Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!

    "మా నాయన పేరు మీ పేరు ఒకటే, సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను" అంది మా పక్కింటి గిరిజక్క , మా నాన్నతో. 

    " సరేనమ్మా నువ్వు ఆర్డర్ వేసింతర్వాత , కాదనే ధైర్యం ఎవరికీ ఉందమ్మా" అన్నారు నాన్న. 

    మా నాన్న, కాట్రాక్టింగ్ పార్టనర్ అయిన గోవింద రెడ్డి అంకుల్ భార్య గిరిజక్క. ‘చండశాసన గండర గండి’ మాటల్లో మటుకు. 

    "ఏమే! మాధవీ, వాసవీ, ఇకనుంచీ, మా నాయిన్ని మీరు తాత అనే పిలవాలి, అర్థ మయ్యిందా" అంది తన కూతుళ్ళ వైపు.  

    వాళ్లిద్దరూ అయోమయంగా మొహం పెట్టారు, ఈయన్ని తాతా అని పిలవడం ఏంది? అనిచెప్పి. 

    ఈ సంభాషణంతా మేము నెల్లూరు సంత పేటలో వాళ్ళ ఇంటి పక్కన చేరిన కొత్తల్లో. 

    మాధవక్క , వాసవక్క మా గిరిజక్క సంతానం. ముగ్గుర్నీ అక్కా! అనే పిలిచే వాణ్ని.

    నేను ఎనిమిదో క్లాసు లో ఉంటే, వాసవక్క బీ.ఎస్.సి ఫస్ట్ ఇయర్ , మాధవక్క బీ.జెడ్.సి ఫైనల్ ఇయర్ లో వుండే వారు. 

    మా గిరిజక్క వాళ్ళ నాన్న గారు డీ.ఎస్.పీ గా పనిచేశారు. 

    పైకి డీస్పీ గారి వారసత్వ వేషం గంభీరం గా వేసినా , లోపలంతా పసిపిల్ల మనస్తత్వం మా గిరిజక్కది. 

    గోవిందరెడ్డి అంకుల్ వుద్యోగం విజయవాడ,రెండు వారాలకోసారి ఆయన దర్శనం. ఇంట్లో వున్నా ఆయన వాయిస్, పెద్ద బయటికి వినిపించేది కాదు. 

     ఒక వేళ వినిపించినా ఎదో ఆయన ముచ్చటపడి తీసుకెళ్లిన "36 ఛాంబర్ అఫ్ షావోలిన్" లాటి ఇంగ్లీష్ సినిమాలు, మాకు తెలుగులో తర్జుమా చేసి చెప్పినప్పుడే. 

    మా గిరిజక్క కి సినిమాలు అంటే చాలా పిచ్చి. 

    కొత్త సినిమా వచ్చిందంటే, మా గిరిజక్క  తన అనుంగు స్నేహితురాలు మాయాదేవి తో కలిసి, పట్టు చీరలు కట్టి మరీ నేల లేక బెంచీ టిక్కెట్టులో తేలేవారు. 

    తనకున్న ఏకైక స్నేహితురాలు మాయాదేవి. 

    మీరు ‘కుర్చీ’ టిక్కెట్టు కొనుక్కుని అక్కడ కూర్చోవచ్చుగా అని గిరిజక్కని అడిగితే, ,

     " మాయ, అంత డబ్బులు దగ్గర పెట్టుకొని రాలేదురా " అనేది మా గిరిజక్క. 

    ఆ మాయా దేవి ఎక్కడ్నుంచి సృష్టించేదో గానీ, పెద్ద పెద్ద రోల్స్ లో పాలిథీన్ షీట్స్ పట్టుకొచ్చేది. 

     వాటిల్ని కవర్లు గా మారిస్తే, షాపులకిస్తే, వంద బాగుల కు ఒక రూపాయ ఇచ్చేవాళ్ళు.  

    వాళ్ళ స్నేహితురాలికి సహాయంగా ఉంటుంది అని చెప్పి, ఆ షీట్లు కవర్లుగా మార్చే హోమ్ వర్క్, మా పిల్లలందరికీ ఇచ్చేది గిరిజక్క. 

    ఆ యాతన తప్పిచ్చుకోడానికి, నానా కష్టాలు పడే వాళ్ళం మేమంతా. 

    ఇప్పుడు అసలు విషయం లోకి వద్దాం !

    మా గిరిజక్కకి , రోజువారీ పనులు ఏ క్రమం లో జరగాలో, తన చేత్తో , లిస్ట్ రాయనిదే నిద్ర పట్టేది కాదు. 

    ఆ పనులు అదే క్రమంలో జరగాలి. 

    ఎవ్వరూ నోరెత్తకూడదు ఈ విషయంలో. 

    వాళ్ళ పనాయనకి, నీళ్లు చల్లి ఇస్త్రీ చేయాలి అనే బదులు, ఇస్త్రీ చేసి నీళ్లు చల్లాలి అని రాసిందంటే, అది అట్టా జరగాల్సిందే.  

    మా గిరిజక్క చేతిరాత డీకోడ్ చెయ్యగలిగింది , వాళ్ళ పని వాళ్ళు తప్పితే , ఈ భూ ప్రపంచం లో ఇంకెవ్వరూ ఉండరని నా నమ్మకం. 

    నేను డీకోడ్ చేయబోయి చాలా సార్లు ఫెయిల్ అయ్యా. 

    గిరిజక్క చిన్న కూతురు, వాసవక్క మా గ్యాంగ్ లీడర్.

     ఆమె చదువులో బ్రిలియంట్. లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో ఆవిడ దిట్ట. 

    ఏ డౌట్లు వచ్చినా వాసవక్కే దిక్కు మా పిల్లలందరికీ. 

    మమ్మల్ని వెంటేసుకొని , సినిమాలకీ షికార్లకీ ఒక పిల్లల కోడి లా బయలుదేరేది వాసవక్క. అసలు రేపు పరీక్ష అనగా ఈ రోజు ఫస్ట్ షో చూడటం కూడా ఆమె అలవాటు చేసిందే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆమెను చూసి మేము అనుకరించి బొక్క బోర్లా పడ్డ సందర్భాలు ఎన్నో. 

    మా గిరిజక్క నిరంకుశత్వాన్ని ఎదిరించి ఎదిరించీ, మా వాసవక్క ఒక రెబెల్ స్టార్ అయిపోయిందని నా నమ్మకం. 

    అలాంటి వాసవక్క గూడ, వాళ్ళమ్మ దగ్గరుండే ఒక చిట్టాకి మటుకు భయపడేది. 

    ఆరు నెలలకి ఒక సారి గిరిజక్కా వాళ్ళ ఇంట్లో, వెండి బంగారు వస్తువుల ఆడిట్ జరిగేది. 

    ఈ వస్తువుల చెకింగుకి ఒక పెద్ద లిస్ట్ ఉండేది గిరిజక్క దగ్గర. 

    ఆ ఆడిట్ కి మా వాసవక్క ఒక నెల రోజుల ముందే ప్రిపేర్ అయ్యేది, తను గానీ, మాధవక్కగానీ ఏవన్నా వస్తువులు పోంగొట్టుంటే.

    మిస్ అయిన ఐటెం, నెల్లూళ్లో వున్న అన్ని బంగారు వెండి అంగళ్ళకు తిరిగి తిరిగీ, అక్కడ తెచ్చి పెట్టేసేది వాసవక్క. 

    మా మాధవక్క మెడిసిను చదివే, రోజుల్లో ఒక డైమండ్ రింగు పోంగొట్టింది. ఇక చూడాల మావాసవక్క తిప్పలు. ఎదో చిన్న రింగో , గింగో అయితే మేనేజ్ చెయ్యొచ్చు. పొయ్యింది డైమండు రింగు. 

    ఎట్టాగైతేనేమి, అలాగేవుండే అమెరికన్ డైమండ్రింగు ఒకటి పట్టుకొని వచ్చింది వాసవక్క.

    ఆడిట్ రోజు రానే వచ్చింది. మా గిరిజక్క పక్కనే ఆమె చెల్లెలు గారు గూడ ఆడిట్లో.

    అన్నీఅయింతర్వాత , ఇంట్లో వుండే ఉంగరాల లెక్క మొదలయ్యింది. చిట్టా ప్రకారం మొత్తం పన్నెండు ఉండాలి.

    ఒకటి , రెండు…. చిన్నగా పన్నెండు , అమెరికన్ డైమండ్ ఉంగరం పన్నెండోది అనిచెప్పి లెక్క పెట్టేసింది వాసవక్క. 

    పక్కనుండే , గిరిజక్క చెల్లెలు ఏమో , “ అది డైమండు రింగు లాగ లేదే గిరిజా” అంటుంది. 

    నీ మొహం మా ఇంట్లో వస్తువులు ఎట్టా మారి పోతాయ్ . సరిగ్గా చూడవే అంటుంది గిరిజక్క. 

    ఆ విధంగా ఆ నెల ఆడిట్ సుఖాంతం అవడంతో ఊపిరి పీల్చుకుంది వాసవక్క. 

    అలాగే మా గిరిజక్క దగ్గర రోజువారీ ఉపవాసాలగ్గూడా , ఒక లిస్ట్ ఉండేది. 

    సోమవారం   శివుడు, మంగళ వారం ఆంజనేయుడు, గురువారం సాయిబాబా, శుక్ర వారం లక్ష్మి దేవి, శని వారం వెంకన్న. ఒక్క ఆదివారం అనుకుంటా పోనీలే దేవుళ్ళకు ఆ రోజు సెలవిద్దాం అనుకునేది.

     ఉపవాసం అంటే గిరిజక్క ఏం తినకుండా ఉంటుంది, అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. 

    హాయిగా, దర్జాగా మా వాసవక్క, దోసెలో, వడలో ,, వాటిల్లోకి రక రకాల చట్నీలు , పొళ్లు చేసిస్తే దర్జాగా ఉపవాసం ముగించేది మా గిరిజక్క. 

    ఈ మధ్య , నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాక, గిరిజక్క మా ఇంటికొచ్చి , అప్పుడప్పుడూ, ఓ రెండు మూడు రోజులు గడిపి వెళ్ళేది. 

    ఆ రెండు మూడు రోజులు దర్జాగా ఉండేది, మా అమ్మ దగ్గర, సుప్రియా దగ్గర.  

    వున్నప్పుడంతా, "చక్కటి పిల్లమ్మా!" అంటూ సుప్రియాకి ఎన్నో కితాబులు. 

    తాను వెళ్లి పోయాక ,  మంచం దిండు కింద చూస్తే మటుకు , ఒక లిస్టు ఉండేది, తనకి ఆ రెండు రోజులు ఏమీ బాగా జరగ లేదో అనిచెప్పి, కంటిన్యూయస్ ఇంఫ్రూమెంట్ ఫిలాసఫీ లాగా. 

    చెప్పడం మర్చిపోయా , ఈ అన్ని లిస్టులల్లో స్పెషల్ , మా గిరిజక్క ‘ తండా’ లిస్టు.

    తండల వ్యాపారం చేసేది గిరిజక్క.

    చుట్టూ పక్కల చిరు వ్యాపారులకు , డైలీ బేసిస్ మీద వడ్డీకి ఇవ్వటమే తండల వ్యాపారం. 

    వీళ్ళతో పాటూ , చుట్టుపక్కల డబ్బులకి ఎవరికి ఏమి ఇబ్బందున్నా , గిరిజక్క దగ్గరికే వచ్చేవాళ్ళు. 

