సత్యం శంకరమంచిగారి 'అమరావతి కథలు'నుండీ, "పువ్వుల్లేని విగ్రహాలు నవ్వాయి"
ఇది పుస్తకరూపంలో వెలువడిన సంపుటిలోని పదునాల్గవ కథ.
అమరావతి దేవాలయంలో మొత్తం పది అర్చక కుటుంబాలు. పెద్ద పూజారి పెద్దయ్యగారి కొడుకు నారాయణ. ఆరేళ్ళవాడు. రోజూ తనూ సావాసగాళ్ళంతా కలిసి, తండ్రులు నివేదనలు పట్టుకెళ్తుంటే, తామూ వెంట వెళ్ళేవాళ్ళు. ఈమారు శివరాత్రి ఉత్సవాలగ్గానూ, ఆలయంలో మూర్తులకి అలంకారం చేయటానికి పెద్దలతో పాటూ ఈ పిల్ల మూక కూడా వెంట చేరారు. తండ్రి అలంకారం చేస్తుంటే, నారాయణ ఆయనతోటే ఉండి, స్వయంగా తానే విగ్రహాలను అలంకరించినంత సంబరపడిపోయాడు. అలంకారం మరింత నిండుగా ఉండాలని ఇంట్లో చెట్టుకి కాసిన రెండు మందార పూలు కూడా తెచ్చి స్వామివారికి, అమ్మవారికి పెట్టి ముచ్చటపడిపోయాడు.
రథాలు ఊరేగింపుకి బయల్దేరే హడావిడిలో, ఆ పూలు కాస్త పడిపోయాయి. కొంచం నిరుత్సాహ పడినా, అమ్మవారు, అయ్యవార్ల విగ్రహాలలో చిరునవ్వు చూసిన నారాయణ, తనూ హాయిగా నవ్వేశాడు.
పసితనంలో ఇంట్లోని పెద్దవారిని అనుకరించటం, వాళ్ళు చేసిన పనులకి తమ స్వంత ఊహలు జోడించి, ఎంతో ఘనకార్యం చేసామని పొంగి పోవటం.... ఆ బాల్యం వైపు మనకు చెప్పకుండానే, మనకు తెలియకుండానే మనల్ని నడిపించి, ఈ రెండు పుటల్లోనే మళ్ళీ మనకు ఆ సంతోషమంతా తోడుకోమని చెప్తారు ఈ కథలో!
రెండు మూడు పుటలు మించకుండా పాఠకులకు ఒక గొప్ప రసానుభూతి కలిగించగల కథలివన్నీ. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, మక్కువ ఉన్నవారందరూ కొని చదివి దాచుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన/చదువుకునే అపురూప కథా మాణిక్యాలలో ఒకటి భాషా ప్రియులు, సాహితీమిత్రులకు పరిచయం, బహుశా పునః పరిచయం అనటమే సబబేమో; చేయాలన్న చిన్న ప్రయత్నం, నానుండీ.
దయతో విన్న మీకు నా కృతజ్ఞతలు. నా ఈ ప్రయత్నం మీకు ఏమేరకు ఆనందాన్ని కలిగించినా, నేను కృతకృత్యుడనైనట్లే. ఇది ఏమాత్రం పేలవంగా తోచినా, అది నా ప్రయత్న లోపమే.