ్ళపని అని చెప్తే గూడా వాళ్లు ఊరుకుంటేనా” అన్నాడు.
“అసలు వాడు పనిచేసే చోటునుంచీ కొయ్యలు చల్లగా దాటించేస్తాడమ్మా. జాగర్తగా ఉండాలి" అని హెచ్చరించాడు, మా శ్రీరాములు.
ఒకే ఊళ్ళోవాళ్ళకు.... పల్లెటూళ్ళలో... ఒకరిగురించి ఒకరికి బాగా తెలిసివుంటుంది. లేనిపోని తంటా కొని తెచ్చుకున్నట్లనిపించింది.
పనిచేస్తూ వున్నప్పుడు గంటకోసారి బయటకు వెళ్తాడు జాన్... బీడీలు కాల్చుకోడానికి, టీ తాగటానికి, ఎవరితోనైనా మాట్లాడ్డానికి, సామాన్లు ఎవరి దగ్గర్నుండో తెచ్చుకోడానికి.. ..ఎన్నోపనులు. ఇందులో ఏ సమయంలో దాటించేస్తాడో! అసలు తాను తీసుకెళ్లడానికి సగం కొయ్యలు వేరుగా ఎక్కువగా తెచ్చాడేమో! మొదట చెప్పినదానికంటే ఎక్కువ బిల్లు చేసుకొచ్చాడే!
జాన్ కోసం మనుషులు వచ్చిపోతుంటారు కూడాను. ఎవరికిచ్చి పంపించేస్తాడో! ఎన్నో అనుమానాలు. అందుకని జాన్ దగ్గర ఒక మనిషి కాపలా ఉండవలసి వచ్చింది.
శ్రీరాములికి ఇతరపనులు చెప్పకుండా, మా ఇద్దరిలో ఒకరు తప్పిస్తే ఒకరు అక్కడ ఉండవలసి వచ్చింది.
శ్రీరాముల్ని చూస్తే జాను చాలా లోకువ. “ఏయ్ అబ్బాయ్, ఆ ఉలి ఇట్లా అందించు, ఈ బల్ల పట్టుకో... ఊ సరిగ్గా పట్టుకోవయ్యా.... ఏ పనీ సరిగా చెయ్యలేవు" అంటూ శ్రీరాములుకు ఏదో ఒకపనిని చెప్తూ గదమాయిస్తూనే వున్నాడు.
చీటికీమాటికీ జాన్ బయటికి వెళ్తూండడంవలన పని వెనుకబడుతున్నది. టీకోసరం వెళ్తే గంటన్నర వెళ్లిపోతాడు. మొదటి రోజు సాయంత్రం మాతోపాటుగా టిఫిన్, టీ ఇచ్చాను. బయటకు వెళ్లకుండా ఇంకో గంట కూర్చుని పనిచేశాడు. మర్నాడు ఉదయం పనిలోకి రాకుండా మధ్నాహ్నం మూడుగంటలకు వచ్చాడు. ఇప్పడే కదా పనిలోకి వచ్చాడు, టిఫినూ టీలూ ఇచ్చి ఎదురు సేవలు చెయ్యాలా? అనుకొని ఇవ్వలేదు.
అయిదుగంటలయ్యేసరికి కొయ్యలు, పనిముట్లు దభీదభీమని ఎత్తిపడెయ్యడం మొదలెట్టాడు. ఆ శబ్దాలు వినలేక అప్పటికప్పుడు టీ చేసి ఇచ్చాను. గ్లాసు చేతిలోకి తీసుకుంటూ నా కళ్లలోకి తీక్షణంగా చూశాడు. .
“రెండుపూటలా అన్నం పెట్టి, కాఫీ టిఫినూ యిస్తామని ఎందరో పిలుస్తారమ్మా! దొరగారి పని అని వచ్చాను" అన్నాడు. ఆ చూపుకి నా గుండెలో దడవచ్చింది.
మర్నాటి నుండీ నాలుగంటలకు సరిగ్గా టిఫిన్ టీలు ఇచ్చెయ్యాలనుకున్నాను. ఈ జాన్ పైకి కనిపించేటంత వినయవిధేయతలు కలవాడుగా తోచలేదు. మాటల్లో కనిపించే విధేయతకు పూర్తిగా వ్యతిరేకమైన స్వభావం కలవాడుగా చేతల్నిబట్టి తోస్తున్నది.
**************************
జాన్ కి ఒక కొడుకూ, ఒక కూతురునట. కూతురు చదువుకొని పట్నంలో టీచరుగా ఉంటున్నది. జాన్ సరిగా చూడడు గనుక జాన్ భార్యకూడా పట్నంలో కూతురి దగ్గరే ఉంటున్నది.
ఇదివరలో జాన్ సంపాదించినదంతా తాగేసి ఇంట్లో డబ్బు సరిగ్గా ఇచ్చేవాడు కాదట. ఏమని అడిగితే భార్యను బాగా తన్ని “ఆడముండవి,నోరు మూసుకొని పడివుండు” అనేవాడట.