    “గిరిజమ్మా ! ఈ సారి ఇంకో , వెయ్యి ఇయ్యమ్మా! ఈ దెబ్బతో నీ ముందు బాకీ, దాని మీద వడ్డీ కట్టేస్తాం” అని ప్రతీ సారీ , ఓ వెయ్యి, రెండు వేలు పట్టకెళ్ళేవాళ్ళు. 

    మా గిరిజక్క, ఈ లెక్కలన్నీ చిత్ర గుప్తుడి చిట్టా లాగ రాసి పెట్టుకొని మరీ ఇచ్చేది. 

    నేనైతే ఎప్పుడూ చూళ్ళా ! ఒక్క రూపాయైనా ఆమెకి తిరిగి రావటం, “ ఈసారికిస్తే ముందువి గూడా వడ్డీ తో కలిపి కట్టేస్తాం” అనే వాళ్ళ మాటలు తప్ప. 

    ఈ విషయంలో మటుకు , మా గిరిజక్క, రాసిన చీటీ, మళ్ళీ బయటకి తీసి చూస్కోడం, లెక్కలేసుకోడం , మేమెవ్వరం చూళ్ళా. 

    ఈ లిస్టులో వేసుకునే అంకెలు , ఆమె పెద్ద మనసుకి కనపడనంత చిన్నవేమో ! , అర్థం అయ్యేది కాదు. 

    ఇవన్నీ , ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయంటే, ఈ రోజు మా గిరిజక్క, పెద్ద కర్మ దినం. 

    కరోనా రెస్ట్రిక్షన్సు వలన, వెళ్ళ కూడదు అనుకుంటూనే వెళ్ళా. 

    వొచ్చేసేటప్పుడు కల్సింది వాసవక్క. 

    " మనం ఈ లిస్టుల గురించి తెగ ఆలోచించేసి, చాలా కష్టాలు పడ్డాం రా కిరణూ! మా ఆయన మాకు పెళ్లి అయిన కొత్తల్లో తెగ మురిసిపోయాడు, అమ్మ రాసే లిస్టులు చూసి, ఏమి రాస్తిరి , ఏమి రాస్తిరి “ అనుకుంటూ. కానీ ఆ లిస్టులో రాసిన పనులు జరక్క పొయ్యినప్పుడు అమ్మ తీరుచూసింతర్వాత, అవి రాయంగానే, కనపడకుండా దాచేసేవాడు రా ”  అంది పెదవి మీద చిరునవ్వుతో, కళ్ళల్లో నీళ్లతో, మా వాసవక్క. 



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    8 min
  • ఆరుముగం దెబ్బ మా నెల్లూరు అంతా అబ్బా!

    నేను ఎనభైయ్యవ దశకంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో అనుకుంటా మా సంతపేటలోని తూకుమానుమిట్టలో రాత్రికి రాత్రే ఆరుముగం & కో అనే కుంపిణి అదిరిపోయే వ్యాపార ప్రణాళికతో వెలిసింది. "ఇందు మూలముగా అందరికి తెలియ చేయటమేమనగా మీరు గాని మా దగ్గరకు వచ్చి మా వస్తు పట్టికలో కనపడ్డ వస్తువును కనపడినట్టు ఆత్రముగా మూడవ వంతు ధర పెట్టి టిక్కు పెట్టుకుంటే మీకు ఆ వస్తువు రెండు నెలల్లో పువ్వుల్లో పెట్టి అప్పచెప్పబడును" అనే వాళ్ళ ప్రకటన సారాంశం నాకైతే అర్థం కాలా నాకు లెక్కలు రావు కాబట్టి. 

    మా నెల్లూరోళ్లు, లెక్కల్లో మహా ఘటికులు, లెక్కలేసేసి, మూడు రూపాయల వడ్డీ గిట్టుబాటు అవతుళ్లా  మనకి అనుకొని, తరవాత రోజునుండి అమెరికాలో గాని థాంక్స్ గివింగ్ ముందు రోజు రాత్రి జంపఖానా పరిచి పడుకున్నట్టు పండుకొని పోయారు, ఎక్కడ మిగతా వాళ్ళు ఆ వస్తువులు తన్నుకు పోతారేమో అని.

    సమయం గడిచే కొద్దీ అల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ కాదురా నాయనా తూకుమానుమిట్టకిరా అన్నట్టు ఒకటే తిరునాళ్ల, కట్టే వాళ్లు కట్టి పోతుంటే, పట్టకెళ్లే వాళ్ళు పట్టకెళ్లి పోతున్నారు.

    అప్పట్లో మా నెల్లూరోళ్లకి పండగలొస్తే ఇంట్లో వుండే స్టీల్ సామానులని బయట తీసి, విమ్మో లేక సబీనాతో తోమి, వీధిలో వెళ్లే వాళ్ళకి, డిస్ప్లే పెట్టందే నిద్రబట్టేది కాదు. ఈ బలహీనతని మా ఆరుముగం బాగా పట్టేసేడు. రాబోయే పండగ సీజన్కి ఆరు నెలలు ముందుగానే దేశంలో వుండే స్టీల్ సామానులు తయారుచేసే ఫ్యాక్టరీల నన్నిటిని గంపగుత్తగా లీజ్ కి తీసేసుకొని మూడు షిఫ్టులలో తయారు చేయించి నెల్లూరులో దించేసేశాడు.  దానికి వాడు ఆ రోజుల్లోనే BI /BW వాడాడని నాకు అనుమానం.

    స్టీల్ సామానులు తర్వాత మా నెల్లూరోళ్లకి ఆరోజుల్లో వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద బీరువా ఉంటే అంత గొప్ప. ఏ బీరువా అయినా గాడ్రేజీ బీరువానే మా వాళ్లకి.  స్టీల్ సామానులు తర్వాత ఎక్కువ మా వాళ్ళు పట్టుకెళ్ళినవి ఈ బీరువాలు, బి.ఎస్.ఏ సైకిళ్ళు, ఆ తర్వాత ఎప్పడు బొమ్మ రాదుకాని బహు భద్రంగా షట్టర్లు తో సహా వచ్చే క్రౌన్ టీ.వీ లు, ఎన్ని టీ.వీలో వాటికి నాలుగు రెట్లు సంఖ్యలో ఆంటెన్నాలు.

    మీకు సందేహం రాలా నాలుగు రెట్లు ఆంటెన్నాలు  ఏందబ్బా అని? నాకు వచ్చింది, వెళ్లి ఆరా తీస్తే ఒకాయన ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే తన గోడు వెళ్లబోశాడు, "మా ఆడమడిసి నువ్వు ఇంట్లో టీ.వీ అన్నా పెట్టకపోతే పెట్టక మాయినావు, ఇంటి మీద ఆంటెన్నా అన్నా పెట్టబ్బా, యింటికొచ్చిన  చుట్టాలకి మా టీ.వీ రిపేర్ కి వెళ్లిందని చెప్పుకొని బతికేస్తా అని ఒకటే సతాయిస్తా వుందబ్బయ్యా" అని. అలా వుంటాయబ్బా మా నెల్లూరోళ్ల యవ్వారాలు.

    మా చుట్ట పక్కల వాళ్లంతా డబ్బులు కట్టేశారు, కొని తెచ్చేశారు. మా ఇంట్లో మా దగ్గర డబ్బులు అసలే లేవు. నేను ఏదో ఒకటి కొందాము అని రోజు అన్నం కూడా తినకుండా అలిగి అలిగి ఇక ఏమీ జరగదని నిస్పృహ లోకి వెళ్ళిపోయా.

    మా దోస్తులేమో రంగు రంగుల బి.ఎస్.ఏ సైకిళ్ళు తొక్కేస్తున్నారు, కొన్న బీరువాలో ఏమి పెట్టాలో తెలియక ఇంకా చెక్కు చెదరకుండా వుంటాయని వాళ్ళ తరగతి పుస్తకాలని పెట్టుకుంటున్నారు. కొందరైతే ఇంట్లో టీ.వీ లేదని తెలిసినా పక్కనోళ్లు చూసేలా ఆంటెన్నాలు తెగ అడ్జస్ట్  చేసేస్తున్నారు, సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకుంటూ. మా నెల్లూరులో అప్పుడు మా టీ.వీ సిగ్నల్ అందటం లేదు అని చెప్పుకోవటం పెద్ద ఫాషన్, అంతర్లీనంగా మా ఇంట్లో టీ.వీ వుంది అని తెలిసేలా.

    ఇక లాభం లేదని నేను సరాసరి రామలింగాపురం లోని మా చిన్నక్క దగ్గరకి వెళ్ళిపోయా. మా ఆరుముగం దగ్గర నువ్వన్నా కొని బాగుపడవే, నాకు ఎలాగూ బాగుపడే అదృష్టం లేదు అని. మా అక్క కోళ్ళని పెంచి, పొట్టేళ్లని పెంచి తెగ వెనకేసుకుందని నా నమ్మకం. నువ్వు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, వేలి పొడువునా తీసుకొని మొహానికి రాసుకొనే ఫెయిర్ అండ్ లవ్లీ మూడు నెలలు మానేస్తే మీ ఇల్లంతా స్టీల్ సామానులతో నింపెయ్య వచ్చు అని సాయంత్రం దాకా ఊదరకొట్టి, లాస్ట్ బస్సుకు బయలుదేరతీసి  నెల్లూరుకు తీసుకొచ్చా.

    మరునాడు వెళ్లి నాలుగు స్టీల్ బిందెలు, మూడు గంగాళాలు, ఓ ఐదు చిల్లుల గరిటెలకు డబ్బులు కట్టేసి వచ్చాము. అప్పటికి గాని నా కడుపు ఉబ్బరం తగ్గలా.

    మా అక్క వెళ్ళిపోయాక నేను గోడమీద బొగ్గుతో గీతలు గీయటం మొదలుపెట్టా, ఎన్ని రోజులు మిగులున్నాయో మా అక్క ఖజానా మా ఇంటికి రావటానికి అని. రోజులు గడవటం  నాకు చాలా కష్టం గా వుంది. మా చు

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    7 min
  • మా వాకాటి కథల్లో, సూరి గాడు!

    సూర్య ప్రసాద్ మా మెకానికల్ ఇంజనీరింగ్ తరగతి సల్మాన్ ఖాన్. కానీ ఆ ఖాన్ కన్నా మంచి పొడగరి, ఎప్పడూ ఆకర్షణీయమైన దుస్తులు ధరించి కళ కళ లాడుతూ ఉండేవాడు. వాడి ఆ పిచ్చిని ఎక్కువ చేస్తూ మా భార్గవ్ గాడు, ప్రశాంత గాడు మరియు మా అనీల్గాడులు తరగతిలో వాడి వెనక వరుసలో కూర్చొని, ఏ ఇండియా టుడే మ్యాగజిన్ లాటి వాటిని తెరిచి, వీడు వినేలా అబ్బా! ఈ మోడల్ చూడరా! అచ్చు వీడు మన సూరిగాడిలా వున్నాడురా అని వాళ్లలో వాళ్లే వీడికి కితాబులిచ్చేలా మాటలాడుకోవటం, వాడు ఆ మ్యాగజిన్ లో మోడల్స్ వుండే పేజీలను కత్తిరించుకొని, వాళ్ళలా తయారయ్యి రావటం, మా అందరికీ కడు కాలక్షేపంగాను ఉండేది. 

