Harshaneeyam

Harshaneeyam

By HarshaneeyamArtsBooksFiction
Download on the App Store

Harshaneeyam episodes

  • 'బేడమ్మ' - శ్రీరమణ గారి కథ

    'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది.

    శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి.

    https://www.telugubooks.in/products/sri-channel-2

    బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు.  ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు. 

    ఒంగిపోకపోయినా నిలువెల్లా  వార్థక్యం తెలుస్తూనే ఉండేది.

    బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ తనవే అనుకునేది బేడమ్మ. రోజుకో  ఇంట్లో భోజనం చేసేది. అదీ ఒక్కపూట ! ఆ రోజు ఆ ఇంటెడు చాకిరీ తనే చేసేది “అప్పనంగా తింటే అరగదు నాయనా' అనేది. 

    ప్రతిరోజూ గుడిబావి నించి పది ఇళ్లకీ మడినీళ్లు మోసేది. 

    బ్రాహ్మణ వీధికీ, శివాలయానికి పది గడపల దూరం. తెలతెలవారకుండానే ఆలయానికి వెళ్లి, గుడిముందు కసువూడ్చి, బిందెడు నీళ్లు జల్లి ముగ్గువేసేది. తను తలారా నీళ్లు పోసుకుని, ఆనక గుడిబయట నందిబొమ్మని కడిగి, నిక్కపొడుచుకున్న నందిచెవుల మధ్య కాసిని పూలు పోసి, మూసి వున్న తలుపుల్లోంచి చంద్రశేఖర స్వామికి దణ్ణం పెట్టుకునేది బేడమ్మ. 

    కళ్లాపు జల్లులకు ధ్వజస్తంభం మీది చిలకలూ పిచ్చుకలూ నిదురలేచి మేతలకు బయలుదేరేవి. ఆ అలికిడికి ధ్వజస్తంభపు చిరుగంటలు వులిక్కిపడేవి. రాలిన జువ్వి పూరేకుల్ని చూసి బియ్యపు  గింజలనుకుని పిట్టలు ఆశగా చెట్టుకింద వాలేవి, నిద్రమొహాలతో. 

    కాదని తెలిసి టపటపా రెక్కలు కొట్టుకుంటూ గుంపుగా  ఎగిరిపోయేవి. ఈ లోగా బేడమ్మ బిందె నిండా నీళ్లు చేదుకుని - ఓ మందారం. నాలుగు  నందివర్ధనాలు, గుప్పెడు పారిజాతాలు, పుంజీడు పచ్చ గన్నేరులు  బిందెలో వేసుకునేది.  తళ తళలాడే నీళ్ల బిందె నడుముకి మోపి బేడమ్మ రోడ్డు వారగా వెళ్తుంటే పూలకలశం కదిలి వెళ్తున్నట్టుండేది.\

    ఆ పసిపొద్దు కిరణాలలో  బిందెలోపూలు నీళ్లకుదుపులకి లయలూ హొయలూ వొలికించేవి. ఆ లేత వెలుగులకి సువాసనలు అద్దేవి. 

    అలా మొదలైన నీళ్లమోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనించి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్ల చార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది. పూర్తిగా తెల్లారేసరికి బ్రాహ్మణవీధి గడప గడపనీ శివాలయంతో తడిపోగులతో ముడివేసేది బేడమ్మ.

    ఆ వీధిలో ఏ కాస్త సందడి వచ్చినా బేడమ్మ సాయం కోరేవారు. అప్పడాలు, వడియాలు, ఊరగాయలూ లాంటి పై పనులు వచ్చినా, నోములూ, వ్రతాలు, చుట్టాలూ, తద్దినాలూ ఏమొచ్చినా బేడమ్మ రంగంలోకి దిగేది. రూపాయి అర్థా ఇస్తే పుచ్చుకునేది. ఏరోజు ఎక్కడ పెద్దతోడు కావాలంటే అక్కడా రోజు మకాం. పుట్టెడు అమాయకత్వం తప్ప పేచీ లేని మనిషి.

    ఓసారి దసరా ఉత్సవాలకి బెజవాడ కనకదుర్గమ్మని చూడ్డానికి వెళుతూ ఎవరో బేడమ్మని కూడా తీసికెళ్లారు. ఊరి పొలిమేర దాటడం, బస్తీ చూడడం బేడమ్మకి అదే మొదటిసారి. వచ్చాక అక్కడి వింతలూ, విశేషాలూ అనేకం చెప్పింది. “అక్కడ బారెడు, బారెడు అరటిదూటలకి వెలట్రీ తగిలించి వెలిగించారు నాయనా, అది వెలుగంటే వెలుగు కాదు... వెన్నెల..” అని ట్యూబులైట్లని గురించి చెబితే అందరూ నవ్వుకుని మళ్లీ మళ్లీ చెప్పించుకునేవారు. 

    ఆడైనా, మగైనా, పిల్లయినా, పెద్దయినా, పక్షయినా, జంతువైనా 'నాయనా' అని సంబోధించడం బేడమ్మ సొంత ముద్ర.

    పేచీ పూచీ లేని బేడమ్మకి వేరే దిగులూ విచారమూ లేవు గానీ ఒకే ఒక్క భయం ఆవిడని వేధించేది పాపం. తను చచ్చిపోతే కట్టెల్లో వేసి కాల్చేస్తారని ఆవిడకి చచ్చేంత భయం....

    చిన్నా, పెద్దా ఎవరు పలకరించినా “ నన్ను కాల్చకండి నాయనా... నొప్పి పుడుతుంది... భరించలేను నాయనా” అని బతిమాలుకునేది. చీరకొంగున బేడకాసు తీసి లంచంగా ఇచ్చి ఒట్టు వేయించుకునేది. కొందరు అకతాయిలు బెల్లించి, బెదిరించి బెడలు పట్టేసేవారు. మా ఊళ్లో బేడమ్మ చేతికింద చెయ్యి పెట్టని వాళ్లు లేరు. బేడలు పుచ్చుకొని వారు లేరు. 

    ఆవిడ కష్టం కొద్దీ అక్షయంగా బేడలు కొంగు ముడికి జమకడుతూనే ఉండేవి. 

    ఓసారి కరణం గారింటికి జమా బందీకి తహసీల్దారు  గారొస్తే బేడమ్మ కమ్మగా వంట చేసి పెట్టింది. వంటనీ... వడ్డననీ ఆయన మెచ్చుకోగా చూసి, చొరవ చేసి బేడమ్మ తన సమస్యని చెప్పి 

    “నాయనా హోదాగలవాడివి. వస్తే నువ్వే చూసుకోవాలి. ఆ బాధ నేను భరించలేను నాయనా!” అని కన్నీళ్ళొత్తుకుంటూ తాంబూలంలో బేడ కాసు పెట్టి ఇచ్చింది. తాసీల్దారు బేడ లంచానికి అదిరిపడ్డారు.

    బేడమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని ఆ బేడని కళ్లకి అద్దుకున్నాడు. ఆ విధంగా బేడమ్మ పేరు అనాదిగా స్థిరపడిపోయింది.

    రోజూ,  చివరి బిందెకి - గడకర్రతో మారేడు దళాలు రాల్చి, వాటి మీద దేవుడి వాటా పూలు ముఖద్వారపు రాతిపద్మం మీద కుప్ప పోసేది. ఆ పూలరెక్కల కింద బేడకాసు కప్పెట్టే సంగతి పెట్టినమ్మకి తెలుసు. పూజారికి తెలుసు. లోపలున్న మూడోకంటి వాడికి తెలుసు.

    కృష్ణా పుష్కరాలకి బళ్లు కట్టుకుని ఊరు ఊరంతా కదిలినట్టు కదిలింది శ్రీకాకుళం రేవుకి. బేడమ్మ సంబరం అంతా యింతా కాదు. మజిలీ మజిలీకి బండి మారుతూ మధ్య మధ్య గుట్టు చప్పుడుగా బేడలు పంచుతూ బతిమాలుతూ బామాలుతూ ఊరికీ రేవుకీ దూరాన్ని తగ్గించింది.

    పుష్కరాల రేవు మహా పర్వడిగా ఉంది. రేవులో దిగి కొంగుముడి విప్పి బేడకాసు కృష్ణమ్మ ఒడిలోకి విసిరి "నాయనా నీదే పూచీ... ఆ బాధ తట్టుకోలేను. నాయనా” అని దణ్ణం పెట్టుకుంది. 

    ముక్కు మూసుకు మూడుసార్లు మునిగి లేచింది కానీ నాలుగోసారి బేడమ్మ లేవలేదు. ఊరి వారు, రేవు వారు గాలించారు. బేడమ్మ జాడలేదు.

    " నాయనా నన్ను... నొప్పి భరించలేను..” అని బేడమ్మ పంచిన ప్రతి బేడా ఎలుగెత్తి ఘోషించినట్టనిపించింది మా ఊరి జనానికి. కృష్ణమ్మ ఒడిలో బేడమ్మ విసిరిందే ఆఖరిబేడ. తర్వాత “నయాపైసలు” చలామణీలోకి వచ్చాయి. బేడమ్మ లేని పుష్కరాల బళ్లు ఊరు చేరాయి. 

    ఊరికీ శివాలయానికి ఉన్న తడిముడి ఆనాటితో తెగిపోయింది.


    ‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)






    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    8 min
  • తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'

    తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.

    తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.

    ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.

    ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.

    తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.

    ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.

    కథ:

    గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!

    రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.

    “వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.

    “పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.

    “గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు. 

    గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.

    గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా

    మోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.

    “నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.

    మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.

    “వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”

    మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....”

    “పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం.

    గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు.

    “జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికి రాదు కాని” అని సమాధానమిచ్చాడట గవరయ్య.

    గవరయ్య ఒంటెత్తుమనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి “పాపం” 'పుణ్యం” అని భేదాలు వున్నట్టు కూడా తెలియదు.

    ఈ యిరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు - ఉదారులూ ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ, గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా యిమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో యిల్లు కట్టుకుని చెప్పారు.

    గవరయ్య గుండ్రంగా లోతుగా వున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కి పెట్టి, విసుగ్గా, విసురుగా “నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి” అనేవాడు. మంచి లేదు, మర్యాదా లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్ష రూపాయలుండడంవల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.

    గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్య నెక్కడికీ పంపేవాడు కాడు. పొరుగిళ్ళకు కూడా వెళ్ళేది కాదు. మేనత్తా, భార్యా, గవరయ్యా - ముగ్గురూ మూడు దెయ్యాలలా వుండేవారు. ఒక పుకారు కూడా వూళ్ళో వుండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూంటుందనీ,

    ఊళ్లో ఎవరికి తెలియకుండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రివేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడనీ ధూపాలు వేస్తాడనీ చెప్పుకుంటూంటారు. ఇంత వంటరిగా సంఘ జీవితంలో కలవకుండా వీళ్ళెలా వుంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన వూరునుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ వూరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతడు గవరయ్యను గురించిన భోగట్టా అందజేశారు.

    గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదమూ, తాగుడూ రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీసు చేశాడుట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువలన గవరయ్య తండ్రి పొరుగూళ్లో ఒకావిడని వుంచుకొన్నాట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డపేరువలన గవరయ్యతో ఎవరూ కలిసేవారు కాదు.

    ఆఖరికి ఆ వూరి బళ్ళో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించినాయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడీ దైవభక్తి వున్నవాడు. ప్రతిఏటా సుబ్బరాయుడి షష్టి ఉత్సవాలూ అన్న సంతర్పణా చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ వుత్సవాలలో గలభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో గవరయ్య తండ్రి చేత యిచ్చిన దానికన్న రెండు రెట్లుకి తనఖా వ్రాయించుకొని వున్న భూమి కాస్తా అన్యాయంగా కాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ.

    కాని వూళ్లో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు కారు. అదే కాక వాళ్ళు చాటుమాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్ధతిమీదే చేస్తున్నారు కాబట్టి పెద్దమనిషీ పరమ భక్తుడూ అయిన భూస్వామి యిలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలచుకోలేదు.

    గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్క పిల్లనీ, రెండు పిల్లిపిల్లల్నీ తెచ్చి యిచ్చి వాటితో ఆడుకోమనేవాడు. “మనుషుల కంటె యివే నయం” అనేవాడు రోగిష్టి అయిన భార్యతో.

    గవరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్ళకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దుండగా లెక్కువైపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బుకోసం చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడీమెకు చివరి రోజుల్లో వైద్యసహాయం చేయించలేక పోవడం భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పెట్రేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తూండగా ఎవరో వాడి తల రెండు చెక్కలయ్యేట్టు యినుపకడ్డీతో కొట్టారు.

    భూస్వామి తన అనుమానమంతా గవరయ్య తండ్రి మీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్టు చేశారు. కేసు మోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా చూడకపోయినా, భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడింది.

    తండ్రి ఆఖరిమాటగా కొడుకుతో 'ఎవర్నీ నమ్మకు. నీ కాళ్ళమీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగ వెధవలు, విషసర్పాలు' అని చెప్పి మరీ పోలీసులతో వెళ్ళాడు.

    తల్లిలేని, తండ్రిలేని గవరయ్య ఆ యింట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో రెండు రోజులు తిండి తిప్పలు లేక యింట్లో మూలగా కూర్చుని పధ్నాలుగేళ్ళ గవరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకి రాలేదు. పలకరించలేదు. రౌడీ, హంతకుడూ అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయనీ, వీడెకెంత దూరంలో వుంటే అంత మంచిదని ఆ వూళ్ళో మంచివాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందులేదు, మాకులేదు. జ్వరం స్ఫోటకంలోకి మారింది. ఆ యింట్లోంచి రాత్రుళ్ళు “అమ్మా చచ్చిపోతున్నానేవ్' అనే కేకలు వినవచ్చేవి భయంకరంగా దీనంగా.

    మశూచి అని తెలియగానే ఆ పొలిమేరలలో కూడా జనం నడవటం మానివేశారు.

    “ఈ కొడుకు కూడా పోతే వూరికి పీడా వదలిపోతుం” దన్నారు కొందరు.

    ఇలా వుండగా ఒక రోజు సాయంత్రం ఒక గుర్రబ్బండీ గవరయ్య ఇంటిముందాగింది. దానిలోనుంచి నలభై ఏళ్ళ స్త్రీ దిగింది. ఒంటినిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా వుంది. చెంపలదగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధి వీధంతా వింతగా ఆమెకేసి చూస్తూ నించున్నారు. కాని ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది. నౌకరు పెట్టెలన్నిటినీ లోపల పెట్టి తలుపులు దభాల్న వేసేశాడు.

    నౌకరు ద్వారా ఆమె గవరయ్య తండ్రికి యిలాకా ఉన్న ఆవిడనీ, ఆరునెలలు పుణ్యక్షేత్రాలు సేవించి రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చిందనీ, గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడడమూ కొడుకు దిక్కులేని వాడై ఉండడమూ తెలిసి యెకాయెకిని సామాన్లు పట్టించుకుని ఆ వూరు వచ్చేసిందని తెలిసింది. అంతే, నాటినుండీ గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బునుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా వున్నా ఆమె లక్ష్యం చేయలేదు. తండ్రితో సంబంధమున్నంత మాత్రాన ఈ చాతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకి చెప్పిచూశారు. కానీ ఎవర్నీ లక్ష్యం చేయని గుణం ఆమెలో వుంది. కొన్నాళ్ళకి ఒక పిల్లని వెతికి తెచ్చి గవరయ్యకి పెళ్ళి చేసింది. గవరయ్య ఇరవయ్యోయేట ఆమె మరణించే ముందు గవరయ్యకి తన నగలూ, పదివేల రూపాయల నగదూ యిచ్చివేసింది.

    తర్వాత అతనీ వూరిలో మేనత్త ఇంటికి రావడం, తోళ్ళ వ్యాపారం చేయడమూ, ఏడెనిమిదేళ్ళకు మొదటి భార్య పోవడమూ ఊళ్ళో అందరికీ తెలిసినదే. ఈ చరిత్ర అంతా గాజుల వర్తకుడి ముఖతః విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం యీసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు, వీడు చిన్నతనం నుండి పిల్లులతో కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవరచుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీ చేత, ఇంతటి అమానుషుడు వచ్చీ వచ్చి తమ వూళ్ళో పడ్డాడనే బాధ ఒక వైపున పీడించింది నలుగుర్నీ.

    అయినా అవధాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు గవరయ్య దుర్మార్గుడు నిజమే. వికృత రూపుడు _ అదీ నిజమే _ పిసినిగొట్టు, ఎవరికీ కానీ రాల్చడు - ఒప్పుకున్నాం - ఒంటెత్తు మనిషి, సభ్యత లేనివాడు. అందరికీ తెలుసును; అయితేనేం ధవవంతుడు. ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చేస్తే అతనికీ, పెద్దలకీ ముక్తి వుంది. ఇంత ఉదారాశయంతో ఎన్నోవిధాల ఎన్నోసార్లు గవరయ్యని కదిపి చూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు. మండపం కట్టించాలన్నారు. ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగుచేయించా లన్నారు. దేనికీ గవరయ్య లొంగిరాలేదు. చివరికి గుళ్ళోకివచ్చిదైవ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోమన్నారు. అది ఖర్చులేని పని. ఎప్పటికైనా గవరయ్య రాతిగుండెలలో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కాని ఏనాడు గవరయ్య గుడి చాయలకి కూడా రాలేదు.

    ఒక తోటివాడు నాస్తికుడై పాపియై పోతూంటే ఊరుకోలేని మంచితనం వలన, కార్యదీక్షవలన ఊరిపెద్ద లతని మీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు.

    కానీ అదేమి పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటినుండీ. చాకలీ, కోమటీ, మంగలీ అతనికి చాటుచాటుగా వాళ్ళ వాళ్ళ సేవలందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలిస్తాడేమో గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళెవరూ ఇష్టపడలేదు.

    మొదటి భార్య కాలుజారి నూతిలోపడి మరణించినప్పుడు అవధానీ తదితరులూ గవరయ్యని పరామర్శించారు. ఇదంతా కర్మఫలితమనీ, యిప్పటికేనామేలుకోమని హెచ్చరించారు. కాని గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా ఏడాదిలో తనకన్న పదిహేనేళ్ళు చిన్నదైన ఒక పిల్లను పెళ్ళి చేసుకుని యింటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అందం ఎటున్నా ఫ్యాషన్ గా అలంకరించుకునేది. ఆమెని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యని గురించి అనుకునేవారు. అయితే ఆమె అయినా ఇల్లుదాటి యీవలికి వచ్చేది కాదు. ఎవరేనా కుతూహలం కొలదీ వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరైనా గవరయ్య రూపాన్ని గురించిగాని, వయస్సు గురించిగాని వ్యంగ్యంగా హేళనచేస్తే “ఆయన చాలా మంచివారు” అనేదిట. నాలుగు రోజుల కొకసారి ప్రక్క టౌన్ కి బండి మీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట. గవరయ్య తన నిబంధనల్ని ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు. కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ యింటిలో వున్నవాళ్ళు అలాగ మనుషులకి, వూళ్ళో జరిగే సంఘటనలకి దూరంగా వుండవలసిందే.

    ఎదురింటి అరుగుమీద వున్న మిషన్ కుట్టువాడితో యీమెకి లేచిపోవడందాకా యింత చనువు ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కాని ఈ దుస్సంఘటనతో మున్సబూ, కరణమూ, తదితరులూ మహదానందం పొందారు. కటికి చీకట్లో వాళ్ళకి మళ్ళీ ఆశాకిరణం గోచరించింది. ఇనుం వేడెక్కినప్పుడేసాగగొట్టాలన్నారు. నలుగురూ కలసి ఒక రోజున గవరయ్య యింటికి వెళ్ళారు. ఇల్లు చాలా పెద్దది. మండువాలోగిలి, ఇంటిచుట్టూ పెద్దదొడ్డి; వెనకాల గడ్డివామూ, దూడల పాకా, చెట్లు, చేమలూ వున్నాయి. ఆపైన యింకేమీ ఇళ్ళు లేవు. అన్నీ పొలాలే, మేనత్త వున్న చిన్న లోగిలిని క్రమ క్రమంగా పెంచే యింత యింటిని చేశాడు గవరయ్య.

    ఆ ఇల్లు అన్ని ఇళ్ళలా వుండదు. కలకల లాడుతున్నట్టు వుండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్టు వుంటుంది.

    రాత్రిళ్ళు దెయ్యాలు గదిలోంచి గదిలోకి వంకర కాళ్ళతో తిరిగి తిరిగి పగటివేళ అటకమీదా, చూరు మూలల్లోను దాక్కున్నట్టు వుంటుంది. పలుకుబడీ, స్తోమతూ సహజంగా ధైర్యమూ వున్న ఆ నలుగురికి ఆ ఇంట్లో అడుగు పెడుతూంటే కొంచెం బెదురుగా వుందన్న మాట నిజం.

    గోడకు చేరబడి కళ్ళు మూసుకుని వున్నాడు గవరయ్య. బనీనులోంచి అతని బలిష్టమైన రొమ్మూ , కండలూ మశూచికపు గుంటలతో గాట్లు తిన్న తుమ్మబాదుల్లా వున్నాయి. అడుగులు చప్పుడు విని కళ్ళు తెరచి చూశాడు. కళ్ళు ఎర్రజీరలతో తాగినవాడి కళ్ళలా వున్నాయి. అవధానీ, మున్సబూ, కరణమూ, మరొక పెద్దమనిషీ తేరి చూస్తున్న గవరయ్యకి దగ్గరగా వున్న బల్లమీద కూర్చున్నారు. గవరయ్య యేమన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూశాడు.

    “నీకు రావలసిన కష్టం కాదోయ్ గవరయ్యా. నిమ్మకు నీరోసినట్టు వుండే స్వభావం నీది. ఒకరిజోలీ కొంఠీ అక్కర్లేదు. విషయం తెలియగానే 'అరే! పాపం' అని మనస్సు కొట్టుకులాడి పోయిందంటే నమ్ము” అన్నాడు కరణం.

    గవరయ్య మాట్లాడలేదు. అలాగే చూస్తున్నాడు.

    పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్ళకి జీతాలివ్వడంలో కానీ _ తన ధర్మం తాను టైముకి నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర వుంచుకోలేదు. సుబ్బయ్యగాడికి సాలు తిరక్కముందే ధాన్యం కొలిచి యిచ్చేశాట్ట గవరయ్య. “వాడు తెగ చెప్పుకోవడమే __మా కామందు మహదొడ్డమనిషీ అని...” అన్నాడు మున్సబు,

    గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు.

    “కాని ఒక్కమాట గవరయ్య బాబూ!” మందంగా, గంభీరంగా, అందులోనే ఒక విశేషమైన దయా, మృదుత్వాన్నీ కలిపి వాచా చమత్కారియైన అవధాని ధర్మకర్తృత్వపు హోదాతో పలికాడు. “భగవంతుడి ఆసరా లేకుండా ఎటువంటివాడూ యీ సంసార సాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి. ముక్కుకి సూటిగా పోయేవాడివి. అయితేనేం; నీ వ్యాపారం వుంది చూడు _ అది కేవలం ధర్మవిరుద్ధమని శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు. అందుకని ఫరవాలేదు. కాని ఒక్కటి చెప్పారు _ ఏమైనా ఆ భగవంతుని స్మరించడం మానకుండావుంటే అన్ని కష్టాలూ మంచులా విడిపోతాయి. ఫలం, పుష్పం, పత్రం, తోయమ్ _ అన్నారు _ భగవానుడు అల్పసంతోషి....”

    క్రమంగా అందరి మొహాలలోనూ విజయాన్ని సూచించే నవ్వు అలముకొంది. ఎప్పుడూ కసురుకొని విసుక్కునే గవరయ్య యీ వేళ మౌనంగా వున్నాడు. అభేద్య మనుకున్న కోట గోడకు పగులు ఏర్పడింది. ఇంక మెల్లమెల్లగా గవరయ్యని మార్చివేయవచ్చుననే భావం వారిలో ఏర్పడింది. అందరూ లేచారు, వెళ్ళివస్తామన్నారు. కాని గవరయ్య అలాగే శిలాప్రతిమలా కళ్ళప్పచెప్పి చూస్తూ కూర్చున్నాడు.

    ఒక ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణము, మున్సబూ వగైరాలు గవరయ్య ఇంటికి వచ్చి పోతున్నారు. గవరయ్యని దైవ దర్శనానికని, హరికథకనీ, మరొకటని చెప్పి పిలుచుకు వెళుతున్నారు. ఊళ్ళోవాళ్ళూ కూడా గవరయ్య వీధిలో వెళుతూంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడడు. మంత్రించిన వాడిలా ఆ దేవాలయంలో కానీ, హరికథలో కానీ కూచుంటాడు. సగంలో ఒక్కొక్కసారి చటుక్కున లేచి వెళ్ళిపోతాడు.

    పెద్దలు తలపంకించి 'రాక్షసముండాకొడుకు, ఒక్కరోజులో మారతాడా' అనేవారు.

    “మారకేం చేస్తాడు? సంఘాన్నీ, ధర్మాన్ని కాదని ఎక్కడికి పోతాడోయ్ వీడు” అనేవాడు అవధాని.

    వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టు వుంది. ఇంక జాగుచేస్తే లాభం లేదనుకున్నారు వూళ్ళో పెద్దలు. పాతిక వేలైనా వుంటేగాని యీ పని జరగదు. అంత మొత్తాన్ని ఒక్క గవరయ్య తప్ప యివ్వగలిగినవాడు మరొకడు లేడన్నారు. ఈ యేడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ్ళ వ్యాపారం అలా వుండగా, పట్టణంలో నూనెమిల్లులో ముప్పాతికవాటా కొన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే ఒక లకారం వచ్చిందని వూరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కారణం అతనిలో పొడచూపిన దైవభక్తి అనివాళ్ళనుకోవడమే కాకుండా అతడు ఏమరిపోతాడేమోనని అతనివద్ద మరిమరీ పనికట్టుకు చెప్పేవారు. ఒక మంచి రోజున మున్సబూ, కరణమూ, ధర్మకర్తా యింకా వూళ్ళో మోతుబరులూ, అందరూ కలిసి గవరయ్య యింటికి వెళ్ళి ప్రాకారోద్దరణను గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు.