ఆవిడే కష్టపడి కూతురి చదివించుకున్నది. జాన్ మాత్రం కొడుకు ఫిలిప్‌తో యీ వూర్లో వుంటున్నాడు.
ఇదివరలో రాక్ లు చేసేటప్పుడు ఒకనాడు ఫిలిప్‌ను వెంటబెట్టుకుని వచ్చాడు జాన్. వాడు కష్టపడలేని వాడు గనుక మిల్లులో ఏదైనా ఆఫీసు జవాను లాంటి పని ఇప్పించమని అడిగాడు.
ఫిలిపు ఇరవై ఏళ్ళ పైన వయస్సుంటుంది. సెకండ్ ఫారమ్ చదువుతూ ఆపేశాడట.
"అమ్మో వాడు చాలా తెలివికలవాడు. పంతులు క్లాసులో ఏదో అన్నాడని పంతం మీద మానేశాడు గాని.... చదివుంటేనా, వాడు..అమ్మా..ఎట్లుండ వలసినవాడు. ఎప్పుడైనా సమయం పడినప్పుడు నేను పనిలోకి రాలేకపోతే, వాడు వెళ్లి నాకంటే బాగా చేస్తాడమ్మా పని! .... అయితే ఎంతటివాళ్లయినా మాటంటే మాత్రం పడడు” అన్నాడు
ఫిలిప్ ది తండ్రికిలాగే దృఢమైన శరీరం. నల్లగా నేరేడు పండులాగా నిగనిగలాడుతుంటాడు. కాని జాన్ మొహంలోనూ ఆకారంలోనూ కనిపించే గట్టిదనం ఫిలిప్లో కనిపించదు. మొహమూ చెంపలూ చేతులూ ఆడపిల్లలకున్నట్లు మృదువుగా వుంటాయి.
వాడి ఇరవై ఏళ్ళ కళ్ళల్లో సోమరితనం, అలసత్వం కనిపిస్తాయి. జీవితంతో పోరాడి ఎన్నో ఢక్కామొక్కలు తిని రాటుదేలిన జాన్ కళ్ళు... అరవై ఏళ్ళవి.... వాడి చూపుతో వెలుగుతూవుంటాయి.
ఇద్దరూ తండ్రీ కొడుకులు. ఒక రకంగా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. కాని అంతకంటే ఎక్కువ భేదమూ వున్నది.
జాన్ కొడుక్కి ఉద్యోగం కావాలని అడుగుతూవుంటే ఆ విషయంతో తనకు ఏమీ సంబంధం లేనట్లు రెండు చేతులు కట్టుకుని ఎటో చూస్తూ ఒంటికాలిమీద నిలబడ్డాడు | ఫిలిప్.
వాడు ఉద్యోగం అర్థిస్తున్న వాడిలా కనబడలేదు. జాన్ పనిచేసుకుంటుంటే అట్లాగే నిలబడి కొంచెం సేపు చూసి 'నేనింటికెల్తా, నాయనా' అన్నాడు.
జాన్ పని ఆపి, ప్రేమగా కొడుకువైపు చూసి 'వెళ్ళు' అన్నాడు. ఫిలిప్ వెళ్లిపోయాడు. పనికోసరం వాళ్ళు మళ్ళీ అడగలేదు. జాన్ కి ఫిలిప్ కి ఉండే సంబంధం నాకు ఆశ్చర్యం కలిగించింది.
భార్యనీ, మరీ అంత కరుగ్గా చూసే జాన్ ఫిలిప్ ను అంత ప్రేమగా చూస్తాడెందుకు? వాడు కంద పయోజకుడైనాడు. జాన్ వాడినట్లా చేశాడనడమే సబబేమో. పంతులు ఒక మాటంటే వాడు చదువు మానేస్తానంటే మానెయ్యనివ్వడమేనా? దండించి చదివించుకోరా! పోనీ చదువు అబ్బకపోతే తన పని నేర్పించితే ఒకరి సంపాదన కొకరికి తోడుగా ఇబ్బడిగా సంపాదించుకోవచ్చునే!
జాన్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉన్నది. తాను ఎన్నో అబద్దాలాడి నానా గడ్డీ కరచి నెట్టుకొస్తున్నాడు. కొడుకు మాత్రం ఒకరి చేత మాటపడని వాడుగా, కష్టపడలేనివాడుగా అబద్ధమూ అన్యాయమూ లేకుండా డబ్బంటే లెక్కలేకుండా ఉండాలా!
ఒకరోజు వచ్చి ఒక రోజు రాత్రి దాకా పని చేసి, చేసి ఎట్లాగో బీరువా పని ఒక కొలిక్కి తెచ్చాడు జాన్. ఇహ అరలు పెట్టి తలుపులు బిగించాలి. అటువంటి సమయంలో మళ్ళీ మాయమైనాడు.