    రావటం కొడిగినహళ్లి పాఠశాల నుండి రావటంతో చదువుల విషయంలో తెలివితేటలతో పాటు క్రమశిక్షణ కలిగివుండే వాడు. నాకు తెలుసు వాడు ప్రతీ పరీక్షకి కనీసం అరడజను మార్కర్ పెన్స్ తో వచ్చేవాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్సామినర్స్ కి హత్తుకునేలా అండర్ లైన్  చేస్తూ, ముత్యాల్లాంటి చేతి రాతతో, అబ్బా! పేపర్ రాయటం అంటే ఇలా వుండాలిరా అనిపించేలా రాసేవాడు. నిత్యం శరీర ధారుడ్యాన్ని పెంచే కసరత్తులతోను మరియు బాస్కెట్ బాల్ ఆటతోను చురుగ్గా ఉండేవాడు.

    ఉండటం హాస్టల్ లో అయినా అందరు హాస్టల్ వాసుల్లాగే, మా రూమ్ ని తరచూ పావనం చేసేవాడు. నేను మరియు మా శ్రీధర గాడు అందరి వాళ్ళమవటంతో అటు డే స్కాలర్స్ తోను ఇటు హాస్టల్ వాళ్ళ దర్శనాలతో మా రూమ్ నిత్య కళ్ల్యాణం పచ్చ తోరణం లాగ ఉండేది. మీ సాఫ్ట్ వేర్  పరిభాషలో చెప్పాలంటే మా రూమ్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్నట్టు మా కాలేజీ మిత్రులకు.

    అన్నట్టు మా సూరికి ఒక ఏకదారి (వన్ వే కి నా తెనిగింపు ) ప్రేమ కథ ఉండేది. మాకు రెండు సంవత్సరాలు జూనియర్ ఆ అమ్మాయి. చూడ చక్కనిది. మా కళాశాల అందరు విద్యార్థులు లాగే మా సూరి గాడు ఆ అమ్మాయి ప్రేమలో నిండా పడిపోయాడు. ప్రతి గురువారం ఒక తెల్లటి లాల్చీ పైజామా ధరించి  మా వాకాటి సాయి బాబా గుడికెళ్ళి, ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ ముక్క అమ్మాయికోసం పట్టుకెళ్లి ఒక ముక్కతో మా రూమ్ కి వచ్చే వాడు. మేము తన ప్రేమని ఆటపట్టిస్తూనో లేక తెగ ఎంకరేజ్ చేస్తూనో పరోక్షంగా వాడిలో వాడి ప్రేమ పట్ల చాలా ఘాడమైన భావన కల్పించే వాళ్ళము. ఆ అమ్మాయి మాత్రం ఎవరినీ తన దరిదాపుల్లోకి రానీయటం మేము చూడలా.

    అలా మా సూరికి మరియు మాకు తెలియని విషయం ఏమిటంటే ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి అయిపోయిందని, తనకి ఆ విషయం అందరికీ చెప్పుకోవటం ఇష్టం లేక దాచిందని. కానీ ఈ విషయం తెలియక మా సూరి గాడు, ఆ అమ్మాయి తిరస్కారం తో దేవదాసు అయిపోయాడు. వాడు అలా కావడానికి మేము కూడా కారణమే పరోక్షంగా అనే బాధ మాలో ఇప్పటికే వుంది. అయినా మావాడు తన చదువుని ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ప్రతీ సంవత్సరం డిస్టింక్షన్ తోనే ఉత్తీర్ణుడయ్యాడు.

    నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా, మేము కళాశాల నుండి బయటపడిన తర్వాత కొందరం కొద్దిమందితోనే సంబంధ బాంధవ్యాలను కలిగి వున్నాము, అప్పటిలో కొందరికే ల్యాండ్ లైన్ సౌకర్యాలు ఉండటం మూలాన, ఇప్పటిలా చరవాణులు మరియు వాట్సాప్ సమూహాలు లేనందున. అలా సూరిగాడితో మాకు సంబంధాలు తెగిపోయాయి. మా స్నేహితులతో ఎవరికి వాడితో  అటుపిమ్మట మాటలు ఉన్నాయో నాకు తెలియదు. మా అనీల్గాడో లేక మా ఈశ్వరుడో చెప్పాలి, ఎందుకంటే మా బ్యాచ్ లో చాలా మంది మధ్య వీళ్లిద్దరి అనుసంధాన కర్తలు.

    మా కళాశాల ప్రథముడైన మా సుబ్బూ గాడు వాడి రీసెర్చ్ నిమిత్తం ఢిల్లీ వచ్చి అక్కడే వున్న నన్ను కలిసినప్పుడు, సూరి అన్నా యూనివర్సిటీ లో సుబ్బూ ఉండగా, వాడి రూమ్ కి ఎదో ప్రవేశ పరీక్ష నిమిత్తం వచ్చాడని, వచ్చిన వాడు ఏ పరీక్షలకు వెళ్ళక ఊరంతా బలాదూర్ తిరుగుడు తిరిగి సాయంత్రానికి వచ్చే వాడని, మా సుబ్బూ అది చూసి ఓ నాలుగు రోజుల తర్వాత నిలదీయటంతో, "నన్ను సి.బి.ఐ వాళ్ళు వెంట పడి తరుముతున్నారు, వాళ్ళని తప్పించుకు తిరుగుతున్నాను", అని అర్థం పర్థం లేకుండా మాట్లాడాడని, సుబ్బూ మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే సుబ్బూ రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, అందుకే సుబ్బు వాడిని మంచి మాటలు చెప్పి ఇంటికి పంపించాడని నాకు చెప్పాడు. అప్పుడు నాకు కలిగింది మా సూరి మానసిక పరిస్థితి మీద సంద

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    17 min
  • అప్పుడప్పుడూ 'ఉదయించే' మా సుడిగాడు

    “బాస్, ఏ బ్రాంచ్ నీది”, అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.

    “ఫౌండ్రి ఇంజనీరింగ్”

    “అదేంటి బాస్, పోయి పోయి, ఆ బూజు పట్టిన బ్రాంచ్ తీసుకున్నావా?, ఇక్కడ మెకానికల్ వాళ్లకి మెషీన్ టూల్స్ బ్రాంచి అన్నిటికంటే బెస్టు. నేనదే తీసుకున్నా!”

    నేను ఖరగ్పూర్లో పీజీ చేరిన ఐదు రోజుల్లోనే, నాకీ ఉపదేశం చేసిన పదో కృష్ణుడు – రామారావు.

    ప్రొడక్షన్ ఇంజనీరింగ్, థర్మల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్లల్లో చేరిన ప్రతీ వాడూ నాకెదురైతే చెప్పేవాడు – “ఫౌండ్రి ఇంజనీరింగ్ ఓ బూజు పట్టిన కోర్స్” అని.

    అసలే నాకు తిక్క తిక్క గా వుంది, మంచి స్కోర్ వచ్చి కూడా ఆప్షన్స్ సరైన క్రమంలో పెట్టకుండా ఫౌండ్రి ఇంజనీరింగ్ లో పడ్డందుకు.

    ఈలోపల ఓ ఆజానుబాహుడొచ్చి వాడికి వాడే , “మామ, నా పేరు ఉదయ్, కడప దగ్గరున్న కమలాపురం నుంచి వచ్చా, బ్యాచలర్స్ మెకానికల్, ఎస్.వీ.యు లో చదివా, ఇక్కడ ఏరో నాటికల్ లో చేరా”, అంటూ మా టేబుల్ లో పైన కూర్చొని నన్ను పలకరించేసాడు.

    ఎందుకో వాణ్ని, వాడి వాలకాన్ని, చూస్తే నాలో ఏదో ఒక కొత్త ఉత్సాహం వొచ్చేసింది –

    రామారావులో మటుకు వీణ్ణి చూస్తే, ఏదో బెరుకు కన్పడతా వుంది.

    ఎత్తుకున్నాడు ఉదయ్ , రామారావు కళ్ళలోకి చూస్తూ సూటిగా,

    “ఏరా రామారావ్, అప్పుడే నీ బ్రాంచ్ మహత్తరమైందనిచెప్పి, సావ కొట్టేశావా! ఈ శాల్తీని. మనిషిలో వుండాలిరా మొగతనం, మడిచి ఆ మెషీన్ టూల్స్ ని తీస్కెళ్ళి జేబులో పెట్టుకో ! అంతకంటే ముందు, పప్పో సాంబారో అర్థం కాని ఆ సంకరజాతి సాధకాన్ని, నా ముందుకు నెట్టు” అంటూ రామారావుని తోమి పారేసాడు.

    ఆ రెండు నిమిషాల “గ్రాండ్ ఇంట్రో” తో ఉదయ్ గాడి తో, పెర్మనెంట్ గా కనెక్ట్ అయిపొయ్యా! నేను.

    క్యాంపస్ అంతా చెడ తిరిగేవాళ్ళం ఇద్దరం.

    కనపడ్డ క్లాస్ మేట్ లని, వాళ్ళ పేర్లకి ముందు ఒక బీప్ పదం, వెనక ఒక బీప్ పదం తో వీడు పలకరించడం,

    వాళ్ళు “వీడితో పెట్టుకోగూడదురా” నాయనా! అంటూ సణుక్కుంటూ పక్కకెళ్లి పోవడం, నాకైతే చాలా నచ్చేసేది.

    నన్ను కూడా అలాగే బీపులతో పలకరించే వాడు

    దేశం కానీ దేశంలో, నా పేరుకు ముందు వెనకా, ఆ అచ్చ తెలుగు బీపులు వింటుంటే, ఒళ్ళంతా పులకరించిపొయ్యేది నాకు.

    ఇది గాక మా ఉదయ్ గాడు అభిమాన ధనుడు, సుయోధనుడు. మాట పడే వాడు కాదు.

    మాటకి మాట ఉండాల్సిందే – అవతల వాడు ఎవడైనా సరే.

    ఎందుకురా ఈ మొండి వాగుడంటే –

    దానికి వాడి సమాధానం –

    “అమ్మా, నాన్నలు బడిలో స్కూల్ మాస్టార్లు రా హర్షా! మా నాయన నేను పుట్టంగానే, నా ఫేసు చూసి, “ఈ నా యొక్క కొడుకు ఒక మొండి నా పుత్రుడు, నా పేరు విషయంలో, నీ జోక్యం ఏందీ? అని రేపొద్దున, నన్ను నిలదీసే లక్షణాలు వీడి మొహం లో బాగా కన్పడుతున్నాయి అనుకోని ఏం జేసాడో తెలుసా ” ?

    “చెప్పరా ! బాబూ , చాలా ఇంటరెస్టింగ్ గా వుంది” అన్నా !

    “నాకు ఐదో ఏడు వచ్చి, స్కూల్ లో వేసే ముందు దాకా అసలు పేరే పెట్టలా. స్కూల్లో వెయ్యబోయ్యే ముందు, నా ముందు ఓ పది పేర్లు పెట్టి, నువ్వే చెప్పరా! ఈ పేర్లల్లో నీకేది నచ్చిందో, రేపొద్దున చెత్త పేరు పెట్టావు అంటూ నన్ను సతాయించ కుండా” అన్నాడు మా బాబు.

    “అప్పుడు ఉదయ్ భాస్కర్ అని నాకు నేనే పేరు పెట్టేసుకున్నా ! కానీ నా ఫ్రెండ్సంతా, ఎందుకో ఉదయ్ లో, వై తీసేసి ఎక్స్ పెట్టేసి ఉడాక్స్ అంటార్రా, కావాలంటే నువ్వు కూడా పిలుచుకో”.

    “వద్దు లేరా, అంత మంచి పేరు నేను ఖూనీ చేయను, నాకు ఉదయ్ బాగుందిరా” అన్నా నేను.

    వాడెప్పుడూ మిగతా మా అందరిలాగ ఉద్యోగం కోసమే పీజీ చదివే వాడిలా కనపళ్ళా .

    ఎవరయినా ఏరోనాటిక్స్ చాలా నారో కోర్స్ కదా, ప్లేస్ మెంట్స్ వుండవు అంటే, తెలిసే కదా నేను, చేరింది. ఇక నువ్వు దొబ్బేయ్యొచ్చు అనే వాడు.

    “ఏరా నీకు ఉద్యోగం గురించి ధ్యాస లేదా!” అంటే.

    “ఎందుకు లేదురా!. బాచిలర్స్ అయితే కోటా మీద సీట్ తీసుకున్నా, ఆ తర్వాత కాంపిటీటివ్ గా చదివా. ఒక్క సారి వాడుకున్నాక ఇక కోటా వాడుకోకూడదు అనిచెప్పి, మెషీన్ టూల్స్ కి, జేజెమ్మ లాంటి, బ్రాంచ్ వచ్చే అవకాశం వున్నా, ఓపెన్ లో ఏరోనాటిక్స్ వచ్చింది చేరిపోయా! ప్రైవేట్ సెక్టార్ లోనే నాకు తగ్గ ఉద్యోగమే చేస్తా!”.

    అలా ఇంకా దగ్గరయ్యాడు వాడు నాకు.

    జనాలంతా వాడి రూమ్ కి వెళ్లాలని తెగ ఉబలాట పడే వాళ్ళు. కానీ పైకి మాత్రం, అదోలాగా మొహం పెట్టి, వాడి రూమ్ ని ట్రిపుల్ ఎక్స్ రూమ్ అని పిల్చుకునే వాళ్ళు. ఎందుకంటే వాడి రూము గోడలంతా డెబోనైర్ సెంటర్ స్ప్రెడ్ లతో అలంకరించి ఉండేవి. వాడి రూము కెళ్ళి పరిస్థితి చూస్తే, అప్పుడర్థమైంది, నాకు వాడి పేరు చివర ‘ఎక్స్’ ఎందుకు తగిలిచ్చారో వాడి ఫ్రెండ్సు.

    “ఎందుకురా నీ రూంలో గోడలమీదంతా, ఈ ఎదవ ఎక్సిబిషన్, ఏదో తేడా గాడిలా ” అన్నా , ఓ సారి.

    “సెమిస్టెర్ ఎగ్జామ్స్ వస్తున్నాయిగా. నా రూమ్ లో కొచ్చి చదువుకో – ఆ పరమార్థం గ్రహించుకో” అన్నాడు వాడు.

    వాడి ఛాలెంజ్ స్వీకరించి, వాడి రూంలోనే ఆ సెమిస్టర్ ప్రిపరేషన్ మొదలు పెట్టా.

    ఓ పది రోజుల తర్వాత నా ముందర ఓ బార్ గ్రాఫ్ పెట్టాడు. డే వన్ నుంచి డే టెన్ వరకు.

    “ఏందిరా, నాయనా ఈ గ్రాఫ్ లు అంటే, – మాస్టర్స్ చదువుతున్నావు, నా పుత్రుడా!, బొత్తి గా డేటా ఇంటర్ప్రిటేషన్ తెలీదురా నీకు”, అని వాడి వ్యంగ్యోక్తి.

    “అర్థ మయ్యిందిరా నాయనా. గోడ మీదున్న డెబోనైర్ అమ్మళ్లను మొదటి రోజు దొంగతనం గా 400 సార్లు చూసా, ఆపైన రోజులు గడిచే కొద్దీ, అవి 200, 100, 50 లెక్కన తగ్గుతూ వచ్చి, గత రెండు రోజులుగా, సంఖ్యలు అంకెల్లోకి వచ్చాయి”

    “అదేరా హర్షాగా, నేను పాటించింది. మూస్తే ఆసక్తి, తెరిస్తే విరక్తి. ఏదైనా అంతే”, అన్నాడు చిదానంద స్వామి లా.

    “ఓహ్! అయితే తమరి రూమ్ లో వుండే ఫుల్లు మందు బాటిల్స్, కూడా, ఆలా తమరి షో ఆఫ్ యేనా”

    “అంతేగా మరి!”

    ఒక సారి నాకు విపరీతమైన జ్వరం జ్వరం తోబాటు నీరసం గా ఉండటం తో, మా కాలేజీ డిస్పెన్సరీ కి వెళ్ళా, వాడికి చెప్పకుండా.

    ఆ డాక్టర్ వూళ్ళో వైరల్ జ్వరాలున్నాయి, దిక్కు దివాణం లేకుండా హాస్టల్ రూమ్ లో పడి వుండే కన్నా, వెళ్లి కాలేజీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిపో అని సలహా ఇచ్చాడు.

    నేను సక్కా వెళ్లి చేరిపోయా.

    చేరటమే తెల్సు నాకు.

    మళ్ళీ మెలుకువ వచ్చేసరికి చేతికి సెలైన్,అంత పెద్ద రూమ్ లో నాలుగ్గోడల మధ్య, అది పగలో రాత్రో కూడా అర్థం కాలా.

    నేను తప్ప ఎవరూ లేరు.

    మళ్ళీ ఎప్పటికో నాకు కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగ్గా ఉదయ్ గాడు, నా మంచం పక్కనే కూర్చోని, కునికిపాట్లు పడ్తూ.

    “ఏరా! నీకెలా తెలుసురా నేను హాస్పటల్లో వున్నాను “అని

    “రెండు రోజులుగా కనపడలేదురా నువ్వు. అన్ని చోట్లా వెతికా, అందర్నీ అడిగా, ఎవరూ చూడ లేదు అన్నార్రా!, నేను వెతక్కుండా మిగిలింది, ఎవడూ రాకూడదు అనుకొనే యీ కాలేజీ హాస్పిటలే! వాకబు చేశా, మొన్నటినుండి నువ్వు ఇక్కడే పడున్నావురా. ముందు ఒక్క మాటన్నా చెప్పి చావొచ్చుగా నాకు … బీప్ బీప్” అన్నాడు వాడు.

    “ఏమోరా జ్వరమేగా అనొచ్చేసా ! ఇక్కడికి వచ్చాకే తెలిసింది వైరల్ అని. అడ్మిట్ అయిపో అన్నారు. అయిపొయ్యేసా !” అన్నా, నీరసంగా.

    ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పి “రేపొస్తారా” అంటూ వెళ్ళిపోయాడు.

    తర్వాత రోజు లంచ్ టైం కి వచ్చాడు, ట్టాట్టడాన్, “ఏమి తెచ్చానో చూడరా హర్షా!” అంటూ ఒక కారియర్ బయటకు తీస్తూ.

    “నీ పాసు కూలా!, ఎక్కడ పట్టావురా!”

    ” ఈ హాస్పిటల్ తిండికి నీ నోరు చచ్చున్టుందని తెల్సు రా, నిన్న మెస్ వర్కర్ కి వార్నింగ్ ఇచ్చారా, రేపు మీ ఇంటి నుండి ఖాళీ కారియర్ పట్టక రాకపోతే మర్యాద దక్కదు అని.”

    “అదే హాస్టల్ కూడు నా మొహాన కొడ్తూ , మళ్ళీ నీ పెద్ద ఫీలింగు ఒకటి, నాకేదో తలంటి పోసినట్టు”

    “నాకు తెలీకనా మై సన్ ! దుర్గా ప్రసాద్ సార్ ఉన్నాడు గా, ఆయన్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళింటి భోజనం పట్టకొచ్చా . నీ పేరు చెప్పుకోని నేను కూడా ఆంద్ర భోజనము తింటా” అంటూ అసలు గుట్టు విప్పాడు.

    అట్టా సాగిపోయింది వీడితో, ఖరగ్పూర్ లో ఉన్నన్నాళ్ళు.

    వీడితో నా స్నేహం ఓ నారి కేళ పాకం.

    మాస్టర్స్ అయ్యాక ఎవరి దారిన వాళ్ళం అయ్యిపొయ్యాం.. ఉద్యోగం రావటం తో నేను ఢిల్లీ కి, రాక పోవటం తో వాడు కమలాపురంకి.

    మళ్ళీ వాణ్ని కల్సింది, డెన్వర్ లో 2001 లో.

    నేను డెన్వర్లో ఉన్నానని ఎట్టానో తెల్సుకొని, లాస్ ఏంజిల్స్ నుంచి హుటా హుటిన వచ్చేసి ఓ వారం ఊరంతా బలాదూర్ తిరుగుళ్ళు తిరిగేసి, నేను మర్చిపోయిన వాడి బీప్ లాంగ్వేజ్ అంతా వినిపించేసి, సుడి గాలి లా వెళ్లిపోయాడు.

    పునర్దర్శనం 2011, నేను చెన్నై లో వున్నప్పుడు, “మామా మీ కంపెనీ లో ఓపెనింగ్స్ ఉన్నాయా” అంటూ.

    కిందా మీద పడి మా బెంగుళూరు బ్రాంచ్ లో దూర్చా వాణ్ని.

    ఎప్పుడైనా పుష్కరానికోసారి, ఫోన్ల మీద మాటలు, కష్ట సుఖాలు చెప్పుకునే వాళ్ళం.

    ఇంకొన్నేళ్ల గ్యాప్ తర్వాత, “మామా ప్రస్తుతం నేను మెల్బోర్న్ లో సెటిల్ అయిపోయా” అంటూ వాడి దగ్గరనించి ఫోన్ కాల్.

    ఇప్పుడు నాలుగు ఐదేళ్లనించి కాల్స్ లేవు మా సుడి గాడి దగ్గర్నుంచి.

    ఈ సారి ఏ చంద్రమండలం లో వున్నాను అంటూ హడావుడి చేస్తాడో మా వాడు??.

    కొన్ని పర్సనాల్టీలు అంతే !

    దగ్గర లేకపోయినా, దూరం పెరగదు వాళ్ళతో.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    9 min
  • మా బడిలో వుండే వాడు ఓ మల్లిగాడు!

    నేను ఏడవ తరగతి ఉత్తీర్ణుడను అయ్యాక, మా కుటుంబము ఉప్పలపాటి నుండి నెల్లూరికి వలస వచ్చేసింది. నెల్లూరిలో మా మకాం సంతపేటలో అని ముందే నిశ్చయించబడింది మా నాన్నగారి వ్యాపార భాగస్వాములు అప్పటికే అక్కడ నివసించే వారు అవటంతో.

    సంతపేట లోని ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల అప్పుడు బాగా పేరుగాంచినది కావటంతో నన్ను అక్కడ మరియు మా అక్కను అమ్మగార్ల బడి అనబడే సెయింట్ జోసెఫ్ బడిలో వేయాలని మా వాళ్ళు నిర్ణయం చేసేసారు. మా అక్కకి ప్రవేశం సులువుగానే దొరికింది, అమ్మగార్ల బడి కేవలం అమ్మాయిల బడి కావటంతో.

    నా ప్రవేశం అంత సులువుగా జరగలా. శ్రీ సుబ్బారావు గారు ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు. నా ఏడవ తరగతి మార్కులు ఆ బడిలో చదివి ప్రధమ స్థానం సంపాదించిన మల్లికార్జున వర ప్రసాద్ కంటే మూడు మార్కులు ఎక్కువ అవటం ఆయనకీ నచ్చలా. అందులోను నేను వచ్చినది మారు మూల పల్లెలో వున్నజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అవటంతో ఆయనకు గట్టినమ్మకం అక్కడ మాస్ కాపీయింగ్ జరిగి ఉంటుంది అందుకే నాకు అన్ని మార్కులు వచ్చి ఉంటాయి అని.