    ''నీ పేరు చిరస్థాయి అయిపోతుంది. గవరయ్యా! నీ పేరు మీదుగా రోజూ పూజాపునస్కారాలు జరిపిస్తాం” అనీ చెప్పారు.

    “దేవుడికి అసలు గుడెందుకు? ఆ గుడి చుట్టూ గోడెందుకు?” అన్నాడు గవరయ్య చుట్ట చివరని నోట్లో నములుతూ.

    “అపచారం! అపచారం!” అని లెంపలువాయించుకున్నాడు కరణం.

    ధర్మకర్త కరణానికి కన్ను గీటాడు. 'గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైనది కాదు. తత్వవేత్తల్నీ, మహర్షుల్నీ కూడా ముప్పు తిప్పలు పెట్టిన జటిల ప్రశ్న అది. అయితే గవరయ్యలో మనకి తెలీకుండానే గొప్ప సాధన జరుగుతోంది. నాలుగు రోజులు మనం ఓపిక పడితే గవరయ్య వంటి పెద్దమనిషి తన ప్రశ్నకి తనే జవాబు పొందుతాడు. భగవదనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్. అంచెలంచెలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య ఏది - మన గవరయ్యే వచ్చి “ఇదిగో అవధానిగారూ, ఈ పదివేలు దగ్గరుంచండి - ప్రాకారం కట్టించెయ్యండి” అని అనడూ?”

    గవరయ్య ఎప్పుడూ చెయ్యనివాడు అవధానికి నమస్కారం చేశాడు. “సెలవు తీసుకోండి. నాకు పనుంది. టౌనుకెళ్ళాలి” అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు.

    “అవధానీ జయించావోయ్. తల వంచి నీకు నమస్కరించాడు కూడా! వీణ్ణి తగలెయ్యా __మారుతున్నాడు, మారిపోతున్నాడు” అన్నాడు కరణం హుషారుగా.

    "ఈ వర్షాకాలం వెళ్ళేసరికి – నే చెబుతున్నాగా _ పాతికవేలూ మన ముందు పడేస్తాడు. ఆ ప్రాకారంతోపాటు మన యిళ్ళకి ప్రహరీ గోడలు లేస్తాయి!” అన్నాడు మీసాల్లో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మున్సబు.

    వర్షాకాలం రానే వచ్చింది. రావడంలో మంచి వూతంగా, కోపంగా బలంగా వచ్చింది. కుంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశంమెరుపులూ, వురుములూ ప్రకృతి పెళ్ళిపందిరిలా హడావిడిగా వుంది. రోడ్లు బురదైనా కుచ్చెళ్ళ నెత్తిపట్టుకొని ఆడవాళ్ళు, అందులో కొత్తగా పెళ్ళయిన వధువులు సరదాగా పేరంటాలకి వెడుతూ వస్తున్నారు. రైతాంగం అంతా పొలంపనుల్లో పడిపోయారు. మున్సబు పెళ్ళానికి కీళ్ళు నొప్పులూ, అవధాని కూతురికి వేవిళ్ళూ అయినా గ్రామం వుమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవ చెల్లెలు కిటికీలోంచి ఎదురింటికి చుట్టంచూపుగా వచ్చిన బస్తీ అబ్బాయికేసి అదే పనిగా చూస్తూ చెయ్యి వూపుతున్నా షార్టుసైటూ మబ్బునీడలూ మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనబడటం లేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లలో వున్న కూలీ, నాలీ జనం, మురికిగుంటలూ పందులూ, జబ్బులూ అన్నీసక్రమంగానే వున్నాయి. పంచాయితీవాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగులో పేకాట నిరంతరం సాగుతోంది.

    ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగులాంటి వార్త చటుక్కున ఊరంతటినీ దద్దరిల్ల చేసింది. మున్సబూ, ఒకరిద్దరు పెద్దలూ మున్సబు యింటి అరుగుమీద కూర్చుని శాలువ కప్పుకొని వెచ్చగా చుట్టలు కాలుస్తూ ఆధ్యాత్మిక గోష్టి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారు ఉంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో, వరదో గ్రామానికి వచ్చినట్టుంది.

    “ఏంరా! ఏం జరిగిందిరా?” అన్నాడు మున్సబు.

    “అదొచ్చిందండీ తిరిగివచ్చిందండీ” అన్నాడు పానకాలు.

    రెజ్లల్ల క్రితం మున్సబుగారి గిత్తదూడ కట్టు తప్పించుకొని పారిపోయింది. మున్సబు చిరునవ్వుతో "అయితే యింకేం నేవచ్చి చూస్తాలే. కొకొట్టాంలో కట్టెయ్” అన్నాడు.

    “గిత్తకాదు బాబూ! గవరయ్య పెళ్ళాం!” అన్నాడు పానకాలు మెల్లగా.

    అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని “ఆఁ ఆఁ ఏమన్నావ్!” అన్నారు ఏకకంఠంతో. పానకాలు చెప్పిన వివరణ యిది.

    రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో రెండో ఆట సినీమా చూసివస్తూన్న బట్టలకొట్టు నరసింహం వూరు సమీపించే వేళకి రోడ్డుకి పక్కగా చెట్లనీడలో ఎవరో కదులుతూండడం చూశాడు. అతనికి దెయ్యమేమో అని అనుమానం భయమూ కలిగి గుండెలు దడదడలాడాయి.

    అక్కడికి కాస్త దూరంలో పాకలో పడుకున్న పానకాలుని కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు, రేగినజుట్టూ నల్లని మాసినబట్టలూ, నడవలేక ఒక్కొక్క అడుగువేసే ఆడకూతుర్ని చూశారు. ఆమె చేతిలో చిన్నమూట వుంది. ఎవరా అని దగ్గర్నుంచి చూశారు. పోల్చలేకపోయారు. పలకరించారు. ఆమె మాట్లాడలేదు. ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంతదూరంనుంచే ఆమెను అనుసరించారు. ఆమె పొలాలమ్మటే వెళ్ళి గవరయ్య యింటి పెరటి నానుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గవరయ్య ఇంటి పెరటికీ, పొలాలకీ మధ్యగావుంది. పాకలో కర్రపేళ్ళూ, పాతసీనారేకు డబ్బాలూ లాంటి చెత్తాచెదారం అంతా వుంది. గవరయ్యను లేపి చెపుదామంటే యింత రాత్రివేళ లేపితే తంతాడని భయం వేసింది.

    మళ్ళీ యిప్పుడా సంగతి జ్ఞాపకం వచ్చి పాకవైపు వెళ్ళి చూశాడు. ఎవరోకాదు ఆ ఆడమనిషి __ గవరయ్య పెళ్ళామే! కడుపు చాలా ఎత్తుగా వుంది. నెలలు నిండినట్టున్నాయి. గడ్డిమీద పడుకుని మూలుగుతూవుంది.

    “ఈ సంగతి గవరయ్యకు తెలుసునంటావా _” అన్నాడు మున్సబు.

    “తెల్లుబాబూ. తెల్లారగట్లనే లేచి టౌనుకెళ్ళిపోతాడుగా గవరయ్య” అన్నాడు పానకాలు.

    మున్సబు తొందరగా లేచాడు. చెప్పులు వేసుకుని బయల్దేరాడు అవధాని ఇంటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు.

    “ఏం మున్సబూ, గవరయ్య పెళ్ళాం తిరిగొచ్చిందటగా, ఈవూరూ, ఈ మడుసులూ, ఏమైపోతున్నారు బాబూ. మంచీ, చెడ్డా, పున్నెంపాపం అన్ని మట్టి...

    43 min
  • 'అహింస' దాదా హయత్ గారి కథ!

    'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు.

    కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు.

    ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి -

    http://bit.ly/2Ok88yb


    అహింస:


    అది మోకాలి మీదికి పాకింది. అది  ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు' పరీక్షించుకొని ప్రమాద మేమీ లేదన్నట్లు మళ్ళీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ.


    నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి. అంతవరకూ ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగుపుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కటి తగిలించాడు. గండుచీమ ఎగిరి నేలమీదపడి సర్దుకొని నిలబడి దొరికి పోయినట్టు తికమకగా ఎటు పారిపోవాలని కాస్సేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది.


    ఒక మోకాలి మీద గెడ్డం ఆన్చి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి. ఆరోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచు కొచ్చేస్తోంది. ఏం చేయాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలూ చాక్ పీసులూ బయటికి తీశారు. అవి ఎప్పుడూ తన జేబులో వుండాల్సిందే--రాత్రిపూట కూడా. ఎవ్వర్నీ తీయనియ్యడు.


    ఓ చాక్వసుతో అరుగుమీద ఓ 'సున్నాగీసి. మధ్యలో నిలువుగా గీతగీసి చెవులు పెట్టి. పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు. 'అమ్మ'. చంటి బళ్ళోచేరి రెండునెల్లే అయింది. కాని, అంతకు ముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు. అమ్మపక్కనే నాన్నని గీసి పీచు జుట్టు పెట్టాడు. తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరోబొమ్మ గీశాడు.. 'టీచర్'.


    ఈలోపల అమ్మబయటికొచ్చి కొడుకు చిత్రకళాకౌశలాన్ని తిలకించి నవ్వి, “బొమ్మలు గీస్తూ కూచున్నావా చంటీ? బడికిపోవూ? మొహం కడుక్కొని స్నానం చేద్దూగాన్రా ,” అని కొడుకుని లేవదీసింది.


    మొహమ్మీది కొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకొని, “అమ్మా, మా టీచర్ చూడవే - బావుంది కదూ?" కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు చంటి.


    “ఆఁ ఆఁ చాలా బావుంది. బడికి వేళ కాదూ? రా"


    చంటికి అరుగు దిగాలనిపించలేదు. బిక్కమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు.


    స్నానం చేయించుకొని, తల దువ్వించుకొని అమ్మవెంట వంట గది లోనికి వెళ్ళాడు చంటి.


    పొయ్యి వెలిగించి, గిన్నె పెట్టి ఉప్మాకోసం పోపువేసి తిరగ. పెడుతున్న అమ్మకొంగు లాగుతూ వగలు పోసాగాడు.


    “అబ్బ, వుండరా! ఉప్మా కానీ”


    అమ్మభుజం మీద గెడ్డం ఆన్చి గారంగా “అమ్మా” అని పిలిచాడు.


    చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు “అమ్మా”


    “ఏమిట్రా?"


    “ఈరోజు ....”


    “ఊఁ”.


    “స్కూలోద్దే".


    చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి “ఏం?” అంది.


    చంటి జవాబివ్వలేదు. అమ్మ మళ్ళీ పన్లో పడింది.


    “అమ్మా”


    “మీ నాన్నగార్నడుగు ”.


    చంటి మొహం వేలాడేసుకొని నిల బడ్డాడు. కాస్సేపాగి మళ్ళీ కొంగు లాగాడు


    “ఊఁ....”


    అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసింది.


    చంటి ఖిన్నుడై పోయాడు. అమ్మ నిరసనకు మొహవైతే చిన్నబోయింది గాని, బడికి మాత్రం వెళ్ళాలన్లేదు.


    బిక్క మొహంవేసుకొని కాస్సేపలాగే నిలబడ్డాడు. తర్వాత అమ్మ భుజం మీద చెయ్యేశాడు.


    కాస్సేపూరుకొని ఒక చేత్తో భుజంమీది " కొడుకు చేతిని నొక్కి పట్టి తలతిప్పి లాలనగా చూసి “అలాగేలే, ఇంట్లో కూచుని చదువుకో” అంది.


    చంటి మొహం వికసించింది. లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింతలావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్నగారి ముందు “హాయ్ హాయ్” అని గెంతులేస్తుంటే పేపరు చదువుతున్న నాన్నగారు “ఏమిట్రా?” అన్నారు కొడుకుని మురిపెంగా చూస్తూ.


    గెంతడం ఆ పేసి కుర్చీ కోడు పట్టుకు నిలబడి, “నాన్న అమ్మేం, స్కూలుకెళ్ళొద్దంది " అన్నాడు సిగ్గుగా. .


    నాన్నగారు విస్మయంగా చూసి, “ఎందుకు?" అనడిగారు.


    చంటికేం చెప్పాలో అర్ధం కాలేదు. ఆలోచన్లో పడ్డట్టు మొహం పెట్టాడు.


    నాన్నగారు వంటగదిలోకి కేకేసి, “చంటిగాణ్ణి స్కూలు కెళ్లాద్దన్నావట?” అన్నారు.


    “ఆఁ లోపల్నుంచి సమాధానం.


    “ఎందుకూ?"


    “రేపెళ్తాడులెండి"


    అయోమయంతో లేచి లోనికెళ్ళారు నాన్నగారు. చంటి నేరస్తుడిలా వున్న చోటునే నిలబడ్డాడు. ఈయన స్కూలు కెళ్ళమనడుగదా? '


    “ఎందుకనెళ్ళోద్దన్నావ్?” అడిగారు నాన్నగారు.


    “వాడు నిన్న ఆదివారమంతా గెంతీ గెంతీ ఈ రోజు బడికెళ్ళడానికి బద్దకిస్తున్నాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. స్కూలికి పోనన్నాడు-సర్లేమ్మన్నాను.”


    “అలా ఎందుకన్నావ్? చదువు దగ్గరేం గారాలు?”


    “పోన్లెండీ. రేపు వెళ్తాడు. రెండు నెల్లేగా బళ్ళోచేరి.”


    నాన్నగారు ముందుగదిలోని కెళ్ళిపోయి చంటివైపు చూడకుండా సీరియస్ గా పేపర్లో పడ్డారు.


    చంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కణ్ణించి కదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగుమీద కూచోని దిగుల్లో పడ్డాడు. నాన్నగారికి క్కోపమొచ్చినట్టుంది.


    ఇందాకా గీచిన బొమ్మలు చెరిపేశాడు.


    ఎండవాలు కాస్త ఎక్కువయ్యే వేళకి లేచి ఇంట్లో చాపమీద కూచొని హోం వర్క్ చేస్తున్న అక్క దగ్గరకెళ్ళి “అక్కా, కేరం బోర్డాడు కుందామా?” అడిగాడు. కుతూహలంగా.


    “హోంవర్క్ చేసుకొని న్కూలు కెళ్లాల్సుంటే నీతో కేరమ్సాడుకొంటూ కూచోమ్మంటావా?”


    పేపర్లోంచి నాన్నగారు, “ఏం నిన్నంతా ఏంజేశావ్?” అడిగారు.


    అక్క తల పైకెత్తి చూసి, “చేసుకోలేదు' ' అని నవ్వేసి మళ్ళీ చివరిలెక్క చెయ్య డంలో మునిగి పోయింది.


    చంటి బాసింపట్టేసుక్కూచొని బుద్ధిగా అక్క చేస్తున్న పనివైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు. అసలేం అర్థంకాలేదు. విసుగుపుట్టి లేచి పెరట్లో కి వెళ్ళాడు. బంతిపూవు మీద కూచొని సీతాకోక చిలకొకటి కనిపించింది. చప్పుడు చెయ్యకుండా వెళ్ళి పట్టుకోబోయాడు. సీతాకోకచిలక ఎగిరిపోయి మరోచోట వాలింది. చంటి మళ్ళీ పట్టబోయాడు. అది ఆకాశంలోకి లేచి పెరటి గోడ దాటి ఎగిరిపోయింది. చంటి నిరాశపడిపోయి ఇంకేమన్నా సీతాకోక చిలకలున్నాయా అని చూశాడు. లేవు-ఇంకొంచెం ముందు వచ్చుంటే వుండేవి.


    చంటి బంతిపూలు కోద్దామా అని ఆలోచించాడు. అమ్మ తిడుతుంది. నేలమీదికి చూశాడు. పెరటిగోడ మొదట్లో గడ్డిపూలున్నాయి. వెళ్ళి ఒక్కోటి ఒక్కోటీ కోస్తుంటే వానపామోకటి బద్దకంగా కదుల్తూ కనిపించింది. చంటి అటూ ఇటూ చూసి ఓ ఎండుపుల్ల నేరి వానపాముని కదిలించాడు. అది కాస్త వేగంగా కదిలి ఓ గడ్డి మొక్క పక్కన చిన్నబొరియలోనికి దూరి పోయింది. ఎండు పుల్లతో బొరియ లోకి గుచ్చాడు. వానపాము బయటికి రాలేదు. గడ్డి మొక్కపట్టి పీకాడు. బొరియ


    పెద్దదైంది. గాని వానపాము మాత్రం రాలేదు. అయితే బలంగా వీకేసరికి గడ్డిమొక్క వేళ్ళతో సహా ఊడోచ్చి చంటివెనక్కి చిత్తడిలోకి పడ్డాడు.


    ఛీ ఛీ బురదైపోయింది.


    “ఒరెయ్ చంటి, ఉప్మాతిందూగాన్రా !' లోపల్నుంచి అమ్మ కేకేసింది.


    మొహమంతా చిన్నబుచ్చుకొని లోనికొచ్చిన చంటిని చూసి


    “చీ...చీగాడిదా, ఇందాకే కదరా స్నానంచేశావ్,” అని బుగ్గగిల్లి లాక్కెళ్ళి చొక్కాలాగూ తీసేసి నీళ్ళ గదిలో చంటి కాళ్ళూ చేతులూ కడిగింది.


    చంటికి బుగ్గ మంట పెట్టింది. కళ్ళల్లోకి నీళ్ళిచ్చాయి. రోషమొచ్చింది.


    అమ్మ లోపలికి తీసుకెళ్ళి వేరే బట్టలేసి ఉప్మాపెట్టింది.


    చంటి ఉప్మా తిని వీథి గుమ్మం దగ్గర నిలబడ్డాడు.


    పక్కింటి హరిగాడు పలకా పుస్తకం పట్టుకొచ్చి “ఏరా కిరణ్' బడికి రావా?” అనడిగాడు.


    చంటి ఫోజుగా తల పై కెగరేసి లేదన్నట్టు తలూపాడు.


    “ఏం?"


    “మా అమ్మొద్దంది ”.


    హరికి అర్థం కాలేదు.


    “దేనికి?”


    “నేనే పోనన్నాను.”


    “అసలు స్కూలుకే రావా?”


    “వస్తాను, ఈ రోజు రాను.”


    “మరి మీ అమ్మ కొట్టదా?”


    “మా అమ్మ కొట్టదుగా” అన్నాడు చంటి గర్వంగా.


    హరి వెళ్ళిపోయాడు. చంటి ఇంకాసేపు అక్కడే నిలబడి ఇంట్లో కొచ్చాడు.


    తెలుగు వాచకం' ముందేసుక్కూచుని బొమ్మలు చూడ్డం మొదలెట్టాడు. కాస్సేపటికి అక్క స్కూలు కెళ్ళిపోయింది. బట్టలేసుకొని నాన్నగారు పదింటికి ఆఫీసు కెళ్ళిపోయారు. పుస్తకం పక్కన పడేసి విసుగ్గా హాల్లో కొచ్చాడు చంటి.


    ఆదివారానికి మామూలు రోజుకీ తేడా అప్పుడు తెలిసింది. కేరమ్స్, బంతాట ఆడటానికి అక్కలేదు. స్కూలుకెళ్ళి పోయింది. ఒళ్ళో కూచోబెట్టుకొని కథలు చెప్పడానికి, మురిపించడానికి నాన్నగారు లేరు. ఇల్లంతా బోసిపోయి మూగగా కనిపించింది.


    నాన్నగారి కుర్చీ ఖాళీగా కనబడితే దిగులుగా వెళ్ళి కూచుని బల్లమీదున్న లావుపాటి పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకొని పేజీలు తిప్పడం మొదలెట్టాడు లోపల బొమ్మలేం లేవు.


    చంటికి ఒకసారి నాన్న చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. నాన్న ఈ పుస్తకం చదువుతుంటే “ఏవిఁట్నాన్నా అది?” అనడిగాడు తను.


    “నా పుస్తకం నాన్నా”


    “ఏముంటుందందులో?"


    “ఆఫీసుమాటలుంటాయి”


    “ఓ” అని అర్థమైపోయినట్టు కళ్ళు మెరిపించాడు.


    “ఎంత పెద్ద పుస్తకమో?” అన్నాడు తను మళ్ళీ.


    నాన్నగారు నవ్వి, “నువ్వూ రోజు స్కూలుకెళ్ళి బాగా చదూకుంటే ఇంతకంటే పెద్ద పుస్తకాలు చదివేస్తావు నాన్నా” అన్నారు. తనకు భలే సంతోషమేసింది.


    ఈ విషయం గుర్తుకురాగానే హాయిగా నవ్వుకొంటూ కుర్చీ వెనక్కి వాలి ఆలోచన్లో పడ్డాడు .


    తను స్కూలు కెల్తాడు. బాగా చదూకుంటాడు. నాన్నగారిలా పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివి పారేస్తాడు. ఒళ్ళోని పుస్తకం అపురూపంగా కనిపించి దాన్ని ప్రేమగా నిమిరి జాగ్రత్తగా బల్లమీద పెట్టాడు .


    గుండెలురకలేస్తూండగా అమ్మదగ్గరికి పరిగెత్తాడు. “అమ్మా....అమ్మా. నేనేం, నాన్నారిలా పెద్ద పే....ద్ద పుస్తకాలన్నీ' చదివేస్తాను పెద్దయ్యి” అన్నాడు ఉత్సాహంగా.


    “ఊహూఁ ” అందమ్మ నిరాసక్తత చూపుతూ.


    “ఇంతింత పెద్ద పుస్తకాలు....” రెండు అరచేతుల నడుమ గొప్ప ఖాళీని చూపుతూ అన్నాడు.


    “ఎలా? నువ్వు సరిగ్గా బడికెళ్ళవుగా?” 'చంటి ఉత్సాహం నీరుగారి పోయింది. ఖిన్నుడై వెళ్ళిపోతున్న కొడుకుని చూసి నవ్వుకొంది. అమ్మ.


    చంటి పెరట్లోని కొచ్చాడు. బాగా ఎండ కాసింది. అడుకోవాలనిపించలేదు. ఇంట్లో కొచ్చేశాడు. మళ్ళీ వెళ్ళి నాన్నగారి కుర్చీలో కూర్చున్నాడు.


    హరిగాడేం చేస్తున్నాడో? నిన్న హరిగాడితో తనెంత ఆడుకున్నాడో?


    హరి గుర్తుకొచ్చేసరికి చంటికి స్కూలు గుర్తుకొచ్చింది. స్కూలుతోపాటు టీచర్ గుర్తుకొచ్చింది.


    టీచరంటే చంటికి భలే ఇష్టం. ఎన్నెన్నో కథలు చెబుతుంది--కొట్టనే కొట్టదు. .


    నల్లటి టీచర్ మొహాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు చంటి. ఆవిడ మొహానికి మందంగా పూసుకొనే పౌడరూ, నుదుట ఎర్రటి తిలకం బొట్టు, కళ్ళకు పెద్ద పెద్ద కళదాలు, వొదులుగా వేసుకొనే జడ. చేతిలో బెత్తం. ఇంకా బల్లమీది డస్టరూ, చాక్ పీసులూ బ్లాక్ బోర్డూ అన్నీ గుర్తుకొచ్చాయి. టీచరెవ్వర్నీ కొట్టదు. బెత్తం మాత్రం చేతిలో ఊతంగా ఊగుతూనే ఉండాలి.


    చంటికి తన డెస్కు గుర్తుకొచ్చింది. ఖాళీగా వుండి వుంటుంది. చెప్పలేనంతగా దిగులేసింది.


    లేచి ఇంట్లోంచి బయటి కెళ్ళాడు. బయట దూరంగా రోడ్డు పక్కన ఓ చెట్టు మొదట్లో కొంతమంది చింపిరిషిల్లలు గోళీలాడుతున్నారు. వెళ్ళి కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు. చంటికి గోళీలాడ్డం రాదు. వాళ్లలో ఒకడు ఎడంచేత్తో గోళీలు విసిరి కుడిచేత్తో కొట్టడానికి ఒక కన్నుమూసి, తెరిచిన రెండో కంటి చివరకు మునివేళ్లతో గోళీని పట్టుకొని గురిచూస్తూ చేతిని ముందుకీ వెనక్కీ ఆడిస్తూ వుంటే భలేతమాషాగా అనిపించింది. చంటి చూస్తూండగానే వాళ్ళలో వాళ్ళకి కొట్లాట మొదలయ్యింది. రెండో వాడు మొదటివాణ్ణి తిడుతూ ఎడంచేత్తో వెనక్కి తోశాడు.


    మొదటివాడు ముందుకు లంఘించి రెండోవాడ్ని చంకలో ఇరికించుకొంటే వాడు మొదటివాణ్ణి మోచేత్తో పొత్తికడుపులోకి గుచ్చాడు.


    చంటికి భయమేసి ఇంట్లోకి దూరిపోయి పెరట్లో కెళ్ళాడు. మూడు రాళ్ళనేరి తనూ గోళీలాట మొదలెట్టాడు. ఎండలో చురుకుపాలు చాలా పెరిగింది. ఒంటరిగా ఆడినంతసేపాడి రాళ్ళు పారేసి ఇంట్లోకొచ్చాడు.


    అమ్మ బియ్యం చెరుగుతోంది. దగ్గరకెళ్లి, “అమ్మా తాయిలం చెయ్యవూ” అనడిగాడు.


    “రోజూ తాయిలమెక్కణ్ణించి తెచ్చేదిరా నిన్న తిన్డేదూ?"


    “ఊఁహూ. చెయ్యి"


    “ఊఁహూఁ నిన్నంటే అక్క కూడా వుండిందికదా?"


    “అక్క మళ్ళా తింటుందిలే”


    “ఊఁ, బావుంది నువ్వు స్కూలు కెళ్ళనపుడల్లా తాయిలాలు చేసి పెట్టాలా?


    అది వారం పూటంటే అందరూ వుంటారు, అందరూ తింటారు. మళ్ళీ ఆదివారం చేస్తాలే.”


    ఉక్రోషంగా చంటి అక్కణుంచి వెళ్ళి పోయాడు.


    ఇప్పుడు పూర్తిగా ఒంటరితనం కనిపిస్తోంది. ఆడుకోవడానికెవరూ లేరు. వెళ్ళి కేరంబోర్డు ముందేసుకొని ఒక్కడే ఆడ్డం మొదలెట్టాడు. ఇట్నుంచటు కొట్టి స్ట్రైకర్ ని కొట్టి అవతలి కెళ్ళి తెచ్చుకోవాలంటే చిరాకేసింది. బోర్డు నెత్త కుండా ఎక్కడి కాయిన్లక్కడే పడేసి లేచిపోయాడు.


    బయటికొచ్చి చూశాడు. గోళీలాడుకునే పిల్లల్లేరు.


    మళ్ళీ ఇంట్లోనికొచ్చి అమ్మ దగ్గరికెళ్ళి, “అమ్మా కథ చెప్పు” అన్నాడు.


    “పన్లు చేసుకొంటుంటే కథలు కావాల్సొచ్చాయా? పనుంది పో”..


    అక్కడే కూచుని అమ్మ బియ్యం క చెరగడం చూస్తూ మెల్లగా జరిగి ఒళ్ళో తలదాచుకోబోయాడు. తోసేసింది.


    అప్పుడొచ్చిందేడుపు. లేచి నిలబడి కాళ్ళు నేలకేసి కొట్టి ఏడుస్తూ వెళ్ళి చాపమీద పడుకున్నాడు. మళ్ళీ అమ్మొచ్చి పిలిచే వరకూ అక్కడే వున్నాడు.


    “అన్నం వండాను తినవా?" ,


    “నేను తినను ఫో”


    “మా చంటి కదూ? రామ్మా.”


    “ఊహూఁ .”


    “మా అమ్మకదూ రామ్మా.” గడ్డాన్ని చేరిన అమ్మ చేతిని తోసేశాడు.


    “రావా?'“తాయిలం 'వద్దా?”


    చటుక్కున లేచి కూచున్నాడు. “తాయిలమా?"


    “తిందూగాన్రా ”.


    “ఊహూఁ " బెట్టు చేశాడు


    “నాకేం. ఇక్కడే పడుకో" అని అమ్మ వెళ్ళిపోతుంటే ఇంకా బతిమాలనందు క్కోపఁవొచ్చిందిగాని తాయిలం కోసం, ఝామ్మని లేచి వెంట పరిగెత్తాడు.


    చంటి భోంచేశాక ఆఫీసునుంచి ప్యూనొచ్చాడు. నాన్నగారికి. అక్కకూ అతను , కేరియర్స్ పట్టుకెళ్లాడు.


    “సిన్నయ్యగోరు స్కూలు కెల్లేదులా వుంది.”


    “వెళ్ళడు ఫో నీకేం”! తన్నాలన్నంత కోపఁవొచ్చింది చంటికి.


    “హబ్బో హబ్బో సిన్నయ్యగారి కెంత కోపం!" ఉడికించాడు.


    రోషంగా వెళ్ళి చాపమీద పడుకున్నాడు. చంటికి మళ్ళీ స్కూలు గుర్తుకొచ్చింది. గుంపులు గుంపులుగా పిల్లలు, తెలుగు వాచకం పట్టుకొన్న టీచరు చాలా ప్రియంగా కనిపించారు. స్కూలుమీద అనుకోని ప్రేమ ముంచుకొచ్చేసింది.


    అలాగే పడుకొని నిద్రపోయాడు చంటి.


    సాయంత్రం నాలుగున్నరకు నిద్రలేచి కాస్సేపు అటూఇటూ తిరిగి వీధిగుమ్మం దగ్గరికెళ్ళి నిలబడితే హరిగాడు స్కూలు నుంచి ఇంటికొస్తూ కనిపించాడు


    “ఒరే కిరణ్, నువ్వు రాలేదురా, టీచర్ భలే కథ చెప్పింది."


    ఉత్సాహంగా ముందుకు వంగి, “ఏం కథరా" అడిగాడు చంటి.


    “జింకా నక్కా కథ."


    “ఒరే ఒరే నాకు చెప్పరా.”


    “తర్వాత చెప్తారా, టీచర్ నువ్వు రాలేదేమంది. నువ్వు చెడిపోతున్నా వన్జెప్పింది."


    చంటి గుండె దిగజారిపోయింది.


    “ఒరే, ఈ రోజు కేశవం మాస్టారు మాఅందరిచేతా కబడీ ఆడించారు వాళ్ళ క్లాసువాళ్ళకీ, మనకూ"


    “ఎవరు గెలిచారా?”


    “మనమే."


    చంటిగుండె గర్వంతో నిండిపోయింది. హరి వెళ్ళిపోయాక చంటి దిగాలుగా ఇంట్లో కెళ్ళాడు.


    సాయంత్రం నాన్నా అక్క వచ్చేశాక బాగా ఆడుకున్నాడు. ఊరికే నాన్న దగ్గర్నుంచక్క దగ్గరికీ, అక్క దగ్గర్నుంచి నాన్న దగ్గరకీ తిరిగాడు.


    ఆ రోజు రాత్రి పడుకోబోయేముందు “అమ్మా, జింకా నక్కా కథేంటే?” అనడిగాడు చంటి.


    “ఏ జింకా నక్కా?”


    “ నాకేం తెలుసు. మా టీచర్' చెప్పిందట. హరిగాడన్నాడు.”


    “అదా" అని అమ్మ చెప్పడం మొదలెట్టింది. “అనగనగా ఓ అడవిలో ఓ జింక వుండేదట. ఓ నక్క దాన్ని చూసి, ఎలాగైనా తినేద్దామని దాంతో స్నేహం చేసిందట....


    చంటి ఒళ్ళంతా చెవులు చేసుకొని కథ విన్నాడు.


    కథ విపరీతంగా నచ్చేసింది. బాగా పొద్దుపోయాక అమ్మ గుండెల్లో వెచ్చగా మొహం దాచేసుకొని ఏవో ఆలోచనల్లో పడిపోయినవాడల్లా ఉన్నట్టుండి తల పైకెత్తి “అమ్మా-రేపు తొందరగా నిద్రలేపాలి” అన్నాడు.


    కళ్ళు మూసుకు పడుకున్న అమ్మ కళ్ళు తెరచి చూసి “దేనికి అనడిగింది.


    “స్కూలు కెళ్ళడానికి" అనేసి మళ్ళీ గుండెల్లో దాగిపోయాడు చంటి. .

    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    22 min
  • వంశీ గారి 'సొట్ట ఆదిగాడు' - 'మా దిగువ గోదారి కథలు' నుంచి

    'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి.

    పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)

    'సొట్ట ఆదిగాడు':

    ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.

    ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.

    అయితే, దొంగలుగానీ, దోచుకుపోయేవాళ్ళుగానీ ఆ ప్రాంతాలకి రాకండా కూలోళ్ళు పాలేళ్ళూ ఉద్దారకుడూ పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది.

    గంగాలమ్మంటే మామూలు మనిషి కాదు. గ్రామదేవత. మహాశక్తి, ఆది శక్తి. ఆవిడకి విగ్రహం లేదు. తోటలో ఒక పంపర పనాస చెట్టు మొదట్లో బొట్టెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దణ్ణాలు పెట్టుకుంటారు.

    ఆమధ్య మాదిగ పేటలో కాళిదాసు సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్లామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర (పంపరపనస చెట్టు మొదట్లో) రక్తం కక్కుకు చచ్చిపడున్నాడు.

    ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్లామని నావఁ వేసుకెళ్తే, తెల్లవారేసరికి వాళ్ల తలకాయలు పొగాకు తోటలోనూ, మొండాలు ఎక్కడో వున్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి.

    పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నదిఎన్నాళ్ళకి తేలలేదు.

    అయినా సరే డిటెక్షను చేస్తున్న పోలీసుల్ని చూసి, నవ్వుకున్న గోపిలంక జనం, “వెర్రిగాకపోతే ...అమ్మోరు. వీళ్ళకి దొరుకుద్దా?” అనుకున్నారు.

    అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తీనీ,

    ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్నీ బోల్డన్ని మేకపోతుల్ని గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ వుంటుంది. నెర్రలు తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతా వుంటుంది. అమ్మవారికి తుని నించి కొమ్ము బూరా వాళ్లని, పెద్దాపురం నించి డప్పులవాళ్లని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రమేంటంటే ఎప్పుడూ గుమాస్తాలకి వదిలేసే ఆ రాజులో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ..

    ఎడం కాలు మడం దగ్గర తోడెయ్యడంతో వేళ్ళని మాత్రం భూమ్మీద ఆన్చి నడిచే గుత్తాల ఆదియ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు.

    అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో జేరాడు.

    ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరొచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావి కంపాడు రాజులు ముగ్గురొస్తున్నారు.

    గోపిలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే, ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా, సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో వున్నారు.

    రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    తూర్పు నుండే తోటల మధ్య పడమట వేపుండే గోదావరితల్లి కనపడేలా కొబ్బరితోటల మధ్యలో అచ్చం రాజులకోటలా కట్టిన గెస్టహౌస్లోకి దిగిన రాజులు, పాలేళ్ళందరికి తలకో జత బట్టలూ నూట పదహారు! చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకి ఆర్డర్లేశారు.

    ఎక్కడ దొరికిందో మూడు ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెల్సింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులో మాటాడాలనిపించింది

    సొట్టాది గాడు అనుకుంటున్నట్లు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసే వారు. కానీ, ఎవరి పనుల్లో వాళ్లుండటంతో ఈడ్ని పట్టించుకోలేదు.

    గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి, ఈ వాతావరణం ఇంత గొప్పగా వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్లు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి దణ్ణమెట్టుకుని ఇక నించి ప్రతి ఏడూ వస్తామని మొక్కుకున్నాకా స్కాచ్ పోసిన గ్లాసులందుకున్నారు.

    ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు, “మా రాజులకి నమస్కారవండి," అన్నాడు. 

    మందు పుచ్చుకుంటా ఎవర్నువ్వన్నట్టు చూశారు.

    “నన్ను సొట్టాదిగాడంటారు బాబూ..." అంటా ఆ రాజుగారి నోట్లో వున్న దాన్ని చూసి, "తవరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా వుంది," అన్నాడు.

    నవ్వేసిన రంగరాజు, "ఇదా? దీన్ని కింగ్ సిగరెట్ అంటార్లే... సిగరెట్ కోసమొచ్చావా?" అనందిస్తుంటే సిగ్గుపడతా తలొంచుకుని, “వద్దండి బాబూ నా దగ్గర గుర్రంబీడి వుందండి." అన్నాడాదిగాడు.

    "అయితే సరే," అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు.

    వాళ్ళ ముందు చతికిలబడిపోయిన సొట్టాదిగాడు, “ఎంత కింగయినా గుర్రం లేకపోతే వేస్ట్ కదండీ,” అనడంతో గతుక్కుమన్న రంగరాజు, "ఈడికి బాగా ఎక్కేసినట్టుంది.” అన్నాడు.

    "స్కాచ్ పక్కన నీచు కాదండి... కొంకిడికాయ రసం కలిపిన సందకల్లు తాగండి. అసలు కిక్కేంటో తెలుస్తది." అన్నాడు సొట్టాదిగాడు.

    మూడో రౌండు పోసుకుంటున్న పర్వతాలరాజుగారు, “ఏరా.... పండగపూట ఒంటిమీద బట్టలు చేతిలో డబ్బులూ పడేసరికి మాట తేడా వచ్చేసింది,” అన్నారు.

    నవ్వేసిన సొట్టాది, "మావి మాటలే బాబూ... సేతలు మాత్రం మీవి.." అంటా లేచి, “ఏవండి... జత బట్టలు జీవితమంతా సరిపోతాయా... నూట పదార్లుతో నేను సచ్చిదాకా కల్లు తాగల్నా" అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాలరాజు, “మరి మీలాంటి కూలి నాకొడుకులకి మా భూములు బంగ్లాలూ రాసెయ్య మంటావా?" అన్నాడు.

    "నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తదండీ కష్టమేంటో."

    సొట్టాదిగాడి నడ్డి మీద తన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగార్రాజుగారు. అయినా కోపం ఆగని రంగరాజు, “ఏంట్రా నోరు లెగుస్తుంది," అన్నాడు.

    “కూలోడు గోదారితల్లిలాంటోడండి... ఆడెప్పుడు గోపాదాలరేవులో గోదారమ్మలాగ మెదలకండానే వుంటాడండి... సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాలాగ రెచ్చిపోతాడండి," అన్నాడు సొట్టాదిగాడు.

    "అసలు వీడ్నిక్కడికెవడు రానిచ్చేడు," అంటా చిరాగ్గా లేచి ఆదిగాడ్ని తన్నడానికెళ్ళబోతున్న రంగరాజుని వెనక్కి లాగిన బంగార్రాజు, "ఈ ఈవినింగు మనకో ఎంటరటైనుమెంటీడు. సీరియస్సవ్వకండా కూర్చో జెబుతాను," అని కూర్చోబెట్టి సొట్టాదిగాడి కేసి చూసి, “ఏరా కుంటోడా... నీ కంత అన్యాయమేం జేసేంరా." అన్నాడు.

    “దార్లో కొచ్చేరు," అంటా నవ్వేసి, "కల్లు రేటు పెరిగింది... కూలి రేటు పెంచలేదు... రోజంతా రెక్కలు ముక్కలు జేసుకునేదెందుకండీ, పొద్దోతే గొంతులో పడే ఆ కల్లుకోసమో సారాకోసమో గదా... ఏవండి గట్టు మీద కూర్చుని చూసే వాడికేం తెలుసండీ కమతంలో కష్టం ఏంటో? ఊరికే ఇచ్చినట్టు అంత ఇదైపోతారేంటండీ. ఇక్కడ జేసే ప్రతి పన్లోనూ మా కల్లూ సారా వున్నాయండీ... అదే... మీ సేవలకి రక్తం మొత్తం కరిగిపోయి ఒంట్లో మొత్తం ఇప్పుడున్నది కల్లే కదండీ... సంటి పిల్లోడి చేతిలో తాయిలం పెట్టినట్టు ఏడాదికోసారి కంటి తుడుపుగా మీరేదో ఇస్తే మా రాజులుంగారిచ్చేరంటా ఏడాది పొడుక్కి పని చేస్తారండి మా బుర్ర తక్కువ ఎదవలు... అందుకే నేనొకటినిర్ణయించుకున్నానండీ."

    “ఏంట్రా?"

    “మూడునెల్లకో జత బట్టలూ, పది తాళ్ళున్న అయిదెకరాల పొలం నా పేర్న రాస్తేనే రోజూ పన్లో కొచ్చేస్తానండి."

    మేనేజరు నారాయణమూర్తిని పిల్చిన పర్వతాలరాజుగారు, "వీడ్ని అర్జంటుగా బయటికి తొయ్యండి," అన్నాడు.

    "ఆ లాగేవోడికన్నా డబ్బులు కరక్టుగా ఇవ్వండి బాబూ... లేకపోతే ఏదో రోజూ కోపంతో మిమ్మల్ని నేను గోదాట్లోకి లాగెయ్యగలను," అంటున్న ఆదిగాడి అంతా బయటికి లాక్కెళిపోయారు..

    సొట్టాదిగాడి దెబ్బకి రాజులు ముగ్గురూ తాగిన స్కాచ్ మొత్తం దిగిపోయేసరికి కొత్తబాటిలో పెన్ చేశారు.

    చిన్నప్పుడే మేనకోడలు వీరలక్ష్మితో పెళ్ళయిపోయిన సొట్టాదిగాడికి ఇద్దరు కవలపిల్లలు. అదీ ఆడ పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలంటే పంచప్రాణాలు. వాళ్ళు కడుపునిండా తింటుంటే చూడ్డం చాలా యిష్టం వాడికి పొద్దుట రేవులోకెళ్ళి శివాలక్ష్మి హొటేలో ఇడ్డెన్లు తెచ్చి పెడతాడు. సాయంత్రమైతే మళ్ళీ రేవులో చినబ్బు కాఫీ హోటేల్లో పెసర పొణుకులు తెచ్చి తినిపిస్తాడు. ఆ పిల్లలూ వీరలక్ష్మి తిన్నాకా మిగిలింది మట్టుకే తింటాడు సాట్టాదిగాడు.

    "పగలంతా పని చేసాచ్చే నువ్వు ఇదేంటిలా పస్తు?" అని వీరలక్ష్మడిగితే నవ్వేసెళ్ళిపోతాడు ఏటిగట్టు వేపు. అలా వెళ్తా వెళ్తా తల్లి గోదారి గాలిని పీలుస్తా తన బిడ్డల్నే తల్చుకుంటా ఆనందపడతాడు.

    అలా అందర్నీ తిడతా వుంటే ఆ ఏరియాలో ఎవడూ పనిలో పెట్టుకోడం లేదాడిని. దాంతో పెళ్ళాం పిల్లల కోసం గోదావరి గట్టుమీద చాలా మైళ్ళు నడిచి కోటిపల్లి అవతలున్న కూళ్ళ ఇసక రేంపులో జేరాడు.

    ఎండిపోయిన గోదావరిలో ఇసకని ప్రొక్లైనర్ల తో తీసి లారీలో వేస్తున్నారు. అక్కడొకటీ అక్కడొకటి ఆఫీసు పాకలు. అందులో వున్న గుమస్తాలు లారీల ట్రిప్పులు రాసుకుంటున్నారు. ఎక్కడికక్కడ మేనేజరూ సూపర్‌వైజర్లు కల తిరుగుతున్నారు. వాళ్ళ పని ఈ నాలుగు నెలలే. తర్వాత వర్షాకాలమొచ్చేస్తుంది. వరదలో గోదావరి ములిగిపోతుంది. కోట్ల మీద పాట పాడిన కాంట్రాక్టరు ఈలోపే తన పెట్టుబడి లాభాల్తో సహా వెనక్కి లాక్కోవాలి. దాంతో ఎవరికీ నిద్రలుండటం లేదు. రాత్రీ పగలనక పనిచేస్తున్నారు. ఏటిగట్టు మీంచి లోపల గోదావరి దాకా ఒక కిలోమీటరు పొడుగున ఇసక, కొబ్బరాకులు వేసి దానిమీద మళ్ళీ ఇసక వేసి తడుపు తున్నారు. జనంలో ఎక్కువమంది వూరికి దూరంగా వున్న లాకు పేటలో వాళ్ళే. వాళ్లలో కలిసిపోయిన సొట్టాది గాడు సీవెండి బిందెలో నీళ్ళు తెచ్చి తడిపే పని చేస్తున్నాడు.

    రేంపుని ఆ ఏడు వేలం పాట పాడుకున్న సలాది సూర్రావు మంచి భోజనప్రియుడు. రేంపులోనే కుదుమట్టంగా వంట పాకనేయించి వారానికో రకం కూరలూ, పులుసులూ, వేపుళ్లూ వండించడం మొదలెట్టాడు. సాయంత్రమైతే మసాలా గారో, ఉల్లిపాయ పకోడిలో వేయిస్తున్నాడు. ఆ కూలోళ్ళ మధ్యలో తనూ వాళ్ళలో ఒకడిగా కల్సిపోయి చిల్లో బొల్లో మంటా మాటాడుంటే చూసిన జనం, ఈరికి పెద్దా చిన్నా లేదం'టాని సంబరపడిపోతున్నారు. వాళ్ళు చేస్తున్న బండ చాకిరీ మర్చిపోతున్నారు. అందరి కంటే ఎక్కువ ఆ పని చేస్తా చూస్తున్న సొట్టాది గాడు కొన్ని రోజులు చూశాడు.

    అది కల్లు సీజను కాదు. దాంతో పుల్లు నాటుసారా పట్టించేసి సూర్రావు దగ్గర కెళ్లేసరికి కూలోళ్లతో పంక్తి కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు సూర్రావు, నమస్కారం పెట్టి కూర్చున్న సాట్టాదిగాడికి ఆకేసేరు

    దాన్ని ఇసకలోకి విసిరేస్తున్న ఆదిగాడ్ని చిత్రంగా చూస్తున్నారు. 

    "ఏరా ఏమైంది?" అన్నాడు సూర్రావుగారు. 

    "గుండెల్లో మంటగా వుందండి." అన్నాడు.

    “రాంపురంలో స్టాలిన్ డాక్టర్ గారి దగ్గరకి తీసుకెళ్ళి ఏదన్నా మందేయించనా?" అన్నాడు సూర్రావు.

    “నేనే వేసుకున్నానండీ. గాబట్టే ఆ మంట బయటికొచ్చిందండి... ఏవండీ... సవ్వాదిగా వుండే పెసర పొణుకులూ మసాళాగార్లూ మీకిష్టమైతే మేవెందుకు తినాలండి... సీక్రేటు చెప్పనాండీ . మీరు తినగా మిగిల్సి మాకెడతన్నారండి... మా పిచ్చి యెదవలు ఇదంతా మామీద మీకిష్టవనుకుంటున్నారండి." అనాగేడు అదిగాడు.

    ఏం చదువుకోపోయినా వ్యాపార లక్షణాలు తెల్సిన సలాది సూర్రాపుగారికి ఎక్కడ పెంచాలో ఎక్కడ తుంచాలో బాగా తెల్సు. దాంతో నవ్వుతా, "చూడొరే కుంటోడా ఇవన్నీ మీకోసమే చేయిస్తున్నాను." అన్నాడు..

    నవ్వేసిన సొట్టాదిగాడు, “ఆకలితో ఉంటార్రే, ఆకులో ఏది పడేస్తే అది తింటార్లే అనుకుంటున్నారండీ... మాకూ రుచులు తెల్పండీ," అన్నాడు.

    "ఒరేయ్... వోనర్నన్న విషయం కూడా మర్చిపోయి మీ అందర్లో కల్సిపోయి పని చేస్తున్నాన్రా... మిమ్మల్ని నా పిల్లల్లాగ చూసుకుంటన్నాన్రా. అలాంటి నా గురించి ఏంట్రా నోటికొచ్చినట్టు మాటాడతన్నావ్?"

    "మీ పిల్లల్లాగ జూసుకుంటన్నావా? అయితే మీ పిల్లల్ని గూడా రేపట్నుంచీ మా పన్లోకి పంపండి. లేదా మమ్మల్ని మీ పిల్లల్తో పాటు స్కూళ్ళకి పంపండి."

    ఆవేశంతో రెచ్చిపోయిన సూర్రావు వూగిపోతా. “ఒరేయ్," అనరిచాడు.

    "ఓనర్... ఓనర్లాగుంటే మాటాడలేకపోయేవాడ్నేమో... మీరు ఓ కూలోడిలా మాతో బాటు తిరుగుతా మధ్యలో ఇది చెయ్యి అని చెబుతా మాతో బండెడు చాకిరీ చేయించుకుని చికెనుముక్కలూ చిల్లిగార్లూ అన్నంలో పడెయ్యడం గాదు. ఈ ఎదవ డ్రామాలొద్దుగానీ కరక్టుగా డబ్బులివ్వండి."

    అప్పటికే చాలా సేపు ఓరిమి పట్టిన సూర్రావు ఇక ఆగలేక ఆదిగాడి గూబమీద లాగి పెట్టి కొట్టేసి, “మళ్ళీ ఈ రేంపులోకొస్తే గోదారి మధ్యలో ముంచేస్తాను పోరా." అనరిచాడు

    .

    గూబమీద రుద్దుకుంటా సూర్రావు మీదకి దూసుకుంటా వచ్చిన సొట్టాదిగాడు, "ఈ రేంపేవన్నా నువ్వు గుట్లేసి పోశావా?... గోదారితల్లి ప్రాసాదం ఇది... మూడునెల్ల తర్వాత నువ్వు కూడా ఇక్కడుండవ్... ఇదిగో సలాది సూర్రావూ నీ భోగం మూడ్నెల్లేరా... మట్టిని నమ్ముకుని మేం బతుకుతున్నాం. మట్టిని అమ్ముకుని నువ్వు బతుకుతున్నావ్," అనరుస్తున్న ఆదిగాడ్ని చితకబాదేసి సూర్రావు అలుపొచ్చేదాకా ఆ గోదావరి గట్టుమీద తరుముతానే వున్నాడు.

    - గోపిలంక తిరిగొచ్చిన సొట్టఆది గాడు అలికిన నేలమీద పడుకుని కముకు దెబ్బలతో మెలికలు తిరిగి పోతుంటే ఏడుస్తా వేణ్నీళ్ళు కాపడం పెట్టింది వీరలక్ష్మి.

    రోజులు గడుస్తున్నాయి.

    పని చెయ్యాలి. లేకపోతే పెళ్ళాం బిడ్డలు మాడిపోతారు. తెల్లవారుఝాము మూడు దాటేక గోదావరి గట్టు మీదే నడుచుకుంటా పిల్లంక, పెదలంక, బోదిలంక దాటుకుంటా కోటిపల్లి సుందరపల్లీ దాటి తమ్మాయి పాలెం, కూళ్ళ, కోరుమిల్లి దాటేక వచ్చే కపిలేశ్వరపురం రేవులో కొచ్చి అక్కడ్నుంచి ఇసకలో మైలు దూరం నడుస్తా రేంపులో ఉన్నవాళ్ళ ఆఫీసులో కెళ్ళి తనెంత దూరం నించొచ్చేడో చెప్పి తన కష్టాలు చెప్పుకుని పన్లోకి జేరేడు.

    ఆ రేంపు కాంట్రాక్టరు పేరు చుండ్రు వెంకట్రావు. సలాది సూర్రావు దగ్గర పనిచేసొచ్చి కాంట్రాక్ట రయేడేమో కొంచెం అటూ ఇటూగా ఆ సూర్రావు టైపే. 

    అయితే తాటి బెల్లం ముక్క బుగ్గనెట్టుకున్నట్టు తియ్యగామాటాడే అతనికి కోపం గబుక్కున రాదు. అందరితోనూ ఆచి తూచి మాటాడుంటాడు. అందర్నీ, ఏరా అని పలకరిస్తానే ప్రేమగా భుజం మీద చెయ్యేస్తుంటాడు. 

    భోజనాలప్పుడు, "ఒరేయ్ ఎదవా ఆ సన్నబియ్యం అన్నంలో నిన్న రాత్రి మట్టిదాకలో కాచిన చేపలపులు సేసుకు తింటే దాని మజాయే సపరేటురా వేస్టు ఫెలో, ఎండిరెయ్య తలకాయలేసి కాసిన ఈ లచ్చుంచారు వేసుకుని రెండు ముద్దలు చుట్టి నోట్లో పెట్టుకో.... తర్వాత దోర్చడవేఁ నీ పని... పుల్ల పెరుగు పక్కనెట్టి మీ అమ్మగారు పంపిన ముంత పెరుగేసుకోరా ఎదవ నా కొడకా" అని ప్రేమగా తిడుంటే అంతా వెంకట్రావు మాయలో పడిపోయి రాత్రనకా పగలనకా తెగ పచేసేస్తున్నారు.

    ప్రొక్లైను ఆపరేటర్ చెల్లెలు పెళ్ళి అంటే పెద్దరికం చేశాడు. కొత్తగా పెళ్ళయిన హైడ్రాలిక్ ట్రక్ డ్రైవర్ జాన్సన్ గాడి భార్య గొడవ పడ్తే మధ్యలో కొచ్చి వాళ్లిద్దర్నీ కలిపాడు. రేంపు రూటుకి కొబ్బరాకు సప్లయి | చేసే మేడిశెట్టి చందర్రావు కూతురు ముండమోస్తే వెళ్ళి పరామర్శించొచ్చాడు.

    అదంతా జూస్తున్న రేంపులో జనం ఒంగి దణాలెట్టేస్తున్నారు. వెంకట్రావు గారికి,

    సొట్టాదిగాడు మట్టుకి చూస్తానే వున్నాడు. అదోరకంగా నవ్వుతానే వున్నాడు. ఈ వెంకట్రావుగాడు ఆ సూర్రావుగాడ్ని కాపీగొడ్తున్నాడు అంటా నవ్వుకుంటున్నాడు.

    రేంపులో జనాలందరికీ మేనేజరు లాగున్న సీతంరాజు వడదెబ్బకి తేడా జేసి పడిపోతే మండపేట హాస్పిటల్లో వైద్యం చేయించి తీసుకొస్తే అర్జంటుగా అక్కడ ప్రత్యక్షమయిన సొట్టాది గాడు " నాదో మనోయాది లేండి... ఓ రకం జబ్బనుకోండి. అయితేనండీ ఈ జబ్బుకి మందుల్లేవండి... మాత్రల్లేవండి.. ఇంజక్షన్లు లేవండి..." అన్నాడు.

    ఆలోచించిన వెంకట్రావు, "కొంపదీసి వికారమా?" అన్నాడు..

    "ఇకారమంటే...మీలాంటోళ్ళు జేసే ఎదవ పన్లు భరించలేక మనసులో వున్నది బయటికి కక్కేస్తుంటా నండి. అదీ జబ్బు. దీనికి మందులుంటాయంటారా? తోళుం అర్ధం జేసుకోండి," అన్నాడు.

    "మీ గురించి నేను ఎంత ఆలోచిస్తున్నానో తెల్పా... దగ్గరుండి మీకు అన్నం వడ్డిస్తున్నానా," అని వెంకట్రావంటే నవ్వేసిన సాట్టాదిగాడు. "గిన్నెల్లో వున్న కూరలు మేఁవేసుకోలేమా.... మీరెందుకండీ వడ్డించడం.... ఎదవ బిల్డప్ గాకపోతే?" అన్నాడు.

    "ఒరేయ్ కుంటి.. ఏంట్రా వాగుడూ?" అరిచేడు వెంకట్రావ్..

    "రోజూ మీరు జెప్పే సొళ్ళు కబుర్లన్నింటికీ మర్యాదగా మేం ఊ కొట్టాలి. మేం ఏదన్నా అంటే అది వాగుడైపోయింది."

    "నీ గురించి ఈ గోదారిగట్టు మీద చాలామంది చెప్పారా నాకు... పోన్లే పాపం అని పనిచ్చేను." 

    “మీరు జేసే పాపాల్లో ఇదేం పెద్ద పాపం గాదులెండి."

    ఆదిగాడ్ని లాగి పెట్టి గూబమీద కొట్టబోతా ఆగేడా చుండ్రు వెంకట్రావ్ గారు.

    "ఇన్నాళ్ళూ పుల్ల పెరుగొద్దు. ఆ గెడ్డ పెరుగేసుకొండి... చేపల పులుసు కలుపుకోండ్రా మీ అమ్మ గారు నిన్న కాసింది అంటే. అదంతా నిజవనుకున్నారు మా కూలెదవలు... చూసేరా... ఒక్క మాట గట్టిగా అడిగేసరికి మనసులోది మొత్తం బయటికొచ్చేసింది. ఎందుకండి ముసుగులో యాక్సనూ " 

    అంటా ఇష్టానికి రెచ్చిపోతున్న సొట్టాది గాడ్ని అక్కడున్న దుడ్డుకర్ర తీసుకుని ఏటిగట్టంతా తరిమి తరిమి కొట్టాడా కాంట్రాక్టరు వెంకట్రావ్. 

    ఎక్కడికెళ్ళినా ఇలా మాటాడేస్తుంటే ఎవడు పెట్టుకుంటాడు పన్లో? పొరపాటున పెట్టుకున్నా మధ్యా అని ఏదో తేడా వచ్చేస్తుంది. వెంటనే పన్లోంచి పీకేసి పచ్చడి కింద కొట్టేసి మరీ పంపిస్తున్నారు.

    సొట్టాదిగాడింట్లో పొయ్యి వెలిగించి రెండ్రోజులయ్యింది. భార్యాపిల్లలూ మలమలా మాడిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేని పిల్లలు ఒకటే ఏడ్పు. అది చూసిన అదిగాడు నీరులా కరిగిపోయాడు. బొలబొలా ఏడ్చేసేడు. అలా ఏడుస్తానే ఆలోచిస్తున్నాడు.

    చాలా సేపు ఆలోచించిన సొట్టాదిగాడికి జన్మలో ఎప్పుడూ రాని ఒక తప్పుడు ఆలోచనొచ్చింది.

    ఇది తప్పు కదా అనుకున్నాడు ముందు. 'తప్పో ఒప్పో బిడ్డల ఆకలి తీర్చాలి అంతే,' అనుకుని బయల్దేరాడు.

    చాలా రాత్రయ్యింది. వూరంతా మాటు మణిగింది. గాలి లేదు. పౌర్ణమి వెళ్ళిన నాలుగోరోజు చిక్కి పోయిన చందమామ ఆలస్యంగా వచ్చేడు ఆకాశంలోకి.

    నడుచుకుంటా గోదావరి ఒడ్డుకొచ్చిన ఆదిగాడు రేవులోకి దిగాడు. ఒడ్డున కట్టేసున్న చాలా నావలో పాటు కామాడి దుర్గారావు నావం కూడా వుంది.

    .

    దాని తాడు విప్పి నావఁలో కూర్చుని తెడ్డేస్తా రావికంపాడురాజుల లంక వేపేళ్తున్నాడు సొట్టాదిగాడు. 

    కాస్సేపటికి లంక ఒడ్డుకొచ్చిన ఆదిగాడు నావఁని కట్టేసి లంక లోపలి కెళ్ళేడు. 

    ఎప్పుడూ ఎవరూ చెయ్యంది ఈ ఏడాది వరి పండించారు. లంకలో, పంటని కోసేసి పనలు వేసేరు.

    ఒక అరబస్తాడు ఒడ్లయ్యేలాగ రెండు పనల్ని మోపు కట్టుకుని పండి నిలువుగా పగిలిన రెండు దోసపళ్ళని భుజాలకి తగిలించుకుంటుండగా ఘల్ ఘల్ మంటా వినిపించింది కంచు గజ్జల చప్పుడు.

    తలెత్తి చూశాడు సొట్టాదిగాడు. ఎర్రటి చీర కట్టుకున్న ఆ ఆడమనిషి పుష్టిగా ఎత్తుగా వుంది. సొట్టాదిగాడ్నే చూస్తోంది.

    ఆ మనిషికేసి ఎగాదిగా చూసిన ఆదిగాడు, “కాలం చాలా మారిపోయింది. ఈ మధ్య ఆడోళ్ళు కూడా దొంగతనాలు మొదలెట్టే సేరన్న మాట," అన్నాడు.

    "నేను దొంగని కాదురా గంగాలమ్మని," అందామె.

    ఆవిడ శిరస్సు నించి సిరిపాదం దాకా చూసి చేతులెత్తి దణ్ణమెట్టిన సొట్టాదిగాడు "నువ్వా తల్లీ.... సెమించండమ్మా" అన్నాడు.

    "ఇక్కడ ఎవరు దొంగతనానికొచ్చినా ఏం జరుగుతుందో తెల్పుగదా?" కటువుగా అందామె. 

    "తెలుసమ్మా... నీ శూలం ఎత్తి కడుపులో గుచ్చి చంపేస్తావు?" అన్నాడాదిగాడు. 

    "తెలిసి కూడా దొంగతనానికొచ్చేవన్నమాట?" గొంతు పెంచింది, తల్లి.

    "ఏం జెయ్యమంటావమ్మా... నీతికి పోయి ముక్కుసూటిగా మాటాడుతూంటే పనివ్వడం లేదెవ్వడూ, పెళ్ళాం పిల్లలుతిండిలేక మాడిపోతుంటే జన్మలో ఎప్పుడూ చెయ్యని ఈ దొంగతనం చెయ్యడానికొచ్చేనమ్మా. తల్లీ! నువ్వు నిజంగా గంగాలమ్మతల్లివైతే పనిలేక తిండిలేక అల్లల్లాడిపోతున్న మా అలగా జనాన్ని సల్లగా చూడాలి. అంతేగానీ కడుపులు నిండిపోయినోళ్ళ పొలాలకి కాపలా గాస్తున్నావు. నాలాగొచ్చినోళ్ళని పొట్టన పెట్టుకుంటున్నావు.... చల్లటి చెట్టునీడలో వుండి చీకటి పడ్డాకా బయటికొచ్చే నీకేం తెలుస్తాయి? అయినా నువ్వు మమ్మల్నెందుకు జూడాలి. మేం నీకు కోడి కోస్తామా? మేకల్ని కొస్తామా! ఆ మారాజులైతే , మేకలేంటి ఇంకా దున్నపోతుల్నేసి రక్తంతో నీ కాళ్ళు తడుపుతా వుంటారు. బోల్డు పప్పులోవండి నైవేద్యాలు పెడతారు. ఆళ్ళలంచాలకి మరిగిన నువ్వు ఆళ్ళ బాగోగులు చూస్తున్నావ్. చూడమ్మా గొప్పడిక న్యాయం బక్కోడికో న్యాయం పనికిరాడు తలీ. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నేను మాటాడిందాంట్లో నిజం లేకపోతే నీ బళ్ళెంతో కుళ్ళ బొడిచి చంపేసెయ్యి." అనాగాడు .

    తలొంచుకుని చాలా సేపుండిపోయింది గంగాలమ్మ. తల్లి గంగాలమ్మతల్లిలో సొట్టాదిగాడి దెబ్బకి చాలా మార్పొచ్చింది. దొంగతనం చేసిన ఆ మోపుని వాడి తలమీదికెత్తి నావ దాకా వచ్చి సాగనంపింది శక్తి గంగాలమ్మతల్లి. 

    సెప్టెంబర్ 2009

    https://harshaneeyam.in/2021/02/19/vamsy-garu/

    https://harshaneeyam.in/2020/09/19/vamsi-1/

    https://harshaneeyam.in/2020/09/20/ekadasi/



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    24 min
  • 'నైట్ డ్యూటీ' - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు గారి కథ

    “ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”

     ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి పేషెంట్లు. 

    “పేషెంట్ ఈజ్ ది రియల్ టీచర్! అతన్ని గౌరవించు. ప్రేమించు.” సార్ చెప్పిన ఆణిముత్యాలే యివి. 

    “కొంగర్లు తిరుగుతూ ఏమిటా సిగ్గు, ఇప్పుడే సమర్త ఆడిన దాన్లా! జాకెట్టు పైకి లాక్కో. డాక్టరుగారు గుండె పరీక్ష చేస్తారు.”

    “మగాయన కదమ్మా! సిగ్గేస్తుంది". -


    “ఏమి నీలుగుతున్నావే! అంత సిగ్గయిన దానివి వెయ్యి రూపాయిలు పట్టుకుని ఏ ప్రైవేటు నర్సింగ్ హోమ్ కో వెళ్ళక పోయావా? ఊరికే మందిస్తామంటే నకరాలు పోతున్నావే!” స్టాఫ్ నర్సు అరుపులు.


    కాండ్రించి ముఖం పై ఊసినట్లుగా ఒక అసహ్యకరమైన అవమానంలా ఆవేల్టి నా నైట్ డ్యూటీ మొదలైంది.


    రాత్రి తొమ్మిదింటికి రొటీన్ రౌండ్స్ - చేస్తున్నాను.


     “సార్! ఈ పేషెంటుకు మందులివ్వద్దన్నారు పెద్ద డాక్టరుగారు. మన చేస్తే ఎనాల్డినో, ఐరన్ టాబ్లెట్ ఇవ్వమన్నారు. అబ్జర్వేషనట. డయాగ్నోసిస్ ఇంకా కాలేదట.” డ్యూటీ నర్సు వినయంగా చెప్పింది. 


    అబ్జర్వేషనా వల్లకాడా. రేటు వుండదు. డబ్బు చేతిలో పడితేనే ట్రీట్మెంటు. ఈ లోపల పేషెంటు కాస్తా టపా కట్టేస్తాడు. ఈ హాస్పటల్లో, డాక్టరే ఒక నయం కాని వ్యాధి. ఇక్కడ పేషెంటు సిలువ పైన జీసస్. హౌస్ సర్జన్లు ద్రోహం చేసిన జూడాస్.


     ఏం చెయ్యగలను మందులివ్వకుండానే ముందుకు కదిలాను.


    మరో పేషెంటు. “ఏమిటి తల్లీ నీ బాధ!' “ఇదో స్పెషల్ కేసు సార్. గైనిక్ వార్డు కేసు. కార్డియాక్ ట్రబుల్ అని మనకు రిఫర్ చేశారు. ఇదో 'విడో' సార్! మొగుడు చచిది నాలుగేళ్ళవుతోంది. డబ్బిస్తారని ఆశతో స్టెరిలైజేషన్ క్యాంప్ కొచ్చి ట్యూబెక్టమీ చేయించు కొంది. పి.జి. స్టూడెంటు ఎవరో చేశాడట ఆపరేషను. కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయట. అక్కడుంటే గొడవవుతుందని మన ముఖాన పడేశారు,” 


    నర్సు చెప్పింది. కళ్లనిండా సిగు. దైన్యం నింపుకొని, “బిడ్డలకు రెండు పూటలైనా కడుపునిండా తిండి పెడదామని ఈ కక్కుర్తి పని చేశానయ్యా! నాకేమన్నా అయితే బిడ్డలు అనాథలవుతారు. దయ చూపండి బాబు,” అంటూ చేతులు జోడించింది పేషెంటు. -


    నీ బాధలూ, గాథలూ ఎవరికి అర్థం అవుతాయి తల్లీ! నువ్వో 'ఒళ్ళు బలిసిన లం...'గానే మా నర్సుకు కనిపిస్తావు. నువ్వో 'చిరాకు కలిగించే న్యూసెన్సు లాగే డాక్టర్లకు తోస్తావు. నీ ఆకలి, నీ అమ్మ ప్రేమ ఎవరికర్థం అవుతాయి.


    రౌండ్స్ ముగిసేసరికి పదకొండు దాటింది.


     “స్పెషల్ వార్డులో ఖైదీ ఒకడున్నాడు. అటెండుకండి సార్. నక్సలైట్ లీడరట. బాగా పోలీసు బందోబస్తు వుంది. జైల్లో సూసైడ్ ఎటెంప్ట్ చేశాడట. పొద్దునొచ్చింది కేసు. స్పెషల్ కేసు అని మరీ చెప్పాడు పెద్ద డాక్టరు.” 

    నర్సు , నేనూ స్పెషల్ వార్డువైపు కదిలాం. ఈదేశంలో కెల్లా ప్రతిభావంతులైన రచయితలు పోలీసులే. జైల్లో ఆత్మహత్య' ఈ థీమ్ పై రోజుకో రసవత్తరమైన కథానిక. కథల పోటీల్లో బహుమతులన్నీ వీళ్లకే ఇవ్వాలి.


    కాలి పొడవునా బాండేజ్. ఎముకల పోగులా వున్నాడాయన. నెరిసిన తల. దీర్ఘ కాలపు ఆలోచన. అలుపుతో అర్ధనిమీలితాలైన కళ్లు. చిరునవ్వుతో 'హలో' అని పలక రించాడు. బాండేజ్ మార్చి, సి.పి. ఇంజక్షన్ ఒకటి ఇచ్చాను.


     “నొప్పి ఎక్కువగా వుంటే చెప్పండి. ఎనాల్జిన్ ఇస్తాను,” అని అడిగాను.


    “శరీరపు బాధలకు మనస్సు రెస్పాండ్ కావడం ఎప్పుడో మానేసింది నేస్తం! ఉద్యమ విజయాలే మాకు నిజమైన మెడికేషన్,” అంటూ నవ్వాడాయన. ఆయన నవ్వులో చిత్రమైన ఆకర్షణ వుంది. 


    గుడ్ నైట్ చెప్పి బయటకు వచ్చాను. 


    మెరుస్తున్న కళ్ళతో వీడ్కోలు  చెప్పాడాయన.



    రాత్రి పన్నెండు దాటింది. అలసటతో డ్యూటీ రూమ్ వైపు కదిలాను. లోపలికి అలెట్ వేసి, అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాను. బెడ్ పై నల్లటి తుమ్మమొద్దులాంటి మగ పశువు. వాడి చుట్టూ నగ్నసర్పంలా అల్లుకుపోయిన స్త్రీ, గాడ్! ఈమె ఝాన్సీ, నర్సింగ్ స్టూడెంటు. 


    ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడలేదు. భయపడలేదు.


    "ప్లీజ్ డాక్టర్! లైటు తీసివేయండి! ఈ రాత్రికి మీరు క్యాజువాలిటీ డ్యూటీ రూమ్ లో ఆస్ తీసుకోండి,” అంటూ పక్కన సిగ్గుపడుతున్న మగ పశువుపై తన నగ్నత్వాన్ని నిస్సిగ్గుగా పుతూ చెప్పింది. 


    "డర్టీ బిచ్!" కోపం, బాధ, అసహ్యంతో బయటకు వచ్చాను. సెక్స్ ఒక ఎమోషనల్ ఇన్వాల్మంటు. వెగటు కలిగించే శావలాన్ వాసన, భీతావహమైన మృత్యువు చీకట్లో పాములాగ మన పక్కనుంచే వెళుతున్న భావన. 

    భరింపలేని నొప్పితో నిశ్శబ్దాన్ని పాడుచేసే ఒక ఆర్తనాదమో, ఒక తెరిపిలేని దగో, ఒక విరామం లేని మూలుగో, అభాగ్య మృతుని బంధువుల విలాపమో, హాస్పటల్ ఏదో మూల నుండి వినిపిస్తూనే ఉంటాయి. 


    ఇలాంటి వాతావరణంలో లైంగికేచ్ఛ  పొందగలిగేవాళ్ళు మనుషులమని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సిన వాళ్ళు.


    రెండు మూడు గంటలు క్యాజువాలిటీలో అసహనంగా కోపంగా గడిపి, ముఖ్య మైన కేసుల్ని మరోసారి చూద్దామని వార్డు వైపు నడిచాను. పిడియాట్రిక్స్ వార్డు మత్తుగా జోగుతూంది.


    కార్డియాలజీ వార్డు చప్పుడు చెయ్యని గుండెలా స్తబ్దుగా వుంది. మెడికల్ వార్డులో ఆస్మా 

    రోగి ఆయాసం మినహా ఏ శబ్దమూ లేదు. -

    లేబరు వార్డు నుండి హఠాత్తుగా “ఓరి నాయనో! దేవుడో,” అంటూ అరుపులు వినిపించాయి. కంగారుగా అటు పరు గెత్తాను. 

    “బిడ్డ బాబు! బిడ్డ! రోజుల బిడ్డయ్యా! కుక్క ఎత్తుకుపోతోందయ్యా పట్టుకోండి! నాయనా దండం పెడతా! కదల్లేని బాలెంత నయ్యా,” ముప్పయేళ్ళ తల్లి పెద్దగా అరుస్తోంది. 


    వరండా మలుపు తిరుగుతూ రాజసంగా నడిచి వెళ్తున్న కుక్క కనిపించింది. పెద్దగా అరుస్తూ అటు పరిగెత్తాను. అరుపులకు బెదిరి నోట్లో వున్న బిడ్డను వదిలి 'యూ స్టుపిడ్' అన్నట్లు నా వైపు చూసి బయటకు పరిగెత్తింది కుక్క. 


    బిడ్డ ఛాతీ పై పదునైన గోళ్ళరక్కులు, పళ్ళగాట్లు- గుక్క పెట్టి ఏడుస్తోంది. ఇంత హడావుడిలోనూ ఒక్క వార్డు బాయ్ కి మెలుకువ రాలేదు.


    ఈ ఆసుపత్రి అతి పెద్దదైన రాక్షసమృగం. 


    దీనికి అనుభూతులూ, స్పందనలూ ఉండవు. 


    తల్లినీ, బిడ్డనూ వార్డుకు పంపి, ఆ సంఘటన పై కంప్లైంటు చేద్దామని ఆర్.ఎం.ఓ. రూమ్ వైపు నడిచాను. 


    అక్కడ పోర్టికో నిండా పోలీసు జీపులు. హడావుడిగా అటూ ఇటూ పరిగెడుతున్నారు పోలీసులు. ప్రెస్ రిపోర్టర్లు కూడా వచ్చినట్లున్నారు. స్పెషల్ వార్డులోని తీవ్రవాద ఖైదీ తప్పించుకుపోయాడట. కాపలా వున్న కానిస్టేబుల్స్ స్పృహ తప్పి పడిపోయారట. హెడ్ కానిస్టేబుల్ తలపగిలి, ప్రమాద స్థితిలో ఉన్నాడట.


    పోలీసు బూట్ల చప్పుడు, పేషేంట్ల దీనారావాలు కలగలుపుగా  ఆ వేకువజాము ఆస్పతి యుద్ధభూమిలా వుంది.. 


    జిల్లా అధికారులంతా తరలివచ్చారు. ఆ రోజు డ్యూటీ  డాక్టర్లను, నర్పులను పిలిపించి ఇంటరాగేషన్ చేస్తున్నారు ఆర్.ఎం.ఓ. రూములో. 


    నా అంతరంగంలో ఒక కత్తిగాటులా మిగిలిపోయింది ఆ వార్డుసంఘటన. 


    తల  వంచుకొని నడిచి వెళ్ళే నన్ను ఆపి ఫెడేల్మని కొట్టిన దెబ్బ ఆ రాత్రి! 




    ఇంటరాగేషన్ ఎస్.ఐ. నా చొక్కా పట్టుకుని, “మీకందరకు తెలియకుండా ఎలా పారిపోయాడా పిపీకలపు  వెధవా!" అంటూ నేలమీద పడేలా త్రోసి బూటుకాలితో తన్నాడు. 


    మా ప్రొఫెసర్ వున్నాడు. ఆర్.ఎం.ఓ., సూపర్నెంటూ  మిగిలిన డాక్టర్లూ అక్కడే వున్నారు. వాళ్ళెవరూ  రాక్షసకాండను ఆపలేదు. 


    నేను పైకి లేచి సూపర్నెంటు దగ్గరకెళ్ళి  "సార్! వీడు నన్ను తన్నిన తన్ను మనందర్నీ తన్నినట్లే! మొత్తం మెడికల్ ప్రొఫెషన్ను వాడు ఫెడేల్మని తన్నాడు. ఈ శాస్తి మనకు జరగాల్సిందే సార్. లంచం ఇవ్వలేదని మందులివ్వకుండా పేషెంటను చంపే మనకు, లేబరు వార్డులో వీథి కుక్కలు యథేచ్చగా తిరుగుతున్నా, డ్యూటీ రూముల్లో బహిరంగ వ్యభిచారం జరుగుతున్నా ఏమీ పట్టని మనకు ఈ అవమానం జరగాల్సిందే సార్. సిగ్గుమాలిన పరమ దుర్మార్గమైన, మానవ జాతికే అవమానకరంగా ప్రవర్తిస్తున్న మనకీ అవమానం సరైందే సార్.” 


    గబగబా బయటికి నడిచి వచ్చాను వాళ్ళ ప్రతిస్పందనల్ని పట్టించుకోకుండా.


    నల్లని నాగులాంటి, మంటలాంటి, ఎంతకీ శమించని దు:ఖం లాంటి రాత్రి ముగిసింది. నా నైట్ డ్యూటీ ముగిసింది. అన్ని రాత్రుల్లా కాక ఆ రాత్రి ఒక ఎలిజీలా నన్ను వెంటాడుతూనే వుంటుంది. ఆ రాత్రి ఎప్పటికీ నా జ్ఞాపకంలో మిగిలిపోతుంది. ఆ రాత్రితో పాటే మరో వ్యక్తి కూడా నా జ్ఞాపకాల్లో హమేషా నిలిచి వుంటుంది. ఆ వ్యక్తి నర్సింగ్ స్టూడెంటు ఝాన్సీ. 


    డ్యూటీ రూములో నేను చూసిన ఆ మగ పశువు,  తల పగిలి అంకాన్షస్  గా వున్న హెడ్ కానిస్టేబులే. 


    నాకు ఆమె నమ్మే సిద్ధాంతాల గురించీ, ఉద్యమాల గురించీ అంతగా తెలియదు. కానీ ఆమె త్యాగం మాత్రం నన్ను విస్మయపరుస్తూనే వుంటుంది.


                                                                                    ఆంధ్రజ్యోతి వారపత్రిక 20 ఏప్రిల్, 1990





    'నైట్ డ్యూటీ' డాక్టర్ చంద్రశేఖర్ రావు గారి, 'చిట్టచివరి రేడియో నాటకం - డాక్టర్.వి.చంద్రశేఖర్ రావు కథలు అనే కథాసంపుటం లోనిది.



    రచయిత:

    1959 లో ప్రకాశం జిల్లాలో జన్మించిన డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు గారు , ఒక విలక్షణమైన కథకులు. ఆయన కథలన్నిటిలో తీవ్రమైన సామాజిక స్పృహ, చుట్టూ మారుతూ వున్న పరిస్థితులూ, వాటి వల్ల వ్యక్తులలో తలెత్తే సంఘర్షణా, ముఖ్యాంశాలుగా ఉంటాయి.

    సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే , సాహిత్యం కంటే ఉపయోగపడే వస్తువు లేదు అని గట్టిగా నమ్మిన మనిషి.

    మెడిసిన్ చదివిన చంద్రశేఖర్ రావు గారు , రైల్వేస్ లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి 2017 లో పదవీ విరమణ చేశారు.

    1990లో రచనా రంగంలో అడుగుపెట్టిన ఆయన 2017 సంవత్సరం దాకా కథలూ , నవలలూ రచించారు.

    అనేకానేక పురస్కారాలను అందుకున్న ఆయన నాలుగు కథా సంపుటాలు, 3 నవలలు తెలుగు పాఠకులకు అందించారు. ' రచయితల రచయిత' గా పేరు పొందారు. తెలుగు కథ ని వున్నత స్థాయి లో నిలబెట్టిన కథకుల్లో చంద్రశేఖర్ రావు గారు ముందు వరసలో వుంటారు.


    చంద్రశేఖర్ రావు గారి పుస్తకాలు కొనడానికి :

    ఆయన కథా సంపుటాలు రెండు మాత్రమే ఇప్పుడు మనకు లభ్యం అవుతున్నాయి.

    1. 'ముగింపుకు ముందు'- ఆయన ప్రచురించని కథలతో - (http://bit.ly/3c7DBNZ). ఇదే పుస్తకంలో శ్రీ బి.తిరుపతిరావు గారు చంద్రశేఖర్ గారి రచనా శైలిపై రాసిన చక్కని ముందుమాటను మనం చదవొచ్చు.
    2. 'చిట్టచివరి రేడియో నాటకం - డాక్టర్ వి.చంద్రశేఖర్ రావు కథలు' - ఈ పుస్తకం కోసం 'విశాలాంధ్ర విజయవాడ' - రాజు గారిని 9840034033 లో సంప్రదించండి.

    చంద్రశేఖర్ రావు గారు తెలుగు కథన రీతులపై 2015 లో చేసిన ప్రసంగాన్ని ఈ లింక్ ద్వారా వినవచ్చు. (https://bit.ly/2M2IsFB)



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    12 min
  • Part 2 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

    కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్తుంటాయి. అక్కడే ఒక పెద్ద బ్రిడ్జి కూడా కడుతున్నారు. రోజంతా గుబిలు గుభిలుమని కొండ రాళ్ళు పేలుతుంటాయి. హిందుస్తానీలు, బ్రిడ్జి పనులు చేసే మళయాళీ మోపలాలు, సర్దార్జీలు, బంగాళీ బాబులు, ఒకరేవిటీ అన్ని రకాల జాతుల వారినీ అక్కడ చూడొచ్చు. ఉత్తరాదినుండి వచ్చిన కంట్రాక్టర్లు, కేంపుని వర్కు స్పాటుకి దగ్గర్లోనే వేసుకున్నారు. రైల్వే కేంపు మాత్రం మైలు దూరాన ఉంది. అటు, ఇటు కాంట్రాక్టర్ల జీపులు, రైల్వే జీపులు చాకుల్లా తిరుగుతుంటాయి.

    అసిస్టెంట్ ఇంజనీరుగారి జీపు ఆగగానే కంట్రాక్టర్లు సవినయంగా నమస్కారం చేస్తూ “ఆయీయే సాబ్ !” అంటూ ఎదురుగా వెళ్ళారు. ముందు సీట్లో నుంచి అసిస్టెంట్ ఇంజనీరు రామారావుగారు, వెనుక సీటునుంచి అకౌంటెంటు దశరథరామయ్యగారు దిగారు. దశరథరామయ్యగారి చేతిలో రెండు లావుపాటి ఫైల్సున్నాయి.

    “దశరథరామయ్యగారూ! నేను బ్రిడ్జి ఇన్ స్పెక్షనుకి వెళ్ళేస్తాను. వచ్చేటప్పటికి అన్ని కాగితాలు సిద్ధంగా ఉంచండి కాంట్రాక్టర్ల సంతకాలు తీసుకుని నా సంతకాలు కూడా చేసేస్తాను, చిన్నయ్యా! ఆ మర్రిచెట్టు కింద జీపు పెట్టి పోయి ఎక్కడేనా పడుకో, నేను తిరిగొచ్చేదాకా! పాపం, రాత్రంతా నిద్ర లేనట్టుంది!” అంటూ కంట్రాక్టర్లు అందించిన కాఫీ తాగేసి వర్కు స్పాటుకి బయల్దేరాడు. .

    చిన్నయ్యా, దశరథరామయ్యలు కూడా వాళ్ళిచ్చిన కాఫీలు తాగేశారు. దశరథరామయ్య మాత్రం ఎందుకో బితుకు బితుగ్గా కనపడుతున్నాడు. ఇంజనీరుగారు వెళ్ళిపోగానే పక్కనే వున్న కంట్రాక్టరు ఆఫీసు టెంటు లోనికి వెళ్ళి ఫైళ్ళు విప్పి లెక్కలు మొదలు పెట్టాడు.

    “పంతులుగారూ! నిద్ర ఊపేస్తోంది, నేను జీపులోకి పోయి పడుకుంటాను”. అంటూ జీపుని ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కిందకి లాగించేసి, వెనక సీట్లో ముడుచుకు పడుకున్నాడు చిన్నయ్య.

    రాత్రంతా నిద్రలేదేమో దశరథరామయ్యకి కూడా కునుకు ముంచుకొచ్చేస్తోంది. తమాయించుకుంటూ కాగితాలమీద లెక్కలు కడుతున్నాడు, దగ్గర్లోనే పనిచేస్తున్న బుల్డోజరు శబ్దం బుర్రని దొలిచేస్తోంది.

    ఇంజనీరుగారు ఇన్స్పెక్షన్ నుంచి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఎండ మండిపోతోంది. ఎప్పుడు పట్టేసిందో నిద్ర పాపం, దశరథరామయ్య టేబుల్ మీద వాలిపోయి అలాగే నిద్రపోయాడు. – “దశరథరామయ్యగారూ! ఆ కాగితాలవీ తియ్యండి. సంతకాలు పెట్టేస్తాను. మళ్ళా భోజనానికి టైమై పోతుంది. త్వరగా పోవాలి”. అంటూ నిద్రపోతున్న దశరథరామయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని మొగంమీద, మోచేతుల మీద కారుతున్న చెమటని “ఉస్సు”రంటూ తుడుచుకున్నాడు. దశరథరామయ్య నిద్రలోంచి ఉలికిపడి లేచి కళ్ళు నులుముకుంటూ కాగితాల ఫైలు ముందు పెట్టాడు. – ఫైల్లో కొన్ని కాగితాలు తిరగేసి ఆశ్చర్యంగా దశరథరామయ్య నిద్రమొహంలోకి

    చూస్తూ “పెద్ద బిల్లేదయ్యా?…….. అదే బ్రిడ్జి వర్కుది”.

    “చెయ్యలేదు సార్” – మనిషి గొంతుకలో తడారిపోతూ దీనంగా చెప్పాడు.

    “వాట్ ? చెయ్యలేదా? ఓ! మైగాడ్ “……… రామారావు కోపంతో ఊగిపోతూ క్షణం సేపు మాటాడలేకపోయాడు. ఎర్ర ధూళి, చెమట పట్టిన రామారావు మొహం కోపంతో మరింత ఎర్రబారింది. కళ్ళు చింతనిప్పుల్లాగా కణకణ లాడుతున్నాయి. “నిన్ననగా చెప్పానే ఎవడి చంక నాకుతున్నావ్ ?” అరిచాడు.

    “ఎక్స్క్యూజ్ మీ సార్ ! నిన్న రాత్రంతా అమ్మాయికి గడబిడ చేసింది కద సార్ …… రాత్రే బిల్లు చేసేదామనుకుంటే……”

    “షటప్! నీ ఇంట్లో గొడవ ఎవడిక్కావాలయ్యా? నీకు డబ్బిస్తున్నది ఆఫీసు పని చెయ్యడానికి గాని, నీ కూతురుకి పురుడొచ్చింది, అదయింది, ఇదయిందని పని ఎగగొట్టడానికి కాదు, వర్త్ లెస్ ఫెలోస్!” అని పిడుగు పడినట్టు గర్తించాడు.

    ఇంతలో తిరుగు ప్రయాణానికి చిన్నయ్య జీపు తెచ్చి పెంటుముందు ఆపి లోపలికొచ్చాడు.

    ఎదురుగా దశరథరామయ్య వెలవెలబోతూ గజగజ లాడిపోతున్నాడు. “రేపట్నుంచే నిన్ను పనిలోనుండి డిశ్చార్జి చేసేస్తున్నాను. గెటౌట్ ……. డోంట్ షో యువర్ ఫేస్; పెద్ద దొరగారు ఆ బిల్లు సంతకం చేసి అర్జంటుగా పంపమన్నారని మరీ మరీ చెప్పానే? ఇప్పుడతను నామీద దెయ్యంలాగ పడిపోతాడు. మీరంతా ఎందుకయ్యా ఉండి, నో! ముసలాడివని కనికరించి అపాయింట్ మెంటు ఇప్పిస్తే పని ఎడతావ్ ! కీప్ ఆఫ్ఫ్రమ్ మీ డర్టీ ఫెలో!” అంటూ ఇంకా కోపం పట్టలేక టేబుల్ మీదనున్న ఫైలు తీసి దశరథరామయ్య మొహం కేసి కొట్టాడు. 

    అసలే భయంతో సగం చచ్చిపోయిన దశరథరామయ్య ఉద్యోగం పోతుందనేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి. దాంతో ఫైలు మొహానికి తగలగానే కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. పక్కనున్న కంట్రాక్టరు మనిషెవడో పట్టుకుని కింద పడుకోబెట్టి మొహం మీద వీళ్ళు చల్లాడు. 

    ఇది చూస్తున్న మిలిట్రీ చిన్నయ్యకి నెత్తురు మరిగిపోయింది. 

    “నువ్వు మనిషివా, రాక్షసుడివా?” అని పిడికిలి బిగబట్టి గట్టిగా అరుస్తూ ఇంజనీరు మీదికి పళ్ళు కొరికి వెళ్ళబోతూ, తమాయించుకుని ఆగిపోయాడు. 

    రామారావు అమాంతంగా నిర్ఘాంతబోయాడు. “ఏవిటి, డ్రైవర్ చిన్నయ్యేనా, ఇలా అంటున్నాడు” అని తన కళ్ళని తనే నమ్మ లేక, కోపంతో వణికిపోతున్న చిన్నయ్యని చూస్తూ క్షణం పాటు అలా వుండిపోయాడు.

    “ముసిలోడ్ని కొడతావా? నువ్వు మనిషివేనా?” అని మరోసారి గర్జించాడు.

    కేకలు విని అంతా చుట్టూ చేరారు. ఇది చూసిన రామారావు అహం దెబ్బతింది. తన దగ్గర పనిచేసే ఒక జీపు డ్రయివరు అంతమంది ఎదుట అలా తనపై కేకలేస్తూంటే సహించలేకపోయాడు. “ఏవిటిది చిన్నయ్యా నువ్వేమన్నా తాగావా? నువ్వెవరివి ఇందులో జోక్యం కలుగ జేసుకోవడానికి!”

    “నేనెవడినా! నీలాంటి జంతువును కాను, మనిషిని. ముసలోడు రాత్రంతా పని చేస్తాడు. నిన్న రాత్రయితే అసలు కంటికి కునుకేలేదు. ఏదో పని మిగిలిపోయిందని కొడతావా? ముసిలోడు సొమ్మసిల్లిపోయాడు. చచ్చిపోతేనో?……. మీకిష్టం లేకపోతే ఉద్యోగంలోంచి తీసేయండి. కొట్టడానికి మీకేం పవర్సున్నాయి?” అని మిలిట్రీ ఊపుతో విరుచుకు పడిపోతూంటే అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు. –

    “నాకేం పవర్సున్నాయా? అమ్మ రాస్కెల్! ఇంత పొగరు పట్టిందిరా నీకు?” అంటూ విసురుగా మీదికి వెళ్ళాడు.

    చిన్నయ్య తర్జని చూపించాడు. “మంచిదికాదు సార్ ! తొందరపడకండి చెప్తున్నాను! నేను పంతుల్ని కాదు ఊరుకోవడానికి ఒంటిమీద చెయ్యి పడిందో ఖైమా చేసేస్తాను….. నేను మిలిట్రీవోడ్నీ!”

    అప్పుడప్పుడే తెలివిలో కొస్తున్న దశరథరామయ్య అమాంతంగా లేని శక్తిని తెచ్చుకుని లేచి ఆఫీసరుకీ చిన్నయ్యకీ మధ్యలో కెళ్ళి “ఊరుకో చిన్నయ్యా, నీకెందుకు? దొరగారూ మీరూరుకోండి! దండం పెడతాను” అంటూ రామారావు చేతులు రెండూ పట్టుకుని ఆపుచేశాడు. 

     “వాట్! నన్ను ఖైమా చేస్తావా?….. నిన్ను…. నిన్ను…… ఏం చేస్తానో చూడు, స్కొండ్రల్!” అంటూ ఉగ్ర నరసింహుడిలా శివాలెత్తిపోతూ నేలని కసిదీరా ఒక తన్ను తన్ని టెంటు తెర తోసుకుంటూ వెళ్ళి జీపులో కూర్చుని స్టార్టు చేశాడు. 

    వెనకాలే దశరథరమయ్య నెమ్మదిగా సర్దేసుకున్నాడు. “తక్కువ వెధవలకి అలుసిస్తే నెత్తికెక్కరూ?….. మధ్య వీడెవడు బోడిగాడు?……. ఆల్ రైట్ ! డిస్మిస్ చేయించేస్తాను వెధవని” అనుకుంటూ ఏక్సిలేటరు దమాయించాడు రామారావు. ఎర్ర దుమ్ము లేపుకుంటూ కేంపువైపు పరుగెత్తింది

    కేంపు చేరుతూనే రామారావు స్టెనో టైపిస్టుని దశరథరామయ్యచేత కబురు పెట్టించి డిక్టేషనిచ్చాడు. ఈ సాయంకాలానికల్లా డిస్ట్రిక్ట్ ఇంజనీరుగారికి చేరేటట్టు స్పెషల్ మెసెంజరుచేత ఉత్తరాన్ని పంపమన్నాడు. ఆ

    “సాక్డ్ ఆఫ్!…… వెధవ తిరగబడతాడూ” అంటూ ఇంకా ఉప్పెనలా విజృంభిస్తోన్న కోపాన్ని తమాయించుకుని భోజనం చెయ్యకుండా పడుకున్నాడు. 

    మెలకువ వచ్చేసరికి బాగా రాత్రి దాటిపోయింది. వంట మనిషి టేబుల్ మీద పెట్టి చల్లారిపోయిన భోజనాన్ని కాస్త ఎంగిలిపడి సిగరెట్టు వెలిగించి ఆలోచనలో పడ్డాడు. నిద్రలో చాలావరకు కోపం చల్లారిపోయింది. మధ్యాహ్నం జరిగిన సంఘటనల్ని తలచుకుంటూ దమ్ము మీద దమ్ము లాగుతూ పచార్లు చెయ్యడం ప్రారంభించాడు. చిన్నయ్య అలా తిరగబడడం తప్పయినా, దూరంగా ఆలోచిస్తే కాస్త న్యాయ సమ్మతమేమో ననిపించింది….. ఔను తను అలా దశరథరామయ్య మీదకి ఫైలెందుకు విసరాలి? కోపం పట్టలేక ఆ పని చేశాడు. అది తప్పు కాదా? తప్పే! ఇంతకీ చిన్న య్యెవ్వడు? ఎందుకు జోక్యం కలుగ చేసుకోవాలి? పాపం ‘ముసలివాడు సొమ్మసిల్లిపోగానే చిన్నయ్య చూళ్ళేక పోయాడు. రక్తం మరిగిపోయింది. సకాలంలో బిల్లు చెయ్యకపోతేనే తనకి అంత కోపం వచ్చింది కదా, సాటి మనిషి మొహం తిరిగి పడిపోతుంటే, అందుకు బాధ్యులైన వాళ్ళమీద చిన్నయ్యకి ఎంతకోపమైనా రావచ్చు. తిరగబడ్డాడు, తనూ రెచ్చిపోయాడు. ఛా …….! చిన్నయ్య చేసిన పని చట్టరీత్యా తప్పయినా, న్యాయదృష్టితో చూస్తే ఆ పరిస్థితిలో మానవత్వం గల ఏ మనిషైనా అలాగే ప్రవర్తించాలని నిర్ధారించుకున్నాడు..

    ఆ రాత్రి చిన్నయ్యని కబురు పెట్టి పిలిపించాడు. చిన్నయ్య మామూలుగానే నిబ్బరంగా వున్నాడు. అక్కడ రామారావు చిన్నయ్యా తప్ప మరెవరూ లేరు.

    “కూర్చో! ఫరవాలేదు. ఆ కుర్చీలో కూర్చో. స్పాట్ నుండి నడుచుకొచ్చావా పాపం….. – 

    “ఫరవాలేదు సార్ , నాకు నడక అలవాటే, మిలట్రీ వాడిని, అయినా ఎంత మైలే గదా?”

    “ఔను మిలట్రీ వాడివి, అందుకే నన్ను ఖైమా చేస్తానన్నావు?”

    “నిన్ను ఎంతో గౌరవంగా చూసుకుంటానే, ఎందుకలాగన్నావు”. –

    “సార్! నన్ను దెప్పి పొడవడానికి పిలిపించారా! మీరే మరొక్కసారి ఆలోచించుకోండి సార్, అప్పుడు మీకే తెలుస్తుంది. మీరు చేసిన పని తప్పో కాదో పంతుల్ని అలా ఫైలుతో కొట్టడం న్యాయమేనా? ఒక్క ప్రాణం సొమ్మసిల్లి పోయాడు గదా! మీ తండ్రిగారే ఆ పరిస్థితిలో ఉంటేనో…….”

    చిన్నయ్యా! నీకు తెలుసు గదా, నేను కోపిష్టివాడ్నని, అరుస్తాను. గాని కరవను . అరిచే కుక్కని మాత్రమే! నేను చేసిన పని తప్పే ఐనా నా కోపం తగ్గిం తరువాత చేస్తే నేనొప్పుకోనా, నేను మనిషిని కానా?….. సరే, అయిందేదో అయిపోయింది. నువ్వు కోపంలో ఏదో అన్నావు. నేనూ ఏదో అన్నాను……. సరే, అన్నీ మరిచిపో, మనసులో పెట్టుకోక. ఈచూట చెబుదామనే పిలిపించాను. పోయి పడుకో చాలా రాత్రయింది. “

    “గుడ్ నైట్ సార్!” అని సెల్యూట్ చేసి బైటికొచ్చాడు. “భేష్! ఏం మనిషి? తన తప్పని తెలుసుకున్న తరువాత తరతమ బేధం చూడకుండా, జీపు డ్రయివరునైన నన్ను పిలిపించి తప్పొప్పుకున్నాడు. కుర్రోడైనా దేవుడు. సివిలోళ్ళలో తప్ప పుట్టాడు. అని లోలోన అభినందించుకుంటూ తన టెంటువైపు నడిచాడు మిలట్రీ మాన్ చిన్నయ్య..

    ఆరోజు ఉదయం అనుకోకుండా డిస్ట్రిక్ట్ ఇంజనీరుగారు. కేంపు కొచ్చారు. అంతా ఎదురు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు. పెద్ద ఇంజనీరు గారికి, అతని సిబ్బందికి – ప్రత్యేకమైన వసతి, భోజనం ఏర్పాట్లు వెంటవెంటనే చేయించారు.

    భోజనాలైన తరువాత పదకొండు గంటలవేళ, ఇంజనీరిద్దరూ మేపులు ముందు పడేసుకుని ఏవేవో చర్చలు జరిపారు. అన్ని కేంపులలోకంటే ఈ కేంపులో పని చురుగ్గా పకడ్బందీగా సాగుతోందని మెచ్చుకున్నారు పెద్ద ఇంజనీరుగారు.

    “రామారావుగారూ! మీ అకౌంటెంటు దశరథరామయ్యనీ, అదెవరు చెప్మా – ఆ జీపు డ్రయివరు – అదే చిన్నయ్యగదూ అతన్ని కబురు పెట్టండి”.

    దశరథరామయ్య ఎప్పుడూ లేంది, గెడ్డం శుభ్రంగా గీసుకొని పంచలో చొక్కా టక్ .. చేసి, ఎప్పటిదో పాత కోటు వేసుకొని, అతి వినయంగా చేతులు కట్టుకొని దొరగారముందు నిలబడ్డాడు. చిన్నయ్య మిలట్రీ ఎటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేసి నిలుచున్నాడు. అతనివైపు రెండు మూడుసార్లు ఎగాదిగా చూసారు పెద్ద దొరగారు.

    “ఇతను మిలట్రీ……..” అని అడగబోతుండగా.. “అవును సార్, ఇతను ఎక్స్ మిలటరీ మాన్!” అని రామారావు చెప్పాడు.

    ఆమాట వినీ విననట్టుగా ఎదురుగా వున్న దశరథరామయ్య నుద్దేశించి “చూడండి ఎకౌంటెంటుగారు మీ పనిని మెచ్చుకుని మీ కేసు అసిస్టెంటు ఇంజనీరు రికమెండ్ చేసారు. మీకు మరో సంవత్సరం ఎక్సటెన్షన్ ఇస్తున్నాను. Prove yourself to be a worthy son to the country అంటూ లేచి దశరథరామయ్యని షేక్ హేండ్ చేసారు. 

    “అంతా తమ దయ సార్. చిన్నదొరగారు, నా పరిస్థితిని చూసి రికమెండు చేస్తుంటారు” అని ఉక్కిరి బిక్కిరైపోతూ ఆనందంతో మరి మాట్లాడలేక కళ్ళంట జలజల నీళ్లు కార్చాడు.

    No No you deserve it I say అని అన్నారు. రామారావు ఓబులు మీద వేపరు వెయిటు తిప్పుతూ. – “మీరు చాలా మంచివారు సార్, పాపం ముసలాయనకి ఇంత తిండి పెట్టారు. ఆయన రాత్రింపగళ్ళు పని చేస్తారు సార్” అని మధ్యలో చిన్నయ్య చెబుతూంటే డిస్ట్రిక్ట్ ఇంజనీరుగారికి మంటెక్కింది.

    “చూడూ, ఒకరితో మాట్లాడుతున్నపుడు మధ్యకి రాకూడదు అది డీసెన్సీకి వ్యతిరేకం. మళ్ళీ మిలట్రీ వాడ్నంటావు? ……” అంటూ చిరాగ్గా చిన్నయ్యవైపు కస్సుమని లేచాడు. వెంటనే మళ్ళా మాట మార్చేసి దశరథరామయ్య నుద్దేశించి —

    “ఇంకా నాలుగయిదు కంట్రాక్టర్ల బిల్లులుండిపోయాయి. ఈ నెలాఖరులోగా కంప్లీట్ చేసేయండి. చాలా డిలే అయిపోయాయి. అన్నట్టు చెప్పడం మరచిపోయాను. రామారావుగారూ, మీ కేంపుకు జనరేటరు కోసం మాట్లాడాను. చీఫ్ ఇంజనీరుగారు ఒప్పుకున్నారు. మరో నెల రోజులలో మీ కేంపుకి కరెంటు వస్తుంది”..

    “థేంక్యూ సార్!” అన్నారు రామారావుగారు.

    “ఇదిగో; నీ పేరేంటన్నావు …… అదే; చిన్నయ్య, ఇప్పుడు నువ్వు మాట్లాడుదువు గావి….. అసలు ముఖ్యంగా నీ పనికోసమే నేనొచ్చారు. ఇంతకుముందే రావలసింది. కలకత్తా వెళ్ళడం వల్ల రాలేకపోయాను….. ఊఁ; నువ్వేం పని చేస్తుంటావు!”

    “జీపు డ్రయివర్ని సార్;”.

    “వారం రోజుల క్రితం చిన్నదొర గారు బ్రిడ్జి ఇన్ స్పెక్షనుకి వెళ్ళినప్పుడు అతన్ని ఖైమా చేస్తానని అన్నావట కదూ?”

    “యస్సార్”

    ప్రక్కనున్న రామారావు చటుక్కున నాలిక్కరుచుకుని కంగారు పడిపోతూ, ‘నో సార్; అది నేను……”

    “వెయిట్ ప్లీజ్ …. అతన్ని మాట్లాడనివ్వండి. నువ్వు కైమా చేస్తానని అనడాన్ని ఒప్పుకుంటున్నావు కదూ;”

    “యస్సార్;”

     “అది తప్పేనా?”

    “ముమ్మాటికీ కాదు. చిన్న దొరగారు దశరథరామయ్యగారిని ఫైలుతో మొగం మీద కొట్టారు. అతను సొమ్మసిల్లి పడిపోయారు……. అలా చేయడం తప్పుకాదా …… తప్పో కాదో చిన్న దొరగార్నే అడగండి, నేను మధ్యలో కలగ జేసుకున్నాని నా మీదికి పిడికిలి బిగిస్తూ ఒచ్చారు. నా ఒంటిమీద చెయ్యిబడితే కైమా చేసేస్తానన్నాను, నేనే కాదు నా పరిస్థితిలో నున్న ఏ మగాడైనా అంటాడు”..

    “అంటే దొరలు గాజులు తొడిగించుకున్నారనేగా నీ వుద్దేశం. అకౌంటెంటుగారికి చిన్న దొరగారికీ మధ్య ఘర్షణ నీకే విధంగాను సంబంధించింది. కాదుగదా? అనవసర విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడమే కాక, నీ పై అధికారిని ఖైమా చేస్తానని బెదిరించడం మోస్ట్ ఇన్ సబార్డినేషన్…… తప్పు……. నువ్వు కాదంటావా?”

    “రూలు ప్రకారం తప్పే కావచ్చు గానీ మనిషిగా ఆలోచిస్తే అది తప్పు కాదు సార్; సాటి మనిషికి సంబంధించిన విషయం “.

    “మీరు దగ్గరే ఉన్నారు కదూ? మీరేమంటారు దశరథరామయ్యగారూ! మీరు తప్పు కాదంటారా!” అని దశరథరామయ్యని ప్రశ్నించారు.

    నిల్చున్నవాడల్లా రెండడుగులు ముందుకు వేసి. పెద్ద అపచారాన్ని వివరించి చెప్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి. “తప్పా, తప్పున్నరా సార్! అది నాకు, చిన్న దొరగారికి సంబంధించిన విషయం. నేను తప్పు చేస్తే కోపం పట్టలేక దొరగారు ఏదో ఫైల్తో కొట్టారే అనుకోండి. అది తప్పా? నా మొహం! ఐనా మధ్య ఈ ఆసామికెందుకు! పిల్లలు తప్పు చేస్తే తండ్రులు మందలించరా సార్ ? అది తప్పా? ఆఫీసు పనుల్లో గుమస్తాలకీ, ఆఫీసరుగార్లకి మధ్య ఇటువంటి చిన్న చిన్న తగాదాలు జరగటం పరిపాటే, ఐనా చిన్న బాబుగారు నా మీద ఫైలు విసిరారంటే, అతనికి నామీద వ్యక్తిగత ద్వేషమా? కందకు లేని దురద బచ్చలి కన్నట్టు. ఇతగానికి ఎక్కర్లేని రోషం వచ్చి కారుకూతలు కూస్తూ దొరగారి మీదికి వెళ్ళబోతాడా? నేను మధ్యలో దూరి ఆపాను బాబూ? మిలట్రీ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఎంత ఇన్ సబార్డినేషను. చిన్న దొరగారు ధర్మరాజులై పోయారు. కాబట్టి సరిపోయింది. అదే మా కాలంలో లాటి ఇంగ్లీషు దొరలయుంటేనా అక్కడే గుండేసి కొట్టిస్తారు” అంటూ ఏకబిగిని చెప్పాడు. .

    ఇది వింటున్న మిలట్రీ చిన్నయ్య నీరుకారిపోయాడు. తన కాళ్ళ క్రింద నేల కూలిపోతున్నట్టు అనిపించింది. అతను చెప్తున్నదంతా మతిపోయిన వాడిలా వింటూ నిల్చున్నాడు. “ఐతే నేను చేసింది తప్పా పంతులు బాబూ!” అనగలిగాడు.

    “తప్పా…… తప్పున్నరా, ఇంకా మెల్లిగా అంటావ్!” అన్నాడు, ఆ ప్రయత్నంలో ముఖం పక్కకి తిప్పుకుంటూ, ఇంత సేపూ ఇదంతా వింటున్న రామారావుగారు రెస్ట్ లెస్ గా మధ్యలో అందుకొని,

    “Excuse me Sir : నేను తొందర్లో కోపంలో చిన్నయ్యమీద రిపోర్టు పంపేశాను గానీ, he is a nice man : దూరంగా ఆలోచిస్తే నాదే తప్పండి. తరువాత గొడవలన్ని సర్దుకున్నాయి. రిపోర్టు విషయమే నేను మర్చిపోయాను. I want to withdraw the report…….

    “No you cannot, I view this most seriously…… చిన్నయ్యా . ఈవేళ సాయంకాలంనుంచీ నీ ఉద్యోగం మాకు అవసరం లేదు. ఈ క్షణమే నీ సెటల్ మెంట్ పెకం తీసుకోవచ్చును. Yes you can go now దశరథరామయ్య గారూ మీరుకూడ వెళ్ళవచ్చును” పెద్ద దొరగారు త్వరత్వరగా తేల్చేశారు.

    “యస్ సార్” అని బూట్లు ఠకాయించి సెల్యూట్ చేసి బైటకు వెళ్ళిపోయాడు చిన్నయ్య.

    రామారావు పెద్ద దొరగారిని చాలా బ్రతిమాలాడు. తన సర్వీసులో ఎప్పుడు ఎవర్నీ బ్రతిమాలనంతగా చిన్నయ్య కోసం బ్రతిమాలాడుగానీ దొరగారు వినలేదు. ఇన్ సబార్డినేషన్ ఇవాళ మీకు, రేపు నాకు అవుతుంది. మిస్టర్ రావ్! నువ్వింకా కుర్రాడివి; ఇలాంటి ఆర్గుమెంటేటివ్ స్టాఫ్ ని ఎక్కడికక్కడ నొక్కెయ్యకపోతే నెగ్గలేం…. టేకిట్ ఈజీ……. అంటూ అప్పటికే స్టెనో సిద్ధం చేసిన చిన్నయ్య డిస్మిసల్ ఆర్డర్స్ మీద పరపర సంతకాలు పెట్టేసి జీపెక్కి వెళ్ళిపోయాడు.

    సూర్యుడు పడమట కొండల్లోకి దిగిపోయాడు. చిన్నయ్య డబ్బా డవాలా అన్నీ కిట్ బేగ్ లో వేసి కట్టేసి వీపుకి తగిలించుకున్నాడు హరికెన్ లాంతర్ని. వాటర్ బాటిల్ కూడ వీపుని వేలాడేసుకున్నాడు. చూడ్డానికి ఉద్యోగం పోయినవాడిలా లేడు. యుద్ధంలో కేంపు మారుతున్న మిలట్రీ సోల్జర్ లాగున్నాడు. విచారంగాని, దిగులుగాని మచ్చుకైనా ముఖంలో కనిపించటం లేదు. జీపు తాళాలు ఇచ్చేస్తూ, ఇంజనీరుగారికి ఆఖరిసారిగా సెల్యూట్ చేశాడు. రామారావు చిన్నయ్య ముఖంలోకి చూడలేక తలదించుకున్నాడు.

    “ఎందుకు బాబూ బాధపడతావు……. నువ్వు కుర్రోడివిగానీ, దేవుడివి బాబు; ఒకసారన్నావు గాపకముందా, అరిచే కుక్కనని చస్ సువ్వెందుకు కుక్కవయ్యావు బాబూ? పులి లాంటోడివి. రాజా జాతి. నీ గుండె మైదానంలాంటిది నిన్ను అంటిపెట్టి బ్రతుకుతున్న మేము కుక్కలమే, నక్కలమే; నువ్వు సివిలోళ్ళలో తప్ప పుట్టావు. నేవొస్తాను బాబూ” అంటూ అక్కడినుండి వచ్చేశాడు.

    చిన్నయ్య వెళ్ళిపోతున్నాడని తెలిసి ఆ కేంపులోని జనమంతా గుమిగూడిపోయారు. అందరితోనూ నవ్వుతూ షేక్ హేండ్ ఇస్తున్నాడు. కొందరు కంటతడి పెడుతూండటం గమనించి, “ఏమి సివిలోళ్ళయ్యా, నేను చచ్చిపోతున్నానా ఎందుకలాగై పోతారు…… వారెవ్వా…… అంటూ వీపులు చరుస్తున్నాడు..

    “మంచోడిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ ఆఫీసర్లకు పెద్ద రోగం రాదా?” అని ఆఫీసర్లని రామారావుకి రాని ఆరవం భాషలో తిడుతూ చిన్నయ్యకి గ్లాసుడు మజ్జిగ అందించింది కళ్యాణ రామన్ గారి ద్వితీయ కళత్రం.

    ఇంతలో కారం అటుకులు పొట్లం కట్టి పట్టుకొచ్చిన సింగు గారి భార్య ఆ పొట్లం అతని సంచిలో పెడుతూ – “హే! మిలట్రీ మాన్ హమ్ సబ్ లోగ్ కో చోడ్ కార్ కహా జాతే హో!” అని చిన్నపిల్లలా బావురుమంది.

    ఇంతలో ఎదురు గుమ్మం దగ్గర పంతులమ్మ, అమ్మాయి నిల్చున్నారు. “చిన్నయ్యా? చీకటి పడిపోయింది, ఇప్పుడెక్కడికెళతావు. ఈ రాత్రికి మా ఇంట్లోనే భోంచేసి పడుకో; రేప్పొద్దున్నే వెళ్ళొచ్చును” అంది పంతులమ్మ చిన్నయ్యకి ఎదురుగా వెళ్ళి.

    “ఒద్దమ్మా! మరిక్కడ ఎందుకు? పోతాను……. అని లోపలికి మంచం మీద పడుకునున్న పసిగుడ్డు వైపు తొంగి చూసి, “ఒరేయ్ బుల్లోడా! పెద్దాడివైతే ఈ సివిలోళ్ళలో చేరిపోకురోయ్ నాలాగ మిలట్రీలో చేరు” అంటూ చిన్న విజిలేశాడు.

    “నిన్ను ఉద్యోగంలోంచి తీయించేసిన వాళ్ళకి తప్పక నీ ఉసురు తగుల్తుంది” అంటూ దుఃఖాన్ని దిగమింగుకుంటోంది పంతులమ్మ గారు. చిన్నయ్యని చూడలేక. మంచం మీద నిద్రపోతున్న బిడ్డని చూస్తూ జలజల కన్నీరు కారుస్తోంది పంతులుగారమ్మాయి.

    దశరథరామయ్య జాడ ఎక్కడా లేదు, ఎక్కడో నక్కలా జారుకున్నాడు.

    చిన్నయ్య కేంపు విడిచి రోడ్డెక్కి పోయాడు. జీపుమీద హరికెన్ లాంతరూ, వాటరు బాటిలూ ఒకదాన్నొకటి కొట్టుకుంటూ టకటకలాడటం కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. వెన్నెల పొడిచి పిండారబోసినట్టుంది.

    టెంటు ముందు నిల్చున్న అసిస్టెంట్ ఇంజనీరు రామారావుగారికి రోడ్డుమీద నడుస్తున్న చిన్నయ్య వెన్నెట్లో స్పష్టంగా కనిపించాడు.

    ఇంతలో హఠాత్తుగా “గాండ్రి – గాండ్రి”మని పులి గర్జించింది. “అమ్మో……. పులి….. చిన్నయ్య”, అంటూ టెంటు లోంచి పంతులమ్మ పరిగెత్తుకొచ్చి చూసింది.

    నిమ్మళంగా అసలు పులి అరుపు వినపడనట్టే చిన్నయ్య నడుచుకుపోతున్నాడు.

    అతని ధైర్యానికి నిర్ఘాంతపోయి చూస్తూండగా ఇంతలో మరో వికృతమైన అరుపు వినిపించింది.

    “బ్లోవ్…… బ్లోవ్……. వ్ …… ……” వఱడు అరుస్తోంది.

    నడుస్తున్న చిన్నయ్య అమాంతంగా ఆగిపోయాడు. ఉలికిపడి, అలా ఒక క్షణం సేపు నిలబడిపోయి, తిరిగి గబగబా నడక సాగించాడు. ..

    పంతులమ్మగారు చిన్నయ్యనే చూస్తూండిపోయారు. పులికి జడవని చిన్నయ్య వఱడుకి జడిసిపోయాడు. డౌను దిగిపోయిన తరువాత మరి చిన్నయ్య కనిపించలేదు. పడుకున్నాడే గాని రామారావుకి నిద్ర పట్టలేదు.

    అర్థరాత్రి గడిచాక దశరథరామయ్య యిల్లు చేరుకున్నారు. ఆ రాత్రి తెల్లవార్లు “బ్లోవ్ ! బ్లోవ్ ! బ్లోవ్ ! “మని వఱడు అడవిలో అరుస్తూనే ఉంది.

    • ఆంధ్రజ్యోతి 3 సెప్టెంబర్ 1971



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    27 min
  • Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు

    ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.

    పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.

    బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.

    ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.

    అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.

    కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.

    1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.

    *** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.

    కథను ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –

    https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)

    స్పాటిఫై యాప్ లో వినాలంటే –

    http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)

    ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –

    http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)

    వఱడు  :

    రాత్రి పదిగంటలు కావస్తోంది. ఆ కీకారణ్యమంతటా పేరుకున్న నల్లటి జారు ముద్దలాంటి చీకటి అలుముకునుంది. కేంపు గూడారాలు మాత్రం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయ్. మధ్యలో అక్కడక్కడ కేంపు పనివాళ్ళు వన్య మృగాల బారినుండి రక్షించుకోడానికి వేసిన మంటలు, దూరాన్నించి కొరివి దెయ్యాల్లా కన్పిస్తున్నాయ్. గుడారాల్లో హరికెన్ లాంతర్లు మిణుకు మిణుకు మంటూంటే, ఆఫీసు టెంటుల్లో పెట్రోమాక్సు లైటు వెలిగిపోతోంది. దశరధరామయ్య గారు ఇంకా ఆఫీసు పనిచేసుకుంటున్నారు. అలా రాత్రి ఒంటి గంట వరకూ ప్రతిరోజూ పని చెయ్యడం ఆయనకి పరిపాటే. –

    చిమ్మెట్టలు “జూయ్ “మనిచేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఎక్కడో దూరంగా కొండల్లో కొండ గొర్రె అవిరామంగా “కార్ కార్ “మని అరుస్తోంది. దశరధ రామయ్యగారికి చిన్న దగ్గుతెర వచ్చింది. కాస్సేపు గొంతుకలో కఫం తగ్గేదాకా దగ్గి, గుండెని చేత్తో పట్టుకుని టెంటు తెర తొలగించి బైటకొచ్చి తుపుక్కున ఉమ్మాడు. ఆయాసం కాస్త తేలికపడిన తరవాత, ఇహ ఇవాల్టికి ఇంటికి పోదామనుకున్నాడు. – కానీ ఇంకా బోలెడు పనుండి పోయింది. ఐనా ఇప్పుడు టైము ఎంత అయుంటుందో అని చిన్నయ్య గుడారం వైపు చూశాడు.

    జీపు డ్రైవరు చిన్నయ్య హెడ్ క్వార్టర్సులో వుంటే, సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఎన్ని పనులున్నా లైటార్పేసి పడుకుంటాడు. అది అతని ఎక్సు మిలిటరీ డిసిప్లేన్ అంటాడు.

    ఇంకా లాంతరు గుడారంలో వెలుగుతోంది. అంటే పన్నెండు కాలేదన్నమాట. సరే మరో గంట పనిచేసి పోదామని టెంటు లోకి దశరధరామయ్యగారు దూరుతుండగా “ఠకాలు”మని బూట్లు కొట్టుకున్న చప్పుడు, వెంటనే “గుడ్ నైట్ పంతులు బాబూ” అనే అరుపుకూడా వినిపించింది. అకస్మాత్తుగా మిలిట్రీ కాషన్ లాంటి అరుపు వినపడగానే ఉలిక్కి పడినా, అది చిన్నయ్య కేకే అని పోల్పేసుకున్నాడు. “ఆఁ రావయ్యా! నిద్రపోలా!” అని పలకరించాడు. తన గుడారం ముందు అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు చిన్నయ్య,

    “రాత్రుళ్ళు కూడా నీ మిలిటీ సెల్యూట్లేనా మిలిట్రీ వదిలేసినా, ఇంకా ఆ డ్రెసులూ వీశడు బరువు బూట్లు, మిలిటీ సెల్యూట్లూ మానవు గదా….. రావయ్యా!…… భోంచేశావా?” అనడిగాడు దశరధరామయ్య..

    “ఇప్పుడే అయింది బాబూ, చుట్ట కాల్చుకుందామని బైటికొచ్చాను. మీరింకా పని చేస్తున్నారా? అసలే మీ హెల్తు మంచిదికాదు. ఉబ్బసపోళ్ళు. ఈ చలికాలం ఇంతవరకూ పని చేస్తే ఒళ్ళు పాడైపోతాది, ఇంటికెల్లి పడుకోండి బాబూ, అమ్మగారొక్కరూ బితుకు బితుకు మంటుంటారు”.

    “అప్పుడే ఎక్కడయ్యా? ఇంకా నన్ను తగలెట్టినంత పనుంది. ఒంట్లో బాగా లేదని పంచేయడం మానేస్తే ఊరుకుంటారా? అందులోనూ రిటైరైనవాడ్ని, కనికరించి తిరిగి వేసుకున్నారు. సరిగా పని చెయ్యకపోతే పీకి పారెయ్యరూ……..”

    “బాబూ! ఇప్పుడు మీకు అరవై దాటుంటాయనుకుంటాను. ఇంకా ఎన్నాళ్ళిలా కష్టపడతారు?”

    “చచ్చేవరకూ……! తప్పదు చిన్నయ్యా, చావకుండా బతికుండాలంటే చచ్చేదాకా పని చెయ్యక తప్పదు. లేకపోతే నాకు, నా పెళ్ళానికి ముద్ద ఎలా గడుస్తుంది. ఊళ్ళో చదువుకుంటున్న నా కొడుకును ఎవరు చూస్తారు?” అని బరువుగా భయంగా నవ్వి టెంటు లోకిపోయి కళ్ళు తడుచుకుంటూ కాయితాల ముందు కూర్చున్నాడు దశరథరామయ్య. కంట్రాక్టరు బిల్లులోని వేలు, లక్షల రూపాయలు – అతని కళ్ళకు గజిబిజిగా కనిపించాయి.

    . “ఏవిటో, పంతులు బ్రతుకు” అంటూ సానుభూతిగా పెదవి విరిచి చుట్ట కాల్చుకోడానికి మంటదగ్గరకి నడిచాడు చిన్నయ్య. మంచు బాగా కురుస్తుండడంవల్ల మంటలు సన్నగిల్లి పోతున్నాయి. పనస చెట్టుమీదనుండి ఉండుండి మంచు బొట్లు మంటల మీదపడి సుయ్ సుయ్ మంటున్నాయి. నీరసించిపోతున్న మంటని బూటుతో తన్ని ఎగదోశాడు చిన్నయ్య, చిటపటమంటూ నిప్పురవ్వలు ఉవ్వెత్తున లేచాయి. పక్కనున్న ఎండుపుల్లల్ని, ఆకుల్ని ఏరి తెచ్చి మంటలో పడేసి రెండు మూడుసార్లు మళ్ళా బూటుతో తన్ని ఎగదోశాడు. పనస చెట్టు మొదట్లో కూర్చుని చుట్ట తీసి, మంటలోనుంచి ఒక కొరకంచు పుల్లతీసి వెలిగించుకున్నాడు చుట్ట. భగ భగ మని చుట్టపొగ వదుల్తూ సెగ కాచుకుంటున్నాడు. ఫళఫళమంటూ, ఎత్తుగా లేస్తున్న మంటలకి అందుబాట్లోనున్న పనస ఆకులు మాడిపోతున్నాయి.

    ఉండుండి కొండ గొర్రె అరుస్తూనే ఉంది. కొండల్లో నుండి పొగ వాసనతో నిండిపోయింది ఆ ప్రాంతమంతా. గాలేసినప్పుడల్లా చెట్టుకి పండిన బురదపనస మత్తు వాసనల్ని గుభాళిస్తోంది. ఉండుండి…… మంటల్లోని నిప్పులు చట్ ఛట్ మని పేలుతున్నాయి.

    చిన్నయ్య తన ఎడంవైపు టెంటు లోకి చూశాడు, ఎవరైనా మేలుకునున్నారేమోనని, అది దశరథరామయ్య కుటుంబం ఉండే టెంటు. లైటు బాగా దించేసుంది. “పంతులమ్మగారు పడుకునుంటారు ఫరవాలేదు” అని చుట్టి పారేసి మెల్లగా జేబులోంచి సీసా తీశాడు. వాటర్ సీసాలో పోసి తెచ్చుకున్న నాటుసారాని డగ్ గ్ మని రెండు గుటకలు మింగాడు. అసహ్యంగా ” బ్రేవు”మని తేన్చుకుంటూ సీసావెపు చూశాడు. మీసాలకి అంటుకున్న సారా బొట్టుని కాసేపు అనుమానంగా నాలికతో చప్పరించాడు. పరీక్షగా రెండు మూడుసార్లు బుడ్డీ లో సరుకుని వాసన చూసి, మిగతా సీసాని మరి రెండు గుక్కల్లో గబగబా ఖాళీ చేసి, ఖాండ్రించి ఎదురుగా వున్న మంటల్లోకి తుపుక్కున ఉమ్మాడు. 

    “చత్! చప్పగా ఉంది” అని విసుక్కుంటూ, సీసా అడుగుని మిగిలున్న అయిదారు చుక్కల్నీ నిప్పుల మీదికి జాడించాడు. అవి సుయ్ సుయ్ మని నీరసంగా వెలిగి ఆరిపోయాయి..

    “దొంగనాయాల గాడు నీరు కలిపేశాడు. ఈ సివిలు నాకొడుకులింతే కల్తీ లేకుండా….. ఏ సరుకూ అమ్మరు గదా? మిలిట్రీ వోళ్ళకి ఆర్డరిచ్చిస్తేనా, ఇలాంటోళ్లని ఫైర్ చేసి పారేస్తారు……. అబ్బే కొంచమైనా ఫోర్సు ఎక్కలేదు…… దొంగనాయాలగాడు” అంటూ ఖాళీ సీసాని వెనకాల తుప్పల్లోకి విసిరేసి, కాళ్ళు రెండూ….. మంటలవైపు చాచి డిజప్పాయింటెడ్ గా పనసచెట్టు మొదలుకి చారగిలబడిపోయి మరో చుట్ట వెలిగించాడు చిన్నయ్య. చెమటపట్టిన మొహం మంట వెలుగులో ఎర్రగా కందగడ్డలా కనిపిస్తోంది.

    చిన్నయ్య అసలు పేరు ఆ కేంపులో చాలా తక్కువ మందికి తెలుసును. అంతా “మిలట్రీ మాన్” అని పిలుస్తారు. అది విని మురిసిపోతాడు చిన్నయ్య. రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసి పింఛను పుచ్చుకున్నాడు. తరువాత అస్సాం నూనెగనుల్లో కొన్నాళ్ళు పనిచేశాడు. ప్రస్తుతం టెమ్పరరీ జీపు డ్రయివరుగ కేంపు నెంబరు -4, అసిస్టెంటు ఇంజనీరు దగ్గర పనిచేస్తున్నాడు. అతనికి మిలిట్రీ అంటే ఎనలేని భక్తి శ్రద్ధలు, మనిషంటే మిలిట్రీ వాడే మనిషి అంటాడు. మిగతావాళ్ళు “సివిలోళ్ళు” అని చులకనగా చూస్తాడు. మిలిట్రీ వాళ్ళు తమ దేశం కోసం ఫైట్ చేస్తే, సివిలోళ్ళు పొట్ట కోసం దేవిరిస్తారంటాడు. మిలిట్రీవాళ్ళు నిస్వార్థంగా పనిచేసే నీతి నిజాయితీగల “సీదా ఆద్మీ”అని సివిలోళ్ళు “బద్మాష్ ఆద్మీ”అనీ ఏదో థీసిస్ చెప్తాడు.

    తుఫాను పట్టినా సరే, ఆ వయసులో తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచిపోయి కసరత్తు చేస్తాడు. ఆరో గంటకల్లా స్నానం చెయ్యడం, బూట్లు పాలిష్ చేసుకోవడం. మీసాలకు రంగెక్కించుకోవడం పూర్తి చేసుకుని నాస్తా చేసి మగ్గుడు టీ తాగి, ఆరున్నరకి ఠంచనుగా ఇంజనీరుగారి దగ్గరికి హాజరవుతాడు. వెళ్ళేముందు జార్జి చక్రవర్తి, సుభాసు బోసు పటాలకి, రకాలుమని బూట్లు కొట్టి అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చెయ్యనిదే బయల్దేరడు.

    మంటకాంతిలో దగ్గర్లో వున్న తుప్పలు, పనస చెట్టు సగం భాగం, పది పన్నెండు గజాల లోపుగానున్న చెట్ల మొదళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. పనస చెట్టు నీడ పడుతూండడంవల్ల దానికి కాస్త వెనకాల ఎడమవైపుగా నున్న పంతులుగారి టెంటు మసగ్గా కనిపిస్తోంది. చుట్టూ చిక్కని చీకటి అల్లుకునుంది. చిన్నయ్య మంటకి దగ్గర్లో ఉండడంవల్ల ఆ వెలుతురుకి అలవడ్డ కళ్ళకి చుట్టూవున్న చీకటి మరింత దట్టంగా కనిపిస్తోంది. చిన్నయ్య ఏమీ తోచక మంటల్లోకి, చుట్టూ ఆవరించుకున్న కటిక చీకట్లోకి, దూరంగా కొండల మీద కాలుతున్న అడవుల్లోకి చూస్తూ చుట్టమీద చుట్ట లాగించేస్తున్నాడు. ఉండుండి ఆఫీసు టెంటులోంచి దశరథరామయ్యగారి దగ్గులు వినిపిస్తున్నాయి. ..

    “ఏం చిన్నయ్యా! భోజనం అయిపోయిందేవిటి? కేంపునుండి ఎప్పుడొచ్చేవు అని పంతులుగారి భార్య పక్క టెంటు గుమ్మంలో నుండి పలకరించింది.

    “దండాలమ్మా, అరగంటయిందండీ వచ్చి, జీపు షెడ్డులో పెట్టి భోంచేసి ఇప్పుడిప్పుడే చుట్ట కాల్చుకుందామని ఇక్కడికొచ్చాను. పొద్దుట్నుండి తిరిగి తిరిగి నడుం లాగేస్తుంటే ఈ చెట్టుకి కొంచెం చేరబడ్డాను”.

    “ఏం నంజుకున్నావయ్యా? నీ కోసం పెరుగు పచ్చడి దాచాను”. కసురుకున్నట్లుగా అడిగిందావిడ.

    “ఛఛ! ఎందుకమ్మా మీకా బాధ? మీ ముసలి కడుపులు గడుపుకోవడమే ఈ రోజులో కనాకష్టంగా వుంటే మళ్ళా దానాలు…. ధర్మాలూ”

    చిన్నయ్య మాటల్ని మధ్యలోనే త్రుంచిందావిడ, “చాల్లే! దానాలా, నీకియ్యడం దానమెందుకయింది?” అంది. అంతకంటే ఎక్కువగా మాటల్లో తన కృతజ్ఞతను చెప్పుకోవడం ఆవిడకి చేతనైంది కాదుగానీ, మనసు నిండా చిన్నయ్యంటే ఆమెకి గొప్ప గౌరవం, అభిమానం. ‘ఆమె కన్న చూపే కాదు, ఆ కేంపులో అన్ని సంసారాలకు పెద్ద దిక్కు చిన్నయ్య! అందరి కుటుంబాలు వారి వారి టెంటుల వరకే పరిమితమైతే ఆ కేంపంతా చిన్నయ్య కుటుంబమే! అది మిలిట్రీ స్పిరిటంటాడు. కేంపులున్నప్పుడు పొద్దుటనగా బండి తీసినవాడు ఏ అపరాత్రికో ఇల్లు చేరుకుంటాడు. ఎటూ వెళ్ళక్కర్లేక పోయిన రోజులోనైనా ఊరుకోడు. ఆ టెంటులన్నీ తుడిపించడం, మలేరియా మందు చల్లించడం చిన్న పిల్లలందర్నీ చెరువుకి తీసుకెళ్ళి స్విమ్మింగు, డైవింగు చేయించి తీసుకు రావడం వగైరా పనులన్నీ నెత్తిన వేసుకుంటాడు. పట్నం ప్రయాణం పడినప్పుడు, ప్రతి టెంటు దగ్గరికి పనిగట్టుకు వెళ్ళి ఆ ఇళ్ళలో అవసరమైన సామాన్లు కనుక్కుని పెద్ద లిస్టు రాసుకుని, పట్నంనుండి పట్టుకొస్తాడు.

    అందుకే పిల్లల దగ్గర్నుండి పెద్దవాళ్ళవరకూ అతనంటే అమితమైన గౌరవం. అందుకే అతను జీపు డ్రైవరు చిన్నయ్య కాడు! మిలిట్రీ చిన్నయ్య!

    “అన్నట్టు చిన్నయ్యా మీ పంతులుగారు చెబుతుంటారు. మన దొరగారికి నువ్వంటే ఎంతో ఇదట?…… అసలు నువ్వు లేందే కేంపు కేన్సిలు చేసుకుంటాడు…….”

    ఆవిడేదో ఇంకా అడగబోతూంటే మధ్యలోనే చిన్నయ్య అందుకున్నాడు. “ఔనమ్మా! బ్రతికున్నన్నాళ్ళూ మీ అందరితోనూ మంచి అనిపించుకుని, చచ్చిన్నాడు గుండె దెబ్బలాగా ధన్ మని పోవాలి. మిలిట్రీ చావు చావాలి. సివిలోళ్ళలాగ తీసుకు, లాగుకు చావకూడదు. అదమ్మా నా కోరిక”.

    “ఛా! అవేం మాటలయ్యా?……. అది సరే గానీ, మీ దొరగారికి ఉత్తుత్తి అభిమానమేనా లేకపోతే, కేంపులో వున్నప్పుడు తిన్నావా, ఉన్నావా అని………….”

    “……. హమ్మమ్మ! దొరగారు కుర్రోడైనా గొప్ప మనిషమ్మా. దేవుడిలాంటోడు. ఎప్పుడైనా కస్సుబుస్సు ముంటాడుగానీ, మనసు మహా మెత్తనిది. ఉత్తి ఎర్రోడు. సివిలోళ్ళలో అటువంటి ఆఫీసర్ని నేను చూడలేదమ్మా, ఒక్క నాకే కాదు, అతనితో కేంపుకొచ్చిన వాళ్ళందరికీ ముందు పెట్టేనేగాని, తాను తినడు” అంటూ పంతులమ్మ పక్కనే ఎవరో కదుల్తున్నట్టు గమనించాడు.

    “ఎవరమ్మా మీ పక్కన. ఎవరీ బుల్లెమ్మ” అంటూ పంతులమ్మ పక్కన చీకట్లో మసగ్గా కనిపిస్తున్న అమ్మాయిని చూశాడు.

    “మా అమ్మాయి చిన్నయ్యా! పొద్దున్నే అల్లుడొచ్చి దిగబెట్టి సెలవులేక వెంటనే వెళ్ళిపోయాడు. పిల్లదానికి ఇప్పుడు ఏడో నెల. ఎనిమిదో నెల ప్రవేశంలో మా బావగారి ఇంటికి పురిటికి దిగబెట్టాలనుకుంటున్నాం. ఈలోపున ఒక నెల్లాళ్ళు మా దగ్గరుంచుకుందామని అల్లుడికి రాస్తే తీసుకొచ్చాడు”. “

    “ఐతే అదేటి బుల్లెమ్మా?” ఇస్సుమన్నాడు డిసిప్లేనేరియన్ చిన్నయ్య. “అర్థరాత్రి దాకా మేలుకున్నావేంటి? ఉట్టి మనిషిని కావు పెందరాగే పడుకోవడం, కావలసినంత రెస్టు తీసుకోటం అలవాటు చేసుకోవాలమ్మా!” అని గదమాయించాడు. చూడు బుల్లెమ్మా; నీకేదైనా తినాలనుంటే, నేను ఎప్పుడూ పట్నం ఎల్తూనే వుంటాను. నాతో చెప్పు మొహమాటం పడేవు”.

    ఆఫీసు టెంటు లోనుండి దశరథరామయ్య దగ్గుతున్నాడు.

    “అన్నట్టు పంతులమ్మగారూ! అయ్యగారికి కాస్త చెప్పండమ్మా. రాత్రింబగళ్ళు ఒకటే పనా? అసలు బాబు ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో? ఎప్పుడూ ఆఫీసు, లెక్కలు, కాయితాలు వయసు మళ్ళినవాళ్ళు అంతగా పని చెయ్యకూడదమ్మా. పోనీ బలమైనోడా? బక్కచిక్కిన ప్రాణం……”

    “చెప్పి చెప్పి నోరు పడిపోయిందయ్యా బాబూ! వింటేనా? ఏదైనా టానిక్కు కొనుక్కుని తాగమన్నా వినరు. రాత్రి ఒంటిగంటా రెండు గంటల వరకూ ఉండకండి తొందరగా పడుకోండి ఆరోగ్యం దెబ్బ తింటుంది”, అంటే 

    “ఆఫీసుపని ఎవరు, నీ బాబు చేస్తాడా?” అని ఖస్సున లేస్తారు. పోనీ మాకు మరో ఆస్కారం ఉందా అంటే, ఒక చిల్లి కాని వచ్చే దారి లేదు. పంతులుగారు. ఈ ఉద్యోగం చెయ్యకపోతే, ఆయన, నేను, నా పిల్లడు మలమలమాడి చావాల…. చిన్నయ్యా! అతని కష్టం చూస్తుంటే కళ్ళవెంట నెత్తురు చుక్కలు కారుతున్నాయి. అతని నెత్తురు పీల్చేస్తున్నాం” అంటూ మరి మాటాడలేక బావురుమంది.

    “ఊరుకోమ్మా; ఊరుకోవే నాన్నగారు వింటారు” అని కూతురు సముదాయిస్తోంది.

    అర్థరాత్రి ఆ కీకారణ్యంలో వయసు మళ్ళిన ఒక స్త్రీ తమ బ్రతుకుల్ని తలచుకుని బావురుమంటూంటే – యుద్ధభూమిలో శవాల మీదనుండి ట్రక్కులు నడిపిన మిలిట్రీ చిన్నయ్య బండబారిన గుండెకూడా చివికిపోతోంది.

    “ఊరుకోవమ్మా, పెద్దదానివి ఏడవొచ్చునా? ఒట్టి మనిషి కాని సిన్న పిల్లముందు మన కష్టాలగూర్చి మాటాడకూడదు” అంటూ చెమ్మగిల్లిన కన్నుల్ని అప్రయత్నంగా తుడుచుకుంటూ, పంతులమ్మవైపు సూటిగా చూడలేక నల్లటి బూట్లలో ప్రతిఫలిస్తున్న మంటల్ని చూస్తూ విషయం మార్చడానికి ఆ అమ్మాయి నుద్దేశిస్తూ “మీ ఆయనకి దేంట్లో పని బుల్లెమ్మా?” అని అడిగాడు. ఇంకా తల్లిని ఓదారుస్తూనే వున్న ఆ అమ్మాయికి ఈ మాటలు వినిపించలేదు.

    “ఊరుకోమ్మా? అసలే నీ ఒళ్ళు మంచిదికాదు, గుండెల్లో నొప్పొస్తుంది”.

    పంతులమ్మ దుఃఖాన్ని మెల్లమెల్లగా దిగమింగుతోంది. చిన్నయ్యకి ఏం మాటాడాలో తోచలేదు. మనసంతా పాడైపోయింది. పడుకుందామని లేవబోయాడు.

    “గాండ్రి…. గాండ్రు….. గాండ్రి…..” కొండల్లో పెద్దపులి అరుపు ఒక్కమారు వినిపించింది.

    అడవంతా ఆ అరుపుతో దద్దరిల్లిపోయింది. అంతవరకూ “జూంయ్ “మని రొదచేస్తున్న కీచురాళ్ళు చప్పున ఆగిపోయాయి. అంతటా భరింపరాని నిశ్శబ్దం ఆవరించుకుంది. పంతులుగారి అమ్మాయి గట్టిగా తల్లిని పట్టేసుకుంది.

    “అమ్మో! పెద్దపులి అరుపులా వుంది. ఇటు వస్తుందేమో, పద లోపలికి పోదాం” అంటూ హడావుడిగా లేచింది. పంతులమ్మ. బ్రతుకు భయంతో అంతవరకూ కుమిలిపోతున్న ఆవిడకి ప్రాణభయంకూడా పట్టుకుందిప్పుడు.

    “అదేం చేస్తాదమ్మా? ఎక్కడో దూరంలో అరుస్తుంది. పాపం మేతకి బయలుదేరినట్టుంది. దాని తోవన అది పోద్ది, మనిషి మాంసం తినమరిగిన పులులు తప్పించి మరేవీ అసలు మనిషి ఛాయలకే రావమ్మా. అలాంటి పులులు ఈ దగ్గర్లో లేనేలేవు. ఆరే, ఎందుకమ్మా అంత గిజగిజలాడిపోతున్నారు? అసలు ఇయ్యం పులులని? నేను మిలిటీలో ఉన్నప్పుడు బర్మాలో చూశాను. అవీ పులులంటే. ఒకసారి బుల్లెమ్మా, ఇలాగే మాంచి రాత్రిమీద ట్రక్కు తీసుకొస్తున్నాను. ఇంకేటుంది, రోడ్డుమీద అడ్డంగా పడుకునుంది. సీదాగా గాడిని దానిమీద కెక్కించేశాను దెబ్బకి అని చెప్పబోతూ గతుక్కున ఆగాడు.

    “బ్లోవ్….. బ్లోవ్……. బ్లోవ్……..

    ఆకలిగొన్న దెయ్యం అరుస్తున్నట్టు మరో అరుపు. పెద్దపులి అరుపులాగ గంభీరంగా లేదు, వికృతంగా ఉంది. అంతవరకూ నిబ్బరంగా కబుర్లు చెప్పున్న చిన్నయ్యకూడా ఈ అరుపు వినగానే గతుక్కుమని లేచి నిలబడ్డాడు.

    “ఇదేమిటి చిన్నయ్యా ? ఇదేదో కొత్త అరుపులా వుంది. ఎప్పుడు వినలేదే?” అంది పంతులమ్మ.

    పులి అరుపుతోనే సగం హడలిపోయిన అమ్మాయి ఈ కొత్త అరుపుతో బెంబేలెత్తిపోయి తల్లిని మరింత గట్టిగా పట్టేసుకుంది.

    “వఱడు …. దీన్ని వఱడంటారమ్మా!”

     “అంటే?”

    “బాగా ముదిరిపోయిన ముసిలి నక్క డొక్కులా ఉంటుంది. గొప్ప మాయదారిది. లుచ్చా జంతువమ్మా! చూశారా….. ఆ అరుపు ఎంత భయంకరంగా ఉందో…. దీన్ని అడవిలో జంతువులన్నీ దెయ్యాన్ని చూసినట్లు చూస్తాయి. ఇదెప్పుడూ పులి వెంట తిరుగుతూంటుంది. బాగా ముసలిదై పోవడం వల్ల, దానంతటది వేటాడి తినలేదు. అందుకే పులిని అంటి పెట్టుకుని ఎప్పుడూ తిరుగుతుంటుంది. పులి తిని విడిచి పెట్టేసిన మాంసం దుమ్ములు తిని బ్రతుకుతుంది. స్వతంత్రంగా బ్రతకలేదు. పగలంతా ఇతర జంతువుల ఉనికిని కనిపెట్టి, రాత్రవగానే పులిని చాటుగా వాటి మీదకి తీసుకెళ్ళిచంపించేస్తుందిట. పులి చంపి తినగా వదిలిన మాంసంతో తన ముసలి కడుపు నింపుకోవడానికి! గొప్ప దగుల్బాజీ జంతువు”.

    “బ్లోవ్….. బ్లోవ్!” వఱడు అరుపు దూరమౌతోంది.

     “గాండ్రి…… గాండ్రి….. గాండ్రి……” దాని వెనకాలే పులి అరుపులు.

    “ఈ రాత్రి అడవిలో గొప్ప ఘోరం జరిగిపోతాదమ్మా విన్నారా వాటి అరుపులు, వఱడువజుడు దేనిమీదకో పులిని ఉసిగొలిపి తీసుకుపోతోంది. పాపం దేని ఆయుష్షు మూడిందో, దాన్ని చంపించేసి, ఎంగిలికూడు ఇదికూడా తిండానికి! పొట్ట కోసం ఎంత నీచంపని?” చిన్నయ్య మనసు కకావికలైపోయింది. “ఛ పడుకునే ముందు, దీని అరుపు విన్నాను శనిలాగ….” అని బయలుదేరాడు తన టెంటు వైపు, పంతులమ్మ అమ్మాయిని తీసుకుని లోపలికెళ్ళింది. టెంటు పరదాలు గట్టిగా దగ్గరికి లాగి రాళ్ళు అడ్డం పెట్టింది. –

    చిన్నయ్య టైము చూసి లైటు ఆర్పేసి మంచంమీద పడుకున్నాడు. మరికొంత సేపటికి ఆఫీసునుంచి ఇంటికి వెళుతున్న దశరధరామయ్యగారి కిర్రుచెప్పుల చప్పుడు మగత నిద్రలో స్పష్టంగా వినిపించింది…

    తెల్లవారుజాము మూడు గంటలయింది. దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది కేంపులో మంటలు చల్లబడి పోతున్నాయి, హఠాత్తుగా కలకలం బయల్దేరింది. అటూ ఇటూ గడబిడగా పరిగెత్తుతున్నారు. చుట్టుపక్కల ఆడవాళ్ళు పంతులుగారి టెంటువైపు పరుగెడుతున్నారు. లోపలినుండి ఉండుండి మూలుగులు వినిపిస్తున్నాయి, “అయ్యో తల్లీ ఇదేవిటే అమ్మా ఇప్పుడే వచ్చాయేవిటి ఈ మాయదారి నొప్పులు, నేనిప్పుడు ఏం చేసేదమ్మా?” అని పంతులమ్మ కోకాలు పెడుతోంది. 

    దశరధరామయ్య ఏమీ తోచక మతిపోయినవాడిలా టెంటు బయట తిరుగుతూ, వచ్చిన వాళ్ళతో ఏదేదో మాటాడు తున్నాడు. మధ్య మధ్య పెళ్ళాన్ని నువ్వు కాస్త నోరుమూసుకో! మధ్య నీ ఏడుపు ఎక్కువైపోతోంది”. అని గదమాయిస్తున్నాడు.

    చిన్నయ్య నిద్రలేచి బైటకొచ్చాడు. దశరథరామయ్యతో మాటాడుతున్న సింగు గారి భార్య చిన్నయ్యని చూడగానే, “ఏయ్ మిలట్రీ ఆద్మీ ఇదర్ ఆవోనా” అని పిలిచింది. చిన్నయ్య రాగానే అంతా చుట్టుముట్టారు. పంతులుగారి అమ్మాయికి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు వచ్చేశాయని. ఏడోనెల కాన్సు, అందులో తొలిచూలు చాలా కష్టమని, వెంటనే పట్నంలో హాస్పిటల్ లో చేర్పిస్తేగానీ లాభం లేదనీ అక్కడున్న ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో ఏకరువు పెట్టారు. ఈ పాడు అడవిలో కష్టం వచ్చినా దిక్కుమాలిన చావు తప్ప వేరే గతి లేదనీ హాస్పిటల్ లేకపోయినా కనీసం మందివ్వడానికి డాక్టరు ముండాకొడుకైనా లేడని రైల్వే కన్ స్ట్రక్షన్ లో పనిచేసే వాళ్ళని పెళ్ళాడిన ఆడవాళ్ళ బ్రతుకింతేననీ ఏకంగా రైల్వే అధికారుల్నే అరవ యాసతో జాడించి పారేస్తోంది స్టోరు కీపరు కళ్యాణరామన్ గారి ద్వితీయ కళత్రం,

    మీ మొగాళ్ళందరూ అలా మొహాలు చూస్తూ నిలపడడమేనా లేక అమ్మాయిని వెంటనే పట్నం తీసుకెళ్లే ఏర్పాటేమైనా ఉందా?” అంటూ అగ్గిమంటలమీద నీళ్ళు కాగబెడుతున్న సుమతి కుట్టియమ్మ మళయాళంలో ఆ గుంపులోని మొగుడిమీద చండికలా పడిపోయింది.

    “గోల చెయ్యకండమ్మా, ఇదుగో పంతులుగారూ, అమ్మగార్నీ అమ్మాయినీ, పట్నం ప్రయాణానికి సిద్ధం చేయించండి. దొరగార్ని జీపు అడగండి. ఇప్పుడే నేను పట్నం తీసుకెళ్తాను” అన్నాడు చిన్నయ్య.

    “ఆహా!! అది గవర్నమెంటు జీపుగదా, దొరగారిని అడిగితే బాగుంటుందా……. అందులోనూ ఈ రాత్రప్పుడు” అని దశరథరామయ్య నసిగాడు.

    “మనం కూడా గవర్నమెంటు మనుషులమే బాబూ! మీరు ముందు సిద్ధంకండి…… మీకంత ఇదైతే నేనే వెళ్ళి దొరగార్ని జీపు అడుగుతాను”.

    “బాబ్బాబు నీకు పుణ్యముంటుంది. నువ్వే అడిగి పుణ్యం కట్టుకుందూ – ” అని దీనంగా చిన్నయ్య చేతులు పట్టుకున్నాడు. –

    “చాల్లెండి పంతులుగారూ, భలేవారే!” అంటూ చేతులు విదిలించుకుని ఇంజనీరు గారి టెంటు వైపుకు నడిచాడు చిన్నయ్య.

    ఇంతలో పంతులమ్మ గారి పిలుపు విని లోపలికి వెళ్ళాడు దశరథరామయ్య. “అయ్యో రామా! జీపు అడగడానికి మీరు వెళ్ళలేకపోయారా? చిన్నయ్యనే పంపించారూ? మన పనిక్కూడా ఇంకొకళ్ళనే పంపించాలా? మీరే వెళ్ళండి. మళ్ళీ పెద్ద ఎకౌంటెంటునంటారు. ఆపాటి జీపు అడిగి తేలేరూ?” అంటూ సర్రున తాచుపాములాగ లేచింది.

    “నువ్వు కాస్త నోరుమూసుకోవే! ఎందుకలా చించుకుంటావు….. తెలియనిదానివి తెలియనట్టూరుకోవాలి. ఆడముండలకేం తెలుసు దొర్ల సంగతి? అసలే మా ఇంజనీరు రావణాసురుడి లాంటివాడు. దానికితోడు పగలంతా కేంపులు తిరిగి తిరిగి, అలసిపోయొచ్చి పడుకునుంటాడు. రాత్రప్పుడు లేపితే ఇంకేమన్నా ఉందా? పులిలా పడిపోతాడు. అసలే కోపిష్టాడు. తిక్క రేగిందంటే వెనకా ముందు ఆలోచించకుండా రేప్పొద్దున తపుక్కున ఉద్యోగం ఊడదీసేస్తాడు. అప్పుడు నువ్వు, నేను రోడ్లమీద చిప్ప పట్టుకు తిరగాలి. ఇలాంటి బోడి సలహాలు మాని నోరు మూసుకుకూచో!” అంటూ గొణుక్కుంటూ బెటకొచ్చి పెంటు ముందు చిరాగ్గా పచార్లు మొదలు పెట్టాడు. – -కాల్ బెల్ విని నిద్రలేచి మత్తుగా ఒళ్ళు విరకుచుకుంటూ బైటకొచ్చి చిన్నయ్యని, దశరథరామయ్య బంటుముందు అలికిడినీ చూసి “ఏమిటి చిన్నయ్యా. ఏం జరిగింది, ఎవరికైనా బాగులేదా?” అని ప్రశ్నించాడు, అసిస్టెంటు ఇంజనీరు రామారావు..

    “పాపం పంతులుగారి అమ్మాయికి పురిటి నొప్పులు అకస్మాత్తుగా వచ్చేశాయట సార్. నెల రోజులుండి పోదామని వచ్చిందట పొద్దున్నే. అనుకోకుండా పాపం ఏడో నెల్లోనే నొప్పులొచ్చేశాయటండి, పట్నానికి తీసుకు వెళ్తేనేగానీ లాభం లేదంటున్నారు సార్” అన్నాడు చిన్నయ్య..

    “అయ్యో పాపం! ఇప్పుడెలాగా?” 

    “జీపు కావాలి సార్! పట్నం తీసుకెళ్ళి ఆస్పత్రిలో జాయిన్ చేసాస్తాను.

    “జీపా? అది…. గవర్నమెంటు వెహికలు….. తీసుకె……” అని ఏదో నానుస్తున్నాడు రామారావు.

    “అదేవిటి సార్ అలా అంటారు. ప్రాణం మీది కొస్తేను….. ఐనా గవర్నమెంటు బళ్ళు ఎన్నిసార్లు పిక్నిక్కులకి, పార్టీలకీ, దొరల బుడ్డలకీ, తిరగడం లేదు?” అంటూ ఇంకేవో చెప్పబోతున్నాడు హీటెక్కిపోతున్న మిలట్రీ చిన్నయ్య.

    ” సర్లే….. ఓబులుమీద తాళాలున్నాయి తీసుకెళ్ళు, పొద్దున్న ఎనిమిదో గంటకంతా ఉండాలి సుమా, కేంపుంది. బ్రిడ్జి ఇన్స్ పెక్షన్ ,జాయిన్ చేసిన తరువాత పంతులుగార్ని కూడా నీతోనే తీసుకొచ్చేయ్. బోలెడు పనుంది” అంటూ...

    31 min
  • సి.రామచంద్ర రావు గారి 'ఏనుగుల రాయి'!

    సి.రామచంద్ర రావు గారు రాసిన ఈ కథ ‘వేలుపిళ్లై’ అనే కథా సంపుటం లోనిది. కథను మీకు హర్షణీయం ద్వారా మీకందించడానికి అనుమతినిచ్చిన రామచంద్ర రావు గారికి కృతజ్ఞతలు. వచ్చే వారం హర్షణీయంలో రామచంద్ర రావు గారితో ఇంటర్వ్యూ మీరు వినవచ్చు.

    అన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా , మార్చి రెండో వారంలో ‘వేలు పిళ్ళై కథలు ‘ కొత్త ఎడిషన్ రిలీజ్ అవుతోంది.

    కథలోకి వెళ్లబోయ్యే ముందు ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటల్లో రామచంద్ర రావు గారి గురించి –

    ‘పొగడ పూలు’:

    గొప్ప కథలు రాసిన టాప్‌టెన్ రచయితలలో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్కపేరు చెప్పమని అడగ్గానే చాసోగారు ఠక్కున చెప్పిన పేరు సి. రామచంద్రరావు.

    రాసికన్న వాసికే విలువనిచ్చే అమితమిత రచయితలలో చాసో తరువాత సి. రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి.

    యాభై అరవై యేళ్లలో సి. రామచంద్రరావుగారు రాసినవి తొమ్మిది కథలే!

    నల్లతోలు, వేలుపిళ్లై, ఏనుగులరాయి, టెన్నిస్ టూర్నమెంటు, గాళిదేవరు, కంపెనీలీజ్… మైగాడ్! వేటికవే! ఇన్నేళ్ళయినా వాడిపోని పొగడపూలు, అపురూపాలు, ఆరనిదీపాలు.

    ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసోగారు.

    రోజూ ఎన్నో కథలు చదువుతున్నా, కథలలో మునిగితేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరి రామమోహనరావు గారు.

    ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లయిపోయేవాళ్ళం. చెప్పుకుని తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…

    కావ్యాల్లాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు.

    అంతర్జాతీయ స్థాయిగల కథలు అన్నారు ఆదివిష్ణుగారు.

    ఎన్నోయేళ్ళు – ఉహూ, ‘హూ – టీ’ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ – మానేజర్- తెల్లదొరల – నల్లదొరల మధ్య హాయిగా విహరించారు. వెలుగునీడలు చూశారు. మనకు చూపించారు. టెన్నిస్ ఛాంపియన్‌గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు. రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్ళే. ఒక సోదరుడి కొకొడుకు – వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి.

    రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది తెలుగే అయినా టెలుగులా వినపడుతుంది. స్టయిలు హొయలు అంతా ఇంగ్లీషే. మాటా ఇంగ్లీషే. కాని మనసంతా తెలుగు. రామచక్కని తెలుగు. స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు.

    ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావు గారి కలం అయినా చాలా కథలకు మెట్టినిల్లు తమిళనాడు! తమిళతంబీలు చాలమంది కనిపిస్తారు. అయినా వాళ్ళంతా మనవాళ్ళయిపోయి మనలో ఒకళ్ళయిపోతారు. అదీ రావుగారి శిల్పం – ప్రజ్ఞ!

    ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు…. మాటల వెనక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలోడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడచాటు నీడలా – ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు – అపురూప శిల్పాలు.

    గంగిగోవుపాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకొందాం.

    అంతవరకూ ఆయన రాసిన ఆ కాసినీ మేసిమేసి నెమరేసి ఆనందించుదాం…

    -ముళ్ళపూడి వెంకటరమణ.



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    38 min
  • స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి

    ‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub

    ఉత్తర పొద్దు :

    మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.

    ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.

    జల్లల దొరువు ప్రయాణమంటే చిన్న విషయం కాదు. తెల్లవారి అయిదు గంటలకు మొదలుపెడితే రాత్రి ఏడుకో, ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్లం. అంటే ఒక పగలంతా ప్రయాణమే. కాసేపు నీళ్లల్లో నడిచి కాసేపు దీవుల్లో నడిచి ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి చేరుకోవాలి. ఇంతా చేసి మా ఊరికి, జల్లల దొరువుకి నడుమ దూరం పాతిక కిలోమీటర్లలోపే.

    ప్రళయకావేట్లో ప్రయాణం ఒక వింత అనుభూతి. నడిచి నడిచి కాళ్లు పీకుతున్నా, ఇంకా నడవాలనే మనసు పీకుతుంటుంది. ఎండా, వానా, మంచు.... ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వన్నెలు చూపించేవి. మా ప్రయాణం ముచ్చట్లు మొదలు పెడితే మీకూ తెలుస్తాయి ఆ వన్నెచిన్నెలు.

    ఒకసారి నేనూ, మా వెంకటన్న, నా నేస్తాలు శీనయ్య, చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాము ప్రళయకావేరిలో, శీనయ్య, చెంగయ్యలు 'రాగన్న పట్టెడ'కు, నేనూ, మా అన్న జల్లల దొరువుకు. అప్పుడు నా వయస్సు పన్నెండో, పదమూడో ఉండొచ్చు. అప్పటికి ఉత్తరకార్తె పెట్టి రెండు దినాలయింది. ఆ ఏడాది మఖ, పుబ్బల్లోనే గట్టి వానలు పడినాయి. అందుకే మా అమ్మకూ, మా అవ్వకూ మా ప్రయాణమంటే దిగులు.

    'దార్లో వానొస్తే 'రాగన్నపట్టెడ'లోనే నిలిచిపోండి. ఉత్తరపొద్దులో కావేట్లో దిగబాకండి' మా అమ్మ హెచ్చరించింది.

    'ఉత్తరపొద్దంటే వాళ్లకేం తెలుస్తాదమ్మే' అని మాయమ్మని ఒక్క కసురు కసిరింది మా అవ్వ.

    మావైపు తిరిగి 'నాయినా ! మద్దినేళ మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా' అనింది. 

    'పునమాల తిప్ప దాటినాక, చిన్నతోటకు పొయ్యే దాకా దిగులుతిప్పలెక్కువ. చూసి నడవండి' మా పెద్దమ్మ సలహా ఇచ్చింది.

     'దిగులుతిప్ప' అంటే ఒక రకమైన బురదగుంట. ఊబి కాదు. ఇందులోకి దిగితే నడుములదాకా కూరుకుపోతాము.

    'ఉత్తరపొద్దు బిడ్డల్ని ఏమారస్తాదేమో' మా అమ్మ గొణగసాగింది.

    ఆడవాళ్ల సణుగుడంతా విన్న మా తాత లేచి, 'మేయ్! గమ్మునుంటారా? లేదా? అయినా పంట రంగస్వామి లేదా. ఏదన్నా అయితే చూసుకొనేదానికి. పోయిరానీ వాళ్లని' అన్నాడు.

    మా వైపు చూసి, 'అబయా. నలగామూల దాటినాక పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ. మునేళ్లు అదిమి పెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు గెబ్బిడు ఎంట్ర కాయల్ని జవరాల్సిపడతాది' అన్నాడు. 

    అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ. జాగ్రత్తగా నడవకపోతే పడతామని చెప్పడం. అప్పటికి మా పల్లెల్లో తమదల (రాగుల) వాడకం ఇంకా ఉంది. చిక్కటి మజిగ కలిపిన గట్టి అంబలిని స్టీలు టిఫిన్లో పోసిచ్చినారు. అట్లే రెండు పులుసన్నం  పొట్లాలు  కట్టిచ్చినారు. 


    తెల్లవారి ఆరుగంటలకు 'అటకానితిప్ప'కు పొయ్యే బస్సు ఎక్కి కూచున్నాము. బస్సు బయల్దేరి కసారెడ్డిపాళెం, చెరువుకండ్రిగ, దావాది గుంటలు దాటి కుదిరికి వచ్చింది. 

    కుదిరి వస్తే మా ఆనందం ఎక్కువవుతుంది. కదిరి దాటగానే ప్రళయ కావేరి మొదలవుతుంది. ఇక కనుచూపు మేరా నీలాలు ఆరబోసినట్లు నీళ్లు.

    ప్రయాణించి 'అటకానితిప్ప'లో మమ్మల్ని దించింది,  బస్సు. కావేరిలోని దీవులకు కేంద్రం 'అటకానితిప్ప 'దీవి. దీవులలో ఉండేవాళ్ళు  ఆ పేటకు (మా ఊరికి) రావాలంటే 'అటకాని తిప్ప'కు వచ్చే బస్సు ఎక్కాలి.

    మూడునాళ్లుగా ముసురుపట్టిన మబ్బుల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు. 

    అటకాని తిప్పలోని వినాయకుడి గుడి దగ్గరకు పోయి తెచ్చుకొన్న అంబలిలో కొంచెం తాగినాము. ..

    'ఏ ఊరికి సిన్నా?' ఒక ముసలాయన అడిగి నాడు. 'మేము జల్లల దొరువుకీ, వీళ్లు రాగన్నపట్టెడకీ' ఇద్దరి తరపునా నేనే చెప్పినాను.

     'జల్లల దొరువా ! నాయినా దూరాబారం బొయ్యేవోళ్లు. బిన్నా బయల్దేరండి. తూరుపుగాలి మళ్లింది. వానొస్తాదేమో! ఇప్పుడు పెళయకావేట్లో దిగితేగానీ సద్దికూటేళ్లకు 'కొరిడి'కి పోలేరు. ఉత్తరపొద్దులో యాడ్నో ఒక దెగ్గిర నిలబడిపోండి' అన్నాడా ముసలాయన.


    మేము ఆ మాటతో దెబగుబా ప్రళయకావేట్లో దిగినాము. తూరుపు నుంచి చల్లగాలీ లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి. వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉంది. అడుసు మీగాళ్లనూ, నీళ్లు మోకాళ్లనూ దాటుతున్నాయి. వలసపక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్లుండాయి. ఉల్లంకి పిట్టలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి. వాటి రెక్కల పసిమి ఛాయ, నీటి నీలివన్నె, ఎండ బంగరు రంగు కలిసి ప్రళయ కావేరి కొత్త హొయలు పోతోంది..

    రెండుగంటల సేపు నీళ్లల్లో కాళ్లీడ్చుకొంటూ సాగిన మా నడక 'కొరిడి' దీవికి చేరి కుదుటపడింది. దీవంటే గట్టినేల. కాలు చకచకా సాగుతుంది. అప్పటి దాకా గిలిగింతలు పెట్టిన సూర్యుడు చుర్రుమనిపిస్తూ పైకి లేస్తున్నాడు. పేముపొదల దొరువులో కాళ్లు కడుక్కొని, తియ్యని ఆ నీళ్లు తాగి, నడక సాగించినాము.

    కొరిడి దీవంతా చిట్టడవి. ఆ అడవిలోని పాల పండ్లు, కలిగిపండ్లు, బీరపండ్లు, బిక్కిపండ్లు, నిమ్మకాయలు, ఊటిపండ్లు, గొంజిపండ్లు, బలిజపండ్లు, ఎలికిచెవులూ,పిల్లొట్టలూ కోసుకొని తింటూ సాగుతున్నాం. అడివంతా చిన్న చిన్న, రంగురంగుల పిట్టలు. వింత వింతగా పలుకరించుకొంటూ, కులుక్కుంటూ, గిలుక్కుంటూ, చెట్టు చెట్టుకు చెంగున ఎగురుకొంటూ చెటాలున దోవకడ్డంగా పరుగెడుతూ మమ్మల్ని పలుకరిస్తున్నాయి.


    కొరిడి దాటిన తరువాత మళ్లీ ప్రళయకావేరిలో గంటన్నర ప్రయాణం. తరువాత కొల్లపట్టు దీవి. కొల్లపట్టు నుంచి గంట ప్రయాణంలో తోటకట్ల.

    తోటకట్లకు చేరేసరికి మిట్టమద్దినేళ అయింది. ఎండ కసిగా కొడుతోంది. గాలి ఎంత చల్లగా తగులుతున్నా చెమట కారుతూనే ఉంది. తోటకట్ల తరువాత గంట నడిస్తే 'రాగన్న పట్టెడ' వస్తుంది.

    మాతోపాటు తెచ్చుకున్న తిండి ఎప్పుడో అయిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు రాగన్న పట్టెడకు చేరుకొన్నాం. మా నేస్తాల ఊరు అదే. మేమ ఐతే సగం వచ్చినట్లు. మా నేస్తాల ఇళ్లలో మమ్మల్ని చూసి చాలా సంతోషించినారు. చెంగయ్య వాళ్ల అమ్మ ఆదరాబాదరాగా సంగటి గెలిగి, ‘చెనిగపప్పుల ఊరిబిండి’ నూరి కడుపు నిండా పెట్టింది.

    'ఈ పొద్దు ఈడ్నే ఉండి రేపు బయదేలిపోండి నాయినా. ఉత్తరపొద్దు పెయాణం మంచిది కాదు' అన్నారు వాళ్లింట్లోని పెద్దలంతా.

    ఎప్పుడెప్పుడు జల్లలదొరువు పోదామా అని ఆత్రుతలో ఉన్న మేము వారి మాటలను వినలేదు. నేనూ, మా అన్నా బయలుదేరినాము.

    ప్రళయకావేట్లో మిట్టమద్దినేళ ప్రయాణం కొంచెం కష్టమే. ఎండకు నీళ్లు తళతళలాడుతూ కళ్లను జిగేలుమనిపించి దారి తప్పేటట్లు చేస్తాయి. దారి తప్పి మిట్టకు పోయినామా నీళ్ల వేడికి కాళ్లు బొబ్బలు లేస్తాయి. పల్లానికి పోయినామా, ఏ దిగులుతిప్పో తగిలి నడుము లోతు అడుసులో కూరుకుపోతాము. 

    దోవ పొడవునా అనుభవం ఉండే పెద్దలు అక్కడక్కడా కట్టెపుల్లలు నాటి ఉంటారు. వాటిని చూసుకొంటూ నడవాలి...

    రాగన్నపట్టెడ తరువాత గంటన్నర నడకలో 'పంట రంగం' ఉంది. ఆ దీవిలో ఎవరూ కాపురం ఉండరు. పాతకాలం నాటి శివాలయం ఉంది అక్కడ. ప్రళయ కావేరి ప్రయాణీకులు ఆ శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకొని పోతుంటారు. త్వరగా పోవాలనుకునే వారు శివాలయానికి పోకుండానే మరో గంట ప్రయా ణంలో వచ్చే 'చిన్నతోట'వైపు సాగిపోతారు. మేమూ అట్లాగే పోవాలనుకొన్నాం. కానీ మేమనుకొన్నట్లు జరుగ లేదు.

    రాగన్న పట్టెడ  తరువాత అరగంట నడిచినామో లేదో తూరుపు నుంచి పశువుల పండక్కి పరుగెత్తే బర్రెల మందలాగా గుంపులు గుంపులుగా మొయిళ్లు (మబ్బులు) బయలుదేరినాయి.

     మరుక్షణంలోనే నల్లగా మూసుకొనింది. కంటికి మింటికి ఏకధారగా వాన మొదలయింది.

    ఒక మేము చిన్నతోటకు పోయే ఆలోచన మానుకొని పంటరంగం చేరుకొనేందుకు త్వరత్వరగా నడవసాగినాము. ఎగువ నుంచి ప్రవాళం వాగో, కాళంగి నదో పరుగెత్తుకొచ్చి ప్రళయకావేట్లో పడినట్లుంది. ప్రళయకావేట్లో సుళ్లు పుటినాయి. దోవ పక్కన నాటిన పుల్లలు కొట్టుకొని పోయినాయి. మాకు పంటరంగం దీవి కంటి కానడంలేదు. మధ్యాహ్నం మూడు గంటలు కూడా అయి వుండదు.

    కానీ చీకట్లు ముసురు కొన్నాయి. మేము గుడ్డి గురుతులలో చాలాసేపు నడిచి, నడిచి చివరకు పంటరంగం చేరుకొన్నాము. ఆ దీవంతా పెద్ద పెద్ద మానులతో చిక్కటి అడవి. వాటి మధ్యలోనే శివాలయం ఉంటుంది. ఆ గుడి దగ్గరకు పోతే, ఎవరో ఒకరుప్రయాణీకులు ఉంటారు. కానీ గుడి దగ్గరకు పోవడానికి కాలిబాట కూడా దొరకడం లేదు. చివరకు నీటివరవను పట్టుకొని ఎదురు నడిచినాము. ఆ వానలోనే గంటకు పైగా ఆ దీవిలో నడిచినాము. శివాలయం జాడే లేదు. నాకు చలికి తోడు, భయం కూడా మొదలై వణుకు ఎక్కువయింది. తిరిగి, తిరిగి గుడి కనబడక ఒక మర్రిచెట్టు కింద నిలబడినాము.

    చీకటి చిక్కబడుతోంది. ఏనుగు తొండంతో చల్లినట్లు వాన కురుస్తూనే ఉంది.

    నేను భయంతో మా అన్నకు దగ్గరగా జరిగి నిలబడినాను. ఆయన పరిస్థితీ నాలాగే ఉన్నట్లుంది. నాకన్నా ఒక ఏడాది పెద్దవాడంతే. ఇద్దరమూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. ఒకరికొకరం బాగా ఆనుకొని నిలబడినాము. 

    ఇంతలో"ఎవుర్రా  ఆడ, ఇయ్యాళప్పుడు ఈడకొచ్చింది?' అని కేక వినపడింది.

    మెరుపుననుసరించే ఉరుము లాగా, కేకతోపాటు మనిషీ మా ముందుకొచ్చినాడు. నల్లగా, నిలువెత్తు మనిషి. తెల్లజుట్టు, ముడుతలు పడిన మొహం, వయసుడిగినా కండలు తిరిగిన దేహం.

    'మేము జల్లల దొరుకువు పోవాల తాతా! రాగన్న పట్టెడ దాటినాక వానొచ్చింది. పంటరంగం గుళ్లో తల దాచుకొందామని వచ్చినాము. గుడి కనబడక ఈడ నిలబడినాం తాతా' మా అన్న అన్నాడు.

    'ఓరి కొడకా ! ఉత్తరపొద్దు ఏమార్చెను గదరా మిమ్మల్ని, పెద్దాళ్లే ఉత్తర పొద్దులో పెళయ కావేట్లో పెయాణం చెయ్యరు. ఏలిడంత లేరు మీరిద్దరూ. ఎట్ట దాటదామనుకున్నారా? సూడబోతే మిడిమాళపు బిడ్డలుగుండారే?" అన్నాడు ఆ తాత.

    మాకేమీ అర్థంకావడం లేదు. మళ్లీ ఆ తాతే అడిగినాడు. 'ఒరే! ఇప్పుడు మీరు యాడుండారో తెలుసా?' అని.

    మేమిద్దరమూ అయోమయంలో పడి ఏమీ మాట్లాడలేదు.

    'రాగన్న పట్టెడ నుంచి ఉత్తరానికి పోతే పంట రంగం. మీరు దోవతప్పి  తూరుపుకు నడిచి 'రెట్టమూల'కు వచ్చుండారు. ఇది నరమానవులు తిరిగే దీవి కాదు. తెలుసా మీకు?' తాత కంఠం ఖంగుమనింది.

    మా పైప్రాణాలు పైనే పోయినట్లయింది. రెట్టమూల గురించి మా అవ్వా తాతలు అప్పుడప్పుడూ మాట్లాడుకొనే మాటలు గుర్తుకొచ్చినాయి.

    'రెట్టమూల' కూడా ఒక దీవే. కానీ మనుషులెవరూ ఆ దీవికి పోరంట. కాలభైరవుడు ప్రేత గణాలతో ఆ దీవిలో తిరుగుతూ ఉంటాడంట. ఏడాదికొక సారి మాత్రం ఆ దీవిలో కాలభైరవుడి బొమ్మ దగ్గరకు చుట్టూ దీవుల్లో ఉండే వాళ్లు పొయ్యి పొంగళ్లు పెట్టి వస్తారంట. 

    ఇవన్నీ గురుతొచ్చి నాకు ఏడుపొచ్చింది. గట్టిగానే ఏడవడం మొదలుబెట్టినాను. ఎంతసేపటి నుంచి అణుచుకొని ఉన్నాడో, మా అన్నా ఏడవడం మొదలు పెట్టినాడు.

    'రేయ్ ! అబ్బయ్యల్లారా ! ఏడవబాకండ్రా, నేనుళ్ళా' అని ఆ తాత మాకు ధైర్యం చెప్పి ఆయనతో కూడా తీసికొని పోయినాడు. కొద్దిదూరం నడిచి ఒక చిన్న గుడిసె దగ్గరికి పోయినాము. ' రాండ్రా లోపలికి” అన్నాడు తాత.

    లోపల తాత పొయ్యి రాజేసి మంట పెట్టినాడు. మేము మంట దగ్గర కూర్చుని చలి కాసుకొన్నాము. తాత అన్నం వండి, తక్కోలం (టమోటా) కాయలు పులుసు పెట్టినాడు. చుట్టూ కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. పొయ్యి మంట చీకటినీ, చలినీ గుడిసెలో నుంచి తరిమేస్తూ ఉంది. తాత మట్ట మూకుడులో అన్నం కలిపి మాకు చెరి నాలుగు పిడచలు చేతిలో పెట్టినాడు.

    మాకు ప్రాణం కుదుటపడింది. తాత ఏవో తత్వాలు పాడడం మొదలుపెట్టినాడు. నాకు కడుపులో ముద్దపడి, ఒంట్లోకి వెచ్చదనం వచ్చేసరికి, బుర్ర పని చేయడం మొదలయింది. పొద్దున్నించీ నన్ను పీడిస్తున్న ఒక సందేహాన్ని తాత ముందు పెట్టినాను.

    'తాతా, తెల్లారినించీ చానామంది ఉత్తరపొద్దు, ఉత్తరపొద్దు అంటుండారు. అంటే ఏంది తాతా?' అడిగినాను. 

    'ఓహోహో! ఎద్దు గిట్లో ముల్లంత లేవు. అప్పుడే ఇయ్యన్నీ నీకు దేనికిరా?' అన్నాడు తాత.

    నేను వదల్లేదు. 'చెప్పు తాతా, చెప్పు తాతా' అని విసిగించసాగినాను.

    'అబ్బ ! బొక్కలాడ బాక చెప్తానుండ్రా' అని మొదలుపెట్టినాడు తాత.

     'ఒరే అశ్విని, బొరణి, కీర్తిక, రోయిణి... ఈ మాదిరిగా మనకు ఇరవై యేడు కార్తిలుండాయిరా. దాంట్లో ఉత్తరకార్తి ఒకటి. ఈ ఉత్తరకార్తిలో సూరయ్య మన పెళయకావేరమ్మతో కూడతాడురా.. 

    'కూడేదంటే ఏంది తాతా?' మధ్యలో అందుకున్నాన్నేను.

     'ఆ?! గోగాకు పులగూర్రా. అందుకే ఇప్పుడు నీకర్థం  కాదు. నేను చెప్పను అనింది' అన్నాడు తాత. 

    'సరే, సరే. నడిమిద్దిలో మాట్లాడను. చెప్పు తాతా' అన్నాను.

     “అబయా! ఉత్తరకార్తిలో పెళయకావేరమ్మ కట్టుకొస్తాది. సూరయ్యకు ముడిడస్తాది. ఇద్దురూ కూడతారు. దానికే ఉత్తర పొయినాకనే పెళయకావేట్లో చేపా, రొయ్యా ఎచ్చయ్యేది. ఉత్తరకార్తి పన్నెండు, పదమూడు దినాలుంటది. ఈ దినాల్లో మద్దినేళ గాలి బిగేసే పొద్దులో వోళ్లిద్దరూ కూడేది' అన్నాడు తాత.

    'గాలి బిగేసే పొద్దంటే ఎప్పుడు తాతా?' ఈసారి మా అన్న అడిగినాడు.

    'మద్దినేళ రెండూ, మూడు మద్దిలోరా. వాళ్లు కూడేటప్పుడు ఎవరన్నా పెళయ కావేట్లోకి దిగితే సూరయ్యకు కోపమొస్తాది. దోవ తప్పించో, దిగులుతిప్పలో ఇరికించో కసి తీర్చుకొంటాడు. దానికే ఉత్తరపొద్దులో మరీ అవసరమైతే తప్ప ఎవురూ పెళయ కావేట్లో దిగరు. దిగినా సూరయ్యకూ, పెళయ కావేరమ్మకూ తప్పు చెప్పుకొని దిగతారు. మీకు తెలియక దిగి ఎన్ని అగచాట్లు పడినారో చూడండి. నేను లేకపొయ్యుంటే మీ గతేం కావాల?' చెప్పినాడు తాత.

    మా మనసంతా తాతంటే ఒక రకమైన ప్రేమతో నిండిపోయింది.

    మాకిద్దరికీ గోతాలు పరిచి, పడుకోమని చెప్పి పొయ్యి దగ్గర కూర్చుని తత్వాలు పాడసాగినాడు తాత. మాగన్నుగా కన్ను మూతబడి మంచి నిద్రపట్టింది మాకు. తాత ఆ రాత్రి తిన్నాడో, నిద్ర పోయినాడో లేదో తెల్లవారి వెలుగుపడే వేళకు మమ్మల్ని తట్టి లేపినాడు తాత. 'నేను కూడా మీతో ఆడదాకా వస్తాను పదండి' అని బయలుదేరినాడు. తాత వెనుక చకచకా నడిచినాము. 


    పొద్దు పుట్టేటప్పటికి పంటరంగం చేరుకొన్నాము. కోనేట్లో మునిగి, పంట రంగేశ్వరునికి మొక్కినాము. తాత రాత్రి మిగిలిన గంజి అన్నాన్ని సొరకాయ బుర్రలో పోసుకొని వచ్చినాడు. మమ్మల్ని తినమని దోసిట్లో పెట్టినాడు.

    మేము తినిన తరువాత, 'నేను ఈడనే నిలస్తాను. మీరు బద్దరంగా పొయి రండి' అన్నాడు.

    మేము తాతకు వీడుకోలు చెప్పి బయలుదేరి నాము. చిన్నతోట, పెద్దతోట, పాములతేరి, నలగా మూలలు దాటుకోని, గొడ్లు విప్పేవేళకు జల్లల దొరువుకు చేరినాము.

    ఆ సమయంలో వచ్చిన మమ్మల్ని చూసి మా మామ ఆశ్చర్యపోయినాడు. 'ఇంత పొద్దున్నే ఎటొచ్చిన్నారా?' అని అడిగి నాడు. మేము జరిగిందంతా చెప్పినాము.

    మా మామతోపాటు, ఊర్లో వాళ్లు నలుగురయిదుగురు విన్నారు మేము చెప్పిన మాటలు.

    అంతా విన్న కుమ్మరోళ్ల రమణన్న లేచి 'అయ్యా! సుధాకరయ్య.... ఆ పంటరంగ సామే మీ బిడ్డల్ని కాపాడినాడు. రెట్టమూల్లో ఇన్ని తరంతాలుగా నరమానవుడున్నట్లు ఎరగం. ఆ సోమే పెద్దాయన మాదిర వొచ్చి బిడ్డల్ని ఉత్తరపొద్దు నించి కాపాడినాడు. శివరేత్తిరికి కూటి పొరుపు (అన్నదానం) జేస్తానని మొక్కో' అన్నాడు.

    మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి, మమ్మల్ని గట్టిగా గుండెల కదుముకున్నాడు.

    ప్రళయ కావేరమ్మతో కూడడానికి సూరయ్య చరచరా పైకి లేస్తున్నాడు.


    పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEub


    హర్షణీయం పాడ్కాస్ట్ ని   –


    ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://bit.ly/harshagaanaa


    స్పాటిఫై  (Spotify )యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam


    ఆపిల్ (apple podcast) ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5


    వెబ్ సైట్ : https://harshaneeyam.in/all


    హర్షణీయం ఫేస్ బుక్ లో  -  https://www.facebook.com/Harsha051271


    హర్షణీయం ట్విట్టర్ - @harshaneeyam


    హర్షణీయం యూట్యూబ్ లో - https://bit.ly/harshayoutube



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    19 min
  • 'రామగ్రామ నుంచి రావణలంక దాకా' రచయిత సీతారామరాజు గారితో పరిచయం.

    'రామగ్రామ నుంచి రావణలంక దాకా' నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది.

    పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి -

    https://amzn.to/3EoRIMn

    Harshaneeyam on apple podcast

    https://apple.co/3K1vMdw



    This podcast uses the following third-party services for analysis:

    Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
    30 min

About Harshaneeyam

From the publisher's feed

Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

More shows like Harshaneeyam

KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

52 Listeners