Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • నా మొదటి అమెరికా యాత్ర, అచ్చు ఆచారికి మల్లె!

    ఆచారి! అమెరికా యాత్రలా, నా మొదటి అమెరికా యాత్ర గురుంచి, తప్పకుండా రాయాలి. నేను, సుప్రియ, ఇద్దరు పిల్లలతో క్రీస్తు శకం 2000, మార్చ్ 31 వ తేదీ ముంబై నుండి కొలరాడో లోని డెన్వర్ కి బయలుదేరాము. అమ్రుకి రెండు నిండి మూడేళ్లు, ఆముకి మూడు నెలలు. ఇంతకు ముందు దక్షిణాఫ్రికాలో మూడేళ్లు ఉండటంతో ఈ ప్రయాణాన్ని చాలా ఆత్మవిశ్వాసం తో మొదలుపెట్టాము, మాకేంటి అనే ధీమా తో. జె .ఎఫ్ .కే లో మార్చ్ 31 వ తేదీ సాయంత్రం ఐదున్నరకి దిగేసాము. డెన్వర్ కి మా కనెక్టింగ్ విమానం, తర్వాత రోజు ఉదయం ఏడు గంటలకు, పక్కనే ఉన్న లాగార్డియా విమానాశ్రయం నుండి. మా కంపెనీ వాళ్ళు 31వ తేదీ రాత్రికి, మాకు జె.ఎఫ్.కె కి దగ్గర వున్న రమడా ఇన్ లో బస ఇచ్చారు.

    నా క్లోజ్ ఫ్రెండ్స్ ఐన శ్రీధర్, మరియు నాకు జూనియర్ ఐన కమల న్యూజెర్సీ లో చాల సంవత్సరాల క్రితమే స్థిరపడి యున్నారు. మా రాక తెలిసి, ఆ ఇద్దరూ విమానాశ్రయానికి   వచ్చారు, మమ్మల్ని చూడను. పిచ్చాపాటి అయ్యాక రాత్రికి ఇక్కడెందుకు,  మనం ఇంటి కెళదాం అన్నారు. మేము ఉత్సాహంగా ఇంకొంచెం కబుర్లు చెప్పుకోవచ్చు అనుకొని,  సరే అన్నాము. అలా కమల వాళ్ళింట్లో బస చేద్దామని, వాళ్ళింటికి వెళ్ళాము. శ్రీధర్ భార్య కవిత మరియు వాళ్ళ బాబు అనిరుధ్ అప్పటికే కమల వాళ్ళింటి కి చేరుకొని వున్నారు. ఆ రాత్రి, మా మూడు కుటుంబాలు కలిసి,  పిచ్చా పాటి మాటలాడుకొని, డిన్నర్ చేసి, మరల బాగా పొద్దు పోయిందాకా కబుర్లు చెప్పుకొని కొన్ని గంటలే నిద్ర పోయాము. తర్వాత రోజు ఆరుగంటలకు, అనగా ఒక గంట ముందు విమానాశ్రయానికి చేరుకున్నాం. అక్కడకి వెళ్ళాక ఎయిర్ లైన్స్ వాళ్ళు బాంబు పేల్చారు, విమాన తలుపులు అప్పటికే మూసివేయబడ్డాయని. ఏంటబ్బా! అని తలలు గోక్కున్నాక, శ్రీధర్ మరియు కమల చెప్పారు, క్షమించు అబ్బాయి! ఈ రోజు ఏప్రిల్ ఒకటి, మాకు అమెరికాలో ఒక గంట సమయం ముందుకు జరుపుతారు. ఇప్పుడు సమయం ఆరు పది కాదు, ఏడు పది, అందుకే మీ విమాన తలుపులు మూసివేయబడ్డాయి అని. ఇన్నేళ్లు మేము ఇక్కడున్నా, మేము కూడా మరిచితిమి, తాళం వేసితిమి గొళ్ళెం వేయుట మరచితి అన్నట్టు.

    హతవిధీ! ఏమి ఈ వైపరీత్యం అనుకుంటూ, ఆ విమానపోళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు దయదలచి డెట్రాయిట్ ద్వారా వెళ్లే విమానానికి సర్దుబాటు చేశారు, కాక పోతే ఒక షరతు తో. అదేమిటంటే, ఆ రోజు ఆదివారం కనుక, డెట్రాయిట్ నుండి డెన్వర్ కి ఏ విమానంలో ఖాళి ఉంటుందో, ఆ విమానం మాత్రమే ఎక్కాలని, బిచ్చగాడికి ఎంపిక చేసుకొనే అధికారం లేదు అని చెప్పకనే చెప్పారు. వాళ్ళిచ్చిన విమానం పట్టుకొని పదకొండుకి డెట్రాయిట్  లో దిగాము. డెట్రాయిట్ నుండి డెన్వర్ కి అన్నీ విమానాలు కిటకిటలాడిపోయాయి. మా ఇద్దరు పిల్లలు చిన్న వాళ్ళు. కాకపోతే మా కేబిన్ బాగ్స్ అన్నిట్లోనూ పిల్ల సామగ్రీయే పెట్టుకున్నాం, కాబట్టి ఇబ్బంది లేదు.  విమానాశ్రయం లోనే  మధ్యాహ్న భోజనంగా, సుప్రీ! పెప్పరోని అంటే ఎర్రని పచ్చి మిర్చి (బెల్ పెప్పెర్స్ ) అని చెప్పి, పిజ్జా ఆర్డర్ చేసి, యమ్మీ యమ్మీ! అంటూ ఒక్క మా చిన్నది తప్ప, అందరమూ తినేశాం.

    అలా సాయంత్రం ఆరు దాకా విమానాశ్రయం లోనే ప్రతీ విమానంలో ఖాళీ ఉందా అని విమానపోళ్ళని అడుక్కుంటూ గడిపేసాము. ఏ విమానమూ దొరకలేదు మాకు ఆ రోజు. మరలా విమానపోళ్ళని బతిమాలుకుంటే, ఆ రోజు రాత్రికి బస మరియు డిన్నర్ కి కూపన్స్ ఇచ్చారు. హోటల్ కి వాళ్ళు ఏర్పాటు చేసిన షటిల్ లో ప్రయాణం. బయటకొద్దుము కదా చలి ఇరగ తీస్తుంది, వొళ్ళంతా గడ్డకట్టుకు పోయేలా. మా బట్టలన్నీ చెక్ ఇన్ బ్యాగేజీ లోనే వున్నాయి.  బతుకు జీవుడా అనుకుంటూ, హోటల్ కి వెళ్ళాం. పిల్లల వరకూ అన్నీ వున్నాయి మా దగ్గరే, పాలపొడులు పొడులు, బిస్కట్స్, డైపర్స్ వగైరా వగైరా. తెల్లవారి లేచి డెన్వర్ ఫ్లైట్ పట్టుకున్నాము.

    కానీ డెన్వర్ లో ముందు రోజు రాత్రి పెద్ద మంచు తుఫాను. దాదాపు రెండు అడుగుల వరకూ మంచు, ఎక్కడ చూసినా కుప్పలుగా. మమ్మల్ని పిక్ అప్ చేసుకున్న అబ్బాయి దాదాపు మూడు గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చాడు విమానాశ్రయానికి , ఆ మంచులో పడి. ఇంటికి చేరే సరికి మాకు లోకల్ టైం ఏ మూడో నాలుగో అయ్యింది. ఆ అబ్బాయి వండిన అన్నం మరియు పప్పు,  అమృతం లా గా తిని పడి నిద్ర పోయాం. చాలా ఆలస్యంగా లేచి విక్రమ్ విక్రమ్ పెప్పరోని అంటే ఏమిటి అంటే,  అది బాగా గుండ్రంగా కోసిన పంది మాంసం ముక్కలు అని చెప్పాడు. అప్పుడు మొదలయ్యింది సుప్రియాకి, కడుపులో అసలు సిసలు యమ్మీ యాక్షన్ . కాబట్టి జనులారా అమెరికాలో, ఈ సమయ మార్పుతో జాగ్రత్తగా వుండండి. మొదటి సారి వెళ్లే టప్పుడు ప్రయోగాలు చేయకండి. బుద్దిగా ఇచ్చిన ముందస్తు సూచనలు  పాటించండి. ఆ కమలాని మరియు శ్రీధర్ గాడిని అసలు నమ్మకండి.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    5 min
  • స్పర్ధయ వర్ధతే విద్య!

    ఉప్పలపాటి ప్రాధమిక పాఠశాలలో మా అక్క సుమతి, రవణమ్మ, హైమావతి, దొరసాని మొదలగు వారు నాకు ఒకసంవత్సరం సీనియర్స్. నిజముగా నాకు గుర్తు లేదు సీనియర్స్ అయిన అబ్బాయిల పేర్లు. కావాలంటే నా క్లాస్ అమ్మాయిల మరియు అబ్బాయిల పేర్లు చెప్పగలను, కరుణాకర్, మురళి, ప్రభాకర్, ఉష, హిమ మరియు జయమ్మ వగైరా వగైరా అని.