    ఆయన నాకు ప్రవేశం ఇవ్వడానికి సుముఖంగా లేరు. నాకు ఆయన నన్ను తిప్పించుకోవటం చాలా ఉక్రోషంగా వున్నది. ఆయనేమో చాలా చిన్న వయస్సులోనే గెజెటెడ్ ర్యాంకు కల ప్రధానోపాధ్యాయ పదవిని అధిరోహించిన సింహ స్వరూపుడు. అయినా ధైర్యం చేసి చెప్పేశా మీరు ఏ పరీక్ష పెట్టుకోవాలంటే ఆ పరీక్ష పెట్టుకోండి, నేను మాత్రం ఈ బడిలోనే చదువుతాను అని.

    బహుశా ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కోసం మరల పరీక్ష రాసిన కొద్ది మంది లో నేను ఒకడినేమో, అలా పరీక్ష పెట్టిన మహా చాదస్తపు ప్రధానోపాధ్యాయుల వారు ఆయనేమో. ఆయన ఏర్పరిచిన ఉపాధ్యాయులు పెట్టిన ప్రవేశ పరీక్షను విజయవంతముగా గట్టెక్కిన నన్ను ఆయన లెక్కలు బోధించే బి-సెక్షన్ లోనే వేయించుకున్నారు పట్టుబట్టి మరీ నీ సత్తా మేమిటో చూస్తా సంవత్సరమంతా అని.

    అలా బి-సెక్షన్ లో ప్రవేశించిన నన్ను ఏడవ తరగతిలో ఆ బడికి ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన మల్లిగాడు మరియు రమణుడు త్వరగానే నన్ను వారి వారి మిత్ర బృందాల్లో కలిపేసుకున్నారు. వారి వారి బృందాలు అని ఎందుకు అన్నాను అంటే మా మల్లిగాడు మరియు రమణుడు అచ్చు టామ్  మరియు జెర్రీ లాటి వారు.

    ఈ ఇద్దరే కాకుండ మా తరగతిలో ఇంకో పాపులర్ ఫిగర్ సయ్యద్ ఆన్సర్ బాషా. అప్పటి దాకా వీళ్లిద్దరి రాజకీయాలకు బలి అయ్యి, ఒక్కోసారి మల్లిగాడి పార్టీ లో ఉండాలా లేక రమణుడి పార్టీ లో ఉండాలా అని సతతమయ్యే వీడికి నాది మరియు మా ఇంకో మిత్రుడు లక్ష్మిపతి రాక ఒక వసంతం. ఎందుకంటే మేము ముగ్గురం ఒక బలమైన తృతీయ ఫ్రంట్ ని స్థాపించాము అటు పిమ్మట కాబట్టి.

    ప్రస్తుతానికి ఈ కథ  జెర్రీ లాటి వాడైన మా మాయదారి మల్లిగాడు గురించే. వీడు అసలు ఏమాత్రం ఆవేశ పడకుండా అవతల వాళ్ళని గిల్లేస్తాడు. అందులోను నన్ను, మా రమణుడిని గిల్లటమంటే వీడికి మహా సరదా. నేను ఎనిమిదవ తరగతిలో చేరే సరికి వీడు మహా పాపులర్ ఫెలో. ఏడవ తరగతిలో పాఠశాల కల్లా  ప్రథముడు కావటం, వాళ్ళ అమ్మ నాన్న గార్లు మా బడికి  అనుబంధమైన బి.ఎడ్ కాలేజీ లో లెక్చరర్స్ కావటంతో టీచర్స్ కి వీడంటే ఒకవిధమైన ప్రేమ. రాజు మరియు వరప్రసాద్ వీడి ముద్దు పేర్లు.

    నేను చేరిన వెంటనే నన్ను వీడి బ్యాచ్ లో కలుపుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టాడు. ఈ ప్రయత్నాలలో భాగంగానే నాకు ఒక్కో రహస్యాలు చెప్పేవాడు. అందులో భాగంగా మా ఆన్సర్ గాడి గురించి చెప్తూ, "ఆ ఆన్సర్ గాడితో ఎప్పుడైనా గొడవపడు, కానీ రంజాన్ మాసానికి కనీసం ఒక వారం ముందు అయినా వాడి దగ్గర తెల్ల జెండా ఎత్తెయ్యి, ఎందుకంటే వాడు రంజాన్ విందుకి వాడి స్నేహితులను అందరిని పిలుస్తాడు. ఆహా ఆ బిర్యాని, ఆ సేమియా పాయసం తినటానికి ఎన్ని జన్మలైనా ఎత్తొచ్చురా అని". ఈ ప్రబోధాన్ని నేను ఇప్పటికీ ఫాలో అయిపోతుంటా.

    మనకి లెక్కలంటే మహా భయం, అసలు అవి రావని గట్టి నమ్మకం. వీడు నాకు లెక్కలు చూపితే నేను వీడికి ఇంగ్లీష్ లో హెల్ప్ చేయాలనేది మా ఒప్పందం. ఇంగ్లీష్ లో హెల్ప్ చేయించుకొని లెక్కలకి నాకు హ్యాండ్ ఇచ్చేవాడు. అలా హ్యాండ్ ఇచ్చినప్పుడల్లా నేను వాడిని ఒక

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    10 min
  • మా దేవళపు ఇసిత్రాలు!

    నాకు ఈ మధ్యన మా ఉప్పలపాడు చాలా గుర్తుకొస్తోంది.

    నాకు దిగులేసినప్పుడల్లా అలా గుర్తుకొస్తోంది, ఎందుకో!

    నేను చిన్న చిన్న కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు నాకు తెలుసు నా ప్రెపంచం చాలా చిన్నదని.

    నాకు తెల్సు, నేను, నా కుటుంబం, నా స్నేహితాలు లేక జీవితంలో నాతో పాటూ పరిగెట్టినోళ్లు, నన్నొదిలేసి ఎల్లిపొయ్యినోళ్లు, ఈళ్ల గురించే రాయగలనని.

    అదేగాదు, నేను చూడలేని వాటి గురించి, చూడనోళ్ళ గురించి రాయలేనని.

    అట్టా అనుకున్నప్పుడు, ఇవన్నీ గబా గబా రాసేస్తే, ఇంక రాయడానికి యింకేం మిగులుద్ది, అని అనిపిస్తే, ఆ దిగులింకా పెరిగిపోతావుంది.

    ఆ దిగులుతోనే నేను ఇప్పుడు మిమ్మల్నీ, మా ఉప్పలపాడుకి తీసుకోబోతా!

    అక్కడికెందుకురా ఇప్పుడు మనం, అంటే ఏమో!

    మా అమ్మమ్మోళ్ల ఇల్లు మా రాములోరి దేవళం కి ఎడం పక్కన.

    నా చిన్నప్పుడు ఆరుబయట ఓ నవారు మంచమో నులక మంచమో ఏస్కొని, వళ్లు మర్చిపొయ్యి, కలల్లోకి బొయ్యి, మళ్ళీ ఉదయాన్నే లేవంగానే, ఎదురుంగా, దేవళం మీద ఓ రెక్క విరిగిన గరుత్మంతుడు, అట్టా నిల్చోనుండేవాడు.

    నాకెందుకో, రాములోరుతో, దేశాలన్నీ తిరిగే ఆయన కంటే, సీతమ్మోరిని, రావణాసురుడు పట్టకపొయ్యేటప్పుడు, అడ్డం పడి , రెక్కలు విరగొట్టుకున్న జటాయువు, అక్కడ కనపడే వాడు. ఎందుకంటారా ఏమో.

    అలా ఉదయాన్నే సీతమ్మోరిని, రాముల వారిని తలచుకోవటం అదృష్టమేమో.

    మా గుడికి ఓ మూగ పూజారి పక్కన ఊరినించొచ్చి, మా నడీది బాయి నుండి నీళ్లు తెచ్చి అభిషేకం చేసి అలంకరించి పొయ్యేవాడు. అగుపడని దేవుడికి, కనపడని మనసుతో, వినపడని పూజ చేసే ఆ పూజారిని మా ఊరిజనాలు గుళ్లోకెందుకు రానిచ్చారో. ఏమో!

    అట్టానే ఆ నడీది బాయిని, ఎసుటి నీళ్ల బాయి అనే వాళ్ళం. ఆ నీళ్లు అన్నం వొండటానికి పనికొస్తాయే గానీ తాగడానిగ్గాదు. తాగడానికి మళ్ళీ, మాకు ఇంకో మంచెళ్ల బాయి ఉండేది.

    పనికి రాని నీళ్లు ఎసుటి కెందుకు, అభిషేకానికెందుకు అని, అడగబాకండి . ఏమో!

    సాయంత్రాల పూట మాత్రం మా మునవ్వో, లేక మా రామాంజవ్వో లేక ఎవరో ఒక ముసలవ్వలు, దీపాలు పెట్టేవోళ్ళు గుళ్లో. మా అమ్మమ్మ ఎప్పుడు ఈ దీపాలు పెట్టే అవ్వలతో గుళ్లో దీపాలు పెట్టేది కాదు. . నాకయితే మా అమ్మమ్మ కూడా ఆ అవ్వల మాదిరే దీపాలు పెడితే చూడాలనుండేది.

    ఎందుకు పెట్టేది కాదో . తనతోనే ఎప్పుడూ వుండే రాముణ్ణీ, గుడి దాకా పొయ్యి చూసే పనేముందనేమో!

    ఆ అవ్వలందరూ గుడిలో దీపం పెట్టి గుడి వరండాలో ఊసులాడుకోని , చివరగా అక్కడే ఆడుకుంటున్న మా పిలకాయల్ని పిల్చి, లెక్క ప్రకారం ఒక్కొక్కరికి, ఒక్కొక్క నలుసంత కలకండ ముక్క పెట్టేటోళ్లు.

    మా స్నేహితులు అప్పుడప్పుడు, వాళ్ళు పెట్టే ఆ నలుసంత కలకండ కోసం, సిగ్గు లేకుండా ఆమైన మన ఆటలు గూడా మానేసి వెళ్లాలా అనే వాళ్ళు. నేను మాత్రం అలా సిగ్గు పడేటోణ్ణి గాదు.

    పైపెచ్చు మా మురళి గాడు వొంతో లేక మా వంశీ గాడి వొంతో గూడా , అడిగి తెచ్చుకొనేటోణ్ణి . నేను ఎందుకంత ఆశ పడేటోణ్ణో నన్ను అడగబాకండి.

    అట్టాగే , ప్రతీ శనివారం సాతంత్రం పూటా మా మునెవ్వ , రామాంజవ్వ ఇంకా చాలా అవ్వలు కలిసి,

    హరే రామ హరే రామ!

    రామ రామ హరే హరే!

    హరే కృష్ణ హరే కృష్ణ!

    కృష్ణ కృష్ణ హరే హరే! అని భజన చేసేటోళ్లు. ఆ భజనకు మా మునెవ్వ కొడుకయిన వెంకన్న డోలు వాయించే వాడు.

    మా అమ్మమ్మ ఇంట్లో వుండే నాకు, ఈ భజన వింటూ వాళ్ళ మీద ఒక జాలి కలిగేది. వీళ్ళకి ఈ నాలుగు వాక్యాలకన్నా ఎక్కువవరావేమో అందుకనే అవే తిప్పి తిప్పి ప

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    8 min
  • నా మొదటి ప్రవాస జీవనానుభవం!