ఆ ముందురోజునే పట్నం వెళ్లి సీలలు, బందులు, హాండిలు, తాళం, పాలిషు, ఎమెరీ పేపర్లు అన్నీ బస్సు ఛార్జీలతో సహా యాభై రూపాయల సామాన్లు తెచ్చాడు. ఇంకొక్క రోజు పనిచేస్తే పూర్తవుతుందన్నాడు. ఇంతవరకు పనిచేసినదానికి తనకు రావలసిన కూలిలో పది రూపాయలు మిగిలివుంటే తీసేసుకున్నాడు. అంతే పనిలోకి రాలేదు.
ఎక్కడికైనా పారిపోయాడా అనుకోవడానికి జాన్ సామాన్లు-ఉలి, రంపం, క్లాంపు అన్నీ మా ఇంట్లోనే వున్నాయి. ఎన్నిసార్లు వెళ్లినా మా మనుష్యులకు జాన్ అంతు దొరకలేదు. మూడో నాడు శ్రీరాములికి బజార్లో కనబడ్డాడట. బాగా తాగివుండి శ్రీరాముల్ని నానా దుర్భాషలాడాట్ట. ఫిలిఫ్ సర్దిచెప్పి మర్నాడు పనిలోకి పంపుతానన్నాట్ట.
ఎన్నో క్షమార్పణలతో మర్నాడు పనిలోకి వచ్చాడు. ఎక్కడో పని ఒప్పుకున్నాడట. రేపటితో యీ పని పూర్తి చేసుకుని వెళ్లిపోతాడట. ఇక్కడ పని సరిగా చెయ్యకుండా, మాట నిలకడ లేకుండా చేసుకున్నందుకు కొడుకు బాగా కోప్పడ్డాడట. మొదట ఇచ్చిన ఎస్టిమేటుకి అయిన ఖర్చుతో సంబంధం లేకుండా ఉన్నదనీ, పని తొందరగా చెయ్యలేదనీ జాన్ ను కోప్పడి ఆయన ఫాక్టరీకి వెళ్లిపోయారు.
తరువాత నా దగ్గర మామూలుగా కనిపించే అతిశయంగానీ అతివినయంగాని లేకుండా మాట్లాడాడు. "సూటయాభై రూపాయలకు బీరువా చేసిస్తానని చెప్పాను. నిజమే. అంతా అయ్యేటప్పటికి రెండువందలయాభై దాటిపోతున్నది. ఇందాక అయ్యగారు తిట్టారు... నాకు అదే చాలా చింతగా ఉన్నది.
ఇంట్లో గూడా చింతపడతాఉంటే నా కొడుకేమన్నాడంటే “మాట పొరపాటు రాకూడదు నాయినా. అయ్యగారు డబ్బు జాస్తి అవుతుందని కోప్పడితే నువ్వు కూలి డబ్బులు తీసుకోమాక! అన్నాడు...." అంటూ చెప్పాడు.
కూలి డబ్బులన్నీ అప్పుడే తీసేసుకున్నాడుగదా! కొడుకు బడాయిమాటలన్నీ తమాషాకి వల్లిస్తున్నాడా? అనుకుంటూ జాన్ మొహంకేసి చూశాను. అక్కడ కనిపించిన ఆనందం మాటల్లో చెప్పగలనా? ఎంతో ప్రశాంతత, ఆనందం, మార్దవం వెలిగిపోతున్నాయి జాన్ మొహంలో.
జాన్ టక్కరివాడు. తాగుబోతు. నిలకడ లేనివాడు. పొగరుబోతు. పైసా ఖరీదు చెయ్యని కొడుకు అప్రయోజకపు మాటలు జాన్‌లో ఇటువంటి భావం | కలిగిస్తాయా? ఎందుకని? ఆమాటల్లో ఏమున్నది? జాన్ అసాధారణ వ్యక్తి.
వ్యక్తుల మధ్యనుండే సంబంధాలూ ఆ వ్యక్తుల్లాగే క్లిష్టమూ, సంకీర్ణమూ అయివుంటున్నాయి. అసలు మనుష్యుల మధ్య నిజంగా సంబంధం అనేది వుంటుందా? వుంటే దాని స్వభావం ఎలాటిది? ఇదంతా నా బుర్రకు అర్ధం అయే విషయంగా తోచలేదు.
ఆలోచనల్ని పక్కకు నెట్టి, నేను చదవలేక పక్కన పెట్టిన పుస్తకం తీసుకున్నాను.
-అడవి ఏమంత దట్టంగా లేదు. కాకులు దూరని కారడవీ, చీమలు దూరని చిట్టడవీ కాదు. రకరకాల చెట్లు కీసర బాసరగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో విలక్షణత. ఆకులో, కొమ్మలో, రూపులో ప్రత్యేకత. కాని వాటిని గుర్తించగల జ్ఞానం నాకు లేదు. నేత్రోత్సవం కలిగిస్తున్న ఆ దృశ్యంలో నేను గుర్తించగలిగింది ఒక సీతాఫలం చెట్టుని. కాయలు విరగ్గా ఉన్నాయ్. అటువంటి చెట్టును నేను ఇదివరకే చూచివున్నాను. అందుకే గుర్తించాను. మిగతా చెట్లన్నీ కలిసి ఒక అడవి. అందులో ఈ సీతాఫలంచెట్టు…
ఈ ప్రపంచం ఒక అస్పష్టమైన వర్ణచిత్రం. అందులో మనం గుర్తించగలిగేది అంతకుముందే మనసులో ఎరుకగా ఉన్నదాన్ని మాత్రమే. తనలోని...
మనం చాలా ప్రేమించే మనుషులు మనకు దూరం అయితే, అస్తిత్వానికి అర్థం లేకుండా పోయినట్టు అన్పిస్తుంది. చుట్టూ వున్న ప్రపంచం అర్థరహితంగా అనిపిస్తుంది. సుప్రసిద్ధ రచయిత్రి వసుంధరాదేవి రాసిన ఈ'జాన్ పాల్ చేసిన బీరువా కథ', తన తండ్రి మరణం ద్వారా జీవితంలో ఏర్పడిన వెలితిని పూడ్చుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక గృహిణి గురించి. ఆమెకు సాంత్వన,ఎవరి వల్ల, ఎలా లభించింది అనేదే ఈ కథ. . వసుంధరాదేవి గారు రాసిన కథల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది.
ఈ కథను అరసం వారు ప్రచురించిన 'ఆర్.వసుంధరాదేవి కథలు' అనే పుస్తకంలో చదవొచ్చు.
ముందుగా ఈ కథ గురించి - మధురాంతకం నరేంద్ర గారి మాటల్లో .

-అడవి ఏమంత దట్టంగా లేదు. కాకులు దూరని కారడవీ, చీమలు దూరని చిట్టడవీ కాదు. రకరకాల చెట్లు కీసర బాసరగా పెనవేసుకుపోయి ఉన్నాయి. ఒక్కో చెట్టుకి ఒక్కో విలక్షణత. ఆకులో, కొమ్మలో, రూపులో ప్రత్యేకత. కాని వాటిని గుర్తించగల జ్ఞానం నాకు లేదు. నేత్రోత్సవం కలిగిస్తున్న ఆ దృశ్యంలో నేను గుర్తించగలిగింది ఒక సీతాఫలం చెట్టుని. కాయలు విరగ్గా...
హర్షణీయంలో మీరు వినబోతున్న కథ పేరు 'ద్రణేవుడు ' . ఈ కథ సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి ' పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు ' అనే కథా సంకలనం రెండో భాగం లోనిది. కథను మీకు అందించడానికి అనుమతినిచ్చిన వేలూరి కౌండిన్య గారికి కృతజ్ఞతలు.
ఆంధ్రా లొయొలా కాలేజీలో అధ్యాపకునిగా జీవిత కాలం సేవలందించిన సుబ్బరామయ్య గారు , కవి సామ్రాట్ , శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియ శిష్యులు కూడా.
1938 సంవత్సరంలో గుంటూరు లో జన్మించిన ఆయన తన జీవిత కాలంలో 350కి పైగా కథలు , 8 నవలలు రాసారు. ఆయన రచనలు ఎన్నో ఇంగ్లీష్ , రష్యన్ తదితర భాషల్లోకి అనువదించబడ్డాయి. ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు తో బాటు ఆయన రచనలు ఎన్నో పురస్కారాలు అందుకున్నాయి.
ఈ పుస్తకం కొనడానికి , లింక్ పై క్లిక్ చెయ్యండి - http://bit.ly/3qJcYCz
ద్రణేవుడు:
సమాచార విస్పోటం అనీ, పోటీ అనీ అనేక నామధేయాలతో ఆధునిక యుగం, విషయ పరిజ్ఞానం ప్రధాన లక్షణంగా శోభిల్లుతున్నది. ఎవడికి ఎక్కువ వివరాలు తెలుసునో జ్ఞాని కింద లెక్క. రకరకాల టెస్టులు, క్విజ్జులూ,, కెబిసిలు ఇవన్నీ యువతరం సమాచార సేకరణ సామర్ధ్యాన్ని గురించే. నాలుగు పేపర్లు తిరగేసినవాడు సాయంకాలం నలుగురి ముందు నాలుగు విషయాలు ఉగ్గడిస్తే వాణ్ణి జ్ఞాని అనేస్తారు.
మనసును అత్యవసర పరిజ్ఞానంతో కాక, అత్యవసర విషయ పరిజ్ఞానంతో కూడా నింపడం, అట్లా కొందరి కంటే కొన్ని ఎక్కువ విషయాలు తెలిసి జ్ఞాపకముంచుకున్న వాణ్ణి బిరుదులతో గౌరవించడం జరుగుతున్నది. వాడెవడో అంత బతుకూ బతికి ఇంగువంటే ఏమిటో తెలుసుకోకుండా, తెలుసుకునే అవకాశం లేకుండగానే దాటిపోయాడు.
ఇక ఈ మనిషి మరో విచిత్రం . రైల్లో తారసపడ్డాడు.
“నిన్నేనయ్యా అడుగుతున్నది?” అన్నాడాయన రెండోసారి పెద్దగా.
అంతకుముందు వేరొక రైలు దడదడ మని శబ్దం చేస్తూ వెళ్తుంటే ఈయన అన్నదేమీ నాకు వినిపించలేదు.
ఇప్పుడు “ఏమిటి?” అని అడిగాను.
ఆయనకు అరవై ఏళ్లు దాటే వుంటాయి. జుట్టు బాగా తెల్లబడి చెంపలు పెరిగి వున్నాయి.
“చూడు! నువ్వు చాలా చదివి వుంటావు కదా. ద్రణేవుడు అనే పేరు, పాత్ర ఎక్కడైనా తగిలిందా? పురాణాల్లో కాని కథల్లో కాని... ఎక్కడైనా....”
నేను లేదంటూ తల అడ్డంగా వూపాను.
“అలాగా?” అన్నాడాయన నిరాశగా.
తర్వాత తన ఎదురుగా కిటికీ పక్కన కూర్చుని ఏదో చదువుకుంటున్న నడివయస్సు వ్యక్తిని కూడా ఇదే ప్రశ్న అడిగి అతడు లేదనగానే హతాశుడై నిట్టూర్చి నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు.
రైలెక్కినప్పుటినుంచి చూస్తున్నాను.... ఈ మనిషి వాలకం చిత్రంగా వుంది. ఒక పొడుగాటి లావాటి పుస్తకం వొళ్లో పెట్టుకుని వుండి వుండి అందులో ఏదో రాస్తున్నాడు. రైలు ఆగిన ప్రతి స్టేషను పేరు ఇంగ్లీషు తెలుగు రెండు భాషల్లోనూ వరసగా రాసి పెట్టుకుంటున్నాడు.
కాసేపాగి మళ్లీ -
"అంతా బాగానే వుంది. ఈ ద్రణేవుడెవరో ఎక్కడివాడో వివరాలేమాత్రం తెలిసి చావడం లేదు. ఎందరినో అడిగాను. ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వివరం ఎప్పటికైనా తెలుస్తుందో లేదో...." అన్నాడు.
“ఎప్పుడో ఒకప్పుడు తెలియకపోదులెండి. ఎవరో ఒకరు చెప్పకపోరు” అన్నాను ఏమీ తోచనివాడిలా.
“పదేళ్ల నుంచి తెలియని విషయం ఎప్పుడు తెలుస్తుందో... అసలు తెలియనే తెలియదో"అంటూ నిట్టూర్చాడు.
నేను చాలా సేపటి నుంచి మధనపడుతున్నాను. 'ఈ మనిషి ఎవరా?” అని.
మనసు లోపలి పొరలలో ఎక్కడో ఒక మూల ఈ వ్యక్తి వివరాలు భద్రంగానే వున్నాయి. అయితే స్పష్టంగా ఉపరితలానికి రావడంలేదు. -
“ఇలా రైల్వేస్టేషన్ల పేర్లూ ఇంకా ఏవేవో విషయాలు రాస్తున్నారు కదా ఈ పుస్తకంలో.... ఎందుకీ వివరాలన్నీ?” అని అడిగాను. -
ఆయన కళ్లలో మెరుపు. “ఎందుకేమిటి? ఇదంతా నాలెడ్జి... ఇన్ఫర్మేషన్... ముందు తరాలవారికి అందించాల్సిన బాధ్యత మనదే కదా. మన తాత ముత్తాతలు 'తమకెందుకులెమ్మ'ని ఊరుకుని వుంటే మనకివ్వాళ ఇంత ఇన్ఫర్మేషన్ దొరికేదా? ఇన్ని విషయాలు తెలిసేవా? సమాచారం, విషయపరిజ్ఞానం వుంటేనే మనిషి మనిషవుతాడు. లేకపోతే మా ఫ్రెండులాగా అతి చిన్న విషయం కూడా తెలియకుండా చచ్చిపోతాడు. పదేళ్ల కిందట మావాడొకడు ఇంగువ అంటే ఏమిటో తెలియకుండానే చచ్చిపోయాడు. అప్పటినుంచి నేను ఇట్లా విసుగనేది లేకుండా విషయ సేకరణ చేస్తున్నాను. అదీ యిదీ అని ఏమీ లేదు. చూసినదీ విన్నదీ అంతా. రికార్డు చేసి పెట్టడమే”
ఇప్పుడు నా మనసులో మెరుపు మెరిసినట్టయింది. చాలా ఏళ్ల క్రిందట సంగతి... మాఇంటి పక్కన నడివయసు దాటిన ఒక వ్యక్తి గుండెజబ్బుతో బాధపడి రెండు మూడు రోజులు అపస్మారక స్థితిలో వుండి చివరకు పోయాడు. అప్పుడీయన అక్కడికి వచ్చాడు.
మనిషి పోగానే హతాశుడై వెనువెంటనే తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు సరిగ్గా చూస్తుంటే పోలికలు బయటపడటం మొదలై ఆ వ్యక్తి ఇతడే అని నిర్ధారించుకున్నాను. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రైల్లో తారసపడ్డాడు. చేతిలో పొడవాటి పుస్తకంతో..
ఆయన మళ్లీ నా వైపు తిరిగి 'ఈ ద్రణేవుడనేవాడు ఎవడో నాకు తెలియదు. ఎప్పుటివాడో ఎక్కడివాడో తెలియదు. ఎందరినో అడిగాను. ఎవరూ చెప్పలేకపోయారు” అన్నాడు దిగులుగా.
“అసలా పేరు గలవాడు ఎవరూ లేరేమో” అన్నాను నేను.
"కాదు... వుండే ఉంటాడు. మనకి తెలియనంతమాత్రంలో లేడని నిర్ణయిస్తే ఎలా?
తెలుసుకోవాలి. దానికి వేరే మంత్రం ఏమీలేదు. కనపడిన వారినల్లా అడుగుతూపోవడమే”.
ఈ ధోరణి ఇంకా కొనసాగేదేమో గాని దిగవలసిన స్టేషను సమీపించడం వల్ల నేను హడావిడిగా లేచి పైనున్న సంచి అందుకుని, దిగేందుకు ఉద్యుక్తుణ్ణయినాను. అంతలో ఆయన కూడా లేచి పెన్ను ముడిచి జేబులో వుంచుకుని, పుస్తకం మూసి, చంకలో పెటుకుని రైలు దిగేందుకు సన్నద్ధుడయ్యాడు.
. ఆశ్చర్యమేమంటే ఆయన స్టేషను బయట కూడా నా వెంటనే నడిచాడు. దగ్గర యిల్లు కావడం వల్ల నేను నడక సాగిస్తే తనూ నా వెంటనే కాకపోతే పక్కనే నడిచాడు. నడుస్తున్నంత సేపూ మాట్లాడుతూనే ఉన్నాడు.
తర్వాత మా వీధిలోనే ముందుగా ఒక యింటిముందు ఆగి “ఇదే మా యిల్లు. మా అబ్బాయి యిల్లు. నేను ఇప్పుడే వొస్తున్నానిక్కడికి. మా వూరు వదిలి వొచ్చేస్తున్నాను. ఇక్కడే వుంటానిక. నా సామాన్లు - అంటే ఎక్కువ భాగం నా పుస్తకాలు - నిన్ననే వచ్చాయి ఇక్కడికి" అన్నాడు.
‘వివేకానంద మీ అబ్బాయా? మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము. మా యిల్లు వీధి చివర" అన్నాను. నేనూ.
“మంచిది. అప్పుడప్పుడు వొస్తూవుండు” అంటూ ఆయన గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు.
ఆఫీసులో మరునాడు వివేకానంద పలుకరించాడు. మాటల సందర్భంలో నా రెలు ప్రయాణం,, అతని తండ్రి పరిచయం ప్రసక్తి తెచ్చాను.
కొన్ని క్షణాలు ఆగి “మా ఊళోనే వుండేవారు ఇంతకుముందు. అక్కడే వుంటానని మొండికేసి ఇన్నాళ్లు గడిపాడు. అక్కడే మట్టి అయిపోతానని గోల చేసేవాడు. ఇన్నాళ్లు సరే అన్నాము. కాని ఇప్పుడిక అక్కడి పొలంతో పాటు ఇల్లూ, వాకిలీ అన్నీ అమ్మేయవలసి వచ్చింది. ఇప్పుడైనా అయిష్టంగానే కదిలి వచ్చాడు” అని చెప్పాడు.
ఆనాడు వివేకానంద ఇంటిమీదుగా వస్తుండగా వరండాలో నిలబడి వుండి ఆయన పిలిచారు. ఆ
పిలుపులో ఎంతో ఆప్యాయత, ఆర్థత. లోపలికి వెళ్లాను. నన్ను తనవెంట లోపలి గదిలోకి తీసుకెళ్లాడు. గది అంతా మసక వెలుతురు. లోపలి కిటికీ పక్కన ఓ చిన్న బల్ల, స్టూలు వున్నాయంతే. గోడవారగా ఒక పక్క మంచం... ఇక మిగిలిన గది అంతా కిందా పైనా అంతటా కాగితాలు, పుస్తకాల కట్టలు. పెద్ద కవిలె కట్టల్లాంటి పుస్తకాలు. బొత్తులు బొత్తులుగా కట్టలు కట్టలుగా ఎక్కడబడితే అక్కడ కాగితాలు.
అంతటా ఆ వాసన.
“ఇదంతా... నా శ్రమ ఫలితం” అన్నాడాయన.
“పాతికేళ్లు నుంచి నేను నిరంతరం సేకరించిన అమూల్య సమాచార భాండాగారం. ఇక్కడ నీకేం కావలిస్తే అది దొరుకుతుంది. బిట్రగుంట స్టేషనుకు అటూ ఇటూ వున్న స్టేషన్లు ఏవి అని నీకు అనుమానం వచ్చిందనుకో... అదుగో, ఆ మూల ఉన్న కాగితాల కట్టలో వెదికితే దొరుకుతుంది. జీలకర్ర ఏ రకమైన పదార్ధమో తెలుసుకోవాలనుకో... లేకపోతే కలరావుండలు ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలనుకో! ఇదుగో ఈ పక్క ఎక్కడో ఒక పుస్తకంలో ఆ వివరం దొరుకుతుంది. ఎవరికైనా తుత్తునాగం అంటే ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తే కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే కాస్త శ్రమపడి వెదుక్కోవాలి. అంతే...” ఇలా సాగింది. ఆయన ధోరణి.
నేను బొమ్మలాగా కూర్చుండిపోయాను.
అంతలో వివేకానంద నా అదృష్టం కొద్దీ వచ్చాడు లోపలికి.
వచ్చీ రావడంతోనే “మా ఆవిడ చెప్పింది మీరు వచ్చారనీ, మా నాన్న మిమ్మల్ని లోపలికి తీసుకొచార నీనూ...లేవండి... పదండి ముందు గదిలోకి వెళ్లాం...” అంటూ 'నాన్నా! ఏవిటీ పద్ధతి? ఇంటికొచ్చిన వాళ్లందర్నీ మీ చాదస్తంతో విసిగించి బాధపెడితే ఎలా?” అని విసుక్కుంటూ నన్ను ముందు గదిలోకి తీసుకువెళ్లి రక్షించాడు.
“ఇదీ ఆయన వరుస, ఏళ్ల తరబడి అనవసరమైన చెత్త పోగు చేశాడు. ఇప్పుడిక ఈ రబ్బిష్ అంతా ఎక్కించడానికి కంప్యూటర్ కావాలంటున్నాడు” అన్నాడు వివేకానంద.
కాఫీ తెస్తానని లోపలికి వెళ్లాడు. ఆయన వదలలేదు. మళ్లీ ముందు గదిలోకి వచ్చి నాతో “అన్నట్టు ఈ ద్రణేవుడితోనే వొచ్చిందయ్యా చిక్కంతా....వాడెవడో తేలడం లేదయ్యా. నువ్వు కూడా నీకు తెలిసిన వాళ్లని వాకబు చేసి చూడు” అన్నాడు.
నేను తల ఊపాను. కాని ప్రశ్న మహా భూతంవలె నా మనసులోకి దూరడం గమనించలేదు.
మరునాడు ఆఫీసు క్యాంటీనులో కాఫీ తాగుతూ వుంటే మా స్టాఫ్ లో పెద్ద - రామేశంగారు వొచ్చి నా ఎదురుగా కూర్చుని '. ఏమయ్యా బాగున్నావా” అని పలకరించాడు.
“బాగున్నా" అంటూనే వున్నట్టుండి “గురూజీ! ద్రణేవుడనే వాడెక్కడైనా తగిలాడా మీకు? పురాణాల్లో కాని, భారత భగవతాల్లో కాని ఎక్కడైనా సరే” అని అడిగాను.
“ఎవరూ?" అని రెట్టించాడాయన. “ద్రణేవుడు”
“అలాంటి పేరు ఎక్కడా తగల్లేదే. అయినా మనకు తెలిసిందెంత? మనం చదివిందెంత? ఎక్కడైనా అటువంటి వాడున్నాడేమో కనుక్కుందాం"అన్నాడాయన.
ఆ సాయంకాలం ఇంటికి తిరిగొస్తూ చూశాను. మా ఇంటి ప్రహరి పక్కన రాళ్ల మీద కూర్చుని మా బావమరిదీ మరో నలుగురు భావి భారత పౌరులు కూర్చుని వుండి తమలో తాము ఏదో తర్జనభర్జనలు పడతున్నారు. కొన్ని క్షణాలు ఆగి విన్నాను. అంతా ఆ క్రిందిటి దినం విడుదలై అమోఘంగా అత్యంత విజయవంతంగా జైత్రయాత్ర సాగిస్తూ వసూళ్లలో స్టేట్ రికార్డులు కంట్రీ రికార్డులు బద్దలు కొడుతున్న, వారి అభిమాన హీరో నటించిన 'అబ్బా వుండండి మీరు మరినూ' అనే సినిమా గురించిన వివరాలు. కలెక్షన్లు వగైరాలు.
నేను ఊరుకోక “ఏమిట్రా అబ్బాయిలు మీరు చదువులు మానేసి ఆటలూ మానేసి మాటాడుకునే విషయాలు ఇవేనా? ఇట్లాంటి పనికిమాలిన వ్యర్థ విషయాలు తప్పు మీకేమీలేవా మాట్లాడుకునేందుకు?” అన్నాను చొరవగా..
వాళు ఎటు వాళ్లు అటు చెదిరిపోయినట్టు పోయి నేను లోపలికి వెళ్లగానే మరో మూల మీటింగ్ పెట్టారు.
నేను లోపలికి వచ్చి కూర్చుని ఆలోచనలో పడ్డాను. నేను మాత్రం ఈ కొద్దీ రోజులుగా చేస్తున్నదేమిటి? వివేకానంద తండ్రి రైల్లో పరిచయమైనప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను ? ఆయన ఆ ద్రణేవుడనే వాడొక్కణ్ణి నా నెత్తిన కూర్చోబెడితే నేను వెర్రివాడిలాగా నాకు కనిపించిన వాళ్లందరిని అడుగుతూ చేస్తున్నదేమిటి?
ఆయన చెప్పిన విషయ సేకరణ, సమాచార సేకరణ అనేది ఒక పెద్ద వెర్రి. ఆయన ఆ పనికిమాలిన విషయాన్ని బురలో కెక్కించి నా మనసు పాడుచేసి నన్నింతకాలంగా వ్యరుణ్ణి చేశాడు. ఇకనైనా జాగ్రత్తపడాలి అనుకున్నాను.
కాని ఒక పనికిమాలిన వెర్రి విషయం మనసులో పడకూడదే గాని అది మనలను తేలిగ్గా వొదులుతుందా?
సాయంత్రం కుమారస్వామి కనిపించి "మొన్న ఎప్పుడో ద్రణేవుడనే వాణ్ణి గురించి వాకబుచేశావుకదా” అన్నాడు.
“అవును. ఏమైనా తెలిసిందా" అని అడిగాను ఆత్రంగా.
అతడు అనవసరంగా నవ్వుతూ “లేదు తెలియలేదు. నేను ఒకరిద్దర్ని అడిగి చూశాను కూడా. అందరూ తెలియదనే అన్నారు” అని ఇంకా అనవసరంగా నవ్వుతూనే వెళ్లిపోయాడు.
నేను తెలివితక్కువవాడిలా నుదురు రుద్దుకుంటూ నిలబడిపోయాను.
మరుసటి రోజు మధ్యాహ్నం మూడుగంటల వేళ ఆఫీసులో ఫోను మోగింది.
ప్యూను “వివేకానందగారూ! మీకు ఫోను” అన్నాడు.
వివేకానంద లేచి వెళ్లి ఫోన్లో మాట్లాడుతూ వుండగా చూశాను. బాగా కంగారు పడుతున్నాడు. బహశా ఏదో ఇబ్బంది కలిగించే విషయమే అయివుండాలనుకున్నాను. అతడు ఫోను పెట్టేసి వస్తూ వుంటే “ఏమిటి?” అని అడిగాను.
అతడు నుదురు తుడుచుకుంటూ “మా నాన్న పడిపోయాట్ట. వెళ్తున్నాను రామేశంగారికి చెప్పు” అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు.
ఆఫీసు పని ముగించుకుని ఆదరాబాదరా బయలుదేరి వివేకానంద ఇంటి ముందుకు వచ్చాను. వరండాలో కొంత అలజడి. కొందరు ఆడవాళ్లు కూర్చుని వున్నారు. వివేకానంద లోపల ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.
ముసలాయన మనలో లేడు. కళ్లు అరమోడ్పులుగా వున్నాయి. నేను వెళ్లి ఆయన మంచం పక్కనే నిలబడ్డాను.
అంతలో ఆయన కళ్లు తెరిచాడు. నన్ను చూడగానే విచిత్రంగా నవ్వాడు. ఆ తర్వాత నన్ను దగ్గరకి రమ్మని కళ్లతో సైగ చేశాడు. నేను ముందుకు వంగి చెవి అప్పజెప్పాను. ఆయన లోగొంతుకతో మాట్లాడాడు.
“ద్రణేవుడు... వాణ్ణి గురించి సంవత్సరాల తరబడి గొడవ పెట్టానా? ఏమో మరి... వాడొకడున్నాడని నాకనిపించడం లేదయ్యా. బహుశా వుండి వుండడు. అంతా నా భ్రమ అనిపిస్తున్నదిప్పుడు. అవును... అంతే”
ఆయన అలా మాట్లాడుతూ వుండగానే కంఠస్వరం క్రమంగా మందగించింది.
ఆయన కళ్లు మూతలుపడ్డాయి.
***************************************************************
'హర్షణీయం' పాడ్‌కాస్ట్ ని 'గానా' (Ganaa) అప్ ద్వారా వినాలంటే -https://gaana.com/podcast/harshaneeyam-season-1
స్పాటిఫై యాప్ లో వినాలంటే -http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే -http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)
హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి [email protected] కు మెయిల్ లేదా '77807 43545 ' అనే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి
ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు.
దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు.
వాళ్ళ జర్నీ ని ఈ హర్షణీయం ఎపిసోడ్లో మనం విందాం.
ఈ ప్రయత్నంలో మీరు గూడ పాలు పంచుకోవాలంటే, క్రింది అడ్రస్, ఫోన్ నంబర్ ద్వారా హర్షిత పబ్లికేషన్స్ షణ్ముఖ గారిని సంప్రదించండి.
Harshitha Publications, , 1-1189-94, NGO's colony, Kadiri, Ananthapuram District, Andhra Pradewsh, India - 515591
Mobile Number: 8885818687, (www.harshithapublications.com)
From the publisher's feed

52 Listeners