    మా సీనియర్ అయిన రవణమ్మకి చాల మంచి పేరు, చక్కని అమ్మాయి అని, బాగా చదువుకుంటుందనియు, మరియు ఆటల్లో కూడా చురుకుగా ఉంటుందని. తాను అవడానికి మా అక్క వాళ్ళ సహాధ్యాయిని అయినా వాళ్ళ తరగతి వాళ్ళకంటే వయస్సులో ఓ సంవత్సరమో లేక ఓ అరో పెద్దదవటం వలన మరియు తరగతిలో చదువుల్లో ప్రధమురాలైనందున సహజంగా తానే వాళ్ళ తరగతి లీడర్. మా అయ్యవారమ్మ ఎప్పుడన్నా మా పిల్ల పీచుల తరగతులకు లెక్కలు చెప్పమంటే ఆ బాధ్యతను నెత్తిన వేసుకొని సమర్థవంతముగా నిర్వర్తించెడిది.

    మా అక్క తరగతి వారంతా బుద్ధిగా ఐదవ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులై, ఆరవ తరగతి మా ఊరికి రెండూర్ల  అవతల వున్న పెదపుత్తేడులోని ఉన్నత పాఠశాలలో చేరిపోయారు. వాళ్లకు జూనియర్స్ మయిన నేను, హిమ ఓ రోజు మనం నాలుగో తరగతిలోనే ప్రపంచాన్నంతా చదివేసాము అని నిశ్చయించుకుని, ఓ ప్రవేశ పరీక్ష రాసేసి, ఐదవ తరగతి ఎగ్గొట్టేసి ఆరవ తరగతిలో చేరిపోయాము.

    అప్పటి వరకు నా చదువులకు పోటీ మా హిమే. కానీ ఇప్పుడు ఆరవ తరగతిలో చేరగానే ఇక నేను పోటీ పడాల్సింది చదువులో కాకలు తీరిపోయిన మా భీష్మి రవణమ్మ తోనే.

    కానీ తాను మాత్రం మా తరగతి పరీక్షలు, యూనిట్ పరీక్షలు, త్రైమాసికాలు, అర్థ సంవత్సర పరీక్షలు మరియు సంవత్సరాంతపు పరీక్షలు అని వచ్చే లెక్కలేనన్ని పరీక్షల్లో తొణకకుండా బెణకకుండా ప్రధమురాలై నిలిచేది.

    మేమందరము మాకు ఆంగ్లము మరియు లెక్కలు బోధించటంలో అపర ద్రోణాచార్యులైన సుబ్రహ్మణ్యం అయ్యవారి వద్ద రెండు పూటలా ట్యూషన్ కి కూడా వెళ్లే వారము. కానీ తాను మాత్రం ఇవేవీ అవసరం లేకుండానే అన్నీ సబ్జక్ట్స్ లో ప్రధమరాలుగానే నిలబడి వార్ ని ఎప్పుడు వన్ సైడ్ చేసి పారేసేది. 

    నా ఏడవ తరగతిలో అనుకుంటా, "రవణమ్మ! నువ్వు రాత పుస్తకాలు ఇంకా కొనలేదు ఎందుకు" అని అడిగిన మా అయ్యోరి ప్రశ్నకు సమాధానంగా ఏమాత్రం భేషజాలకు పోకుండా, జంకు బొంకు లేకుండా, సూటిగా , "హర్ష! వాళ్ళ పొలానికి పనికి వెళ్లిన కూలి డబ్బులు యింకా రాలేదు సార్, అవి రాగానే కొనుక్కుంటాను" అని అని చెప్పింది రవణమ్మ,

    తాను మాకు బడి లేని సమయాల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మా వూరి పొలాల్లో కూలికి వెళ్ళేది అని తెలిసి కూడా నేను మా అయ్యోర్లు ఎప్పుడు చెప్పే, స్పర్దయా వర్ధతే విద్య అనే సూక్తిని వెంబడించి తనతో పోటీకి దిగేవాడను.

    కానీ ఆ రోజు నాకు మా రవణమ్మలో ఒక నాయకురాలు కనిపించింది. కళ్ళనీళ్ళతో దగ్గరకు వెళ్లిన నాకు, నేను ఆంగ్ల భాష నీలాగా చదవాలనుకుంటాను అబ్బాయీ!, నాకు నేర్పవూ! అని చెప్పింది తాను. నేను నీతో పోటీ పడి చదువులో నీ దరిదాపుల్లో వుండగలనేమో కానీ రవణమ్మ, నేను ఎప్పటికీ నీవు కాలేను అని చెప్పాను సిగ్గుపడుతూ. ఇంత చెప్పాక మీకు చెప్పనక్కర్లేదు అనుకుంటా, ఆ సంవత్సరం జరిగిన పబ్లిక్ పరీక్షలలో మా బడికి ప్రధమ స్థానం లో నిలబడినది ఎవరో. 

    నేను ఎనిమిదవ తరగతిలో నెల్లూరుకు వెళ్ళిపోయి అక్కడ మా గుంట బడిలో చేరినా, మనస్సులో నా పోటీ రవణమ్మతోనే, తనకెన్ని మార్కులు వచ్చాయి మరి నాకెన్ని వచ్చాయి అని.  అంటే గుంట బడిలో పోటీ దారులు లేరని కాదు, అక్కడ మహా మహులున్నారు.  ఉప్పలపాటికి వచ్చినప్పుడల్లా మా రవణమ్మని కలిసే వాడిని.

    జీవితంలో ఎంతో ఉజ్జ్వల భవిష్యత్తు ఉండవలసిన మా రవణమ్మకి నేను తొమ్మిదో తరగతిలో ఉండగానే మద్రాసు సంబంధం వచ్చిందని పెళ్లి చేసి పంపించేశారు. నేను వాళ్ళ అమ్మతో తగువు పెట్టుకున్నా ఉక్రోషంతో కళ్ళ నీళ్లు తిరుగుతూ ఉండగా, అంత బాగా చదివే ఒక్కగానొక్క కూతురుని చదివించలేక పోయారా అని. దానికి ఆమె, మా ఇళ్లల్లో ఆడ పిల్లని ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే నాయనా అని నిట్టూర్చారు.

    నా ఆ ఉక్రోషానికి కారణం కల్మషాలు లేని వయస్సు అని, ఆ వయస్సులో  మనం మన పోటీ దారులను మనకి తెలియకుండానే ఎంతో గౌరవిస్తామని.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    5 min
  • స్నేహనాథుడు మా రఘునాథుడు!

    మీరెప్పుడన్నా విన్నారా, "కొత్త బిచ్చగాడు పొద్దెరగడు", "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి", "పిచ్చోడికి పింగే లోకం" లాటి సామెతలు. వినలేదా అయితే సుప్రియని అడగండి, ఇంకా నాలుగు చెప్పి వాటికీ ఉదాహరణ గా నన్ను చూపిస్తుంది.

    నేను అదే పనిగా మా పెదపుత్తేడు జిల్లా పరిషత్ పాఠశాల స్నేహితుల, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల స్నేహితుల, మా వాకాటి ఇంజనీరింగ్ స్నేహితుల గూర్చి రాస్తుంటే తాను నా రాతల్లోని యాంత్రికతను తట్టుకోలేక పై సామెతలు నేను వినేలా పాటల రూపంలో పాడుతుంది యీ మధ్య.

    "నా స్నేహితుల గూర్చి రాయాలంటే పెట్టి పుట్టాలి సుప్రియా!", అని చెబుతూ, వాళ్ళ గురించి నాలుగు ముక్కలు రాసుకుందామని యీ కథ రాస్తున్నా.

    నాకు  ప్రతీ సారి   ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల  అని పదే పదే రాసెడి ఓపిక వున్నా మీకు చదివే సమయము ఉండదు కాబట్టి ఇక మీదటి మనం ఈ బడిని గుంట బడి అని పిలుచుకుందాము.  మా నెల్లూరు సంతపేట గుండా పోయే పాత బైపాస్ రోడ్ కన్నా ఒక ఆరడుగులు లోతులో ఉంటుంది కాబట్టి, మా నెల్లూరు వాసులు ముచ్చటగా దీనికా పేరు పెట్టుకున్నారు. ఈ బడిలో నాకు దొరికిన నాకు దొరికిన ఇంకో స్నేహ నాథుడు మద్దిన రఘునాథుడు.

    నా దృష్టిలో అస్సలకి మా  గుంట బడికే అందగాడు వీడు. వీడి పక పక నవ్వు చాలు స్నేహం చేసేదానికి. మేము ఎనిమిదో తరగతికి వచ్చేసరికే ఎదిగిపోయాడు, ఆపైన వేసేది పొట్టి నిక్కర్లూ. మహా స్టైల్ గ నాలుగు నోట్ బుక్స్ తెచ్చేవాడు బడికి, నో టెక్స్ట్ బుక్స్, నో గాడిద మోత. నేను కూడా ఫాలో అయిపోయా ఆ స్టైల్. కలిసే వెళ్లే వాళ్ళము స్కూల్ కి.

    వాళ్ళ ఇంట్లోనే మా గుంట బడి ప్రధానోపాధ్యాయులు శ్రీ  సుబ్బారావు గారు అద్దెకి వుండే వారు. వాడు ఆయన దగ్గరే సాయంత్రాల పూట చదువులు వెలగబెట్టే వాడు. వీడితో స్నేహమయ్యాక వీడి సిఫారసుతో నేను కూడా ఆయన విద్యాదానం చేసే శిష్య పరమాణువులో చేరిపోయా, నాతో పాటు మా సహాధ్యాయునిలైన ముని మరియు అంజనీ కూడా.