    నా మొదటి ప్రవాస జీవితం దక్షిణాఫ్రికా లోని జోహనెస్బర్గ్ లో మొదలయ్యింది. ఆనాడు దక్షిణాఫ్రికా లో రెండు ప్రధాన బ్యాంకు సమూహాలుండెడివి, ఒకటి ఏ.బి.ఎస్.ఏ మరియు రెండవది నెడ్కోర్. నేను ఏ.బి.ఎస్.ఏ బ్యాంకు వాళ్ళ అసెట్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లో పని చేసే వాడిని. మా బస మరియు రవాణా అంత మా కంపెనీ నే ఏర్పాటు చేసింది. జోహనెస్బర్గ్  కంతటికీ అందమైన సాండ్ టన్ అనే ప్రదేశంలో సాన్మారియో అనే గృహ సముదాయం లో. చాలా అందమైన దేశం దక్షిణాఫ్రికా, విశాలమైన రహదారులు, రహదారుల మీద ఖరీదైన బి.ఎం.డబ్ల్యూ లు బెంజులూ, ఫోల్క్స్ వాగెన్ లు, ఎక్కడ బట్టినా సహజ సిద్దమైన అడవులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆహా ఏమి అభివృద్ధి అనేలా. ఆఫీస్ లో సహోద్యోగులంతా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ మరియు మిగతా యూరోప్ దేశస్థులే. మా ఆఫీస్ మాత్రమే ఏమిటి అన్నీ తెల్లకాలర్ పనుల్లో అంతా తెల్లవారే. ఆహా ఏమి ఈ దేశం ఏమి ఈ ప్రగతి ఇలాటి దేశానికి వచ్చిన నా భాగ్యమే భాగ్యమంటూ మురిసాను.

    కానీ ఆ కమ్మిన పొరలు కరగడానికి అట్టే సమయం పట్టలేదు. పెట్రోల్ పంప్స్, బిల్డింగ్ మైంటెనెన్సు, రోడ్స్ క్లీనింగ్, డొమెస్టిక్ మెయిడ్స్ లాటి పనుల్లో అంతా అక్కడి నల్లవారే వారే. చిన్న చితకా పనులు, కష్టమెక్కువ డబ్బులు తక్కువ పనులన్నీ వారివే. వాళ్ళ నివాసాలన్నీ ఊర్లకు దూరంగా వుండే మురికి వాడల్లో. టిన్ షీట్స్ తో వేసిన తాత్కాలిక నివాసాలు, కచ్చా రోడ్స్, అక్కడికి వెళ్లాలంటే అందరు భయపడేలా కథనాలు. వాళ్ళు అక్కడనుండి సిటీ లోకి రావాలంటే మనకిక్కడి రన్నింగ్ ఆటోల్లాగా రన్నింగ్ వ్యాన్లు  వాటిల్ని కాంబిలు అనే వారు. వాళ్ళు అంటే చెప్పలేని సృష్టించిన భయాలు. ఆరుగంటలు దాటితే అన్నీ రహదారులు నిర్మానుష్యం అయిపోతాయి. కాలి నడక అయితే అస్సలకే బంద్. అన్నీ నివాస సముదాయాలు విద్యుత్ కంచెలతోనే దర్శనమిస్తాయి.

    మాకు మా కంపెనీ మెయిడ్ ని కూడా ఏర్పాటు చేసింది. వారానికి రెండు రోజులు వచ్చి ఇల్లు మొత్తం అద్దంలా తుడిచి, బట్టలన్నీ కామన్ వాష్ మెషీన్ లలో ఉతికి, ఇస్త్రీ చేసి వెళ్లేవారు. మా మెయిడ్ పేరు సిల్వియా. ఎంత భీకరాకారో అంతే భీకరమైన గొంతుతో వుండే  ఈమె అంటే మా వాళ్లందరికీ టెర్రర్. ఎక్కువ బట్టలున్నా వాషింగ్ కి, ఇల్లు ఎక్కువ గందర గోళంగా వున్నా క్లీనింగ్కి, రుస రుస లాడి పోయేది. అలాటి గడ గడ లాడించే సిల్వియా సుప్రియా దగ్గర కొచ్చేసరికి ఒక స్నేహితురాలైపోయేది. సుప్రియ తను ఆకలి మీద వస్తుందని ఎమన్నా తినడానికి పెట్టేది, తనకి మన బిర్యాని ని బాగా అలవాటు చేసేసింది. తాను కూడా బాగా కబుర్లు చెబుతూ పని చేసేది. అంత రుస రుస లాడే సిల్వియా ఇక్కడ మాత్రం, ఈ హర్షా! విప్పినన్ని గుడ్డలు ఈ వోల్ సాన్ మారినోలో వుండే మగాళ్లు కలిపి విప్పరు అని నవ్వేసేది.

    అలాటి సిల్వియా ఒక రోజు మా ఇంట్లోనే కుప్పకూలి పోయింది. బోరు బోరు మంటూ ఒకటే ఏడుపుతో. తనతో సహజీవనం చేసే వాడు పారిపోయాడు తాను ప్రెగ్నెంట్ అని తెలిసాక. వాడుత్త తాగుబోతని, వాడిని ఆమె పోషించేది అని, ఆఖరుకు వాడి తాగుడుకి కూడా ఆమె ఇచ్చేది. వాడి పని తాగటం, వచ్చి కొట్టటం. ఇది విన్నాక ఏ దేశ మేగినా , ఎందు కాలిడినా, కథలన్నీ ఒకటే, మనుషుల వ్యధలన్నీ ఒక్కటే అని. ఇది తెలిసాక సుప్రియా సిల్వియా కి ఒక మదర్ అయిపోయింది. తాను ఏదైతే తినేదో అదే సిల్వియా కి  పెట్టేది. కొన్నాళ్ళకు మేము కూడా,  మా చిన్నది సుప్రియా కడుపులో పడటంతో మా  ఊరికొచ్చేసాం. ఇప్పటికీ మా చిన్నది ఎప్పుడన్నా పెద్ద పెద్ద గొంతుతో అరిచినప్పుడల్లా,  నేను కానీ సుప్రియా కానీ ఏమ్మా! నీకు సిల్వియా పూనిందా అంటూ ఉంటాము. ఆలా సిల్వియా మా జ్ఞాపకాలలో సజీవంగానే వుంది . నా సౌతాఫ్రికా అనుభవాలతో ఎవరన్నా బ్రిటిషర్లు మనదేశాన్ని ఏకీకృతం చేశారు , రోడ్లు వేశారు , పొగ బండ్లు ఏర్పాటు చేశారు , చాలా అభివృద్ధి చేశారు అంటే అసలే నల్లగా వుండే నా మొహం ఇంకా వివర్ణమవుతుంది.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    5 min
  • బెల్లంకొండ వెంకటేశ్వర్లు!

    ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము

    ఒక రోజు బడికి వచ్చేసరికి, మా తరగతిలోనే ఓ కొత్తమొహం కనిపించింది నాకు. మధ్యాహ్నమయ్యేసరికి ఆ వచ్చిన అబ్బాయి వివరాలు తెలిసి పోయాయి.

    పేరు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు. అప్పటిదాకా బుచ్చి లో చదువులు వెలగబెట్టి,యీ రోజే మా బడిలో చేరాడు. వూరు మాత్రం మా వూరే, ఉప్పలపాడు.

    వారం లోపులే సావాసం గాడు అయ్యాడు, వాడి కి తెలియని విద్యే లేదు. వాడి పుస్తకాల సంచి మాకో వింత ప్రపంచం. దాన్లో ఓ కేటర్బాల్ (స్లింగ్ షాట్) దార్లో కనపడ్డ చింత కాయలో లేక సీమ చింత కాయలో కొట్టడానికి, రాలిన తాటి పళ్ళు కాల్చడానికి ఓ అగ్గిపెట్టె, దారి మధ్యలో ఆగి ఆడడాని కో అరడజను గోళీలు, యూనో లాగ ఆడదానికి సిగరెట్ బాక్స్ కార్డ్స్.

    ఇవన్నీ కాక వాడి కి అమోఘమైన మిమిక్రి కళ వుంది. వచ్చిన వారం పది రోజుల్లోనే అందరి అయ్యవార్లను అనుకరించడం నేర్చేసాడు. వాడే మాకు సెంటర్ అఫ్ అట్రాక్షన్. ఇంత టాలెంట్ సొంతమైన మా వాడిని అన్యాయంగా పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు అని తేల్చేశారు మా అయ్యోర్లు. మాకు మా అయ్యోర్ల అభిప్రాయం తో అస్సలకి పనిలేదు కదా, మా హీరో వాడే.

    నేను వాడు ఓ ఒప్పందానికి వచ్చేసాము. పరీక్షల్లో వాడూ నేను పక్క పక్కన లేక పోతే నా వెనక వాడో కూర్చోవాలని. నాకు వచ్చినవన్నీ వాడు చూసి రాసేసుకోవాలి, వాడికి వచ్చిన విద్యలన్నీ నాకు నేర్పించేయాలి. ఆరోతరగతి యూనిట్ పరీక్షలు, క్వార్టర్లీ మరియు హాఫ్ యియర్లీ అన్నీ మేనేజ్ చేసేసాము.

    క్లాస్కెళ్ళింతర్వాత అంతా షరా మామూలే. ఒక్కో అయ్యోరు రావటం వాడినేదో ప్రశ్నలడగటం, వీడేమో వాళ్ళు అడక్క ముందే బెంచీ ఎక్కటం. వాళ్లేమో తా జెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అంట అంటూ ఇంకా చీవాట్లు పెట్టటం.

    రోజులు గడుస్తూనే వున్నాయి, మా అయ్యోర్లలో మార్పేమీ లేదు. మేము మాత్రం బుద్ధిగా వుండే పిలకాయల్ని కూడా కోతులుగా మార్చేస్తున్నాము. మా అయ్యోర్లేమో మళ్ళీ యూనిట్ పరీక్షలు వస్తున్నాయి, బాగా చదవండి అంటూ, అవేవో పబ్లిక్ పరీక్షలు అయినట్టు హెచ్చరికలు జారీ చేయటం మొదలు పెట్టారు. బెల్లంకొండోడి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు, ఏమీ చదవని వీడికి వీడికి ఇప్పటి వరకూ వచ్చిన మార్కులకి బాలన్స్ కుదరటం లేదు అంటూ, మొదటి సారిగా నన్నో మూల, వాడినో మూలా కుర్చోపెడతామని ముందే వార్నింగ్ ఇచ్చారు.

    అయినా మా వాడి మొహం లో టెన్షన్ కనపడలా, దానిక్కూడా వాడి దగ్గరేదో సొల్యూషన్ ఉన్నట్టు. ఓ రోజు ఉన్నట్టుండి, యురేకా అనుకుంటూ వచ్చాడు నా దగ్గరకి.

    "నాకు నువ్వు అన్నీ ప్రశ్నలకి జవాబులు రాసివ్వు ముందరే" అన్నాడు.

    "చిట్టాలు పెడతావా. ఎక్కడ దాచుకొని పోతావురా వాటిల్ని, జోబీలోనా, లేక నీ తలకాయ జుట్టులోనా" అని నవ్వా నేను.

    "కాదురా! మనవేమో నేల బల్లలు, ఫ్లోరింగ్ అంతా మట్టి. ముందే వెళ్లి నేను నా ప్లేస్ లో చిన్న గుంత లోడి, నువ్విచ్చే పేపర్స్ అన్నీ అక్కడే కప్పెడతా" అన్నాడు పెద్ద హీరో లాగా.

    "దొర్కవుగా" అన్న.

    "లేదేహే! నువ్వొట్టి పిరిగ్గొడ్డు వి"

    నిజమే మా బెల్లంకొండోడి ఐడియా నే ఐడియా. విజయవంతం గా రాసేసాడు తెలుగు, ఇంగ్లీష్.

    కానీ మూడో రోజు లెక్కల పరీక్షలో పట్టుబట్టాడు వాడు మరీ ఓవర్ గా సంభాషణలతో పాటు నడకని కూడా మిమిక్రి చేసే మా సోషల్ అయ్యవారికి.

    మరు నిమిషం వాడి వీపు మరియు నా వీపు బద్దలయ్యాయి. చిట్టాలు పెట్టింది వాడే, కానీ రాత నాది కదా. ప్రతీ అయ్యోరు రావటం, తీయండి రా గుంజీలు అనటం, తీసి తీసి మేము పడిపోయేదాకా తీయించటం. కాస్త ఓపిక రాగేనే ఇంకో అయ్యోరు తగులుకోవటం.

    మా ఘన కార్యం తెలిసిన మా హెడ్ మాస్టర్ బహు ముచ్చట పడి వీళ్ళ సమయం మధ్యాహ్నం నుండి నాకు బహూకరించండి అని మా అయ్యోర్లను వేడుకొని, ఆయన రూమ్ ముందర ఆయనకు కనపడేలా మోకాళ్ళ దండన కార్యక్రమం మొదలెట్టారు. ఇదే మేలురా హర్షా అయ్యోర్ల బెత్తం దెబ్బలు , గుంజీళ్లు కంటే , ప్రాణం హాయిగా ఉందబ్బా అంటూ పళ్ళికిలిచ్చాడు వాడు.

    ఆ రోజు నేనైతే ఇల్లెలా చేరానో నాకే తెలియదు, ఆ రోజే కాదు ఒక వారమంతా కదిలితే వొళ్ళంతా ఒకటే సలుపు, గుంజీళ్ల మహిమ.

    అలా జరిగిపోయేదేమో కాలమంతా, ఆ రోజు ఆ అవ్వ మా అమ్మ కాళ్ళ బడకుండా వుండి ఉంటే.

    మా ఊరి పొలాలకు పోవాలన్నా, పొలాలనుండి ఇళ్ల కు పోవాలన్నా అందరు మా వీధి గుండా, మా ఇంటి ముందర నుండే వెళ్ళాలి.

    ఓ రోజు సాయంకాలం, ఓ ముసలవ్వ, వొంట్లో శక్తీ అంతా వొడిగి పోయినట్లుగా పొలం నుండి ఇంటికి వెళ్తూ కనిపించింది మా అమ్మకి.

    "నర్సమ్మ బాగుండావా!" అంది అమ్మ.

    "ఏమి బాగు సుజాతమ్మ, ఎదో ఇలాగా" అంటూ ఆగింది అవ్వ, బుట్టని ఇంకో సంకలోకి మార్చుకుంటూ.

    "మనవడు ఎలా వున్నాడు నర్సమ్మ"

    "బాగానే వున్నాడమ్మా! మొన్నటి దాకా బుచ్చిలో చదువుకొనే వాడు, గవర్నమెంటోళ్ళ హాస్టల్ లో వుండి. అక్కడుంటే చదువు అబ్బటం లేదు, సావాస గాళ్ళతో కలిసి ఒకటే ఆటలు, తిరుగుళ్ళు. నాకాడే పెట్టుకుందామని తీసుకొచ్చాను అమ్మా. ఇక్కడ చదువులు బాగుంటాయని"

    "ఏమి చదువుతున్నాడు నీ మనవడు"

    "ఆరో తరగతి అమ్మా. ఆ ఏడుకొండల స్వామి పేరు పెట్టుకున్నా, వెంకటేశ్వర్లు అని"

    "అయితే మా వాడు రోజూ జపం చేసేది నీ మనవడి గురుంచే అన్న మాట" అంటూ, అమ్మ గబ గబా వెళ్లి ఒక చేట నిండా బియ్యం తెచ్చి అవ్వ గంపలో పోసింది, వాటిల్తో పాటు కాస్త గోకాకు కొన్ని పచ్చి మిరపకాయలు కూడా గంపలో చేరాయి

    "సల్ల గుండు తల్లా!, కనపడి నప్పుడల్లా ఎదో ఒకటి ఇస్తావుంటావు" అంటూ బయల్దేరింది అవ్వ.

    అవ్వ వెళ్ళగానే, "చిన్న! నువ్వు పలవరించే బెల్లంకొండా వెంకటేశ్వర్లు ఈ అవ్వ కూతురి బిడ్డే. వాడి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతే, ఈ అవ్వ ఈ వయస్సులో కూడా కూలీ పని చేసి వాడిని పెంచుతుంది"

    "వెంకటేశ్వర్లు వాళ్ళ, నాన్న ఏమయ్యాడమ్మా!"

    "ఏమయ్యాడా! వాడిని వాళ్ళ ముసలి అమ్మమ్మ ఎదాన పడేసి మాయమయ్యాడు. వీడన్నా సక్రమంగా చదువు కుంటే ఆ ముసలామెకి ఈ దిగులెందుకు చెప్పు" అన్నది కోపం గా.

    అసలే ఆ అవ్వని చూసి దిగులుగా వున్న నాకు, మా అమ్మ కోపంతో ఇంకా ఎక్కువయ్యింది. రాత్రంతా కలలో ఆ అవ్వే, ఇంకా ఏమిటేమిటో కలలు. బెల్లంకొండ ముందు దేవుడు ప్రత్యక్షమయినట్టు, వాడినేదో కోరుకోమన్నట్టు, వాడు నాకు చదువు కావాలి అన్నట్టు, దేవుడు తధాస్తు అన్నట్టు. ఇంకా చాలా కలలు.

    తెల్లారింది. యధావిధిగా భుజాలకు సంచులేసుకొని బడికి బయలుదేరాము. వాడేమో ఈ సారి ఇనప గోళీలు తెచ్చాడు. దారంతా వాటితో ఆడుతూ బడికి చేరాము. దార్లో ఆటలాడుతూనే వాడికి నా కల చెప్పా. "పిచ్చోడివిరా నువ్వు " అన్నాడు వాడు నవ్వుతూ. "ఎందుకురా నన్ను పిచ్చోడివి" అంటున్నావు అంటే, ఆ అడిగేదేదో డబ్బులే అదగొచ్చుకదారా అంరూ కిసుక్కుమన్నాడు వాడు.

    ఆ దెబ్బకి బెల్లంకొండోడితో ఆటలైయితే సరే కానీ పరీక్షలకి సంబంధించి వాడి బ్రిలియంట్ ఐడియా లకి చాలా దూరంగా వుండాలని. కానీ వాడికేమో నా ఈ మార్పు నచ్చలా.

    "నాకు చదువు రాకపోవటం వల్లే కదా మనకీ కష్టాలు. మరి నాకు చదువుకోవటం ఎలాగో నేర్పు" అంటూ మొదలు పెట్టాడు. నాక్కూడా నిజమే కదా, వాడికి రాక పోవటం వల్లే కదా మేము చిట్టాలు పెట్టాల్సి వచ్చి, పిక్కలు పెట్టె వరకూ గుంజీళ్లు తీయాల్సి వచ్చింది అని. సరే చదువుకుందాం అని నిర్ణయానికి వచ్చేసేము.

    ఒక మనిషి వాడితో పది నిమిషాలు మాటలాడితే వాళ్ళ మాటలు మరియు హావ భావాలు పట్టేసే ధారణ వాడుకుంది. అది వాడి బలం. ఆసక్తి లేక వాడు దాన్ని చదువులో పెట్టలా. నేను వాడికి చదవటం మొదలు పెట్టాను, వాడు వినటం, విన్నది మరలా నన్ను మిమిక్ చేయటం, దానికి నేను నా గొంతు మార్చటం, వాడు దాన్ని కూడా మిమిక్ చేయటం, ఇలా నవ్వుల్తోనే సాగేది మా చదువు.

    మావాడు అయ్యోర్లు అడిగిన ప్రశ్నలకి చిలక పలుకుల్లా సమాధానాలు చెప్పటం మొదలు పెట్టాడు. వాళ్ళు కూడా మేము చేసిన పనులు మర్చిపోయి వాడిని "పర్వాలేదురా దార్లో పడుతున్నావు, దెబ్బకి దెయ్యం వదిలిన్దిరా నీకు. ఈ పని మేము ఎప్పుడో చేయాల్సింది" అంటూ సానుకూల పడటం మొదలెట్టే సరికి మా ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

    ఓ సారి ధైర్యం చేసి మా ఎల్.ఏ సెక్రటరీ ని బతిమాలుకొని మా వాడి పేరు ఎలక్యూషన్ కి ఇచ్చేసాము. నచ్చిన స్వతంత్ర సమరయోధులు మా టాపిక్. తెగ ప్రిపేర్ అయ్యాము. సుభాష్ చంద్ర బోస్ గారి బాల్యం, చదువు, ఐ.సి.ఎస్ ఎంపిక, ఆజాద్ హింద్ ఫవుజ్ స్ధాపన, ఆయన మిస్టీరియస్ మరణం గురుంచి మా వాడు రక రకాల మోడ్యులేషన్స్ తో చెప్తుంటే ఆహా నేతాజీ కదా అసలు సిసలు లీడర్ అంటూ గుండెలు పొంగని వాడు లేడు.

    అలా మా బెల్లంకొండ ఆ రోజుకి మా స్కూల్ హీరో అయ్యాడు.

    మేము మా చదువు అలానే కంటిన్యూ చేసాం.

    సరిగ్గా సంవత్సరం తర్వాత మా ఆరు ఊర్లలో సంచలనం లేపాడు ఏడో తరగతి పబ్లిక్ హిందీ తో సహా 284 మార్కులతో గట్టెక్కి.

    *** మీరు కథపై వ్యాఖ్యానించాలనుకుంటే, 'హర్షణీయం' ని సందర్శించండి. కథ క్రిందిభాగంలోని 'కామెంట్స్' సెక్షన్ లో మీ వ్యాఖ్యలని పొందుపరచండి.

    https://harshaneeyam.in/2020/09/11/bellam/




    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    10 min
  • స్కై ల్యాబ్, మా గడ్డివాములో పడింది!

    నా చిన్నతనపు ఇంకో కథ. మేము ఎక్కువ మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలోనే గడిపేశాం చిన్న తనమంతా. మా ఇల్లు పెద్ద స్థలం లో ఆస్బెస్టాస్ రేకులు కప్పిన ఒకే ఒక్క పెద్ద గది,  ముందు పంచ, పక్కన ఒక తాటి ఆకులు కప్పిన వంటగది. ఇంటికి కుడి పక్క పెద్ద బాదం చెట్టు వెనక ఒక ఉసిరిగి చెట్టు, ఎడమ పక్క పెద్ద స్థలం లో గడ్డి వాము, ఆ వాముకి ఆవల పెద్ద ఎరువు దిబ్బ. ఆ దిబ్బ నానుకొని ప్రహరీ, ప్రహరీకి ఆవల పంట పొలాలు. మా ప్రహరీకి పంట పొలాల మధ్య ఒక పంట కాలువ. ఒక రోజు మేము గడ్డి వామి మీద కెక్కి దిబ్బలోకి దూకుతూ ఆడుతున్నాం. అలా ఆడటంలో నాకు ఆ దిబ్బలో ఒక పారేసిన అగ్గి పెట్టె దొరికింది. ఓపెన్ చేస్తే దాన్లో ఒకే ఒక అగ్గిపుల్ల. ఆహా ఇంకేముంది కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు మనం ఆ పుల్ల గీసేశాం. బస్సు మని వెలిగి ఆరి పోయింది. ఆ వెలిగిచ్చామన్న తృప్తితో మరియు ఆరికూడా పోయింది అనే నిర్లక్ష్యంతో ఆ పుల్లని ఆ దిబ్బ లో విసిరేసి అగ్గిపెట్టె మాత్రం అగ్గిచెక్కులాట కోసం జోబీలో వేసు కొని సైలెంట్ గా వచ్చేశాం.

     ఒక అరగంట తర్వాత ఒక్కసారి గా అక్కడనుండి మంటలు మొదలయ్యాయి. పక్కనే గడ్డి వాము. మా అమ్మమ్మ చూసేసింది, వామ్మో మన దిబ్బలో స్కై లాబ్ పడిపోయిందిరా నాయనా అంటూ. అందరూ పరిగెత్తారు. మా శీనన్న హడావుడిగా బిందెలెత్తుకొని తొట్టిలో నీళ్లతో,  దిబ్బలో దూరేసి, నీళ్లు చల్లటం మొదలెట్టాడు. అలా అందరూ ఆ మంటల్ని రంగంలోకి దూకి ఆర్పేశారు. ఆ ఆర్పటంలో మా శీనన్న అరిపాదాలు కూడా కాలాయి . అందరూ స్కై ల్యాబ్ శకలాల కోసం దిబ్బలో వెతికారు. అవి లేవు. ముసలోళ్ళు అమెరికానీ శాపనార్థాలు పెట్టేశారు, తిని కూర్చోక, ప్రయోగాలు అంటూ మా ఊర్ల మీదకు ఎందుకు తెస్తారు అని. మీకు గుర్తుందో లేదో, స్కై ల్యాబ్ భీతి ఆఖరుకు పల్లెల్లో కూడా, యిప్పటిలా నిరంతర వార్తా ప్రసార మాధ్యమాలు, చరవాణులు లేని రోజుల్లో కూడా చొచ్చుకుపోయిందంటే, ఏ ఇద్దరు కలిసిన అది కూలితే, ఒక వూరే నాశనమని, కాదు ఒక జిల్లానే పోతుందని, కాదు కాదు ఒక రాష్ట్రమే కాలి పోతుందని ఒకటే చర్చ. నేను కూడా మా శీనన్న కాలు కాలేసరికి అది నావల్లే అని నోరు విప్పే ధైర్యం చేయలా. కుక్కిన పేనులా గుడ్ల నిండా నీరు నింపుకొనివున్నా.

    స్కై ల్యాబ్ ఎప్పుడైన పడొచ్చు ఇది శాంపిల్ మాత్రమే అని, మా వూరు ఊరంతా కోళ్ళని పొట్టేళ్లని కోసేశారు, అవెక్కడ కాలి బూడిద అవుతాయో అన్న భూతదయతో. భుక్తాయాసంతో పడుకున్న నా పొట్ట మీద వాతాపీ జీర్ణం వాతాపీ జీర్ణం అంటూ పొట్ట తమిడింది మా అమ్మమ్మ. ఆ దిబ్బ లో అగ్గి పెట్టె గీసింది నేనేను, కానీ శీనన్న కాలు కాలటంతో చెప్పలేక పోయాను. భయమేసింది అన్నా బెక్కుతూ. నేను చూశాలేరా నువ్వా దిబ్బలోకి వెళ్ళటం, ఎదో చేసిన మొహంతో బయటకి రావటం అన్నది మా అమ్మమ్మ. మరి నువ్వు ఆ స్కై ల్యాబ్ అంటూ అమెరికా వాడిని తిట్టటం అంతా, అంటే పడుకోరా పిచ్చి సన్నాసి, నువ్వూ నీ బుజ్జి బుర్రలో ప్రశ్నలూ అంటూ నవ్వేసింది మా అమ్మమ్మ . ఈ సీక్రెట్ నాకూ మా అమ్మమ్మకు మధ్యలోనే 1983 వరకూ.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    4 min
  • నేను పగలకొట్టిన పిచ్చుకను నాకు ఇవ్వండి తెచ్చి!

    నాకు నా చిన్నప్పటి రోజులు ఇప్పటికీ జ్ఞాపకమే. నాలుగేళ్లు వుంటాయనుకుంటా నాకు అప్పుడు. మా పెద్దమ్మతో నెల్లూరు వెళ్ళినప్పుడు, సతాయించి సతాయించి ఒక కారు బొమ్మ కొనిపిచ్చుకున్నా. కాస్త అదిమి పెట్టి వెనక్కి లాగితే స్ప్రింగ్ ముడుచుకొని, వదలగానే రయ్యిమంటూ ముందు కెళ్లే ఎర్ర కారు అది. కొన్ని రోజులైతే దానితోనే నా లోకం. ఉన్నట్టుండి ఒకసారి దాని ముందు చక్రం ఊడి పోయింది. సరి చేసి పెడితే కొంచెం దూరం వరకు చక్రం ఉండటం, తర్వాత ఊడి, కుంటి గుర్రం లాగా ఒక పక్కకి పడి పోవటం. అలా చక్రం ఊడిన కారు నాకు నచ్చలా. ఒక రాయి తీసుకున్నా, మా దేవళం పంచలో కూర్చున్నా, కారుని పచ్చడి పచ్చడి చేసిపారేశా!. మా మూగ పూజారి నేను చేసే పని చూసి, లబ లబ లాడాడు. ఎత్తుకెళ్ళి దాన్ని మా సుబ్బరామ్ తాత వాళ్ళ స్నానాల నీళ్లు వెళ్లే తూము కింద పారేసా!. అలా మా వాళ్లంతా నీ కారేదిరా అని అనటం, నేను పోయుందని చెప్పటం. మా వాళ్ళు నిజమే కాబోలు వీడికి ఊరంతా పెత్తనాలే కదా, ఎక్కడో పారేసుకుని ఉంటాడని సరిపెట్టుకున్నారు. మా శీనన్న కొన్నాళ్ళకు గండవరం తిరునాళ్ల కెళ్ళి, మళ్ళీ నాకోసం ఓ బొమ్మ కారు పట్టకొచ్చాడు, వాడు జార్చుకుంటే జార్చుకున్నాడులే, ఉన్నన్నాళ్ళు ఆడుకుంటాడు అని.

    ఈ లోపల నాకు మా ఊరి వీధిబడిలో చదువుకొనే మహదావకాశం వచ్చింది. పెద్ద పండగలాగా, మా ఉషాకి , మా జయమ్మకి , మా మురళికి , మా కరుణాకి , ఇంకా అందరు పిల్లకాయలకు, పలకలు బలపాలు పంచేసి బడిలో చేరిపోయా. మా అయ్యోరొక పలక మీద, అ! ఆ! రాసిచ్చి, కొంత సేపు రుద్దిచ్చి, ఇంకా రుద్దు కొని రారా అని తరిమిపడ నూకినాడు, ఆయన పోయి కొడవంలో పడ్డ చేపలు తెచ్చుకోడానికి . నేను మా ఇంటికి లగెత్తినా, ఈ లగెత్తడంలో పలక, కిందబడి ఒక చిన్న పెచ్చు ఊడింది. పెచ్చు ఊడిన పలక నాకు నచ్చలా. దారిలో కాశీ రాయొకటి తీసుకొని, పలకను ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టినా!. నాలుగు కర్రముక్కలు కలిపిన ఫ్రేమ్ మాత్రం మిగిలింది. మా ఉషాకి ఆ ఫ్రేమ్ ఇచ్చి, మే ! మీ అమ్మని పొయ్యిలో పెట్టుకోమని చెప్పు అని, ఆ పిల్ల మొహాన పడేసి వచ్చా. ఏమిటో మనకి మొదట నుండి అన్నీ సక్రమంగా ఉండాల, తేడా వస్తే పగల కొట్టేయాల్సిందే. షరా మాములే, ఏదిరా నీ పలక అనటం, మనం పగిలి పోయిందనటం. మరలా మనకో కొత్త పలక, దాంతో పాటు మనం అరగ దీయటానికో బలపం కట్ట బోనస్ గా వచ్చేది.


    ఒక రోజు నేను, మా పెద్దమ్మ వాళ్ళ కొట్టాం పక్కగా నడుచుకుంటూ వస్తున్నా. చొక్కా గుండీకి దారం పోగు బయటకు వేలాడుతుంది, దాన్ని చూడగానే నాకు చిరాగ్గా వుంది. ఉంటే సక్రమంగా ఉండాలా లేక పోతే ఊడాల ఆ గుండీ. దాన్ని పీకుతూ తలెత్తే సరికి, కొట్టంకి వేసున్న కర్ర తుమ్మ కర మీద, పిచ్చుకలు వాలున్నాయి గుంపుగా. అబ్బా! ఇప్పుడు గాని వాటి మీద ఒక్క రాయి వేస్తే నా సామి రంగా, ఒక్కటన్నా నేలమీద పడదా అని, పక్కకి వొంగి ఓ కంకర రాయి తీసి విసిరా వాటి మీదకి. వెంటనే అవన్నీ చిల్లా పల్లాగా ఎగిరిపోయాయి. కంచె దగ్గరకెళ్ళి చూస్తే ఒక రెక్క తేడాగా ఎగరలేని పిచ్చుక ఒకటి అక్కడ పడుంది. అది ఎగరడానికి ప్రయత్నిస్తూ, ఎగరలేక నేలమీద, దాని చుట్టూ అదే గిరికీలు కొడుతుంది. అలా సక్రమంగా ఎగరలేని పిచ్చుక నాకు నచ్చలా. కొంత సేపటికి ఎగిరి పోతుందిలే అని అక్కడ నుండి కదిలా. కానీ మనసు లాగింది, ఎక్కడో సన్నని బాధ, వెనక్కి మరలా. వెళ్లి పిచ్చుకని చేతిలో తీసుకున్నా. ఇంటికి పట్టుకొచ్చా, ఇంట్లో ఒక మూల ఉంచా. కొంత సేపయ్యాక కొన్ని బియ్యం నూకలు వేసా దాని ముందు, ఒక చిన్న మట్టి మూతలో నీళ్లు తెచ్చిపెట్టా. దాన్నే చూస్తూ కూర్చున్నా. ఎవరో చెప్పారు దాని గాయం దగ్గర మట్టి రాస్తే తగ్గుతుందని, వెంటనే మట్టి తెచ్చి రాసా. ఆ సాయంత్రమంతా దానితోనే. పొద్దుబోయింది నిద్ర వస్తుంది మధ్యలో లేవటం, దాన్ని చూసుకోవటం, ఇలా తెలియకుండానే నిద్ర పోయా.


    తెల్లారగానే అది కోలుకొని ఉంటుందని అది ఉన్నవైపు కెళ్ళా, అక్కడ నాకది కనిపించలా, దాని కొన్ని ఈకలు మాత్రం వున్నాయి. అప్పుడు నాకర్థమయ్యింది ఆ మధ్య మా ఇంట్లో ఓ పిల్లి తిరుగుతుందని. అప్పుడొచ్చింది నాకు ఏడుపు. నేను కారు పగలకొడితే ఇంకో కారు తెచ్చారు, పలక పగలకొడితే ఇంకో పలక తెచ్చారు, మరి నాకు ఇంకో పిచ్చుక వద్దు, నేను పగల కొట్టిన పిచ్చుకే కావాలి. తెచ్చి ఇయ్యండి మీరైనా, ఇప్పటికైనా.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    5 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners