నింగివి నువ్వు నేలను నేను
దూరంగా ఉంటే కలిసిపోయినట్టే ఉంటాం
దగ్గరయ్యేకొద్దీ పెరుగుతుంది మన ఇద్దరి మధ్యన దూరం
జాబిలి నువ్వు సూరీడు నేను
ఒకేచోట ఇరువరం ఎప్పుడూ కలిసిలేం
నన్ను చూడగానే అవుతావు నువు మాయం
మంచువు నువ్వు మంటను నేను
దగ్గరకు రానీయవు నన్నెప్పుడూ
కరిగిపోతావేమో అని భయమేమో నీకు నా ప్రేమలో
తీరం నీవు అలను నేను
నిన్ను తాకాలనే తపనతో ఎగిసిపడుతున్నా
నీ కోపం చూసి మళ్లీ వెనక్కి వస్తున్న
అంటీ ముట్టనట్టే ఉంటావు నాతో
తామరాకు మీద నీటి బొట్టులా
కలిసిపోయాం అని చనువు తీసుకునేలోపే
జారిపోతావు మెల్లగా
ఇక నాతో కాదు అని నా మానాన నేనుంటే
తిరిగి తిరిగి నావైపే వస్తావు తూనీగలా
ఓర చూపుతో కుట్టిపోతావు తేనెటీగలా
విడిగా ఉండటం కూడా వరమే ప్రేమలో
అని తెలిసింది నీ వల్ల
వింతగా ఉంది నీతో ఈ ప్రణయం
దారీ తెన్నూ తెలియని ప్రయాణం
నీ తలపుతో మొదలయ్యే ఉదయం
కలలో కూడా వదలదు నీ వదనం
నువ్వు నాతో ఉన్నా లేకపోయినా
నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా
ఎన్ని రోజులు ఇలా గడిచిపోయినా
నా పేరు వినగానే నీ పెదవిపై పూచే చిరునవ్వులా
నేను ఎప్పటికీ నీతోనే ఉంటా
నిన్ను ఆరాధించటం తప్ప ఇంకేమి తెలియని నేను
నువ్వు పిలిచేదాక నీకు దూరంగానే ఉంటా
నీ పిలుపు కోసం ఎదురుచూస్తుంటా
నిన్ను మరిచిపోయి మనలేను కనుక
నిన్ను మరిచిపోవడం మర్చిపోయా
ఇక చేసేదేమీ లేక
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360