    ఆయన మాకు లెక్కలు, సైన్స్ మరియు ఆంగ్లము బోధించేవారు, కానీ తెలుగు జోలికి వచ్చేవారు కాదు.

    రఘు వాళ్ళ నాన్నగారు వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములు మరియు ముగ్గురు అక్క చెల్లెళ్లు. వాళ్ళను అందరిని పోషించడానికి మరియు ఒకదారి చూపించడానికి రఘు వాళ్ళ పెద్ద నాన్నగారు అయిన పరంధామయ్య గారు, తనకు వచ్చిన ఒక చిన్న పభుత్వ ఉద్యోగాన్ని కాదనుకొని మా సంత పేట లోనే ఒక హోటల్ ప్రారంభించారట చాలా ఏళ్ల క్రితము. 

    ఈ  హోటల్ ని ఆ నలుగురు అన్నదమ్ములు మరియు భర్త చనిపోవటంతో అన్నదమ్ముల వద్దకే వచ్చేసిన రఘు వాళ్ళ పెద్ద అత్త నడిపేవారు. ఆ హోటల్ మా సంతపేట లోని మునిసిపల్ కూరగాయల మార్కెట్ కి ఎదురుగా వుండే పరంధామయ్య హోటల్. అక్కడ దొరికే దోశె మరియు పాయా కూర కలిపి తింటే స్వర్గానికి బెత్తెడు దూరం లో ఆగిపోవొచ్చు అని మా నెల్లూరు వాసులు చెప్పుకుంటారు.

    మా స్నేహితుడు, గుంటబడి బడి విద్యార్ధి, మా సంతపేట నివాసి అయిన ప్రతాప్ గాడికి  రోజుకి ఒక రూపాయ ఇచ్చేవారు ఇంట్లో టిఫిన్ కి. అది తీసుకెళ్లి అక్కడ దోశె పాయ తిని నాకు వర్ణించి వర్ణించి చెప్పేవాడు. నాకేమో నోరు ఉరిపోయేది, కానీ రూపాయ ఎత్తుకు వెళ్లి టిఫిన్ తినే బడ్జెట్ నాకు లేదు. మా ప్రతాప్ గాడు నాకు  చెప్పే వాడు, వాడు తినే టిఫిన్ విలువ రూపాయున్నర అని, రఘు వాళ్ళ నాన్న గారు కౌంటర్ లో వుంటారు కాబట్టి వాడికి అర్థ రూపాయ కన్సెషన్ అని. 

    ఒక రోజు నాకు ప్రతాప్ గాడికి గొడవ జరగటం, నేను ఇది మా రఘు గాడికి కుట్టెయ్యటం, వాడు నాకు ప్రామిస్ చేయటం జరిగిపోయాయి, "రేయ్ హర్షాగా! ఇక చూసుకుంటారా వాడి సంగతి. నేను కౌంటర్ లో ఉంటే వాడి చేత రూపాయిన్నర కక్కిస్తానురా" అని. రఘు గాడు ప్రతాప్ గాడు చాలా దగ్గర బంధువులు, అందుకే మా ప్రతాప్ గాడికి వాళ్ళ హోటల్ లో కన్సెషన్. అయినా మా వాడి ప్రేమ నా పట్లే.   

    మేము తొమ్మిదవ తరగతిలో వున్నప్పుడు అనుకుంటా, రఘు వాళ్ళ చిన్న మేనత్త వాళ్లకు చెందిన

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    6 min
  • లక్ష్మి, లేకపోవటం చాలా చేదు నిజం!

    నాన్న వాళ్ళది ఉలవపాళ్ళ. నేషనల్ హైవే లో నెల్లూరు నుండి కావలికి వెళ్తుంటే సున్నబ్బట్టి , అల్లూరు గేట్ దాటిన తర్వాత హైవే నుండి ఒక కిలో మీటర్ లోపలి కెళ్ళాలి. ఒకప్పుడు బిట్రగుంట లోకో ఇంజిన్ మైంటెనెన్సు కి ఫేమస్. ఆ చుట్టు పక్కల ఊర్లలో సగం మంది రైల్వే ఎంప్లాయిస్. డ్రైవర్స్, ఫిట్టర్స్, గ్యాంగ్ మెన్ ఎవరి అర్హతల్ని బట్టి వారు ఆ చుట్టుపక్కల గ్రామాలనుండి బాగా సర్వీసెస్ లో వుండే వారు. మా తాత గారు కూడా అక్కడ ఫిట్టర్ . పక్కా కమ్యూనిస్ట్. ప్రజాశక్తి న్యూస్ పేపర్ చదవటమే కాక పది మందికి రోజూ చదివి వినిపించనిదే ఆయనకు నిద్ర రాదు. పుచ్చలపల్లి సుందరయ్య కి అనుంగు శిష్యుడు. ఆయనంత పెద్ద లీడర్ కావాలని మా నాన్న పేరు కూడా సుందర రామయ్య అని పెట్టారు. మా ఊర్లో పిల్లకాయలకి పేర్లు కూడా కొంత వింతగా పెట్టేవారు. రాజమ్మ హాస్పిటల్ లో పుట్టాడని మా తమ్ముడి పేరు రాజా రామయ్య , మా మా మేనత్త కొడుకుల పేర్లు భాస్కరయ్య , గోపాలయ్య. ఎందుకంటే వాళ్ళు మా మేనత్త కడుపు తో వున్నప్పుడు చూసిన వైద్యులు . ఆలా ఉండేవి వాళ్ళ కృతజ్ఞతలు అలాగే వైద్యులను దేవుళ్ళలాగా చూసే విధానం.

    మా వూరు లో చాలా మంది రైల్వే ఉద్యోగులు, రైతులు అలాగే బిట్రగుంటలో వ్యాపారాలు చేసుకొనే వారు. చాలా మటుకు బొంతరాయి గోడలమీద పెంకులతో ఇళ్ళు కళ కళ లాడుతూ ఉండేవి. మా ఊరి చెరువు రామన్న చెరువు , చేపలకి చాల ప్రసిద్ధి . ఊరులో బలిజ వీధి, రెడ్ల వీధి , గొల్ల వీధి , సాలె వీధి. వూరికి కొంత దూరంగా మాలాడ, మాదిగ వాడ.  ఒకప్పటి టిపికల్ విలేజ్ స్ట్రక్చర్. ఎవరి వృత్తులు వారివే. మా తాత కమ్యూనిస్ట్ అన్నాను కదా అందుకే మా నివాసం రెడ్ల వీధిలో కాదు, బలిజలందరి మధ్య. ఇక్కడ నేను కాస్ట్ డివిజన్ గురుంచి మాటలాడటం లేదు. వాళ్ళ మధ్య వున్న యూనిటీ గురించి చెప్తున్నా. మా అమ్మ పిల్లలందరికీ చదువు చెప్పేది మాతో పాటు. పిల్లలకు మా గేదె పాలు ఒక గ్లాస్ ఫ్రీ. మాకు ఒక ఐదు ఎకరాల తోట ఉండేది. వేరుసెనగ మరియు మిరప ఎక్కువగా పండించేవాళ్ళము. ఇతర పంటలుగా గోంగూర, వంగ, బెండ మొదలగునవి వేసే వాళ్ళము. ఈ ఇతర పంటలు అమ్మకానికి కాదు. కోసి ఇంటికి తీసుకొస్తే ఎవరైనా తీసుకెళ్లొచ్చు. అమ్మ ఎవరికీ అడ్డు చెప్పేది కాదు. అందుకే చుట్టుపక్కల వాళ్లందరికీ మా అమ్మ అంటే చదువుకున్నది, పిల్లలకి నాలుగు చదువు ముక్కలొస్తున్నాయని, తన దగ్గర ఉంటే సహాయం అడగ కుండానే వస్తుందని వాళ్ళ ఇంట్లో మనిషిగానే వుండే వారు.

    మా ఇంటి పక్కలంతా మామిడాల వాళ్ళు, కేశాని వాళ్ళు, అక్కిశెట్టి గారు, పూలశెట్టి వాళ్ళు. మా వూర్లో ముందు ఇంటిపేర్లే చెప్పాలి. ఎవరబ్బాయివిరా అంటే మామిడాల వాళ్ళ అబ్బాయిననో, అక్కిశెట్టి గార్ల పిల్లోడిననో చెప్పాలి దాన్ని బట్టి ఏ కులమో కనిపెట్టేస్తారు. నేను ఆదిరెడ్డి మనవడిని అంతే. ఎవరన్నా ఎవర్రా నువ్వు అంటే నా దోస్తులు ఆదిరెడ్డి మనవడు అని చెప్పేవారు. మా వూర్లో గుడులకు కూడా కొదవ లేదు. ఒక రామాలయం , ఒక కామాక్షమ్మ గుడి, ఒక ఆంజనేయస్వామి గుడి. వూరికి ముందు ఒక వాగు వూరికి వెనుక రామన్న చెరువు. ఆ వూర్లో మా పిల్లకాయలు ఆడిందే ఆట పాడిందే పాత. ఎక్కడ నీళ్లుంటే అక్కడే మా ముడ్లు కడగటం, ఆడటం. వాగులో నీళ్లుంటే వాగు పక్క, చెరువులో నీళ్లుంటే చెరువు పక్క. ఛాయస్ మాదే.

    నాకు ముగ్గురు దోస్తులు. మామిడేలా కిష్ట, అక్కిశెట్టి శేషగిరి, గుడిపూజారి కొడుకు స్వామి. కిష్టకి అమ్మ లేదు చనిపోయింది. నాన్న వెళ్ళిపోయాడు ముగ్గురు పిల్లల్ని వాళ్ళ తాత కి వదిలేసి. తాతేమో అమ్మమ్మ చనిపోతే ఇంకో ఆవిడని చేసుకున్నాడు. ఆవిడ పేరు పద్మావతమ్మ . ఆవిడే వీళ్ళ ముగ్గురుని చూసుకొనే వారు. ఆవిడకి కిష్ట వాళ్ళ తాత వలన లక్ష్మి అని ఒక పాప . మాకన్నా రెండేళ్లు చిన్న. మాకు ఆరేళ్ళు ఉంటే ఆ పాపకి నాలుగేళ్లు. లక్ష్మి , మా తమ్ముడు రాజా ఐకే వయస్సు. ఆటలు పాటలు వాళ్లొక బ్యాచ్.

    ఒక రోజు కిష్ట, స్వామి సాయంత్రం మూడు అప్పుడు వచ్చారు తోపులోకి వెళదామని అంటే చెరువు వైపు. నాకెందుకు తోపులో చింత చెట్లు దెయ్యాల్లా ఉంటాయి, అందుకని నేను వాగుకి వెళ్ళడానికి ఇష్టపడతా. నేను రాను అన్నా, కానీ వాళ్ళు ఇద్దరు నేను ఒకడిని. అందులో చెరువు లోకి నీళ్లు అప్పుడే వస్తున్నాయి. నీళ్ళల్లో ఆడొచ్చు అని. ఎప్పుడూ మాతో రాని లక్ష్మి ఆ రోజు వెంటబడింది నేను వస్తా అని. వొద్దని రానివ్వలేదు. ఐనా వెంటబడితే వాళ్ళింట్లో దింపొచ్చాము. కానీ ఇంట్లో కళ్లుకప్పి మా వెంట వచ్చేసింది. తీసుకెళ్ళాం.

    అక్కడ నీళ్లను చూస్తే మాకు పూనకం వచ్చేసింది. అక్కడ అప్పటికే ఓ పది నుండి పదిహేను వరకూ చిన్న చితక పిల్లలున్నారు. వాళ్ళల్లో కలిసిపోయాం. అసలు లక్ష్మి మా వెంట వచ్చిందనే స్పృహే లేదు మాకు. ఆడాం ఆడాం అలిసిపోయే వరకు. వచ్చేస

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    7 min
  • ట్రాఫిక్ తో ఆత్మ సాక్షాత్కారం!

    మొన్ననగా వెళ్లారు సుప్రియ మరియు పిల్లకాయలు, జూబిలీ హిల్స్ లో వాళ్ళ అక్క వాళ్ళింటికి. నేనెళ్ళి నసపెట్టి తీసుకురాక పోతే, వాళ్లకు నేనొకడ్ని వుండానని గుర్తుకే రాదు. టాకీ టౌన్ దగ్గర హైవే 65 మీదకి ఎక్కా, ట్రాఫిక్ స్మూత్ గానే ఉండడంతో కొంచెం స్పీడ్ పెంచా, అంతలోనే మియాపూర్ బస్సు స్టాండ్ దగ్గర, ఒక గుంపు రోడ్ ని అడ్డంగా దాటుతూ, అందులోనూ ఒకడు చెయ్యెత్తి మరీ, మీ వెహికల్స్ అన్నీ ఆపండెహె అన్నట్టు. నాలుగడుగులు ముందుకేస్తే,  మియాపూర్ సర్కిల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి వుంది, లిఫ్ట్ కూడా ఉందిగా, ఏమి మాయ రోగం వీళ్ళకి రోడ్ కి అడ్డం గా దాటక పోతే అనుకుంటూ, విసుగ్గా వెహికల్ స్లో చేసి వాళ్ళు దాటాక ముందుకు కదిలా. జె.ఎన్.టి.యూ సిగ్నల్ దాటాక ఎర్రగడ్డ మీద కాకుండా అయ్యప్ప సొసైటీ మీద వెళదామని, విశ్వనాథ సినిమా దాటాక వచ్చే యూ-టర్న్ తీసుకుందామని రైట్ ఇండికేటర్ వేసి యూ-టర్న్ తీసుకుంటున్నా, ఇంతలో ఓ బండోడు స్కూటర్ లో నా వెహికల్ కి, మెట్రో పిల్లర్ కి, వుండే గ్యాప్ లో నాతో పాటు పార్లల్ టర్న్ తీసుకోవాలని దూరుతున్నాడు, ఆడిని దూరనివ్వకూదని ఆ గ్యాప్ ని ఇంకొంచెం నారో చేస్తూ టర్న్ తీసుకున్న. ఎప్పుడు నేర్చుకుంటారో ఈ వెధవలు ఒక వెహికల్ టర్న్ తీసుకునేటప్పుడు పార్లల్ గా టర్న్ తీసుకోకూడదు అని తిట్టుకుంటూ ముందుకెళ్లా.

    జె.ఎన్.టి.యూ దగ్గర, రైతు బజార్ దగ్గర, మంజీరామాల్ కి ముందు, ట్రాఫిక్ బాగానే వుంది కానీ, ఒక్క సారి ఫ్లై ఓవర్ ఎక్కగానే కాస్త తగ్గింది ట్రాఫిక్. ఎలాగూ ఆ ఫ్లై ఓవర్ దిగాక ఆ ఎదవ మలేషియన్ టౌన్ షిప్ దగ్గర ట్రాఫిక్ తప్పదు అనుకుంటూ ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న, అంతలో నా ముందు ఒక డొక్కు ఆర్.టి.సి బస్, ఎడమ లేన్ నుండి నా లేన్ లోకి ఏమాత్రము ఇండికేషన్ లేకుండా వచ్చేస్తున్నాడు. ఒరే నేనున్నాను రా! ఈ లేన్ లో ఆల్రెడీ, నన్ను వెళ్లనివ్వరా, నేనెందుకు ఆగాలిరా నీకొసం, అనుకుంటూ వాదుగా ముందు కెళ్లాలని చూశా . వాడిదేం బోయా!  సగం బస్ నా లేన్ లోకి తెచ్చేసాడు. ఎంజేద్దాం! బస్సుతో పెట్టుకుంటే పడేది మనకే బొక్క అనుకుంటూ ఆగక తప్పలా నాకు.  జూబిలీ హిల్స్ కి చేరేసరికి ఇటువంటివే మరల మరల పునరావృత్తమవుతూ నా ఓపిక తినేసాయి. ఉసూరుమంటూ సుప్రియా అక్క వాళ్ళింటికి చేరేసరికి, అక్కడ నాకు వాళ్ళు మేము సెకండ్ షో కి వెళ్తున్నాము , నీతో ఇంటికి రాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నీకీ మాత్రం చెప్పటమే గొప్ప అన్న విధంగా. కావాలంటే భోజనం పెడతాం తిని ఇక్కడన్నా తొంగో లేక ఉదయాన్నే నీ ఆఫీసుని ఉద్ధరిద్దామని అనుకుంటే ఇప్పుడే కొంపకు పో అని ఆఫర్ ఇచ్చారు. చూడు నాకు మా అక్క చాలా మూటా ముల్లె ఇచ్చింది, అది మన ఇంటికి రావాలంటే నీ వెహికల్ వొదిలేసి వెళ్ళు, నేను రేపు ఆ మూటా ముల్లె వేసుకొని వస్తా అని అల్టిమేటం ఇచ్చింది సుప్రియా,.

    సరే నా కొంపకు పోయి, నే హాయిగా ఉంటా అని అనుకోని, వాళ్ళ అక్కకొడుకుని అడిగా, నన్ను మెయిన్ రోడ్ దాకా డ్రాప్ చేయరా బాబు అని. వాడికి సినిమా టైం అవుతుంది , స్కూటర్ లో అయితే తొందరగా డ్రాప్ చెయ్యొచ్చు అని స్కూటర్ తీసాడు. తెలివిగల్లోడు వాడు నా నస తప్పించుకోవొచ్చు అని నన్నే డ్రైవ్ చేయమంటారు ఎప్పడూ. సరే బయలు దేరాం యూ-టర్న్ ని సర్రుమని కార్ కి పిల్లర్ కి మధ్య గాప్ లో పార్లల్ గా తిప్పేసా. మా వోడు బాబాయ్, అలా తిప్ప కూడదు అంటూ మొదలెట్టాడు ,సర్లే రా ఆ బండ కారోడు వాడిదే పెద్ద కారు అనుకుంటూ ,అంత పెద్ద టర్నింగ్ రేడియస్ తీసుకుంటూ ఉంటే, మనకి టైం అయిపోవటంలా అంటూ దూసుకెళ్లిపోయా. వాడు వాడి  తలకొట్టుకోవటం మిర్రర్ లో కనిపించింది. మెయిన్ రోడ్ లో దింపి వాడు సక్కా బోయాడు ఎనక్కి తిరగకుండా.

    ఇంతలో లింగంపల్లి బోయే బస్సు వచ్చింది, ఎక్కేసా. విండో సీట్ దొరికింది, ఏసీ బస్సు కావటంతో సౌలభ్యంగా వుంది. ఆహా! హాయిగా వుంది ప్రయాణం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జిందాబాద్, ఒక్క బస్సు నలభై మందిని తీసుకెళ్తుంది అంటే పది కార్లకి సమానమబ్బా, దీనికి రోడ్ మీద మహారాజ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవడైనా , ముందు బస్సు తర్వాతే ఏదైనా, కార్లైనా గీరైనా అని ఆలోకాహ్నాలలో మునిగిపోయా. ఇంతలో మా వోడు పక్క లైన్ లోకి తిరుగుతున్నాడు, ఎనక నుండి కారోడు భయ్ మంటూ హార్న్ కొడుతున్నాడు. బుద్దిలేనోడా! నీ కారేంత బే, అందులోను అన్నీ బస్సులకు ఇండికేటర్స్ వుండవు, బస్సుల బ్లైండ్ స్పాట్ చాలా పెద్దది, అస్సలకి నువ్వు వెనకున్నవని ఎవడికి ఎరుక బే , ఐన ఈ జనాలెప్పటికీ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    6 min
  • నా స్నేహితుల కథా క్రమం లో మా సుబ్బూ గురించి!

    నేను కథలు రాయాలనుకున్నప్పుడు, మొదట స్నేహితుల గురుంచి రాద్దామనుకున్నాను. కానీ ఇలా రాయటం లో తెలియని ప్రమాదముంది. మొదట యీ రాయటం సరదాగా మొదలయినా, పోను పోను అవి నా అభిప్రాయ వ్యక్తీకరణ సాధనాలుగా మారుతాయేమో అన్నది నా భయం. అప్పటికీ నేను నా స్నేహితులతో వాదించవచ్చు ఈ కథ నేను నా కోణంలోనుంచి మాత్రమే రాస్తున్నాను అని. అలా వాదించటం నన్ను నేను మోసం చేసుకున్నట్టే అవుతుందేమో. కాబట్టి నాకు తెలిసినంత వరకూ తటస్థం గానే రాస్తాను. మా శ్రీధర గాడు మాత్రం దీనికి మినహాయింపని మీకిది వరకే బోధపడిందను కుంటా. వాడో మంచి స్నేహితుడు మరి. ఈ కథ నా ఇంకో స్నేహితుడు సుబ్రహ్మణ్యం గురుంచి.

    నేను, సుబ్రహ్మణ్యం మరియు చంద్రశేఖర్ మా వాకాటి కాలేజీ వుండే విద్యానగర్ అనే పల్లెకి ఎక్కువ, పంచాయితీకి తక్కువ లాటి ఊర్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరపు కాలంలో రూమ్ మేట్స్ మి. ఆ వూర్లో పేరుమోసిన ఆర్ట్స్ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో రూమ్స్ కి డిమాండ్ ఎక్కువే. ఆ ఊరి మోడల్ హై స్కూల్ లో పని చేసే గరటయ్య అనే లెక్కల మాస్టారు, కోటలో పని చేసే మా బావకి స్నేహితుడు కావటం మూలాన, మా బావ కోరికతో, ఆ మాస్టారు మాకు రూమ్ అని ఏకోశానా గుర్తింప మనస్కరించని ఓ సగం కూలి వంగిపోయిన కప్పుగల ఒక పూరి గుడిసె చూపించి పుణ్యం మూటకట్టుకున్నారు. మరి మేము ముగ్గురము ఎలా రూమ్ మేట్స్ మి అయ్యామంటే, చంద్రశేఖర్ గరటయ్య మాస్టారి ప్రియ శిష్యుడు మరియు మా సుబ్రహ్మణ్యం యొక్క చెడ్డీ మిత్రుడు, నన్ను గరటయ్య మాస్టారు వీళ్ళతో కలిపాడు. మా చంద్రశేఖరుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాదు, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి. మేము ఆ గుడెసెనే దేవాలయంగా ఆ ఓనరమ్మనే దేవత గా కొలిచాము. మరలా అప్పుడప్పుడూ ఆవిడ రూమ్ ని నీట్ గా పెట్టామా లేదా అని ఇన్స్పెక్షన్ కి వచ్చేది. ఆవిడకి మా సుబ్బూ మాట అంటే తెగ గురి, చదుకొని బాగుపడే లక్షణాలు ఉన్నాయని.

    కానీ మా సుబ్రమణ్యాన్ని చూసాక అసలు ఒక వ్యక్తి ఇంతలా చదువుతాడా అన్న ప్రశ్నకి సమాధానం ఇప్పటికీ దొరకలా. స్వయం పాకం చేసుకునేవాడు. ఉదయం లేచి స్టవ్ మీద అన్నం పెట్టి, అది అయ్యేలోపల చదువుతూ, చదివినది పలక మీద పర పరా రాస్తూ మొదలెట్టి, మరలా కాలేజీ నుండి వచ్చాక అన్నీ సబ్జెక్టులు, అన్నీ టెక్స్ట్ బుక్కులు, ఆ బుక్కుల్లో అన్నీ పేజీలు చదివేసే వాడు, చదివింది మరలా యధావిధిగా పలక మీద పర పరా రాసేసేవాడు. మా గుడిసెలో ఒకే బల్బ్ హోల్డర్ వుండేది కాబట్టి మా చదువులన్నీ ఒక దగ్గరే. చాలా శ్రద్దగా చదివే సుబ్రహ్మణ్యం అవతలి వాడు చీమని చిటుక్కుమనిపించినా చిరాకు పడిపోయేవాడు. నాకది చాలా వింతగా వుండేది మరియు వాడిని ఇరిటేట్ చేయడానికి సాధనంగానూ కూడా. నేను కూడా అప్పుడప్పుడు కొంచెం పెద్దగా చదువుతూ వాడిని గీరే వాడిని తగువుకి.

    సుబ్రహ్మణ్యం నాయుడుపేట మండలంలో ఓజిలి దగ్గరైన అన్నమేడు గ్రామస్థుడు. మొదటి నుండీ అన్నీ తరగతుల్లో ప్రధముడే. వాళ్ళ నాన్నగారు వాడికి ఊహ రాక ముందే గతించడంతో, తన ఇద్దరి పిల్లల్ని వాళ్ళ అమ్మగారు తన రెక్కల కష్టంతో చదివించుకుంటున్నారు. వీడు మూడు వారాలకో లేక నెలకొకసారో సైకిల్ మీదనే వాళ్ళ ఊరెళ్ళి తనకి కావాల్సిన సామగ్రి తెచ్చుకొనే వాడు. వాడి ధ్యాస అంతా చదువే. నాకు మొదటి నుండీ ప్రశ్న-అర్ధకమే, వీడు మా వాకాటి కాలేజీలో ఎలా పడ్డాడురా నాయన శాపవశాత్తూ, ఎక్కడో ఐ.ఐ.టి లో ఉండాల్సినోడు అని. అలా చదవటమే తిండీ నిద్రలాగా భావించే మా సుబ్రహ్మణ్యం మొదటి సంవత్సరంలో మా కాలేజీకి ప్రధముడిగా నిలిచాడు. మా కాలేజీ మా యూనివర్సిటీలో చదువుల్లో మేటి కాబట్టి, మా యూనివర్సిటీకి ప్రథముడు వాడు. మాకూ ఎదో గుర్తింపు యూనివర్సిటీ ప్రధముడి రూమ్ మేట్ గా. కొందరు చదువుల ఔత్సాహికులు వాడితో పాటూ నాతో మాట మంతీ కలిపేవారు, మా సుబ్రహ్మణ్యం రాంక్ యొక్క రహస్యం చెప్పమని. అక్కడ రహస్యమేమీ కనపడలా నాకు అస్సలు సాధ్యం కానీ కఠోర శ్రమ తప్ప.

    సుబ్బూ చదువు చూసి ఉత్తేజితుడైన మా చంద్రశేఖరుడు కూడా నా మడత కూడా పడని మరియు కొత్త కరుకులా మిగిలిపోయిన ఇంజనీరింగ్ మెటీరియల్ నాచేతనే తెప్పించుకొని, మా చేత సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఎంసెట్ లో రాంక్ తెచ్చుకొని తదుపరి సంవత్సరం ఇంజినీరింగ్ లో చేరటం మాకు మిగిలిన గొప్ప అనుభూతి. కానీ ఇలా చదివే సుబ్బుని నేను రెండవ సంవత్సరంలో భరించలేక మా శ్రీధరగాడితో కలిసి వేరే రూమ్ కి మారిపోయి ఊపిరిపీల్చుకున్న.

    నాకు మా సుబ్బూ మీద మొదటి నుండి చివరి వరకూ ఓ ఫిర్యాదు లేక ఓ మనస్తాపం ఉండేది. మా బోటి వాళ్ళము మాకొచ్చిన అరాకొరా విజ్ఞానంతోనే, ఎవరైనా స్నేహితులొచ్చి ఏమన్నా సందేహాలు అడిగితే, పరీక్షా సమయంలో కూడా, మేము చదివేది పక్కన పెట్టి వాళ్ళ సందేహాల్ని నివృత్తి చేయ ప్రయత్నించే వాళ్ల

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    13 min
  • మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!

    నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది , కళ్యాణం రెడ్లది ఇలా అన్న మాట. ఉభయం ఎవరిదైతే ఆ రోజు దేవుడి అలంకరణ , అన్న ప్రసాదాలు , వినోదాల ఏర్పాట్లు వాళ్లవే. మా వూరు అంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ వూరు. అమ్మమ్మ వూరు అంటే ఆత్మ బంధువుల వూరు అంటారుగా. ఈ ఉభయాల సందర్భం గా జరిగే వినోద సమర్పణలో మేము ఎదురు చూసేది రికార్డింగ్ డాన్స్, కీలు గుర్రాలు, నెమలి వేషాలు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రము ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం, ఈ లోపల డాన్స్ పాపలు వచ్చారా అని ఎంక్వయిరీ లు చేయటం, కుతూహలం చంపుకోలేక జట్లు జట్లు గ పిల్ల కాయలం వెళ్లి వాళ్ళు బస చేసిన ఇంటి చుట్టూ గిరికీలు కొట్టటం . ఈ లోపల ఎవడో పిల్లకాయ చెప్తాడు, నేను చుశానురా డాన్స్ పాపని కిటికీ తొర్రలోంచి అని. వాడు కన్ఫర్మ్ చేయగానే హమ్మయ్య అని తృప్తి పడటం.

    చీకటి పడగానే మొదలయ్యేది వాళ్ళ ఊరేగింపు, బస దగ్గర నుండి గుడికి. కీలు గుర్రాలు , నెమలి వేషాల వాళ్ళు, రికార్డిండ్ డాన్స్ ట్రూప్ లు, దారి పొడవునా వాళ్ళతో పెట్రోమాక్ లైట్స్ వెలుగులో మేము. మొదట కీలు గుర్రాల ఆట, తర్వాత నెమలి వేషాలు, ఆ తర్వాత అసలు సిసలు రికార్డింగ్ డాన్స్ లు. ఈ రికార్డింగ్ డాన్స్ లకు నార్మల్ గా స్టేజి, ట్రాక్టర్ తొట్టి. మొదట డాన్స్ లన్నీ క్లాసికల్ పాటలకి. కుర్రాళ్ళు మాత్రం అసహనంతో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండేవారు. తర్వాత ఏమి జరగబోతుందో తెలిసినట్టు కొందరు ఊరు పెద్దలు మర్యాదగా తప్పుకొనే వారు. అప్పుడు మొదలయ్యేవి నా సామీ రంగా! పుట్టింటోడు తరిమేశాడు డాన్స్ లు. వాళ్ళు రెచ్చిపోవటం కుర్రకారు రెచ్చిపోవటం. డాన్స్ వేసే ట్రూప్ లో మొగ వాళ్ళని నెట్టేసి మా ఉరి మొగ జనాలే, ఆ డాన్స్ పాపలతో డాన్స్ లు. మిగతా రోజుల్లో ఉండేవి హరి కథ కాలక్షేపాలు, బుర్ర కథ లు. కానీ మాకు అవి ఎక్కవే. మాది అంత డాన్స్ పాపల పార్టీ అయ్యే.

    ఇక కళ్యాణం అయినా మరునాడు వసంతోత్సవాలు, మాకు గుర్తుండే రోజు. ఊరు ఊరంతా వసంతాలు (హోళీ లాగ) పోసుకొనే వాళ్ళు. వరసైన వాళ్ళుంటే, కుర్ర కారుకి ఆ మజానే వేరు. ఇక మాకు పిల్లల కి పంటలు వచ్చే కాలం లో వచ్చే వినోదాలు చాలా వున్నాయి. ఎలుగు బంటిని తీసుకొని ఊరూరా తిరుగుతూ, వాటితో విన్యాసాలు చేయిస్తూ వచ్చే వారు కొందరు. కొందరు కాటి పాపలు అంటూ వచ్చేవారు, చిన్న చిన్న మేజిక్ ట్రిక్స్ చేస్తూ, వాళ్ళ చేతుల్లో గోలీలను మాయం చేసి మా ముక్కుల్లోంచి తీస్తూ బాగా వినోదం పంచేవారు. వాళ్ళ వెంట వీధులన్నీ తిరుగుతూ మేము. తర్వాత ఏమాల స్వాములని వచ్చేవారు గుర్రమెక్కి. సాయంత్ర మైతే పసుపు బట్టలతో తయారయ్యి స్వామిలా గుర్రమెక్కి ఊరి వీధుల్లో వూరేగేవారు. వాళ్లకి హారతులు ఇస్తూ ఇళ్ల ముందు, వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ధాన్యం ఇచ్చేవారు ఊరి జనాలు. అలాగే హరి దాసులు. వీళ్ళు చూసేదానికి చాలా చక్కని వారు. మెడలొ హారాలతో నెత్తి మీద బంగారు రంగు పాత్రతో, హరిలో రంగ హరి అంటూ వీధి వీధికీ తిరుగుతూ వీళ్ళ వెంట మేము. అలాగే శంఖం ఊదుతూ వెట్టి వాళ్ళు వచ్చే వారు. అంత బార్టర్ సిస్టమే. ఇచ్చేది డబ్బులు కాదు, ధాన్యమే.

    వరినాట్లుకి వరికోతలకు ఉత్తరాది వారు అంటూ పనికి వచ్చి అవి అయ్యేవరకు మా గ్రామము లోనే బస చేసే వారు. వాళ్ళని డబ్బుల కూలీలు అనే వాళ్ళం. మాకు విశాలమైన కొట్టాలు ఉండటం తో ఎక్కువమంది మా కొట్టాలలో వుండే వారు. వాళ్ళ భాషలు, వాళ్ళ వంటకాలు, వాళ్ళ పాటలు ,మా పిల్లలకి ఎప్పుడు వింత, ఎప్పుడు మహా ఆసక్తి. పంటలు కోసేసాక పొలాల్లో రాలిపోయిన గింజల్ని మేపుకోవడానికి బాతుల వాళ్ళు వచ్చే వారు. వాళ్ళ నివాసాలు పొలాల్లోనే. వాటి వెంట పడి ఆడటం మాకు సరదా.


    అలాగే మా చుట్టూ పక్కల ఊర్లకంతా మా ఊరికి ఒక నాలుగైదు మైళ్ళ దూరం గొట్లపాళెం లో గౌతమి టాకీస్ అనే టూరింగ్ టాకీస్. సినిమాకి ఎద్దుల బండి కట్టించుకొని వెళ్ళటం లో హాయి అనుభవిస్తే కానీ అర్థం కాదు. దగ్గర దగ్గర కెళ్ళి నప్పుడు ఇంకా నమో వెంకటేశా! నమో తిరుమలేశా! అనే పాట ఇంకా వస్తుంటే ఆట ఇంకా మొదలు కానట్టు. లవకుశలు, పాండవ వనవాసాలు, నర్తన శాలలు, మాయా బజారులు వ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    5 min
  • ఉజ్జ్వల మైత్రి అనుబంధం కి నాంది!

    మా సూరిని తీసుకు రావటం, వాడిని రీహాబిలిటేషన్ సెంటర్ లో చేర్చటం మరియు వాడు కూడా బుద్ధిగా చికిత్సకు సహకరిస్తూ వుండడటంతో మా మిత్రబృందపు ఆత్మ విశ్వాసం ఇనుమడించింది, మనము కూడా అనుకున్నపనులు అనుకున్నట్టుగా సాధించగలం అని.

    ఈ లోపల మాతో వాకాటిలో చదివిన ఇంకో మిత్రుని అమ్మగారికి శస్త్ర చికిత్స అవసరం అయ్యింది, మా వాడు కూడా ఉద్యోగం మారే సంధికాలంలో ఉండటంతో ఇన్సూరెన్స్ ద్వారా అందవలసిన సహాయం అందక పోవటముతో ఇబ్బందుల్లో పడిపోయాడు. ఈ విషయం తెలిసిన మా ప్రశాంత్ గాడు స్పందించి మా అనీల్గాడిని కార్యరంగంలోకి దిగమని ఆజ్ఞాపించటం, మరియు మా వాడు మా వాళ్ళందరినీ కదిలించటంతో ఒక వారం లోపే చికిత్సకు కావలసిన రమారమి ఓ పది లక్షలు, ఇంక వొద్దురా నాయనా చాలు ప్రస్తుతానికి అనే దాకా మా వాళ్ళు చక చక సర్దేసారు.

    ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలాగా అందిన సహాయం మా వాళ్ళ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది, అవును అవసరాలలో వున్న మన స్నేహితులనందరినీ ఆదుకోవోచ్చు అని. దానితో పాటు ఎన్నో ఆలోచనలు, వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఏమేమి ప్రాధమిక అవసరాలు పరిగణలోకి తీసుకోవాలి, కేవలం స్నేహితుల ఆరోగ్య సమస్యలేనా, లేక కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు కూడానా, లేక పిల్లల చదువులు కూడా పరిగణించాలా, బదులు తీర్చే నిబంధన తోనా లేక గ్రాంట్ రూపం లోనా, ఇటువంటివి అన్నిటికీ ఒక రూపం రావాలంటే ఒక కార్యనిర్వాహక బృందం ఏర్పడాలి అని నిశ్చయించారు.

    ఈ లోపల మా కాలేజీతో సంబంధ బాంధవ్యాలు నెరుపుతున్న మిత్రులకి మా కాలేజీ తరపున మా బృందం కాలేజీని వొదలి ఇరవై ఐదేళ్లు అయిన సందర్భముగా జరపబోయే రజతోత్సవానికి  రమ్మని ఆహ్వానము అందినది. ఈ ఆహ్వానాన్ని అందిపుచ్చు కొని వీలు అయినంత మందిమి కలవాలని నిశ్చయించారు. మా ముందు బ్యాచ్ వాళ్ళు ఒక ఎనభై మంది వరకు అట్టి సమ్మేళనంలో కలిసారని మా సీనియర్ అయిన బాలాజీ ద్వారా తెలియటం తో మేము కనీసం ఒక నూట ఏభై మందిమైనా కలిసి మా బ్యాచ్ యొక్క ప్రత్యేకతని నిలబెట్టుకోవాలని తీర్మానం చేసేశాము. 

    వీటి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి అందరం ఒక మూడు నెలల ముందే మా నారాయణగాడి నిర్మాణ సంస్థలో వాడి కార్యాలయం లో ప్రతి రెండు ఆదివారాలొకొక సారి సమావేశాలు నడపాలని నిశ్చయించారు. అలా సమావేశానికి వచ్చిన వారికి మా నారాయణుడు ఇడ్లీలు, పొంగలి, వడలు, అటుపిమ్మట ఓ మంచి కాఫీ తో సత్కరించాలని హుకుం జారీ అయిపోయాయి. అలా మొదలైన మా సమావేశాలకి మా ఎన్.ఆర్.ఐ మిత్రులు వీడియో కాల్ లో కలిసేవారు.

    రజతోత్సవం రోజున మా కాలేజీ లో కలిసి, సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొని, అటు పిమ్మట ఆ సాయంత్రానికి తిరుపతి చేరుకొని, ఆ రాతిరి  మరియు మరుసటి రోజంతా మా సంబురాలు జరుపుకొని అటుపిమ్మట మరలా ఎవరి మానాన వాళ్ళం వాళ్ళ వాళ్ళ ఊర్లకు చేరుకునేలా పథకం వేసేశాము.  ఈ పథకాన్ని చిన్న చిన్న పనులుగా విభజించి, ఒక్కో పనికి ఒక్కొరిని బాధ్యుల్ని చేసి ఆ పనులు ఎలా సాగుతున్నాయి చూడడానికి రెండువారాలకొకసారి సమావేశం అయ్యేవాళ్ళము.

    వీలైనంత మంది స్నేహితులను ఈ సమ్మేళన సందర్భంగా వచ్చేలా చూసే బాధ్యత మా అనీల్గాడు నెత్తికెత్తుకున్నాడు. ఆ కార్యక్రం అయ్యేదాకా నిద్రాహారాలు మాని ఒక పూనకం వచ్చిన వాడిలా పని  చేశాడు. వాడు ఒక్కో స్నేహితుడిని ఎలా కనుగొన్నాడో రాయాలంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది కానీ మచ్చుకు కొన్ని రాసి వాడి పరిశోధనా భరితమైన బుర్రని గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నా.

    అసిఫ్ అహ్మద్ మా సహాధ్యాయి మరియు మా అనీల్గాడికి ల్యాబ్ మేట్. అట్టి ఆసిఫ్ ని మావాడు చివరిసారిగా కలిసింది 1994 లో మరియు హైదరాబాదు నగరంలో. అటు పిమ్మట వారిద్దరి మధ్య సమాచార వారధి తెగిపోయింది. మావాడు ముందుగా ఆసిఫ్ ని వెతకటం లో పడ్డాడు, ముందుగా మా కాలేజీలో లోనే ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మా స్నేహితుడైన మోహనయ్య ద్వారా అసిఫ్ అడ

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    12 min
  • గడ్డు కాలంలో నాతో నేను!

    ఈ రోజు తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే మా ఇంజనీరింగ్ అయ్యాక మాకు లభించిన ఒక సంవత్సరం ఖాళీ మనకు చాలా జీవుతానుభవాలనే నేర్పించి ఉంటుందని అనిపించింది. ఈ మధ్య ఒక సినిమాలో చూశా డిగ్రీ అయ్యి బయటకి రాగానే నెక్స్ట్ ఏంటి అని ప్రతీ వాడూ అడిగేవాడే అని కథానాయకుడు బాధగా పాడుకొనే పాటని. మేము బయటకు రావటం అందరిలా కూడా రాలేదు కదా, మీరు మర్చిపోయారా, పరీక్షలు ఎగ్గొట్టి ఒక్క సంవత్సరం కాజేసుకొని వచ్చిన బ్యాచ్ మాది అని.

    అసలు మాకీ పరిస్థితిఎందుకు వచ్చిందబ్బా అని కొంచెం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, ఎక్కడో మేము మా నాలుగవ సంవత్సరపు చదువుని నిర్లక్ష్యం చేసి తీరా పరీక్షలు దగ్గర పడటంతో ఎక్కువ ప్రిపరేషన్ కావాలని, అలా కావాలంటే యూనివర్సిటీ వాళ్ళు ముందుగా షెడ్యూల్ చేసిన ప్రకారం ల్యాబ్ ఎగ్జామ్స్ థియరీ ఎగ్జామ్స్ కన్నా ముందు వద్దు, వెనకకి జరపమన్నామని  నాకు గుర్తు. అలా చెయ్యటం వలన మాకు కొంచెం ఎక్కువ రోజులొస్తాయి థియరీ ఎగ్జామ్స్ రాయడానికి అని మా వాదన.

    కానీ మేము మిస్ అయిన లాజిక్ ఏమిటంటే మాలో తొంబై శాతం మందిమి వన్ డే బాటింగ్ చేసేవాళ్ళమే, అలాటి మాకు ఎక్కువ రోజులుంటే  ఏమి తక్కువ రోజులుంటే ఏమి. ఎందుకంటే మేము చదవ బోయేది సరిగ్గా పరీక్షకు ముందు రోజే కదా. వెళ్లి రాసి పడేసి వుండాల్సింది, స్ట్రైక్ అని మా తద్దినం మేమే పెట్టుకోకుండా.

    పరీక్షలు రాయకుండా ఇంటికి వచ్చిన నన్ను చూసి ఇంటా బయటా హేళనలే, ఎవరూ జాలిపడలా, పిల్లకాయలేదో తప్పు చేసి వచ్చారు అని. ఆ తర్వాత పరీక్షలు రాసి వచ్చినా, మా అన్న హైద్రాబాదులో చూపిన వుద్యోగం చేయకుండా రెండవ రోజే పారిపోయి రావటం తో వీడు దేనికీ పనికి రాడు అనే ముద్ర పడిపోయింది మా వాళ్లకు.

    అది నా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసింది. మీకు తెలుసనుకుంటా నాకిటువంటి అనుభవమే ఇంటర్మీడియట్ లో జరిగింది, రెండవ సంవత్సరం లెక్కల పరీక్ష  తప్పటంతో. అక్కడో సంవత్సరం ఖాళీ మరలా ఇంజనీరింగ్ అయ్యాక ఇంకో సంవత్సరం ఖాళీ. ఈ దెబ్బతో మనకి అన్ని సంవత్సరాలు ఎగిరెగిరిపడి తీరా అసలు సమయమొచ్చాక చతికిల పడ్డ చందాన పేరు వచ్చింది. అందులోను మనల్ని మన తలితండ్రులు చూసే విధానం మనం చదువుల్లో ఎలా రాణిస్తాము అనే దాని బట్టి ఉంటుంది, దీనికి మినహాయింపు ఇవ్వ దగ్గ తలితండ్రులను వేళ్ళ మీద లెక్కించ వచ్చు. మా కుటుంబం ఇందుకు అసలుకే మినహాయింపు కాదు, మా కుటుంబ ఆర్ధిక పరిస్థుల దృష్ట్యా.

    ఏమీ చేత కానీ వాడు అనే ముద్రనుండి బయట పడాలని, నేను నెల్లూరు లో ఒక ఏ.ఎం.ఐ.ఈ కి శిక్షణను ఇచ్చే సంస్థ వెనక పడ్డా, ఉద్యోగమివ్వండి నేను స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్, థెర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ల వంటి సబ్జక్ట్స్ ని బాగా చెప్పగలను అని. నాకింకా గుర్తు మనకి సర్టిఫికెట్స్ కూడా రాలేదప్పటికీ, నేను నా గేట్ స్కోర్ కార్డు పట్టుకు తిరిగే వాడిని నన్ను నమ్మండి మహా ప్రభో అని.

    వాళ్లేమో రేపురా లేక ఎల్లుండిరా అంటూ రెండు నెలల పుణ్యకాలం అరగ దీశారు. ఈ లోపు నేను అప్పట్లో మా నెల్లూరులో పుట్ట గొడుగులా వుండే ఇంటర్మీడియట్ కోచింగ్ సెంటర్ల చుట్టూ కూడా తిరిగా, లెక్కలు మరియు భౌతిక శాస్త్రం చెప్పగలనని. పేరు మోసిన సంస్థలు ఎలాగూ గేట్ లోపలక్కూడా రానివ్వవని తెలిసి, టెన్త్ పాస్ అయితే చాలు మీ వాడికి ఇంజనీరింగ్ గ్యారంటీ అని బోర్డు లు పెట్టి వుండే సంస్థలు లక్ష్యంగా.

    సాధనా సంస్థ అని ఎక్కడో ఊరి బయట వున్న ఒక సంస్థలో అవకాశం వచ్చింది మా ఇంటి పక్కనుండే ఒక ఉపాధ్యాయుడి సిఫారసుతో, రోజుకు రెండు గంటలు చెబితే నెలకు ఐదొందలు ఇస్తామని. వెళ్లి చేరిపోయా, పిల్లలు ఇష్టపడటంతో రెండు గంటలు బదులు నాలుగు గంటలు చెప్పటం మొదలెట్టా ఫానులు కూడా లేని రేకుల షెడ్డుల్లో, ఎగుడు దిగుడు గోడలకు నల్ల రంగు వేసి బోర్డులుగా మార్చిన తరగతుల్లో. ఇంట్లో ఖాళీ అనే మాట బదులు అక్కడ అలా పడివుండటమే స్వర్గంలా అనిపించేది.

    ఈ లోపల ఏ.ఎం.ఐ.ఈ శిక్షణా సంస్థ వాళ్ళు కూడా రోజుకు రెండు గంటలు చెప్పమని అవకాశం ఇచ్చారు నెలకు ఒక వెయ్యి రూపాయల వేతనంతో. చేరిన ఒక నెలలోనే, మాకు స్ట్రెంగ్త్ అఫ్ మెటీరియల్స్ చెబితే ఆ హర్షా సర్ చెప్పాలని అన్నీ బ్యాచ్ లు నా దగ్గరకే రావటం నాకు మరచిపోలేని అనుభవం. వాళ్లకు నేనే రామామృతాన్ని మరియు సురేంద్ర సింగ్ ని. వీళ్లిద్దరు ఎవరబ్బా అంటారా ఆ సబ్జెక్టు మీద పేరు మోసిన రచయితలు. కొన్నాళ్ళకి ఆ కోచింగ్ సెంటర్ ఓనర్ వాళ్ళ కుటుంబాన్ని వరకట్న కేసుతో వాళ్ళ వదిన గారు అరెస

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp

    8 min
  • మా పంచింగ్ ఫలక్ నామ!

    నాకు రామ్ అని ఒక సహోద్యోగి ఉండేవారు చెన్నైలో. ఆయన సందర్భోచితంగా వేసే పంచ్ లు అంటే నాకు చాలా సరదా, కానీ ఎప్పుడు నా మీద ప్రయోగిస్తారేమో అని జాగ్రత్తతో ఉంటా. వాళ్ళ టీంలో ఒక నిష్ టెక్నాలజీల నైపుణ్యముండే పిల్లకాయలున్నారు. అదే నిపుణత వేరే కస్టమర్కి కూడా అవసరమయ్యింది. బయట ఎక్కడా దొరకటంలా. కావాల్సిన కస్టమర్ ఏమో ఎక్కేస్తున్నాడు. అలా రోజూ ఎక్కిచ్చుకోలేక ఆ కస్టమర్ కి పని చేసే ఇంకో మా మేనేజర్ నా దగ్గర కొచ్చి, హర్ష, ఆ రామ్ తో మాటలాడి కొంచెం ఆ పిల్లకాయలు హెల్ప్ తీసుకుందాము అన్నాడు. నేను సరే అని, ముందే రామ్ కి యీ విషయం చెప్పి, పంచ్ లు వెయ్యొద్దని బతిమాలి మరీ ఫోన్ లో కలిపాను యిద్దరినీ. రామ్ ఫోన్ లో రావటమే తరువాయి మొదలెట్టాడు, 'రవీ! నాకు తెలుసు నువ్వు బట్టల్లేకుండా రోడ్ మీద నిలబడున్నావని, హర్ష చెప్పాడు. కానీ నన్నివ్వమంటే ఒక సారి షర్ట్ ఇవ్వగలను, పోనీ లే అనుకుంటే ఇంకో సారి ప్యాంటు కూడా ఇస్తాను, అలా ఇస్తున్నాను కదా అని నువ్వు అండర్ వేర్ కూడా ఇస్తానని ఆశించమాకు' అంటూ మొదలెట్టాడు. నాకైతే అవతల రవీ, మొహం ఎలా ఉందొ ఉహించు కోడానికి భయం వేసింది. ఆయన అసలే సింహం లాటోడు.

    అలాగే ఒక రోజు మా చెన్నైకి వేరే వూరు నుండి ఒక విభాగాధిపతి , రివ్యూ చేయడానికి వస్తున్నాడు, రామ్ ప్రాజెక్ట్స్ లను. ఆ వచ్చే మనిషి చాలా నసగాడు, రామ్ కి చెప్పా! చాలా జాగ్రత్తగా వుండు, తనసలే తేడా అని. రామ్ తన ట్రేడ్ మార్క్ నవ్వుతో, హర్షా!, మనింట్లో కుక్క పిల్ల భౌభౌ అందనుకో ఏమి చేస్తాం, ముద్దు చేస్తాం, అదే దార్లో కుక్క పిల్ల భౌభౌ అంటే మూతి మీద కొడతాం. అతను విభాగాధిపతి అయితే పక్క ఊర్లో కదా మనకి కాదు కదా అంటూ ముక్తాయించాడు. ఆ తర్వాత రివ్యూ ఎలా జరిగిందో అడగడానికి నాకు ప్యాంటు తడిచింది.

    అలాగే మాకు ఒక హారిజాంటల్ గ్రూప్ వుంది. హారిజాంటల్ అంటే వాళ్ళు మా వర్టికల్ కి మాత్రమే కాక అన్నీ వెర్టికల్స్ కి సపోర్ట్ చేస్తారు. మీకర్థం కాక పోతే మీరు మా ఐ.టి వాళ్ళు కాదని అర్థం. వాళ్ళు అసలే పేరు తగ్గ అడ్డంగాళ్ళు. అన్నిటికి మా హారిజాంటల్లో ఇంతే అంటూ చావ కొడతారు. మేము ఆకాశంలో నుంచి ఊడి పడ్డాం అంటారు. ఈ రామ్ వీళ్ళని ఎలా డీల్ చేస్తాడబ్బా అని చూడాలని వెళ్ళా ఒక రోజు. సరే, అందరం కలుద్దామని ఫ్లోర్ వాక్ కి పిలిచాడు, ఆ హారిజాంటల్ వాళ్ళని కూడా ఆహ్వానించాడు. వాళ్ళు రాగానే మొదలెట్టాడు, మీరు అన్నీ అకౌంట్లలో వున్నారు, అన్ని దగ్గర్లా కావు కావే, మీరు అన్నీ దగ్గర్లా ఎగరరండి బాగా, కావు కావు అని కూడా ఆనండి, కానీ ఇక్కడికొచ్చి రెట్ట మాత్రం వేయకండి అంటూ. నేను అయితే ఆయన మాటలకి ఫ్రీజ్ అయ్యా.

    ఆయన వాళ్ళ ప్రాజెక్ట్స్ ని ఒక హెడ్ మాస్టర్ స్కూల్ ని ఎలా నడుపుతాడో అలా, ఒక పక్క బెత్తం, ఒక పక్క పంచ్ లతో నడుపుతాడు. ఒకసారి ఈ పంచ్ లు తట్టు కోలేక ఆయన టీమ్ వాళ్లంతా ఆయన్ని ఆయన ఆఫీస్ లో కలిశారు. ఏంటీ ట్రాన్సిషన్ మేనేజర్, అప్లికేషన్ మేనేజర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ అందరూ కట్టకట్టుకొచ్చారు, అబ్బబ్బ ఆల్సేషన్ , డాల్మేషన్ , డాబర్ మాన్ అని ఎన్ని పేర్లున్న కుక్క పిల్లలు కుక్క పిల్లలేనబ్బా, మీకు ఎన్ని డిసిగ్నషన్స్ వున్నా మీరు నాకు పనిచేసి పెట్టేవాళ్ళేనబ్బా అంటూ మొదలెట్టాడట, ఇక వాళ్ళు ఈయన పంచ్ లకు అలవాటు పడటమే బెటర్ అని డిసైడ్ అయిపోయారు. ఆ తర్వాత వాళ్లకూ నాకు రామ్ పంచ్ లు వినకపోతే వెల్తి.

    అలాగే అందరూ సరిగా కలిసి తనకి ప్రాజెక్ట్ డెలివరీ చేయక పోతే, అల్లం ముక్క , మామిడి ముక్క వెల్లుల్లి పాయ తెచ్చి నేను ఎందుక్కలుపు కోవాలి అబ్బాయిలు, దాని బదులు రెడీ మేడ్ గా నేను ప్రియా పికిల్ కొనుక్కుంటా అని బెదిరిస్తాడు. ఇలా వుంటాయి ఆయన పంచ్ లు. మీకూ ఇలాటి ఫలక్ నామ తో పరిచయం ఉంటే మీరు కూడా రాయండి. నేను చాలా తక్కువ రాశా.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    4 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners